మా రచయితలు

రచయిత పేరు:    కవితశ్రీ

కవితలు

చల్లబడ్డ రక్తం

సెల్లుఫోను సొల్లుకబుర్లతో
ఉడుకు రక్తం చల్లబడిపోయింది
అంతర్జాలం బూతుదృశ్య వీక్షణతో
ఆవేశం ఆవిరైపోయింది
చచ్చిన పాములు, జీవశ్చవాలు 
బాధ్యత లేదు 
హక్కు లెరుగరు
పోరాటం పదమే తెలియదు
ఆల్దీ క్రెడిట్ గోస్టూ గ్లోబలైజేషన్
తిట్టితే తాపం లేదు
కొట్టితే కోపం రాదు
పెట్టితే గుడ్డెద్దులా తింటూపోవడమే
చెప్పితే గంగిరెద్దులా తలలాడించడమే
వీళ్ళ నేమైనా అన్నావో
నీవే పాపభీతిలో పడి చస్తావు
పోరా అంటే ఉరకలు తీస్తారు
రారా అంటే పరుగెత్తి వస్తారు
గోబీ కోసం రూపీ ఇస్తే చాలు
గులాములై పడి ఉంటారు
చేతికి చరవాణి ఇస్తే చాలు
వారాలైనా కిమ్మనకుండా

చీకటిగదుల్లో పడుంటారు
గొప్పంతా ఘనత వహించిన కార్పోరేట్లదే
వీళ్ళు అభినవ ఋష్యశృంగులు
మోరలు సాచి 
ఆడతనం వాసన చూడ్డానికి
చిత్తకార్తె పోతుకుక్కల్లా వెంటబడి 
సొంగ కార్చి కార్చి
ఊరి ఊరి నీరుగారిపోయారు
నిలువునా జావగారిపోయారు
వీళ్ళు అష్టవిధ నాయికల్లో అభిసారికలు
రెండు మాటలు ఎంగిలి పడ్డానికి 
ఎదకొచ్చిన ఆవుదరుపుల్లా

తొక్కుళ్ళుబడుతున్న కోడిపెట్టల్లా

మగతనాన్ని వెంబడిస్తూ
తిరిగి తిరిగి నీరసించిపోయారు
ఫీజు రీయెంబర్సు పుణ్యం కొద్దీ
నిరుద్యోగభృతి దాతృత్వం వల్లా
ఆదాయవ్యయాలకు అతీతులైపోయారు
ఉంటే తింటారు
లేదంటే పస్తులైనా పడుంటారు
కారణాన్వేషణ కలనైనా కనబడదు
తిరుగుబాటు పదం నిఘంటువుల్లోనే లేదు
ప్రపంచీకరణ మాయా జూదంలో
కార్పోరేట్ల కంత్రీ గాలంలో
అధర్మం అభౌతికదేహి
అన్యాయం అదృశ్య శక్తి
ఇప్పుడు అంతా చీకటి
ఆ చీకట్లో 
ఆలోచన అడుగంటి పోయింది
ఆవేశం ఆవిరైపోయింది
ఉడుకు రక్తం చల్లబడిపోయింది 
ఉష్ణశక్తి జనించక యవ్వనమంతా చచ్చిపోయింది

సమీక్షా సమయం

విశ్వం వినువీధుల్లో ఎన్నో వేగుచుక్కలు    

చీకట్ల డొక్కలు చించి డోలు కొట్టలేదా?

ఎర్రటి నెత్తుర్లు చిందిస్తూ    

బుర్రల పంచలపై వెల్లలు వేస్తూ

తిమిరకుడ్యాలపై తైలవర్ణాలు రచిస్తూ 

వెలుగుల రహదార్లు పరుచుకుంటూ  

కోట్ల కాంతిసంవత్సరాలు పయనించలేదా?

ప్రభవించి పయనించి పయనించి

ఎంతో ఒనగూడిపోయింది

ఎంతో ఎదిగిపోయింది అనుకుంటాం గానీ    

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే  

ఇన్నాళ్ళూ చేసిన పయనం

అంతా దిగ్గున మేల్కున్న స్వప్నవాస్తవం  

దారులన్నీ కటికచీకట్లే   

అంతటా తిమిరకోలాహలమే  

ఇదివరకటి నడచినదంతా వృథా మిథ్యాపర్వం  

మిణుగురుపురుగు చేసిన దిగ్విజయయాత్ర

ఏళ్ల తరబడి ఈది బావికప్పు చేరిన గమ్యం   

అడుగడుగునా నిశీధిభామలు

మర్లింటి సూరుకింద నిలబడి

వయ్యారంగా సరసాల వాసాలు వేలాడుతూ    

పెదవి కొరికి మూ...’ అని కవ్విస్తుంటే

కాంతి ఏకపత్నీవ్రతం ఎలా నిలుపుకోగలుగల్దు?

యోజనాలు తవ్వి వెలికితీసిన వెలుగుదీపం  

గాలిలో అల్లాడుతూ కొడిగడుతుంటే

యుగయుగాలు యుద్ధం చేసి తరిమికొట్టిన చీకటి   

సునామీ సంద్రమై నాల్కలు కోస్తుంటే  

వేగుచుక్కల శక్తికి ఎప్పుడూ పరీక్షా సమయమే     

జయాపజయాల మదింపుల సమీక్షా సమయమే

 

                                                                    

కథలు

ఆడతనం

ముల్లీలగ్గారి కిట్టమ్మతో ఒచ్చిన బెడద ఏందంటే . . . ఆ పాపను ఎబ్బుడూ 'కిట్టమ్మా!' అనే పిలల్ల, ఇబ్బుడు... అనమగారి కట్టిగోడు ఉండాడు. ఉండాడా ! వానికి 'డామోడు' అని మారు పేరు ఉండాది. వాని 'ఒరే డామిగా!' అని పిలచ్చు. మా రెడ్డి గోడే ఉంటాడు. వానికి మెల్లకన్ను ఉండాది. వాని 'ఏంర్యా గుడ్లో డా!' అని పిలచ్చు. ఇంగ వంకలో రామన్నగారి నరిసిమ్ములు ఉండాడు. వాడు ఉత్తారెడ్డి గారి ఎనుం మాదిరి నల్ల...గ ఉంటాడు. వాని 'ఒరే మసోడా!' అని పిలచ్చు. ఆడోల్లనే తీసుకున్యా రెడ్డెమ్మత్త ఉండాది. ఆయమ్మను గుడా మారు పేర్తో  ' మ్మోవ్ ! పంగనామాల పతివర్తా...!' అని పిలిసి, ఆయమ్మ ఉండు నా బట్టా" అని సుట్టింట్లోకి బొయ్యి, పరక్కట్ట ఎత్తకచ్చే లోపల ఎగిసి గెంతేసి ఆ పక్కన్యాడా పత్తా ల్యాకుండా ఉరకచ్చు.

కిట్టమ్మ సంగతి అట్లగాదే. కిట్టమ్మకు పెద్ద సొట్టేందీ లేదు. అట్లని ఆ పాప పెద్ద అందగత్తీ గాదు. పిలకెంటికులు, బుడిగి దూడ మాదిరి సద్ది మగము, పిల్లి మాదిరి దొంగ కండ్లు ఆ పాపను జూస్తే గిచ్చబుద్దీ, గిల్లబుద్దీ ఐతుందేగిని అదేపనిగా చూడబుద్ది గాదు. అందువల్ల కట్టమ్మకు మారు పేరేందీ కుదర్లా. పోన్లే 'కిట్టమ్మా!' అని పిలుస్టాంలే అంటే ఆ పాప నాకంటే పెద్దదీ గాదు. నాకంటే రొండు మూడేండ్లు చిన్నదైపాయ. ఐనా ఊరికే సప్ప...గ కిట్టమ్మా! అని పిలిస్తే ఏమంత బాగుంటుంది. నోటి ఉలవరమూ తీరదు. న్యాలికి జిల గూడా తగ్గదు.

ఈ మజ్య కిట్టమ్మ కొంచిము మార్తాంది. ఆ పాప రెయిక్క జాం చెట్టు అందాలు ఒస్తాండాయి. ఇబ్బుడిబ్బుడే అవి దాలిమ్మర చెట్టు అందాలుగా మారి పాతాండాయి. అందుకేనేమో ఆ పాపను చూసినబ్బుడంతా ఇంగా చూడల్లనీ, ఆ పాపకు ఆనుకోని కుచ్చోవల్లని అనిపిస్తోంది.

ఒగనాపొద్దు పొలికిమాని కింద ఇసకలో కండ్లే మూసాట ఆడతాండాము. నేనే దొంగోని. నా కండ్లకు రూంచెం గూడా కనపడకండా గెట్టిగా టువ్వాల గట్టినారు. అందురూ దాంకోని ఉండారు. కొందురు ముక్కు గిల్లి, నేను చేతులు జాంపి పట్టుకునే లోగా దొరక్కండా పూజాపలే కట్టు జారిపా తాండారు. కొందురు చెవి నులిపి, కొందురు జుట్టు పీకి, కొందురు ముడ్డిమీద తన్ని ఉరకతాండారు. నేను గ్యాల్లోనే చేతులు పుటుకుతా ఆ...మ్ , ఆ...మ్ "అంటా ఒగరన్నా దొరక్కపోతారా! అని ఎతక తాండా.. రూంచేపులుకు నా రొండు స్యాతలకు ఏంటివో రౌండు సల్లగ, మెత్తగ తగిల్న్యాయి. ఎవురిదో నిట్టూర్పు. అబ్బ...! ఎచ్చగ తగిలింది.

ఏం రాగము సీనా నీకూ..." అన్యారు ఎవురో, ఎవురో గాదు, అది కట్టమ్మ గొంతే. అవునూ...కిట్టమ్మ అట్లాటలో లేదు గదా! ఇబ్బుడెట్టొచ్చిందబ్బా...?" అనుకుంటా టువ్వాల పీకేసి చూసినా. ఇంగేముండాది. దాలిమ్మర చెట్టు! అదే కిట్టమ్మ, దాలిమ్మర కాపంతా నా రొండు స్యాతల్లో ఉండాది. నాకుమాతరము జడుపు ఎత్తుకున్యాది. చేసింది గబ్బుపని గదా! ఎగిరిపడి, గబుక్కున కవైప్పలెత్తి, పుటుకు పుటుకుమని పులకరిచ్చి చూస్తే కిట్టమ్మ తలకాయి మింద ప్యాడతట్టి, రొండు స్యాతలో దాని పట్టుకోని దిగులుగా కిట్టమ్మ. వాల్లమ్మ గాన కొట్టిందేమో!

ఆఁ ఏంల్యా. ఏంల్యా. మేము గుడ్యాట ఆడుకుంటాండాము" అనేసి ఉరికెత్తినా, అగ్గిరామన్న గారి ఇంటి మొటుకులేకి పొయ్యి ఎనిక్కి తిరిగి చూస్తే కిట్టమ్మ నగతా నగతా పాతాండాది పేడకాల్ల తట్టెత్తుకోని దిబ్బకల్ల. ఆ పాప ఎందుకు నగతాందో నాకర్తం గాలా.

ఒగనాడు నేను, డామోడు బోడెన్నగారి ఇంటి ముందర కంజు మింద కుచ్చోండాము. కంజంటే అది మావూరు బడికి చుట్టూరా కట్టిండే రాతికంజు. ఒరేయ్ మాండ్లోల్ల సీనా!" అని ఆ ఈది కొన్నుంచి ఒగ ఇనసొంపైన పిలుపు ఇనొచ్చింది. ఆ పక్క తిరిగి జూస్తే ఆ ఈది సివర కొండకిందోల్ల ఎంగటేసు గారి ఆడబిడ్లు రొండు ఉండాయిలే. అవి వాల్ల మేకలే కట్టు కర్రీ....గ ఉన్యా చూసేదానికి రూంత మినమినా తనతనా అంటాంటాయిలే. దాండ్లలో చిన్నది ప్రేమి ఉందే! దాని పిలుపది. ఏమ్మే కొవ్వా!" అన్యాఆ కర్రి ప్రేమి ఒయ్యారంగా ఒగ నగువు నగి పొడువు పాపన్నగారి ఇంటి దొడ్లోకి పరిగెత్తింది. మా అట్లాటల్లో మేం బన్యాము. అది మల్లా ఈదిలేకి ఒచ్చి 'రేయ్" అన్యాది. ఏమ్మే పొసరమా!" అన్యా. అదిమల్లా పాపన్నగారి దొడ్లోకి పరిగెత్తింది. ఈ సారి మల్లా ఈదిలేకి ఒచ్చి రేయ్" అనింది. ఈ గబ్బుదాంతో మనకేంపన్లే అని నేను చూల్లా.

అది ఈసారి ఒరేయ్ చూర్రా ! " అని అరిసింది. ఆ పక్క తిరిగి చూస్తే ఇంగేముంది . ఆది ఊర గొండ కల్ల మల్లుకోని కుంచిలిగుడ్డ పైకికి మాకు ముడ్డి చూపిస్తా. కాల్ల మజ్యలో నుండి మమ్మల్ను తొంగిచూస్తా, న్యాలికితో అల్లాడా...ల్యా ! అవ్వావ్వా...వ్యా ! అని ఎక్కిరిస్తా , నగతా ఉంది .. దాని కర్రి ముడ్డి చూసేలకో బొగ్గిలి కాన్నించి తన్నకచ్చింది వాంతి . " తుపూ " అని గెట్టిగ ఉంచినా. అది మల్లా కిలకిలానగతా పాపన్నగారి దొడ్లోకి పరిగెత్తింది.

ఈ సారి మల్లా రేయ్ అనింది. తిరిగి చూస్తే మల్లా అదే చూపడం. కానీ ఈ సారి చూపిస్తాండేది ప్రేమి గాదు. వాల్లక్క, మల్లా తువూ" అన్యా గినీ ఆ తుఫూలోనే నగువు గుడా కలిసింది. ఇంగ అదోగ తమాసా ఐపొయ్యింది. ఒగసారి చిన్నది. ఒగసారి పెద్దది. ఒచ్చేది. కుంచిలి ఎత్తేది, ముడ్డి చూపిచ్చేది అయోల్లో...ల్యా ! అవ్వావ్వా...వ్యా ! అని ఎక్కిరిచ్చేది. నగేది, ఉరికేది. ఇంగ నేనూ, డామోడు జూడు పడిపడి, నగి నగి సహిందాము. ఇట్ల మేం నగతా ఉంటే ఏందబ్బా అని కిట్టమ్మ ఆడికి ఒచ్చి చూసింది. చూస్, " తుపూ గబ్బు లంజలు. చూపిచ్చే దాండ్లకైనా సిగ్గుండల్ల. చూసే వాల్లకైనా సిగ్గుండల్ల " అనేసి ఎల్లిపాయ . కిట్టమ్మకు వాల్లిద్దురు దగ్గరి బందుగులు. చెల్లిలు వరస. ఇంతలో యాన్నుంచి ఒచ్చిందోగిని ఆ పిల్లముండ్ల వాల్లమ్మ మల్లమ్మత్త ఒచ్చి జులుకు బర్ర తీసుకోని "తుపూ నా సొయితుల్లాలా!" అని చెరు రొండు పీకులు పీకింది. అవి రొండూ అల్లల్ల...మని ముడ్డు గీక్కుంటా ఇంట్లోకి పరిగెత్య. అది జూసి మేము పకపక నగతా ఉంటే మల్లమ్మత్త తుఫూ నా బట్టకున్నల్లారా ! అవంటే పిల్లముండ్లు. అవి సిగ్గిడిని పెట్టి ముడ్డు సూపిస్తా ఉంటే మీరు తమాసా జూస్తాండారా! ఉన్నండి" అని జులుకుబర్ర ఎతుకోని మారెమ్మ ఒచ్చినట్లు వస్తోంది. ఇంగజూడు నేను, డామోడు మా ఈదిలేకి ఉరుకో ఉరుకు.

ఒగనాపొద్దు కిట్టమ్మ వాల్లింటి పంచలో ఎందుకో బండి మక్కిరి బోర్లిచ్చినారు. దాని లోపలనే కిట్టమ్మ ఉంది. ఒరే...! " అని ఆశ్రీకం పడి దగ్గిరికి బొయ్యినా. లోపల ఒరిగెడేసి , దాని మింద కానగాళులు పరిసి, దాండ్లమింద దుప్పటి గప్పుకొని ఏం కేలీ ఇలాసంగా ఉందో కిట్టమ్మ.

ఐ...నేనూ వస్తా. లోపలికీ..." అని అడుక్కున్యా. చీ . . . మగోల్లు రాగూడదు " అనింది కిట్టమ్మ, “ అబ్బా అట్లాడుకునేదానికి ఎవురైతే ఏమి " అని అన్యా. ఇంతలో లచ్చుమత్త ఇంట్లో నుంచి సంగటి బోకి ఎత్తుకోని బచ్చల్లోకి బోతా నా యవ్వారం జూసింది.

" తుపూ . . . గబ్బు నా బట్టా ! ఎదిగి బయటపడిండే ఆడబిడ్డ మక్కిర్లోకి పొయ్యి అట్లాడతావా ? తాలు . పరక్కట్ట తెస్తా " అని గబుక్కున ఇంట్లేకి పొయ్యింది. నా కెందుకో బయమేసింది. ఉరికితీ . . . మా యింటికి. అమ్మ సద్ద సంగటి చేసేసి , తెద్దిగ తీసుకోని కూరటకలో పుల్లగూర ఎనుపుతా . . . ఉండ్య . నేను గెస పెడతా పరిగెత్తి పొయ్యింది జూసి, “ ఏం నాయినా అట్లోస్తాండావు ? " అనింది అమ్మ.

చూడుమా ! నేను అట్లాడుకుండేదాని కోసము కిట్టమ్మ దగ్గరికి పాతాంటే ముల్లీలగారి లచ్చు మత్త తరుముకుంటాంది " అంటి. ఎందుకూ . . . ? " అనింది అమ్మ.

ఎందుకో ఆ పాప ఎదిగి బయట పడిందంట " అంటి.

అట్లనా ! అయితే వాల్లింటికల్ల పావద్దు నాయినా ! " అనింది అమ్మ గుడా.

ఏమ్మా ! ఎదిగిందంటే ఏందిమ్మా ! అంటి. ఓరి నీయమ్మ నా కొడకా ! అది గుడా తెల్గా, ఎదిగిందటే సమర్తయిందని అర్థం ".

సమర్తయిందా ? అట్లంటే ఏందిమా ! " అంటి.

ఓరి తిక్కల్నా కొడకా . అంటే రజస్తల అయిందనిరా ! " అనింది. అంటే . . . ” “ పుస్పవతి అయిందని "

అబ్బ ! సంపితివి గదమ్మా ! నీ మాట్లు ఒగటన్నా అర్ధమయి సస్తాండాయా ? " అంటి.

అంటే ఆ పాప పెద్దమనిషి అయిందని అర్తంరా " అబ్బ ! ఏమబద్దాలు చెప్పుతావుమా ! ఆపాప ఏలుడంత గుడా లేదు పెద్దమనిషి ఎట్లయిపోతుందిమా ! అంటి . అ . . . బ్బ నీ కెట్ల చెప్పల్నో నా కర్తం గాలా. పోరా ! " అనింది అమ్మ.

ఊర్లో కొంతమందే తిక్కలోల్లు అనుకున్యా. అమ్మగుడా తిక్కట్టే అనుకోని ఎదిమ్ము మింద సూపు డేల్లతో పలకేకట్టు జగ్గునాం, నింగునాం " ఆని దరువేసుకుంటా ఎగురుకుంటా ఎక్కన్నో ఎల్లిపోతి.

ఒగా నొగనాడు కిట్టమ్మ మా ఇంటికల్ల ఒచ్చింది. బోడిమామ వాల్లింటి సూరు పట్టుకోని ఏలాడి నట్టు ఉండాది. మాయక్క సందులో బోకులు తోమతాంది. నేను దొడ్లోకి రాంగనే కిట్టమ్మ ఒల్లంతా కూడగట్టుకొని మెల్లిగ " స్సీ . . . నా ! " అని పిలిసింది. నేను అక్కడా ఇక్కడా చూసి య్యే . . . మి " అన్యా . పచ్చారిమాని కిందికి పోదాం రా చెప్పుతా అనింది. ఇద్దరం ఒంకలో పచ్చారిమాని కిందికి పొయ్యి దాని చల్లని నీడలో ఇసకలో కుచ్చున్యాం.

ఇంగజెప్పు అన్యా ఏం ల్యా . నాకోగ మాడికాయి ఈవా ! " అనింది. ఇబ్బుల్లేవ్ . మల్ల తోపుకాడికి బోతా పీక్కస్తాలే అన్యా. కిట్టమ్మ ఇంగా మాటల్లోకి దింపతాంది. రూంచేపు ఆమాట ఈమాటా మాట్లాడి నీకొగటి తెల్సా ! " అనింది  ఏందది " అన్యా . కిట్టమ్మకు అంత పెద్ద మాట్లు ఎవురు నేర్పిచ్చినారో గినీ నీకు సర్గం తెల్సా!" అనింది. ఓ తెల్సు" అన్యా. యాడ జూసినావ్" అనింది. అదే కాలవపల్లి సాయిబులు ఈడియో ఏస్తారే దాంట్లో యందరమరాజు సిమ్మాసనమ్మీద కుచ్చోంటాడు. ఒగపక్క గండు మీసాలోల్లు కొంతమందిని కొరడాలో కొడతాంటారు. ఇంగోపక్క తంతాంటారు. ఇంగోపక్కకొంతమందిని రంపాలో కోస్తాంటారు . . . " అంటాండా.

అంతలోనే కిట్టమ్మ " తుపూ సరగమంటే అదికాదు . అది నరకం " అనింది . ఇంగ సరగమంటే ఏంది ? " అని అడిగినా. మా వారపాకులేకి పదాం పా చూపిస్తా " అన్యాది. కిట్టమ్మోల్ల వారపాకులేకి ఎన్నో సార్లు పొయ్యినా. ఆడ ఎద్దల గ్యాడి, ఒగపక్క అరుగు, దానిమింద బండి మక్కిరి , పైన ఉలవ పొట్టు బోసుకుండే అటవ తప్ప సరగమనేది యాడా కనపల్లేదే. ఇబ్బుడు యాన్నుంచి చూపిస్తుంది బా ! ఈ పాప " అని మనుసులో అనుకుంటానే ఆ పాప ఎనకాల పొయ్యినా . ఆ పాప వారపాకు దగ్గరికి పిల్పకపొయ్యి , సిన్నగ బందిరి తడక తీసింది. లోపలికి పొయ్యినాము. నా రబ్బసానికి తడక కిర్రు మన్యాది. ఆ పాప ఇస్స్ . . . . " అంటా బాలీబక్కల ఏసిండే బండిమిక్కిర్లేకి పొయ్యింది.

నేను పాకుండా దిక్కుల్గిక్కులు చూస్తాంటే ర్రా . . . " అన్యాది . నేను యాడుందిబ్బా ! సరగం అనుకుంటా దిక్కులు జూస్తా మక్కిర్లేకి బొయ్యినా . ఆ పాప మక్కిర్లో ఎల్లెలకల పండుకున్యాది. నేను య్యేదీ సరగం అన్యా ".

 " పండుకో ! చూపిస్తా " అన్యాది.

నేను ఇంగా యాడుంది ఈ గబ్బు సరగం " అనుకుంటా, అక్కడా ఇక్కడా చూస్తా పండుకున్యా . బండి మక్కిర్లో జాగా తక్కవ గదా ! ఇద్దురం అనుకోని ఆనుకోని ఉండాము.

య్యే . . . . దీ " అన్యా. ఆ పాప రోండు స్యాతల్లో నా కుడి చెయ్యి తీసుకోని మింద బెట్టుకుంటాంది . నేనేమో ఈ సరగము యాడుందో ఏమో " అని కండ్లింతింత జేసుకోని గ్యాట్లేకి ఒంగి ఒంగి చూసినా . బండి మక్కిరి మూలల్లోకి తొంగి తొంగి జూసినా. కనపల్లా. పైన అటవలో ఉందేమో " అని అర్రు సాంచి, మెడకాయి పైకెత్తి చూసినా . ఊహూ . . . . లాబం లేదు.

కిట్టమ్మ నాకు తెలకుండానే నా చెయ్యి నలపతా ఏందో చేస్తా ఉంది . నేను ఈ సారి వారపాకు పైన యాడన్నా ఉందేమో " అని పైన కనబడతాండే , వాసాలు , బాదెన్నులు , సాలీడు బూజులు, చూస్తా ఉండా. ఇంగా కనపలేదా ! " అన్యాది. నా కేమో కనపడి సావ్లా. ఇంగా కనపలేదంటే ఈ గొనవదాని దగ్గిర అలుసైపోతానని ఆఁ . . . కనపడింది . కనపడింది " అంటా కిందికి చూసినా . కిట్టమ్మ పావడా రూంత వైదొలిగి నున్న . . . గ మినకొడతా మాకాల్లదంకా కనబడతాంది . తుపూ . . . నీ కుంచిలి పైకి లేసి పొయ్యింది . సరింగా ఏసుకో " అన్యా.

కిట్టమ్మ బిత్తర పొయ్యింది. మగం పాలిపొయ్యింది. గబుక్కున కండ్లు ఎర్రబడి ఇంతింత అయి పొయ్యినాయి. ఎల్లమ్మసామే కట్టు కోపంగా గుడ్లురిమి చూసి, బుసకొడతా లై . . . య్ రా ! " అన్యాది. ఇంతకు ముందెబ్బుడూ ఆ పాప నన్ను ఒరే తరే అన్లా. బయిపడిపొయ్యి లేసి నిలబన్యా . కానీ సరగం కనపడలేదు గదా ! చూపిస్తుందేమో అని బయిపడతా, బయిపడతా కొంచెం సేపు నిలబడి జాలిగా ఆ పాప కండ్లల్లేకి జూసినా. ఈ సారి ఇంకొంచెం మరియాద పెంచి ర్యా . . . య్ ! ప్పో . . . రా ! " అన్యాది. ఈ పాపకు దమ్మే పట్టిందో, గంగంమ్మే ఒల్లుకొచ్చిందో అని జడుసుకోని బందిరి తడక తీసి ఎనిక్కి తిరిగి చూడకుండా ఉరికెత్తినా. .

కిట్టమ్మతో యవ్వారం అట్లయినంక ఇంగ ఆ పాపతో మాట్లాడేది గాని, అట్లాడేది గాని, ఏమీ పెట్టుకోలా.

నీను సౌడసంద్రంలో ఆరో తరగతి చదివేసి , ఇంగా ఏడు, ఎన్మిది , తొమ్మిది, పది గుడా చదివేసి మదనపల్లిలో ఇంట్రమింట్లో చేరినా. అబ్బున్నుండి మనె విలు పెరిగిపోయిందిలే. ఒగసారి సంకు రాతిరి సెలవల్లో మా ఊరికిపొయ్యి, మంగడుక్కోని ఈదిలేకి పొయ్యినా.

కిట్టమ్మోల్ల ఇంటికాడ పంది లేసి, దాని మింద కానగాకులు, టెంకాయికితలు కప్పి, గుంజలకు సున్నం, ఎర్రమన్ను చార్లు చార్లు పూసినారు. ఇంగేముంది కిట్టమ్మ పెండ్లి ఐపోయింది. కిట్టమోల్ల బజారు బండ మింది అందురూ పెండ్లి మాటలే చెప్పుకుంటాండారు. కిట్టమ్మ మొగుడు వాల్ల కడప్మాన్లో మెటికిలుమింద కుచ్చోని ఎవురితోనో తమాస బడతాండాడు. నేను ఆటికి పొయ్యినబ్బుడే ఆ పాప ఇంట్లో నుంచి ఒచ్చింది. కిట్టమ్మ మొగుడు స్యానా మంచోడంట. వాయనది అన్నగారిపల్లి.

కిట్టమ్మ నన్ను కంతారక లేకండా చూసింది. నా పుల్లమీసం కల్లా, పిల్లిగడ్డం కల్లా ఎగతాలిగా చూసింది. ఎంటనే ఆ పాప మొగుని గుబురు గడ్డం కల్లా, కోరమీసం కల్లా గర్వంగా చూసింది. చూసింది గమ్మునుండకుండా ఎవురుకీ తెలకుండా, నాకు మటుకే తెలిసేటిగా కనైప్ప లెగరేసింది. ఏందోలే ఆ పాప పాకలు. నేను ఓడిపోయినట్లు. ఆయమ్మ గెలిసినట్లు.

నాకు సిగ్గయింది. పిసకరాన్చోట యాన్నో మిరక్కాయి పిసికినట్లైంది. ఈ గబ్బుదాని మొగుడు ఎట్లుంటే నాకేమి. నేనేమన్నా దీని చేసుకుంటానని చెప్పినానా ? అయినా నేను చేసుకోబోయ్యేది యట్లుండల్లని. యా ఇజయశాంతో, రాదా మాదిరో ఉండల్ల. కనీసం సుహాసినీ , రమ్యక్రిస్న కట్టు ఉన్యా పరవాల్యా.

అయినా మాకు ఎకనామిక్సు చెప్పే రుసీందరబాబు , ప్రకాసు సారోల్లకు ముప్పైయ్యారు , ముప్పైయ్యేడేండ్లు అయింటాయి. ఇయ్యారవ వరకు వాల్లకే పెండ్లిండ్లుల్యా, గిండ్లిండ్లుల్యా. నాకు అబ్బుడే పెండ్లింది. ఎవురికన్నా చెప్పితే . . . లతో నగుతారు " అనుకుంటి.

కిట్టమ్మ మొగున్తో న్యాస్తం జేసుకోని, వాయనా నేనూ ఇద్దరం గలిసి మెలికులు మింద కుచ్చోని కిటమ , ఆటబడితిమి. కిటమ్మను రూంచేపు ఏడిపిచ్చి, రూంచేపు నగపిచ్చి ఇంటికెలిపోతి . .

ఇంగోసారి దశారా సెలవలు ఒచ్చినాయి. ఊరికి బొయ్యినా. మావిటేల అట్లా బజార్లోకి బోతి. కిట్టమ్మోల్ల ఈదిబండ మింద పిల్లనాయాండ్లంతా తమాసా బడతాండ్రి. నేనూ బోయ్యి కుచ్చుంటి. కిట్టమ్మ పుట్టింటికి ఒచ్చింది. పగులంతా చేండ్లో దొంగగా కడుపు నిక్క మేసిండే దొంగావే కట్టు ఇట్లా అట్లా పొనుగుతా కిట్టమ్మ సిన్నగ దొడ్లో కదల్తాంది.

కిట్టమ్మను చూసి నాకు అర్సోజ్యమైపాయ. " ఆడోల్లకు కడుపొస్తే లావుయితారు గిని. ఇదేందబ్బా ఈ కిట్టమ్మ ఇంత లావయింది. అనుకుంటి. ఆ కనైప్పల మింద ఎర్ర . . . గ ఆ పొడలేంది. ఆ చెక్కులు ఆ పకుర్తుము పైకెక్కి పోవడమేంది ! ఆ గదగలు ఒగొగటి జాను జాను కిందికి దిగజారి పోడమేంది ! ఆ రొమ్ముకట్టు అట్ల రెయికి పట్టకండా మిడిమ్యాలంగా నిక్కబొడుచు కోడమేంది ! అ . . . బ్బ ! చూసే దానికి గాలా. ఓర్నాయినో అందుకేరా ఆడదంటే ఆది సెక్తి అంటారు " అనుకోని ఇంటికెల్లిపోతి.

మల్లా మజ్యలో ఒగనాడు బియ్యమైపోతే తెచ్చుకుందామని మదనపల్లి నుండి ఇంటికి బోతి. కిట్టమ్మోల్ల బజారుబండ మింద, పోలుమాను కాడ, బడి మెటికులు మింద జానాలు గుంపులు గుంపులుగా ఉండారు. కొందురు ఏందో గుట్టుగా మాట్లాడతాండారు. ఇంకొందురు ఆ పాపకు దేవుడు ఆటికి రాసినాల్లేరా ఇసి పెట్టండి " అంటాండారు. నాకేందో ఇచ్చింతరంగా అయితాంది. బెరుక్బెరుగ్గానే పొయ్యు కిట్ట ల్ల బండమింద గుచ్చుంటి. ఆడ చెప్పుకుంటాండేదంతా ఇంటాంటే ఎంత ఉగ్గబట్టుకున్యా గుండికాయి తల్లడిల్లిపోతాంది. మనుసు మరిగిపాతాంది. వాల్లు చెప్పుకున్ని దాంట్లో సారమేందంటే . . . .

కిట్టమ్మ కడుపొచ్చి కాగూడనంత లావయిపొయ్యిందంట. అట్ల ఇపరీతంగా లావు కాగూడదంట. ఇంగా అందురి కండ్లు బడి జిప్ తగిలిందంట. అందుకే కిట్టమ్మకు దనుర్వాత మొచ్చిందంట. పురుడుకు పుట్టింటి కొచ్చిన కిట్టమ్మ నట్టింట్లో మల్లాడతా మల్లాడతా ఉండి ఉన్నట్లుండి కండ్లు తిరిగి న్యాల పడిపొయ్యిదంట. కిట్టమ్మ పడిపాతానే ఎవురో అన్నగారిపల్లికి పరిగెత్తా బొయ్యి చెప్పితే కిట్టమ్మ మొగుడు ఒచ్చినాడంట. ఇంగా దగ్గిరి దగ్గరి బందుగులంతా ఒచ్చినారంట. ఎందుకొచ్చినా ఇంగా ఎవురో రావల్ల, నేను కడసారి చూపు చూడల్లన్యట్లు కిట్టమ్మ వాగిట్లోకల్ల చూస్తానే ఉందంట. చూసి . చూసి . . చూసి . . . కన్ను కొలకల్లో నుంచి నిండా పొంగిన కన్నీల్లు నిజా . . . నంగా ఒగ తొటుకు కార్చి పానాలిడిసిందంట. కిట్టమ్మ కండ్లు మాతరము గౌడిచెరువులో కలుంపూలే కట్టు ఇంతింత రెప్పలు తెరుసుకొని ఎవురి కోసమో గినీ కడపమాన్లో కల్ల ఎదురు  చూస్తా . . . నే ఉండాయంట !

 

సాహిత్య వ్యాసలు

అది ఒక సహృదయుడు కలగన్న కలలరాజ్యం

సమకాలీన ప్రముఖ కథకుడు, నవలా రచయిత టి.ఎస్.ఏ కృష్ణమూర్తి. ఇటీవల ఆయన కలం నుండి వెలువడిన రచన కలలరాజ్యం. అది ఒక సహృదయుడు కలగన్న రాజ్యం. గుండె తడిగలవాడి వ్యాజ్యం కలలరాజ్యం. సమాజంలో నిత్యం జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను చూసి, గుండె గాయపడి దానికి విరుగుడుగా ఏమీ చెయ్యలేని సున్నిత మనస్కుడైన రచయిత తనలో తాను నిర్మించుకున్న ఒకానొక ఆదర్శరాజ్యం కలలరాజ్యం.  అలతి అలతి మాటలు, మాట మాటలో నేర్పరితనం, ఆ నేర్పరితనం వెనుక అపారమైన జీవితానుభవం వెరసి పాఠకుడిని ఏకబిగిన నవలంతా చదివించే గుణం ఈ నవల్లో ఆద్యంతం దర్శనమిస్తుంది. కృష్ణమూర్తి గారు మొదట నవలను నడిపించుకుపోతున్న తీరు కాస్త చిలిపిగా, హాస్యపూరితంగా కనిపించినా, తను సామాజిక బాధ్యత పట్ల అంకిత భావం, జీవితం పట్ల గాంభీర్యం ఉన్న రచయిత అని తర్వాత్తర్వాత తెలుస్తుంది. 

కలలరాజ్యంలో కథ ఏంటంటే ఉదయ్ బాబు అని ఓ నిరుద్యోగి. లావణ్య అనే బ్యాంకు ఉద్యోగినిని ఇష్టపడి ఆమె దివ్యదర్శనం కోసం ప్రతి రోజూ తంటాలు పడుతుంటాడు. కానీ ఆమెతో మాట్లాడడానికి గాని సన్నిహితంగా మెలగడానికి గాని జంకుతుంటాడు. రాజారావు అని అతని స్నేహితుడు ఉదయ్ బాబు ప్రేమాయణాన్ని కనిపెట్టి దాన్ని గమ్యం చేర్చే పనిలో తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఉదయ్ బాబు ప్రేమను గెలిపించడం అటుంచితే ఇతనే లావణ్య నేస్తం స్వాతి ప్రేమలో పడి పెళ్ళికూడా చేసుకుని బుద్ధిగా కాపురం పెట్టుకుంటాడు. కానీ  ఉదయ్ బాబు కొన్ని పరిస్థితుల్ని జయించి లావణ్యను పెళ్ళాడతానని చెప్పి నిష్క్రమిస్తాడు. అప్పటి నుండి ఆ ఊళ్ళో కలలరాజ్యం పేరిట వరుస హత్యలు జరుగుతాయి. పోలీసు వేట మొదలౌతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక చిన్న క్లూ కూడా దొరకదు. ఎలాగో చివరికి హంతకుడు  పోలీసులకు దొరికిపోతాడు. హంతకుడెవరో కాదు ఉదయ్ బాబే. అతడు పోలీసుల వద్ద నేరం ఒప్పుకుని కథలో వచ్చే ఒక పిచ్చి డాక్టర్ కలగన్న ఆదర్శవంతమైన కలలరాజ్యం స్థాపించడానికే సమాజానికి ప్రమాదకరంగా మారిన వారిని తాను హత్య చేశానని చెబుతాడు. అతనికి తెలియకుండానే అతనికి సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధి వల్ల అతడు తొందరలో చనిపోతాడని తెలిసి పోలీసులు సానుభూతితో అతడు తమ స్వగ్రామంలో తల్లిదండ్రుల ముందు చనిపోడానికని వదిలేస్తారు. అతడు స్వగ్రామం పోయి చనిపోతాడు. కథ ఇంతే. సాదాసీదాగా కనిపించే ఈ కథలో రచయిత పాత్రల ద్వారా తన కలలరాజ్యం ఏపాటిదో చాటి చెప్పాడు.   

ఇంతకీ టి.ఎస్.ఏ కలలరాజ్యం ఎలా ఉంటుంది అంటే ఈ నవల్లో కలలరాజ్య సిద్ధాంత కర్త పిచ్చి డాక్టర్ మాటల్లోనే చూద్దాం.  “మేము కలలుకనే రాజ్యంలో మరణశిక్షలుండవు. కరకు హంతకులకు, తీవ్రవాదులకు సైతం ఇతర శిక్షలుంటాయి తప్ప మరణశిక్షలంటూ ఉండవు... హత్య కాదు కదా, చిన్ననేరం చెయ్యడానికి కూడా ఏ మనిషి సాహసించే అవకాశం వుండదు. ఎందుకంటే మరణశిక్షలు తప్ప ఇతర శిక్షలన్నీ వుంటాయి. మామూలుగా ఉండడం కాదు. చాలా కఠినంగా వుంటాయి... భయం నీడలోనే నడవాలి మనిషి... ఐదారుగురికి మించి ఎప్పుడూ, ఎక్కడా ఎవరూ సంచరించరాదు... రాస్తారోకోలంటూ రోడ్డుమీద బైఠాయించిన వాళ్ళ బట్టలూడదీయించి పిరుదుల మీద వాతలు కాల్చి పంపించాలి(ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా చూడ్డానికి, ట్రాఫిక్ స్తంభించడం వల్ల పోయే ప్రాణాలను కాపాడ్డానికి)... విధ్వంసాలకు పాల్పడేవారికి ఒకటి రెండు చేతివేళ్లు నరికివేయాలి... భయం మాత్రమే ఈ సమాజాన్ని సక్రమంగా సరిజెయ్యగలుగుతుంది... రైలు పట్టాలను, సిగ్నలింగ్ వ్యవస్థను దెబ్బతీసే వాళ్ళకు కుడిచెయ్యి తొలగించివెయ్యాలి... హింసను, చట్టవ్యతిరేకతను ప్రేరేపించే చలనచిత్రాలు నిర్మించేవారు కూడా శిక్షార్హులే... ప్రేమపేరిట ఆడపిల్లల్ని హింసించినా, స్త్రీలపై అత్యాచారాలు చేసినా, గృహహింసకు పాల్పడినా వాళ్ళు ఒక్కో కన్ను, ఒక్కో చెయ్యి, ఒక్కో కాలు పోగోట్టుకోక తప్పదు... ప్రతి నేరానికీ, ప్రతి తప్పుకూ కఠినమైన శిక్ష తప్పనిసరి... అదీ వెన్వెంటనే. జాప్యం అంటూ ఉండదు. ఉండకూడదు. పనేదీ చెయ్యకుండా రాజకీయాలు చేసే సోమరిపోతులకు కఠినాతి కఠినమైన కారాగార శిక్షలే. ఆ పరంపరలో అక్కడక్కడా, అప్పుడప్పుడు కొందరు అమాయకులు కూడా బలయిపోవచ్చు.. తప్పదు. సమాజం బాగుపడాలంటే, వ్యవస్థ పఠిష్టంగా ఏర్పడి గాంధీజీ కలలుగన్న రామరాజ్యాన్ని కళ్ళ చూడాలంటే కొన్ని బలిదానాలను భరించాల్సి రావచ్చు. ఏది ఏమైనా కఠినాతి కఠినంగా వ్యవహరించక తప్పదు. వైద్యులు సమ్మె చేస్తే వాళ్లకు పాదం మీద గాట్లు పెట్టాలి... ఎక్కువ గంటలు పని చేస్తూ ఉత్పత్తిని అధికం చెయ్యడం ద్వారా తమ నిరసనను నిరభ్యంతరంగా తెలుపుకోవచ్చు ఎవరైనా... లంచగొండులకు ముఖం మీద “లంచగొండి” అన్న గుర్తు స్పష్టంగా కాల్చబడుతుంది. సెల్ఫోన్ వ్యవస్థ అవసరానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. మద్యపాన నిషేధం నిరవధికంగా అమలుపరచబడ్తుంది. మద్యాన్ని తయారు చేసినా, అమ్మినా, తాగినా ద్వీపాంతర కారాగారమే. చవితినాటికి ఆకాశమెత్తు వినాయకులుండరు. మూరడు పొడవుకు మించకుండా కుటుంబాలలో భక్తితో కూడిన పూజలకే పరిమితం. కలుషిత జలాలను జీవజలాలలోకి వదిలే కర్మాగారాలు శాశ్వత ప్రాతిపదికన మూసివేయ బడ్తాయి... గురుద్వారాలు, మసీదులు, మదరసాలు మొదలైన వాటిలో తీవ్రవాదులుండరు. ప్రార్థించేవారు మాత్రమే ఉంటారు... మానవతా విలువలు, మంచితనం, మనిషితనం మాత్రమే కన్పిస్తుంటుంది... ముఖ్యంగా పనిలేనివారుండరు. పనిలేకపోవడం అంటే శిక్షకు చేరువకావడమే. ఎక్కడ చూసినా పని! పని!! పని!!! ఎటు చూసినా భయం! భయం!! భయం!!! ముఖ్యంగా ఎక్కడబడితే అక్కడ బహిరంగ సభలనీ, రోడ్ షోలనీ వుండవు. పాదయాత్రలు అస్సలుండవు... టి.వి. సందేశాలిచ్చుకుంటే చాలు...” ఇదీ కాన్సెప్ట్. ఇదీ టి.ఎస్.ఏ కన్న కలలరాజ్యం.  అంటే కఠిన శిక్షల ద్వారా అకృత్యాలు, అన్యాయాలు జరక్కుండా; సామాజిక జీవితంలో నేడు వేళ్ళూనుకున్న విధ్వంసాలు, నష్టాలు వాటిల్లకుండా చూడ్డం.  వాటిని నిత్యం చవిచూసి విసిగిపోయిన ఓ మంచివ్యక్తి చేసిన గొప్ప భావన.       

కలలరాజ్యం మొదట్లో కథానాయకుడు ఉదయ్ బాబు-లావణ్య, అతని నేస్తం రాజారావు-స్వాతీల లవ్వాయణాలు చూస్తుంటే సీరియస్ పాఠకుడికి "కలలరాజ్యం అంటే ఇదా!" అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే వరుస హత్యలు, అపరాధ పరిశోధన పాఠకుడిని నిజమైన కలలరాజ్యంలోకి తీసుకుపోతాయి. కానీ మొదటి ప్రేమాయణానికి ఈ హత్యలకు సంబంధం ఏమిటన్న ఉత్కంఠ(ఒక రకంగా విసుగు) కలుగుతుంది. ఆ తర్వాత కలలరాజ్యం పేరిట హత్యలు చేసింది ఉదయ్ బాబే అని సస్పెన్షు తొలగిపోయే వరకూ కలలరాజ్యం శీర్షిక అంతరార్థం అవగాహనకు రాదు. 

ఉదయ్ బాబు, రాజారావుల ప్రేమవ్యవహారాలు నడిపే పట్టుల్లో పాపులర్ రచయిత లాగా, కలలరాజ్యం పేరిట జరిగే హత్యా ప్రస్థానాల్లో డిటెక్టివ్ రచయిత లాగా కృష్ణమూర్తి గారు కనబడతారు. ఇలా అనడం కన్నా సీరియస్ రచయిత స్థాయి నుండి ఆ  స్థాయిలకు ఆయన పడిపోయారు అని అనడం సరిగా ఉంటుంది. ఇంతలా ఆయన్ని నొప్పించడం ఎందుకంటే పాక్షిక సిద్ధాంతబలంతో కాకుండా ఆయన కలం నుండి సంపూర్ణంగా సైద్ధాంతిక భూమిక గల రచనలు వెలువడాలని. అయినప్పటికీ అపరాధ పరిశోధనలో రాటుదేలిన ఒక పోలీస్ అధికారి కన్నా లోతైన అవగాహన కృష్ణమూర్తి గారిలో మనం చూడవచ్చు. ఈయన పూర్వాశ్రమంలో కొంపదీసి పోలీసు అధికారి కాదు కదా అన్న సందేహం పాఠకునికి కలుగుతుంది. 

కలలరాజ్య స్థాపన రచయిత ముఖ్యోద్దేశం. ఆ కలలరాజ్య స్థాపనకు కథానాయకుని శారీరక అనారోగ్యం, మరణభయం కాకుండా పిచ్చి డాక్టర్ ఇచ్చిన స్ఫూర్తి, లలితకు జరిగిన అన్యాయాలే కారణం అయ్యుంటే సైద్ధాంతిక బలం చేకూరేది. వీటికి అనారోగ్యం, మరణభయం తోడయ్యాయని చెప్పడం సైద్ధాంతిక పునాదిని బలహీనపరచింది. నాయకుడి కమిట్మెంట్ ను అగౌరవపరచింది. అది రచయిత పరంగా ఒకరకమైన పలాయనవాదంగా అనిపిస్తుంది.

ఉదయ్ బాబుకు హెచ్చైవీ, ఎయిడ్స్ రావడం లో సంభవనీయత(possibility), సంభావ్యత(probability), శాస్త్రీయత ఉన్నాయి. ఎందుకంటే అతడు వాడేసిన సిరంజీలు పొడిపించుకున్నాడు. మరి అతనికి శారీరక సంబంధాల ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో సదరు వ్యాధి సోకడానికి అవకాశం ఉందని తెలియజెప్పడానికి పిచ్చి డాక్టర్ చెప్పిన యువతి కథలో అవి ఎంతమాత్రం లేవు. ఎందుకంటే ఆ యువతి ఎయిడ్స్ గల డాక్టరమ్మకు కాలి ముల్లు తీశాక వాళ్ళు మరికొంత దూరం నడిచారు. అందువల్ల ఆ ముల్లు తీసిన పిన్నుకున్న రక్తం తడారిపోయి ఉంటుంది. అప్పుడు డాక్టరమ్మకు తీసిన పిన్నుతోటే తానూ ముల్లు తీసుకున్నా ఆమెకు హెచ్చైవీ సోకే అవకాశం లేదు. హెచ్చైవీ వైరస్ తడి రక్తంలో తప్ప బయటి వాతావరణంలో క్షణకాలం కూడా మనలేదని శాస్త్రం చెబుతున్నది. కానీ ఎయిడ్స్ వ్యాధిపైనా, వ్యభిచార ప్రవృత్తిపైనా లోతైన పరిశోధనా, అవగాహనా ఈ నవల్లో కనబడుతాయి. 

నిజానికి రచయిత కోరుకున్నది, కఠిన శిక్షలూ కాదు, మరణశిక్షలూ కాదు. మరేమిటి? సమాధానం నేరాలు జరగని లోకం. పేదరికం లేని ప్రపంచం. అది ఆయన హృదయ మార్దవానికి,  మంచితనానికి నిదర్శనం. అయితే నేరాలు జరక్కపోవడం కన్నా, పేదరికం లేకపోవడం కన్నా భౌతిక, సామాజిక సౌకర్యాలు సమానంగా పంపిణీ కాబడ్డం ప్రధానం అని, సమాన పంపిణీ జరిగితే ఆ అనర్థాలన్నీ మటుమాయం అవుతాయని రచయిత గుర్తించి ఉంటే బాగుండేది. అంటే రచయిత సమాజంలోని లొసుగుల్ని జనరలైజ్డు దృష్టితో కాకుండా వర్గదృష్టితో అడుగువర్గం పక్షాన నిలబడి  చూసి ఉంటే ఆయన తన ఆదర్శానికి న్యాయం చెయ్యగలిగి ఉండేవారు. మన సినిమాల్లో మంచికీ చెడుకూ పోరాటం నడిపిస్తారు. కళ్ళతో చూడలేనంత హింస చూపిస్తారు. మరి వాళ్ళు సెన్సార్ సర్టిఫికేటు ఎలా పొందుతున్నారు? దానికి సినిమావాళ్ళ దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటంటే ఆ పోరాటాన్ని వర్గపోరాటంలా కాకుండా, హింసని వర్గహింసలా కాకుండా వైయక్తికాలుగా జనరలైజ్ చేసి చూపిస్తారు. అలాంటి సినీ టెక్నిక్ జోలికి రచయిత పోకుంటే బాగుండేది.      

టి.ఎస్.ఏ గారు పేదరికమే అన్ని అనర్థాలకు మూలం అని భావించారు. ఉదయ్ బాబు పోలీసులకు తన ఆఖరి కోరిక వెల్లడిస్తూ “పేదరికం చాలా చెడ్డది సార్! దానిలోంచీ దీనత్వం, క్రూరత్వం, వ్యభిచారం, అసంఖ్యామైన అకాల మరణాలు, ఆకలి మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మొదలైన సామాజిక రుగ్మతలన్నీ పుట్టుకు వస్తాయి. ఈ పేదరికం వల్లే మనుష్యులలో మనిషితనం నశిస్తుంది. మంచితనం అడుగంటుతుంది. పశుత్వం, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగలు మొదలైనవి సెగలై రగులుకుంటాయి” అంటాడు. ఈ అకృత్యాలు, అనర్థాలు లేని సమాజాన్ని ఒక సహృదయుడుగా ఆయన కోరుకున్నారు. అయితే పై లిస్టులో చెప్పిన అనర్థాలు చాలా వరకూ పేదరికం ఫలితాలు కావడం కొంతవరకూ నిజమే. కానీ  క్రూరత్వం, హత్యలు, దోపిడీలు, పశుత్వం, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగలు ఈ అనర్థాలు పేదరికం కంటే ధనదాహం, అధికారదాహం, లోభత్వం, పరస్త్రీవ్యామోహం... మొదలైన లంపటలు ఉన్న సంపన్న సమాజం వల్లనే అధికంగా జరుగుతాయి. సంపన్న వర్గాలవాళ్ళు బ్యాంకు అప్పులు మొదలు వివిధ మార్గాల్లో సేకరించి ఎగ్గొట్టిన ప్రజాధనం ముందు, వాళ్ళు పొందిన లక్షల కోట్ల రుణమాఫీ ముందు  పొట్టకూటికోసం దొంగతనం చేసినవాళ్ళు దొంగలించిన ధనం ఏ పాటిదో ఆలోచించండి. అది రచయితకు తెలియదా? మరి ఆయన వాటిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన సంస్కరణవాది అయితే ఆ రుగ్మతల్ని కథా వస్తువుగా ఎందుకు తీసుకోలేదు? వాళ్ళను సంస్కరించాలని ఆయనకు ఎందుకు సంకల్పం కలగలేదు?    

రచయిత సంఘసంస్కరణకు కఠిన శిక్షలే ఔషధం అని పిచ్చి డాక్టర్ చేత ప్రతిపాదించాడు. దానికి మరణశిక్షా అవసరమేనని ఉదయ్ బాబు చేత ప్రతిపాదించాడు. (కలలరాజ్యం కాన్సెప్ట్ పిచ్చి డాక్టర్ ఊహల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని ఆయనకే తెలియకుండా అమలుకు పూనుకున్నవాడు ఉదయ్ బాబు) ఆ విధంగా కఠిణ శిక్షలు, మరణశిక్షల ద్వారా కలలరాజ్యం స్థాపించవచ్చని ఆయన కలగన్నారు. అందువల్ల టి.ఎస్.ఏ గారు సంఘ సంస్కరణం పేరిట ఉదయ్ బాబు చేత ఒక కామాంధుని, డబ్బాశ గల ఓ డాక్టర్ని, బాధ్యత ఎరుగని ఓ ఆర్టీసీ డ్రైవర్ని(జనాలను కావాలని గుద్ది చంపే డ్రైవర్లు ఉన్నారా?), ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాల్ని హత్య చేయిస్తాడు. సంఘసంస్కరణే ధ్యేయమైతే వీళ్ళందరి కంటే ఎక్కువ మోతాదులో సంఘద్రోహం చేసే ఓ రౌడీని, ఓ గూండాని, ఓ రేపిస్టుని, ఓ ముఠాదారుని, ఓ కూనీకోరుని, చెయ్యని పనులకు బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని కాజేసే ఓ కాంట్రాక్టర్ని, బ్యాంకుల్లో వందలూ వేలకోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాల్లో సేదతీరే ఓ కార్పోరేట్ని, అవినీతి పరుడైన ఓ రాజకీయజీవిని ఎందుకు హత్య చేయించలేదు? ఇలా విలాసాల కోసం ధనలంపటతో అధిక హాని చేసే వాళ్ళని కాకుండా పొట్టకూటి కోసం అల్పనేరాలు చేసేవాళ్ళని చంపించడం పలాయనవాదం కాదా? అగ్రవర్ణ, ధనికభావజాలం(రచయిత అగ్రవర్ణుడూ, ధనికుడూ అని భావించకండి) కాదా? యథాతథస్థితిని కపాడ్డం కాదా? దానిలో నుండి రచయిత బయటపడలేక పోయాడా? 

కఠిన శిక్షలద్వారా సంఘసంస్కరణ చెయ్యాలని, అది సాధ్యం అని రచయిత భావించాడు. అది కొంతవరకూ వాస్తవం కావచ్చు. కానీ మనిషి లో మానవత్వాన్ని నిద్రలేపకుండా, మానసికమైన మార్పు తీసుకురాకుండా భయపెట్టి మనిషిని మార్చలేం. అది సంస్కరణవాదమైనా, సామ్యవాదమైనా దానివైపు ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఆ సంస్కారం వాళ్లలో వచ్చే వరకూ సదరు ఉద్యమ కారులు ఆగాలి. వాళ్ళను మానసికంగా సన్నద్ధం చెయ్యాలి. మనిషి అంతరంగంతో మొదలు పెట్టి ఒకానొక నిర్మాణాత్మకమైన మార్పు తీసుకురావాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. బలవంతంగా దేన్ని జనాలపై రుద్దినా అది అనతికాలంలోనే ఫెయిల్యూర్ అవుతుంది. రచయిత ఎంత కాదన్నా అది సామ్యవాద రాజ్యమే. రచయిత కన్న కలలరాజ్య స్థాపన జరగాలంటే కావాల్సింది శిక్షలూ కావు, మరణశిక్షలూ కావు. సైద్ధాంతిక భూమికపై నిర్మాణాత్మకంగా జరిగే నిరంతర పోరాటం.

 కృష్ణమూర్తి గారుమత సంస్థల్లో తీవ్రవాదులు ఉండరు” అని అక్కడే ఆగిపోయారు. అసలు మత సంస్థలే ఉండవు, మతమే ఉండదు అనే స్థాయికి చేరుకోలేకపోయారు. రచయిత తను తీసుకున్న వస్తువు యొక్క సైద్ధాంతిక ప్రాతిపదిక మార్క్సిస్టు ప్రాదిపదిక అనీ, ఆయన కన్న కలలన్నీ కమ్యూనిజంతోనే సాధ్యం అనీ గ్రహించి ఉంటే మరింత ప్రభావవంతంగా రాసుండేవారు. నేరాలు - అన్యాయాలు లేని రాజ్యాన్ని రచయిత కలగన్నారు. అది సంస్కరణ వాదం. అది సగటు పౌరుడెవడైనా కనేదే. కానీ రచయితా, మేధావీ కలగనే రాజ్యం అంతకన్నా కొంచెం ఎత్తులో ఉండాలి. దానికి సైద్ధాంతిక ప్రాతిపదిక కావాలి.

కృష్ణమూర్తి గారు నిస్సందేహంగా అభ్యుదయవాది. కానీ తన భక్తులను ఆదుకోవడం కోసం భగవంతుడు రకరకాల అవతారాలు దాలుస్తుంటాడు అనడం, స్వాతి కులం తమ కులం ఐతేనే రాజారావు ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు అనడం లాంటివి రచయిత అభ్యుదయవాది అనడానికి అడ్డువచ్చే అంశాలు. కృష్ణమూర్తి గారు పాపులర్ శైలిపై, డిటెక్టివ్ శైలిపై చూపిన శ్రద్ధ కాన్సెప్ట్ పై పెట్టి ఉండాల్సింది. వర్గస్ఫృహకు మళ్ళాల్సింది. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిలో సామ్యవాదం ఉంటుంది. దాన్ని అంగీకరిస్తే  తాను పుట్టి పెరిగిన వర్గాన్ని కాదన్నవాడవుతాడు. ఒక్క సారిగా దాన్ని అతడు జీర్ణించుకోలేడు. అప్పుడు అతడు తనలో ఉన్నది కమ్యూనిస్టు భావజాలం అని ఒప్పుకోలేడు. తనను తాను కమ్యూనిస్టుగా అంగీకరించలేడు. అలాంటి డోలాయమానంలో కృష్ణమూర్తి గారు కనబడతారు.  

ఉదయ్ బాబు ఉద్దేశాలు తెలిసి, అతను అవసాన దశలో ఉన్నాడని తెలిసి తమ చేతికి చిక్కిన నేరస్తుణ్ణి పోలీసులు మర్యాదగా ట్రీట్ చేశారని, స్వగ్రామం పోవడానికి వదిలేశారని రచయిత రాశారు. నేరస్తుడు అతగాడు ఎంత మంచి వాడైనా, ఎంత మంచి ఉద్దేశం కోసం అతడు నే‌రం చేసినా, పోలీసుల ట్రీట్మెంట్ మాత్రం అంత మర్యాదగా ఉండదు. అతడు ఎంత అవసానదశలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తీ ఉండదు. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారుల్లో ధనిక వర్గంవారే ఎక్కువ. వాళ్ళు సంపన్న వర్గాల భావజాలానికి గండికొట్టే ఏ భావజాలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్రతకనియ్యరు. ఈ విషయంలో రచయితలకు స్పష్టత లేకపోవచ్చు గానీ వాళ్ళకు మాత్రం వందశాతం స్పష్టత ఎల్లప్పుడూ ఉంటుంది.

 ప్రాయికంగా రచయితది సంస్కరణవాదం. దృక్పథంలో, భావజాలంలో సామ్యవాదానికి కొంత దూరంలోనే ఆయన నిలబడిపోతున్నా కృష్ణమూర్తి గారు కలలరాజ్యం నవలద్వారా నేటి యువతరానికి గొప్ప దిశానిర్దేశం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయిత కలగన్న కలలరాజ్యం స్థాపించడానికి నేటి యువత పూనుకోవాలి. కానీ దాని సాధనకు వాళ్ళు అనుసరించాల్సిన మార్గం ఉదయ్ బాబు అనుసరించిన మార్గం ఎంతమాత్రం కాదు. పైగా అలా చేస్తే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టే అవుతుంది. అలా కాకుండా ఒక స్పష్టమైన నిర్మాణాత్మకమైన నిరంతర కార్యాచరణతో ముందుకుపోతే టి.ఎస్.ఏ గారు కలగన్న కలలరాజ్యం సాకారమవుతుంది. 

 

ఆధునిక వ్యక్తిత్వం దిశగా చేసిన ప్రయాణం - నీల

ఒక నిరుపేద రైతుకూలీ చెమటోడ్చి పొదుపు చేసి కొంచెం పొలం కొంటాడు. అతని కొడుకు మరికొంత పొలం కొని రైతవుతాడు. అతని కొడుకు నాలుగక్షరాలు నేరుస్తాడు. అతని కొడుకు బాగా చదివి ఒక చిరుద్యోగం సంపాదిస్తాడు. అతని కొడుకు ఉన్నతాధికారి అవుతాడు. అతని కొడుకు ఓ చిన్న పరిశ్రమ పెట్టి నలగరికి ఉపాధి కల్పిస్తాడు. అతని కొడుకు దాన్ని పెద్ద కంపెనీగా దిద్ది వేల మందికి ఉపాధి కల్పించి గొప్ప ధనవంతుల జాబితాలో తన పేరు లిఖించుకుంటాడు. ఇలా అంతా సవ్యంగా జరిగితే అది తరతరాల్లో సంభవించే సహజ పరిణామ క్రమం. అలా కాకుండా ఒక నిరుపేద బుడుతడు తన తెలివితేటలతో అద్భుతంగా దూసుకెళ్ళి ఒక జీవితకాలంలోనే లక్షలకోట్ల కంపెనీకి అధిపతి అవుతాడు. మరొక పేద పిల్లాడు అమేయంగా ఎదిగి ఒక జీవిత కాలంలోనే ఒక దేశాధినేత అవుతాడు. ఇది వ్యక్తిగత ప్రగతి దృష్ట్యా చూస్తే అసహజం అసమానం అయిన పరిణామం. ఈ రెండవ కోవని పోలిన ఒక మానసిక వైజ్ఞానిక నాగరిక మేధో పరమైన పరిణామం కె.ఎన్. మల్లీశ్వరి గారి నవల ‘నీల’లో చూడొచ్చు. 

కలవారి ఇళ్ళలో పుట్టి చదువుసంధ్యల ద్వారా తెలివితేటలు గడించి వెలిగిపోవడం వేరు. కడమల ఇళ్ళలో పుట్టి కడగల్లు అనుభవిస్తూ ఎదగడం వేరు. అది బ్రాయిలర్ కోడి ఫారంలో ఫీడింగ్ మెక్కి కండపట్టి ఒళ్ళు బలుపెక్కడం లాంటిది. ఇది అడవికోడి గుడ్డిడిగి బయటి ప్రపంచలో అడుగు పెట్టింది మొదలు ఎలుకల నుండి ఎంటవల నుండి ముంగిసల నుండి అడవి పిల్లుల నుండి గద్దలనుండి వానల నుండి వరదల నుండి కార్చిచ్చు నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవితమంతా చావుభీకరాన ఉరుకులు పరుగులతో మనుగడ సాగిస్తూ ఎదిగి వచ్చే ఒక క్రమం లాంటిది. దీనికీ దానికీ మోడుకూ మొలక్కూ ఉన్నంత తేడా. చావుకూ సచేతనంగా జీవించడానికి ఉన్నంత తేడా. అలా కష్టనష్టాల అనుభవంలోంచి ఉద్యమ నేపథ్యంలోంచీ చేతనతో, సజీవశక్తితో ఎదిగొచ్చి గడిదేరిన ఒక క్రమం ‘నీల’లోని నీల పాత్రలో మనకు కనబడుతుంది.

నాగరికతలు ప్రారంభం అయ్యాక ఈ భూమ్మీద అత్యంత ఆధునికుడు, అత్యాదిమ మానవుడూ సమకాలీనులుగా అన్ని కాలాల్లో కనబడతారు. అయితే అత్యంత వెనుకబడ్డ కుటుంబంలో పుట్టి ఒక జీవితకాలంలోనే పరిపూర్ణమైన ఆధునిక వ్యక్తిగా ఎదగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది నీలలో జరిగింది. దీనికి ఊతమిచ్చే మాటలు ఈ నవల్లో నీల అంతరాంతికంలో కూడా దొరుకుతాయి. “బుద్ధి చెప్పిన మంచిని గ్రహించడానికి, ఆచరించడానికి మంచి వాతావరణం, చదువు, డబ్బు, స్వేచ్ఛ లాంటివి కూడా చాలా సాయపడతాయి... ఇవేమీ లేని మనుషుల్లో కూడా అసాధారణ వ్యక్తిత్వం ఉండొచ్చు. కానీ దానిని సంతరించుకోడానికి మామూలు మనుషులు కన్నా వేల రెట్లు నలుగుళ్ళు పడతారు” అని నీల తనలో తాను అనుకుంటుంది. నిజానికి అలా నలుగుళ్ళు పడి అనుభవం గడించినవాళ్ళకే నిజమైన సుస్థిరమైన వ్యక్తిత్వం అబ్బుతుంది. అందుకే నీల తన బిడ్డ మినోని బ్రాయిలర్ కోడిలా పెంచకూడదని ఆమెకు తన కష్టసుఖాలు తెలిసేలానే బతుకుతుంది.    

ఒకానొక ఉదయం ఏలూరుకు ఆనుకొని ఉన్న చోళదిబ్బలో “ఉప్పుడు మబ్బులుండవు” అన్న ప్రకృతిని అర్థం చేసుకునే స్వగతంతో నీల అన్వేషణ మొగ్గ తొడిగింది. చోళదిబ్బ బీదరికం, కడుపాకలి, తల్లి చంద్రకళ పెద్దమ్మ ఆరంజ్యోతిల బతుకారాటం, జ్యూట్ మిల్లు కార్మిక పోరాటం, స్టాలిన్ సూర్యం ఉద్యమస్ఫూర్తి ఆ పసితనానికి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న తపన పెంచాయి. తన తండ్రి పరిశి అమ్మని ఆటోరాజుని హతమార్చి జైలుకెళ్లడంతో బతుకు తెరువు కోసం నీల కుంగిపోయింది. ఆ కుంగుబాటు నుంచి ఆమె ఎంతో బతుకు పాఠం నేర్చుకుంది. ఆ పాఠాన్ని డైరీలో మూడు బతుకు సూత్రాలుగా రాసుకుని తనను తాను ఒక చట్రంలో బంధించుకుంది.  

నీల జీవితం పొడుగునా ఇతరుల్లో లోపాలను చూస్తూ వాటికి తను దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటూ అలాంటి లోపాలు తనలోనూ ఉన్నాయని గుర్తిస్తూ తనను తాను విమర్శించుకుంటూ సమీక్షించుకుంటూ సరిదిద్దుకుంటూ ఎదిగింది. భార్యాభర్తల మధ్య మాత్రమే జీవితం కడదాకా లైంగిక సంబంధాలు ఉండాలని, వారి మధ్య మూడో మనిషి ప్రమేయం ఉండరాదని ఆమె నమ్మింది. అయితే అనుకున్నదొక్కటి ఐనది ఒక్కటి. తను ప్రసాద్ నుండి ఏ కారణంగా విడాకులు తీసుకుందో, పరదేశిని ఏ కారణంగా తిరస్కరించిందో అటువంటి ఎలిమెంట్ పట్ల రాడికల్ ఆలోచనలు ఉన్న సదాశివతో జీవితం పంచుకోడానికి ఆమె సిద్ధపడింది.

నీల రాసుకున్న బతుకు సూత్రాల చట్రం నుంచి తనకు తెలియకుండానే పరిస్థితుల ప్రభావం వల్ల బయటపడింది. అమ్మ చంద్రకళ, సవతి సరళ, భర్త ప్రసాద్, ఆప్తబంధువు సంపూర్ణ, మిత్తరికం కట్టుకోడం ద్వారా తన మొకర అయిన పరదేశి, ప్రియమైన నేస్తం అజిత, సహచరుడు సదాశివ వీళ్ళలో ఉన్న పరవ్యక్తి వ్యామోహం, బహుళ శారీరక సంబంధాలు, ప్రేమల్లోని అంతరాలను ఆమె అసహ్యించుకుంది. అవి అమ్మ, ఆటోరాజుల చావు; దాని వల్ల తాను పడ్డ అవమానాలు; అపరాధభావం లాంటి అనర్థాలకు దారి తీస్తాయని అందువల్ల తను అలా ఉండకూడదని చాలా గట్టిగా అనుకున్నది. కానీ జీవితం చివరికి వచ్చి చూసుకుంటే ఆ చిక్కుముళ్ళ బంధాలు తననే ఆవరించేసాయి. ఆమె దాన్ని జీర్ణించుకోడానికి సమయం, అనుభవాలు అవసరమయ్యాయి. మానవ సంబంధాల్లో శారీరక సంబంధాలు చాలా అల్పమైనవనీ వ్యక్తిగత సామాజిక సంబంధాలు కొనసాగించడంలో అవి కాస్తా తాత్కాలిక  శారీరక సంబంధాలుగా మారినా కొంపలు మునిగేది ఏమీ లేదనీ దానివల్ల సాహచర్య, కుటుంబ సంబంధాలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదనీ మనస్సు ముందు నైతికానైతికాల చర్చ అనవసరం అనీ ఆమె గ్రహించడానికి ఎంతో మానసిక పరివర్తన అవసరమైంది. దానికి పైన చెప్పిన వాళ్ళందరి అనుభావాలు, వ్యక్తిత్వాలు, వాళ్ళ కౌన్సిలింగులూ ముడిసరుకులు అయ్యాయి. 

అవివాహ లైంగిక జీవితం, వివాహేతర సాహచర్యం, వివాహ సహిత బహుళ శారీరక సంబంధాలు, ఒకరితో ప్రేమ ఒకరితో పెళ్లి ఇలాంటి వాటిని సహజీకృతం చెయ్యడానికి ఈ నవల్లో అజిత, సదాశివ, ప్రసాద్, పరదేశి పాత్రలు ప్రయత్నించాయి. సరళ, సంపూర్ణ కూడా ఈ కోవలోకే వస్తారు. ఈ భావనలకు నీలను సానుకూలం చెయ్యడంలో ఆమెను ఒప్పించడంలో ప్రసాద్, పరదేశి, సంపూర్ణ, అజితలు విఫలం అయ్యిండొచ్చు. దానికి వాళ్ళ వ్యక్తిగత బలహీనతలు కూడా కారణం కావచ్చు. సదాశివ ఒక్కడే ఈ విషయంలో సఫలుడై ఉండొచ్చు. దానికి అతని నిజాయితీ కూడా కొంత కారణం కావచ్చు. కానీ సదాశివ విజయానికి ముడిసరుకులు పై నలుగురే. నీలలో పరిణామం ప్రసాద్ వద్ద ప్రారంభమై, పరదేశి సంపూర్ణ అజితలతో బాటు ప్రయాణించి, సదాశివ వద్ద పరిపూర్ణమైంది. అలా పరిపూర్ణం కావడానికి తన ఆరాధ్య దేవత లాయరమ్మ వసుంధరకు సదాశివకు మధ్య కూడా కొంత సాహచర్యం ఉందన్న వాస్తవం నీల గ్రహింపుకు రావడం బలమైన కారణం అయింది.

నీల ఇంత నలిగి ఎదిగిన ఎదుగుదల కంటే ఎక్కువ ఎదుగుదల తన కూతురు మినోలో ఏ నలుగుళ్ళూ లేకుండానే వచ్చింది. అది ఆ అమ్మాయి పుట్టి పెరిగిన పరిసరాల నుండి లభించింది. దాన్ని నీల అర్థం చేసుకుంది. నీలలో ప్రారంభమైన మార్పులు వసుంధర బుద్ధులు చెప్పినప్పటి నుండి ఒక స్పష్టమైన రూపం సంతరించుకుంటూ వచ్చాయి. “నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రేమలన్నీ ఏదో రూపంలో బందిఖానాలే. అట్లా కాకుండా మునుషులకుండే అన్ని రకాల స్వేచ్ఛలనూ గౌరవిస్తూ ప్రేమించుకోవడం అనేది మంచి విలువ... దానికి(స్త్రీపురుష బంధానికి) చాలా పరీక్షా సమయాలుంటాయి. మనుషులు ఒకరికొకరు తారసపడే సందర్భాల్లో అనేక ఆకర్షణలు ప్రేమలు కలుగుతాయి. ఏ స్థాయి వరకూ వాటిని రానివ్వాలో ఎక్కడితో ముగించాలో ఎంతవరకూ కొనసాగించాలో మనుషులు ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. నిర్బంధాలున్న చోట అవి రహస్యంగా సాగుతాయి... ఆడా మగా స్నేహాలంటే కేవలం లైంగిక సంబంధాలుగా చూడటం నుంచి మనం బైటకి రాలేదనిపిస్తుంది” అని వసుంధర చెప్పిన మాటలు నీలకు ఎంతో ఊరట నిచ్చాయి. నీల సదాశివతో చోళదిబ్బకు పోయి ఊరు తిరిగినప్పుడు బాల్యంలో ఎంతో పెద్దగా గొప్పగా కనిపించిన స్థలాలు కంటికి ఆనకుండా పోయాయి. దాని వల్ల మార్పు అనేది సహజం అని ఆమె అవగాహనకు వచ్చింది.

చివరగా నీల తనలో వచ్చిన మార్పులనే ఆమె విశాఖ నుండి పరదేశిని వదలి సదాశివ కోసం హైదరాబాదు వచ్చేటప్పుడు నెమరు వేసుకుంది. తన జీవితంలో ఎదురైనవాళ్ళు వాళ్ళు కష్టపెట్టిన వాళ్లైనా, కష్టం పంచుకున్నవాళ్లైనా అందరివల్లా తన వ్యక్తిత్వానికి మేలే జరిగిందని గ్రహించింది. వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకుంది. ఒకప్పుడామెను ప్రతి ఒంటరిరాత్రి వంటింట్లో నిర్జీవంగా పడున్న అమ్మరూపు కనబడి భయపెట్టేది. ఇప్పుడు కనిపించడం లేదు. అంటే అప్పుడు అమ్మ చేసింది తప్పు కాదని ఇప్పుడు తాను చేస్తున్నదీ తప్పుకాదని తెలుసుకుని అపరాధభావం భావం నుండి బయటపడింది. ఇప్పుడు నీల వడ్డించిన విస్తరి లాంటి తన జీవితం అన్నీ నిండిన శూన్యమా? తన పోరాట జీవితం అయిపోయిందా? అని భయపడుతున్నదే తప్ప ఆమెకెలాంటి కొరతా లేదు. ఇప్పుడామె పొట్టలో పేగులు గుర్రుమంటుండగా అది చూసి చిలకమ్మగారి నడిపిదాని లాంటి పిల్లలు ఎగతాళిగా నవ్వుతుండగా ఆకలితో చోళదిబ్బ వీధుల్లో తిరిగిన నీల కాదు. కాటన్ కుర్తాలు, జీన్స్ ప్యాంట్సూ ధరించి చిన్నపిల్లలా కనిపించే అత్యాధునిక మహిళ. ఆబగా విస్తృతంగా సాహిత్యాన్ని చదివి హక్కులూ ఉద్యమాలూ దృక్పథాల గురించి అవగాహన సంపాదించిన మేధావి. వివిధ సామాజికాంశాలపై జరిగే సెమినార్లలో పత్రసమర్పణలు చెయ్యగల దిట్ట. మురికివాడల బాగోగులకై నడుం కట్టిన సామాజిక ఉద్యమకర్త. “తనలాంటి నీలవేణులకు జీవితప్రస్థానాన్ని సులువు చెయ్యాలి” అని దృఢంగా సంకల్పించుకున్న ధీరవనిత. పరదేశి వేసిన సముద్రం ఎందుకు వెనక్కి వెళుతుందో తెలుసా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకున్న నీలవేణి.  

నీల నవల్లో ప్రస్తావించిన అవివాహ లైంగిక జీవితం, వివాహేతర సాహచర్యం, వివాహ సహిత బహుళ శారీరక సంబంధాలు, ఒకరితో ప్రేమ ఒకరితో పెళ్లి ఈ సంబంధాలను సహజీకృతం చెయ్యడం అన్నవి నిజానికి రచయిత్రి దృక్పథాలు. ఈ విలువల స్థాపనం చెయ్యడానికే ఆమె ఈ నవల రాశారు. ఇవి ఇప్పటికే నాగరికంగా ఎదిగిన సంపన్న దేశాల్లో సహజాతిసహజం  అయిపోయాయి. అభివృద్ధి చెందుతున్న మన దేశం లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంప్రదాయాలు కాలూనుతున్నాయి. అయితే వాటికి బహిరంగంగా బయటపడే సామాజిక స్వేచ్ఛ, రాజకీయంగా శాసనబద్ధతలు లేవు. అగ్ని సాక్షికమైన వివాహ బంధాన్ని పరమపవిత్రంగా భావించే భారతావనిలో ఈ సంబంధాలను జనాలు ఎలా స్వీకరిస్తారు? వీటికి ఎంత తొందరగా సానుకూలం అవుతారు? ఈ వ్యవస్థ ఎప్పుడు వేళ్ళూనుకుంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అన్నది కాలం నిర్వహించాల్సిన విధి. 

తొంభైల నాటి కాలం, ఆ రోజుల్లో వచ్చిన సారా వ్యతిరేకోద్యమం, పొదుపు ఉద్యమాలు స్త్రీలలో గొప్ప చైతన్యాన్ని తీసుకు వచ్చాయి. కుటుంబాల్లో కొన్ని కుదుపులు వచ్చినప్పటికీ పొదుపు సంస్థల నిర్వహణల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ అవి స్త్రీల గొంతులకు పురుషాధిపత్యం పట్ల ధిక్కార స్వరాన్ని అందించాయి. స్త్రీల చేతుల్లోకి కొంత వరకూ ఆర్థికాధికారాలను తెచ్చాయి. వాళ్లకి రాజకీయ చైతన్యాన్ని అందించాయి. వీటిని ఫాష్టరమ్మ, శుభాంజలి, వసుంధర, నీతాబాయి, అజితల్లో సూచాయగా సంపూర్ణలో పరిపూర్ణంగా చూడొచ్చు. ఈ పరిణామాల్ని అక్షరీకరించం కూడా రచయిత్రి ఉద్దేశాల్లో ఒకటి. ఈ పాత్రల నుండి నీల ఎంతో స్ఫూర్తిని పొందుతూ ఎదిగింది. ఫాష్టరు మావయ్య తనను హాస్టల్లో చేర్పించి చదివించి పెట్టిన అక్షరభిక్ష, రాజమండ్రిలోని నవనీత మహిళామండలి, అక్కడి పుస్తకాలు, మహిళలు దళితుల ఉద్యమాల్లో పాటలు పాడ్డానికి వచ్చిన అవకాశాలు, ‘కాలాతీత వ్యక్తులు’ మొదలైన నవలల్లోని ఇందిర లాంటి పాత్రలు, పాష్టరమ్మ చూపించిన రెక్కలు ఊడిన పక్షిరాజు లాంటివి నీలపై చాలా ప్రభావం చూపాయి.  

బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది”లో దయానిధి లాగా మల్లీశ్వరి గారి నీలలో నీల అమ్మ జ్ఞాపకాల అపరాధభావం అనుభవిస్తుంది. అందువల్ల ‘సంచికా.కాం’లో “నీల చదువుతుంటే బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’కి ఫిమేల్ వర్షన్ అనిపిస్తుంది” అన్న జగద్ధాత్రి గారి మాటల్లో కొంత వాస్తవం ఉంది. అయితే అమ్మ చేసిన అపరాధం ఏమిటో బుచ్చిబాబు గారు స్పష్టం చెయ్యలేదు. కానీ అది నీలలో మల్లీశ్వరి గారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బుచ్చిబాబు గారు అలా దాచడానికి ఆయన, ఆయన సంస్కారం, ఆయన సామాజిక నేపథ్యం, ఆయన కాలం ప్రభావం చూపించి ఉండవచ్చు. దాన్ని బట్టబయలు చేసి అదీ ఒక్క జీవన విధానమే అని సమర్థించి “ఏం చేసుకుంటారో చేసుకోండి” అని సమాజం ముందు ఒక సవాల్ విసరడానికి ఇప్పుడు ఈ రెండువేలా పది-ఇరవై దశకంలో సరిగ్గా సమయం ఆసన్నమైంది. అందుకే ఆ పనిని మల్లీశ్వరి గారు సాహసోపేతంగా చేశారు. మల్లీశ్వరి గారు తన దృక్పథాన్ని వెల్లడించింది బ్రాహ్మణేతర సమాజం ద్వారా అయ్యుండొచ్చు. కానీ ఒక స్రష్టగా ఆమె అనివార్యంగా రాబోయే భవిషత్తు సమాజాన్ని ముందే పసిగట్టారు. దానికి ఏ గొంకూ లేకుండా రాబోయే విమర్శలకు, సవాళ్ళకు సిద్ధపడి ధైర్యంగా నవలా రూపం ఇచ్చారు.  

వాడ్రేవు చినవీరభద్రుడు గారు నీలకు అభిప్రాయం రాస్తూ “వ్యక్తిని, అతని చుట్టూ సమాజాన్ని సంపూర్ణంగా చిత్రించడం నవల ప్రధాన లక్షణం” అన్న ప్రతిపాదనకు ఉపపత్తులను తీసుకువచ్చారు. ఈ అర్థంలో తన కర్తవ్యాన్ని నిర్వహించిన నవలలు తెలుగులో చాలా అరుదని అలాంటి వాటిలో నీల చాలా విలువైన రచన అని కొనియాడారు. అది ముమ్మాటికీ సత్యం.  

ఇదివరకే నేను తానా బహుమతి 2017 పొందిన నవలల్లో బండి నారాయణస్వామి గారి ‘శప్తభూమి’పై వ్యాసం రాశాను. అది ప్రజాశక్తి “అక్షరం” పేజీలో రెండుసార్లు ప్రచురితమైంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి ‘ఒంటరి’పై రాశాను. అది సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైంది. ఈ మూడు నవలలూ చదువుతూ పోతున్నపుడు అవి చాలా ఆసక్తిగా అనిపించాయి. రచయితలు ముగ్గురూ జీవితపు అనుపానులు తెలిసినవాళ్ళే అని అనిపించింది. అయితే ఆత్మీయంగా అనిపించి హృదయానికి హత్తుకోవడం దృష్ట్యా, గుండెను కరిగించి కంటతడి పెట్టించడం దృష్ట్యా, పాత్రల్లో వచ్చిన హృదయ మార్దవం మానసిక పరివర్తన చిత్తసంస్కారం జీవిత విలువల పట్ల అభిప్రాయ పరిణామం దాన్ని చదివిన పాఠకుల్లో కూడా కలిగేలా నవల చూపే ప్రభావం దృష్ట్యా చూస్తే ఒక కొంత ఎత్తులో ఒంటరి కనబడింది. దానిపైన శప్తభూమి కనబడింది. ఈ రెండింటి కన్నా చాలా ఎత్తులో నీల నిలబడి కనబడింది అని చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం గానీ సంకోచం గానీ కలగడం లేదు.   

వృద్ధిని బహిష్కరించిన వృద్ధి

ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఇటీవల రచించిన ‘వృద్ధి’ కథపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లడవుతోంది. తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కథ రాసింది ఇనాగ్గారేనా? ఆయన ఒక దళిత రచయితేనా? అని చాలామంది విస్తుపోతున్నారు. ఈ కథలో కథానాయికలైన లింగి, సౌందర్యలు పనిదొంగలుగా, సోమరిపోతులుగా, తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, పోకిరీలుగా చిత్రింపబడినట్లు కనబడుతున్నది. అందువల్ల రచయిత ఈ కథలో దళితస్త్రీ స్వాతంత్ర్యాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని చర్చలు చేస్తున్నవాళ్లు అపోహపడుతున్నారు. ఇనాగ్గారు వాడిన భాష కూడా ఈ సందిగ్ధతకు కొంత కారణమయింది. అందువల్ల ఇనాగ్గారిని చాలామంది నిరసిస్తున్నారు. సదరు కథని భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోయిందంటే “ఇలాంటి కథ రాసిన పెద్దమనిషిని ఇంకా గారూ గీరూ అనడం ఏంటి?” అనేంతవరకూ పోయింది. పాఠకుడి నుండి రచయితల వరకు కథను సరిగా అర్థం చేసుకోలేక పోవడం వల్లే ఈ దుమారం రేగుతోంది. కానీ ఈ కథ వెనుక చాలా మర్మం ఉంది. వ్యంగ్యం ఉంది. వెటకారం ఉంది. అన్నిటికన్నా గొప్ప విరోధాభాసం దాగుంది. అనాది నుండి స్త్రీలని మరబొమ్మల్లా చూసిన పురుషాధిక్యతపై ఆగ్రహముంది. మాదిగల్ని బానిసలుగా చూసిన ఆధిపత్యవర్గాలపై తీవ్రమైన తిరుగుబాటుంది. ఇన్నాళ్ళూ దళితస్త్రీల శ్రమని దోచుకోవడమే తప్ప వాళ్ళ సంక్షేమం చూడని వ్యవస్థపట్ల ఎనలేని అక్కసుంది. ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకుని ఇనాగ్గారు కథ రాశారో ఆ బడుగువర్గాలవాళ్ళే అపార్థం చేసుకునేంత చిక్కదనం చిక్కుదనం ఈ కథలో ఉన్నాయి. విరోధాభాసంతో కూడిన ఈ శిల్పాన్ని పట్టుకుని విశ్లేషించుకుంటే కథ యొక్క గొప్పతనం తెలుస్తుంది. 

వృద్ధి కథలో లింగి, ఆమె కూతురు సౌందర్యల్లో కనిపించే మొదటి లోపం శ్రమించకపోవడం. పని చెయ్యాల్సిన వేళల్లో ఒంటినిట్టాడి గుడిసెల్లో సోమరిపోతులుగా నిద్రపోవడం. పనిచేసి సంపాదించి పైకి వద్దామనే ఆశావహ దృక్పథం లేకపోవడం. ఒకప్పుడు వేజండ్ల మాదిగలు కూలి దొరక్క కష్టాలు పడ్డారు. ఆసాములు ఇంటి వద్దకి వస్తే చేతులు కట్టుకుని “అట్టాగే సోమీ, వత్తాం దొరా” అనేవాళ్ళు. మంచం దిగి చేతులు నలుపుకుంటూ నిలబడేవాళ్ళు. ఇప్పుడు నారయ్య లాంటి ఆసాములు వచ్చి కూలికి రమ్మని అడుక్కుంటుంటే లింగి, సౌందర్య రామని నిర్భయంగా చెబుతున్నారు. మంచంపై నుండి లేవకుండా సమాధానం చెబుతున్నారు. “మాకేం గాడు బట్టిందా? మేం రాం” అంటున్నారు. వాళ్ళు బతిమాలుతుంటే వీళ్ళు తుస్కారిస్తున్నారు. నారయ్యని లింగి “నువ్వూ నీ పెళ్ళమూ నీ నలుగురు పిల్లలు వంగితే ఆ కలుపు తీయటం ఎంతసేపు?” అని ప్రశ్నించిది. “ఆళ్ళు పొలం పనులు ఎరగరే” అంటే “ఆళ్ళేమో నీడపట్టునుండాలా? మేమేమో ఎండనకా వాననకా పనిచేయాలా? మావల్ల గాదు. పొండి” అని కరాఖండిగా చెప్పేసింది. ఇంకా పల్లెలోని మాదిగలు ఆసాములకు కూలికి పోవడం మాని గుంటూరులో రకరకాల పనులకు పోతూ, సొంతంగా పాడి పితుక్కుంటూ సుఖపడుతున్నారు. ఒకప్పటి మాదిగల దీనస్థితికి, ఆసాముల దోపిడీకి అలవాటు పడ్డ చింతయ్యతాతకు ఇది విడ్డూరంగా కనబడింది. అతడు కాలమహిమ అని ఆశ్చర్యపోయాడు. చింతయ్యతాతలో రచయిత ఉన్నాడని అతని భావాలే రచయితవని చాలామంది చదువర్లు అపోహపడ్డారు. ఎంత కష్టపడ్డా ఆసాములు తమ శ్రమని దోచుకోవడమే గానీ తాము బాగుపడేదేమీ లేదని, తమని వాళ్ళు బాగుపడనివ్వరని, అందువల్ల ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధితో ఉన్నంతలో ఇల్లు గడుపుకుని పనిపాట లేకుండా, వళ్ళు గుల్లచేసుకోకుండా ఇంటిపట్టున హాయిగా ఉండడం మేలని మాదిగల్లో మాదిగస్త్రీలల్లో వచ్చిన చైతన్యాన్ని, వాళ్ళ భౌతికవాద దృక్పథాన్ని రచయిత సానుకూల భావంతో కథలో అంతర్లీనం చేసారు. దాన్ని పాఠకులు గుర్తించలేదు. అందుకే కథని, రచయితని అపార్థం చేసుకున్నారు.   

కథలో లింగి, ఆమె కూతురు సౌందర్యల్లో కనిపించే మరో లోపం వాళ్ళు తమ మొగుళ్ళు పోయి విధవలయ్యాక మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళకపోవడం. మొదట లింగి తన మొగుడు పోయినందుకు బాధపడకపోగా సంతోషించింది. “పీడ ఇరగడైపోయింది” అనుకున్నది. పెళ్ళయి కార్యం కాకనే తన అల్లుడు జమాల్సుగాడు పోయాక కూతురు సౌందర్యలో ఆ భావననే నూరిపోసింది. మళ్ళీ పెళ్లి జోలి ఎత్తకుండా చేసింది. దానికి కారణం మగాడి స్వయంకృతాపరాధం. లింగి భర్త తాగుబోతు. ఇల్లూ వళ్ళూ గుల్లచేసుకుని ఇరవై ఏళ్లకే వల్లకాటికి చేరాడు. తన రెండేళ్ళ కాపురంలో లింగి నరకం చూసింది. అందువల్ల మగాళ్ళ పట్లా, సంసారం పట్లా లింగికి విరక్తి కలిగింది. అది తరతరాలుగా తనపై పెత్తనం చేస్తున్న మగాడిపట్ల సగటుస్త్రీకి ఉన్న విముఖతే గాని పెళ్లిపై సంసారంపై సంసారసుఖాలపై ఉన్న వ్యతిరేకత కాదు. మొగుడు లేకుంటే ఏ గోకుడూ లేదు కదా అని ఆమె భావించింది. దాన్నే తన కూతుర్లో ప్రోదిచేసింది. మగవాళ్ళు రాక్షసులని నమ్మించింది. ఏ బాదరాబందీల్లేని సుఖవంతమైన జీవనానికి వాళ్ళు అలవాటు పడ్డారు. నాగరిక వర్గాల్లో మాత్రమే సాధ్యమైన ఈ పక్కా భౌతికవాద చైతన్యం ఏ ఎదుగుదలా లేని వేజండ్ల దళితస్త్రీల్లో వచ్చింది. దాన్ని రచయిత కథాగతం చేశారు. కాగా రచయిత తల్లీకూతుళ్ళని ఎప్పుడూ పెళ్లి చేసుకొమ్మని ఎబ్బెట్టు మాటలతో పోరే చింతయ్యతాతలో ఉన్నాడని పాఠకులు అనుకున్నారు. అందువల్లే కథ పట్ల వ్యతిరేకత వచ్చింది. కానీ ఇనాగ్గారు కథానాయికల తాత్వికతలో ఉన్నాడే గాని చింతయ్యతాతలో లేడు. అందువల్ల ఈ కథలో సమస్య కూడా లేదు.

కథానాయికల్లో మనకు కనిపించే మరో లోపం వాళ్ళు విధవలై, మరో పెళ్లిని నిరాకరించి కూడా శారీరక సుఖాలకు అతీతులు కాకపోవడం. వాళ్ళు శారీరక సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఏ మగాడైనా వెంటబడితే ఇంత బిక్ష వేసినట్లు వాడి కక్కుర్తి తీర్చి తమ అవసరమూ  తీర్చుకుంటున్నారు. (ఈ సందర్భంలో ఇనాగ్గారు లింగీ సౌందర్య తమ ‘కుతీ’ తీర్చుకుంటున్నారు అని వాడిన మాట చాలా వివాదాస్పదమైంది) కానీ ఏ మగాడికీ కట్టుబడలేదు. వాళ్ళు ఇవ్వజూపే కాసులకు చెయ్యి చాపలేదు. వాళ్ళకి బానిసలు కాలేదు. పైగా ఎప్పటికప్పుడు కొత్తదనం గమ్మత్తుగా ఉంది. డేటింగుల పేరుతో సంపన్న నాగరికుల్లో మాత్రమే కనబడే ఈ స్వతంత్రేచ్ఛ వేజండ్ల మాదిగస్త్రీలో రావడం అద్భుతం. దాన్ని రచయిత గుర్తించి ధ్వనించారు. కానీ పాఠకులు వాళ్ళని తిరుగుబోతులుగా పోకిరీలుగా తూలనాడిన చింతయ్యతాతలో రచయితని చూసినారు. రచయిత గొంతుని గుర్తిస్తే ఏ సమస్యా లేదు.

లింగి సౌందర్య ఇద్దరూ పని చెయ్యడానికి, పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరు. అదే వాళ్ళలో చింతయ్యతాతకి ప్రధానమైన అభ్యంతరం. అతడు “మానన్నాక కాయలు కాయాలి. ఆడదన్నాక పిల్లల్ని కనాలి” అంటాడు. “కష్టపడాలి, కూడు తినాలి. ఇష్టపడాలి, పిల్లల్ని కనాలి” అంటాడు. “నువ్వు పనిచేసే శక్తివి మాత్రమే కాదు. పిల్లల్ని ఉత్పత్తి చేసే ప్రాణయంత్రానివి కూడా” అంటాడు. కానీ వాళ్ళ తత్వం వేరు. “ఒకడికి చాకిరీ ఎందుకు చెయ్యాలి? ఒకడికి పిల్లల్ని ఎందుకు కనాలి?” అంటారు. తమ బతుకులే భారమైనప్పుడు ఇంకా పిల్లలెందుకంటారు. పిల్లల్ని కనడం అంటే ఈ భూమ్మీద మానవుడి మనుగడని కొనసాగనివ్వడం. తమని మనుషులుగా చూడని పురష ప్రపంచానికి, ఆధిపత్య పెత్తందారీ ప్రపంచానికి నిరాఘాటంగా కొనసాగే అవకాశం ఇవ్వడం. అందువల్ల వాళ్ళు దాన్నే దెబ్బకొట్టాలని భావించారు. అందుకే వాళ్ళు వాళ్ళ వృద్ధినే కాదు జనవృద్ధినే నిరాకరించారు. వాళ్ళు తమ శ్రమశక్తిని దాచుకోవడం ద్వారా అర్థవృద్ధిని, పిల్లలు కనే తమ ప్రాకృతికమైన సృష్టిశక్తిని త్యజించడం ద్వారా జనవృద్ధిని బహిష్కరించారు.    

లింగి డ్వాక్రా సభ్యురాలిగా కష్టపడి కొంత డబ్బు కూడబెట్టుకున్నది. వైధవ్య ఫించను రెండువేలు అయ్యాక కూరగాయలగంపని మూల పడేసింది. తల్లీకూతుళ్ళు నెలనెలా చెరో రెండువేలు చొప్పున వైధవ్య ఫించను తీసుకుంటారు. చౌకధరల దుకాణం ద్వారా వాళ్లకి  చవగ్గా ఇంటిసరుకులు లభిస్తాయి. ఓపిక ఉంటే వండుకుంటారు. లేకుంటే గుంటూర్లో సినిమా చూసి ప్రభుత్వ క్యాంటీన్లోనో గుళ్ళోనో చర్చిలోనో తిని వస్తారు. అందువల్ల వాళ్లకి ఆసాములకు వెట్టిచాకిరీ చేయాల్సిన అవసరం లేదు. ఒక మగాడి కింద బానిసలా పడి ఉండాల్సిన అగత్యం లేదు. ఇప్పుడు వాళ్ళకి మగాళ్ళు కుక్కల్లా కనబడుతున్నారు. చింతయ్యతాత వాళ్ళ భవిష్యత్తుపై బెంగపడ్డ భయాలన్నింటికీ వాళ్ళు తమదైన తాత్వికశైలిలో సమాధానాలు చెప్పారు. అది సమాజం పట్ల వాళ్ళలో పేరుకున్న అక్కసు. తేరగా వచ్చే వైధవ్య ఫించను తీసుకోవడంలోనూ, ప్రభుత్వ క్యాంటీన్ భోజనం తినడంలోనూ వాళ్ళు తమ అక్కసుని తీర్చుకుంటున్నారు. తమకు తమ కాళ్ళపై నిలబడేటట్లు ఉపాధి కల్పించకుండా ఓట్ల కొనకం లాంటి ఫించను ఇవ్వడం పట్ల వాళ్లకు కసి ఉంది. ఎన్నాళ్ళు ఇస్తావో ఇవ్వు అన్న కక్షసాధింపు ఉంది. ఇలాంటి తత్వచింతనా నేపథ్యం ఉన్న ఒక సరికొత్త తరం ఇప్పుడు పుట్టుకొస్తోంది. ఇది తమని భౌతిక వస్తుసంపదలతో ఎదగనివ్వని సమాజాన్ని ఎదిరించడానికి వాళ్ళలో కలిగిన ప్రగతిశీలం. మానసికమైన వృద్ధి. దాన్ని రచయిత పసిగట్టారు. దాన్నే కథనం చేశారు. పైకి కథానాయికల్లో లోపాలు చూపిస్తూ అంతర్లీన శిల్పం ద్వారా వాటిని ఆభాసం చేశారు. అందువల్ల చదువరులు కథలో ఉన్న విరోధాభాసాన్ని గుర్తిస్తే అది ఇచ్చిన సందేశం తెలిసొస్తుంది. రచయిత చింతయ్యతాత అనుభవాల్లో ఉన్నాడే తప్ప ఆచరణలో లేడు. అతని భాషలో ఉన్నాడే తప్ప అతనిదైన ఫ్యూడలిస్టు భావజాలంలో లేడు.

 

వృద్ధి ద్వారా రచయిత నిమ్నకులస్త్రీల్లో వచ్చిన చైతన్యాన్ని నిరూపించారు. భూస్వాములూ ఆస్వాముల ఆగడాలు ఇక చెల్లవని సందేశం ఇచ్చారు. ఆడతనంపై మగపెత్తనం ఇక కొనసాగదని హెచ్చరించారు. ఐతే వస్తు నేపథ్యపు అవసరం కొద్దీ దాన్ని ఎబ్బెట్టు పదజాలంతో బీభత్సపాకంలో పండించారు. ఎందుకంటే సక్రమమైన సంసారసుఖాలకు నోచుకోని ఆ బతుకుల నిండా బీభత్సం దాగుంది కాబట్టి. ఆసాముల శ్రమ దోపిడీల్లో, ఓట్లకోసం కమీషన్ల కోసం ప్రవేశపెట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మనిషి జీవితం ఒకానొక వికృతరూపం దాలుస్తోంది కాబట్టి. అంతేగాని ఆయనకు దళితస్త్రీలపట్ల గాని, వాళ్ళ నూతన జీవన తాత్వికత పట్ల గాని ఎలాంటి వ్యతిరేకతా లేదు. వాళ్లకి జరుగుతున్న అన్యాయం పట్ల ఆగ్రహంతోనే ఆయన అలాంటి భాషని ఎన్నుకున్నారు. ఈ కథలోని వస్తువు దళితస్త్రీలని, దళితుల్ని ఎక్ష్ప్లొయిట్ చేస్తున్న వ్యవస్థాగత రుగ్మతలకి రచయిత కనుగొన్న ఒక సరికొత్త ఔషధం. నోటిని చేదు చేసే ఔషధం చెడ్డది కాదు. అది పుష్టిదాయిని. కథకుడైన రచయిత ఒక సామాజిక వైద్యుడు. పుచ్చిపోతున్న సమాజానికి చురుక్కుమని సూదిమందు వేస్తున్న ఆ వైద్యుడు చెడ్డవాడు కాడు. దాని రోగాల్ని నయం చేసి స్వస్థత చేకూర్చుతున్న ఆరోగ్య ప్రదాత. అందువల్ల వృద్ధి కథలోని వ్యంగ్యాన్ని, విరోధాభాసాన్ని అర్థం చేసుకుని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

                    చ.వా: 9494696990   

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు