మా రచయితలు

రచయిత పేరు:    డి. కుమార స్వామి రెడ్డి

కవితలు

నాజీల నింగి నీడన కాందిశీకులు

బహుశ ఈ మహా నగరంలో

సుమారు కోటి జీవులుండొచ్చు

కొందరు ఆకాశ హర్మ్యాల్లో నివసిస్తే

కొందరు కలుగులో వసిస్తున్నారు

అయినా మనకింత చోటు లేదు

ప్రియా, అయినా మనకింత చోటు లేదు

 

ఒకప్పుడు మనకో దేశముండేది

అంతా సుందరంగా బంధురంగ వుండెదని

మురిసి పోయాము

విశ్వదర్శినిలో అది ఇప్పటికీ కన్పిస్తూనే వుంది

మనమిక అక్కడికి వెళ్లలేం

ప్రియా, మనమిక అక్కడికి వెళ్లలేం

 

మన పల్లెలో గుడి ప్రక్కన పున్నాగ వృక్షం

ప్రతి వసంతంలో చిగురిస్తుంది , పుప్పిస్తుంది .  

కానీ మన పాత పాస్పోర్టులు ఆ పని చేయలేవు

ప్రియా, పాత పాస్పోర్టులు ఆ పని చేయలేవు

 

కౌన్సిల్ అధికారి బల్లగుద్ది మరీ చెప్పాడు  

పాస్ పోర్టు లేనట్లైతే మీరు మృతజీవులు "

కానీ మనమింకా బతికేవున్నాం

ప్రియా, మనమింకా బతికేవున్నాం

 

కమిటి వద్దకు వెళ్లాను కుర్చీ చూపారు

కూర్చోమన్నారు పై ఎడు వెళ్లిపొమ్మని

నమ్రతతో సెలవిచ్చారు

కానీ మనమీనాడు ఎక్కడికి వెళ్లాలి ?

ఒక బహిరంగ సభ కెళ్లాను

అక్కడ వక్త ఇలా అన్నాడు  

ఈ రోజు వాళ్లను అనుమతిస్తే

వాళ్లు మన నోటికాడి కూడు లాక్కుంటారు  "

అతడు మాట్లాడింది

నీ గురించి నా గురించి  

ప్రియా, అతడు మాట్లాడింది

మనలాంటి కాందిశీకుల గురించి

 

నింగిలో పిడుగు గర్జన విన్నట్లనిపించింది

అతడు హిట్లర్ . .

ఐరోపా నుద్దేశించి అంటున్నాడు

వాళ్లు కచ్చితంగా తప్పని సరిగా చావాలి "

అతడి మనసులో వున్నది మనమే

ప్రియా , అతడి మనసులో వున్నది మనమే

 

గుంజకు తాడుతో కట్టిన

పెంపుడు కుక్కను చూశాను

తెరవబడిన తలుపులోంచి

పిల్లి పిల్లను యజమాని లోనికి రానివ్వగా చూశాను

కానీ అవేవి జర్మన్ యూదులు కావు

ప్రియా , అవేవి జర్మన్ యూదులు కావు

 

హార్బర్ కెళ్లి దిగువన రాయిపై

స్వేచ్ఛగా వున్నట్లు నిల్చున్నాను

చేపలు స్వేచ్చగా ఈదడం చూశాను

ఇది అంతా జరుగుతోంది

నా పాదాలకు పదడుగుల దూరం లోపే

ప్రియా , పదడుగుల దూరం లోనే



అడవి గుండా నడుస్తూ

చెట్టల్లో పక్షులను చూశాను

వాటిల్లో వాటికి మన మనుషులలో వలే

రాజకీయాల్లేవు , నాయకుల్లేరు

అవి స్వేచ్ఛగా సరళంగా పాడున్నాయి

వాళ్లది మానవ జాతి కాదు

ప్రియా , మానవ జాతి కాదు

 

స్వప్నిస్తూ వేయి అంతస్థుల

భవంతిని చూసాను

వేయి కిటికీలు వేయి తలుపులు

అందులో ఒక్కటి కూడా మనవి కావు

ప్రియా , అందులో ఒక్కటి కూడా మనవి కావు

 

కురుస్తున్న మంచులో

ఒక విశాల తలంపై నిల్చున్నాను

పదివేల సైనికులు బాతులలా*  కవాతు చేస్తూ

వెనక్కి ముందుకు నడుస్తున్నారు

వాళ్లు నా కోసం , నీ కోసం వెతుకుతున్నారు

ప్రియా , వాళ్లు నా కోసం , కోసం వెతుకుతున్నారు

(W . H . AUDEN : Refugee Blues కవిత స్పూర్తితో Goose step March : నియంతలు ఇష్టపడే సైనిక కవాతు . . . 1994 తరువాత చాలా దేశాలు ఈ కవాతును ఉపసంహరించుకొన్నాయి )

ఆశ ఓ సూర్యోదయం

భూమి చూట్టూరా క్రమ్మిన

చిక్కటి చిమ్మ చీకటి..

రాత్రి మత్తు రెప్పలపై

నిర్వేదపు రెక్కలతో

కాలం జోగుతున్న వేళ

వెన్నలనూ వెలుగునూ

దిగమింగిన గాడాంధకారం

ఓ విలయ లయల నిశీవలయం!

హోరు గాలిలో బ్రహ్మాండమంతటా

శివాలెత్తిన నిరాశ ఝోష!!

 

రాళ్ళ గుండెలను పిండిచేసి

విరుచుక పడే కడలికెరటాలు

భీభత్సరసాన్ని ఓపాసనబట్టి

విరబోసుకున్న కేశాపాశాలతో

భూమండలాన్ని అలుముకుని

కరాళదంష్ట్రలతో డస్సి

విహ్వల నృత్యములో

విరాజిల్లుతోంది రాత్రి!!!

 

నిస్తేజంలో ప్రకృతి సమస్తం

నిద్రాణమైనవేళ ల

దేనిని లెక్కచేయని ధిక్కారంతో

ఓ ఒంటరి మిణుగురు

ఒక తుంటరిలా నర్తిస్తూ

నిర్లక్ష్యంగా కాలాన్ని ఈదుతూ

ఓ పతంగంలా ఎగిరింది!!!

అతిలిప్తకాలం తన కాంతిపుంజాల

ఉజ్వల సాంగత్యం పంచి

గాలి అలలపై ముందుకు సాగింది!!!

 

రాతృలలో కెల్లా భయంకరమైన

గాడాంధకారపు రాత్రి ఒడిలో

ఒంటరిగా నన్ను వీడి వెళ్తూ

తన మిళమిళల వెలుగు రవ్వల

"ఆశ" విత్తనం నా ఎదలో పొదిగింది

చీకటికోరల కాటుకు

తలవాల్చని నేను

మిణుగురుతో ఉన్మిలనమై

తన సదాశయాన్ని తలదాల్చాను!!!

 

దావానలాలను కార్చిచ్చులను

ఒడి(సి)పట్టి ఎదదాల్చి

ఆటుపోటులనూ, అలజడులనూ

తన అలలజడిలో ప్రకటిస్తూ

అలవాటుగా విర్రవీగుతూ

విరిగిపడ్తున్న సముద్రపు అలలకు

ఎదుట దివిటీలానైనా దీటూగా

ఇసుకలో పాదాలను లంగరువేసి

ప్రాచీరేఖ పైకి చూపు సారించాను!

 

దిగ్దిగంతాల్లో నిండైన

 ఓ అద్భుతం ఆవిష్కృతం!!

వేనవేల వెలుగు రవ్వలు పొదిగిన

కోటిరేకలతో అలలపై తేలుతూ

దిగంత కుడ్యంపై

"ఆశా"సుమమై వికసిస్తూ సౌరకాంతులతో విచ్చుకున్న

ఉదయబాలుడు సూర్యుడు!!!

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు