ఎవరీవిడ
అంటే నేనేమని జవాబివ్వగలను?
పరిచయమే లేదే ....?
అవును,
ఒప్పుకుంటాను.
ఒకనాడు
ఈవిడకూ, నాకూ
పెళ్ళంటూ మంత్రాలు చదివిందీ,
తన కొంగూ, నా ఉత్తరీయమూ
ముడి వేసిందీ,
ఫన్నీ ఫన్నీగా
మా ఇద్దరికీ జోకర్ వేషాలు వేసి
పల్లకిలో ఊరేగించింది
అన్నీ నిజమే !
ఆ తర్వాతేముంది?
ఒకరి వొళ్ళో ఒకరం పడుకుని ‘ప్రేమించు’కుంటూనే
ఎవరిలో వాళ్ళం వలవలా ఏడవడమూ –
సంసారం చేయడమూ, పిల్లల్ని కనడమూ
నెలకో , రెన్నెళ్ళకో వో సారి
మా బతుకుల్నే సినిమాల్లో చూసి
గలా గలా నవ్వేయడమూ,
కుటుంబ వ్యాపారంలో “పార్ట్నర్స్”గా
ఒకర్నొకరం “కన్సల్ట్ “ చేసుకోవడం తప్ప
ఇద్దరిలో ఎవరమూ
ఒకరి గడప ఒకరం దాటితేనా?
పులుసుకు చింతపండు తెమ్మనో
రాత్రికి మల్లెపూలు తెమ్మనో
తను.
“ఇదిగో నెల జీతం అనో,
అదిగో ఆ కనకాంబరం చీరే కట్టుకో సినిమాకెళ్దాం” అనో
నేను.
తప్ప వేరే మాట్లాడుకుంటేనా?
అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది,
గుండెలో కెలుకుతుంది;
పరిచయం కోసం ప్రయత్నిద్దామని
కాని ఎదీ
కాస్త విరామం దొరికిందా
గులాబీ పువ్వుకూ
తాకబోయే వేళ్ళకు మధ్య
ముళ్ళల మౌనం .....