పొద్దుగూట్లె పడుతుంది. గొర్లు దొడ్లకు చేరుతున్నయ్. కొన్ని మందలు పానాది ఎక్కినయ్. ఇంకా కొన్ని అప్పుడప్పుడే కంచెలల్లకెల్లి ఎల్లుతున్నయ్. కొంరయ్య గొర్లు పానాది ఎక్కినయ్. ఒక గొర్రె ఒక్కటే ఇరాం లేకుంటా బే.. బే...అని ఒర్రుతుంది. దాని ఒర్రుడుకు మిగతా గొర్లు తొవ్వ సక్కగా సాగుతలెవ్ బెదురుతున్నయ్. ఉస్‍ఉస్‍స్సా అని గొర్లను మర్లేసుకుంటా ఒరెక్క ఎక్కడిపాడయిందిరో ఇదో దీని మొదలారా ఒక్కటే ఒర్రుడు ఒర్రుతుందని ఆ గొర్రెను తిడుతూ కొంరయ్య చిరాకు పడుతుండు.
అది ఘనపురం గుడ్డిగొర్రె. చెట్లపొంటి గుట్టలపొంటి తిరుగుకుంటా అది కండ్లు కానొచ్చి కానరాక ఆ మందలకెల్లి ఈ మందలకెల్లి చివరకు కొంరయ్య గుంపుల కలిసింది. గొర్లు పానాది ఎక్కంగనే ఒక్కటే ఒర్రుడు ఒర్రుతుంది.
పక్కమంద బీరప్ప ఎక్కడిదే ఈ సాటుగండ్లది ఒర్రుతావుంది.
ఏమో ఎక్కడిది తలుగవడ్డదో దీని పాడుగాను నా గుంపుల వచ్చి చేరింది.
బీరప్ప మనూరిది కానట్టుంది కదనే.
కొంరయ్య కాదుకాదు మనూరిది కాదు. ఘణపురపోల్లదే కావొచ్చు గిటు ఇంకోవ్వరి యెత్తయ్. ఇద్దరు మాట్లాడుకుంటా గొర్లను కొట్టుకొస్తుండ్రు. ఈ ముచ్కట ఆ ముచ్చట మాట్లాడుకుంటుండగనే గొర్లు దొడ్లకు చేరినయ్. గొర్లు దొడ్లల్ల తోలిండ్రు. పిల్లల కలేసిండ్రు.(పిల్లల పాలుశీకపెట్టిడ్రు). గొర్లు నిమ్మల పడంగనే గొంగడి భుజానేసుకొని, టిపిని చేతపట్టుకొని ఇంటి బాట పట్టిండ్రు కొంరయ్య, బీరప్ప.
ఏంచేద్దాం ఈ గుడ్డి గొర్రెను. ఇయ్యాల పొద్డూకి అటికెల పెడుదామే మరి గుసగుస అంటుండు బీరప్ప. సప్పుడు చేయలేదు కొంరయ్య.
ఏమంటవే రాత్రి చేద్దామా దానిపని బీరప్ప అన్నడు.
కొంరయ్య అలోచనలో పడ్డడు.
ఒదిక్కు అడుగుతుంటే సప్పుడుచెయ్యవేందే బీరప్ప.
కొంరయ్య కులపోని సొమ్ము గట్లచేస్తే ఏమంటర్రా...
నలుగురికి ఎరుకైతే తుప్పుక్కున్నుచ్చంరా.
కురుమలలో ఎవరిదైన గొర్రెగాని, మేకగాని తప్పిపోయి పక్క మందలకో పక్కూరి మందలకో పోతే తిరిగి వాళ్లది వాళ్లకు కొట్టిచ్చే సంస్కృతి ఉంది. వాటి గురించి ఎవరు రాకపోతే కొన్ని రోజులు చూసి కులంల కలుపుకుంటరు.
నీయవ్వ నీకు అన్ని ఇచ్చత్రమేనేమే అది గుడ్డిదేనాయే ఏ నక్కో కుక్కో తిన్నదను కుంటరు తియ్. గీ గుడ్డిగొర్రెను దేవులాడుకుంటా వొస్తారు. దీర్ఘం తీసుకుంటా అన్నడు బీరప్ప. బీరప్పకు అప్పుడప్పుడు దొంగపనులు చేసిన అలవాటు ఉంది.
ఏమోరా నాకైతే ధైర్యం సాలుతలేదు. గీ లంగాదొంగ పనులు నాకు రావు గిసొంటి పని నావొల్లగాదురా.
నీకు శాతగాకపోతే చెప్పే కొంరన్న గా పుల్లన్ని, పచ్చిపులుసు సామిగాన్ని పిలుద్దాం. నీయక్క వాళైతే గంటల కతం చేస్తరు. పోతూపోతూ వాళ్లిద్దరికి మెల్లగా చెవుల ఏశిండ్రు. బువ్వతిని ఒత్తొత్త కత్తులు పట్టుకొనే రాండ్రి మరి ఊకనే వొట్టిచేతుల ఉగులాడుకుంటా వచ్చేరు. ముత్తెమంత చేపట్లకతం చేయాలె. వాళ్లిద్దరు ఇంకో ఇద్దరికి చెంద్రయ్య, నర్సయ్యకు చెప్పిండ్రు.
కొంరన్న ఇంటికిపోయి కాళ్లుచేతులు కడుక్కొని బల్లపీఠమీద కూసుండు. చిన్నబిడ్డ కేతమ్మ గొంగడి సూత్తుంది. శిలుపక్కపండ్లు (సీతాఫలాలు) తెచ్చిండేమో అని. రెండు చెట్టుమీది పండ్లు తీసుకొచ్చిండు. పోరగాండ్లు చెరొకటి తీసుకున్నరు. కురుమ సంఘం దగ్గర డోలు సప్పుడు అయితుంది. ఒరెక్కో...డోలు కొడుతుండ్రు ఎందుకో అన్నడు కొంరన్న. కురుమలు కులం గడ్డమీదికి రావాలంటే డోలు సప్పుడు చేస్తరు.
ఇయ్యాల పస్టు కాదయ్య బీరప్ప చిట్టేమో అన్నది అయిలమ్మ.
అవును కదా ఒరెక్కో... చ్టిని యాదిలేకపాయేగానే ఒక్క రూపాయి లేదు. కులంలా ఇజ్జతిపోతట్టుంది ఎట్లనే. మిత్తి పైసలన్నలేవు.
ఇప్పటికిప్పుడు ఎవలదగ్గర దొరుకుతయ్ అని ఆలోచన చేస్తుండగనే. అయిలమ్మ గా మల్లయ్యను అడుగుపో బ్యారగాడెనాయే ఎప్పటికి ముల్లె (డబ్బులు) ఉంటదిగా ముల్లెలకెల్లి అన్న తీసి ఇయ్యమను ఎట్లనన్న చేసి. మంచిగనే యాజ్జేసినవే ఒక్కడుగు పోయ్యోత్త. ఊళ్లే ఎవరికి ఆపతి సాపతి వచ్చిన అదలుకు బదలుకు మల్లయ్య దగ్గరికి పోతరు. పైసలు అడుక్కొచ్చుకుంటరు. గొర్లబ్యారం చేస్తడు కనుక ఎప్పటికి నడుముకు ముల్లె ఉంటదని ఊరంతా ఎరికే..
కొంరన్న కాదుకక్కుసం అంటే రేపు రెండు బక్కగొర్లు ఇత్త అని చెప్త ఏంజేత్త మరి సావల్నా. గొర్లు అమ్ముత అనంగనే అయిలమ్మకు కోపమొచ్చింది. రెండు గాకపోతే నాలుగు అమ్ముకుందువుగాని ఇంత ఎత్తేసుకోని (తిని) పోరాదు మల్ల వచ్చేతోరకు ఏ నడుజామైతదో.
నీయక్క దుడ్డుగట్టె సూడు ఎట్లుందో
నేను తిన్ననా? తాగిన్నా? పొల్ల పశిద్దయినప్పుడు తెచ్చిన పైసలేనాయే నువ్ లెస్సా ఎగురవడితివేమే. నీ అవ్వగారింటికాడికెల్లి ఏమన్న తెచ్చిఇచ్చినట్టే చెయ్యవడితివి. గాళ్లను నోట్లెపెట్టుకోంది నీకు నిదురపడుతదా.
తినుకుంటా ఈల్లలొల్లి అయితుండగానే పెద్దపోరడు లింగడు అయ్యా రేపు పరిక్ష పీజు కట్టాలె. పెద్దసారు రేపు పైసలు తీసుకరమ్మన్నడు...
పరిక్ష పీసులేదు లొల్లపీసులేదుపో. ఓదిక్కు చిట్టిపైసలు ఎట్లరో అని నేను తిప్పల పడుతుంటే పరిచ్చపీసంటా లొట్టపీసంటా. గులుగుకుంటా తిని తువ్వాలతోని మూతి తూడుచుకుంటనే కుక్కకు గంజి పోసిరా అనుకుంటా బయటికెల్లిండు.
లింగడు ఏడుపుమొఖం పెట్టిండు.
పోరడు అనేటోరకే సైసవేందయ్యా అనుకుంటా లింగన్ని దగ్గరికి తీసుకుంది అయిలమ్మ.
కురుమ సంఘం దగ్గరికి ఒక్కొక్కొల్లు వొస్తుండ్రు..
చిట్టి పైసలు కట్టెటోల్లు కడుతుండ్రు. పైసలు లేనోల్లు అదలుకు బదలుకు తిప్పలపడుతనే ఉండ్రు.
కొంరన్న కూడా మల్లయ్యను కాళ్లోఏళ్లో పట్టుకొని చిట్టిపైసలు తెచ్చి కట్టిండు. ఇజ్జతి కాపాడుకుండు.
కాని ఎత్తుకున్నోళ్లు ఎవరైనా ఖచ్చితంగా కట్టాల్సిందే....
చిట్టి ఎత్తుకున్నోల్లు అందుబాటులో లేకపోతే పెనాల్టి కూడా ఏస్తరు.
ప్రతినెల చిట్టికాడ లొల్లి అయితనే ఉంటది.
లొల్లి పెట్టేటోడు పెడుతుండు. చిట్టి పైసలుకట్టెటోడు కడుతనే ఉంటడు.
ఈ లొల్లి ఆ లొల్లి కాంగా చిట్టి అయిపోయేసరి పన్నెండు అయింది. చిట్టి అయినా తెల్లారి చిట్టికాడ లొల్లిపెట్టుకున్న మల్లోక పంచాది ఉంటనే ఉంటది.
చిట్టి సవాల్ పాడిండ్రు. ఎత్తుకునేటోల్లు ఎత్తుకుండ్రు. జమనాత్ పెట్టిచ్చుకోని ఎత్తుకునోన్నళ్లకు పైసలిచ్చిండు ఏజెంట్ ఎట్టయ్య.
బీరప్ప, పుల్లయ్య, పచ్చిపులుసు సామి, మిగతా ఇద్దరు కూడా చిట్టికాడికి వచ్చిండ్రు.
చిట్టి అయిపోంగనే ఈ ఆరుగురు గొర్లదొడ్డికెల్లి బయిలెల్లిండ్రు. గొర్ల దొడ్డికాడికి వీళ్లు పోంగనే కుక్క మొరుగుతుంది.
ఒరెక్కో కుక్కకు ఎవలైందిన తెలుస్తలేదురో. జూ... అనంగానే కుయ్యకుయ్య అనుకుంటా తోకుపుకుంటా కొంరయ్య దగ్గరికి వొచ్చింది.
రోజు గొర్లదొడ్లకాడ పండుకునేటోల్లు ఆయెల్ల(ఆరోజు) గొర్ల దొడ్లకాడ ఎవరు పండు కోలేదు. అందరు బీరప్ప చిట్టికాడికే పోయిండ్రు.
దొడ్లెకు పోయిండ్రు గుడ్డిగొర్రెను పట్టుకుండ్రు. గుడ్డిగొర్రె మల్ల ఒక్కటే బే బే అని ఒర్రుతుంది.
బీరప్ప ఇంటెనుక గుడ్డిగొర్రెను కోసిండ్రు. తిత్తితీసిండ్రు. పేగులు కడిగేటోడు కడుగుతుందు. బొక్కలు, కూర కొట్టెటోళ్లు కొడుతుందు.
సామిగా మెల్లగా కొట్టురా. మా రుక్కమ్మ లేస్తే తిడ్తదిరా. మెల్లగా కొట్టు. మొద్దుసప్పుడు బయటికి ఇనబడుతది. ఎవడన్న సూత్తె అడ్డంగా దొరికిపోతతమ్ సుమా. ఒకటికి రెండు దండుగకట్టాల్సి వస్తంది. కులంల ఇజ్జతిపోతది. అని బీరప్ప గదిరిస్తుండు.
ఇద్దరు రైతులు ఆశాలు, రామడు మోటరుపెట్టడానికి బాయికాడికి పోయోటోల్లకు ఆ సప్పుడు ఇనబడనే ఇనబడ్డది. గిప్పుడు యాటను కోస్తుండ్రు ఎందుకో అనుకుంటా వాళ్లు ఎల్లిపోయిడ్రు.
తెల్లారె వరకు ఎక్కడిదక్కడ చేసిండ్రు. కూర ఎవరి ఇండ్లళ్లకు వాళ్లు తీసుకపోయిండ్రు. అందాదా మనిషికి రెండుకిలోల మీదనే వచ్చింది. అరెయ్ పుల్లయ్య ఈ తలకాయ మంచిగా కాపిపెట్టురా పొద్దూకి మనమే దావత్ చేసుకుందాం అన్నడు బీరప్ప.
తెల్లారింది. పాలుపిండుకొచ్చేడోడు పాలుపిండుకొస్తుందు..పాలు పోషోచ్చెటోడు పోషోస్తుండు...
బీరప్ప పెండ్లానికి (రుక్కమ్మకు) ఓయ్ లోతుగిన్నెల కూరుంది ఒండుమన్నడు.
కూరెక్కడిదయ్యా. ఎవరిదన్న సచ్చిందా ఏంది అన్నది రుక్కమ్మ.
ఎక్కెడిదయితే నీకేందిగని ఒండరాదు. నీయక్క నీకు అన్నిగావాలె.
ఒశినిపాడుగానో గింతకూర ఏంజేసుకుంటాని తెచ్చినవ్ పోరగాళ్లు గూడ లేరైరీ.
సామి పెండ్లమయితె పొర్కపొర్క తిడుతుంది గింత కూర ఎందుకు తెచ్చినవని. బాడుకావ్ మీదికెల్లి దిగలె. ఆ తిట్టుడుకు సుట్టపక్కొళ్లకు అందరికి ఎర్కయింది. కూర తెచ్చిండని సగం ఊరు తెల్సింది. అమ్మలక్కలు గియ్యాల యాటను ఒవలు కోశిడ్రో అనుకుంటుద్రు.
అట్లా అందరి ఇండ్లళ్ల గదే లొల్లి కూర తీసుకపోయిన సుఖం లేకుంటయింది.
వండుకునేటోళ్లు వండుకున్నరు. కూర ఎక్కుకున్నదని సుట్టుపక్కొళ్లకు ఇచ్చేటోల్లు ఇచ్చుకున్నరు.
ఏడు, ఎనిమిది అయితుంది.
ఎవరో చెప్పంపినట్టే సైకిల్‍మీద రానే వచ్చిండు బండ కొమారు గొర్రెపోయిందని.
గొర్లకాడి అయిలయ్య గొర్లదొడ్డి ఊడుస్తుండు
బండ కొమారు ఒత్తొత్తనే సైకిల్ దిగముందుకే శెనార్థి అయిలయ్య బావ అన్నడు.
శెనార్థి శెనార్థి అంతాబాగేనానోయ్. పొద్దుగాలనె ఎల్లినేమోయ్ ఎటుపోతున్నవ్ అన్నడు అయిలయ్య. నీపాడుగాన్ నిన్న ఓ గుడ్డిగొర్రె కీతప్పింది బావ. ఎక్కదపాడయిందో ఏమో మీ గుంపులకు గిట్ల వచ్చిందా అని తిరుగుతున్నా.
ఏమోనోయ్ నేనైతే కానలేదు (కనబడలేదు)....
బండ కొమారు గొర్లదొడ్లు అన్ని తిరిగిండు ఏ గుంపుల గుడ్డిగొర్రె కనబడలేదు.
తిరుగంగా తిరుగంగా అమ్మటాల్ల అయింది.
కొమారకు ఊళ్లె సుట్టిర్కం (బందువులు) కూడా ఉన్నది అందరు నెలువున్నొల్లె. (తెలిసినోల్లె)
ఊరంతా తిరిగిండు వాళ్ల అల్లుడు భూపాల్ ఇంటికి పోయిండు...
ఇంటికాడ భూపాల్ లేడు. వాళ్ల అమ్మ ఉన్నది. ఇప్పుడే వత్తున్నవా తమ్మి అనుకుంటా కడుక్కుందురారా అని బుడిగె చెంబుతో నీళ్లీంచింది. కాళ్లు కడుక్కుండు. ఇంట్లెకు కూడా పోకుంటనే అరుగుమీదనే కూసుండు. పోరగాళ్లు మంచిగున్నార్రా.. పెద్దోడు పట్నంల సదువుతుండేమో మంచిగ పోతుండా.. అవ్వకు శాతనైతుందా.... అని మంచి చెడు అర్సుకున్నది (తెలుసుకున్నది) అమురమ్మ.
అల్లుడు ఎటుపోయిండు అక్క అన్నడు కొమార..
ఆడు ఏడ పెత్తనం చేయపోయిండో... ఇంటికాడ ఉంటడా మీ అల్లుడు..
అల్లున్ని అడుగవడితివి ఎందుకురా?
ఏంలేదు అక్క నిన్న గుడ్డిగొర్రె పోయింది. మీ గుంపులల్లకు గిట్ల వచ్చిందేమో అని వచ్చినా యాడ దొరుకలె...
గది యాడికిపోతదిగని అమ్మటాల్లయింది తిందురారా.
అల్లుడు రానియ్యరాదు తింటగని.
ఆడు ఎప్పుడొస్తడో ఏమో నువ్ తిందురారా.
పోస్కతాగ (కూర) కూడా ఏంలేక దప్పుడం పెట్టిన ఏం కూరగాయలు దొరుకుతలేవ్. ఏమ్ దొరికి పాడయితున్నయ్ ఈ ఊళ్లె. కూరగాయలోడన్న అమ్మోస్తలేడు అన్నది అమురమ్మ.
ఊల్లెకెళ్లి అటుఇటు తిరిగి వచ్చిండు అల్లుడు భూపాల్.
ఎటుపోయినవ్‍రా మావొచ్చి గింతసేపాయో.
నేనెటు పోయిన్నె గడ్డమీదనే ఉన్న ఇంతసేపు. రాత్రి బీరప్ప చిట్టికాంగనే గొర్లకోస్క తిన్నరటా అని మాట్లాడుతుంటే గాన్నే ఉన్నా. రాత్రి గొర్రెను కోసిన విషయం పాలు పోసేకాడ శిలశిల తెలిసింది. అమ్మటాల్ల వరకే ఊరంత ఎరుకైంది.
ఎవడెవడురా అన్నది...
ఇంకెవడెవడో తేలలే.. ఇంకెడెవడు ఉంటరు గాళ్లే బీరప్ప, సాగ్యాడు గీ ఇద్దరు దొంగలు అయిఉంటరు..వాళ్లు ఇద్దరు కల్సి మిగతా ఇంకో నలుగురికి అంటిచ్చిర్రు....నోట్లె నాలుకలేనోడు కొంరి పెద్దయ్య కూడా దొంగయ్యేటట్లుండు.
మామది కూడా గొర్రె పోయిందటగారా. గదే కావోచ్చునా.
అది గదే అయి ఉంటది.
అల్లుడు నాది అయితే గొర్రె పోయింది. నేను పెద్దకురుమ బయన్నకు పిర్యాదు అయితా మరి నువ్వెంజేస్తవో నీఇష్టం అన్నడు బండ కొమారు....
నీయవ్వ నీ గొర్రెకు ఒక్కటికి రెండు ఇప్పిత్తపో నువ్వెం పికరు పడకు. అన్నడు భూపాల్.
మామ అల్లుడు దప్పుడం పోసుకొని తిన్నరు. పెద్దకురుమ ఇంటికి ఇద్దరు పోయిండ్రు.
శెనార్థి పెద్దకురుమ అన్నడు కొమార.
శెనార్థి శెనార్థి. ఏం సంగతి బాగేనానే అన్నడు పెద్దకురుమ.
బాగే అనుకుంటనే బండ కొమారు నా గుడ్డిగొర్రె పోయింది మీ ఊరోళ్లు కోసుకుండ్రటా అని పెద్దకురుమ బయన్నకు పిర్యాదు అయిండు.
కురుమలలో ఏ పంచాయతి అయినా పెద్దకురుమకు పిర్యాదు అయితరు.
పెద్దకురుమ కులాన్ని కూడగొట్టిండు. కులపోల్లు అందరు గడ్డమీద కూడిండ్రు.
రాత్రి పొరుగూరు కులపోని గొర్రెను కోసుక తిన్నరటా. నిజమా? అబద్దమా?
అతగాడు వచ్చి పిర్యాదు అయిండు మరి ఏం చేద్దాం చెప్పుండ్రి.
ఎవడెవడో ఆ దొంగ పని చేసింది ఎవడో అనుమానం ఉంటే మరి పిలిపియ్యరాదే అన్నడు ఓ కులపాయినా.
బయటోడు ఎవడయ్య మనదాట్లెనే దొంగలు ఉన్నరు అని ఇంకో పెద్దమనిషి అన్నడు. తెల్లారంగనే సామిగాని పెండ్లం, బీరని పెండ్లంలొల్లి పెడుతనే ఉండే కూరెందుకు తెచ్చివని.
అట్లా వాళ్లంతటే వాళ్లే బయటపడ్డరు.
అనుమానితులను బీరయ్య, కొంరయ్య, సామి, పుల్లయ్య, చెంద్రయ్య, నర్యయ్య అందరిని పిలిపిచ్చిండ్రు..
కులం గడ్డమీద కులపోల్లు అందరు కూడిండ్రు...
ఓ కొమార ఓ కొమార పిలుచుకుంటా గుయ్యగుయ్య లొల్లి పెట్టకుర్రా అని పెద్దకురుమ గదిరిస్తూ ఓ కొమార మాకు పిర్యాదు అయిన సంగతి ఏందో చెప్పుమన్నడు పెద్దకురుమ బయన్న.
కొమార కులమా అందరికి శెనార్థి.
నాది నిన్న గుడ్డిగొర్రె (తప్పిపోయింది) కీతప్పిందే. మీ ఊరొళ్లు కొసుక తిన్నరు అని ఇప్పుడే తెలిసిందే. కోసుక తిన్నరా? లేదా మాకు ఏం తెల్వది అంటరా చెప్పుండ్రి.
గంతేనానే నువ్ అట్లా ఉండు అన్నడు పెద్దకురుమ.
పెద్దకురుమ ఆరీ బీరా ఓరి బీరా (బీరప్ప) నిన్న గుడ్డిగుర్రెను కోసుకు తిన్నది నిజమేనా ఎవడెవడు కూడిడ్రో. చెప్పు మరి బదునాం నువ్వొక్కని ఎందుకు మోత్తవ్.
బీరప్ప నాకు ఏం తెల్వదే.
పెద్దకురుమ అందరిని వరుసపెట్టి కొంరయ్యను, సామిని, పుల్లయ్య, చెంద్రయ్య, నర్సయ్యను అందరిని అడిగిండు.
అందరు మాకు ఏంతెల్వది మాకేంతెల్వది మేం ఏ గుడ్డిగొర్రెను సూడలేదు అన్నరు.
పొద్దుగాల సామి పెడ్లం ఇంటికాడ లొల్లిపెట్టినప్పుడే ఊరంత ఎరుకయింది. వీళ్లు దొంగగొర్రెను కోసుకున్నరని.
వీళ్లు గిట్లయితే చెప్పరు అనుకుండు పెద్దకురుమ చెప్పు అందుకుండు లం... కొడుకులారా....అని తిట్టుకుంటా కులపోని సొమ్ము దొంగరాత్రి కోసుకతింటరు మల్లనాకు తెల్వదితెల్వది అంటార్రా అని మనిషి రెండుపెట్లు పెట్టిండు..
బీరప్పకు, పచ్చిపులుసు సామికి ఇద్దరికి చెప్పుదెబ్బలు పడుడు అలవాటే.
మిగతావోళ్లు ఒక్కటేదెబ్బకు ఒప్పుకుండ్రు మేమే కోశినం అని.
బండ కొమార లేషిలేషి ఎగురుతుండు ఇగ కులం మర్యాద గిట్లనే ఉంటాదే. రేపు గొర్లు గిట్లనే మా ఊళ్లెకు తప్పిదారి వొస్తయ్ మేము గిట్లనే చేయల్నా చెప్పుండ్రయ్యా అని లొల్లి పెడుతుండు.
అక్కడున్న కులపోల్లు ఓ కొమార నువ్ ఓపికపట్టు జెర ఆగు అని ఊకుంచ్చిండ్రు.
ఈల్లనోట్ల ఆల్లనోట్ల పడి ఊరంతా ఎరుకయింది మంది బాగనే కూడిండ్రు..
తల ఓమాట తిడుతుండ్రు. కడుపు కొట్టినాది వారవారం కోస్తనేవుండ్రి ఇంత కూర తెచ్చుకోపోయిండ్రు అని అమ్మలక్కలు తిడుతుండ్రు..
గొర్రెను కోసుకతిన్నోళ్లు ఇజ్జతికి తలలు కిందికేసుకుండ్రు.
సామి పెండ్లమయితే కూర వొండలే పచ్చికూరనే తెచ్చి కులం గడ్డమీద పెట్టింది.
బీరప్పను రుక్కమ్మ సిగ్గుతప్పినోడా. లజ్జతప్పినోడా..అని ఆగకుంటా ఒక్కటే తిట్టుడు.
కొంరయ్యకు గిసోంటి లంగదొంగ పనులు తెల్వయ్.. గీల్లు చెయ్యవట్కెనే గీ బదునాం మోస్తుండు..
లం...కొడుకులకు కడుపుకొట్టినాది అని తిట్టుకుంటా ఒక్కోక్కని రెండు గొర్లు దండుగెయ్యాలె అంటడు ఓ కులపాయిన యాదగిరి.
కులంల ఒక్కడు చేసిన అందరు చేసినట్టే ఏం తీర్మాణం చేస్తరో చేయిండ్రి అంటడు.. రాజయ్య.
అనుభవం అయినోల్లు పెద్దపెద్ద మనుషులు పక్కకు పోయిండ్రు.
ఒకరినొకరు అడుగుతుండ్రు ఎట్లాచేద్దాం అని.
నర్సయ్య అనే పెద్ద మనిషి అన్నడు పొరుగూరు బండ కొమారును ఒకటి రెండు ఇస్తం అని ఎల్లగొడ్త్తాం. తర్వాత మనం కులం కూసోని మాట్లాడుకుందాం అన్నడు.
అరె మంచిగనే ఉంది ఈ మాట గట్లనే చేద్దాం. ఇంకో పెద్దమనిషి వాళ్ల ముచ్చటకూడ ఇప్పుడే తెగగొట్టాలె అంటడు.
పొరుగూరోని ముందట మనలొల్లి ఎందుకే ఆయనను ఎల్లగొడ్తాం అంటరు.
అందరు ఒప్పుకుంటరు.
అందరు మళ్లీ కులం గడ్డమీదికి వొస్తరు.
పెద్దకురుమ తొప్పో ఒప్పో మా పోరగాళ్లు ఓ దొంగపని చేసిండ్రు...
నువ్ ఏమనుకోకు మేము నీకు ఒకటి రెండు గొర్లు కొట్టిస్తం అని కొమారకు చెప్పిండ్రు.
కొమార అంత అల్కగా ఏం ఒప్పుకోలె లొల్లి పెట్టుకుంటనే గిట్లనే ఉంటదా కులం మర్యాద అని కాసేపు లొల్లి చేసిండు..
సచ్చిందా రాదుగని నువ్ నిమ్మలపడు ఒకటికి రెండు ఇస్తమన్నరు కదా. ఇగ నువ్ ఊకోఊకో అన్నరు అందరు.
ఇగ నీపని మీద నువ్‍పో వారంలోపల నీకు రెండు గొర్లు కొట్టిస్తంగని అన్నరు.
పెద్దకురుమ మాటమీదికెళ్లి ఎల్లిపోయిండు బండ కొమార.
పెద్దమనుషులు అందరు గడ్డమీదనే కూసుండ్రు.
కులమా ఎట్లా చేద్దాం చెప్పుండ్రు మరి గొర్లు ఇడిసేయాల్లయింది పొద్దుపోతుంది అన్నడు పెద్దకురుమ.
అందరు కలిసి ఒక ఆలోచన చేసిండ్రు.
తప్పు ఒప్పుకోని కులం కాళ్లు పట్టుకోవాలె..
జుట్టుకు రెండు గొర్లు దండుగ ఎయ్యాలె అని తీర్మాణం చేసిండ్రు.
కొంరయ్య, సామి, పుల్లయ్య, చెంద్రయ్య, నర్సయ్య ఇజ్టతికి ఒప్పుకుండ్రు కాని బీరప్ప లేసిలేసి పోతుండు. ఏం చేత్తరో చేయుండ్రు. నేను ఏ దండుగా కట్టా అనుకుంటా.
కురుమ గడ్డమీద బీరప్పను తిట్టినోడే కాని తిట్టనోడు లేదు.
యాడికి ఉరుకుతడో ఉరుకనీయరాదు. ఒక పెద్ద మనిషి అన్నడు.
ఏ సమస్య వచ్చిన మళ్లీ కులంలకు రాకతప్పదు. కులం తప్పు తీస్తరు. పండుగ పబ్బం ఏ శుభకార్యం అయిన కులపోల్లు పోరు వాళ్లను పిలువరు...
బీరప్ప పాలోల్లు నచ్చచెప్పి తీసుకొచ్చి తప్పు అనిపిచ్చి దండుగ కట్టిపిచ్చే ప్రయత్నం చేస్తున్నరు. బీరప్ప ఇంటలేడు.
బీరప్ప అన్నదమ్ములు మా ఇజ్జతి తీస్తుండుగా మా ఇంట్లా చెడపుట్టిండు గీ ఇజ్జతితప్పినోడు అని తిట్టుకుంటా వాడు ఇయ్యక పోతే మేము ఇస్తం అని కులంల ఒప్పుకుంటరు. రుక్కమ్మ బీరప్పను తిట్టకుంటా పెద్దకురుమ కాళ్లమీద పడుతది.
నువ్ చెయవట్కినే మేము దొంగలమైతిమి కదరా..అని బీరప్పను మిగతా అయిదురుగు ఇంకోసారి గీ దొంగ లం....కొడుకు సోపతి కూడొద్దురా అని తిట్టుకుంటా ఎవరి ఇండ్లళ్లకు వాళ్లు పోయిండ్రు.
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు