మా రచయితలు

రచయిత పేరు:    అడిగోపుల వెంకటరత్నమ్

కవితలు

మనిషి మనిషి గా మారటానికి

న్యాయ శాస్త్ర బడి నడుస్తుంది

కంటికి ముసుగు కప్పిన ధర్మ దేవతకు

వినికిదే ఆధారం

సాక్ష్యాలు వడ్డించిన విస్తర్లై

కధనానికి వక్రభాష్యం

శ్రేయస్సుకు విఘాతం

నిజం అబద్దముగా

ధర్మం అధర్మంగా

పజ్ఞా పర్వాలు

చంపింది వాడే

వాడు కాదంటూ నిరూపణ

పొలం వాడిదే

వాడిది కాదంటూ నిర్ధారణ

బడి నిండా విద్యార్థులు

ప్రవేశానికి బారులు తీరిన

ఆశావాహులు!

 

మత శాస్త్ర బడి నడుస్తూంది

మత  మౌఢ్యానికి అందలం

మతాన్ని మనిషి బతికిస్తే

మనిషిని మతం బతికిస్తుంది

మనిషీ మతం వేరు కాదు

మనిషికి పేగు బంధం

అస్తిత్వానికి చిరునామా

ఆరోహాణకు ఆయుధం !

మతం బలం ప్రాణం

పేరులోనే మతం ధ్వనించాలి

ఆయువు అనంత వాయువుల్లో కలిసినా

భూమి చుట్టూ పేరు పరిభ్రమించాలి

ఉపదేశకుల ప్రవచనాలు

ఆధ్యాత్మిక అధ్యాయానికి

వరుస కట్టిన విద్యార్థులు!

 

మనవశాస్త్రం బడి నడుస్తూంది

మనిషి  మనిషిగా మారటానికి

పాఠ్యాంశాలు రెండే రెండు

విశ్వప్రేమ

మానవత్వం

ప్రవేశరుసుం

వయో పరిమితి లేదు

లింగబేధం

విద్య సంవత్సర విధానం లేదు

ప్రవేశానికి ప్రతి రోజు అర్హమే

ప్రజలదే ప్రశ్నాపత్రం కూర్పు

ప్రజలదే ఉత్తీర్ణతాధికారం!

 

ఎందుకో ఏమిటో

ఒక్కరు ప్రవేశం కోరటం లేదు

బడి నిండా శూన్యం

బడి చుట్టూ అభావం

కలలకు మరణం లేదు

కలలకు మరణం లేదు

కలగాని వొకటి కాదు

కలలు కనే కర్తలూ  వొకటి కాదు! 

మనసులో ప్రాణికి

మరో రూపమే కల

ఆ రూపానికి  ప్రాణమే

కలలకు సాకారం!

యుగయుగాలుగా

ఒంటరిగా నిలిచిన చంద్రుడు

పలకరింపులు

పరామర్శలు లేక

మానవ సంచారం

మనుగడ కోసం పరితపిస్తే --

నీల్ ఆమ్ స్ట్రాంగ్ కరస్పర్శతో  

కల కంచికి

కథ సుఖంతానికీ !

 చెరువు గట్టుపై

కొంగ జపానికి

పక్షుల నిలయానికి

పీఠభూమిగా మారిన రాయి

 చెక్కితే చిదిమి పోని  

చేవగల దాన్నంటూ  

మూర్తిగా మారి

మొక్కులు పొందాలని--

కలకు జీవం పోస్తూ

శిల్పి చేతిలో శిల్పమే

గర్భగుడికి చేరింది!

అడవిలో పుట్టి

అడవిలో అంతమౌతూ

ఒకానొక పుష్పం

సర్వసాక్షి

పాదాల చెంత చేరి

ప్రణుతించాలని--

కల ఫలించి

మాలగా మారి

జగత్సాక్షి కంఠహారమైంది

మనిషి రూపం మట్టేనని

మనిషి మట్టిలో కలుస్తుందని

 తండ్రి మనసులో

గూడు కట్టిన కొండంత కోరిక--

కల నిజమై

తండ్రికి జ్ఞాపికగా

సమాధి నిర్మితం!

కలలు జీవించే  వుంటాయి

భూత భవిష్యత్ వర్తమానాలు

వాటికి వర్తించవు!

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు