నువ్వొక మొలకై
నా గర్భంలో చిగురిస్తుంటే
నా కడుపులో భయమొక
సునామీ కేంద్రమవుతుంది.
ఎందుకంటే
నీ ఊపిరి ఇక్కడి నేలను స్పర్శించిన మరుక్షణం నుండి నా చూపులకు తాళం వేయకుండ ప్రతీ గడియతో సహవాసం చేయాలి.
ఆ మరుమల్లెలు
పొద్దూకుతుండగానే ఉదయిస్తుంటాయి కానీ నీ దేహ సుగంధం ఎప్పుడూ
ఉదయాన్ని మోస్తూనే ఉంటుంది.
నీ నవ్వులు
నీ అల్లరి
నీ అడుగులు
గడపకి పుదించిన పసుపు ముగ్గోలే
అందంగా ఉంటాయి.
నీ ఊసులెప్పుడూ
మా గుండెల్లో హిందోళ రాగంను పలికిస్తూ ఉంటాయి.
నీ ఆలోచనలతో ఇక్కడి సగం ఆకాశాన్ని నీవెప్పుడో కప్పుకున్నావు.
కానీ సమానత్వం మాత్రం
నీ దోసిళ్లలో ఒంపిన పాదరసమే కదా!
ఇక్కడ
నీ పుట్టుకే ఓ మారణహోమం
అయిపోతుంటే నా నుండి నిన్నెలా బయటకు తీసుకురమ్మంటావు.