1
అందగత్తె
ఎందుకా పొగరు,
నీ అందమైన నారింజ రంగు కాళ్ళు చూసుకునా?
లేత పాల తెల్లని రెక్కలు చూసుకునా?
ఎందుకా గర్వం,
నీ మధురాన్ని మించిన ఏ సెంటూ ఇంకా రాలేదనా?
నీ ముందు వేరే ఏ పువ్వు నిలబడదనా?
ఎందుకా కొంటె నవ్వు,
నిన్ను ఎవరూ ప్రేమించకుండా ఉండలేరనా?
నిన్ను తాకిన ఎవరూ మరువలేరనా?
ఎందుకా మౌనం,
నువ్వు మాకిచ్చే హాయికి తృప్తా?
మా లేత నవ్వుకు కారణం నువ్వేనని తెలిసా?
ఎందుకా భయం,
వేకువకు ముందే రాలిపోతావనా?
రాలిన నిన్ను ఏరతారో లేదోననా?
ఎందుకా బాధ,
చెట్టు నుండి దూరమవుతావనా?
లేక నీ దేవుని పాదాల వద్దకు చేరువవ్వలేవేమోననా?
ఎందుకా అందం, ఆనందం, తాజాదనం, పారిజాతం?!
2
ఓ చిన్న దానా
ఓ చిన్నదానా,
ఏ చిన్ని కన్నం నుండి ఊడిపడతావో తెలీదు,
ఏవో చిన్ని చిన్ని మేము పారేసిన తుక్కు ముక్కలను ఏరుకెళుతుంటావు ఎక్కడికో,
నల్లగా ఉంటావు, మాకు ఏ హానీ కలిగించవు,
ఏ చిటికన ఏ కాలు కింద పడతావో తెలీదు, జాగ్రత్త సుమీ,
తీపిని భలేగా ఇష్టపడే జీవి, నువ్వే నా కన్నా కష్ట జీవి,
ఓ చిన్ని చీమ, నువ్వెక్కడకెళతావో తెలుసుకోవాలన్న నా ఈ చిన్న కోరికను తీరుస్తావా?
3
తెల్ల గౌను పాప
దీపాలతో గుడి నిండింది.
అందరూ పలురకాల ప్రమిదల్లో దీపాలు పెడుతున్నారు.
అందరితో పాటు ఓ చిన్ని పాప కూడా వెలిగిస్తోంది దీపం.
ముఖం మీద పడిన జుట్టు పక్కకు నెట్టింది ఆ పాప, తన బుల్లి చేత్తో.
గౌను దెగ్గరగా లాక్కుంది ఇంకో చేత్తో.
నాలుక బయట పెట్టింది, వత్తు వెలిగిస్తూ.
వెలిగిన దీపాన్ని చూసింది, ఆశ్చర్యం నిండున్న పెద్ద కళ్ళతో.
దీపాల వెలుగులో మెరిసిపోతోంది, తన ముఖం, మురుపుతో.
భలే ముద్దుగా ఏదో చదివింది మనసులో.
ఆ పున్నమి చంద్రుడే అసూయపడేలా ఉంది ఆ పాప, తన తెల్ల గౌనులో.
4
మా గోడ
చెరో చేతిలో ఓ రాయి పట్టుకుని,
ధైర్యం ఇచ్చేదాన్ని,
పిల్లులేవి రాకుండా కాపాడతానని.
అదేంటో గాని జామపండు వద్దంటూ,
బియ్యం గింజలే తినేది,
టక్ టక్ మంటూ భలే శబ్ధం చేసుకుంటూ.
ఎక్కడున్నా గాని, ఇట్టే వచ్చేసేది ఎగురుకుంటూ,
నా ఈల విని, ఆ గోడ మీదకి,
ఎప్పుడైనా నేను మరచిపోతే,
అదే వచ్చి నన్ను పిలిచేది క్రీచ్ క్రీచ్ మని,
త్వరగా రా అంటూ.
కొన్ని రోజులకు ఆ గోడ పడగొట్టేసారు,
ఓ భవన నిర్మాణం కోసం.
అప్పటినుండి మళ్లీ రాలేదు ఆ ఎర్ర ముక్కుది,
నాకు మళ్లీ ఎప్పుడైనా కనిపిస్తావా,
నా బియ్యం గింజలు మళ్లీ తింటావా???
5
ఓయ్ సూరి
ఏమిటోయ్ మరీ అంత కోపం?
దేనికా కోపం? ఎవరిమీదా కోపం?
ఈ వాళ మరీ ఎక్కువగా మండిపడుతున్నావేం?
నీ స్నేహితులతో పోట్లాటలకు అంతు లేకుండాపోయిందా?
లేక చంద్ర లాగా నిన్ను చూపించి గోరు ముద్దలు తినిపొంచట్లేదనా?
పెంద్రాలే లేవగానే ఎంతో ముద్దుగా ఉంటావ్,
ఆ నవ్వు ముఖాన్ని ఎంతో సేపు ధరించవు!
కొన్ని గంటల్లోనే ముఖం నిండా, కోపం నింపుకుని ఎర్రగా ఆయిపోతావు!
సంధ్య వస్తే గానీ, చల్లారదు నీ కోపం.
ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవోయ్
మరీ అంత కోప్పడకోయ్! ఓయ్ సూరి!
స్పెషల్ ట్రైన్
చాలా మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు, కొంత మంది సంతోషంగా, ఇంకొంత మంది వీడ్కోలు చెప్తూ దిగులుగా, మరికొంత మంది కంగారుగా, అలా రకరకాల మనుషులని చూసిందీ ట్రైను.
అలా ఎలాంటి వారినైనా, కాస్త అటూ ఇటూ అయి ఆలస్యమైనా గమ్యానికి మాత్రం తప్పక చేరుస్తుంది ఈ స్పెషల్ ట్రైను. ట్రైను బయలుదేరగానే కొంత సమయానికి అందరినీ తమ గమ్యానికి ముందుగా, వారి ఊహా లోకాలకి చేరుస్తుంది.....
అసలు అలాంటి పరిస్థితి నుండి ఎప్పటికీ బయటపడలేనేమోనని అనిపించింది ఒకప్పుడు. ఇంకా గుర్తున్నాయి నాకు ఆ రోజులు, ఎంతైనా నా తొలిప్రేమ కదా! నేను ఎంత కావాలనుకుంటే అది నాకు అంత దూరం అయ్యేది. జీవితం మీద పెద్దగా ఆసక్తి లేని నాకు, నువ్వు ఒక కొత్త వెలుగులా కనిపించావు. నిన్ను పొందితే, జీవితంలో ఇంక ఏదీ అక్కర్లేదనిపించింది. అమ్నానాన్నకు చెప్పినా, వ్యతిరేకిస్తారని తెలుసు, అయినా ధైర్యం చేసి చెప్పా ఓ రోజు, ఎలాగూ అదే జరిగింది. రోజూ ఊరి చివర ఉన్న పాతబడ్డ లైబ్రరీకి నీకోసం వచ్చేద్దాన్ని, రహస్యంగా. నిన్ను చూసినకొద్దీ ఇంకా చూడాలనిపించేది. నీకోసం అమ్మానాన్నలతో ఎన్నోసార్లు గొడవాడా, మీరు చూపించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను అని. అలా ఆసారి జరిగిన గొడవ నా జీవితాన్నే మార్చేసింది.
"ఇప్పుడేమంటావ్, పెళ్లి చేసుకోకుండా ఉారెమ్మటపడి ఊరేగుతావా?!"
"అలా కాదమ్మా, నా వైపునుండి కూడా కాస్త ఆలోచించచ్చు కదా!"
"అవన్నీ ఏమైనా మాటలా? అన్నన్ని చదువులు చదవాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయే? బుద్ధిగా నా మాట విని పెళ్లిచేసుకో, మా కళ్ళముందే ఉంటావు."
"లేదమ్మా నేను నిర్ణయించుకున్నాను, నేను ఎలాగైనా చదువుకుని తీరుతాను! మొన్ననే ఒక కాలేజీకి అప్లై కూడా చేశాను, నేను అక్కడే జాయిన్ అవుతున్నాను..."
ఎందుకో తెలీదు ఆరోజు నాకు ఆ సమయంలో చదువును పొందాలనే ఇచ్ఛ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మ చెప్పినట్లుగానే, అక్కడ ప్రతీరోజు డబ్బుల్లేక, ఎన్నో పనులు చేసి, అనేక రకాల కష్టాలు పడాల్సి వచ్చినప్పుడు, ఒక్కోసారి, తప్పు చేస్తున్నానేమో అని ఒక సందేహం వచ్చినప్పటకీ, చదువుకోగలుగుతున్నా, అన్న సంతోషం నన్ను మరిపించేది, మురిపించేది. చదువు కోసం ఎంతో దూరం వెళ్ళా, విదేశాలు వెళ్లి ఎన్నెన్నో నేర్చుకున్నా, అయినప్పటికీ ఒక లోటు, అమ్మ గుర్తుకొవచ్చేది.
కొన్నాళ్ళకి, ఎవరో ఫోను, ఎత్తా...
"నన్నొదిలేసి ఎన్నెన్ని చదువులు చదివావే?! నీకు చదువంటే ఇంత ఇష్టం ఉందని ముందే చెప్పుంటే, ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం వచ్చేది కాదు కదా... అమ్మాయి చదువును, వ్యతిరేకించిన ఒకప్పటి ఊరు, ఇప్పుడు నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటోంది. నువ్వు ఆడపిల్లల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసావటగా, ఎంత పెద్దదానివయిపోయావే లత! నిన్ను వద్దనుకున్న నాన్నగారు కూడా నిన్ను చూడాలని తపిస్తున్నారు, ఇంటికి వచ్చేయవే!"
అలా ఓ వెనుకబడిన గ్రామంలో, ఓ పేద కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి, తాను అనుకున్నది సాధించి, ఎంతో మంది ఆడపిల్లలకు ఎన్నో ఉచిత సేవలు అందించిన కారణంగా, ఆమెను గుర్తించి, ప్రభుత్వం ఎన్నో అవార్డులు అందించింది. అలాగే ఇప్పుడు, ఇంకెంతోమంది పిల్లలకు ఆమె జీవిత చరిత్రను పంచుకుని, ఆదర్శంగా నిలువమని మద్రాసు ఐఐటీలో ఒక టెడ్ టాక్ కు ఆహ్వానించారు. ఈమె ప్రయాణం అక్కడికే.....
అతను ఈ రోజు, ఏదో చోట కూర్చుని నన్ను టీవీలో చూస్తూ ఉంటాడేమో. నిజానికి, అతడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నాలో దాగివున్న సందేహాలన్నీ పోగొట్టి, వాటికి బదులుగా కసిని నింపినందుకు.
కాలేజీ రోజులవి, మనసు మనం వేసిన హద్దులు దాటి వెళ్ళకుండా ఆపలేని రోజులవి. అతడిని మొదటిసారి క్రికెట్ ఆడుతుండగా చూశాను, మనసులో ఏదో తెలియని ఫీలింగ్, అప్పటినుండి అతన్ని మళ్లీ ఇంకెప్పుడు చూసినా. అతన్ని ఇష్టపడని అమ్మాయి ఉండదేమో, అన్నట్టుగా ఉండేవాడతడు.
ఏదైనా సరైన సమయం చూసి వెళ్లి చెప్పేయి, అని స్నేహితులంటూండేవారు, కానీ అతడిని చూస్తే మాట వచ్చేదే కాదు మరి. అతడి నుండి ఈ మాటలు వస్తాయని ఊహించలేదు, అయినా ఏది జరిగినా మన మంచికే, అని మా అమ్మమ్మ మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి.
"అంతా బావుంది, పర్లేదు అందగత్తెవే, కానీ నువ్వు కాస్త తెల్లగా ఉంటే ఇంకా అద్దిరిపోయేదానివి..."
అంటే ఓ ఇద్దరు ప్రేమించుకోవడానికి అందం, రంగు అడ్డవుతాయా? అందంగా లేకపోతే అది మన తప్పా? అసలు అందం అంటే కేవలం అవుటర్ అప్పియరెన్స్ మాత్రమేనా? అని ఒకప్పుడు నేను సందేహ పడినట్టే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్న ఎంతో మంది పిల్లలకు, నేను సమాధానంగా నిలిచినందుకు, నాకు ఈ రోజు ఎంతో గర్వంగా ఉంది.
నల్లగా ఉన్న నేను అతడి మనసు గెలుచుకునేదెలా? తెల్లగా పుట్టడం తప్ప వేరే మార్గం లేదా? అంటే అతడు నన్ను తెల్లగా ఉంటే ప్రేమించుండేవాడా? అంటే అతడికి కావలసినది కేవలం నా రంగా? ప్రేమ వద్దా? నేను ఇన్ని రోజుల నుండి దాచుకున్న ఫీలింగ్స్ వద్దా? అప్పుడు నిజమైన నన్ను వద్దనుకున్న అతడు నాకు కావాలా? అక్కర్లేదు కదా! ఎన్ని రోజులు పట్టిందో నాకు, ఆ ప్రేమను మరువడానికి, ఎంతైనా ఇష్టపడ్డా కదా, కానీ తెలుసుకున్నా, అందం మనిషిని గూర్చి చెప్పదనీ, ఓ అద్భుతమైన అందం, లోపలినుండి అందవిహీనంగా కూడా ఉండచ్చని.
ప్రూవ్ చేసి చూపించాను నేడు, మిస్ ఇండియా పోటీలకు సెలెక్ట్ అయ్యాను. గెలుస్తా అని ఖచ్చితంగా చెప్పలేను కానీ, ఒకవేళ గెలిచినా అది కేవలం నా లోపల ఉన్న అందం వల్ల మాత్రమేనని, ప్రపంచమంతా గట్టిగా అరిచి చెప్తాను, నాలాంటి ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శం అవుతాను.....
"ఏయ్ లక్కీ! ఇలారా! అటూ ఇటూ పరిగెట్టద్దూ, అల్లరి చేయ్యకుండా ఇలా వచ్చి పడుకో."
"నేను రానమ్మా, కథ చెప్తా అంటేనే వస్తా!"
"సరే చెబుతాను, ఇలారా వచ్చి పడుకో.
అనగనగనగా ఒక పాప ఉండేది. తాను ఒకరోజు బెంచీ మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఒక బాబు వచ్చి అక్కడ ఒకతని దగ్గర ఓ పీచుమిఠాయి కొని, ఆ పాపకి ఇచ్చి, ఫ్రెండ్స్? అని అడిగి షేక్ హాండ్ ఇస్తాడు. అలా వాళ్లిద్దరూ ఎంతో మంచి స్నేహితులు అయిపోయారు. రోజూ స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక చోట కలిసి, చెరో పీచుమిఠాయి కొనుక్కుని, కబుర్లు చెప్పుకుంటూ తమ ఇళ్లకు వెళ్లేవారు. అలా ఒకరోజు వాళ్లిద్దరూ ఎప్పటికీ విడిపోమనీ, స్నేహితులు ఒకరినొకరు వదలకూడదనీ, పింకీ ప్రామాస్ కూడా చేసుకున్నారు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళిద్దరు. కొంతకాలం గడిచాక, హఠాత్తుగా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఏదేమైనా ఒకరినొకరు క్షమించుకుని మళ్లీ నవ్వుకొని ఎప్పటిలాగే సంతోషంగా ఉండేవారు.
కానీ ఒకరోజు పెద్ద గొడవే వచ్చిపడింది వాళ్ళిద్దరి మధ్య. "నాకు నువ్వు వద్దు, ఇక నువ్వంటే నాకు ఇష్టంలేదు, అలాగే నేనంటే కూడా నీకు ప్రేమ లేదు.." , అన్న మాటలకు ఆ పాప తట్టుకోలేకపోయింది. దానితో అతనితో మాట్లాడటం మానేసింది. ఎన్నో రోజులు బాధపడింది, ఏడ్చింది, అయినా తనతో మాట్లాడలేదు, అలా అని అతన్ని వదులుకోలేకపోయింది. ఇతర స్నేహితులు, అతడితో ఇంత జరిగాక కూడా ఎందుకు స్నేహం చేస్తున్నావు, వదిలేయవచ్చు కదా, ఇంకొకళ్ళతో స్నేహం చెయ్యి, అంతేగాని ఇలా కష్టపడకు, అని ఇచ్చిన సలహాలను పక్కకి నెట్టేసేది.
అతను తప్పు చేసినా పర్వాలేదు, నేను సారీ చెప్పేస్తా, ఎంచక్కా మేము ఇదివరకటిలా కలిసిపోవచ్చు అనుకుంది. కానీ అది ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ట్రీన్ ట్రీన్ అని ఊదుతూ ఓ అబ్బాయి వచ్చాడు. తనకు ఏం చెయ్యాలో తట్టేసింది. రెండు పీచుమిఠాయిలు పట్టుకుని పరిగెత్తుకు వెళ్లి, "ఒరేయ్ సారీ రా, నాదే తప్పు, మనం మళ్లీ ఫ్రెండ్స్ అయిపోదాం, ఇదిగో ఈ పీచుమిఠాయి తిను," అంది. తన ఆశ్చర్యానికి అతడు ఆ పీచుమిఠాయి తీసుకున్నాడు, కానీ వెంటనే నేల మీదకు విసిరికొట్టాడు. తన కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇంకెప్పుడు అతడికి మొహం చూపించకూడదనుకుంది." కానీ అంత సులువుగా నిన్ను వదలను, మన పింకీ ప్రామిస్ నిలబెడతా ఎలాగైనా, నువ్వు చూస్తూ ఉండు! " అనుకుంది, తన కళ్ళను తుడుచుకుంటూ.
అలా ప్రతీ రోజు, తను పీచుమిఠాయి ఇవ్వడం, అతడు విసిరికొట్టడం, దీనికి అంతే లేకుండాపోయింది. అతడు ఏ రోజైనా నా పీచుమిఠాయి స్వీకరించకపోతాడా అనే నమ్మకం, తనకి బాధలన్నింటినీ ఎదుర్కునే శక్తిని ఇచ్చేది. తను అనుకున్న దానికన్నా, చాలా ఆలస్యమే అయినా, తాను కావాలనుకున్న రోజు రానేవచ్చింది. ఎప్పటిలాగే ఆరోజు కూడా, అతడికి అందంగా ప్యాక్ చేసి ఉన్న గులాబీ రంగు పీచుమిఠాయి ఉన్న కవర్ ఇచ్చింది. తాను కూడా ఎప్పటిలాగే ఆ పీచుమిఠాయిని తీసుకున్నాడు. ఓ ఐదు క్షణాలు దానిని చేతిలో ఉంచి మళ్లీ విసిరికొట్టాడు, ఈ సారి మరీ దూరంగా వెళ్ళిపడింది. వెంటనే పరిగెత్తుకు వెళ్లి, ఆ పిల్లను గట్టిగా కౌగలించుకున్నాడు, ఏం జరుగుతోందో ఒక్క క్షణం, ఏమీ అర్థం కాలేదు ఆ పాపకి. "నీది కాదు, నాదే తప్పు! అంతా నేనే చేశా! అయినా నీకు నేనంటే ఎందుకంత ఇష్టం?!" అని ఏడుపుతో పాటు నవ్వు కూడా రప్పించాడు ఆ పాప మొహంలో... "అలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, మన అనే వాళ్లెవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు సరేనా లక్కీ?! అయ్యో చూడండి అప్పుడే నిద్రపోయింది."
"అంతా బాగుంది కానీ, కథలో ఆ పిల్లాడు ఆఖరిలో, పాప మీద ఇష్టం వ్యక్తం చేసేటప్పుడు కూడా ఎందుకు పీచుమిఠాయి విసిరేసాడు?"
"వాళ్ల ఇద్దరిని కలిపినది తనకు ఎంతో ఇష్టమయిన పీచుమిఠాయే. కానీ మధ్యలో తమ ఇద్దరి మధ్య దూరానికి, తన స్నేహితురాలి బాధకి కారణమైన ఆ పీచుమిఠాయిని కోపంతో మరింత గట్టిగా విసిరాడు. అర్థమయిందా అండీ?"
"ఓహో అలాగా! నీలో మంచి రచయిత్రి కూడా దాగి ఉందే! మన ఈ కథను చిన్న పిల్లల కథగా మార్చి, మన ప్రేమను పీచుమిఠాయిగా, పెళ్లిని పింకీ ప్రామిస్ గా, డివోర్స్ గొడవలను పిల్లల గొడవలగా మార్చిన నీకు నా దన్నం అమ్మా తల్లీ! అవును మరీ, ఆ పిల్లాడికి మళ్లీ కోపం వస్తే ఏం చేస్తావ్? ఈ సారి ఇంక వదిలేస్తావా?"
"లాగి ఒక్కటి కొట్టి బుద్ధి చెప్తాను, మళ్లీ మారాం చేస్తే మిమ్మల్ని ఇక!" అంటూ పాత రోజుల గుర్తుకు తెచ్చుకుని, ఇద్దరూ నవ్వుకున్నారు.....
"అత్తయ్యా ఒకసారి నేను చెప్పేది వినండి."
"అదేం మాయదారి పిల్లవమ్మా?! ఇంట్లో వాళ్ళని కాదనుకుని, బయట ఊరు పేరు లేనివాళ్ళనీ, కులమూ మతమూ తెలియనివాళ్ళనీ, ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో ఏంటో ఏమీ తెలియకుండా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతోందా? ప్రతిచోట నీ మాట నెగ్గించుకోవాలని చూస్తున్నావేమో, ఇలాంటివి ఒప్పుకునే ప్రసక్తే లేదు!"
"ఒకరిని స్వచ్ఛంగా ప్రేమిస్తే, వాళ్ళు ఎవరైనా, ఎక్కడి వాళ్ళయినా, ఎలాంటి వాళ్ళయినా, మనకు సొంతం అవ్వక తప్పదు అత్తయ్యా."
"నువ్వెన్నన్నా చెప్పు, నేను దీనికి ఒప్పుకోను గాక ఒప్పుకోను. ఉద్యోగం చేసి నాలుగు నోట్లు సంపాదించగానే, నీకు నచ్చినట్లు ఇంట్లో అందరూ ఆడతారనుకుంటున్నావేమో, నేను ఇలాంటివి చాలా చూసా! ఆ!!!"
"ఏంటమ్మా దిగులుగా ఉన్నావు?"
"అదేంలేదు, నిన్న జరిగిన విషయాలేవో గుర్తొచ్చాయి, అంతేనండి."
"ఇందాకటి నుండి చూస్తూనే ఉన్నా, ఏదో గాఢంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది? ఏదైనా సమస్యా?"
"ఏం చెప్పమంటారు బామ్మగారు, నాదో కోరిక. కానీ దాన్ని చేరేందుకు మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఒక్కోసారి అది తీరదేమోనన్న సందేహం నన్ను చంపేస్తుంటుంది."
"ఏమిటే పిల్ల! నీ ఆ అడ్డంకులొచ్చేసే అంత పెద్ద కోరిక?"
"నాకు అనాధాశ్రమం నుండి ఒక ఆడ పిల్లను తెచ్చి పెంచుకోవాలని కోరిక బామ్మగారు, కానీ ఇంట్లోవాళ్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు."
"ఓహో అలాగా, మంచి ఆలోచనే! ఓస్ ఇంతేనా, ఇదో పెద్ద సమస్యేవిటే పిల్లా, మాకు చిన్న వయస్సులో ఉండే కష్టాలతో పోలిస్తే ఇదసలు ఆనాదే పిల్ల.
నాకు పదహారేళ్లకే పెళ్లి చేశారు మా నాన్నగారు. అసలు ఏమీ తెలియని వయసు కదా, ఎన్నో తప్పులు చేస్తుండేదాన్ని, మా అత్తగారు అస్తమానం విసుక్కుంటూనే ఉండేవారు. అయినా ఎప్పుడూ బాధపడకుండా, ఓర్పుతో, అన్నీ నేర్చుకుంటూ ఉండేదాన్ని. చాలా సార్లు రహస్యంగా టీచర్ పోస్టులకు అప్లై చేసా, అలా నన్ను పట్టణంలోని ఓ పాటశాల వాళ్ళు, అక్కడ పనిచేసేందుకు ఆహ్వానిస్తూ కబురు పంపుతూ ఉండేవారు. ఈ సారి వడులుకోదలచుకోలేదు. ప్రతీ సారి అందరూ దీనిని ఎంతో తీవ్రంగా వ్యతిరేకించేవారు. కానీ నాకు అన్ని ప్రదేశాలు చూసి, కొత్త అవగాహనలు పొందాలనే కోరిక. అప్పటిలో ఆడపిల్లలు, వంటగదికి మాత్రమే పరిమితం. అందులో విధవలు అయితే ఇక ఇంటినుండి అడుగు బయట పెడితే మహా విడ్డూరం. అలాంటి రోజుల్లో నేను హఠాత్తుగా ఊరు వదిలి, పట్టణం వెళ్లి ఉద్యోగం చేస్తా అంటే, ఎవరైనా కంగారు పడటం సహజమే కదా. నేను ఓపిగ్గా నచ్చచెప్పి చూసా, అయినా పరిస్థితుల్లో మార్పు కనబడలేదు.
ప్రతీదీ ఓర్పుతో సాధించాలంటారు కానీ అమ్మాయి, కొన్నింటిలో ఈ ఓర్పు, సహనం కన్నా, మన పట్టుదల, మన కోరికే ముఖ్యం, ఆయ్! నేనప్పుడేం చేశానో తెలుసునా? ఒకరోజు ఇంటి బయటకు వెళ్లి గట్టిగట్టిగా అరవడం మొదలెట్టా. చుట్టుపక్క ఇళ్ళవాళ్ళందరితో పాటు మా అత్తగారు కూడా బయటకొచ్చారు.
"న్యాయం కాదిది! నాకోసం, నా ఇంట్లో వారి కోసం, నేను పనిచేసినప్పుడు, నలుగురికి చదువు చెప్పి, ఉపయోగమైన పని చేయాలనుకోవడం తప్పా?!
కాలం మారుతుంది! చూస్తూ ఉండండి అందరూ, ఆడవాళ్ళకి జరిగిన అన్యాయం ఇక చాలు, మేము మగవారికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించే రోజు త్వరలోనే రాబోతోంది, మీరు దీనిని స్వీకరించక తప్పదు.
మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నేను పట్టణం వెళ్లి తీరుతాను, ఉద్యోగం చేసి పిల్లలకు చదువు చెప్పి తీరుతాను!"
“నమ్ము నమ్మకపో అమ్మాయి, తెలుసునా, కొన్నాళ్ళకి, మా అత్తగారు కూడా దీనిని అంగీకరించేశారు. నేను మాట్లాడిన కొన్ని మాటలు ఆ ఊరిలో అందరినీ మార్చాయంటే నమ్మలేకపోయా. అలా ఆవిడకి కూడా నేను చదువు మీద ఆసక్తి తెప్పించగలిగా, కొన్ని కొన్ని పదాలు రాయడం, చదవడం కూడా నేర్పేసా."
"మీరు చాలా ధైర్యవంతురాలు బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు, నా కోరిక తీరుతుందని, బలమైన నమ్మకం ఏర్పడుతోంది."
"అద్ది! అమ్మాయి, అలా ఉండాలి! ఈ లోకం నిన్ను ఎంత బాధపెట్టినా, గాయపరిచినా, నీ గమ్యాన్ని ఎప్పుడూ వదలకు అమ్మాయి! వారందరికీ నీ కోరికను సాధించి చూపించు....."
అలా కొంతమంది, జీవితంలో, అనుకున్నది సాధించినవారు, సాధించాలని అనుకుంటున్నవారూ, సాధించలేనేమోనన్న సందిగ్దంలో మునిగిన వారు, అందరూ ప్రయాణిస్తుంటారు ఈ స్పెషల్ ట్రైన్లో. కొంతమంది వెలుగులోకొస్తారు, కొంతమంది రాకపోవచ్చు, కానీ ప్రతి అమ్మాయి, తన గమ్యాలకై పోరాడుతూనే ఉంటుంది, సాధిస్తూనే ఉంటుంది. ఒక బోగీలో ఒక ఐదుగురి ఆడవాళ్ళ కథలు ఇవి. బోగీలు పెరుగుతూ ఉంటే, అలా కథలూ పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో ఎన్నెన్నో మనకు తెలిసిన, తెలియని కథలను, జీవితాలను మోస్తుంది, అదే ఈ స్పెషల్ ట్రైన్ యొక్క స్పెషాలిటీ.....
Sep 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు