నియోగం
ఈ లోకం పైకి కనబడని సంకెళ్ళతో స్త్రీలను ఎంతలా బిగిస్తోందీ?
ఆశ్చర్యమూ, విచారమూతో కూడిన ఆలోచన కుంతీదేవిని కలవరపరుస్తోంది. ఆడవాళ్ళు స్వతంత్రించడం ఈ క్షత్రియపుత్రులు సహించలేరు. అందునా రాజ్యపాలకులకు అసలు నచ్చదెందుకో! అనూచానంగా వస్తున్నదేకదా తాను అనుసరించిందీ? ఈనాటికి అది ఎందుకు కంటగింపైందీ? నా అత్తనాటికీ, నా నాటికీ ఎంత అగాధం?... ప్రవాహసదృశమైన కాం ఎంత ఉత్థాన పతనా నెదుర్కొంటోంది.
కృష్ణుడెంత నిర్దయుడూ?... మనసులో మారుమూలకు నెట్టబడి మరుపుపొరల్లో దాగిన వాటిని బలిమిన వెలికితీసి!... ఏం! సంతోషం?. మనసు మూగగా రోదించింది.
సూర్యుడు పశ్చిమాద్రిలో నిద్ర కుపక్రమించబోతున్నాడు.
వినీలాకాశం తన నిశీధి తెరలు దించుతూ జీవ ప్రపంచానికి విశ్రాంతి నివ్వడానికి సమాయత్తమవుతోంది. కను చీకట్ల గోచరంతో పక్షు కిలకిలారావాను ముగించి గూటిని వెతుక్కుంటూ బారులు తీరి ఆకాశవీధిలో వేగంగాపోతున్నాయి.
ఆ ప్రశాంత నిశ్శబ్దంలో గంగానదీ జలాల జలజలలు సహితం కుంతీదేవికి కల్లోల తరంగాలుగా మారాయి.
మరోసారి, ‘కృష్ణుడెంత నిర్దయుడూ’!` తలచుకుంది. అష్టపదులు దాటి అంతిమ సమయానికి దగ్గరయిన ఈ వయస్సులో ఈ పరీక్షేమిటీ?
‘‘ఇది పరీక్షే కావచ్చు! కానీ తప్పదు అత్తా!’’` మేనల్లుడి మాటలు మృదువుగా అనిపిస్తున్నా, అవి ములుకుల్లాగే వున్నాయి. ‘‘ఎవరైనా, ఏనాడైనా తాము నిర్వహించిన చర్యకు ఫలితాన్ని స్వీకరించక తప్పదు అత్తా!’’....
మేనల్లుడివి మామూు మాటలే కావచ్చు` కానీ అవి ఆజ్ఞల వంటివే, కలవక తప్పదు... కానీ ఏ మొహం పెట్టుకునీ?... వాడిపట్ల నేనేం నిర్వహించాననీ?....రాచరికానికి నీతి, న్యాయం వుండవుకదా!... ఆమెకు సిగ్గుగా అనిపిస్తోంది. ఈ ఆలోచనలతో కుంతీదేవి మనస్సు ద్వైదీభావంతో కొట్టుకులాడుతోంది. ‘రాధేయుడు’గా పెరుగుతున్నాడని తనకు తెలియదా? తానీ ఇంద్రప్రస్తావతికి వచ్చినపుడే - రహస్యంగా తమ పాత దాసీది కలిసి - చెప్పింది కదా! - అప్పుడుకూడా బిడ్డ ఎలా వున్నాడన్న ఆసక్తితో, ఏదో మిషతోనైనా తనకు ఒక్కసారి చూపించమని చెప్పగలిగిందా? మమకారపు బంధనాలను తానై బవంతంగా తెంచుకుంది.
అవును!... రాచరికపు ‘పరువు’ తననూ బంధించింది... జీవితమంతా ఈ రాచరికం దించరాని బరువును భుజాల మీద మోపి కృంగదీసింది. అందుకోసం బతుకంతా ఎదురుదెబ్బలే తప్ప పొందిందేమిటీ?... భోజరాజు కూతురిగా ఆ బాల్యంలో ఏం సుఖపడిందో! - మిగిలిన ఈ ఏడు పదుల జీవితంలో అన్నీ అడ్డంకులే, అంతా కల్లోలమే!.
అయినా ఈ కృష్ణుడు వేటినీ వదలడుగదా! ఏ జ్ఞాపకాు తనను కల్లోలపరుస్తాయని అట్టడుగు పొరల్లోకి నెట్టివేసిందో... వాటినే పైకిలాగి ఎదురుగా నిలబెట్టి, తేల్చుకోమంటున్నాడు.
ఏడుపదుల వెనక్కు వెళ్ళమంటున్నాడు. తప్పదు.... పరాభవం మరోసారి నెత్తిన వేసుకోక తప్పదు. తల్లితనం కూడా రాచరికపు వస్తువే అయింది. ఎంత దురదృష్టం!
గతం ముందుకు వచ్చి ప్రశ్నిస్తూ నిలబడింది.
అవి తెలిసీ తెలియని తొలి యవ్వనపు వికసనాలు, ప్రతిదీ ఆసక్తే, కుతూహలమే. చిరుగాలి సవ్వడికూడా మైమరపు గిలిగింతలే!. అది మధుమాసం. తోటంతా సువాసన భరితమైన సంపెంగ, పారిజాతం, మరువం, ఫలపుష్పాలే. చెలులతో కసి వాటిని ఆస్వాదిస్తూ రాచనగరు దాటి బయట వనాలలోకి తెలియకుండానే వెళ్ళిపోయింది. ఒక్కొక్క పొదనూ పలకరిస్తూ తెలియని ఉన్మత్తతతో వనమంతా కలియతిరుగుతూ స్వప్నాలలో తేలియాడుతుండగా....
ఆ చల్లని సాయంసంధ్య వనంలో దేదీప్యమైన వెలుగులు విరజిమ్ముతుండగా` తననే తదేకంగా చూస్తున్న ఓ సమ్మోహన రూపసి, ఎట్టఎదుట ప్రత్యక్షమైంది. అదే ఆమెకు పరపురుషుని తొలి దర్శనం. ‘అయినా తాను భయపడి పరిగెత్తి పోయింది లేదు. భయం తనకు కొత్త పదం. అలాగే నిల్చుండిపోయింది.’
ఇరువురూ బాహ్య స్మరణలేని ప్రతిమలయ్యారు.
అతనే ముందుగా తేరుకున్నాడు. ‘‘పృధాదేవీ’’... అంటూ నెమ్మదిగా, ఆశ్చర్యంతో నిండిన పిుపు.
‘ఇతనేమిటీ ఇంత చొరవగా ఏదో పేరుపెట్టి పిలుస్తున్నాడూ!’ మౌనంగా, సూటిగా అతన్నే చూస్తోంది.
‘‘నీ పేరు తెలియదు` అయినా నిన్ను చూసాక ఆ పేరే నీకు తగినదనిపించింది. నిండుగా సమస్త లోకాన్ని భరించే పృదివికి మరో రూపంగా గంభీరమైన నీ విగ్రహం, విశామైన నీ పాలభాగం, నీ భువన మోహన సౌందర్యం - నన్ను అలా పివడానికి ప్రేరేపించాయి కుంతల మహారాణీ.! నేను ఇంతవరకు మన గణాలలో ఈ అందాన్ని చూడలేదు పృధా! శ్రద్ధగా తీర్చి చెక్కిన శిల్పకారుడి సృష్టిలా వున్నావు.’’
ఆమెను చూస్తూ అతనేమిటేమిటో మాట్లాడుతున్నాడు. అవన్నీ ఆమె చెవికి ఎక్కడం లేదు; చూపు మరల్చాలని తోచలేదు. అతను తనకు దూరపువాడిలా అనిపించలేదు; పచ్చని పసిమి రంగు కాంతులీనుతూ ఆజానుబాహు - భుజానికి విల్లంబు, వీపున అంబుపొది, చేతిలో బాణాలతో ఎట్టఎదుట చిరునవ్వుతో....
ఇంతలో తనతో వచ్చిన దాసీలు ఆమెను సమీపించి - ‘‘అమ్మా!, కుంతీదేవీ!... విహారానికి వచ్చిన సమయం మించిపోయిందమ్మా! రాచనగరకు తిరిగి పోదాం దేవీ!’’ - జ్ఞాపకం చేశారు.
అప్పటికి మామూలు స్థితికి వచ్చిన కుంతీదేవి చెలులతో కలిసి మరలిపోవడాని కుద్యుక్తురాలయింది.
‘‘దేవీ! మీరు కుంతి భోజరాజు పుత్రికలా! - మేం ఈ పొరుగునే వున్న సూర్యగణానికి చెందినవారం’ - నా పేరు ఉదయుడు, వేటకోసం ఇలా వచ్చాను. మీ పాదస్పర్శతో పులకించిన ఈ నేలను విడిచి తిరిగిపోవాని లేదు. నా జన్మ ధన్యమైంది. తిరిగి తమ దర్శనం కోసం ఈ చుట్టుపక్కలే తిరుగాడుతుంటాను.’’
కుంతీదేవికి అతని మాటలు లోలోపల పులకింతలు రేపాయి. అయినా చెలులతో కలిసి నెమ్మదిగా ఆ వనాల నుండి రాచనగరు వైపు దారి తీసింది.
‘‘అమ్మా! వారు మన గణానికి చెందిన వారు కారమ్మా’’
‘‘ఆ మాట అతనే చెప్పాడుకదా! అయితే నేమిటి చెలీ! అతనెంత వున్నతంగా వున్నాడూ - మనలను ఒక్క మాట మీరి మాట్లాడలేదు కదా!’’`
‘‘నిజమే దేవీ! కానీ ఇతర గణాల పురుషులతో పరిచయాన్ని మన గణపెద్దలు ఒప్పరు కదా’’...
అప్పటికిక మౌనంగా తను సౌధానికి చేరింది. కానీ అతని రూపం, మాటలు ఆమెను వీడలేదు. కాలం ఆమె ఆలోచనల్ని తుడిచి వేయలేకపోయింది.
ఓ రోజు మెల్లిగా చెలులను ఏమార్చి తన సౌధం వెనకనున్న తోటలో నుండి బయుదేరి విశాల వనాలలోకి కదిలింది. అతనిని మొదటిసారి చూసిన ప్రదేశం వైపు దారితీసింది.
నిజంగానే అతను చెప్పినట్టుగా అక్కడే శిలాతల్పం మీద ఎదురుచూస్తున్నట్టే కూర్చున్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతన్నే చూసింది.
కుంతి రాకను గమనించి ఉదయుడు ఎదురేగి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించాడు.
ఇరువురూ మౌనంగా ఎంతో సమయం అలా వుండిపోయారు. ఉదయుడే ముందుగా తేరుకుంటూ, ‘‘దేవీ! అప్పటి నుండి ప్రతి దినం మీ రాకకోసం ఈ ప్రదేశానికి వచ్చి, సూర్యాస్తమయం వరకు వుండి, నిరాశగా తిరిగిపోతున్నాను. ఈ రోజు నిజంగానే ధన్యుడను.’’
ఆ మాటకు జవాబివ్వలేదు... ‘‘మీరు, మా గణానికి చెందినవారు కాదు - కదా!’’ - ఎప్పటికో ఆమె పెగుల్చుకుంటూ తన సందేహాన్ని అతని ముందుంచింది.
‘‘అవును - ఇన్నాళ్ళుగా ఆ ఆలోచనే నన్ను నిలవనీయడం లేదు, పృధాదేవీ - ఈ కట్టుబాట్లు వెనక లేవు. కొత్త కొత్త నియమాలు ఎవరికోసం, ఎందుకోసం చేస్తున్నారో తెలియడం లేదు’’` విచారంగా అన్నాడు అతను.
ఆ మాటతో ఇద్దరి మధ్యా తిరిగి మాటలు కరువయ్యాయి. కుంతీదేవి మనస్సు కల్లోలమైంది. తానిలా రావడం తన తండ్రికి ఇష్టం వుండదని ఆమె మనస్సు చెప్తోంది. అయినా చలనం లేనట్లు అలాగే వుండిపోయింది. అప్పుడొకటీ, ఇప్పుడొకటీ చిన్న చిన్న మాటలేవో జరిగిపోతూ వున్నాయి. ఒకరిని వీడి ఒకరు వెళ్ళాలనిపించక అలాగే వున్నారు.
చివరకు పడమట వెలుతురు తగ్గుముఖం పట్టడంతో, నగరుకు తిరిగి వెళ్ళడానికి అడుగు ముందుకు వేసింది. ఆమెతో పాటు అతనూ వనాల చివరిదాకా వచ్చి, కుంతీదేవి నగరులో ప్రవేశించాక వెనుదిరిగాడు.
ఆమె సౌధానికి చేరి తోటలోకి అడుగు పెట్టీ పెట్టగానే చెలులు ఆతృతగా ఎదురువచ్చారు.
‘‘అమ్మా! మీరింకా పిన్నవయస్కులు, స్వతంత్రించడం మంచిదికాదు. అయినా గణనియమాలను దాటటం గణ పెద్దలు సహించరమ్మా! ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారూ? ఇంతటితో దీనిని ముగించడం మంచిదమ్మా!,...’’ భయపడుతూ హెచ్చరించారు. ఏది ఎటుపోయినా ప్రమాదం తమకే ననేది వారి ఆందోళన.
కుంతీదేవి మౌనంగా వుండిపోయింది.
* * * * *
ఎన్నోయేళ్ళుగా ఈ లోలోపలి జ్ఞాపకాలు మరుగున పడిపోయాయనుకుంది. కాని అవి ఎప్పటికీ మరుపురానివే అయ్యాయి.
తొలి విరిసీ విరియని మధురిమలు - నూతన కౌతుకం. పైగా తనంతట తానుగా ఇష్టపడి ఏర్పరుచుకున్న బంధం; అదో స్వప్నం. కాని ఆ స్వప్నం విరిగి తుళ్ళిపోనే పోయింది. దాదాపు తాను ఇంతకాలం అది గుర్తుకు లేనట్టుగానే వుండిపోయింది.’ నిజంగానే తాను ఉదయుడిని మర్చిపోయిందా?... మర్చిపోవానుకుంది, అంతే! - కానీ అంతా వట్టిదే అయిపోయింది. వివాహానికి ముందు మనస్సును కట్టడి చేసుకోవడానికే కృతనిశ్చయురాలైంది. రాచబిడ్డగా తండ్రి ఆజ్ఞను ఔదల దాల్చింది.
అయితే పాండువునితో వివాహమయి హస్తినావతికి వచ్చాకనే మానిన గాయం తిరిగి సలపరించినట్లయింది. పాండువు ప్రతి రాత్రీ తనను హింసపెట్టీ... అతను హింసపడీ... నిర్వీర్యుడుగా మిగిలిపోయిన ప్రతిక్షణం తానెంత శిక్షను అనుభవించిందీ? అప్పుడే ఉదయునితో తన అనుబంధం మనసులోకి వచ్చేది. అతని కలయికలోని మధురానుభూతి మనసును అగ్నిలా దహించేది. అతని జ్ఞాపకాలు కాల్చివేస్తుండగా ఆమెకు తానెందుకు ఉదయుడిని వదులుకుందీ? అన్న ప్రశ్నలు నిత్యమూ తొలిచేవి.
ఆ కాలమంతా రాజ్యం... గణం, గౌరవ ప్రతిష్టలు తనకూ సంకెళ్ళు వేసాయి. ‘ఉదయుడు మన ‘గణం’ కాదమ్మా!’, అంటూనే తండ్రి తనను కట్టడి చేశాడు. దీనికితోడు అప్పటికే ఏర్పడ్డ కొత్త నీతి నిబంధనాలు స్త్రీకు బంధనాలయ్యాయి.
‘‘నీ వివాహం నీకు మాత్రమే చెందింది కాదు కుంతదేవీ! ఇది రాజ్యానికి సంబంధించినది. మన వివాహ బంధాలు - రాజ్య రక్షణకోసం కొత్త బలగాన్ని, భాగ్యాన్ని చేకూర్చేవిగా వుండాలి... గణపెద్దల, తల్లితండ్రుల అనుజ్ఞ లేకుండా నీ వివాహం ఎవరికీ సమ్మతం కాదు కుంతీ!’’ - ‘‘స్త్రీలు ఎల్లవేళలా అటు తండ్రో, భర్తో, ఇటు బిడ్డల సంరక్షణలో వుండాలి తప్ప - స్వతంత్రించడం ఎంత తప్పూ!’’-
‘‘ఈ నియమ నిబంధనన్నీ మనం ఏర్పరుచుకున్నవేగా పితామహా! శకుంతల ఇష్టపడి దుష్యంతుల వారిని గ్రహించింది కాదా? ఆమెకు అనుమతి ఎవరిచ్చారనీ!’’
‘‘ఆనాటికి ఈ ప్రజ ఇంతగా కట్టుతప్పి లేరు కుంతీ! అప్పటికింకా దేవలోకంతోనూ, గంధర్వులతోనూ సంబంధ బాంధవ్యాలు వుండేవి. మానవుల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఆ లోకంతో సంబంధాు తెగిపోయాయి. దానితో మనం కొన్ని నియమాలు ఏర్పరచుకోవాల్సి వచ్చింది.
మేనక తన లోకానికి వెళ్ళిపోయింది. తిరిగి ఇంద్రుడి కొలువులో చేరిపోయింది. బిడ్డను పెంచింది కణ్వుడేకదా!... ఇటువంటివన్నీ జరిగాకే - గణాలు తమలో తాము - బయటి గణాలతోనూ కొన్ని నియమాలు ఏర్పరచుకొన్నాయమ్మా. ఆ నియమాలు, పూజ్యులైన పెద్దలు పెట్టిన కట్టుబాట్లు దాటటం నాకు కూడా శక్యం కాదు బిడ్డా!... ఇప్పుడింక ఈ రాజ్యాలు ఏర్పడ్డాక అవి మరింత కట్టుదిట్టమయినాయి తల్లీ.!’’
‘‘అంటే తండ్రో, అన్నో ఒప్పుకున్న బంధానికి తప్ప ఇష్టపడి ఏర్పరచుకున్న బంధం నిషిద్ధమైపోయిందా? ఉదయుడితో నా అనురాగం మీకు ఇష్టంలేకనే కదా! ఇదంతా! ఈ నీతి నియమాలు ఎవరు ఏర్పరిచారు తండ్రీ! స్త్రీ పురుషుల అనుబంధం సహజమైంది. ఈ సహజమైన సంబంధం ఇన్ని కట్టుబాట్లతో ఎందుకు బిగించారు.’’
తిరిగి భోజరాజు ఉపక్రమిస్తూ, ... ‘‘తల్లీ! నువ్వు చెప్పేది ఒకప్పటిది! వెనకటి రోజుల్లో ‘కానీనుడైన’ బిడ్డతో సహా తల్లిని వధువుగా అంగీకరించేవారు. ఇప్పుడు అటువంటి వధువును వివాహమాడటానికి ఏ రాజూ అంగీకరించడం లేదు. ఇప్పుడంతా కన్యావివాహానికే క్షత్రియ పుత్రులు సంకల్పిస్తున్నారు.’’ - ఆ మాట అని భోజరాజు మౌనంగా వుండిపోయాడు.
ఓ క్షణం ఆగి ‘‘నువ్వేం ఆందోళనకు చెందకు తల్లీ! నీ బిడ్డను సురక్షితంగా పెంచే ఏర్పాటు చేస్తాను. తిరిగి నువ్వు వివాహానికి సిద్ధంకావాలి కుంతీ!’’` ఆజ్ఞతో కూడిన తండ్రి ఆదేశం. అప్పటి నుండి పాండురాజుతో వివాహం వరకు తను సౌధం దిగి రావడానికి లేకుండా పోయింది. అడుగుతీసి, అడుగువేయడానికి కాపలా! పాత దాసీలను మార్చి... ప్రతిరోజూ భోజరాజు పర్యవేక్షణలో తన జీవితం.
ఈ ఆలోచనతో తమ బంధాన్ని ‘గణనీతి’కి బలిచేసిన పెద్దలపై పట్టరాని ఆగ్రహం కలిగేది. ఈ రాజుకూ, రాజరికానికీ కావల్సింది మనుషులూ, మనసుూ కాదు - పరువు, ప్రతిష్ఠలే!...
ఆ కాలం గుర్తు చేసుకుంటూ, ‘అయ్యో! ఎందుకు నాకీ విషమ పరీక్ష పెట్టావు కృష్ణా!’...దు:ఖం ముప్పిరిగొన్నదామెను. కర్ణుడిని కలవడం కంటే గడిచిపోయిన తన జీవితపు తలపులు ఆమెను క్షోభకు గురిచేస్తున్నాయి.
నీకిది చెయ్యలేని పనే! సంకట స్థితే. కానీ తప్పదు! నీ పుత్రులు రాజ్యం పొందాలనీ, వారు జయించాలనీ నీకు లేదా? పదమూడేళ్ళు పరాయి పంచలో ఎందుకు పడి వున్నావ్! నీ పుత్రులేం శౌర్యహీనులా, కార్య శూన్యులా! అయినా అన్ని అవమానాలను ఎందుక సహించారూ?.
నిజమే! అకాలంగా భర్తను మృత్యువు కబళించడంతో ఒంటరిగా చంటిబిడ్డతో బావగారి దయాదాక్షిణ్యాల మీద బతకటం మాటలా! నిజానికి భీష్మ పితామహులు వుండబట్టి తమకీపాటి గౌరవమైనా దక్కింది. అప్పటికీ ఎన్ని చిచ్చులు పెట్టారూ? ల క్క ఇల్లు దహనం దగ్గర నుండి జీవితమంతా ప్రాణాలు కాపాడుకోవడమే పనిగా మిగిలిపోయిందిగా!
మనసు గట్టి చేసుకుంది. తప్పదు తమకు రాజ్యం రావాలనీ - మానవ సమూహాలను పీనుగు కుప్పలుగా మార్చి శ్మశానాలను ఏలుకోవాలని కాదు - కానీ జరిగిన అవమానాలు బడబాగ్నిలా దహిస్తున్న ఈ లోలోపలి ఈ ఆవేదనలు తీరేదెట్లా?
తన కోడలిని నిండు సభలో ఏక వస్త్రను చేసి లాక్కురావడమే కాక, ఆమెను వివస్త్రను చెయ్యాలని నడిపిన అకృత్యం మర్చిపోయేదేనా? ఆడదాన్ని అవమానించిన మృషణ్ణులు భూమికి కూడా భారం. వారికి తగిన దండన జరగాల్సిందే!
పాండు పుత్రులను పట్టుకుని - ‘మీరంతా నా పిన తండ్రికి పుట్టారా? నేనెందుకు రాజ్యమివ్వా’ని అంటే కిమ్మనకుండా మౌనంగా వుండిపోయిన ఈ పెద్దు నిజంగా పెద్దలేనా - ఆ ముసలి భీష్ముడికి మతిగాని పోయిందా? ఎంత అవమానం? పాండు పుత్రులు పాండురాజు బిడ్డలు కారా?... కుంతి బిడ్డలు మాత్రమేనా?
క్షేత్రం ఎవరికి చెందుతుందో - పంట వారికి చెందుతుందనే కదా! శాస్త్రాలు చెప్పింది - తన బిడ్డలు శాస్త్ర విరుద్ధంగా జన్మించలేదే? ఆ శాస్త్రమే తప్పనుకుంటే తమ మామగారికే జన్మించారా వీరంతా?... ఆ ముసలి భీష్ముడు బలవంతంగా అంబ, అంబాలికను తీసుకురావడమేకాక, వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆనాడు తన మారుటి తమ్ముడితో ఎందుకు నియోగింపచేశాడూ?... ముసలమ్మ సత్యవతి కానీన పుత్రుడితో కురు రాజును కన్నప్పుడు అది న్యాయమే అయిపోయిందా? ఆ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా? వీళ్ళు! వారికి చెల్లిన నియోగ పద్ధతి, తన బిడ్డల కెందుకు చెల్లలేదూ?
అసలు ఈ కురువంశమే నిజమైన కురు బీజ పునాది మీద లేదు... ఈ మాట ఆ ముసలి భీష్మునికి తెలుసుగదా! ఆ ముక్క మనవళ్ళకు చెప్పి వారిని దండించలేడా?... కాదు, కాదు అసలు కీలకమంతా ఈ ముసలాడి దగ్గరే వుంది.
పాండురాజుతో కలిసి వన విహారం నెపంతో హిమాలయాల వైపు వెళ్ళడం... కిరాతులు, గంధర్వుల పరిచయాలు - అన్నీ ఆమె ముందు పరచుకున్నట్లయింది.
ఆమెకు చనిపోయిన తన భర్త మొహం కళ్ళముందు నిలిచింది.
పాండువు తన అశక్తతను పెద్దలకు చెప్పుకోలేక, తప్పంతా తనమీద వేసి, పెద్దల ముందు దోషిగా నిబెట్టినప్పుడు - తానెంతో ఘర్షణకు గురయ్యేది. చివరకు భీష్మ పితామహుడు కూడా కళ్ళతో తనను ‘దోషి’ అన్నట్లుగా చూడడం!, అవమానంగా వుండేది. కౌరవ రాజ్యానికి వారసులనివ్వలేని ‘సారంలేని క్షేత్రంగా’ అనుమానిస్తున్నప్పుడు క్షోభగా వుండేది. ఉదయుడి ఉదంతం, తన బిడ్డ గురించీ చెప్పాలన్నంత ఆవేశం వచ్చేది. అయితే ఎప్పుడూ తన బిడ్డ గురించి బయటపెట్టలేకపోయింది. అన్నిటినీ మౌనంగా, తిరస్కారంతో భరించింది.
చివరకు పాండువు తనను నిందించీ, నిందించీ అన్నివిధాలా ఓడిపోయి - తన ఓటమిని అంగీకరించక తప్పలేదు.
‘‘కుంతీదేవి!... ఈ సువిశాల కౌరవ సామ్రాజ్యం నిలబడాలి. ఈ హస్తినావతి వారసుల్లేని నిర్భాగ్యురాలు కాకూడదు. అందుకు నీ సహకారం కావాలి’’ - ప్రాధేయపూర్వకంగా పాండువు అడగడం తనకింకా తడి ఆరని జ్ఞాపకం.
మనశ్సరీరాలు రెండూ శత్రుభావం వహించినా - భర్త అనుజ్ఞ అంగీకరించక తప్పదు; రాజ్యానికి వారసులను కనడం బాధ్యతగా ‘నియోగాని’కి సిద్ధపడింది. ఇష్టపడ్డ ఉదయునిని వదులుకుంది - పెద్దల అంగీకారం లేదని - ఇష్టంలేని నియోగం ఒప్పుకుంది ఆ పెద్దల కోసమే.
స్త్రీలది ఎంత గొప్ప జీవితం? - విచారంతో అలాగే వుండిపోయింది.
అప్పటికే కనుచీకటి పడిపోయిందని, కుంతీదేవి కుటీరానికి ఇంకా చేరలేదని ఆమెను వెతుక్కుంటూ విదురుడు గంగానది ఘట్టానికి చేరాడు.
అప్పటికే గంగా మహాజలం చీకటిని నింపుకొని నీలవర్ణం నుండి కాటుక వర్ణానికి మారిపోయింది. ఆ నిశ్శబ్దంలో మహోధ్రుతమైన ఆ ప్రవాహాపు ఝరి, మనుషులనూ, వారి అంతరంగాలనూ తెలియని ప్రకంపనాలకు గురిచేస్తోంది.
అనంతమైన ఆ ప్రకృతి విలయోద్వేగాన్ని వింటూ కుంతి చలనం లేనట్లు ఆ రాతిమెట్లపై కూర్చిండిపోయింది.
కుంతిని గమనించిన విదురుడు... ‘‘ఆర్యాణీ! చీకటి చిక్కనవుతోంది, పద పోదాం!’’ అన్నాడు.
‘‘విదురా! నేను విన్నది నిజమేనా!’’...
కుంతీదేవి ఏమడగబోతోందో అతడు ఊహించాడు.
‘‘నిండు సభ తీరి వుండగా ` దుర్యోధునుని వాచాలత్వాన్ని అటు మామగారుగానీ, ప్రపితామహుడుగానీ ఖండించలేదెందుకు?’’
విదురుడు ఓ క్షణం మౌనంగా వుండి ‘‘నిజమే! ఆర్వాణీ! కానీ ఏదో మూల భీష్ములవారికీ ఆ పక్షపాత ముందేమోనని నా సందేహం!’’
‘‘అదే అయితే, బీజ ప్రధానాన్ని సమ్మతించేటట్లయితే అంబ, అంబాలికకు పుట్టిన మీరంతా ఏ గణానికీ, ఏ వంశానికీ చెందుతారూ?.. ఆనాడు క్షేత్రమే ప్రధానమని, క్షేత్రం ఎవరికి చెందుతుందో ఆ సంతానమూ వారికే చెందుతుందని, కోడళ్ళ బిడ్డలు మీ కౌరవ వంశానికి చెందినప్పుడు ... ఇప్పుడీ కుంతి పుత్రులు ఎట్లా కాకుండా పోయారు. ఇదంతా తెలిసి వుండి కూడా పెద్దలు నోరెత్త లేదంటే అర్థమేమని?...’’
విదురుడు సమాధాన మివ్వలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాడు.
కుంతికి ఆలోచించే కొద్దీ సంభాషణ పెరిగేకొద్దీ ఆవేదన, ఆవేశం ముప్పిరి గొంటున్నాయి. ఇద్దరిదీ మౌన భాషే అయింది.
ఆ మాట అంటూ కుంతి ఆ నదీ ఘట్టం మీద నుండి పైకి లేచింది. విదురుడు ముందుకు సాగుతుండగా - తల దించుకుని కుంతి ఆలోచనల్లో మునిగిపోయింది.
తనదెంత దురదృష్ట జాతకం అనుకుంటూ, తనదేనా! స్త్రీ జాతి అంతటిది కూడా కదా!... తన కోడలు మాత్రం ఏం సుఖపడిందనీ - నా తొందరపాటుతో తాను ఐదుగురికి భార్య అయి ‘‘పాంచాలీ పంచభర్తృక’’ అని అవమానాలు మోయడం లేదూ!. నవ్విందనో, ఏడ్చిందనో మరొకటో నెపం పెట్టుకుని రాబోయే యుద్ధనేరాన్ని ఆమె మీద మోపుతున్నారు పాపం! కానీ ఆమెదేం తప్పూ!...
అసలు కారణమంతా భీష్ముడి దుష్ట ఆలోచనలే! ఆ ముసలోడు శాసిస్తే ` ఈ దుర్యోధనాధులు ఎదురు తిరగగలరా?... ఎంత ఉప్పుతిన్నామన్న విశ్వాసముంటే మాత్రం` అసలు మూలాన్నే ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదూ?...
స్త్రీలెంత పరాధీనులూ? ఆనాడు తన తండ్రి, ఉదయుడు తమ గణానికి చెందినవాడు కాదని - తన అంగీకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చానని` తనకు ఉదయుడినీ, బిడ్డనూ ఇద్దరినీ దూరం చేశారు. ఇప్పుడు పాండురాజు అనుమతితో అతని ఆలోచనమీదనే అన్యమనస్కంగానే ఆ నియోగాన్ని అంగీకరించాను - అది శాస్త్ర సమ్మతమేనని - ఇన్నేళ్ళుగా అంగీకరించి` ఈ రోజు బిడ్డలు ఎదిగి రాజ్యంలో భాగం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు పుట్టుకు వచ్చాయా?
కుంతికి తీరని అవమానంగా అనిపిస్తోంది. తన భర్త పాండువు ఆ రాజ్యం కోసమే తనను నియోగానికి పురికొల్పాడు. ఇప్పుడు ఆ రాజ్యం పంపిణీ అడ్డుకోవడానికి అదే నియోగం అడ్డు ప్రశ్నగా వస్తోంది.
ఈ అంతటిలో స్త్రీలుగా తమ ప్రమేయం ఏ మాత్రం లేనేలేదు కదా!...
ఈ ఘోర అవమానాల నుండి తన కానీనుడు తనకు గౌరవం కల్పిస్తాడేమో? ఆశగా అనుకుంది - కృష్ణుడు ఎందుకోసం ఈ పనికి పురికొల్పాడో. అయినా తను దాన్నుండి రక్షణ కవచాన్ని అందుకోగలిగితే?
ఆ మాట అనుకుంటూ తనకు తనకే అవమానంతో ఆగిపోయింది.
నిజంగా కర్ణుడు తనను ఆదరిస్తాడా? అసలు ఏ మొహం పెట్టుకొని అతని వద్దకు వెళ్ళగలదు?... నిజమే! ఆదరించడు - పైగా నిందిస్తాడు కావచ్చు. ఈ రోజు నీ బిడ్డల రక్షణ కోసం నన్ను అర్థించడానికి వచ్చావు కాని నేనే నీ కొడుకునన్న అభిమానంతో రాలేదనవచ్చు. అసలు నా జన్మమేమిటి? సూత పుత్రుడిగా నేను ఎన్ని అవమానాలు పడ్డాను - అప్పుడంతా నీ తల్లి మనసు ఏమైందని నిందిస్తే?
అవును - నేను నిందార్హురాలునే. వాడికి జరిగిన అవమానాలకు అన్యాయాలకు నేనే కారణం. కన్నబిడ్డను కన్నీట ముంచి - నదీ గర్భానికి అప్పగించిన పాపం ఊరికే పోతుందా? అయినా నా కడుపున పుట్టినవాడి ఆ నిందనలను నేను భరిస్తాను. వాడి న్యాయమైన ఆక్రోశానికి తలొగ్గుతాను. అయితే తల్లిగా తన అవమానాలకు లేపనం కావాలని బిడ్డను అర్ధిస్తాను. తప్పేముందీ?...
ఏ రాజనీతి, ఏ పురుషనీతి తన బిడ్డను తనకు దూరం చేసిందో - ఆ రాజ్యమే, ఆ పురుషనీతే మరింత వికృతంగా తననూ, తన బిడ్డనూ ప్రశ్నలు వేస్తోంది.
‘‘కర్ణా! ఈ ఆధిపత్య పురుషనీతి విలువతో విలసిల్లే ఈ రాజ్యనీతిని ఎదిరించు బిడ్డా’’ - అని చెప్పడానికైనా తన బిడ్డను కలవాలి. అందుకోసం అతనెంత అవమానంతో నిందించినా భరిస్తాను. ‘‘తల్లీబిడ్డ మధ్య ` మరే ఇతర జోక్యాలు లేని ఉత్కృష్ట మానవ విలువల కోసం సాధనచెయ్యి తండ్రీ!’’ అని చెప్పడం కోసం నా కర్ణుడిని కలుసుకుంటాను.
ఆ మాట దృఢంగా అనుకుని కుంతి, విదురుడి వెనక స్థిరంగా అడుగు వేసింది.
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు