మా రచయితలు

రచయిత పేరు:    శైలజా మిత్ర

కవితలు

నేను వెళ్ళిపోయాక..

ఒక్కోసారి మనమే కాదు..

గది కూడా మౌనంగా మిగిలిపోతుంది..

గుండెను పట్టినట్లు లోలోపల బాధ పడుతుంది

సన్నని కిరణం తాకినా మురిసిపోయే గది

కనీసం కన్నెత్తయినా ఎవరినీ చూడటం లేదు

దానికి తోడు ఏదో తలుచుకుంటూ

ఒకటే ధారగా కన్నీటిని గుమ్మరిస్తోంది..

తలుపులు తెరిస్తే చాలు

అనంత విశ్వమైనట్లు సంబర పడిపోయే గది

నేడు ఆవేదనతోనే ముఖం ముడుచుకుని ఉంది..

 

రాత్రి దుప్పటిపై కురిసిన కలల్ని ఏకరువు పెట్టాను

నిత్యం..నా కవితల్ని వినిపించాను. కధల్ని వివరించాను.

జరిగిన అవమానాల్ని, పెరుగుతున్న అసహనాన్ని, పంచుకున్నాను

నా నమ్మకాన్ని చెప్పుకున్నాను. నమ్మక ద్రోహుల్ని చూపించాను

ఏ బంధమూ లేని ఆ గది నాకు ఏకంగా

ఒక అనుబంధమై నిలిచిపోయిందని మురిసిపోయాను.

 

గది నా సహజ ప్రపంచం..

ఒకప్పుడు అసహజంగా ఉన్న ఆ గదిని

నా గుండె కెరటాలపై తేలి ఆడించాను

అన్నింటికీ మించి నాలోని ఆర్థ్రతను, ఆనందాన్ని

రెంటినీ సమపాళ్ళలో తెలియజేస్తూ

నువ్వు నేను ఒకటే అని చెప్పి నమ్మించాను..

ఒక్క మాట చెప్పనా ?

ఆ గది గోడలో ఇటుకలు లేవు..

కొన్ని నవ్వులు, మరికొన్ని మాటలు

నా కన్నీటితో కలిసి తయారైంది అంతే .. 

ఏం చేయను?

నా ప్రేమలో ఎంతటి సహజత్వం ఉన్నా

ఆ గదిని నేను నిర్మించలేదు కదా? అందుకే

ఇపుడు నేను వదిలి వెళుతున్నాను      

గది ఒకటే బందీలా ఒంటరిగా మిగిలిపోయింది

 

అది మాత్రమే మిగిలిందా

నేను మాత్రం ? గది గోడల్ని తాకుతూ

ఆ తాలూకు చిత్రపటాన్ని గుండెకు తగిలించుకుని

నిర్వేదంగా కదలడం లేదూ?

అయినా ఇపుడిలా విచారించీ ఏం లాభం?

ఏదయినా నాది అనుకునేటప్పుడే ఉండాలి జ్ఞానం

ఏది నీది ఏది నాది?

ఏదయినా వదిలి వెళ్ళాల్సిందే..

ఎవరికైనా వీడ్కోలు చెప్పాల్సిందే..

 

నిజమే..

వాస్తవాలు లేనిచోట 

ఆశల రెక్కల్ని

మనకు మనమే ఖండించుకోవాలి..

ఎటొచ్చినా గుండె దైవానిది కదా?

చివరికి ఒంటరిగా మిగిలిన ఈ దేహ చిత్రపటం

గది చిలక్కొయ్యకే వేల్లాడుతుంది కదా...

 

ఈ సంచికలో...                     

Nov 2020