పగిలిన నా రవిక అద్దం చెప్పింది..
ధ్వంసం అయిన నా చరిత్రను..
ఏడు తీర్లా దారంతో ఎదపై పోదిమినా
రవిక(కాళ్ళీ) యదకు దూరమైంది..
తెల్లని గాజుల(బలీయ)కు కట్టిన నల్లని దారం
నరుడి దృష్టిని దూరం చేస్తాయనుకున్నా..
కానీ, తెల్ల గాజులే నా నుండి దూరం అయినాయి..
చెవులను తాకే కెంపైనా ఊసులు చెప్పే టోప్లీ
శృతి చేయని వీణలా మూగబోయింది..
మోముకి దిష్ఠి చుక్కలా.. ముక్కపై పోదిమిన అర్థ చంద్రాకారం మాయమై అమావాస్య చీకట్లను మిగిల్చాయి..
మెడను అలుముకున్న నక్షత్రహారాలను
వేటాగాడొకడు అపహరించి
నన్ను అమ్ముకునే వస్తువును చేశాడు..
అయినా....
నేను వస్తువును కాదు కాదా!
వనంలో ఒంటరిగా నాట్యమాడే
మయూరం నా తోబుట్టువే!
అలా ఉన్నాననేగా వేటగాడు
నా రూపాన్ని దోచుకేళ్ళీంది
దోచుకెళ్ళని.... ఈసృష్టిలో తరగనంత సౌందర్యం
జీవనాడుల్లో పదిలంగా దాచుకున్నాను..
రేపటి కోసం వసంత కోకిల గానమై వస్తాను!
వాకిట్లో సింగిడి పూల మొగ్గనై పలకరిస్తాను!!