మా రచయితలు

రచయిత పేరు:    కె సంధ్యా శర్మ

కథలు

నమ్మకం

 "చెంప చెళ్ళుమన్న శబ్ధం" తప్ప మరొకటి రాలేదు , ఇల్లంతా నిశ్శబ్ధం...
మానస ముఖం ఎర్రగా కందిపోయి అవమానాన్ని తట్టుకోలేక కంట్లో నీరు ధారాపాతంగా వస్తూంటే తూలిపడిపోయింది.

"రవి కోపాన్ని తగ్గించలేక ఇంట్లో అందరూ నిశ్చష్టులైపోయారు".

రవి మేనకోడలు పద్దెనిమిదేళ్ల మానస అన్న మాటలే తన చెవిలో ఇంకా వినిపిస్తున్నాయి, "మా అమ్మే నన్ను అడగలేదు, నువ్వెవరు నన్నడగడానికని".

అక్క రేవతికి తొలి కాన్పులో మానస పుట్టింది. పుట్టగానే ఎర్రగా ముద్దుగా వున్న బిడ్డని హాస్పిటల్ లో తనే మొదటగా చేతిలోకి తీసుకున్నాడు.  తాకితే కందిపోయేలా వున్న పాపాయిని హాస్పిటల్ లో నర్సులను కూడా తాకనిచ్చేవాడు కాదు. అంత మురిపెంగా చూసుకున్న తను, ఈ రోజు తనపై చేయి చేసుకోవాల్సివచ్చిందని లోలోనే కుమిలిపోతూ ఇంటి గేటు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.

తమ్ముడు అలా వెళ్తుంటే రేవతి అడ్డుచెప్పలేకపోయింది. మానసను ఓదార్చలేక        నిల్చుండిపోయింది.  రవి భార్య ప్రియ మానసను తీసుకుని గదిలోకెళ్ళింది.

"అత్తయ్య" ,అంటూ బోరున ఎక్కిళ్ళు పెట్టుకుంటూ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతోంది.

“మానసా కాస్త నీళ్ళు తాగు. కూర్చో ఒక్క నిమిషం.  నా మాట విను. ఇలా చూడ “ అంటూ తన ముఖం పైకి ఎత్తి కళ్ళ నీళ్ళు తుడిచింది.
మానస ముఖం పక్కకు తిప్పుకుని అరచేతులతో అడ్డంపెట్టుకుని మామయ్య నన్నెందుకలా అడగాలనుకుంటూ ఉక్రోషంతో ఇంకా తన ముఖం ఎర్రగా కందిపోయేలా చేసుకొంటోంది.

తను, మానసను  సముదాయించ లేక  గదిలో ఒంటరిగా వదిలేసి బయటకు వచ్చేసింది.

మధ్యాహ్నం రెండు గంటలవుతున్నా ఎవరూ భోజనానికి కూర్చోలేదు. ప్రియ మానసను పిలిచినా నాకు ఆకలిగా లేదు. భోజనం వద్దంటూ కాస్త కోపంగానే అంది.  రేవతి మాట్లాడేలోపు 'టీనేజీలో వుండే పిల్లలు అలాగే వుంటారులే ' నువ్వేం మాట్లాడకు అంటూ సైగ చేసి, తనే కాస్త పెరుగన్నం కలిపి 
తీసుకెళ్ళింది మానసకు.

నాకు వద్దని చెప్పానా, మళ్ళీ ఎందుకు తెచ్చారు. అంతా మీ ఇష్టమేనా? నేను చెప్పేది ఏది వినరా ...అంటున్న మానసకు ప్లేటు అందిస్తూ.. 

“మానసా నా మాట విను కాస్త అన్నం తిని రిలాక్స్ అవ్వు ... నీకు ..”అంటుండగానే అన్నం ప్లేటు విసిరికొట్టింది. 
తనపై చెయ్యెత్తాలన్నంత కోపాన్ని అణుచుకుని, తనకు దగ్గరగా వెళ్ళి “నీకో విషయం చెబుతా పూర్తిగా విని తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వుండచ్చు, నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు, మీ మామయ్య కూడా. నీకు నేను మాట ఇస్తున్నా!”

'ఏమిటన్నట్లు' కనుబొమ్మలు ముడివేసి చూసింది మానస...
మా పెళ్ళపుడు నీకు నిండా మూడేళ్ళు కూడా లేవు. నీ మాట తీరుతో, అల్లరితో అందరిని ఆకట్టుకుంటుంటే ఇంట్లో అందరూ ముద్దు చేసేవారు దాంతో పాటు నీకు ఆరేళ్ళకు పెంకి తనం, మొండితనమూ పెరిగాయి. మీ అమ్మకు చిన్నది పుట్టిన ఏడాదికి మీ నాన్నకు చిన్న దగ్గుతో మొదలైన అనారోగ్యం రెండు నెలల్లో గొంతు క్యాన్సర్ గా మారి, ఆఖరి దశలో వుందని తెలుసుకుని చికిత్స చేసే లోపే చనిపోయాడు.

పెళ్ళైన పదేళ్ళ లోపే మీ నాన్న మరణం తట్టుకోలేక, మీ అమ్మ  ఆత్మహత్యా ప్రయత్నం
చేసింది....తనను కాపాడి మామూలు స్థితికి తీసుకురావడానికి ఆరు నెలలు పట్టింది. ముక్కుపచ్చలారని మీ ఇద్దరినీ ఎక్కడ తల్లీదండ్రీ లేని పిల్లలుగా చూడాల్సివస్తుందోనని మీ మామయ్య, నేను ఎంత ఆవేదన  పడ్డామో మీకెలా తెలుస్తుంది! 'నువ్వు ,చెల్లి అపుడపుడూ మా నాన్నెక్కడ?' అంటూ, అడిగే ప్రశ్నకు ఎంతగా బాధ పడేవాడో మీ మామయ్య..

నీ రూపం, నీ నడత అంతా మీ నాన్నలాగే వుండటం వల్ల మీ అమ్మ నీలోనే మీ నాన్నను చూసుకుంటూ తండ్రి లేని లోటు లేకుండా చూసుకోవాలని, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదని పదవతరగతైనా పాసవని మీ అమ్మ, ముప్పైయేళ్ళపుడు ప్రైవేటుగా చదివి పది పాసయి, చిన్నపుడు ఇష్టంగా నేర్చుకున్న కర్ణాటక సంగీతమే తన జీవనాధారమై ప్రైవేటుగానే ఇంటర్, డిగ్రీ చదివి ఇపుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటోంది.

ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముళ్ళపొదలోని గులాబి రేకులా విచ్చుకుని మిమ్మల్ని బాధ్యతగా ప్రేమతోనే కాదు నమ్మకంతో పెంచింది. మీరు అడక్కుండానే అన్నీ అమర్చే మీ మామయ్య అండతో మీకేలోటు రాకుండా మీకు స్వేచ్ఛనిచ్చి, ఆధునికమైన సౌకర్యాలు కల్పించి విజ్ఞానం పెంచుకుని నేటి పోటీ ప్రపంచంలో సాంకేతికంగాను ముందుండాలని బాగా చదువుకుని భద్రంగా ,బాద్యత గా బతకమంటే ....నువ్వు చేస్తున్నదేమిటి. ముక్కు, మొహం తెలియని వాళ్ళతో స్నేహం చేసి, ఫేస్ బుక్ ఫ్రెండని ఛాటింగ్ లతో, మెసేజ్ లు పంపుకుంటూ ఒకరికొకరు మేము అర్థం చేసుకున్నాం ,కలిసుంటాం,
పెళ్ళి చేసుకుంటామని, 'నా సుఖం నే చూసుకుంటాను, నువ్వేం మాట్లాడకని'  మీ అమ్మతో ఒక్క మాట చెప్పి ఇంట్లోంచి వెళ్ళాలనుకున్నావు. అంతే కదా మానసా...
చివ్వున ...తలెత్తి ఒక్కసారి ప్రియ కళ్ళలోకి చూసింది , ..తనలో ఇంకా పశ్చాత్తాపం కలగలేదని అర్థమైంది ప్రియకు.

చిన్నప్పటి నుండి వున్న నీ మొండితనంతో నిన్ను వద్దంటే ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని భయపడి మీ మామయ్యకు చెప్పింది. తనూ నచ్చచెప్పాలని చూశాడు.  ఆడపిల్లగా గడప దాటితే  నీకేం అవుతుందోననే భయం ,బాధే తప్ప మరొకటి కాదు. మీ మామయ్యకు నువ్వంటే ప్రాణం. అలాంటిది "తననే నువ్వెవరని అడ్డుచెప్పడానికని" అడిగితే ఆ ప్రాణం ఏమై పోవాలి రా.. 

"ఎందరో ఆడపిల్లలు ఆత్మస్థైర్యంతో అన్నింటిలో విజయాలు సాధిస్తూ ఒక్కొక్క మెట్టు పైకెదుగుతుంటే",  నిన్ను, అలా చూడాలనుకోవటం మా తప్పా. "టీనేజిలో వున్న ఆకర్షణనే ప్రేమని నమ్మి జీవితాంతం  కలిసి వుండాలనుకుంటారు". కానీ, ఒక్క మాట పొంతన లేకపోతే ఒక్క క్షణంలోనే కలిసి వుండలేమని విడాకుల వరకు వెళతారు, అటువంటిిదానిని ఏమంటారో..  నీకే తెలియాలి..నీకొక్క మాట ...మానసా...మీ నాన్న చనిపోయినప్పుడు ఆడపిల్లలతో ఒంటరిగా వుండద్దు  మాతో రమ్మంటే చెడి పుట్టింటికి వచ్చి చెడ్డదాన్ని కాలేనని ఆత్మాభిమానంతో అత్తవారింట్లో తలెత్తుకుని బతికింది మీ అమ్మ. కానీ, ఇవాళ నీ కారణంగా తలదించుకునేలా చేస్తున్నావు. అనవసరపు మాటలకు, ఊసులకు కళ్ళెం వేసి మేము నీపైన వుంచిన నమ్మకాన్ని వమ్ముచేయక నీ జీవితంలో ఒక స్థాయిలో వుండాలనుకుంటావో లేక  "నా లైఫ్ నా ఇష్టం " ఎలాగైనా వుంటాననుకుంటావో నీకే వదిలేస్తాను...  ఒక్క క్షణం ,మానస కళ్ళలోకి సూటిగా చూసి గదిలోంచి వెళ్ళిపోయింది.
        .                                                           *   *   * 
రాత్రి 9'౦ గంటలపుడు రవి ఇంటికి వచ్చాడు...
రాగానే మానస భోజనం చేసిందా అనడగ్గానే! గది లోంచి మానస పరుగున వచ్చి మామయ్యా ,నేను తప్పు చేశాను ,సారీ అంటూ కళ్ళనీళ్ళతో రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది.

పిచ్చిపిల్ల... సారీ ఎందుకురా , నీ కళ్ళలో నీవు కలలు గనే కలలు పండించాలనుకున్నా గానీ నీళ్ళు కాదు , నువ్వేడవకు లే , నువ్వింతవరకు ఏమీ తినలేదని నాకు తెలసని కూర్చుంటూ...ప్రియా .. తినడానికి ఏమైనా తీసుకురా..అంటూ.. నీకు ఏది ఇష్టమైతే అలా చెయ్యి, మీ అమ్మ పిచ్చిదిరా, నీపై పెట్టుకున్న నమ్మకం అలాంటిది  నువ్విలా వెళతానంటే తనేమవ్వాలి.. చెప్పు.. అంటుంటే,
"నేనెక్కడికీ వెళ్ళను మామయ్య" ,బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకుంటాను
అంటూ మారిన మానసగా మాట ఇస్తోంది..
మానసను మానసికంగా ధృడంగా చేయాలనుకుంది ప్రియ ,తను చేస్తున్న పని తప్పని తెలుసుకుని పశ్చాత్తాపం కలిగితే చాలనుకుంది ....,
ఇద్దరి మొహాల్లో చిరునవ్వును చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది!

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు