మా రచయితలు

రచయిత పేరు:    పసునూరి రవీందర్

కవితలు

దేశం ఇప్పుడొక డిటెన్షన్ క్యాంప్

తల్లి వేరు తెగనరికే రాబందుల రాజ్యం
నీడను కూడా అనుమానించే
శాడిస్టుల పాలన

భిన్న జాతుల సమూహాల
తహజీబ్ లకు గోతులు తవ్వుతున్న దృశ్యం
భిన్నత్వానికి గోరీలు కడుతూ
కాషాయ ఏకత్వ చెదలు

మతం విషపురుగై తొలుస్తున్న సందర్భం !

నేనంటే సర్టిఫికెట్ మాత్రమే కాదు
తరాల మట్టి వారసత్వం కదా
నాకిప్పుడు నీ నంబర్ ప్లేటెందుకు
మీరిచ్చే తత్కాల్ గుర్తింపులేమిటి ?
మెడలో ఈ సొమ్మరోగపు బిల్లలెందుకు ?

మనిషంటే చరిత్రని మరిచి
కాగితాల కంప్యూటర్ లెక్కలతో
దేశపు పేగుబంధానికి నిర్ధారణలా ?

మూర్ఖుడా . . . నువ్వెప్పుడైనా అడవుల
ఆవలి ముఖాలను చూశావా ?
మైదానాల్లో . . . . బతుకంతా వలస పక్షియై బతికే  

దేహాలను ఎప్పుడైనా గమనించావా ?
యిల్లే లేనివాడికి నీవిచ్చే సర్టిఫికెట్

దేనికి పనికొస్తుంది

సంచారమే బతుకుదెరువైన చోట
నీ జిమ్మిక్కుల పౌరసత్వబిల్లు
ఒక చెల్లని పైసా !

పరాయి గుర్తింపు పేరుతో
ఇది వేలయేండ్ల చరిత్ర మీద
నీది కనిపించని దాడి

ఎక్కడి నుండి ఎటు పయనిస్తున్నాం ?
అంతటా గోడలు కట్టే దళారీలు
మనుషులను గుంపులు గుంపులుగా
విభజించే కుట్రదారులు

ఒక్కతల్లి బిడ్డలకు డీఎన్ఏ టెస్టులు
చట్టసభల్లో ఉరితాళ్ల తయారీ
రాజ్యాంగం మీద రామభక్తుల అత్యాచారం

బాధ పెట్టడమే బడిపాఠమైనోళ్లకు
కుమిలిపోతున్న మనసుల
మూలుగులు మాత్రం ఎలా వినబడతాయి

దేశమిప్పుడు ఒక డిటెన్షన్ క్యాంపు
కాళ్లకింది నేలకు కసాయి శీల పరీక్ష 
 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు