దినకరుడు నిద్ర లేవక ముందే
వృక్ష మాతకు నమస్కరించానా...
ఇక ఆ రోజుంతా నా తలమీద నీడల గొడుగులే! పొద్దు పొద్దున్నే లేచి.......
అమ్మ పాదాలకు వంగి నమస్కరిస్తునా...
అమ్మ కట్టుకున్న పట్టు చీర వృక్షమై కనిపించె!
నాలుగు అక్షరాలు రాద్దామని అనుకొన్నదే తడువు
తెల్లకాగితమై నాముందు వాలిందో చెట్టు తల్లి
ఆకలయిన కడుపుకింత క్షుద్భాద తీర్చనందునా మధుర ఫలాలిచ్చు ఓ వృక్ష మాతకదా!
మనిషి వికృత చేష్టలకు విలవిలలాడిందా తరువు
ఇంత శ్వాస నిచ్చే మొక్కల్ని నరుకుతున్న
ఓ నరకాసుర సంతానమా ఎందుకు ప్రకృతిపై నీ విషపు సంతకం చేస్తావు?
నీ ప్లాస్టిక్ నవ్వుల పువ్వులు......
జలసంద్రంలోని తిమింగలాల గుంపును మింగేస్తున్నాయి.....ఆ గరళం
నీ మెదడులోకి మురుగు కాలువయి
ప్లాస్టిక్ వ్యర్ధాలతో పొంగి పొర్లుతుంతోంది చూడు!
జీవితం దొర్లి దొర్లి కాలం లోయలోకి జారిపోతుంటే
ప్లాస్టిక్ పాలపుంతను కావాలించుకున్న ఓ మనిషీ
నీ మనుగడే పచరశ్నార్థకమైన వేళ....
పాత మిత్రుల పునఃపలకరింపులా
ఓ చిరు మొలకవై మొలకెత్తరా!
ఒకానొక జీవన విశ్వాసాన్ని దోంగలిస్తున్న వేళ
నీ ఆశలు వేకువజామున వికసించే శ్వేత కాలువలు కావు సరికదా......
ఆకాశం నుండి జాలువారిన మంచు
బిందువులు కూడా కావు సుమా!
నీ జీవితమిప్పుడు ..
నాగరికతా ఉబ్బలో కూరుకు పోయిన
వొట్టి గడ్ది పోచల గుంపే గదా!
నీవెంత ఉల్లాస తరంగాలలో తేలియాడినా
నీ అంతరంగంలో ప్లాస్టిక్ బాంబు
పేలడానికి సిద్దంగా ఉంది చూడు
నిన్ను అంతం చేయడానికి మూడవ
ప్రపంచ యుద్ధం అక్కర్లేదు మిత్రమా!
అందుకే.....
ఓ మనిషీ ఎన్నాళ్ళు ఈ ఎడారి పలకరింపులు
పచ్చని ఆకులతో సంభాషించు.....
నీ గొడ్డలి దెబ్బతిన్న చెట్టుతో చర్చించు
అశేష వృక్ష సమూహాల్నీ స్పర్శించు.
నీ శిథిల దేహానికి జాతి పత్రహరితం పులుముకో
కాలం గుహలో ఇంకెన్నాళ్ళు దాగుడు మూతలు?
రా... మిత్రమా! కొత్త పదమై కదిలి రా
నా కవితలో ఒక వాక్యమై వొదిగిపో!
రాతి పలకలాంటి.
నీ గుండె తలుపులు తెరిచి చూడు....
పచ్చని చెట్టే నీ ప్రగతికి మెట్టని ప్రతిధ్వనిస్తోంది
అడవి వాకిట్లో నీ అడుగుల చప్పుడు విని
ఇన్ని లేత చిగుళ్ళ సిరిగంధపు మొక్కలు
దీనంగా నమస్కరిస్తున్నాయి చూడు!