సందీప్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడు. ఇద్దరు అన్నలు మధ్య తను తన తర్వాత చెల్లి,కుటుంబం బాగానే స్థిరపడిన వాళ్ళు , ఊర్లో ఉండడం వల్ల చదువు కొనసాగదు అని వరంగల్ కి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు.
ఇప్పుడు సందీప్ ఏం.బి.ఏ లో జాయిన్ అయ్యాడు. చదువుకుంటూనే అన్న మొదలు పెట్టిన మెడికల్ షాప్ లో అప్పుడప్పుడు ఉంటూ సాయ పడుతూ ఉండేవాడు.
అన్నలు ఒకరు మెడికల్ షాప్ రన్ చేస్తుంటే ఇంకొకరు మొబైల్ షాప్ రన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చెల్లెలు ఊర్లో ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉన్నారు.
మొత్తానికి సందీప్ కుటుంబం స్థిరంగా ఉన్నారు. ఎలాంటి గొడవలు , పొరపొచ్చాలు లేకుండా సంతోషంగా గడుపుతూ ఉన్నారు.
పొంగి పొరలే వయసు మనసు తో యువత కాలేజీలో ఉరకలు వేస్తూ ఉంటారు. మన సందీప్ మాత్రం సున్నిత మనస్కులు కావడం వల్ల ఎవరితో ఎక్కువగా కలవకుండా , మాట్లాడకుండా తన పనేంటి, తన చదువు ఏంటో చూసుకుంటూ ఉండేవాడు.
కానీ కాలేజీ లో ఇలాంటి వాళ్లను చూస్తే ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది కదా ఇక్కడ కూడా అలాగే జరిగింది.
**
మనుషులు తాము ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ దాని ఫలితం , పర్యవసానం ఎలా ఉంటుందో అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
ఎదుటి వారు ఎంత బాధ పడుతున్నారు, వారు ఏం చేస్తారు అని ఆలోచించకుండా కేవలం తమ సరదా కోసం, ఒకరిని ఫుల్ చేయాలని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
**
ఏయ్ అటూ చూడే ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అంటూ మోచేత్తో పొడిచింది దీప రూప ను అవునే చూస్తూనే ఉన్నా , కానీ ఎవరితో మాట్లాడ డు , ఎవరితో కలవడు ఏం చేద్దాం మరి , తను అంటే నాకు ఇష్టమే తనని ఎలాగైనా ముగ్గులోకి దింపి తనతో సినిమాలు ,షికార్లు చేయాలి అని ఉంది.
కానీ గురుడు అమ్మాయిలు అంటేనే ఆమడ దూరం పెడతాడు. ఎలాగే వాడిని మాట్లాడేలా చేయడం అంది రూప . నికు వాడు మాట్లాడడం కావాలి అంతే కదా నేను చేస్తాను ఏమిస్తావు చెప్పు అంది దీప.
ఎలనే నిజంగా మాట్లాడేలా చేస్తావా చెప్పు అంది రూప చేస్తా కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి దాంతో వాడు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు మరి నీకు ok కదా అంది దీప .
ఆ సరే మరి ప్లాన్ ఏంటో చెప్పు అంది .
నువ్వు వెళ్లి సందీప్ తో మన స్నేహితురాలు వీణ ఉంది కదా అది నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పు , నువ్వంటే దానికి ప్రాణం అని చెప్పు అప్పుడు తను నీతో మాట్లాడతాడు. నీ వెనకే పడతాడు అంటూ చెప్పింది.
దానికి రూప కానీ వీణ ప్రేమించడం లేదు కదా అసలు తనకు మనకు ఏం సంబంధం లేదు కదా ఒక వేళ సందీప్ తనను అడిగితే ఎలా అంది రూప.
దానికి దీప నీ బొంద వాడు ఎవరితోనూ మాట్లాడడం చూశావా ఇంకా లవ్ మేటర్ అంటే ఇంకెక్కువ సిగ్గు పడి మాట్లాడడం అంటూ జరగదు.
కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్లి చెప్పు. నీ మాటల్లో అసలు భయం కనిపించకుండా నమ్మేలా చెప్పు సరేనా అంటూ రూప ను ముందుకు తోసింది దీప.
భయపడుతూనే వెళ్ళిన రూప కాస్త ధైర్యం తెచ్చుకుని సందీప్ అంటూ పిలిచింది బెంచ్ పై కూర్చుని బుక్ చదువుతున్న సందీప్ తలెత్తి చూసి రూప కనిపించడం తో తడబడుతూ లేచి నిలబడ్డాడు.
అతని తడబాటు చూసిన రూప ఇంకా జబర్దస్తీ గా వెళ్లి కూర్చుని నీతో ఒక మాట చెప్పాలి అంది. దానికి సందీప్ ఏంటో చెప్పండి అన్నాడు. కూర్చుంటే చెప్తా అనగానే తన పక్కన కాకుండా కాస్త దూరం లో కూర్చున్నాడు కానీ రూప అంతా దూరం వెళ్తే మైక్ లో అరిచి చెప్పాలా అంటూ తన ముందుకు వెళ్లి చూడు సందీప్ మన క్లాస్ లో వీణ ఉంది నీకు తెలుసా అని అడిగింది .
లేదండీ తెలియదు అన్నాడు సందీప్ అదిగో అటూ చూడు అంటూ వీణ ఉన్నవైపు చూపించింది తల తిప్పి చూసాడు సందీప్ అవును తనెనా వీణ అన్నాడు అవును తానే వీణ , తను నిన్ను ప్రేమిస్తుంది తనతో నువ్వు మాట్లాడడం ఇబ్బంది గా ఫీల్ అవుతారు అని నన్ను చెప్పమని పంపింది .
కాలేజీలో చేరిన మొదటి సారి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టింది. కానీ తనతో నువ్వెప్పుడు మాట్లాడలేదు కలవ లేదు . ఇక తను నిన్ను కలిసి చెప్పాలనుకున్న ప్రతిసారీ నువ్వు తనను అవాయిడ్ చేస్తున్నావు అని అనుకుంటుంది. తను నిన్ను ఇష్టపడుతుంది ఇక నీ నిర్ణయం చెప్పు అంది రూప.
అవునా నిజంగా తను నన్ను ఇష్టపడుతుంది అని నాకు తెలియదు అయినా ఇప్పుడే కదా తెలిసింది. నాకు కొంచం టైమ్ కావాలి ఆలోచించాలి కదా అన్నాడు . నిజంగా నన్ను ప్రేమిస్తుంది కదా అంటూ అడిగాడు. అవును బాబు అవును నిజంగానే ప్రేమిస్తుంది కావాలంటే చూడు నువ్వేం చెప్తావు అని ఇటే చూస్తుంది అంటూ వీణ వైపు చూపించింది రూప.
నిజంగానే వీణ రూప ,సందీప్ వంక చూస్తూ కనిపించడం తో నిజమే అని నమ్మాడు సందీప్. సరే క్లాస్ కు టైం అవుతుంది కానీ నీ ఫోన్ నంబర్ ఇవ్వు, తన గురించి నీకు అన్నీ చెప్తాను అంటూ ఫోన్ నంబర్ తీసుకుంది . తర్వాత మూసి మూసి గా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రూప.
ఒక అమ్మాయి తనను ఇష్టపడుతుంది. తనను ప్రేమిస్తుంది అని తెలిసిన సందీప్ ఊహల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళాడు. ఒక అమ్మాయి తన జీవితం లోకి రావడం, తనంతట తానుగా ప్రేమిస్తున్నా అని చెప్పడం తో సంతోష పడి ఊహల్లో విహరిస్తూ ఇంటికి వెళ్ళాడు. తన ఇష్టాఇష్టాలు ఎంటి, తన అభిరుచులు ఏంటి తెలుసుకోవడానికి రూప తో మాట్లాడడం మొదలు e సందీప్.
**
దీప చెప్పిన ప్లాన్ పని చేయడం వల్ల రూప సంతోషంగా ఉంది. తను సందీప్ తో మాట్లాడుతూ తన ఇష్టాలను వీణ ఇష్టలుగా అన్నట్టు చెప్తూ, అతనితో చాటింగ్ చేస్తోంది. రోజూ గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు.
కానీ వీణ కు ఈ విషయాలు ఏవీ తెలియవు, తనకు తెలియకుండానే తను వారికి ఒక ఆట వస్తువు అయ్యింది. రోజులు గడుస్తున్నాయి.
వీణ తన ఊర్లో ఉన్న ఇంకొక అబ్బాయిని ప్రేమించింది కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వీణ తల్లిదండ్రులు వీణ అతన్ని కలవకుండా చేశారు. కట్టడి ఎక్కువ అయ్యింది.
పెళ్లికి ఇద్దరు తల్లిదండ్రులూ ఒప్పుకోక పోవడం వల్ల తాము ఎప్పుడూ కలవలేము అని అనుకున్నా వీణ ఆత్మహత్య చేసుకుంది. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు.
విషయం తెలుసుకున్న సందీప్ చాలా బాధ పడ్డాడు. అయితే దీప, రూప ఇద్దరు ఈ విషయాన్ని తీసుకుని సందీప్ తో సరదాగా ప్రాంక్ చేయాలి అనుకుని , నీ వల్లనే తాను చనిపోయింది. నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పక పోవడం వల్లనే తాను సూసైడ్ చేసుకుంది అంటూ చెప్పడం మొదలు పెట్టారు.
విషయం తెలిస్తే పోలీసులు నిన్ను తీసుకుని వెళ్తారు. మీ ఇంట్లో ఎం చెప్తావు అంటూ సందీప్ ను అదర, బెదర గొట్టారు. పాపం సున్నిత మనస్కుడు అయిన సందీప్ ఇది తట్టుకోలేక పోయాడు. నిజంగా నా వల్లే జరిగి ఉంటుంది .
నేను నా అన్నల ముందు , తల్లిదండ్రుల ముందు , కాలేజీ లో ఉన్న స్నేహితుల ముందు తలెట్టుకొలేను అనుకున్నాడు. చాలా భయ పడ్డాడు. బాధ పడ్డాడు. పోలీసులు రాక ముందే ఏదైనా చేయాలి అనుకున్నాడు. అందుకే ఊరికి వెళ్ళిపోయాడు.
**
అక్కడ ఊర్లో రాక రాక హఠాత్తుగా వచ్చిన కొడుకును చూసి తల్లి దండ్రులు, చెల్లి సంతోషించారు. సందీప్ కూడా ఏమి జరగనట్టు వారితో సంతోషంగా గడిపాడు. తల్లి చేసిన వంట తిన్నాడు. చెల్లి తో సరదాగా కబుర్లు చెప్పాడు. తండ్రితో తనివి దీరా మాట్లాడాడు.
తిన్న తర్వాత పొలానికి వెళ్లి చూస్తా అంటూ బయలుదేరాడు. వాళ్ళు కూడా సరే అని అన్నారు. పొలం లో మందు కొడుతున్నా బిడ్డ అంటూ తండ్రి చెప్పడం తో నేను మందు తీసుకుని వెళ్తా, నువ్వు కొంచం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి , పొలానికి వెళ్ళాడు సందీప్.
అంతకు ముందే ఫోన్ లో రూప పోలీసులు మీ ఇంటికి బయలుదేరారు అంటూ సందేశం పంపింది. సందీప్ కు ఏం చేయాలో అర్థం అయ్యింది. పొలానికి తీసుకుని వెళ్ళిన గుళికలు చేతిలో పోసుకుని ఒక్కసారిగా మింగేశాడు. మోటారు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాడు. ఇక నా వల్ల ఎవరికీ ఏమీ నష్టం లేదంటూ, అక్కడే పడి పోయాడు.
ఇంట్లో ఉన్న తండ్రి పొలానికి మందు వేద్దామని వచ్చి , కింద పడి కొట్టుకుంటున్న కొడుకుని చూసి , గుండెలు బాదుకుంటూ కొడుకుని ఆసుపత్రి కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సందీప్ ప్రాణాలతో పోరాడి ఓడిపోయి చివరికి చనిపోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సందీప్ ఫోన్ చెక్ చేశారు. దాంతో రూప బండారం బట్టబయలు అయ్యింది. దాంతో రూప దగ్గరికి వెళ్లారు. మేము కావాలని చేయలేదు ఏదో సరదాగా చేశాను.
అంటూ రూప ఏడుస్తూ చెప్పేసరికి పోలీసులు ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్దం కాక బుర్రలు గిక్కున్ననారు. కానీ ఒక మనిషిని ఆత్మహత్యా చేసుకునేలా ప్రేరేపించడం వల్ల వారీ ని అరెస్టు చేశారు.
ఏది సరదా గా చేయాలో , ఎది సీరియస్ గా చేయాలో తెలియని వయస్సులో ఇలా చేయడం అమ్మాయిలు చేసిన పొరపాటు , వారు ఒకటి అనుకున్నారు . జరిగింది ఇంకొకటి , ఇక్కడ మంచిగా ఉన్న వాడిని ప్రేమలోకి దించాలని, తనతో ఆడుకోవాలని అనుకున్నారు. డబ్బు కోసం కూడా ఆశ పడ్డారు. అలాగే సందీప్ దగ్గరి నుండి డబ్బులు గిఫ్ట్ ల పేరిట వసూలు చేశారు.
ఇప్పుడు సందీప్ చనిపోవడం తో రూప ను , దీప ను కోర్టులలో ప్రవేశ పెట్టారు. దాంతో జడ్జ్ వారికి రిమాండ్ విధించారు. జైల్లో ఇక వాళ్ళు మగ్గ వలసిందే.
వాళ్ల జీవితాలు యువతరానికి ఒక గుణ పాఠం.