ఆమె నిద్ర
ఆమె నిద్రలో ఒక రహస్యం ఉంది
అమ్మ, సహచరి లేదా ఇద్దరు కూతుర్లు
ఎవరైతే ఏం ?
వాళ్ళు నిద్ర పోవడంలో ఒక అద్భుతం దాగివుంది .
ప్రపంచమే విస్తుపోయేంత ప్రేమ కరుణ , ఆదరణల్ని
నిత్యం అవిశ్రాంతంగా పంచే వాళ్ళ కళ్ళు , చేతులు
నిద్రలో సైతం ప్రేమమయంగానే ఉంటాయేమో ?
రుచులేక్కువయ్యే కొద్ది , జీవితం గుది కోల్పోతున్న రోజుల్లో
నలుగురుండాల్సిన ఇంట్లో పది మంది బ్రతికడం ,
నలుగురు మాత్రమే తినాల్సిన అన్నాన్ని
పది మందికి సర్దటంలోని జీవన సౌందర్యమేదో వాళ్లకు తెలుసు
ఎప్పుడూ అనుకుంటాను-
రోజంతా కష్టపడే వాళ్ళు యెట్లా నిద్ర పోతారో చూడాలని!
ఒక్క రోజైనా ఇంట్లో మగాళ్ళ కన్నా ముటదు వాళ్ళు నిద్ర పోతే కదా?
ఇల్లు , వంటిల్లు, హాలు , బాత్ రూమ్ , పెరడు . . .
ప్రహారి నుండి, ఇల్లు సమస్తం వాళ్ళ సంరక్షలోనే!
పుస్తకాలు , వస్తువులు, పరికరాలు, పరిసరాలు,
ఇల్లు మొత్తం, ఇంట్లోని పరిమళాలన్నీ వాళ్ళే !
ఆదివారాలు, సెలవు రోజులు, పండుగలు , పర్వదినాలూ వాళ్ళే!
కాఫీ కప్పులు , టీ గ్లాసులు , అన్నం పళ్ళాలు ,
ఆకుకూరలు , కూరగాయలు , పండ్లు ,
మందులు , మాత్రలు , లేపనాలు , బి . పి . మిషిన్లు , థర్మామీటరూ వాళ్ళే ?
ఇంట్లో వాళ్ళు కానిది ఏమీ లేదు
వాళ్ళు లేనిది ఏమీ లేదు!
వాళ్ళకన్నా ముందు నిద్ర లేచి ,
వాళ్ళకన్నా ఆలస్యంగా నిద్రించే రోజు
వాళ్ళ మొహాల్లో , వాళ్ళ చేతుల్లో , వాళ్ళ కళ్ళల్లో
నవ్వుల్ని చూడాలి
నిరంతరం ప్రేమించి , నిరంతరం శ్రమించే వాళ్ళ నిద్ర -
సోమరిపోతు ప్రపంచానికి మెలకువ!
మా నాయిన చేసింది ఫారెస్ట్ గార్డు, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగమే కానీ, ఆయనకి ఎందుకో ప్రభుత్వ ఉద్యోగస్తుల లక్షణాలు ఏమీ రాలేదు. ఆయన ఎప్పుడూ తనను తాను ఒక ఉద్యోగి అని అనుకోనేలేదు.
ఆ కాలంలో అడవుల్లో మేకలు, ఆవులు మేపే వాళ్ళ దగ్గర అడవిలో కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర ఫైన్ లు వేసి డబ్బులు ప్రభుత్వానికి కట్టాల్సిన టార్గెట్స్ ఉండేవి.
చాలామంది అటవీశాఖ ఉద్యోగస్తులు కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర వాళ్ళ కత్తులు తీసి,తమ వద్దే ఉంచుకుంటారు. కట్టెల వాళ్లు ఫైన్ లు కట్టిన తరువాతనే ఆ కత్తుల్ని ఆ కట్టెల్ని విడిపించుకోవాల్సి ఉండేది.అప్పుడు కూడా అటవీశాఖ ఉద్యోగస్తులకు ఆ కట్టెలమోపులని ఇచ్చే వాళ్ళు ఉచితంగా. అయినా ఏ రోజు మా ఇంట్లో ఉచితంగా కట్టెలు తీసుకుంది లేదు. మేము అటవీశాఖ ఉద్యోగి కుటుంబ సభ్యులమే అయినా, మేం సిగ్గుపడకుండా కట్టెలు కొనేవాళ్ళం. నేను అడవిలో కట్టెలు కొట్టే లేదుగానీ, సైకిల్ పైన అడవికి వెళ్లి, ఎండిపోయిన కట్టెలని తాడుతో కట్టి ఇంటికి కట్టెల పొయ్యి కోసం తెచ్చే వాడిని.
అలాంటి రోజుల్లో ఒకరోజు.. ఏం జరిగిందంటే?.. "మేయ్ జయా.. ఇంకో గ్లాసు బియ్యం పెట్టు పొయ్యి పైన"అన్నాడు మా నాయన.
అప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది.
"ఇప్పుడా.. ఎటూ కాని పొద్దులో బియ్యం ఏంది, పెట్టేది ఏంది , ఇంతకీ ఎవరికోసం ? ఇంటికి మళ్లింకా ఎవరైనా పిలిచినావా ఏంది "అని కసురుకుంది జయమ్మ.ఆమె మా అమ్మ.
"తెల్లారి నుంచి సాయంత్రం దాకా ఫారెస్ట్ ఆఫీస్ లో కూర్చుని పెట్టేసినారు మే...పాపం. ఆ పల్లెటూరి మనుషులని.తిండీ నీళ్లు లేవు వాళ్ళకి. రూపాయి ఉంటే టీఇప్పించినా పోనీలే పాపం అని. అయినా పాపం వాళ్లకు ఆకలి కాకుండా ఉంటుందా. హోటల్లో తిండి పెట్టేదానికి నా దగ్గర డబ్బులు యాడుండాది? ఎట్లో ఒగట్లా నువ్వు ఏదో ఒకటి చేస్తావనే మన ఇంటికి పిలుచుకుని వచ్చినా. వాళ్ళు వీధిలో కూర్చుని ఉంటారు"మా నాయన కనికరంగానే అంటాడు గాని, మా అమ్మకి ఆ మాటలు వింటే ఎప్పుడూ
కోపం ముంచుకు వచ్చేస్తుంది.
"మా యబ్బ కానీ మీయబ్బ గాని నా దగ్గర లబ్బి ఏమైనా పెట్టిండారా? ఇట్లా దారిలో పోయే వాళ్లకంతా అన్నం పెట్టాలంటే కొంపా గోడూ అమ్ముకోవాల్సిందే. ఇంట్లో బియ్యం ఏడుండాయి? నాకు తెలియదు నువ్వు ఏమైనా చేసుకో ఫో.."
"మేయ్ నువ్వే అట్లంటే ఎట్లమ్మే? ఎక్కడో చోట అడుక్కు రా పో.,,"
"అంతే అంతే లే. దారిలో పోయే వాళ్లకంతా అన్నం వండిపెట్టతా ,టీ నీళ్లు పెట్టిస్తా ఉంటే.. నేను నా బిడ్డలు అడుక్క తినాల్సిందేలే. మాకు ఆగతే రాసిపెట్టినట్లే ఉంది చూస్తా ఉంటే.."
ఆ మాట నిష్టూరంగా మాట్లాడతానే వంట గదిలోకిపోయి, ఒక పెద్ద ఖాళీ గ్లాస్ తీసుకొని, పక్కింట్లోకో,ఎదురు ఇంట్లోకో, వీధి చివర దాకా వెళ్ళిపోతుంది.మా నాయన ముసిముసిగా నవ్వుకుంటా గణేష్ బీడీనో, అశోకా బీడీనో ముట్టించుకుంటాడు.
అప్పుడు కిరసనాయిలు ఉండదు. ఉన్నా.. స్టవ్వు పని చేయదు. కిరోసిన్ ఉంటే కదా పని చేసే దానికి. ఇంక కట్టెల పొయ్యి పైనే అన్నీ..
"ఈ కట్టెల పొయ్యిలో ఊదీ ఊదీ నాకు ఊపిరితిత్తులు పోతా ఉండాయి. ఆ నవ్వు చూడు.. అంతా ముండమోపి నవ్వు." ఆ మాట అనేటప్పడు చూడాలి మా అమ్మ మొహం..
అప్పుడు ఆమె మొహంలో కోపం ఉంటుంది ,బాధ ఉంటుంది కానీ మొగుడి పైన ప్రేమ కూడా ఉంటుంది.
బీడీ పొగల మధ్య మా నాయిన దగ్గుతా కొన్ని క్షణాలు విరామం తీసుకుని" మేయ్ జయా..టీ పెట్టు ముందు.. స్ట్రాంగ్ గా పెట్టు మే.."అని అనకుండా వుండడు.
మా నాయన ఆయన జీవిత కాలంలో మాట్లాడిండే అన్ని మాటల్లోకి లక్ష సార్లో, కోటి సార్లో చెప్పిన మాట ఏదైనా ఉందంటే ఆ మాట అదొక్కటే.
మా నాయన ఇప్పుడు లేడు, మా అమ్మా ఇప్పుడు లేదు. కానీ, మా ఇంట్లో ముఖ్యంగా మా వంట ఇంట్లో ఆ మాట ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంటుందంటే అది అబద్ధం కాదు..
"మేయ్ జయా టీ పెట్టు..".
అదే ఆ మాట.!
నాకు మా పాత పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం. అందుకే మా పాత ఇల్లు ఆరు దశాబ్దాలు అయిన తర్వాత, పడిపోయే దశకు చేరుకున్నప్పుడు, మా నాయన చని పోయిన 15 సంవత్సరాల తర్వాత, బ్యాంకు లోను తీసుకుని ఎట్లాగైనా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ పాత పెంకుటిల్లు కొట్టేస్తున్నప్పుడు మురిపెంగా ఫోటోలు తీసి పెట్టుకున్నాను. ఆ పాత ఇంటికి ఉన్న తలుపులు కిటికీలు,పెంకులు, ఇటుకలు ఇతర సామగ్రి అమ్మగా వచ్చిన డబ్బే, మా కొత్త ఇంటి పునాది కి ఖర్చు పెట్టుకున్నాను. ఈ రోజు ఈ ఇంటి పునాది ఏంది అంటే, అది మా నాయన కష్టార్జితం తప్ప మరొకటి కాదు. అమ్మ నాన్న ప్రేమలు అట్లాగే ఉంటాయోమో. ఇంటికి పునాదుల్లాగా పైకి ఎప్పుడూ ఎవరికీ కనబడవు కానీ అవి చాలా బలంగా ఉంటాయి. అవి బలంగా ఉంటాయి కాబట్టే , అంతో ఇంతో మనం కూడా ఎదుగుతా ఉంటాం.
ఈ కథలన్నీ ఇంతే .ఒక మనిషి గురించి నిజాలు మాట్లాడాలి అనుకుంటే ఒక వరుస క్రమంలో ఏమి మాట్లాడలేం. ఒకదాని తర్వాత ఒకటిగా ఏవేవో గుర్తుకు వస్తాయి. అన్నీ కలవర పెడతాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. ఊహించినవో,కల్పించినవో అయితే ఆ కథలు రచయిత చెప్పినట్లే ఉంటాయి. కానీ ఇవి కల్పితాలు కాదు కదా. ఇవి జీవితాలు కదా, మనం చెప్పినట్లు అవి ఉండవు. మా ఎరుకల జీవితాలు ఎట్లా ఉంటాయో ఎట్లా కొనసాగాయో, మా తాత గాడిదల పైన ఉప్పు అమ్మే కాడ్నుంచి, మా నాయన ఎట్లా ఉద్యోగస్తుడు అయినాడో, అటవీశాఖలో గుర్రం పైన తిరిగే ఫారెస్టరు చిన్నయ్య పెద్ద కూతురు జయమ్మను, కాబోయే మామ గారి ఇంటికి తిరిగి తిరిగి ప్రాధేయపడి, ఫారెస్టర్ చిన్నయ్య ను ఒప్పించి మరీ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఓ పెద్ద కథ.
ఎరుకల కుటుంబాల్లో ఒక్కొక్కరివి ఒక్కో కథ. ఎరుకల ఇళ్లల్లో పంచాయితీలు ఎలా జరుగుతాయో, ఎన్ని బాధలు పడి,ఆ తల్లులు తమ పిల్లల్ని స్కూలుకి పంపి చదివించుకున్నారో, అటవీ శాఖ లో ఉద్యోగి అయి ఉండి కూడా, ఎప్పుడు కట్టెలమోపు వాళ్లకు ఫైన్ వేయకుండా, మేకల వాళ్ళ దగ్గర సంవత్సరానికోసారి ఈనామ్ గా మేకపిల్లనో, గొర్రె పిల్లనో తీసుకోకుండా, సంవత్సరం మొత్తంలో ప్రభుత్వానికి వసూలు చేసిన అపరాధ రుసుం చెల్లించే సమయంలో, ఆ అపరాధ రుసుం ని అడవుల్లో పల్లెల్లో ఎవరి దగ్గర వసూలు చేయకుండా, ఆ నెల జీతం డబ్బుతో ప్రభుత్వానికి అపరాధ రుసుం చెల్లించి, 'ఈ నెల జీతం లేదు మే. మొత్తం సీ ఫీస్ కట్టేశా.' అని అమాయకంగా అపరాధిగా మాయమ్మ ముందు నిలుచుండిపోయిన కనికరం గుండె కలిగిన మా నాయన కథ ఇది.ఏ పొద్దు ఎవరికి ఏం అవసరం వచ్చినా, తన చెవిలో కమ్మలు, ముక్కుపుల్ల కుదువపెట్టి, మా నాయనను మాట మాత్రం అడగకుండా, తనకు తానుగా ఎన్నో కుటుంబాల్ని వడ్డీలు కట్టి ఆదుకున్న కనికరం గుండె కల మా అమ్మ కథ ఇది.
కొంచెం ముందు వెనక ఉండవచ్చు, సందర్భాలు అటూ ఇటూ ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రేమలు నిజం, వాళ్ల పేదరికాలు నిజం, వాళ్ల కనికరం నిజం.
***
ఇంటి ముందు దూరంగా పల్లెటూరి వాళ్ళు కూర్చుని ఉంటారు. అమ్మ ఉడుకుడుకు గా అన్నం చేసి చెనిగి గింజల చెట్నీ నో, పచ్చిపులుసో, గొజ్జో, రసమో ఏదో ఒకటి చేసి వాళ్లకు పెడుతుంది.
"ఆయన ధర్మ ప్రభువు తల్లీ. నువ్వు కనికరంగల తల్లివి తల్లీ.మీరు సల్లగా ఉండాల్ల. మీ పిలకాయలు సల్లగా ఉండల్ల" అని వాళ్లు మా అమ్మ కు నమస్కారం పెట్టి, తినేసి వెళ్ళిపోతారు.
అప్పటికి మా నాయన ఖాకీ యూనిఫామ్ వదిలిపెట్టి, బనియన్, పంచ తో కూర్చుని ఉంటాడు.
"ఎన్నిసార్లు అబ్బా నీకు చెప్పేది ఆ బనీను చూడు ఎంత బొక్కలు పడి పోయి ఉన్నాయో?. రెండు బనియన్ లు కొనుక్కోని రమ్మని చెప్పినాను కదా"అని తల పట్టుకుంటుంది మా అమ్మ.
తాను చెప్పింది ఏ పొద్దూ వినడని మా ఆయన పైన మా అమ్మకు భలే కోపం.ఒక్కోసారి ఎడం చేత్తో ఖర్మ ఖర్మ అని కోపంతో నొప్పి వచ్చేలా , చాలా బలంగా నుదుటి పైన కొట్టుకుంటుంది కూడా.
మా నాయన అప్పటికే వేడివేడి టీ తాగి గ్లాసు పక్కన పెట్టి, ఇంకోసారి బీడీ ముట్టించుకుని ఉంటాడు. బీడీ పొగల మధ్యలో ఆయన నల్లటి ముఖంలో తెల్లటి పండ్లు స్పష్టంగా కనపడతాయి. మా అమ్మ కోపం ఉందని తెలిసినా, అయినా నవ్వుతాడు.
మా అమ్మకు కోపం వచ్చినప్పుడు నేను, మా తమ్ముడు భయపడతాం కానీ, మా నాయన ఎందుకో భయపడడు. మా నాయనకు కోపం వచ్చినా కూడా అంతే. ఆయన కోపంతో పండ్లు కొరుకుతాడు. ఆవేశంతో ఊగిపోతాడు. అప్పుడు కూడా మా అమ్మ భయపడినట్లు నటిస్తుంది కానీ, నిజానికి అసలు భయపడదు. ఆయన కోపం నిమిషాల పాటే అని ఆమెకు బాగా తెలుసు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ప్రశాంతంగా నెమ్మదిగా ఈ ప్రపంచంలోని బాధలు ఏవి తనకు పట్టనట్లు, తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఏవి తనవి కానట్లు, ఏ బాధలు ఏ కన్నీళ్లు లేనట్లు, ఆయన ప్రశాంతంగా నవ్వుతాడు. ముఖ్యంగా మా అమ్మకు నిజంగా బాగా కోపం వచ్చినప్పుడు కూడా ఆయన అట్లాగే ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటాడు. ఆ ప్రశాంతమైన నువ్వు చూసేకొద్దీ మా అమ్మకి ఇంకా కోపం బాగా పెరిగిపోతుంది.
ఆరోజు కూడా అట్లాగే బాగా కోపం వచ్చేసింది మా అమ్మకు.
ఉద్యోగం చేసే వాడివి నీకు గౌరవం ఉండాల్సిన పని లేదా? చినిగిపోయిన బనియన్ వేసుకొని ఎన్నిసార్లు తిరుగుతావు? నీ జన్మకు ఎన్ని సార్లు చెప్పినాను?ఈరోజు కచ్చితంగా బనీను కొనుక్కొని రావాల్సిందే అని చెప్పినాను కదా. నా మాటంటే లెక్కేలేదు. నేనంటే విలువే లేదు.ధూ.."
మా నాయన మెల్లగా లేచి వెళ్ళి, తను తీసుకు వచ్చిన ప్లాస్టిక్ కవర్లో ఉంచిన, పేపర్లో భద్రంగా చుట్టిన ప్యాకెట్ విప్పాడు.
"ఇది ఏందో తెలుసా? చాలా గొప్ప పుస్తకాలు. పెద్దపెద్ద ఆఫీసర్ల పిల్లకాయలు చదివేది. మన ఎరికిలోల్ల ఇళ్ళల్లో ఎవరి పిల్లల వద్దా ఈ పుస్తకాలు ఉండవు. ఇలాంటి పుస్తకాలు చదవతా వుంటే చాలు, పిలకాయలు చాలా గొప్పోళ్లు అయిపోతారు చూస్తా ఉండు.."
ఆయన దేన్నయినా చాలా భద్రంగా తెస్తాడు. ఎంత చిన్న వస్తువు అయినా సరే చాలా విలువైన వస్తువు లాగా అత్యంత జాగ్రత్తగా భద్రంగా తీసుకొస్తాడు. ఇంట్లో పిల్లలకు ఏదైనా తీసుకురావడం అంటే ఆయనకు మహా సరదా. అప్పుడు ఆయన మొహం లో ఏదో గొప్ప తేజస్సు కనబడుతుంది. అప్పుడు ఆయన ఎందుకో నల్లగా అనిపించడు. ఎందుకో ఆ క్షణాల్లో ఆయన చాలా గొప్ప అందగాడుగా కనిపిస్తాడు. చూడండి ఆ ప్యాకెట్ విప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎంత చిరునవ్వు ఉందో, ఎంత సంతోషం కనబడతావుందో..
రెండు పుస్తకాలను అపురూపంగా బయటకు తీశాడు. నాకు ఒక పుస్తకాన్ని మా తమ్ముడు చేతిలో ఒక పుస్తకాన్ని ఉంచాడు. చిల్డ్రన్స్ నాలెడ్జ్ బ్యాంక్ పుస్తకాలవి.
నేనూ మా తమ్ముడు గబగబా పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తూ అందులో ఉన్న సమాచారాన్ని చాలా ఆత్రంగా చదివే ప్రయత్నం చేశాం. అప్పుడు మాకు ఎట్లా ఉందంటే ఆ రాత్రికి రాత్రే మొత్తం పుస్తకాన్ని చదివేయాలి అన్నంత ఉత్సాహం కలిగింది. మొత్తం మీద చాలా విలువైన పుస్తకాలని అర్థం చేసుకున్నాం.
తలలు వంచి ఆ పుస్తకాల పండుగలో మేం ఇద్దరం నిండా మునిగి ఉన్నప్పుడు, మా అమ్మ అంతకు ముందు అన్నదే మళ్ళీ అనేది. అయితే ఈసారి మాత్రం ఆమె గొంతులో అస్సలు కోపం ఉండేది కాదు.
"ఏమబ్బా.. ఇప్పుడీ పుస్తకాలు ఈ పిలకాయలకి అంత అవసరమా? వాళ్లు ఏమైనా ఇప్పుడు అర్జెంటుగా పరీక్షలు రాసి కలెక్టర్లు అయిపోవాలా?"
బీడీ తర్వాత బీడీ తాగడం మా నాయనకు అలవాటు.మధ్యలో కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు విరామం ఉంటుంది అంతే.
"ఎన్ని తూర్లు చెప్పినా ఇంట్లో బీడీ తాగవద్దని. ఏదైనా ఒకసారి చెబితే అర్థం కాదా నీకు?. ఇంట్లో ఇంత కంపు కొడతా ఉంటే పిల్లకాయలు ఎట్లా చదువుతారు? ఎట్లా బాగుపడతారు."అని కసురుకుంది గట్టిగా.
"బయట వాన లో చలిలో తిరుగతావుంటా కదా. ఒంట్లో చలి ఎక్కువ ఉంటుంది కదమ్మే. అయినా పిల్లోల చదువు పాడవుతుందంటే ఇంట్లో ఇంక ఎప్పటికీ తాగనులే."
అంతే. ఒక మాటే మా అమ్మ అనింది. కొన్ని ఏళ్లుగా మా నాయనకు ఉన్న ఆ అలవాటు ..ఇంట్లో బీడీ తాగే అలవాటును ఆ క్షణం మానేశాడు.ఆ రోజు నుండి మా నాయన చనిపోయేంత వరకూ , ఏ రోజూ ఇంట్లో బీడీ ముట్టించింది లేదు. వర్షం పడుతుంటే గొడుగు తీసుకొని, ఇంటి బయటకు వెళ్లి బీడీ తాగి వచ్చేవాడు.అదీ ఆయన నిక్కచ్చితనం.
చలికి తట్టుకోలేడని, స్వెటర్ కొనుక్కోమని మా అమ్మ మా నాయనకు కనీసం లక్ష సార్లయినా చెప్పి వుంటుంది.
రెండు మూడు ఏళ్లకు మాకు కొత్త స్వెటర్లు తెచ్చేవాడు కానీ, అయినా స్వెటర్ కొనుక్కునే వాడే కాదు. చాలా ఏండ్లు స్వెటర్ కొనుక్కోకుండానే అట్లాగే గడిపేశాడు.
"బస్సులో కూర్చున్నప్పుడు కిటికీ అద్దాలు మూసేస్తే చలి రాకుండా ఉంటుంది కదా డాడీ" అని అమాయకంగా అడిగాను.
ఆయన తన సహజ ధోరణిలో నవ్వినాడు కానీ ఒక్క మాట కూడా బదులు మాట్లాడలేదు.
మా అమ్మ మొహం నిండా ఆ నాటి వెలుతురు ఇప్పటికీ గుర్తే నాకు.
"లారీ లో వస్తే యూనిఫాం లో ఉంటాడు కాబట్టి చార్జీలు ఇచ్చే పని లేదు. ఆ బస్సు ఛార్జీలు మిగిలితేనే కదా,మీకు ఏదో ఒకటి తినటానికి తెచ్చేదానికి కుదురుతుంది".
నా మొదటి కథా సంపుటిని ఆయనకు అంకితమిస్తూ ఒక మాట అన్నాను. కనీసం వంద మంది అయినా నాకు ఫోన్ చేసి ఆ మాట గురించి మాట్లాడి ఉంటారు.
కొట్టి తిట్టీ
బలవంతంగా నా చేత
యాపిల్ తినిపించిన నాన్నా..
నువ్వెప్పుడైనా
ఒక్క పండైనా తిన్నావా తండ్రీ....
ఎరికిలోల్ల కతలు -02
మా నాయన చెమటలు కార్చుకుంటా, గసపోసుకుంటా , సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. సరిగ్గా ఊసురోమని ఆయన ఇల్లు చేరే టయానికి మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి “ జయమ్మక్కా... ఏమి చెప్పేది ఇట్లా అయిపోయిందే ..ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని ఏడిస్తే చాలు ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మా యమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే వుంటాయి. ఆ మూడూ కలిపి ఆ యమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం చిన్నప్పుడు ఎప్పుడూ చూడనే లేదు. మా నాయన రూపాయి రూపాయి కూడబెట్టి పదేండ్లకు అప్పుడు ఒకటి, అప్పుడు ఒకటి అని కష్టపడి చేపించిన సొత్తు అది.
మా ఇంట్లో ఏ గ్లాసు చూసినా, ఏ ప్లేట్ చూసినా, మంచం, టేబుల్ చూసినా, మేము చదువుకోవడాని రాసుకోవడానికి చేయించిన ఆ కాలం కరణాలు, వి ఏ ఓ లు వాడే చెక్క డస్కులు చూసినా.. మాకు మా నాన్న చెమటా , రక్తమే.. గుర్తుకు వస్తాయి ఎప్పటికీ. మేము తినే ప్రతి అన్నంముద్ద పైన అయన చెమట, రక్తం వుంటాయి అనేది మా అమ్మ. ఒక్క మెతుకు అన్నం కూడా వృధా కాకూడదని అంటుంది. అందుకే ఇప్పటికి మేము తినే ప్రతి అన్నం ముద్దకూ ముందు మా అమ్మా నాయనా గుర్తుకు రాకుండా వుండరు.
మా యస్టీ కాలని లోనే అదెందుకో తెలియదు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మా అమ్మే.. జయమ్మే..! అట్లా అని మేము ఏమీ వుండే వాళ్ళం ఏమీ కాదు. మా నాయన ఒక్కడే చిన్న జీతగాడు. ఇల్లు మొత్తానికి మా నాయన జీతమే ఆధారం. అందునా మా నాయనకు జీతం చాల తక్కువ. లంచాలు , మామూల్లు తెసుకునే మనిషి కాదు. ఆయన జీతం ఇంటికి చాలేది కాదు. అయన ఆరోగ్యం బాగా లేక, చిత్తూరు, బెంగళూరు, వేలూరు సి యమ సి., తిరుపతి రకరకాల ఆసుపత్రులకు తిరగడం, మందులు కొనడానికి అప్పులు చేయడం మెడికల్ లీవులు అన్ని వాడేసి, జీతం లేని సెలవులు వాడి,మొత్తం మీద సంవత్సరం అంతా వెతికి చూసినా అప్పులు లేని నెలే లేదు మాకు.క్యాలండర్ నిండా అప్పులతో, వడ్డీ లెక్కలతో, నిండిపోయేది. మేo ఎప్పుడూ పాత క్యాలెండర్లు పడేసింది లేదు. మా అమ్మ అందమైన చేతిరాతతో, ఎన్నో అంకెలు, సంఖ్యల తో క్యాలెండర్లు నిండిపోయేవి. ఎక్కడా ఖాళీ అనే మాటే వుండదు. ఇంటి వద్ద నాకు, మా తమ్ముడికి ఐదో తరగతి వరకూ రోజూ అమ్మే కదా ట్యూషన్ చెప్పేది. మాకు ఆ క్యాలండర్ లోనే లెక్కలు నేర్పేది. మాకున్న అప్పులు వడ్డీ బకాయిలతోనే లెక్కలు నేర్చుకున్నాం. మా అప్పులే మాకు ఎక్కాలు, లెక్కలు నేర్పింది. అట్లా చాలా కష్టాలతోనే మా బాల్యం గడచింది.
ఫారెస్ట్ డిపార్టుమెంటు లో ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం టార్గెట్ వుంటుంది. అడవిలోకి వెళ్లి మేత మేసే పశువులపైన పన్ను వుంటుంది. అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్మే వాళ్ళ నుండి అపరాధం వసూలు చేసి గవర్నమెంట్ కు కట్టాలి. ఆ నెల వచ్చిందటే చాలు మా అమ్మ మొహంలో కళ తప్పిపోయేది. ఎందుకంటే ఆ నెల మా నాయన జీతo తీసుకుని ఆయనకు ఆఫీసర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారం తను వసూలు చేసి ఉండాల్సిన మొత్తం అపరాధo కింద జీతం మొత్తం ప్రభుత్వానికే కట్టేసే వాడు.
“ మేయ్ జయా.. ఈనెల ఇంకా జీతం రాలేదు. లేట్ అవుతుంది, ఎట్లో నువ్వే ఈనెల సర్డుకోవల్ల ” అనే వాడు కుశాలగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. మళ్ళీ ఆయనే అసలు విషయం చెప్పేసి తప్పు చేసిన వాడిలా మా అమ్మ ముందు తల వంచుకునేసే వాడు. చేత్తో బీడీ ని అదే పనిగా నలుపుతూ వుండి పోతాడు కానీ, ఆ రోజంతా మా అమ్మ మొహం చూసే వాడు కాదు. ఆయనకి కానీ మా అమ్మకి కానీ అపద్దాలు చెప్పేది తెలియదు.మాకు ఎప్పుడూ వాళ్ళు అపద్దాలు చెప్పింది లేదు. మాకు అపద్దాలు చెప్పే అలవాటూ అందుకే రాలేదు.
ఒక నెల జీతం రాకపోతే అప్పో సప్పో చేసి ఇల్లు గడుస్తుంది కానీ , ఆరునెలలు పడుతుంది ఆ అప్పు వడ్డీ అంతా తీరి సరిగ్గా కుదురుకోవడానికి. “ ఏం చేసేదమ్మా ఖర్మ..అందర్లాగా కాదు, మా ఆయన పదకొండు నెలల జీతగాడు” అని మాత్రం అనేది. మా నాయనకు అమ్మ చేతుల్లో జీతం డబ్బు పెట్టేయడమే తెలుసు. అంతా అమ్మే చూసుకునేది. మా నాయన చాలా అమాయకుడని, టీ, బీడీ తాగడం తప్ప ఆయనకు ఇంకేమి తెలియదని మేం చిన్నప్పుడు అమాయకంగా అనుకునే వాళ్ళం.
అయితే మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ఎప్పుడైనా సరే ఆయన వచ్చే సమయానికి ఇంట్లో మా అమ్మ ఉందంటేనే ఆయన ఇంట్లోపలకి వస్తాడు. మా అమ్మ ఇంట్లో లేదంటే, ఇంటి బయటే అరుగు పైన కూర్చునేస్తాడు. నేను, మా తమ్ముడు ఇద్దరం ట్యూషన్ కి వెళ్లి ఉంటే, ఇంటి బయట మా అమ్మ చిలుకు(గొళ్ళెం ) పెట్టి వెళ్లి ఉంటుంది. చుట్టూ పక్కల ఇండ్లకు వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి ఎప్పుడూ తాళం వెయ్యదు. ఆమెకు తాళంవేసి వెళ్లే అలవాటు లేదు. ఎస్టీ కాలనీలో మా బంధువుల ఇండ్లన్నీ పక్క పక్క లోనే, కొంచెం ముందూ వెనకా ఉంటాయి. వాళ్ల ఇళ్లకు వెళ్లి రావాలంటే తాళం వేసి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని మా అమ్మ అనుకుంటుంది.
ఎక్కడికి వెడుతుందో ముందుగా చెప్పి వెళ్ళే అలవాటు ఆమెకు లేదు.
ఆమె లేకుండా ఇంట్లోపలకి వచ్చే అలవాటు మా నాయనకు లేదు.
ఇంటికి రాగానే కూర్చున్నంత సేపు ఆయన ఇంటి బయటే కూర్చుంటాడు. మూడో నాలుగో బీడీలు ఊది పారేస్తాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోయి ఉంటాడు. అడవిలో తిరిగివచ్చినా, చెక్ పోస్టులో డ్యూటీ చేసి వచ్చినా , అటవీశాఖ ఉద్యోగిగా ఆయనకు శారీరక శ్రమ ఎక్కువ. అందునా డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా బస్సు ఎక్కి ఇంటికి చేరడు. బస్సు చార్జీలు పెట్టడం ఆయనకు నచ్చదు కదా, లారీ లోనే ప్రయాణం చేసి వస్తాడు. ఆ మిగిలిన డబ్బులకి ఏ పండో , స్వీటో ఏదో ఒకటి మాకోసం తెస్తాడు కదా. ఖాకి బట్టలు వేసుకుని ఫారెస్ట్ చెక్ పోస్టులో ఆయన చేయి ఊపితే చాలు, ఏ లారీ అయినా ఆగిపోవాల్సిందే. ఆయన లారీలో చాలా దూరం ప్రయాణించటం వల్ల, బస్టాండ్ వద్ద లారీ దిగిన తర్వాత ఆయన బరువైన బ్యాగ్ మోసుకుంటూ చాలా అలసిపోయి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వస్తాడు.అప్పటికే అయన బాగా అలసిపోయివుంటాడు.
వయసు కూడా ఎక్కువ కాబట్టి, దగ్గు, ఆయాసం, ఉబ్బసం వల్ల అయన అప్పటికే గసపోస్తా ఉంటాడు.ఎంత దూరం వెళ్ళినా, ఎంత రాత్రయినా ఇల్లు చేరిపోతాడు. ఆయనకు ఉద్యోగం ఇల్లు, భార్య పిల్లలు తప్ప ఇంకో లోకం తెలియదు.అయన ప్రాణాలన్నీ మా పైనే ఉండేవి .ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇంకా ఈయన పని అయిపోయిందిలే అని అందరూ అనేసి, తల ఊపేసినా కూడా ఎట్లో మళ్ళీ మాకోసమే అన్నట్లు బ్రతికేసే వాడు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇల్లు చేరిపోయేవాడు.
ఇల్లు,భార్య,పిల్లలు అంటే ఆయనకు అంత ఇష్టం . శారీరకంగా ఎంత బలహీనుడైనా భార్యా, పిల్లల్ని ప్రేమించడంలో ఆయన్ను మించిన బలశాలి మాకు తెలిసిన లోకం లో ఇంకెవరూ లేరేమో?!
అంత అలసిపోయి వచ్చిన వాడికి ఇంటి ముందుకు రాగానే, తలుపులు మూసి ఉండటం గొళ్ళెం పెట్టి ఉండటం చూడగానే ఆయనకు ప్రాణం ఉస్సురు మంటుంది. ఎక్కడలేని నీరసం ముంచుకు వస్తుంది. విపరీతంగా కోపం వస్తుంది. మా నాయనకు అట్లా ఇంటికి ఆమె తాళం వేయకుండా వెళ్లడం అస్సలు నచ్చదు.ఆయన వచ్చే సమయానికి మా అమ్మ ఇంట్లో లేకపోవడంతో ఎప్పుడు పెద్ద గొడవ మొదలవుతుంది. తను ఇంటికి వచ్చే సమయానికి, మా అమ్మ ఇంట్లో లేకపోవడం, ఆయనకు కోపం వచ్చే సవాలక్ష కారణాలలో ముఖ్యమైనది.ఆయనకు అసలే కోపం ఎక్కువ. ముక్కు మీదే వుంటుంది కోపం.
మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది." నీ కేమబ్బా.. ఊరికే ఊరికేనే కోపం వచ్చేస్తుంది.అయినా చీమ చిటుక్కుమన్నా కోపం వచ్చే ఇలాంటి ఆగింతం మొగవాడ్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మొగుడు ఇంట్లో కూలి డబ్బులు అస్సలు ఇయ్యడమే లేదంటే , పిలకాయలు ఆయమ్మ పస్తులు ఉండారంటే, పిల్లోల్లకి వయసైపోతా వుంటే కూడా ఇంకా మునిదేవర చెయ్యలేదని పెద్ద గొడవ అయిపోయింది లే. ఆ కతేందో మాట్లాడదామని మా ఆడబిడ్డ పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయింటిని అది కూడా తప్పేనా..." అని దీర్ఘాలు తీస్తుంది.
చాలాసార్లు నెమ్మదిగానే తన గైర్హాజరికి మెత్తగానే జవాబు చెపుతుంది కానీ, ఒక్కోసారి మా అమ్మకు కూడా కోపం వచ్చేస్తుంది. “ ఇప్పుడు ఏమైందని అంత ఆగింతం చేస్తా ఉండావు? ఇంట్లో లబ్బి ఏమైనా పెట్టిండావా? బంగారం ఉందా? వెండి ఉందా? దుడ్లు ఉండాయా? ముడ్డి చుట్టూరా ముప్ఫయి ఆరు అప్పులు పెట్టుకొని బతకతా ఉంటే ఎవురో వస్తారంట.ఈడుండే సత్తు సామాన్ల కోసం..".
ఆమె కోపంగా చెప్పినా, ముక్కు చీదతా చెప్పినా, కరుగ్గా చెప్పినా, ఏడుపు గొంతుతో చెప్పినా మా నాయనకి ఆమె ఎప్పుడు ఏం చెప్పినా నచ్చేది కాదు.కానీ ఆమెకు బదులు చెప్పేవాడు కాదు.ఆయన కోపం ఎంత తీవ్రంగా వున్నా సరే , ఆమెకు కోపం వచ్చినప్పుడు అయన పూర్తిగా తగ్గి పోయేవాడు. అట్లా అయన తగ్గిపోవడమే వాల్లిద్దరి అన్యోన్యతకి కారణమేమో .
"మొగోడు అన్యంక చిలుకు తీసి తలుపు తోసి లోపలికి పోయి, బ్యాగు పడేసి, గుడ్డలు మార్చుకుని పంచ కట్టుకోవడం కూడా తెలీదా ఇంత పెద్ద మొగోనికి? నేను పక్కలోనే వుండి ఏం చెయ్యాలంట? ప్యాంటు విప్పి పంచ కట్టించాలా ?" ఆమె ఎదురుదాడి ప్రారంభిస్తుంది. మా అమ్మ గొంతు పెద్దదయ్యేకొద్దీ మా నాయన గొంతు మెత్తగా మారిపోతుంది. ఆమెకి నిజంగా కోపం వచ్చిన అన్ని సందర్భాలలో , ఆయన తప్పు వున్నా, లేక పోయినా ఆయన పూర్తిగా తగ్గిపోతాడు.అది మా అందరికీ బాగా తెలుసు.
" మేయ్ జయా.. టీ పెట్టు.." అని మాట మార్చేస్తాడు.
ఆ గొంతులో విన్నపం ఉంటుంది. బ్రతిమాలడం ఉంటుంది. ప్రాధేయ పడటం ఉంటుంది. అభ్యర్థన ఉంటుంది.అన్నిటికీమించి అప్పడా గొంతు ఎంతో తియ్యగా వుంటుంది. ఆ మాటల నిండా ఎంతో ప్రేమ వుంటుంది. మా నాయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు అనే మాట అది ఒక్కటే.ఆ టీ కూడా చాల వేడిగా పొగలు పోతూ వుండాలి. ముందుగా బాగా వేడి నీళ్ళతో గ్లాసు నింపాలి.గ్లాసు వేడెక్కాలి..ఆ టీగ్లాసు పట్టుకుంటే చేతివేళ్ళకు వేడి అoటుకోవాలి. టీ చప్పరిస్తే నాలుక చురుక్కుమనాలి. అప్పుడే దాని “టీ..” అంటాడు మా నాయన.అదీ టీ అంటే !
ఒకోసారి మా అమ్మ చుట్టుపక్కల ఇండ్లలో కాకుండా కొంచెం దూరం వెళ్లి ఉంటుంది. ఎస్టీ కాలనీలో పందులు మేపే వాళ్ళు ఉన్నారు. బాతులు మేపే వాళ్ళూ ఉన్నారు. ఎర్రమన్ను ముగ్గుపిండి అమ్మే వాళ్ళు ఉన్నారు. వెదురు దబ్బలు చీల్చి, చేటలు గంపలు తట్టలు బుట్టలు అల్లిక చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు.
మా అమ్మ వాళ్ళ నాన్న చిన్నయ్య అటవీశాఖ లో ఉద్యోగి.
మా నాయన వాల్ల నాయనేమో గాడిదలు మేపే వాడు. అదీ తేడా.!
అడవి నుండి ఎండు కట్టెలు గాడిదల పైన తీసుకొని వచ్చి, ఊర్లో అమ్మడం మా నాయన వాళ్ళ నాయనకు వృత్తిగా ఉండేది. ఆయనకు పందుల వ్యాపారం కూడా ఉండేది.అయన అస్సలు ఏమీ చదువుకోని వాడు. ఎట్లో ఒగట్లా కష్టపడి మా నాయన చదివినాడు కాబట్టి, అప్పట్లో ఫారెస్ట్ గార్డ్ గా ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆయనకి గాడిదలు కాసే పని తప్పోయింది. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఆ చిన్న ఉద్యోగమే లేక పోయి వుంటే మూడేండ్లు మా అమ్మ కోసం ఎన్నిసార్లు అయన చుట్టూ తిరిగినా, మా అమ్మను మా నాయనకు ఇచ్చి మా చిన్నయ్య తాత పెండ్లి చేసి వుండే వాడే కాదు.అందుకేనేమో మా నాయనకు అడవులు తిరిగే ఆ పని ఎంత కష్టం అనిపించినా, అస్సలు తను చెయ్యలేని పరిస్థితి లో వున్నా సరే ఆ ఉద్యోగం అంటే అంత ఇష్టం.డ్యూటీ నుండి ఇంట్లోపలికి వచ్చి, ఆ బట్టలు తీసి దండెం కు తగిలించాక ఆ గుడ్డలకు అయన రెండు చేతులతో దేవుడ్ని మొక్కినట్లు మొక్కుకునే వాడు. ఆ ఖాఖీ బట్టలంటే అంత గౌరవం ఆయనకి .
మామూలుగా స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలని టీచర్లు తిడతా వుంటారు. “ ఏమ్రా ..సరిగ్గా స్కూలుకు రాకపోతే చదువు ఎట్లా వస్తుంది మీకు ? సరిగ్గా సడువుకోక పోతే గాడిదలు కాసే దానికి తప్ప ఇంకా దేనికి మీరు పనికి రాకుండా పోతారు” అని . మా కాలనీలో వుండే పిలకాయలకి మాత్రం భలే నవ్వు వస్తూ వుంటుంది...ఆ మాటలు వింటా వుంటే .. అయినా అట్లా గాడిదలు కాసే పనో , పందుల్ని కాసే పనో హీనమైనదనో, నీచమైన పని అనో ఎందుకు పిల్లోల్లకి చిన్నపాటి నుండే అయ్యవోర్లు అట్లా తప్పుగా చెపుతారో మాకు అర్థం అయ్యేది కాదు.మాకైతే గాడిదలు గొప్పే, పందులూ గొప్పే.మా ఎరికిలోల్ల ఇండ్లల్లో పందులూ గాడిదలు మాతో బాటే కదా వుంటాయి.మాకు వాటిని తక్కువగా చూడటం మాకు అస్సలు చేత కాదు.
ఎందుకంటే మాఎరికిలోల్లల్లో పందులు మేపినా, గాడిదలు కాసినా, ఉప్పు అమ్మినా, వెదురు బుట్టలు డబ్బాలు, తడికలు అమ్మినా, అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టుకొచ్చి ఊర్లోకి మోసుకొచ్చి అమ్మినా, ఎర్రమన్ను, ముగ్గు పిండి అమ్మినా , పెద్దోల్ల ఇండ్లల్లో ఇంటి పని చేసినా, కూలికి పోయినా ఏం చేసినా మా బ్రతుకేదో మేం బ్రతకడమే మాకు తెలుసు. కష్టపడి సంపాదించడమే తెలుసు కానీ, ఎవురి సొత్తుకు పోవడం కానీ, ఇంకొకళ్ళ సొత్తు వూరికే ఆశించడం కానీ మాకు తెలియదు. గాడిదలు కాసినా, పందులు మేపినా ఆ జీవాల్ని ఎంత గొప్పగా, గౌరవంగా, ఇష్టంగా మా ఇండ్లల్లో మనుషుల మాదిరే అన్నాతమ్ముల మాదిరే, అక్క చెల్లెళ్ళ మాదిరే చూస్తాం తప్ప, అవేవో జంతువులని కానీ , మనుషుల కంటే చాల తక్కువైనవనే భావన కానీ మాకు అస్సలు వుండదు. మాతో బాటే అవీ ...
ఎందుకంటే మాకు పంది పిల్లలతో ఆడుకోవడం తెలుసు. గాడిద పిల్లల్ని చాకడమూ తెలుసు. పై కులమోల్లు గొప్ప గొప్పోళ్ళు అని అంటా వుంటారు కానీ, ఎందులో ఎవురేం గొప్పో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కులం అంటే తెలీదు, కానీ మా ఎరుకల కులం ఎందుకో చాల తక్కువైనదని మాత్రం బాగా తెలుసు. మేం దడాలున ఎవరి ఇంట్లోపలికి పోకూడదని తెలుసు.
అదేందో తెలియదు కానీ మా కాలని పిల్లోల్లని ఇంట్లో వుండే వాళ్ళు, స్కూల్లో అయివోర్లు, చిన్నా పెద్దా అందరూ కలసి ఎందుకు అంత భయపెడతారో అప్పట్లో తెలియదు. ఆఖరికి దొడ్డికి పోవల్లంటే కూడా మిగతా జనాలు పొయ్యే కాడికి మా కులం వాళ్ళు పోకూడదని అంటే, మా మల మూత్రాదులకి కూడా అంటూ, మైల ఉంటాయని తెలియదు.వాళ్ళది వేరు, మాది వేరు అని అమాయంగా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు.
ఇట్లా నిత్యం భయాలతో , అడగడుగునా ఆంక్షలతో పెరిగే ఎరికిల పిల్లోల్లు యెట్లా చదువు కుంటారో, యెట్లా బాగు పడతారో చెప్పే వాళ్ళు ఎవరు ? ఇప్పటికీ కులం అడిగి , చెప్పి చెప్పంగానే మొహం చిట్లించే వాళ్ళని ఎంత మందిని చూడలేదు ? అయితే మాకు కులాన్ని దాచి పెట్టుకుని అపద్దం చెప్పడం మాకు తెలియదు. ఎవరు మొఖాలు మాడ్చుకున్నా సరే, మా కులం ఏమిటో బెరుకు లేకుండా చెప్పాలని మా నాయన చెప్పేవాడు. దేనికీ భయపడ కూడదని మా అమ్మ చెప్పేది.
మా అమ్మ ఎప్పుడూ ఒకమాట అంటా వుండేది.. సంపాల్సి వస్తే ముందు.. భయాన్ని సంపెయ్యల్ల,అప్పుడే ఎట్లాంటి మనిషైనా బాగు పడతాడని చాల సార్లు అనేది. చిన్నప్పటి నుండి నాకు ఆ మాటలు బలంగా గుర్తుoడి పోయాయి. అందుకే నాకు ఎవురన్నా , ఏదేమైనా ఎప్పుడూ భయమే అనిపించదు.వుండేది వున్నేట్లుగా నిజాయితిగా పచ్చిగా ధైర్యం గా మాట్లాడతాను అంటే , చిన్నప్పుడు నేర్చిన ఆ చదువు కానీ , ఆ ధైర్యం కానీ అంతా మాయమ్మ పెట్టిన భిక్షే !
ఎవరైనా ఏదైనా మాట సాయమో, చేతి సాయమో అడిగితే, మా అమ్మ వెనకా ముందు ఆలోచించేది కాదు. మనిషి సహాయం అవసరమైతే ఇంట్లో కట్టెల పొయ్యి పైన బియ్యం పాత్రలో పొంగు వస్తా ఉంటే కూడా సరే, ఇంకోపక్క పప్పు చారు ఎనపాల్సి వుండినా సరే.. దాన్నట్లా చూసుకోండిరా అని చెప్పి ఆమె వెళ్ళిపోయేది. మేము లేకపోతే మండుతున్న కట్టెల పైన నీళ్ళు జల్లి ఉన్నఫలంగా వంట పనులు ఎక్కడికి అక్కడ అట్లాగే వదిలేసి ఇంటికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయేది.
ఈ పందులు మేపే వాళ్ళు, కాలనీలో కొంచెం దూరంగా ఉంటారని చెప్పినా కదా, అక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఆమె అటు వెళ్లిందంటే రావడానికి చాలా సమయమే పట్టేది.మేము ట్యూషన్ నుంచి వచ్చి ఆకలితో, ఏడుపు ముఖాలతో నిలబడితే మా నాయనకు మా అమ్మ పైన విపరీతంగా కోపం వచ్చేసేది.
" చిన్న పిల్లలని కూడా చూడకుండా యాడికి పోయినావు మే.. బుద్ధుందా నీకు? అట్లా చూడు ఆ పిలకాయల మొహాలు ఎట్లా వాడిపోయిండాయో.."అని కసిరే వాడు.
"ఏముండాది ఆ పక్క కాంతమ్మని వాళ్ళ ఇంటాయన కొట్టి చంపేస్తా ఉంటే అడికి పోయినా. ఆ నా బట్ట కి ఎన్నిసార్లు చెప్పేది ఆడదాన్ని కొట్టద్ధురా..అని. మిడిమాళం పట్టినోడు.. ఆ పాప ఓ..అని ఏడస్తావుంటే యాడ వాని చేతుల్లో చచ్చిపోతుందో అని పోయినా.. తప్పా?"
ఇంకేo అంటాడు మా నాయన ?
ఆయన నోట్లోంచి వచ్చే మాటలకు, ఆయన కోపానికి ఆమె అనే ఒక్క మాట అడ్డుకట్ట వేసేస్తుంది .ఆయన కోపం మొత్తం ఒక్క క్షణంలో మాయమైపోతుంది.
“ అయ్యో పోనీలే పాపం. నువ్వు సరిగ్గా టయానికి పోయినావు కాబట్టే ఆయమ్మకి దెబ్బలు తప్పోయి వుంటాయి. నాలుగు దెబ్బలైనా తగ్గి వుంటాయి లే . ఏదో ఒకటి మంచే జరిగిందిలేమ్మే . సరేలే ముందు ఈ పిల్లోల్ల కత చూడు ఇప్పుడైనా పాపం ” అని మా వైపు తిరిగి మా ముఖాల వైపే చూస్తూ మెల్లగా అనేవాడు గణేష్ బీడీనో, అశోకా బీడీనో ముట్టిoచుకుంటా . ఆ మాట అంటా అట్లాగే ఇంట్లోంచి బయటకు కదిలే వాడు. ఇంట్లో బీడిలు తాగకూడదని నాలుగో తరగతి చదివేటప్పుడు నేను గొడవ చేసినాను కాబట్టి. నేను నా జడ విప్పే వాడ్ని అయన మాటలు వింటా , ఆయన్నే చూస్తా.మొగ పిల్లోడికి జడ ఏమిటి అంటారా ?
మా అమ్మకు ఆడ బిడ్డలు అంటే చాలా ఇష్టం కదా . అందుకే మా అమ్మ తమ్ముడి కూతుర్ని, అన్న కూతుర్లని, చెల్లెలు కూతుర్లను ముదిగారంగా చూసుకునేది. అయితే మా అమ్మకు ఇద్దరూ మొగ బిడ్డలే కాబట్టి నాకు జడలు వేసేది. నేను స్కూలుకు రెండు జడలతో వెళ్ళే వాడిని. మునిదేవర జరగటం, మునీశ్వరుడికి తల వెంట్రుకలు ఇవ్వడం డబ్బు సర్దుబాటు కాకపోవడం వల్ల చాల ఆలస్యం అయింది.
ఎరుకల కుటుంభాల్లో డబ్బు వున్నా లేక పోయినా అప్పో సప్పో చేసి అయినా ఆడంబరం గా జరిపించే వేడుకల్లో మునిదేవర ముఖ్యమైనది. మునిదేవర జరిగి గుండు కొట్టిన తర్వాతనే నాకు క్రాఫు కు అనుమతి వచ్చేది. ఆ రోజు గొడవ కూడా మా అత్తవాల్ల ఇంట్లో వాళ్ళ పిల్లోడికి మునిదేవర యెట్లా చేయల్ల అనే దాని గురించే అంట. డబ్బు లేదని, అప్పు పుట్టలేదని మా మామ అంటే మా అత్త ఒప్పుకోలేదంట. పిల్లోడికి టయానికి మునిదేవర కూడా చెయ్యలేక పోతే నువ్వేం మొగోడివి అనేసిందంట. దాంతో మా మామకి కోపం వచ్చి మా అత్తను ఇష్టం వచ్చినట్లు కొట్టేసినాడంట. సరిగ్గా టయానికి మా అత్త వచ్చి అమ్మను తీసుకు పొయ్యింది కాబట్టి ఆ యమ్మకి దెబ్బలు తప్పోయిన మాట నిజమే అని అన్నo తినేటప్పుడు మా అమ్మే మా నాయనకు చెప్పింది.
నవ్వుతా నవ్వుతానే మా నాయన ఒక మాట అడిగినాడు మా అమ్మ కల్లా చూస్తా చూస్తా ..“ జయా ఉద్యోగం చేస్తా వుండే నాకే దేవర చెయ్యాలంటే ఆలోచిస్తా ఉండాదా. ఆ రమనయ్యకి యెట్లా కుదురుతుందిమే ”
అప్పుడైనా అసలు కథ చేపుతుందేమో అని ఒక్క క్షణం ఎదురు చూసాడు కానీ, మా అమ్మ తెలివిగా బదులు చెప్పేసింది. “ ఏముండాది ఎవురో ఒకరు మనసు పెట్టి ముందుపడి ఆదుకుంటే అయిపోతుందిలే. దేవుడి పనికి దేవుడే వస్తాడా యాడన్నా ?”.తల వంచుకునే వడ్డించింది, తల వంచుకునే అన్నం తింది. తల వంచుకునే మాట్లాడుతుంటే చిన్నపిల్లోల్లం మాకే అర్థం అయి పోయింది, ఇంక మా నాయనకు అర్థం కాకుండా ఉంటుందా ?
చూసి, చూసీ అడగనే అడిగేసాడు.
“ ఏమ్మే జయా.. కొత్త పెండ్లి కూతురి మాదిరి తల వంచుకునే వుండావు. సిగ్గు పడతా నా మొహం కల్లా చూడకుండానే మాట్లాడతా ఉండావే? ఏమైంది నీకీ పొద్దు ? ”
ఆమె అప్పటికీ తల పైకి ఎత్తదు.మా నాయన మొహం కల్లా చూడదు.అయినా అమ్మ అపద్దం చెప్పదు కదా, నిజమే చెపుతుంది. ఆయమ్మకు ధైర్యం చాలా ఎక్కువ కదా.భయమే ఉండదు కదా! . ఏం జరిగిందో చెప్పేస్తుంది.
“ వాళ్ళు పందులు అమ్మేదానికి ఇంకా టైం పడుతుంది కదా. అందుకే.. నా కమ్మలు ఇచ్చేసి వచ్చినా. కుదవపెట్టి మునిదేవర చేపించేయమంటి. ఏమిప్పుడు ? ” అని క్షణం ఆగి “ ఊ.... ” అంటుంది ప్రశ్నార్థకంగా.
అప్పుడు మా నాయనకు కోపం రాదు.బాధ కలగదు.ఆయన మొహం మామూలుగానే వుంటుంది. ఏ మార్పూ వుండదు.
నాకు చెప్పకుండా చేసినావే అని కానీ, నాకు ముందుగా చెప్పల్ల కదా అని కానీ, నన్ను అడగల్ల కదా అని కానీ అనే మాట అస్సలు రాదు ఆయన నోట్లోనుంచి.
ఏం మాట్లాడకుండా “ మీ అమ్మ ఒక మదర్ తెరిస్సా.. లేరా ” అని మా కళ్ళా ఒక చూపు చూసి నవ్వుతా బీడీ కట్ట అగ్గిపెట్టె ఎత్తుకుని , మా ఇంటి ముందు వుండే నెల్లికాయల చెట్టు దగ్గరకి వెళ్ళిపోతాడు. అదిగో కరెక్టుగా మా నాయన ఇంట్లోంచి బయటకు పోయిన ఐదారు క్షణాల తర్వాత మా అమ్మ తల పైకి ఎత్తి, వక్కా ఆకుతో గార పట్టిన ఎత్తు పళ్ళు కనిపించేలా నవ్వుతా మా వైపు చూస్తుంది.
ఎందుకో తెలియదు కానీ జయమ్మ మొహం లోకి అప్పుడు ఏదో వింత వెలుతురు వచ్చి వుంటుంది.
ఎందుకో అప్పుడు మా అమ్మ మాకు కొత్తగా అనిపించేది.ఎందుకో అంతకు ముందుకన్నా అప్పుడు మా అమ్మమాకు చాలా అందంగా కనిపించేది .
ఎరికిలోల్ల కథలు ( 03 )
“ రమేషు వచ్చిoడాడా ? వాడి గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “
యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి కొళ్ళాపురెమ్మ గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా prema , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది.
గుడి పక్కనే ఒక మొండిగోడల సగం ఇల్లు మీకు కనపడుతుంది.
పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు.
తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి కూర్చునో , లేదా పడుకునో ఉంటాడు.పగల్లో కానీ, ratrullo కానీ అతడికి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఆదమరచి నిద్రలోకి జారుకుంటాడు. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి కూర్చుని గుడ్డ పేలికతో తాడు అల్లడమో, వెదురు దబ్బలతో తట్టా, బుట్టా, చాటాలు చెయ్యడమో చేస్తుంటాడు. పగలుకు ratriki అతడి దృష్టిలో తేడా వుండదు.వానొచ్చినా, చలి అన్పించినా , ఎండ మటమటలాడిస్తున్నా అతడి పని అతడిదే. అతడి లోకం అతడిదే .ఆ గొంతు అతడిదే .!
“ ఈ కట్టే కాలిపోయే లోగా రమేషు వస్తాడు. వానికోసమే ఇదంతా. వచ్చినోడికి కష్టం తెలికూడదు. మళ్ళీ కడుపాత్రం ఇల్లు వదిలి దేశాంతరం వెళ్లి పోకూడదు చిన్నబ్బా... ” నారాయణప్ప తాత రోజూ చెప్పే మాటలే ఇది. అయినా నాకు ఎప్పుడూ విసుగు అనిపించదు.
ముసలాయనకు కళ్ళు సరిగ్గా కనిపించదు. ఆయనకు మొదటినుoడీ ఒక కన్ను పూర్హిగా కనిపించదు. అందరూ ఒంటి కన్ను నారాయణప్ప అనే పిలుస్తారు. దగ్గర దగ్గర ఎనభై ఏళ్లు వుంటాయేమో. నులక మంచం పైన కూర్చుని పని చెయ్యడమో, అదే నులక మంచం పైన పడుకుని gurru పెట్టి నిద్ర పోవడమో చేస్తూ ఉంటాడు.
ఆ పక్క ఎప్పుడు ఎవరొచ్చినా, ఎంత మాత్ర అలికిడైనా ఒక మాటే పదే పదే అడుగుతూ ఉంటాడు
” మా చిన్నోడు.. నా కొడుకు రమేష్ గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? మనోళ్ళు దేశం మొత్తం తిరగతానే వుంటారు కదా. ఎవురికైనా యాడైనా కనిపించాడేమో అడిగినారా? కుడికాలు ఎత్తుగా వుంటుంది. కాలు ఎగరేసి ఎగరేసి నడుస్తా ఉంటాడు. మట్టిలో కలిసే లోగా నా చేతులతో వాడికి కడుపునిండా అన్నం తినిపించల్ల. మునక్కాయల చారoటే వాడికి శానా ఇష్టం. కడుపు నిండా వాడు తృప్తిగా తిని, ఇంత కూడు వాడు నాకు తినిపిస్తే తినేసి, నా దోవ నేను సూసుకుంటా. నాకు ఇంకేం కోరికల్లేవు అబ్బోడా . నోరు, చెయ్యి కట్టుకుని , తినీ తినక మునెమ్మ దగ్గర దాచి పెట్టిoడేది అంతా ఆయప్పకి ఇచ్చేస్తే సాలు. నా pranam నెమ్మదిస్తుంది. ముందిది సెప్పు . నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా “
ఆ పక్క నుండి వస్తూనే మొత్తం కాలనీ ఇండ్లన్నీ నిలువు అడ్డం వరుసలలో కనపడతాయి. కొన్ని పాడు బడిపోయాయి, కొన్ని మరమ్మత్తు చేయించినవి. కొన్ని మళ్ళీ కొత్తగా అధునాతనంగా కట్టుకున్నవి. ఆ ఇండ్లు అన్నీ ఎరికిలోల్లవే . ఒక బోరింగు, సిమెంటు రోడ్లు, మురికినీటి కాలువలు మళ్ళీ వచ్చాయి. కులమోల్లు అందరూ కలసి చందాలు వేసుకుని కట్టుకున్నదే సల్లాపురెమ్మ గుడి.
చాల కాలం కింద ఎరికిలోల్లoదరికీ కాలనీఇండ్లు కట్టిoచేదానికి గవర్మెంటు ముందుకు వచ్చింది. అప్పుడు ఇండ్లు మాకు కావల్లంటే మాకు కావల్ల అని చాలామంది ముందుకు వచ్చినారు.టౌన్ లో ఇండ్ల స్థలాలకు డిమాండు ఎక్కువ కాబట్టి, ఎవరికీ స్వంతిండ్లు లేవు కాబట్టి అందరూ ఉత్సాహo చూపించారు.
కానీ అందుకు లబ్దిదారుల వాటాపేరుతో డబ్బు కట్టాలి అనేసరికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు .అంత డబ్బు మా వద్ద లేదంటూ ఒకరొకరే వెనక్కి జరిపోతావుంటే మా నాయన , మా అమ్మ , మా మామయ్య , మా చిన్నాయనల మొహాలు మాడిపోయాయి. ఎంతో కష్టపడి, ఎన్నెన్ని సార్లు అధికారులకి , ప్రజా ప్రతినిదులకి అర్జీలపైన అర్జీలు పెట్టుకుంటేనో ఎంతో కాలం తర్వాత యస్టీ కాలని మంజూరు అయ్యింది. ఆ కష్టం, ఆ శ్రమ తిరిగినోల్లకే తెలుస్తుంది. కాలనీ యెట్లా ఏర్పడిందో నేను చిన్నప్పుడు దగ్గరగా చూసింది మొత్తం నాకు ఇప్పటికీ బాగా గుర్తు వుంది.
ఎరికిలోల్లకి వూరి మధ్యలో , అదీ కాలేజీకి వెళ్ళే రోడ్డులో స్థలం కేటాయించడమే గొప్ప అని, ముందు ముందు స్థలానికి విలువ బాగా పెరుగుతుందని, గుడిసెల్లో, ఎర్రమట్టి ఇండ్లల్లో వుండేవాళ్ళు వాళ్ళ బిడ్డలకోసమైనా concreet ఇండ్లు కట్టుకోవాలని శతవిధాలా పోరాడినారు మా పెద్దోళ్ళు.
డ్యూటీ నుండి ఇంటికి రాగానే “ జయా అర్జెంటుగా మంచి స్ట్రాంగ్ టీ పెట్టు..” అని ఆర్డర్ వేసి , ఖాఖీ యూనిఫారం విప్పేసి , తెల్ల చొక్కా, తెల్ల పంచ కట్టుకుని టీ తాగి, టీ బాగుందిమే .. అని మెచ్చుకుని, గణేష్ బీడీ ముట్టించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు మా నాయన . కొన్ని వారాల పాటూ రోజూ సాయంత్రాలు, రాత్రిళ్ళు అందరి ఇండ్లకు తిరగటమే అయన పని. కొంత మంది అయితే ఆయన వచ్చి చెప్పిందే చెప్తాడని ఇండ్లల్లో సరిగ్గా అయన వచ్చే సమయానికి లేకుండా పోయే వాళ్ళు. అది కూడా మంచిదే అనుకుని ఆయన మట్టసంగా గుడిసె ముందు చాప వేయించుకుని, మిగిలిండే ముసలి వాళ్ళు , ఆడవాళ్ళoదరితో మీటింగు పెట్టేసేవాడు.
“ నాకేమో ఉద్యోగం వుండాది అలివేలమ్మా , పెంకుటింట్లో వున్నాను. వానొచ్చినా, వరదొచ్చినా నాకేమీ బాధ లేదు. మీ పరిస్థితి ఏందో నాకంటే మీకే బాగా తెలుసు. నా మాట వినoడి. మీ పిల్లోల్లకి సదువులకి బాగుంటుంది,మీకు మర్యాదగా వుంటుంది. ఎంత కాలమని విసిరేసినట్లు ఆడాడ గుడిసెల్లో పడి వుంటారు? ఊర్లో అంతో ఇంతో మతింపు వుండల్లంటే సొంత ఇల్లు వుండల్నా, వొద్దా మీరే తేల్చుకోండి. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తా వుంటే మీ మొగోళ్ళు వెనిక్కి వెనిక్కి పోతా వుండారు. సారయి తాగే దానికి మాత్రం దుడ్లు యాడినుంచో రోజూ పుట్టుకుని వస్తాయి. అరె దానేమ్మా సొంతంగా ఇల్లు కట్టుకోండిరా నాయనా అంటే మాత్రం మా కాడ దుడ్లు లేవు అనేస్తారు.దుడ్లు ఎవురికాడా ఎప్పుడూ వుండవు. కష్టపడల్ల, అప్పో సప్పో చెయ్యల్ల. పిల్లోల్ల మంచికోసం మనం తెగాయిoచల్ల .ఏ ఇల్లయినా వుండాది అంటే దాంట్లో ఆడోల్ల కష్టమే వుంటుంది.మీ కష్టం వూరికే పోదు, అయినా ఆడోల్ల పేరుతోనే కదా ఇంటి పట్టాలు, ఇండ్లు ఇస్తా వుండేది.. ఎవురిల్లు అంటే .. ఇది అలివేలమ్మ ఇల్లు, రాజమ్మ ఇల్లు అంటారే కానీ కుయ్యప్ప ఇల్లు, కపాలి గాడి ఇల్లు అనరు కదా. ”
అయన ఆమాటలు చెప్పి వచ్చేసినంక వాళ్ళ సందేహాలన్నీ తీర్చే పెద్ద మనిషి ఎవరో కాదు, వుంది కదా మా ఇంటి వెలుగు మా మదర్ తెరిసా.!మా అమ్మ .
ఇప్పుడైతే స్యయం సహాయక బృందాలు, వెలుగు మెప్మా సంఘాలు అని మీటింగులు పెడుతున్నారు కానీ , ఆ పని మా నాయన, మా అమ్మ ఏ కాలమో చేసేసినారు. మొగవాళ్ళు ముందుకు రాక పోయినా,సగం మనసుతో వెనకా ముందూ చూసుకుంటా వెనక వెనకే వుండి పోయినా, ఆడవాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పి వాళ్ళు కూడ బెట్టిన డబ్బులతో , అక్కడక్కడా వేరే వాళ్ళ దగ్గర అప్పులు ఇప్పించి మొత్తానికి బ్యాంకులో డిపాజిట్టు కట్టించేశారు.
“ ఒకురి బాధలు ఒకురికి చెప్పుకోవల్లంటే, ఒకురి కష్టానికి ఒకురు రావాల్లంటే, అంతా ఒక్క చోట వుంటే మంచిది కదా వదినా. నీ మొగుడు తాగేసి వచ్చి ఒంట్లో స్వాధీనం లేకుండా కొడతా వుంటే నువ్వే ఎన్నితూర్లు ఇండ్లమ్మడి ఆయప్పకి దొరక్కుండా పరుగెత్తుకు వచ్చిoటావు చెప్పు? అంతా ఒక్క చోటే వుంటే ఒకురికి ఒకురు తోడుగా వుంటారు కదా. ఎంత కష్టం లో అయినా మనిషికి మనిషే కదా ధైర్యం ఇచ్చేది. నా మాట వినండి, పందుల్ని మేపినా, గాడిదల పైన ఉప్పు అమ్మినా, తట్టా , బుట్టా అమ్మినా, యెర్ర మన్ను ముగ్గు పిండి అమ్మినా మనల్ని అడిగే వోడు లేదు. మన కాళ్ళ పైన మనం నిలబడి మన కష్టం మనం తింటా ఉండామే కానీ ఉన్నప్పుడు తిని, లేనప్పుడు పస్తయినా వుండామే కానీ, ఏ పొద్దూ ఒకురి సొత్తుకు పోము . అయినా మనం అంటే మన పిలకయలకి ముందు ముందు కొంచైనా మర్యాద ఉండాలా వద్దా చెప్పండి “ అని మా అమ్మ వాళ్ళను నిలదీసి అడిగేది.
“ అయినా ఈ మొగ నా బట్టలు మారతారoటావా ? ఇల్లు కట్టుకుంటే దినమ్మూ తాగేది మానేస్తారా వొదినా ? తాగిన్నాకొడుకులు గుట్టుగా ఇంట్లో ఉండిపోతే సాలు అంటే వినరే. పెండ్లాలు సెప్పేది వింటే యెట్లా?వాళ్ళు మొగోళ్ళు కదా, మొగోళ్ళు మొగోల్ల మాటలే వింటారు, సావనైనా సస్తారు కానీ , సచ్చినా ఆడోల్లు సెప్పే మంచి మాత్రం వినరు కదా. ఆడోల్ల మాట వింటే అంతకంటే అగుమానం ఇంకేమైనా ఉంటుందా ? raatri అయితే సాలు గుడ్డలిప్పుకుని ఈదుల్లోకి వచ్చేస్తారు. నా సంపాదన ఇంత అని రాగాలు తీస్తారు., ఈతలో పందిపిల్లలు రెండు ఎక్కువ పుట్టినా అదీ నా గొప్పే అనేస్తారు. గుడిసెలు, గుడిసెలో వస్తువులు చెప్పి, పండి పిల్లల్ని లెక్కేసి లెక్కేసి నాది ఇంత వుంది, నీది ఎంతరా అని కొట్టుకుంటారు. ఎనకటి పురాణాలు , తాతల కాలంనాటి రామాయణాలన్నీ అంత సారాయి గొంతులో పడేసరికి గుర్తుకు వచ్చేస్తాయి. “ ముక్కు చీదుకుంటా, ఒంటికి తగిలిన దెబ్బలని చూపిస్తా మొగుణ్ణి శాపనార్థాలు పెట్టడం లో మునిగి పోతుంది రాజమ్మ.
“ తాగినోల్లు తాగినట్లు గుట్టుగా వుంటే యెట్లా ? ఎవురు ఎంత ఎక్కువ తాగితే , ఎవురు ఎక్కువగా ఆడదాన్ని తంతే కదా ఆ నా బట్టలు మొగోల్లని అనిపించుకునేది. ” అలివేలమ్మకి జుట్టు ఎప్పుడూ నిలవదు.జుట్టు ముడి వేసుకుంటా ఆయమ్మ అట్లా అనగానే చంద్రమ్మ ఆవేశంగా లేచి నిలబడి చేతులు వూపతా అరుస్తుంది.
“ తాగేదంట్లో, ఆడోల్లని తన్నే దాంట్లో మొగతనం వుండాదని వీళ్ళకు నేర్పించినోల్లని తన్నల్ల ముందు. అంత సారయి నోట్లికి పడే సరికి ఉచ్చ నీచాలు మర్చిపోతారు, మానం మర్యాద మర్చిపోతారు. సగం జీవాలు .. పంది పిల్లలు వానెమ్మా తాగుడికే పోతే నేనూ నా పిలకాయలు ఏం తిని యెట్లా బతకల్ల అక్కా? తాగేస్తే వానికి ఒంట్లో స్వాధీనం వుండదు అక్కా, సూడు ఆ నాబట్ట చేసిండే పని ” అంటా అరుస్తా అరుస్తానే చీర విప్పేసి ఒంటినిండా కమిలిన గాయాల్ని చూపుతుంది ఆయమ్మ .
“దానికే నువ్వట్లా అబ్బారిస్తా వుంటే నేను ఎవురికి సేప్పుకోవల్ల అత్తా..? ” అని అంటా అంటానే సులోచనమ్మ చీర కొంగు కింద పడేసి వెనక వైపు జాకెట్ గుడ్డ పైకెత్తేసింది. ఆమె వీపు మొత్తం గాయాలతో నిoదిపోయింది. ఒంటిపైన తేలి కనిపిస్తున్న కమిలిన గాయాలను చూసి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మగవాళ్ళని తిడ్డడమే వాళ్లకు ఓదార్పు అయినట్లుగా అక్కడి వాతావరణం క్షణాల్లో మారిపోయింది. వాళ్ళకది మామూలే .
కొన్ని నిముషాల తర్వాత ఆ ఏడుపులే నవ్వులయ్యాయి. వేళాకోలాలు మొదలయ్యాయి. ఒకరి పై ఒకరు పడీ పడీ నవ్వుకోవటాలు, మొగుడి దెబ్బల నుండి యెట్లా తప్పించుకుందీ, పనిలో పనిగా మొగుడ్ని యెట్లా ఎదురు దెబ్బ కొట్టిందీ, చెప్పుకుని కుశాలగా మాట్లాడుకుంటూ మొత్తం మీద మా అమ్మ చెప్పిన మాటలకు ఒప్పుకుంటున్నట్లు తలలు ఊపుతూ “ మాకు ఎప్పుడేం అవసరం వచ్చినా నువ్వొక చెయ్యి వెయ్యాలమ్మా “ అని కూడా మాట తీసుకునేసారు.
“ మ్మోవ్ .. నాకుండేది మీకు అందరికీ ఉన్నెట్లు రెండు చేతులే. తలా ఒక్క చెయ్యి వెయ్యాలంటే కూడా నాకు ఈడ ముఫ్ఫై ఆరు చేతులు కావల్ల . ” అంటూ మా అమ్మ నవ్వుతూ తన రెండు చేతుల్ని దిష్టి తీస్తా వున్నట్లు గాల్లో గుండ్రంగా తిప్పి చూపించింది.
ఆ తర్వాత మా అమ్మ ఇంకో మాట కూడా అనింది “ వదినా నాకు రెండు చెవులు , రెండు చేతులే వున్నాయి. మీ అన్న కడుపు కాల్చుకుని సరిగ్గా తినీ తినకా ఎట్లనో జత కమ్మలు, గాజులు చేపించినాడు.
అవి ఎప్పుడూ ఎవరికోసమో ఒకరికోసం కుదవలోనే కదా వుంటాయి.ఇంకో జత కమ్మలుంటే బావుండేది వదినా , నా కోసరం కాదు, మీకే ఇంకో మనిషిని ఎవరినైనా ఆపదలో కాపాడింటాయి. ”
మా నాయనకు, పెరుమాళ్ మామకు , గోవింద స్వామి చిన్నాయనకు కాలనీ యెట్లా పుట్టిందో చెప్పుకోవడం వాళ్ళకు సంతోషం కలిగించే విషయాల్లో ముఖ్యమైంది.
“ నేల చదును చేసి, ముండ్ల కంపలు కొట్టి , బండరాళ్ళు ఏరి పారేసి ,ఆ ఇండ్లు కట్టేటప్పుడు మనుషులు పడిన బాధలు అన్ని ఇన్నీ కావు. చీమ తలకాయంత బంగారం కూడా వదల్లేదు, రాగి పాత్రలు, తట్టా,బుట్టా, గాడిదలు, పంది పిల్లలు, మేక పిల్లలు , కోళ్ళు , ఇనుప మంచాలు ఏమేమి వుంటే అవన్నీ అమ్ముకోక తప్పలేదు రా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎక్కడో విసిరేసినట్లు దూరదూరంగా వుండే వాళ్ళు, రకరకాల పనులు చేసే వాళ్ళు, అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముకునే వాళ్ళు, తేనే , మూలికలు, ఆకు పసర్లు అమ్ముకునే వాళ్ళు, బాతు పిల్లలు మేపే వాళ్ళు , వెదురు పని చేసే వాళ్ళు, యెర్ర మన్ను, ముగ్గు పిండి అమ్మే వాళ్ళు ఇట్లా రకరకాల మనుషులు ఒక్క చోటికి వచ్చి , కాయ కష్టం చేసి, తినీ తినక, కూలి నాలి చేసి, ఒకరి ఇంటి పనుల్లో మరొకళ్ళు వంతుల వారిగా పని చేసుకుంటూ ఒకరికొకరుగా నెలల తరబడి అహో రాత్రులు శ్రమ పడితే కదా కాలనీ ఇట్లుoడాది.” మా పెరుమాళ్ మామకు చెప్పిందే చెప్పటం అలవాటు.
రెండు దశాబ్దాల తర్వాత అయితే పరిస్థితులు క్రమంగా మారాయి. మనుషులు ఆ పాడు అలవాట్లనుండి బయట పడ్డారు, కొందరు తాగి తాగి ఆ తాగుడికే బానిసలై లోకం లోంచే వెళ్ళిపోయారు.అప్పుడు చాల కష్టపడి కట్టుకున్న ఇండ్ల స్థానం లో ఇప్పుడు కాలనీలో కొత్త ఇండ్లు కనపడతాయి. అక్కడక్కడా కొన్ని ఇండ్లు చరిత్రకు సాక్ష్యాలుగా మొండి గోడలతో, తలుపులు, వాకిళ్ళు, కిటికీలు లేకుండా కనిపిస్తాయి . ఒక్కక్క ఇంటిది ఒక్కో కథ కాదు. ఒక్కో మనిషికో కథను ఆ ఇండ్లు వినిపిస్తాయి.
లోకంలో లేకుండా పోయిన వాళ్ళ కథ యెట్లా వున్నా కడుపాత్రం దేశాంతరం పోయి , కరువు కాలం లో కంటికి కనిపించకుండా పోయిన వాళ్ళు ఇప్పటికైనా తిరిగీ ఇల్లు చేరుకుoటారేమో అని ఇంకా ఆ మొండిఇండ్లల్లో , మొండిగా బ్రతుకుతున్న ఆ మొండి మనుషుల ఎదురు చూపులే చూసేవాళ్ళకు కళ్ళ నిండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.
ఇప్పుడు అందరూ ముసలివాళ్ళయిపోయారు. వాళ్ళను కదిలిస్తే చాలు కన్నీళ్ళు నేలరాల్తాయి. వాల్లందరివీ కంటికి కడవెడు కన్నీళ్ళు నింపుకున్న జీవితాలే.!
ఒకప్పుడు ఎరికిల వాళ్ళు అంటేనే పోలీసులు, నాయకుల మొహాలు మారిపోయేవి.
“ స్టూవార్టుపురం అనే ఊరు మీ కోసమే పుట్టిందంట కదా. దొంగతనాలు చేసే వాళ్ళoదర్నీ అక్కడకు తీసుకు వెళ్లి దూరంగా పెట్టేసి దొంగతనాలు చెయ్యకుండా కట్టడి చేసారంట. ”
“ అయ్యా ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని మొత్తం కులాన్ని తప్పు పడితే యెట్లా ? గతాన్ని సాకుగా చూపి మొత్తం మా కులాన్నే తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఎక్కడ దొంగతనాలు జరిగినా ముందు మీరు మా ఇండ్లకాడికే వచ్చి వయసు మొగోల్లని, ముసిలోల్లని కూడా కుల్లబొడుస్తారు. ముసిలోళ్ళనయినా ఇడిసి పెట్టండి సారూ అని మేం అడుక్కుంటే ముసిలోల్లకే అనుభవం ఎక్కువ నేర్పరితనం, పనితనం ఎక్కువ అంటారు.మేం చెప్పే ఒక్క మాటైనా వినకుండా మమ్మల్ని అనుమానాలతో అవమానాలతో సంపేస్తావుంటే, మేం యాడికి పోవల్ల స్వామి ? ”
అప్పుడెప్పుడో ఆ ముసలాయన, ఆ నారాయణప్ప, ఆ ఒంటి కన్ను నారాయణప్ప పోలీసులకు ఎదురు తిరిగి మాట్లాడినాడంట . ఏదో దొంగతనం కేసులో వారం దినాలు అతడు , అతడి కొడుకు అశోక్ పోలీసు స్టేషన్ లో వుoడి వెనక్కి వచ్చిన తర్వాతే అశోక్ ఇల్లు వదిలిపెట్టి పోయిoది.
అలా పోయిన వాడు పోయినట్లే ఉండిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో , ఎందుకు వెళ్ళాడో చెప్పేవాల్లే లేరు. కొడుకంటే ఆయనకు ఉండే prema కంటే, కేవలం కులం కారణంగా అతడికి జరిగిన అవమానాల కారణంగా పోలీసులకు భయపడి అతడు అట్లా దేశంతరo వెళ్ళిపోవడం అతడ్ని బాగా కలచివేసింది.
పెళ్ళాం చనిపోయాక, కూతురు బాతులు మేపే భర్త కుటుంభంతో తమిళ దేశం వెళ్ళిపోయాక అతడు ఒంటరి వాడై పోయాడు. ఓపిక ఉన్నంత కాలం వంట చేసుకునే వాడు, కానీ వయసై పోయాక దగ్గరి చుట్టాలు పోసే కలో గంజో మాత్రమే అతడి ఆహారం. పండగలప్పుడు, దేవర్లప్పుడు, దినలప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోకుండా అంత కూడు తెచ్చి పెట్టేసిపోతారు.
దగ్గు అడ్డు పడటం వల్ల కొంచమే మాట్లాడతాడు నారాయణప్ప. మిగతాది మనమే అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మాటలమధ్యలోనే ప్లాస్టిక్ కవర్ లోంచి ఆకు వక్క సున్నం దుగ్గు నోట్లో వేసుకుని కసాబిసా నమలతాడు. వక్కా ,ఆకు తినీ తినీ నోట్లో పండ్లు గార పట్టిపోయి, నాలుక ,పళ్ళు పెదాలు ఎర్రబరిపోయి చూడడానికి రక్తం కక్కినట్లు కనపడతాడు.
“ ఏముండాది అబ్బోడా ఈ కులం లో పుట్టినందుకు ఏ తప్పు చెయ్యకపోయినా దండన పడల్లoటే యెట్లా చెప్పూ ? . నా బిడ్డ ఒకురి మాటకు కానీ ఇంకొకళ్ళ సొత్తుకు కానీ పోయే రకం కాదు.పద్దతిగా పెరిగినాడు, మందూమాంసం ముట్టనోడు, నీతిగా నిజాయితిగా బ్రతికినోడు. అట్లాంటోడ్ని నువ్వు దొంగతనం చేసినావు కదరా దొంగ ముండా కొడుకా.. తప్పు చేసినావని ఒప్పుకోరా అని గుడ్డలిప్పేసి కొడితే, వాడు ఆ పసికంద తట్టుకోలేక పోయినాడబ్బా. యాడికి పోయినాడో ఎల్లిపోయినాడు. నాకు దీపం పెట్టె టయానికి అయినా వస్తాడో, రాడో.. కళ్ళు కనిపించకుండా పోయినా , కళ్ళలోనే వున్నడబ్బా ...నా చిన్నోడు. పెండ్లీ, దేవరా లేకుండా పోయింది నా బిడ్డకి ”
చాలా కాలం తర్వాత కాలనీలో సందడి మొదలైంది.
గుడి బయట చాపలు వేసుకుని ఆదివారం సాయంత్రం నిరుద్యోగ యువకులు , కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్ళు అందరూ ఏదో మీటింగ్ పెట్టి కలుసుకున్నారు. గంటసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. చర్చించుకున్నారు.
“ అందుకే చెపుతున్నాను. బాగా అర్థం చేసుకోండి. యస్టీ కాలనీ అని కాలనీ మొదట్లో తోరణం మాదిరి పెద్ద బోర్డు పెట్టుకుని , మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. కాలేజీలో కానీ హాస్టల్లో కానీ ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏముందో చెప్పoడి. మన కులం పేరు చెప్పుకోవల్లంటేనే నామోషీగా వుంటుంది. అందుకే ముందు ఈ కాలనీకి పేరు మార్చేద్దాం. యస్టీ కాలనీ అని, ఎరికిలోల్ల కాలనీ అని అనటం మనకు ఏమైనా గౌరవంగా ఉందా మీరే చెప్పండి. ముందు కాలనీ పేరు మార్చేద్దాం, ఏమంటారు ? ”
అక్కడ కాసేపట్లోనే కలకలం మొదలయ్యింది.
కొందరు పూర్తిగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే , కొందరు ఆ మాటలని అంగీకరించారు.ఇంకొందరు తమ తమ వాదనల్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.
“ ఎవురి కులం వాళ్లకి గొప్పే, సమాజం లో కులాల మధ్య అంతరాలు పోతేనే సమాజం లో అసమానతలు పోతాయి. సమానతే మనoదరి కర్తవ్యం కావాలి. ఎవరి కులాన్ని అయినా చెప్పుకోవడం ఎవరికీ తక్కువా కాదు, నామోషీ కాదు. ”
“ నేను ఇంతకు ముందే చెప్పినాను మీరే వినలేదు.”
“ ఏం చెప్పినావు bro ..”
“ మనోళ్ళు అందరూ పేరు చివర ఎరుకల అని పెట్టుకోవాలి. నా పేరు అడిగితే నాగరాజు ఎరుకల అనే చెపుతా ”
వీళ్ళ హడావిడిలో వీళ్ళు వుంటే, నారాయణప్ప గొంతు బలంగా వినిపించిది వాళ్లకు. ఎనభయ్యేళ్ల ఆ ముసలాయన గొంతు ఏదో చెపుతున్నట్లు లేదు. దేన్నో తీవ్రంగా నిరసిస్తున్నట్లు , ఎవర్నో బలంగా నిలదీస్తున్నట్లు, ప్రశ్నిస్తున్నట్లు వుంది.
నారాయణప్ప దగ్గుతెరల మధ్యే గట్టిగా అన్నాడు. “ ఆ కులం పేరు సేప్పినందుకే కదా స్వామీ ఒక కన్ను పోయేలా కుమ్మేస్తిరి. ఆ కులం పేరు సేప్పినందుకే కదా స్వామీ కొడుకుని దేశాంతరం పోయేలా తరంగొడితిరి. మేం చెప్పేది వినండ స్వామీ మీ కాళ్ళు మొక్కుతాం అంటే మా కులం పేరు మాత్రమే కదా స్వామీ ఇన్న్యారు. అంతే ,కానీ ఇంకేమైనా ఒక్క మాటైనా మేం సెప్పింది ఇంటిరా దొరా? ఈ కులం లో పుట్టడమే మా తప్పా స్వామీ ? ”
ఎరికలోల్ల కథలు - 3
అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం దక్కదు.
ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా పూలహారాలే.
” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు. ఇంకో మాట కూడా అనేశారు . ” ఎరికిలోలల్లో ఏ సావుకైనా పై కులమోల్లు ఇంత మంది వచ్చిండేది చూసినారా ? అదీ కాంతమ్మంటే! ”
ఎంతో మందిలో కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది. ఒకళ్ళ గురించి పదిమంది పదికాలాల బాటూ మంచిగా చెప్పుకున్నారంటే, అదే వాళ్ళు చేసుకున్నభాగ్యం.అట్లా భాగ్యవంతురాలనిపించుకున్న వాళ్ళల్లో మా అత్త పేరు తప్పకుండా వుంటుంది. ఆమె పేరు కాంతమ్మ.
ఆ పేరు చెప్తే జనాలకు ఆమె ఎవరో కొంతమంది తెలీదని చెపుతారు, కానీ కొళాయి కాంతమ్మ అంటే మాత్రం, పాతపేటలోనే కాదు, కొత్తపేటలో కూడా జనం ఆమె గురించి కథలు కథలుగా చెప్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే, పెద్ద పెద్ద నాయకులకు లాగా చాలా మందికి ఆమె ముఖ పరిచయం లేకపోయినా, ఆమె పేరు, ఆమె గురించిన సంగతులన్నీ చెప్పేస్తారు.అదీ ఆమె ప్రత్యేకత.
అట్లాగని ఆయమ్మ పెద్దగా చదువుకునిందని కాదు, పెద్ద ఉద్యోగం చేసిందనీ కాదు. ఆమె సంపాదించిన ఆస్థిపాస్తులు ఏమీ లేవు. నిజానికి ఆమె ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అయినా “ హోల్ ఇలాకాలోనే ఎరికిలోల్ల కాంతమ్మ అంటేనే వుండే గౌరవమే వేరు. ఆయమ్మ సెయ్యి మంచిది, ఆయమ్మ నోరు మంచిది . ఆయమ్మ గుణం మంచిది ” అని జనం అనటం వెనకాల ఆమె నిలుపుకున్న పెద్దరికం అలాంటిది. పది మందిని సంపాదించుకున్న ఆమె మంచితనం అలాంటిది .
చిన్న బoకుఅంగడి పెట్టుకుని, ఆ చిన్న బంకులోనే అన్నీ పొందిగ్గా అమర్చి పెట్టేసేది. పాతపేటలో అప్పట్లో అంగళ్లు తక్కువ ఉండేవి. పలమనేరు వూరి మధ్యలో నాలుగో నంబరు జాతీయ రహదారి వెడుతుంది. యo.బి.టి. రోడ్డు అంటారు.మద్రాస్, బెంగుళూరు గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఆ రోడ్డుకు అటు వైపు కొత్తపేట, ఇటు వైపు పాత పేట వుంటాయి. యస్టీ కాలనీ వుండేది పాతపేటలోనే. కాలనీలో జనమే కాదు చుట్టూ పక్కల ఆరేడు వీధుల్లో వాళ్లకి, ఎవరికేం కావాలన్నా, పదో ఇరవయ్యో సరుకు అప్పు కావాలన్నా , ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కొళాయి కాంతమ్మ అంగడే .
రకరకాల వస్తువులు, ఆకుకూరలు, కూరగాయలు, రోజువారీ, వారంవారీ కంతుల కింద అప్పులు తీసుకునే వాళ్ళ కోసం , అప్పు జమా నిల్వలు చూపించే పాకెట్ సైజు లెక్కల పుస్తకాలు, బాండు పేపర్లు , రెవిన్యూ స్టాంపులు,స్కూలు పిల్లలకోసం పెన్నులు, పెన్సిళ్ళు, ఆడపిల్లలకు కావాల్సిన సామాగ్రి రకరకాల వస్తువులు ఆ చిన్నఅంగడి లోనే అందంగా అమర్చుకునేది. ఆ కాలంలో నాల్గో, ఐదో క్లాసు చదివినారంటే ఈ కాలం డిగ్రీ వాళ్ళతో సమానం కదా ఆ చదువు. ఆమెకి లోక జ్ఞానం , జ్ఞాపకశక్తి రెండూ ఎక్కువే. ఏ లెక్క అయినా, ఎంత కాలం అయినా, ఎవురెవరు ఎంతెంత బాకీ వున్నారో ,ఆమె కాగితం , పెన్నూ వాడకుoడానే చెప్పేయగలదు. వినే వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ నోటు పుస్తకాల్లోనో , క్యాలండర్లోనో ,డైరీలలోనో వాళ్ళు రాసింది ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ తిప్పించి మళ్ళించి చూసుకునే వాళ్ళు. అన్నీ చూసుకుని ఆయమ్మ చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళు.
వీధి కొళాయి దగ్గర రోజూ జరిగే పంచాయతీలను పెద్దరాయుడి మాదిరి తీర్చేది మా అత్త . కొళాయి దగ్గర ఎవరికీ పెద్దరికాలు లేవు. అక్కడ అందరూ సమానమే. ఒకరు గొప్ప అని కానీ, ఇంకొకరు తక్కువ అని కానీ తేడాలు అక్కడ లేవంటే ఆమె దశాబ్దాలుగా అమలు చేసిన ఆ సమానత్వమే అందుకు కారణం.గలాటాలు,తోపులాటలు మాటల యుద్దాలు లేకుండా , వచ్చే నీళ్ళను సక్రమంగా అందరికీ అందేటట్లు ఆమె చూసేది. కొళాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహాలు కడుక్కుని తల దువ్వుకుని శుభ్రంగా రావాలని పట్టు పట్టింది. ఎరికిలోళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఇండ్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, ఉన్నంతలో శుభ్రతలో కూడా ముందు ఉండాలని ఆమె తనకులపోళ్లకు శతవిధాలా చెప్పుకొచ్చింది. పందులు మేపేవాళ్లయినా సరే అది వృత్తి వరకే పరిమితం కావాలని, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు శుభ్రంగా ఉండాలని, శుభ్రత ముఖ్యమని ఆమె ఆ కాలం నుంచే మనుషుల్ని మారుస్తూ వచ్చింది. పిల్లలు ఎవరు ఇంటిదగ్గర కనిపించినా బెత్తం తీసుకొని వాయించేది. ఎందుకు స్కూలుకు పోలేదా అని ఆరా తీసేది. ఆ పిల్లల అమ్మానాన్నలకు చదువు విలువ గురించి హితబోధలు చేసేది. కారణం లేకుండా ఒక పూట అయినా పిల్లలు స్కూల్ కు పోకపోతే ఆమె కంటికి కనిపించారంటే ఆమె అసలు ఒప్పుకునేది కాదు. ఆడపిల్లల్ని చదువు మానిపించే ప్రయత్నం చేసినా, చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ప్రయత్నించినా, ఆమె ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేది. వాళ్ళ పైన తిరగబడేది. ఆమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ విపరీతంగా కొట్లాడేది. రచ్చ రచ్చ చేసేది. వాళ్లను బ్రతిమలాడేది, ఏడ్చి మొత్తుకునేది, చేతులు పట్టుకుని అడుక్కునేది. పిల్లల గొంతులు కొయ్యవద్దని భవిష్యత్తు నాశనం చేయొద్దని ఆమె నచ్చచెప్పేది. కొనే శక్తి లేని పిల్లలు ఎంతో మందికి ఆయమ్మ పలకా బలపాలు, పుస్తకాలు, పెన్సిల్లు, పెన్నులు ఉచితంగా ఇవ్వడం అందరికీ తెలుసు.
ఆడపిల్లలు మొగుడి దగ్గర దెబ్బలు తిని ఏడుస్తా కనిపించినా, ఆమె దగ్గర సలహా కోసం వచ్చినా ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.
“ ఆడదనిపైన చెయ్యి చేసుకోవడం కూడా ఒక మొగతనమేనారా ?ఎంతో మురిపంగా సాకి బిడ్డను ఇచ్చేది మొగోడి వంశాన్ని నిలబెట్టే దానికి. భార్య అంటే తల్లి తర్వాత తల్లి మొగోడికి. ఆ బుద్ధి మొగోల్లకి ఉండల్ల. అత్త కూడా ఆ మాదిరే తన కోడలిని చూసుకోవల్ల.ఒక ఆడదానికి ఇంట్లో వుండే ఆడోల్లు సప్పోర్ట్ ఇస్తే సాలు, ఇంకేమి అవసరం లే ..అప్పుడు ఏ మొగోడి చెయ్యి అయినా పైకి లేస్తుందా ? ” అని వాదించేది.
ఆడోల్లకు చెప్పాల్సింది అడోల్లకి, మొగోల్లకి చెప్పాల్సింది మొగోల్లకి చెప్పేది. కులపోల్ల ఇంటి గలాటాలకి ఆడోల్లు నోర్లు లేనోళ్ళు, గట్టిగా మాట్లాడనోల్లు, మొగోల్లని నిలదీసే ధైర్యం లేనోల్లకి ఆమే ఒక ధైర్యం . వాళ్ళ తరపున ఆయమ్మే పంచాయతీలో మాట్లాడేది, వాదించేది.
“నమ్మినోల్లకి ప్రాణం అయినా ఇస్తారు కానీ , ఎరికిలోల్లు ఎవురికీ నమ్మక ద్రోహం చెయ్యరు. ఎరికిలోల్ల ఇండ్లల్లో పుట్టుక పుట్టినాక ఒక తెగింపు ఉండల్ల బ్రతికేదానికి. మనం కరెక్టుగా వున్నప్పుడు ఏ ఆడదైనా ఏ మొగనాబట్టకైనా భయపడాల్సిన పనేముoడాది ? ”అని ఆడోల్లకి ధైర్యం చెప్పేది.
“ ఆడది వూరికే బోకులు తోమి, ఇల్లు వాకిలి పిల్లల్ని చూసుకుంటాను అంటే కుదిరే కాలం కాదుమ్మే ఇది. ఆడది కూడా ఏదో ఒక పని చెయ్యల్ల. కోళ్ళు పెంచుతారో , పందుల్ని మేపుతారో, కూలికే పోతారో, ఆవుల్ని పెట్టుకుంటారో, గంపలు ,చేటలు, బుట్టలు అల్లుకుంటారో అది మీ ఇష్టం. మీ కష్టానికి ఓ విలువుండల్ల, మీ సంపాదనకో లెక్క వుండల్లoతే. ” ఇదీ ఆమె అభిప్రాయం.
ఆమె ఇప్పుడు లేదు. చనిపోయి ఆరేళ్ళు అవుతోంది. ఎరుకల ఇండ్లల్లో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును, ఎంతోమంది ఆడవాళ్ళ సంసారాలను కాపాడిన ఆమె గురించి దీపం పెట్టే ఏ ఇంట్లో అయినా తలుచుకోని వాళ్ళు ఉండరు.
మా నాయనకు వరసకు ఆమె చెల్లులు అవుతుంది. మా నాయనకు స్వంత అక్కా చెల్లెళ్ళు ఉన్నప్పటికీ, ఆ అత్తావాళ్ళకంటే కూడా మాకు కాంతమ్మ అత్తే ఎక్కువ. ఎందుకంటే ఆమె మా పట్ల కనపరచిన ఆపేక్ష అలాంటిది. మా అమ్మతో ఆమెకు గల స్నేహం అలాంటిది. అందుకే మా అత్త అంటే మాకు చాల ఇష్టం .
“ ఆ యమ్మకు మనుషులంటే భలే ప్రీతీ నాయినా, మనుషులతో మాట్లాడకుండా వుండలేoదు.దారిలో పొయ్యేవాళ్ళు ఎవరైనా ఆయమ్మను మాట్లాడక పోయినా , ఆయమ్మే నొచ్చుకుని పిలిచి మరీ మాట్లాడేది. ఏం ఎత్తుకుని పోతామబ్బా.. ఉండేది నాలుగు నాల్లె. ఆ నాలుగు నాళ్ళు, నాలుగు నోళ్ళల్లో మంచి అనిపించుకుని పోతే పోలేదా. అంత మాత్రానికి కోపాలు, గొడవలు , అపార్థాలు దేనికి మనుషుల మధ్య ?“ అనేది.
అట్లా అనడటమే కాదు, అట్లానే బ్రతికింది కడదాకా . ఆయమ్మ ఎంత నిఖార్సైన మనిషంటే , ఒక్క ఉదాహరణ చాలు చెప్పటానికి.
ఎంత జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఎట్లాంటి అనారోగ్యం ఎదురైనా సరే ఒక్క పూటంటే ఒక పూట అయినా ఆయమ్మ ఎవరింట్లో ఇంత ముద్ద తిని, చెయ్యి కడిగింది లేదు. చేసుకునే శక్తి వున్నప్పుడు తనే వండుకుని తినింది.కానీ ఒంట్లో ఆ శక్తి లేకపోతే, ఎంత సొంత మనుషులైన ఇంట్లో అయినా సరే, ఒక్క పూటైనా ఆమె అన్నం తినింది లేదoటే ఆయమ్మ పట్టుదల ఏపాటిదో అర్థం అవుతుంది. ఆయమ్మకు ఒకరికి పెట్టడమే తెలుసు కానీ, ఒకరింట్లో తినడం తెలియదు. ఒకరికి ఇవ్వటమే కానీ ఇంకొళ్ల దగ్గర చెయ్యి చాపింది లేదు.
ఆమెకు అరవయ్యేళ్ళు కూడా రాకుండానే పెద్ద జబ్బు చేసింది. నోట్లో పుండు లేచింది. కొడుకులు, కూతుర్లకి ఆయమ్మ అంటే చాల ఇష్టం కదా, చాలామంది డాక్టర్ల వద్ద చూపించారు.పలమనేరు, చిత్తూరు, తిరుపతిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల వద్దే చూపించారు కానీ , డాక్టర్లు ఆమె బ్రతకదని చెప్పేసినారు.
చెప్పకూడదని అనుకున్నారు కానీ, ఆమెకు ఎవరూ చెప్పకుండానే తన పరిస్థితి అర్థం అయిపోయింది. ముందు బాగా ఏడ్చింది. ఆమెకు అసలే మనుషులంటే అకారణమైన ప్రేమ కాబట్టి , మనుషుల్ని తలచుకుని తలచుకుని , గుర్తు తెచ్చుకుని మరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఒక రాత్రి రెండు పగళ్ళు, తిండీ , నీళ్ళుమాని మరీ ఏడుస్తూ వుండి పోయింది . ఏమవుతుంది ఈమె? అంత ధైర్యం గల మనిషి ఇట్లా అయిపోయిందే అని పిల్లలు భయపడిపోయారు.
కానీ ఏదో ఒక అధ్బుతం జరిగినట్లు ఆమెకు ఎక్కడినుంచి వచ్చిందో కానీ అంత ధైర్యం ఉన్నట్లుండి ఎక్కడి నుంచో వచ్చేసింది . అదిగో ఆ మహత్తర క్షణం నుండి ఆమె మారిపోయింది.
అప్పటిదాకా ఆయమ్మతో యెట్లా మాట్లాడాలో, ఆమెకు ఏం చెప్పి ఎట్లా ఓదార్చాలో అర్థం కాని కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు కోడలికి ఆమెలో వచ్చిన మార్పు ఒక షాక్ లాంటిది . అంత వరకూ ఆమెకు ఇంట్లో ఏమి కుదిరితే అది తినడటమే అలవాటు. అది సద్దిది కావచ్చు, సంగటి కావచ్చు, చారు, ఊరిబిండి కావచ్చు, పచ్చిపులుసు కావచ్చు.ఆమె చిన్నపటినుండే చాల కష్టాల్లో పెరిగిన మనిషి కదా ఆమెకు అన్నం విలువ, ఆకలి విలువా బాగా తెలుసు.
అప్పట్లో ఆమె చిన్నతనంలో కరువు కాలంలో గంజి తాగి బ్రతికిన మనిషి.అడవికి వెళ్లి కాయలు పండ్లు, మూలికలు, తేనె తెచ్చి అమ్మి బ్రతికిన మనిషి.
“ అత్తా చెట్లు కొట్టడం కూడా పాపమే కదా, తెలిసి నేను ఏ పాపం చేయాలేదురా అబ్బోడా .. అంటా ఉంటావు కదా ఎప్పుడూ ..” అని నేనోసారి మాటవరసకి ఆమెని అడిగేసాను.
అప్పుడు ఆయమ్మ మొహంలోకి నవ్వు వచ్చింది.
ఎప్పుడూ వక్కాకు వేసుకుని నమిలి నమిలి ఆమె పళ్ళు ఎప్పుడో గారబట్టి పోయాయి.ఆమె నోరు అందుకే ఎప్పుడూ ఎర్రగానే వుంటుంది. వక్కా,ఆకూ లేకుండా ఆమెకు ఒక పూట కూడా గడవదు. ఆమె నడుముకు, ప్రత్యేకంగా టైలర్ ముందు నిలబడి మరి దగ్గరుండి కుట్టించుకున్న గుడ్డ సంచి వేలాడుతూ వుంటుంది ఎప్పుడూ. వక్కాకు తిత్తి అంటారు, దాన్ని నడుముకు ఎప్పుడూ చెక్కుకునే వుండేది. మూడు నాలుగు అరలు ఉండేవి ఆ సంచికి. ఒకదాంట్లో డబ్బు పెట్టుకునేది. ఇంకో దాంట్లో అవసరమైన మాత్రలు, ఇంకోదాంట్లో వక్కా ఆకు సరంజామా. ఆమెకు నైటీలు అలవాటు లేదు కాబట్టి రాత్రి నిద్రలో కూడా వక్కాకు సంచిని ఆమె నడుముకే అంటిపెట్టుకుని వుండేది .రకరకాల చీరరంగులకు జోడీ కుదిరేవిధంగా ఆమె వక్కాకు తిత్తి రకరకాల రంగుల్లో తయారుగా వుండేవి.
“ అబ్బోడా నాకు ముందునుంచే పాప భయం ఎక్కువ, మీ తాత చిన్నయ్య మన ఎరికిలోల్ల ఇండల్లో పుట్టల్సినోడు కాదు కదా, మమ్మల్ని యెట్లా పెంచినాడు అనుకున్యావు? చీమకు కూడా అపకారం సేయ్యకూడదని , పచ్చని చెట్టు కొడితే మహా పాపం అని రోజూ పాఠo మాదిరి దినామ్మూ చెప్తానే కదా మమ్మల్ని పెంచినాడు.మీకు చెపితే నవ్వుకుంటారు కానీ,మా ఇంట్లోకి తేలు, జర్రి ఎన్నో మార్లు వచ్చింటాయి కానీ ఒక్కసారి కూడా నేను చంపిన దాన్ని కాదు, పచ్చని మాను కొడితే పాపం అని కదా మా నాయన మాకు నేర్పించినాడు, అడవిలో ఎండుకట్టెలు ఏరుకుని సైకిల్ పైన పెట్టుకుని తోసుకుంటా తెచ్చేదాన్ని రా . సైకిల్ పైన ఫుల్లుగా కట్టెలు పేర్చుకుని తోక్కేది రాదు కదా అప్పట్లో , సైకిల్ తోసుకుంటా వచ్చేసే దాన్ని.మా వయసు మగోల్లకన్నా నా సైకిల్ పైనే ఎక్కువ కట్టెలు ఉండేవి. ఏం? మేం దేంట్లో తక్కువ? మాకూ మొగోల్లకి ఇంత తేడా ఎందుకని పోట్లాడే దాన్ని ? ఆ తర్వాత కాలంలో సైకిల్ నేర్చుకున్నా కానీ, ఆ తర్వాత తర్వాత వయసు బిడ్డ అని, నన్ను అడవికి పంపడం మాన్పించేసినాడు మా నాయన. ”.
ఆమె చిన్నతనంలోనే అన్ని పనులు, అన్ని విద్యలు నేర్చుకుంది. ఆమెకి చెట్లు ఎక్కడం కాయలు, పండ్లు, చింతాకులాంటివి కోయడం తెలుసు. దోటీతో చింతకాయలు రాల్చడం తెలుసు. చింతపండు కొట్టటం తెలుసు, రకరకాల మూలికావైద్యం తెలుసు. రెండు కాన్పులు అయ్యాక, మంత్రసాని పని కూడా నేర్చుకుంది. ఎవరికి ఏం సహాయం చేసినా ఎప్పుడూ ఆమె డబ్బు తీసుకోదు. మనిషికి మనిషి సాయం కదా అంటుంది.
మా అత్త చెప్పక పోయినా అవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే. చిన్నప్పటి నుండి మేం ఆమె గురించి కథలు కథలుగా వింటూ పెరిగిన వాళ్ల మే కదా.
అయినా నాకు మా అత్త నోటివెంట ఆమె చిన్నప్పటి సంగతులు వినటం ఎప్పుడూ ఇష్టంగానే వుంటుంది. ఆమెకు కూడా వాళ్ళ నాయన గురించి, మా నాయన గురించి మా అమ్మ గురించి చెప్పటంలో ఆమె కళ్ళనిండా, గొంతు నిండా సంతోషం కనిపించేది.ఆమెకు ఎవరికీ లేనంత ఇష్టం మనుషులంటే బంధువులంటే ఎందుకు వుందో మాకు అర్థం అయ్యేది కాదు.
“ మా నాయన మాకు నేర్పింది ఒకటే అబ్బోడా ధైర్యంగా బతకడం. అది చాలు అబ్బోడా. ధైర్యం ఉంటే చాలు ఎట్లాగైనా తెగించి బ్రతికేయొచ్చు! దేంట్లోనూ ఆడోల్లు మొగోల్లకంటే తక్కువేమీ కాదురా, ఎరికిలోల్లల్లోనే కాదు ఏ కులం లో అయినా అంతే .! ఆడోల్లు మగోల్లకన్నా తక్కువేమీ కాదు.! ”
ఆ మాట అంటున్నప్పుడు ఆమె స్థిరత్వం, ఆమె ధైర్యం ఆమె తెగింపు నాకు ఆమె మొహంలో స్పష్టంగా కనిపించేది.
అయినా ఆమె చివరిదినాల్లో ఎందర్ని కలవరించిందో, ఎందుకు కలవరించిందో మాకు సరిగ్గా తెలియదు. ఎంత బాధలో వున్నప్పటికీ ఆయమ్మ నాకు ఈ నొప్పి వుంది, ఇంత కష్టం ఉంది అని చెప్పిందే లేదు. నోట్లోంచి ఒక్కమాట కానీ అరుపు కానీ, ఏడుపు కానీ బయటకు వచ్చిందే మాకు తెలియదు.
“ ఆ కాలం లో మొగ పిల్లోల్లని మాత్రమే మీ నాయిన సదివించినాడు కదత్తా? నీ అన్నతమ్ములు అదే మా చిన్నాయన పెద్దనాయన వాళ్ళు మాత్రం బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తా వుండారు. నీకు మాత్రం చదువు లేకుండా చేసినాడని మీ నాయన పైన నీకు ఎప్పుడూ బాధ అనిపించలేదా అత్తా, కోపం రాలేదా? ” అని అడిగినాను.
ఒక్క మాట కూడా వాళ్ళ నాన్నను పడనిచ్చేది కాదు మా అత్త . మా మామయ్య వాల్ల గురించి కానీ, వాళ్ళ అమ్మ నాయన గురించి కానీ ఎవురేం మాట్లాడినా ఆమె గొమ్మునా ఊరుకునేది, వాళ్ళ అత్తామామల గురించి కానీ, ఆడబిడ్డల గురించి కానీ ఏనాడూ ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనకపోవటం , ఇంటికి దూరం వెళ్లిపోయి, తన దారి తాను చూసుకున్న మా మామయ్యను సైతం ఒక్క మాటైనా అనకపోవడం ఆమె వ్యక్తిత్వం అనుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాత్రం ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు.
“ మా నాయన తప్పేమీ లేదు అబ్బోడా. మా నాయన్ను గానా ఎవరైనా యేమైనా అంటే వాళ్లకు కండ్లు పోతాయి . మా నాయన ముందే చెప్పినాడు కానీ నేనే సరిగ్గా సదువుకోలేదు, సరిగ్గా సదువుకొని వుంటే ఏదో ఒక వుద్యోగం గ్యారంటీగా కొట్టేసి వుంటాను . నా జాతకమే మారిపోయి వుండేది. నా పిల్లోల్లు ఇంకా బాగా సెటిల్ అయిండే వాళ్ళు. సదువే బ్రతుకు అని మా నాయిన చెప్తానే వున్యాడు కానీ నా బుర్రకే ఎక్కలే . ” ఇదీ మా అత్త మాట.
“ పెండ్లి అయినప్పటి నుంచి ఒక్క రోజైనా నువ్వు మీ నాయనను తలచుకోకుండా , పొగడకుంటా వుంటావేమో అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తానే ఉండాను కానీ, ఒక్క పొద్దైనా నీ నోట్లోంచి మీ నాయన మాట రాకుండా ఉన్నింది లేదు కదమ్మే.ఇంతగా ప్రేమించే కూతురు వుండటం మీ నాయన చేసుకున్న పున్నెం. ఇన్నేండ్లు గడచినా నువ్వు మీ నాయన్ని, ఇప్పుడికీ తలచుకుంటా ఉండావు కానీ, నిన్ను నన్నూ ఇట్లా మన పిలకాయలు తలచుకుoటారంటావా ? మన పిల్లోల్లు రాబోయే కాలంలో ఎట్లుంటారో ఏమో “ ..అనే వాడు మా మామయ్య.
“ ఒకరిని ఆశించి ఏదైనా చేయడం దరిద్రం.పిల్లలు తమని చూస్తారని ఏ తల్లి తండ్రీ పిల్లల్ని కనరు, పెంచరు . ఎవురి బ్రతుకు వాళ్ళదేబ్బా.. ”. ఇదీ ఆమె జవాబు, ఆమె వ్యక్తిత్వం కూడా!.
మా నాయన చనిపోయినప్పుడు నేను తమ్ముడు చాల చిన్న వాళ్ళం. మా అమ్మకు యెట్లా ధైర్యం చెప్పాలో, ఆమెను యెట్లా ఓదార్చాలో మాకు తెలియదు. అదిగో సరిగ్గా అ సమయంలో మా అత్తే గనుక తోడు లేకుంటే మా అమ్మ ఏమై పోయి ఉండేదో మాకు తెలియదు.
ఇప్పటికీ ఒక దృశ్యం నా కళ్ళ ముందు అట్లాగే నిల్చిపోయింది. బహుశా ఆ దృశ్యం నేను బ్రతికి వుండేంత వరకూ నాతోనే వుండి పోతుందేమో.!
బాగా వర్షం పడుతోంది. మా అమ్మ ఏడుస్తా పడుకుని వుంది. మాది పెంకుటిల్లు. అక్కడక్కడా కారుతోంది. నేను, మా తమ్ముడు వాన నీళ్ళు పడేచోటికి బక్కెట్లు మారుస్తూ వున్నాం. నీళ్ళు నిండగానే రెండు చేతులతో బక్కెట్లు ఎత్తుకుని ఇంటి ముందు పారబోస్తున్నాం. ఆ రోజు మా అమ్మ ఉదయం నుండి అస్సలు ఏమీ తినలేదు. మేం ఎంత చెప్పినా లేయ్యలేదు, ఏమీ వండలేదు. హోటల్ నుండి అయినా ఏమైనా తెస్తాను మా అని అడిగినాను కానీ మా అమ్మ వద్దు అనింది.
వర్షం బాగా పెరిగి పోతోంది. చలి ఒక పక్క. అసలే మా ఊరిని పూర్ మెన్స్ ఊటి అంటారు, అంత చలి వుంటుంది ఇక్కడ. మాకు ఆకలి అవతా వుంది. నేను, మా తమ్ముడు ఇద్దరూ మగపిల్లలమే అమ్మకు. మగపిల్లమే అయినా మాకు ఇంటిపనులన్నీ నేర్పించింది మా అమ్మ. చెత్తలు ఊడ్చటం , అంట్లు తోమడం, కల్లాపి చల్లి ముగ్గులు వెయ్యటం,వంట చెయ్యడo, బట్టలు ఉతకడం ఆన్నీ నేర్పింది మా అమ్మ. పని చేసేదాంట్లో ఆడ పిల్లలు, మొగ పిల్లలు అనే తేడా వుండకూడదు. మగపిల్లోల్లు పని చేసేదానికి నామోషి పడకుండా వుంటే చాలు, ఆడోల్ల జీవితాలు బాగుపడతాయి “ అనేదిమా అత్తయ్య అభిప్రాయం. మా అమ్మకు కూడా అదే నమ్మకం.
నిజానికి మా అమ్మకు ఆడపిల్లలంటే చాల ఇష్టం. అందుకే ఆడపిల్లలాగే నాకు తలదువ్వి, రోజూ జడ వేసేది. మాకు మునిదేవర చేసి తల వెంట్రుకలు మునీశ్వరుడికి సమర్పించే ఆనవాయితి ఉంది. తెల్లమచ్చ ఒక్కటి కూడా లేని నల్ల మేకపోతు కావాలి, పూజలు చేసి, అందరికి వండి పెట్టాలంటే విందుకు చాలా డబ్బే అవుతుంది. అది లేక మా మునిదేవర వాయిదా పడుతూ వచ్చింది.ఆ మునిదేవర అయ్యేంత వరకూ తల వెంట్రుకలు అట్లాగే వుంటాయి. జుట్టు కత్తరించడానికి వీల్లేదు.
నేను ఉప్మా చేశాను కానీ అమ్మ తినలేదని మేం కూడా తినకుండా అట్లాగే ఉదయం నుండి పస్తు వుండి పోయాం.
“ అమ్మా నువ్వట్లా వుంటే మేం ఏం కావాలి, నిన్ను చూస్తా వుంటే మాకు ఏడుపు ఆగడం లేదు , నువ్వు ధైర్యంగా వుంటేకదా మేo కూడా ధైర్యంగా వుంటాం, తినమ్మా ... ” అని అప్పటికే చాలా సార్లు అమ్మను అడుకున్నాం..కానీ ఆమె మా మాట వినలేదు . మంచం పైనుండి లేవడం లేదు.
అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆమె సరిగ్గా తినలేదు. కొన్ని సందర్భాలలో ఆమె చాలా మొండి మనిషి.ఎవ్వరు ఎంత చెప్పినా వినే రకం కాదు.
యెట్లా చెయ్యాలి, ఆమె చేత ఇంత అన్నం తినిపించడం యెట్లా రా నాయనా అని మేం బాధ పడే టైంలో సరిగ్గా మా అత్త, భోరోమని కురుస్తున్న వర్షాన్ని అస్సలేమాత్రం లెక్క చెయ్యకుండా , చీరకొంగు తలపై కప్పుకుని, ఒడి లో రెండు స్టీల్ గిన్నెలు దాచి పెట్టుకుని చీరకొంగు దాని చుట్టూ కప్పుకుని వర్షంలో తడుస్తా వేగంగా ఇంట్లోపలికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఆ వాననీళ్ళ వాసన జీవితాంతం చాల సందర్భాలలో నన్ను వెన్నాడుతూనే వుంది.అదొక వర్షం వాసనే కాదు, వర్షంలో తడచిన మనిషి వాసన. పసి బిడ్డలాంటి, కన్నతల్లి లాంటి నిఖార్సైన మనిషి వాసన.!
“ వొదినా లెయ్యమ్మా, వేడి వేడిగా సంగటి, గురుగాకు తెచ్చినాను. అంగడి తలుపు కూడా ముయ్యలేదు. గభాలున తినేయ్యాల్లి. మా తల్లి కదా లేయ్యమ్మా. పిల్లోల్ల మొహాలు సూడు ఎట్లుoడాయో. నువ్వు అన్నమూ నీళ్ళు మానేసినంత మాత్రాన , పోయిన మా అన్నేమైనా తిరిగొస్తాడా సెప్పు ? ”
పసిబిడ్డను లేపినట్లు మా అమ్మను లేపి కూర్చోబెట్టింది. బలవంతాన మా అమ్మ చేత నాలుగు ముద్దలు తినిపించింది.
మా అమ్మ ఏమి చెప్పిందో ఏమో కానీ, మా అత్త ఆ రోజు నుండి మూడు నెలలు మా అమ్మకు తోడుగా పడుకునే దానికి, రాత్రి అన్నం తినేసి , మా అమ్మకు సంగటో, ఊరి బిండో, చింతాకు చారో, ఏదో ఒకటి అంత గిన్నెలో తీసుకుని మా ఇంటికి వచ్చేసేది. అమ్మ తినేసాక ఇద్దరూ వక్కా ఆకు నమలుకుంటా, పాత సంగతులెన్నో మాట్లాడుకుoటా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటా వుండి పోయే వాళ్ళు. వాళ్ళ బాల్యం వాళ్ళ కష్టాలు వాళ్ల దుఃఖాలు, వాళ్ల ఒంటరితనాలు ఆ కబుర్లు నిండా వినిపించేవి. ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు. వాళ్ల తల్లిదండ్రుల్ని గుర్తుతెచ్చుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేవాళ్ళు.
హరికథలకి , భజనలకి, గుడులకి, సావిత్రి సినిమాలకి వాళ్ళు ఇద్దరే వెళ్లి వచ్చే వాళ్ళు. మా నాయన పోయిన దుఖం లోంచి మా అమ్మ బయట పడిందంటే దానికి ఒకే కారణం మా కాంతమ్మ అత్తే !
తనకంటూ ఎప్పుడూ ఏమీ ప్రత్యేకంగా వండుకొని తినే అలవాటు లేని ఆయమ్మ, ఎప్పుడూ సంగటి ముద్దా, చెట్నీలు ఊరిబిండి, గొజ్జు, చింతపండు రసంతోనే కాలం గడిపేసిన మా కాంతమ్మ అత్త చివరి రోజుల్లో మాత్రం మనసు మార్చుకుంది. ఆ పది పదిహేను రోజులు ఆమె రాజీపడనే లేదు. తను జీవితాంతం ఏం తినాలని ఇష్టపడి, ఏం తినకుండా నిరాసక్తంగా ఉండిపోయిందో అవన్నీ కూతురి దగ్గర అడిగి మరి చేయించుకుని తినింది.
ఒక శుక్రవారం రోజు తలంటు పోసుకుని, ఆమెకు నచ్చిన పసుపు రంగు చీర కట్టుకుంది. కూతురిని చింతాకు వంకాయ పుల్లగూర ఉడుకుడుకు సంగటి చేసి పెట్టమని అడిగింది . పుష్పమ్మకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం కదా, ఊరంతా తిరిగి ఎక్కడా చింతాకు మార్కెట్లో దొరక్క పోతే, యూనివర్సిటీ దగ్గరకు పోయి, చింతచెట్టు కొమ్మల్ని దోటితో కిందకు వంచి లేత చింతాకు కోసుకుని వచ్చి లేత వంకాయలు తెచ్చి వాల్లమ్మ కోరినట్లే చింతాకు, వంకాయ పుల్లగూర , ఉడుకుడుకు సంగటి చేసి పెట్టింది. ఇష్టంగా తినేసి దూరంగా పడేసిన వక్కా ఆకు తిత్తి వెతికి మరీ నడుముకి దోపుకుంది. డాక్టర్లు వద్దంటే ఒక్క మాటతో మానేసిన వక్కా ఆకు ఆరోజు మాత్రం తెప్పించి వేసుకుంది. చాలా కాలం తర్వాత ఆమె నోరు మళ్లీ ఎర్రగా పండింది. అంత నీరసంలోనూ ఆమెకి ఎక్కడినుంచి అంత ఓపిక వచ్చిందో తెలియదు.
అప్పుడు మా అత్త మా అమ్మనే గుర్తు చేసుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుoదని పుష్పమ్మ ఏడుస్తూ ఆ తర్వాత మా అత్త చావు రోజు ఏడుపుల మధ్య దీర్ఘాలు తీస్తా, చెపుతా వుంటే నాకు , మా తమ్ముడికి కన్నీళ్ళు ఆగనే లేదు.
“ మా వదిన జయమ్మ ఈ లోకంలో, ఈ కులంలో , ఈ కాలంలో ఉండాల్సిన మనిషే కాదుమేయ్. అందుకే ఆ దేవుడు ఆయమ్మని తొందరగా పైకి తీసుకుని పోయినాడు. ఆ పిల్లోల్లు ఉత్త అమాయకులు. మంచి తప్ప చెడు తెలియయనోళ్ళు . ఈ మాయదారి లోకంలో యెట్లా బ్రతకతారో ఏమో. కొంచెం వాళ్ళని చూస్తా ఉండండి , అట్లాంటి అమాయకపు మనుషుల్ని కాపాడితేనే , దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఈ లోకంలో అమ్మా ,నాయన లేనోళ్ళకి చుట్టూరా ఎంత మంది జనం వున్యా అనాధల కిందే లెక్క. ఆ బాధ అనుభవించినోల్లకే తెలుస్తుంది. ఆ బిడ్డలు జాగ్రత్తమేయ్. పైన నా కోసం మా జయమ్మ వక్కాఆకు తిత్తి చేతిలో పెట్టుకుని ఎదురు చూస్తా వుంటుంది. నేను పోయేటప్పుడు గుంతలో వక్కా ఆకుతో బాటూ ఈ కూడే వేసి, మన్ను వేసేయ్యండిమేయ్. నేను కూడా పోతాపోతా జయమ్మకి తీసుకుపోవల్ల కదా, ఏంతినిందో ఎప్పుడు తింనింటుందో? మా వదిన సగం ఆకలి తోనే ఉంటుంది ఎప్పుడూ. వస్తా వస్తా నేను తప్పకుండా ఏదో ఒకటి తనకోసం తెస్తానని నమ్మకంతో ఎదురు చూస్తా వుంటుంది మే... ”
అంత స్నేహం, ఇష్టం మా అమ్మంటే .అంతటి అపేక్ష మా అమ్మంటే.ఆమె మాట ప్రకారమే, ఎవరు ఏమనుకున్నా, ఆకూవక్కా, దుగ్గూ సున్నం తో బాటూ, లేత అరటి ఆకులో ఉడుకుడుకు సంగటి, కూరాకు గుంతలో ఆమెని పూడ్చేటప్పుడు ఆయమ్మ చెప్పినట్లే గుంతలో బద్రంగా పెట్టేసినారు కాంతమ్మ బిడ్డలు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట నిలబెట్టినారు. అంత ప్రేమ వాళ్లకు ఆయమ్మ అంటే.
బిడ్డలకు ఆమె పెద్దగా ఆస్తుల్ని ఇచ్చింది లేదు. కానీ, లోకంలో చాలా మంది బిడ్డలకు ఇవ్వలేని ఆస్తిని మాత్రం ఆమె ఇచ్చి వెళ్ళింది . అదేమిటి అంటారా ? ధైర్యంగా బతికే లక్షణం. మనుషుల్ని ప్రేమించే గుణం.! అంతకు మించి బిడ్డలకు తల్లి తండ్రులు ఇచ్చే ఆస్తి లోకం లో ఇంకేం ఉంటుంది ?
ఆయమ్మ సంపాదిoచుకున్నట్లే ఆయమ్మ బిడ్డలు కూడా చుట్టూ పది మందిని సంపాదించుకున్నారు.ఎరికిలోళ్ళు అనే పేరే లేకుండా, అన్ని కులాలోల్లు వాల్లని సొంత మనుషుల్లా చూసుకుంటారంటే , బంధుత్వాల్ని కలుపుకుని, కులాంతరo చేసుకున్నారంటే , కులాన్ని మించిన మంచిగుణం, మంచితనం, మనిషితనం వాళ్ళల్లో కనిపించబట్టే అని అందరూ అంటుంటారు.
ఒక పండగ వచ్చినా, ఒక దేవర వచ్చినా, ఒక గొడవ వచ్చినా, ఏదైనా పంచాయతి జరిగినా, మా ఇంట్లోనే కాదు, మొత్తం ఎస్టీకాలనీలోనే ఇప్పటికీ దేనికో ఒకదానికి ఆయమ్మ పేరు చెప్పుకోకుండా ఉండలేరు.
మా కాంతమ్మత్త చనిపోయినా, మా మాటల్లో, మనస్సులో, జ్ఞాపకాల్లో ఆమె సజీవంగానే వుందిప్పటికీ . మనుషుల మాటల్లో, మనస్సుల్లో, జ్ఞాపకాల్లో బ్రతికి ఉండటమే కదా అమరత్వం అంటే? !
“ దీన్ని టీ అంటారా ? ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది.
పైకి గట్టిగానే అంటున్నట్లున్నా ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి, కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ గొంతులో ఏదో మొహమాటం, బెరుకు.
నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని బెరుగ్గా “ స్టీల్ గ్లాస్ లోనే టీ ఇవ్వు రెడ్డీ , వేడిగా వుంటుంది అని ఎన్నోసార్లు చెప్పింటా. అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ .. ” అంటున్నాడు నంగి నంగిగా.
గల్లాపెట్టె వద్ద నింపాదిగా కుర్చుని విసనకర్రతో విసురుకుంటున్న హోటలు ఓనరమ్మ వక్కాకు కసాబిసా నములుతూ కొరకొరా చూసింది మొగిలప్ప వైపు. ఆపక్క ఆ కుర్రాడేమో అస్సలు మొగిలప్ప మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. వినడం వరకూ అయితే విన్నాడు కానీ అసలేమీ , విననట్లు, మొగిలప్ప మాటలకు ఎలాంటి స్పందనా లేనట్లు మా చేతుల్లోకి పేపర్ కప్పులు పెట్టేసి తలతిప్పుకుని , ఏదో పాట పాడుకుంటూ , బాయిలర్ లో బొగ్గులు కలబెట్టుకుంటూ ఉండిపోయాడు.
మొగిలప్ప అనింది నిజమే.ఆ టీ టీ లాగా లేదు. టీ వేడిగా లేదు, అట్లాగని చల్లగానూ లేదు, ఎటొచ్చీ నాకు కావలసినంత వేడిగా మాత్రం లేదు.ఆ టీ లో రుచీ లేదు,ఏమీ లేదు. మొగిలప్ప ఏదో అనబోయి, బస్తాoడులోకి వెడుతున్న బస్ డ్రైవర్ వేసిన హారన్ సౌండుకి ఆగిపోయాడు.
బస్తాoడు పక్కనే టీ హోటల్. ఎంత మాత్రం రద్దీగా లేదు.
ఎండా ధాటికి జనం ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినట్లున్నారు. రోడ్డు పైన రద్దీ అంతగా లేదు. బస్టాండు కూడా దాదాపు నిర్మానుష్యంగానే వుంది.దుఖానాలు అన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి.బస్సులు కూడా అయిష్టంగా బద్దకంగా కదులుతున్నాయి.
అయినా ఎండను ఎంత మాత్రం లేక్కచేసే అలవాటు లేని వాళ్ళు, లేదా ఎండలకు బాగా అలవాటు పడినవాళ్ళు మాత్రం ఎండను పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు హడావిడిగా వున్నారు. రెండు చక్రాల లాగుడుబండి లాగే ఇబ్రహీం ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ సరుకుల బండిని లాక్కుపోతున్నాడు. బజారు వీధి సందుల్లోకి ఆటోలు, లారీలు వెళ్ళలేవు.బస్టాండులో కానీ, లారీ పార్సిల్ ఆఫీసుల వద్దనుండి సరుకులు షాపుల్లోకి పోవల్లటే ఎడ్లబండి పురుషోత్తం అయినా లాగుడుబండి ఇబ్రహీం అయినా కదాల్సిందే. లేదంటే ఆ సరుకులు రోడ్డు దాటి, ఇరుకైన బజారు వీధుల్లోకి పోలేవు. హంగూ ఆర్భాటాలు కొత్తగా ఎన్ని వచ్చినా వూరు మొత్తం మారిపోయినా , వూరి నడిబొడ్లో ఇప్పటికీ మారంది మూడే. ఆ ఎడ్లబండీ, ఆ లాగుడుబండి, బస్టాండు ముఖద్వారం వద్ద ప్రశాంతంగా నిలుచుని ఒక చెయ్యి పైకి ఎత్తి నవ్వుతూ అభివాదం తెలిపే నెహ్రూ విగ్రహం.
టీ పూర్తయ్యే లోగా సెల్లు రింగ్ అయింది . ఈరోజుకు ఒకే నెంబర్ నుండి వచ్చిన పదహారో కాల్.
అవతల వైపు మా పిన్నమ్మ “ పూజ సామన్లు అన్నీ తీసుకున్నారు కదా చిన్నోడా ?”
ఆ ప్రశ్నకు జవాబు చెప్పేలోగా ఆమె కొనసాగించింది..” మొగిలప్ప నీతో బాటే వున్నాడు కదా. వాడికేమీ తెలియదు. నువ్వే బద్రంగా చూసుకోవల్ల. ఎలాగైనా సరే నా కొడుకు పొలీసు కావల్ల అంతే ..వాడికి అన్నీ భయాలే. నువ్వు చెప్పినావనే హైదరాబాదుకు కోచింగు కోసం పంపినా. మా పొలీసు మునిరత్నం అన్న కూడా ఈ రోజు మునిదేవరకు వస్తా వుండాడు కదా. వాడితో కూడా మాట్లాడిపించల్ల.నువ్వేం చెప్తావో నువ్వేం చెపుతావో, నేర్పుతావో నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. అయినా మొగిలప్పకి నువ్వంటే బాగా గురి. నీ మాట బాగా వింటాడు చిన్నోడా . నువ్వేం చెప్తావో నువ్వేం చెపుతావో, నేర్పుతావో నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. ”
ఆమె ఆగదు, మనమే ఎక్కడో చోట ఆమెను ఆపాలి. “ పిన్నమ్మా నేను మాట్లాడతాలే. నువ్వు బాధ పడొద్దు.” అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆగకుండా సెల్ కట్ చేసేశాను.అంత సేపూ మొగిలప్ప నా వైపే చూస్తూ వున్నాడు.వాడి మొహం నిండా నవ్వు. వాడికి మొత్తం అర్థం అయిపోయింది.
మా పిన్నమ్మ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చెయ్యకపోయినా మాటలు బయటకే స్పష్టంగా వినిపిస్తాయి. ఆమె గొంతు అంతే. ఎదురుగా నిలబడి నేరుగా మాట్లాడినప్పుడు చూడాలి, చుట్టుపక్కల వీధి మొత్తo అందరికీ వినిపిస్తూ వుంటుంది. దీనికి పూర్తిగా వ్యతిరేఖం మా చిన్నాయన. గొంతు బాగా తగ్గించి మెల్లగా, నింపాదిగా మాట్లాడటం ఆయనకు ముందునుండీ వచ్చిన అలవాటు. కొత్తవాళ్ళు అయన మాట్లాడేది కనుక విన్నారంటే , ఆయనేదో చెప్పకూడని పరమ భయంకరమైన రహస్యం ఏమిటో చెపుతున్నట్లు పొరబడతారు.
“ చిన్నప్పుడు ఆటలోనే దొంగా పొలీసు అడుకోవల్ల. అంతే కానీ ఎరికిలోడు ఏంది.. పొలీసు కావడం ఏంది ?మనోల్లంటే ఆ డిపర్మెంటు లో మర్యాద యాడ వుంటుంది? ’’ మా చిన్నాయన ఎప్పుడూ మా పిన్నమ్మ ఆశలపై నీళ్ళు చల్లే మాటే అది. మా పిన్నమ్మకు ఆ మాటలు అస్సలు నచ్చదు. ఎట్లాగైనా వాళ్ళ కొడుకు మొగిలప్పను పోలీసు చెయ్యాలనేది మా పిన్నమ్మకు ఎన్నో ఏళ్ళ కోరిక.
” పోయి పోయి ఆ పోలీసు మునిరత్నం గురిoచి చెప్తా ఉండాది సూడు. ఏ కాలం లోనో ఆయప్ప ఉద్యోగం పోగొట్టుకున్యాడు.పొలీసు ఉద్యోగం మనకులానికి అచ్చిరాదురా అని మీ నాయన ఎంత చెప్పినా, ఆమాట మీ తమ్ముడు ఏనాడైనా వినింటే కదా. ఆయన మాటలు విని ఇంకేదైనా వేరే ఉద్యోగంలో చేరింటే ఈ పాటికి మంచి పొజిషన్లో వుండేవాడు కదా. సంపాదించే రాత రాసి వుంటే కదా . తలపైన రాత బాగాలేనోల్లే కడాకి తలలు చెడుపుకుంటారు. “ మా చిన్నాయన మాటలు ఇంకా పూర్తి కాకముందే, వక్కాకు తుపుక్కన ఉమిసి, మా పిన్నమ్మ అయన మాటలకు గబాలున అడ్డం వచ్చేస్తాది.
“ మా అన్నకి ఇప్పుడేం తక్కువా అని ?ఎట్లైనా మా అన్న డ్యూటీ లో వున్నింటే ఇప్పుడు ఇన్స్పెక్టరు ర్యాంకు కదా. వాని టైం బాగాలేక వాడు బంగారం లాంటి ఉద్యోగాన్ని వద్దనుకుని అట్లా వచ్చేసినాడు కానీ, వాడి మోహంలో వుండే కళ ఈ ఇలాకాలో కానీ, మనోల్లల్లో కానీ ఎవరికీ వుందో సెప్పబ్బా? ఆ దిష్టే తగిలి వుంటుంది. అందుకే కడాకి యెట్లా కాకుండా అయిపోయినాడు మా మునిరత్నం అన్న. ”
“ పొలీసు కావడం అంటే మాటలనుకున్నావా? మన ఇండ్లల్లో యాడ జరుగుతుంది. ఆ మునిరత్నం ఒక్కడే కదా పోలీసు, ఆయప్ప కూడా ఇప్పుడు ఉద్యోగంలో లేడు. ” ఇదీ మా చిన్నాయన గోవిందయ్య వాదన.
“ మా అన్న ఏమన్నా కాని పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడా?ఎంతో పద్దతిగానో కదా ఉద్యోగం చేసినాడు. ఒంటినిండా భయంతోనే కదా నడచుకున్యాడు. వాడ్ని గానా ఏమన్నా ఒక్కమాట అన్నావంటే బావుండదు. ఒక్క మాట అడ్డంగా మాట్లాడినా నేను వూర్కోను ముందే సెప్తా ఉండాను. ” మొహం తిప్పుకుంటూ కళ్ళు తిప్పుతూ, చేతులు చూపిస్తూ పెద్ద గొంతుతో మా పిన్నమ్మ అలివేలమ్మ అట్లా మా చిన్నాయనను చాలాసార్లు భయపెట్టడం నాకు బాగా గుర్తు వుంది.
అప్పటిదాకా ఎంత సేపు ఏమేం మాట్లాడినా, అట్లా మా పిన్నమ్మ కోపంతో విరుచుకు పడేసరికి మా చిన్నాయన మెత్తగా అయిపోయేవాడు. పైకి ఏమి మాట్లాడే వాడు కాదు కానీ, అక్కడినుండి బయటకు వచ్చి మెల్లగా గొనుక్కునే వాడు.ఇదంతా ఎప్పుడూ ఉండేదే ! అయితీ ఈరోజు ప్రత్యేకం ఏమిటి అంటే చాలా కాలంగా నేను వింటూ వుండిన ఆ పొలీసు మునిరత్నం అనే పెద్దమనిషిని ఈరోజు కలవబోవటమే.
హైదరాబాదు నుండి కోచింగ్ పూర్తి చేసుకుని నెలప్పుడు ఇంటికి వచ్చాడు మొగిలప్ప. బాగా చదువుతానని వాడికి నేనంటే చాలా ఇష్టం. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ లో పోయినా పట్టు విడవకుండ గ్రూప్ టూ జాబ్ కు సెలెక్ట్ అయ్యానని నేనంటే మంచి గౌరవం కూడా.
“ అన్నా పరసువేది చదివినావా , సీక్రెట్ చదివినావా, జోనాధన్ లివింగ్ స్టన్ సీగల్ చదివినావా ? నువ్వు ఏం చదివినావో చెప్పు, నేనూ నీలాగే కాంపిటిషన్ పరిక్షలు పాస్ అయిపోయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయి ఉద్యోగం సంపాదిoచల్ల. మా నాయనను, అమ్మను అడవిలోకి పోనీకుండా , కంపా గోడూ తెచ్చే పనిలేకుండా, పందుల్ని మేపే పని చెయ్యనీకుండా బాగా చుసుకోవల్ల అన్నా. ఎట్లాగైనా గవర్నమెంటు జాబ్ కొట్టాల్ల అన్నా. నువ్వు చెప్పు యెట్లా చదవాలో,నీ టెక్నిక్ ఏందో చెప్పన్నా.” ఇట్లాగే మాట్లాడతాడు ఎప్పుడూ మొగిలప్ప. నేను నవ్వేసే వాడిని.
“ పుస్తకాలు చదివితేనే పరిక్షలు పాస్ అయ్యేట్లుంటే , కొన్ని లక్షల మందికి ఈ పాటికి పెద్ద పెద్ద ఉద్యోగాలే వచ్చి వొడిలో వాలిపోయి ఉండల్ల.కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. అధ్యయనం ముఖ్యం, సూక్ష్మ పరిశీలన ముఖ్యం, పుస్తకం మనలో ఇంకి పోవల్ల.నేను పక్కాగా నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటా.ఇంతకు ముందు నాలాగా పరిక్షలు రాసి పాస్ అయిన వాళ్ళని కలసి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే వాడ్ని.మనం ఎవ్వరిలా కావాలని అనుకుంటామో, అలాంటి వాళ్ళని కలసి వాళ్ళు యెట్లా ఈ ఉద్యోగాన్ని ఇష్టపడేవాల్లో, వాళ్ళు యెట్లా సక్సెస్ అయ్యారో తెలుసుకునే వాడ్ని. వాళ్ళ అనుభవాలతో మనకు ఎన్నో మెళకువలు నేర్పుతారు.” అని నేను చెప్పిన మాటల్ని అతడు బాగా గుర్తుపెట్టుకున్నాడు.
చుట్టుపక్కల ఇండ్లల్లోంచి యస్టీ కాలని పిల్లల్ని కొందర్ని గుంపుగా చేర్చి సాయంత్రాలు గుడిసె ముందు నిలబెట్టి పందుల షెడ్ వైపు చెయ్యి చూపిస్తా మొగిలప్ప క్లాస్ చెపుతుంటాడు. మొదట్లో ఒక్క మాట అంటాడు ” ఈ జీవితం మారల్ల, బ్రతుకులు బాగు పడల్ల అంటే చదువొక్కటే మార్గం. “ అప్పుడప్పుడూ నేను కొంచెం దూరంగా నిలబడి అతడి మాటల్ని ఆసక్తిగా వింటూ వుంటాను.
“నిద్రపోతే వచ్చేది కాదు కల అంటే .మీకు నిద్ర లేకుండా రాకుండా చేసేదే మీ అసలైన కల. మీ కలల్ని ముందుగా మీరు చూడగలగాలి .నిద్రలేవగానే రోజూ అద్దం లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎప్పుడైతే మీ మొహం బదులు మీ లక్ష్యం, మీ భవిష్యత్తు మీకు కనపడతాయో.. ఆప్పుడు మీరు మీ లక్ష్యానికి చేరువలో వున్నారని అర్థం. మీకు కార్ కావాలి అంటే మీరు దాన్ని ముందుగానే ఊహించాలి. ఏరకం కారుఏ మోడల్ కొనాలో స్పష్టత వుండాలి. అదే మాదిరి మీరు ఏ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళను కలవాలి. ఆ ఉద్యోగం గురించి ముందుగా తెలుసుకోవాలి. మీ వాళ్ళల్లో అంటే మీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ మీరు కోరుకునే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడండి, నేరుగా వాళ్ళను కలవండి. ఉత్తుత్తి బంధుత్వాలు, పరిచయాలు, స్నేహితాలు వేరు. వాళ్ళ వృత్తిలో వాళ్ళ అనుభవాలు మీకు స్ఫూర్తి కలిగిస్తాయి.మీ కలలు త్వరగా సులభంగా నెరవేరుతాయి.” హైదరాబాద్ లో పోటీ పరిక్షల శిక్షణా కేంద్రం లో ఎప్పుడూ వినే మాటలే అతడిలో బలంగా జీర్ణించుకుని పోయాయి. మొత్తానికి అతడి కల పొలీసు కావడం.
అందుకే ఎప్పుడూ పొలీసు మునిరత్నం పేరు కలవరించేవాడు. మన బంధువుల్లో ఒక్క పోలీసు ఉన్నాడు కదన్నా. ఎట్లాగైనా ఆయన్ని కలవాల్సిందే అనేవాడు. ఇప్పుడు అతడికి ఉద్యోగం లేదంట కదా . వేరే వాళ్ళను కలుద్దాం లే అని నేను చెప్పినా, “ అది కాదన్నా, మనోడైతే మనకు అన్నీ చెప్తాడు కదా అని అనేవాడు.
“ ఏం లేదన్నా. ఆయన ఎందుకు ఉద్యోగం మానేసాడో అదికూడా తెలుసుకోవల్ల కదా..ఎంతో కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్నే వదులుకున్నాడు అంటే ఏందో బలమైన కారణమే వుంటుంది కదా. అది తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఎవర్ని అడిగినా ఏదేదో చెప్తావుండారు, గానీ ఆయన్నే నేరుగా అడిగేస్తే అసలు కథ ఏందో ఆయనే చెప్పేస్తాడు కదా “ అనేవాడు. ఆ పోలీసు మునిరత్నం గురించి అస్సలు ఏం జరిగిందో ఎవరికి తెలీదు. పొలీసు కావాలని అనుకునే వాడ్ని కదా..అయన పోలీసు ఉద్యోగం ఎందుకు వద్దనుకున్నాడో, ఎందుకు వదులుకున్నాడో.. తెలుసుకోవాలని మొగిలప్పకే కాదు నాకూ వుంది. అయితే ఇన్నేళ్ళకు ఈరోజే ఆ అవకాశం వచ్చింది. బజారుకు వెళ్లి ఇంట్లోవాళ్ళు చెప్పిన పూజ సామాన్లు , పూలు, పండ్లు తెస్తూ మధ్యలో బస్టాండు వద్ద ఆగి, టీ తాగుతూ మరోసారి ఇవే విషయాలు మాట్లాడుకున్నాం.
అక్కడే వార్తలు అక్కడక్కడా చదువుతా, కొన్ని వార్తలు వదిలేసి , దినపత్రికలని అక్కడే పడేసి, టీ తాగడం అయ్యాక అక్కడినుండి కదిలాం.
అప్పటికి సమయం సరిగ్గా పన్నెండు గంటలు.
ముందు మా ఇల్లు చేరి అమ్మ అడిగిన వస్తువుల్ని అమ్మకు అప్పకు అప్పగించాక మా చిన్నాయన వాళ్ళ ఇంటివైపు నడిచాం. యస్టీ కాలనీలో దుర్గమ్మ గుడి ముందు కోలాహలంగా వుంది. గుడికి దగ్గరే మా చిన్నాయన వాళ్ళ ఇల్లు. లౌడ్ స్పీకర్ లోంచి అమ్మ వారి శ్లోకాలు, పాటలు పెద్ద సౌండ్ తో వినిపిస్తున్నాయి. పిన్నమ్మ మేం తెచ్చిన పూజ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటా వుంటే, మా చిన్నాయన మెల్లగా నోరు విప్పినాడు.
“ సూస్తావుండు. ఈ దినం సూడు.. మొత్తం జాతర మాదిరి జనం ఉడ్డ చేరిపోతారు. యాడేడ వుండే వాళ్ళో దూరాభారం అని సూడకుండా వచ్చేస్తారు సూడు.నువ్వు ఎప్పుడూ అడగాతా ఉంటావే, పొలీసు మునిరత్నం ఎవురు ఎవురు అని, ఈ దినం సూపిస్తాలే. మొగిలప్ప డౌట్లు అన్నీ తీరిపోతాయి ఈ దినం ” అన్నాడు మా చిన్నాయన నవ్వుతా తన సహజ ధోరణిలో. ఈ సారి ఎందుకో ఆయన మాటలు ఎంత చిన్నగా మాట్లాడినా, అంత సౌండ్ లోనూ నాకు స్పష్టoగానే వినిపించాయి. అదే ఆశ్చర్యం.
ఆ మాట అనగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నాను, కానీ నాకు ఆ మునిరత్నం అనే అయనను కలుద్దామంటే ఇప్పటిదాకా కుదరటమే లేదు.ఎప్పుడైనా పండగలు దేవరలు, చావులు, పుట్టిన రోజులు, పెళ్ళిళ్ళు ఇలా అనేక సందర్భాల్లో బంధువులు అనే వాళ్ళు కలవడం మామూలే కానీ , అయన మా వూరు వచ్చినప్పుడు నేను హాస్టల్లో , లేదా నేను వచ్చిన సందర్భాల్లో అయన రాకుండా పోవడమో, నా చదువులు , పరిక్షలు, డిగ్రీ అయ్యాక గ్రూప్స్ కి కోచిoగ్ కోసం నేను హైదరాబాద్ లో మూడేళ్ళకు పైగా ఉండిపోవడంతో నాకు ఆయన్ను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చిన్నప్పుడు, మధ్య మధ్యలో కొన్ని సార్లు ఆయన్ను చూసాను కానీ, అంతగా నేను పట్టించుకుంది లేదు.
నాకంటే ఎక్కువ ఉత్సాహం , కుతూహలం మొగిలప్పలో కనిపిస్తున్నాయి.
“పోలీసు మునిరత్నం అన్న పేరు ఒక్కటే కాదు నాయనా , ఇంకా ముందు ముందు పోలీసు మొగిలప్ప అనే పేరు కూడా మన ఎరికిలోల్లు చెప్పుకోవల్ల. ఈ ఇలకలో మనోల్లల్లో పోలీసు అనే వాడు లేదు అని ఎవ్వరూ అనుకునే పనే లేకుండా చేస్తాను , చూస్తా వుండు, మాటంటే మాటే. ” మొగిలప్ప గొంతులో అప్పటిదాకా లేని స్పష్టత నాకు ఆశ్చర్యం కలిగించలేదు.ఆ మార్పు నేను ఊహిస్తున్నదే. ప్రతి ఒక్కడికీ లోపల ఏదో సాధించాలి అనే తపన వుంటుంది,కొందరికి అది ఎప్పుడోసారి గబుక్కున వెలుగుతుంది. కొందరికి ఎవరో ఒకళ్ళు అగ్నిలాగా దాన్ని వెలిగించే సందర్భాలు కొన్ని వుంటాయి.
నింపాదిగా అతడి వైపు చూశాను. మంచి పొడగరి, ధీశాలి గా కనిపిస్తాడు మొగిలప్ప. కురచగా జుట్టు కత్తరించుకుని, పోలీసు క్రాప్ తో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. అతడి కళ్ళల్లో వెలుతురు అతడు తప్పకుండా అనుకున్నది సాధిస్తాడు అనే నమ్మకాన్ని నమ్మకంగా చెపుతోంది.
మునిదేవర పండగ ఇంకా మొదలు కాక ముందే పొలీసు మునిరత్నం నేరుగా గుడి ముందుకు వచ్చేసాడు. మనోళ్ళు అందురూ ఉడ్డ చేరినప్పుడైనా, వినిపించాల్సింది దేవుడి పాటలు కాదుకదా అని క్యాసెట్టు మార్పించేసినాడు. ఆయనకి అడ్డు చెప్పే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. కులనిర్మూలన పాటలు, అంబేద్కర్ పాటలు యస్టీ కాలనీలో ..ఒళ్ళు జలదరించింది నాకైతే.. ! కొన్ని క్యాసెట్లు గుడికి తెచ్చినానని చెపుతూ గుడి పనులు చూసే ప్రకాష్ కి అందించాడు.మనిషిలో వయసు తెలియడం లేదు, చురుగ్గా ఉత్సాహంగా వున్నాడు. అదే అతడి ప్రత్యేకతేమో అనిపించింది నాకు .
కుశల ప్రశ్నలు అయ్యాక మా చిన్నాయన వాల్ల ఇంట్లో అందరం మాటలకు దిగేసినాం.ఉండ బట్టలేక మొగిలప్ప అడగనే అడిగేసినాడు . పోలీసు ఉద్యోగం గురించి, డ్యూటీ గురించి, సాధక బాధకాల గురించి చెప్పుకొచ్చాడు ఆయన.
“ ఏ తప్పు చెయ్యని, మనోల్లని తప్పుడు కేసు లేకుండా పోరాడి వాళ్లకి న్యాయం అయితే చేసినా కానీ నాపైన పెద్ద కులపోల్లకి, పై ఆఫిసర్లకి మంట మొదులైపోయింది. ఏందేందో డ్యూటీ లు వేసి, ఎక్కడెక్కడో తిప్పతా వున్యారులే. మనకి ఇది సెట్టు కాదని తేల్చుకున్యాక, మనకులపోల్లకే న్యాయం చెయ్యలేమని తెలుసుకున్యాక గట్టిగా ఎదురు తిరిగినాలే.” అని క్షణం ఆగి కొనసాగించాడు.
“మన ఎరుకల కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటానా? ఎరుకలోడు అయితే దొంగే అంటావా? ఎవడ్రా దొంగా.. దొంగ నాకొడకా అని యస్ ఐ చొక్కా పట్టుకునేస్తి. ఉద్యోగం అయితే పొయ్యింది కానీ నా పేరులోంచి పోలీస్ అనే మాటను పికేదానికి ఎవడి తరం కాలే. ఇదంతా చెప్పేది నిన్ను భయ పెట్టాలని కాదు. అన్నిటికి సిద్దపడి ఉద్యోగం లో చేరల్ల అని హెచ్చరించేడానికి మాత్రమే . మన కులం గురించి చెప్పకుండా ఉండలేం. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరి కులం వాళ్లకు గొప్ప. ఎప్పుడో ఎవరో ఏ కాలం లోనో దొంగతనాలు చేసినారని మొత్తం మన జాతినే దొంగలంటే యెట్లా ఒప్పుకుంటాం ?ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం. ఉద్యోగం వల్ల వచ్చేదే గౌరవం కాదు. తలపైన టోపీ పోయినా పర్వాలేదు కానీ తల దించుకునే ఖర్మ నాకు వద్దు అనుకున్నాను. పోయిన ఉద్యోగం గురించి నాకు ఎప్పుడూ బాధ లేదు.నేల తల్లిని నమ్మినాను. మట్టికి కులం లేదు, మలినం తెలీదు . నా బ్రతుకేందో నేనే సొంతంగా బ్రతకతా ఉండాను. రోజoతా సెల్యూట్ కొట్టేది మానేసి ఇప్పుడు నేలతల్లికి దండం పెట్టుకుండా ఉండాను..”
అయన మాట తీరు స్పష్టంగా వుంది. ప్రశాంతంగా చూస్తూ మెల్లగా మాట్లాడుతున్నాడు.ఎక్కడా తడబాటు లేదు, మొహమాటం కానీ , జరిగిపోయినదాని గురించి బాధ కానీ అతడి మోహంలో కానీ, మాటల్లో కానీ, గొంతులో కానీ కనిపించడం లేదు.
మునిదేవర పూర్తి అయ్యింది, మధ్యాహ్నం ఆకలి వేళ. వడ్డనకి ఎవ్వరూ ముందుకు రావడం లేదు, మొహమాట పడుతున్నట్లు వున్నారు.మునిదేవర చేసిన ఇంటి వాళ్ళు కొందరు అటూ ఇటూ తారాడుతున్నారు.
ఎండ భీకరంగా వుంది.అందరికీ ఆకలి వేస్తా వుంది. ఇంకా భోజనాలకు పిలుపు రాలేదు. ఏ నిముషంలో అయినా పిలువు రావచ్చు అనే ఆశతో జనం భోజనాల బల్లల వద్ద షామియానా కింద ఆకలి మొహాలతో ఆశగా ఎదురు చూపులు చూస్తూ వున్నారు.
పోలీస్ మునిరత్నం మొహమాటం లేకుండా భోజనాల బల్ల వద్దకు నడిచాడు, మమ్మల్ని కూడా రమ్మన్నట్టు సైగ చేయడం తో మేం కూడా మొహమాట పడుతూనే అతడితో బాటూ ముందుకు నడిచాo.
“ ఈ బెరుకూ మొహమాటాలే కద చిన్నోడా .. కొంపలు ముంచేది.నువ్వు ఏమైనా చెప్పు.. మనోళ్ళకు ఎక్కడికి పోయినా మొహమాటాలు బెరుకూ ఎక్కువే. ధైర్యం తక్కువ. టకా అని ముందుకు దూసుకు పోలేరు. కొంచెం ఎదిగినోల్లని చూస్తే మనోళ్ళే అయినా సరే, మనోళ్ళు ముందుకు పోలేరు. మనోల్లే మనోళ్ళతో కలవలేరు. కొంత మంది కొంచెం పైకి వచ్చినాక ఎరికిలోల్లు అనికూడా చెప్పుకోరు. థూ..కులం పేరు కూడా మార్చి చెప్పుకుంటారు బడాయికి .అట్లాంటి వాళ్ళని కులo లోంచే వెలివేయల్ల చిన్నోడా. రా.... రా... తిoడికాడ మొహమాటం వుండకూడదు ” ఆ మాటలు వింటూ అప్పటిదాకా అతడు భోజనాల కోసం వెడుతున్నాడని అనుకున్నాం కానీ, అతడు నేరుగా వడ్డనలోకి దిగిపోయాడు. మమ్మల్ని చూసి ఇంకో నలుగురు కుర్రాళ్ళు ముందుకు వచ్చారు.
“ చూడండి ముసలివాళ్ళు, చిన్న పిల్లోల్లు, ఆడోల్లు పని చేసి చేసీ బాగా ఆకలిపైన వుండారు. ఎండకు గాలికి ఇంకా ఆకలి పెరకతా వుంటుంది కడుపులో. ముందు వాళ్ళని కూర్చో మని చెప్పండి. ” అంటూనే చురుగ్గా అతడు కదిలాడు. నిముషాల్లో అక్కడ అంతా సద్దుమనిగింది. కుర్చీలు కొన్ని దూరంగా వేయించడం, చేతులు కడుక్కోవడానికి దూరంగా బకెట్ నిండా ఉప్పునీళ్ళు తెప్పించడం, తినేసిన ఆకులు, ప్లాస్టిక్ గ్లాసులు పడేయటానికి వెదురు గంపలు పెట్టించడం అంతా చకచకా జరిగిపోయింది.గంటన్నరలో భోజనాలు ముగిసాయి. ఆఖరి బంతిలో మేం కూర్చునే సరికి మాకు వడ్డించడానికి చాలామంది పోటీ పడ్డారు.
అప్పుడు అక్కడ ఎలాంటి మొహమాటాలు లేవు.వాళ్ళు ఎవరో, మాకు వరసకి ఏమవుతారో కూడా నిజానికి మాకు తెలియదు. సందడిగా మనుషులు కొందరు ముందుకు వచ్చారు అంతే.!. మనుషులు మనుషుల పట్ల యెట్లా ఎందుకు స్పందిస్తారో అప్పుడు అర్థం అయ్యింది నాకు.
అయన బయలుదేరుతున్నపుడు బస్టాండు వరకూ నేను, మొగిలప్ప తోడుగా వెళ్ళినప్పుడు, అయన మేం వద్దంటున్నా వినకుండా టీ హోటల్ కు తీసుకు వెళ్ళినాం. టీ హోటలు ఓనరమ్మ విసనకర్రతో మొహానికి అడ్డంగా విసురుకుంటూ ఉంది. మేం కాస్సేపు నిలబడి చూసాం కానీ, టీ వేసే కుర్రాడు భోజనానికి వెళ్లి ఇంకా వచ్చినట్లు లేదు. చెక్క బెంచి పైన కూర్చుని, అప్పటిదాకా అతడ్ని అడగలనుకుని, అడగలేక పోయిన ప్రశ్నని బయటకు తీసాం.
“ మీరు ఎందుకు పోలీసు ఉద్యోగం వదులుకున్నారు మామా ? ”
ఆయన మా నుండి ఈ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించినట్లు ఉన్నాడు. మా వైపు చూస్తూ చిన్నగా నవ్వినాడు. హోటల్ ఆమె వైపు, రోడ్డు వైపు, బస్టాండు లోకి పోతున్న ఆటో వైపు , రోడ్డుకు అటు వైపుగా నిలుచుని అదే పనిగా తోక ఊపుతున్న కుక్కని చూసాడు.మళ్ళీ మా వైపు తల తిప్పి చూస్తా అదే మాదిరి మెల్లగా పైకి కనపడీ, కనపడకుండా నవ్వినాడు.
“ వానలో మోబ్బులో ఆరోజు రాత్రి కదా నాకు ప్రాణం పోయినంత బాధయ్యింది. స్టేషన్ లో డ్యూటీ లో వుండినప్పుడు మనిషి ఎట్లా వుండల్లో తెలుసా...?” అని క్షణం ఆగి మా వైపు తేరిపారా చూసాడు, చూసి అతడే ఎంత మాత్రం ఆలస్యం లేకుండా జవాబు చెప్పేసాడు.
” ఎట్లుండాలో తెలుసునా? మనిషి మనిషిగా మాత్రం వుండ కూడదు.మనిషి పోలీసులాగే ఉండల్ల. రాయిలాగా గట్టిగా నిలబడల్ల. కళ్ళ ముందర అన్యాయమే జరిగినా చూస్తూ నెమ్మదిగా గుడ్దోని మాదిరి ఉండల్ల, ఏడుపులు ఎంత మాత్రం వినిపించనంతగా చెవులు మూసుకోవల్ల చిన్నోడా.. కొత్తగా ఉద్యోగంలో చేరినా కదా. అప్పుడు నాకు అదంతా తెలీదు. ఆ గొంతు ఎక్కడో తెలిసినట్లే అనిపించింది. ఆ మొహం సరిగ్గా కనపడలేదు కానీ ఎక్కడో బాగా చూసినట్లే అనిపించింది. మా హెడ్డు అప్పటికే నన్ను దూరంగా లాగతానే వున్యాడు కానీ నాకే అర్థం కాలేదు....” అని కాస్సేపు ఆగిన్నాడు.
బహుశా ఆయన కళ్ళల్లో కన్నీల్లు ఇమిరి పోయినట్లున్నాయి. మొహంలో మార్పు కనిపించింది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోగా చాయ్ వచ్చింది. “ఇంకొంచెం డికాషన్ వేసి ఆకు మార్చి స్ట్రాంగ్ గా ఇవ్వు బాబు” అని మాత్రం అన్నాడు.ఆ గొంతు లోని స్థిరత్వo , అజ్ఞాపిస్తున్నట్లు వచ్చిన ఆ మాటల తీవ్రతకి ఆ హోటలు కుర్రాడు మాత్రమే కాదు , మేం కూడా ఉలిక్కిపడ్డాం.కొన్ని క్షణాల్లోనే అయన తన దుఖపు జ్ఞాపకాల్లోంచి తేరుకోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ, అట్లా ఆయన తనను తాను అట్లా సర్దుకోవటానికి ఎన్ని ఏండ్లు ఎన్ని విధాలుగా తనను తానూ సర్దుకుని ఉంటాడో అని అనిపించింది.
ఏమనుకున్నాడో ఏమో, ఆ టీ హోటలు కుర్రాడు మా గ్లాసులు కూడా మౌనంగా వెనక్కి తీసేసుకున్నాడు. ఏమీ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు.
పోలీసు మునిరత్నం ఇప్పుడు పోలీసు కాదు.అయినా పోలీసు క్రాప్ అట్లాగే మైంటైన్ చేస్తున్నాడు.ఆయన ఇప్పుడు పొలీసు ఉద్యోగంలో లేక పోవచ్చు. కానీ ఆ గొంతులో ఏదో వుంది. అది కేవలం అధికారానికి సంభందించింది కాదు.కొంచెం ప్రేమా, కొంచెం మార్దవం, కొంచెం అనునయం, ధైర్యం, తెగింపు,నిలదీసి ప్రశ్నించే నిక్కచ్చితనం, అన్నీ కలసిపోయిన గొంతు అది.ఒక్క మాటలో చెప్పాలంటే అతడి గొంతులో, మాటలో ఏదో క్లారిటీ వుంది.
ఈ సారి గ్లాసులు మారాయి.
ముందు మాకు ఇచ్చిన ప్లాస్టిక్ కప్పులో పేపర్ కప్పులో కావు.
వాటి బదులు స్టీలు గ్లాసులు వచ్చాయి.
టీ ముందులాగా నీళ్ళు నీళ్ళుగా లేదు. చిక్కగా వుంది. స్ట్రాంగ్ గా వుంది. టీ టీ లాగే వుంది.రంగు రుచి చిక్కదనం..పరిమళం అన్నీ ఉన్నాయి.
“ చాలసార్లు చెప్పినా విల్లు వినలే.ఇప్పుడు సూడు.. దీన్ని కదా టీ అంటారు.” అన్నాడు మొగిలప్ప కళ్ళ నిండా నవ్వుతూ టీ ని ఇష్టంగా, సంతోషంగా చప్పరిస్తూ...
“ అవునవును ఇది కదా టీ...” అన్నాను నేను కూడా నవ్వుతూ.
హోటల్ ఓనర్ వైపు చూశాం. ఆమె కళ్ళు కొంచెం పెద్దవి చేసి మమ్మల్నే చూస్తా వుంది. ఆమె కళ్ళల్లో విస్మయం,భయం, కంగారు.
“మార్పును చూసి తట్టుకోవడం ఎవరికైనా వెంటనే కష్టమే.!కొంచెం టైం పడుతుందిలే ..” అంటున్నాడు మా పోలీసు కాని పోలీసు మామయ్య మునిరత్నం.ఇంకో మాట కూడా అన్నాడు మొగిలప్ప భుజం పైన చెయ్యి వేసి..
“ముందు నువ్వు ఒకటే నేర్చుకోవల్ల పిల్లోడా . ఏదైనా సాధించాలి అనుకునే ఎరుకలవాడి జీవితంలో భయంవుండకూడదు...ముందు మనిషనే వాడు భయాన్ని నరికేయ్యాల్ల. నువ్వు ఏదైనా కల గంటే ముందు నువ్వు దేనికీ భయపడొద్దు . ధైర్యంగా వుండు. అదే అన్నిజబ్బులకి మందు “.
అప్పుడు చాలా కాలం తర్వాత మొదటిసారి నాకు ఇంకో టీ తాగాలనిపించింది. వాళ్ళిద్దరి వైపు చూసాను, వేడి వేడిగా అందరికంటే ముందు ఖాలీ అయిన నా టీ కప్పు వైపు చూస్తా నవ్వుతున్నారు ఇద్దరూ.
ఇబ్రహీం రోడ్డు దాటుతున్నాడు. ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా అదే నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ,ఎండని, చలిని పట్టించుకోనట్లు,దేనితో సంభందమే లేనట్లు, దృష్టి మొత్తం వెడుతున్న దారి మీదే నిలిపి ఇబ్రహీం ఏకాగ్రతతో సరుకుల బండిని లాక్కుపోతున్నాడు
” బాబూ ఇంకో స్ట్రాంగ్ టీ.. వేడిగా చిక్కగా.. ”
(ఎరికిలోల్ల కథలు – 7)
ఆదివారం ఉదయాన్నే చావు కబురు.ఉడుకోడు చనిపోయాడు.ఊరు ఉలిక్కిపడింది. అసలు పేరు ఎరుకల రామచంద్రుడు అయినా గవర్నమెంటు లెక్కల్లోనే ఆ పేరు. అందరూ పలికేది మాత్రం ఉడుకోడు అనే.
చాలామందికి తెలిసినవాడు, కావాల్సినవాడు, పదికాలాల్లో పదిమందికీ మంచి చేసినవాడు.డెబ్బైఐదేళ్ళు దాటివుంటుంది వయసు. ఎడమచేతికి ఆరువేళ్ళు అతడికి.యస్టీకాలనీ ఎగువ వీధిలో చివరి ఇల్లు. గుడిసెలో రాత్రి పడుకున్న వాడు పడుకున్నట్లే పోయాడు. నిద్రమధ్యలోనే ప్రాణం పోయినట్లు వుంది. హాస్పిటల్ కు పోనే పోను అని మొండికేసిన వాడు, జన్మంతా ఒక్కసారైనా ఇంజెక్షన్ వేసుకోని వాడు, డాక్టర్ను చూసే పనిలేకుండానే చివరిదినాలు గడిపేసాడు.
చావుకబురు ఇండ్లు, వీధులు, ఊర్లు దాటే పనిలో వుంది.
అసలే పెద్దచావు. పెద్ద కులాల వాళ్ళు , సాటికులాల వాళ్ళు, కింద కులాల వాళ్ళు, పెద్దవాళ్ళు, నడివయసు వాళ్ళు , ఆడవాళ్ళు, మగవాళ్ళు , వీధిలోని వాళ్ళు, ఊరిలోని వాళ్ళు, చుట్టుపక్కల ఊరి వాళ్ళు, మున్సిపాలిటి మనుషులు, టీచర్లు , ఎవరెవరో ఉద్యోగస్తులు,ఇంకాఎవరెవరో వస్తున్నారు, దండలు వేసేసి దండాలు పెట్టేసి పోతున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుoటున్నారు. ఫోన్లు, వాట్సాప్ లు, మెసెంజర్ లు , ఫేస్ బుక్ లో ఆయన ఫోటోలు ఏవేవో సమూహాల్లోకి వెళ్లి అక్కడినుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి.ఆయన ఫోటో కింద నలుగురూ నాలుగు మాటలు రాసినట్లున్నారు.చూస్తూ ఉండగానే గంటల వ్యవధిలో చాలామంది వచ్చేసారు. కాలనీలో మనుషులకి అదొక పెద్ద పండుగలాగా జతరలాగా వుంది.
కాలనీలో ఆయనకు అందరూ బంధువులే కానీ ఆయనకంటూ ఒక కుటుంబం లేదు.పెళ్లి అయిందో లేదో ఈ కాలం వాళ్లకి సరిగా తెలియదు కానీ పిల్లలు అయితే లేరు.తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడో దేశాంతరం వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఇక్కడే మిగిలిపోయాడని అంటారు. పెళ్లి అయిందని భార్య ఎవరితోనో లేచిపోయిందని కొందరు...లేదు, అతడే ఆమెకు నచ్చిన వాడితో ఆమె ఇష్ట ప్రకారం పంపించేసాడని కొందరు అంటూ ఉంటారు.
అంత్యక్రియలు ఏ పద్దతిలో ఎలా చెయ్యాలో , ఎవరెవరు ఏమేం చెయ్యాలో కొందరు ముసలివాళ్ళు చెపుతున్నారు.వాళ్ళ మాటలకు కొందరు నడివయసు వాళ్ళు మౌనంగా తలలూపుతూ వుంటే, ఇంకొందరు రకరకాల సందేహాలు అడిగి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. కొందరు యువకులు బ్యానర్లు కట్టాలని , ట్రాక్టర్లో ఊరేగింపు జరపాలని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు గుంపులో వున్నారు కానీ, నోర్లు తెరవడం లేదు. వక్కాఆకు నములుతూ తలలు నిలువుగా, అడ్డంగా అటూ ఇటూ ఆడిస్తున్నారు.
“ఎట్లో ఇప్పుడు కరోనా భయం తగ్గింది . అయినా దూరాభారం వచ్చిపొయ్యే వాళ్ళు ఎవరుoడారు? ఎక్కువగా రారులే. ఈ పక్క చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, వి,కోట రామాపురం వాళ్ళు ,ఆ పక్క అరవదేశం నుంచి వానియంబాడి వాళ్ళు, ఆలంగాయం వాళ్ళు, ఆ పక్కనే అంబూరు వాళ్ళు.. అంతే కదా అందరూవచ్చేస్తార్లే సాయంత్రానికి.”
“ కులం మొత్తం తెలిసినోడు. అందరికీ కావాల్సినోడు, మనజనం చాలా మంది వస్తార్లే. బయటనుంచి అన్నాలటయానికి సరస్వతి హోటల్లో ఆర్డర్ చెప్పేయండి. దూరంగా ఆ పక్క వీధిలో ఒక చోట పెట్టేస్తే తినే వాళ్ళు తినేసి పోతారు. ”
వరసలతో సంబంధం లేకుండా కాలనీలో ఎవరు చనిపోయినా, బయట ఊర్ల నుండి వచ్చేవాళ్ళ కోసం అందరూ కలసి మధ్యాహ్నంఒక పూట భోజనాలు తెప్పించేయడం- ఈ మధ్య వచ్చిన కొత్త కట్టుబాటు అది.అన్నం పెట్టడానికి వరుసలేంది అని వాదించినవాడు ఉడుకోడే.!
బాధల్లో వున్నప్పుడు భోజనాల ఏర్పాటు ఇబ్బంది ఉండరాదని, ఉన్నవాళ్ళు పెట్టగలిగినా లేనివాళ్ళు చావులప్పుడు భోజనాలకి ఇబ్బంది పడకూడదని, అన్ని రకాలుగా అలోచించి, ఇక్కడున్న వాళ్లకు, బయటినుంచి వచ్చే వాళ్లకు ఇబ్బంది ఉండకూడదని అట్లా ఏర్పాటు అలవాటు చేసింది కూడా ఆ పెద్దాయనే. ఆఉడుకోడే.!
“మూడుదాకా రాహుకాలం కదా .మూడునుంచి మొదులు పెడితే నాలుగున్నరకు అంతా అయిపోతుంది. బయటినుంచి వచ్చినోళ్ళుమళ్ళిoకా ఎవురి తావులు వాళ్ళు చేరుకోవల్ల కదా.. ”
అంతా సిద్దం చేస్తున్నారు. ముందు షామియాన వద్దు అనుకున్నారు కానీ, వచ్చే జనం అంతకంతకు పెరిగిపోతావుంటే షామియానా వెయ్యక తప్పింది కాదు. ముందు కుర్చీలు అవసరం లేదు అనుకున్నారు, కానీ నూరుకుర్చీలు కూడా చాలలేదు. పొలీసు సైరన్ వినిపించే సరికి కాలనీలో అప్పటిదాకా అక్కడకి ఇప్పుడే కడులుదామా వద్దా అని తటపటాయిస్తున్న జనం మొత్తం గుంపులు గుంపులుగా వచ్చేశారు.
ఎండ పెరిగిపోతున్నా చమటలు కారిపోతున్నా ఉక్కపోస్తున్నా జనం కదలడంలేదు. ఎవరు తెప్పిస్తున్నారో ఎవరు తెస్తున్నారో అక్కడ ఉంటున్న వాళ్లకి తెలియడం లేదు కానీ బ్యానర్లు వచ్చేసాయి. ముఖ్యమైన కూడళ్ళలో కట్టేశారు. మైక్ సెట్ వచ్చింది, సంచుల నిండా మంచి నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు , ప్లాస్టిక్ గ్లాసులు వచ్చాయి.గుడిసె నుండి వీధి మొదలుదాకా రెడ్కార్పెట్ వేసారు.మైక్ ముందు నిలబడి నివాళి చెప్పడమో, ఆ పెద్దయన గురించి నలుగురూ మాట్లాడటం , కాలనీ మొత్తం ఇంటింటా వినపడుతోంది. ఆ కాలనీలో ఇదంతా కొత్త వ్యవహారం.అంతకు ముందు ఎప్పుడూ ఎవరికీ ఇలా జరగలేదు. అందరికీ విచిత్రంగానే వుంది.
ముందు పోలీసులు తర్వాతనాయకులు , ప్రజాప్రతినిధులు వచ్చారు. పొలీసు అధికారి పెద్దదండ వేసి మౌనంగా వెళ్ళిపోయాడు, నాయకుడు కూడా కాస్సేపు మౌనం పాటించాడు కానీ మాట్లాడక తప్పలేదు. ఆయన అందుకు సిద్దపడే వచ్చినట్లుంది.పెద్దగా ఎవరూ బ్రతిమలాడకుండానే, గబగబా మైక్ అందుకున్నాడు.
“ నేను ఎంతోమందిని చూసాను. అందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినవాళ్ళే కానీ మీకు ఏం సప్పోర్ట్ కావాలో చెప్పు , మంచికి నేను ఎప్పుడూ ముందు వుంటాను అని నేను రాజకీయాల్లోకి రాకముందే నాకు ధైర్నం చెప్పిన మంచి మనిషి మేనపాటి రామచంద్రుడు . ఎంతమంది కింద కులాల వాళ్ళు బడికి పోలేని స్థితిలో అయన వద్ద చదువుకుని బాగుపడినారో లెక్కే లేదు. గవర్నమెంటుటీచర్ కాకపోయినా, అంతకన్నా ఎక్కువే కష్టపడినాడు కదా?ఆయనకి కులం మతం జాతి, నాది నీది అనే బేధమే లేదని నాకన్నా ఇక్కడ వుండే వాళ్ళకే తెలుసు. అయన శిష్యులు ఎంత మంది ఆయన్ను నీకు ఏం కావాలని అడిగినా అయన ఏ పొద్దూ నాకు ఇది కావాలని చెప్పింది లేదు. స్కూల్లోపిల్లోల్లకి పుస్తకాలు పెన్నులు బ్యాగులు బట్టలు అడిగినాడే కానీ , స్కూల్లో టేబుళ్లు బెంచీలు, కుర్చీలు అడిగినాడే కానీ ఇంకొకటి అడిగినోడు కాదు.” నాయకుడి ఆవేదన.
“ పేదోల్లు సార్, ఇండ్లకు పట్టాలు లేవు అని అర్జీలు ఆయనే రాసి మాతో బాటూ ఎన్నిసార్లు యoఆర్ఓ వద్దకి తిరిగినాడో లెక్కే లేదు. ఈ కాలనీ ఇండ్లు సాంక్షన్ అయ్యేదానికి మూలం కూడా ఆయప్పే కదా.పిడుగు పడి మండీపేటలో గొర్రెలు చనిపోయినా ముందుగా కదిలేది ఆయనే. కరెంటు షాక్ కొట్టి ఎరుకల వెంకట్రాముడికి కాళ్ళు చేతులు కాలిపోయినా ఆదుకోవడానికి ముందుకొచ్చి సరుకులు తెప్పించి ఇచ్చేది ఆయనే.అంత ఎందుకు? ఆడోల్లు డ్వాక్రా గ్రూపుల్లో కరెక్టుగా లోన్లు కట్టకుండా వుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి అడిగేది కూడా ఈ పెద్ద మనిషినే కదా. నచ్చ చెపుతాడో, భయపెడతాడో, అధికారుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది చేసి చూపిస్తాడు. ” కౌన్సిలర్ సుబ్రమణ్యం.
షామియానా చాలడం లేదు. కాలనీలో అన్ని వీధుల్లో జనం.. జనం.. జనం. ఆ కాలని పుట్టినప్పటి నుంచిఎప్పుడూ ఆ కాలనీ అంత మంది జనాల్ని ఎప్పుడూ చూడనే లేదు. జనం ఎండను ఉక్కపోతను పట్టించుకునే స్థితిలో లేరు.మాటలన్నీ ఉడుకోడి గురించే. ఆలోచనలన్నీ అతడి గురించే.
దారులన్నీ యస్టీ కాలనీ వైపే.ఒక్క మాటలో చెప్పాలంటేఆ రోజు ఉడుకోడిదే.!. ఎండ ఎంత మాత్రం వాళ్ళని భయపెట్టడం లేదు. వాళ్ళలో హుషారు తగ్గడం లేదు. ఏదో కదలిక, ఏదో చైతన్యం, వాళ్ళు ఎందుకో ఉడుగ్గా ఉన్నట్లున్నారు.ఉడుకుడుగ్గా ఉన్నట్లున్నారు.అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.రహదారి కూడళ్ళలో ఇంకా అక్కడక్కడా ఊరంతా బ్యానర్లు గాలికి అటూ ఇటూ కదులుతూ చప్పుడు చేస్తున్నాయి.
“ పలక కొట్టేవాళ్ళు దుడ్లు వద్దు అనేసిరి. గుంత తవ్వినోల్లు దుడ్లు వొద్దు అనేసిరి. సావు సరుకులకోసం పోతే ఉడుకాయప్పకే కదా అని ఫ్రీగా ఇచ్చినారు. కొత్త పంచె టవలు కూడా ఫ్రీనే. ఊరంతా తెలిసిపోయింది కదా చావు ఎవరిదీ అని. ఇంకో ఇచిత్రం తెలుసునా..”వక్కాకు ఎంగిలి దూరంగా రోడ్డు పక్కకు వెళ్లి సైడు కాలువలో ఉమిసి వచ్చాడు.
“ అటో వాళ్ళ గురించేనా.. ? ” వంగిపోయిన నడుము ఆడమనిషి కిసుక్కున నవ్వింది.
“నా కొడుక్కూడా ఆటో డ్రైవరే కదా వాడు చెప్పినాడులే. యూనియన్ మొత్తం ఒకే మాట అంట. ”
“ ఇచిత్రం కాక పోతే బస్టాండుముందు వుండే ఆటోస్టాండు వాళ్ళు అందరూ గట్టిగా అనుకున్యారంట. సావుకు వోచ్చినోల్ల కాడ ఎవరిదగ్గరా రూపాయి కూడా తీసుకోకూడదని. ”
“ అదే న్యాయం కదా నాయనా . యూనియన్ యెట్లా ఉండాలో చెప్పి మనోళ్ళకే కాదు, ఎంతో మందికి సబ్సిడీ లోన్లు తెప్పించినాడు. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబెట్టడమే కాదు , చేతిలో పదిరూపాయలు పడితే చెయ్యికి నవ్వ రాకూదడురా కన్నా ... అని ఎంత బాగా వాళ్ళ మైండు సెట్టు మొత్తం మార్చినాడoటే, చాల మంది సారాయి తాగకుండా ఉండరంటే అదంతా ఈ ఉడుకోడి పుణ్యమే కదా నాయనా .ఎన్నితూర్లు వీధి గలటాలప్పుడు పెద్దమనిషిగా పోలీసు స్టేషన్కి పోయింటాడు?. ”
కాలనీలో కుక్కలు కొన్ని అటూ ఇటూ దిక్కు తోచనట్లు పరుగెడుతున్నాయి. బోరిoగు చప్పుడు రోద పెడుతోంది. కొన్ని ఇండ్లల్లోంచి వస్తున్న రకరకాల టీవిల చప్పుడు , కుక్కల అరుపులు,వీటి మధ్యలోనే ఒంటి కాలి బోయకొండప్ప సారాయి మత్తులో పడుతున్న పాట వికారాన్ని తెప్పిస్తోంది.
ఉడుకోడి గుడిసె ముందు లైటు వెలుగుతూనే ఉంది. ఎవరూ దాన్నే ఆర్పే పని చెయ్యలేదు. లోపల ఎవరో పెట్టిన దీపం గాలికి అటూ ఇటూ కదులుతోంది. గుడిసె ముందు కొయ్యమంచం పైన వుంది ఉడుకోడి శవం.
దాని పక్కనే రాతి బండలు.అక్కడకి వచ్చే వాళ్లకి అవే కుర్చీలు, బెంచీలు.దానిపైన కావాటి మునస్వామి,ఎరుకల నరసింహుడు, నాగరాజు, కుయ్యప్ప, కపాలి , మేనపాటి గోవిందస్వామి కూర్చుని వున్నారు. కొందరి చేతుల్లో బీడిలు వెలుగుతున్నాయి. వాళ్ళకు కొంచెం ఎడంగా డిగ్రీ చదివే ఆడపిల్లలు ఆ కాలనీ వాళ్ళే పార్వతి, భూమిక నిలబడి పూలహారాలు మంచం చుట్టూ పొందిగ్గా పేరుస్తున్నారు.
వీధికాలువలో దొడ్డికి కూర్చోవడానికి వచ్చిన చిన్నపిల్లాడు ఒకడు వీళ్ళని చూసి బిత్తర పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయాడు.క్షణాల్లో వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని మళ్ళీ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మఅలివేలమ్మ ఉడుకోడి గుడిసె ముందు నిలుచున్న వాళ్ళని, కూర్చున్న వాళ్ళని అదేపనిగా చూస్తా మొహం ఎందుకో తిప్పి వంకరగా మాట్లాడింది.
“ నువ్వు ఆ పక్క పోరా..వూరికే వూరికే మనుషుల్ని, శవాల్ని చూసి భయపడితే ఎట్లా? సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకోవల్ల.”
నరసింహుడికి ఆ మాటతో కోపం వచ్చేసింది. గభాలున మంచం దిగి వీధిలోకి వచ్చిఅలివేలమ్మ పైకి గొంతు ఎత్తి గలాటాకి వెళ్ళిపొయినాడు.
“ ఏమ్మే నీమొగుడు కడుపాత్రం దేశాంతరం పోతా ఉంటాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు యాడికి పోతాడో వాడికే తెలిదు.ఉండేది ఒక్కదానివి.ఇంట్లో నీకు తోడు ఉండేది ఆ పిల్లోడు ఒక్కడే. ఇప్పుడు వాన్ని ఆ పక్కకు దూరంగాతీసుకోని పోయిరాలేవా.. బుద్ధి ఉందా లేదా నీకు ? దినామ్మూ కొంచెం ఆ ఉడుకోడ్ని.. ముసలాయన కదా కొంచెం చూసుకోమ్మే అని చెపితే ఇంటివా?ఆఖరి దినాల్లో కొంచెంకూడూనీళ్ళు ఆయప్ప మొహాన పోసి వుంటే బావుండేది కదమ్మే. అడిగినోల్లకి అడగనోల్లకి అందరికీ ఆయప్ప అన్నీ చేస్తాడు కానీ, ఆయప్ప నోరు తెరిసి ఎవుర్ని చిన్న సహాయం కూడా అడిగే రకం కాదని అందరికీ తెల్సు కదా ? ”
చీరకొంగు నడుముకు బిగించి కట్టుకుంటూ వక్కాకు ఎంగిలి ఉమిసి ఇoత లావు నోరు వేసుకుని, చేతులు తిప్పతా అలివేలమ్మ నేరుగా గొడవలోకే దిగేసింది.
“నువ్వు ఒప్పుకుంటే కాగితం బాండు రాసి ఇచ్చేయి మామా.నీ ఖాళీ జాగా మాకు ఇచ్చేయి అంటే ఒప్పుకోలేదు నువ్వు పోయినంకకాలనీలో ఈ గుడిసె లో మేం ఇల్లు కట్టుకుంటాం. బదులుగా రోజూ మూడు పూటలా తిండి పెడతాం మామా.. అని చెప్పినా కదా. నా మాటకి ఒప్పుకున్యాడా ఆ మొండి మనిషి ? పస్తులైనా వుంటాను, నా జాగాలో ఎరికిల పిల్లోల్లు చదువుకునేదానికి షెడ్ కట్టల్ల, నా జాగా అమ్మను, ఇంకెవరికి ఈను అంటాడు.అట్లాంటి వానికి నేను ఎందుకు....?” ఆయాసం వల్ల ఆగింది కానీ అప్పటికే ఆమె భారీ శరీరంలో ఆవేశం వళ్ళ ప్రకంపనలు మొదలయ్యాయి.గొంతు కూడా వణుకుతోంది.మనిషి నిలువెల్లా ఊగిపోతోంది.
“ అప్పుడికీ ఎన్నోతూర్లు చెప్పి చూసినా. అప్పుడప్పుడు గంజి నీల్లు టీలు ఇస్తానే కదా ఉండా కదా. ఆయప్ప అందరికీ ధర్మాత్ముడే కావచ్చు, కానీ నాకు మాత్రం దుర్మార్గపు ముండా కొడుకే.. అట్లాంటి వానికి నేను ఎందుకు తిండి పెట్టల్ల అని? ”
ఆమె మాటలకి చుట్టుపక్కల వుండే వాళ్ళు కూడా ఇండ్ల లోంచి బయటకు వచ్చేసి, చుట్టూ నిలబడి ఆసక్తిగా వింటుండి పోయారు.
“ ముందు నుంచి ఆయప్ప చెప్తానే వుండాడుకదాఅలివేలమ్మా.. కాలనీలో గుడి కట్టేటప్పుడు కూడా ఎంత గొడవ చేసినాడో నీకు తెలిదా? గుడి ఎందుకురా ఎరికిలి నా కొడుకులారా ? ఇంకెన్ని గుడులు కడతార్రా ? ఇంకెంత మంది దేవుళ్ళని మొక్కుతార్రా అని గట్టి గట్టిగా అందురని అరిసేసినాడు కదా? అప్పుడే మర్చి పోతివా ? మా పిల్లోల్లు కొంత మంది ఆ ఉడుకోనికే సప్పోర్టు చేసి గుడి వద్దు లైబ్రరీనే కట్టల్ల, పుస్తకాలు పెట్టల్ల, ఈ పిలకాయలంతా సదూకోవళ్ళ అని తెగేసి చెప్పినారు కదా. ఆ పొద్దు మన పిల్లోల్లు గుడి వద్దని అడ్డం తిరిగిన రోజే ఎంత గొడవ అయిందో ఊరంతా ఇచిత్రంగా కాలనీ గురించి కతలు కతలు చెప్పుకున్యారు కదా. ” దగ్గుతెర అడ్డురావడంతో ఆరిపోయిన బీడీముక్క పారేసి , క్షణం ఆగి గొంతు సవరించుకున్నాడు నరసింహుడు .
“ ఆ పొద్దే చెప్పెసినాడు కదా. ఆయన ప్రాణం పోయినంక ఆ సగం కూలిపోయిండే కాలనీ ఇల్లు , యీ గుడిసె మొత్తం కలిపి ఎప్పటికన్నా ఇక్కడ లైబ్రరీ కట్టల్ల అని, దాన్నిండా మన పిలకాయలు పెద్ద పెద్ద పరిక్షలు రాసేదానికి పుస్తకాలు ఉండల్ల అని పెద్దఆశ కదా ఆయప్పకి. ”అన్నాడు కపాలి.
ఆ మాటలేవి నచ్చనట్లు అలివేలమ్మ మొహం తిప్పుతా “ ఓహోహో.. మన ఎరికిల పిల్లోల్లు సదివి.. ఇంకచూడల్లా సంబడం ” అని తేలిగ్గా మాట్లాడే సరికి , అప్పటిదాకా చేతులు నలుపుకుంటా నోరు మెదపకుoడా మౌనంగా నిలబడి చూస్తూ వున్న ఆ ఇద్దరు అమ్మాయిలలో ఉడుకు వచ్చేసింది. అంత కోపం అంత ఆవేశం అంత దూకుడు యెట్లా వచ్చాయో తెలియదు కానీ వాళ్ళ గొంతుల్లోంచి మాటలు దూసుకు వచ్చేస్తున్నాయి.
“ మేం ఇంకా పందులు తోలుకుంటా గాడిదలు మేపుకుంటా , ఇంటికాడ బోకులు తోముకుండా ఉండల్లా అనే నీ కోరిక. థూ... మనకి సిగ్గువుండల్ల అత్తా. పది మందిలో తల ఎత్తుకుని బతికే పనులు చెయ్యాల్ల,కానీ మేం ఇంతే. ఇట్లే పుట్టినాం, ఇట్లే చస్తాం అంటే ఎవరు మారస్తారు మన బ్రతుకులు.అందుకే అత్తా ఆ తాత చెప్తా వున్యాడు కదా .దేశానికి ఒక్క అంబేద్కర్ చాలడు. ఒక్కో కాలనికీ ఒక్కో ఊరికీ ఒక్కో ఇంటికి ఒక్కో అంబేద్కర్ కావల్ల అని , మీకే అర్థం కాలేదు ఆ తాత చెప్పేది. ఒక్క మాట అడగతా చెప్పు. ఈ తాతే అడ్డం పడకుండా వుంటే, మొండిగా ఊరoదర్నీ ఎదిరిoచి నిలబడకుండా వుంటే మన లింగాపురం భూములు మనచేతుల్లో ఉండేవా? మన కాళ్ళు మన భూముల్లో నడిచేవా? మన భూములకు పొయ్యేదానికి మనకో ఓనిమి ఉందంటే అది ఆ తాత వల్లే కదా ? ” భూమిక.
ఎన్నేళ్ళ కథ అది. ఎంత పెద్ద కథ.ప్రభుత్వం యస్సీ యస్టీ లకు భూములు ఇచ్చిన తర్వాత ఎందరు ఎరుకల వాళ్ళు రైతులుగా మారినారో, చివరికి ఎందరుఎరుకల వాళ్ళు రైతులుగా మిగిలినారో చెప్పే కథ.ఎరుకల వాళ్ళు వాళ్ళ భూములకి వాళ్ళు పోలేకుండా లింగాపురం లో ఓనిమి (దారి ) లేకుండా పెద్దోళ్ళు యెట్లా మాయo చేసారో చెప్పే కథ.ఒకసాదా సీదా మామూలు మనిషి పెద్దోల్ల అన్యాయాన్ని ఒప్పుకోకుండా తిరగబడి ఎదిరించి నిలబడితే ఉడుకుడుగ్గా మాట్లాడితే, ఆ మనిషిని జైలుకు పంపిన కథ. సాటి కులమోల్లకోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టిచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉన్నత విద్యావంతుడైన,ఒక గిరిజన ఉపాధ్యాయుడి కథ.ప్రభుత్వఉద్యోగం పోయినా జీతం లేకుండానే కొన్ని సంవత్సరాలపాటూ ఎంతో మంది పేద పిల్లలకి మంచీ చెడు చెప్పి, పాఠాలు నేర్పి, ప్రయోజకుల్ని చేసిన ఒక సృజనకారుడి కథ.
***
“ బిరిన్నే చెప్పండి మీ భూములు అమ్ముతారా? అమ్మరా ?” పెద్ద కులపోల్ల గొంతులు ఎప్పుడూ పెద్దవిగానే వుంటాయి. ఆ వూర్లో అప్పటిదాకా ఎప్పుడూ ఆ గొంతులకు అడ్డం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆ రోజు మాత్రంలింగాపురం లో ఒక విచిత్రం జరిగింది.
ఎరుకల కులంలో పుట్టి , ఊరు దాటి, జిల్లా దాటి హాస్టల్లో చదువుకుని టీచర్ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఎరుకల రామచంద్రుడు ఆ నిముషం గొంతు విప్పాడు. గుండె విప్పాడు.
“ ఏం మీరు కొనాలంటే మాత్రం మేం మా భూములు చవగ్గా ఇవ్వాల్నా ? మీరు అమ్మాలంటే మాత్రం రేట్లు ఆకాశం లో ఉండల్నా? తక్కువ జాతోల్ల భుములకు రేట్లు తక్కువ అంటారా? ఇదేమి న్యాయం? మా పక్కన మీ భూములు వుండచ్చు . ఎంత మాత్రం తప్పు లేదంటారు. అదే మా భూములు మీ పక్కలో వుంటే మాత్రం అది మీకు తక్కువనా? ఏమన్నా ? కులాన్ని బట్టి భూమి రేటు కూడా మారుతుందా ? మట్టికి కూడా కులం ఉందoటారా అన్నా ? ఇదెక్కడి న్యాయం ? ”
ఉడుకురక్తం కదా అనుకున్నారు అందరూ.
పెద్దవాళ్ళు కోపంతో ఉడికిపోయారు.ఎరుకల వాళ్ళు అంతకంటే ఎక్కువగానే ఆవేశంతో ఉడికిపోయారు.
అంత ఉడుకుడుగ్గా మాట్లాడాడు రామచంద్రుడు.
“ నువ్వు ఉండరా అబ్బోడా .... నీది ఉడుకు నెత్తురు. తొందర పడొద్దు”కులపెద్ద నాగయ్య అడ్డు వచ్చేశాడు.
“ ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా , పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బ్రతకాలంటే కరువుతోనే కాదు, మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటాలు చెయ్యడం నేర్చుకోవల్ల. పందుల్ని మేపే వాళ్ళకు , ఊరూరా తిరిగి గాడిదలపైన ఉప్పు అమ్మి , ఎర్రమన్ను, ముగ్గుపిండి అమ్మిబ్రతికే వాళ్లకు,అడవుల్లో బ్రతికే వాళ్లకు,ఎండకు వానకి పురుగూ పుట్రకిభయపడని వాళ్లకి ఇంకొకరు నేర్పించల్లనా? బ్రతికేదానికి వయసుతో పనేముంది మామా ? ఏ వయసోడికైనా బ్రతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల. అసలు మనిషి అనే వాడు ఎప్పుడూ ఉడుకుడుగ్గానే ఉండల్ల.” కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పేశాడు రామచంద్రుడు.అతడు అట్లాగే బ్రతికాడు. జీవితకాలం మొత్తం ఉడుకుడుగ్గానే బ్రతికాడు. ఎక్కడా ఎవరిముందు తల దిoచిన వాడు కాదు. పెద్దోల్ల కుట్రలకి పొలీసుకేసులకి ఉద్యోగం పోయినా వెనకడుగు వేసినవాడు కాదు.
నెలలు కష్టపడి రాళ్ళు తేలిన నేలలో అడవిలాగా పెరిగిపోయిన మొక్కల్నిమొత్తం పీకిపారేసి, బండరాళ్ళు పగలగొట్టి, , రాళ్ళు ఏరి, నేల చదును చేసి సాగుకు అనుకూలంగా మార్చిన తర్వాత ఆ భూముల రూపమే మారిపోయింది. ఎందుకూ పనికి రాదనుకున్న కొండనేల, బండనేల, ఆ భూములపైన కన్ను పడిన తర్వాత జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఊరి పెద్దోళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. ఆ పొలాలను ఎట్లాగైనా చవగ్గా కొనేయ్యాలని విఫల ప్రయత్నo చేశారు.
ఊర్లోంచి ఆ పొలాలకి వెళ్ళే దారి ఉన్నట్లుండి ప్రభుత్వ రికార్డుల్లోంచి మాయమైపోయింది.
ఆ దారికి ఒక చరిత్ర వుంది.
అది ఆ ఊరి రక్తచరిత్రలో ఒక భాగం.చెరువు దాటి , పెద్దోల్ల పొలాలు దాటి, వాగు దాటి వంక దాటినా తర్వాతా , కొండల్లో గుట్టల్లో , పిచ్చి మొక్కల మధ్య గవర్నమెంటు ఎరుకల వాళ్ళు బాగుపడాలని ప్రభుత్వం ఇచ్చిన పొలం అది.ఆ రాళ్ళల్లో ఆ బండ రాళ్ళల్లో, ఆ దుమ్ములో, ధూళిలో, ముండ్ల చెట్లల్లో, పాముల పొదల్లో , విషపు పురుగుల మధ్య కొన్ని సంవత్సరాలు ఎరుకల వాళ్ళు మనుషుల్లాగా కాక, యంత్రాల్లాగా పని చేస్తే ఆ నేల అంత మాత్రం చదును అయ్యింది.ఎరువులు తోలినారు, ఎద్దులని తోలినారు, గంపల కొద్ది రాళ్ళు మోసినారు, ఒళ్లంతా రక్త గాయాలే. ముందుతరం వాళ్ళ రక్తంతో చమటతో తడచిననేల అది.ఆ పొలాలకి వెళ్ళే దారి కోసం యుద్దాలే జరిగాయి, తలకాయలు పగిలాయి.పోలీసు కేసులు అయ్యాయి.
ఎన్నో పంచాయితీలు, రాజకీయాలు నడిచాయి.చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు, మదనపల్లి సబ్ కలెక్టర్ వద్దకు వెళ్లి అర్జీలు ఇచ్చి వచ్చారు.ఆ అర్జిలన్నీ తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చాయి. కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా వుండిన ఆ డొంక దారి రెవిన్యూ రికార్డుల్లోంచి ఎందుకు యెట్లా మాయమైoదో తెలియదు. దారి మూసి వేసిన రైతుల్ని గట్టిగా అడిగితే వాళ్ళు మొహాలు చూపకుండా కనపడకుండా పోయారు.
ఆ రోజు పెద్ద గొడవ అయింది.వీఆర్వో ను అడిగితే ముందు నోరు తెరవలేదు. అది దారి కాదు , అక్కడ దారే లేదు అనేశాడు. అందరూ ఎంత మాట్లాడినా , ఎంత బ్రతిమలాడినా దిగి రాలేదు ఆయన.
“ఓపిక లేదా నీకు?. ఇంత తొందర పెడితే ఎలా ? మేం కూడా మనుషులే కదా మాకేమన్నా నాలుగు చేతులున్నాయా? “ మొహం చిట్లించేశాడు. అవలింతను ఆపుకునే ప్రయత్నం కానీ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునే పని కానీ చెయ్యకుండా మొహం అంతా పెద్దది అయ్యేలా నోరంతా తెరిచి పెద్ద చప్పుడుతో ఆవులించాడు వీఆర్వో రంగారెడ్డి . సన్నగా వున్నాడు కానీ అతడి గొంతు చాలా కరుగ్గా వుంది, మాట కటినంగా వుంది.నోట్లోంచి సిగెరట్ పొగతో ఇంకేదో కలసి మొత్తానికి వెగటు వాసన వస్తోంది.
మొహం పక్కకు తిప్పుకుంటే ఏమనుకుంటాడో అని సందేహిస్తూనే , ఒక అడుగు వెనక్కు వచ్చి, ఊడి పోయిన అతడి చొక్కా గుండిల వైపు, ఉబ్బి పోయిన అతడి కడుపు వైపు చూస్తూ మెల్లగా ఇంకోసారి మెత్తగానే అడిగాడు ఎరుకల రామచంద్రుడు.
“ దారి కోసం జనం అల్లల్లాడతా వుండారు సార్, కొన్నేండ్లు వానల కోసం ఎదురు చూసినాం సార్ .ఇంకోన్నెండ్లు పట్టాలకోసం చూసినాం సార్. మా బావులన్నీ పూడిపోయక, రాళ్ళు తేలిపోయిన బావుల్లో పాములు పురుగు పుట్రా ఇన్నెండ్లూ వుoడి పోయినాయి సార్, ఇప్పుడైనా వానలు పడినాకే ఇంత మాత్రం నీళ్ళువచ్చి మా బావులు కళకళ్ళాడతా వుండాయి సార్, ఇప్పుడు గానా మాకు మా పొలాలకి పొయ్యేదానికి దారి వదల్లేదంటే మొత్తం మా పొలాలు అన్నీ మళ్ళీ బీడు పడిపోతాయి సార్, మా బ్రతుకులు మళ్ళీ పందుల పాలు అవతాయి సార్.మీరు మా పరిస్థితి అర్థం చేసుకోండి..ప్లీజ్ ”
“ఊర్లో పందులు వుంటే ఊర్లో వుండే వాళ్లoదర్కీ వ్యాధులు వస్తాయి అంటారు సార్, నిజమే. పందులతో బాటూ మమ్మల్ని కూడా వూర్లోంచి వేలేస్తామని దండారా కొట్టి చెప్తావుండారు, బావుంది సార్, మీరు అందరూ ఎప్పుడూ బావుండల్ల. మేమే చెడిపోవల్ల. అంతే కదా సార్. మేం అడవుల్లోకి పోకూడదు, వెదుర్లు కొట్టకూడదు, చెట్లు కొట్టకూడదు, మేకలు తోలుకుని అడవిలోపలికి పోకూడదు అంటారు.అప్పుడు అడవులనుండి తరిమేస్తిరి, ఇప్పుడు సేద్యం చేసైనా పొట్ట పోసుకుందాం అనుకుంటే అదీ కాకుండా చేస్తా ఉండారు . ఇప్పుడు సేద్యం నుండి కూడా తరిమేస్తేఇంకా మేం యెట్లా బ్రతకాలని మీరంతా అనుకుంటా వుండారు? మీరు మాత్రం బ్రతికితే సాల్నా ? తక్కువ కులం లో పుట్టినామని ఇంత అలుసా సార్ మేమంటే ?”
“ ఏయ్ ఒక్కసారి చెపితే అర్థం కాదా మీకు ?మీ పొలాలకు ముందునుంచే ఎక్కడా దారి లేదు. రికార్డుల్లో ఎక్కడా మీ పొలాలకు దారి వున్నట్లు ఎక్కడా ఆధారాలే లేవు. లేని దారిని ఇప్పుడు మీరు అడగతావుండారు.ఇదేమి న్యాయం?మల్లింకా గట్టిగా ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే మాత్రం కిందకులాలంటే అంత చులకనా మీకు అని నిలదీస్తారు.మీదే తప్పు. అసలు తప్పంతా మీదే.పెద్దోల్ల పొలాల్లోకి పోకండి. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మీపై కేసు పెట్టకుండా మాటల్లోనే హెచ్చరిస్తా వుండారు. మీరంతా బాగుపడాలనే కదా, పైకి రావాలనే కదా యస్సీ యస్టీలకు ఇంత నేల చూపిస్తుంది ప్రభుత్వం.ఇంత మాత్రం కొండలో గుట్టలో ఏదో ఒక భూమి ఇచ్చేదే గొప్ప, ఇంకా దారికూడా కావాలంటే యెట్లా? ”
“ రాళ్ళూ రప్పలు ఉండే చోట కొండ తవ్వి సేద్యం చేసుకోవాల్నా మేం ? దారి లేకుండానే భూములిస్తే మేo ఏమైనా గాల్లో ఎగిరి పోయి సేద్యం చేసుకోవల్నా ? ఎందుకు పనికి రాని భూముల్ని యా మూల్లోనో మాకు ఇస్తానే వుంటారు. కింద కులాలోల్లు యాడికి పోయ్యేదీ లేదు, సేద్యం చేసుకునేదీ లేదు. కింద వుండే వాళ్ళు కిందనే ఉండిపోతాo. అయినా ఏంది సార్ అంత అన్యాయంగా మాట్లాడతా వుండారు ?ఇన్నెండ్లూ మా పొలాలకి దారి లేదంటే, మేమంతా గాల్లోకి పొయ్యి సేద్యం చేసినామా ఇన్నేండ్లు ? ”
మాటా మాటా పెరిగింది. ఉడుకోడు ఊరుకోలేదు.
ఆఖరికి ఉడుకోడు పెద్దగా గలాటా చేస్తే వీఆర్వో అడ్డం తిరిగేశాడు.
“ పోనీలే... అని మర్యాద ఇస్తా వుంటే ఏందిరా ఎదురు మాట్లాడేది నేరిస్తా వుండారు? మాలోల్లు మాదిగోల్లే అనుకుంటే, ఇప్పుడు తిరగబడి మాట్లడేదానికి ఎరికిలోల్లు కూడా తయారవతా వుండారు.ఏం తెలుసురా మీకు? చట్టం తెలుసా , గవర్నమెంటు అంటే తెలుసా ? అధికారులంటే అంత అలుసా మీకు? నాతో జాగ్రత్తగా ఉండండి. ముందుగానే చెప్తా ఉండా. నాకు తిక్క రేగిందంటే కేసులు పెట్టి మీకు భవిష్యత్తే లేకుండా చేసేస్తాను బద్రం.. ” అది అతడి ఒక్కడి మాటే కాదు. పెద్దోల్ల మాట కూడా అదే. వాళ్ళ మాటలే అతడి నోటి వెంట...
వాళ్ళ బెదిరింపులకు ఉడుకోడు అస్సలు లొంగలేదు. వీఆర్వో మొత్తానికి అంతా తారుమారు చేసేశాడు. అది డొంకదారి కాదని, దొంగదారి అని తేల్చేశాడు.మారింది మార్చింది ఒక్క అక్షరాన్నే. కానీ మారింది పాడయింది..ఎన్నో జీవితాలు.కొంతకాలం వరకూ ఆ పొలాలు కొన్ని బీడుగానే ఉండిపోయాయి.కొన్ని పెద్దోల్ల బలవంతాన ఆ దారిలేక, వేరే దారీ..లేక తక్కువ ధరలకే అమ్మకానికి వెళ్ళాయి.కొన్ని పొలాలు చేతులు మారాయి.ఇంకొన్ని పొలాలు వాళ్ళు చేసిన అప్పులకీ వడ్డీలకీ పెద్దోళ్ళ వద్దకే తాకట్టులోకి వెళ్ళిపోయాయి.
“ ఇదొక పనికిమాలిన రూలు. మన గవర్మెంటు వస్తానే దీనెబ్బా.. ఎదవ రూలు మార్చి పడేద్దాం అన్నా. అదేంది.. యస్సీయస్టీ ల డికేటి భూముల్ని వేరే కులాలోల్లు కొనకూడదoటే యెట్లా కుదురుతుంది? రిజిస్ట్రేషన్ చేసేది లేదంటే ఎట్లా ? ” పెద్దోల్ల బాధలు పెద్దోల్లవి.
తొంభైతొమ్మిది సంవత్సరాలకు లీజుకు పత్రాలు రాసుకున్నారు కొందరు. బాండుపేపర్ పైన అగ్రిమెంట్ చేసుకుని అమ్మకాలు జరుపుకున్నారు కొందరు. ఇచ్చిన సొమ్ముకు ఎక్కువగా బాండ్ పేపర్లో తెలివిగా సంతకాలు తీసుకున్న పెద్దోళ్ళు కొందరు. తాము ఇచ్చిన దానికన్నా తక్కువకే అతి తెలివిగా బాండు పేపర్ రాసుకున్నపెద్దోళ్ళుఇంకొందరు .
నాగయ్య అడగనే అడిగేశాడు ” ఎందుకురా మన పొలాలు అమ్మకానికి పెడతారు. ఈ భూములు మళ్ళీ కొనాలంటే జీవితాంతం మన బ్రతుకులన్నీ కలిపినా సాలవు.అందరం కలసే భూములు సాగు చేసుకుందాం .అందరూ ఒక్క మాట మీదే నిలబడదాం. ” ఆ మాటలు ఎవరూ పట్టించు కోలేదు. ఆయనంటే గౌరవం ఉన్న వాళ్ళు మాత్రం ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
“ పెద్దాయనా నువ్వు సెప్పేది వినేడానికి బాగానే వుంది. రైతుల్ని చూడు.ఉండేవాడు బాగానే వుండాడు. వుండే రైతుకు వాన వచ్చినా ఒక్కటే, రాకపోయినా ఒక్కటే, ఎందుకంటే ఉండేవానికి పది రకాల సంపాదనలు వుంటే అందులో సేద్యం ఒక్కటి మాత్రమే. జరుగుబాటు లేని రైతును సూడు. వానికి వానొస్తేనే సేద్యం వుంటుంది. వానొస్తేనే బ్రతుకు వుంటుంది, వాళ్ళ ఇంట్లో వానొస్తేనే పండగలు అయినా దేవరలు అయినా టయానికి జరగతాయి.టయానికి వానలు లేవు అంటే అదును తప్పేది వానోక్కటే కాదు. మొత్తం రైతు బ్రతుకే అదుపు తప్పుతుంది. వాళ్ళ పరిస్థితే అట్లా వుంటే ఇంక మనం ఎంత? మన బ్రతుకులెంత ? ”అనేసారు.
“ అయినా మనకు వేట తెలుసు, జీవాల్ని మేపడం తెలుసు,అడవులు తెలుసు, తేనే,మూలికలు ఆకు పసుర్లు తెలుసు. అడవులు, ఊర్లు,వీధులు తిరిగి తిరిగి బ్రతకడమే తెలుసు.వెదుర్లు చీల్చి దబ్బలు, బుట్టలు అల్లడం తెలుసు, మనం మానంగా బ్రతికే బ్రతుకు వదిలేసి,ఇప్పుడు మడక కట్టు, దుక్కి దున్ను, విత్తనాలు ఎయ్యి, కలుపు తియ్యి అంటే అదంతా కుదిరే పనేనా ?అయినా సేద్యం పనులకి కూలికి పోయ్యేదానికే మనకు అలవాటు కానీ ఇప్పుడు నువ్వే రైతువి, నువ్వే సేద్యం చెయ్యల్ల అంటే ఎరికిలోడికి గుoడె జారి పోతా వుండాదిరా అబ్బోడా.నీకు ఎన్ని తూర్లు చెప్పినా అర్థమే గావడం ల్యా... మార్చల్ల అంటావు, మారల్లఅంటావు,ఇదంతా అయ్యే పనే అంటావా? ”నాగయ్య ఎంత చెప్పినా ఉడుకోడు వినలేదు. అప్పుడు మొదలు పెట్టిన పోరాటాన్ని ఆపనే లేదు.
***
ఉడుకోడు జీవితకాలం అట్లాంటిపోరాటాలు చేస్తూనే ఉండిపోయాడు.ఎప్పుడూ ఎక్కడా చల్లబడలేదు.
వయసు మళ్ళినా ముసలితనం వచ్చినా, చూపు మందగించినా, వినికిడి శక్తి తగ్గినా, కీళ్ళనొప్పులు సతాయించినా అతడిలో పట్టు తగ్గలేదు.ఇప్పటికీ అతడు ముసలివాడు కాలేదు, ముసలివాడని ఎవరి దగ్గరా అనిపించుకోలేదు. మార్పు కోసమే అతడి పోరాటం.అన్యాయాన్ని ఎదిరించడమే అతడి జీవన విధానం.
ఆ ఊరికి పంచాయతి కేంద్రం ముందు నుండీ చాలా దగ్గర. తర్వాత అది మండలకేంద్రం అయింది, మున్సిపాలిటీ అయింది. పొలాలకు మనుషులు దూరమయ్యాక , కొత్త కొత్త పనులకు, కొత్త ఉపాధులకు వాళ్ళు అలవాటు పడ్డాక టౌన్ లో కాలనీ ఇండ్లు మంజూరు అయ్యాక వాళ్ళ స్థావరాలు మారాయి.ఉపాధులు మారాయి. కొన్నేoడ్లకు పందులు వూరికి దూరం గా ఉండాలనే ఆంక్షలు వచ్చాక, కొందరు పందుల తో బాటూ ఆ ఊరు వదిలిపెట్టేసారు.
ఉన్న అప్పులకి తోడు ఇంకా అప్పులు చేసి కొoదరు, గవర్నమెంటు ద్వారా బావులు తవ్వుకొని కొందరు, బోర్లు వేసుకుని కొందరు మాత్రం వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. ఎంత లోతుకు వెళ్లి వేసినా వాటిల్లో ఫెయిల్ అయిన బోర్లే ఎక్కువ. బోర్ ఫెయిల్ అయినా బ్యాంకు అప్పులు వడ్డీలు కట్టాల్సిందే అని బ్యాంకులు తెగేసి చెప్పినప్పుడు, ఆ అప్పులు తీర్చేదానికి మిగిలిన పందుల్ని, మేకల్ని , ఆవుల్ని అమ్ముకున్నవాళ్ళు కొoదరు.ఇన్ని బాధలూ పడిన తర్వాతా కూడా ఆ పొలాలకి వెళ్లి వచ్చేదానికి దారి లేదంటే వాళ్లకు ఏడుపే వచ్చింది. అట్లా ఏడ్చుకున్న వాళ్ళు ఎందరో. అటూ వ్యవసాయమూ చెయ్యలేక,ఇటు కులవృత్తులు చెయ్యలేని పరిస్థితిలో...అయోమయంలో వుండిపోయారు.. చాలా కాలం.
ఇప్పుడు వాళ్ళ వద్ద పందులు లేవు, ఆవులు వున్నాయి.
వాళ్ళ పిల్లలు వూరు దాటి హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో మాత్రం ఇండ్లకు వస్తారు. అప్పుడైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది, ఎక్కవ సేపు వుండేది ఉడుకోడి వద్దే. చిన్నప్పటి నుండి వాళ్లకు అక్షరాలు నేర్పి,చదువుతో బాటూ మంచీ,చెడు చెప్పిందీ ఆయనే, బాగా చదవాలనే తపన కలిగించిoదీ ఆయనే. వాళ్ళల్లో కొందరు మైక్ ముందు నిలబడి కొత్త బాషలో కొత్తగా మాట్లాడుతూ వుంటే కాలనీ వాళ్లకి ఆశ్చర్యంగానే ఉంది.
“ మనం ఎప్పుడూ వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంత కాలం ఈ వెనుకబాటుతనం.ఇంకెంత కాలం ఈ కుల రాజకీయాలు ? ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు కాదు వుండాల్సింది, మంచి పుస్తకాలు ఉండల్ల.మనలో ఏ ఒక్కడూ తక్కువ చదివే దానికి లేదు.ఎరికిలోల్లు అందరూ ఎక్కువే చదవల్ల. ఉడుకాయన పోటీపరీక్షలకి పుస్తకాలు కావాలని మా సీనియర్లకి చెప్పినాడు, ఉద్యోగాలు వచ్చినోళ్ళంతా పుస్తకాలు కొనిస్తామన్నారు.గుడి బదులు లైబ్రరీ కడితే చాలు. అందరూ ముందుకు వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే కానిది ఏముంది ? ” ఉడుగ్గానే ఉన్నాయి ఆ మాటలు.
అప్పుడు వచ్చింది భూమిక మైక్ ముందుకు.” అన్నా మొన్న కూడా ఉడుకాయన ఆ ఓనిమి గురించే... ఆ దారి గురించే బాధ పడినాడు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య పరిష్కరించాలి. అప్పుడే ఆయనకు శాంతి. ”
అప్పుడు చాలాకాలం తర్వాత మళ్ళీ ఆ దారి గురించి మాటలు మంతనాలు మొదలయ్యాయి.గవర్నమెంటు మారినప్పుడల్లా ఆ దారి కూడా తన రూపు రేఖలు మార్చుకుంటుంది. మనిషి నడవడానికి మాత్రమే కుదిరే దారి అప్పుడు మాత్రం విశాలమవుతుంది!అంత వరకూ అడ్డుగా వుండిన రైతులు అప్పుడు మాత్రం దారి వదలతారు,అప్పుడుఆ దారిగుండా ఎద్దుల బండ్లు పోతాయి. ట్రాక్టర్లు పోతాయి, జేసిబిలు పోతాయి. ఆ కాలం లోనే ఎరుకలవాళ్ళు బోర్లు వేసుకోవాలన్నా , కలుపు తీయాలన్నా , నేల చదును చేసుకోవాలన్నా కుదురుతుంది.
ఇదేండ్ల తర్వాత ప్రభుత్వం మారితే దారి కూడా మారిపోతుంది. ఒక్కోసారి ఆ దారి కాలిబాట లాగా కుంచించుకు పోతుంది. అప్పుడు ఇక ఎద్దుల బండ్లు పోలేవు.ట్రాక్టర్లు , జేసిబిలు పోలేవు. సైకిళ్ళు పోవచ్చు, నడచి పోవచ్చు అంతే, అంతకు మించి పోవడానికి కుదరదు. అదే లింగాపురం రాజకీయం.
పరుగులాటి నడకతో కొందరు అప్పుడే బస్సు దిగి వచ్చారు కాలనీ లోకి.
“ఎవరికి ఏం కావాలన్నా ఉడుకోడి వద్దకే కదబ్బా అందరూ వస్తారు. గవర్నమెంటులో ఏ పని యెట్లా చెయ్యాలో ,చేయించుకోవాలో, పని కాక పోతే ఎవుర్ని కలవాలో, యెట్లా కంప్లైంటు చెయ్యాలో ఆయనే కదా నేర్పించేది. యస్టీ కార్పోరేషన్లో ఎంత మందికి ఎన్నెన్ని లోన్లు తీపిచ్చినాడో లెక్కేలే . మనోళ్ళవద్ద ఏ ఆఫీసర్ అయినా లంచాలు అడగల్ల అంటేనే భయపడి పోతారంటే వాళ్లకి ఉడుకోడు అంటే వుండే భయమే కదా కారణం.పద పదా .. చివరి చూపు చూసి ఆయనకో దండం పెట్టుకుని రావల్లనే కదా ఇంతదూరం వచ్చిండేది. బిరిన్నే పదా ..”
ఇప్పుడు మైక్ ముందుకు పార్వతి వచ్చి నిలబడి చుట్టూ చూసింది.
పార్వతి పొడవుగా వుంటుంది. వాళ్ళ నాన్నకు అక్కడపొలం వుంది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది కానీ యస్ఐ కావాలని పోటీ పరిక్షలకు చదువుకుంటోంది. ఆమె తల తిప్పుతూ అక్కడ గుమిగూడిన వారిని చూస్తూ మాట్లాడుతోంది...
“ఒక్కటే మాట. అంబేద్కర్ చెప్పినాడో , ఇంకొకాయన చెప్పినాడో ఉడుకాయన చెప్పినాడో ఒక్కటే మాట..” ఎడమ చెయ్యి పైకి ఎత్తి మిగతా నాలుగువేళ్ళు మడచి పెట్టుకుని చూపుడు వేలు మాత్రం పైకి ఎత్తి చుట్టూ చూపిస్తూ అంటోంది...
“అస్సలు ఈ కులం ఎవడికి పుట్టింది? మన భూమి అనేది మన ఆత్మగౌరవం. ఎవరు ఏం చేసినా సరే మన భూములు అమ్మడానికి లేదు. మందు, బిర్యానీ,డబ్బులేకుండా ముందు ఓటేద్దాం.అప్పుడు వాళ్ళే దారికొస్తారు.
మనది దొంగదారి అంటారా వాళ్ళు.. చూద్దాం..దాన్ని మళ్ళీ డొంక దారి చేసుకుందాం.ఇది మన దారి.. రహదారి.ఏమంటారు ? అన్నతమ్ముల్లారా , అక్క చెల్లల్లారా.. ఏమంటారు? ”
“అంతే అంతే.. “ జనం ఉడుగ్గా ఉన్నట్లున్నారు.
మనుషులు వడివడిగా నడుస్తున్నారు.అక్కడ ఎండవల్లో, ఎందువల్లో వేడి సెగ కొడుతోంది.గాలిలోనే కాదు,మనుషుల నుండీ కూడా ఏదో వేడి సెగ మొదలయ్యింది.అక్కడి వాతావరణం ఉడుకెక్కిపోయింది.అక్కడున్న వాళ్ళు అందరూ ఉడుకెత్తి పోతున్నారు.
పలకల చప్పుడు ఎక్కువైంది. చప్పట్లు, ఈలలు, నినాదాలు, అరుపులు, ఏడ్పుల మధ్య ఉడుకోడి శవం పైకి లేచింది.
@@@
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు