మన సరాగాల సయ్యాటను వీక్షించుటకై
నిలువెల్లా కనులతో దోబూచులాడుతోంది రేయి
ఆ సరాగాల మధురిమల జ్ఞాపకాలను
నెమరువేసుకుని పులకించి పోవాలని ఉవ్విళ్లూరుతోంది పగలు.
నీ స్పర్శ కోసం తహతహలాడే
ఈ తనువి తపన ఈ రేయి భరిస్తుందా!
నీ నిర్లక్ష్య వైఖరి ఆనవాళ్ల వేదనని
ఈ పగలు పలకరిస్తుందా!
నా కంటి చెలమ చెక్కిల్లను దాటి నా యదలను తడుపుతూ ఉంటే, తన ఒడిలోకి తీసుకున్న
ఈ రేయి సాక్ష్యం గా నిలిచింది.
నా నిశ్శబ్ద మౌనం నీ నిరాదరణకు ఆనవాళ్ళు
ఈ పడతి పరిమళాల కోరికల సెగలు
నీ నిద్రకు భంగం కలిగించ లేదా!
సిగ్గుతో నీ ఎదుట కూడా పైట జార్చని
ఈ కోమలి కోరిక నీకు కానరాలేదా!
గొంతులోకి ఇంకిపోయిన కన్నీటి చారికలు సముద్రపు నీరే చాలవు అంటున్నాయి
మూడుముళ్ల బంధంతో, పెళ్ళినాటి ప్రమాణాలతో ఇదే! "నా" జీవితం అనుకున్న నాకు
"ఇదేనా?" జీవితం అన్న ప్రశ్న మిగిలిపోయింది.