మా రచయితలు

రచయిత పేరు:    డా. లక్ష్మీ రాఘవ

కథలు

ఎలాటి మార్పు ??

“ఎందుకమ్మా ఇలా అంటున్నావు? ఒకటి కాదు ఏకంగా నిన్ను మూడు కంపెనీలు పిలుస్తున్నాయి “
ప్రశ్నార్థకంగా అడిగాడు తండ్రి రామచంద్ర కూతురు రమ్యని.
“నా కిష్టమైనది చెయ్యడం అలవాటుకదా నాన్నా. చిన్నప్పటినుండీ నాకు మీరు ఆ స్వేచ్చ ఇచ్చారు.” తనను తానూ సమర్థించుకుంది రమ్య.
“స్కూలు  కాలం నుండీ క్లాసు ఫస్ట్ వచ్చేదానివి. ఇంటర్ లో ఎంసెట్ కోచింగ్ కూడా వద్దన్ననీవు ర్యాంకు సంపాదించు కున్నావు. నీవు కావాలనుకున్న ఇంజనీరింగ్  కాలేజీ లో సీటు దొరకడం,..దేనికీ నీవు మా కోరికలకు భిన్నంగా ప్రవర్తించలేదు . లేదా మేము కోరినట్టే జరిగింది అనుకో వచ్చును. ఇప్పుడు బి టెక్ అవుతూనే ఆల్రెడీ కాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం వచ్చింది కదా. చేరవచ్చు...అనుకున్నాం నేనూ మీ అమ్మా ...ఇప్పుడు నీవు కంపెనీలలో చేరానని నీవు చదివిన కాలేజీ లోనే లెక్చరర్ గా చేరతాననీ అంటే ఏమనుకోవాలి? మంచి తెలివి గలదానివి, నీ అంత నీవుగా కంపెనీ ల జాబ్స్ కు సెలెక్ట్ అయినదానివి ఒక మామూలు లెక్చరర్ గా ఎందుకు పోవాలి?
“నాకు టీచింగ్ ఇష్టం నాన్నా... మీకు తెలుసు..”
“అయితే మాత్రం కంపెనీలలో నీవు ఎదగడానికి ఆస్కారం వుంటుంది. గుర్తింపు వుంటుంది. మంచి జీతాలు వుంటాయి. అన్నిటికీ మించి నీకు మంచి సంబంధం వస్తుంది...”
“కంపెనీలలో మాత్రమే ఎదగలమని మీకు ఎందుకు అనిపిస్తుంది.?? జీతం ఎక్కువ అనా లేక పెళ్లి అవటం సులభం అనా?”
“రెండూనూ...మాకూ బాధ్యత తీరాల కదా??”
“మీకు మీ అమ్మాయి బాధ్యత తీరాలి అన్నది ముఖ్యమా? చుట్టూ వున్నసమాజం పట్ల మీకు  బాధ్యత లేదంటారా?”
“ఇప్పుడు సమాజమూ, బాధ్యతా ఎందుకు గుర్తుకు వచ్చింది?”
“గుర్తుకు రావటం కాదు. మరచిపోకూడదు. మనమే సమాజం ! అది బాగుండాలంటే మనమందరం బాధ్యులం కాదంటారా?
“రమ్యా....చెప్పేదేదో సూటిగా చెప్పు....”
“సూటిగానే చెబుతున్నా నాన్నా, పోయిన నెల జరిగిన ఒక సంఘటన గుర్తుందా?? ఆరేళ్ళ చిన్నారిని రేప్ చేసి చంపాడు 14 ఏళ్ల కురాడు మన ఏరియా లోనే ...”
“అవును ఆరోజు అందరమూ ఎంతగానో ఫీల్ అయ్యాము”
“ఫీల్ అవటం తో సరిపోదు అని నేనను కుంటున్నా. పోయిన సంవత్సరం మా కాలేజీలో ప్రేమించలేదని తన క్లాస్ మేట్ ఒక అమ్మాయి మీద ఆసిడ్ పోసాడు ఒక విద్యార్ధి. కొన్ని రోజులు ధర్నాలు, ర్యాలీలు చేశాము...తరువాత దాని గురించిన వార్త ఏమైనా ఉందా అని పేపర్స్ లో చూస్తాము. .”
“అంతే కదా ...పోలీసులు, చట్టాలు ఉన్నా యి..”
“అలా అనకండి నాన్నా... అదే నాకు జరిగివుంటే మీ స్పందన ఇలాగే ఉండేదా? పోలీసులు, చట్టాలు తమపని తాము చేస్తాయి అని చేతులు దులుపుకుంటారా?? పదిసార్లు పోలీసులచుట్టూ తిరుగుతారు...ఇంకోసారి ఇలా జరిగితే ఎలా అని ఆలోచిస్తారు. అందరికీ చెబుతారు..”
“అవును మరి...ఊరుకుంటామా ??”
“అదే నేను ప్రశ్నించేది...నాకోసం మీరు ప్రశ్నించి, స్పందించి ఇలా జరగకూడదు అని, మార్పు రావాలి అని ప్రయత్నాలు చేయాలనప్పుడు సమాజం లో ఎవరికీ జరిగినా స్పందించాలి. ఇలా కావడానికి మూలాలు కనుక్కోవాలి...పరిష్కారాలు ఆలోచించాలి..”
“మనం ఒక్కరు ఏదో చేసేద్దాం అనుకుంటే సరిపోదు  కదా. సమాజం మన ఒక్కరి వల్ల ఉద్దరించబడదు. “ కొంచెం తీవ్రంగా అన్నాడు రామచంద్ర.
“ఆ పాయింట్ మీదనే నేను మాట్లాడేది. నిజమే ఒక్కరి  చేత ఉద్దరింప బడదు.  కానీ ఒక మార్పు కోసం అందరూ ప్రయత్నం చేస్తే ఎందుకు కాదు??”
రామచంద్ర లేచి “నేను కాస్త బయటకు వెళ్ళాలి. సాయంకాలం మాట్లాడదాం.” అని లేచాడు . అతేని ముఖం లో ఇంతవరకూ జరిగిన సంభాషణ పట్ల అయిష్టత స్పష్టం గా కనబడింది.
అంతవరకూ మౌనంగా ఉంటూన్న తల్లి విమల కూతురు రమ్య వైపు చూసినా రామచంద్ర బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళేదాకా మాట్లాడ లేదు.
రమ్య తన రూమ్ లోకి వెళ్లి కంప్యూటర్ దగ్గర కూర్చుంది. విమలమ్మ వచ్చి రమ్య దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుని “ఇందాక నాన్న తో మాట్లాడుతూ వుంటే విన్నాను రమ్యా...”
“నీకు కూడా చాలా చెప్పాలి అమ్మా. నా చదువు పూర్తి అయ్యింది కాబట్టి నేనూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ముందు నా నిర్ణయాలు మీరు ఆమోదించాలి అనుకున్నాను” రమ్య మాటలకు అడ్డు వస్తూ 
“నీ చదువు పూర్తి అవగానే ఎలాగూ ఉద్యోగాలు చేతిలో వున్నాయి కదా నీవు ఒక దాన్లో చేరి ఆరునెలలు గడిస్తే నీకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టి సంవత్సరం లోగా పెళ్లి చేసేయాలని మా ఉద్దేశ్యం...” అంది కమల.
“ఈడుకి వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులుగా మీ ఆలోచన తప్పు అని నేను అనను..కానీ అమ్మా  మీరు ఎన్నో విషయాలకి నాకు స్వేచ్చ నిచ్చారు. నన్ను నిర్బంధ పెట్టట లేదు...అందుకే ఇప్పుడు నాలో నిరంతరం ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నా...”
“ నాకూ చెప్పు నీ ఆలోచనలు...”
“అమ్మా, నేను స్కూల్ లో వున్నప్పుడు సెల్ ఫోన్లు వస్తే , నేను కావాలని మొండి చెయ్యలేదు. దాని అవసరం నాకు అంతగా అనిపించేది కాదు. అలా మార్కెట్ లో అవచ్చినవన్నీ కావాలని మారాం  చెయ్యాలని పించకుండా మీరు పెంచారు . అదే విధంగా టెక్నాలజీ పరుగుతున్న కొద్దీ  అవసరమైన కంప్యూటర్, మొబైల్ లాటివి మీరు నాకు ఇచ్చారు. వాటి అవసరం ఎంతవుందో అంతవరకే వాడుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ లో కొంతమంది వాటిని చాలా అనవసర విషయాలకు ఉపయోగించుకుని అదే లైఫ్ అంటూ విపరీత ధోరణిలో పడ్డారు. ఎందుకిలా?? అని తలచుకుంటే పిల్లలను పెంచే విధానం లో పేరెంట్స్ పాత్ర స్పష్టంగా కనిపిస్తూంది. పిల్లల్లో విపరీత ఆలోచనలకు కారణం చూస్తె  పిల్లలను ఎలా పెంచాలీ ??వారిలో  మంచి ఆలోచనలు పెరగడానికి ఏమి చెయ్యాలి?
ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎంతసమయం గడుపుతున్నారు?? ఉమ్మడి కుటుంబవ్యవస్థ మారి న్యూక్లియర్ ఫామిలీలు అయ్యాక తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలకు కావలసినంత స్వేచ్చ, అందుబాటు లోవుంటున్న టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరికీ ఇంటర్నేట్ తో అవసరం వచ్చింది.  వారు హోంవర్క్ చేస్తున్నారా లేదా అశ్లీల దృశ్యాలు చూస్తున్నారా..చెక్ చేస్తున్నారా? ఎవరు గమనిస్తారు? అటువంటి వాతావరణం వుంటే పిల్లవాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అంతే కాదు ఇంట్లో వున్న ఆడపిల్లలకే రక్షణ కరువవుతూంది వావి, వరసలు లేకుండా...ఇలాటి కేసులు చూస్తున్నాం. సగం ఇలాటివి బయటకు పోక్కనివ్వరు. కానీ నష్టపోతున్నది ఎవరు??? మహిళలు!
ఈమధ్య ఎక్కువ అవుతున్న అత్యాచారాలు చూస్తె మహిళలకు లోపించిన బద్రత కనబడుతుంది. ముఖ్యం గా “నిర్భయ “ “దిశా “ లాటి సంఘటనలతో ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా బయటకు రాని  అత్యాచారాలు ఎన్నో...మరి  దీనికి మూల కారణం ఏమిటి?ఎందుకిలా జరుగుతోంది? ఆలోచిస్తూ వున్నా.
టెక్నాలజీ పెరుగుతోంది.ఎన్నో సాధిస్తున్నాము ..కానీ ఇంత నీచంగా ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి.
ప్రతి దాన్లోనూ మంచీ, చెడూ రెండూ వుంటాయి. మంచికి ఉపయోగించకుండా  మొబైల్ వాడకం లో అశ్లీల దృశ్యాలు చూసి ఆడపిల్లల మీద ఇలాటి దాడులు జరుగు తున్నాయా?
ఎందుకు మగపిల్లలు ఈ విధం గా బిహేవ్ చేస్తున్నారు? మద్యం అందుబాటులో వుండటం వల్లనా? లేక ఆడపిల్లలే తమ వస్త్రధారణతోనూ, ప్రవర్తన తోనూ రెచ్చగొడుతున్నారా?? ఈ అపవాదు కూడా వుంది. ఏది ఏమైనా ఆడపిల్లలు ప్రతి వయసులో, ప్రతి క్షణం, ఎలా రక్షించుకోవాలో నేర్పాలా? లేక మగవారి మనసుల్ని మార్చాలా?  ఆడది అంటే ఒక లైంగిక  వస్తువు కాదు అన్న భావం వచ్చేలా చెయ్యాలి. ఆడది లేకపోతే జన్మ లేదు,జీవితం లో తల్లి ,చెల్లి, అక్క, అమ్మమ్మ ,నాన్నమ్మ ఎవరూ లేకుండా ప్రపంచం ముందుకు సాగుతుందా??
ఒక అత్యాచారం లో నేరస్తుడు పట్టు బడ్డాక ఎందుకు శిక్ష అమలు ఆలస్యం అవుతూంది??
అన్నిటికంటే ముఖ్యం  తల్లిదండ్రుల పెంపక౦. అది ఎలా వుంటే బాగుంటుంది??
ఇలాటి ఆలోచనలతో నాకు ఒకే మార్గం కనిపిస్తూంది.
మీరు చెప్పినట్టు ఒక మంచి కంపెనీ లో చేరి ఆ తరువాత పెళ్లి చేసుకోవడం కన్నాఒక లెక్చరర్ గా చేరి 
పిల్లలకు చదువుతో బాటు మానవత్వపు విలువలు నేర్పి , సాయంకాలాలను కొన్ని  స్కూల్స్ లో ప్రత్యేకంగా క్లాసులు తీసి మగపిల్లల ఆలోచనలకు, ఆడపిల్లల స్వయం రక్షణకు ఏమి చెయ్యాలో చెప్పాలి అనుకుంటున్నాను.
దేనికైనా ఒక బిగినింగ్ వుండాలి అది నాతోనే ఎందుకు మొదలవకూడదు? నాతో బాటు నలుగురు కలిసి ఒక సంస్థ లాగా ఏర్పడి సమాజం లో మార్పుల కొరకు ఎందుకు పాటు పడకూడదు?”
ఆపింది రమ్య రూమ్ లోకి రామచంద్ర రావటం తో .....
“నీవు చెప్పినది వింటున్నా తల్లీ...నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను .కానీ నీవు ఒక్కదానివో , కొంతమంది కలసో మార్పుని తీసుకురాగలరా?? ఒక్కసారి ప్రశ్నించుకో...సమాజాన్ని మార్చే తీరు ఇలా కాదు..ఒక ఉద్యమం లా రావాలి ప్రతి ఒక్కరి మనసులో కదలిక కలగాలి.అది సాధ్యం అవుతుందా??”
“ఎక్కడో ఒకదగ్గర మొదలైతే కదా అది ఉద్యమం అవుతుంది. నన్ను ప్రయత్నం చెయ్యనివ్వండి నాన్నా ...అందులో సక్సస్  అవక పోతే మీరు చెప్పిన విధంగా పెళ్లి  చేసుకుంటాను.”
“నీ ఇష్టం అమ్మా, నాకు నీ ప్రయత్నం మీద నమ్మకం వుంది. కానీ ఒక రెండేళ్ళు మాత్రమే  టైం ఇవ్వగలను..తరువాత నీవు మేము చెప్పిన విధంగా వినాల్సిందే..”
“తప్పకుండా నాన్నా..థాంక్స్  నన్ను అర్థం చేసుకున్ననదుకు..”అంది రమ్య నాన్నదగ్గరగా వచ్చి  భుజం మీద  తలపెడుతూ...
అలా ఒక ఇంట్లో ఒక బీజం ఆశగా మొలకెత్తడానికి రెడీ అయ్యింది . సమాజం లో కదలిక వస్తుందా?? వేచి చూడాల్సిందే...........

ముందు చూపు

రామూ, ఒక సారి వచ్చి వెడతావా?” అక్క సుమతి  ప్రశ్నకు

ఎందుకే ?? ఇలా ఎప్పుడు పిలవని నువ్వు పిలుస్తున్నా వంటే ఏదో బలమైన కారణం వుంటుంది. అంతా బాగే కదా ?”అన్నాడు తమ్ముడు రాము.

...అంతా బాగున్నాము. మీ బావ కాంప్ వెళ్ళారు...నీతో ఒక విషయం మాట్లాడాలి

ఏమైందే..బావ ఏమైనా అన్నారా ఏమి?”

బావతో కాదు లే... రాజేష్ విషయంగా.ఇంకా ఏమి, ఎక్కడా అని ప్రశ్నలు వెయ్యకుండా సాయంకాలానికి వచ్చేసేయ్...”ఫోన్ పెట్టేసింది సుమతి రాముకు అన్నీ ఫోను లోనే వివరించ లేక.

సాయంకాలం ఐదు గంటలకల్లా రాము వచ్చేసాడు. తన వూరి నుండీ ఒక గంట ప్రయాణం అంతే. అందుకే టౌనులో ఏ పని వున్నా అక్కా వాళ్ళ ఇంటికి రావటం అలవాటే.

ఏమీ సమస్యలు లేని అక్క కుటుంబం ఎప్పుడూ ఆదర్శమే రాముకు. తనకు ఎన్నో విషయాలకు సలహాలు ఇచ్చే బావ గారు రవి! అక్క సుమతీ,బావ రవి,వారి కొడుకు రాజేష్. వారిదేప్పుడూ ఆదర్శ కుటుంబమే!రాజేష్ తో సమస్య ఏమిటి? వాడి భవిష్యత్తుకై ప్రతి నిర్ణయం లో ఎంతో జాగ్రత్త వహిస్తారు వారు...ఇలాటి ఆలోచనలతోఅక్క ఇంటికి వచ్చాడు రాము.

రాగానే చల్లటి మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ కలుపుకుని తీసుకువచ్చింది సుమతి.

రాజేష్ ఎక్కడా??” అనడిగాడు.

రాజేష్ క్రికెట్ ప్రాక్టీసు వుందని స్కూల్ గ్రౌండుకు వెళ్ళాడు.”

ఎంసెట్ కోచింగ్ కు వెడుతునాడు కదా

ఆ వెడుతున్నాడు...ఆ తరువాతనే  వచ్చింది తంటా...”

ఏమైంది..”

వాడికి వున్న క్రికెట్ పిచ్చి తెలుసు కదా...ఆటగాడిగా స్కూల్ లో బాగా గుర్తింపు...ఇంటర్ చేరినప్పటినుండీ స్టేట్ లెవల్ లో ఆడటానికి చాన్సు వస్తుందని ఆశ! దాని తో ఎంసెట్ రాయను..అందరూ ఇంజనీరింగ్ చదవాలా? ఇలా అనుకుంటే మనకు గవాస్కర్, గంగూలి, ధోని, సచిన్ లాటి వారు వుండేవారా? క్రికెట్ అంటే ఇంత క్రేజ్ వున్న దేశం లో పుట్టాక నా టాలెంటు కు అడ్డం వేస్తారా?అని వాదిస్తున్నాడు...నీవు స్వయానా ఈ విషయం లో పడ్డ అవస్థలు వాడికి తెలియదు కదా...నేను చెబితే వాడు వినటం లేదు రామూ. నీవైనా చెబుతావేమోనని నిన్ను రమ్మన్నాను. మీ బావ వచ్చాక సమస్య ఇంకా తీవ్రమైతే కష్టం....”

నేను రెండురోజులు వుంటే బెటర్ అనుకుంటా రాగిణి కి ఫోన్ చేస్తా ఆలస్యం అవుతుందని..”అని భార్య రాగిణి కి ఫోను చేసాడు.

సుమతి, రాము మాట్లాడుతున్నప్పుడే వచ్చేసాడు రాజేష్.

రాజేష్ వచ్చాక సంభాషణ మామూలుగా మారింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాక భోజనం చేశారు. సుమతి అన్నీ సర్దుతూ వుంటే

అక్కా నేనూ, రాజేష్ వాక్ కు వెళ్లి వస్తాము అన్నాడు రాజేష్ ని రమ్మని చెబుతూ.

సరే అంది సుమతి.

రాము, రాజేష్ ఇద్దరూ మెల్లిగా నడుస్తూ వున్నారు

రాజేష్....కోచింగ్ బాగా ఉందా? ఎంసెట్ కు బాగా ప్రిపేర్ అవ్వాలి కదా...”

కోచింగ్ బాగుంది మామయ్యా.కానీ నాకే ఇష్టం గా లేదుఅన్నాడు రాజేష్.

ఏమిటి ఇష్టం లేనిది?? కోచింగా??”

అసలు ఇంజనీరింగ్ వెళ్ళటమే ఇష్టం లేకుంటే కోచింగ్ వెళ్ళటం ఇష్టం ఎలా అవుతుంది?”

ఇంజనీరింగ్ ఇష్టం లేదా?? మరి మొదటినుండీ మీ పేరెంట్స్ మా వాడు ఇంజనీరింగ్ చేస్తాడని చెబుతూనే వున్నారు కదా? నీకు ఇష్టం లేదు అని ఎప్పుడైనా చెప్పావా??”

అప్పుడు చూద్దాం లే అనిపించేది కానీ ఈ సంవత్సరం  స్టేట్ లెవల్ కి వెళ్ళచ్చు అన్న ఆలోచన కలగడం తో నాకు ఇప్పుడు పూర్తి ఇష్టం స్పోర్ట్స్ లోనే వుంది అనిపిస్తుంది. మామయ్యా

ఈ వయసులో అలా అనిపించడం సహజమే! నీకు ముందు జీవితమంతా క్రికెట్ వుంటున్నట్టు వుంటుంది...”

స్పోర్ట్స్కోటాలో చదువులే కాదు, ఉద్యోగాలూ దొరుకుతాయిమామయ్యా....”

రాజేష్ తన ఇష్టాన్ని ఎంతగా సమర్థించు కోవాలని చూస్తాడో అర్థం అయ్యింది రాము కు.

రాజేష్ నీవంటున్నది నిజమే...కాదనను కానీ నీకు దానిలో వుండే లోటుపాట్లు తెలియవు... కాస్స్సేపు ఇక్కడ కూర్చుందామా?అని రోడ్డు పక్కగా వున్న సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు ఇద్దరూ.

నా ఫ్రెండు ఒకరికి నీలాగే క్రికెట్ పై విపరీతమైన ఇష్టం వుండేది..స్కూల్ దాటాక కాలేజీ లెవల్ లో గానీ తెలియలేదు దానిలో  ఎన్ని లొసుగులు వున్నాయో...కోచింగు లో కూడా స్పోర్ట్ టీచర్ కి ఫేవరేట్ అవుతేనే స్థానం వుంటుంది. ఎలాటి ఆట లో నైనా పైకి రావాలంటే రాజకీయాలు చాలా వుంటాయి. క్రీడా శాఖ కమిటీలు ఒక ఎత్తు, వేరే దారుల్లో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వుంది...”

ఆగు మామయ్యా ...అలాటివే వుంటే ఒక కపిల్ దేవ్, ఒక ధోనీ వచ్చేవారా? ఎవరైనా టాలెంట్ తోనే ఎదుగుతారు...”

అవును టాలెంట్ తోనే ఎదగాలి మొదట ఇంటర్ కాలేజీ లెవల్ లో తరువాత స్టేట్ లెవల్ లలో, నేషనల్ లేవల్లో అడుగడుగునా అడ్డంకులు వుంటాయి సెలెక్ట్ చేసేవాళ్ళు , కెప్టన్ అన్నీ అయ్యాక నీ ఆట...ఇవన్నీ అందరికీ తెలుసు. ఒక్క క్రికెట్ నే కాదు, హాకీ, ఫుట్ బాల్, వాలీ బాల్ ఏదైనా మంచి ఆటే. ఆటగాళ్ళు ఆడుతూంటే ఫాన్ ఫాలోఇంగ్..విపరీతమైన అభిమానాలు,ఆరాధనలూ చూపుతూ ఒక దేవుడిలా చూస్తారు. అంతా ఆట నీవు ఆడినంత సేపే. నీవు  కనక రెండుసార్లు ఫెయిల్యూర్ అయితే అంతే ఈ ప్రభావం విపరీతంగా తగ్గిపోతుంది. నీకు తెలియదా ఎంతగా తిట్టిపోస్తారో...

రాజేష్ , ఏఆట అయినా ఆడేది ఒక వయసుదాకానే ! జీవితంతా ఆడుతూనే వుండిపోవడానికి వీలుకాదు కదా. నిజమే,ఆట లో నీవు రాణిస్తే భారీ గా డబ్బు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కానీ అంతవరకూ ఎదగ లేక మామూలు ఆటగాడిగా వుండి  పోతే అదే జీవనాధారం కాదు కదా...జీవనం సవ్యంగా సాగడానికి  ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కదా..దానికి తగ్గ చదువు తప్పనిసరి...ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యమే. రాజేష్ అందుకే మీ  వయసు వారికి  ఒక పటిష్టమైన ఆధారాన్ని కల్పించాలని తల్లిదండ్రులు తాపత్రయ పడతారు. వారికి జీవితం చదివిన పుస్తకం ....మీకు ఇంకా తెరవని పుస్తకం...” ఆపి రాజేష్ భుజం పై చెయ్యి వేశాడు.

నాకింకా కన్ ప్యూజింగా వుంది మామయ్యా...చదువు పూర్తి అయ్యాక ఆటలకు వయసు దాటి పోతుంది. నాకు ఆటంటేనే ఇష్టం...”

కాదనలేదు...పెద్దలు ఎందుకు చెబుతారో ఆలోచించు... పోదామాఅంటూ లేచాడు రాము. రాజేష్ అనుసరించాడు.

******!

తను చిన్నప్పుడు క్రికెట్ క్రేజు లో తల్లీ తండ్రి మాట వినకుండా దానిలో పైకి ఎదగలేక, చదువులో ముందుకు పోక జీవితాన్ని కష్టంగా  గడుపుతూ వుండటం అద్దం లో కనిపించేనిజం!   రాజేష్ కి వివరించిన ఈ బాధలు స్వయంగా అనుభవించినవే అని నేరుగా చెప్పలేక డొంకతిరుగుడుగా చెప్పినా...ఉత్సాహంగా వున్న ఒక ఆటగాడి కాళ్ళ కు బంధం వేస్తున్నానా అన్న బాధ ఎక్కువ కలిగింది రాముకు.

రాజేష్ నిర్ణయం ఎలా వుంటుందో  అన్న యోచన లో వున్నాడు రాము.

ఇంట్లో వున్నవున్న సుమతి ఆలోచనలు వేరుగా వున్నాయి.

పిల్లలు దేనిలోనైనా నైపుణ్యం పెంచుకునేలా ప్రోత్సహించే కాలం ఇది.ఎదిగే పిల్లల అభిప్రాయాన్ని అర్థం చేసుకుని వారి నైపుణ్యాన్ని పెంచుకునేలా చెయ్యాలనీ తమ ఆలోచనలనూ వారి మీద రుద్దకుండా ఒడ్డున వుండి సూచన ఇవ్వాలనీ సైకాలజీ చదివిన తనకు తెలియనిది కాదు. ఎదగాలనుకున్న ఏ క్రీడా రంగం అయినా  పూర్తిగా రాణిస్తే తప్ప విజయం వుండదు అన్న అవగాహన కల్పించేలా వ్యవహరింఛి జీవిత శిఖరాల నేక్కించే విధానం తెలియ చెయ్యాలని, క్రికెట్ మీద అతీ ఇష్టం తో దానిలో ఎదగలేక దెబ్బతిన్న తమ్ముడు రాము తో చెప్పించి చిన్న ప్రయత్నం చేస్తూంది.

        క్రికెట్ మాచ్ వచ్చినప్పుడు టి.వి. లకు హత్తుకుపోతారు భారత దేశం లో. ఇష్టమైన క్రికెటర్, ఇష్టమైన మాచ్, 6 రన్స్ కొడితే వచ్చే త్రిల్ అన్నీ మామూలుగానే వుంటాయి. కానీ అదే క్రికెట్ నేర్చుకుని క్రికెటర్ అయిపోతా అనే పిల్లల్ని ఇంట్లోనే వద్దు అనటం జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు  ఏ ఆలోచన చేసినా దాని వెనుక వారి భవిష్యత్తు గురించిన తాపత్రయం ప్రతి తల్లిదండ్రులకీ వుంటుంది. జీవితాన్ని చదివిన, అనుభవించిన దాన్ని బట్టి పిల్లల భవిష్యత్తు అద్దంలో కనబడుతుంది వారికి.

                             

                           

ఆంతర్యంలో అమ్మ

భర్తశ్యామ్వచ్చే వరకూ కాస్త టెన్షన్...

ఆలోచిస్తూ సోఫాలో జారిగిలబడి తలను వెనక్కి వాల్చింది రమణి.

ఈ రోజు అమ్మ మరీ, మరీ గుర్తుకు వస్తోంది.

కొన్ని విషయాలు మనసును కలచి వేస్తున్నాయి. అమ్మా తానూ... ఎలావుండేవి ఆరోజులు? అమ్మతో పోట్లాడితే సంతోషం అప్పుడు...నెమ్మదిగా జ్ఞాపకాల పుటలు కదలసాగాయి ...

*****.

“ఈ సారి బర్త్ డే కి నేను నా ఫ్రెండ్స్ ని హోటల్ కి తీసుకెడతా. నీవు ఎలాగూ ఇంట్లో పార్టీ వద్దు అంటావు కదా.

నీ చూపులకు దూరంగా ఎంజాయ్ చేస్తాను..నేనేమీ చిన్న పిల్లను కాను” అంటూన్న కూతురు రమణి ని ఒక్క సారి చూసింది సరస్వతి.

“నేను నిన్నేమీ అడగటం లేదు. నాన్నగారు వచ్చేవరకూ కాచుకుని మరీ అడిగి ఒప్పిస్తాను..”ఛాలెంజ్ గా ఒక్క చూపు చూసింది రమణి తల్లి వైపు. ఇంకేమైనా సమాధానం చెప్పినా గొడవ తప్పదు అని నెమ్మదిగా లోపలికి నడిచింది సరస్వతి..అమ్మ అలా మౌనంగా వెళ్ళటం తోఏదో సాధించినట్టు ఫీల్ అయ్యింది రమణి.

అసలు ఇలాటి విషయాలు నాన్నదాకా పోవాల్సింది కాదు ఎన్నాళ్ళు  భరించినా అమ్మ మారటం లేదు. నాన్న ది బిజినెస్ కాబట్టి ఇంటికి రావటం ఆలస్యం కావటం మామూలే. పొద్దున కూడా కాలేజీకి వెళ్ళే సమయానికి ఆయన వున్నా కూర్చుని మాట్లాడే టైమే వుండేదికాదు. అలా అని అమ్మ మరీ చెడ్డదేమీ కాదు. ఏది  కావాలన్నా దాన్ని పూర్వా పరాలు ఆలోచించి నచ్చ చెప్పేది.  మొన్న కూడా బర్త్ డే డ్రస్ కూడా అంతే. కాలేజీలో అందరూ గ్రాండ్గా వున్న డ్రస్సులే కొంటారు అని చెప్పినా తను మాత్రం అలా కొననివ్వదు ఎందుకో.డబ్బులకేమీ తక్కువ లేదు. నాన్న బిజినెస్ బాగుంది. దేనికీ తక్కువ చేయక్కరలేదు....అసలు నాన్న అమ్మను  ఏమీ అనకుండా ఎందుకు వుండేవారు? ఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? ఇలాటి ఆలోచనలతో వున్నప్పుడు రమణి కి అమ్మ తో మాట్లాడడం కూడా ఇష్టం వుండేది కాదు. చాలా విషయాల్లో అమ్మను ఎదురించేది అయినా అమ్మ సమాధానం చెప్పేది కాదు. అది మరీ వొళ్ళు మండేది.

ఒకరోజు బాగా అమ్మను ఎదురించి మాట్లాడాక నాన్నకు చెప్పాలనే రాత్రి మేలుకుని నాన్నకోసం ఎదురు చూసింది. అన్నం కూడా వొద్దని అంటే అమ్మ ఏమీ అనక పోయినా నాన్న రాగానే ముగ్గురికీ కంచాలు పెట్టి డిన్నర్ రెడీ చేసింది.

నాన్న రాగానే “అదేమిటి, రమణి కూడా తినలేదా ఇంతవరకూ “ ఆశ్చర్యపోయారు. “మీరు పిలవండి” అని అమ్మ చెబితే “రమణీ, ఎందుకురా ఇంతసేపు తినలేదు.. రా.. భోంచేద్దాం”అంటే తప్పని సరి కూర్చుంది.

నాన్న అడిగిన వాటికి అమ్మ ముఖ౦ చూడకుండా  సమాదానం చెబుతోంటే

“ఏమిటీ ?అమ్మ మీద అలకా?” అని నవ్వి“భోంచేశాక నాదగ్గరికి రా కాస్సేపు” అన్న నాన్నని ప్రేమగా చూసింది రమణి. తన మూడ్ ను క్షణం లో గ్రహించిన నాన్నతో అన్నీ మాట్లాడాలనే అనిపించింది చాలా.. డైనింగ్ టేబల్ దగ్గర అమ్మ మౌనంగానే వుంది. ‘ఇలా వుంటూనే నాన్నని బుట్టలో వేసుకుని ఆడిస్తోంది’అనుకుంది కసి గా.

అమ్మ వంటింట్లో అన్నీ సర్డుతో౦టే  గబ గబా బాల్కనీ లో సిగరెట్టు కాలుస్తూ వున్న నాన్న దగ్గరికి వెళ్ళింది.

అక్కడే వున్న  కేన్ చైర్ లో కూర్చుంటూ “రమణీ, ఎలావుందిరా చదువు? అమ్మ చూసుకుంటుందనే భరోసా తో మీతో స్పెండ్ చేసే సమయం లేకపోయినా ఫీల్  అవను .. చెప్పు ఏదైనా చెప్పాలా?” లాలనగా అడుగుతున్న నాన్న దగ్గరగా కుర్చీ లాక్కొని ఆయన చేతిలో చేయి వేస్తూ

“నీవు ఇలా అడుగుతూంటే ఎంతబాగుందో నాన్నా.. ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా అమ్మ తోనే చెప్పడం,తను చెప్పినట్టు మీరు వినడం తోనే సరిపోతుంది. పైగా చిన్నప్పటి లాగా కాకుండా మీరు మరీ బిజీ అయిపోవడం నచ్చలేదు నాన్నా” మనసులో మాట ఇలా చెప్పడం ఎంతబాగుందో రమణి కి.

“అవున్రా  నాకూ అలాగే వుంది.. ఇంతకు మునుపు కంపెనీ ఎలా పైకి రావాలని తాపత్రయం, ఇప్పుడు బాగా నడుస్తోంటే ఇంకొద్దిరోజులు ఇలా నిలుపుకుంటే కొంచెం రిలాక్స్ అవవచ్చని ఉద్దేశ్యం. అయినా ఏమి చేసినా నిన్ను బాగా సెటిల్ చేసి మేమూ హాయిగా వుండాలనే కదరా.. దేనికైనా ఇంట్లో మీ అమ్మ సహకారం తోనే ఇదంతా..”అంటూన్న నాన్నని చూసి తాను చెప్పాలన్నది చెబితే బాగుంటుందా అని ఒక క్షణం ఆగింది.

కానీఈ రోజు ఏమైనా చెప్పాల్సిందే అనిపించి “నాన్నా, మీకు ఎలా చెప్పాలో తెలియక పోయినా ...” రమణి మాట పూర్తి కాకనే

“చెప్పరా.. నా దగ్గర దాయడమెందుకు ?” అన్నారాయన

“నాన్నా నేను చిన్నగా వున్నప్పుడు మీరు ఇంట్లోనే వుండే వాళ్ళు. ఇప్పుడు ఏది కావాలన్నా అమ్మ చెప్పినట్టు వినాల్సిందే.. నాకూ వయసు పెరుగుతోంది. కోరికలు వుంటాయి ఏది కోరినా అమ్మ వెంటనే వినదు. ఆఖరికి నా బర్త్ డే కి మంచి డ్రెస్ కావాలన్నా, పార్టీ చేసుకుంటానన్నా ఒప్పించడం కష్టమే. అది చాలా ఫీల్ అవుతోంది.ఎప్పుడూ నాకు ఒక్కటే ప్రశ్నఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక మీరు అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? అసలు ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? అనిపిస్తుంది...” కాస్త అర్థం చేసుకోండి అన్న భావం తో చూసింది

“రమణీ, నిజమే  ఎదుగుతున్న నీకు వచ్చే ఆలోచనను నేను అర్థం చేసుకోగలను. నాకు టైమే దొరకక పోవడం ఒక కారణం అయినా ఈ రోజు మంచి అవకాశం ఇచ్చావు. అమ్మకు నేను ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నానే కదా.. చాలా చెప్పాలి రా.. నీవు చిన్నగా వున్నప్పుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నా ఊద్యోగం పోయింది అమ్మ దైర్యం చెప్పింది. కొన్ని రోజులు ఇల్లుగడవక పక్కనే వున్న చిన్నప్రైవేటు స్కూల్ లో తన టెన్త్ క్లాస్ చదువుతోనే పిల్లలకు చదువు చెప్పేది. అప్పుడే నేను ఇంట్లో వున్నాను.ఒక రెండు నెలల్లో ఇలాగే గడవదని తెలిసి పోయింది.నాకు వెంటనే ఉద్యోగం దొరికే ఛాన్స్ లేదు. ఇరువైపు కుటుంబాలకూ తెలియకూడదని నిర్ణయించుకున్నాక తన కున్న కొద్ది బంగారాన్ని, పుస్తేల తాడుతో సహా నాచేతిలో పెట్టి అమ్మించి౦ది. అమ్మ సలహాతో నాకు ముందు ఉద్యోగం లో వున్న ఎక్స్పీరియన్స్ తో చిన్నగా ఒక ఏజెన్సీ  గా మొదలు పెట్టాను. ఎదగడానికి టైమ్ పట్టింది. అప్పుడు ఇంటి గురి౦చి  నేను ఆలోచించకుండా.. అన్నీ ఖర్చులు పొదుపు గా చేయడం కాకుండా నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకో సాగింది. తనకు చదువు లేదు అన్నావు కదా.. చదువు నేర్పేదానికంటే ఎక్కువ జీవితాన్ని చదివింది. చదువుకున్న వారికంటే ఎంతో మెరుగ్గా పని చేసేది. ఆమె ద్వారా కష్ట సమయంలో కూడా నిరాశ పడకుండా ఎలా ముందుకు పోవాలో తెలుసుకున్నాను. నీకు తెలియదుఅమ్మ ప్రైవేటుగా బి. ఎ కూడా పాసయింది.ఏ అవసరానికైనా చదువు సర్టిఫికెట్ చేతిలో వుండాలని చెబుతుంది.

నీకు ఇన్ని విషయాలు ఎందుకు వివరిస్తున్నానంటే అమ్మ మనస్తత్వం తెలుసుకోవాలి ఎందుకంటే  తనకు తానుగా ఏదీ చెప్పదు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే కదా నీవు ఏమి చదివితే బాగుంటుందో నాతో డిస్కస్ చేసింది. ఇంట్లో ఏమి చేయాలన్నా మాకు ఒక ప్లాను వుంటుంది. ఒకటే ధ్యేయం...మాలాగా నీకు ఎప్పుడూ కష్టకాలం రాకూడదు. ఒకవేళ వచ్చినా ధైర్యం గా ఎదుర్కునేలా నిన్ను పెంచాలని. అంతే.

నీ క్షేమమే కాదు, మేము కూడా జీవితాంతం ప్రశాంతం గా వుండాలని... కానీ ఇప్పుడనిపిస్తోంది కొన్ని విషయాలలో మీకూ ఫ్రీడం ఇవ్వాలని, అమ్మ మాత్రం ‘టీనేజీ దాటాక తనే అన్నీ అర్థం చేసుకుంటుంది అనిఅనేది నీ మీద అంత నమ్మకం.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. రేపటినుండీ గమనిస్తే తెలుస్తుంది ..” అని నాన్న అన్నాక రమణిమనసును కప్పుకున్న ఒక తెర పైకి లేచినా అమ్మనుఅర్థం చేసుకోవాలి  చూద్దాం అనుకుంటూ“గుడ్ నైట్ నాన్నా” అని చెప్పి తనరూముకు వెడుతూ అమ్మా, నాన్నల బెడ్ రూమ్ వైపు ఒకసారి చూసింది.

హాయిగా నిద్రపోతూంది అమ్మ!అంత నిశ్చింత ఎలా ???

*****

“రమణీ, ఇక్కడే పడుకున్నావా?” అంటూ లోనికి వచ్చిన శ్యామ్ ని చూస్తూ గతానికి తెర వేసి

“ఏదైనా కుదిరిందా ? మీ ఫ్రెండ్స్ ఏమమన్నారు?” అనడిగింది  ఆతృతగా

“ఒక విధంగా ముగ్గురు ఏకగ్రీవంగా ఒకే ఐడియాకి వచ్చాము. పెట్టబడి కష్టం అని శ్రీకాంత్ తప్పుకున్నాడు. నీతో కలిసి నలుగురం.ఒక్కొక్కరికీ ఎంత పడుతుందని డిసైడ్ చేయాలి. “

“పెట్టుబడి పరవాలేదు అనినేను చెప్పాను కదా.. నాకు అమ్మా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా నగలు కూడా వున్నాయి. ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. తప్పకుండా సక్సస్ చూస్తాము.”

“నీ దైర్యమే నాకు శ్రీరామ రక్ష.”అని శ్యామ్ రమణిని దగ్గరికి తీసుకున్నాడు.

పాండమిక్ వల్ల ఇద్దరి ఉద్యోగాలూ ఒకే నెలలో పోవటం జరిగింది. రమణి కంటే ఎక్కువ డీలా పడిపోయాడు శ్యామ్. కానీ రమణి ప్రతి క్షణం అతనికి దైర్యం చెబుతూ ఒక స్టార్ట్ అప్ కంపెనీ పెట్టడానికి ప్రోత్సహించింది. కష్ట కాలం లోనే మనం నిలబడాలి అన్నది చేసి చూపుతోంది.

ఆ రాత్రి “నీలాటి దైర్యస్థురాలు నాకు భార్య గా దొరకడం ఎంత అదృష్టమో..” అంటూన్న శ్యామ్ ఎదమీద తలవాల్చి ‘థాంక్ యు అమ్మా..’ అనుకుంది అమ్మను తలచుకుంటూ.

*******                                                                 

 

 

 

 

ఈ సంచికలో...                     

Jan 2022

ఇతర పత్రికలు