మా రచయితలు

రచయిత పేరు:    వి.వి.వి.కామేశ్వరి(v³k)

కథలు

సాధికారికత

ఎడతెరిపిలేని వర్షం,ఆగకుండా గంట నుంచీ కురుస్తోంది. వేడివేడిగా వేసిన ఉల్లిపాయ పకొడీ తింటూ,మధ్య మధ్యలో వేడి వేడి టీ గొంతులోకి జారుతుంటే 'ఆహా!ఎంత హాయిగా ఉందో.                     పనిచెయ్యటానికి లక్ష్మి ఈ పూట ఇంకేం వస్తుంది.డుమ్మా కొట్టటం ఖాయం' అని స్వగతంలో అనుకోగానే మెరుపులా మెరిసిన యోచనతో కథకు సబ్జెక్ట్ దొరికిందని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది శ్యామల.

తను రాయబోయే కథకు "సాధికారికత" అనే పేరు అయితే సరిగ్గా సరిపోతుందని అనుకుంది. అనుకోవటమే తడవుగా కథను రాయటం ప్రారంభించింది శ్యామల. 

బాగా తలనొప్పి, ఒళ్ళునొప్పులుతో బాధపడుతూ లేవలేక పడుకునే వున్న శ్యామల బలవంతంగా కళ్ళు విప్పి పక్కనే ఉన్న సెల్ చేతిలోకి తీసుకుంది. 

"అమ్మో! అప్పుడే ఎనిమిదిన్నర అయ్యిందా" మంచం దిగుతూ అనుకుంది. 

హాల్లో న్యూస్ పేపర్ చదువుతున్న భర్త వంక చూస్తూ, "బాగా ఎండెక్కింది అయినా లేపలేదేమిటండీ. అవునూ,లక్ష్మి ఇంకా రాలేదా" అంది బ్రష్ చేసుకోవటానికి పెరట్లోకి వెడుతూ ఆగి. 

"లేదు శ్యామలా, ఫోన్ చేసింది. నీకు చేస్తే నువ్వు ఫోను లిఫ్ట్ చెయ్యలేదట. నాకు చేసింది. నీకు ఒంట్లో బాగుండలేదు పడుకున్నావని చెప్పాను. కాస్త లేటుగా వస్తా అయ్యగారూ అమ్మగారికి చెప్పమన్నది.నువ్వు మొహం కడుక్కురా హార్లిక్స్ కలిపి ఇస్తాను. కాస్త రిలాక్స్ అవుదువుగాని" అన్నాడు కిచెన్ వైపు వెడుతూ రామం. 

 'ప్చ్! నాకు బాగోలేని రోజే తను ఇలా చేస్తుంది. అదేమంటే కారణం రెడీగా ఉంటుంది ' స్వగతంలో అనుకుంటూ పైటకొంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన భార్యకు పాలగ్లాసు అందిస్తూ

" సినిమా పాటల సుప్రసిద్ధ రచయిత భువన చంద్ర గారితో ముఖాముఖి కార్యక్రమం నీ కథల గ్రూపులో జరిగిందని పొద్దుటి నుంచీ తీరిక కుదరలేదనీ రాత్రంతా వింటూ లేటుగా పడుకున్నావుగా. పోనీలే పాపం పడుకోనీ అని లేపలేదు" భార్య పక్కన సోఫాలో కూర్చుంటూ అన్నాడు రామం. 

నిజంగా, అర్థం చేసుకునే మీలాంటి భర్త దొరకటం నా పూర్వ జన్మ సుకృతమండీ" అంది గ్లాసు టీపాయ్ మీద పెట్టి భర్త వంక ప్రేమగా చూస్తూ శ్యామల. 

    "ఎప్పుడు చూసినా కథలు, కవితలు రాసుకుంటూనో ,లేదంటే ఇలాగే ఏదో ఒకటి వింటూనో ప్రతి రోజూ అర్థరాత్రి ఒంటిగంట దాకా మేలుకుంటావు. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవదా చెప్పు. అదేమంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే నాకు ఆలోచనలు వస్తాయి . వెంటనే రాయకపోతే మళ్ళీ ముడిపడదు అంటావు" అన్నాడు పాలు తాగటం పూర్తవటం చూసి లేకపోతే రాణి గారు అలక వహిస్తారని.      

"సందు దొరికింది కదా అని బాగానే యుటిలైజ్ చేసుకుంటున్నారు. అమ్మో! మీరేం తక్కువ వారు కాదు ,సమయం కోసం కాచుక్కూర్చుంటారు " వాదన పెరుగుతుందని స్నానానికి వెడుతున్నానంటూ లేచింది. 

"తమరు మాత్రం తెలివిగా మాట అంటించి ఏమీ ఎరగన్నట్టు వెళ్ళటంలా ఎంతైనా రచయిత్రివిగా ఆమాత్రం తెలివి ఉంటుందిలే" కవ్వింపుగా నవ్వాడు రామం. 

గంజి పెట్టిన కాటన్ తెల్లచీరపై ఆకుపచ్చ రంగు లో రామచిలుకలు అంచు ఉన్న చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతూ కిచెన్లోకి వచ్చిన శ్యామల బియ్యం కడగబోతున్న భర్తను చూసి , గబగబ చేతిలో నుంచి గిన్నెను లాక్కుని "చాలు చాల్లేండీ సంబరం, ఎవరయినా చూస్తే నవ్విపోతారు.అసలే మీకు మొదటి నుంచీ అలవాటు లేదు. 'చావు తరువాత లావు దుఃఖం'అన్నట్లు ఈ వయసులో మీరు చెయ్యి కాల్చుకోవటం నేను  కాలు మీద కాలు వేసుకుని దర్జాగా భర్తతో పనులు చేయించటం అవసరమా, పోనీ నేను పూర్తిగా లేవలేకపోతే తప్పదు మీకు. అయినా గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే బడలిక తీరింది" అని వంట చెయ్యటానికి ఉపక్రమించింది శ్యామల.  

రామం టీవీలో వార్తలు చూస్తూ హాల్లో కూర్చున్నాడు.

ఇంతలో ఎప్పుడు వచ్చిందో "ఇలా ఇవ్వండి అమ్మగారు నేను తరిగిపెడతా"పనిమనిషి లక్ష్మి చేతిలోంచి కూరలు తీసుకుంది తరగటానికి . పేరుకు పనిమనిషే గాని కడిగిన ముత్యంలా శుభ్రంగా ఉంటుంది . స్నానం చేసి చక్కగా రెడీ అయి వస్తుంది. సీజన్ బట్టి మల్లె , కనకాంబరం, కాగడా మల్లె, ఏదో ఒక పూలమాల తురమందే అసలు బయటికి రాదు . ఇంట్లో పిల్లలా కలిసి పోయింది. లేటుగా వచ్చి విసిగిస్తుందనే గానీ వస్తే మాత్రం పనులన్నీ చకచక చిటికెలో సర్ది పెట్టేస్తుంది . ఆలోచనలో వుండగానే దొండకాయలు, ఉల్లి, పచ్చిమిర్చి తరిగి ఇచ్చింది. 

"అమ్మా , మీరు రాసే కవితలు హృదయానికి భలే హత్తుకుంటాయి . కథలు కూడా జీవితంలోకి తొంగి చూసినట్లు చాలా బాగా రాస్తారు.మీకు ఆలోచనలు ఎలా  వస్తాయమ్మా" అంది లక్ష్మి శ్యామల వంక అభిమానంగా చూస్తూ. 

"అవునా, ఏదో నీ అభిమానం అంతే. సరేలే గానీ నీ కథ రాయనా " ఏమంటావు అన్నట్లు చూసింది లక్ష్మి వంక శ్యామల. 

"మా పేదోళ్ళ జీవితాలలో ఏముంటాయమ్మా! కష్టాలూ, కన్నీళ్ళు తప్ప" నిట్టూర్చింది లక్ష్మి. 

"సరేలే,నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాగా. అదే రాస్తాలే"సముదాయింపుగా అంది శ్యామల. 

"అది సరేగానీ, ఆలస్యంగా వచ్చావేమిటి లక్ష్మీ" అడిగింది శ్యామల. 

"మన ఊళ్ళో పాపారావుగారి అమ్మాయి సుధ పెళ్ళి కుదిరింది. పెళ్ళికూతురికి  ప్రభుత్వం తరుఫు నుంచీ ముప్పై అయిదు వేలు ఇస్తారమ్మా . త్వరలో లక్ష చేస్తాము అంటున్నారు. డబ్బులు వస్తాయని పెళ్ళి కానుకకి అప్లై చేశారమ్మా. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుల వివరాలు తీసుకుని మొన్ననే పంపించాను. ఈ రోజు ఉదయం పెళ్ళి జరిగింది. పెళ్ళి ఫొటోలు తీయటానికి వెళ్ళాను. అందుకే ఆలస్యం అయ్యింది. ఒక పెళ్ళికి అయిదు వందలు వస్తాయమ్మా . ఇంకా పాత వాటికి కూడా ఇరవై వేలు దాకా రావాలి.మా ఆయనకు కూడా సరిగా జీతం రావటంలేదు. కరోనా వలన స్కూలు మూసేశారు కదమ్మా.వారానికి ఒకసారి రమ్మంటున్నారు. రెండువేలే ఇస్తున్నారు. ఇల్లు గడవటం కూడా కష్టంగా వుంటోంది. మీరయితే మంచిగా అర్థం చేసుకుంటారు. ఆమధ్య నాకు  పదివేలు బదులిచ్చారు కూడా. అప్పులు ఎలా తీర్చాలోనమ్మా" తన గోడు వెళ్ళబోసుకుంది లక్ష్మి. 

"అవునులే లక్ష్మీ ,ఏది ఏమైనా ఈ 'కళ్యాణమిత్ర' ఉద్యోగం వచ్చాక వెనకా ముందుగా వస్తున్నావనుకుంటే, మాస్కులు కుట్టటం మొదలుపెట్టాక పూర్తిగా ఎగనామం పెడుతున్నావు.చూడబోతే పూర్తిగా మానేసేటట్లు ఉన్నావు"అంది శ్యామల కొంచెం కోపం నటిస్తూ. 

ఏం చెయ్యనమ్మా, ఇక్కడ పని చేసుకుని వెళ్ళాక, ఇంట్లో పని కూడా చేసుకుని రోజుకి వందనుంచీ నూట యాభై దాకా మాస్కులు కుడుతున్నాను. ఒక మాస్కు కుడితే మూడు రూపాయలు చొప్పున రోజుకి కనీసం మూడు వందలు ఇస్తారమ్మా. మీరు కూడా కాస్త నన్ను అర్థం చేసుకోండమ్మా. చెయ్యలేకపోతే మానేస్తాను అంతే గానీ ,మీ ఇల్లు మాత్రం మానను. అంది లక్ష్మి. 

మధ్య నువ్వు కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ కూడా అందుకున్నావుగా. త్వరలో నీకు పరమనెంట్ అవుతుందిలే . మీ కష్టాలు తీరతాయి" అంది శ్యామల. 

"అసలు పని చెయ్యటం మొదలు పెట్టిందే మీ ఇంట్లో కదమ్మా. మా ఆయన ఎవరి ఇంటికి పనికి పంపడు. ఏదో మనింటికి అంటే మాట్లాడడమ్మా అంతే. మీది మంచి మనసు, మీ నోటి చలవన పర్మనెంట్ అయితే అదే పదివేలు అమ్మా" అంది ముక్తాయింపుగా లక్ష్మి. 

"పది ఏసీల కన్నా చల్లనైనది మంచి మనసు" అని భువనచంద్రగారు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.శ్యామలకు లక్ష్మి మాటలు వింటుంటే. 

పని పూర్తవగానే 'వెళ్ళొస్తానమ్మా' అని చెప్పి వెళ్తున్న లక్ష్మి నడకలో ఒక ధీమా తన కాళ్ళమీద తనే నిలబడే మహిళా సాధికారికతకు ప్రత్యక్ష సాక్ష్యంలా.తోటి వారికి తానూ ఆదర్శం అయ్యేలా.....

    

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు