మా రచయితలు

రచయిత పేరు:    ఉదయమిత్ర

కవితలు

రోడ్డును చదవండి

మీ పుస్తకాలకు ఆఫీసుకాగితాలకు
కాసేపు విరామమివ్వండి

ఈరోడ్డును చదవండి

నిన్నటి దాంక. శాంతి ని నెమరేసిన రోడ్డు
నేడెందుకు అట్టుడుకు తున్నదో చూడండి

అంటుకున్న అడవిలా
సంక్షోభ సముద్రం లా
మహోగ్ర గీతంలా
మార్చింగ్ సాంగ్ లా
రూపాంతరం చెందుతున్న
రోడ్డును చదవండి

ఒకరిలోంచి ఒకరు విస్తరించి
ఒకేధార అందరిలో ప్రవహించి
వందలై,వేలై,లక్షలై
జ్వాలలై,వేగుచుక్కలై
బతుకుల్లో విసిగివేసారి
పాలకుల కుట్రల్ని పగలదీయడానికి
విధ్యార్థులు రోడ్లమీదికొస్తున్నారు
మాటమీద తూటా పేలుతున్నచోట
వాళ్ళు రొడ్లను గొంతుకగా మల్చుకు
మౌనాన్ని చీల్చుకు,గాయాల్ని మోసుకు వొస్తున్నారు

చదవండి రోడ్లను

ఢిల్లీ ని చదవండి
బెంగాల్ ను చదవండి
అస్సాం ను చదవండి
రగులుతున్న వర్తమానాన్ని
రోడ్డు అద్దంలో చూడండి
 అర్ధ రాత్రి రోడ్డును 
నిద్ర లేపి అడగండి
విరిగిన లాఠీ కన్న
పెంచిన స్వరమెం గొప్పదో చెబుతుంది
మతాలు వేరైనా
మానవత్వమే గెలుస్తుందని చెబుతుంది

రోడ్డు..ఒక పుస్తకం
జ్ఞానాన్ని పొందండి
రోడ్డు..ఒక స్నేహితుడు
కరచాలనం చేయండి
రోడ్డు..ఒక సూర్యుడు
స్ఫూర్తి ని పొందండి

మీ పుస్తకాలకు ఆఫీసుకాగితాలకు
కాసింత విరామమివ్వండి
నిస్సారపు జీవనమైదానాల్లోకి
ఈ రోడ్డుకు దారినివ్వండి

రోడ్డూ..నీకు వందనం

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు