నేను రోజూ
వాకింగ్ వెళ్ళే దారి పక్కన
మొన్న కురిసిన తొలకరి జల్లుకు
రాగుల చేను మొలకెత్తి నవనవలాడుతోంది
ఆమె తన చేతి గాజుల గలగలల చప్పుడుతో పక్షుల్ని పారద్రోలుతోంది
అప్పుడే పెరికిన వేరు శనాగ కాయల్ని
నాకు పెడుతూ ఆమె నవ్వినపుడు
ఎంత పారదోలినా
పక్షులు తమ కిలకిలరావాలతో
ఆమె చుట్టే ఎగురుతున్నాయి
చాలా రోజులయ్యాక నేనే మళ్ళీ
అదే దారంతా వాకింగ్ కు వెళ్ళినపుడు
ఈ సారి వర్షం కురిసిన జాడలేదు
దారి పక్క చేలలో సమాధులు మొలిచాయి
ఆమె ఓ సమాధి ముందు
దీపం వెలిగించి రెండు చేతులా నమస్కరిస్తోంది
ఇప్పుడు చేతి గాజుల గలగలల శబ్ధం లేదు
పక్షులు అక్కడా ఇక్కడా
వేటినో వెతుక్కుంటున్నాయి
నేను ఎప్పటిలాగే వాకింగ్ కు వెళుతూనే ఉన్నాను
కంచెకు అవతలి వైపు చేల నిండా
ఇండ్ల ప్లాట్లు మొలిచాయి
హద్దులుగా ఎర్రటి రంగు పూసిన రాళ్ళు పాతారు
ఆ స్థలములో రోడ్లు వేశారు
విద్యుత్ స్తంభాలు అక్కడక్కడ వెలిశాయి
తెల్లటి కార్ల లోంచి
బాగా బొజ్జలు పెరిగిన మా రాజులు దిగుతున్నారు
కంచే పక్కన కూచుని ఆమె ఏడుస్తోంది
ఎగదన్నుకొని వస్తున్న దుఃఖాన్ని
చీర కొంగుతో అదిమి పట్టుకొంది
విద్వంసమై పోయిన సమాధుల ఆనవాలు
గుర్తుపట్టలేక ఆమె
నాతో ఓ మాట కదిపింది
ఇప్పుడక్కడ పక్షులే జాడే లేదు
అన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయో !
మొన్న నేను వాకింగ్ కు వెళ్ళినపుడు
అక్కడ ఒక్కటొక్కటిగా ఇండ్లు మొలిచాయి
కొత్తగా కట్టబడిన కాంపౌండుకు ఇటువైపు
ఇప్పుడు పక్షుల స్థానంలో
ప్లాస్టిక్ కవర్లు ఎగురుతున్నాయి
అసలు ఆమె ఎక్కడా కనిపించలేదు