మా రచయితలు

రచయిత పేరు:    గట్టు రాధిక మోహన్

కథలు

ఆమె కథ

పని మనిషి రాక పదిరోజులైంది.
ఇవ్వాల గూడ వస్తదో ...రాదో...
తెల్వదు.నాల్గు రోజుల్నుండి ఫోన్ జేస్తాంటె అవుటాఫ్ కవరేజ్ ఏరియా అనొస్తాంది.ఏ ఏరియాలొ ఉన్నదో ఏమో ! సుట్టాల పెండ్లి రెండ్రోజులు పోయొస్తనని జెప్పింది. గిప్పుడేమొ పత్తకు లేకుండ పోయింది.పని మనిషి మీద ఆధారపడితె గిట్లనె ఉంటది.ఎదురుసూపులు తప్పవు.ఎక్కడి పని ఆన్నె ఉంటది.గీ టెన్షన్ జేయబట్టి ఆఫీసుల మనశ్శాంతిగ పన్జేయలేక పోతాన.

"అమ్మా...అమ్మా....నీ మొబైల్ నేనె రింగవుతుంది. కాల్ లిఫ్ట్ చేయమ్మ .." అని స్టడీ రూంల నుండి చింటు అరుస్తాంది.పని మనిషి ఆలోచన్ల పడి హాల్లో ఫోన్ రింగయ్యేది గూడ మనసుకెక్కలేదు.

"హలో ఎవరు ...? " అనగానె

"మేడమ్ గారు గుడ్మార్నింగ్...నేను రాధని...పొద్దున్నె డిస్టర్బ్ చేస్తాన్నేమో ...దయచేసి ఏమనుకోకండి.ఒక గుడ్ న్యూస్ జెప్పుదామని కాల్ జేసిన.మా పాపకు నిన్న రాత్రినె మ్యారేజ్ సెటిలయ్యింది.అబ్బాయి బెంగుళూరు లో సాఫ్ట్‌వేర్ జాబ్ ..మంచి సాలరీ. ఈ విషయాన్ని మీకె ముందుగళ్ల జెప్పుతున్న..." అని రాధ ఆమె  సంతోషాన్నంత ఆగకుండ జెప్పుతనే ఉన్నది. 

రాధ వాళ్ల అమ్మాయి గూడ బెంగుళూర్ లనె రెండేండ్ల నుండి సాఫ్ట్‌వేర్ జాబ్ నె జేస్తాంది.అమ్మాయి చాలా తెలివికల్లది.తల్లి పడ్డ బాధలను కండ్లార సూసుకుంట పెరిగింది. కష్టపడి సదివి జాబ్ సంపాదించుకొంది.గాని ఒక యాడాది నుండి చాన డిప్రెషన్ కి పోయినట్టు ఓ సారి రాధ కాల్ జేసి ఏడ్సుకుంట జెప్పింది.చాన మంది డాక్టర్లకు సూపెట్టిందట ఫలితం లేదు.నేనె ఓసారి సైక్రియాటిస్ట్ దగ్గర సూపెట్టమన్న ...ముందుగళ్ల ఒప్పుకోలేదు. ఆ తర్వాత తప్పని పరిస్థితులల్ల తీసుకెళ్లి సూపెడుతె రెండు నెలల్లోనె నార్మలైపోయింది.  సైక్రియాటిస్ట్ డాక్టరంటె ఓ పిచ్చి డాక్టరని పోకడున్నది గద ఈ సమాజంల...ఒంటికి ఏ చిన్న రోగమొచ్చిన డాక్టర్ దగ్గరికి ఉరుకుతరు గాని...మనసుకొచ్చిన రోగాన్ని తగ్గించుకోడానికైతె నమోషిగ ఫీలైపోతరు. సైక్రియాటిస్ట్ దగ్గరికి పోయేటోళ్లనంత పిచ్చోళ్లుగ జమగట్టడం వల్లనె ఈ బాధంత.  

ఆ మధ్యనె ...ఓ రోజు రాధ చౌరస్తలో దూరం నుండి నన్ను జూసి దగ్గరికొచ్చింది. వాళ్లబ్బాయితో కల్సి షాపింగ్ కోసమని వచ్చిందట.

"మేడమ్ గారు మీరిచ్చిన సలహా వల్ల ముందుగళ్ల మీమీద బాగ కోపమొచ్చిన...తర్వాత ఆలోచించి పాపను సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం వల్లనే ఇప్పుడు బాగ సెట్టయ్యింది." అని రాధ సెప్పింది.

" ఇంత తొందరగ పాప బాగైందంటె చాన సంతోషంగున్నది. అసలు డాక్టర్ ఏమన్నరు రాధ గారు ...?!" అని కొంత ఉత్సుకతతో అడిగిన.

"పాపకి జాబ్ వచ్చినప్పటి నుండి ఇంతకుముందు కంటె ఇప్పుడు నా గురించి...వాళ్ల నాన్న గారి ప్రవర్తనలో రాని మార్పు గురించి బాగ ఆలోచిస్తాంది...ఇదే విషయాన్ని డాక్టర్ గారితో షేర్ జేస్కుంది.మా ఇంట్ల ప్రభావమే మనసు మీద బాగ పడ్డదని డాక్టర్ గ్రహించి మూడు సిట్టింగ్ లు కౌన్సిలింగ్ జేసిండు.ప్రశాంతంగ నిద్ర పోడానికి ఓ టాబ్లెట్ ఇచ్చిండు. రెండు నెలల్లోనె పాపలో చాన ఛేంజొచ్చింది.ఆ తర్వాత టాబ్లెట్ అవసరం గూడ లేకుండ పోయింది..." అని రాధ గారు సెప్పుతాంటె...నాకేమొ ఆమె మొఖంల ఓ లైట్ మెరిసినట్లనిపించింది.

రాధ సూడ్డానికి చాన అందంగుంటది.పది మంది తోడబుట్టినోళ్ల మధ్యన ఆమె తొమ్మిదోది.ఆమె తర్వాత ఓ తమ్ముడున్నడు. పేదరికం వల్ల, తల్లిదండ్రులకు వయస్సు మీద పడటం వల్ల ఇల్లు గడవటమె కష్టమయ్యేది.ఉన్నంతలో అప్పుసొప్పుజేసి అయిదుగురు అక్కల పెండ్లిళ్లను ముగ్గురన్నలు కల్సి జేసిండ్రు.వాళ్లు గూడ వాళ్లకు తగ్గట్టు అమ్మాయిలను సూస్కొని పెండ్లిళ్లు జేస్కున్నరు. ఎవలికి వాళ్లు సపరేట్ ఫ్యామిలీలను పెట్టుకొన్నరు.రాధ పెండ్లి వంతు అందరికంటె చిన్నోడైన రవి వంతు పడ్డది.రవికి ప్రైవేట్ సీడ్ కంపెనీలో జాబ్ దొరికింది.ఇటు ఇంటి బాధ్యత,అటు పెండ్లీడు దాటిపోతున్న అక్క బాధ్యత, సాలీసాలని జీతంతో రవి ఉక్కిరిబిక్కిరి అయ్యెటోడు.

ఓ రోజు దూరపు సుట్టాల తరుపునుండి రాధ కొక  పెండ్లి సంబంధమొచ్చింది.

"అబ్బాయి మొదటి భార్య సుసైడ్ జేస్కొని సచ్చిపోయింది.పదేండ్ల లోపు ఏడాది గ్యాప్ తో ఇద్దరు ఆడిపిల్లలున్నారతనికి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ...మంచి సాలరీ...ఉండడానికి ఒక ఇల్లు గూడ ఉంది."  అని సంబంధం తీస్కొచ్చిన మధ్యవర్తి రాధ తల్లిదండ్రులతొ సెప్పుతుండగ రాధ తలుపు పక్కన నిలబడి ఇన్నది.

"మా బిడ్డను సూశి సూశి రెండవ సంబంధం మనిషికిచ్చి పెండ్లి జేత్తమా...ఇద్దరు ఆడిపిల్లలు గూడ ఉన్నారంటున్నావు...ఈ సంబంధం మాకిష్టం లేదు..." అని రాధ తల్లిదండ్రులు మాటగల్పుకొని మధ్యవర్తికి సెప్పిండ్రు.

గాని రాధకు తెల్సు మధ్యవర్తెందుకు ఇట్లాంటి సంబంధాన్ని తీసుకొచ్చిండో...! ఇంతకుముందు తీస్కొచ్చిన చాన సంబంధాలు పేదరికం...వాళ్లడిగినంత కట్న కానుకలు ఇచ్చుకోలేక పోవడం  వల్లనే ఎత్తిపోయ్నయని.రాధకు మాత్రం ఈ సంబంధం నచ్చింది. ఇదే విషయాన్ని ఇంట్ల జెప్పి అందర్ని ఒప్పించి పెండ్లి జేసుకుంది.ఆమె తమ్ముడు రవి మాత్రం అక్క పెండ్లి విషయంల గిల్టి గానె ఫీలయ్యిండు. వారసత్వంగ తనొంతుగ వచ్చిన నూటయాభై గజాల భూమిని అక్క పేరు మీదికి మార్పిచ్చిండు.

"నువ్వు చాన అందంగ ఉంటావు రాధ...మంచి వయస్సులోను ఉన్నావు.మనిద్దరి మధ్య ఇరవై ఏండ్ల గ్యాప్ ఉన్నది.నీ వయసు తోని నేను ఉరకను...నువ్వు అందంగ తయారుగావడం గూడ ఇగ ఇప్పటి మానెయ్యాలి.ఇద్దరు పిల్లల తల్లిలా బాధ్యతగ ఉండిపో..." అని మొదటి రాత్రే చాన కరుకైన మాటలు భర్త నుండి ఎదుర్కొన్నది రాధ. 

మనసులోని కోరికలను సంపుకొని బతకడం అలవాటు జేస్కోవాల్నని పరోక్షంగ రాధ కర్థమయ్యింది.

తల్లిగా పిల్లలకు దగ్గరకావడానికి ట్రై జేసింది.గాని రాధంటె ఆ ఇద్దరు పిల్లలకు ఇష్టం లేదు.వాళ్ల నాన్న మళ్ల పెండ్లి జేసుకోవడమే వాళ్లకు ఇష్టం లేదు.రాధ అందం మీద గూడ ఈర్ష్య బాగ పెరిగింది. ఇష్టం లేని పెండ్లి... అందం మీద ఈర్ష్య... రోజు రోజుకు రాధకొక అగ్ని పరీక్షగా మారినయి.తండ్రి రాంగనె ఇద్దరు పిల్లలు రాధ మీద లేనిపోని చాడీలు సెప్పెటోళ్లు. పిల్లల మీదున్న ప్రేమతో అతను గూడ వాళ్ల మాటలే నమ్మి రాధను చాన చిత్రహింసలు పెట్టెటోడు. 

రాధకు గూడ పాప,బాబు పుట్టిండ్రు.వాళ్లకు అను,రిషి అని పేర్లు పెట్టుకున్నది.తనకిద్దరు పిల్లలు పుట్టినా...ఆ ఇద్దరు పిల్లలు అసహ్యించుకుంటున్నా...భర్త పోరు ఎంత ఉన్నప్పటికీ...రాధ మనసుల మాత్రం నల్గురు నా బిడ్డలేననుకునేది.భర్త ఆరోగ్యంగ ఉండాల్నని వారానికి మూడ్రోజులు ఉపాసముండేది. 

రాధకు పుట్టిన పిల్లలు పెరుగుతున్న కొద్ది...భర్త నుండి భర్త పిల్లల్నుండి వేదింపుల తీవ్రత గూడ పెరుగుతనె ఉన్నపది.ఉన్న ఇంట్లనె భర్త తన పిల్లల కోసం వేరె వంట వండటం మొదలుపెట్టిండి. రాధ వండి పెట్టె తిండిలో ఏమన్న విషం గల్పి మా ముగ్గురిని సంపేస్తదేమోననె అనుమానంతో...రాధకు పుట్టిన పిల్లలు నా పిల్లలు గాదన్నట్టు వాళ్ల మీద ఏ రోజూ ప్రేమను సూపెట్టెవాడు గాదు. వాళ్ల కోసం ఖర్చు జేసేవాడు గూడ గాదు. ఎప్పుడైన రాధ నిలదీస్తె ఇంట్ల నుండి ముగ్గురు ఎల్లిపొమ్మని కొట్టెటోడు.

బయటికెళ్తె సంసారం బజారుపాలైపోతదని రాధ ఆ ఇంట్లనె కుక్కిన పేనులా తన పిల్లలతో పడుండేది.పెరుగుతున్న పిల్లల అవసరాలు తీర్చడానికి తనకు ఇంతకుముందె టైలరింగ్ లో ప్రావీణ్యం ఉండటం వల్ల చిన్న బోటిక్ షాప్ ను పెట్టుకున్నది.

రోజు రోజు తన తల్లి మీద తండ్రి,
అక్కలిద్దరు సూపెట్టె టార్చర్ ను‌ కండ్లార సూడటం వల్ల రాధ ఇద్దరి పిల్లల మీద ఆత్మన్యూనత ప్రభావం బాగ పడ్డది.ఈ విషయాన్ని గమనించిన రాధ పిల్లలిద్దర్ని హాస్టల్ లో వేసింది‌.

ఓ రోజు అర్థరాత్రి రాధ నుండి కాల్ ....

"మేడమ్ గారు నాకు సచ్చిపోవాలనిపిస్తాంది‌...ఈ ముగ్గురు టార్చర్ ని భరించడమిక నా వల్ల గాదు మేడమ్ గారు..‌....ఎంత ఓపికగున్న ఓపికకె పరీక్ష పెడుతాండ్రు వీళ్లు.  నా పిల్లలిద్దరు నేను సచ్చిపోతె అనాధలైపోతర‌ని బెంగగున్నది..." అని ఎక్కెక్కి ఏడ్సుకుంట తట్టుకుంటున్న మాటలతో మాట్లాడుతనె ఉన్నది రాధ.

"సచ్చిపోవాలనిపిస్తాంది మేడమ్" అని రాధ అన్న మాటకు నా గుండెలన్ని అవిశిపోయినట్టపించింది.ఓపిక పట్టిన వాళ్లకే జీవితంల పరీక్షలెదురైతయ్ గావొచ్చు గానీ ఒక్కోసారి ఆ ఓపికకు గూడ ఓపిక లేకుండపోతె సావు తప్ప కండ్ల ముందు మరేది కానరాదేమో.

"రాధ ...రాధ...ప్లీజ్ ఏడ్వకు ఊర్కొ...రేపొద్దున నేను నిన్ను కలుస్త.నా మాటకి విలువిచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానీయకు రాధ" అని రాధను నిమ్మలం జేసిన.

"ఓకె మేడమ్...రేపొద్దున నేనె వచ్చి మిమ్మల్ని కలుస్త" అని రాధ ఫోన్ కట్ జేసింది.

రాధ ఇంటికొస్తదని ఆఫీస్ కి హాఫ్ డే రానని కొలీగ్ కి కాల్ జేసి సెప్పిన.రాధ పది గంటలకొచ్చింది.నేను గూడ రాధ కోసమె ఎదురు సూత్తాన.రాత్రంత టెన్షన్ తో నిద్ర పట్టనే లేదు.  రాధను సూడగానె మనసు నిమ్మలపడ్డది.

నన్ను సూడగానె రాధ దుఃఖమంత కట్టలు తెంచుకొన్నది.

"ఏడ్వకు రాధ ...జర మనసును నిమ్మలం జేస్కొని నేను సెప్పేది ఇను రాధ..."

"సెప్పండి మేడమ్ ...ఇంటాను.
మిమ్మల్ని కలిస్తే నాకొక సొల్యూషన్ దొరుకుతదనె ఆశతోనె వచ్చిన " అని రాధ కండ్ల నీళ్లను కొంగుతో తూడ్సుకుంట నా వైపు ఆశగ సూత్తాంది.

"రాధ ముందుగళ్ల మీ భర్త పిల్లలకు మంచి సంబంధాలు సూసి పెండ్లి జెయ్యి.ఆ ఇద్దరమ్మాయిలకు పెండ్లి వయసొచ్చిందనె సోయి నీ భర్తకు గుర్తు జెయ్యి.వాళ్లిద్దరు వెళ్లిపోతే నీకెట్లాంటి టార్చరుండదు.నీ భర్తకు వాళ్లిద్దరి మీదున్న ప్రేమనె నిన్ను నీ పిల్లలను సరిగ సూస్తలేడేమో...వాళ్లకి పెండ్లై వాళ్ల సంసారంలో వాళ్లు మునిగిపోతె అప్పుడేమన్న మీ వైపు తొంగి సూత్తడేమొ ఓ సారి ఆలోచించు రాధ." అని రాధకు ధైర్యం జెప్పి,కొంచెం అన్నం తినమని బతిలాడి,తిన్నాక చింటును బైక్ మీద వాళ్లింటిదగ్గర డ్రాప్ జేయమని  పంపించి,నేను ఆఫీసు కెళ్లిపోయిన. 

                                                      ******  *****  *****  *****

మేడమ్ వాళ్ల అమ్మాయి నన్నింట్ల డ్రాప్ జేసి పోయ్నాక ఆ రోజంత ఆలోచించిన.మేడమ్ సెప్పింది వంద పాళ్లు నిజం.ఎట్లనైన ఈయన మనసును పిల్లల పెండ్లిళ్ల వైపు మళ్లించాలె...! మరి నేను సెప్పితె ఇంటాడ? ఎవలితోనైన సెప్పించాల్న? 
ఎట్లనైన పెండ్లి జేసి పంపించాలె ...అప్పుడన్న జరంత నా గురించి, అను,రిషి సదువుల గురించి ఆలోచిత్తడేమో...దేవుడా ఈ కష్టం నుండి నువ్వె బైట పడెయ్యాలె...

డ్యూటి నుండి ఎప్పుడెప్పుడు ఒత్తడా అని పొద్దూకి నుండి కండ్లల్ల ఒత్తులేసుకొని గల్మల్లకు వచ్చుకుంట... పోకుంట సూత్తాన.గాని వచ్చెసరికి రాత్రి పదైంది.ఇప్పుడు సెప్పకపోతె నాకివ్వాల నిద్రనె పట్టదు.ఎట్లైన సెప్పాలని ఆయ్నె ఎప్పుడెప్పుడు ఫ్రెష్షయితడా నని సూస్తాన.ఇయ్యాలయితె పిల్లలు గూడ ఇంట్ల లేరు.వాళ్ల అమ్మమ్మొల్లింటికి ఎల్లిండ్రు...రేపొద్దున్నె వస్తమని పొద్దుగళ్ల ఈయ్నతో ఫోన్ల సెప్పుతాంటె ఇన్న.వాళ్లు లేరు గాబట్టె నేను వండింది తింటడు...ఉంటె వాళ్ల ముగ్గురిది ఏరె వంట.

"ఏమయ్య మన ఇద్దరమ్మాయిలకు పెండ్లెప్పుడు జేత్తరని సుట్టాలంత తలోమాట అంటాండ్రు.కన్నతల్లి ఉంటె వాళ్ల గురించి ఆలోచించక పోవ్నా...సవ్తి తల్లయ్యెసరికి పట్టించు కుంటలేదనుకుంటాండ్రు.గీ ముచ్చటెప్పట్నుండొ సెప్పాలనుకుంటాన...నువ్వు నేను సెప్పె ముచ్చటినవని ఇన్ని రోజులు సెప్పలేదు.గాని సెప్పకుండ ఉండలేకపోతాన...నేనెప్పుడు నాకు నల్గురు పిల్లలనె అనుకుంట...ఇన్నేండ్లయిన నన్నర్థం జేసుకుంటలేరు...." అని ఇదే ఛాన్సని ఆయ్నతో నా మనసులున్న బాధనంత కక్కుతనె ఉన్న.

"అవ్ను రాధ....నువ్వన్నది నిజమె ...ఈ మధ్యన నన్ను గూడ రెండు మూడు ఫంక్షన్లల్ల కొంతమంది మొఖం పట్టుకొని అడిగిండ్రు.నీకు సెప్పలేదు గని నేనాల్రడీ మంచి సంబంధాలుంటె సూడమని ఇద్దరు ముగ్గురికి సెప్పిన....కుదిరితె ఇద్దరికొక్కసారె జేస్త." అన్నం తిన్న చెయ్యిని కడుక్కుంట సెప్పిండు.

ఆయ్న మేనబావ ఓ రోజు ఇద్దరికి మంచి సంబంధాల జాడ పట్టుకొచ్చిండు. పెద్దమ్మాయి లత పెండ్లిష్టమే నని సెప్పింది
రెండో అమ్మాయి లలిత మాత్రం నాలుగైదేండ్ల దాక పెండ్లే జేస్కొనని సెప్పింది.లత కన్న లలిత ఓ యాడాదిన్నర మాత్రమె సిన్నది.ఇద్దరిట్ల లలితనె ఎప్పుడేదోకటి పుల్లలేస్తుంటది. లలిత వల్లనె వీళ్లిద్దరి మనసులు మారి మూర్ఖులవుతరు.

లలిత మాటకు సరేనని సెప్పి...లతకొక్కదానికె పెండ్లి జేసిండు.అల్లుడు హైద్రబాద్ ల ఓ ప్రైవేట్ కంపెనీల పనిజేస్తాండు.భర్త, అత్తమామలు లతని మంచిగ సూస్కుంటాండ్రు.ఇగ లతకు ఇంటి మీద ఆలోచనలు తగ్గిపోయి...సంసారం బాధ్యతలల్ల మునిగిపోయింది.గానీ లలిత ప్రతీ విషయంల ఇంట్ల రోజుకో లొల్లి జేసుకుంట నన్ను నా పిల్లలను వాళ్ల నాన్న నుండి దూరం జేస్తనే ఉన్నది. ఓ సారి జాబ్ జేస్తనంటది...మళ్లోసారి హయ్యర్ స్టడీస్ జేస్తనంటది...అనవసరమైన ఖర్చులు వేలకువేలు వాళ్ల నాన్నతో ఖర్చు బెట్టిస్తది.బిడ్డ మీద ప్రేమతో ఆయ్న గూడ ఎదురు మాట్లాడకుండ ఆడిచ్చినట్టు ఆడుతడు.

అను కి బీటెక్ ఫైనలీయర్లోనె క్యాంపస్ ప్లేస్మెంట్టొచ్చింది.రిషి కి సీఏ లో సీటొచ్చింది.వాళ్లిద్దరి సదువుల ఖర్చు భారమైతాంది.ఆయ్న మాత్రం నయాపైస ఇయ్యడు.నా బోటిక్ వర్క్ తోనె ఎల్లదీసుకొస్తాన.

అను బెంగుళూర్లో జాబ్ లో జాయినయ్యింది.ఇప్పుడు అను,రిషి ఇద్దరు బెంగుళూర్లోనె రూం రెంట్ కి తీస్కొని ఉంటాండ్రు. అప్పుడప్పుడు తమ్ముని ఖర్చలను అనునె భరిస్తుంది. ఇప్పుడు నా ఆలోచనంత అనుకి పెండ్లెట్ల జెయ్యాల్నని...
ఆయ్నేమాత్రం వీళ్లిద్దరి సదువుల మీద నయా పైస ఖర్చు బెట్టలేదు.నేనె ఎల్లదీసుకుంటొచ్చిన...ఇప్పుడు 
పెండ్లంటె లక్షలు లక్షలు కట్నమిచ్చి నేనెట్ల జెయ్యాలె...? లలిత నేమో  పెండ్లాలోచన్నె రానిస్తలేదు...సూడబోతె జేసుకునేట్టు కనబడ్తలేదు.
ఈ ఆలోచన్లతో రోజురోజుకు నా బుర్ర పగిలిపోతాంది.ఈ టెన్షన్లతో వంట్లోకి షుగరు...తల్లోకి మైగ్రేనొచ్చింది.

అను సంక్రాంతి పండక్కి ఓ వారం రోజులుందామనొచ్చింది.ఈ మధ్యల అనుకి తలనొప్పి బాగొస్తాంది జాబ్లోని స్ట్రెస్ వల్ల.రిషి కి సెలవుల్లేక ఆన్నె ఉన్నడు.

పండగ రేపనంగ ఆయ్నతో అను పెండ్లి గురించి అడిగిన...తండ్రిగా ఈ బాధ్యతొక్కటైన పంచుకొమ్మని.ఈ మాట లలిత తలుపు సాటు నుండి ఇన్నది. అను ఇంటికొచ్చినప్పట్నుండి ఏదో ఒక సాకుతో లొల్లి జేయడానికె సూత్తాంది. ఇప్పుడిదొక సాకు దొరికింది. పిల్లి చేతికి సిక్కిన ఎలుకలాగైపోయిన నేను....లలిత ఆయ్న సంబంధం లేని విషయాలను ముందటేసి అను ఉన్నన్ని రోజులు బాగ లొల్లి జేసిండ్రు.రెండు సార్లు ఆయ్న నా ఒంటిమీద చెయ్యేసుకొని బాగ కొట్టిండు. ఇదంత అను సూస్తనే ఉన్నది. లొల్లొద్దని ఏడ్చింది...ఒర్రింది...బతిలాడింది. అను ముందే ఆయ్న నా కడుపులో బలంగ  తన్నిండు. కడుపులో భరించరాని నొప్పి మొదలైంది. పదిహేను రోజులు బ్లీడింగ్ ఆగకుండయ్యింది. షుగర్ లెవల్స్ పడిపోయి రెన్నెళ్ల దాక మంచం నుండి లేవలేకపోయ్న. అనుకి నన్ను సూస్కోడానికి ఓ వారం రోజులున్నది.ఆఫీస్ లో సెలవివ్వకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో ఎల్లిపోయింది. వాళ్లిద్దరు మాత్రం దగ్గరికి రానేలేదు...
వండిపెట్టలేదు.ఏదోలాగ లేసి నా తిండి నేనె వండుకునేదాన్ని.

ఈ సంఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఓ రోజు రాత్రి అను నుండి ఫోనొచ్చింది."అమ్మా నువ్వు మా దగ్గరికి వచ్చెయ్యి...మాతోనే ఉండమ్మ. అక్కడ నీకెవలున్నారని ఉంటవమ్మ..? నేను జాబ్ జేస్తానా...తమ్ముడు గూడ ఓ యాడాదిలో సెటిలైపోతడు. మన ముగ్గురం ఒక్క దగ్గరె ఉందాం...ఇక్కడికిరా అమ్మ...ఆ రోజు నా పెండ్లి మాటెత్తినందుకు వాళ్లిద్దరి ప్రవర్తనను మర్చిపోలేకపోతున్న...
రాత్రిళ్లు నిద్రపడ్తలేదు...సరిగ నిద్రలేకపోయెసరికి ఆఫీస్లో పన్జేయలేకపోతాన...పనంత పెండింగ్లో ఉండేసరికి మా బాస్ తిడుతాండు.మా చిన్నప్పట్నుండి వాళ్లతో పడ్డ కష్టాలను తమ్ముడు నేను సూత్తనె ఉన్నం.మాకు సెప్పకుండ...ఎన్ని బాధల్ని దాసుకున్నవో గూడ అర్థమైతాంది. ఇప్పుడు గూడ ఈ కష్టాలు ...ఆ మనుషులు అవసరమా అమ్మా...? నా పెండ్లి కోసం ఎక్కువాలోచించకు...నాకిప్పుడె జేస్కోవాలనె ఆలోచన్లేదు.తమ్ముడు సెటిలైనంక...ఓ రెండేండ్ల తర్వాత ఆలోచిస్త..." అని అను మనసులోని బాధనంత సెప్పుకుంట...బాధ్యత లేని తండ్రి మాకస్సలే వద్దని ఏడుస్తనె ఉన్నది.

అను నా గురించి... వాళ్ల శాడిజం గురించి బాగ ఆలోచించడం వల్ల....నిద్ర లేక పోవడం వల్ల...హెల్త్ ప్రాబ్లం మొదలైంది.ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పినా...ఫలితం లేకపోయింది. ఒక్కో డాక్టర్ ఒక్కోటి సెప్పి టెస్ట్ ల మీద టెస్ట్ లు జేయించమనేది.ఆ టెస్టులన్ని గూడ నార్మల్గానె ఉండేయి. ఏమన్న దేవుని కొంటెతనమేమోనని మొక్కని దేవుడ్లేడు. చివరికి మేడమిచ్చిన సలహాతో సైక్రియాటిస్ట్ దగ్గరికి తీస్కపోయిన....రెన్నెళ్లలో అను మళ్ల మామూలు మనిషైంది.

ఈ విషయాన్నంత రిషి ఓ రోజు తమ్ముడు రవికి ఫోన్జేసి సెప్పిండట.రవి ఒక రోజు నాకు కాల్జేసి చాన బాధ పడ్డడు....బోరున ఏడ్చిండు. నా బాధలెప్పుడు వాళ్లతో జెప్పుకోలేదు...నేను మంచిగనె ఉన్నాననుకుంటాండ్రు. ఇంట్లో మేమిద్దరం చిన్నోళ్లం గావడం వల్ల రవికి నాకు క్లోజ్నెస్ ఎక్కువుండేది.
పెండ్లైపోయ్నాక వాని గురించి ఆలోచన్నే పోయింది.

  "అక్కా ...నీతోని ఒక్క విషయం చెప్పాల్నె...ఇన్నేండ్లు మాకు నీ బాధలు తెల్వకుండ జేసినవ్.నువ్వు మంచిగున్నవనుకున్నం గాని గిప్పుడు  నీ పరిస్థితి తెల్సినంక నాకస్సలు తిండి సయిస్తలేదు....నిద్రబడ్తలేదు.నువ్వు ఊ ..అంటే నా వంతుకొచ్చిన నూట యాభై గజాల ల్యాండ్ ని నీ పెండ్లప్పుడు నీ పేరు మీదికి మార్చిన గద...గిప్పుడది మస్తు రేటొస్తాంది.దాన్ని తీసేస్తె ఎంత గాదన్న ఓ ముఫ్పై లక్షలొస్తయ్ ...ఆ పైసలతో అనుకి ఓ మంచి సంబంధం సూసి పెండ్లి జేద్దాం...అన్ని రకాలుగ నేను ముందు పడుత..." అని రవి ఫోన్ల మాట్లాడ్తనె ఉన్నడు.

నాకింతగన్న ఏం గావాలె...! అను పెండ్లైపోతే నా సగం బాధ పోతది.ఇగ రిషి ...అబ్బాయి వాడు.ఎట్లనో ఒకలాగ సెటిలైపోతడని నా మనసులనుకున్న.

"గాకపోతే....ఒక్క కండీషనక్క..! 
నువ్వు ఆమనుషులనొదిలెయ్యాలె.
కన్నపిల్లల్ని...పెండ్లాన్ని బట్టించుకోనోడ్ని ఇంక పట్టుకొని నా మొగుడని...ఆయ్న పిల్లల్నింకా నా పిల్లలని నువ్వనుకుంటె సరిపోతదా...నీ పిల్లల పరిస్థితి ఏం గావాలె....అదృష్టం మంచిగుండి అను మామూలు మనిషయ్యింది.రేపొద్దున రిషి గానిక్కూడ ఆ పరిస్థితి రాకుండ సూస్కోవాలె గద...." అని రవి నా మీదున్న ప్రేమతో...మేనమామగ పిల్లల మీదున్న బాధ్యతతో చెప్పుతనె ఉన్నడు.

రవి సెప్పిన విషయం గురించి రెండ్రోజులు ఆలోచించిన.....వాడిచ్చిన భరోస నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.అను కండీషన్ ని కండ్లార సూసినంక,రేపొద్దున రిషికి గూడ ఇసొంటి పరిస్థితి రావొద్దంటె ఆయ్నని...ఆయ్న పిల్లల్ని శాశ్వతంగ వదిలేస్తెనె మంచిది...ఇప్పుడు నేను నలభై ఆరేండ్ల వయసుకొచ్చిన...
వయస్సుతో పాటుగ వంట్లోకి టెన్షన్స్ వల్ల రోగాలు గూడ జేరుతానయనుకున్న.ఈ విషయాన్ని అను, రిషిలకు ముందుగళ్ల సెప్పిన.
వాళ్లు చాన సంతోషపడ్డరు.తర్వాత రవికి కాల్జేసి సెప్పిన.

ఆయ్న రోజుకొక్కసారైన "ఇంట్ల నుండి నువ్వు నీ పిల్లలు ఎల్లిపోండి.నాకు మీతో ఎట్లాంటి సంబంధం లేదు" అని మొఖం పట్టుకొని అనేటోడు.గానీ నాకు భర్త గావాలె...ఆయ్న పిల్లలు గావాలె ...ఎప్పటికైన మారుతరని నమ్మేదాన్ని.భర్త నొదిలేసిన ఆడోళ్లను ఈ సమాజమెట్ల సూస్తదో తెల్సు.సాటి ఆడదానికి సపోర్టివ్వాలనె ఆలోచనైతే రాదుగని మూడు ముచ్చట్ల మాటలతో ఎంత టార్చర్ జేస్తరో తెల్సు.గానీ గిప్పుడు గా సమాజం గురించి గానీ..మూడు ముచ్చట్ల ఆడోళ్లను గురించి గానీ ఆలోచించదల్చుకోలేదు.
వందమంది ఇసొంటోళ్ల కంటె ...మేడమ్ లాగ అర్థం జేస్కొనె ఒక్క ఆడది సపోర్టున్నా చాలనుకున్నా...

తెల్లారి ఓ లెటర్ రాసి ...హాల్లో కూసోని టీ తాగుతున్న ఆయన ముందున్న టీపాయ్ మీద పెట్టి ...ఇంట్ల నుండి ఎల్లపోడానికి సమాన్లను సర్థుకుంటాన.అను రిషిలు రాత్రె కాల్జేసి బెంగుళూర్కి టికెట్ రిజర్వ్ జేసినమని సెప్పి,వాట్సప్ కి స్క్రీన్ షాట్ పెట్టిండ్రు. ఆ లెటర్ సూసి సూడనట్టె ఉన్నడు.ఇగ నేనేమి పట్టించుకోదల్చుకోలేదు.
ఎందుకంటే గిప్పుడు నాలోపల ఇంతకుముందులాగ బాధపడి ...ఏడ్చే రాధ సచ్చిపోయింది....

రవి కొన్ని రోజుల తర్వాత అనుకి ఓ మంచి సంబంధం తీసుకొచ్చిండు.
అబ్బాయి గూడ సాఫ్ట్‌వేర్నె  ...
బెంగుళూర్లోనె పనిజేస్తాండు.
నా గురించి అబ్బాయి వాళ్లకు ముందే సెప్పిండు.

రాత్రి పదవుతాంది రవి కాల్జేసి "అక్కా...అబ్బాయి వాళ్లు పెండ్లికొప్పుకున్నరు...చాన సంతోషంగుంది నాకైతే...పెండ్లి ల మేమె కాళ్ళు కడుగుతమక్క ...నువ్వెట్లాంటి టెన్షన్ బెట్టుకోకు...అను పెండ్లి ని చాన గ్రాండ్గ జేద్దాం " అని రవి సంబురంగ మాట్లాడ్తనె ఉన్నడు.నా మనసులున్న బాధంత కండ్లళ్ల నీళ్లుగ కారుతాంది.నోట మాట రావట్లేదు సంతోషంతో...వాడు ఆ మాట ఈ మాట సెప్పుకుంట రెండు గంటలు మాట్లాడి ఫోన్ పెట్టేసిండు.

పెండ్లి కుదిరిందన్న సంతోషంతో ఆకలిపోయింది.టైం సూత్తె పన్నెండవుతాంది. ఎంటనే నాకు మేడమ్ గుర్తొచ్చింది.ఈ సంతోషకరమైన ముచ్చటను మేడమ్ కు సెప్పాలని....గాని గిప్పుడు మంచి నిద్రల ఉండొచ్చు.నా కాల్జూసి ఏమయ్యిందోనని టెన్షన్ గూడ పడ్తది....గందుకే ఫోనిప్పుడొద్దు   రేపొద్దున్నే సెప్పుత ‌...అనుకొని నిద్రరాని కండ్లను బలవంతంగ మూస్కున్న.

ఇంటర్వ్యూలు

నేను నవలా ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేయడం వలన నవలాకారునిగానే గుర్తింపు పొందాను

కేంద్ర సాహిత్య అకాడమీ  అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారితో గోదావరి పత్రికాల్ కోసం గట్ట్టు రాధిక మోహన్ చేసిన  ఇంటర్వ్యూ

1.         మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా చెప్పండి?

నేను 1941,డిసెంబరు 24న జనగాం తాలుకా,బమ్మెర గ్రామానికి(పోతన పుట్టిన ఊరు) కి దగ్గరలో ఉన్న వావిలాల గ్రామంగా జన్మించాను. నా అసలు పేరు దొంగరి మల్లయ్య,అది మా తాతగారి పేరు.  నవీన్ అనేది నా కలం పేరు.  ఈ పేరును వరవరరావు సూచించారు.  అంపశయ్య అనేది నా మొదటి నవల‌.దానికొచ్చిన గుర్తింపేనా ఇంటిపేరుగా మారింది. మాది మధ్య తరగతి వ్యవసాయిక కుటుంబం.మా ఊరిలో మూడవ తరగతి వరకే ఉండేది.అక్కడ మూడవ తరగతి వరకు చదివి, పక్క ఊరైన కొడకండ్ల లో నాల్గవ తరగతి, మా అమ్మ వాళ్ల చెల్లె మా చిన్నమ్మ ఊరు కొరివి లో అయిదవ తరగతి, ఆ తర్వాత పాలకుర్తి దగ్గరున్న తిరుమలగిరి మిడిల్ స్కూల్ లో ఆరేడు తరగతులు చదివిన.ఆ తర్వాత వరంగల్ కి వచ్చిన...వరంగల్ లోని ఏవి స్కూల్ లో ఎనిమిది నుండి హెచ్చెస్సి వరకు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో పియుసి మరియు బిఎ పూర్తి చేసిన. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన.నాకక్కడి నుండె నా లైఫ్ లో మార్పులు చోటు చేసుకున్నవి.

2.         మీరు సాహిత్యంలోకి రాకముందు మీ చుట్టూ సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?

మా ఊరు పక్కనే బమ్మెర గ్రామం ఉండేది.పోతన పుట్టింది అక్కడే.మా నాన్న గారు పోతన భాగవతం లోని పద్యాలను చాలా చక్కగా రాగయుక్తంగా పాడుతుండే వారు. ఆ ప్రభావం నాపై బాల్యంలోనే పడింది. నాల్గవ తరగతి, అయిదో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ లైబ్రరీ లోని చందమామ కథలు, జానపద కథలను నేను బాగా చదివే వాన్న.  చదివి ఊరుకోకుండా చిన్న చిన్న కథలను కూడా రాసేవాన్ని.

3.         మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక,రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని సాహిత్యం వైపు నడిపించాయి?

అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న రోజులవి.భూస్వాముల పెత్తనం,రజాకార్ వ్యవస్థ కింద సామాన్య ప్రజలు అన్ని రకాలుగా బాధలు పడేవాళ్లు.  ఒకరోజు నేను పదకొండో ఆంధ్ర మహాసభని ప్రత్యక్షంగా చూసిన.ఆ సభకి పదకొండు జతల ఎడ్లబండ్ల మీద అతిధులను ప్రజలందరూ సభా ప్రాంగణానికి తీసుకురావడం,వాళ్లకు జేజేలు కొట్టడం నా మనసుకు బాగా తాకింది. ఈ చరిత్రను రికార్డు చేయాలని అప్పుడే అనుకున్నాను. తర్వాత ఆ సంఘటనల మీద నవల రాయడం జరిగింది.

4.         మీ సాహిత్యం పై,మీ వ్యక్తిగత జీవితం ఎంత వరకు ప్రభావితం చేసింది?

నా సాహిత్యంపై నా వ్యక్తిగత జీవితం తప్పకుండా ఉంది. నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు, అనుభవాలనే వస్తువుగా తీసుకుని మలచడం జరిగింది.

5.         అంపశయ్య నవల రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన పరిస్థితులు ఎలాంటివి.ఆ నవల మీకెలాంటి స్థానాన్ని ఇచ్చిందనుకుంటున్నారు?

   ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నేను ఎంఏ చదువుకున్న రోజులవి...అక్కడంతా రకరకాల మనస్థత్వాలు కలిగిన విద్యార్థులుండే వాళ్లు. ఫీజు కట్టకపోతే పేరు నోటీసు బోర్డు పైకి ఎక్కేది. పరీక్షలు రాయనిచ్చేవారు కాదు.ఆర్థికంగ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను.నా చుట్టూ ఉన్న సహ విద్యార్థుల మనస్థత్వాలను కలుపుకొని ఒక రోజులో జరిగిన సంఘటనలను...అనుభవించిన అంతర్మథనాన్ని ఒక నవలగా రాయాలనుకున్నాను. దానికి శ్రీకారం చుట్టింది మాత్రం నేను నల్గొండలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నప్పుడు.

అది పూర్తయ్యేసరికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇదే నా మొదటి నవల. దీన్ని చైతన్య స్రవంతి శిల్పంలో రాయడం జరిగింది.రాసేటపుడు అది చైతన్య శిల్పమనే తెలువదు. దాన్ని చదివిన వాళ్లు కొందరు చెప్పడం జరిగింది.మన ఆలోచనా ప్రవాహాన్నే ఉన్నదున్నట్లుగ అక్షర రూపంలో పెట్టడం. ఆంగ్ల సాహిత్యంలో జేమ్స్ జాయిస్ రచించిన "యులిసెస్" లో ఇదే శిల్పం ఉంటుంది.తెలుగులో బుచ్చిబాబు రాసిన కొన్ని కథలల్లో,శ్రీ శ్రీ గారి "ఒసే తువ్వాలందుకో"కథలో కొంత వరకు మాత్రమే ఈ శిల్పం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ శిల్పంలో రాయబడిన మొదటి నవల అయితే అంపశయ్య మాత్రమే.అప్పుడు ఈ నవలనొక సారి చూడమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి, యువ మాసపత్రిక ఛీఫ్ ఎడిటర్ చక్రపాణి గారికి పంపించడం జరిగింది.  కానీ వాళ్లు కొన్ని పేజీలను చదివి ఇది నవలనేనా  అని తిరిగి పంపించారు.ఆ తర్వాత వరవరరావు,నేను కలిసి "సృజన" అనే త్రైమాసిక పత్రికను ప్రారంభించాము.  మూడు నెలలకో సారి వచ్చే ఈ పత్రికలో ఒకేసారి అరవై నుండి డెబ్బై పేజీల వరకు ప్రచురించాము.  ఆ తర్వాత రవిబాబు సహాయంతో ఫెయిర్ కాపీ తీసుకురావడం జరిగింది.1968 లో ప్రింట్ కాపీ వచ్చింది. నేను రాసేటప్పుడే అనుకున్నాను ఈ నవల తప్పకుండా యువతీ యువకుల మీద ప్రభావం ఉంటుందని.ఊహించినట్టే జరిగింది. అది నా ఇంటి పేరుగా మారింది. ఈ మధ్య యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాపీల కొరత వల్ల పదమూడవ ప్రచురణ కూడా జరిగింది.

6.         మీ సీక్వెల్ నవలల గురించి చెప్పండి.

నేను సీక్వెల్ నవలలు రాయడానికి ముందు హిందీలో సత్యజిత్ రే గారి "పథేర్ పాంచాలి" చిత్రానికి సీక్వెల్ గా "అపరాజిత", " అపూర్ సంసార్" చిత్రాలు రావడం జరిగింది.  అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది తెలుగులో సీక్వెల్ నవలలను ఎందుకు రాయకూడదని.ఆ ఆలోచనె నన్ను రెండు నవలాత్రయాలు రాసేలా చేసినాయి. నా మొదటి నవల "అంపశయ్య" కి సీక్వెల్ గా "ముళ్లపొదలు", "అంతఃస్రవంతి" ని తీసుకొచ్చాను. "అంపశయ్య" ఒక స్టూడెంట్ ని సబ్జెక్టు గా తీసుకుని రాయబడితే "ముళ్లపొదలు", "అంతఃస్రవంతి" లలో నిరుద్యోగిని,వివాహం తర్వాత కొనసాగే జీవితాన్ని తీసుకుని రాయడమైంది.  ఇది నా మొదటి నవలాత్రయం.ఇదే స్ఫూర్తితో మరో నవలాత్రయంగా "కాలరేఖలు-చెదిరిన స్వప్నాలు-బాంధవ్యాలు" లను తీసుకొచ్చాను.  ఈ మూడు నవలలు ఇటు తెలంగాణ ప్రాంతంలోను, అటు భారతదేశంలోను, 50 సంవత్సరాలలో, (1944–1994) జరిగిన అనేక సంఘటనల్ని ఈ కాలంలో ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, జీవనాల్లో ఉత్పన్నమైన పరిణామాల్ని చిత్రిస్తాయి. 1996లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీ విరమణ చేశాక రాయడం మొదలు పెట్టాను.50 ఏళ్లలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన మూడో నవల కాలరేఖలు.

7. మీ "చీకటి రోజులు" నవల నేపథ్యం చెప్పండి.

ఈ నవలా 1975 సంవత్సరం ఎమర్జెన్సీ పీరియడ్ ఆధారంగా రాయబడింది. రచయిత మెట్టు తిరుపతయ్యను విరసం తో సంబంధమున్నదని అరెస్టు చేసి దాదాపు ఇరవై మూడు రోజులు పోలీసు క్యాంపులో ఉంచుకొని రిలీజ్ చేసినారు.నిజానికి తిరుపతయ్యకి విరసం తో ఎలాంటి సంబంధాలు లేవు.  అతను పోలీస్ కస్టడిలోని తన అనుభవాలను నాతో పంచుకున్నప్పుడు ఇదంతా కూడా ఒక నవలగా రాయాలనిపించింది.  ఒక ప్రత్యేక శైలితో రాయాలనుకొని ఆలోచించి డైరీ రూపంలో రాయడానికి నిర్ణయించుకున్నాను.ఈ నవలంతా కూడా పందొమ్మిది రోజుల దినచర్య గా కొనసాగుతుంది.  ఇందులో ఒక తిరుపతయ్య గురించే కాకుండా యావత్ దేశంలోని సంఘటనలను కూడా చిత్రించాలనుకున్నాను.  అందుకే కొంతమంది అమాయకులు ఎదుర్కొన్న సంఘటనలను తీసుకున్నాను.కేరళ లోని లెనిన్ కాలేజ్ స్టూడెంట్ రాజన్ గురించి, సోషలిస్ట్ పార్టీకి చెందిన స్నేహలతా రెడ్డి గురించి, కొంతమంది ఆరెస్సెస్ నాయకుల గురించి ప్రస్థావిస్తూ ఎమర్జెన్సీ పీరియడ్ తరువాత తీసుకురాబడింది ఈ నవల.

8.మీరు నవలలే కాక అనేక కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు కూడా రాసినారు కదా...కానీ విమర్శకులచే మీరు నవలాకారుడు గానే గుర్తింపు పొందారు. దీనిపై మీ అభిప్రాయం ?

సాహిత్య ప్రక్రియలో ఇప్పుడు మీరు చెప్పిన ప్రక్రియలన్నీ ఉంటాయి. దాదాపు ప్రతీ రచయిత ఒక్క ప్రక్రియనే కాకుండా అనేక ఏవో కొన్ని ప్రక్రియల్లో ప్రవేశముంటూనే ఉంటుంది.  వాటిలో ఏది ఎక్కువ ప్రభావితం చేస్తే ఆ ప్రక్రియలోనే పేరొస్తుంది.నాది కూడా అంతే....నేను నవలా ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేయడం వలన నవలాకారునిగానే గుర్తింపు పొందాను.

9.         ఇప్పటి వరకు మీరు రాసిన రచనల గురించి చెప్పండి.

ఇప్పటి వరకు ముప్పై రెండు నవలలు, ఏడు కథా సంకలనాలు,ఐదు వ్యాస సంకలనాలను తీసుకురావడం జరిగింది.

10.       మీ కవిత్వం గురించి చెప్పండి.

నేను మొదటి ఛందోబద్దమైన కవిత్వాన్ని రాసేవాన్ని.  అది కుదిరింద లేదా అని మా తెలుగు మాస్టర్ కి చూపించి సరిచేసుకునేది.  ఆ తర్వాత నేను నవలా ప్రక్రియపై శ్రద్ద పెట్టడం వల్ల కవిత్వం గురించి పట్టించుకోనే లేదు.వచన కవిత్వమైతే ఎప్పుడూ రాయలేదు.

11.       కాళోజీ గారితో..."మిత్ర మండలి" తో మీ అనుబంధం ఎలాంటిది?.

నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (హన్మకొండ) లో చదువుతున్న రోజుల్లోనే నాకు కాళోజీ సోదరులతో మంచి అనుబంధం ఏర్పడింది.  వారి ఆధ్వర్యంలో నడుపబడిన "మిత్ర మండలి" కి మొదటి కన్వీనర్‌గా వరవరరావు గారు పనిచేస్తే,రెండో కన్వీనర్‌గా నేను పని చేసాను.  వారింటికి ఎప్పుడూ తరచుగా వెళ్లుతూ ఉండేవాన్ని.

12.       కాళోజీ గారు మిమ్మల్ని "పద్మశ్రీ" అవార్డు కోసం రికమెండ్ చేసారని తెలిసింది.దాని గురించి వివరాలు చెప్పండి.

1992 సంవత్సరంలో కాళోజీ గారు "పద్మ విభూషణ్" అవార్డును అందుకున్నారు. మరుసటి సంవత్సరం అంటే 1993-94 కు గాను కాళోజీ గారిని అవార్డు కమిటీ వారు మీకు తెలిసిన వారిలో ఒకరిని "పద్మశ్రీ" కి రికమెండ్ చేయమని అడిగారట.  అప్పుడు కాళోజీ గారు నా పేరు రాసి పంపించారట.  కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు రాసి పంపించమన్నారట.  కాళోజీ గారు కొంచెం ముక్కోపి, రెండో సారి పంపించడమేందని కోపంతో వివరాలు పంపించలేదట.ఇదంతా కూడా నాకు ఆ తర్వాత ప్రస్తుత కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిళ్ల రామశాస్త్రి గారు చెప్పారు.

13.       మీపై ఏ రచయితల ప్రభావం ఉందంటారు?

చలం గారు,బుచ్చిబాబు గారు,శ్రీ శ్రీ గారు నా అభిమాన రచయితలు.వీరి రచనల ప్రభావం నాపై ఉందనే చెప్పుతాను.

14.       మీరు ఈ మధ్య చలం గారి మీద ఒక నవల తీసుకొచ్చారు కదా...దాని గురించి చెప్పండి.

అవును అది చలం గారి జీవితాత్మక నవల."ప్రేమకు ఆవలి తీరం " పేరుతో తీసుకొచ్చాను. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన మొదటి జీవితాత్మక నవల ఇది.  చలం గారు తన ఆత్మకథను తను రాసుకున్నారు.కానీ అందులో తన స్వంత అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి.ఆ బుక్ రాసే నాటికి చలం గారు వయసు రీత్యా రాసే స్థితిలో లేరు.  తను డిక్టేట్ చేస్తుంటే విశ్వం గారు రాసారట.అందువల్ల తన ఆత్మకథ చాలా మంది అభిమానులకు నిరాశనే మిగిల్చింది.  నేను రాసిన "ప్రేమకు ఆవలి తీరంలో" చలం గారి స్పష్టమైన జీవిత చిత్రం కనిపిస్తుంది.

15.       సాహిత్యంలోకి యువతరం,కొత్త తరం ఎందుకు రాలేకపోతున్నది?

దీనికి ముఖ్యమైన కారణం కుటుంబ వాతావరణమనే చెప్పుకోవాలి. ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలను ఐఐటి, మెడిసిన్ అంటూ ర్యాంకుల కోసం ప్రైవేటు విద్యాసంస్థలపై ఆధారపడి వాళ్ల బాల్యాన్ని బంధించేస్తున్నారు.  అలాచేస్తే పిల్లవానికి సామాజిక స్పృహ ఎలా వస్తుంది. ఇంకా చెప్పాలంటే విపరీతమైన మొబైల్ ఫోన్ల వాడకం. తల్లిదండ్రులే వీటిని అతిగా వాడుతుంటే పిల్లవాడు కూడా వాళ్లనే అనుకరిస్తున్నాడు.ఎప్పుడైతే తల్లిదండ్రులు సాహిత్యం చదువుతుంటారో పిల్లలు కూడా వాళ్లను అనుకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఇవిగాక ప్రస్తుతం తెలుగు భాష అస్థిత్వ పోరాటం జరుగుతుంది. పాఠశాలల్లో తెలుగు మీడియాలే కనబడ్తలేవు.  దీనివల్ల మాతృభాష తెలుగులో పట్టు తప్పుతున్నాడు.  ఈ సమస్యలను గ్రహించి ఇప్పటి కైనా సరైన పరిష్కసరాలను తీసుకుంటె రేపటి సమాజంలోనైనా సాహిత్య ప్రపంచానికి యువతరాన్ని అందించినవాళ్లమవుతాము.   

16.       ప్రస్తుతం ఉన్న తెలుగు సాహిత్యాన్ని మీరెలా చూస్తున్నారు?

సాహిత్యంలో కుల,మతాలకతీతంగా రచనలు చేయాలి. కాని ఇప్పుడలా కనిపించడం లేదు.  గ్రూపులు గ్రూపులుగా విడిపోయి రాస్తున్నారు.  లౌకిక సాహిత్యం లోపిస్తుంది.  ఇది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

17.       మీ యాభై సంవత్సరాల సాహిత్య జీవితంలో నెమరువేసుకునే సంఘటన /రచన/అవార్డు ఏదైనా ఉందా?

 నా జీవితంలో మరపురాని సంఘటన అంటే,నాకు "కాల రేఖలు" నవలకు గాను "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం" వచ్చిందని ప్రకటించినప్పుడు, ఆ పురస్కారంను ఢిల్లీలో అందుకుంటున్నప్పుడు. ఈ అవార్డు ఫంక్షన్ మూడు రోజుల పాటు జరిగింది.  అక్కడ ప్రతీ భాష నుండి ఒక్కరు ఉంటారు.ఆ వాతావరణం ఎంతో బాగా నచ్చింది. అవార్డు తీసుకోబోయే ముందు కొందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తారు.  ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను.  ఇదంతా కూడా నా జీవితంలో ఒక తీయని అనుభూతిగా ఉండిపోయింది.

18.       ప్రస్తుతం కొత్తగా వస్తున్న నవలాకారులకు మీరిచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా?

కొంత మంది చాలా అద్భుతంగా రాస్తుంటే...మరికొందరైతే ఏం రాస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది.వారి రచనలలో శిల్పం కనబడట్లేదు. కవిత్వానికి శిల్పం ఉన్నట్టే నవలకు,కథకు కూడా శిల్పం ఉంటుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రచించిన "నవలా శిల్పం", " కథాశిల్పం" బుక్స్ ని చదివితే శిల్పం ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.

19.       గోదావరి అంతర్జాల మాస పత్రిక ద్వారా పాఠకులు, కవులు,రచయితలు, సాహితీ వేత్తలకు మీరేం చెప్పదలచుకున్నారు?  

 ఇంతకుముందు "గోదావరి త్రైమాసిక పత్రిక" ను నడిపించినట్టు తెలుసు.ఒక పత్రిక ను నడిపిస్తున్నప్పుడు తలెత్తే సమస్యలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు. కొంత విరామం తర్వాత ఇప్పుడు "గోదావరి అంతర్జాల మాస పత్రిక" గా అందరిముందుకు తీసుకొచ్చినందుకు సంపాదక వర్గాన్ని అభినందిస్తున్నాను.

పాఠకులైనా,కవులు,రచయితలెవరైనా వారికి ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే విషయం ...పుస్తకాలు ఎక్కువ చదవాలి.  చదవడంలో ఉన్న ఆనందం దేనిలో దొరకదనే చెప్పొచ్చు.  పఠనం వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. అందుకే ఎక్కువ సాహిత్యాన్ని చదవాలని కోరుతున్నాను.

సాహిత్యం అనేది ఒక అణ్వాస్త్రం లాంటిది – గట్టు రాధిక మోహన్ 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు గట్టు రాధిక మోహన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ సాహిత్య నేపథ్యం గురించి...

నాది ఇంటర్మీడియట్ లో ఎం.పి.సి. గ్రూప్.  సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో...మా కాలేజ్ హాస్టల్లోనే ఉండే నా ఫ్రెండ్ ఒకరు (నేను డే-స్కాలర్ ని) స్టడీ అవర్స్ తో ప్రెషర్ గ ఫీలయినపుడు కొంత రిఫ్రెష్ మెంట్ కోసం కవితలను రాసేది.  రాసినవి ఎవరికో ఒకరికి చదివి వినిపించాలని ఉంటుంది కదా...ఆ ఎవరో ఒకరు నేనయ్యేది.లీజర్ క్లాస్ లలో..తను ముందు రోజు రాసినవన్ని నాకు చదివి వినిపించేది.  అలా...తనవి వింటూ...వింటూ... నేను కూడా చిన్న చిన్నవి మ్యాథ్స్...ఫిజిక్స్...కెమిస్ట్రీ లలోని అప్లికేషన్స్ ని ఫ్రెండ్స్ కి అప్లై చేస్తు రాసేదాన్ని.అవన్నీ ఫ్రెండ్స్ ముందు చదివి వినిపిస్తు కాసేపు నవ్వుకునే వాళ్లం...ఈ విధంగా  రాస్తూ రాస్తూ....ఏదైనా చూసినప్పుడు నా ఫీల్ ని రాయడం అలవాటు చేసుకున్నాను.  ఎప్పుడైతే నా ఫీల్ ని పేపర్ మీద పెట్టినప్పుడు లోలోపలి తెలియని ఏదో పెద్ద బరువు కరిగిపోయినట్టు అనిపించేది. ఇదంతా ఒక రెండేండ్ల వరకే కొనసాగింది.ఆ తర్వాత జాబ్ రావడం... వెంటనే పెండ్లి కావడం వల్ల ఒకవైపు వృత్తి, కుటుంబ బాధ్యతలు ...మరోవైపు  అదనపు విద్యార్హతలను పెంచుకోడానికి చదువుతుండటం వల్ల    (నాకు ఇంటర్మీడియట్ టిటిసి తోనే 19 ఏళ్లకే టీచర్ జాబ్ వచ్చింది.  ఇప్పుడు నా విద్యార్హతలు M.Sc Physics,M.A.Sociology, B.Ed.)

టైం దొరక్కపోయేది కొంతకాలం గ్యాప్ వచ్చింది.  మళ్లీ నేను గర్ల్స్ హైస్కూల్ లో పనిచేస్తున్నప్పుడు ఆ స్కూల్ లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిని నేనే నిర్వహించేదాన్ని.

నేను నిర్వహించే ప్రోగ్రామ్ పిల్లలకు బోర్ గ అనిపించకుండ ఉండటానికి మధ్య మధ్యలో చిన్న చిన్న కవితలను చెప్పుతుండేదాన్ని...

పిల్లలంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గ...అటెన్షన్ గ ఉండేవాళ్ళు...ఆ విధంగ మళ్ళీ మొదలు పెట్టిన కవితలను రాయడం.

2.       మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు

ఒకరోజు పేపర్ లో (2017 మే నెల అనుకుంట) "దొడ్డి కొమురయ్య ఫౌండేషన్" వాళ్లు కవితా సంకలనం కోసం కవితలకు ఆహ్వానం అనే న్యూస్ చదివిన.  వెంటనే వాళ్లు ఇచ్చిన నంబర్ కి నా దగ్గర ఉన్న కవితను వాట్సప్ చేసిన.వాళ్ల నుండి ఒక రిప్లై వచ్చింది...మీ కవితను స్వీకరిస్తున్నామని.  ఆ తర్వాత పోయెట్రీ వాట్సప్ గ్రూప్ లో ఆడ్ చేసారు. (అప్పటి వరకు నాకు పోయెట్రీ మీద గ్రూప్స్ ఉంటాయని తెలియదు).  వాళ్లే అస్నాల శ్రీనివాస్ గారు మరియు బిల్లా మహేందర్ గారు.  ఆ తర్వాత అప్పుడప్పుడు జరిగే సాహిత్య సభల సమాచారం ఇచ్చేవాళ్లు.

అన్నీటికి కాకపోయినా కొన్నీటికైనా టైం ని కుదుర్చుకొని అటెండ్ అయ్యేదాన్ని.  గ్రూపుల్లో వచ్చే కవిత్వాన్ని బాగా చదువుతూ నేను కూడా ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని.

3.       రచనా క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి

నేను 2017 నుండి ఈ సాహిత్యం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టిన.సామాజిక సమస్యలు...

సంఘటనల మీద నా మనసు తీవ్ర వేదనకు గురైనప్పుడు అప్పుడు కలిగే భావోద్వేగాన్నంత పేపర్ మీద పెట్టేదాన్ని...దాన్నే కవిత్వం అనుకునే దాన్ని....తర్వతర్వాత ఇతరుల కవిత్వాన్ని చదవడం అలవాటు చేసుకున్నప్పుడు నా కవిత్వంలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది...ఈ సందిగ్ధ సమయంలోనే నా మొదటి కవిత్వ సంపుటి ఆమె తప్పిపోయింది వచ్చింది.  ఇదొక భావ కవిత్వమనే చెప్పుతాను...ఎందుకంటే శిల్పం గురించి అప్పటి వరకు నాకు తెలియదు.  ఆ తర్వాతే సీనియర్ కవుల చర్చనీయాంశాల ద్వారా తెలుసుకున్నాను.  ఎప్పుడైతే కవిత్వం లోతుపాతుల్ని తెలుసుకున్నానో కవిత్వం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకున్నాను.  రాసినదాన్ని ఒకటికి పదిసార్లు చదువుకుంటాను...చదువుతున్న ప్రతీసారి ఏదో ఒక మార్పు జరిగేది.  ఇక ఏ మార్పు లేదనుకున్నప్పుడు ఒక సీనియర్ కవికి చూపెట్టి అభిప్రాయం తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ విధంగ నా కవిత్వంలో బలాన్ని పెంచుకోగలిగాను.

4.       మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు,రచయితలు, పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.

నాకు సాహిత్యానికి ఒక దారి ఉందని చూపెట్టిన వారు బిళ్ల మహేందర్ గారు,అస్నాల శ్రీనివాస్ గారు...ఇక ఆ దారిలో నేను నడుస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపించిన వారు కవిసంగమం వ్యవస్థాపకులు కవి యాకూబ్ గారు, కవి సాయంత్రం అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ గారు.  నన్ను బాగా ప్రభావితం చేసిన వారయితే విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు, పుప్పాల శ్రీ రామ్ గారు,

నారాయణ శర్మ గారు,దర్బశయనం శ్రీనివాసు గారు.  బుక్స్ విషయానికొస్తే శ్రీ శ్రీ గారి 'మహాప్రస్థానం' , తిలక్ గారి 'అమృతం కురిసిన రాత్రి' , శేషేంద్ర శర్మ గారి 'ఆధునిక మహాభారతం' .  అలాగే తెరసం, అరసం, ప్రరవే సంస్థలు ఎంతో ప్రోత్సహించాయి. 

5.       మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?  

నేను సాహిత్యంలోకి రాకముందు ఈ సాహిత్య ప్రపంచం గురించి నాకు ఏమాత్రం తెలియదు.  ఏదో తోచిన నా భావాలను పేపర్ మీద రాసేదాన్ని.ఎప్పుడైతే ఈ వాతావరణంలోకి ప్రవేశించానో...ఇదొక మహా సముద్రమని,  ఓపికున్నంత వరకు సాహిత్యాన్ని తోడుకుంటు పోవచ్చని అర్థమైంది.  సాహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో అన్నిట్లో ఉన్నట్టు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండవు...చాలా ప్రశాంతంగా ఉంటుందనుకునేదాన్ని.  కానీ లోతులోకి దిగుతున్నా కొద్ది ఇక్కడ కూడా అంతేనని తెలుసుకున్నాను.  సాధ్యమైనంత వరకు నా మీద ఆ ప్రభావం పడకుండా ఉండటానికి జాగ్రత్త పడుతుంటాను.

6.       మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?  

సాహిత్యం నిర్వచనం తెలియని స్టేజీ నుండి మొదలైన నేను ఈ నాలుగేళ్లలోనే దాని గురించి తెలుసుకుంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాననే అనుకుంటున్నాను.

7.       కొత్తగా వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?  

మనం ఒకటి రాస్తున్నాము అంటే చదివే వారికి ఏదో ఒక విషయంలో కొంత సమాచారాన్ని ఇచ్చేలాగనో...ఉపయోగపడేలాగనో...

మార్పు తీసుకొచ్చేలాగనో... ఆలోచించేలాగనో కొంతవరకైనా ఉండాలనుకుంటాను.           

8.       భిన్న సాహిత్య ఉద్యమాలు మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?

ఇప్పటివరకైతే నా మీద ఎలాంటి ప్రభావం పడలేదు.

9.       మిమ్మల్ని ప్రోత్సహించిన సీనియర్ రచయిత ల గురించి,మీరు ప్రోత్సహించిన యువతరం రచయితల గురించి చెప్పండి.

  నా మొదటి కవిత్వ సంపుటి "ఆమె తప్పిపోయింది" బుక్ ని తీసుకొచ్చే సమయంలో అలాగే నా కవిత్వంలో మొదటిసారి మార్పు చోటుచేసుకున్నది లక్ష్మీ నరసయ్య సార్ మాటల ప్రభావం వల్లనే అని చెప్పుతాను.  కవి యాకూబ్ సార్ అయితే నెమ్మదిగా "అమ్మా...కవిత్వం రాయాలమ్మా...ఈ మధ్య రాయట్లేదంటూ" గుర్తు చేస్తుంటారు. కవిత్వంలోని లోతుపాతుల గురించి పుప్పాల శ్రీ రామ్ సార్...నారాయణ శర్మ సార్, దర్బశయనం సార్ చాలా బాగా చెప్పుతుంటారు. అఫ్సర్ సార్, నారాయణ స్వామి వెంకటయోగి సార్ , సివి సురేష్ సార్ మంచి ప్రోత్సాహ బలాన్ని అందిస్తుంటారు.

తమ్ముడు బండారి రాజ్ కుమార్, వడ్లకొండ దయాకర్ అన్న, కంచెర్ల శ్రీనివాస్ అన్న మంచి మంచి సూచనలు,  సలహాలు ఇస్తుంటారు.  వీళ్లంత ప్రభావం వల్లనే తక్కువ సమయంలో కవిత్వంలో ముందుకెళ్లానని చెప్పగలను.నాపై ఉన్న ఇంతమంచి ప్రభావాన్ని...అనుభవాలను తెలియని మరో నలుగురికి చెప్పాలనుకుంటాను. ఆ ఉద్దేశంతోనే కొత్తగా రాస్తున్న వాళ్లు ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు సాహిత్యం పట్ల ఎలాంటి విలువలను, ఉద్దేశాలను కల్గియుండాలి...ఎలా నడుచుకోవాలో చెప్పుతాను.  నేను చెప్పిన చాలా మంది కూడా అదే విధంగా ముందుకుపోతున్నారు.

వాళ్లనలా చూసినప్పుడు నాకు చాలా సంతోషం కల్గుతది. సాహిత్య వారధులను పెంచుకోవడం చాలా అవసరం... ఇంకా చెప్పాలంటే మన తెలుగు సాహిత్యానికి చాలా చాలా అవసరం.

10.     సాహిత్యం ద్వారా సమాజానికి మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి?

సాహిత్య మనేది సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలి.  ప్రజల ఆరాటాలను తెలియజేసేదిగా ఉండాలనేది నా అభిప్రాయం.

11.      సాహిత్యం సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు?

సాహిత్యం అనేది ఒక అణ్వాస్త్రం లాంటిది.

ఎన్నో రాజ్యాలను కూల్చేసిన ఘనత ఈ సాహిత్యానికుంది.  ఉదాహరణకు ...ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రజల ఆరాటం... పోరాటం అయిన తెలంగాణ రాష్ట్ర సాధనలో సాహిత్యం ప్రధాన పాత్ర పోషించడం వల్లనే రాష్ట్ర ఆవిర్భావం జరిగిందనే నిజం అందరికీ తెలిసిన విషయం.

12.      కథ,కవిత, నవల, నాటకం, విమర్శ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏమిటి?   ఇతర ప్రక్రియల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

నాకు అవన్నీ ఇష్టమే...సాహిత్యం లోని అన్ని భాగాల రుచిని ఆస్వాదించాలనుకుంటాను.

ఇప్పటివరకు నేను ఒక కవిత్వమే కాకుండ సాహిత్యంలోని చాలా ప్రక్రియలలో అడుగుపెట్టాను.  అందులో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాను.     అవేంటో చెప్పాలంటే...

కవిత్వం రాయడంతో పాటు కవిత్వం మీద సమీక్షలను, కథలను...కథల పుస్తకాలు, నవలల మీద వ్యాసాలను రాస్తున్నాను.

అలాగే లిరిక్స్ రాస్తున్నాను.ఇప్పటి వరకు ఒక అరవై వరకు లిరిక్స్ రాసుకొని పెట్టుకున్నాను.

ఒక రెండు ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డ్ అయ్యి బయటకొచ్చి చాలా మందికి రీచయినవి.ఇంకా మరో నాలుగు ఒక పేరొందిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రికార్డు అవుతున్నాయి.ఇవే కాకుండా... ఈ మధ్యనే నేను 'తెలంగాణ గవర్నమెంట్ మరియు ఫర్ ఎవర్ ఫంటాస్టిక్ థియేటర్' వారి ఆధ్వర్యంలో జరిగిన "స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రైటింగ్‌" కోర్సును కంప్లీట్ చేశాను. నాకు ఒక సినిమాకు,  ఒక షార్ట్ ఫిల్మ్ కి స్క్రీన్ ప్లే రాసే అవకాశం కూడా వచ్చింది.ఇప్పుడు అదే పనిలో ఉన్నాను.  నేను దాదాపు అన్నీ సృశిస్తున్నానని గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ...ఇష్టముంటే....దాన్ని ప్రేమిస్తే...

ఎంత హార్డ్ వర్క్ అయినా సులువుగా చేయొచ్చనుకుంటాను.

13.      మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పండి...

ఓల్గా గారివి,చలం గారివి, కేశవరెడ్డి గారివి బాగా నచ్చుతాయి. 'పోస్ట్ చెయ్యని ఉత్తరం' మహాత్రయ గారిది చదువుతున్నప్పుడు జీవితంతో ముచ్చట పెట్టినట్టు...

అనుభవాలను గుర్తుచేసుకుంటున్నట్టుగ అనిపిస్తుంది.  ఓల్గా గారి రచనలైతే ఇప్పటి పరిస్థితులకు కూడా వర్తిస్తున్నాయి.  గుంటూరు శేషేంద్ర శర్మ గారి 'ఆధునిక మహాభారతం' చాలా అద్భుతమైన కవిత్వం చాలా ఇష్టపడతాను.అలిశెట్టి గారి కవిత్వం అదొక అక్షర సంపదగా అనిపిస్తది.  అక్షరాల అమరికలోని నైపుణ్యం...ఆ పదాలతో ఏర్పడే లోతైన అర్థాన్ని చూస్తే ‍ ఆశ్చర్యమనిపిస్తది.

14.      మిమ్మల్ని కలవరపెడుతున్న ఆలోచింప చేస్తున్న సామాజిక పరిణామాలు ఏవైనా తెలపండి...

 నన్ను కలవరపెట్టేవి మొదటిది రైతు విషయం... ఆ తర్వాత ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాల విషయం.  రైతు గురించి చెప్పాలంటే...రైతు లేని రాజ్యం...సూర్యుడు లేని ఆకాశం లాంటిదవుతుంది.  రాజుగా బ్రతకాల్సిన రైతు ఆకలి కడుపును పట్టుకొని రోడ్డెక్కుతున్నాడంటే అది ప్రతీ ఒక్కరి అవమానంగా భావించాలి.  అన్ని పదవులకు రాజీనామా ఉన్నట్టే రైతు కూడా తన రైతు పదవికి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి...!?

ఇక మరో విషయానికొస్తే ...అమలు గాని చట్టాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నంత కాలం ఆడవాళ్ల మీద జరిగే అరాచకాలు కొత్తకొత్త పద్దతుల్లో పుట్టుకొస్తూనే ఉంటాయి.

సాహిత్య వ్యాసలు

వస్తు వైవిధ్యమున్న కవిత్వం 

రూపాయి బిళ్ళ కు బొమ్మ బొరుసు రెండు ముఖాలు ఉంటేనే విలువుంటుంది...కానీ మనిషికి మాత్రం అంతర్భహిర్ముఖాలు ఒక్కటైనప్పుడే విలువుంటుంది. ఏదీ కూడా ద్వంద్వంగా ఉండకూడదు. అదే మాటంటారు శ్రీరామ్ తన అద్వంద్వం కవితా సంపుటిలో. దీంట్లో 38 కవితలు మొత్తం కూడా చదువుతున్నంత సేపు పదాల పొందిక వల్లనో లేక అందులోని శిల్పం వల్లనో లేక భావం వల్లనో గని మనసును ...చూపును కట్టిపడేసి ఏకబిగిగా చదివిస్తాయి. ఏ కవైనా రైతు మీద, శ్రామికుడి మీద కవిత్వం రాయకుండా ఉండలేడు. ఆ రాసే విధానం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది.కొందరి కవిత్వంలోని పదాల వినియోగం మాత్రం మరిచిపోనీయ్యకుండా చేస్తాయి. ఆ కోవకు చెందినదే నాసిక్ - ముంబై కవిత. ఇందులో రైతు గురించి చెప్పుతూ

కలల సాగుబడి పురాతన దేహాన్ని వెన్నుముకకి వేడుకగా తగిలించుకుని పొలం కాళ్ళు నగరానికొచ్చాయి అంటారు. తన ప్రపంచమే వ్యవసాయంగా చస్తూ బతుకుతున్న రైతు పొలాన్నిడిచి,ఊరునిడిచి నగరానికి పాదయాత్ర చేయడమంటే తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికే తప్ప...స్వలాభం ఏమీ ఉండదు. ఈ కవిత చదివితే చాలదా రైతు మౌనభాషని అర్థం చేసుకోవడానికి అనిపిస్తది.

 

కవి విప్లవాన్ని ప్రేమించే చూపులోని దిగులు ఆకాశాన్ని మన గుండెలో బంధించాలనుకుంటారు.

ఏమవనీ బంధాన్ని తన అక్షరాలతో కవితగా ఏర్పరచుకుంటారు.అందుకే ఆ గిరిజనుడికి నేనేమవుతాను ? అని ప్రశ్నిస్తూనే... చెప్పుల్లేక పోయినా ముల్లు గుచ్చుకోని పాదాలకీ... పుల్లటి చింతకొమ్మకి వేలాడే తియ్యటి తేనెగూడుకీ,నాకూ ఏ లోతైన ఒకే గాయమైనప్పుడు స్రవించిన రక్త సంబంధముంది? అని శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని... ఆ గిరిజనుడి బాధను తడిగా ఉండే తన హృదయంలో సంబంధాన్ని కలుపుకుంటారు.

 

నీళ్ళ కోసం నువ్వెప్పుడూ యుద్దాలు చేయలేవు...నీళ్లే యుద్ద నౌకలకి దారి చూపే చూపుడు వేళ్లు అని  యుద్ధనౌక కవితలో అంటారు. ఈ వాక్యాలలో ఎంత అర్థముందో కదా...దేశంలోపల,దేశాల మధ్య జరుతున్న నీటి యుద్దాలకి అంతమనేది లేకుండా పోతుంది. కానీ ఆ నీరే యుద్దనౌకలకి దారి చూపెడుతాయని సలసలా కాగుతున్న ఆకాశాలపై తన గొంతును గట్టిగా వినిపిస్తారు. ఈ కవితకి 5000 రూపాయల నాటా పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

 

అదే విధంగా దుఃఖ నది లో గంగానది కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో ఎండగడుతూ... *ఆ నది దేవ ప్రయాగ నుండి నా ఇంటి పంచపాత్రలోకి దూరి

దేవుడి ముందు ఒత్తిలేని దీపంలా వెలిగేది...ఇప్పుడు నది దుఃఖం నదిది మాత్రమే కాదు నీలో నాలో ఎండిన మోళ్ళది కుండపోతగా కురవని వానది*

అంటారు.  నదులను మన దేశంలో పూజించినంతగా ఎక్కడా పూజించరు.పవిత్రమైన జీవనదిగా పేరు తెచ్చుకున్న మన గంగానది ఇప్పుడు తన ఆనవాళ్లను మరిచిపోయేలా అర్థాన్ని మార్చుకొని కుప్పలు కుప్పలుగా పడివున్న శవాల అస్థికలకు కేరాఫ్ గా కనబడుతుందంటారు కవి.

 

*ఇప్పుడో సారన్నా గుళ్లో దేవుణ్ణి

తాకితే బావుణ్ణు..ఇప్పటికైనా వెట్టి వాడొకడు రాజైతే బావుణ్ణు* అని తన మనసులోని కోరికను అట్రాసిటి కవితలో బయటపెడుతారు.ఎందుకంటే ఏడు దశాబ్దాల వయసున్న స్వాతంత్ర్య భారతంలో ఓ దిక్కు నిర్మించుకున్న నిబంధనలు నీరుగారిపోతుంటే...

రాసుకున్న ఆశయ తీర్మానాలు తీరుమారిపోతున్నాయి. సమానత్వం అనేది అబద్దంగా, తీరని కోరికగా  మిగిలిపోయిందన్న విషయం ఈ కవితలో అర్ధమవుతుంది. మహిళలపై కొనసాగుతున్న కామాలు లేని కామారాచకాలను రోజూ ఎన్నో చూస్తూనే ఉన్నాము.

చట్టాలు,శిక్షలు నామమాత్రమై పోతుంటే భరితెగించే మృగాళ్ల జాతి పెరుగుతూనే ఉంది. *దేహానికి దేశంతో పనిలేదు...నిర్భంధ కూలితనంతోనో,

గతిలేని ఆలితనంతోనో బానిస రాగం తీస్తుంది.అవయవాల్నొక్కొక్కటి తెంపుకుంటున్నప్పుడు కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చి రోదిస్తుంది. అంటూ అమ్మాయిల అక్రమ రవాణాను, ఏళ్ళనాటి బానిసత్వంను, దేహంపై అరాచకాలను *ఇదం శరీరం లో వినిపిస్తారు.దేహాలతో వ్యాపారం చేయడం...దేహాలపై మోహాలను పెంచుకోవడం ...శృతిమించిపోతుంటే మానవ మనుగడనేది రేపటికొక ప్రశ్నగా నిలబడి చూస్తుంటదనుకోవచ్చు.

 

ప్రస్తుత రాజకీయాలను...ప్రభుత్వాల ఏర్పాటు చూస్తుంటే VIBGYOR లో ఇంకో కొత్త రంగు కలిసిందేమోనని ఆలోచించాల్సిన తరుణమిది. ప్రజాస్వామ్యం అర్థాన్ని చెరిపేసి ఇప్పుడు సరిపోయే కొత్త అర్థాన్ని చేరిస్తేనె బాగుంటుందేమో ఓసారి ఆలోచించాలి.ఎందుకంటే కొన్ని ఎప్పటికీ మారవూ...మారుతుందన్న నమ్మకమూ కలుగదు.మీరే చూడండి...

*ప్లేటుకింతని పెట్టే ఘనమైన పెళ్ళి భోజనానికి పందులన్నీ బుద్దిగా క్యూలో నిలబడాలి,ఎడం చేతి చూపుడు వేళ్ళ

నుదుటి ఆకాశమ్మీద మళ్ళీ ఇంకోసారి నల్లటి మచ్చల్ని పొడిపించుకోవాలి.*

అంటూ మారని వాస్తవాన్ని తూటాను చేసి పేల్చినట్టు చెప్పినారు.

 

  ఇలా చెప్పుకుంటు పోతే ప్రతీ కవిత కూడా అందంగా చెక్కబడిన శిల్పంలా కనిపిస్తుంది.పదాల ప్రయోగాలను చూస్తే రసం మామిడి పండ్లలా ఉన్నాయి.కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను.గేదె పొదుగు నుండి అప్పుడే పిండిన చిక్కని పచ్చి పాలలాంటిది శ్రీ రామ్ గారి కవిత్వం.కానీ ఆ పాలకు కొన్ని నీళ్ళను కలిపినప్పుడే దానికి చక్కని రుచి చేరుతుంది. తాగిన వాళ్లందరికీ సులభంగా అరుగుతుంది.ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికైనా కొంత రాగి కలిపితేనే దాన్ని వాడుకలోకి తీసుకురాగలము. ఇప్పుడొచ్చే కవిత్వం అంతా కూడా వ్యవహారిక భాషలో... మాండలికం లలోనే వస్తున్నాయి.అవే అందరికీ దగ్గరవుతున్నాయి...కనుక శ్రీరామ్ గారి కవిత్వ భాషను వ్యవహారికంలోకి మారిస్తే కొత్త తరానికి ఎంతో ఉపయోగ పడుతుందనుకుంటున్నాను. ఎందుకంటే తన కవిత్వం అంతా కూడా సామాజికత్వంను నింపుకున్నది.

సమాజ పక్షాన నిలబడి చెప్పే కవిని ఎప్పుడూ కూడా సామాజిక వైద్యుడుగానే పరిగణించాలి.

మన పుప్పాల శ్రీ రామ్ గారు వృత్తి రీత్యా బ్యాంకు మేనేజర్ అయినప్పటికీ,  ప్రవృత్తి రీత్యా మాత్రం ....అతనిలోని వామపక్ష దృక్పథం తన కవిత్వంపై కనబడుతూనే ఉంటుంది.సమస్యలను నిక్కచ్చిగా చెప్పుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే తత్వంగల సాహిత్యకారుడు.

 

మీరెక్కువ ఎవరిని ప్రేమిస్తారని ప్రశ్నిస్తే కవులను చదవడాన్ని ప్రేమిస్తున్నానని తడుముకోకుండా చెప్పేస్తారు.అందుకే కావొచ్చు కవులను అలవోకగా చదువుతూ వాళ్ల వాళ్ల అంతర్ముఖాలను నవ్వుతూ సొంతం చేసుకుంటున్నారు.అద్దం కొన్ని రోజుల తర్వాత మరకల వల్ల ఖచ్చితమైన ప్రతిబింబాన్ని ఇవ్వకపోవచ్చు.కానీ తను మాత్రం ఏ మరకను తన హృదయానికి అంటనీయకుండ నిఖార్సైన కవిత్వ ప్రతిబింబాన్ని విమర్శ రూపంలో చూపెడుతున్నారు. ఎన్నేసి లోకాలు తిరిగి,ఎంతెంతమందినో కలిసి, మన బతుకు మూలాల్ని కవిత్వం సజీవంగా తడుముకోనిస్తుంది.నవ్వుల్ని,

ఏడుపుల్ని,ఎండల్ని,వెన్నెలల్ని,క్షతగాత్రుల్ని,ప్రేమికుల్ని,పోరాట యోధుల్ని,కవిత్వమే పరిచయం చేసి నన్ను నేను కాకుండా చేస్తుంది" అని అంటారు.దానికి నిదర్శణగా అద్వంద్వం ను హత్తుకుంటున్న పురస్కారాలను చూస్తే అర్థమైపోతుంది.ఇప్పటి వరకు వచ్చిన పురస్కారాలను చెప్పుకుంటే... వచన కవిత్వానికి ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి శెట్టి రాధేయ పురస్కారం , పెన్నా రచయితల సంఘం పురస్కారం ,కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య వారి కళ్లె శేషశయనం స్మారక సాహితీ రత్న జాతీయ పురస్కారం , రంగినేని యెల్లమ్మ సాహిత్య పురస్కారం ఖమ్మం మొవ్వా రంగయ్య ఫౌండేషన్ వారి నవస్వరాంజలి* అతన్ని వరించాయి.

 

స్కూలులో చదువుతున్నప్పటి నుండే కవిత్వం రాయడం మొదలుపెట్టానని చెప్పారు. కానీ బుక్ తేవడానికి చాలా ఆలస్యమే జరిగింది. కానీ రెండవ బుక్ విషయంలో మాత్రం ఇలాంటి... ఎలాంటి ఆలస్యం చేయకుండ తీయాలని ఖచ్చితంగానే చెప్పుతున్నాను. విమర్శని, కవితనీ రెండూ కూడా బ్యాలన్స్ చేయాలనే కోరుకుంటున్నాను.

 అతనే...తీగలచింత
 

 అతనొక Arrow Mark.ఎటువైపు వెళ్లాలో ...ఎలా వెళ్లాలో తెలియని పసితనపు కవిత్వానికి దారిలో నిలువెత్తు పచ్చని చెట్టులా నిలబడి ప్రేమతో వేలు పట్టుకొని,చిరునవ్వును ఒలికిస్తూ దారి చూపుతుంటాడు. కనబడే...వెంటబడె...చింతలన్నీటికి అక్షరాన్ని తొడిగి కవిత్వాన్ని తీగలు తీగలుగా పారిస్తుంటాడు.తీగలచింతగా మారిపోతుంటాడు. ఇంతకీ ఆ తీగలచింతను మోసే మొదలు ఎవరనుకుంటున్నారు...? "పచ్చని చెట్టుగా నువ్వు మారితే...పిట్టలు వాటంతటవే వచ్చి వాలుతాయంటూ  కవుల సముద్రాన్ని ఊరూరికీ మోసుకెళ్లే అలుపులేని ఆత్మీయకవి మన కవి యాకూబ్ గారు.  కవిత్వాన్ని ఎంతగనం  ప్రేమిస్తాడో తన పేరు ముందు నిలబడ్డ "కవి" ని చూస్తె అర్థమవుతుంది. ఒక కవికి సునిషిత సూక్ష్మ పరిశీలన ఉన్నప్పుడే రాయాల్సిన వస్తువులోకి పరకాయ ప్రవేశం చేసి దానిమీద కవిత్వం రాయగలుగుతాడు. తీగలచింత కవిత్వంలో కూడా అవే కనబడుతుంటాయి. ఊరు, చెట్టు, వర్షం, బతుకు, నిజం, పుస్తకం...ఇలా చెప్పుకుంటు పోతే అదొక ఒడవని తొవ్వలా కనబడుతుంది.తొవ్వ పొడుగూత తీగలుబారిన చింతలే కనబడ్తాయి.  ముందుమాటలో నరేష్కుమార్ సూఫీ "అతనిప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు,ఒక జీవితపు ఒడ్డున కూర్చుని బతుకు ప్రవాహంలో కాళ్లనాడిస్తూ మాట్లాడే చెట్టులా..." అని చెప్పుతారు.ఈ వాక్యాలు వందపాళ్లు నిజము...అతనొక మాట్లాడే చెట్టునే.ఎందుకంటే ఒక విత్తు మొక్కగా మొలిచింది మొదలు చెట్టుగా పరిణామం చెందేవరకు కాలంతో పోరాడాల్సిందే...ఆ పోరాటంలో ఎన్ని గాయాలుంటయో...ఎన్ని అనుభవాలను సొంతం చేసుకుంటుందో ఆ చెట్టు పరుచుకున్న నీడనే చూపిస్తుంది.కవి యాకూబ్ గారి తడి మనసును చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ఇక తీగలచింత లోకి ప్రవేశిస్తే....."బతకడం అవసరం" అంటారు. ఎలా బతకాలో కూడా చెప్పుతారు.

  "సూర్యుడు చంద్రుడు మళ్ళీ మళ్ళీ

   వంతులేసుకొని వచ్చిపోతుంటారు

   రికామీ లేకుండా...

   అలా వంతులేసుకొని బతకడానికి

   ఇంకెవరూ ఉండరు

   ఎవరికి వాళ్లే బతకాలి

   ఇష్టంగా ఉన్నట్లు బతకాలి."

ఒడిదుడుకులు లేని జీవితమే ఉండదు.ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతు ఎవరి బతుకును వాళ్లు బతికితే ఎలాంటి మానసిక రోగాలు దరిచేరవనే చెప్పొచ్చు.

మరో సందర్భంలో "తెల్వద్" కవితలో

అదే బతుకు గురించి ఇలా అంటారు...

    "ఇంకా ఎక్కడిదాక? ఎప్పటిదాకా?

     తెల్వద్!

     జీవితం పరాయిదయ్యింది,

     మనిషి తనకుతానే కాందీశీకుడు

     కాలం ఇప్పుడొక ప్రశ్నల అవశేషం

     ఈ శరణార్ధుల శిబిరంలాంటి కాలంలో

     బతుకు ఈడవాల్సిందే!"

    "తెల్వద్" అనే పద ప్రయోగంతోనే తెలుస్తుంది.ఎంత ఖచ్చితంగా జీవితం పరాయిదయ్యిందోనని.తెలంగాణలో చాలా పౌరుషంగా,కచ్చితత్వంగా కొలవబడే పదం ఇది.  స్వార్థంనే ఎజెండాగా మార్చుకొన్న మనిషి జీవితంలో ఒకరికి ఒకరుగా కాకుండా.. ఒకరికొకరు అపరిచితులుగా, అంతకుమించి శత్రువులుగా మారిపోతు భద్రత కరువైన మొఖాలేసుకొని తనకుతానే కాందీశీకుడుగా మారిపోతున్నాడు.  అందుకే మరో సందర్భంలో ...

   "ఎంత వెతికినా నాకు నేనే దొరకని

    ఒక వింత సందిగ్ధంలో

    ఇంకేదో ఉండాలి ఇక్కడ అనుకుంటూ

    ఎప్పట్నుంచో వెతుకుతూనే ఉన్నాను."

అని "Missing Something" కవితలో అంటారు. నిజానికి ప్రతీ ఒక్కరు కూడా రుచితప్పిన ఈ సమాజంలో ఏది మిస్సైపోయిందో  వెతకాల్సిందే మరి.

కొన్ని జ్ఞాపకాలు మబ్బులను తొడుక్కున్నప్పుడు ఎట్ల కురుస్తాయో "ప్రాగ్మెంట్స్" కవితలో చెప్పుతారు...

   "కొన్ని చినుకులు అప్పుడప్పుడు

    చెంపలపై కూడా కురుస్తాయి...

    అప్పటి ఇల్లు గుర్తొచ్చింది!

    ఇల్లే అనుకుంటాం,గోడలే అనుకుంటాం

    కానీ ఎన్నెన్నో,ఇంకా ఏవేవో

    ఉంటాయి!"

ఇక్కడ ఎన్నెన్నో, ఇంకా ఏవేవో అంటే...ఇల్లంటే గోడలు, గోడలకేసిన రంగులనుకుంటే పొరపాటే అవుతుంది మరి.ఆ ఇంటి గోడల్లో పేర్చుకున్న ఇటుకల క్రమంలానే అల్లుకున్న అనుబంధాలు, ఆప్యాయతలు,ఇంటి ఆవరణలోని చెట్లు,వాటితో ఆడిన ముచ్చట్లు, దోస్తులు, బాల్యం... ఇవన్నీ గుర్తుకొస్తే ఎవరి చెంపలపైనైనా చినుకులు కురవాల్సిందే కదా!

కాలాలు వాటికవి అలారం పెట్టుకొని నిద్రలేచినప్పుడే ప్రకృతి సమతుల్యంగా చిగురిస్తుంది. ముందుగా చిగురించాలంటే విత్తు మొలకెత్తాలి.మరి మొలక రావాలంటే...అందరికీ అర్థం అయ్యే ఉంటుంది వర్షం తప్పనిసరని.వర్షాన్ని "మార్పు" గా చేసి ఎలా కురిపించారో చూడండి....

     "వర్షం.వర్షం

      ఆకాశంలో తప్పిపోయి

      భూమ్మీద పరుగులు పెడుతున్న

      చినుకులు

      పగలంతా కాగి కాలి

      గాయంగా మారిన రాత్రిలో

      లేపనమై కరుగుతున్న వర్షం." అంటారు.

 మరో కవిత "తడి గురించి"  చెప్పుతూ....

"వర్షం కురిసినందుకు

 మొక్క కృతజ్ఞతగా లేచి నిలబడుతుంది

 కొమ్మలు కొన్ని చినుకుల్ని తమకోసం

 వచ్చే పిల్లల కోసం దాచుకుంటాయి."  అంటారు. ఈ కవితా వాక్యాలను చదివినప్పుడు "గుంటూరు శేషేంద్ర శర్మ" గారి యొక్క "ఆధునిక మహాభారతం" లోని వాక్యాలు గుర్తుకొస్తాయి.అవి

   "భూమిలో ఉన్న చిన్నారి గింజ

    మెడ బయట పెట్టి

    మొదట వచ్చిన రెండాకుల్ని

    చేతులుగా జోడించింది కృతజ్ఞతతో.."

ఉపాధి కరువై పల్లెలు ఖాళీ అవుతుంటే నగరాలేమో వలస కాళ్ళతో జాతరగా మారిపోతున్నాయి.  గజిబిజి లోకంగా మారిన నగరాన్ని చూసి "ట్రాష్" కవితలో..

    "ఎంతకీ అర్థం కాని పదబంధంలా

     నగరం...

     మాడుచెక్కల్లాంటి మాటలు

     సబ్సిడీల సరసమైన మాటలు

     పగిలిన పైపులైన్ లాంటి మాటలు

     వాడిన పూరేకుల లాంటి మాటలు"

బతుకు పోరాట క్షేత్రంగా మారిన ఈ నగరాలలో సమయాన్ని క్యాష్ చేసుకోవడమే ధ్యేయంగా మారడం వల్ల మాటలన్నీ కృత్రిమరంగులతో మెరిసిపోతుంటాయి.

భారతమాతకు కిరీటంగా ఉన్న కాశ్మీర్ ను చూస్తే స్వర్గం అంటూ ఒకటుంటే ఇలా ఉంటుందేమోననుకుంటారు. దీన్ని భూతల స్వర్గంగా కూడా పిలుచుకుంటాము.  కానీ ఈ స్వర్గంలోని జీవితాలు నెత్తురు మంచుని కప్పుకున్న నరకాన్ని ఎలా అనుభవిస్తున్నారో "కాశ్మీరం" కవితలో చెప్పుతారు...

  "బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు నవ్వడమే

  మరిచిపోతారు...

  శవమై ఇంటికి వచ్చే కొడుకు

  చిరిగిన దుస్తులతో జీవచ్ఛవమై మిగిలే

  కూతురు

  బుల్లెట్ల దెబ్బకు గుడ్డి వాళ్ళయిన పిల్లలు

  కలల్లో విహరిస్తుంటారు." 

మనిషి మనిషికి ఉండాల్సిన లక్షణాలను రోజురోజుకు కోల్పోతున్నాడు.స్వార్థం, మోహం,డబ్బు, అధికారం లాంటి దాహాలతో గొంతును తడి చేసుకోడానికి క్రూరమృగ లక్షణాలను అలవర్చుకుంటున్నాడు.  మనిషితత్వంనే మరిచిపోతున్నాడు.  ‍అందుకే "మనుషులు కావాలిప్పుడు!" అనే కవితలో ఇలా చెప్పుతుంటారు....

 

  " నువ్వొక వీసాగా,నువ్వొక ఓటుగా,

    నువ్వొక ముడిసరుకుగా

    మారిపోయాక...

    నువ్వొక యంత్రంగా, నోరు మెదపని

    తలవూపేవాడిగా, అంతకుమించి

    అసలేమీకానీ ఒక ప్రాణం లేని

    విగ్రహంగా రూపొందాక

    మొద్దుబారిన నీ మెదడులో పెను

    విస్ఫోటనం సృష్టించే మనుషులు

    కావాలిప్పుడు" అని...

ఇవే గాకుండా కథువా ఘటన,ఆసిఫాపై అత్యాచారం,గౌరీలంకేశ్ హత్య,శివారెడ్డి గారి కవిత్వంపై,ఎన్నార్సీ,మైకెల్ జాక్సన్,ఊరు డైరీ,చరిత్రలన్నీ అవే అనే దీర్ఘ కవిత....ప్రతీ దానిలో తన ఆలోచనలను, చింతలను  చూపించారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో కవిత్వం ఎలా ఉండాల్నో విన్నపం కూడా చేసారు ఇలా...

  "కాకలు తేరిన కవులు మెట్టుదిగి

   మెరుపుల్లా మెరిసే కవితా వాక్యాల్ని

   గుర్తుపట్టి మెచ్చుకోవడమే....

   హత్తుకోవడమే తక్షణ అవసరం."

కవిత్వం వర్థిల్లాలన్నా...మంచి కవిత్వం రావాలన్నా....కొత్త తరాన్ని సీనియర్ కవులు భుజం తట్టి ముందుకు నడిపించాలి.అప్పుడే రెడీమేడ్ కవులు, చాక్లెట్ కవులు లేకుండా పోతారు. అలాగే మరో సందర్భంలో "కవి నిర్మాణం" ఎలా ఉండాలో కూడా సూచిస్తారు... 

"కవిత్వం అతడి ప్రాణ వాయువు

  గాయాల్ని మటుమాయం చేసే ఔషధం

  ఒంటరిగా కన్పించే ఒక సమూహం

  అతడు...

  అతడి చేతిలో కవిత్వం రెపరెప

  లాడినంత కాలం అతడు జెండాలా

  నిత్యం ఎగురుతూనే ఉంటాడు."

అక్షరాన్ని..కవిత్వాన్ని ప్రేమించే కవి ఎప్పుడూ చరిత్రలో ఇలాగే ఉంటాడు కదా....

ఈ విధంగా  "తీగలచింత" లో ఉన్న మొత్తం 77 కవితలు కూడా ఏదో ఒక చింతను కలిగిస్తు...కరిగిస్తూనే ఉంటుంది.ఈ కవిత్వం అంతా కూడా ఎలాంటి సంక్లిష్టత లేకుండా సరళతను చోటుచేసుకోవడం వల్ల పాఠకున్ని ఏకబిగిగా చదివించేస్తుంది.సామాజిక పరమైన కవిత్వాన్ని ఎవరైనా ఇష్టపడతారు. ఈ పుస్తకమంతా కూడా సామాజికతనే పరుచుకుంది.

 

  కవి యాకూబ్ గారివి ఇంతకుముందు వచ్చిన కవిత్వాన్ని గమనిస్తే...

1992 లో వచ్చిన "ప్రవహించే జ్ఞాపకం" ఇది 1997 లో రెండవ ముద్రణ కూడా వచ్చింది.2000 లో "Arc of Unrest" (కవిత్వ ఆంగ్లానువాదాలు),2002 లో సరిహద్దు రేఖ", 2010 లో  "ఎడతెగని ప్రయాణం", 2014 లో "నదీమూలంలాంటి ఆ ఇల్లు."

వారి సాహిత్య కృషిని మెచ్చి వచ్చిన అవార్డులు... పురస్కారాలు చెప్పుకుంటు పోతే అది ఒక ఒడవని ముచ్చటగనే అనిపిస్తది.అట్లా అని చెప్పుకోకుండ ఉండలేము కదా!మీరే చూడండి...అవి

1.       ఎస్ వి టి దీక్షితులు అవార్డు - యలమంచిలి

2.       సి.నారాయణ రెడ్డి కవితా పురస్కారం -కరీంనగర్

3.       ఉమ్మిదిశెట్టి కవితా అవార్డు -అనంతపురం

4.       ఫ్ర్రేవర్స్ ఫ్రంట్ అవార్డు - హైదరాబాద్

5.       నూతలపాటి గంగాధరం అవార్డు -తిరుపతి

6.        కళాభారతి అవార్డు -తిరుపతి

7.       తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం -హైదరాబాద్

8.       తెలుగు యూనివర్సిటీ  ఉత్తమ కవితాసంకలనం అవార్డు -హైదరాబాద్

9.        మాణిక్యం కవితా అవార్డు -ఖమ్మం

10.      ఆలూరి బైరాగి కవిత్వ అవార్డు - విజయవాడ

11.      ఇస్మాయిల్ కవిత్వ అవార్డు -కాకినాడ

12.      కే సి గుప్తా అవార్డు -హైదరాబాద్

13.      రంజని కుందుర్తి అవార్డు -హైదరాబాద్

14.      జస్నే ఎ తెలంగాణ -ద ఉర్దూ రైటర్స్ ఫోరం అవార్డు -హైదరాబాద్

15.      ఖమ్మం జిల్లా కవిగా తానా సత్కారం .

16.      రావెళ్ళ వెంకటరామారావు పురస్కారం

ఇవే గాకుండా ఎన్నో ఆత్మీయ ఆహ్వానాలు,సన్మానాలనూ పొందినారు.

 వృత్తి రీత్యా తెలుగు అధ్యాపక వృత్తిని నిర్వర్తిస్తూనే...సమయాన్ని పొదుపుగా వాడుకుంటూ కవిత్వంతో పాటు అనేక సాహిత్య వ్యాసాలు, విమర్శలు,ముందుమాటలను రాసారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం కూడా వహించారు.సాహిత్య విమర్శపై పుస్తకాలు కూడా వెలువడ్డాయి.

 ఇదంతా చెప్పుకోవడం ఒకెత్తు అయితే...అంతకన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మరోటి ఉంది.ఇతనికి కవిత్వం రాయడం కన్నా...కవులను తయారు చేయడంలోనే గొప్ప ఆనందాన్ని పొందుతారు.వాళ్లే తన ఆస్తిగా భావిస్తారు. ముందుమాటలో లక్ష్మీ నర్సయ్య సార్ చెప్పినట్లు పెద్ద పెద్ద సాహిత్య సంఘాలు చేయలేని పనిని "కవిసంగమం" గ్రూపు ద్వారా కవి యాకూబ్ గారు చేస్తున్నారు. ఈ గ్రూపు దాదాపు పన్నెండు వేల మంది కవులు,

సాహిత్యాభిమానులతో ఫేస్‌బుక్ ప్రపంచాన్ని ఏలుతుంది."తీగలచింత" లోని 'ఇప్పుడు తెరిచి చూడండి' , 'ఎజెండా', 'విన్నపం' కవితలు "కవిసంగమం" లక్ష్యాలను, ఉద్దేశాలను స్పష్టంగా చూపిస్తాయి.  రోజుకో శీర్షికా వ్యాసంను కవులకు పరిచయం చేయడమే కాకుండా... కొన్ని వందల మంది కవులు తమ కవిత్వాన్ని రాస్తూ చక్కని ప్రోత్సాహాన్ని సొంతం చేసుకుంటున్నారు.  అంతేకాకుండా "మూడు తరాల కవిత్వం" ఎజెండాను పట్టుకొని నగరం నడిబొడ్డు నుండి యూటర్న్ లు తీసుకుంటూ ఊరూరా తిరుగుతుంది.ఇంతటితో ఆగిపోకుండా...

స్వగ్రామం రొట్టమాకురేవులో 'Rottamaku Revu Library & Poetryspace[RRLP]' స్థాపించారు.

జీవితంలో ప్రేరణనిచ్చిన తండ్రి షేక్ మహమ్మద్ మియా, చదివించిన కే ఎల్ నరసింహారావు, స్ఫూర్తినిచ్చిన మామగారు పురిటిపాటిరామిరెడ్డి గారల పేరిట 'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు' ఐదేళ్ళ క్రితం స్థాపించి, ఇప్పటి వరకు ముగ్గురు కవులకు ఆ అవార్డులను ప్రదానం చేశారు.

 సమయాన్ని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో తన సమయాన్ని ఇంతగనం దారబోస్తున్నారంటే దానివెనుక ఏదో స్వార్థం ఉండే ఉంటుంది.ఆ స్వార్థంలో తన సగమైన కవి శిలాలోలిత గారి భాగస్వామ్యం కూడా ఉంటుంది.స్వార్థం లేకపోతే వాళ్లిద్దరూ ఎందుకిలా సాహిత్యం పట్ల తాపత్రయ పడుతున్నారు? ఎందుకు జయహో కవిత్వం అంటున్నారు? అవును వాళ్లు నిలువెత్తు స్వార్థ పరులు...వాళ్ల దురాశ అంత కూడా కంపుకొడుతున్న ఈ సమాజానికి కవిత్వ అత్తరును పూయాలని, చెదలు పట్టిన ఆలోచనలను సాహిత్య చమురుతో కడిగేయాలని. అందుకే "కవిత్వం కావాలి కవిత్వం" అను జండా ఎత్తుకొని నినదిస్తుంటారు.  వాళ్ల గుండె చప్పుళ్లని వింటే మనకు లబ్ డబ్ కి బదులుగా జయహో కవిత్వంగానే వినబడుతుంది.

 

తను చేసిన వృత్తిలో కూడా సాహిత్య వాతావరణాన్ని సృష్టించి అక్కడ ఎన్నో కవిత్వ విత్తనాలను నాటి, 2020 మార్చి లో వృత్తి నుండి మాత్రమే రిటైర్మెంట్ తీసుకున్నారు.  కానీ ఆ విత్తనాలు మొలకెత్తి రేపు ఎంత పెద్ద తోటగా మారుతుందో ఊహించగలమా! కొద్ది సమయం దొరికినప్పుడే సంగమాన్ని సృష్టించారు.ఇప్పుడు మహాసంగమాన్ని సృష్టిస్తారేమో..!!

 కవి యాకూబ్ గారు వయసుకి వచ్చిన రిటైర్మెంట్ ని మనసుకి తీసుకోకుండా...ఇప్పుడు దొరికే పూర్తి సమయాన్ని సాహిత్య కృషికి కేటాయించాలని...ఇంకా ఎంతో కవిత్వం మాముందుకు తేవాలని...

కవిమహాసంగమాన్ని సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

 

 

 

           

ప్రపంచీకరోనా ఒక ఆర్కైవ్స్ కవిత్వం

ఎంత సుదీర్ఘరాత్రి అయినా ఉషస్సు రాకతప్పదు...దానికోసం మనమందరం ఎదురుచూద్దామని ధైర్యం చెప్పుకుంట, భూగోళానికి వైరస్ లేమీ కొత్తకాదనీ  గుర్తుచేస్తున్నారు మన గోపి గారు.

ప్రపంచమంతా కరోనా గుప్పెట్లో చిక్కుకొని భయంముద్దగా మారింది. ఆత్మవిశ్వాసాలన్ని శూన్యాలుగా మారిన ఈ కరోన కాలంలోని అనుభవాలను, ఆలోచనలను, ముందుచూపులను, సేవలను, ఆకలివెతలను, వలసకడుపుల ఆర్థనాదాలను, రేపటి ఆలోచనలను అక్షరంతో బంధించి "ప్రపంచీకరోనా" పేరుతో అద్భుతమైన కవిత్వాన్ని తీసుకొచ్చి భవిష్యత్తుకు ఒక బహుమతినిచ్చారు.ఒక కవి మనోలోకంలో చెలరేగిన భావప్రకంపనల రికార్డని,ప్రాచీన పత్రాలు భద్రపరిచే భాండాగారమని చెప్పుతారు గోపి గారు.మొత్తంగా ఇదొక "ఆర్కైవ్స్ కవిత్వం" అంటారు. ముమ్మాటికిది నిజమేనని ఒప్పుకోవాలి.ఎందుకంటే కవి ఎప్పుడు కూడా సమాజ పక్షాన నిలబడి,పోరాడి,అనుభవించి, గుండెనంత పుండుచేస్కొని,కడుపులోని నొప్పిని అక్షరం చేసి రేపటి తరానికందించే చరిత్రకారుడు.

ఇరవై ఐదు కవితల సమాహారంగా వెలువడిన ఈ "ప్రపంచీకరోనా" ను పరిశీలిస్తే దాదాపు కవిత్వమంతా కూడా లాక్డౌన్ కాలంలోనే రాయబడ్డది.ప్రతీ కవిత కూడా ఒక్కోఅనుభవాన్ని, సందేశాన్ని చూపించుకుంట కొత్తగ ఎట్ల ఆలోచించాల్నో చెప్తది.కవిత్వంలోకి వెళ్తే...చైనాలోని ఊహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ క్రమక్రమంగా ప్రపంచాన్నంత తన బంధీగ చేసుకుందంటే దీనంతటికి కారణం ప్రపంచీకరణనే మూలకారణమవుతుంది."ప్రపంచీకరణ -ప్రపంచీకరోనా" సారూప్యాన్ని గమనిస్తే వైరస్ వ్యాప్తివెనుకున్న అసలు రహస్యం మనకు కనబడ్తది.అందుకే విదేశీ యాత్రలను గురించి ఇట్ల చెప్పుకుంటొస్తరు "ప్రపంచీకరోనా" కవితలో...

  "ఒకప్పుడు విదేశీయాత్రలు

   జ్ఞానాన్ని మోసుకొచ్చేవి,

   ఇప్పుడు రోగాలను వెంట తెస్తున్నాయి"

ఇప్పుడొచ్చిన కరోనా గానీ, అంతకుముందు వచ్చిన, ఎబోలా, స్పానిష్ ఫ్లూ లు గాని బస్సు ఎక్కి దిగినంత సుళువుగ ప్రపంచంలో తిరిగినయి..తిరుగుతున్నది. దీనంతటికీ కారణం ప్రపంచమొక గ్లోబల్ విలేజ్ గ మారిపోయినందువల్లనె మరి. విదేశాలల్లో స్థిరపడిన వాళ్లు గానీ,విదేశీ టూర్లకు పోయొచ్చిన వాళ్లు గానీ స్వదేశానికి వస్తున్నప్పుడు న్యూస్ పేపర్లలో పోటాపోటీగా స్వాగతం-సుస్వాగతం స్వదేశాగమనానికని పెద్ద పెద్ద ప్రకటనలు కనబడేవి. బొకేల నుండి గజమాలలతో వాళ్లను ముంచెత్తేటోళ్లు. కానీ ఇప్పుడు వాళ్లంతా కరోనా వాహకాలు.వాళ్ల రాక ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.

ఇలాంటివెన్నో సంఘటనలను కరోనా వ్యాప్తి మొదటి కాలంలో చూసినము. ఈ అనుభవాన్నే గోపి గారు ...

  "ఒకప్పుడు విదేశాల నుంచి తిరిగొస్తే

   పూలదండలు ఎదురొచ్చేవి.

   ఇప్పుడు వైద్యులు బురఖాలు వేసి

   లాక్కుపోతున్నారు."

 

వైరస్ వ్యాప్తి,దాని ప్రభావ ఫలితాలు క్రమక్రమంగా మనుషుల మధ్య గొలుసులను తెంపుకుంటపోయింది.

మరణ చిత్రమంత అరచేతుల్లోనే ఆడటం వల్ల స్పర్శలు అంటరానివైపోయినయి. పాశ్చాత్య షేక్ హ్యాండ్ పోయి మన నమస్కారమే మళ్ళీ ముందుకొచ్చింది.

కరోన రచించిన రాజ్యాంగంలో  పదవులు,హోదాలు,అంతస్థులు, కులమతాలేమీ లేవు.  అందరూ సమానమే అయిపోయారు. అందుకే గోపి గారు ..

     "ఊపిరితిత్తులకు

     కులమత భేదాలుండవు

     అధికార దర్పం

     ఎందుకు అక్కెర రానిదైంది."  అని చెప్పుతరు.

ఎన్ని మారిన,ఎన్ని రకాల వైరస్ లు దాడిచేసిన, ఎంతటి ప్రాణ సంక్షోభం తలెత్తిన మనుషుల్లో కొన్ని మాత్రం మారవంటారు...

      "అలజడుల మధ్య

     మానవత్వం ఒక మిథ్య అయినా

     స్వార్థానికి నిలకడ లేదు

     రాజకీయాలకు చావు లేదు

     ఈ విషక్రిముల ముందు

     కరోనా వైరస్ ఏ పాటి!"

      "వేటకు బయలుదేరిన కరోనాకు

    ఏదైనాఒక్కటే...

    చైనా,అమెరికా,ఇరాన్,

    ఇటలీ,ఇంగ్లాండ్,ఇండియా అనేవి వొట్టి

     పేర్లు" మాత్రమే అంటారు.

 

అంతేకద కేంద్రకమే లేని కరోనాకు, మనుషుల్లాగా తేడాలు చూడటానికి చూపులేదు. ప్రపంచీకరణ పేరుతో ప్రపంచాన్ని పాడుచేసినప్పుడు "ఏ కీటకమైనా కాటకాన్ని సృష్టించగలదు" అంటరు.

ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి యుద్దం చేద్దామని రమ్మని పిలుస్తారు గోపి గారు...

   "మనిషికి యుద్ధం కొత్తకాదు

   పోరాటం ఇప్పుడే పొడిచిన పొద్దుకాదు.

   సాహసమొక్కటే కాదు

   సహనం కావాలి.

   ఓపికే నేటి దీపిక"  అనే సారాంశాన్ని తెలియజేస్తరు.

ఈ వైరస్ వల్ల ఉన్నట్టుండి ఒకేసారి జనజీవనమంత శూన్యంలోకి నెట్టేయబడింది.రోజువారీ అలవాట్లు,

పద్దతులలో మార్పులు సంతరించుకున్నయి.పార్కులు,గ్రౌండ్ లల్లో చేసే మార్నింగ్ వాక్ పలకరింపులు దొంగపోలీస్ ఆటలా మారిపోయినయ్...

ఈ సమయంలో మార్నింగ్ వాక్ ఎట్ల నడుస్తుందో చెప్తరు...

     "నిన్నటిదాకా నా నడక

     పురోగమ్యం దిశగా

     కానీ ఇప్పుడు

     చప్పుడు కాకుండా భయం మీద

     అడుగులు వేస్తూ నడుస్తున్నాను."  అంటు...

     "దూరంగా ఓ సహగామి

    చెయ్యూపుతుంటే

    అతడు నా వైపు కరోనాను

    విసుర్తున్నట్టే ఉంది!"

అని లోలోపల గడ్డకట్టుకుపోయిన భయాన్ని బయటపెడ్తరు.అందుకే చాలవరకు మార్నింగ్ వాక్ లు ఒంటరితనాన్నెత్తుకొని వాకిట్లోకో..డాబాలమీదికో చేరిపోయినయి.

భూగోళానికి ఆవరించిన ఈ నిశ్శబ్దంతో  గ్లోబు తిరగడమె మర్చిపోయిందంటారు! దీనంతటికి కారణం మానవుని యొక్క విపరీత బుద్ది,విచ్చలవిడి ప్రయోగాలె అయ్యుంటాయనుకోచ్చు గోపి గారి అంతరార్థం నుండి...

       "ఇవాల గ్లోబు

      తిరగడం కూడా మర్చిపోయింది.

      పక్కగ్రహాలు ప్రశ్నిస్తున్నాయి

      వసుధా! వసుధా!

      నీ పేరేమిటి?"

ఈ కవిత్వ సంపుటిలోని "గృహమే కదా స్వచ్చంద సీమ" అనే కవితకు గాను ఈనాడు వారు ముప్పై రోజులు నిర్వహించిన "కరోనాపై కదనం" కవితల పోటీలో మొదటి రోజు మొదటి బహుమతిని దక్కించుకున్నది.ఆ కవితను పరిశీలిస్తే..అకస్మాత్తుగా ప్రకటించిన లాక్డౌన్ లో మనిషికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఇంటికే పరిమితమయ్యాడు.ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కో రకంగా ఉన్నప్పటికీ, తెల్లారితే నాల్గుదిక్కులకు నలుగురు రెక్కలుగట్టుకొని ఎగిరిపోయే వాళ్ల మధ్య ఇప్పుడు ముచ్చట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు,పాతబడిన జ్ఞాపకాలను కొత్తగా మొలకెత్తించడం,సహకారం, సమన్వయం ఎన్నో బలపడ్డాయి...ఆ అనుభవాలను గోపి గారు ఇట్ల చెప్పుతరు  ...

     "ఆమె వంటింటి చాకిరీ సర్వస్వాన్ని

      ఇవాల అందరూ పంచుకుంటున్నారు.

      పిల్లల ముఖాల్లో ఇంతటి సుమనోహర

      కాంతిపుంజాలున్నాయా!

      ఇన్నాళ్ళు టైం దొరక్క పెరిగిపోయిన

      అపోహలు దూదిపింజల్లా

      తేలిపోతున్నాయి.

      గృహం ఇప్పుడు గుహ కాదు

      అనురాగ సంగీత శ్రుతుల తహతహ."

ఇదే సందర్భంలో ...ఈ విపత్కర పరిస్థితులలో ఇల్లులేని వారి గురించి ఆలోచించాలనే స్పృహను కూడ కల్పిస్తరు...

     "ఇవ్వాల ఇంట్లో కూర్చుంటే

     ఇల్లు లేనివాళ్లు గుర్తొస్తున్నారు.

     తిండికోసం కండలు కరిగించే

     కష్టజీవులు కళ్లలో మెదుల్తున్నారు."

ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య అనేవి ప్రతీ మనిషి జీవితానికి ప్రాథమిక అవసరాలు. అభివృద్ధి చెందిన ఏ రాజ్యాన్ని చూసినను ఈ నాలుగింటికే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుంటుంది.

మొన్నటితో డెబ్బైమూడు వసంతాలు పూర్తి చేసుకున్న మన భారతదేశం వీటికెంత ప్రాధాన్యతనిచ్చిందో

ఈ కరోనా కాలంలో దాదాపు ప్రతొక్కరికి తేటతెల్లమైంది.అందుకే మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్ నుండి బయట పడలేకపోతుందనే చెప్పొచ్చు.

కరోనా దాడికి అన్ని మతాల దైవాలన్నీ లాక్డౌన్ లో ఇరుక్కపోయిన సమయంలో వైద్యుడే ప్రత్యక్ష దైవమని మరోసారి నమ్మిన సందర్భమది.తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వృత్తికే ప్రాధాన్యత నిచ్చిన వారి సేవలు అనిర్వచనీయం.

తర్వతర్వాత ఎంతో మంది వైద్యులు కరోన బారిన పడి మరణిస్తూనె ఉన్నరు.వాళ్ల యొక్క ధైర్యం, చేసిన సేవ గురించి గోపి గారు...

     "కరోన కదనరంగంలో

     తెగించి దూకిన యోధుడతను.

     నిన్నటి దాక అది వృత్తి ధర్మమే

     కావొచ్చు. ‍

     ఇప్పుడు మానవ ప్రవృత్తి జాగృతమైన

     సిద్దుడతను.

     ప్రాణాలను నవ ప్రకర్షాకుడతను"  అంటరు.

ఎంతో సీరియస్ గ జరుగుతున్న లాక్డౌన్ సమయంలో ఏర్పడిన ఎకానమీ లోటును భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర పభుత్వం మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల అప్పటివరకు వ్యక్తుల మధ్యనున్న భౌతిక దూరం మత్తులోపడి ఊగిపోయిందనేది తెలిసిన విషయమే.  వైద్యులు,పోలీసులు,జర్నలిస్టులు,సానిటైజర్ వర్కర్లు అప్పటి వరకు ధైర్యంగా అందించిన సేవలు నిష్ప్రయోజనంగా మారినయి.మద్యంతోనే మన రాష్ట్రం రెవెన్యూని సులభంగా పెంచుకుంటుందని తెలిసిన విషయమే! అందుకే కావొచ్చు గోపి సార్ మద్యాన్ని "రెవెన్యూ స్టాంప్" గ పరిగణించారు.ఈ కవితలో ఒక తాగుబోతు సన్నివేశ వాస్తవాన్ని ఇట్ల చూపిస్తరు...

     "ఓ సారాయి వీరుడు

     కట్టె తీసుకొని

     కరోనాను తరిమికొడ్తానంటున్నాడు

     కరోనా పగలబడి నవ్వుతోంది." అని

కరోనా లాక్డౌన్ లో దేశాన్ని మొత్తం కదిలించిన హృదయవిదారక దృశ్యం వలసకూలీల నడక గొలుసులు.ఒక విధంగా చెప్పాలంటే కరోనా ప్రభావం వల్లనే వలస కూలీల వాస్తవ స్థితిని,ప్రభుత్వాల డొల్లతనాన్ని తెలుసుకోగలిగాము.వలస కూలీల కష్టాలకు స్పందించి సేవలందించడానికి సోనూసూద్విజయ్ దేవరకొండ లాంటి సినీ సెలెబ్రిటీలు,స్వచ్చంద సంస్థలు,ఇంకా ఎంతో మంది ముందుకొచ్చి వాళ్ల వాళ్ల పుట్టినూర్లకు పంపించారు. కవిత్వము, పాట దీనికెంతో దోహదం చేసిందని ప్రత్యక్షంగ తెలుసు.ఆదేశ్ రవి గారి పాట ప్రభుత్వాలనే దిగివచ్చేలా చేసింది.

వలసకూలీల నడకల గురించి గోపి గారు ఈ విధంగ వ్యక్తీకరించి వాళ్ల పట్ల ఆలోచించేల చేస్తరు...

     "వలస బతుకుల్ని

     అనాథలను చేసి

     స్వార్థం సరిహద్దులకు

     కొత్త భాష్యం నేర్పింది కరోనా" అంటు

      "ఊపిరితిత్తులు అందరికీ ఉంటాయి

      కానీ కూలీలకు బయట

      వేళాడుతుంటాయి.

      వేలాది మైళ్లు నడిపించే

      లక్ష కాళ్ల జెర్రీ కరోనా" అంటరు.

ఇప్పటివరకు వచ్చిన ప్రతీ ఉపద్రవం కూడ మానవాళికి ఏవో కొన్ని పాఠాలు నేర్పిపోతూనె ఉంటయి.మనిషి నడకను,అలవాట్లను సరిచేసుకొమ్మని గుర్తుచేస్తుంటయి.మరి ఇప్పుడొచ్చిన ఈ కరోనా ఉపద్రవం నుండి గాడి తప్పిన మానవ వ్యవస్థ ఎంతో నేర్చుకోవాల్సే ఉంది.దాన్నే కరోన పాఠంగ చెప్పుతరు

గోపి గారు...

     "హస్తశుద్ది మంచిదే

     చిత్తశుద్ది మరీ ముఖ్యం

     ప్రపంచం

     ఎంత చిన్నదైపోయింది!

     ఓ పురుగుకు లొంగిపోయింది." అంటు  చెల్లాచెదురైన ప్రపంచ పటం గురించి చెప్పుతరు...

      "అట్లాసు ముందు కూర్చుంటే

     దేశాల మధ్య గీతలన్నీ

     కలగాపులగమవుతున్నాయి.

     కరోనా తర్వాతైనా

     పాఠాలు మిగలాలి

     పుటం పెట్టిన బంగారంలోంచి

     కొత్త పాటలు మెరవాలి" అని నేర్చుకోవాల్సిన సారాంశాన్ని గుర్తుచేస్తరు.

సమాజంలోని ప్రతీ సంఘటనను ఆవాహన చేసుకొని స్పందించే ఒకేఒక వ్యక్తి కవి.వూహాన్ నుండి కరోన బయలుదేరినప్పుడే రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించాడు.

అప్పటి నుండి ఇప్పటి వరకు గుట్టలు గుట్టలుగా కవిత్వం వస్తునే ఉన్నది.ఆ కవియొక్క అంతరంగాన్ని ఈ విధంగ ఆవిష్కరిస్తరు‌...

        "ఇవ్వాల కవి

      గంప కింద కోడి కావచ్చు

      కాని

      ప్రపంచం నిండా రెక్కలు సాచి

      అందరికీ భరోసానిచ్చే

      తాపత్రయమూర్తి"  అంటరు.

అలాగె కవి స్థానమెటువంటిదో కూడ చెప్పుతరు...

        "కవి అంటే

      దస్త్రాలు ముందేసుకొని

      కూర్చునే మున్షీ కాదు,

      బతుకు పునాదులను

      పాటగా మలిచే వంశీ లాంటివాడు.

      సమస్త భేదభావనలు

      పటాపంచలౌతుంటే

      ఆనందించే అంబేద్కర్ లాంటివాడు" అని.

 ప్రపంచమంతా దాదాపు ఆరునెలల నుండి ఈ ఉపద్రవంలో చిక్కుకోవడం వల్ల ఆర్థిక,రాజకీయ వ్యవస్థలు గాడితప్పినయి.చివరి చూపుకి కూడ నోచుకోకుండ ఎంతో ప్రాణనష్టం జరుగుతనే ఉన్నది.మానవాళిని భయం కప్పేసింది.మానసిక స్థైర్యం లోపించడం వల్ల జీవన విధానం బలౌతూనే ఉన్నది.విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడుతుంది.ప్రైవేటు ఉద్యోగుల ఉద్యోగాలు పోయి పారను పట్టడానికి సొంతూర్లకు మకాం మారుస్తున్నరు.  మనసులల్ల నిశ్శబ్దమనేది రోజురోజుకు అగమ్యగోచరంగ చక్కర్లుకొడుతున్నది.

రేపు అనేది ఇప్పుడు సామాన్యునికి జవాబులేని ప్రశ్నగా కనబడుతుంది.

ఈ విధంగ "ప్రపంచీకరోనా" అనే కవిత్వం లాక్డౌన్ కాలంలో గోపి గారి యొక్క అంతరంగాన్ని తొలిచేసిన సంఘటనల నుండి వెలువడిన ఆర్కైవ్స్ కవిత్వం.రేపటి తరాలకు ఇదొక గుప్తనిధి.

 

 

                     

     తెలంగాణ గుండెనే ఈ రుబాయీలు

గజళ్లను కొత్త వస్తువు దిశగా దారిమళ్లించి సినారె గారు విజయం సాధించారని అందరికీ తెలిసిన విషయమే. సాహిత్యంలో...అందులో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక లక్షణాలతో కూడిన అనేక కొత్త ప్రక్రియల ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నయి.అందులో కొన్ని విజయవంతంగా ముందుకు సాగిపోతున్నయి.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రక్రియ... ఈ మధ్య ఎక్కువ వినబడుతున్న ప్రక్రియ "రుబాయిలు." ఈ రుబాయి ప్రక్రియ పారసీ ఉర్దూ నుంచి వచ్చిందని కొందరు, అరబ్బీ నుంచి వచ్చిందని ఇంకొందరి వాదన.ఏదేమైనా అనువాదం ద్వారా ఈ ప్రక్రియ తెలుగు వారికి పరిచయమైందని చెప్పాలి.ఉమర్ ఖయ్యాం రాసిన రుబాయిలు తెలుగు,ఇంగ్లీషు భాషలలోకి అనువాదం జరగడం వల్ల భావకవులనెంతో ఆకర్షించింది ఈ ప్రక్రియ.

ఈ రుబాయిలను తెలుగులో రాస్తున్న... సింగిల్ డిజిట్ కూడా దాటని అతిముఖ్యమైన వారిలో ఏనుగు నరసింహా రెడ్డి గారొకరు.తెలంగాణ లోని బతుకు చిత్రాలను నేపథ్యంగా తీసుకొని,వినూత్న వస్తువులను ప్రకటిస్తూ విభిన్న ఆలోచనలు రేకెత్తేలా రాసిన 536 రుబాయిలతో "తెలంగాణ రుబాయిలు" అనే పుస్తకాన్ని ఈ సాహిత్య లోకంలోకి తీసుకొచ్చారు ఏనుగు నరసింహా రెడ్డి గారు.

రుబాయిలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కల్గిఉండి చదువుతున్నప్పుడు ప్రత్యేకతతో ఆకర్షింపబడతాయి.

రుబాయి అనేది ఒక పారసీ ఛందస్సు పేరు.అదే... పారసీ కవితా ప్రక్రియకు పేరుగా మారింది.దీనిలో నాలుగు పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలు కూడా ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.

1,2,4 పాదాలలో రదీఫ్, కాఫియాల నియమాలతో ఒకే భావాన్ని చమత్కార పూర్వకంగా వ్యక్తపరచాలి.ఈ మూడు పాదాలలో రదీఫ్ కు ముందున్న పదాన్ని కాఫియా అంటారు.రదీఫ్ గా ఒకే పదాన్ని కల్గి ఉండి కాఫియాతో అంత్యప్రాస నియమాన్ని పాటించాలి.అన్ని పాదాల్లో సమాన మాత్రలు తప్పనిసరిగా కల్గిఉండాలి.అలాగే 3వ పాదంలో ఎలాంటి నియమం లేకుండ స్వతంత్ర వాక్యమై ఉంటు భావపరిణామ సూచన చేస్తూండాలి.అందుకే ఈ 3వ పాదాన్ని రుబాయి అనే భవనానికి పునాది లాంటిదని,ఉరుము ముందు వచ్చే మెరుపు లాంటిదని పెన్నా శివరామకృష్ణ గారు ముందు మాటలో అంటారు. ఈ మూడవ పాదంతోనే మిగిలిన పాదాలకు అర్థం, అందం,బలం,ధైర్యం చేకూరుతుందని చదివే వాళ్లకు కూడా అర్థమవుతూనే ఉంటది.

  ఈ "తెలంగాణ రుబాయిలు" లో మొత్తం పధ్నాలుగు వస్తువుల కింద 536 రుబాయిలు రాయబడినవి. ఆ వస్తువులనొకసారి చూస్తే... వలయంలోపల వలయం, దూదిపింజ లాంటి నవ్వు, స్వరం పొంగినపుడు, ఇంటిమీద ఇల్లు,నింగి మురిసిన వేళ, తూర్పు తేనె, అనుసంధానం, ఎర్రెర్రని చెల్కల్లో,

ఎత్తొంపుల నేలల్లో, వరణ భంగం, క్రమాక్రమం,పాసంగం, కౌశల,పుడమి అంచులు.

  కొన్ని రుబాయిల్లోకి వెళ్లితే....

ఒక చుక్కకు ఒక చుక్కకు ఎంతటి దూరం

గ్రహరాశికి గ్రహరాశికి ఎంతటి దూరం

ఎవరైనా నా వారని చెబుతాం కానీ

మనుషులకూ మనుషులకూ ఎంతటి దూరం

  పై రుబాయిలో కొలవలేనంత నిగూడార్థాన్ని నాలుగు పాదాలో ఇమడ్చబడింది.అది సామాన్య విషయం కాదనే చెప్పాలి. ఆకాశంలోకి చూసినప్పుడు చుక్కలన్ని ఒకదానికొకటి ఇంటిపక్కనె ఉన్నంత దగ్గరగా కనిపిస్తాయి.గ్రహరాశులూ అంతే ..వాటి మధ్య అసలు దూరాన్ని తెలుసుకుంటే ఆశ్చర్య పడాల్సిందే మరి.అయినను మనకు మాత్రం ఒక దగ్గరున్నట్లు కనబడుతూ ఒక నీతినందిస్తాయి.

ఎందుకంటే దగ్గరగా ఉన్నామనుకునే  ఈ మనుషుల మధ్య దూరాన్ని కొలవడానికి ఎన్నైనా కాంతి సంవత్సరాలు పట్టొచ్చును కదా.. !

ఇంకో రుబాయిని చూస్తే...

ఎడారిలోకీ తరిమితే ఇసకతో ఆడుకుంటా

తీరానికీ నెట్టేస్తే గవ్వలతో ఆడుకుంటా

గీతలోపల ఆడనిస్తే వాళ్లకే మరి మంచిదీ

అన్నిచోట్ల నెట్టివేస్తె మనసులోతులొ ఆడుకుంటా

ప్రస్తుత మానవాళి స్వార్థపు తత్వాన్ని తెలుపుతుంది ఈ రుబాయి.  పక్కోడు బాగుపడితె ఓర్వలేని మనుషుల మధ్య బతకాలంటే తెగింపునిధైర్యంని కల్గిఉండాల్సిందే మరి! "ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..." అనే పాట నిత్యం వినబడుతుంటది. ఆడవాళ్ళ మాటలను,మనసును అర్థం చేసుకోలేమని ఈ విషయం మీద మనకెంతో సాహిత్యం కూడా కనబడుతుంటది.  కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనే విషయాన్ని పురుష ప్రపంచం మరిచిపోతారు.  నరసింహా రెడ్డి గారు దీన్ని సాధించడానికి ఒక టెక్నిక్ ని ఈ రుబాయిలో చెప్పుతరు..

సింధూలో చిత్రలిపీ అర్థమైతది

అరచేతిలో బ్రహ్మలిపీ అర్థమైతది

ఆమె చూపులోతు మనకు ఎలా తెలియడం

హృదయంలో చూడు దూరి అర్థమైతది

కోకొల్లలుగా పుట్టుకొస్తున్న పురస్కారాలు,అవార్డులు ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో కొంత అలజడిని,నిరుత్సాహ వాతావరణాన్ని సృష్టిస్తుంది.ఒక పురస్కారమైన,అవార్డైన ఏ విధంగ ఉండాలి.తీసుకునే వాళ్లు కూడా ఏ విధంగ ఉండాలో కింది రుబాయిలో చెప్పుతరు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా అవసరమైన రుబాయిగా భావించొచ్చు..

పురస్కారమంటే వన్నెలు ఉండాలె

సన్మానానికి నవవెలుగులు ఉండాలె

స్వీకర్తలవల్ల అవార్డులు వెలగాలె

బహుమతులె నిను కోరేటట్లు ఉండాలె

ఈ మధ్య దంచికొడుతున్న వానలకు ఇండ్లు,వీధులు,ఊర్లు,పట్టణాలు,నగరాలన్నీ కూడ తప్పిపోయిన చెరువులను గుర్తు చేస్తున్నయి.విశ్వనగరమని గొప్పగా చెప్పుకుంటున్న మన హైదరాబాదు అయితే మొదటి స్థానంలోనె ఉంటుందని చెప్పొచ్చు. ఈ విశ్వనగరం చెరువు కావడానికి పెద్ద వానలేమి అవసరమే ఉండదు.చిన్నపాటి నాలుగు చినుకులు పడితే చాలు. ఈ నగరంలోని ట్రాఫిక్ సమస్యనైతే చెప్పవశం కాదు.ప్రసవ వేదనతో బాధపడే స్త్రీ అయితే హాస్పిటల్ కి చేరుకోక ముందె గంటలు గంటల ట్రాఫిక్ లోనే ఆ రణగొణ ధ్వణుల మధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటిముఖం పట్టొచ్చనడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.ఈ సమస్యల మీద ఓ రుబాయి లో నరసింహా రెడ్డి గారు ఇట్లంటారు...

ఒక్క వాహనమాగిపోయెను,

బిర్రబిగిసెను ట్రాఫికంతా

ఒక్కడొచ్చెను రాంగురూటున ఇరికిపోయెను ట్రాఫికంతా

ఎవ్వడో విసరేయు రాయి ఎన్ని తలలను

గాయపరచునో

అర్థగంటే వాన కురిసెను,ఆగిపోయెను

ట్రాఫికంతా

ఈ టెక్నాలజీ యుగంలో చాలా ఫాస్ట్ గా హార్డ్‌వేర్ ,సాఫ్ట్‌వేర్ లనుపయోగించి దేన్నైనా కలిపేస్తున్నారు. తక్కువ టైం లో ఎంతో ప్రాడక్టివిటీని సాధిస్తున్నారు.  ఇదంత కూడా సాంకేతిక దయనేనని తెలుసు. ప్రతీ ఒక్కరికీ కూడా ఇది సుళువుగా దగ్గరవుతుంది.ఇంతటి ఘనమైన నైపుణ్యం కల్గినటువంటి ఈ నిపుణులకు ఒక రిక్వెస్ట్ ని చేస్తు ఎంతో ఆలోచింపదగిన రుబాయిని అందించారు...  

ఇనుము గూడ ఇరగదీసి అతుకేసే యంత్రాలు

కట్ పేస్టులతొ టెక్స్టులనూ కలిపేసే యంత్రాలు

లక్షలాది నిపుణులున్న సాంకేతిక యుగంలో

ఎపుడు సృష్టి చేయుగలడొ మనసతికే యంత్రాలు

మన దేశంలో ఎలక్షణం ఏ లక్షణాలతో సాగుతుందో తెలిసిందే.మనకెన్ని పండగలున్నా ఈ ఎలక్షణం పండుగ ముందు బలాదూరే అవుతుంది.  ఎందుకంటే ఈ పండగెప్పుడు ఏదో మూలన ఏదో ఎన్నిక రూపంలో జరుగుతనే ఉంటుంది.  తెల్లారి లేవంగనే ఓటరు ముఖంనే సూడాలనుకుంటాడు.  మురికి వాడల దర్శనాన్నే చేయాలనుకుంటాడు. ఇదెన్ని రోజులో కాదు ఓటరు సూపుడు వేలు మీద నల్లసుక్క పొడిచేంత వరకే.  ఆ తర్వాతంతా షరా మామూలే ఉంటది.ఇట్లాంటి ఎలక్షణం మీద ఓటరేమనుకుంటాడో తన రుబాయిలో ఈ విధంగ చెప్తరు...

ఏటేటా ఎన్నికలూ ఉంటె ఎంత బాగుండు

నెలానెలా నేతలిలా తిరుగ ఎంత బాగుండు

మాటల్లొ మనసుల్లొ ఏకత్వం వచ్చునేమో

ధనం ఎలక్షణం లంకె విడితె ఎంత బాగుండు

చట్టానికి కండ్లు లేవనే నానుడి కలదు.ఆ నానుడి ఇప్పట్లో అయితే అదెంత నిజమవుతుందో చెప్పలేమిక.కొన్ని చట్టాలెందుకు చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు.అర్థమయ్యేలోపు జరిగేదంత జరిగిపోతనే ఉంటది.ఇంకొన్ని చట్టాలయితే మేకప్ ఏసుకొని ఫ్యాషన్ షో చేస్తున్నట్లుంటాయి.మరికొన్నైతే ఉన్నట్లు కూడ తెల్వదు.ఈ చట్టాలెన్ని రకాలున్నా..ఎన్ని చట్టాలొచ్చినా ... దానివల్ల ఉపయోగమైతే సామాన్య జనానికేమి ఉండకపోగా సామాన్యుడే బలైపోతుంటడు.ఒక రుబాయిలో ఇదే విషయాన్ని ఇలా ప్రస్తావిస్తారు...

పది మొనలున్న కత్తి లాంటిది చట్టం

అమాయకుల పైనే దిగేది చట్టం

పెద్దలెట్లయినా తప్పించుకుంటరు

చిన్నోల్లను సతాయించేది చట్టం

ఇట్లాంటి ఆలోచనాత్మకమైన రుబాయిలెన్నో ఈ "తెలంగాణ రుబాయిలు పుస్తకంలో కనబడుతుంటాయి. ఈ రుబాయిల నాడీననుసరించి అందమైన చిత్రాలను కూరెళ్ల శ్రీనివాస్ గారు పుస్తకం నిండుగ అందించారు.కవర్ పేజీ ఈ పుస్తకానికి మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. పర్షియన్ చిత్రకళలోని లతలు, అల్లికల కలబోతగా కవర్ చిత్రం కనబడుతుంటది."రుబాయిలు" ప్రక్రియ చరిత్రను అంచనా వేయడానికి పాఠకులు ఈ చిత్రాన్ని పట్టుకుంటే సరిపోతుందనిపిస్తది. పెన్నా శివ రామకృష్ణ గారు నరసింహా రెడ్డి గారి రుబాయి నాడీ పట్టుకొని ముందుమాటలో "కొత్త పోలికలతో, చమత్కారంగా సరికొత్తగా వ్యక్తీకరించడం వీరి రుబాయీలలోని ఒక ప్రత్యేకత" అంటారు.  ఈ రుబాయీలన్నీ చదివినంక ప్రతీ పాఠకుడు ఇదే మాటను  తప్పక అనుకుంటాడు. తెలుగులో ...తెలంగాణ నాడీని,గుండెను రుబాయీలుగా మలిచినందుకు ఏనుగు నరసింహా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

 

 

                        

సమాజ తత్వాన్ని ఆవిష్కరించిన గునుగుపూలు...

"ఇక్కడి ఏ రాయిని పలకరించినా చెపుతాయి వేవేల కథలు అంటూ పౌరుషాలకు పురుడుపోసిన ఓరుగల్లు గడ్డ నుంచి తన పౌరుషాన్నంత "గునుగు పూలు" లో చూపెట్టింది ఓరుగల్లు ఆడబిడ్డ శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారు.ఈ పేరు సాహితీ ప్రపంచానికి సుపరిచతమే...

కవిత్వం ఎప్పటి నుంచో రాస్తున్నప్పటికీ చాలా ఆలస్యంగా తన ఈ తొలి సంపుటిని మనకందించారు.

 

 తెలంగాణలో గునుగుపూలకు ఎంతో విశిష్టత కలదు.బతుకమ్మను పేర్చడంలో తంగేడు తర్వాతి స్థానంలో ఉండేది ఈ గునుగుపూలే ...పూవై పుట్టాక పూజకో...సిగకో వచ్చి చేరుతుంటాయి.

కానీ గునుగుపూలు మాత్రం వాటికి నోచుకోకుండా తెలంగాణ ఆడబిడ్డల బతుకు చిత్రాన్ని చూపించే బతుకమ్మలో సింగిడి రంగులనద్దుకొని హుందాగా కూర్చుంటాయి.చెలకలల్లో వనంలా పెరిగే ఈ పూలు చూడటానికి గరుకుగా కనిపించినప్పటికీ...తాకితే మాత్రం సుతిమెత్తగా తగులుతుంటాయి.ఈ లక్షణమే ఉదయశ్రీ గారి ఈ కవిత్వ సంపుటిలో కనబడుతుంటుంది.తన చుట్టూ కనబడే సమస్యలకు,తనలోని జ్ఞాపకాలకు,స్పర్శించిన అనుభూతులకు అక్షరాన్ని తొడిగి రంగురంగుల ఈ సమాజ తత్వాన్ని గునుగు పూలు గా పూయించారు.తను తీసుకున్న కవితా వస్తువుల్లో ఎక్కువ భాగం స్త్రీ గురించే అయినప్పటికీ..రైతును,ప్రకృతిని, మట్టిని,జీవన ప్రవాహాన్ని,పల్లెను,పట్నపు సంస్కృతిని,పువ్వులను,కులాన్ని,నాన్నను,వృద్దులు...ఇలా చాలా అంశాలు  వస్తువులుగా మారి కవిత్వంగా కనబడుతుంటాయి.ఈ బుక్ ని వస్తువు పరంగా పరిశీలిస్తే ఒక మల్టీ విటమిన్ లా గోచరిస్తది.ఇందులోని 51 కవితలను చదివాక స్త్రీ పక్షపాతి అని చెప్పకుండ ఉండలేము.కొన్ని మచ్చుకు చెప్పుకుంటే..

తను "అనంత సాగర స్వరూపం" కవితలో ఆమెను ఇలా అంటారు...

 

"అంతరాలలో రగులుతున్న

బడబాగ్నులున్నా చిరునవ్వులు చిందిస్తూ

ఆకాశాన్ని తనలో దాచే సంద్రంలా

రాగద్వేషాలను తనలో ఇముడ్చుకునే

స్థిర గంభీర రూపం ఆమె "

 

ఒక స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించే వాక్యాలు ఎంతమంది ఎంత రాసినా ఈ వాక్యాలు మాత్రం నిలిచిపోయేవని చెప్పుకోవచ్చు.మనిషై పుట్టాక జీవన వేట తప్పదు.ఆ వేటలో మనిషి చుట్టూ అల్లుకుపోయిన బంధాలు బలపడొచ్చూ...తెగిపోవచ్చూ.ఏది జరిగినా చివరకు చేరేది మాత్రం మట్టిలోకే! ఆ మట్టితో మనిషికి బంధాన్ని జతకడుతారు మన ఉదయశ్రీ గారు."మట్టి బంధాలు " కవితలో చివరి వాక్యాలు మాత్రం మనసును గుచ్చుకుంటాయి...అవి

 

"మట్టి పరిమళంలో దాగుంది

మనిషి బతుకు చిత్రం

ఎవరి ప్రయాణం ఎటువైపు సాగినా

మమతల ముడులు తెంచుకుని సాగినా

మనసు బంధాలకు మసిపూసిన

మనిషి బంధాలన్నీ చివరకు మట్టి బంధాలే"

 

చిరు వ్యాపారుల వెన్నుముకల మీద కట్టుకున్న మాల్స్ లోకి ప్రవేశిస్తే మధ్యతరగతి కుటుంబీకుడు చేతిలోని డెబిట్/క్రెడిట్ కార్డు లబోదిబోమని మొత్తుకుంటది.అదొక మాయాబజార్‌... అందులో నుండి బయటపడాలంటే తనకు తాను ఏకాగ్రతను గట్టిగా పట్టుకోవాల్సిందే...ఇదే విషయాన్ని "చూపులు చిక్కనీయకు" అనే కవితలో ఇలా అంటారు...

 

"అవసరాల వెతుకులాట ఆనాడు

దర్జాల ప్రదర్శణకై ఆర్భాటాలు నేడు

డెబిట్ కార్డులకు రెక్కలొస్తాయి

క్రెడిట్ కార్డులు బరువెక్కుతాయి

చూపులను చిక్కనీకు మాల్స్ మాయల

చిక్కాలకు..."

 

ఆడపిల్లలకు నాన్నలపైనే ఎక్కువ ప్రేముంటుందనేది లోకం పోకడ.ఉదయశ్రీ గారి "నాన్న" కవితను చదివాక ఈ విషయం మరోసారి రుజువైంది.నాన్నపై తను రాసుకున్న కొన్ని వాక్యాలను చూస్తే ...

 

"బాధ్యతలు ఎన్నున్నా నిటారుగా నిలిచే

ఆకాశంలా...

అంతరాలలో అలల అలజడులకు చెదరని

సంద్రమై నిరీక్షిస్తాడు తీరం చేరే నీ నవ్వుల

కోసం...!"

 

 "గునుగు పూలు" గా తీసుకొచ్చిన ఈ కవిత్వ సంపుటిలో "గునుగు పూలు" కవితలో కొన్ని వాక్యాలు తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను చూపిస్తాయి....

 

"తెలంగాణలో విరిసిన పూల వనాలు

 మా గునుగు పూల వనాలు

 పరుగు పరుగున వస్తున్నాయి

 బతుకమ్మ వచ్చిందని..."

 

ఈ సంపుటిలో మరో కవిత "గీత కార్మికుడు".ఇందులో గౌడన్న వృత్తి ఎంత రిస్క్ తో కూడుకున్నదో ఉదయశ్రీ గారు ఆసాంతం అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ కవితకు ప్రాణం పోసిండ్రని చెప్పొచ్చు...ప్రతీ స్టాంజా కూడా మనసును మెలిపెట్టేలా ఉన్నాయి.కొన్ని వాక్యాలను చూస్తే...

 

"ప్రాణాన్ని పదే పదే దేవుడికి తాకట్టు పెట్టి

 చెట్టుని తనతో ముడివేసుకొని

 ప్రేమగా జతకడతాడు...

 

"ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు

చెట్టు శిఖరాగ్రం చేరుతాడు..."

 

"పుడమి తల్లిని తాకగానే

 మరో రోజు దొరికినట్లో

 మరో జన్మే దొరికినట్లో ఆనందించే

 నిత్య సంతోషి గీత కార్మికుడు"

 

ఇప్పుడు ఎక్కడ చూసిన చిన్న కుటుంబాల సంస్కృతినే ఏలుతుంది.ఇంట్లోని పెద్ద మనుషులను కూడా భరించే స్థాయిలో లేని ఒంటరి మనుషులే కనబడుతున్నారు.

తమకది సుఖంగానే ఉందనుకున్నప్పటికీ కలుషిత మనసులు తయారవ్వడానికి ఇదొక పెద్ద కారణమనే చెప్పాలి.ఈ

వయోధికులను దూరం చేసుకోవడం వలన ఈ సమాజమెంత కోల్పోతుందో...వాళ్ల నుండి ఎంత నేర్చుకోవచ్చో... "వయోధికులు‌.‌‌.." కవితలో ఈ విధంగా చెప్పుతారు....

 

"అనుభవాల ఘనులు వారు

 యువతకు దారిచూపు నీతి సూర్యులు

 కొత్త దారులకు బాటలు చూపే మైలురాళ్ళు

 ఎన్నో గ్రంథాలయాల సారం వారి మాటలు"

 

అలాగే "నేనవరిని?" అంటూ మనిషి యొక్క

జన్మ అంతరాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు...

 

"అంతరాలలో నివసిస్తున్న విభాజక

 సమాజంలో నాలోని గొప్పతనాలన్నీ

 కొట్టుడుపోయి శేషం సున్ననే...

 తరతరాల లెక్క ఇదే

 ఎవరు భాగించినా ఫలితాలివే.."

 

 ఈ కవిత్వ సంపుటిలోని కవితలన్నీ కూడా గునుగు పూలకు రంగులద్దినట్లుగా... తీసుకున్న వస్తువును బట్టి యాసను చూపెట్టారు.ఇందులో పుస్తక భాష కనబడుతుంది...తెలంగాణ యాసా కనబడుతుంది.మంచి కవిత్వం రాయడానికి పుస్తక పఠనం ఒక కారణమైతే...

వ్యక్తులను..సమాజాన్ని చదవడం కూడా మరో కారణమవుతుంది.ఉదయశ్రీ గారిలో ఈ రెండూ మెండుగా ఉన్నాయని అర్థమవుతుంది.దాదాపుగా ప్రతీ కవి యొక్క తొలి సంపుటి భావం,వస్తువు ప్రాధాన్యతను సంతరించుకుంటుందనే విషయం తెలుసు ...ఇందులో కూడా అదే కనబడుతుంది.తన ఆలోచనలకు మరింత పదునుపెడితే మంచి శిల్పంతో ఎంతో చక్కని కవిత్వం రాయగలరు...ఉదయశ్రీ గారిలో ఆ పట్టుదల ఉందని...రాయగలరని భావిస్తున్నాను."గునుగు పూలు" కవిత్వ సంపుటిని ఈ సాహిత్య ప్రపంచానికి అందించినందుకు మనసార అభినందనలు తెలుపుకుంటున్నాను.

 

                   ****

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు