మా రచయితలు

రచయిత పేరు:    డా. వెల్దండి శ్రీధర్

కవితలు

చివరి ప్రశ్న

మున్ముందు

 నా నాలుక సందులో ముల్లు

పెదాల ఉపరితలంపైన

మోయలేని బరువులు దించబడుతాయి

ప్రశ్నించడానికి

లోపలి నరాలన్నీ

గిలగిలా తన్నుకొని కూలిపోతాయి

ఇక్కడి మట్టి ఆనవాళ్లను

నా దేహం మీద వెతుకుతావు

రక్తాన్ని జల్లెడ కట్టి

పిడికిట్లోకి మట్టినెలా తేవాలి ?

గుర్తింపు కార్డులన్నీ

ముఖం వేలాడేసి

నన్నొక దొంగలా నిలబెడుతున్నాయి

నన్ను నేను తవ్వుకుంటూ పోయి

వెతుకుతున్న తీగ

కాళ్లకు తగలక బొక్కబోర్లా పడతాను

ఈ నేల గాలి నీరు నింగి నిప్పు

నావేనని చెప్పడానికి

రుజువులు అడుగుతావు

నా చెమటను పరీక్షనాళికలో వేయి

అది పంచభూతాలుగా విడిపోతుంది

నా శ్వాసను వస్త్రగాలం పట్టు

ఈ దేశ మూలవాసిగా రూపుకడుతుంది

చివరిగా ఒక ప్రశ్న అడగనా ?

నీ ఒంట్లో పారుతున్న నెత్తురుది

ఈ దేశమేనా ?

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు