స్వేచ్ఛ చిరునామా కనుమరుగై
నిబంధనల కచ్చడాలతో
నిత్య బంధినై
బ్రతుకు పంజరాన రెక్కలున్నా ఎగరలేని విహంగం ఆమె
అవసరాల వెలుగులో
ఆడతనం చిరునామా చేసి
స్త్రీత్వం కొల్లగొడుతున్న
పరువు ప్రతిష్టల గోడలు దాటి రాలేక
మౌనాలను మోస్తుంది..నేడు
జాతి వివక్ష కొలువుదీరిన క్షణాల నుంచి..
కన్యా శుల్కమంటూ అమ్మకానికి పెట్టినా..
దేవదాసీలంటూ వివాహానికి దూరం చేసినా..
నేడు వరకట్నం పేరిట కాసులు రాశులకు తూగలేక..
కన్నెతనానికి రక్షణ లేక
స్త్రీ ఉనికి పుట్టింట భారమై
మెట్టినింట బానిసై
వర్ధిల్లుతుంది కడగండ్లకు వారసురాలై..
కోరికలు తీర్చే అమ్మవారంటూ
జన్మనిచ్చే మాతృమూర్తoటూ
దేశ మాతంటూ..పూజిస్తూ
నదీ నదాలు పుణ్య క్షేత్రాలంటూ
ప్రకృతి మాతంటూ.. దైవత్వానికి చిరునామా స్త్రీ అంటూ
పూజించే నా దేశానా
గర్భంలో వధింపబడుతూ
అమ్మ కొంగున కన్నీటిని మూట కడుతూ
నాన్న భుజాన భారంగా
పుట్టింట చింతల చిట్టా తానై
మెట్టినింట వంశోద్దారక అంటూనే
దాసిగా సన్మానాలు చేస్తూ
ఆవేశాలకు అత్యాశలకు ఆమెను ఆహుతిచేసి
స్మశానానికి
సాగనంపుతున్నారు
సమాదులే .. నిజ నివాసలంటూ..
సవాళ్ళు విసిరే సమాజంలోనూ
ఓ..మహిళా..
నిరసనల ప్రవాహంలో కొట్టుకుపోకు
ఉనికికై పోరాట స్ఫూర్తి వై
సంకల్పాల వెలుగులో విస్తరించి
నిన్ను నీవునిరూపించుకో..
పరాదీనవు కావంటూ
జీవితం భిక్ష కాదు..హక్కుగా మలుచుకో...