మా రచయితలు

రచయిత పేరు:    పుట్టి నాగలక్ష్మి

సాహిత్య వ్యాసలు

కళ్ళ ముందు జరిగిన సంఘటనలను చిత్రించిన “వక్ర గీత” 

డాక్టర్ వి ఆర్ రాసాని (డా.రాసాని వెంకట్రామయ్య) తమ ఊరిలో చుట్టుపక్కల పల్లెలలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని కథలు, నవలలు రాయడంలో స్రష్ట.  అలా అని వార్తలలాగా రాయరు.  కథ, నవలా, శిల్పం, వర్ణనలు, స్థానిక మాండలిక సంభాషణలు అద్భుతంగా ఉంటాయి.  ముఖ్యంగా అణగారిన వర్గాల దీన బాధామయ గాథలను వస్తువుగా ఎంపిక చేసుకుంటారు.

'వక్ర గీత' నవల ఆయన చెప్పుకున్నట్లు గానే చిత్తూరు జిల్లాలోని పల్లెలలో జరిగిన ముగ్గురు అమ్మాయిల బాధామయ గాథ. నిజజీవితంలోని ఆ ముగ్గురు అమ్మాయిల కరుణారసభరిత గాథలను కలిపి ఒకే పాత్రగా మలిచి సాహితీ లోకానికి అందించడం వారి రచన చమత్కృతికి, వైచిత్రికి నిదర్శనం.

ఈ నవలలోని 'తిమ్మక్క' వివిధ పరిస్థితులలో, బలహీన క్షణంలో చేసిన తప్పు... మళ్లీ మళ్లీ తప్పులు చేయిస్తుంది. ముగ్గురు ఆడ పిల్లలను కంటుంది. అసలు భర్త కి పుట్టిన కూతురు మేనమామల బాధ్యత తీసుకోవడంతో సుఖ జీవనం సాగిస్తుంది.  మిగిలిన ఇద్దరు ఆడపిల్లలలో ఒకరు పెళ్లయ్యాక చనిపోతే, పసిపిల్లని అమ్మకానికి పెడతాడు పిల్లని కన్న తండ్రి. కుక్కలు చింపిన విస్తరిలా నిస్సారమై, వీచే గాలిని బట్టి జీవిత ప్రవాహంలో కొట్టుకుపోతూహీన స్థితిలో మరణిస్తుందామే.

వయసులో ఉన్న ఆడ పిల్లలకు ఎదురయ్యే వేధింపులు, క్షణికావేశంలో వేసిన తప్పటడుగులు, తప్పటడుగులు వారి జీవితాలనే కాక పిల్లల జీవితాలను ఛిద్రం చేయడం బాధాకరం.  కానీ ఇవన్నీ ఇప్పటికీ కింది వర్గాలలో పల్లెలలో జరుగుతున్న కథలే! వెతలే!

ఉన్నత వర్గాల వారు చేసే 'డేటింగ్' అనీ 'సహజీవనం' అని మెచ్చుకోలుగా అనేవారే, పేదలు చేస్తే 'వ్యభిచారం' అంటారని ఉదాహరణలతో చూపించారు రచయిత.

ఇక వర్ణనలకు వస్తే పల్లెలలో జరిగే జాతరలు, జరిగే భయంకర పద్ధతి, తాగి తందనాలు ఆడే మగవాళ్ళు, ఆడవాళ్ళ ఆవేదన, ఆర్తనాదాలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి.

రచయిత సునిశిత పరిశీలన, వర్ణనా వైచిత్రి, ఉపమానాలు అద్వితీయం.

చిన్న కుటీర పరిశ్రమలు, కపిలబాయిల పూడిక తీయడం, ఇటుక బట్టీల నిర్వహణ, రోడ్లు వేయడం వంటి వాటి వివరణ ఆ సన్నివేశాలను మన కళ్ళ ముందుంచుతాయి.

ఆధునికీకరణ పెరిగిన కొద్దీ పల్లెలో వృత్తి పని వారి జీవితాలకు భద్రత కరువైన విధానాన్ని అద్భుతంగా వివరించారు.

చిత్తూరు జిల్లా పల్లెల మాండలికం ఆయన చేతి రాతలో కొంగొత్త సొబగులను కూర్చుకొని శోభిల్లుతోంది. ఇవన్నీ మనం అనుభవించాలంటే ఈ దీనురాలి గాథను చదివి తీరవలసిందే.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు