మా రచయితలు

రచయిత పేరు:    రాధేయ

కవితలు

భయద సౌందర్యం

ఎవరూ లేని ఏకాంతం లో సాంత్వన లేదు

అందరూ ఉన్న ఒంటరి తనం లో ఓదార్పులేదు 

ఒక సామూహిక అస్తిత్వవేదన 

నమ్మకం కోల్పోయిన చూపుతో 

పతనం అంచుల్లో వేలాడుతోంది 

ఒక నాజూకు చేతన 

ప్రేమ రాహిత్యం లో నలిగి పోతోంది 

మర్చిపోయిన ప్రేమలూ,దారితప్పిన బంధాలు, కన్నీటి మసకలో దోబూచులాడుతున్నాయి 

సాధువుల ప్రవచనాలు,మేధావుల విశ్లేషణలు,స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించడం లేదు

పశ్చాత్తాపాన్ని మన్నిస్తూ క్రీస్తు గాయాలింకా 

రక్తమోడుతూనే ఉన్నాయి 

సంఘం శరణం గచ్చామి అంటూ 

బుద్ధుడు భిక్షాపాత్ర పట్టుకొని 

దుఃఖం లేని ఇంటికోసం అన్వేషిస్తున్నాడు

సత్యంవద, ధర్మం చెర, ప్లేకార్డులు పట్టుకొని 

మహాత్ముడు దీక్షాశిబిరం లో కూర్చున్నాడు

వేమన్నలూ, బద్దెనలూ, సామాజిక వ్యాఖ్యానాలు చేస్తూ

మన మధ్యనే తిరుగుతున్నారు 

కాస్తప్రేమ, కాసింతజాలి ,కొంచెం నమ్మకం 

ఎక్కడైతే దొరుకుతాయో 

అక్కడ మనిషనే వాడుండాలి

ఈ లోకంలో మంచిని మినహాయించుకొని 

దర్జాగా బతికెయ్యడం చాలా సులభం

అనుభవాల నేపధ్యాలన్నీ నిప్పురవ్వలై

ఎగిసి పడుతూంటే 

నిద్రకీ మేలుకువకీ మధ్య,

రెప్పలకి అంటుకున్న తడి స్పర్శ 

ఎంతకీ ఆరిపోదు కదా 

దేహం మూల మూలల్లో చిప్పిల్లుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టాలంటే 

ఈ పెదవుల మధ్య ఎంత ఘర్షణ  

విష్పోటనం లో విధ్వంసమైన ప్రాంతాన్ని 

పునర్నిర్మించు కోవచ్చు 

నానాటికీ ధ్వంసమై పోతున్న మనుషుల 

హృదయాల్ని మళ్లీ నిర్మించుకోగలమా 

అని నా సందేహం 

ఈ సంక్లిష్ట స్థితిలో మన భుజం తట్టే ధైర్యవచనాలే  కవిసమయాలు 

పిరికి తనం నుండి ధైర్యంలోకి 

భయం నుండి స్వేచ్ఛలోకి 

నన్ను నడిపించే నా నేస్తమే కవిత్వం!!

సాహిత్య వ్యాసలు

తెలంగాణా మట్టి బంధం  దాసరాజు  "విరమించని వాక్యం" ! 
 

కొన్ని పరిచయాలు స్నేహం గా వికసిస్తాయి 

అవి సాహితీ స్నేహాలైతే పరిమళ భరితమై కొనసాగుతుంటాయి. 

 

సరిగ్గా 19 ఏళ్ల క్రితం చిగురించిన ఒక కవితో నా స్నేహం అవిచ్చిన్నంగా నేటికీ కొనసాగుతూనే ఉంది. 

ఆ కవి దాసరాజు రామారావుగారుసహృదయత మితభాషిత్వం వారి వ్యక్తిత్వం. వారి కవిత్వం "గోరు కొయ్యలు" 2001 లో మా అవార్డు ను గెలుచుకుంది. దాసరాజు గారు అప్పట్లో గజ్వేల్ లో ఉపాద్యాయినిగా పనిచేస్తున్నారు, గోరుకొయ్యలు వీరి తొలి కవితా సంపుటి. 

 

నేను అప్పుడప్పుడే జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ పొంది, అనంతపురం జిల్లా లోని పుట్టపర్తికి అతిసమీపంలో ఉన్న కొత్తచెరువు మండల కేంద్రంలో శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. 

 

నా ఫామిలీ తో పాటు, నా సాహిత్య కార్యరంగం కూడా కొత్త చెరువుకు మారింది.

 

అనంతపురం జిల్లా కేంద్రానికి కొత్తచెరువు 70 km ఉంటుంది. పుట్టపర్తి కి 10 km ఉంటుంది. ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణమే తప్ప, సాహిత్య వాతావరణం కనిపించదు. 

 

నేను సాహసించి తొలిసారిగా కొత్తచెరువులో అవార్డు ప్రధానసభ జరపాలని నిర్ణయించాను. తేదీ ఫిక్స్ చేసి అవార్డు విజేత దాసరాజు రామారావు గారిని కొత్తచెరువు ఆహ్వానించాను.  వారు ఉదయాన్నే కొత్తచెరువుకు చేరుకున్నారు. వారికి పుట్టపర్తిలో రూమ్ ఏర్పాటు చేశాను. ఎందుకంటే అనంతపురం జిల్లాలో చూడదగిన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. బాబాను విశ్వసించే దేశ విదేశి భక్తులతో నిత్యం పుట్టపర్తి సందడిగా ఉంటుంది. 

 

సభ సాయంత్రం ఐదు  గంటలకు.  నా ఆహ్వానంతో అనంతపురం నుండి సాహితీవేత్తలు సింగమనేని నారాయణగారు, ఆచార్య రాచపాలెం గారు వచ్చారు. 

 

నాకు ఊరుకొత్త అయినా నా స్టూడెంట్స్, కొలీగ్స్, స్థానిక మిత్రుల సహకారంతో అవార్డు ప్రధానసభ ఎంతో హుందాగా జరిగింది. 

 

అవార్డు పొందిన "గోరుకొయ్యలు" గురించి ఆచార్య రాచపాలెం గారు, సింగమనేని గారు చక్కగా ప్రసంగించారు. ఇలా జరిగిపోయింది మా 14 వ  అవార్డు సభ. 

 

అప్పటి నుండి దాసరాజు రామారావు కవిగా తన కవితా ప్రస్థానాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. 

 

తర్వాత 2012 లో ‘పట్టుకుచ్చుల పువ్వు' , 2018 లో "విరమించని వాక్యం" తెచ్చారు. 

 

ఈ తాజా  కవిత్వం "విరమించని వాక్యం" గురించి విశ్లేషణ రాసి ముందుగా వారితో నా కేర్పడిన సాహితీ మైత్రిని గురించి వారి పరిచయ నేపథ్యం గురించి ఇదంతా రాయవలసి వచ్చింది.

 

మన కళ్ళముందు పరాయీకరింపబడుతున్న జీవితం, మనుషుల్ని ప్రాంతాల వారిగా, మతాల వారిగా, కులాల వారిగా విభజించి, ఓటు బ్యాంక్ లు రాజకీయాలు నడుపుతున్న వ్యవస్థలో సృజనకారుల పై అణిచివేతలు, ధిక్కార స్వరాలపై నిర్బంధాలు కొనసాగుతున్న వ్యవస్థలో ప్రతిపక్ష వాదిగా, కవి స్వరం శబ్దిస్తూనే ఉంటుంది. 

 

ఉద్యోగానికి విరమణ ఉంటుంది. వృత్తికి విరమణ ఉంటుంది. పనీ పాటకు విరామం ఉంటుంది. అక్షరానికి, శబ్దానికి, భావ సంచలనానికి, వాక్యానికి విరమణ లేదు. సృజన కారుడైన కవికీ విరమణ అనేది ఉండదు. విరమణ జరిగితే జీవన ప్రవాహం ఆగినట్లే , చైతన్య శ్రోతస్విని మూగవోయినట్లే. పాలకవర్గ దుర్నీతిని ఆమోదించినట్లే.  ఇన్ని రకాల వివకలు, అసమానతలు, అసహనాలు, ఆక్రోశాలను ఆకరీకరించిన కవిత్వమే దాసరాజు రామారావు గారి 'విరమించని వాక్యం తెలంగాణా జనని జయకేతనంతో ప్రారంభించి, తెలంగాణా ముఖచిత్రంతో దృశ్యమానం చేసిన 54 కవితలున్న సంపుటి ఇది. కవికి పుట్టి పెరిగిన తెలంగాణా మట్టి మీద మమకారమే కాదు, రాస్ట్రేతర తెలుగు వారిపై ఒకింత కోపం కూడా ప్రకటించి ఉందనిపిస్తుంది.

 

2001 వచ్చిన గోరుకొయ్యలు లో తెలంగాణ జన జీవితం ఉంది. మారిపోతున్న మానవ సంబంధాల పట్ల ఆవేదన ఉంది. 2018 లో వచ్చిన విరమించని వాక్యం లో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో జీవన సంఘర్షణ తాలూకు మారిన రాజకీయ పరిస్థితులున్నాయ్.

" అణగ దొక్కిన చరిత్ర కిప్పుడు

పట్టాభిషేకం

జీవ గంధపు పరిమళం చిమ్మిన యాస కడుపు చూసి, పీట ఏసి

అంబలి పట్టిన పెద్ద ముత్తయిదువ

ఎడ్డీ తనమనే ఎక్కిరింపుల

మూర్చిల్ల జేసిన మల్లినాధుని అక్షరవెలుగు కారంపొడి చీపురు కట్టలే

తరతరాల బూజు, బురుజులను ధ్వంసించిన చేసిన

కొట్లాట ముచ్చట

భూమిలో నిక్షిప్తమైన సాంస్కృతిక నిధుల పొద్దుపొడుపు " పుట..12

సోషలిస్టు భావానికి నిలువెత్తు క్రియా పదమైన వెనిజులా ను కీర్తించారు.

 

మాఘ మాసంలో జరిగే పుల్లూరు బండ జాతర వైభోగం లో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటారు

"లాయిలప్ప కొని భూమికి అరచేతి

గుప్పిటికి తాకిస్తూ ఆడటం

పిల్లంగోవితో తూ తూ రాగాలు పలకటం

ప్లాటిక్ రంగు కళ్ళద్దాల్లోంచీ కండ్లగ రేసుకుంట చూడటం

నరసింహసామిని రా నిన్ను నమలక తింటను రా

 

డ్రైమెటిక్ గా పాడటం

పొగరెక్కిన వేళలే అవి " .... పుట 22

 

మన బతుకుల్లో వాన కాగితపు పడవ లాంటిదే నంటారు కవి . ప్రకృతి వికృతి గా మార్చి మనిషిని మృగంగా తయారు చేసింది ఎవరు ? బతుకుని ప్రేమిద్దాం అంతకంటే మించి కవిత్వాన్ని ప్రేమిద్దాం, జీవితమే కవిత్వ మనుకునేంతగా జీవిద్దామంటాడు కవి. జీవితమే కవిత్వం గా మలుచుకున్న వాళ్లందరు ?

 " ఒక మబ్బు, కన్నీళ్లు కురిపిస్తది

ఒక మేఘం కలల్ని వెంటేసుకొస్తది గుడిసెలు తడిపిన వాన

మహల్లో కురిసిన వెన్నెల

పోలిక కుదర్చలేక

కవి మనసు తంటాలు పడుతుంటది " .... పుట 36

 

కవిత్వమేలా ఉంటుంది ? ఒక ఊహా. ఒకస్పృహ. ఒక భరోసాస్పర్శ. ఒక రహస్యానంతర జిలుగు ధారతో మైమరపించే మేలుకొలుపే కవిత్వ మంటారు.

ఒక ఆకుపచ్చని మొక్క దీవెన ఇలా ఉంటుందట

"పొద్దున్నే పాదు ముందు నిలిచి

నా ' బర్త్ డే ' అని చెప్పుతుంటే

రెండాకులూపుతూ ఆశీర్వదించింది

మొక్క " - పుట 40

 

అమర వీరుల స్థూపం ముందు నిలబడి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటాడు కవి.

అమరత్వం

స్థూపం మీద పాలపిట్ట

మన ఇంట్ల , మన బువ్వ తింటున్నం సరానపడ్డప్పుడల్లా

మిమ్మల్నే తల్సుకుంటున్న .... పుట 42

 

మనది మత ప్రసక్తి లేని లౌకిక వ్యవస్థ అయినను, మనం మతం గురించే మాట్లాడుకుందాం. ఏ ఆత్మ స్పందనల కింద ఏ బాంబు అమర్చి ఉందో, ఏ చరిత్రలు తెర తీయబడుతుందో, అయినా భక్తితో మనం మతం గురించే మాట్లాడుకుందాం అంటున్న కవి.

నాకు అమ్మ ప్రస్తావన వచ్చినా, అమ్మను తలుచుకున్నా గుర్తొచ్చే కవి కవి దాసరాజు రామారావు 2001 లోనే గోరుకొయ్యలు లో ' అమ్మకు క్షమాపణలతో ' అనే కవితను ఎప్పుడు చదివినా కొడుకులకే కాదు అమ్మలకూ కన్నీళ్లోస్తాయి.

భర్తను కోల్పోయిన తల్లి నిస్సహాయ స్థితి లో పట్నంలో కొడుకు దగ్గరికి ఆశ్రయం కోసం వస్తుంది , వారింట్లో పనిమనిషి అవుతుంది. వారింటికి కాపలా కుక్క అవుతుంది.

 

అమ్మ స్థితిని కళ్లారా చూస్తూ కూడా ఏమీ అనలేని కొడుకు మనస్థితిని అమ్మకు క్షమాపణలతో..కవిత రాస్తూ

 

నిలువెత్తుగా ఎదిగిన అమ్మ ముందు మరు గుజ్జంత నేను పూర్తిగా ఓడిపోయాను బతిమాలి గోరుముద్దలు తినిపించిన

అమ్మ చేతులతో ఇప్పుడు పాచి పని చేయించుకుంటున్నాను

ఇంత చేసినా నా నన్ను ఇప్పటికీ అడ్డాల నాటి బిడ్డ వేరా అంటుంది అమ్మ

అందరి ముందు గెలవాలి రా అంటుంది ఒక్క అమ్మ ముందే గెలవలేక పోయాను నేను .... ( గోరుకొయ్యలు నుండి )

ఈ కవిత నాకు పదేపదే గుర్తుకు వస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కవిత మళ్ళీ ఈ కొత్త కవిత్వం " అమ్మ సంతకం " పేరుతో ఉంది.

" అమ్మ సంతకం దర్శించిన

ఆ అపురూప క్షణాన

'ఎట్లావున్నావమ్మా' అని అడగాలనిపించింది .

అమ్మ నీ రుణం గురించి  

ఎన్నడైనా ఆలోచించినా

నువ్వే నాకు ఇంకా గోరుముద్దబాకీ ఉన్నట్లు

అనిపిస్తూ ఉంటుంది

నాన్న పాత్రను , నీపాత్రను పోషించిపోషించీ

అలసిపోయావనుకుంటా

ఏ పూట ఏం మాట్లాడాలో

తెలియని అపసవ్యపు గాళ్ళం

అనుభవం కావాలంటే అమ్మే కావాలి

ఆ స్వర్గంలో అతిధి మర్యాదలతో

హాయిగా ఉండు  

నేను నీ ఆరని సంతకం చివర్న ప్రణమిల్లి సుఖంగానే ... పుట 48

 

ఈ రెండు కవితలు కవికి అమ్మపట్ల అపరాధ భావనతో పాటు, కలిగిన పశ్చాత్తాపం నన్ను కదిలించింది.

నాకు తెలిసి చాలా మంది కవులు వాళ్ళ అమ్మను దేవతను చేసి కీర్తించడం, ఆమె పడిన అష్టకష్టాలను ఏకరువు పెట్టడం , ఆమె వల్లనే తాను ఇంతగా ఎదిగి పోయానని చెప్పుకోవడం తప్ప ఒక కొడుకుగా చరమాంకం లో ఆమె పట్ల తాను చూపిన అనాదరణ, గురించి గానీ, వృద్ధాశ్రమాల్లో వారు గడిపిన దయనీయ జీవితాన్ని గురించి ఏ కవి అయినా నిజాయితీ గా చిత్రించాడా చెప్పండి. చరమాంకంలో అమ్మపట్ల తను, తన కుటుంబ సభ్యులు చూపిన అనాదరణను క్షమాపణలతో వేడుకున్నాడు. తడియారని తల్లి సంతకం ముందు ప్రణమిల్లు తున్నాడు ఈయన.

ఇది గుర్తుచేసుకుంటూ నేను ఆరేళ్ళ కిందట నేటినిజంలో పత్రికలో .... " అమ్మను గురించి రాసే కవులంతా ఆత్మ విమర్శ చేసుకోండి " పేరుతో ఓ సుదీర్ఘ వ్యాసమే రాశాను. ఇలా రాసేందుకు ఈ కవి ఇచ్చిన స్ఫూర్తె నని ఒప్పుకుంటాను. అయితే వ్యాసం చదివిన కవులంతా నన్ను వ్యతిరేకించారు, దూషించారు. అది వేరే విషయం. నిజాలెప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయి గదా.

 

ఈ సారి నదిని పద్యం చేసి గానీ వదలనంటున్నాడు.  జిహ్వ రుచుల కలవాటు పడ్డాక, మనసు రుచులెట్లా తెలుస్తాయ్. సంసారమంటూ ఏర్పడ్డాక ప్రేమ పరిధులు కురచ కాలేవంటాడు కవి.

 

' నేను ' అనే కవితలో తెలంగాణా సాహిత్య సాంస్కృతిక , వైభవ కీర్తి గానం చేస్తాడు, ఒక్క తెలంగాణే కాదు, ప్రతి ప్రాంతానికి తనదైన సాంస్కృతిక, నేపథ్యం కల్గి ఉంటుంది. ఆ నేల, మీద పుట్టి పెరిగిన వారేవారికైనా అది గొప్పగానే ఉంటుంది.

 

మృత్యువును శత్రువుగా చూడడు. స్నేహశీలిగా, ప్రేమమయిగా ఆమోదిస్తాడు కవి.

 

అపురూపంగా పెంచి పెద్దచేసి ఓ అయ్య చేతిలో పెడుతున్నప్పుడు, వారు డాలర్ల దేశం కు వలస బోతున్నప్పుడు తల్లి దండ్రుల పడే మనోవేదన ఇలాగే ఉంటుందా ..

" అమ్మాయి వెళుతోంది.

ఈ భూమినుంచి ఆ భూతల స్వర్గానికి

డాలర్ల పక్కన చేరిన ఆయన సందిట్లోకి

అయ్య చేతిలో తనను పెట్టినప్పుడు

 చేతులతో పాటూ మనసూ వణికింది

అరుంధతి నక్షత్రం చూపించిన వాడు

అమెరికా రమ్మంటున్నడు .... పుట 67

ప్రతి సుఖం వెనుకా ఒక దుఃఖపు జీర లీలగా కదలాడుతూనే ఉంటుందనీ, కవిత్వాన్ని ప్రేమిస్తే కలలో నడుస్తూ మెలకువని చేరుకుంటామంటాడు .

 

ఒక్కసారి కవిత్వంతో సావాసం చేద్దామా ! అలలు ఎగిరిపడుతున్న నది ముందునిలబడి గెలుపుని ఆవాహన చేసుకుంటం

ఒక్కసారి కవిత్వాన్ని రాద్దామా!

కాలాన్ని యుద్ధాన్ని వదిలేస్తం

మనల్ని మనం మరిచిపోతం

ఒకే ఒక్క కవిత్వమై మిగులుతం .. పుట 74

ఎన్నో అరచేతుల ఏకధ్యానపు పొందిక గా, ఎన్నో సబ్బండ వర్ణాల సాంస్కృతిక, అస్తిత్వ ప్రతీక గా, కొలువుదీరిన బతుకమ్మను పదారుకలల కాణాచిగా అభివర్ణిస్తాడు కవి.

 

పెళ్లి పరిచయాలు కమర్షియల్ వేదికల ఆర్భాటాల్ని మనకు పరిచయం చేస్తాడు. కల గనడం మనిషి అద్భుతమైన ప్రక్రియ గా పోల్చుతారు.

 

పెరుకేమో అన్న దాత బిరుదు. అప్పుల కుప్పలు, అవహేళనల దండలు. ప్రభుత్వాలు మారినా రైతు బతుకు లో మార్పును చూడలేం మనం.

రైతే రాజుట

ఏ రాజ్యానికి ఎన్నడు కాలె

రైతు దేశానికి వెన్నె ముకట

నిటారుగా ఎప్పుడు నిలబడలే

చేనుకు చేవ- రైతుకు రొక్కం

పొలం గట్టున పాతిన బోర్డు పరిహాస మాడుతది

ఎవరు ఎంత చేసిండ్రోగని

ఏమి చేస్తర్ గని

 

రైతు బతకాలి

బువ్వ బతకాలి..పుట 89

 

కవి సువర్ణ తెలంగాణ ను కోరుకోవడం లో తప్పు లేదు, అత్యాశ లేదు.వారి అభివృద్ధి నిరోధకులు గా కోస్తా ఆంధ్రులను కారకుల్ని చెయ్యడమే మాకు బాధ కలిగిస్తుంది.

 

ఎందుకంటే ఆంధ్రుల్లో రాయలసీమ వాసులు 60 ఏళ్లుగా వరస కరువులతో , సాగునీరు తాగునీరు లేక అప్పులు, వలసలు, ఆత్మహత్యలతో అట్టుడికి పోతున్న ఈ ప్రాంతంలో 1956 లోనే విద్వాన్ విశ్వం ' పెన్నేటిపాట ' సీమ దయనీయ జీవితానికి సాక్ష్యం కాదా.

 

అప్పట్లో ఆ పుస్తకాన్ని తెలంగాణా రచయితల సంఘమే ప్రచురించింది. ప్రకృతి శాపం, పాలకుల మోసం రాయలసీమ వెనుక బాటు తనానికి గురైందని ఒప్పుకోక తప్పదు.

" రాయలసీమలో వ్యవసాయం కంటే రాజస్థాన్ ఎడారిలో సేద్యమే నయం " అనే సామెత స్థిరపడిపోయింది.

అంతెందుకు ఐదేళ్ల కిందట శ్రీకృష్ణ కమీషన్ తెలంగాణా కంటే రాయలసీమ తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా తేల్చి చెప్పింది కదా మేమెవరితో మొరపెట్టుకోవాలి. అనేక ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడిపే వాళ్లంతా రాయలసీమ వాసులే మరి.

అయినా ఈ కవి కొంత మెరుగు. ఆంధ్రుల పట్ల అసమ్మతి మాత్రమే ప్రకటించాడు.

"కోస్తాంధ్ర కీర్తనలకు

మైమరుస్తున్న రాముణ్ణి తట్టిలేపనీ

కలవరం లేని పోలవరం 

 

కళ్ళజూడనీ "

 

కొంతమంది కవులు సీమాంద్రుల్ని శత్రువులుగా చిత్రిస్తూ కవిత్వం రాయడం నన్ను బాగా కలవర పెట్టిస్తుంది.

"అన్నదమ్ముల్లా విడిపోదాం  స్నేహితుల్లా కలిసుందాం " అంటూ హిత బోధచేసిన వాళ్ళే ఆగర్భ శత్రువులు గా చూడటం వింతగా ఉంది..పుట 95

 

కవి ఆశారాజును పాత బస్తీ షాయరీ పావురంగా  కవిత్వం కోసమే పుట్టిన రాజుగా అభివర్ణిస్తాడు. 

లోకం గుడ్డిదని, సమాజం చెడిందని భావించే వద్దంటాడు. ఆగినచోటే, పదమల్లడం మొదలు పెట్టాలనీ వాక్యం నీరసంగా కూలబడిన వేళ, బలమైన శీర్షికతో బలపరీక్ష పెట్టాలంటాడు కవి.

 

తన ఇంటి లోగిట్లో ఒక పిచ్చుకల జంట స్వేచ్చా ప్రియత్వ ప్రపంచాన్ని వర్ణిస్తూ ..

" కళ్ళు మూస్తే

నా వల్ల కాగితాల నిండా అవే నడుస్తున్నాయి రాజసంగా

కళ్ళు తెరిస్తే

ముద్రితమౌతున్న అక్షరాలై ఎగురుతున్నయి ఆ రెండు పిచ్చుకలకి

గుప్పెడు గింజలు వేయడమంటే

ప్రేమను పంచటానికి

ఒక చిరునామా మిగిలే ఉందని

తెలుపటానికి " ..నంటాడు..పుట 103

కవి జీవకారుణ్య దృష్టికిది. ఉదాహరణం ...

 

కవి దాసరాజు గారు తన బాపు ( నాన్న ) కు ఏకలవ్య శిష్యునిగా మనకు పరిచయం చేసుకుంటూ, లేనితనమో, పేదరికపు మూలమో, బాపూ లేని తనమో, తానిచ్చిన శరీరంలో అక్షరమై వెలుగుతున్నానని కాసింత గర్వపడుతున్నాడు.

" బాపుకు నేను ఏకలవ్య శిష్యుణ్ణి . పట్టుకోడానికి చిటికెన వేలు చిటికెన వేలేదని అమ్మను అడిగానో లేదో, పగిలిన పలకమీదే రాయడ మందుకో, చిరిగిన చెడ్డీలకు మాస్కలెందుకే యడమో, భాస్కర్ ఉన్నోళ్ళ లేనోళ్ల ఇండ్లల్ల వంటల పొయ్యి లేసి , ఇచ్చిందేదో తెచ్చుకునే ఖర్మే ఎందుకు పట్టిందో, అర్ధం కానట్టు , మరోసారి అయినట్టూ , లేని తనమా ? తను లేని తనమా ? పెద్దరికపు బాబు లేని తనమే పేదరికపు మూలం " .... పుట..122

 

చివరి కవితగా ..

తెలంగాణను కలగనీ

తెలంగాణ ను గెలవాలనీ 

తెలంగాణ గా బతకాలనీ

నా గొడవ కాళన్న ను యాది చేసుకున్న కవిగా , అభినందనీయుడు ఈ కవి.

 

కవిత్వం మొత్తంలో, తెలంగాణా జీవద్భాష, జీవన పరిమళం, తెలంగాణ వైతాళిక ఉద్దీపనల తాలూకు గతం, వర్తమాన , భవిష్యత్తరాలకు పరిచయ వ్యాఖ్యానం ఈ కవిత్వం.

 

తెలంగాణా పట్ల అపారమైన ప్రేమేగానీ, కొంతమంది వీర తెలంగాణా ప్రేమికుల్లాగా సీమాంధ్రులపట్ల ద్వేషభావం నా కన్పించలేదు.తనదైన భావనల్లో స్పష్ట వైఖరినే ప్రదర్శించారు.

 

నాలుగైదు కవితలు పేలవంగా విన్పించాయి.  వాటిని వదిలేసినా కవిత్వ సమగ్రతకు ఏ మాత్రం భంగం కలగదు . గోరుకొయ్యలు నాటే కవిగా, కంటే " విరమించని వాక్యం " కవిగా విషయ వైవిధ్యం పెరిగింది. ఆర్థత కాస్త కొరవడిందని చెప్పాలి. అది రాష్ట్రం విడిపోక ముందు వచ్చిన కవిత్వమైతే ఇది విడిపోయాక వచ్చిన కవిత్వం గనుక విషయ విస్తరణ పెరిగి మట్టిదీపాలైన తెలంగాణ వైతాళికుల ఉద్దీపనగా "బంగారు తెలంగాణ" ఆకాంక్షగా కొనసాగింది.

విరమించని వాక్యాలతో, తెలంగాణా జీవన వైవిధ్యాన్ని అర్ధవంతం గా వినిపించిన కవిమిత్రుడు దాసరాజు రామారావు గారిని మనసారా అభినందిస్తున్నాను. 

 

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు