మా రచయితలు

రచయిత పేరు:    మంథని శంకరయ్య

సాహిత్య వ్యాసలు

ఎగిరి పోయిన కొత్త గబ్బిలం

                     ‘‘రాజు మరణించె నొకతార రాలిపోయె

                        కవియు మరణించె నొకతార గగనమేగె’’

            కవి ఎండ్లూరి సుధాకర్‍గారి అకాల మరణం సాహితీ లోకాన్ని విషాదంలో ముంచింది. సాహితీ సాగరంలో శూన్యాన్ని మిగిల్చింది. జి.లక్ష్మి నరసయ్యగారన్నట్లు కవి ఎండ్లూరికి అధిక పాఠకలోకముంది.  వారి బాధాతప్త హృదయాలలో కలిగిన ప్రకంపనలే ఎండ్లూరి అనురాగ మూర్తిత్వానికి నిదర్శనం.  దళితకవిగా, తెలుగుకవిగా,ఎంత చెప్పుకున్నా ఆచార్య దార్ల వెంకటేశ్వర్లుగారు చెప్పినట్లు ఎండ్లూరి సుధాకర్‍ సార్‍ మానవీయ మూర్తిగా,ప్రేమమూర్తిగా కనబడుతాడు.

            మా తెలుగు విభాగం ఆచార్యులు బన్న అయిలయ్యగారు బి. వో.ఎస్‍.గా ఉన్న కాలంలో రాజమండ్రి నుండి కాకతీయ విశ్వవిద్యాలయం తరచుగా వచ్చేవారు ఎండ్లూరి సుధాకర్‍ సార్‍.  కాకతీయ విశ్వవిద్యాలయంలోని గెస్టుహౌజ్‍లో బస చేసే సుధాకర్‍ సారుకు నేను బ్రేక్‍పాస్టు తీసుకెళ్ళేవాణ్ణి.  ఉదయం ప్రశాంతంగా ఏం చేస్తున్నావు,ఏం చదువుతున్నావు అని అడిగి దళితులకు చదువును నమ్ముకోవడం తప్పా వేరే మార్గంలేదని మనల్నీ మనమే నిరూపించుకోవాలని చెప్పాడు. ఆచార్యులు బన్న అయిలయ్యగారితో ఆచార్య ఎండ్లూరి సుధాకర్‍ గారికున్న స్నేహంవల్ల అయిలయ్యగారి శిష్యుడినైన నాకు సుధాకర్‍ గారితో కొంత సన్నిహితం ఏర్పడింది.విశ్వవిద్యాలయం గెస్టుహౌజ్‍లోనే తన ‘‘కావ్యత్రయం’’ను ఆత్మీయంగా అందజేసాడు. అయితే ఇదే మా మొదటి పరిచయం కాదు. నేను పరిశోధన చేస్తున్న సమయంలో ‘‘సమాంతర వాయిస్‍’’అనే పత్రికలో‘‘దిగిరాకు దిగిరాకు’’ అనే దండోర కవిత మమతఅనే కలం పేరుతో అచ్చయింది.  ఈ కవితను చూసి ఎండ్లూరి సుధాకర్‍ గారు ఫోన్‍ చేసి నీ కవిత బాగుంది, ఇలాంటివి ఆంధ్రజ్యోతి పత్రికకు పంపించు,ఇలా దండోర కవిత్వం రాస్తూవుండమని అభినందనలు తెలిపి, కలం పేరు కాకుండా స్వంత పేరుతో కవిత్వం రాయమని ప్రోత్సాహించాడు. అయితే 2017లో వెలువడిన నా తొలి కవితా సంపుటి ‘‘తునకలందని దండెం’’లో చాలా దండోర కవితలు చోటు చేసుకున్నాయి.  దీనికి ఎండ్లూరి సుధాకర్‍ సార్‍ ‘‘కవితా శంకరం’’అనే ముందుమాట రాసాడు. నా రెండవ కవితా సంపుటి ‘‘నల్ల రక్తకణాలు’’పంపినపుడు ఫోన్‍ చేసి మాట్లాడిన మాటలు మెలకువలు ఇంకా గుర్తున్నాయి.

            మాతెలుగు విభాగం శాఖాధ్యక్షులుగా ఆచార్య కాత్యాయని విద్మహే గారు, బి.వో.ఎస్‍.గా ఆచార్య బన్న అయిలయ్యగారున్న సమయంలో అంటే 2013లో పి.జి. సెలబస్‍ మార్చే క్రమములో మహిళా జీవితం-అధ్యయనం-సాహిత్యం’, దళిత సాహిత్యం రెండు పేపర్లు పెట్టారు.  పి.జి. విద్యార్థులకు దళిత సాహిత్యంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్‍ సార్‍ రాసిన ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ పాఠ్యాంశంగా వుంది.  మొదట ఆచార్య బన్న అయిలయ్యగారు బోధించిన, కొంత కాలానికి దళిత సాహిత్యం బోధించే అవకాశం నాకు లభించింది.  అప్పటి నుండి నేటి వరకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’కావ్యాన్ని బోధిస్తున్నాను.  అమ్మగాజులు, ఆత్మకథ, గూర్కా, డక్కలిపిల్ల, దాసును చూడాలి. నల్లతల్లి, నాన్న, నీలిక, నెత్తుటి ప్రశ్న, మైసమ్మమరణం, వర్తమానం మొదలగు కవితలల్లో దళిత సామాజిక జీవన అభివ్యక్తి నిండివుంది కనక నేను బోధించే సమయంలో కొంత ఆర్థ్రతకు లోనైయ్యేవాడిని. విద్యార్థులకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ చెబుతుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లు నామూలాల గురించి నేను చెప్పుకున్నట్లే ఉండేది. సుధాకర్‍ సార్‍ ఫోన్‍ చేసినపుడు నేను పి.జి విద్యార్థులకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ కావ్యాన్ని బోధిస్తున్నాను అన్నపుడు సంతోషంగా అభినందనలు తెలియజేస్తూ పఠనంలో మెలకువల గూర్చి తెలిపాడు. ఏది చెప్పాలనుకున్న ఎవరితో చెప్పాలనుకున్న విషాయాలను వెంటనే వ్యక్తపరచేవారు. ఇలా వారితో నాకున్న అనుబందం తక్కువే అయినా గుర్తుండి పోయేవిగా వున్నాయి.

            సుధాకర్‍ సార్‍ సతీమణి హేమలత మేడంగారు మరణించిన తరువాత హేమలత గారిపై స్మృతి  కవితలు రాస్తూ వడ్సఫ్‍ మెసేజీలు వచ్చేవి.  ఆ కవితలు చదివితే హృదయం భారమయ్యి కరుణారస భరితమయ్యేది.వాటికి బాధగా నేను స్పందించేవాణ్ణి.  ఇలా మనుషుల మనుసులనే ప్రబంధాలుగా చదివిన సుధాకర్‍సార్‍.అక్షరాలను మెతుకులుగా తిన్న సుధాకర్‍సార్‍ దళిత సాహిత్యాన్ని,తెలుగు సాహిత్యాన్ని తన కవిత్వం ద్వారా కథల ద్వారా సుసంపన్నం చేసాడు.

            ‘‘అగ్రహం రాని అక్షరం జ్వలించదనీ

            ఆర్థ్రత లేని వాక్యం ఫలించదనీ’’

చెప్పి తెలుగు సాహితీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసి ఇప్పుడు తనే ఈ లోకానికి దూరంగా కొత్త గబ్బిలమై గగన వీధిలోకి జనవరి 28న ఎగిరిపోయారు సుధాకర్‍సార్‍.  వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగు సాహితీ క్షేత్రం ముందుకు సాగాలని కోరుకుంటూ, వారి కూతుర్లు మానసకు మనోజ్ఞకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

 

 -డా।।మంథని శంకర్‍

 తెలుగు విభాగం

కాకతీయ విశ్వవిద్యాలయం

వరంగల్‍   

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు