మా రచయితలు

రచయిత పేరు:    పొన్నాల బాలయ్య

కవితలు

రక్తం వోడుస్తున్న ఖడ్గం నీడలో

"అమానిత్వమదంభిత్వమ్  అహింసాక్షాంతి రార్జవమ్"

        :-శ్రీమద్భగవద్గీత, 13వ భాగం క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగ యోగం'

( భావం :-తానేశ్రేష్ఠుడనను భావము లేకుండుట. డాంబికం లేకుండుట .అహింస ,క్షమించు గుణం, మనోవాక్కులయందు సరళత్వము)

 

ఎవ్వరిదో! శవయాత్ర జరుగుతుంది 

తప్పుకొండ్రి  తప్పుకొండ్రి

తాత ముత్తాతల మాయి ముంతలెక్కడో ? తవ్వుకొండ్రి   తవ్వుకొండ్రి

 

రక్తం వొడుస్తున్న ఖడ్గం నీడలో 

భక్తిని పరీక్షించుకునే కాలం

తలకాయలిప్పుడు 

జిట్టి గుమ్మడికాయలై కోట గుమ్మానికి వేలాడాలి

 

 ఎవరక్కడా?

గడ్డం టోపీతో సూటు బూటుతో 

నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుండ్రు

జీవించే పన్ను  జిజియాపన్ను వేసే రాజుల కంటే ఎదుటోని చూస్తే కండ్లల

తేజాబ్ పోసుకున్నంత మంట

 

అగాధపు అంచుల్లో వుయ్యాలలూగే 

అయోమయం సహజీవనం 

 

మనుషులు ఇక్కడా ...!

శిరస్సు భుజాలు తొడలు పాదాల నుండే కదా పుడతారు 

 

 

ఈడనే పుట్టినమంటే 

ఎట్లారా ?నమ్మేది !

 

వేషం భాష కాదిక్కడుండాలంటే 

అంగాంగానికి జాతీయత వుండితీరాలి

 

 ఏమంటావ్....!

జన్మించేటప్పుడే 

రెండు చేతులతో భూమిని మోసుకొచ్చినట్టు

అక్షాంశ రేఖాంశాలు సరిహద్దులు పెట్టి 

భూమధ్యరేఖలు గీస్తావు 

 

అవును కదా !

వలసొచ్చిన సేపోయోనివి 

బతుకొచ్చిన సామ్రాజ్యవాదివి

కాళ్ల కింద నేల లేని కాందిశీకునివి

మోసపు కత్తుల అమ్ములపొదివి

రక్తదాహంతో రగిలే రాతిగుండెవి

 

 ఓహో ...!

మెదళ్లను రంగుల పరదాకు చుట్టేశాడు 

చూపులనిప్పుడు టచ్ స్క్రీన్ కు కట్టేశావు మనుషులకు ఆలోచించేటంత తీరికెక్కడిది ?

 

జిఎస్టి జిడిపి  ఆదాయ వ్యయాలు 

అధిక ధరలు  ఆకలి మంటలు 

నిరుద్యోగం  నిండా అప్పులు 

సవాల్ కర్నేకా ఛాన్స్ నహి హై

 

"హత్ మే స్మార్ట్ ఫోన్ హై

 సబ్  జీయో...జీబర్కే"

 

దేశమంతా కుత కుత వుడుకని 

బతుకులు కుక్కలు చింపిన ఇస్తార్లే

తన్నుకొని తన్నుకొని చావనీ

గాయాల భగభగ మంటకు 

గజ్జళ్ళల్ల గగ్గోడు సలిపినట్టు

మనదంతా మతం చుట్టే తిర్గనీ

 

పిండా కూడుకు ఆశపడే పీతిరి గద్దల గాండ్రింపు

 

అయినా....!

మహా సామ్రాట్ అశోకుడేక్కడ?

బోధి వృక్షం కింద అహింసాయుత

అష్టాంగ మార్గాలను ఇంకా అన్వేషిస్తున్నట్టున్నాడు..

 

ఒక్కసారి ఫోన్ కలపండి

“ఆప్ జిస్ వ్యక్తి సే  సంపర్క్ కకర్నా చాహతే హై

వే అభి జప్తుహై  యా నెట్వర్క్ క్షేత్ర్ సే బాహర్ హై “

నమ్మి నానపోసిన మాటలు

ఎట్లాగు జనం !వాడి పారేసిన ఇత్తార్లే

ఒక్కొక్క ఈకె పీకి యిన్ని నూకలు చల్లితే

అన్నీ మర్చిపోయి మహా ప్రసాదం అని బుక్కేటోళ్ళు

 

 భువనవిజయుడా !

నమ్మి నానపోసిన కీలకొండి మాటలకు

తీర్థం వస్తే నువ్వు గుల్లే మేము సలిలే

 

 వాబ్బో! ఏం వాగ్ధాటి

గంగా జలం కంటే పవిత్రమనుకుంటిమీ

అచ్చం శ్రీకృష్ణ దేవరాయల ఆహార్యం

కవిత్రయానికే వంకలు పెట్టే గాత్రం

ఎన్నెన్నో గ్రంథాల గంభీరధ్యాయనం చేసిన

పండితోత్తములు కదా !

 

మహాసభల మాటలు సుక్కలు సూపెట్టి

పద్యాలు నేర్పించిన పండితులకే గుణపాఠాలు నేర్పినయి

చాణిక్యుడే వుంటే మీ నీతులకు

దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోయ్యేది

 

ఎందుకు  ?మహారాజా

ఏరు దాటినంక తెప్ప తగులబెట్టే వైపు తీరు

భాషాపండితుల  కడుపు కొడితే పాపం కదా నాయనా ...

 

"దేశ భాషలయందు తెలుగు లెస్స "పలికితిరి

తెగులు భాష ఇంగ్లీష్ పీస్ బడులలో

 నోరు ఇగిలించి కొడిజివునం తోటి కొట్టుకుంటుంది

 

 ఈ మట్టిని ముట్టుకున్నావా !ప్రభూ

ఎలా !నవ్వుతుందో మీ ప్రతిభను చూసి

ఆ నింగి వంక జర చూడు !దొర

మీ మాటలను ఎంత పరవశించి వింటుందో!

 

చెట్టు పుట్ట నీరు నిప్పు ప్రకృతంతా

వంగి మీ పాదాలకు ప్రణామం చేస్తున్నాయి

ఆ గడియల కోసం ఎదురు చూస్తున్నాయి

తలావొక్క చెయ్యేసి తమలో కలుపుకోవడానికి

 

ఇంతకు మునుపు ఆయనది పాయిరాల గుట్టల్ల పచ్చలుపచ్చలైంది అహం

 

రా దేవా! మాలు దిగి రా !

బడి పంతుల్లు అంటే మీ బానిసలు కాదు

భవిష్యత్తు నిర్మాతలు

వాళ్ళ వుసురు తలుగక ముందే

మాటలు నిలుపుకోను జర మనిషివై మందిలకు రా!

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు