ఆదివారం ఇంట్లో అందరికీ సెలవు రోజు. నేను పనిచేస్తున్న స్కూల్ లోనే నా పెద్ద కూతురు ఏడవ తరగతి ,రెండవ కూతురు ఐదవ తరగతి చదువుతున్నారు. నాకు, పిల్లలకు స్కూల్ లేదు. ఆయన ఆఫీసుకు సెలవు. రోజూ లాగా కాకుండా కొంచెం ఆలస్యంగా నిద్ర లేచాను. చలి కాలం వెళ్ళిపోయి ఎండాకాలం రాబోతోంది. ఇంట్లో అందరికీ జలుబులు, జ్వరాలు ... నాకు నిద్ర లేచినప్పటి నుంచీ జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎక్కడి కైనా తీసుకు వెళ్ళమని పిల్లలు నిన్నటి నుంచీ గొడవ చేస్తున్నారు. మా ఆడబిడ్డ ఇంటికి వెళ్ళాలని నిన్ననే అనుకున్నాము. కుకట్ పల్లిలో వాళ్ళ ఇళ్ళు ఉంది. అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవ్వవచ్చు. నాకు చేతకావటం లేదనిపిస్తోంది. 'అదే విషయం ఆయనతో అన్నాను. నువ్వు రాకపోతే మా అక్క ఏమనుకుంటుందో? ఏమో? అన్నారాయన. నేను వదినకు ఫోన్ చేసి చెప్తాను అని అన్నాను. టిఫిన్ తిని ఆయనా పిల్లలు బయటకు వెళ్ళగానే ఇల్లు సర్దుకుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. మెయిన్ డోర్ పెట్టి లోపలకు వచ్చాను.
ఇంతలోకి కాలింగ్ బెల్ మోగింది. ఇల్లు ఎంత చిందర వందరగా ఉందో? చెప్పలేను. తుడుచుకున్న టవెల్స్, విడిచిన బట్టలు, తిన్న ప్లేట్లు, గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. ఎవరైనా ఇంటికి వస్తే 'ఇల్లు ఇలా ఉన్నదేమిటి ?'అనుకుంటారేమో 'మనసులోనే అనుకుంటూ తలుపు తీశాను. ఎదురుకుండా నా ప్రాణ స్నేహితులురాలి రేవతి కూతురు పద్మ. పద్మ పదవ తరగతి చదువుతోంది. ఆయాస పడుతూ, గాబరాగా "అమ్మ వచ్చిందా? ఆంటీ "అని అడిగింది. "రాలేదు పద్మా" అని అంటూ లోపలకు రమ్మన్నాను. అమ్మ కనిపించటం లేదు ఆంటీ .. పొద్దుటినుంచీ వెతుకుతున్నాము. ఎక్కడికి వెళ్ళిందో? తెలియదు. నేను ఇంటికి వెళ్ళాలి " అని అంటూ నా మాట వినిపించుకోకుండానే వెళ్ళిపోయింది.
నా మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. రేవతి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏంటి? ఏ కారణంతో వెళ్ళిపోయింది. నేను రేవతి మంచి స్నేహితులం .. మా స్నేహం ఈనాటిది కాదు. మేము స్కూల్లో చదువుకునే కాలం నుండీ స్నేహితులము. తను ఎప్పుడూ లైబ్రరీలోనే ఉంటుండేది. రేవతిని అందరూ 'పుస్తకాల పురుగు' అని పిలిచే వాళ్ళు. రేవతి నా కంటే ఎంతో తెలివైనది. సమయస్ఫూర్తి కలిగినది. మరి ఇట్లా ఎందుకు చేసి ఉంటుంది. ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావటం లేదు. రేవతికి కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగం వచ్చాక ఆమె వివాహం జరిగింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేదాకా ఆమెను మోహనరావు చాలా బాధలు పెట్టాడు. కొడుకుకు సపోర్టుగా ఆమె అత్తా, ఆడబిడ్డలు ఒకరకంగా ఆమెను రాచిరంపాన పెట్టారు. ఈ మధ్య కాలంలో ఖర్చులు పెరిగిపోయి ఏదో ఒక ఉద్యోగం చెయ్యమని వత్తిడి తెస్తున్నాడు మోహనరావు. అంతా తన ఇష్టమే ... వంద సంవత్సరాల క్రితం పుట్టవలసిన వ్యక్తి. అత్యంత వెనుకబాటు భావాలు కలిగిన మనిషి. అదీ భార్య విషయంలో నే బయట సమాజంలో అలా ఉండడు. తప్పని సరై ఈ సంవత్సరమే టీచర్ గా జాయిన్ అయ్యింది. ఆ స్కూల్ లోనే మహిళా సంఘాలలో పనిచేసే సరోజ పరిచయమయ్యింది రేవతి. ఏ మాత్రం అవకాశమున్నా తామిద్దరూ అనేక విషయాల గురించి చర్చించుకుంటాము అని చెప్తుండేది రేవతి. ఏమై ఉంటుందో? నాకు ఏ మాత్రం అర్ధంకావటం లేదు.
మా ఇంటికి రెండు బజార్ల అవతల రేవతి వాళ్ళ ఇల్లు ఉంది. గబగబా ఇల్లు సర్ది తనకు ఫోన్ చేసి విషయం చెప్పి హాట్బోస్ లో కిచిడి పెట్టుకొని రేవతి వాళ్ళ ఇంటికి బయలు దేరాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రేవతి అత్త రమణమ్మ, ఆడబిడ్డ లలితా, భర్త మోహన రావు, పిల్లలు పద్మా, రోహిత్ లూ, బంధు మిత్రులూ అందరూ ఉన్నా రేవతి లేని లోటు కనపడుతూనే ఉన్నది. ఇల్లంతా కళ తప్పినట్టుగా ఉంది. మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తున్నా వంటా, ఇల్లు ఏ పనీ జరిగిన దాఖలాలు కనిపించటం లేదు. మోహనరావు సోఫాలో కూర్చొని రేవతి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఆమె తరుఫు వాళ్ళందరికీ ఫోన్ చేసి రేవతి ఇళ్ళు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. నేను వెళ్ళగానే కళ్ళ తోటే సైగ చేసి కుర్చీలో కూర్చోమన్నది రమణమ్మ. నా కుర్చీ పక్కనే ఉన్న దీవానం మీద లలిత మౌనంగా కూర్చొని ఉన్నది. బహుశా లలిత అప్పుడే వచ్చినట్టు ఉంది. ఆమె, ఆమె కుటుంబం ఎక్కువశాతం ఎదో ఒక సాకుతో అన్న ఇంటికి వస్తూనే ఉంటుంది. మోహనరావు నన్ను కూర్చోమని చెప్తూ 'ఇప్పుడే వస్తాను' అని రమణమ్మకు చెప్పి బయటకు వెళ్ళిపొయాడు. మోహనరావు ఉన్నంత సేపూ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రమణమ్మ అతను బయటకు కాలు పెట్టగానే ఒక్కసారిగా తన అసహనాన్ని, కోపాన్నీ వెళ్ళగక్కింది.
నా వైపు తిరిగి ఇలా చెప్తోంది "సుధమ్మా! అర్ధం ఉందా? పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి పోవటం ఏంటి? నా కోడళ్ళ లాంటి కోడళ్ళు ఈ దేశాన ఉండరు. ఒకదాన్ని మించినది మరొకతి. మేమూ సంసారాలు చేసాం ... ఇట్లనా అమ్మా !అరె నిన్నంతా బానే ఉంది. అనకూడదు గానీ నా కొడుకు ఒక్క మాట అనలేదమ్మా? కనీసం పుట్టింట్లో నైనా ఎక్కడికి వెళ్తోందో? చెప్పి వెళ్ళవచ్చు కదా !మరి చదువుకున్నాం అంటారు ఆ మాత్రం తెలియదా? ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా కొడుకుల మెడకు చుట్టుకున్నాయి. "రమణమ్మ ఇలా మాట్లాడుతూనే ఉన్నది. ఇంతలోకి పద్మ కలగచేసుకొని "ఇక ఆపు నానమ్మా! నాన్న ఉన్నంత సేపూ ఏమీ మాట్లాడవు ... నాన్న అటు వెళ్ళగానే అమ్మను తిడుతుంటావు .? పొద్దుటి నుంచీ ఇదే వరసా ... ఇక చాలు ఆపు ... ! రోహిత్, అక్క మాటలకు సపోర్ట్ గా "ఇక ఆపే నానమ్మా" అని అంటున్నాడు .
అమ్మ లేదన్న అసహనం ... అమ్మను అందరూ తలా ఒక మాట అటున్నారన్న బాధా .. ఉక్రోషం పద్మ ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. పరామర్శించటానికి వచ్చిన వాళ్ళకు మంచి నీళ్ళు, చాయ్ లు ఇవ్వటం ఇతరత్రా పనులు అన్నీ పద్మనే చూసుకుంటోంది. ఇవి చాలవన్నట్టు లలితా, రమణమ్మ ఏదో ఒక పని పద్మకు పురమాయిస్తూనే ఉన్నారు. మంచి నీళ్ళు తెచ్చి నా చేతికిచ్చింది పద్మ. మంచి నీళ్ళ గ్లాసు తీసుకుంటూ "ఏమన్నా అవసరమైతే మేము తీసుకుంటాములే కానీ నువ్వు వచ్చి కూర్చో పద్మా" అంటూ పద్మను నా పక్కనే కూర్చో బెట్టుకున్నాను.
అప్పటి దాకా మౌనంగా ఉన్న లలిత ఇలా అన్నది "సుధ గారూ మీకు తెలుసు కదా! ఇట్లా ఎవరన్నా చేస్తారా? సంసారం అన్నాక ఎన్నో ఉంటాయి. మాకు బాధలు లేవా? ఎప్పుడైనా పండుగలకు, సెలవులకు అన్నయ్య పిలవకపోతే ఇక మా ఆయన సాధింపులు వినలేము. తను ఈ ఇంటి అల్లుడు కాబట్టి అందరూ తనకు చెయ్యాలనే పద్దతి ఆయనది. మరి మేము పడటం లేదా? ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇక ఇట్లా అందరూ ఇల్లూ ,వాకిలీ వదిలి పెట్టి పోవాలంటే సంసారాలుచేసినట్టే...!" తానొక సహనమూర్తి అయినట్టుగా చెప్పుకుపోతోంది లలిత.
"రేవతి ఎట్లాంటి మనిషో మీకు తెలియదా? ఎవ్వరినీ ఏమీ అనని మంచి మనిషి. రేవతి ఇలా వెళ్లిపోవటానికి ఏదన్నా బలమైన కారణం ఉన్నదేమో? ఆలోచిస్తే బాగుంటుంది." లలిత వంకా రమణమ్మ వంకా చూస్తూ అన్నాను.
"నా కోడలని కాదు గానీ రేవతి మంచిదే "అన్నది రమణమ్మ.
"మీ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచీ రేవతి ఎట్లా ఉండేదో? మీకు తెలియదా?"
"అవును రేవతి మా ఇంటి పెద్ద కోడలుగా వచ్చింది. చాలా అనుకూలంగా ఉండేది. " వెనకటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటోంది రమణమ్మ. "నాకు అయిదుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. ఇంటికి బాధ్యతంతా చూసుకునేది. ఓపికస్థురాలు. నా కొడుకే తండ్రి లాగా ఖచ్చితం మనిషి. మొండి మనిషి. చాలా కోపిష్టి మనిషి. రేవతి నా కొడుకుతో ఏగింది కానీ ఇంకోళ్ళయితే ఎప్పుడో పుట్టింటికి వెళ్ళి పోదురు. నా మగడు ఏమన్నా తక్కువ మనిషా ...బియ్యంలో వడ్లు ఉన్నాయి అన్నందుకు బస్తాడు బియ్యం వరండాలో పోసి కాళ్ళతో తొక్కాడు .. '' అంటూ భర్త పెట్టిన బాధలూ, అత్తా, ఆడబిడ్డలు పెట్టిన బాధలూ ...ఏకరువు పెడుతోంది రమణమ్మ. మధ్య మధ్యలో కోడలు ఎక్కడికి వెళ్ళి పోయిందో? ఏమో? అంటూ బాధపడుతోంది.
వంట గదిలోనుంచి ప్లేట్ లు తీసుకొని హాట్బోస్ లో తీసుకు వచ్చిన కిచిడీని వాళ్ళు వద్దన్టున్నా అందరికీ ప్లేట్ లలో తలా కొంచెం పెట్టి ఇచ్చాను. పద్మా, రోహిత్ లు వాళ్ళ అమ్మ ఇంటికి వస్తేనే తింటామని లేకపోతే తినమనీ మొండికి వేశారు. ఇద్దరికీ నేనే తినిపించాను.
రమణమ్మ చెప్తున్న మాటలు విని పద్మ ఇలా అన్నది "నానమ్మా అమ్మకూ, నీకూ మీ అందరికీ మాటలు పడటం తప్ప తిరగపడటం తెలీదా? అప్పుడేమో అత్తను చూసి, మామను చూసి, ఆడబిడ్డను చూసి, మొగుడ్ని చూసి భయపడ్డావ్ ఇప్పుడేమో కొడుకుని చూసి భయపడుతున్నావ్ .. ఇంత వయసొచ్చినా ఇంకా భయపడాలన్నా? తిరగబడాలని తెలీదా?'' పద్మ అడిగే ప్రశ్నలకు రమణమ్మ ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. "మాటలు పడాలని ,భయపడాలనీ ఎవరికుంటుంది. ఆడోళ్ళం ..ఏమి చేస్తాం" అని అన్నది.
"మీ రిట్లా ఉండబట్టే .. వాళ్ళు అట్లా అంటున్నారు .. ఆలోచించవే నానమ్మా .. " అన్నది పద్మ.
" ఏమి చెయ్యాలి ..ఆడదాని బతుకు పడ్తానే ఉన్నాం .. " అంటున్న రమణమ్మతో "ఇంక నిన్నెవరూ బాగుచేయలేరే నానమ్మా ... ఇప్పటికైనా ధైర్యంగా ఉండకూడదూ? అన్నది పద్మ. పద్మ మాటలకు నవ్వుతూ తలూపింది రమణమ్మ.
4 గంటలకల్లా మోహనరావు వచ్చాడు. "ఏమన్నా తెలిసిందా "అని అడిగింది లలిత. తల అడ్డంగా ఊపి ఆలోచనగా ఉండిపోయాడు. మళ్ళీ ఇళ్ళంతా నిశ్శబ్దం.టి .వి ఆన్ చేశాడు. ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ టి .వి లో చూపిస్తున్నారు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న పేపర్ ను తీసుకొని చదువుతూ కూర్చున్నాను. ఈ రోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పద్మ నా పక్కనే కూర్చొని వార్తలు పైకి చదువుతోంది. కూకటిపల్లిలో బయలుదేరారని తను ఫోన్ చేసి చెప్పాడు. ఒక అరగంట ఉండి ఇంటికి వెళదామనుకున్నాను. అదే మాట పద్మకు చెప్పాను.
సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది ... బయట నినాదాలు వినపడుతున్నాయి. రోహిత్ బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ "డాడీ .. అదిగో వాళ్ళల్లో అమ్మ ఉంది."అని అంటున్నాడు. అందరం లేచి బయటకు వెళ్ళి నిలబడ్డాము. ఎదురుకుండా చాలా మంది మహిళలు ప్లే కార్డ్స్ పట్టుకుని ఉరేగింపుగా వస్తున్నారు. ముందు వరసలో కుడి పక్కన రేవతి నిలబడి ఉంది. ఆమె చేతిలోని ప్లే కార్డు పై "స్త్రీ లపై అణిచివేత నశించాలి "అని ఉంది. పద్మా, రోహిత్ "అమ్మ ...అదిగో 'అని సంతోషంతో అంటున్నారు. రమణమ్మ కర్రపొటు వేసుకుంటూ ఊరేగింపుకు ఎదురుకుండా వెళ్ళింది. రమణమ్మ ఊరేగింపు వైపు వెళ్ళటం చూసి "అమ్మ వెళ్ళింది కదా !అందరి ముందూ బుద్ది వచ్చేటట్టు నాలుగు తిట్లు తిడుతుంది. అప్పటికి కానీ ఆ మట్టి బుర్ర పనిచేయదు." లలితతో అంటున్నాడు మోహనరావు.
రమణమ్మను చూసి ఊరేగింపులో ముందు వరుసన ఉన్న వాళ్ళు ఆగారు .రమణమ్మ రేవతి దగ్గరకు వెళ్ళింది. ఒక చేతిలో కర్ర మరొక చేతితో రేవతి పట్టుకున్న ప్లే కార్డు ను తానూ పట్టుకుంది. రేవతి గొంతులో తానూ గొంతు కలిపింది. అడుగులో అడుగు వేసింది. ఖిన్నులమై అందరం అలా చూస్తూ ఉండిపోయాము. సమాన హక్కులు కావాలని నినదిస్తూ ఉప్పెనలా ,పోటెత్తిన సంద్రం లా ఊరేగింపు ముందుకు వెళ్తోంది. పద్మా, నేను చేతులు పట్టుకొని ఊరేగింపు వైపుగా అడుగులు వేసాము.