ఈ ప్రపంచమంతా
మన అస్తిత్వానికి ఆనవాళ్లే
అయినా
అడుగడుగునా
ఎదురయ్యేవి సవాళ్లే
అందరూ అయినవాళ్లే
అయినా
మన అడుగెప్పుడూ
వెనకే ఉండాలని
శాసించేవాళ్లే
సమస్యోదయాన నిలచి
ఓటముల కంటకాలు విరిచి
స్వాభిమాన కందకాలు తొలిచి
స్వయంకృషీ సౌధాలు గెలిచిన
కళాయి లేని అద్దాలం కాకూడదు మనం
అందం ,ఆనందాలకు
అచ్చమైన నిర్వచనాలం
నిప్పులాంటి ఆత్మశక్తి
నివురుగప్పబడిన ఆంజనేయులం
ఎవరూ చేయందించకున్నా
ఎదిగే చూపించే తెగువ
మనకు ఊతకర్ర కావాలి
ఎవరో దించాలని చూసే
మన అభిమానం
అందనంత ఎత్తుకెదిగి
అద్వితీయమై వెలుగొందాలి
ఇది మానవారణ్యం!
బలహీనులపై బలవంతుల జులుం!
అవసరమైతే పీపీలకమై
అత్యవసరమైతే
బెబ్బులిగా మారినపుడే
ఇక్కడ మనుగడ సాగించగలం
మెత్తని మనసు ఒరలో
సుతిమెత్తని పంచ బాణాలకు తోడుగా
ఆగ్నేయాస్త్రాలతో
అంధకార బంధురమైన సమాజాన్ని
గెలిచే అసలు కిటుకు నేర్వాలి మనం!!
...............