చూశావా !
గడ్డి పరక అచ్చం నాలాగే వుంది !
గడ్డి పరక తనను
పరిపూర్ణం చేసుకోవడానికి
(నీ) పాదం క్రింద విచ్చుకొని
పరివ్యాప్తం కావల్సివుంది
కానీ...
దాని దేహంలోని చెమ్మ
ఏం చెబుతోందో విను !
మనస్సు చెవి ఒగ్గి విను !
గడ్డి పరక చెప్పే విషయం కీలకం !
దహించే అవమానాలు కావచ్చు
చిగురించే కలల అవశేషాలు కావచ్చు
గడ్డి పరక చెప్పే విషయం కీలకం !
గడ్డి పరక అచ్చం నాలాగే వుంది
అది తల ఎత్తుకోగానే
వన మాలి ఆత్రంగా
తోటను చదును చేస్తాడు
గడ్డిని నేలమట్టంగా కత్తిరిస్తాడు
తోటను మఖ్మల్ తివాచీలా
ఉంచాలనే గుబులు వాడిది !
మీరు ప్రయత్నించి
ప్రయాసపడి
స్త్రీలను నేల మట్టం చేసిన్నట్లుగా లేదా ఇది !
కానీ... జీవితాన్ని ప్రకటించాలనే
భూమి కోరిక మరణించదు
స్త్రీ జిజ్ఞాస మరణించదు
నా సలహా తీసుకో
రహదారిని ఏర్పరిచే
ఆలోచన మంచిదే
ధైర్యంతో పాటు
మండే ఓటములను
భరించలేని వారు
నేల మట్టం చేయబడ్డారు
మట్టిలో పాతబడ్డారు ఆ విధంగానే వారు
బలశాలులకు 'దారి' చేస్తారు
కానీ
వారు కేవలం
గడ్డి పోచలు (స్త్రీ) మాత్రమే
గడ్డి కాదు !
గడ్డి నిజంగా, అచ్చం నాలాగ ఉంటుంది
సమాంతరంగా
సముద్రాన్ని ఊరడిస్తూ
నిటారుగా
పర్వతాన్ని నిలబెడుతూ
గడ్డి పరక
సీదాగా సాదాగా
నాలాగ ఉంటుంది