మా రచయితలు

రచయిత పేరు:    యామిని నల్ల

కవితలు

కలం-హలం

హలం తో పొలంలో అడుగు పెట్టె అవనీ పుత్రుడు
పుడమి తల్లికి పచ్చని పైరును చీరగా..
కనుచూపుమేరలో పరచి చూసుకొని కాపాడుకునే కొడుకు ఆ పృథ్వీ పుత్రుడు  
ఆ కొడుకుకు
దళార్ల రాజకీయ వాగ్ధానాల రూపంలో అతివృష్టి పడినా...,
వ్యయం తప్ప
సాయం లేనిది వ్యవసాయం.
అయినా...,
ఆకలి నుండి సమాజాన్ని బ్రతికించే అన్నదాత రైతన్న

అవతలి గట్టున !.
బతుకు ఒకటి...బతికేది ఒకటి
ఐతే అతివృష్టి...! లేదా అనావృష్టి..!

మొలకెత్తని విత్తనలుతోమోసపోయినా...,
అతని ఆశ ఎపుడు అక్షయపాత్రయే.
సేద్యానికి సాయం రాక మేఘాలు మౌన వ్రతాలు చేసినా..,
అతనో  భగీరధుడై తన చెమటతో
మట్టి గడ్డలని సారవంతం చేస్తడు
బతకలేక బతుకు బండి లాగుతున్నా  బక్కచిక్కిన అతని పొట్ట వెన్నుముకకు మొరపెట్టిన.
ఆకాశం దిక్కే తప్ప పాతాళం చూడని మడం తిప్పని సాహసి రైతు

శివారులో యువ రైతుగా ఊగిన ఉయ్యాలతోనే
అలసిన రౌతెై తూగెను ఉరి వేసుకొని
రైతుసమాధులు మీద పునాదులు లేపే రాజధానులు, రాజకీయ రాబందులు .

రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక
అనే నినాదాన్ని నిత్యనూతనంగా ఉంచుతూ సాధించాల్సిన సత్యాన్ని సమాధి చేసుకుంటున్నాం.
సృష్టికర్తలైన రైతుల శ్రమని ఇంట్లో కూర్చోని T. V రిమోట్ మార్చుకుంటూ చూస్తం
టిక్ టాక్ లో ఉల్లి మీద సిల్లీ జోక్స్ వేసుకుంటాం !

ఆదిబిక్షువుకు అన్నం పెట్టే  అన్నపూర్ణ కే
భోనమండి అన్నం పెట్టే మొదటి హస్తం రైతమ్మ  కదా!

గంగ లేక ఎండిన భూములు చూసిన రైతు
బెంగతో గరళ కంఠుడు అయ్యేను .
పంటకు పోసే పురుగుల మందును గొంతులో  తీర్ధంగా స్వీకరించి

అందరి ఆకలి మంటలు ఆర్పేవాడు
సమాజంలో ఆర్ధ్రత లేక నేడు ఆవిరి అయ్యిపోయినాడు
" రైతుఆత్మ హత్య "గా పత్రికలో  వార్తగ మొదటి పేజిలో మిగిలిపోయినాడు 
కలం హలంగా మారి
ఇపుడిక సామాజిక సేధ్యం చేయాలి
పుడమిపై చేతల అడుగులు అక్షరాల పంటలు తీయాలి

కన్నీటి బతుకులు

మూడు పూటలా

కూడు లేక

ఆటు పోటులా....

కడుపును తాకే ఆకలి కెరటాలు,

నిస్సహాయతతో నీరసిస్తున్న

వ్యథార్త జీవులు....

 

కన్నతల్లిని,

వున్న వూరును విడిచి పెట్టి

బ్రతుకు తెరువు కోసం

నడిచి నడిచి...

ఇపుడు

ఆ బతుకే భారమై కుమిలిపోతున్న

దారి తెలియని జీవితాలు

దిక్కు తోచని ప్రయాణాలు..

కాలం పుస్తకంలో

తడిసిన

కన్నీటి కాగితాలు.

 

ఎడారిలో ఎండమావిలా

బంగారు భవితను వెతుకుతూ...

నెత్తిన తట్ట,

చేతిన బుట్ట,

చంకన బిడ్డను, వెంట ఆలిని

అంటి పెట్టుకుని

కదలని గడియారంలో

కదిలే కాలాన్ని తెలిపే ముళ్ళవోలె

ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు

చతికిలబడ్డ బతుకులు...

 

కాలం కన్నెర్ర జేసింది పాపం..

వాళ్ల బతుకుల్లో

నిప్పులు జల్లి

నిరుపేదల్ని జేసి

రోడ్డు మీద

వాళ్ళ బతుకు చిత్రాలను గీసింది

కనికరం లేని కాలం..

కల్లోలం రేపింది...

 

కనబడని తీరానికి

తెలియని భవిష్యత్తుకు పరుగులు తీసే

వలస కూలీల జీవితాలు

ఎప్పుడు ఒడ్డుకు చేరుతాయో?

 

కాటు వేస్తున్న  కరోనాను

కునుకు లేకుండా

ఎదుర్కొంటూ

సాటి లేని వైద్యం ఇస్తున్న దేవుళ్లు ఆ డాక్టర్లు.

 

ఉమ్మేసి,

కావాలనే తుమ్ముతున్న

తుగ్లక్ జనం వున్నా.

నాకెందుకు లే

ఈ వైద్య వృత్తి.

నా దారిన నేను ఇంట్లో వుంటాను. అనలేదు! వాళ్లు.

అదే జరిగివుంటే?

ఈ సమాజం శ్మశానంగా సింగారించుకుని

21 రోజులు

అయ్యుండేది.

సమాధులకు

పునాదులు కట్టడానికి,

ఇదీ రాయడానికి నేనూ, చదవడానికి జనం

వుండే వాళ్ళమ???

 

కామ్ గా కాలం సాగుతుంటే ప్రకృతికి గుచ్చుకుంది పొల్యూషన్ ముళ్ళు.

నిద్ర లేచిన విధికి

కరోనా వచ్చి  సొల్యూషన్ ఇచ్చినట్టుంది.

 

స్వేచ్ఛగా తిరుగుతున్న

వన్య జీవులు.

దట్టమౌతున్న ఓజోన్ గొడుగు.

అడవిలో  పెరుగుతున్న

పచ్చదనం.

 

అడవులే పెరుగుతున్నాయి.

నదులు ఆడుకుంటున్నాయి.

జలపాతాలు రంకెలు వేస్తూన్నాయి.

కనబడని గాలి కూడా

విజిల్ వేస్తోంది.

 

మనుషులు మాత్రం బందీలైనారు.

వలస జీవులు కన్నీటికి బంధువులైనారు.

నడిరోడ్డుకు దోస్తీలైనారు.

 

 

ఇంటర్వ్యూలు

నేను ఎక్కువగా మార్క్సిస్టు సాహిత్యమే చదివాను

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా రత్నమాల గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.       మీరు స్త్రీ వాదం వైపు ఎలా  ఆకర్షితులయ్యారు?
స్త్రీ వాదం అనేది నా వ్యక్తి చైతన్యం. నేను స్త్రీ ని కాబట్టి స్త్రీవాదం వైపు మొగ్గు చూపాను. అమ్మమ్మ ప్రభావం వల్ల చిన్నప్పుడు  స్త్రీ వాదిని.
అప్పుడు స్త్రీవాదం అన్న పదాలు లేవు. 70లలో అంతర్జాతీయంగా వచ్చింది. మనకు 80లల్లో స్త్రీవాదం వచ్చింది.
నేను ఎక్కువగా మార్క్సిస్టు సాహిత్యమే చదివాను. స్కూల్ ఏజ్ నుండి అవి అర్థం కాకపోయినా కూడబలుక్కొని చదివేదాన్ని. నాకు ఆ పుస్తకాలే అందుబాటులో ఉండేవి.

2.       స్త్రీవాద సాహిత్య అభివృద్ధిలో మీ పాత్రను ఎలా నిర్వచించుకొంటారు?
నేను నూతన అనే పత్రిక నడిపినప్పుడు మార్చ్ 8వ తేదీన స్త్రీల కోసం ఒక ప్రత్యేక సంచిక తీసుకువచ్చాను. అప్పుడు అందరు స్త్రీల కోసం ప్రత్యేక సంచిక అవసరమా అన్నవాళ్ళు ఉన్నారు. "స్త్రీ శక్తి సంఘటన" అనే సంస్థ పెట్టాము మొదటి సారి. స్త్రీ శక్తి  సంఘటన పెట్టినప్పుడు ఫెమినిజం అనే దానికి తెలుగులో ఏమని రాయాలనే చర్చ వచ్చింది. ఫెమినిజం అనే పదానికి తెలుగులో స్త్రీవాదం అని మొదటి సారి కరపత్రంలో రాసాను. మానవి అనే పదం మొదటగా చెప్పడం జరిగింది.

3.       అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? తద్వారా కలిగే ప్రయోజనాలు , ప్రేరణలు ఏమిటి?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించినప్పటికే ఇక్కడ శ్రీకాకుళ ఉద్యమం, శ్రీకాకుళ మహిళల ఉద్యమాలు ఉన్నాయి. మహిళా సంఘాలు ఏర్పడ్డాయి.
నిజానికీ క్లారా జేట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనలేదు. అంతర్జాతీయ కార్మిక మహిళా దినోత్సవం అని మార్చ్ 8వ తేదీన ప్రకటించారు. అంతర్జాతీయంగా ప్రకటించడం వల్ల ఒక ప్రేరణ లాగా, విశ్రుతంగా ప్రచారం అయింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోరాటదినంగా కాకుండా devolute dilute అయింది. కానీ శ్రామిక మహిళలు, ప్రజాసంఘాల మహిళలు పోరాట మహిళా కార్యక్రమంగా నడుపుకుంటున్నారు.

4.       స్త్రీ వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
స్త్రీవాదం అయిన, ఏ అస్తిత్వ ఉద్యమము అయిన అంటే దళిత కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఉపకులాల ఉద్యమం కావచ్చు అవి అస్తిత్వ చైతన్యమే కానీ వాదం కాదు. స్త్రీ వాదం కాదు.. స్త్రీ అస్తిత్వ చైతన్యము.

సమాజంలోని ఇతర సమస్యలతో జమిలిగా సమన్వయం చేసుకొని, అంటే వర్గ స్పృహ, అస్తిత్వ స్పృహ రెండూ కలిసి జమిలిగా సాగితేనే సరైన పోరాటం, సరైన చైతన్యం అవుతుంది.

5.       స్త్రీవాదానికి  ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో సహా దళిత బహుజన మైనారిటీ అస్తిత్వాలకు వైరుధ్యం ఉందని అనుకుంటున్నారా?
ఏ స్త్రీవాదం అయినా వాళ్ల అస్తిత్వ చైతన్యం కోసమే పోరాటం చేస్తారు.  అస్తిత్వ చైతన్యంలో దళిత, మైనార్టీ, బహుజన స్త్రీవాద అస్తిత్వ చైతన్యాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని ఈ చైతన్యం ఒక్కటే పరిష్కారం అని మిగతా వాటిని వదిలేస్తారు.. అది సరైన పద్ధతి కాదు కదా. మిగతా వాటితో సమ్మిళితమై పోరాటం చేయాలి.
మొత్తం సమాజంలోని పరిస్థితులు మారకుండా.. ఏ అస్తిత్వ చైతన్యం కూడా పరిష్కారం చూపదు.

6.       తెలుగు లో  స్త్రీ వాద సాహిత్యం వెలువడడానికి  భూమిక ఏమిటి? స్త్రీవాద సాహిత్య అవసరం  ఈనాటికీ ఉన్నదనుకుంటున్నారా?
స్త్రీల సమస్యలు ఉన్నంత కాలం స్త్రీవాద సాహిత్యం ఉంటుంది. స్త్రీ , పురుషుల సమానత్వం సాదించే వరకు స్త్రీ వాదం ఉంటుంది. సమానత్వం సాధించిన తరువాత కూడా అది నిలబెట్టడానికి ఉంటుంది స్త్రీవాదం.

7.       20,30 ఏళ్ల కిందటి నాటి స్త్రీవాద సాహిత్యం  ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నదని  మీరు భావిస్తున్నారా ?
సమాజంలో సమస్య ఉన్నంత వరకు దాని రిలవెన్స్ ఉంటుంది. స్త్రీలకు సమస్యలు ఉన్నాయి, స్త్రీలకు అసమానతలు ఉన్నాయి, స్త్రీల మీద రోజు రోజుకో హింస పెరిగిపోతుంది. ఇవన్నీ ఉన్నంత కాలం స్త్రీవాద సాహిత్యం వస్తూనే ఉంటుంది.

8.         కొత్తతరం రచయితలలో స్త్రీవాద స్పృహ ఎలా వ్యక్తమవుతున్నది?
 స్త్రీవాదం అంటే ఇన్స్పరేషన్ తో రాస్తున్నారు.  దానిని అధ్యయనం గాని, లోతుగా అర్థం చేసుకోవడం అనేది అవసరం..

9.       మీ రచనలలో అచ్చమైన, గాఢమైన స్త్రీవాద రచనలుగా మీరు వేటిని పేర్కొంటారు? ఎందువల్ల?
నా ఏ రచనల్లో స్త్రీ వాదం ఉండదు. వర్గ చైతన్యంలో భాగంగానే ఉంటుంది.

10.     "సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి  కనుక స్త్రీ వాదం బలహీనపడింది అంటున్నారు. "
ఇది నిజమా కాదా ? ఎందుకు ?
బలహీన పడినవి అని నేను అనుకోవట్లే.

11.      ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో మీరు పని చేసారు కదా. ప్రరవే ఎలా ఏర్పడింది?
అసమానత్వం అనేది అన్నింటిలో ఉంటుంది. అలాగే రచనా రంగంలో కూడా ఉంటుంది. రచయిత్రులు కూడా విడిగా ఒక సంఘంగా ఏర్పడితే బాగుండు అనిపించింది. మొదట్లో "మనలో మనం" అని ఒక సంవత్సరం పాటు k n మల్లీశ్వరి ఇంకో అయిదారుగురు రచయిత్రులు కలిసి పెట్టారు. మనలో మనం లో రచయిత్రులు మీటింగ్స్ పెట్టడం మాట్లాడుకోవడం జరిగేది.. మనలో మనం అనే దాని కంటే ఇంకా వేరుగా పేరు ఉండాలి అనుకొని "ప్రజస్వామిక రచయిత్రుల వేదిక" అనే పేరును సూచిస్తే అందరి ఆమోదంతో ఈ సంఘం ఏర్పడింది. నిజానికి ఈ సంఘం ఏర్పడటానికి మల్లీశ్వరి కారణం. చాలా మంది రచయిత్రులు ఎలివేట్ అయింది ప్రరవే ద్వారా. వీటి కంటే ముందు కొండవీటి సత్యవతి "భూమిక" రచయిత్రుల సమావేశాలు జరుగుతుండేవి.

సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పని చేసింది స్త్రీవాద కవిత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా శిలాలోలిత గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.       అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? తద్వారా కలిగే ప్రయోజనాలు , ప్రేరణలు ఏమిటి?

నిజానికి ప్రతి రోజు కూడా మహిళా దినోత్సవం గడుపుకోవాలనే రోజు కోసం కలగంటున్నామూ మనం ప్రపంచం మొత్తం చూసుకున్నప్పుడు చిన్న చిన్న కోరికల కోసం చిన్న చిన్న వెసులుబాట్ల కోసం అనేకమంది ఓటు హక్కు దగ్గరనుంచి ఎన్నో సాధించుకుంటు ఇప్పటి వరకు వచ్చారు ఈ దశకు రావడం స్త్రీలు ఎంత సంఘర్షణకు లోనయ్యారో.

 

2.       అంతర్జాతీయ మహిళా దశాబ్ది చైతన్యం ఏమిటి?

చైతన్యం చాలా వచ్చింది స్పష్టంగా గ్రాఫ్స్ లో కనబడటం కాదు, మన జీవితాన్ని గమనించినప్పుడు స్త్రీలు గెలిచారని అని చెప్పట్లేదు కానీ చైతన్యవంతులు అయ్యారు అని చెప్పగలను. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే గెలుపు కూడా ఉంది.

 

3.       స్త్రీ వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మనుషులంతా ప్రశాంతంగా హాయిగా సమాన స్వేచ్ఛతో బతకడానికి ఏర్పడినటువంటి ఒక నా దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా స్త్రీ వాదాన్ని గౌరవిస్తాను ఇష్టపడతాను స్త్రీవాదం లో ఉన్న అనేక అంశాల్లో ఒకటి రెండింటికి మాత్రం ఇప్పుడు దాన్ని బలహీనపరచడం కోసం కేవలం స్త్రీలు ఇష్టం వచ్చిన మగాడితో గడపడం కోసం లైంగిక స్వేచ్ఛ కోసం మాత్రమే స్త్రీవాదం పెట్టారు అని స్త్రీ వాదం లోకి మీరు వెళ్ళినట్లయితే మీరు కూడా చెడు పోయినట్టే అని ప్రచారం కూడా జరిగాయి. చాలా మందిని దాడులు కూడా జరిగాయి. కాబట్టి అక్కడ అవగాహన పెంచుకోవాలే తప్ప ఇప్పుడు చాలా మంది పురుషుల్లో మార్పు వచ్చింది కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎటువంటి విలువలు లేవు ఆలోచనలు లేవు హింస అనేది ఎక్కువ అవుతుంది.

 

4.       మహిళా జన జీవన అధ్యయనాలకు స్త్రీవాదానికి ఉన్న సంబంధం ఏమిటి?

స్త్రీవాద సిద్ధాంతాన్ని తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు తమకు వీలైనంత పరిధిలో ఆక్టివిటీస్ట్ ల రూపంలో ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నారు. కాబట్టి సమస్య రాగానే అదేమిటి అనేటటువంటి చర్చలు జరుపుతున్నారు. సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కాదు ఇంకా లోతుగా వెళ్లాలి ఇంకా జీవితాలు మారాలి మా తరంఅయిపోయింది, మా తరంలో మార్పులు వచ్చాయి. ముందు వచ్చే తరాలు మారాలి.

 

5.       స్త్రీ వాద భావజాలం తెలుగు సమాజాన్ని  ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా ? గతంలో అది వేసిన ప్రభావానికి  వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య భేదం ఏమైనా గుర్తించారా

 స్త్రీవాదం పుట్టుకతోటి చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలలో మార్పు రావడంతో పాటు ఇప్పుడు వీళ్ళ మీద డైరెక్ట్ గా అంటే స్త్రీ వాదులు ఏదైనా రాస్తారు అని అంటే ఇప్పుడొకటి జరుగుతున్నది. వీళ్లు విశృంఖలంగా రాస్తున్నారని వర్గం నెమ్మది నెమ్మదిగా తయారవుతున్నారు పక్కన నుంచి. విశృంఖలత వేరు స్పష్టంగా చెప్పాలి ఏ విషయం అయిన అనే ధోరణి వేరు. కాబట్టి వీళ్లు అలాంటి వాటిని చాలా బ్రేక్ చేశారు. ఒకప్పుడు కొంత బిడియంగా రాసిన కొందరు స్త్రీవాదులు ఉంటే అటువంటి వాళ్లను చూసి బ్రేక్ చేసుకుని చాలా స్పష్టత వచ్చింది. కొన్ని కొన్ని రచనలు చూస్తే ఇంత చిన్న పిల్లలు 25 ఏళ్లు కూడా లేని పిల్లలు ఎంత బాగా జీవితాన్ని అర్థం చేసుకున్నారు కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి బాల క్రెడిట్ కంటే కూడా హింసే కారణమే చుట్టూ ఎటు చూసినా హింసే కదా. మీటు రావడం కూడా ఆ పుస్తకం రావడానికి వెనుక ఆ రాయడానికి ఎంతో ధైర్యం కావాలి వాళ్లకి ఎంత సాహసంతో రాసారు. దాన్ని మనం మెచ్చుకోవాలి ఏం రాశారు అని పక్కనపెట్టి దాంట్లో ఏముంది పక్కనపెట్టి రాయడానికి వాళ్లు ప్రదర్శించిన ధైర్యాన్ని మనం అం మెచ్చుకోవాలి. 

 

6.       తెలుగు లో  స్త్రీ వాద సాహిత్యం వెలువడడానికి  భూమిక ఏమిటి? స్త్రీవాద సాహిత్య అవసరం  ఈనాటికీ ఉన్నదనుకుంటున్నారా?

స్త్రీ ఉన్నంతవరకు పురుషుల్లో దుర్మార్గులు ఉన్నంతవరకు ఈ హింస ఉంటుంది హింస ఉన్నంతవరకు ప్రశ్నించే స్త్రీవాదం ఉంటుంది.

 

7.       80, 90  దశకాల్లో స్త్రీ వాద సాహిత్యం బలంగా వెలువడడానికి కారణాలు ఏమిటి ?

బలంగా అంటే హింస ఎక్కువైపోవడం ఒకటి తర్వాత స్త్రీలలో చదువు చైతన్య పూర్వకమైనటువంటి  ఆలోచన రావడం తర్వాత విదేశాల్లో జరుగుతున్నటువంటి రకరకాల ఉద్యమాల ప్రభావం. మన దేశంలో ఆ ప్రభావం అంటే విదేశాల్లో పుట్టిన తర్వాతే మన దేశంలో పుట్టినట్టు కాదు ఏ దేశంలోనైనా స్త్రీ పుట్టినకనే స్త్రీవాదం పుడుతుంది. 

 

8.       స్త్రీ వాద  సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంతమేరకు ప్రభావితం చేసింది?

చాలావరకు ప్రభావితం చేసింది. దాని ప్రభావం కొన్ని చోట్ల స్పష్టంగా కనపడుతుంది, కొన్ని చోట్ల అస్పష్టంగా ఉంటుంది. కానీ ప్రభావం అయితే ఉంది. అది స్త్రీల రచనలలో ఉంది, పురుషుల రచనల్లోనూ ఉంది. మానవ రచనల అన్నింటిలోను స్త్రీవాదం అంతర్లీనంగానే ఉంది. 

 

9.      నవల, కథ, విమర్శ, నాటకం వంటి  ప్రక్రియల కంటే స్త్రీ వాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడింది. దీనికి కారణాలు ఏవంటారు?

కవిత్వం  తక్షణ  స్పందనతో వస్తుంది. చాలా ఫోర్స్ ఫుల్ గా వస్తుంది చిన్న చిన్న మాటల్లోనే చెప్పదలుచుకున్న విషయాన్ని బాణం కంటే వేగంగా చెప్పగలదు. ఆ చెప్పగలదు కాబట్టి అప్పుడు ఉన్న సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పని చేసింది స్త్రీవాద కవిత్వం. ఆ కవిత్వం కంటే ఇంకా చాలా చెప్పాలని ఉంది, కవిత్వం యొక్క నిర్మాణాల్లో చాలా చిన్నగా ఉంటవి, దీర్ఘకావ్యాలు ఒకటి తీసేస్తే పది పదిహేను  లైన్లలో  కవిత అయిపోతుంది, కానీ జీవితం అయిపోవట్లేదు. అప్పుడు ఒక్కొక్క సమస్యను ఉద్దేశించి రాయాలనే ఆలోచనతోని మిగతా ప్రక్రియలు వచ్చాయి. కవిత్వం ఒక సామాజిక అవసరంగా బలంగా స్త్రీవాద రూపాన్ని తొడుక్కుంది.

10.     స్త్రీ వాదం ఎక్కువగా తనకు మద్దతు ఇచ్చే ఉద్యమాలను, ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నించింది, కానీ -పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం. దీని గురించి మీరు ఏమంటారు?

పాలకులను  ఇప్పటివరకు  ప్రశ్నించలేదంటే... ఇప్పటికి స్త్రీ వాదం అనేది ఇది ఎప్పుడో రూపం కోల్పోయి ఉండేది. వివేచన ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్న వాళ్ళు కొంత ఆలోచించి మాట్లాడాలి.. హింస అనేది ఒకరి చేతిలో లేదు. మనకు సామాజిక సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా ఇవన్నీ కారణం.. వీటితో చైతన్య పరచాల్సినటువంటి  స్థితి ఉండాలని వాళ్లు కూడా గ్రాస్ రూట్  లెవల్లో అస్సలు పట్టించుకోలేదు అనడానికి లేదు. వాళ్లు కూడా వాళ్లతో మీటింగ్స్ పెట్టడం వాళ్లు మనకు తెలియని మన చరిత్ర పుస్తకం  వాళ్లందరి లైఫ్ హిస్టోరీస్ కలెక్ట్ చేసి రికార్డ్ చేసినటువంటి పుస్తకాలు, మహిళావరణం లాంటి పుస్తకాలు కూడా వచ్చాయి.  అంటే సాహిత్య వరకే ఎక్కువ పరిమితమయ్యారని ఒక ఆలోచన మా దళితవాడల్లో రాలేదు. అప్పటి స్త్రీవాదులు అందరూ ఆక్టివిస్టులుగా ఉన్నారు. 

పురుష రచయితలు రాసే విధానంలో బలమైన మార్పును తీసుకువచ్చింది స్త్రీవాదం.

 

11.      దళిత బహుజన మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు , ఉద్యమ సాహిత్యం స్త్రీవాద సాహిత్య విస్తరణకు అవరోధం అయ్యాయని  భావిస్తున్నారా?

లేదు. అవరోధం ఏం అవ్వలేదు.స్త్రీ వాద సాహిత్యంలో అంటే స్త్రీలను గురించి చేసే ఉద్యమం. అది దళితులు అయినా, అగ్ర వర్ణాల వారు అయినా ఎవరైనా సరే వాళ్లు చేస్తున్న ఒక స్త్రాగుల్ గానే భావించాలి తప్ప ఒకటి కొకటి శత్రువులుగా లేవు ఎప్పుడు. ఒక వేళా అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే స్త్రీ కాదు. అగ్రవర్ణ పురుషుడు ఉన్నాడు కదా. 

 

12.     స్త్రీవాదానికి ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో సహా దళిత బహుజన మైనారిటీ అస్తిత్వాలకు వైరుధ్యం ఉందని అనుకుంటున్నారా?

స్త్రీవాద ఉద్యమం వచ్చిన బలము భూమికతో అది చాలా నిలబడింది. తర్వాత వచ్చిన బహుజన వాదం, మైనారిటీ వాదం ఇవన్నీ కూడా ఎంత పెయిన్ అయితే అనుభవిస్తున్నారో వాటిలోంచి అప్రయత్నంగా పుట్టిన ఉద్యమాలు. వీటి మధ్య వైరుధ్యాలు లేవు అనే నా అభిప్రాయం.

 

13.     "సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి  కనుక స్త్రీ వాదం బలహీనపడింది అంటున్నారు. "

 ఇది నిజమా కాదా ? ఎందుకు ?

స్త్రీవాదం బలహీన పడటం అంటూ జరగలేదు. స్త్రీవాదం బలహీన పడింది అన్నప్పుడళ్ల నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒకతను ఒక మేకను పట్టుకొని రోడ్డు వెళ్తుంటాడు. నలుగురు దొంగలు ఆ మేకను దొంగిలించి వండుకొని తిందామని అనుకుంటారు. నలుగురిలో ఒకడు వచ్చి ఏందిరా పందిని తీసుకొని అని అడుగుతాడు... మిగతా వాళ్ళు నవ్వుతారు.. ఇతను చూసుకుంటే మేకలాగే కనబడుతుంది. మళ్లీ కొంచెం దూరం వెళ్ళాక రెండో వాడు వచ్చి ఏంట్రా కుక్కను తీసుకు పోతున్నావు అంటాడు. ఇంకొకడు వచ్చి గాడిద ని తీసుకొని పోతున్నావ్ ఏంటి అంటాడు. ఇలా నలుగురు ఒక్కోటి అనేటప్పటికి.. మేకను తీసుకువెళ్లే వాడికి అనుమానం వస్తుంది ఒకే విషయాన్ని నలుగురు చెప్పినప్పుడు అది నిజమేనేమో... నాకు తెలివి లేదు మేక అనుకొని తీసుకొని వెళ్తున్నాను అని ఆ మేకను అక్కడే వదిలేసి వెళ్తాడు. అట్లాగే  స్త్రీవాదం బలహీనపడింది స్త్రీవాదం ఉందా లేదా అనే పనిగట్టుకుని ప్రశ్నలు వేసి వేసి ఉందా లేదా అనే భ్రమలో ఉన్నారు.

          స్త్రీవాదం మొదట్లో కవిత్వంలో చాలా బలంగా వచ్చింది. కవిత్వం కంటే ఇంకా బాగా చెప్పడానికి కథ నవల అయితే మనం చెప్పదలుచుకున్న అనేక అంశాలు చెప్పవచ్చు అనే ఆలోచనతో కథ, నవల, వ్యాసాలు వచ్చాయి. రూపాన్ని మార్చు కుంది కానీ  స్త్రీవాదం బలహీన పడలేదు రచన మొత్తంలో స్త్రీవాదం ఉంది.

 

14.     గ్లోబలైజేషన్  కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు స్థానం ఉన్నదంటారా?

స్థానం ప్రత్యేకంగా ఇక్కడ పెట్టి ఇదిగో ఈ ఉద్యమం మీరు నడుపు కోండి అని ఎవరు చెప్పరు. దీని అస్తిత్వం ఇది అని ఎవరు కూర్చోబెట్టి చెప్పరు. మార్కెట్లో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ మార్కెట్ పై పై ఎంత ఉందో వీళ్లకు స్త్రీలు వస్తువులు రెండు ఒకటే స్త్రీని వస్తువుగా చూడటం తో పాటు స్త్రీని మార్కెట్ చేస్తున్నారు వాళ్లు స్త్రీని అమ్ముకుంటారు వేశ్య వృత్తిలో చేస్తారు చంపుకుంటారా అత్యాచారం చేస్తారు ఈమె శరీర సౌష్టవాన్ని బట్టి రేటును నిర్ణయిస్తారు ఇలా గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఎక్కడో ఉందనుకుంటాను కానీ ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ప్రతి ఇంట్లో కూడా ఉంది దాని యొక్క ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేక పోతున్నారు దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది మనం ఆలోచించాల్సిన మనం భయపడాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్త్రీ అంటే కేవలం ఉపయోగపడే వస్తువేనా అనే ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ ఈ కాలంలో కూడా అస్తిత్వ ఉద్యమాలు అవసరమే.

 

15.     మీరు స్త్రీవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

మన చుట్టూ ఉన్నటువంటి అనేకమంది స్త్రీలు, సమాజంలో వాల్లపై చూపబడుతున్న వివక్ష ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచింప చేస్తూ ఉండేది. అప్పుడు నాకు ఒక సిద్ధాంత భూమికగా మనం ఎలా అర్థం చేసుకోవాలి స్త్రీల సమస్యలను అనడానికి గాను స్త్రీవాదం చాలా ఉపయోగపడింది. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంటే 80 ప్రాంతాల్లో  ఎక్కువగా అన్వేషి అస్మిత మీటింగ్స్ పెట్టడం, చేర గారి ఉపన్యాసాలు వీటిని చూసి ఆకర్షితురాలయ్యను. ఎందుకంటే దీని ద్వారా  స్త్రీల సమస్యలను కొంత వరకు పరిష్కరించవచ్చు అని అనిపించింది. 

       80 దశకం  తర్వాత మన దగ్గర స్త్రీవాదం బాగా ఎక్కువగా వచ్చింది. చాలా మంది అనుకుంటారు ఫారిన్ లో పుట్టింది, దాన్ని చూసి వెర్రితలలు వేస్తుంది అని. ఇక్కడ ఇండియాలో మనకు అసలు సమస్యలే లేవనడం నాకు చాలా కోపాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సమస్యల్లేని స్త్రీ అంటూ ఎవరు లేరు. 

         స్త్రీలు ఉన్నంత కాలం, స్త్రీలు వివక్షకు, హింసకు గురవుతున్నంత కాలం స్త్రీవాదం ఉంటుంది.  తర్వాత ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఇది కేవలం స్త్రీల సమస్య కాదు, సామాజిక సమస్య. స్త్రీ పురుషులిద్దరూ కూడా ఫెమినిస్ట్ లే. ఫెమినిజం అనేది కేవలం నీ గొడవ నీదే కాబట్టి నువ్వే పరిష్కరించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పెరుగుతున్న కాలంలో, ఆలోచనా సరళి పెరిగి, అవగాహన పెరిగి పురుషుల్లో కూడా చాలామంది ఫెమిస్టులుగా  మారడం ఉండటం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. 

 

16.     స్త్రీవాద సాహిత్య అభివృద్ధిలో మీ పాత్రను ఎలా నిర్వచించుకుంటారు?

రచనను నేను ప్రధానంగా ఎనుకున్నాను. నేను సమాజంతో, సమాజంలో ఉన్న స్త్రీ తో సంభాషణ చేయడానికి రచనను ఒక ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నాను. నే ఏది రాసిన అది స్త్రీలకు సంబంధించినదే అవుతుంది. విమర్శ రాసిన, కవిత రాసిన, చిన్న కథలు రాసిన వీటన్నింటి యొక్క అంతర్లీన శక్తి మాత్రం స్త్రీవాదం ఇచ్చినటువంటి బలమే చైతన్యము.

 

17.     స్త్రీ వాద సాహిత్యం సాధించిన ప్రయోజనం ఏమిటి?

సమాజంలో మార్పులు తీసుకురావాలని కోరుకుంది. ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటుంది.  మనం చూస్తూనే ఉన్నాం మనుషుల మనసుల్లో మార్పు తీసుకురావాలి అని కోరుకుంది

 

18.      తెలుగులో వచ్చిన స్త్రీవాద సాహిత్యంలో మీకు నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన రచన ఏది?

చాలా ఉన్నాయి.. ఒక విధంగా చెప్పాలంటే సాహిత్యమే నన్ను, నాలో ఉన్న ఆలోచనాశక్తిని, ఆలోచనా సరళిని మార్చింది కూడా సాహిత్యమే. 'రేవతీదేవి' 'శిలాలోలిత' అనే కవితా సంపుటి నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను తను ఒకటే అని అనెంతగా చాలా లోతుగా వెళ్ళిపోయినవి ఆలోచనలు. తను పడినటువంటి సంఘర్షణ కానీ, బ్రతకడానికి తాను పడినటువంటి బాధలు కానీ, మళ్ళీ జీవితం నిర్మించుకోవడానికి తన ఇది అంతా కూడా ఆ పుస్తకంలో బాగా కనబడుతుంది. వడ్డెర చండిదాస్ గారివి అప్పట్లో నేను విపరీతంగా చదివేదాన్ని. నేను రోజుకు అయిదు ఆరు పుస్తకాలు చదివిన రోజులు కూడా ఉన్నాయి. నాలో inbulit సాహిత్యం అంతా కూడా నా రక్తంలో కలిసిపోయిందేమో అనిపించేంతగా చదివిన తర్వాత... చదవడంలో  వ్యక్తుల స్నేహంతోటి ముఖ్యంగా భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి స్నేహం కూడా తనలో ఉన్న చైతన్య స్ఫూర్తి ఆకర్షితురాలిని చేసింది. నేను చేద్దాం అనుకున్న పనులన్నీ చేయడం చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఎంతోమంది స్త్రీలకు సమాజంలో ఉపయోగపడే మార్గంలో తన ఉంది. 

 

19     కొత్తతరం రచయితలలో స్త్రీవాద స్పృహ ఎలా వ్యక్తమవుతున్నది

ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఒక ఐకమత్య ధోరణి కనబడుతున్నది. ఒక కాకి చనిపోతే వంద కాకులు ఒక్కసారి వచ్చేస్తాయట.. వేరే ఏ పక్షి కి అలా కాకుండా కాకి సోప అంటాం కాకి దుఃఖాన్ని. అలాగే  ఒక స్త్రీకి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని వెంటనే తక్షణమే స్పందించి దానిని ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నటువంటి ఇప్పటి యువతను చాలా అభినందిస్థాను. వాళ్లంతా కూడా హింసకు గురిఅవుతున్న స్త్రీలను రక్షించాలని, వాళ్ళ సమస్యలను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో భాగమే కదా ఇవ్వన్నీ.

 

 20. స్త్రీవాద సాహిత్య సృజనలో మీ అనుభవం ఏమిటి?

చాలా తృప్తి కలుగుతుంది నాకు. రచన చాలా తృప్తినిస్తుంది. రచన చేయాలనే ఇక్కడకు వచ్చాను కనుక... నిరంతరం రచనలు చేస్తూనే ఉంటున్నాను. నా శక్తికి మించి పని అయిపోతుంది. నెలలో ఇంచు మించుగా ఇరవై ఇరవైఅయిదు వరకు రచనలు చేస్తుంటాను అవి నాలుగు కాలమ్స్, కవిత్వం,ముందుమాటలు ఇలా ఏదైనాకానీ

 

21.      మీ రచనలలో అచ్చమైన, గాఢమైన స్త్రీవాద రచనలుగా మీరు వేటిని పేర్కొంటారు? ఎందువల్ల?

నాకు ఏమనిపిస్తుంది అంటే రాసిన వాళ్ళకి ప్రతిదీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. 'పంజరాన్ని నేనే పక్షిని నేనే' నా మొదటి కవితా సంపుటి సంపుటిలో 'పంజరం' అనే కవిత... అది చరిత్రని తిరగ రాద్దామని, స్త్రీలు మళ్ళీ చరిత్రను ఎట్లా రాయాలి, ఎలా హింసకు గురిఅవుతున్నారో చెప్పే కవితలు. నా రెండో కవితా సంపుటి 'ఎంతెంత దూరం'. మూడవది గాజు నది... మొత్తం అన్ని కూడా స్త్రీవాదం సాహిత్య భూమికతో ఇష్టంతో రాసినటువంటి రచనలే.ఏ ఒక్కటి కూడా బలహీనతలను స్త్రీలను ఎగతాళి చేసినట్టుగాని నా రచనల్లో ఉండవు.

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు