మా రచయితలు

రచయిత పేరు:    హుమాయున్ సంఘీర్

కథలు

దిద్దుబాటు 

పెదమామ కిషన్ చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే "పెద్దబాపూ ఎంతపని జేస్తివే? అప్పుడే నీకు అవుసు మూడినాదే" అంటూ మంజుల గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు అమ్మ ఏడుస్తోందని వాళ్లు కూడా శోకం పెట్టారు. వాళ్లను చూస్తూ రఘు, రామ్ పైకి కన్నీళ్లు కనిపించకుండా బాధను అదుముకుంటున్నారు. రామ్ భార్య సుజిత కూడా పసివాణ్ణి ఎత్తుకుని తోడి కోడలు పక్కన చేరి ఓదార్చుతోంది. ఇల్లంతా ఏడుపులతో గొల్లుమంటోంది. సుజిత పక్కనే కూర్చున్న ఐదేళ్ల కుమార్తె లలీ ఏమీ అర్థం కాక అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తోంది. ఇంట్లోని ఏడుపుల చప్పుడు వాడకట్టు అంతా వ్యాపించింది. దీంతో ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఏమైందంటూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. "మా పెద్దమామ కాలంజేశిండు" అని వాళ్లకు రఘు సమాధానం చెప్పిండు. "ఊకో బిడ్డా.. కిషన్‌కు అప్పుడే నూరేండ్లు నిండినయా.. నా కండ్లముంగటి పోరగాడు. లారీ నడిపిచ్చి నడిపిచ్చి కిడ్నీలు ఫెయిల్ చేసుకున్నడు. శిన్న బిడ్డె లగ్గమన్న సూడకపాయె పోరడు" అంటూ మంజులను హత్తుకుని శోకం పెట్టి ఏడుస్తోంది మేదరి నర్సమ్మ. ఆమెను మరింత గట్టిగా పట్టుకుని మంజుల వలవలా ఏడుస్తోంది. తన కొంగుతో మంజుల కన్నీళ్లు తుడుస్తూ "ఊకోయె పోరీ.. ఎప్పటికున్న ఎవలమైన పోవల్శిందే" అంది. తొంభై ఏళ్లుంటాయి నర్సమ్మకు. తన పెద్దకొడుకు, కిషన్ ఒకటే తోటోల్లు అనేది. "బతకవోయిన ఊర్లనే సందం జేశెటట్టున్నరు గదా" వెక్కుతూ అడిగింది రఘును చూస్తూ. అవునన్నట్టు తలూపాడు రఘు. 

"ఈడ మాయిముంతను ఇడ్సవెట్టి పోయి బతకవోయిన జాగలనే ఇంత ఇల్లు కట్టుకున్నడు గదా.. ఆడనే బొందవెడ్తరు. కనీ సూశినవా మీ అవ్వ సచ్చి యాడాది తిర్గకుంటనే వీడు పాయె. ఏం సూశిర్రని పోరగాండ్లు అప్పుడే నూరేండ్లు నిండినయి" అంటూ మళ్లీ ఏడుపందుకుంది నర్సమ్మ. గోపాల్ పేట్ నుంచి ఎల్లారెడ్డికి పోవాలిప్పుడు. రామ్ ఫోన్‌లో కిరాయికి ఉమ్నీ మాట్లాడుతున్నాడు. సాయంత్రం సందం అని చెప్పారు. అరగంట జర్నీ కాబట్టి బయలుదేరాల్సిందే. పది నిమిషాల్లోనే ఉమ్నీ వచ్చి ఇంటి ముందు ఆగింది. అందరూ అవే అవతారాల్లో వెళ్లి ఉమ్నీలో కూర్చున్నారు. ఉమ్నీ కదిలింది. 

* * * 

పసితనంలోనే నాన్నను పోగొట్టుకున్న రఘు, రామ్‌లకు పెద్దమామ కిషనే తండ్రి అంతటి ప్రేమను పంచాడు. ఏ పండగ వచ్చినా వాళ్ల పిల్లలకు సరిగ్గా తమకూ కొత్తబట్టలు తెచ్చేవాడు. తన చెల్లెలు భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి కూలీనాలీ చేస్తూ అష్టకష్టాలు పడుతోందని పెద్దన్నగా కిషన్ అండగా నిలిచాడు. చెల్లెలి పిల్లలు బాధ్యతను కూడా తీసుకున్నాడు. చదువులు, పుస్తకాలు, బియ్యం, ఉప్పూకారం ఇలా సకలం కిషనే సమకూర్చాడు. జీవితం అనే సినిమాలో రఘు, రామ్ చూసిన మొట్ట మొదటి హీరో కిషన్. యుక్త వయసులో ఉండగా కిషన్ మెలితిప్పిన మీసాలతో ముఖంలో రోషం ఉట్టిపడేది కానీ, కొండంత ప్రేమ మయుడు, సముద్రమంత విశాల హృదయం కలవాడు. లారీ డ్రైవర్‌గా కిషన్‌కు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో మంచి పేరు ఉంది. లారీ డ్రైవర్ అనగానే బీడీలు తాగుతారని, మద్యంలో జోగుతారని, ట్రిప్పుకు వెళ్లిన చోటల్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఒక ప్రచారం ఉంది. కానీ కిషన్ ఒక్క దురలవాటులేని నికార్సయిన మనిషి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో అమ్మాయి సరిత మినహా అందరి పెళ్లిళ్లు చేశాడు. ఎల్లారెడ్డి టౌన్ కావడంతో తన లారీ పని అక్కడ బాగా సాగడం, పిల్లల చదువూ బాగుండటంతో అక్కడే సెటిల్ అయిపోయారు. గోపాల్ పేట్‌లో ఉన్న ఇల్లును చెల్లెలి కోసం వదిలేశాడు. 

ఎలాంటి అనారోగ్యం లేని కిషన్‌కు ఊరికే కూర్చుని రాత్రింబవళ్లు డ్రెవింగ్ చేసి చేసి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు కొంత కాలానికే ఎక్కువయ్యాయి. మోకాలి చిప్పలు అరిగి పోయాయని డాక్టర్లు మందులు ఇస్తే వాడుతున్నాడు. అయినా తగ్గకుండా మోకాళ్ల నొప్పులు కిషన్‌ని బాగా బాధించాయి. అప్పటికి కొడుకులిద్దరూ పెద్దవారై ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా మరొకరు నాన్న సంపాదించిన రెండు లారీల మెయింటెయినెన్స్ చూసుకుంటున్నారు. ఇంతలో కరోనా సోకింది కిషన్‌కు. ఎలాగోలా దానిని ఎదుర్కుని నిలిచాడు కానీ రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చాలా నీరసించి పోయాడు. వైద్యానికి శరీరం సహకరించకుండా అయిపోయింది. బాడీ సహకరిస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేద్దామని వైద్యులు చెప్పారు. ఇంతలో కోమాలోకి వెళ్లిపోయి వారం వ్యవధిలోనే కిషన్ తన 60వ ఏట ఈ ప్రపంచాన్ని వీడాడు. అంతకుముందు ఏడాది తన చెల్లెలు రఘు, రామ్‌ల అమ్మ లలిత రోడ్డుప్రమాదంలో చనిపోయింది. 

* * *

పడుకున్నాడేమో అన్నట్టుంది మామయ్య మృతదేహం. "పెద్ద బాపూ" అని శవం మీద పడి లబోదిబోమంటోంది మంజుల. కిషన్ తలాపున సరిత కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. రఘు, రామ్ మామయ్యను అలా చూసి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. అక్కడే నిల్చుని మౌనంగా రోదిస్తున్న మామ కొడుకులు సురేష్, మధులను చెరొకరు పట్టుకుని ఏడ్చేస్తున్నారు. ఒక శిఖరం నేలకొరిగినట్టు శాశ్వత నిద్రలోకి జారుకున్న మామను చూస్తుంటే రఘు దుఖ్ఖం ఇంకా కట్టలు తెంచుకుంటోంది. చుట్టాలు, బంధువులతో ఇల్లంతా కిక్కిరిసి పోయింది. ఏడుపులు పెడబొబ్బలతో వాడకట్టు అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కిషన్ తమ్ముడు, మంజుల నాన్న పండరి, ఆయన భార్య.. వదినను ఓదారుస్తూ ఆమె పక్కన కూర్చున్నారు. మరోపక్క కిషన్ చిన్న చెల్లెలు సరోజ కూర్చుని బాధ పడుతోంది. రఘుకు మామయ్యతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుని మరింత ఏడ్చేస్తున్నాడు. ఆఖరి నీళ్లు పోసి కడసారి అందరూ కిషన్ ముఖం చూసి సాయంత్రానికి అంత్యక్రియలు ముగించారు. మామకు చివరగా గుప్పెడు మన్ను సమర్పిస్తున్న రఘు ఆలోచనలన్నీ సరిత గురించే సాగుతున్నాయి. 

* * * 

చీకటి పడుతోంది ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మంజుల, సుజిత పిల్లలను తీసుకుని వెళ్లి తాము వచ్చిన ఉమ్నీలో కూర్చున్నారు. వెనకాలే రామ్ కూడా వచ్చేశాడు. రఘు సురేష్‌కు వెళ్తున్నానని చెబుతూ భుజం నిమిరాడు. ఆ చర్యకు భావోద్వేగంతో సురేష్ రఘును గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. "పోయిండు బాపు. మనకు రేపటినుంచి మంచీ చెడ్డా చెప్పే పెద్ద దిక్కు పాయె బావా" అంటున్న సురేష్ కళ్లు ఏరుధారలు అయ్యాయి. రఘు కూడా దుఖ్ఖాన్ని ఆపుకోలేకపోయాడు. వాళ్లని చూసి మధు కూడా వచ్చి పట్టుకుని ఏడుస్తున్నాడు. అక్కడికి వచ్చిన పండరి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. "ఊకోండ్రి బేటా అందరం పోయెటోళ్లమే. ఎవరు ఈడ ఎల్లకాలం ఉండనీకి రాలే. ఎనకా ముందు పోయెటోళ్లం" అంటున్న చిన్న మామ మాట విని రఘు తనని తాను సంభాళించుకుని, సురేష్, మధులను ఓదార్చ సాగాడు. ఇంతలో రఘు చూపు వేరే గదిలో నిల్చుని తననే తీక్షణంగా చూస్తున్న సరిత మీద పడింది. ఆమెను చూడగానే రఘు షాక్ అవుతూ మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. సరిత రెప్ప కూడా కొట్టకుండా తననే చూస్తోంది. ఏడ్చి ఏడ్చి సరిత ముఖం అంతా పీక్కుపోయినట్టుగా అయింది. 

ఆ కళ్లలో తన మీద వీసమెత్తు కూడా తరగని ఆరాధనా భావం. తనను గుండెలకు హత్తుకుని ఇన్నేళ్లుగా తన మనసులో పేరుకున్న భారాన్నంతా చెప్పేసుకుని బోరున విలపించాలని.. తనకోసమే దశాబ్దాలుగా ఎదురు చూసీ చూసీ అలసిపోయిన కళ్లలా.‌. ఆమె కళ్లను చదవగలిగే ఏకైక వ్యక్తి రఘు మాత్రమే. సరిత తనకు ఏదో చెప్పాలనుకుంటోందనేది రఘుకు ద్యోతకమైంది. మరదలే కదా అని చనువుగా వెళ్లి మాట్లాడలేడు. వారి మధ్య ఇప్పుడు ఓ పెట్టని కోట లాంటి మౌనం నిలుచుంది. అది ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఇద్దరు. రఘు అటు ఇటు ఎవరైనా చూస్తారని చూపులు మరల్చుతూ సరితను మార్చి మార్చి చూస్తున్నాడు. కానీ సరిత మాత్రం అలాగే ఉంది. తనిప్పుడు పెళ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రి. పదేళ్లు గడిచిపోయింది సరితను తన మనసులోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు గానీ, తియ్యలేక విఫలం అవుతున్నాడు. తన మనో ఫలకం మీద పచ్చబొట్టులా ముద్రించుకుపోయింది సరిత పేరు, రూపం. ఇంతలో బాపూ అని తన కూతురు చేయి పట్టుకుని పిలిచింది. "మమ్మీ రమ్మంటున్నది బాపూ. పా పోదాం" అంది. "ఆఆ.. పోదాం బేటా" అంటున్న అతని కళ్లు సరిత వైపే లాగుతున్నాయి. అప్రయత్నంగానే కళ్లు వాటికవే సరిత మీద కేంద్రీకృతం అయ్యాయి. సరిత ముఖంలో రంగులు మారుతున్నాయి. దుఖ్ఖం దేవుతుంటే కరువైన కన్నీళ్లు ఆమెకు అరువు వచ్చాయి. టపటపా కన్నీళ్లు రాల్చుతూ తన ఊబకాయం వైపు చూసుకుంటూ, తనని తానే అసహ్యించుకుంటూ ముఖం తిప్పుకుని లోపలి గదిలోకి విసురుగా వెళ్లిపోయింది. ఆ చర్యకు రఘు మనసు చివుక్కుమంది. లాగిపెట్టి చెంప ఛెళ్లుమనింపించారెవరో అన్నట్టైంది.

తన జీవితం ఏంటి? శాసించడానికి నువ్వెవరు? తన జీవితం గురించి ఆలోచించే నాన్న వెళ్లిపోయాడు.. రేపటినుంచి తానేంటి? అమ్మ కూడా ఏదో ఒకరోజు పోవాల్సిందే.. అందరి పెళ్లిళ్లు అయిపోయి పిల్లలున్నారు. తన బతుకింక వారి పంచ మీద బల్లేనా??? అన్న ప్రశ్నలు సరిత గొంతులోంచి విన్నట్టుగానే ఉంది రఘుకు. కాళ్లకింద నేల కంపించినట్టు అయింది. ఇంతలో "బాపూ బాపూ" అంటూ చేయి ఊపుతున్న కూతురి వైపు చూశాడు. అంతే తన భావం మారిపోయింది. కూతురి వైపు ప్రేమగా చూస్తూ "పా బేటా" అని నడుస్తున్నాడు. సురేష్, మధులకు, చిన్న మామకు వెళ్తున్నానని చెప్పి భారంగా కదిలాడు రఘు.. బాధ్యతల గుండెను ప్రేమ తొలుస్తుండగా. ఉమ్నీ వచ్చేలోపు రఘు ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. కూతురి చేయిని గట్టిగా పట్టుకుని మరో చేత్తో వేళ్ల మీద తనలోతాను ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. కూతురు కూడా తన చేయిని గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తోంది. అయినా మనసు పందిరి గుంజరు పుచ్చు పురుగు తొలిచినట్టు తొలుస్తోంది. ఉమ్నీలో కూర్చోబోతూ ఆగిపోయాడు. ఏదో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు స్వరం పెంచుతూ "రామ్ నువ్వు దిగు ఓసారి" అన్నాడు స్థిరంగా. అందరూ షాక్ అయ్యారు. మంజులను చూస్తూ "మంజుల మీరు బైలెల్లుర్రి. నేను తమ్ముడు పెయింట్ డబ్బాలకు ఆర్డర్ ఇచ్చి వస్తం. వారం తర్వాత మనూర్ల ఎంపీటీసీ ఇంటికి పెయింట్ చేశేది గుత్తకు పట్టుకున్నం గదా.. ఆ కలర్లు ఉన్నాయో లేదో అరుసుకొని వస్తం సరేనా. మల్ల ఈ ఎల్లరెడ్డిల గూడ ఓ ఆర్డర్ వచ్చింది. అది గూడ ఫైనల్ జేసుకుని బయానా తీసుకొని వస్తం" అంటున్న రఘు గొంతులో గాబరాను మంజుల కనిపెట్టింది. తన మూడ్ బాధలో ఉండటంతో మరేం మాట్లాడకుండా సరేనని తలూపింది. 

ఉమ్నీ కదిలింది. పిల్లలకు బై చెప్పారు ఇద్దరూ. రామ్‌కు రఘు ప్రవర్తనలో మార్పును చూసి ఏదో అనుమానంగా ఉంది. "ఏందన్నా.. గిప్పుడు మనకు ఆర్డర్లు ఉన్నయని వదినకు అవద్దం ఎందుకు చెప్పినవు?" భృకుటి ముడివేస్తూ అన్నాడు రామ్. "అంత ఖుల్లంఖుల్ల చెప్తగనీ పా గా గోపాలస్వామి గుడి తంతెల కాడ కూసుండి మాట్లాడుదాం" అంటూ తమ్ముడి చేయి పట్టుకుని గుడి వైపు కదిలాడు రామ్. మామ ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే రఘులోకి పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. రావి చెట్టు గాలి రివ్వున వీస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. రామ్‌కు ఏం అర్థం కావడం లేదు. రఘు కూడా ఎలా చెప్పాలా అని కాసేపు తటపటాయించాడు. కాసేపు మౌనం. తర్వాత రఘు తననితాను సిద్ధం చేసుకుని పూడుకుపోతున్న గొంతును సవరించుకుంటూ "నేను సరితను రెండో పెండ్లి చేసుకుందాం అనుకుంటున్న తమ్మీ " అన్నాడు మరో మాటకు ఆస్కారం లేకుండా. ఒక్కసారిగా ఆ మాట వినగానే రామ్ షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బివసాగాడు. "అన్న నిజమా నువ్వు చెప్పేది?" అన్నాడు. "అవున్రా.. మనకు తండ్రి లేని లోటును మరిపిచ్చిన మామకు ఎంతో కొంత చెయ్యల్నని ఈ నిర్ణయం తీసుకున్న" అంటున్న రఘు భుజాలు తడుతూ "శభాష్ అన్నా.. లేటుగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నవు. నువ్వీ పని చేస్తే అమ్మ, మామల ఆత్మలు మస్తు ఖుష్ అయితయి" అనునయంగా అన్నాడు రామ్. "చిన్నప్పటినుంచి సరితకు, నాకు పెండ్లి జేస్తమని అమ్మ, మామ మాట ఇచ్చిపుచ్చుకున్నరు. కానీ ఆ మాట మీద నిలవడలేకపోయిర్రు. ఊర్ల పెద్దల నసలైన ఆ ఇల్లును పోనియ్యద్దని అమ్మ జిద్దు వట్టింది. అప్పుడు మామ పెద్దబిడ్డె లగ్గాన్కి పైసల్లేక ఇల్లు అమ్మల్శిన పరిస్థితి. ఇల్లు అమ్మద్దని అమ్మ అమ్ముతనని మామ మాట మాట పెంచుకున్నరు. నువ్వు ఒకింటికి పోయిందానివి ముండమోశి అచ్చి అన్ల మాలాస్క దినాలె ఉన్నవు. నువ్వు ఎల్లు ఇగ ఆ ఇంట్లకెల్లి అని మనలను బయటకు పంపి మామ ఇల్లు అమ్ముకునే. బయిటోనికి ఎందుకు మనమే కొంటమని మామకు జెప్పినా ఇనక ఇల్లు అమ్ముకునే. అప్పుడు మనం వేరే ఇల్లు కట్టుకుంటిమి. అగో గా ఇల్లు ఆళ్లిద్దరు అన్నాచెల్లెళ్ల నడుమ ఆరని చిచ్చు వెట్టె" గతాన్ని చెబుతున్న రఘు ముఖంలోకి చూస్తూ అవునన్నట్టు తలూపుతున్నాడు రామ్. 

ఈసారి రామ్ అందుకుంటూ.. "ఇల్లు పొడగొట్టిండని అమ్మ మంకుపట్టు వట్టె. నాలుగేండ్లు వాళ్లకు మనకు మాటల్లేవు. నీకు, సరితకు లగ్గం అనే మాటను గూడ తీశి గట్టు మీద పెట్టేశిండ్రు. తప్పు అయింది నన్ను మన్నించి నా బిడ్డెను నీ కొడుకుకు చేస్కో అని మామ ఎంత బతిలిమిలాడినా అమ్మ మచ్చంవోయిన ఇనకపాయె. జిద్దుతోని చిన్న మామ బిడ్డె మంజులను నీకు చేస్కచ్చింది. పాపం సరిత అందరి నడుమల బలిపశువు అయింది" విచారిస్తూ అన్నాడు రామ్. "అవున్రా చిన్నప్పటి సంది ఆడుకునే జాగల, పెద్దగైనంక ఏ ఫంక్షన్ల కలిసినా మేమిద్దరం ఆలుమగలమే అనుకున్నం. ఒకరి మనసుల ఒకోళ్లను దేవుండ్ల లెక్క పూజించుకున్నం. కనీ అమ్మ మాటను జవదాటుడు ఇష్టంలేక మనసు సంపుకొని మంజుల మెడల పుస్తెలతాడు కట్టిన. పిల్లలు పుట్టి వాళ్లల్ల పడి సరితను యాదిమరుస్తున్న. కనీ సరిత ఇంకా నన్ను తన మనసులకెల్లి తీశెయ్యలేదుర. మామ గూడ పంతానికి పోయి బయిటి సంబంధాలు సూశిండు గనీ పిల్ల దొడ్డుగ ఉందని ఎవరు మెచ్చకపాయె. వచ్చినోళ్లంత గదే పేరు పెట్టిర్రు. రోజులు గడిచిన కొద్ది పిల్ల ముదిరిందని ముక్కు ఇరిశిర్రు. ఇప్పుడు నేనే ముప్ఫై ఐదేండ్లకు అచ్చిన. సరిత నాకన్న యాడాదే శిన్నది. మీదికెల్లి ఈ వయసుల రెండో పెండ్లి సంబంధాలు వస్తుంటే మామ మెచ్చకపోయె. నా బిడ్డెను ముసలోల్లకు ఎందుకిస్త అనుకున్నడు. ఇట్ల ఈల్లకు నచ్చుతే వాళ్లకు నచ్చకపోవుడు వాళ్లకు నచ్చితే వీళ్లకు నచ్చకపోవుడుతోని పదిహేనేండ్లు ఇట్ల ఎల్లిపోయినయి" దీర్ఘశ్వాస వదులుతూ అన్నాడు రఘు.

"మ్యారేజ్ బ్యూరోలల్ల గూడ పెట్టిర్రు గదా?" సంశయించాడు రామ్. "అక్కడ గూడ పిల్ల తొంబై ఐదు కిలోల బరువుందని, ఎనిమిదో తరగతే సదివిందని చాలా సంబంధాలు రిజెక్ట్ అయినయి. ఎందుకో సరితకు సదువు అబ్బకపాయె. పాపం సరిత బరువు తగ్గనీకి ఒక్కపూటనే అన్నం తిని కడుపు సంపుకున్నది. పొద్దుగాల్ల ఇన్ని ఓట్స్, మధ్యాహ్నం అన్నం, రాత్రి జొన్న రొట్టెలు తిన్నా మోటుతనం పోకపాయె. మన కాన్‌దాన్ల ఎవరికి అట్ల అంబటి పెయి లేకపాయె. మామ సరిత గురించే బగ్గ పికర్ జేశిండు. తనకన్న చిన్నోళ్లయి అందరి పెండ్లీలు అయి పిల్లలు పుట్టి పెద్దగ గూడ కావట్టె. పాపం ఆడివిల్ల తన నెత్తి మీద అక్షింతలు పడ్తలేవని ఎంత రంది వెట్టకుందో. ఇంట్లకెల్లి కాలు బయటవెట్టదాయె. ఇంకా ఈ పిల్లకు పెండ్లి అయితలేదని, పెండ్లి అయ్యే యోగం లేనట్టుందని లోకం సూటిపోటి మాటలతోని పొడుస్తరని ఇంట్ల కాలు బయటవెడ్తలేదు" రఘు గొంతులో జీర. "అవును అన్న. ఆడివిల్లలు బయటకు చెప్పుకోక లోపటలోపట నవుస్తరు. కొనజాలకు సరిత నీకే రాశిపెట్టినట్టుంది" అంటున్న తమ్ముడి ముఖంలోకి చూస్తున్న రఘు ముఖం చిన్నగా విచ్చుకుంది. జీవితంలో ఏదో సాధిస్తున్నాననే భావం ప్రస్ఫుటమౌతుంది. 

"నాకెందుకో ఇయ్యాల్ల మామ మొకం లాస్టుసారి జూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిచ్చిందిర. మనకు ఎంతో జేశిన మామ రుణం తీర్చుకోవాలని మన్ను వోసుకుంట నిర్ణయించుకున్న. అప్పుడేదో మాట పట్టింపులకు పోయిర్రు గనీ అమ్మ ఎన్కశీరి మా విషయంల తప్పు జేస్తినని మస్తు కుదెవడ్డది. కనీ, అప్పటికే నా లగ్గం అయిపాయె. తప్పు దిద్దుకునే ఛాన్స్ లేదని అమ్మ బాధవడె. ఇయ్యాల్ల కోపాలు రేపు ఉండయి. కోపంల ఏ నిర్ణయం తీసుకోవద్దని గిందుకే అంటరుగావచ్చు. మామ గూడ నన్ను అల్లునిగ పొందకపోతినని శాన బాధవడ్డడు. కనీ ఏం జేస్తం అంత మన కర్మ అంతే" ముభావంగా అన్నాడు. "పెద్దలు జేశిన తప్పును పిల్లలమైన మనం దిద్దుబాటు జెయ్యలంటవ్?" రామ్ ప్రశ్నకు అవునన్నట్టు తలూపాడు రఘు. "తప్పు అనద్దురా.. అది మన పెద్దమనుషుల పొరపాటు అంతే. దాన్ని మనం దిద్దాలంతే" అంటున్న రఘును ఓ మహానుభావుడిని చూస్తున్నట్టు చూస్తున్నాడు రామ్. ఇంతలో ఓ అనుమానం కలిగింది. "అన్నా అంత మంచిగానే ఉంది గానీ.. సరిత మనసుల ఏముందో తెల్సుకోకుంట మనకు మనం ఇట్ల ఏకపక్ష నిర్ణయం తీసుకునుడు కరెక్ట్ కాదేమో. ఇన్నేండ్లు గడిశిపోయినయి గావట్టి తనకు నిన్ను రెండో పెండ్లి చేసుకునుడు ఇష్టమో లేదో తెల్సుకోవాలి. మల్ల ఏ ఆడది గూడ తనకు కాబోయే మొగుడు సెకెండ్ హ్యాండ్ ఉండాల్నని కోరుకోదు" అన్నాడు రామ్. "అవును అది కరెక్టే. కనీ సరిత మనసుల నేను ఇంకా ఉన్నరా. తన కండ్ల నిండ నేనే ఉన్నరా" గుండెల్లో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ అన్నాడు రఘు. రామ్ మళ్లీ అందుకుంటూ "అన్నా నాకు ఇంకో అనుమానం ఎందంటే.. ఈ పెండ్లికి సరిత ఒప్పుకునుడు ఒకెత్తు అయితే వదిన ఒప్పుకునుడు మరొక ఎత్తు. తన భర్తను ఇతర స్త్రీతో పంచుకోవుడు ఏ భార్యా ఒప్పుకోదు. భర్త చేశే పనిల న్యాయం ఉన్నా ఒప్పుకోదు. అండ్ ఇంకో ప్రాక్టికల్ సమస్య ఏందంటే రెండో పెండ్లి చేసుకున్నంత ఈజీ గాదు రెండు ఫ్యామిలీలను లీడ్ జేసుడు. పిల్లలు, ఖర్చులతోని అదనపు భారం పెరుగుతది. మనం మిడిల్ క్లాసోళ్లం. మల్ల ఇల్లు అన్నజాగల చిన్న చిన్న గడ్‌బడ్‌లు జరుగుతుంటయి. అవి పెద్దగ గూడ కావచ్చు. పైగా ఒక భార్య ఉండంగ ఇంకో పెండ్లి జేసుకునుడు చట్టం దృష్టిల తప్పు అయితది. ఇవన్నీ నేను ముందుగాల్లనే ఎందుకు చెప్తున్ననంటే కీడెంచి మేలెంచాలని మన పెద్దమనుషుల ఊకెనే అనలేదు గదా. మీదికెల్లి ఈ లోకం గూడ శితాం పేర్లు పెడ్తది. అంకుల్ వయసుల రెండో పెండ్లి చేసుకున్నడేంది అని ఎక్కిరిస్తరు. నువ్వెందుకు రెండో పెండ్లి చేసుకుంటున్నవో ఈ లోకానికి తెల్వది గదా. ఇంకో సమస్య ఏందంటే సరితోళ్ల అన్నదమ్ములు, మన పెద్దత్తమ్మ ఇట్ల అందరు ఒప్పుకోవాలె. ఎంత సుట్టీర్కం అయినా ఒప్పుకుంటరని నాకు నమ్మకం లేదన్న" కుండబద్దలు కొట్టినట్టుగా అన్నాడు రామ్. తమ్ముడి మాటలు విని ఆలోచనలో పడ్డాడు రఘు. గందరగోళంగా మారింది అతని మస్తిష్కం. 

మళ్లీ మౌనం ఆవహించింది వారి మధ్య. గాలి తెరలుతెరలుగా వీస్తోంది. వారి మనసుల్లో అంతులేని ప్రశ్నలు. కాసేపటి తర్వాత రఘు మాట్లాడుతూ "నువ్వు అన్నయన్ని సైమాటలే. కనీ ఇప్పుడు మనముంగట ఉన్నది ఒకటే తొవ్వ. వేరే సంబంధాలను మనం లెంకి తెచ్చినా వాళ్లు మస్తు ఈర్నాలు తీస్తరు. ఇప్పటికే ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టి సరిత మనసును పొడిశిర్రు. ఆడజన్మల ఇన్ని లోపాలా అని అనుకునేటంత దిగజారింది మన పురుష సమాజం. ఏజుబారు అయిందని ఎవరు చేసుకోరు గూడ. ఇయ్యల్ల రేపు ల్యాత పిల్లలు కావాలంటున్నరు. వాన్ది కర్రె బుడుసు మొకం అయినా అప్సరస కావాలనుకుంటడు. సరిత ఆ స్టేజ్ దాటిపోయింది. గందుకే ఏదేమైనా అందర్ని ఒప్పిచ్చి సరితను నాదాన్ని చేసుకుంటనని నాకు కాన్ఫిడెన్స్‌గ ఉందిరా. నాపేరు మీదనే ఉండిపోయింది గావట్టి ఆల్శమైనా సరే నాదాన్ని చేసుకుంట. నా ప్రేమను పొందుత. మా ఇద్దర్కి అయితేనే జోడి కుదురుతది. ముసలోనికి ఇచ్చిర్రు అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఇద్దర్కి యాడాది వయసే ఓర్పాటాయె" అంటూ అప్పటికప్పుడు ఏదో తోచినవాడిలా టక్కున తన ఫోన్ తీసి పిన్ని నంబర్‌కు ఫోన్ చేశాడు రఘు. "గోపాలస్వామి గుడి దెగ్గర్కి ఒక్కదానివే రా పిన్ని ఎవరికి చెప్పకుంట" అని చెప్పి కట్ చేశాడు. అన్నట్టుగానే పిన్ని సరోజ అరగంట వ్యవధిలోనే వచ్చింది. మెట్లు ఎక్కడం వల్ల దమ్ము ఎగబీలుస్తోంది సరోజ. వరుసకు పిన్నే అయినా సరోజ రఘు కన్నా ఓ పదేళ్లు పెద్దది. కిషన్, పండరి, రఘు వాళ్లమ్మ లలిత తర్వాత చివరగా పుట్టిందామె. రఘు సరోజకి పదేళ్ల వయసు తేడా ఉంటుంది. రఘు పక్కన సరోజను చూస్తే ఎవరైనా అక్క అనుకుంటారు గానీ పిన్ని అనుకోరు. ఇద్దరు అన్నదమ్ములను చూసి ఆమె షాక్ అయింది. "ఏమైందిరా పోరగాండ్లు మీరు గోపాల్ పేట్ పోయిర్రేమో అనుకున్న. సరే గానీ, ముచ్చటేందో చెప్పు. నువ్వు అట్టిగనే నన్ను పిల్వవని తెలుసులే" అంది సరోజ. రఘు ఇందాక రామ్ ముందు చెప్పిందంతా పిన్నికి వివరించి చెప్పేశాడు. అంతా విన్నాక పిన్ని ముఖంలో ఆనందం. "అరే మాకన్న చిన్నోనివి ఎంత సక్కగ ఆలోచించినవుర. పాపం సరిత లగ్గం ఇగ ఈ జన్మకు కాదనుకున్నం గనీ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నవుర బేటా. పెద్దన్న సచ్చిపాయె.. రేపటి దినం వదిన గూడ వోయేదె. ఒకోల్ల ఎన్క ఒకోళ్లం అందరం పోయెటోళ్లమే. ఇంట్ల పెద్దమనుషులు పోయినంక ఆ పోరి బతుకు అర్వంద్రం అయితదని పెద్దన్న మస్తు పికర్ జేశిండు. సరిత పికరే అన్నకు మాలాసుండె. రేపటికి లగ్గాలు జేస్కున్న అన్నలు చెల్లె అని మంచిగ జూస్తుండచ్చు గనీ.." అంటూ ముఖానికి కొంగు అడ్డం పెట్టుకుని వెక్కసాగింది సరోజ. రఘు, రామ్ ఆమెను ఓదార్చసాగారు.

"ఏ ఆడివిల్ల బతుకైనా చేసుకున్న మొగోనితోనే శింగారం ఉంటది. ఇంటిమీద బెలుగు లెక్కట ఉంటే ఎప్పుడో ఒగనాటిక వదిన ఒగ మాట అంటది. అగో మీ అమ్మను అనలేదా అన్న. ఇంట్ల కెల్లి ఎల్లుమనలే. అక్క గా ఒక్క మాటకాడనే మనసు ఇరగొట్టుకొని సరితను కోడలిగ చేసుకోకపాయె. మొగోని బతుకైనా పెండ్లాం ఉంటేనే మంచిగుంటది. తనకొక మొగోడు, పిల్లలు, ఇల్లు ఉండాలని ఏ ఆడదైన కోరుకుంటది. కనీ బేటా నువ్వు మంచిగ ఆలోశించినవురా. నేను ముంగట నడిశి అందర్ని ఒప్పిచ్చి మీ లగ్గం జేస్త. మంజులను, మా వదినెను అందర్ని ఒప్పిస్త సరేనా" ధీమాగా చెప్పింది సరోజ. ఆమె ఇచ్చిన భరోసాతో వాళ్ల మనసులో ఉన్న గందరగోళం అంతా ఎగిరిపోయింది. మనసులు నిర్మలంగా మారాయి. 

* * * 

కిషన్ పెద్ద కర్మ రోజున చుట్టాలు బంధువులు అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయాక సరోజ ఈ విషయాన్ని ఇంటి సభ్యుల ముందు ప్రస్తావించింది. తొలుత సురేష్, మధులు తిరస్కరించారు. సరోజ వారికి అర్థం అయ్యే రీతిలో సముదాయించగా ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇక తానే మధ్యవర్తిత్వం తీసుకుని గోపాల్ పేట్ వచ్చి మంజుల ముందు కూడా చెప్పింది. ఆ మాట విని మంజుల కుప్పకూలిపోయింది. ఇక అప్పటినుంచి తను ఎలాంటి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉండసాగింది. నిర్ణయం తీసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలనుకుంది సరోజ. మంజుల పిల్లలతోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఇక రఘునైతే కొన్ని రోజులు శతృవు కన్నా హీనంగా చూసింది. పిల్లలను తీసుకుని విడిగా నిద్రపోతోంది. తోడికోడలితోనూ ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏం మాట్లాడటంలేదు. ఇంట్లో వసపిట్టలా ఉండే మంజుల తీరు నచ్చక రఘు మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ, దగ్గరికెళ్లినప్పుడల్లా గిన్నెలు కింద పారేస్తూ తనతో మాట్లాడొద్దని నిరసన తెలుపుతోంది. దీంతో రఘు ఆమెను మాట్లాడించి ఎందుకు ఇబ్బంది పెట్టాలని మిన్నకుండిపోయాడు. రాత్రుళ్లు నిద్రపట్టక అదే విషయమై మంజుల దీర్ఘంగా ఆలోచించడం రఘు దృష్టిని దాటిపోలేదు. రఘుకు, సరితకు పెళ్లి చేస్తారని తను చిన్నప్పటినుంచి విన్నది. తానే వారి మధ్యలోకి వచ్చానని చాలాసార్లు అనుకుంది. కానీ ఇప్పుడు జీవితాలు మారిపోయాయి. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతోంది తను. మరోవైపు ఇప్పుడీ విషయంలో మంజుల ఒప్పుకోకపోతే ఏం చేయలేమని రఘు అవే ఆలోచనలతో తన పని చూసుకుంటున్నాడు. అలా మూణ్ణెల్ల కాలం గడిచిపోయింది. 

* * *

ఆ రోజు రఘు సరితకు ఫోన్ చేశాడు. సరిత ఫోన్ ఎత్తి "హలో బావా" అంది. ఓ గదిలో గడియ పెట్టుకుని చిన్నగా మాట్లాడుతోంది సరిత. తన పెళ్లి అయ్యాక సరితతో మాటలు లేవు రఘుకు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు దూరం నుంచే చిన్నగా పలకరించడం అంతే. ఇన్నేళ్లకు రెండో పెళ్లి ప్రస్తావనతో మాట్లాడుతుంటే రఘులో ఏదో అలజడి రేగుతోంది. "ఎలా ఉన్నావ్" అన్నాడు. ఆ ప్రశ్నకు సరిత నుంచి సమాధానం లేదు. కాసేపు మౌనం. "నాకు అనిపిచ్చింది నిర్ణయించుకుని ఇతరుల మీద రుద్దుడు కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇది జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి. నీకు ఇష్టమైతేనే మన పెండ్లి. మల్ల ఇక్కడ గూడ మీ చెల్లె మంజుల ఒప్పుకోవుడు గూడా ఇంపార్టెంట్" నిదానంగా అన్నాడు రఘు. "నాకు నువ్వంటే మాటలల్ల చెప్పలేనంత ప్రేమ బావా. మన పెద్దోళ్లు మనిద్దరికి పేరు పెట్టినప్పటి సందే నువ్వూ నేను మొగుడు పెండ్లామే అనుకున్న. కనీ విధి ఎంత పని జేశింది సూడు. నువ్వు మంచిగ మంజులను మనువాడినవు, పిల్లలను కన్నవు, నన్ను మరిచిపోయినవు. కనీ నా కర్మనో ఏందోగనీ.. నాకు ఒక్క సంబంధం కాయంగాకపాయె. నాగ్గూడ లగ్గమై మొగోడు, పిల్లలు ఉండుంటే నేను గూడ నిన్ను మర్శిపోద్దునేమో. కనీ ఎక్కడా.. దినాం నిన్ను యాజ్జేస్కుంట కుమిలిపోతున్న. నేనిట్ల ఎందుకు దొడ్డుగైన్నో తెల్వది. నా మోటుతనం సూశి ఎవరు మెచ్చకపాయె. థూ ఏం బతుకని సచ్చిపోదామని గూడ అనుకున్న గనీ ధైర్నం సాలలేదు బావా. నాకంటే చిన్నోళ్లయి పెండ్లీలై పిల్లలు, సంసారం అని ముద్దుగ ఉంటున్నరు. నా తలరాతనే ఆ భగవంతుడు ఎందుకిట్ల రాశిండో అర్థంకాదు" అంటున్న సరిత కళ్లు ఏరుధారలయ్యయి.

రఘు కళ్లు కూడా చెమర్చాయి. తనను ఎలా ఓదార్చాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. "నన్ను క్షమించు సరితా.. ఆనాడు నేను మా అమ్మకు ఎదురు మాట్లాడి నిన్నే పెండ్లి జేసుకుంటనని గట్టిగ మాట్లాడేదుండె. కనీ అమ్మను నొప్పియ్యద్దని నిన్ను జీవితకాలం నొప్పిచ్చిన సరితా. నన్ను క్షమించు. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుకుందాం అనుకుంటున్న" బావురుమన్నాడు రఘు. "ఊకో బావా ఏడ్వకు. నువ్వు తప్పు దిద్దుకుంటనని అంటున్నవు గనీ.. మంజులకు నేను అన్యాయం జేశినట్టు అయితది. అది నా కాక బిడ్డె. నా సొంతశెల్లె కన్నా ఎక్కువ. వద్దు బావా నాకోసం పెండ్లాం పిల్లలకు అన్యాయం చెయ్యద్దు. నేను సరోజ అత్త ముంగట ఇదే మాట చెప్పిన" అంది. ఇంతలో బయటి నుంచి "సరితా" అమ్మ పిలిచింది. "ఆ వస్తున్నా అమ్మా.. బావా ఫోన్ పెట్టేస్తున్న. తర్వాత మాట్లాడుత" అంటూ ఫోన్ కట్ చేసింది సరిత. రఘు తల దించుకుని కుమిలిపోతున్నాడు. మనసు కకావికలం అవుతోంది. అటు మంజుల, ఇటు సరితలు నిత్యం మనసులో మౌనయుద్ధం చేసుకుంటున్నారు. 

* * *

రెండో పెళ్లి కాబట్టి ఆడంబరాలకు పోకుండా అతికొద్ది మంది సమక్షంలో రామాలయంలో పెళ్లి జరుగుతోంది. పంతులు మంత్రోచ్ఛారణ చేస్తుంటే సరిత మనసులో తెలియని ఆనందం వెల్లి విరుస్తోంది. సరిత పక్కనే మంజుల ఉండి అన్నీ ఏర్పాట్లు చూసుకుంటోంది. రఘు మార్చి మార్చి సరితను, మంజులను చూస్తున్నాడు. మంజుల ఈ జన్మకు ఒప్పుకోదు అనుకున్నాడు గానీ, ఒప్పుకుంది. మనసులో మంజులకు ఎన్నో థాంక్స్‌లు చెప్పుకుంటున్నాడు. అటు నుంచి చూస్తే సరితకు మంజుల చెల్లెలు అవుతుంది. ఇప్పుడు కొత్త వరసలో సవతి (అక్క) అవుతోంది. అందుకే పెళ్లి బాధ్యత అంతా తానే తీసుకుంది. రఘు మెడలో మూడు ముళ్లు వేస్తుంటే సరిత ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి‌. ఆ తాళిబొట్టును చేత్తో తాకుతూ ఆనందభాష్పాలు కారుస్తోంది. అరుంధతి నక్షత్రం చూడటానికి దంపతులిద్దరూ తల పైకెత్తారు. ఆకాశం నుంచి అన్నాచెల్లెలు (కిషన్, లలిత) ఆనందంతో శతమానంభవతి అని దీవిస్తున్నట్టు ఇద్దరికీ కనిపిస్తున్నారు. "మా అన్నాచెల్లెళ్ల పంతానికి మీరు మంచి ముగింపు ఇచ్చిరు" అంటున్నట్టుగా వినిపిస్తోంది వారికి.

 

----------+++++++++/////

 

 

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు