ఓ పురుషనేస్తమా ప్రకృతి సృష్టి కార్యక్రమంలో మనమిద్దరం అర్థనారీస్వరులై అవతరించాము,
మరి ఆకాశమంతా అక్రమిస్తారనే భయంతో
ఆడవాళ్ళను అణచివేస్తూనే వున్నారెందుకు..!
మీతో చేయిచేయి కలిపి అపురూప జంటలుగా చెట్టాపట్టాలు వేసి ప్రకృతి ఒడిలో హాయిగా పిల్లాపాపలతో ఆడుతుపాడుతూమనలేమా..,
నీ మంచిమనసుతో జీవితాన్ని లోతుగాఆలోచించు!
ఈ కాలనాళికలో నాగరికత విచ్చుకుంటూ
కన్నుమిన్ను ఎరుగక ప్రగతనే యంత్రతంత్ర
వేగంలో కొట్టుకుపోతూ ఆశదురాశలకులోనై
నీలోని సగభాగాన్నే శతృవుగా చూస్తున్నావు..,
మన మానవుల ప్రగతి మనిద్దరిచేతుల్లోదే కదా
శివశక్తులం మనమిద్దరం మన భూమ్యాకాశాలను
నాలుగు చేతులెత్తి సరిసమానంగా మోసినపుడే
మన సంతతికి ఆనందలోకాలనందించగలం .,
కాని..బుసలు కొట్టే నీ స్వార్థంమింగేస్తూంది
నీ మతిని అసలు రహస్యాన్ని అడుక్కుతొక్కి ,
ఇకనైన నీ మనోనేత్రాన్ని తెరిచి తిలకించు
నీ సగభాగం చేతిని గట్టిగపట్టి నీతోనడిపించు,
మనఇద్దరి ఆకాశాన్ని పచ్చనిగొడుగుగా ఒడిసిపట్టి
అందంగా ఆనందంగా ప్రకృతి మాతతో మమేకమై చేతులు కలిపి నడుద్దాం మన భావితరాలకు పచ్చనిజీవితాలను పంచుదాం నేస్తమా..!!