మా రచయితలు

రచయిత పేరు:    అయిత అనిత

కవితలు

నీటి బుడగ

ఎంత అందంగా నర్తిస్తావో

నీటి అలల హొయలపై...నువ్వు!

 

ఎంత హాయిగా విహరిస్తావో

వన్నెచిన్నెలతో గాలితేరులో...నువ్వు!

 

కనుోగిలిలో  రంగు రంగుల స్వప్నమై

పిల్లల మదిదోచేవు...నువ్వు!

సబ్బు నురగవై లేలేత చేతుల్లో ఆడేవు...నువ్వు!

 

నీ ఆయువు క్షణమని తెలిసినా...

చెరగని చిరునవ్వుతో

పయనిస్తావు...నువ్వు!

 

పరుల సంతోషంలో

పాలుపంచుకుంటావు..నువ్వు!

కాలంలో కరుగుతున్నా

గమ్యానికై పరుగెడుతావు..నువ్వు!

 

ఇంకేం కావాలి..!

జీవిత పాఠాలు నేర్చుకొవడానికి..!!

నువ్వే గురువై సత్యాలు బోధించగా...!

జగతికి స్ఫూర్తి మంత్రాన్ని బోధించగా.!

ఆమె..!

పరుల క్షేమమే తపమై

పరాయిగా జీవించే ఒంటరి

సృష్టికి మూలమైనా

అస్థిత్వమెరుగని బాటసారి

 

తన ఆశలను అదిమిపట్టి

తనవారి ఆశయాలకు ఊపిరిపోసే తపస్వి

అభిరుచులను మరిచి

అలవాట్లను మార్చుకుని

కుటుంబానికై కరిగిపోతున్న క్రొవ్వొత్తి

 

త్యాగాల వారధిగా

వారసుల అభివృద్దికి

నిరంతరం తొడ్పడే కల్పతరువు

అవమానాలెదురైనా

సహనం కోల్పోని ధీరమేరువు

 

నిర్లక్ష్యానికి నిరాదరణకు ఆయువుపోసే

నేటి సమాజంలో

కర్తవ్యదీక్షనెత్తుకొని

సాధికారదిశగా సాగుతుతున్న 

అలుపెరుగని  ప్రవాహం ఆమె

అణచివేతకు ఆజ్యం పోస్తున్న

మగాధిపత్యపు పీఠాన్ని పెకిలిస్తూ

గుర్తింపుతొవ్వ తవ్వుకుంటున్న

సంకల్పగునపం ఆమె

అణువణువునా ఆత్మవిశ్వాసాన్ని ఒంపుకొని

సడలని ధైర్యాన్ని గుండెపొరల్లో నింపుకొని

తీరంచేరే దాక

ఆగని కెరటం ఆమె

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు