మా రచయితలు

రచయిత పేరు:    శాంతిశ్రీ బెనర్జీ

కథలు

మీ...టూ...

అది హైదరాబాదులో ఉన్న యూనివర్సిటీ లేడీస్‌ హస్టల్‌ రెండవ అంతస్థులోని ఒక రూములో సమీర, స్వాతి ఉంటున్నారు. సమీర చరిత్ర విభాగంలోనూ, స్వాతి రసాయనశాస్త్ర విభాగంలోను పి.హెచ్‌.డి చేస్తున్నారు. ఇద్దరూ ప్రియ స్నేహితులు. ఒకరంటే ఒకరికి విపరీతమైన గౌరవం, అభిమానం. స్వతంత్ర భావాలు గల  యువతులు  కూడా. స్టడీ టేబుల్‌ ముందు కూర్చుని చదువుకుంటున్న సమీర ఉలిక్కిపడింది. చేతికి ఉన్న వాచీలో టైము చూసింది. రాత్రి పదిగంటలవుతుంది.
‘‘అరే! స్వాతి ఇంకా రాలేదేంటి? ఈ రోజు లాబ్‌ నుంచి రావటం ఆలస్యం అవుతుంది. నాకోసం డిన్నర్‌ మెస్‌ నుంచి తీసిపెట్టు అంది. కానీ ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. ఒకసారి ఫోను చేసి చూస్తాను’’ అనుకుని మొబైల్‌ తీసుకుని స్వాతికి ఫోను చేసింది. రింగ్  అవుతుంది కానీ స్వాతి ఎత్తలేదు.
‘‘దారిలో ఉందేమొ? వచ్చేస్తుందిలే!’’ అనుకుని సమాధానపరుచుకుంది. మరో అరగంట గడిచింది. ఇంకోసారి ఫోను చేసి చూసింది. సమాధానం లేదు. పదకొండయింది.
‘‘ఇక లాభం లేదు. నేనే లాబ్‌కి వెళ్ళి దాన్ని తీసుకొస్తాను’’ అనుకుని బయలుదేర బోయింది.
ఇంతలో తలుపు దబదబ కొట్టినట్లనిపించి లేచి చటుక్కున తలుపు తీసింది. పెనుతుఫానులా స్వాతి లోపలికి వచ్చి తన మంచంమీద బోర్లాపడుకుని వెక్కివెక్కి ఏడవ సాగింది. ఈ హఠాత్‌ పరిణామానికి విస్తుపోయి నిబడింది  సమీర. తర్వాత తెలివి తెచ్చుకుని తలుపు వేసి స్వాతి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని వీపుమీద చెయ్యివేసింది.
‘‘ఏమయింది స్వాతి? ఇంటి దగ్గరనుంచి ఏమయినా ఫోను వచ్చిందా? 
స్వాతి దు:ఖం ఇంకా ఉదృతం అయింది. కొంచెంసేపు ఏడ్చి నెమ్మదిగా వీపు మీద నిమురుతూ ‘‘నాతో చెప్పు ఏమయిందో. నీకు కొంత ఉపశమనంగా ఉంటుంది’’ అంది సమీర.
స్వాతి లేచి ఎర్రగా ఉబ్బిపోయిన కళ్ళని తుడుచుకుంటూ వాడంత నీచుడని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక్కదాన్ని ఉన్న సమయం చూసి, కాపేసి, నన్ను లోబరుచుకోవాలని చూస్తాడా అంది.
సమీరకు అర్థం కాలేదు. ‘‘ఏమయిందో వివరంగా చెప్పు ప్లీజ్‌!’’ అంది.
స్వాతి నిస్సహయంగా సమీర వంక చూసింది. ‘‘ఉండు! కొంచెం మంచినీళ్లు తాగు’’ అని గ్లాసందించింది సమీర. స్వాతి మంచినీళ్లు తాగి, కొంచెం తేరుకుని చెప్పసాగింది.
ఈ మధ్య స్వాతి ల్యాబ్‌ వర్క్‌ వీయినంత త్వరగా పూర్తిచేసి థీసిస్‌ రాయాలనుకుంది. అందుకని ఆ రోజు ఉదయం లాబ్‌లో పనిచేస్తూ, మధ్యలో లంచ్‌ బ్రేక్‌లో తప్ప లేవనేలేదు. ఎంతకీ తెమలని  పనిని టైముకూడా చూసుకోకుండా చేస్తున్నది. లాబ్‌లో పనిచేస్తూ అందరూ ఎప్పుడో వెళ్లిపోయారు. ఆ సంగతి కూడా పట్టించుకోకుండా తంటాలు  పడుతుంటే, ఇంతలో ఎవరో తన భుజాల  చుట్టూ చేతులు  వేసి దగ్గరికి లాక్కున్నట్లనిపించింది. ఉలిక్కిపడి చూస్తే లాబ్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కుమార్‌. కోపంగా తోసెయ్యబోతే మరింత గట్టిగా  పట్టుకుంటూ ‘‘నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎన్నోరోజులా  నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఈ రోజు నా పంట పండింది. లాబ్‌లో ఎవరు లేరు, మనిద్దరమే! నీ అందాలు  నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలో కలసిపో! నీకు స్వర్గం చూసిస్తాను. లాబ్‌ తలుపు వేసేసాను’’ అన్నాడు తమకంగా. ఈ పరిణామానికి నివ్వెరపోయింది స్వాతి.
ఒక చెత్తో స్వాతిని మరింత హత్తుకుంటూ,  మరోచేత్తో ఆమె శరీరాంగాలను తాకరాని చోట తాకసాగాడు. స్వాతి ఊపిరి బిగబట్టుకొని ఆరవసాగింది. ల్యాబ్‌లోని పరికరాలు  చిందరవందర అవసాగాయి. తన ఉక్కుపట్టుతో స్వాతిని పక్కగదిలోకి లాక్కెళ్లాడు. ఇక సర్వశక్తులూ  హరించి పోతాయనుకున్న సమయంలో ఎదురు బల్ల మీద ఒక ఇనపకడ్డీ కనిపించింది. స్వాతి లేని బలం  తెచ్చుకొని అతన్ని ఒక్క తోపు తోసి, ఆ ఇనుపకడ్డీని చేతిలోకి తీసుకుంది. దూరంగా ‘‘ముందుకి అడుగువేస్తే దెబ్బ పడుతుందని’’ అతన్ని బెదిరిస్తూ తలుపు దగ్గరికి జరగసాగింది. ఈ సారి విస్తుపోవడం కిరణ్‌ వంతయింది. దొరికిన ఈ అవకాశం వదులుకోవడం ఇష్టంలేక నెమ్మదిగా అడుగులేస్తూ స్వాతి వైపుకి రాసాగాడు. అది గమనించి స్వాతి చటుక్కున తలుపు తీసి బయటికి వెళ్లి గడియ వేసింది. లోపల  కిరణ్‌ తలుపు బాదసాగాడు. ఇక ఒక్క నిముషంకూడా ఆలస్యం చెయ్యకుండా తన బ్యాగ్‌ తీసుకుని ల్యాబ్‌ తలుపు తీసుకొని బయటికి పరుగెత్తింది.
స్వాతి చెప్పింది విని ‘‘ఎవరీ కిరణ్‌కుమార్‌? ఎప్పుడు వాడి గురించి చెప్పలేదే?’’ అంది సమీర.
‘‘కిరణ్‌కుమార్‌ లాబ్‌ అసిస్టెంట్‌. సుమారు 45 ఏళ్లుంటాయి. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. యూనివర్సిటీ కాంపస్‌లోనే ఉంటాడు. కనబడినప్పుడు బాగానే మాట్లాడేవాడు. మంచివాడు అనుకున్నాను. మనస్సులో ఇంత కుళ్ళు పెట్టుకున్నాడని ఈ రోజే తెలిసింది. ఛీ! ఛీ! వళ్లంతా ముట్టుకుని మైలపరచాడు. మంటల్లో దూకాలనిపిస్తూంది అని మళ్లీ ఏడ్వటం మొదలు  పెట్టింది స్వాతి.
‘‘ఏడవకు! ధైర్యం తెచ్చుకో! ముందేం చెయ్యాలో ఆలోచిద్దాం.  ఆ నీచుడికి తగిన గుణపాఠం చెప్పాలి. నీ జీవితంలోనే కాదు నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు  జరిగాయి. సరే! అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లేచి ముఖం కడుక్కుని అన్నం తిను” అంది సమీర.
‘‘నాకిప్పుడు అన్నం తినానిపించడంలేదు. ఆకలి వచ్చిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో త్వరగా చెప్పు’’ అంది స్వాతి ఉద్వేగంగా. సమీర స్వాతిని సమాధానపరచి కొంచెం మజ్జిగ తాగేలా చేసి ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్పసాగింది. 
‘‘నువ్వు జరిగిన సంఘటనని యధాతధంగా రసాయనశాస్త్ర విభాగానికి హెడ్‌ అయిన మధుసూధన్‌ గారికి ఉత్తర రూపంలో వ్రాయి. ఆఖరులో కిరణ్‌కుమార్‌కి తగిన శిక్ష విధించాలని, అతన్ని క్షమించి వదిలేస్తే ముందు ముందు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చని, ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోతుందని వ్రాయి. నేను లిఖిత రూపంలో ఎందుకు ఫిర్యాదు చెయ్యమంటున్నానంటే ముఖాముఖి చెప్పడం కంటే రాయడం సులువని.  రేపు ఇద్దరం  కలిసి మధుసూధన్‌ గారిని కలుద్దాం’’ అంది.
సమీరని వాటేసుకుని కళ్లనీళ్లు పెట్టుకుంది స్వాతి ‘‘నిన్ను నాకు ధైర్యంగా ఉంది. నీ సపోర్ట్  నాకిప్పుడెంతో అవసరం. నువ్వు లేకపోతే నేనేం అయిపోయేదాన్ని?’’ అంది ఏడుపు గొంతుతో...
స్వాతిని మరింత ఓదార్చి,  ధైర్యంచెప్పి ఒక నిద్ర మాత్ర ఇచ్చి పడుకోబెట్టింది సమీర. మరునాడు ఇద్దరు కలిసి ఉత్తరాన్ని ఎలా రాయలో చర్చించుకుని రాశారు. పదింటికి మధు సూధన్‌గారిని కలిసి ఉత్తరం అందజేశారు. ఆయన ఈ సంఘటనకి ఎంతో చలించి, బాధతో ఏ విభాగంలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఇక ముందు జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను. కిరణ్‌కుమార్‌కి తగిన శిక్షపడేలా చూస్తాను’’ అన్నారు.
లాబ్‌లో పనిచేసే కొంత మందిని పిలిచి మాట్లాడారాయన. కిరణ్‌కుమార్‌ గదిలో ఉన్నట్లు లాబ్‌లోని పరికరాలు  చిందరవందర అయినట్లు, ప్రొద్దున్నే వచ్చిన ఇంకో లాబ్‌ అసిస్టెంట్‌ తలుపు తీస్తేనే కిరణ్‌కుమార్‌ బయటికి వచ్చినట్లు అప్పటికే అందరికి తెలిసిపోయింది.
‘‘సాక్ష్యాధారాలు  ఉన్నాయి కాబట్టి ఇంకేం ఫర్వాలేదు. అతను తప్పించుకోలేడు. మీరిక నిశ్చింతగా ఉండండమ్మా!’’ అని ఆయన వాళ్లని ఓదార్చి పంపించారు. 
ఇద్దరు హస్టల్‌ గదికి వచ్చారు. ఇక రోజు ఇద్దరికి  వర్క్ చెయ్యాలని అనిపించలేదు. మధుసూధన్‌ గారి ఓదార్పు వాళ్లకెంతో ధైర్యానిచ్చింది. స్వాతి మళ్లీ మామూలు  మనిషయింది. గదిలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. స్వాతికి హఠాత్తుగా గుర్తుకొచ్చాయి నిన్న రాత్రి సమీర చెప్పిన మాటలు.
‘‘సమీరా! నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు  జరిగాయి అన్నావు. నాకు చెప్పవూ! అసలింతవరకు నాకెందుకు చెప్పలేదు” అని ప్రశ్నించింది.
‘‘అవును నా మనస్సులోనే దాచుకుని మదన పడ్తున్నాను. ఈ రోజు నీకు చెప్పాలని అనిపిస్తుంది. ఈ యూనివర్సిటీలోనే అవి జరిగాయి. మొదటిది ఎమ్‌.ఏ మొదటి సంవత్సరంలో ఉండగా, రెండవది పి.హెచ్‌.డి. రెండవ సంవత్సరంలో చెప్తాను. విను.
          *   *   *   *   *  *  *
సమీర ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఎమ్‌.ఏలో చేరింది. చరిత్ర చదవడం అంటే ఆమెకెంతో  ఇష్టం. పి.హెచ్‌.డి. చేసి, ఉద్యోగం, సంపాదించుకుని, చరిత్ర పాఠాలు  చెప్పుకుంటూ జీవించాలని కోరుకుంది. క్లాసు ఎప్పుడు మిస్‌ అవ్వకుండా, ల్బెబ్రరీలో శ్రద్దగా చదువుకుంటూ ఉండేది. చరిత్ర విభాగంలో ఒక పేపరు చెప్పే ప్రొఫెసర్‌ నారాయణగారు బాగా దగ్గరయ్యారు. వీలున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లడం, చర్చలు  జరపడం, ఏమన్న సందేహలుంటే  తీర్చుకోవడం చేసేది. ఆయన తన తండ్రికంటే బహుశ ఏడెనిమిదేళ్లు చిన్నకావచ్చు. ఆయన్ని ఎంతో గౌరవభావంతో చూసేది. చరిత్రపట్ల ఆయనకున్న ఆసక్తి, తెలివి ఆమెని ఆశ్చర్యపరిచేవి. ఆయన కూడా కాంపస్‌లో ఉన్న ప్రొఫెసర్‌ క్వార్టర్స్లో ఉండేవాడు. 
ఒక రోజు సమీర లైబ్రరీనుండి ఎనిమిదింటికి హాస్టల్‌కి పోయే దారిలో నారాయణగారు కనపడ్డారు. పిచ్చాపాటి మాట తర్వాత ఆయన ‘‘సమీరా! రేపు రాత్రి డిన్నర్‌కి మా ఇంటికిరా! ఇంకా చాలా  విషయాలు  చర్చిద్దాం !’’ అన్నారు.
‘‘అలాగే సర్‌. ఎన్నింటికి రానూ?’’ అన్నారు.
‘‘ఎనిమిదిన్నరకి రా!’’ అన్నారాయన. సరేనని సెలవు తీసుకుంది.
మరుసటి రోజు ఎనిమిదిన్నరకల్లా ఆయనింటికి వెళ్లింది. కాలింగ్‌ బెల్‌ నొక్కింది. ఆయనే వచ్చి తలుపు తీశారు. లోపల  డ్రాయింగ్‌ రూమ్‌కు వెళ్లి కూర్చుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన తప్ప ఎవరు ఉన్నట్లు లేదు.
‘‘మేడమ్‌ గారు లేరాండి?’’ అని అడిగింది. 
‘‘లేరు. ఆమె, పిల్లలు  ఊరెళ్లారు. పదిరోజుల వరకు రారు’’ అన్నారాయన.
‘‘వాళ్లు లేనప్పుడు తననొక్క దాన్ని డిన్నర్‌కి పిలవడం ఏమిటి?” అన్న ఆలోచన వచ్చినా, అనవసరంగా అనుమానపడ్తున్నానేమో ? ఆయన చాలా మంచివారు అని సమాధాన పడింది.
‘‘ముందు భోం చేద్దాం’’ అని ఆయన అన్నీ డైనింగ్‌ టేబుల్‌ మీద సర్దసాగారు. సమీర కూడా లేచి సహాయం చేసింది.
‘‘వంటమనిషికి చెప్పి నీకోసం మంచి వంటకాలు  చేయించాను తెలుసా?’’ అన్నారు. సమీర కృతజ్ఞతా పుర్వకంగా నవ్వింది.
కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోంచేశారు. మళ్లీ పాత్రలన్నీ వంటింట్లో పెట్టడానికి సహాయం చేసింది. ఆఖరిలో డైనింగ్‌ టేబుల్‌ కుర్చీలు  సర్దసాగింది.
ఆమెనే గమనిస్తున్న ఆయన హఠాత్తుగా దగ్గరికి వచ్చి, ‘‘నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెలుసా? ఏది ఒక సారి ముద్దు పెట్టుకోనివ్వు’’ అని ఆమెని గట్టిగా పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు.
రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనకి ఆమె బిక్క చచ్చిపోయి ‘‘సర్‌, సర్‌, ఏమిటిది? ప్లీజ్‌ వదలండి’’ అంది. 
‘‘వదడానికే పిలిచానా నిన్ను?’’ అని ఆమె ముఖం మీదికి ఒంగాడాయన.
ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘‘ఛ! ఇప్పుడెవరొచ్చారు?’’ ఆమెని వదలలేక వదిలి తలుపు తీయడానికి డ్రాయింగ్‌ రూములోకి వెళ్లారు. వచ్చింది ఆయన దగ్గర పి.హెచ్‌.డి చేసే విద్యార్థి అని అర్థం అయింది సమీరకు. వాళ్లిద్దరూ ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. బిగుసుకుపోయిన సమీర తేరుకుంది. ఒక్కసారిగా వాస్తవం గుర్తుకొచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకోకుండా పరుగులాంటి నడకతో డ్రాయింగ్‌ రూములో వాళ్లిద్దర్ని దాటుకుని తలుపు తీసుకుని బయటపడింది. ఇక వెనక్కి చూడకుండా వాయువేగంతో హస్టల్‌రూమ్‌లో పడింది. వేగంగా కొట్టుకుంటున్న గుండె నెమ్మది పడేవరకు కూర్చుండి పోయింది.
‘‘ఎంత పని జరిగింది?! ఆ స్టూడెంట్‌ భగవంతుడిలా రాకపోతే ఏమయ్యేది? ముద్దుతో ఆగేదా  ఆయన వ్యవహరం? ఇంకా చొరవ తీసుకునుంటే? అసలు  తనకి బుద్దిలేదు. పిలవంగానే వెళ్లడమేనా? ఇక జన్మలో ఎవరినీ నమ్మకూడదు’’ అనుకుంది.
సమీర ఆ సంఘటనని మనస్సులోనే దాచుకుని చాలా రోజులు  బాధపడిరది. ఆ తర్వాత నారాయణగారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఎక్కడైనా అనుకోకుండా కనపడితే ముఖం తిప్పుకుని వెళ్లి పోయేది. అదృష్టవశాత్తూ కోర్సు చివరిలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత పరీక్షలొచ్చాయి. ఆయన పేపరు బాగానే వ్రాసింది. అయిన మిగతా పేపర్స్లో మంచి మార్కులొచ్చాయి గాని, ఆయన పేపర్‌లో బొటాబొటిగా పాస్‌ అయింది. ‘‘పోనీలే ఇంతటితో పీడవదిలిపోయింది” అని తనని తాను ఓదార్చుకుంది.
సమీర మంచి మార్కుతో ఎమ్‌.ఏ. పాసయింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరాలు  ఎమ్‌.ఫిల్‌ చేసి చివరికి పి.హెచ్‌.డిలో జాయిన్‌ అయింది. ఆమె రెండో సంవత్సరంలో ఉండగా ఎమ్‌.ఏలో చేరిన చాలా మంది జూనియర్స్తో పరిచయం అయింది. వారిలో అవినాశ్‌ అనే అతనితో ఎక్కువ స్నేహం ఏర్పడింది. అతనికి కూడా చరిత్ర చదవడం అంటే ఎంతో ఆసక్తి. ఎమ్‌.ఏ అయిన తర్వాత కాంపిటెటివ్‌ ఎగ్జామ్స్కి వెళ్లకుండ పి.హెచ్‌.డి చెయ్యాలని, సమీరే తనకు ఆదర్శం అని అంటూ ఉండేవారు. తన జూనియర్‌ అయిన అతనికి సమీర సహాయం చేస్తూ ఉండేది.
ఒక రోజు ఆమె, ఆమె సహా విదార్థి కరుణ సినిమా చూసి హస్టల్‌కి వెడుతుంటే దారిలో అవినాశ్‌ కలిశాడు. మాట్లాడుకుంటూ వెడుతుంటే ముందుగా అవినాశ్‌ ఉండే హస్టల్‌ వచ్చింది. అవినాశ్‌ వాళ్లిద్దర్ని కాఫీకి ఆహ్వనించాడు. తను చాలా బాగా కాఫీ చేస్తానని అందరూ అతన్ని తెగ మెచ్చుకుంటారిని, రుచి చూసి చెప్పాలని ఇద్దర్ని బవంత పెటాడు. అవినాశ్‌ కాఫి పెడుతుంటే కరుణకి ఫోను వచ్చింది. ఫోనులో మాట్లాడిన తర్వాత కరుణ కంగారు పడిరది. ‘‘ఏమయిందని?’’ అడిగితే నాకు టెలిగ్రామ్‌ వచ్చిందట ఇంటిదగ్గరనుంచి! నా సెల్‌కి ఫోను చెయ్యకుండా టెలిగ్రామ్‌ పంపించడం ఏమిటి? నేను వెడతాను. నువ్వు కాఫీ తాగేసిరా! అని హడావిడిగా వెళ్లిపోయింది.
అవినాశ్‌ ఇచ్చిన కాఫీ కబుర్లు చెప్పుకుంటూ పూర్తి చేశారు. ఆ తర్వాత అవినాశ్‌ తన ఫోటో ఆ్బమ్‌ చూపించాడు. తను చూస్తుంటే, ఫోటోల్లోని తన కుటుంబ సభ్యులని, స్నేహితులని పరిచయం చెయ్యాలన్న నెపంతో పక్కకి వచ్చి కూర్చొని చెప్పసాగాడు. అతను అంత దగ్గరగా కూర్చోవడం నచ్చలేదు. ఇక తొందరగా పోదామనుకుని ఆల్బమ్‌ని త్వరగా తిప్పసాగింది. ఇంతలో హఠాత్తుగా తన ఒడిలోని ఆల్బమ్‌ని పక్కకి పెట్టి, తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అవినాశ్‌. సమీర ‘‘వద్దు ! వద్దు ’’ అంటున్నా  వినిపించుకోకుండా ‘‘నువ్వంటే నాకెంతో ఇష్టం సమీరా! నీకు కూడా నేనంటే ఇష్టమేగా? అందుకే నాకెంతో సహాయం చేస్తున్నావ్‌ ఐ లవ్‌ యు’’ అని ఇంకా దగ్గరికి లాక్కోబోయాడు. సమీరకి జుగప్స  కలిగి ఒక ఊపుతో అతన్ని తోసి లేచి నిబడింది.
అవినాశ్‌! నీ పరిధిలో నువ్వుండు! నీ సీనియర్ని అన్నా  కూడా నీకు గుర్తుకు రాలేదా? అడుగు ముందుకు వేస్తే పెద్గగా అరచి గొడవ చేస్తాను. మర్యాదగా నన్ను పోనివ్వు’’ అని తలుపు దగ్గరికి వెళ్లి, ఒక్కసారి వెనక్కి తిరిగి నిప్పులు  గక్కే కళ్లతో ‘‘ఐ హేట్‌ యు’’ అని విసురుగా తలుపు తీసుకుని వెళ్లి పోయింది.
ఆ సంఘటన జరిగిన చాలా రోజుల  వరకు సమీర మనిషి కాలేక పోయింది. ఎవరికీ చెప్పకుండా  తన మనస్సులోనే దాచుకుని వ్యధపడిరది. ఆ తర్వాత అవినాశ్‌తో మాట్లాడలేదు. ఒకటి రెండు సార్లు అవినాశ్‌ ‘సారీ’ చెప్పబోతే వినిపించుకోనట్లు వెళ్లిపోయింది. అతని మొఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. సంవత్సరం తర్వాత అతను ఎమ్‌.ఏ. పూర్తి చేసి పి.హెచ్‌.డి. చెయ్యడానికి అమెరికా వెళ్లాడని తెలుసుకుని ‘‘అమ్మయ్య! ఇక ఆ దరిద్రపు ముఖం కనబడదని’’ ఊపిరి పీల్చుకుంది.
               *   *   *   *   *   *  *
సమీర చెప్పడం ముగించగానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆర్ధ్రతతో ‘‘ఇన్నాళ్ళు నీ మనస్సులోనే దాచుకుని బాధపడ్డావా? నా కెందుకు చెప్పలేదు? ధైర్యం చేసి వాళ్ళిద్దరి గుట్టు బయటపెట్టలేక పోయావా?” అంది స్వాతి.
‘‘ధైర్యం చెయ్యలేక పోయాను. అదే నేను చేసిన తప్పు! మనం ఇలా ఉండబట్టే, ఇటువంటి సంఘటనలు  జరగడం ఎక్కువయింది. నీ విషయంలో మాత్రం మనం మెదలకుండా ఉండొద్దు! ఆ కిరణ్‌కు శిక్ష పడేంత వరకు వదలొద్దు!’’ అంది సమీర.
కొన్ని రోజు గడిచాయి.
ఒక రోజు లాబ్‌ నుంచి దిగులుగా వచ్చింది స్వాతి “ ఏమయింది” అని అడిగింది సమీర.
‘‘ఆ కిరణ్‌ గాడు యథాలాపంగానే లాబ్‌కి వస్తున్నాడు. వాడిమీద ఏ చర్య తీసుకున్నట్లు అనిపించడంలేదు. ఎవరూ లేకుండా చూసి వెకిలిగా నవ్వి, కన్నుగొడుతున్నాడు. దుగుల్బాజి వెధవ! ఇన్నాళ్లు ఓపిక పట్టాను. ఇక లాభంలేదు. ఇంకోసారి మధుసూధన్‌ గారిని కలుద్దాం పద’’ అంది స్వాతి.
సరేనంది సమీర. మరునాడు ఇద్దరూ మధుసూధన్‌ గారిని కలిశారు. ఆయన బాధగా ‘‘అమ్మా! నేనెన్నో విధాలుగా ప్రయత్నించాను. వాడు డీన్‌ ప్రభాకర్‌రావు గారి బంధువట! ఆయన ద్వారానే ఈ ఉద్యోగంలో చేరాడట! ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పిద్దాం! పిల్లలు గలవాడిని ఉద్యోగం నుంచి తీసివెయ్యడం ధర్మం కాదు అంటున్నాడాయన’’ అన్నారు.
ముఖాలు  చిన్న బుచ్చుకుని, నిస్సహాయంగా హస్టల్‌కి తిరిగి వచ్చారు. గదిలోకి వచ్చిందగ్గరి నుంచి సమీర మౌనంగా దీర్ఘాలోచనలో పడట్టు కూర్చుంది.
కాసేపటికి ‘‘స్వాతి! మనం ఒక పని చేద్దాం, నా ఫ్రెండ్‌ అన్నయ్య జర్నలిస్టు. చాలా మంచి ఆశయాలు  కలవాడట! ఎవరికి అన్యాయం జరిగినా సహించడట! అతన్ని కలిస్తే ప్రయోజనం ఉండోచ్చు’’ అంది.
స్వాతి ముందు సందేహించినా, తర్వాత ఒప్పుకుంది. ఇద్దరు చిత్ర ద్వారా ఆమె అన్నయ్య సూర్యాని కుసుకున్నారు. అతను ఒక ప్రముఖ దిన పత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌ గా పనిచేస్తున్నాడు. వీళ్లు చెప్పిందంతా విని కొన్ని ప్రశ్నలడిగి వాళ్లిచ్చిన సమాధానతో సంతృప్తి పడి, ‘‘మీరు నిరాశ పడొద్దు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేవరకు నేను మీకు సహాయం చేస్తాను. ముందు వార్త మా దిన పత్రికలో వచ్చేలా చూస్తాను’’ అన్నాడు.
మరునాడు ప్రముఖ దిన పత్రికలో అన్ని వివరాలతో ఈ వార్త చదివి యూనివర్సిటీ విద్యార్థులు  కోపంతో ఉడికి పోయారు. కిరణ్‌కుమార్‌ని ఉద్యోగంనుంచి తీసేసేలా చూడాని అందరూ పట్టు  పట్టారు.  క్లాసుకి పోకుండా ఊరేగింపు, ధర్నాలు  చెయ్యడం మొదయింది. ఆడపిల్లలు  వేరుగా వైస్‌చాన్సర్‌ని కలుసుకుని న్యాయం జరగాలని అర్జీపెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థలను సమర్థిస్తూ యూనివర్సిటీ వార్తలు  అన్ని ప్రముఖ దిన పత్రికల్లో ప్రచురణమవసాగాయి. 
విద్యార్థు పట్టువిడవకుండా ఆందోళన కొనసాగించడం యూనివర్సిటీ అధికాయి ఏ చర్యా తీసుకోవడం లేదన్న పత్రిక అభియోగం చూసి వైస్‌చాన్సర్‌, డీన్‌ని కలుసుకుని కిరణ్‌కుమార్‌ను  ఉద్యోగం నుంచి డిస్‌మిస్‌ చెయ్యవలిసిందిగా కోరారు. ఆ మరునాడు కిరణ్‌కుమార్‌ ఉద్యోగం నుంచి డిస్‌మిస్‌ చెయ్యబడ్డాడు. వీలయినంత త్వరలో తన క్వార్టరు ఖాళీ చెయ్యమన్న ఆర్డర్‌ కూడా పాస్‌ అయింది. విద్యార్థు తమ ఆందోళన విరమించారు. సమీర, స్వాతి ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. తమకి న్యాయం జరిగిందని తృప్తిపడ్డారు. మరునాడు తమకెంతో అండగా నిబడిన సూర్యకి ధన్యావాదాలు  చెప్పుకున్నారు.

ఆత్మగోచరం

          కంప్యూటర్‍లో ఆ రోజు మిగిలిపోయిన ఆఫీస్‍వర్క్ పూర్తి చేసిన శర్మిష్టకు అలసటగా అనిపించింది. టైము చూసింది. ఒంటిగంట దాటి పదినిముషాలవుతున్నది.

            ‘‘చాలా రాత్రయింది. ఇక పడుకుంటాను’’ అనుకుని బాత్‍రూముకి వెళ్లొచ్చి, లైట్‍ తీసేసి పడుకుంది.

            వెంటనే నిద్రపట్టేసింది. కొన్ని గంటల తర్వాత ఏదో శబ్దానికి ఉలిక్కిపడిలేచింది. మర్చిపోయి తలుపు ఓరగా వేయడం వలన శబ్దం చక్కగా వినపడింది. ఫ్లాటు తలుపు తాళం తీసి లోపిలికెవరో వచ్చారు.

            ‘‘ఇంకెవరుంటారు? ప్రవలికే అయ్యుంటుంది’’ అనుకుని టైము చూసింది. మూడున్నర అయింది.

            ‘‘ఈ రోజు చాలా లేటయ్యిందే? శుక్రవారం రాత్రి కదా? రేపు తొందరగా లేచి ఆఫీసుకెళ్లాల్సిన పనిలేదుకదా? అందుకనే’’ అనుకుని ప్రక్కకు తిరిగి పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ నిద్ర రాలేదు. ప్రవలికను గురించిన ఆలోచనలు చుట్టేశాయి.

            ఢిల్లీ ఇంజనీరింగ్‍ చదువుతున్నప్పటి నుంచి శర్మిష్ట, ప్రవలికలు మంచి స్నేహితులు.  మనస్థత్వంలో భూమ్యాకాశాలకి ఉన్నంత తేడా ఉన్నా ఒకరి మీద ఒకరికి వల్లమాలిన అభిమానం. స్నేహానికి ఇద్దరూ ప్రాణం పెడతారు.

            ప్రవలిక ఎగిరిపడే కెరటం లాంటిది. లోతుగా, గంభీరంగా ప్రవహించే నది లాంటిది శర్మిష్ట. ప్రవలిక అందగత్తే కాదు మాటకారి కూడా. ఎప్పుడూ నవ్వుతూ, ఎదుటివారిని నవ్విస్తూ మనుష్యుల్ని ఇట్టే ఆకట్టేసుకుంటుంది. శర్మిష్ట మితభాషి. కానీ ప్రసన్న వదనంతో, చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న వాళ్లిద్దరినీ చూసి, వాళ్ల స్నేహన్ని చూసి అందరూ ఆశ్చర్యపడుతుండేవారు.

            ఇంజనీరింగ్‍ పూర్తయిన తర్వాత కాంపస్‍ ఇంటర్యూలలో వాళ్లిద్దరికీ బెంగుళూరులోని రెండు సాఫ్ట్వేర్‍ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరికీ ఒకే ఊళ్లో ఉద్యోగాలు రావడంతో ఎంతో సంతోషపడ్డారు. వాళ్ల తల్లి దండ్రులను కూడా ఈ విషయం ఆనందపరిచింది. ఎందుకంటే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా అని. బెంగుళూరులోని ఇందిరానగర్‍లో రెండు బెడ్‍రూముల ఫ్లాటు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అద్దె, ఇంటికయ్యే ఖర్చులు, పనిమనిషి, వంట మనషులకిచ్చే జీతాలు - వీటన్నింటినీ సమంగా సంచుకుంటూ సరదాగా ఉండసాగారు.

            ఇక్కడికి వచ్చాక, తల్లిదండ్రుల నిఘా లేకపోవడం, స్వేచ్ఛా జీవితం, ఏం చేసినా ఎందుకు అని అడిగేవాళ్లు లేకపోవడం, ఇవన్నీ ప్రవలికకెంతో నచ్చాయి. అలా అని ఢిల్లీలో తల్లిదండ్రుల దగ్గరుండి చదువుకునేప్పుడు ఆమె అణిగిమణిగి ఉంటూ, భయపడుతూ ఉందా అంటే అదేం లేదు. తల్లిదండ్రులకు తెలియకుండా స్వేచ్ఛా జీవితం గడిపేది. మగపిల్లలతో భయం లేకుండా సంచరించేది. ఎప్పుడూ ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్  తో  తిరిగేది. కొన్ని రోజుల సాహచర్యం తర్వాత, ఎవరయినా నచ్చకపోతే వదిలేసేది. ఇంకొకళ్లతో సంబంధం కలుపుకునేది.

            ఇవన్నీ శర్మష్టకు నచ్చేవి కాదు. వాళ్లిద్దరి మధ్య వీటిని గురించిన సంభాషణలు జరుగుతుండేవి.

            ‘‘మరీ అలా విచ్చలవిడిగా ప్రవర్తించకు. మీ అమ్మా, నాన్నలకు తెలిస్తే ప్రమాదం’’ అని హెచ్చరించేది శర్మిష్ట.

            ‘‘అరే! నీలాగా నేను మడికట్టుకుని కూర్చోలేను! జీవితంలో ఎంజాయ్‍ చెయ్యడం నాకిష్టం! మా అమ్మానాన్నలకు తెలుస్తుందని నువ్వు భయపడకు. నా జాగ్రత్తలో నేనుంటాను. సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు’’ అని ధైర్యంగా మాట్లాడేది.

            ఆమె ధైర్యం చూసి శర్మిష్టకు ఆశ్చర్యం కలిగేది. మగ పిల్లలతో ఆమె ప్రవర్తించే తీరు, తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పి సినిమాలకు, పిక్‍నిక్‍లకు వెళ్లడం, ఒక్కోసారి డ్రింక్‍ చెయ్యడం, బాయ్‍ఫ్రెండ్స్ని ఎటువంటి సంకోచం లేకుండా మారుస్తుండటం చూసి మౌనంగా బాధపడేది. తనేం చెప్పినా వినిపించుకోదని తెలిసి చెప్పడం మానేసింది. కానీ ఇన్ని జరుగుతున్నా ప్రవలిక స్నేహన్ని వదులుకోలేకపోయింది. తనపట్ల ఆమె చూపే ప్రేమాభిమానాలు ఆమెని కట్టిపడేశాయి. తనకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యే ప్రవలిక అంటే ఆమెకెంతో ఇష్టం. తన మనస్తత్వానికి భిన్నంగా ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, నవ్విస్తూ ఉండే ఆమె పట్ల ఒక విధమైన ఆకర్షణ ఉండేది.

            మృదువుగా మాట్లాడుతూ, ప్రసన్నంగా నవ్వే శర్మిష్ట అంటే కూడా ప్రవలికకు మరింత ఇష్టం. ఒక్కోసారి కొన్ని విషయాల్లో తను తొందరపడినా, ఓర్పుగా ఉండే శర్మిష్ట అంటే ఆమెకి ఒక విధమైన అభిమానం. ఆఫీసులో కొలీగ్స్తో గాని, ఇతరులతోగాని విభేదాలొస్తే ముందుగా శర్మిష్టతో చెప్పుకుంటుంది. బాగా లోతుగా ఆలోచించి, పరిశీలించి పరిష్కారాలు చెప్పే శర్మిష్ట అంటే ఆమెకి గౌరవం కూడా!

            యువతీయువకులు ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాలనుండి బెంగుళూరు వస్తున్నారు. స్వతంత్ర జీవనం గడుపుతున్నారు. వారితో సాహచర్యం, ఉద్యోగంతో వచ్చిన ఆర్థిక స్వాతంత్య్రం ప్రవలికను అందలం ఎక్కించాయి. ఆ స్పేచ్ఛా వాతావరణంలో విహంగంలా విహరించసాగింది!

            మొదట్లో తన కంపెనీలోనే పనిచేస్తున్న రంజీత్‍తో స్నేహం ఇట్టే కలిసింది. ఆ స్నేహం ఆకర్షణలోకి దారితీసింది. ఇక ఎక్కడ చూసినా వాళ్లిద్దరే! చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు! ప్రవలిక అతని ఫ్లాటుకి కూడా వెళుతుండేది. రాత్రిళ్లు ఒక్కోసారి లేటుగా వచ్చేది. శుక్రవారం, శనివారం అయితే మరీ ఆలస్యం అయ్యేది. శర్మిష్ట దగ్గర రంజీత్‍ గురించి తెగ చెప్పేది! రంజీత్‍ ఇలా అన్నాడు, అలా చేశాడు అనే కబుర్లే ఎప్పుడూ!

            శర్మిష్టకు మాత్రం చాలా వరకూ ఇల్లూ, ఆఫీసు, స్నేహితురాళ్లు ఇదే జీవితం. అలా అని ఆమెకి మగ స్నేహితులు లేరా అంటే, ఉన్నారు కాని వాళ్లు స్నేహం వరకే పరిమితం. ఇంజనీరింగ్‍ చదివేటప్పుడు ఆమె తన సీనియర్‍ అయిన అనురాగ్‍ని ప్రేమించింది. అనురాగ్ కి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. అతను ఢిల్లీలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగుళూరులో ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సరైన ఉద్యోగం రాగానే ఇద్దరూ వివాహం చేసుకుందామని అనుకుంటున్నారు. వారి తల్లి దండ్రులకు కూడా ఈ విషయం తెలుసు.

                                            *  *  *

            ప్రవలికకు రంజీత్‍తో స్నేహం కలిసి ఆరునెలలపైన అయింది. యథాలాపంగా కలుసుకుంటున్నారు. ఆ తర్వాత నెమ్మది, నెమ్మదిగా ప్రవలికలో మార్పు గమనించింది. శర్మిష్ట రంజీత్‍ గురించి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడటంలేదు. ఇంటికి కూడా ఆలస్యంగా కాకుండా మామూలు టైముకి రావడం మొదలెట్టింది. రంజీత్‍ గురించిన ప్రస్తావన వస్తే మాట మారుస్తూ ఉండేది. వాళ్లిద్దరూ ఇదివరకటిలాగా కలుసుకోవడం లేదేమొనని శర్మిష్టకి అనుమానం వచ్చింది.

            ఒక ఆదివారం ఇద్దరూ తీరిగ్గా లేచారు. శర్మిష్ట ఇద్దరికి చాయ్‍పెట్టింది. తాగుతూ ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

            హఠాత్తుగా శర్మిష్ట ‘‘ప్రవీ! నేనొకటి అడుగుతాను ఏమి అనుకోవుగా!’’ అంది.

            ‘‘అదేమిటి వింతగా అడుగుతున్నావు? నువ్వేదన్నా అడిగితే నేనింకోలా అనుకోవడం కూడా ఉంటుందా?’’ అంది ప్రవలిక.

            ‘‘సరే అయితే! నువ్వీమధ్య రంజీత్‍ గురించి ఎక్కువ మాట్లాడటం లేదు! అసలు మీరిద్దరూ ఇదివరకటిలాగా కలుసుకుంటున్నారా?’’

            ఆ ప్రసక్తి తేవడం ఇష్టంలేనట్లు చూసింది ప్రవలిక. తన వంక సూటిగా చూస్తూ, జవాబు ఆశిస్తున్న శర్మిష్టను చూసి ఇక తప్పదనట్లు మాట్లాడటం మొదలెట్టింది.

            ‘‘అతను ఈ మధ్య ముభావంగా ఉంటున్నాడు. ఇదివరకటిలాగా కలుసుకోవడంలేదు’’ అంది ప్రవలిక.

            ‘‘ఎందుకని? ఏమన్నా మనస్పర్థలొచ్చాయా?’’ అడిగింది శర్మిష్ట.

            ‘‘అవును అతని వ్యవహారం నాకు నచ్చటం లేదు. ఎంతసేపూ పెళ్లి చేసుకుని సెటిల్‍ అవుదామని అంటున్నాడు. అతనిలో ఆధునిక భావాలు మృగ్యం. సాంప్రదాయ పద్ధతిలో పోవాలంటాడు ఎంతసేపూ!’’

            ‘‘అతనన్నదానిలో తప్పేముంది? నీతో జీవితాంతం ఉండే సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నాడు. పెళ్లి చేసుకోవచ్చు కదా?’’ అంది శర్మిష్ట.

            ‘‘ఛీ! ఛీ! అప్పుడే పెళ్లేంటి? జీవితంలో ఇంకా బాగా ఎంజాయ్‍ చెయ్యాలిగాని? ఇప్పటి నుంచే ఆ బంధాల్లో ఇరుక్కుపోవడం నాకిష్టంలేదు. అతని పోరు భరించలేక అతనితో కలిసి తిరగడం మానేశాను. నాకిప్పుడు హాయిగా ఉంది’’ అంది ప్రవలిక.

            శర్మిష్ట ఇంకేమి మాట్లాడలేకపోయింది. జీవితం పట్ల ప్రవలికకున్న నిర్ధిష్ట భావాలను ఎవరూ మార్చలేరన్న సంగతి ఆమెకు బాగా తెలుసు.

                                            *  *  *

 

            కొన్ని నెలలు గడిచాయి. ప్రవలికకు మరో బాయ్‍ఫ్రెండ్‍ తోడయ్యాడు. అతని పేరు ఆదిత్య. ప్రవలిక ఆఫీసులో పనిచేస్తున్న కొలీగ్‍కి కజిన్‍ అతను. ప్రవలిక మళ్లీ అదివరకటిటాగే ఉత్సాహంగా తయారయ్యింది. ఎప్పుడూ ఆదిత్య గురించి మాట్లాటం, సినిమాలు, షికార్లు, లేట్‍గా రావడం జరుగుతున్నాయి. ఒకసారి దగ్గర గ్రామంలో ఉన్న ఆదిత్య ఇంటికి కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత మళ్లీ మామూలే! ప్రవలికకు ఆదిత్య అంటే విరక్తి కలిగింది. ఇద్దరూ కలుసుకోవడం తగ్గించారు.

            ఒక రోజు శర్మిష్ట ఆపుకోలేక అడిగేసింది. ‘‘ఈసారేమయింది? ఏమన్నా పోట్లాడుకున్నారా?’’

            ‘‘షరామామూలే! మగవాళ్లంతా ఇలాగే ఆలోచిస్తారెందుకని? ఆదిత్య కూడా రంజీత్‍లాగే మాట్లాడటం మొదలెట్టాడు. కాకపోతే ఒకటే తేడా. ఆదిత్య తల్లిదండ్రులకు నేను బాగా నచ్చానట! నన్ను పెళ్లి చేసుకుని సెటిల్‍ అవమని బలవంతపెడుతున్నారట! తల్లిదండ్రుల మాట తీసెయ్యలేనని, నన్ను ఒప్పుకోమని ఒకటే పోరు పెడుతున్నాడు. నా సంగతి నీకు తెలుసుగా? నేను ససేమిరా అన్నాను. ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఆగుదాం అన్నాను. దానికి అతనికెంతో కోపం వచ్చింది. మాట్లాడటం మానేశాడు’’ అంది.

            ఇది రెండో కేసు అనుకుంది శర్మిష్ట.

                                            *  *  *

            ప్రవలికకు ఇలాంటి కేసులు తగలడంతో కొంచెం నిరాశకు గురయ్యి కొన్ని నెలలు ఎవరితో సంబంధం పెట్టుకోకుండా ఉంది.

            ఆ రోజు శనివారం. తొమ్మిదైనా వాళ్లిద్దరూ ఇంకా లేవలేదు. ఇంతలో కాలింగ్‍ బెల్‍ మ్రోగింది. ప్రవలిక లేచి తలుపు తీసింది. తర్వాత ఉత్సాహంగా మాట్లాడుతున్న ప్రవలిక మాటలు, వచ్చిన ఆ వ్యక్తి మాటలు వినిపించాయి శర్మిష్టకి. కాసేపటికి ప్రవలిక వచ్చి...

            ‘‘శర్మీ! శశాంక్‍ వచ్చాడు. నీకు పరిచయం చేస్తా! త్వరగా ముఖం కడుక్కుని రా!’’ అని ముందుగదిలోకెళ్లెంది.

            శర్మిష్ట ముఖం కడుక్కుని డ్రాయింగ్‍ రూమ్‍లోకి వచ్చింది. దృఢంగా, ఎత్తుగా ఉండి, కన్ను, ముక్కుతీరు చక్కగా       ఉన్న యువకుడు మాట్లాడుతున్నాడు. అతన్ని అదివరకు చూడలేదు.

            ‘‘శర్మీ! ఇతను శశాంక్‍ ఇద్దరం ఢిల్లీ స్కూల్లో క్లాస్‍మేట్సమి. ఈ మధ్యనే బెంగుళూరులో జాబ్‍ వచ్చింది. మా ఆఫీసు పక్కనే శశాంక్‍ ఆఫీసు. అనుకోకుండా కలుసుకున్నాం. శశాంక్‍! ఇది శర్మిష్ట. నా ప్రియ స్నేహితురాలు’’ అని పరిచయం చేసింది.

            పరిచయాలయ్యాక ముగ్గురూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. టిఫిన్‍, కాఫీలు సేవించారు. శశాంక్‍ అంటే శర్మిష్టకి మంచి అభిప్రాయం కలిగింది. శశాంక్‍ వెళ్లిపోయాక అదే చెప్పింది ప్రవలికకి.

            ‘‘అవును శశాంక్‍ చాలా డీసెంట్‍. ట్వెల్త్ క్లాసులో మా స్కూలు ఫస్ట్ కూడా వచ్చాడు తెలుసా?’’ అంది.

            ఆ తర్వాత నెమ్మదిగా శశాంక్‍, ప్రవలికల మధ్య స్నేహం, ఆకర్షణ పెరిగాయి. తరుచు కలుసుకోవడం మొదలెట్టారు. ప్రవలిక జీవితం అదివరకటిలా మారింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఆ తర్వాత నెమ్మదిగా సంవత్సరం గడిచింది.

            ఈ మధ్యలో ప్రవలికలో మార్పు కనపడింది శర్మిష్టకి. ఒకొక్కసారి మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆలోచనలో పడిపోతుంది. అదివరకటి తుంటరితనం, చిన్నతనం, కొంతవరకు తగ్గిపోయి, మనిషిలో పరిపక్వత చోటు చేసుకుంది. శశాంక్‍ని గురించి మాట్లాడేటప్పుడు ఒక విధమైన తన్మయత్వంతో మాట్లాడుతుంది, కళ్లలో మెరుపు కనబడుతుంది. అతని పేరత్తగానే ముఖంలో మార్పు వచ్చి, మనిషి మృదువుగా ప్రవర్తిస్తుంది. అప్పుడప్పుడు సిగ్గుపడుతుంది కూడా!

            శర్మిష్ట ఇదంతా గమనించి ప్రవలికను ఆటపట్టించసాగింది. అయినా ప్రవలిక కోపం తెచ్చుకోవడంలేదు.

            ఒక రోజు ఉండబట్టలేక శర్మిష్ట అడిగేసింది’’ ప్రవీ! నువ్వు ప్రేమలో పడ్డట్టున్నావు? నిన్నీస్థితిలో ఎప్పుడూ చూడలేదు. అదివరకటి అఫైర్స్ అన్నింటిని ఆషామాషిగా, లైట్‍గా తీసుకునే దానివి. కానీ ఈసారి మాత్రం అలా అనిపించడంలేదు!’’ అంది.

            ‘‘అవును శర్మీ! నేను నిజంగా ప్రేమలో పడ్డట్టున్నాను! నాలో ఈ మార్పు నాకే వింతగా అనిపిస్తున్నది! లైఫ్‍ని ఎంజాయ్‍ చెయ్యాలన్న నా ఫిలాసఫీ ఏమిటి ఇలా మారిపోయింది? శశాంక్‍తో శాశ్వత సంబంధం పెట్టుకోవాలని, పెళ్లిచేసుకుందామా అని అడగాలని అనిపిస్తున్నది. నువ్వు చెప్పు ఏం చెయ్యమంటావో? నీ సలహా ఇవ్వు’’ అంది....

            ‘‘తప్పకుండా అడుగు. అతనికి కూడా నువ్వంటే ఇష్టమేగా? శని, ఆదివారాల్లో ఇద్దరూ బయటికి ఎక్కడికో                     వెళ్తున్నారుగా? అప్పుడు అడిగేసెయ్యి’’ అంది శర్మిష్ట.

            కృతజ్ఞతగా స్నేహితురాలి వంక చూసింది ప్రవలిక.

                                            *  *  *

            అనుకున్నట్లే శుక్రవారం రాత్రి ప్రవలిక, శశాంక్‍లు కూర్గు ట్రి వేసుకున్నారు. బస్సులో వెళ్లి, బస్సులో వచ్చేటట్లు టికెట్స్ కొనుక్కున్నారు. సోమవారం ప్రొద్దున్నే బెంగుళూరుకి తిరిగివచ్చి ఆఫీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

            సోమవారం ప్రొద్దున శర్మిష్ట ఆఫీసుకెళ్లడానికి తయారవుతుంది. ఇంతలో కాలింగ్‍బెల్‍ మ్రోగింది. తలుపు తీసింది. ప్రవలిక కూర్గు ట్రినుంచి వచ్చింది. మనిషి అన్యమనస్కంగా ఉంది. ముఖం కూడా చిన్నబోయి ఉంది.

            ‘‘ఏంటి అలా ఉన్నావు?’’ అడిగింది శర్మిష్ట.

            ‘‘ఏమీలేదు. బాగా అలసి పోయాను’’ అని తనగదిలోకి వెళ్లిపోయింది.

            ‘‘ఇక ఇప్పుడు కాదు, సాయంత్రం మాట్లాడుతాను’’ అనుకుని శర్మిష్ట ఆఫీసుకెళ్లింది.

            సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ప్రవలిక నీస్తేజంగా కూర్చుని కనిపించింది. ఆఫీసుకు కూడా వెళ్లలేదట!

            ‘‘ఏమయింది ప్రవీ? శశాంక్‍ని అడిగావా’’?

            ప్రవలిక కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆమెని ఈ స్థితిలో చూడటం ఇదే మొదటిసారి.

            మృదువుగా చెయ్యి పట్టుకుని ‘‘ఏమయిందో నాకు చెప్పు ప్రవీ!’’ అంది.

            ‘‘శశాంక్‍ని అడిగాను. ఇప్పుడు తొందరేముంది? ఇంకా మనం లైఫ్‍ ఎంజాయ్‍ చెయ్యాలికదా? మూడు,                   నాలుగేళ్లు ఆగి ఆలోచిద్దాం! అప్పటికి కూడా మనం ఒకరినొకరం ఇష్టపడుతుంటే పెళ్లి చేసుకుందాం అన్నాడు’’ అంది ప్రవలిక.

            ఈ పరిణామానికి విస్తుపోయింది శర్మిష్ట. ‘‘వాట్‍ ఏన్‍ ఐరనీ ఆఫ్‍ లైఫ్‍’’ అనుకుంది. ప్రవలికను ఎలా ఓదార్చాలో ఆమెకి తెలియలేదు.

                                            *  *  *

 

            ఆ తర్వాత ప్రవలికలో ఆశ్చర్యకరమైన పరివర్తన కలిగింది. మనిషిలో గంభీరత చోటు చేసుకుంది. అవసరం అయితేనే మాట్లాడటం చేస్తుంది. శశాంక్‍ని కూడా కలవడం మానేసింది. ఒక్క శర్మిష్టను తప్ప మిగతావారిని దూరంగా         ఉంచుతుంది. పుస్తకాలు చదవడం వ్యాపకంగా పెట్టుకుంది. ఈ మధ్య ఇల్లు, ఆఫీస్‍, పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం లేదు.

            కొన్ని రోజుల తర్వాత శని, ఆదివారాలు కూడా ఏ ఆలోచనలూ లేకుండా బిజీగా ఉండాలని ఒక స్వచ్ఛంద సేవాసంస్థలో చేరింది. ఆ సంస్థయొక్క వయోజనవిద్య, స్త్రీ సంక్షేమ పథకాలు, అనాథ పిల్లల సంరక్షణ వంటి కార్యక్రమాల్లోకి చురుకుగా పాల్గొనడం మొదలు పెట్టింది. ఆ పనులు చేసేటప్పుడు ఆమె చూపించే ఏకాగ్రత, అంకిత భావం అందరిని ఆశ్చర్యపరుస్తున్నది. ఈమె అసలు ప్రవలికేనా అన్న సందేహం చాలా మందికి కలగసాగింది.

            ‘‘ప్రవలిక శశాంక్‍ని గాఢంగా ప్రేమించింది. అతనితోనే లోకం అనుకుంది. అందుకే శశాంక్‍ ధోరణి ఆమె హృదయాన్ని గాయపరచింది. ఆ గాయాన్ని నెమ్మదిగా కాలమే మానేలా చేస్తుంది’’ అనుకుంది శర్మిష్ట.

 

* * *

            ఆరునెలలు గడిచిపోయాయి. అనురాగ్‍కి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరకముందే శర్మిష్ట, అనురాగ్‍ల వివాహం ఢిల్లీలో జరిగింది. స్నేహితురాలి పెళ్లిలో కీలకపాత్ర వహించింది ప్రవలిక. ముందుగా ప్రవలిక, ఆ తర్వాత శర్మిష్ట బెంగుళూరు చేరుకున్నారు. ఇందిరానగర్‍లో కొంచెం దూరంలో శర్మిష్ట, అనురాగ్‍ల కోసం ఫ్లాట్‍ వెదికి పట్టుకున్నారు. చాలా వరకు తన సామాను అక్కడికి చేరవేసింది శర్మిష్ట. అనురాగ్‍ ఇక రెండు రోజుల్లో వస్తాడని తెలిసి, మరుసటిరోజు తన ఫ్లాటుకి వెళ్లాలనుకుంది.

            కానీ ప్రవలికను వదిలి వెళ్లడం ఆమెకి ఎంతో కష్టం అనిపించిసాగింది. ఆ రాత్రి స్నేహితురాళ్లిద్దరూ చాలా సేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్నారు. దిగులుగా ఉన్న శర్మిష్ట ముఖం చూసి ప్రవలిక...

            ‘‘అరే! శర్మీ! ఎందుకంత దిగులు? మనం కలుసుకుంటూనే ఉంటాం కదా? నాతో పాటు ఇక్కడ ఉండటానికి నా కొలీగ్‍ అపర్ణ వస్తుంది కదా?’’ అంది.

            శర్మిష్ట కొంత సర్దుకుంది. ప్రవలిక వంక దీర్ఘంగా చూసింది. ‘‘ఎన్నో రోజులనుంచో ప్రవలికను అడగాలనుకున్న విషయాలు ఇప్పుడే అడిగేస్తాను’’ అనుకుంది.

            ‘‘ప్రవీ! నువ్వు చాలా మారిపోయావు. నిన్ను చూస్తుంటే నాకు  దిగులుగా ఉంది’’ అంది.

            ‘‘శర్మీ! నాలో మార్పు నా మంచికే వచ్చింది. నాలోకి నేను చూసుకున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను. ఇప్పుడే నాకు నిజమైన స్వేచ్ఛాస్వాతంత్రాలు వచ్చినట్లు అనిపించసాగింది. ఒకరి కోసం కాకుండా నా కోసం నేను బతుకుతున్నానన్న తృప్తి కలగసాగింది. నేను చేసే పనుల్లో ఊహించని ఆనందాన్ని పొందుతున్నాను’’ అంది.

            ‘‘మరి శశాంక్‍ సంగతేంటి?’’

            ‘‘అతన్ని నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. తనంతట తనే వచ్చి పెళ్లి చేసుకుందాం అంటే నేను ఒప్పుకుంటాను. ఒకవేళ రాకపోయినా ఫర్వాలేదు. నేను నేనుగా జీవంచగలను. నాలో వచ్చిన ఈ మార్పు నన్ను నిర్భయంగా ముందుకు సాగమంటున్నది’’ అంది.

            ప్రవలిక ముఖంలో కనపడే ఆత్మవిశ్వాసం శర్మిష్టను శాంత పరచింది. స్నేహితురాలిని ఆప్యాయంగా కౌగిలించుకుంది

ఆత్మాభిమానం 

పొద్దునే ఆరుగంటలకే మెలుకువ వచ్చింది శమంతకి.మెలుకువ రాగానే ఈ రోజు శ్రీధర్ వస్తున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి ఆనందంతో పులకించిపోయింది.

"అబ్బా! శ్రీధర్ ని చూసి అప్పుడే ఆర్నెలవుతుంది.ఇన్నాళ్లు చూడకుండా ఎలా ఉండగలిగింది? అతనిక్కడ ఉన్నన్నాళ్ళు తనకిక పండుగే.ఏడింటికల్లా హైదరాబాదు వచ్చేస్తాడు.తనింటికి కనీసం పదికల్లా రావచ్చు.ఈ లోపల తను రెడీ అయిపోవాలి"అనుకొని చెంగున మంచం దిగి బాత్రూం కి వెళ్ళింది.

శ్రీధర్,శమంత ఐదవ క్లాసు నుంచి ఒకే స్కూల్లో చదివారు.12 వ క్లాసు తర్వాత శ్రీధర్ మంచి మార్కులతో ఆల్ ఇండియా టెస్ట్ లో కూడా మంచి ర్యాంకు తెచ్చుకొని ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాడు. శమంత కూడా మంచి మార్కులతో పాసై హైదరాబాదులోని ఆడపిల్లల కాలేజీలో బి.ఏ పొలిటికల్ సైన్స్ ఆనర్స్ చేస్తున్నది.ఆమె ఇప్పుడు బి.ఏ ఫైనల్ పరీక్షలు రాసి సీటు వస్తే హైదరాబాద్ యూనివర్సిటీ లో ఎమ్.ఏ చేయాలన్న ఆలోచనలో ఉంది.

శమంతకి స్కూల్లో ఉన్నప్పుడు కూడా శ్రీధర్ అంటే ఇష్టంగా ఉండేది.నెమ్మదిగా ఉండి, మృదువుగా మాట్లాడే శ్రీధర్ స్వభావం ఆమెకెంతో నచ్చేది. యుక్తవయస్సు రాగానే ఆ ఇష్టం నెమ్మదిగా ప్రేమ లోకి మారింది. శ్రీధర్ కి కూడా ఆమె అంటే ఎంతో అభిమానం.అమాయకంగా చురుగ్గా ఉండే శమంత అతనికి స్కూలు రోజుల నుంచి ప్రియ స్నేహితురాలు.ఆ తర్వాత ప్రియురాలు.

 రోజూ బద్ధకంగా పదిసార్లు చెప్పించుకొని తాత్సారం చేసే శమంత ఈరోజు హడావిడిగా తయారై హాల్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చూసి నవ్వుకుంది శారద.ఆమెకి తెలుసు  శ్రీధర్ అంటే కూతురికి ఎంత ఇష్టమో.

శమంతా హాల్లో సోఫాలు శుభ్రం చేసింది.కుషన్స్ ఒకటికి పది సార్లు సర్దింది.పూలు తీసుకొచ్చి వాజుల్లో అమర్చింది.ఎదురుతెన్నులు చూస్తూ గడియారం వంక పదేపదే చూడసాగింది.శ్రీధర్ ఎంతకీ రాలేదు.అతని సెల్ కి ఫోన్ లు చేస్తుంటే స్విచాఫ్ వస్తున్నది.

ఈలోగా భోజనం టైం అయింది. తల్లి బలవంతం మీద భోజనం అయిందనిపించింది.ఆ తరువాత సోఫాలో చాలా సేపు ఎదురు చూస్తూ గడిపింది.చివరికి విసుగనిపించి అక్కడే పడుకుంది. ఐదింటికి కాలింగ్ బెల్ మ్రోగ్గా ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది.

 ఎదురుగా చిరునవ్వుతో శ్రీధర్. అతన్ని చూడగానే అన్నీ మర్చిపోయి నవ్వింది.ఇద్దరు ఒకరినొకరు గాడంగా చూసుకుంటూ నిలబడిపోయారు. లేత నీలం రంగు షెల్వార్ కమీజ్ లో అతనికి దేవతలా కనిపించింది. ఇంకా ఎత్తు పెరిగి దృఢంగా తయారైన శ్రీధర్ ని శమంత తనివితీరా చూడ సాగింది.చివరకి శమంత తేరుకొని తెచ్చుకున్న కోపంతో.

 "పొద్దుననగా వచ్చి ఇప్పుడా రావడం? నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను తెలుసా? నీ సెల్ ఉదయం నుంచి స్విచాఫ్ వస్తున్నదేందుకు?" అంది.

 "సారీ శమంతా! తొందరగానే వద్దామనుకున్నాను.డాడీ కారు సర్వీసింగ్ కి ఇయ్యమన్నారు. అక్కడికి వెళ్తే అనుకోకుండా ఒక ఫ్రెండ్ కలిశాడు.దాంతో ఆలస్యం అయింది.సెల్ కి ఛార్జింగ్ పెట్టడానికి ఈరోజు టైమే కుదరలేదు.ఇంతకీ నన్ను లోపలికి రానిస్తావా?" అన్నాడు.

శమంత దారి ఇచ్చింది.ఇద్దరూ కూర్చున్నాక శమంత నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పసాగింది.తన చదువు, స్నేహితురాండ్రు,ఎమ్.ఏ లో చేరే విషయం,వీటన్నిటినీ గురించి శ్రీధర్ చెవిన వేయాలనే ఆత్రంతో చెప్తున్నది.కొంచెం సేపటికి ఆపి

 "నువ్వు ఏమీ మాట్లాడటం లేదు" అంది.

" నువ్వు మాట్లాడనిస్తేగా" అన్నాడు నవ్వుతూ.

ఇంతలో శారద ఇద్దరికీ కాఫీ,టిఫిన్ లిచ్చి శ్రీధర్ విశేషాలు అడిగి తెలుసుకుంది.కొంచెం సేపు కూర్చొని లోపలికెళ్ళింది.

ఇద్దరు కాఫీ,టిఫిన్లు పూర్తి చేశారు.కాసేపు శ్రీధర్ తన కాలేజీ విషయాలు,ఫ్రెండ్స్ కబుర్లు,పూనా విశేషాలు చెప్పి "అలా పార్క్ కి వెల్లోద్దామా?" అని అడిగాడు.

 శమంత ఉత్సాహంగా "అలాగే అమ్మకి చెప్పోస్తాను ఉండు" అంది.

 ఇద్దరూ కాలనీకి కొంచెం దూరంగా ఉన్న పార్క్ కి దారి తీశారు.పెద్ద పెద్ద చెట్లతో, రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది పార్కు.జనం ఎక్కువగా లేరు.ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చున్నారిద్దరు.కొంచెంసేపు మామూలు మాటల తర్వాత

" మూడు సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయి.నాలుగో సంవత్సరంలో నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చేది, ఎక్కడ పోస్టింగ్ అయ్యేది తెలిసిపోతుంది" అన్నాడు శ్రీధర్.

"నువ్విక పైకి చదవ్వా? ఉద్యోగంలో చేరి పోతావా?' అడిగింది శమంత.

 "అవును. నువ్వు లేకుండా ఇక ఎక్కువ రోజులు ఉండలేను శమంతా.ఉద్యోగం వస్తే, పెళ్లి చేసుకుని నిన్ను తీసుకెళ్తాను" అన్నాడు.

 "మరి నా చదువు?" అంది గాభరాగా శమంత.

"అవును కదూ! మర్చిపోయాను. పెళ్లయిన తర్వాత కూడా నువ్వు చదువుకో! నీ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వద్దువుగానీ" అన్నాడు.

 "మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా?కులాల ప్రసక్తి తీసుకురారు కదా?"అంది శమంత అతని చేతిని తన గుప్పిట్లోకి తీసుకుంటూ దిగులుగా.

 "వాళ్లని ఒప్పించే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు.నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నిన్ను చేసుకుంటానని ఇంట్లో చెప్తాను" అన్నాడు.

పార్కులో చీకటి పడింది.చుట్టు పక్కల ఎవరూ లేకుండా చూసి శమంతని ముద్దుపెట్టుకున్నాడు శ్రీధర్.

 అతనికి స్కూల్లో చదివేటప్పుడు శమంత తన పుట్టినరోజు నాడు దాచుకున్న పాకెట్ మనీ తో గిఫ్ట్ లు  కొనివ్వడం,ఒకసారి తనకి శిక్ష తప్పించడానికి చెయ్యని తప్పుని తనమీద వేసుకుని తెలుగు టీచర్ తో తిట్లు తినడం గుర్తుకు వచ్చి మనసు ఆర్ద్రతతో నిండిపోగా శమంతను తన ఒడిలోకి లాక్కున్నాడు.అలా చాలా సేపు గడిచిపోయింది. చివరికి శ్రీధర్ తెలివి తెచ్చుకొని

 "ఇక వెళ్దాం పద. చాలా టైమ్ అయింది" అన్నాడు.

 శమంత అయిష్టంగా లేచింది. ఇద్దరు కొంచెం దూరంగా నడుస్తూ కాలనీ చేరుకున్నారు.శమంతని ఇంటి దగ్గర దించి బై చెప్పి ఆ వీధి చివరి లోనే ఉన్నా తన ఇంటికి దారి తీసాడు శ్రీధర్.

శ్రీధర్ ఉన్న నెలరోజులు గిర్రున తిరిగి పోయాయి.ఎన్నో ఊసులాడుకున్నారు.ఊహల్లో విహరించారు.ఇంట్లో వాళ్ళకి తెలియకుండా షికార్లు చేశారు. సినిమాల కి వెళ్లారు.చివరికి శ్రీధర్ వెళ్లే రోజు వచ్చింది.శమంత కళ్ళనీళ్ళు పెట్టుకుంది.ఇంకో సంవత్సరం ఓపిక పట్టమని ఓదార్చాడు.

శమంత తండ్రి మురళీధర్, శ్రీధర్ తండ్రి సూర్యప్రకాష్ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.ఇద్దరూ స్నేహంగా ఉంటారు.శారద,శ్రీధర్ తల్లి సుమిత్ర కిట్టి మెంబర్లు.మంచి స్నేహితులు.రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉన్నాయి.శ్రీధర్,శమంతల విషయం శమంత తల్లిదండ్రులు చూచాయగా గ్రహించారు.శ్రీధర్ తల్లిదండ్రులకి విషయం తెలుసా అన్నదే ఇంకా తేలని విషయం. ఎందుకంటే శ్రీధర్ శమంత ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు.శమంత మాత్రం శ్రీధర్ ఇంటికి ఎంతో అవసరం అయితే తప్ప వెళ్ళేది కాదు.

ఆ తర్వాత శమంత ఎమ్.ఏ లో చేరింది.శ్రీధర్ తో ఫోన్ల ద్వారా టచ్లో ఉంది.శ్రీధర్ కి ఫైనలియర్ అవ్వడం మూలానా,క్యాంపస్ ఇంటర్వ్యూల మూలాన ఇంటికి రావడం కుదరలేదు. శ్రీధర్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఢిల్లీలో మొదటి పోస్టింగ్ అని సుమిత్ర శారదకి చెప్పింది.శ్రీధర్ కూడా శమంతకా విషయం చెప్పాడు.

ఇంకో మూడు నెలల్లో శ్రీధర్ తిరిగి వస్తాడనగా శమంతకి అతని నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది.శమంత ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీధర్ సెల్ స్విచాఫ్ వచ్చేది.శమంత దిగులు పడింది. శ్రీధర్ ఎందుకు ఫోను చేయడం లేదో ఆమెకు అర్థం కావడం లేదు. అతనెప్పుడూ వస్తాడా అని వేయికళ్ళతో ఎదురు చూడసాగింది.

ఒకరోజు ఈ యూనివర్సిటీ నుంచి నాలుగింటికి ఇంటికి రాగానే తల్లి కాఫీ ఇస్తూ

 "శ్రీధర్ వచ్చి నాలుగు రోజులు అయిందట! నీకు తెలుసా?" అంది.

శమంత నిర్ఘాంతపోయింది."తనకు కనీసం కబురు కూడా చేయలేదేంటి  శ్రీధర్?" అని మదన పడసాగింది.

శ్రీధర్ ప్రవర్తన శమంత లో తెలియని భయాన్ని కలిగించాయి. తెరవెనుక ఏదో జరుగుతుంది అదేమిటో ఆమె ఊహించలేకపోయింది.ఇంకో రెండు రోజులు శ్రీధర్ తన ఇంటికి వస్తాడని ఎదురు చూసింది. రాకపోయేసరికి ధైర్యం చేసి అతని ఇంటికి వెళ్లింది.

ఆ రోజు ఆదివారం.సూర్యప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు.శమంత పలకరించి, "లోపల ఉష ఉందమ్మా! వెళ్ళు!" అని ఒక వైపు ఉన్న బెడ్రూమ్ చూపించాడు.శమంత లోపలికెళ్ళింది. శ్రీధర్ చెల్లెలు ఉష ఏదో పుస్తకం చదువుకుంటున్నది.శమంతని చూసి లేచి నవ్వుతూ పలకరించి కూర్చోమంది. ఉషా నెల్లూరులో మెడిసన్ రెండవ సంవత్సరం చదువుతుంది. నిన్ననే హైదరాబాద్ వచ్చినట్లు మాటల్లో చెప్పింది. కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఇక ఆపుకోలేక

" శ్రీధర్ వచ్చాడటగా! కనబడడేం?" అంది ఆత్రుత కనబడకుండా.

"అన్నయ్య,అమ్మ విజయవాడ వెళ్లారు.అన్నయ్య కి సంబంధం వచ్చింది.అమ్మాయి ని చూడటానికి వెళ్లారు.డాడీ ఆఫీస్ పనుల వలన వెళ్లలేకపోయారు.సంబంధం తెచ్చిన అరుణ ఆంటీ అమ్మతో, అన్నయ్య తో కూడా వెళ్లారు" అంది.

శమంత తల గిర్రున తిరిగింది. దిక్కుతోచలేదు.క్షణాల్లో మనిషి డీలా పడిపోయింది.తలపట్టుకు కూర్చుంది.

ఉష కంగారు పడింది.

 "ఏమిటి అలా ఉన్నావు" అని అడిగింది.

శమంత కి ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియలేదు. ఉషా వ్యవహారం చూస్తే ఆమెకేమీ తెలిసినట్టు లేదు. ఇక అక్కడ ఆమెకు ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు.

"ఏం లేదు ఉషా! సడన్గా తలనొప్పి మొదలైంది.ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని వడివడిగా లేచి బయటకొచ్చేసింది.

ఇంటికొచ్చిందేగాని మనస్సు మనస్సులో లేదు.తల్లి పలకరిస్తున్న వినకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద పడి ఏడవసాగింది. ఒక గంట తర్వాత తల్లి వచ్చి తలుపు కొట్టింది.లేచి తలుపు తీసింది.మొహం ఉబ్బిపోయి,కళ్లెర్రగా ఉన్న కూతురుని చూసి ఏదో జరిగిందని గ్రహించింది శారద.అనునయించగా వెక్కిళ్ల మధ్య జరిగింది చెప్పింది. శ్రీధర్ ప్రవర్తనలో వచ్చిన మార్పుని,తనకి మధ్య ఫోను చేయకపోవడాన్ని గురించి కూడా చెప్పింది.

ఈ సారి ఆశ్చర్యపోవడం శారద వంతయింది.సుమిత్ర తనకీ విషయం మాట మాత్రమైనా చెప్పకపోవడం విచిత్రంగా అనిపించింది.అసలు విషయం తెలుసుకుంటానని శమంతని ఓదార్చింది.మురళీధర్ ఇంటికి రాగానే విషయం చెప్పింది.ఆయన కూడా ఆశ్చర్యపడి  "సూర్యప్రకాష్ అన్ని విషయాలు నాతో చెప్తాడు.ఈ విషయం ఎందుకని చెప్పలేదు?" అన్నాడు.

ఆయన శారద ఇద్దరూ ఎంతో సేపు ఆలోచించి సుమిత్ర,శ్రీధర్ ఊరు నుంచి రాగానే వెళ్లి మాట్లాడదామన్న నిర్ణయానికొచ్చారు.రెండు రోజుల తర్వాత శ్రీధర్,సుమిత్ర వచ్చినట్లు తెలిసింది.శారద మురళీధర్ ఆ రోజు సాయంత్రం శ్రీధర్ ఇంటికెళ్లారు.వాళ్ళు వచ్చేవరకు ముళ్ల మీదున్నట్లు గడిపింది శమంత.ఒక గంట తర్వాత వాళ్ళిద్దరూ ముఖాలు వేలాడేసుకుని వచ్చారు.శమంతకి జరిగింది చెప్పారు.

వీళ్ళు వెళ్లగానే సుమిత్ర మొదట్లో కొంచెం గాబరా పడి సర్దుకుంది. కొంచెంసేపు మామూలుగా మాట్లాడుకున్నారు.సంభాషణల్లో కేవలం సుమిత్ర పాలుపంచుకుంది. సూర్య ప్రకాష్,శ్రీధర్ ముభావంగా కూర్చున్నారు.కాసేపటికి సుమిత్ర నవ్వుతూ  "శ్రీధర్ పెళ్లి కుదిరింది.విజయవాడ అమ్మాయి. పేరు లావణ్య. మా వాళ్లే. వచ్చే నెల మూడవ తారీఖున విజయవాడలో పెళ్లి. మీరందరూ తప్పకుండా రావాలి" అంది.

 "అదేమిటి సుమిత్ర? చిన్నప్పటి నుంచీ శమంత,శ్రీధర్ కలిసి పెరిగారు.కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు.ఒకరినొకరు కూడా ఇష్టపడుతున్నారని కూడా నేను అనుకుంటున్నాను.అయినా ఇంత హఠాత్తుగా వెళ్లి పెళ్లి కాయం చేసుకోవచ్చారెందుకు? మాట మాత్రమైనా మాకు చెప్పలేదు ఎందుకని?శ్రీధర్ చదువయ్యాక మేమే మిమ్మల్ని అడుగుదామనుకున్నాం" అంది శారద.

దానికి సుమిత్ర వాళ్ళిద్దరూ "క్లాస్ మేట్స్,ఫ్రెండ్స్. అంతే!అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుందని మీరెలా అనుకున్నారు.మన కులాలు వేరు కదా.నేను బతికుండగా ఇది జరగని పని. వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు.వాళ్ళకి విషయాలు తెలియవు.శమంతకి సర్ది చెప్పాల్సింది పోయి రాయబారానికి వచ్చారా" అంది అక్కసుగా.

 శారదకేం మాట్లాడాలో తెలియలేదు.శ్రీధర్ వంక చూసి "శమంత నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఇలా చేసావేం శ్రీధర్?" అంది బాధగా.

శ్రీధర్ ఏమి చెప్పలేనట్లుగా తలవంచుకున్నాడు.దానిని బట్టే గ్రహించుకుని శారద ఇక లాభం లేదని భర్తతోపాటు బయటకి వచ్చేసింది.

ఆ తర్వాత ఆ రెండిళ్ళ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. సుమిత్ర,శారదలు కలుసుకోవడం మాట్లాడుకోవడం మానేశారు.శ్రీధర్ పెళ్లి కార్డు కూడా ఉష ద్వారా పంపించారు.

 శమంతా హృదయానికి లోతైన గాయం తగిలింది.ఆమె ప్రపంచం అస్తవ్యస్తమైంది.శ్రీధర్ మీద ఆగ్రహంతో ఉడికి పోయింది.

 "అతన్ని ఎంత గుడ్డిగా నమ్మింది. చిన్నప్పటినుంచి అతనితోనే జీవితం అనుకుంది.పెళ్ళికి ఒప్పుకునే ముందు కనీసం తనకు క్షమాపణ చెబుతూ ఉత్తరమయినా రాయొచ్చుగా? అసలు ఏమీ పట్టనట్లు మౌనంగా అన్నిటికీ రాజీపడి పిరికితనం చూపించాడు. తల్లిదండ్రులనెదిరించి తనని చేసుకోవచ్చుగా?ఆ మాత్రం ధైర్యం లేదా? ఎన్ని ప్రమాణాలు చేశాడు? తను అనుకుంటూనే ఉంది కులాల ప్రసక్తి వస్తుందని, ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను కదా అని ఎంత నమ్మకంగా చెప్పాడు?" అనుకొని విలవిలలాడింది.

తల్లిదండ్రులు ఎంతో ఓదార్చారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకముందు జీవితాన్ని గురించి ఆలోచించమన్నారు.కానీ శమంత కృంగిపోయింది.నిద్రాహారాలు మాని విలపించింది.

కాలం ఎవరికోసం ఆగదు.మూడో తారీకు వచ్చింది.వెళ్లిపోయింది కూడా.ఇరుగుపొరుగుల ద్వారా శ్రీధర్ పెళ్లి అయిపోయినట్లు, లావణ్య తో సహా ఇంటికి వచ్చినట్లు తెలిసింది.రెండు రోజుల తర్వాత హనీమూన్కి కేరళ వెళ్తున్నట్లు కూడా తెలిసింది. శ్రీధర్ కి ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి శమంతని చేసుకుంటానని చెప్పాడని,తల్లి కులాల ప్రసక్తి తెచ్చి ససేమిరా అన్నదని,శ్రీధర్ మాట వినకపోతే తన శవాన్ని చూడాల్సి వస్తుందని,శమంతతో ఇక ఎటువంటి సంపర్కం పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చిందని,లావణ్య పెద్ద కట్నంతో లాంచనాలతో వచ్చిందని సుమిత్ర శారద ఇద్దరితో స్నేహంగా ఉండే సౌజన్య ద్వారా విషయాలు తెలిశాయి.

నెమ్మదిగా శమంతా కొంత తేరుకుంది."తనకి వీసమంతైనా విలువ ఇవ్వని శ్రీధర్ ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి.అది అనుకున్నంత తేలిక కాకపోయినా తప్పదు మరి!" అనుకుంది.

 శ్రీధర్ లావణ్య హనీమూన్ నుంచి వచ్చారని తెలిసింది. ఆ నెల 15వ తారీఖున లావణ్య పుట్టిన రోజు గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారని చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచారని కూడా తెలిసింది.

15వ తారీకు రానే వచ్చింది.శ్రీధర్ ఇంటిని రంగురంగుల పూలతో అలంకరించారు. బయట షామియనా వేశారు.సాయంత్రం అయింది.అతిథులు రావడం మొదలైంది.

ఉదయం నుంచి రెస్ట్ లెస్ గా గడిపిన శమంత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు లేచి నైటీ తీసేసి డ్రెస్ వేసుకుంది.తల్లికి ఇప్పుడే వస్తానని చెప్పి, ఎక్కడికని అడుగుతున్న వినిపించుకోకుండా, బయటకి వచ్చి వడివడిగా శ్రీధర్ ఇంటి వైపు వెళ్ళింది.గేటు తీసుకొని హాల్లోకి వచ్చింది.హాల్లో లావణ్య అప్పుడే కేక్ కట్ చేసింది. చుట్టూ ఉన్నఅందరూ "హ్యాపీ బర్త్డే టూ యు" అని పాడారు శ్రీధర్ తో సహా. చిన్న కేకు ముక్క శ్రీధర్ ఆమె నోట్లో పెట్టాడు.ఆమె కూడా అతని నోట్లో పెట్టింది. ఇద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. హఠాత్తుగా శ్రీధర్ దృష్టి వాళ్ళిద్దరినీ చూస్తున్నట్లు ఉన్న శమంత మీదకు మళ్ళింది.నిశ్చేష్టుడై ఆమె వంకే చూడసాగాడు.నెమ్మదిగా అందరి దృష్టి ఆమె మీదకు మళ్ళింది.

శమంత శ్రీధర్ వంక సూటిగా చూస్తూ మాట్లాడ సాగింది. "శ్రీధర్ చాలా సంతోషంగా ఉన్నావే? చిన్ననాటి స్నేహితురాలిని, నీ ప్రియసఖిని నన్ను మర్చిపోయావా? తల్లి బెదిరింపులకు లొంగి పోయావా? లేక లావణ్య కట్నానికి దాసోహం అన్నావా? అందంలో నా కాలి గోటికి కూడా సరిపోని లావణ్య ధన మోహంలో అతిలోక సుందరిలా కనబడుతున్నదా? హనీమూన్ కి వెళ్లొచ్చావ్. రేపు లావణ్య తో సహా ఢిల్లీ వెళ్తున్నావు. కొత్త జీవితం ప్రారంభించబోతున్నావ్. ఇక ఈ పాత ప్రేయసిని పూర్తిగా మర్చిపోతావ్. అవునా? నా ఇక నా సంగతి.నాకు చిల్లిగవ్వ విలువ కూడా ఇవ్వని నీ కోసం జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా? నెవర్. నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. బాగా చదువుకుంటాను. మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడుతా. నేనంటే ఇష్టపడేవాడిని, నన్ను నన్నుగా అభిమానించి విలువనిచ్చి గౌరవించే వాడిని పెళ్లి చేసుకుంటాను.ఇక నీ కోసం ఒక్క కన్నీటిబొట్టు కూడా వ్యర్థం చెయ్యను.ఆఖరిగా నా కోరిక ఒకటి తీర్చుకుంటాను.అంతేకాదు నీకు జీవితాంతం గుర్తు ఉండే బహుమతి కూడా ఇచ్చి వెళతాను. అని వేగంగా శ్రీధర్ దగ్గరికెళ్ళి తనకు ఉన్న శక్తినంతా కూడదీసుకుని చెంప చెల్లుమనిపించింది. ఇక ఎవరి వంక చూడకుండా వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయింది.

 ఏం జరిగిందో అర్థం కాక పోయినా ఇంటికి వచ్చిన కూతురు ముఖంలో కనపడిన ప్రశాంతత, ఏదో నిర్ణయానికి వచ్చిన నిశ్చింత చూసి శారద దీర్ఘంగా నిట్టూర్చింది.

 

సాహిత్య వ్యాసలు

‘కొండ పొలం’ తెలుగు నవలా సాహిత్యానికి కలికి తురాయి

                   సుమారు ఇరవై ఏళ్లగా రాయలసీమ నుంచి ఆ ప్రాంత అస్తిత్వాన్ని ధృవపరచే కథలు, నవలలు వస్తున్నాయి. మరీ ముఖ్యం గత నాలుగైదేళ్లలో ఆ ప్రాంతం నుంచి వస్తున్న నవలలకు సాహిత్యపరంగా  ఎంతో గుర్తింపు లభిస్తున్నది. రాయలసీమ చారిత్రక వారసత్వం, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, ప్రజల అలవాట్లు, వేషభాషలు, నమ్మకాలు, వైఖరులు, దృక్పథాలు ప్రతిబింభించేలా సాహిత్యం ఉండాలన్న స్పృహ, చైతన్యం ఆ ప్రాంతపు సాహిత్యకారులలో రావడం దీనికి కారణం కావొచ్చు. తన శప్తభూమినవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు డిసెంబరు 2019లో ఎంపికైన సందర్భంగా డిసెంబరు 23న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో రచయిత బండి నారాయణస్వామి “తెలంగాణ ఉద్యమక్రమంలో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా దాదాపు పునరుజ్జీవం పొందింది. కానీ తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ ప్రాంత మూలాలను సామాజికంగా, రాజకీయంగా చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ శప్తభూమినవలను రాయించింది’’ అన్నారు.  ఆయన మాటలు పై పరిశీలనను ధృవపరుస్తున్నాయి.

            రాయలసీమ జీవన విధానాన్ని సమర్థవంతంగా, సరైన అవగాహనతో, వాస్తవానికి దగ్గరగా ఆ ప్రాంతపు మాండలికంలో రాసిన నవలాకారులలో పేర్కొనదగినవారు కేశవరెడ్డి, పొలాప్రగడ సత్యనారాయణమూర్తి, స్వామి పేరుతో రాస్తున్న బండి నారాయణస్వామి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, చిలుకూరి దేవపుత్ర, శాంతినారాయణ, జి.కల్యాణరావు, కొలకలూరి ఇనాక్‍ మొదలైనవారు. రాయలసీమ నవలా పక్రియలో తనదైన ముద్రవేస్తూ, ఆ ప్రాంతపు జీవనరీతిని వెలుగులోకి తెస్తూ నవలలు రాస్తున్న మరొక నవలాకారుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. 1998లో వచ్చిన ఆయన నవల కాడి: రాయలసీమ రైతు జీవితంలో రెండు దశాబ్దాల కాలం (1980 - 1998)లో వచ్చిన మార్పుల్ని సమగ్రంగా చిత్రించిన నవల. రైతులకు (రెడ్లకు) దళితులకు మధ్య ఆర్థిక, సామాజిక సంఘర్షణను కూడా సమర్ధవంతంగా చిత్రించిన  ఈ నవలకు  ఆటాబహుమతి లభించింది.  2017లో వచ్చిన ఆయన నవల ఒంటరిప్రకృతిని అర్థం చేసుకున్న వాడెవడూ దాన్ని విధ్వంసం చెయ్యడన్న సందేశాన్నిచ్చింది. మనిషికి తనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఒంటరి’ నవల అంటారాయన. ఇది తానా బహుమతి పొందిన నవల.

            2019లో వచ్చిన ఆయన నవల కొండపాలంమరోసారి తానా  బహుమతి గెలుచుకుంది. గొల్లలు, కాపులు సగం సగంగా ఉన్న ఊరు ఆయనది. అది కడప జిల్లాలో ఉన్న బాలరాజు పల్లె. చిన్న తనం నుండి గొల్లలతో కలసి మెలసి బతుకుపయనం సాగిస్తున్నప్పటికీ, వాళ్ల జీవితాన్ని అర్థం చేసికొని, వాటిని సాహిత్యంలోకి తీసుకురావాలనే తలంపుతో ఈ నవల రాయడానికి ఆయనకి పదిహేను సంవత్సరాలు పట్టింది. వ్యవసాయ వృత్తిని జీర్ణించుకొన్నంతగా గొర్లకాపరితనాన్ని  జీర్ణించుకుని ఈ నవల రాసారు. తన కులానికి, వృత్తికి సంబంధించిన  పొరలన్నీ వదల్చుకుని అవతలిగట్టుకు నడవగలిగిన స్థితికి వచ్చినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం.

            ఈ నవలలో ముఖ్య పాత్రదారి రవీంద్రయాదవ్‍, యాదవుల  ఇళ్లల్లో మొదటి ఇంజనీరింగ్‍ ‘‘గ్రాడ్యుయేట్‍’’.  ఉద్యోగం సంపాదించుకోడానికి నాలుగేళ్లగా హైదరాబాద్‍ అమీర్‍ పేటలోని సాఫ్ట్వేర్‍ సొల్యూషన్స్లో కోచింగ్‍ తీసుకుంటున్నాడు. కానీ ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. నగరాల్లో పిల్లల ఆంగ్ల వాగ్ధాటి ముందు గుంపు తర్కంలో నిలబడలేక పోతున్నాడు. ఇంటర్వ్యూగదిలోకి పోకముందే వెన్నెముక జలదరింపుతో, ముఖాముఖి చెమట భయంతో, న్యూనతతో ఢీలా పడిపోతున్న పల్లె యువకుడు. తండ్రి గురప్ప నాలుంగేండ్లయితాంది సదవైపోయి...’’ అనే ప్రశ్నలకు జవాబియ్యలేక సతమతమవుతున్నాడు.

            వంద గొర్రెలున్న గొర్రెల కాపరి గురప్ప. వర్షాలు పడేదాకా ఎండాకాలం వాటి మేత, నీళ్లు పెద్ద సమస్య.  సాధారణంగా కాపర్లు పదిమైళ్ల దూరంలో ఉన్న నల్లమల కొండల మీద మంచి వాన పడ్డ తర్వాత గొర్రెల మందల్ని తోలుకుపోయి కొండలమీద అడవుల్లో మేపుతారు. పల్లెల్లో వర్షాలు పడిన తర్వాత తిరిగివస్తారు. అలా పోవడాన్ని కొండపొలం వెళ్లడం అంటారు. గొర్రెల కాపర్ల కొండపొలానికి బత్తెం తయారు చేస్తారు ఇంటి ఆడపడుచులు.   సజ్జరొట్టెలు, బియ్యం, బెల్లపుండలు, ఉల్లిగడ్డలు, చింతపండు, వెరుశెనగ గింజలు, ఎండు మిరపకాయలు దంచి, ఉప్పుకలిపిన ఉండలు మొదలైనవి మూటగట్టి ఇస్తారు. అవి బత్తెపు  కాలానికి అంటే ఎనిమిది రోజులకు సరిపోతాయి. అవి అయిపోగానే మళ్లీ బత్తేలు తయారు చేసి పంపుతారు.

            రవితాత రవితో ‘‘మీ నాయనతో పాటు నువ్వూ కొండపొలం చేసిరాపో. గొర్లపానాలు నిలబెట్టు. ఆర్నెల్లల్లో నీకు  ఉద్దేగం రాకుండ నా మొగం సూడగాకు’’ అని ప్రతిజ్ఞ చేసినట్లుగా చెప్పాడు. అన్న శంకర్‍కి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన ఏడాది కొండపొలం చెయ్యకూడదన్న నియమంవల్ల అతన్ని మినహాయించారు. చివరికి రవి తండ్రికి సహాయంగా వెళ్లక తప్పలేదు. తల్లి గురమ్మ చిన్నప్పటి నుంచి రవిని గారాంగా పెంచి, దూరంగా పంపి చదివించింది. వాడికి ‘‘పల్లగొర్రెకు, బొల్లిగొర్రెకు తేడా తెలీదు. కారుపొట్టేలికి, దొడ్డిపొట్టేలికి భేదం కనుక్కోలేడు. తాపుడు పిల్లను దాని తల్లికాడ చేర్చలేడు. అడ్డాలు తాగే పిల్లను కొనుక్కొని పక్కకు లాగలేడు’’ అని మొదట్లో ఒప్పుకోలేదు. చివరికి తన భర్తకి తోడవసరం అని గ్రహించి మరీమరీ జాగ్రత్తలు చెబుతూ కళ్లనీళ్లతో సాగనంపింది. రోజంతా భుజాన్నేసుకునే ఎవరి బత్తెం వాళ్లు మోసకపోతూ బయలు దేరారు తండ్రి కొడుకులు.

            ఏభైరోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించినతీరు అద్వితీయం! ఉత్కంఠ భరితంగా, ముందు ముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాన్ని ఇంత చక్కగా వర్ణించిన ఇటువంటి నవల ఇంత వరకు రాలేదు. ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న అశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల! ఈ నవల చదివేటప్పుడు నాకు నచ్చిన అంశాలు, సన్నివేశాలు, వచ్చిన ఆలోచనలు, అడవితో మమేకమైన నా మనస్థితి మీతో పంచుకోవాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం!

            మొదట్లో రవి కొండల్లో ఇతర గొర్రెకాపర్లతో పాటు తను అన్ని రోజులు జీవించగలడా అని సందేహపడ్డాడు. రోజూ స్నానం చెయ్యడానికి నీళ్లుండవు. స్నానం కాదుగదా కాళ్లు కడుక్కున్నా వెంటనే చలిజ్వరం వస్తుంది ఆ నీళ్ల తత్వానికి. పురుగుపుట్రా ఆలోచన లేకుండా నేలమీద పడుకోవాలి. రాళ్లు విసిరి చప్పుళ్లు చేస్తూ అడవుల్లోకి చొచ్చుకుపోతూ ఉండాలి. ఏ క్షణాన్నయినా క్రూరమృగాల దాడి జరగవచ్చు, వానొచ్చినా ఆశ్రయం ఉండదు. గొర్రెల్లాగా ఆరుబయట గడపాల్సిందే. గుండెల్లో దడుపు, అలజడి వలన అడవి అందంగాని, వెన్నెల చల్లదనం గాని ఆస్వాదించలేక పోయాడు. భయం రకరకాల జంతువుల రూపాలెత్తుతూ నిద్రను దూరం చేసేది.

            నెమ్మది నెమ్మదిగా అతనిలో ధైర్యం వచ్చింది. ఎన్నోసార్లు పెద్దనక్క (పులిని గొల్లకాపర్లు అలాగే పిలుస్తారు) దర్శనం అయింది. ఒకసారి చంటిపిల్ల తల్లియైన ముచ్చుగొర్రెను, మరోసారి తనతండ్రి పెంపుడికుక్కను పులుల పాలబడకుండా సాహసంతో వాటిని ఎదుర్కొన్నాడు. ‘‘పెద్దపులి వస్తేరానీ...ఒక గొర్రెను కొరకుతింటది. అంతే గదా!’’ అనేంత నిర్లిప్త మనస్థితికి చేరుకున్నాడు. అడవిలో ఇతర జంతువులైన చిరుత, చిలువ, ఎడగండు (బూడిద రంగు శరీరం మీద నల్ల చారల చిరుబులి) ఎలుగుబంటిలు ముఖాముఖి అవ్వడం వల్ల కూడా అతనిలోని అదురుని తుడిచి పారేసింది. అడవి సౌందర్యం, గొర్రెకాపరుల జీవనసరళి, కొండపొలం అనుభవాలు అతనికి ఎంతో ఇష్టంగా అనిపించి అనుభవించడం అలవాటయింది. అడవి అంటే అయోమయమని, భయమని అనుకున్న అతనికి అడవి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అడవిని ప్రేమించే మనిషిని తయారు చేసింది. అతనిలోని నిద్రాణమైన మానవత్వాన్ని జాగృతం చేసింది. చివరికి అతని జీవిత గమ్యాన్నే మార్చివేసింది. మొదట్లో అతని పిరికితనాన్ని చూసి నవ్వుకున్న సాటి గొల్లకారపుర్లు అతనిలో వచ్చిన ధైర్యానికి, మార్పుకి అబ్బురపడి వాటిని కథలు కథలుగా చెప్పుకున్నారు.

            నవల చదువుతున్నప్పుడు ప్రకృతి రహస్యాలు, విన్యాసాలు, సౌందర్యాలు, వివిధ రూపాలు మనకళ్ల ముందు నాట్యం చేస్తాయి. వెన్నెలని, ఆకాశాన్ని, అడవిని రచయిత వర్ణించిన తీరు మన మనస్సుల్లో చెరగని ముద్రవేస్తుంది.        ఉదాహరణకి  వెన్నెల వర్ణన: తెల్లని వెన్నెల అడవి అంతటా పరుచుకోవడం, నిశ్శబ్దం దాని కొక ప్రత్యేక అలంకారంగా ఉడటం, పలుచని నీళ్ల మజ్జిగ లాంటి పంచమి వెన్నెల, ఉల్లిపొర లాంటి తెల్లని వస్త్రాన్ని అడవంతా కప్పినట్లుగా వ్యాపించివున్న వెన్నెల,  తెల్లవెన్నెల కొండంతా పరచుకోవడం...      ఆకాశం వర్ణన: ఆకాశం నిండా తెల్ల జొన్నలు ఆరబోసినట్లు చుక్కలు ఉడండం, ఉతికి ఆరేసిన నీలంరంగు ముత్యాలచీరలా అందంగా ఉన్న ఆకాశం, చెట్టు కొమ్మల రెమ్మల సందుల్లోంచి దోబూచులాడే ఆకాశం, నిశ్శబ్దపు భాషతో చీకట్ల నిండావూగే ఆకాశం...  అడవి వర్ణన: ఎతైన శిఖరాల మీద పడుకుని కిందవైపున్న కొండల వరసల్ని చూడటం, చిన్న బోటి మీద పడుకుని చూట్టువున్న ఎత్తుకొండల్ని చూడటం, లోయల్లో ఎక్కడో చిన్న పక్షి అరిచినా ఆ శబ్దం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తూ వచ్చి చెవులను సోకడం, మనిషి చేసిన శబ్దం ప్రతిధ్వనిగా మారి చివరికి వాని చెవుల్లోకి వచ్చి చేరడం, కోడిపుంజులు ఎగిరే విన్యాసం, వెదురు పొదల చాటునుంచి తల్లి నెమలి ముచ్చటగా వెంబడి ఐదారు పిల్లలు రావడం, రెండు కొండ చిలువల రతిక్రీడ, పెద్దపెద్ద వృక్షాల మొదళ్లకు కరచుకుని కొమ్మలకేసి పాకే బెట్టుడతలు, వాన కురిసిన తర్వాత కొత్త గుడ్డలు కట్టుకుని పూలు పెట్టుకుని కూచున్న పెండ్లికూతురులావున్న అడవి, అద్భుత సంగీత కచేరి నిర్వహిస్తూ అడవినంతా సంగీత మాధుర్యంతో నింపుతున్న పక్షులు, లోయలోంచి పెద్దపులి వేసిన రంకె గాల్లో తేలి వచ్చినపుడు పక్షులన్ని మూగబోయి నిశ్శబ్దం నిండటం, చివురించిన చెట్లతో అద్భుతంగావున్న అడవి, ఎతైన కొండమీద నిల్చుని చూస్తుంటే అమాయకంగా కనిపించే అడవి, వృక్షాలనిండా దట్టంగా ఆవరించుకుని అద్భుత సౌందర్యాన్ని ప్రసాదించే నిశ్శబ్దం, ఎన్నో కొత్త అనుభవాల్ని అందించే అడవి, ఇలా రాసుకుంటూ పోతే వర్ణనలు కోకొల్లలు!

            రచయిత అడవిలోని రకరకాల చెట్లతో, పళ్లతో, జంతువులలో మనకి పరిచయాలు చేస్తారు.

            చెట్లలోని రకాలు:  ఎర్రపొలిక చెట్లు, తెల్లపొలిక చెట్లు, ఏపచెట్లు, ఇనుమద్ది, భిల్లు, సీకిరేణి, ఉసిరికి, దాదిర, ఎలమ, కొండగోగు, పొలిక చందనపు చెట్లు, తాండ్ర, మద్ది, సండ్ర, వెదురు, సిరిమాను, కొండగోగు చెట్లు, చందనపు చెట్లు...

            పళ్లలోని రకాలు: మోవిపళ్ళు, వెలగపళ్లు, ఈతపండ్లు, టూకిపళ్లు, పరికపళ్లు, అల్లనేరేడు పళ్లు, కొండీతపళ్లు...

            జంతువుల్లోని రకాలు: కడుతులు, గండంగులు, పులులు, కొండచిలువులు, ఎలుగుబంట్లు, ఒంటిపందులు, ఏదు పందులు, రేచులు, చెట్టుడతలు, నెమళ్లు, కోతులు, మేక చిరుతలు.

            నవలలో వచ్చిన రకరకాల సామెతలు కూడా మనకి గిలిగింతలు పెడ్తాయి. కడపజిల్లా మాండలికంలోవున్న ఆ సామెతలు పల్లెటూరి తత్వాన్ని, లోకంపోకడని, జ్ఞానాన్ని మనకి పంచిపెడతాయి. ఉదాహరణకి కొన్ని...

1) నీల్ల కుండ నెత్తిన పెట్టుకుని పుట్టచెండు ఆడగూడదంట,

2) ఒకూరి రెడ్డి ఇంగోకూరికి పసలపోలుగా ఉంటడు  

3) ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో

4) గుడ్డొచ్చినపుడు గూడెతుక్కున్నెట్టుంది యవ్వారమంతా

5) గోడరాయి గోడకు చేర్చటమే మంచిగాని తీసిపారెయ్యడం ఎంతసేపు?

6) కక్కొచ్చినా కళ్యానమొచ్చినా ఆగదని

7) చిక్కి ఇగిలించేదానికన్నా వెల్లి ఎక్కిరించేది మేలు

8) గొర్రెల కాసేవాన్ని కొట్టనివాడు బర్రెల కాసేవాన్ని తిట్టనివాడులేడు

9) చాకలి తెలుపు మంగలి నునుపు

10) తీటవున్నేంక గీరుకోకుంటే ఎట్టా

11) రాత గొట్టినా సేత గొట్టినా దెబ్బ గుర్తుండిపోవా....

            ఇక గొల్లకాపరుల మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను, జీవితం పట్ల వాళ్లకున్న అవగాహన గురించి చెప్పుకోకపోతే ఈ సమీక్షకి న్యాయం చేకూర్చినట్లుకాదు. కొండ పొలం వెళ్లిన గుంపందరిలో పుల్లయ్య పెద్దవాడు. ఎన్నో ఏళ్ల కొండపొలం అనుభవంగల ముసలికాపరి. అడవి చరిత్ర సాంతం తెలిసిన వాడు. గుంపులోని కుర్రకారు తొందరపడితే వాళ్లకి నచ్చజెప్పి గొర్రెమంద రక్షించుకునే బాధ్యతను తనమీద వేసుకున్నాడు. అడవి న్యాయం అంటే ఏమిటో అతని సంభాషణల వలన మనకు తెలుస్తుంది. గొర్రెలు కాసేటప్పుడు పులులొస్తాయి. కొండసిలవులొస్తాయి. చిరుతలొస్తాయి, వాటిని తప్పించుకుని పోవాలిగాని, సంపి మందను బతికించుకోవాలని అనుకోకూడదు! పెద్దనక్క రాజ్జెం అడవి.  గొర్రెలు మేపుకుందికి పుల్లరి తీసుకుంటది. గొర్రెనో, పొట్టేలినో పుల్లరిగా చెల్లించి దూరంగా పోవాల. కొండకొచ్చినాంక జీవాలను నష్టపోయేది మామూలే. ఆ నష్టాన్ని కాపరులందరూ భరిస్తారు. భాస్కర్‍ గొర్రెను కొండసిలువ లాక్కేళ్లినప్పుడు, దాని ధర లెక్కవేసి, ఆ నష్టాన్ని అందరూ పంచుకునేలా చేశాడు పుల్లయ్య. అంతే కాకుండా గొర్రెకాపర్లు తమ ప్రాణాలు కాపాడుకుని క్షేమంగా ఇళ్లకు పోవాల.  పెద్దనక్కకు నాలుగైదు గొర్రెలు బలయినా పర్వాలేదు. ఆ సమయంలో పట్టువిడుపులుండాల. ప్రాణం మీదికి తేచ్చుకోకూడదన్నది అతని హెచ్చరింపు. చెట్లను నరికి అడవులను నాశనం చెయ్యగూడదు. పొలం దున్నే నాగలికోసం కొమ్మను నరకవచ్చు. ఐదారేండ్లకు నాగలి అరిగి పోతే మళ్లీ కొమ్మను కొట్టుక్కతెచ్చు. అంతే గాని అనవసరంగా కొమ్మల్ని నరికి అడవిని నాశనం చెయ్యకూడదన్నది అతని సిద్ధాతం.

            గొల్ల కాపరికి తన గొర్ల మీదుండే ప్రేమని కూడా ఎంతో హృద్యమంగా వర్ణించాడు రచయిత. గొర్రెకు ముల్లు గుచ్చుకుని నడవ లేనప్పుడు గొర్రకాలుని పళ్లతో కరచిమరీ ముల్లు తియ్యడం, సేవచేసేటప్పుడు మనిషికీ, జంతువుకీ తేడా చూపించక పోవటం, స్వంత బిడ్డలా చూసుకోవడం, మధ్యాహ్నం తిండి తినేటప్పుడు తప్ప మిగతా సమయమంతా గొర్రెల వెనక తిరిగి తిరిగి, వాటిని ఏమారకుండా కాపాడుకోవడం, గొర్రెలకు పుల్లిక చేసి మేపుకుంటూ తినకుండా వున్నప్పుడు సూదిమందు ఎక్కించడం, గొర్రె ఈనేటప్పుడు మర్ధన చేస్తూ అండగా నిలబడటం - ఇలాంటివి ఎన్నో!

            ఇవిగాక నవలలో అక్కడక్కడా మనస్సును కదిలించే సంఘటనలు తారసపడతాయి. సేద్యగాడయిన కొండా నారాయణ అప్పుపాలై అప్పులు తీర్చలేక పొలందగ్గర గుడిసెలో మందుతాగి మరణించిన వైనం హృదయాలను విషాదభరితం చేస్తుంది. గొల్లకాపరి అంకయ్య గొర్రెలను సాకే పనిలోబడ్డ భార్య సుభద్ర కోరిన చిన్న చిన్న కోరికలను తీర్చలేకపోవడం, ఆమె అలిగి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె ఎడబాటుని అంకయ్య భరించలేక పోవడం, రవితోపాటు కొండదిగి వచ్చినపుడు టెలిఫోను బూతులో ఆవేదనతో భార్యతో మాట్లాడిన వైనం మనసుల్ని ఆర్థ్రతతో నింపుతుంది. పెళ్లికి ముందే తల్లయిన కూతురు తనని చూసి దు:ఖపడి, క్షమించమని అడిగిన విధానం, దానికి రామయ్య పశ్చాత్తాపంతో కరిగి నీరై కన్నీళ్లు కార్చిన సంఘటన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసి కళ్లనీళ్ల పర్యంతం చేస్తుంది.

గొర్ల కాపర్ల కుటుంబాలలో ఆడవాళ్లదే పెత్తనం అని మనకి నవల చదివేటప్పుడు అర్ధం అవుతుంది. గొర్లకాపర్లు గొర్లను కాస్తూ చాలా వరకూ బయట తిరుగుతుంటారు కాబట్టి ఇంటిపెత్తనమంతా భార్య తీసుకుంటుంది. అంటే మేట్రియార్కల్‍ కుటుంబవిధానం అన్నమాట!

            గొర్రలు కాసేటప్పుడు అక్కడక్కడా ఎర్రచందనపు చెట్లు నరికినట్లు రవికి కనిపించాయి. కొన్ని చోట్ల చందనపు మొద్దులు ఎర్రగా పేర్చబడి ఉన్నాయి. ఎర్రచందనపు దొంగరవాణా గురించి పేపర్లో చదివాడు చాలా సార్లు. ఇప్పుడు కళ్లారా చూశాడు. ట్రాక్టరు కదలికలు కూడా పసిగట్టారు. వాటిని నరికి పెట్టిన ఎర్రచందనం దుంగల్ని తరలించేందుకు తెచ్చారని తెలిసి వచ్చింది. అందమైన ప్రకృతిని అమానుషంగా రాక్షసంగా విధ్వంసం  చేస్తున్నారని బాధపడ్డాడు.

            వానకోసం రైతులేకాదు, గొర్రెకాపర్లు కూడా ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఎదురుచూస్తారు. అడవి వర్ణన లాగే వానల్ని వర్ణించడం ఈ పుస్తకంలోని మరో ప్రత్యేకత! ఆకాశం అంతా మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపల సందడి మొదలయింది. మేఘాలు చెట్లను తాకినంతగా కిందకు వంగుతున్నాయి. గొర్రెలు చిందులేస్తూ మోరలు పైకెత్తి ఆకాశం కేసి చూస్తున్నాయి. రాబోయే వానని, ఊహించుకుని ఎగిరెగిరి పడ్తున్నాయి. వాతావరణంలోని తేమశాతంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల్ని పసిగట్టి వానరాకడ తెలుసుకుంటాయి గొర్రెలు.  రాత్రి చందమామ గాని, పగలు పొద్దుగాని కనిపించని ఆకాశం చాలా ఆహ్లాదకరంగా వుంది. రాత్రంతా వాన కురిసింది. గొర్రెలు తెల్లవార్లూ నిలబడి, చెట్లలాగా, రాళ్లలాగా వానకి తలొంచాయి. ఏ కొండమీద చూసిన నీటి జాలులే. సెలలన్నీ ప్రాణం వచ్చి కొండ చిలువలై పరుగులు తీస్తున్నాయి. చెట్లన్నీ తడిచి శుభ్రపడి పసరు కక్కుతూ వున్నాయి. పర్వతాలకూ, సెలయేర్లకూ నోరోచ్చింది. వాన కురిసిన ఆనందం అన్ని బాధల్నీ మింగేసింది. మిట్టపల్లాలను ఏకం చేసింది. వంకల్నీ, వాగుల్నీ చెరువులతో కలిపింది. చేలల్లో ఎటుచూసినా మనషులే! ఎద్దులతో, ట్రాక్టర్లతో నేలను దున్నుతున్నారు. ‘‘ఒక్కవాన ఎంత మార్పు తెచ్చింది’’ అనుకున్నాడు రవి.

ఏభైరోజుల శ్రమంతా కరిగిపోయింది. కొండనించి వచ్చిన మనషులకు ఉలవ గుగ్గిళ్లు, ఉలవచారుతో తొలి భోజనం పెట్టారు. అది గొల్లల ఆచారం. అడవి నుండి వెంట తెచ్చుకున్న చాలారకాల శారీరక రుగ్మతల్ని అది తొలగిస్తుందట!

            ఇక రచయిత నవల చివరిలో ఇచ్చిన ముగింపు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. కొండపొలం అనుభవం రవిని ఆధ్యంతం మార్చివేసింది. నాలుగు గోడల మధ్య ప్రాణంలేసి కంప్యూటర్లతో చేసే సాఫ్ట్వేర్‍ ఉద్యోగం తనకి సరిపడదని గ్రహించాడు. మనుషులు చెట్లు, చేమలు, జంతువులు ఉన్న ప్రాణమున్న ప్రపంచం కావాలనిపించింది. అటవీశాఖలో జిల్లా స్థాయి అధికారి కావాలన్న ధ్వేయం పెట్టుకుని రెండేళ్లు కష్టపడ్డాడు. నేరుగా డిఎఫ్‍ఒ ఉద్యోగాన్ని సాధించగలిగాడు. అధికారిగా మొదటిసారి అడవిలోకి అడుగుపెట్టినపుడు అమ్మ ఒడిలోకి వెళ్లినంతగా అనుభూతించాడు. గిరిజనులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అడవి నరికేవాళ్ల ఆగడాలను అరికట్టగలిగాడు. తన పరిధిలో నిజాయితీ పరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. పల్లె టూరి పిల్లనే పెళ్లి చేసుకుని ప్రతి పండుగకు పల్లె వెళ్తున్నాడు. అది అతనికి కొత్త శక్తి ఏదో ఇస్తున్నది. ఆ శక్తే అధికారుల వొత్తిళ్ళనూ, రాజకీయ నాయకుల బెదిరింపులను, స్మగ్లర్లను ఎదుర్కునేందుకు ధైర్యాన్నిస్తున్నది.

            చివరగా రచయిత తన ముందు మాటలో అన్న వాక్యాలను గుర్తు  చేసుకుందాం. ‘‘నా కాళ్ల కింద నేల, నాచుట్టూవున్న జీవితాలు కలిసి నాచేత రాయించిన మరో నవల యీ కొండపొలం.  సగిలేటి నుంచి నల్లమలదాకా వున్న బరక పొలాలూ, మెరక నేలలూ, రకరకాల జీవరాశులతో కూడిన యీ నేలకు నేను ఆస్థాన లేఖకుడ్ని. నిరంతరం వాటి ముందు కూచుని అవి చెప్పే విషయాల్ని శ్రద్ధగా వింటూ రాసి ప్రకటించటం నా పని. ఆ పరంపరలో ఇప్పుడు నల్లమల కొండల వంతు వచ్చింది”. ఈ పరంపరలో భాగంగా ఇంకెన్నో ఆణిముత్యాలు ఆయన కలలనుండి ఒలుకుతాయన్న ఆశాభావాన్ని మనలో కరిగించాయి యీ మాటలు! చూపులు ముందుకు సాగించి ఎదురు తెన్నులు చూద్దాం మరి!

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు