ఏకాంత అంతరంగంలో
కుంచెగా మారిన మనసు
నిశ్శబ్ధాన్ని రంగుగా మార్చుకుంటుంది
హృదయం గీసిన చిత్రంలో...కన్నీటితడి
రంగులు ఇంకా ఆరకముందే
మదిలో..మరో దృశ్యం ఊపిరిపోసుకుంటుంది
ఆకాశంలో ముసురుకున్న మబ్బులు
కొత్తభావాల చినుకుల్ని వర్షిస్తాయి
ఆ హృదయంలోని సుప్తచేతనలో
సప్తస్వరాల సంగీతధ్వనులు..కడలి కెరటాలై
దుఃఖపు తీరాలను తాకుతాయి.
.
కాలం పరుగులోని ప్రతిఅడుగులోనూ
ఒక కొత్తచిత్రం ఆవిష్కరణవుతుంది
చిత్రం కొత్తదైనా..రంగులు పాతవే..
మదిలోని వేదనలు
కొత్తభావాల రంగుల్ని పూసుకుంటాయి
అంతే....
అక్షరాలుగా ఇమడని భావాలు
పరుగులుతీసే చిత్రాలై..మదిలో
కలవరం లేపుతాయి..నిశ్శబ్ధంగా
రంగులన్నీ ఏకమై శూన్యాన్ని సృష్టిస్తాయి
నాటి నుండి నేటి దాకా..నిశ్శబ్ధంగా సాగిన
అరవైయేండ్ల జీవనప్రస్థానంలో
దారులన్నీ చిక్కుముడులే
ముళ్ళతీగలపై పాకిన తమలపాకు తీగలే
ఒక్కొక్కటే మసకబారి జారిపోతున్న
చీకటి రాత్రులే
మాసిపోయిన అక్షరాలతో వెక్కరిస్తున్న
చిరిగిన పేజీలే..
కొత్త ఆశల్ని పొదుపుకుంటూ
కొత్త చిత్రాల్నీ..కొత్త అక్షరాల్నీ కావలించుకుని
ఆనందించడమో
నన్ను నేను శిక్షించుకోవడమో అనివార్యం
నాకు నేను రాతినేలలోకి పయనిస్తూ
ఆ నేలలోని సాహిత్య సుగంధాల్ని
హృదయంలో నింపుకుని..శిలగా తలవంచి
శిల్పాక్షరాలను శబ్ధిస్తూ.. నేను నేనుగా
శూన్యంలో విహరిస్తున్నాను....!