మనసు కసుగాయాల
ఊసులు ఇంకెలా ఉంటాయి
మంకెన పూవులా కాక!
ఉనికి పోరాటంలో
ఎరుపెక్కిన మనసుతో
బాధ్యతల బంధీగా
కలల రెక్కలను జీవిత చెరసాల
ఊచలకు కట్టుకొని...
కరిగే క్షణక్షణమూ
నీవేంటని ప్రశ్నిస్తూనే ఉంటుంది
ఏమి చెప్పను....
నాకంటూ నేనుగా
ఏమీ మిగలని అస్థిత్వపు
పూదోటననా
ఒక గ్రీష్మం ఒక శిశరం
ఒక మానని గాయం
అప్పుడపుడూ కురిసే చల్లని వాన కాలం
మారే మనసుల మధ్య తారాడే
అలుపెరుగని రుతురాగం
అలజడి అలల ఆశల మధ్య ఊగిసలాడే
మనసు యుద్ధ గీతం...
రేపటికీ నేటికీ మధ్య మునిమాపు వేళ
నిశ్శబ్దంగా నిష్క్రమించే సూరీడి రెక్కల కెరటం
ఉషస్సులో కన్నీటి చుక్కలా
చెక్కిలిపై వాలుతుందిలే
గెలవాలని తపిస్తూ చీకటి రహదారిలో
నాతో కలిసి నడిచే
గుండె భావోద్వేగాల గుర్తుల నేస్తం....
ఆశకు శ్వాసకూ నడుమ
వేలాడే కలల లాంతరు దీపం
వేకువకూ సాయంసంధ్యలకూ
నడుమ గమ్యం వైపు ఒకసారైనా కదలాలని
నలిగి ఓడే కాంక్షల హృదయం