మా రచయితలు

రచయిత పేరు:    శీలా సుభద్రాదేవి

కవితలు

 ఆ శుభదినం కోసం......

పొద్దున్నే

కళ్ళు సూర్యచంద్రులై

కేలండర్ చుట్టూ పరిభ్రమిస్తాయ్

ఈ రోజు ఏ శుభ దినమా అని

మతపరమైనవో 

జాతీయమైనవే కాక

మన మేథావుల్ని

కుదవ బెట్టిన దేశాల్నుండీ

ఎరువు తెచ్చుకున్న దినాల్నన్నింటినీ

కేలండర్ల నిండా ప్రేమతో అతికించుకున్నాం కదా

ఇక ఇప్పుడు

ఎన్నెన్ని ప్రత్యేక దినాలలో

 

నట్టింట్లో ఆత్మీయంగా

ఒక ముద్ద పెట్టని వాళ్ళు సైతం

పోయాక మాత్రం అట్టహాసంగా

నలుగురికీ చాటేందుకు పిండాలు పెట్టినట్లు

ఏడాదికోమాటు

సామాజిక ప్రసారమాధ్యమాలన్నీ 

అక్షరప్రేమల్ని వర్షిస్తాయ్

ప్రేమంటే తెలియని పసిమొగ్గలు సైతం

హృదయాల్ని అమ్మానాన్నల పిడికిట్లో దాచేసి

ఎర్రగులాబీల్నీ,ఆఠీను గుర్తుల్నీ

పంచుకుంటూ మురిసి పోతాయ్

 

ఒకటి కాదు

రోజుకో రకం ప్రత్యేక దినాలు!

తెల్లారుతూనే

వార్తా మాధ్యమాలన్నింటినీ 

కళ్ళను ఇంతింతచేసి వెతుకుతుంటాను

ఏ రోజైనా ఏ మూలైనా

నో క్రైమ్ డే,నో రేప్ డే,నో సువిసైడ్ డే

అన్న  మాటలేమైనా ఉంటాయేమోనని

నాకు తెలియక అడుగుతున్నాను

ఏ రోజైనా మనిషి దినమో, మానవత్వదినమో

ఉందేమో కాస్తా చూసి చెప్తారా

ఆ రోజైనా మనుషులుగా మారి

ఒకరినొకరం

ఆర్తిగా ఆత్మీయంగా అభినందించుకుందాం.

 

 

 

సాహిత్య వ్యాసలు

జీవన అక్షరచిత్రాలు ద్వివేదుల విశాలాక్షి కథలు

60వ దశకంలోని నవలా ప్రభంజనకాలంలో రచయిత్రులందరూ నవలారచన వైపే ఆసక్తి చూపుతున్న కాలం కన్నా ముందుగానే 1953లోనే గృహలక్ష్మి పత్రికలో ఎప్పుడూ ఇంతేనాకథతో కథానికారంగంలోకి ప్రవేశించారు ద్వివేదుల విశాలాక్షి. నవలలకన్నా ముందు ఆమె ఎక్కువగా కథలు రాశారు. తర్వాత్తర్వాత నవలారచన మొదలుపెట్టినా దాదాపు అరవైకిపైగా కథలు రాశారు. ఆమె కోరిక, కథామాలిక, తప్పెవ్వరిది, భావబంధం అనే కథాసంపుటాలు వెలువరించారు.

విశాలాక్షి భర్త ఉన్నతోద్యోగి కావటం వలన వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలలో ఆమె పర్యటించారు. విశాలాక్షి కథలు తరచి చూస్తుంటే ఆమె తన దృష్టిని కేవలం కుటుంబపరమైనవీ, దాంపత్య సంబంధాల పైనే కాక అనేక విషయాలపై కేంద్రీకరించి విషయ సంగ్రహం చేసుకొని, పరిశీలనాత్మకంగా తన రచనలను పరిపుష్టం చేసుకోవటానికి ప్రతీక్షణం పరిశ్రమించినట్లుగా తెలుస్తోంది. ఏదో గాలివాటంగా కనిపించిన సంఘటన చుట్టూ కథని అల్లేయాలని  అనుకోలేదు ఆమె.

దాంపత్య సంబంధాల్ని చిత్రించినా అందులోని లోటుపాట్లనీ, లొసుగుల్నీ ఎత్తిచూపటమే కాక వాటిని అధిగమించేందుకు చేసే ప్రయత్నాలూ, మానసిక విశ్లేషణతో అన్నీ తనదైన దృక్కోణంలో మంచీచెడులని ఎత్తిచూపే పద్ధతిలో కాకుండా, పాఠకులకు అవగాహన కలిగే విధానంలో, మార్మికంగా చెప్పే రచనావిధానం విశాలాక్షిది. అంతేకాకుండా చిక్కుముళ్ళను సామరస్య పూర్వకంగా విప్పుకునేలా ఆలోచనాత్మకరీతిలో పాత్రల్ని తీర్చిదిద్దటం రచయిత్రి ప్రత్యేకత. విశాలాక్షి కథలన్నీ మధ్య తరగతి వారి కథలే. వారికి ఆకలి బాధ తెలుసు. అందుకే చదువుకునే పిల్లలకు తమ కష్టకాలంలో సైతం ఒకరోజు భోజనం పెట్టి ఆదుకునే స్వభావం గల కుటుంబీకులు, తమకున్న దాంట్లోనే కలో, గంజో పోద్దామనుకునే తల్లులూ కథలో కనిపిస్తారు. సుమారు  50-60 ఏళ్ళ కిందట ప్రభుత్వ పథకాల పేరిట ఉచిత పందారాలు లేవు. చదువుకోవాలనే తపనతో పట్నాలు వచ్చి, ఏడురోజులూ ఏడు ఇళ్ళల్లో భోజనం చేసుకుని చదువుకునే వారాలబ్బాయిల సంస్కృతి ఉండేది. అంత కష్టపడి చదివి, స్కాలర్ షిప్పులు తెచ్చుకొని పైకొచ్చిన వారికి డబ్బు విలువ, చదువు విలువ, జీవితం విలువా తెలిసేది. ఈ పరిస్థితులు విశాలాక్షి మూడు నాలుగు కథల్లో బాగా కనిపిస్తాయి.

భావబంధం కథలో వారాలు పెట్టేవాళ్ళు దొరకని రాముడికి అన్నపూర్ణ ప్రతికూల ఆర్థిక పరిస్థితిలో సైతం రోజూ తానే రాముడికి అన్నం పెడతానంటుంది. కానీ తిండిగింజలకు మరింత కరువు వచ్చి పడేసరికి మనసుకి కష్టమైనా వేరే యిల్లు చూసుకోమని పంపేస్తుంది. మొత్తం కథనంతటినీ అన్నపూర్ణ మనోగతంగా, మానసిక సంఘర్షణగా నడిపించటం ఒక విశేషం. తల్లి మనసునీ చాలాకథల్లో ఆర్ద్రంగా చూపటమేకాకుండా ఆకలి ఎంత దారుణమైనదో, కనీసపు కోర్కెలు తీర్చుకోలేని మధ్య తరగతి ఆర్థిక పరిస్థితుల్నీ, చిరుద్యోగుల రుణగ్రస్థ జీవన విధానాల్నీ ఈవిధంగా అనేక కథల్లో ఆవిష్కరించారు రచయిత్రి.

కథ నడిపేటప్పుడు కథాకాలాన్నీ, సమాజ ముఖచిత్రాన్ని పట్టి చూపే రచన చేసిన రచయిత సామాజిక చరిత్రకు సాయపడిన వాడౌతాడు. నాటి ఆర్థిక, సామాజిక విలువల్నీ నమోదు చేసిన చారిత్రకునిగా నిలుస్తాడు. ఆ విధంగా విశాలాక్షి కథలు అరవై ఏళ్ళ నాటి ఆర్థిక స్థితిగతులు సామాన్య కుటుంబీకుల్ని ఎటువంటి ఆటుపోట్లకు గురిచేస్తాయో తెలుపుతాయి. సమాజంలోని బడుగు బలహీన వర్గాలలోని వారి దుర్భర జీవితాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా వీరి చాలా కథలలో పసిపిల్లల నేపథ్యంలో సాగినవి చాలానే ఉంటాయి. పిల్లల మనోగతాలు, ఆలోచనలూ వాటికి సరియైన ప్రాతినిధ్యం ఇవ్వలేని సామాజిక పరిస్థితులు చాలా స్పష్టంగా పాఠక దృష్టికి గమనింపుకు వచ్చేలా ఉంటాయి.

విశాలాక్షిది ప్రత్యేకమైన శైలి. కథాగమనం కూడా ఒక కొత్త విధానంలో సాగుతుంది. అంతేకాక ప్రథమ పురుషలో రాసినా, ఉత్తమ పురుషలో రాసినా అనేక కథలను పురుష పాత్రతోనే కథను చెప్పించటంలో ఈ రచయిత్రి ఒక ప్రత్యేకత సాధించారు. పురుష పాత్ర పరంగా చెప్పినా స్త్రీ జీవితం, ఆర్థిక సంక్షోభంలో కూడా పొందికగా సంసారాన్ని నడిపే చాకచక్యం, ఆమె శ్రమశక్తీని పురుష దృక్కోణంలోనే ఆమెపట్ల సానుభూతినీ, ఆదరాన్నీ, అభిమానాన్నీ వ్యక్తపరుస్తూనే కథ ఆసాంతం నడుస్తుంది.

ఉద్యోగరీత్యా భర్తతోపాటూ అనేక దేశాలు తిరిగి రావటం వలన అనేక భిన్న సంస్కృతులను, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులనూ, మారుతున్న సాంప్రదాయాలనూ, కుటుంబ జీవనాల్నీ, సంఘటనల్నీ చూడడం వలన, తాను చూసిన, విన్న సంఘటనల్నీ, సందర్భాల్నీ దేశీయం, ప్రాంతీయం చేసి ఒక సామరస్య దృక్పథంతో ఎవర్నీ నొప్పించని పద్ధతిలో స్త్రీ పాత్రలు సమస్యల్ని పరిష్కరించే విధానంలోనే వీరికథలు ఉంటాయి.

జీవితాన్ని భయంకర సన్నివేశ కల్పనలతో ఉక్కిరి బిక్కిరి చేయరు. జీవితాన్ని తెరిచి చూపేలా ఉంటాయి. కథాంశం కేవలం సంఘటనలు మాత్రమే ఆశ్రయించుకొని ఉండదు సందర్భాన్ని బట్టి మూల కారణాలను సమకూర్చుకుంటూ పాఠకుల అవగాహనకు అందేలా ఉంటుంది విశాలాక్షి రచనా విధానం, సంఘటనలను గుదిగుచ్చినట్లుగా, పాఠకులకు నీతి బోధ చేసేటట్లుగా కాక మనిషి ప్రవర్తనను, మానవ స్వభావాలను తెలియజేసే విధంగా ఉంటాయి ద్వివేదుల విశాలాక్షి కథలు.

1955-60ల నాటి వీరి తొలి కథల్లో చాలావరకూ శిష్ట వ్యవహారికంలో రాసినా గ్రాంథిక ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత్తర్వాత భాషమీద కన్నా పాత్రచిత్రణ మీదా, పాఠకులను ఆలోచింపచేసే విధమైన సంభాషణల మీదా, సామాజిక విలువల ప్రాతిపదిక మీదా ఎక్కువ దృష్టి పెట్టారనిపిస్తుంది. దానికి బహుశా సాహిత్యంలో మారుతోన్న ధోరణులూ, సమాజం తీరుతెన్నులూ, సమకాలీన సాహిత్యంలోని పరిణామక్రమాలూ, మారుతోన్న పాఠకుల అభిరుచులూ వీటన్నిటి ప్రభావరీత్యా తన కథల్ని విశాలాక్షి మెరుగుపరచుకుంటూ పాఠకులకు ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దుకున్నారు.

66లో రాసిన అడుగున పడిన పునాదిరాళ్ళుకథలో వంతెన నిర్మాణ కార్మికుడి శ్రమశక్తిని గుర్తించని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తారు. ఆ కార్మికుడు గోపన్నతో అనుబంధం పెంచుకున్న చిట్టి అనే బాలుడు గోతులు తవ్వి పునాదులు వేసినది గోపన్నఅని మసిబొగ్గుతో వంతెన గోడల మీద రాసాడనీ, ఆ రాత్రి కురిసిన వర్షానికి ఆ అక్షరాలు చెరిగిపోయాయని చెప్పటంలో గోపన్న శ్రమని ప్రపంచానికి చాటాలనుకున్న చిట్టి ఆకాంక్ష చెదిరిపోయిందనేది రచయిత్రి కథలో చెప్పే ప్రయత్నం శ్రీశ్రీ చెప్పిన తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరుఅన్న కవితాపంక్తుల ప్రభావం కథలో ప్రస్ఫుటం అవుతుంది.

59లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైన కనీసపు కోర్కెలుకథ అప్పుడప్పుడే చదువులకీ, ఉద్యోగాలకి వెళ్తున్న రోజులలోని స్త్రీల మనోభావాలను తెలియజేస్తుంది. ఇంటి చాకిరి తమ పైనే పడడం పట్ల నిరసన చేయాలనుకోవటం, స్ట్రైక్ చేసి సాధించుకొన్న నెలకి మూడురోజుల విశ్రాంతీ, లేదా ఏడాదికి నెల రోజుల సెలవుకి సంతోషపడినంతసేపూ పట్టదు వాళ్ళేమీ కొత్తగా సాధించినది లేదనే విషయం అర్థం కావటం. పూర్వం నుండీ ఆడవారికి నెలకి మూడురోజుల సెలవు వున్నదే. నెల తప్పితే పురిటికి నెల రోజుల విశ్రాంతి ఉంటుందనేది అర్థం అయ్యేటప్పటికి సాధించింది ఏముంది అనే నిస్పృహని డెబ్భై ఏళ్ళ కిందటే రచయిత్రి ప్రస్తావించారు.

బిచ్చగాళ్ళ బతుకు పోరాటం మీద రాసిన దేవుడి పిలుపు’ (1974)లో కళ్ళు లేని ముత్యాలు ద్వారా తన బతుకు వెళ్ళబుచ్చుకునే అప్పిగాడు ముత్యాలు దాచుకున్న డబ్బు కోసమే ఎదురుచూస్తుంటాడు. తీరా ఆమె చనిపోతే డబ్బు కనబడక శవాన్ని చూపి అడుక్కుంటాడు. ఆ వచ్చిన సొమ్ముని దహనానికి వాడకుండా తాగి మర్నాడు కూడా అదేవిధంగా అడుక్కోవాలనుకుంటాడు. ఇంతవరకూ కథని రచయిత్రి ముష్టివాళ్ళ జీవన పోరాటాల్ని పరిశీలించిన విషయం అర్థమవుతుంది. తర్వాత  ఆ కథని కల్తీ మద్యాన్ని అరికట్టలేని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినట్లుగా అప్పిగాడు, మరొక బిచ్చగాడూ తాగిన కల్తీ మద్యం వల్ల చనిపోయారనీ ఆరోగ్యశాఖ వారు వచ్చి ముగ్గురి శవాలనీ తొలగించారనీ ముగిస్తారు. ముఖ్యంగా ఈ కథని ఉత్తరాంధ్ర మాండలికంలో రాయటంతో కథ అసాంతం చక్కటి కథనంతో చిక్కని గాఢతగల శైలితో సహజంగా వచ్చింది.

సమాజం స్త్రీ పురుషుల మధ్య చూపే వివక్షనీ, మగవాళ్ళ అవసరార్థం మార్చుకొనే నియమాల్నీ, నిబద్ధతల్నీ ప్రశ్నించే కథ విలువలుమాలచ్చిమి మీద అనుమానంతో పంచాయితీ ద్వారా విడిపోయిన సింహాద్రి ద్వారా పురుష స్వభావాన్ని ఎండగడుతుంది రచయిత్రి. వ్యభిచారం చేసి కొడుకుని పెంచుతూ జీవనం సాగించే మాలచ్చిమి నీతీ, నాయం అంటూ వుంటే అందరికీ ఒకే నాగే ఉండాలనిప్రశ్నించే దృఢ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. మారు మనువు చేసుకున్న సింహాద్రి శారీరకావసరం తీర్చుకోవటానిక మళ్ళా మాలచ్చిమి దగ్గరికి వచ్చి, అప్పటికే మరొకనితో ఉన్న మాలచ్చిమి కోసం బయట కాచుకొని ఉన్నాడని రచయిత్రి పురుష స్వభావాన్ని చాలా స్పష్టంగా చూపుతారు. ఈ ఒక కథ చాలు విశాలాక్షి కథని ఎంత ఆలోచనాత్మకంగా నడిపిస్తుందో తెలియటానికి. గతిలేక వెలయాలుగా మారిన మాజీ భార్య కోసం బయట కాచుకొని ఉండడం, అవసరం కోసం పొందు కోరటం, మరొకరికి తార్చటంలో మగాడు పాటించే విలువలూ, భార్యాభర్తల మధ్య అవసరార్థ శారీరక, ఆర్థిక సంబంధాలూ బేరీజు వేసి చూపటమేకాక స్త్రీని కేవలం మగవాడు భోగ వస్తువుగానే చూడటం అనేది ఈ కథ స్పష్టం చేస్తుంది. మాలచ్చిమి పాత్ర చిత్రణలో రచయిత్రి నిర్మాణాత్మక ప్రతిభ వ్యక్తమవుతుంది.

మరో ఊర్లో ఉద్యోగం చేస్తూ వారాంతంలో వచ్చే భర్త కోసం ఎదురుచూస్తున్న శశికి భర్తకు బదులుగా అతని భౌతికదేహం వస్తే మతి తప్పి తర్వాత కూడా అతని కోసం ముస్తాబై అతనికి ఇష్టమైనవి వండి ఎదురుచూస్తూ భ్రమలో బతుకుతుందని చెప్పే కథ అంతులేని నిరీక్షణబలహీన మనస్కులైన స్త్రీల గురించి నిజం తెలిస్తే వారెలా బతకగలరంటూ 1957లో రాసిన కథ హృదయాన్ని ద్రవింపజేసేలా ఉంటుంది.

విశాలాక్షి రాసిన అద్భుత కథ నిండుచూలాలు’. డెబ్భైలలో దేశమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. బియ్యం రవాణాపై ఆంక్ష ఉన్న పరిస్థితులు. రైలు జనతాబోగీలో పదిమందికి పైగా మూటలతో ఓ మూల కూర్చుంటారు. మధ్య మధ్య బెదురు చూపులు చూస్తుంటారు. వాళ్ళని బొగ్గు సంచుల కుప్పలా ఉన్నారని వర్ణిస్తుంది రచయిత్రి. ఆ గుంపులో ఒక అమ్మాయి గర్భంతో ఉన్నట్లు బానపొట్టతో, వళ్లో వానపాములాంటి చంటిపిల్లతో ఉంటుంది. అకస్మాత్తుగా పోలీసులు దాడిచేస్తారు. ఆంధ్ర సరిహద్దు గ్రామాల నుంచి అయిదూ పది కిలోల బియ్యం మూటల్ని తెచ్చి అమ్ముకుని బతికే బడుగు జీవులు కడుపుకు కట్టుకున్న మూట నుండి బియ్యం దారలా మరుగుదొడ్డి వరకూ పడిపోతాయి. గర్భవతిగా కనిపించిన పిల్ల కడుపు నడ్డికి అంటుకుపోయిందంటుంది  రచయిత్రి ఆ సందర్భంలో. బడుగు జీవుల ఆకలి బాదని గుండెని కలిచేలా రాసిన కథ ఇది. ఒక రచయిత్రి కలం నుండి సమకాలీన ఆర్థిక రాజకీయ పరిస్థితిని కళ్ళ ముందుకు తీసుకువచ్చేలా కథ రాయటం గుర్తించవలసిన విషయం. మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇంతటి సజీవ చిత్రణను చేయగలుగుతారు.

నాకూ అమ్మ ఉంది’ (64) కథలో తల్లిని మింగినవాడుగా తండ్రి నిరాదరణకు గురైన అయిదేళ్ళ బాలుని మనస్తత్వాన్నీ, మొండిగా తయారుచేసిన కుటుంబ పరిస్థితుల్నీ ఒక సైకియాట్రిస్టుగా తీర్చిదిద్దారు రచయిత్రి అనుకోని పరిస్థితులలో బాలుని తండ్రి పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఆ బాలుడికి స్కూల్లో టీచరు. సైకాలజీ చదివిన ఒక ఉపాధ్యాయినిలా ఒక క్రమపద్ధతిలో వాడిలో మార్పుని తెచ్చిన విధానాన్ని కథనం చేయటం రచయిత్రి ప్రతిభావంతంగా ప్రదర్శించారు.

1955లో ప్రచురితమైన వాళ్ళు ముగ్గురుకథ స్వాతంత్ర్యానంతరం గ్రామీణ వికాసానికి ప్రభుత్వ చర్యలను తెలియజేసే కథ. తెల్లచీరలు కట్టుకున్న ముగ్గురు స్త్రీలు పాడుపడ్డ యింటిని శుభ్రపరుస్తుంటే, గ్రామీణులు వారిని దయ్యాలని భయపడ్తారు. ఇంటి చుట్టూ భూతవైద్యులతో కర్రలు పట్టుకుని దాక్కుని గమనిస్తుంటారు. కాలక్రమేణా ఉచిత వైద్యం’, ‘ఉచిత విద్యాలయం’, మహిళా మందిరం బోర్డులు వెలసి అవసరమైన సేవలు చేస్తుంటారు. ఒకరోజు గ్రామంలో ఇళ్ళకి నిప్పంటించిన దుండగుల్ని పట్టి చూస్తే వారు భూతవైద్యులు. కాలిపోయిన వారికి ఆ స్త్రీలు సేవ చేస్తారు. అప్పుడప్పుడే గ్రామాభ్యుదయం పేరున గ్రామసేవికలు చేసే పనులకి అద్దం పట్టటమేకాక గ్రామాలలో మూఢనమ్మకాల్ని పెంచి పబ్బం గడుపుకునేవారి అవకాశవాదాన్నీ, ప్రజల అజ్ఞానాన్నీ తెలిపే కథ.

‘‘ఏ ఉద్యమం అయినా రాత్రికి రాత్రే పుట్టుకురాదు. దాని పుట్టుకకి ఎన్నో అనుకూల, ప్రతికూల శక్తులు దోహదం చేస్తాయి. నక్సలైటు ఉద్యమం అయినా అటువంటిదే. మనిషిలోని విద్రోహబుద్ధి ముళ్ళ డొంకలాంటిది. దాన్ని నాశనం చెయ్యాలంటే మూలాన్ని పట్టుకొని వేళ్ళతో సహా పెకిలించి పారేయాలి అప్పుడే విముక్తి’’ అంటూ కథాంతంలోని పాత్ర సమాజంలోని ప్రజలపై పడే ప్రభావాల గురించి విశ్లేషించుకునే సందర్భంలో ఆలోచనల్ని రచయిత్రి ప్రస్తావిస్తూ చివర్లో, ‘గంగులు నక్సలైటుగా మారటానికి కారణం ఏమిటనితలపోయటంతో ముగిస్తారు.

రచయిత్రి సమాజంలోని అనేకానేక సందర్భాలనూ, ప్రజల్ని ప్రభావితం చేసే సంఘటనల్నీ అన్నివైపుల నుండీ విశ్లేషిస్తూ పాఠకుల మనోభావాల్నీ కూడా సానపెడుతూ పునస్సమీక్షించుకునే విధంగా కథల్ని మలచి చూపుతారు.

విశాలాక్షి కథల్లో విమర్శకులు అందరూ పేర్కొన్నదీ, అనేక కథా సంకలనాల్లో చోటుచేసుకున్నది మనస్విఅనే కథ.

ప్రమాదవశాత్తూ జాతరలో జరిగిన అగ్ని ప్రమాదంలో తప్పిపోయి పరమేశం ఇంటికి వచ్చిన పాపని చూసి ప్రకటన యిచ్చినా ఎవరూ రాకపోయే సరికి పిల్లలు లేని ఆ దంపతులు కన్నబిడ్డలా చూసుకుంటారు. ఆ పాప దొరికిన రోజునే పుట్టిన రోజు సంబరాలు చేసుకుంటున్న సమయంలో తప్పిపోయిన మనవరాలి కోసం వెతుక్కుంటూ వచ్చిన ముసలాయనని పాప గుర్తుపడుతుందేమో అనిపించేలా దృశ్యాన్ని కళ్ళముందు సన్నివేశ కల్పన చేసారు రచయిత్రి. ఆ ముసలాయన తన మనవరాల్ని పిలిచినట్లుగా పిలిచినా పాప పలకకపోవడంతో పాఠకుడు కూడా ఊపిరి పీల్చుకుంటాడు. తిరిగి బస్సు ఎక్కి వెళ్ళే సమయంలో ఆ పాప పేరు కృష్ణప్రియ అనీ కిట్టూ అని పిలుస్తే పలుకుతుందనీ, సంక్రాంతి రోజున పుట్టిందనీ చెప్పే సరికే బస్సు కదులుతుంది అంటూ కథని ముగిస్తారు రచయిత్రి. పుట్టిన రోజు సంబరాలతో కథ మొదలుపెట్టి మధ్యలో జాతరలోని అగ్ని ప్రమాదాన్ని చెప్పి ఒక చక్కని ముగింపుతో ముగిసిన ఈ కథ ఒక స్క్రీన్ ప్లే లా సినిమా సన్నివేశాలతో దృశ్యమానం చేయటంతో ఒక సినిమా చూసిన అనుభూతి కథ చదివిన తర్వాత పాఠకులకు కలుగుతుంది.

సినిమాల్లో అందంగా చూపే ప్రేమ వివాహాలు, ఆదర్శ వివాహాలూ నిజజీవితంలోకి వచ్చేసరికి త్యాగానికీ, ప్రేమలకీ విలువ లేకుండా ఆవిరైపోతాయి. ఒక్కోసారి దాంపత్యాలు కుప్పకూలిపోతాయి. ఆ నిజాన్ని భార్యాబిడ్డల్ని వదిలి బిక్షకుడిగా మారిన సిద్ధార్థుడి కథతో మొదలుపెట్టి కథలోకి ప్రవేశింపజేయటంలో కొత్తదనం ప్రదర్శిస్తుంది రచయిత్రి. ‘భిక్షుకికథలో భర్తా, కొడుకులకు దూరమై మరో వివాహం చేసుకున్న వేదవతికి యశోధరా, గౌతముల మానసిక స్థితిని తన స్థితితో పోల్చుకుంటూ ఒక తలపోతగా, చూపుతూ కథని నడిపిస్తారు రచయిత్రి. భర్త పేదరికాన్ని తట్టుకోలేక బిడ్డని భర్త దగ్గర వదిలిన వేదవతి మనోవేదనకు గురై చీకటిలో బిడ్డని చూసేందుకు వెళ్ళిన ఆమె మానసిక స్థితిని సహజసిద్ధంగా కథనీకరించింది విశాలాక్షి.

బడిపిల్లల్ని లాటరీచక్రంతో ఆకర్షించి గెలిచిన పిల్లలకి కొబ్బరి ఉండలూ, బిళ్ళలూ ఆశపెడ్తూలాటరీతాతచక్రం తిప్పే పద్ధతిని ఎత్తి చూపి నిరసించిన పాప ప్రభావంతో వీరన్న ఆ పాపలో చనిపోయిన తన కూతుర్ని చూసుకొని లాటరీ చక్రం కూడా తీసేస్తాడు. కానీ అదే పాప తండ్రికి లాటరీలో బోల్డు డబ్బు వచ్చిందని ఆ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని చెప్పటం కొసమెరుపు. కొంతకాలం కిందట లాటరీ టికెట్లు కొని సులభంగా కోటీశ్వరులు కావాలనే ఆశతో ఉన్నది కూడా పోగొట్టుకొని బికార్లు అయిన పరిస్థితులు ఉండేవి. ఆ దశని ప్రతిబింబించే కథ యిది.

నమ్మి చెడినవాడుకథలో అనాధ అయిన చిన్నిగాడు నాయుడుగారింట తన కుంటి మేకపిల్లతో ఉంటూ పనులు కాపరిగా ఉంటాడు. ఒకరోజు అమ్మగారు చద్దన్నం పెట్టకపోయేసరికి ఆకలితోనే పశువుల్ని మేతకి తీసుకువెళ్తాడు. ఆ రోజు నాగులచవితి కావటంతో చెరువు కట్ట దగ్గర పుట్టలకు పూజ చేస్తుంటారు. ఆ వూరిలోని పిల్లల నాయకుడు రాగవులు ఎవరైనా పుట్ట పూజ చేసి వెళ్ళగానే చెప్తే పైసలిస్తానని ఆశపెడ్తాడు. తర్వాత పుట్ట నుండి ప్రసాదం, గుడ్లు లాఘవంగా తీసి బుట్టలో వేసుకుంటాడు రాగవులు. మధ్యాహ్నం తర్వాత రాగవులు మళ్ళీ వచ్చి పైసలిస్తానని వెళ్తాడు. అతనికోసం చిన్నిగాడు ఎదురుచూసి ఆకలి భరించలేక రాగవులు మాదిరిగా పుట్ట నుండి ప్రసాదం తీయటానికి ప్రయత్నించి చాతకాక చేయి దూర్చి పాము కాటుకు బలౌతాడు. కరుణార్ద్రమైన కథ యిది. కథ మొదటి నుండి చివరి వరకూ ఎక్కడా అసహజత్వానికి తావు లేకుండా పసివాడి దృక్కోణంలోనే కథని నడిపించటంలో చెయ్యి తిరిగిన రచయిత్రి విశాలాక్షి.

ఈ విధంగానే బూట్ పాలీష్ చేసి డబ్బులు కూడపెట్టి బొమ్మల చొక్కాకొనుక్కోవాలనుకున్న వెంకడిని కూడా చిత్రిస్తారు రచయిత్రి. సన్నివేశ కల్పనతో కానీ, శైలిలోగాని రచయిత్రి కనిపించకుండా పాత్రలే కథని నడిపిస్తారు. తీరా డబ్బు జమ చేసి బొమ్మల చొక్కా కొనుక్కోవాలనుకునేసరికి వెంకడి దగ్గర చిల్లర తీసుకొని దొంగనోటు యివ్వటం, షాపు లూఠీ కావటం, దొంగనోటు వల్ల పోలీసుల బారిన వెంకడు పడటం వెంట వెంటనే దృశ్యాలు మారిపోతాయి. చివరికి ఆ బొమ్మలచొక్కాకాలవలో పడి రంగులు వెలిసిపోవటాన్ని పేదవాడి ఆశలు, కలలు ఎలా కరిగిపోతాయో సింబాలిక్ గా చూపుతారు రచయిత్రి.

ఇదేవిధంగా ఆమె లేదుకథని కూడా సినిమా స్క్రీన్ ప్లేలా సన్నివేశాలుగా రాసిన కథ. కొంత సస్పెన్సుతో కథంతా చదువుతున్న పాఠకుడికీ ఆతృత కలిగించేలా ఉంటుంది. కథని పురుష పాత్రతో ఉత్తమ పురుషలోనే రాసింది రచయిత్రి. భార్య స్నేహితురాలి యింటిని వెతుక్కుంటూ వెళ్ళటం 81 నెంబరు ఇంటికి వెళ్ళి ఇంటివాళ్ళు లేకున్నా ఆతిథ్య పొంది తిరిగి రావటం మొదటి అంశం. అతను ఇచ్చిన విజిటింగు కార్డులోని అడ్రసుకి వచ్చిన ఉత్తరంతోపాటు పంపిన కవిత, నిస్పృహ, నిరాశలతో కూడిన ఉత్తరం రెండవ అంశంలో పురుష పాత్రని దిగ్భ్రమ కలిగించటంతో ముగుస్తుంది.  నీ భర్త మా యింటికి రాలేదేమన్న స్నేహితురాలి ఉత్తరంతో భర్తతో గొడవ పడటం మూడవ అంశం. స్నేహితురాలి ఉత్తరం చివర అడ్రసులో ‘18’ ఇంటి నెంబర్ చూసి తన తప్పు తెలుసుకున్న ఆ భర్త తర్వాత ఒకసారి తిరిగి ‘81’ నెంబరు ఇంటికి వెళ్ళటం ఆ యిల్లు విలాసగృహంగా మారటం, ఆ యింటి ఇల్లాలు ఇప్పుడు లేదని తెలుసుకోవటంతో కథ ముగుస్తుంది. కథని నాటకీయతతో రాసినా పాఠకులను ఒప్పించగల శైలితో నడిపించటం తెలిసిన రచయిత్రి విశాలాక్షి. దాంపత్య సంబంధాలలోని డొల్లతనాన్ని చూపే కథల్ని రాసేటప్పుడు రొడ్డకొట్టుడుగా పాఠకులకు అనిపించకుండా ఎన్నెన్ని రకాలైన లొసుగులు మహిళల జీవితాల్ని అస్తవ్యస్థం చేసి బతుకుల్ని దుఃఖభాజనం చేస్తున్నాయో తెలుస్తుంది. ఎక్కడా సన్నివేశాలలోగానీ, సంభాషణల్లోగానీ, ఎక్కడా కూడా పునరుక్తి ఉండదు. అటువంటి కుటుంబ కథల్లో ఒకటి చావు బతుకుల మధ్య దూరం’. అన్యోన్యదంపతుల్లా ఉండే సౌదామిని, మధుసూధనరావుల జీవితంలో సౌదామిని అనారోగ్యం ఒక పిడుగుపాటు ఆమె చికిత్స కోసం హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆమె చెల్లెలు, మంజులత అతనికి దగ్గరౌతుంది. ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళిన సౌదామినికి విషయం తెలిసి గుండె పగులుతుంది. ఆమె పోయిన వెంటనే ఆమె చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాడు. ఏడు నెలలు తిరక్కుండానే మంజులతకు పుట్టిన బిడ్డ నెల తక్కువ బిడ్డ కాదని డాక్టరు అంటుంది. ఇవన్నింటినీ కథలో రచయిత్రి స్పష్టంగా రాయదు. పాత్రల స్పందనలు, మనోభావాలు, సన్నివేశాల్ని బట్టే పాఠకుడికి తెలుస్తుంది. మరొక స్త్రీ జీవితానికి తన బతుకు ప్రతిబంధకం కాకూడదని సౌదామిని తన చావులోనే బతుకుని చూసిందంటారు రచయిత్రి. చావు బతుకుల మధ్య దూరాన్ని కథలో ప్రతిసన్నివేశం కొలిచినట్లు పాఠకులకి తెలుపుతుంది.

ఈ విధంగా ద్వివేదుల విశాలాక్షి తన పరిశీలనలో వచ్చిన సమాజంలోని అనేక కోణాలను తన కథలలో చొప్పించారు. కుటుంబపరమైనవి రాసినా, సమాజంలోని దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని గూర్చి రాసినా ఒక నిబద్ధతతో తన పరిధిలో, తన దృక్కోణంలో ఎంతవరకూ సమస్యని చిత్రించగలరో అంతవరకే రాసారు. కథకు కావలసిన క్లుప్తతని పరిగణనలోకి తీసుకొని రాయటంతో ఎక్కడా కథ పక్క దారి పట్టదు. భాష విషయంలోగానీ, వాక్య నిర్మాణంలోగాని పరిపూర్ణత కలిగినవారు కావటంతో పాఠకులను ఆకట్టుకునేలా పఠనీయత కలిగి ఉంటాయి వీరి కథలు.

విజయనగరంలో జన్మించిన విశాలాక్షి కతలలో అక్కడక్కడ, ముఖ్యంగా బడుగు బలహీనవర్గానికి చెందిన పాత్రల సంభాషణలలోని ఉత్తరాంధ్ర మాండలికం వారి ప్రాంతీయతను స్పష్టం చేస్తాయి. నలభై ఏళ్ళకు పైగా గల సాహిత్య ప్రస్థానంలో పదమూడు నవలలూ, నాలుగు కథాసంపుటాలే కాక సుమనఅనే కలం పేరుతో అనేక వ్యాసాలు రాసారు ద్వివేదుల విశాలాక్షి విదేశాలలో అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. నేషనల్ బుక్ ట్రస్టు వారు వీరి నవలను అనేక భాషలలోకి అనువదించి ప్రచురించారు. అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేటు అందుకున్న రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి. ఇంతటి ప్రతిభావంతురాలైనా వీరు ఏ మాత్రం పటాటోపం లేకుండా నిరాడంబరంగా ఉండటం గుర్తించదగినది.

విస్మృత జంట రచయిత్రులు - మందరపు పద్మ, లలితలు
 

తెలుగు సాహిత్యంలో తొలిరోజుల్లో వేంకట రామకృష్ణకవులు (1909), పింగళి కాటూరి, తిరుపతి వేంకట కవులు (కొప్పరపు కవులు) మొదలైనవారు మనకు తెలుసు. ఆధునిక కథాసాహిత్యంలో 1. విహారి శాలివాహన,       2. రాంబాబు సాయి అని జంట రచయితలు కథలు రాసేవారు. కానీ రచయిత్రులలో 1956-59మధ్య ఆంధ్రపత్రికలో విరివిగా కథలు రాసిన మందరపు పద్మ-లలిత తొలి తెలుగు జంట రచయిత్రులు. వీరి జన్మస్థలం తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామానికి చెందినవారు కావటాన తెలంగాణ తొలి జంట కథారచయిత్రులుగా కూడా చెప్పుకోవచ్చు.

పద్మ-లలితల కథల్లో ఆనాటి ఆడపిల్లల మనస్థితి, ఆర్థిక సంక్షోభం, అటు చదువుకొనే పరిస్థితులూ లేక, ఇటు కట్నాలిచ్చి పెళ్ళిచేసుకునే అవకాశం లేక కునారిల్లుతూ జీవితాలు గడిపే అమ్మాయిల జీవన సందిగ్ధతని చాలావరకూ అన్ని కథలలోనూ చర్చించారు. పదేళ్ళు నిండే సరికే ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులు చాలాకథల్లో కనిపిస్తారు. తెలిసీ తెలియని తనంతో స్త్రీ స్వాతంత్ర్యం అంటే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవటం కాకుండా స్త్రీ పురుష సమానత్వ కాంక్షతో నలుగురిలో చులకన అయిపోయే సామాజిక పరిస్థితుల్ని తేటతెల్లం చేసి, చివరికి సమాజానికి కట్టుబానిసలయ్యేలా చేసిన కట్టుబాట్లకు తలవొగ్గిన స్త్రీ పాత్రల్ని వీరి కథల్లో చూడగలం.

1954లో ‘గుండుసూది’ అనే మాసపత్రికలో ‘ఆశయం-ఆచరణ’ కథతో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు. మళ్ళీ ఏడాదికి ‘కలిసిరాని కన్నీరు’ అనే కథ రాశారు. ఆ తర్వాత 1956-57-59లలో ఆంధ్రపత్రికలో పదిహేడు కథలు ప్రచురితమయ్యాయి. అందులో రెండు పిల్లల కథలే అయినా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.

వివాహబంధం కన్నా చదువుకొని ఉద్యోగం చెయ్యాలనే ఆనాటి యువతులకు ప్రతినిధులుగా ‘అంతం కాని పంతం’ కథలోని వనజ, ‘సమానత్వ సాధన’లోని సంధ్య కనబడతారు. కానీ చివరకు వచ్చేసరికి వారిలోని ఆకాంక్షలు, ఆశయాలు భగ్నమైపోయి మామూలు ఆడవాళ్ళలాగే మారిపోవటం రచయిత్రులు ముగింపులోని సామాజిక సంప్రదాయాలకు తల ఒగ్గినట్లుగా ఉంది. వనజ వివాహబంధాన్ని ఒదులుకొని చదువుపట్ల ఆసక్తితో డాక్టరు అవుతుంది. తన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకున్న ఆమెకి ప్రసవం చేయాల్సి రావటంతో, తాను కోల్పోయిన సౌభాగ్యానికి బాధపడినట్లుగా చిత్రించారు రచయిత్రులు. అదేవిధంగా బాల్యం నుండీ తండ్రి ప్రోత్సాహంతో స్త్రీ పురుషులు సమానం అనే స్వేచ్ఛా దృక్పథంతో పెరిగి విశ్వవిద్యాలయ చదువు కూడా చదివిన సంధ్య, చివరలో తన దృక్పథాన్ని మార్చుకొని సంధ్య భావాల్ని ఇష్టపడని బాల్యమిత్రుడిని వివాహం చేసుకున్నట్లుగా ముగించారు. అది సాధికారత కోరుకునే ఈనాటి యువత అవమానకరంగా భావించేలా ఉంది. కానీ ఆ కథ రాసినప్పటి సమాజ తీరు, ఆ సమాజంలోని వ్యక్తుల ఆలోచనా విధానం అంతకుమించి ఎదగలేదనేది గుర్తుపెట్టుకోవాలి.

ఆడపిల్లలకు వివాహం చేయటం అనేది సామాన్య గృహస్థులకు అగ్ని పరీక్షలా ఉండేదని వీరి కథలన్నింటా ప్రస్ఫుటమౌతుంది. అందుకే ఒక కథలో రచయిత్రులు ఇలా అంటారు. ‘‘వ్యక్తురాలైన  దగ్గర నుండి లోకమంతా ఆ పిల్లపై ఒక కన్నేసి ఉంచుతారు. వీధిలోకి వెళ్తే తప్పు. వీధికేసి తొంగి చూస్తే తప్పు. ఆడదంటే అంత అవిశ్వాసం, అంత చులకన’’ అని డెబ్భై ఏళ్ళ కిందటి స్త్రీల జీవన దుఃఖాన్ని వెళ్ళబుచ్చారు. పద్మ, లలితలు ‘కలిసిరాని కన్నీరు’ (1955) కథలో ‘‘అనేకమంది పెళ్ళికొడుకుల ముందు పెళ్ళి చూపుల కొరకు తలవంచిన కన్నెపిల్ల అభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చంపుకొని అందరి పరీక్షకి నిలవాలి. ప్రతీ ఆడది ఈ పరీక్షలో నెగ్గితీరాలి’’ అని బాధపడే మనోచింతనలో స్వాభిమానం, అసహాయతతోపాటూ నిరాశని కూడా చాలా కథల్లో చెప్పారు. ఇన్ని పరీక్షలకు నిలబడి కూడా తీరా పెళ్ళయ్యాక ‘‘అతను కొడితే పడాలి, తిడితే పడాలి. ఇన్నీ అనుభవిస్తూ అతనికి అన్నీ సదుపాయాలూ చేసిపెట్టి ఏడాదికో పిల్లని కనాలి. ఆడదానిది ఎంత నికృష్టజీవితం’’ అని కథలలోని కథానాయికల దుస్థితిని చిత్రించారు.

కట్న సమస్య మీదే రాసిన రెండు కథలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కట్నం తెచ్చిన పేచీ’ నలుగురు ఆడపిల్లలున్న తండ్రి పెద్ద వాళ్ళిద్దరినీ 516రూపాయల కట్నంతో స్కూల్ ఫైనల్ చదివిన అబ్బాయిలకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు, బియ్యే చదివిన మూడో అల్లుడికి 1116 రూపాయలు ఇచ్చినందుకు పెద్ద అల్లుళ్లు వాళ్ళకి కూడా అంత యివ్వాలని పేచీ పెట్టి వెళ్ళిపోతారు. తర్వాత నాలుగో అమ్మాయి పెళ్ళికి వాళ్ళు వస్తారో రారో అనుకుని పిలుస్తారు. అయితే వచ్చి ఎమ్మే చదివిన నాలుగో అల్లుడికి ఎంత ఇచ్చి ఉంటారోనని తగువుకి సిద్ధపడి వస్తారు. కానీ నాలుగో అల్లుడు ‘‘నిజమే అందరికి సమానంగానే ఉండాలి కదా. మీకిచ్చిన డబ్బు తెచ్చి మామగారికి ఇవ్వండి. ఎందుకంటే నేనేమీ కట్నం తీసుకోలేదు’ అనేటప్పటికి వాళ్ళందరూ బిత్తరపోతారు.  ఈ కథ కొంత హాస్యస్ఫోరకంగా రాసినా అంతర్గతంగా కథ ఆసాంతం ఒక దుఃఖపు పొర కదులుతూ ఉంటుంది. కట్నాల పేరిట శుభకార్యాలు ఎంత భారమౌతున్నాయో తెలిపే కథలో ఇవి.

కట్నం సమస్య మీదే రాసిన మరొక కథ ‘నీతి లేని మానవులు’ (1956) సోమసుందరం అనే చిరుద్యోగి అతి కష్టం మీద కూతురికి రెండు వేల రూపాయల కట్నంతో సంబంధం స్థిరపరచి ప్రదానం జరుపుతాడు. అప్పుడు వచ్చిన స్నేహితుడు మూర్తి పెళ్ళి కొడుకు లాయరని తెలిసి మంచి అల్లుడు దొరికినందుకు సోమసుందరాన్ని చూసి అసూయపడతాడు. తిరుగు ప్రయాణంలో పెళ్ళి వారితో మూర్తి కూడా ప్రయాణమై మార్గమధ్యంలో వారిని తన యింటికి తీసుకెళ్తాడు. ఎమ్మే చదివిన కూతుర్ని వాళ్ళకి పరిచయం చేసి, కూతురికి సంబంధాలు చూస్తున్నాననీ అయిదు వేలు కట్నం లాయర్లయితే ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి ఆశపెట్టి వాళ్ళు సోమసుందరం సంబంధం వదులుకొని తన కూతుర్ని చేసుకునేలా చేస్తాడు. విషయం తెలిసిన సోమసుందరం మిత్రుని నమ్మకద్రోహానికి కుప్పకూలిపోతాడు. కట్నం సమస్య, ఆడపిల్లల వివాహ సమస్య ఎంత దారుణంగా మారాయో, స్నేహబంధాల్ని కూడా ఎంతగా కలుషితం చేస్తాయో చాలాబలంగా ఈ కతలో చర్చల ద్వారా చెప్పారు పద్మ లలితలు.

‘వాసంతి వేడుక’ (1959)లో పత్రికలో ప్రచురితమైన వివాహ ప్రకటనని చూసి వాసంతి సరదాగా మారుపేరుతో దరఖాస్తు పెట్టి స్నేహం కొనసాగిస్తుంది. అందచందాలూ, విద్యా ఉద్యోగాలు చర్చించుకొని ఒకసారి కలవాలనుకుంటారు. కానీ ఇద్దరూ అనుకోకుండా తాము కాకుండా తమకి బదులుగా వేరే వారిని పంపిస్తారు. తర్వాత ఒకరికొకరు ‘తనకు మేనరికం స్థిరపడింది కనుక మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి అంగీకరించలేకపోతున్నాననీ, పెళ్ళి కార్డు పంపుతున్నాను. వీలుంటే రమ్మని ఉత్తరాలు రాసి కార్డులు పంపుతారు. తీరా ఆ రెండు కార్డులూ ఒకటేననీ, వాసంతీ, ఆమె బావా వాళ్ళిద్దరూ అని తెలియటం కొసమెరుపు. ఈ విధమైన కథలు ఆ తర్వాత్తర్వాత వివిధ మీడియాలు ద్వారా ఫోన్లూ, ఈమెయిల్స్, ఛాటింగులూ సంధానకర్తలుగా స్నేహాల మీద నేటివరకూ వస్తూనే ఉన్నాయి.

పెద్ద చదువులు చదువుతున్న యువతలో ఆధునిక పోకడలు ఎలా రూపుదిద్దకుంటాయో తెలిపే కథ ‘రసన’. భార్య పేరు నరసమ్మ బాగా లేదనీ అందమైన భార్యని ఆ పేరుతో పిలవడానికిగానీ, స్నేహితులకు పరిచయం చేయడానికి గానీ బాగుండలేదనీ పేరు మారుస్తానంటాడు మహీధర్. మొత్తం కథంతా హాస్యరచనా విధానంలో నడుస్తుంది. ఎన్ని పేర్లు అనుకున్నా భార్యాభర్తలిద్దరికీ ఏదో ఒక వంక కనిపిస్తుంది. చివరికి పోనీ ‘నరస’ అని పిలవమంటుంది భార్య. అంతలోనే ఆమెకి మరో ఆలోచన వచ్చి ‘న’ అక్షరాన్ని చివరికి చేర్చండి అంటుంది. అందమైన ముగింపుతో ‘రసన’గా మార్చిన రసరమ్యంగా రాసిన కథ.

బతకలేని బడిపంతులుగా సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు ఆ రోజుల్లో మరింతగా ఉండేది. అదేవిధంగా గుమస్తా ఉద్యోగం పట్ల కూడా నిరసన ఉండేది. ఆ విషయం పద్మ లలితల చాలా కథల్లో చాలా సందర్భాల్లో ‘ఇంత చదువూ చదివి గుమస్తాని చేసుకోవాలా’ అనే సంభాషణ వస్తుంది. అదేవిధంగా కట్నాల బేరాలలో కనిష్ఠ స్థానం టీచర్లకే కల్పిస్తారు. డెబ్భై ఏళ్ళ కిందట గొప్ప చదువుగా గానీ, బాగా సంపాదన వచ్చే ఉద్యోగంగా కానీ లాయరుకే కట్నాల బేరంలో ప్రధాన స్థానం కల్పించటం వీరి కథల్లో చూడొచ్చు.

మందరపు పద్మ లలితల కథలు పందొమ్మిది వరకూ లభ్యమయ్యాయి. అందులో పదిహేను కథలు ఆంధ్రపత్రికలోనే ప్రచురితం కావటం విశేషం.

వీరు తమ కథలలో డబ్బు విలువను ప్రకటించటం చాలాచోట్ల కనిపిస్తుంది. నలభై రూపాయలు పెట్టి కొన్న కాశ్మీరు సిల్కు చీర, ఇరవై అయిదు రూపాయల జరీ చీర కొనటం, కట్నం విలువలు, స్కూలు ఫైనల్ వారికి 516 రూపాయలు, 1000 రూపాయలు బియ్యే పెళ్ళికొడుక్కీ, లాయరుకి 5000 రూపాయలు, ఎమ్మే వారికి 2000 రూపాయలు అనీ అనేక కథలలో ప్రస్తావించటం ఉంటుంది. మూడు రూపాయలు పెట్టి కొన్న ఎర్రగౌను ఇలా చాలా చోట్ల రూపాయి విలువ డెబ్భై ఏళ్ళ కిందట ఎలా ఉంది అనేది తెలుస్తుంది.

మరొక విశేషం. కథలలో సందర్భానుసారం సామెతలు కూడా చొప్పించుతారు. ‘‘తానూ ఒక మనిషేనా, తవుడూ ఒక రొట్టేనా’’, ‘‘గంతకు తగ్గ బొంత’’, ‘‘పైన పటారం లోన లొటారం’’ ఇలా సంభాషణలలో మెరుస్తాయి.  పద్మలలితలు తెలంగాణాలోని గ్రామానికి చెందిన వాళ్ళు కావటాన, గ్రామీణ జీవితంతో సామెతలు ముడిపడి ఉండడం వలన రచనలలోకి వచ్చాయి.

పద్మ లలితలు కథలన్నిటిలోనూ ఎక్కడా తెలంగాణా మాండలికం తొంగిచూడదు. పూర్తిగా పత్రికా భాషలోనే కథలన్నీ రాశారు. పాఠశాల చదువు మాత్రమే చదివినవారు కావటాన కుటుంబ పరిధిని దాటి వీరి కథలు వెళ్ళలేదు. ఒకటి రెండు కథలలో స్త్రీ పురుష సమానత్వ సాధన తపన కనిపించినా బలంగా చెప్పలేకపోయారు.

1959వరకూ కలిసి కథలు జంటగా రాసినా 1969లో ‘తానొకటి తలిస్తే’ అనే కథ మందరపు పద్మ రాసింది. తర్వాత చాలాకాలం వీళ్ళ నుండి కథలు రాలేదు తిరిగి 1987, 88లలో రెండు కథలు వనిత మాసపత్రికలో మందరపు లలిత పేరున ప్రచురితమయ్యాయి.  మందరపు లలిత ఆంధ్రపత్రికలో ‘అయిదురెళ్ళు’ అనే ధారావాహిక రాసినట్లుగా తెలుస్తోంది. అనంతరం  కథలు రాయలేదు. వీరి వివరాలు గానీ, ఎక్కడ ఉన్నారనేదిగానీ తెలియదు. జంట రచయిత్రులుగా కథాసాహిత్యంలో మందరపు పద్మ, లలితల పేర్లు గుర్తించక తప్పదు. ఈనాడు విస్మృత కథకులే అయినా సమాజంలోని ఆడపిల్లల జీవితాల్ని, మనస్సుని అణచివేసేలా చేసి సామాన్య జీతగాళ్ళకి గుండెలపై కుంపటిగా మారిన కట్న సమస్య ఇన్ని విధాలుగా సమాజ వ్రణంగా మారిన తీరుపైరాసిన కథలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.

ముఖ్యంగా పద్మ లలితల జన్మస్థలమైన ఆదిలాబాదు జిల్లా. తెలంగాణా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 1956లో వీరు ఎనిమిది కథల వరకూ రాశారు. ఖర్చు చేసే ప్రతీ పైసానీ చూసుకుంటూ జాగ్రత్తగా కుటుంబాల్ని నడుపుకుంటూ ఇంటి ఆడపిల్లలకి ఉన్నదాంట్లోనే కట్నమిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి సిద్ధపడే మధ్య తరగతి కుటుంబీకుల కథలు వీరివి.  ఈ కథలన్నీ 1956లో ముఖ్యంగా వెనుకబడి ఉన్న ఆనాటి తెలంగాణ జిల్లాల్లోని మధ్యతరగతి ఆర్థిక పరిస్థితులని తేటతెల్లం చేసే విధంగా ఉన్న కథలు.

మందరపు పద్మ, లలితలు కథలు రాసేనాటికి ఆంధ్రరాష్ట్రాలలో రచయిత్రులు తక్కువగానే ఉన్నారు. తెలంగాణ ప్రాంతం 1948 వరకూ నిజాం పాలనలో ఉండడం వలన కావచ్చు తెలుగు పాఠకుల సంఖ్య కూడా పరిమితంగానే ఉంది. అందులో ఆడవారికి మరింతగా సాహిత్యం వైపు తొంగి చూసే పరిస్థితులు తక్కువ ఆ కారణం వలనే 1950-60ల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నంతమంది రచయిత్రులు తెలంగాణ ప్రాంతంలో లేరు.

అందువలన మందరపు పద్మ, లలితల కథల్ని ఆనాటి మధ్య తరగతి సామాజిక, ఆర్థిక జీవన విధానానికి ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొట్టమొదటి జంట కథారచయిత్రులుగా తెలుగు సాహిత్య చరిత్రలో నమోదు చేయక తప్పదు.

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ - పి. సరళాదేవి కథలు

యాభయ్యవ దశకం తర్వాత సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొందరు అనేక కారణాల వలన కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు తదనంతర నవలాప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తీ, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూ ఉన్నారు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన  కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.

1955లో ప్రజాతంత్ర పత్రికలో బావ చూపిన బ్రతుకుబాటకథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో  ప్రమదావనంలో రచనలు చేసారు. డా. పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో కుంకుమరేఖలుపేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని సరళాదేవి కథలుపేరుతో 1977లో మరొక సంపుటిని స్నేహితురాలు డా. పి. శ్రీదేవికి అంకితంగా తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం  ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని మాకుగాదులు లేవు పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.

1977లో యువమాసపత్రికలో కొమ్మా-రెమ్మాపేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు చిగురుఅనే నవలికనీ కలిపి గ్రంథస్థమై వచ్చాయి. ‘తెలుగు సామెతలు-సాంఘిక చిత్రణఅనే పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా సరళాదేవి ప్రచురించుకున్నారు.

1956 నుండి 1960 వరకూ స్వాతంత్ర్యానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం నుండి కోలుకోలేని ఆర్థిక సంక్షోభం, దుర్భిక్షం ఇలా అనేకానేక కారణాల వలన  - మధ్య తరగతి కుటుంబీకులలో ఇంటి పెద్ద మాత్రమే సంపాదించే చిరుద్యోగి కావడం, బహు కుటుంబీకులు కావటం ఆడపిల్లలకు చదువు, పెళ్ళి వంటివి పెనుభారాలుగా మారాయి. కొద్దిపాటి చదువుకున్న ఆడపిల్లలు అప్పుడప్పుడే తమ గురించి ఆలోచించడం మొదలెట్టిన కాలం. మధ్యతరగతి కుటుంబాలలో అందులోనూ ఉత్పత్తి కులాలలోని ఆడపిల్లలకి చదువు, ఉద్యోగం అందుబాటులోకి రాలేదువరకట్న సమస్య వలన వారి వివాహం పెనుభారంగా మారిందిదిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లలకి ఒంటినిండా బట్టా, తిండికీ కూడా కష్టమై వారు కోరుకున్న అతి చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు.

బహుశా అందువలనే కావచ్చు సరళాదేవి కథలు కూడా చాలావరకూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పెళ్ళిచూపులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్ని పొదుపు మంత్రంతో సమతూకం చేసి ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలు సతమతమవ్వటం వంటి కథాంశాలు కన్పిస్తాయి.

1962లో వచ్చిన మొదటి పుస్తకం కుంకుమరేఖలులోని కథలు రచయిత్రి పాతికేళ్ళలోపు వయసులోనే రాసినవి. అందుచేత అందులోని కథలు ఎక్కువగా  ఆ వయస్సు మధ్య తరగతి ఆడపిల్లల ఆలోచనలు, ఆత్మాభిమానాలు, ఆశయాలూ, ఆదర్శాలతో సహా ఇంటిని  ఉన్న దాంట్లో అప్పుల పాలుకాకుండా ఎలా తీర్చిదిద్దుకోవాలనే తపన కొన్ని కథల్లో ఉంటాయి. ఇంటికి అవసరమైనవి సమకూర్చుకోవాలనుకునేవారికి అకస్మాత్తుగా వచ్చే బంధువులు, రోగాలు, రోస్టులూ, ప్రయాణాలు ఆ ఆశని ఆవిరిచేయడం, నిస్పృహతో బొక్కబోర్లాపడకుండా సర్దుకుపోవడం కొన్ని కథల్లో చూడొచ్చు. అయితే సరళాదేవి కథలు అంతటితో ఆగిపోవు. ప్రతీమెట్టు దగ్గరా ఆడపిల్లలు తమ అస్తిత్వం గురించీ ఆలోచిస్తూ వెన్నెముక గల వ్యక్తిత్వంతో నిలబడతారు.

బాల్యంలో పూలగౌను తండ్రి కొనితెస్తాడనీ, యవ్వనంలో పూలైనా కనీసం భర్త తీసుకొస్తాడేమోననీపిల్లలు పెద్దైన తర్వాత కూతురో, కొడుకో అమ్మా నీకోసం కొన్నానని ఇస్తారని జీవితకాలం ఎదురుచూస్తూనే మరణానంతరం పైన కప్పటానికి కొత్తబట్ట తేవడానికి కొడుకు ముందుకొస్తే పరికించలేని అనంతలోకాలకి వెళ్ళిపోయిన దుర్గ కథ ఎదురుచూసిన ముహూర్తం’. ఉద్యోగిని అయినప్పుడు కూడా తనకోసం తాను కొనుక్కోలేకపోయిన పరిస్థితులు ఆమెని చుట్టుముడతాయి. బాల్యంలో ఆర్థికాంశాలు తోడైతే తర్వాత ప్రేమరాహిత్యంతో దుర్గ నిస్పృహతో ముడిపడడం ఈ కథానేపథ్యం. తనవారు అనుకున్నవారు నీకోసం తెచ్చానుఅని ఏ చిన్న వస్తువునూ తెచ్చినా సున్నిత మనస్కురాలైనా స్త్రీ హృదయం ఉప్పొంగిపోతుందనే విషయాన్ని పురుషులే కాదు, తోటి స్త్రీలు కూడా గుర్తించరు. చిన్న విషయంగా అనిపించే పెద్ద విషయాన్ని  కథగా మలచటంలో రచయిత్రి చూపిన శిల్పవిన్యాసం పాఠకులను ఆకర్షిస్తుంది. బహుశా అందుకనే కౌమారదశ అంచుల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేశారు ఈ కథని.

పిల్లల్ని కనటం, పెంచటం తల్లిదండ్రుల బాధ్యత అనీ, పిల్లలు కన్నవాళ్ళ రుణం తీర్చుకోకతప్పదనీ భారతీయ సనాతన ధర్మాలన్నీ ఘోషిస్తుంటాయి. అయితే పిల్లలు తమని కనమని అడగరు, కన్నందుకు పెంచకా తప్పదు. అది బాధ్యత కన్నా తమని  వృద్ధాప్యంలో ఆదుకుంటారనే ఆశిస్తారు తల్లిదండ్రులు. పిల్లలకూ, తల్లిదండ్రులకూ, భార్యాభర్తలకూ, అన్నాచెల్లెళ్ళకూ, అక్కాచెల్లెళ్ళకూ, అన్నాతమ్ములకూ మధ్యన ఉన్నది ప్రధానంగా ఆర్థిక సంబంధమే అనేది  తెలిసినా ఆ విషయాన్ని బయటపెట్టరు. మానవ సంబంధాలలోని  లొసుగులు ఆర్థిక పరమైన విషయాలలోనే బైటపడతాయని చెప్పిన కథ వాడికొమ్ములు’ (1977). ఇటువంటి అంశాన్ని తీసుకుని రచన చేయడం సాహసమే.

మొగుడు కావాలా కొడుకు కావాలా అన్న ప్రశ్నని అనేక సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ చూపించిఆడది మొగుడ్ని ఎంచుకుంటే ఆదర్శ మహిళత్వమని పొగిడి చప్పట్లు కొడతారు. అదే మగవాడి జీవితంలో తల్లి ఎక్కువాభార్య ఎక్కువా అనే ప్రశ్నకి భార్య ఎక్కువని ఎంచుకుంటే  చప్పట్లు కొట్టరెందుకు?’ అంటూ సూటి ప్రశ్నని పాఠకులకు సంధిస్తారు రచయిత్రి. కొడుకు పెళ్ళి జరిగాక అత్తాకోడళ్ళ మధ్య  సయోధ్య కుదరకపోవటానికి మూలకారణం ఈ ప్రశ్నల గురించి ఆలోచించినవాళ్ళకి అర్థమవుతుంది.

దాంపత్య సంబంధాలలోని విచ్ఛిన్నతకు అవకాశం ఉన్న అనేక  సమస్యలన్నీ రచయిత్రి తన కథలలో ఎత్తి చూపారు. స్త్రీలకూ, పురుషులకూ సమాజం విధించిన వేర్వేరు లక్షణాలనూ, విధి విధానాలనూ చూపిన రచయిత్రి, వాటివలన వస్తోన్న వివిధ సంఘర్షణలను గ్రహించటం వలన, వాటినే తన కథాంశాలుగా తీసుకుని రాశారు. ముఖ్యంగా చాలా కథలు  దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాల జీవన వైవిధ్యాల్ని ఆనాటి జీవన శైలితో ముడిపెట్టి సరళసమ్మోహనమైన కథన శిల్పాన్ని ఎంచుకుని కథలు అల్లారు.

మూడు పాత్రల స్వగతంగా  చెప్పిన కథ పేచీ’. ఒక మధ్య తరగతి ఆడపిల్ల వివాహం ఆర్థికాంశాలతో ముడిపడి  తండ్రీ, భర్తల మధ్య ఎంతగా నలిగిపోయేలా చేస్తుందో తెలుపుతుంది.

పెళ్ళైన మర్నాడు శాంత వ్యక్తురాలయ్యింది శారీరకంగా కాదు మానసికంగా అన్నమాటతో స్త్రీకథను మొదలుపెట్టటమే పాఠకుల్ని కథలోకి లాక్కెళ్ళిపోతుంది. శాంతకొడుకుకి  పెళ్ళయిన మర్నాడు శాంత చచ్చిపోయింది శారీరకంగా కాదు మానసికంగాఅంటూ కథ ముగించటంలో సరళాదేవి కథన విన్యాసం తారాస్థాయికి చేరిందనిపిస్తుంది. ఈ రెండు వాక్యాల నడుమ నడిచిన కథ ఏమిటనేది నిజానికి వివరించి చెప్పకపోయినా ఫర్వాలేదు. మందబుద్ధి అయిన కొడుకును శాంతకు ఇచ్చి పెళ్ళి చేసిన అత్త శారీరక సుఖం కోసం నీ ఏర్పాటు నువ్వు చేసుకోవచ్చు అని సలహా ఇస్తుంది. ‘అటువంటి భర్తని  మగవాడిని చేసింది శాంతఅంటారు రచయిత్రి. ఇంతకన్నా విడమరిచి చెప్పక్కర్లేదు. తన నేర్పరితనంతోనే పిల్లల్ని కనిపెంచినప్పుడు శాంత మాతృమూర్తి అయ్యిందిఅంటారు. కథని ఎంతవరకూ చెప్పాలో ఎక్కడ ఆపాలో తెలిసిన రచయిత్రి.

1957లోనే రాసిన గతాగతాలు, వక్రించిన కీర్తికాంక్ష ఇంచుమించుగా ఒకే రకం అంశంతో ఒకదాని సీక్వెల్ ఇంకొకటి అనిపిస్తుంది. కొత్తకాపురం పెట్టిన ఇంటిచుట్టుపక్కల వాళ్ళంతా అంతకుముందు ఆ యింట్లో ఉన్న యిల్లాలు మంచితనం వేనోళ్ళ కీర్తించటాన్ని చూసి తాను కూడా అలాగే ఉండి మంచిది అనిపించుకోవాలా అనే సందిగ్ధంలో పడుతుంది కథానాయిక. రెండో కథలో వాళ్ళింట్లోని బావిలోని నీళ్ళని తొడుకొని పక్కబస్తీ వాళ్ళంతా వెళ్తారు. పక్కింటామె బతిమాలించుకొని రెండురోజులకొకసారి, ఉదారంగా ఇచ్చినట్లుగా నీళ్ళని తోడుకోనిస్తుంది. అయినా ఆమెని వాళ్ళంతా  పొగుడుతారేమిటనే అర్థంకాని సందిగ్ధత మరో ఇల్లాలికి. మానవ స్వభావాలలోని విభిన్న కోణాల్ని దర్శింపజేసే కథలు ఇవి.

1977లో ప్రచురితమైన సరళాదేవి కథలుసంపుటిలోని కథానాయికలు పరిణతి పొందిన యువతులు మర్రిచెట్టునీడలో’ (1969)లో అయిదుగురు అక్కల తర్వాత పుట్టిన వెంకటేశ్వర్లు తల్లీ అక్కల అపేక్షతో ముద్దుగా పెరిగి తనకేం కావాలో కూడా ఆలోచించనివాడు. అటువంటి కుటుంబంలోకి కోడలుగా వచ్చిన పద్మకి, భర్త మర్రిచెట్టు నీడలో పెరిగిన గడ్డిచెట్టుగా కనిపించటమేకాక క్రమేణా తాను కూడా మరో గడ్డిమొక్కగా మారుతున్నానని తెలుసుకుంటుంది. పద్మ సాహచర్యంతో నీడలో ఉన్నంతకాలం ఎదగలేమని తెలుసుకున్న వెంకటేశ్వర్లు ట్రాన్సఫర్ కి పెట్టుకోవటంతో ముగుస్తుంది. కథ ఇంతేనా  అనుకుంటే అంతే. కానీ కథలో ఉన్న పాత్రల స్వభావం, యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తించే పాత్రల పరిచయాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమాజంలోని కుటుంబ కలహాలకు కారణాలు అవగతమవుతాయి.

తరతరాలుగా పిల్లల్ని తప్పనిసరిగా సవతితల్లి ప్రేమించదు అనేది జానపద కథల దగ్గర నుండి సామాజిక సాహిత్యం వరకూ శిలాక్షరాలుగా ఉన్నాయి. పుట్టింట్లో తనకంటూ అస్తిత్వం లేకుండా బతికిన కమల నలుగురు పిల్లలున్న వాడిని పెళ్ళిచేసుకుని పిల్లల్ని ప్రేమించి, కుటుంబాన్ని తనకంటూ ఒక ప్రేమైక ప్రపంచంగా చేసుకున్నా, చుట్టూ వున్న సమాజం విషబిందువుల్ని చిలికించి ఆమె కూడా సవతితల్లిగా మారిపోయే పరిస్థితుల్ని కల్పించటాన్ని పిన్నిప్రేమ’ (1957)గా కథ రూపెత్తింది.

ఈ రచయిత్రి కథలలో పాత్రల్ని దుర్మార్గులుగా చిత్రించరు. అలా అని మంచివాళ్ళని చెప్పలేదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న సామాన్య వ్యక్తులు. విభిన్న మనస్తత్వాలు, మనోభావనలు  కలిగిన మనుషుల మధ్య యువతులు అధైర్యపడి కుమిలిపోక కుటుంబంలోని సమస్యల చిక్కుముళ్ళని చాకచక్యంగా, తెలివిగా, సున్నితంగా మానవ సంబంధాలను తెగిపోకుండా విప్పుకోవటం ఎలాగో ఈ కథలు తెలుపుతాయి. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సాంఘిక జీవితం విధించిన వివక్షతలను అర్థం చేసుకుని ఒక కొత్త ఆలోచనావిధానాన్ని ప్రదర్శిస్తూ ఒక కొత్త చూపుని  ఈ కథలు పాఠకులకు అందిస్తాయి.

సరళాదేవి కథలు అతిసామాన్యంగా, మామూలుగా, నిరాడంబరంగా చెప్పుకుపోతున్నట్లే ఉంటాయి. సంభాషణలు మన ఇళ్ళల్లోనో, మన చుట్టూ వున్న వారి మాటల్లాగా పొరుగింట్లో జరిగిన సంఘటనల్లాగో ఉంటాయి. కానీ కథల్ని లోతుగా పరిశీలించి చదివితే కథలోని అంతరార్థం అవగాహనకు వచ్చి, రచయిత్రి రచనలోని లోతులు పాఠకులకు అర్థమవుతాయి. అందుచేత రచయిత్రి కథలు ఎంత సమకాలీనంగా ఉన్నాయో తెలుస్తుంది.

          బియ్యే చదువుకున్న విద్యావతి తన భర్త చేత తన్నులుతింటూ బతుకుతుంది కానీ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకో అంటే – ‘విడాకులు ఇస్తే జామ్మని ఖుషీ చేస్తాడు. కలలోనైనా తలవడు. కానీ నేను మాత్రం అవస్థలు పడాలా? ఎక్కడో ఎందుకు ఆ పడేదేదో ఇక్కడే పడతాను. పెళ్ళంటే బొమ్మలాటా....’’ అని ఆవేశపడుతుంది భిన్నత్వం ఏకత్వంకథలో జమున. అదే కథలో పల్లెటూరి దిగువ తరగతికి చెందిన అమ్మాయి  తన భర్తతో నానా చావుదెబ్బలు తింటుందిశిశు సంక్షేమశాఖలో ఉపాధి కల్పిస్తాం అని చెప్పినా భర్తని విడిచిపెట్టదు. ఇలా రెండు వర్గాల స్త్రీలను సాదృశ్యంగా చూపుతూ ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించేదేమిటివీళ్ళ ప్రయాణం ఏ దిక్కుకి? అని ప్రశ్నిస్తూ ప్రశ్నలతోనే నాటి సమాజంలో స్త్రీ పురుష జీవన వైరుధ్యాన్ని సమాధానంగా చూపిస్తారు రచయిత్రి.

          కట్నం పుచ్చుకునేవారిని పెళ్ళిచేసుకోనని  ప్రతిజ్ఞ చేసి సాధించిన అమ్మాయి కథ ప్రచురించిన పత్రికను మరదలికి అందుబాటులో ఉంచి, ఆమెను జాగృతపరచిన వదిన  సూత్రకారి’(1958)గా మారుతుంది. మరదలు వసుంధరకు కట్నం తీసుకొని వరుడిని సాధిస్తుంది.

పెళ్ళిచూపుల పేరుతో ఆడపిల్లని శల్యపరీక్ష చేయటం తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఆడపిల్ల అందచందాల్నీ, రంగుని, అవకరాలనీ ఎత్తి చూపటం వంటి వాటిని రెండు మూడు కథలలో నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తుంది రచయిత్రి.

జీవన స్రవంతి విధానంలో బస్సు ఎక్కిన దగ్గరనుండి తిరిగి దిగేవరకూ డ్రైవరు, కండక్టర్, యువకుడు సంభాషణతో కథంతా నడుస్తుందియువకుడి పెళ్ళి సంబంధాల గురించి జరిగిన ఆ సంభాషణలో వివాహ వ్యవస్థ, పెళ్ళిచూపుల  ప్రహసనాలూ, ఆడపిల్లలకు పెళ్ళిపట్ల గల మనోభావాలు, యువకుల దృక్కోణాలూ అన్నిటినీ ఇతర ప్రయాణీకులైన ముసలివాళ్ళ మాటల్లో వ్యక్తమయ్యే తరాల అంతరాలూ అన్నింటినీ చర్చకు పెడుతూ నడిచిన కళ్యాణ కింకిణి’ (1956) కథ అరవై ఏళ్ళ కిందటి  వివాహ వ్యవస్థకి సంపూర్ణ నిర్వచనంలా రచించింది సరళాదేవి.

చలం, కుటుంబరావుల రచనలను అమితంగా ఇష్టపడే సరళాదేవి, తన కథలలో ఎవరినీ అనుసరించకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని ఏర్పరచుకుంది. ఏ విషయానికైనా, ఏ సమస్యకైనా మౌలికాంశం ఏమిటన్నది ఆలోచించి ఆ దృశ్యకోణంలోనే కథలను అల్లగలిగే నేర్పును సాధించటమేకాకుండా, అతి సాధారణమైన అచ్చతెనుగు నుడికారంతో కూడిన సంభాషణలతో కథలను రాయటం సరళాదేవి ప్రత్యేకత.

అతి సామాన్యమైన కుటుంబ కథే అనిపించే వాటిలో కూడా కుటుంబ ఆవరణను, పరిస్థితులనూ, పాత్రల మనస్తత్వాలనూ నిశితంగా గమనించే పరిశీలనాశక్తి ఈ రచయిత్రి స్వంతం.

ఏ రచయితకైనా తాను సృష్టించిన ఎటువంటి పాత్ర మీద అయినా అసహనం, ద్వేషం ఉండదు.  అంతేగాక ఆ పాత్ర ఎటువంటిదైనా సానుభూతి ఉంటుంది. సమాజంలో కనిపించే అహంకారాలూ, అల్పత్వాలూ, అభిమానాలూ, కుత్సితాలూ లాంటి వివిధ రకాల మానవ దౌర్భల్యాలు సంయమనంతో పరిశీలించటంకథానుగుణంగా  ఆయా పాత్రల ప్రవర్తనలనూ, మనోభావాలనూ కథలలో ప్రస్ఫుటించే దశలో కూడా కరుణార్ద్ర పూరితంగానే పాత్రలను చిత్రీకరించింది సరళాదేవి.

నిజానికి సరళాదేవి కథలలోని పురుష పాత్రలు ఏవీ దుర్మార్గులుగానో, స్త్రీలను అన్యాయం చేసేవారిగానో కనిపించరు. కానీ వివాహ పూర్వవ్యవస్థని కానీవివాహ వ్యవస్థని కానీకుటుంబ వ్యవస్థనిగానీ కథనం చేసే క్రమంలో స్త్రీలకు ప్రస్ఫుటంగా కనిపించనిరీతిలోనే జీవన విధ్వంసంగా లోలోపల జరిగే అన్యాయాలు తెలుస్తుంటాయి. కొన్నింటిలో స్త్రీలు పరిస్థితులకు తలవంచి సర్దుకుపోవటం కనిపిస్తుంది. మరికొన్నింటిలో అమ్మాయిలు తమకు జరుగుతున్న వివక్షతను గ్రహించి ప్రశ్నించి దానిని తెలివిగా సరిచేసుకునే ప్రయత్నంలో సఫలం కావటం ఉంటుంది.

జీవితంలో ఎదుర్కొన్న  అనుభవాలకు ఆశ్చర్యపడుతూఒక్కొక్కసారి చిన్నబుచ్చుకుంటూ, ఆవేశపడ్తూ, అయోమయపడుతూ ఉన్న కథానాయికలు తమ అస్థిత్వం నిలుపుకుంటూనే తమ సమస్యలకు తామే పరిష్కారం దొరకబుచ్చుకుని తమని తాము పునర్నించుకోవాల్సిన అవసరం తెలుసుకుని, చుట్టూ ఉన్న వారిని నొప్పించకుండా, తాను నొచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ధృఢమైన వ్యక్తిత్వాన్ని సాధించే కథానాయికలుగా తొణికిన స్వప్నంలో కమలం, ‘పురుషుడులో కృష్ణకుమారి, ‘మర్రిచెట్టు నీడలో పద్మ, ‘కుంకుమరేఖలుహేమలత, ‘తిరిగిన మలుపుజానకి, ‘ఇల్లూ ఇల్లాలులో శకుంతలా- ఇలా చాలామంది  కథలలో, పాఠకులకు  పరిచయం అవుతారు. వీరి సమస్యలు వేర్వేరు కావచ్చు, కాని సునిశితంగా, చాకచక్యంగా దిద్దుకునే నేర్పుని ఈ పాత్రలలో మనం చూడవచ్చు. ఇది రచయిత్రి నైపుణ్యానికి నిదర్శనం.

అంతకుముందు రాసిన కథలకు భిన్నంగా జీవితానుభవంతో మారిన  దృక్పథంతో రాసిన కొన్ని కథలను కూడా పరిశీలించాల్సి ఉంది.

పదవీ విరమణ అనంతరం జీవితం ముగిసిపోయినట్లే అని భావించే భార్యాభర్తలు రామయ్యా, సుందరమ్మల కథ నిండా తొంభై ఏళ్ళు బ్రతుకు’. పెళ్ళిళ్ళు అయి ఎవరి సంసారాలు వారే చేసుకుంటున్న పిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఉండదు. అటువంటి వారి దగ్గరికి తల్లిదండ్రులు వెళితే ఇరువురికీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడతాయి.  పిల్లల కుటుంబాలలో  వ్యక్తులుగా ఇమిడిపోలేరు. తరాల అంతరం ఒక కారణం అయితే పిల్లల స్వేచ్ఛకు ఆటంకం కలిగించినవాళ్ళు అవుతారుఆ విషయాన్ని చాలా సున్నితంగా చర్చిస్తారు రచయిత్రి. వాళ్ళేదో తమని నిర్లక్ష్యం చేస్తున్నారని లబోదిబో అనకుండా చెప్పేతీరు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తెలుసుకోవలసిందే. కొండదేవర తమని తొంభై ఏళ్ళు బతుకుతారని చెప్పటంతో ఇంకా ముప్ఫై ఏళ్ళు ఎలా బతకాలని చివర్లో భార్యాభర్తలిద్దరూ నిస్పృహతో తల్లడిల్లిపోవటం యాభై ఏళ్ళ క్రిందట కనుక సరిపెట్టుకోగలం. ఈనాడు ఎంత వయస్సు వచ్చినా తమకి తాము ఏదో వ్యాపకం కల్పించుకొని చురుకుగా జీవితాన్ని కొనసాగిస్తున్న నేటి వృద్ధులకు ఈ కథ అసంతృప్తి కలిగిస్తుంది.

వ్యాపార దక్షత మెండుగా గల ఆ పత్రికకు చందా ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదని తీర్మానించుకున్న భార్యాభర్తల దగ్గర, ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గరా ఏవిధంగా రెండు చందాలు కట్టించుకున్నాడో చెప్పిన కథ సవ్యసాచి’. ఈ కథని పాత్రల మనోగతంగా ఒక్కొక్కరిచేతా చెప్పించిన పద్ధతిలో కథని నడపడం కొత్తదనం. యాభై అరవై ఏళ్ళ కిందట ఈ విధానంలో చాలామంది  కథలు రాసారు. సరళాదేవి కూడా ఈ రకంగా పాత్రలు కథను చెప్పే పద్ధతిలో మూడు కథలు రాశారు.

పుట్టిన రోజు పండుగను ఏవిధంగా జరుపుకున్నారో రాయమని క్లాసులో విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయినికి ఒక విద్యార్థి ఉత్తరం రాస్తాడు. సమాజంలో అందరి జీవితాలూ ఒకేలా ఉండవనీ, తినడానికీ, మందులకు లేని జీవితాలకు పండుగలు, పుట్టినరోజులూ ఏమిటని ప్రశ్నిస్తూ విద్యార్థి రాసిన స్వీయజీవన కథనం ఉపాధ్యాయినికి జ్ఞానోదయం కలిగిస్తుంది. ‘మాకుగాదులు లేవు’ (1975) కథలో పి. సరళాదేవి రాసిన చివరి కథ యిది. 1975 తరువాత ఎందుచేతనో మరి కథారచన చేయలేదు.

సరళాదేవి తన కథానికలలో అద్భుతమైన, ఆధునిక భావజాలంతో రాసిన చక్కటి నిర్వచనాలు కథాసందర్భంలో ఆకట్టుకుంటాయి. ‘మన వివాహ వ్యవస్థలో పెళ్ళికూతురు ఎంత బొమ్మో పెళ్ళి కొడుకూ అంతే బొమ్మఅంటారు భిన్నత్వంలో ఏకత్వం కథలో. ‘అవమానాలన్నీ ఆడవాళ్ళు ఆవలింతలుగా తీసుకోవాలా’ (దుర్బలుడి వాగ్దానం)లో, ‘ఏ జీవజాలంలోనూ లేని ఆర్థికబంధం, సేవాబంధం, త్యాగబంధం మనుషుల జీవితానందాన్ని తినేస్తుంది (వాడి కొమ్ములు)లో ఆలోచింపజేస్తాయి.

సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్కతు ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి  చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ ఉన్నాయిఅంటారు. ‘కుంకుమరేఖలుసంపుటికి రాసిన ముందుమాటలో గోరాశాస్త్రి.

‘‘మొదటిది రచయిత్రి సంస్కృతి, వ్యుత్పత్తి, రెండవది భాషపై వున్న అమోఘమైన స్వాధీనం, మూడవది నిశితమైన మానవ మనస్తత్వ పరిశీలన ముప్పేట జడవలె సమన్వయపరుచుకుని కథానికలను అందిస్తున్న సరళాదేవిని అభినందిస్తున్నానుఅంటారు గోరాశాస్త్రి.

వివాహ వ్యవస్థ స్త్రీ జీవితంతో ఎలా ఆడుకుంటుందో చూపటమే లక్ష్యంగాస్త్రీ జీవితంలోని ఇతర పార్శ్వాలను కూడా చిత్రించే సరళాదేవి మరిన్ని రచనలు చేసి వుంటే బాగుండేదంటారు మృణాళిని.

ఈ రకంగా అరవై ఏళ్ళ కిందట  విస్తృతంగా కథలు రాసి సమకాలీన కథకులలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని కూడా రెండు దశాబ్దాల పాటూ మాత్రమే రచనలు చేసి కలాన్ని పక్కన పెట్టేశారు పి. సరళాదేవి.

మాదిరెడ్డి సులోచన కథల్లో భిన్న కోణాల మానవ నైజ చిత్రణ

అరవై డెబ్భై దశకాలలో చదువుకున్న వాళ్ళు సరే, రోజంతా ఇంట్లో పనీపాటలతో సతమతమయ్యే సాధారణ గృహిణులు సైతం కాస్తంత సమయాన్ని సమకూర్చుకుని సీరియల్స్ చదువుతూ పత్రికల సర్క్యులేషన్ ను అమాంతం పెంచేసిన రోజుల్ని తలచుకుంటే అది పబ్లిషర్లకు బంగారుపంటని అందించిన స్వర్ణయుగం. ఉత్కంఠని రేపే నవలలను విస్తృతంగా రాసి కీర్తినీ, ధనాన్నీ సాధించిన రచయిత్రుల కాలమది. అటువంటి కాలంలో కేవలం పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఒకవైపు సాహిత్యాన్నీ, మరోవైపు ఉపాధ్యాయవృత్తినీ సమతూకంగా చేసుకొని తనకంటూ ఒక ముద్రని సాహిత్యరంగంలో వేసుకుంటూ అనేక నవలలు, కథలూ రచించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన.

            మాదిరెడ్డి సులోచన 1965లో జీవనయాత్రపేరుతో నవలాప్రయాణం ప్రారంభించి 72 నవలలూ, రెండు నాటికలూ, పది ఏకాంకికలూ రాశారు. పది నవలలు వెండితెరకెక్కాయి. వీరికథల గురించి చెప్పాల్సివస్తే ఆంధ్రజ్యోతిలోప్రచురితమైన మదిరామదవతిమొదటి కథగా భావించవచ్చు. దాదాపు 150 కథలు రాసారని సాహిత్య పరిశోధకుల ద్వారా తెలుస్తున్నా, శ్రీకాకుళంలోని కథానిలయం వెబ్సైట్ నమోదు చేసినవి మాత్రం అరవై ఏడు కథలు. 1975లో మాదిరెడ్డి సులోచన కథలు’, ‘అక్కయ్య చెప్పిన కథలుసంపుటాలుగా వచ్చాయని తెలుస్తోంది. ఇటీవల సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఎంపిక చేసిన ఇరవై కథల్ని మాదిరెడ్డి సులోచన కథలుగా వెలువడ్డాయి.

రచయిత్రి రాసిన కథలో సింహభాగం ఉత్తమ పురుషలోనే రాయటం ఒక ఎత్తైతే, ఆ పాత్ర ఉపాధ్యాయినిగానీ, రచయిత్రిగానీ కావటం మరో విశేషం. అటువంటి చాలా కథలలో ఆ పాత్ర పేరు క్రాంతి అని గానీ, మాలతి అని గానీ కావటం మరింత విశేషం. కథల నేపథ్యం, చిత్రణ చాలావరకు తెలుగు ప్రాంతాల్లో అదీ జంటనగరాల పరిసరాలలోనే కాక విజయవాడలో కూడా కథా వాతావరణం కనిపిస్తుంది. మరికొన్ని కథలు మాదిరెడ్డి సులోచన ఉద్యోగరీత్యా దర్శించిన, నివసించిన ఇథియోపియా, జాంబియా వంటి విదేశాల్లోని జీవన విధానం, అక్కడ స్థిరపడిన భారతీయులు, తెలుగువారి మానసిక ప్రవృత్తుల చిత్రణతో కథల్ని అల్లారు. అందుచేత కథలలోని పాత్రలు యథార్థ వ్యక్తులేననీ, వారి జీవనచిత్రణ, మాతృభూమి వదిలినా మారని మానవ దృక్పథాల్నీ వాస్తవికంగా చిత్రించారని పాఠకులు కథలో మమేకం అయ్యేలా అక్షరబద్ధం చేశారు. కాల్పనిక చిత్రణలో కేవలం ఊహనే జోడించినట్లు కాకుండా మానవీయ విలువల్నీ, వాటిని కలుషితం చేసే పరిస్థితుల ప్రభావాల్నీ సమర్థవంతంగా చొప్పించి పాఠకుల మన్ననలందుకున్నారు రచయిత్రి.

కేవలం కాల్పనిక సాహిత్యంగానే మాదిరెడ్డి సులోచన రచనల్ని గుర్తించటానికి వీలు లేదు. కథానికలలో ఊహాజనిత చిత్రణకన్నా వాస్తవిక జీవిత చిత్రణకు ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. కథల్లో ఆనాటి కథానికా సాహిత్యంలోలాగ కథాంశాల్ని కేవలం ప్రేమలూ, పెళ్ళిళ్ళ చుట్టూ కాక కుటుంబం జీవితంలోని అనేక కోణాల్ని చిత్రించటానికే ఉత్సుకత చూపారు. వీరి రచనల్లో మహిళా పాత్రలన్నీ విద్యావంతులో, ఉద్యోగినులో, రచయిత్రులుగానో ఉంటారు.

స్త్రీని వ్యక్తిగత ఆస్థిగా భావించే పురుషుల దృక్పథాన్నీ, చదువుకుని స్వయంశక్తితో నిలదొక్కుకున్న స్త్రీల దృక్పథాల్నీ కొన్ని కథలు వెల్లడిస్తే; స్త్రీకి స్త్రీయే శత్రువుగానూ, అసూయాద్వేషాల్తో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి రక్త సంబంధీకుల్ని సైతం అంతం చేయగల కుత్సిత బుద్ధిగల స్త్రీల దుష్టత్వాన్ని మరికొన్ని కథలలో చిత్రించారు రచయిత్రి.

ప్రగతివాద ధోరణిలో మాట్లాడుతూనే ఆచరణలో మాత్రం తప్పించుకు తిరిగే కుహనా అభ్యుదయ వాదుల్ని చురకలు అంటిస్తూ కొన్ని కథల్లో ఎండగడతారు మాదిరెడ్డి సులోచన.

సౌందర్యవతి అయిన చెల్లెలు పట్ల తన భర్త ఆకర్షింపబడుతున్నాడేమో అనే భ్రమతో అసూయ పెచ్చరిల్లి నిద్రమాత్రలు కలిపి చెల్లెల్ని చంపటం ఒక కథలోనూ, తనకు పిల్లలు లేకపోవటంతో ఆస్థి తనకు రాదేమోనని తన చెల్లెలినే భర్తకు కట్టబెట్టిన అక్క, తీరా చెల్లెలు గర్భవతి కాగానే భర్త తన చెల్లెలిని అపురూపంగా చూడటం భరించలేక చెల్లెలిని హత్యచేయటం – ‘తప్పు నాదా’ (1971), ‘స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః’ (1969) ఈ రెండు కథలు సుమారుగా అసూయ ఎంత దుర్మార్గానికైనా ఒడికట్టేలా చేస్తుందనే విషయాన్ని సమర్థిస్తూ రాసిన కథలే అయినా; అప్పటికే రచయిత్రి నవలలు సినీమాలుగా రూపొందటంతో ఆ ప్రభావంతో నాటకీయతతో రాసిన కథలుగానే తోస్తాయి. కానీ సమాజానికి ఒక చెడు సందేశాన్ని ప్రసరింపచేసే కథలు రచయిత్రలు నుండి రాకూడదనిపించినా మనిషి విభిన్న పరిస్థితులలో ప్రవర్తించే విధానానికి, తనకున్న మంచి గుణాలు ఛిద్రం కావటానికి కారణాలను అన్వేషించేలా మనస్తత్వ విశ్లేషణకూ, పరిశీలనకు  ఈ కథలు ఉదాహరణలుగా నిలుస్తాయనవచ్చు.

మాదిరెడ్డి సులోచన కథలలో విదేశీ పర్యటనల నేపథ్యంలో రాసిన కథలు చాలా ఉన్నాయితిరిగి స్వదేశం వచ్చాక ఉద్యోగంలో చేరటానికి ఏర్పడిన అవాంతరాల నేపథ్యం, అందులోనూ ముఖ్యంగా విద్యాశాఖలో జరిగే అవినీతి భాగోతాలను బట్టబయలు చేసిన కథ – ‘ఇదీ భారతం’ (1974) – ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఉన్నా, ఇంటర్వ్యూలో సెలెక్టు అయినా కూడా విద్యాసంస్థలలో ఉండే రాజకీయాలు, ఏ విధంగా ఉద్యోగంలో నియమించేందుకు అడ్డంకిగా మారిందో తెలిపే కథ ఇది. అదేవిధంగా రైల్వేలలో చోటుచేసుకున్న అవినీతినీ, రైల్వే ఉద్యోగుల లంచగొండితనాన్నీ ఎత్తిచూపుతూ ప్రయాణీకులు సిన్సియర్ గా ఉందామనుకున్నా పరిస్థితులను ఎలా ఎక్స్ ప్లాయిట్ చేస్తాయో తెలియజేస్తుంది. ‘సిన్సియారిటీ ఖరీదు’ (69). ఒకే అంశాన్ని రెండు వేర్వేరు శాఖలలో సమాజంలో పెచ్చుపెరిగిపోతున్న జాడ్యాలను ఎత్తిచూపి చాకచక్యంగా కథనాన్ని నడిపించారు రచయిత్రి.

ఇల్లరికపుటల్లుళ్ళ కథలు రెండు రాసారు సులోచన.  ఒకటి తమ కూతురు చనిపోతే ఆమె పిల్లల్ని చూసుకునేందుకు పేదింటి పిల్ల సరితను తెచ్చి తమ ఇల్లరికపుటల్లుడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ తమ కూతురు అనుభవించని సుఖాలూ, సౌభాగ్యాలూ సరిత అనుభవించటం భరించలేక అల్లుడు లేనప్పుడు ఆ పిల్లను దాసీకన్నా హీనంగా చూస్తుంది అత్త. అది గమనించిన అల్లుడు చంద్రశేఖరం ట్రాన్సుఫర్ చేయించుకుని అత్తకు దూరంగా తన కుటుంబంతో వెళ్తాడు ఓ తల్లి కథలో. రెండవ కథ ఇల్లరికపుటల్లుడులో తన ధనవంతుల ఇంటికి ఇల్లరికం వచ్చిన లక్ష్మీపతి ఎదుర్కొన్న అవమానాల గురించి రాస్తారు. మాదిరెడ్డి సులోచన గారి చాలాకథల్లో ఒకే అంశాన్ని బొమ్మాబొరుసుగా రెండు కథలుగా రాయటం ఆమెకు ఇష్టమైన విధానంగా అనిపిస్తుంది.

సమాజంలోని విభిన్న మనస్తత్వాలు కలిగినవారు స్త్రీలైనా పురుషులైనా వారి నైజంగానీ, ప్రవర్తనగానీ, స్పందించే తీరుగానీ ఒకేలా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలైనా, ఆస్తిపరులైనా, ధనానికి దాసోహులే స్వార్థం వారిని ఎటువంటి నేర ప్రవృత్తికైనా పురిగొల్పుతుంది. కాలం మారుతున్నా మానవ నైజంలో మారని విలువలు గురించిన కథలు మాదిరెడ్డి సులోచన కథలు.

స్త్రీలలో పఠనీయత పెంచి చైతన్యవంతుల్ని చేసే యజ్ఞంలా నాటి పత్రికలు యధోచితంగా రచయిత్రులను ప్రోత్సహించి నవలలు ప్రచురించాయి. అదేకోవలో వీరు కూడా నవలలు విస్తృతంగా రాసినా, పాఠకులను ఆలోచింపజేసే కథల్నీ సైతం రాసారు రచయిత్రి.

పాఠశాల, కళాశాల నేపథ్యంలో రాసిన చాలాకథలు కేవలం ఆంధ్రప్రాంతం, హైదరాబాదు, సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా పలు విదేశాలలో కూడా కథని నడిపించారు.   వేరే దేశాలలో ఉన్నా భారతీయులు అందులోనూ తెలుగువారి మనస్తత్వ విశ్లేషణ వారి ఆలోచనా విధానం ఎంత చదువుకున్నా మారని నైజం చిత్రించారు.

ఆడంబరమైన జీవితాన్ని ఆశించి, ప్రగతిపథంలో ఆధునికంగా ఆలోచిస్తున్నాననుకొని తనను తాను పతనం చేసుకున్న పద్మకి, అభ్యుదయ భావాలు గల రచయిత్రేకాక ఉపాధ్యాయినికి మధ్య జరిగే సంఘర్షణని చిత్రిస్తూ, ఎప్పటికప్పుడు పద్మని మంచిదారిలోకి మళ్ళించలేక అశక్తురాలు అయిన విధానం రాయటంలో రచయిత్రి నేర్పరితనం తెలుస్తుంది. ఆస్తిపాస్తులపై ఆశతో డబ్బున్న వయసు మీరిన వాడితో వెళ్ళిపోయి, మరింత పతనమైన పద్మని బ్రోతల్ కేసు నుండి బయటకు తెచ్చి చదివిస్తుంది ఆ రచయిత్రి. ఆ సందర్భంలో చీకటి చీకటి అని అరచేవారు సమాజ శ్రేయస్సు కోరేవారుకాదు. తన శక్తియుక్తులతో ఆ చీకట్లో చిరుదీపం పెట్టేవారు కావాలి. ప్రగతి, స్వేచ్ఛ అని పేరు కోసం ప్రాకులాడటానికికాక నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగాలి అనే నమ్మికని కథల్లో రచయిత్రి చాలాచోట్ల వ్యక్తపరుస్తుంది.

దోషులెవరు (1981)’ నలభై ఏళ్ళనాటి కథ ఇంటర్ బోర్డులోని నిర్లక్ష్యం, వైఫల్యం ఒక ప్రతిభ కల విద్యార్థి చావుకి ఎలా కారణం అయ్యాయో తెలియజేసే కథ. ఒక ఉద్యోగి రిటైర్ అయితే అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసినా చెప్పులరిగాకో, మరణించాకో పెన్షన్ వస్తే అందుకు దోషులెవ్వరు? అదేవిధంగా స్కాలర్ షిప్ ల విషయంలో కూడా లభ్యం కాకపోతే దోషులెవరు? ప్రభుత్వం అలసత్వమా, శాఖలోని ఉద్యోగులా ఎవరిని తప్పు పట్టాలి అనే ప్రశ్నలతో కొంత ఆవేదన, మరి కొంత ఆవేశంతో సమాజంలోని బాధ్యత పట్టించుకోని వ్యవస్థలపై గురిపెట్టి సంధించారు రచయిత్రి మాదిరెడ్డి సులోచన.

చదువుకున్న, ధనవంతుల అమ్మాయి శోభాదేవి(1976)’ సోషలిజాన్ని వంట పట్టించుకుని, తన యింటిలో పనివాళ్ళూ, యజమానుల మధ్య సమానత్వం సాధించాలని అనేక మార్పులు చేయాలని ప్రయత్నించి విఫలమవ్వటమేకాక తిరిగి ఆమె ఎదురు విమర్శలు ఎదుర్కొంటుంది. కష్టపడి సంపాదించుకునే అవకాశమిచ్చినప్పుడే శ్రమ విలువ, డబ్బు విలువ తెలుస్తుందనీ, అవసరాన్ని మించి దానాలు చేయటం వారిని సోమరులుగా తయారుచేయటమేననీ, అపాత్రదానం కూడదనేది తెలియజేసేలా సంఘటనల కూర్పుతో సహజసిద్ధంగా కథారచన చేసింది రచయిత్రి.

నైజీరియాలో ఉపాధ్యాయపోస్టుకి అప్లై చేస్తే, ఢిల్లీలో ఇంటర్వ్యూకి పిలుపు వస్తుంది. ఒంటరిగా నైజీరియాకి వెళ్ళటానికి సిద్ధపడిన దాన్ని ఢిల్లీ వెళ్ళటానికి భయపడటమేమిటని బయల్దేరింది కథానాయిక. ఆమెకి తెలిసిన ఢిల్లీ మిత్రులు ఊళ్ళో లేకపోవటంతో ఆ మిత్రులు ఆమె బాధ్యతను ఒకరికి అప్పగించుతారు. ఆమెని హోటల్ లో దింపేవరకూ సహాయం చేసిన వ్యక్తి తిరుగుబోతు వ్యసనపరుడని తెలుసుకుంటుంది కథానాయిక. అతనితో కలిసి అతనింటికి వెళ్ళి అనుమానం, నిరసన, అవమానానికి గురౌతుంది. తన తప్పేమీ లేకపోయినా అందరి నిరసన దృక్కులు ఆమెని బాధిస్తాయి. ఏ మనిషి అయినా తన పరిసరాలను బట్టీ, స్నేహితులను బట్టీ గౌరవింపబడతాడనే సత్యం ఆమెకు అవగాహన అవుతుంది తాడికింద పాలు కథలో.

అక్క సౌందర్యరాశి, చెల్లెలు అందవిహీన అయినప్పుడు చెల్లెలి మనస్సంక్షోభం తప్పెవ్వరిదికథ. ఇంటిలోనూ బయటా ఆఖరికి వివాహ వ్యవస్థలోనూ అనుభవించిన వివక్ష ఆమెను ఎలా దుర్మార్గురాలిని చేసిందో తెలుపుతుంది.

డబ్బు తోబుట్టువుల మధ్య కూడా మానవ సంబంధాల మధ్య ఎలా చిచ్చు పెట్టగలదో తెలియజేసే కథ డబ్బు. డబ్బు. డబ్బుమానవ జీవితం గురించి రచయిత్రి తనకు ఉన్న అవగాహనను పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసుకుంటూ, విస్తృతం చేసుకుంటూ అనుభవాల లోతుల్ని స్పృశిస్తూ రాసే రచయిత్రిగా మాదిరెడ్డి సులోచన కనిపిస్తుంది. మానవ దృక్పథాన్ని అనుసరించి సమస్య, సంఘర్షణ పరిష్కారం- ఈ క్రమంలోనే ఆమె కథలన్నీ తీర్చబడ్డాయి.

నిత్యజీవితంలో తెలియక చేసే పొరపాట్లు గానీ, క్షణికోద్రేకంలో జరిగే సంఘటనలు గానీ అన్యోన్య దాంపత్యాలను కూడా తలకిందులు చేస్తాయి. స్వార్థం, ధనాశ బాల్యమిత్రుల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తాయి. ఏ దేశంలోకి ఉపాధి కోసం వెళ్ళినా మానవ మనస్తత్వాలు, విధానాలూ మారవు. జీవితాల్ని ఆనందమయం చేసుకోవటానికి ఏ కుటుంబమైనా ఏ విధంగా సంయమనం సమకూర్చుకోవాలో, అదేవిధంగా స్నేహబంధం నిలవాలన్నా అదే ధోరణి అలవరరచుకోవాలనేది మాదిరెడ్డి సులోచన కథలలో బాధ్యత గల రచయిత్రిగా, ఉపాధ్యాయినిగా ఉద్భోధిస్తారు.

నిజానికి తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల సమాజంలో, ప్రేమాభిమానాలు ఉండాలి కానీ ఆడపిల్లలని ఎప్పటికైనా పరాయిదేననీ, తమని జీవితాంతం చూసుకొని తల కొరివి పెట్టే వాడనే దృష్టితో కొందరు మగపిల్లల పట్ల అతిప్రేమని ప్రదర్శిస్తారు. ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టినదే అయినా దేవయాని పట్ల వివక్ష చూపుతాడు తండ్రి. కొడుకుల ఉద్యోగరీత్యా దూరంగా స్థిరపడటంతో తండ్రి బాధ్యత దేవయాని స్వీకరించి ఎంత సేవలు చేసినా తనని పట్టించుకోకపోగా కొడుకులను తలచుకుని మురిసిపోయే తండ్రిని చూసి విరక్తి చెందుతుంది హక్కుకథలో దేవయాని. తనని ప్రేమించని తండ్రిని ఏ విధమైన హక్కుతో బాధ్యత పడాలి అనే నైరాశ్యానికి గురికావటం కథలో చక్కగా పాఠకులకు కనువిప్పు కలిగేలా దృశ్యీకరణ చేశారు రచయిత్రి.

చాలాకథలు  ఉత్తమ పురుషలోనే చెప్పటం వలన రచనలో వైయక్తిక ఛాయలు కనిపిస్తాయి. రచయిత్రి సందర్శించిన ఇథియోపియా, జాంబియా దేశాలలోని సామాజిక స్థితిగతులు, జీవన విధానం, అక్కడ స్థిరపడ్డ భారతీయులు అందులోనూ తెలుగువారి మానసిక ప్రవృత్తులు చర్చించబడతాయి. ఇతర వృత్తులకన్నా ఎక్కువగా మాదిరెడ్డి సులోచన చాలాకథల్లో ఉపాధ్యాయవృత్తికే ప్రాధాన్యం ఇవ్వటమేకాకుండా అందులో ఎదురైన సమస్యలనూ, ఒడిదుడుకులనూ అనుభవ పూర్వకంగా కథలలో ఒదిగించారు, పరిష్కార మార్గాలనూ సూచించారు.

రచయిత్రికి పూజలూ, వ్రతాల పట్ల నమ్మకం లేనట్లుగా, ఆమె కథలలో ఆయా చోట్ల రాసిన ప్రస్థావనలను చదివితే అనిపిస్తుంది. ‘హరివిల్లుకథలో కథానాయిక అమరావతిలో ఏర్పాటైన రచయితల సమావేశానికి వెళ్ళి అక్కడ తన పిన్నికూతురు సుగుణ ఇంటికి పలకరింపుకై వెళ్తుంది. సుగుణభర్త కథానాయికకు చాలాకాలం కిందట స్కూలులో సహ ఉపాధ్యాయుడు. అప్పటికే అతను గ్రంథసాంగుడు తప్పని పరిస్థితులలో ఒక పెద్ద వయస్సామెని పెళ్ళిచేసుకుంటాడు. అప్పట్లో ఒకసారి వాళ్ళింటికి పేరంటంకి వెళ్ళిన కథానాయిక అక్కడ అమ్మలక్కల కబుర్లకి చికాకు పడి వెళ్ళిపోబోతుంటేవరలక్ష్మీ వ్రతంకి వచ్చి తాంబూలం తీసుకోకుండా వెళ్ళకూడదుఅంటుంది ఆమె. దానికి కథానాయిక నాకా నమ్మకాలు లేవనివెళ్ళిపోతుంది. అదేవిధంగా పూజలంటే తప్పించుకు తిరుగుతానుఅనే అర్థంతోని సంభాషణలు కూడా వేర్వేరు కథల్లో కనిపిస్తాయి. హేతువాదదృక్పథం కల రచయిత్రి అనే భావన కలిగించిన మాదిరెడ్డి సులోచన దెయ్యం కథల్ని రెండింటిని రాయడం విశేషం!

బీరూట్ లోని కోరల్ బీచిలో కొన్ని క్షణాలుకథలో బీచిలో పర్ష్యన్ అందగత్తెతో అనుభవం తలచుకొని కథానాయకుడు ఆనంద్ తన్మయుడైన సమయంలో ఆ అందగత్తె పదేళ్ళ క్రితమే చనిపోయిందని కథగా మిత్రుడి ద్వారా తెలుసుకుని, అదంతా భ్రాంతేనా అని నివ్వెరపోతాడు. ఇదేవిధంగా మరో కథలో మిత్రులతో ఒక గుడికి వెళ్ళి తనకు గుడిలోకి వెళ్ళే ఆసక్తి లేదని వాళ్ళని దర్శనానికై లోనికి వెళ్ళమంటాడు కోనేరు గట్ల మీద కూర్చున్న కథానాయకుడి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తనకు ముసలివాడితో వివాహం చేస్తున్నారని తాను మరొక వ్యక్తిని ఆరాధిస్తున్నానని తన కథంతా చెప్పుకొని వెళ్తుంది. అంతలో తిరిగి వచ్చిన మిత్రులు అదే కథని స్థల పురాణంగా చెప్పి ఆ అమ్మాయి కోనేరులో దూకి దేవతగా మారిందని చెప్పుకుంటారు. దాంతో ఆ కథానాయకుడు తనతో ఇంత సేపూ మాట్లాడినది గుడిలో దేవతా అని ఆశ్చర్యపోతాడు. ఈ రెండు కథలలోనూ దెయ్యం, దేవతల కథగానే చెప్పినా దైవభావన గురించి దైవచింతన గురించి హేతువాద భావ ప్రకటన గల సంభాషణలతోనే కథంతా చర్చింపబడుతుంది.

రచయిత్రి కథలలో వాదాలేవీ స్పష్టంగా లేకపోవచ్చు కానీ కొన్ని కథలలో సూచనప్రాయంగా కథానాయిక జీవితం, సంఘటనలూ, అభిప్రాయ ప్రకటనలోలను మహిళా సాధికారతగల పాత్రగా చిత్రిస్తారు. కథానాయికలందరూ విద్యావంతులు, ఉద్యోగస్తులు, రచయిత్రులు కావటం వలన ఆనాడు అప్పుడప్పుడే సమాజంలోనూ, సాహిత్యంలోనూ మొలకలెత్తుతున్న స్త్రీ చైతన్యస్ఫూర్తి మహిళా పాత్రలన్నింటా గోచరిస్తాయి.

ఒక సందర్భంలో ‘‘సాహిత్యంలో మానవత్వాలు, వాస్తవికత హేతుబద్ధమైన దృక్పథం పెరగాలని మాదిరెడ్డి సులోచన అంటారు.

మాదిరెడ్డి సులోచన 1965-83 మధ్య స్వల్పకాలంలోనే అంత విస్తృతంగా, అన్ని రచనలు చేయటం తన సమకాలీన రచయిత్రులలో పోల్చి చూస్తే ఒక రికార్డుగానే పరిగణించాలి. ఒకవైపు దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ఉపాధ్యాయ ఉద్యోగ బాధ్యతలలో తలమునకలుగా ఉండటం, మరోవైపు కుటుంబ బాధ్యతల మధ్య ఒత్తిడులను అధిగమిస్తూ రెండు దశాబ్దాల కాలంలో పాఠకులను అలరించేలా రెండు మూడు పత్రికలలో ఒకేసారి ధారావాహికలనూ, అంతే విస్తృతంగా కథలనూ రాయటమనేది అంత సులభ సాధ్యమేమీ కాదు.

1978లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పురస్కారంగా పొందిన మాదిరెడ్డి సులోచన 1984లో వారి యింటిలో వంటగేస్ దుర్ఘటనలో తమ భర్తతో సహా భౌతికంగా దూరమైనా, వారి కలం నుండి మరిన్ని రావలసిన రచనలు చేజారిపోయినా, సుమారు ముప్పై ఏళ్ళు గడిచినా వారి రచనలు పాఠకుల హృదయాలలో పదిలంగానే ఉన్నాయి.

 

జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం

ఒక రచయిత ఎన్ని ప్రక్రియలలో రచనలు చేసినా, పరిశోధనలు చేసినా అతని సాహిత్యంలోని ఒక ప్రక్రియతోనే ఆ రచయిత (త్రి) గుర్తింపు సాధిస్తారు. కాని నాయని కృష్ణకుమారి వ్యాసం, యాత్రాచరిత్ర, కథలు, జానపద గేయ కథలు వంటి అనేక సాహిత్యప్రక్రియలతో అక్షరయాత్ర కొనసాగించినా ఆమెని ప్రధానంగా జానపదసాహిత్య పరిశోధకురాలని విద్యారంగంలోని వారు గుర్తిస్తారు. కానీ సాహిత్యరంగంలో మాత్రం కవయిత్రిగా, కాశ్మీరదీపకళిక వంటి యాత్రా చరిత్ర రాసిన తొలి రచయిత్రిగా గుర్తిస్తారు. 

బాల్యంనుండీ తండ్రి నాయని సుబ్బారావుగారి వలన ప్రముఖ సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ సాహిత్యాభిలాషేగాక నిర్భయంగా నలుగురిలోనూ మాట్లాడటం నేర్చుకున్నారు నాయని కృష్ణకుమారి. తొలిరోజులనుండీ కూడా పరిశోధనాత్మక సాహిత్యరచనపట్ల మక్కువ పెంచుకోవటంవలన 18 ఏళ్ళ వయసులోనే ఆంధ్రుల చరిత్రని పరిశీలించిఆంధ్రుల కథఅనే పుస్తకం వెలువరించారు. తదనంతరంతిక్కన కవితావైభవంపై పరిశోధన మొదలుపెట్టి మధ్యలో ఆపేసిజానపద సాహిత్యంపై పరిశోధించి డాక్టరేటు పట్టా తీసుకున్నారు. అయితే సమాంతరంగా కవిత్వ రచన పట్ల ఆసక్తి ఉన్నా వృత్తిరీత్యా సమయాభావం వల్ల కావచ్చు- అగ్నిపుత్రి (1978), ఏంచెప్పను నేస్తం(1988), సౌభద్ర భద్రరూపం (2006) అనే మూడు కవితాసంపుటాలు మాత్రమే వెలువరించారు.

1960 నుండీ కవిత్వం రాస్తున్న కృష్ణకుమారి ఆనాటి కవయిత్రులకు భిన్నంగా సమాజ పోకడలను గమనిస్తూ, సామాన్య మధ్య తరగతి జీవుల పక్షాన నిలబడుతూ, కవితలు రాయటం గమనించవలసిన విషయం.  జానపద పరిశోధన ప్రభావం వలన కావచ్చు అచ్చమైన తెలుగు పారిభాషిక పదాలతోనే వీరి కవితలు సామాజిక స్వభావాన్ని పొదువుకొని వుంటాయి.

స్వాతంత్ర్యానంతరం కవిత్వంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కవులలో ప్రతిబింబించినా, సాహిత్యోద్యమాలలోని భావకవిత్వోద్యమం ఛాయలు ఎక్కువగా కవయిత్రులలో కనిపిస్తున్న సమయంలోనే కృష్ణకుమారి తనదైన శైలిలో రాస్తూ వచ్చారు.

అంతేకాక అదే సమయంలో సృజనాత్మకత కల మహిళామణులందరూ ధనమూ, కీర్తీ తెచ్చిపెట్టే నవలా రచన వైపు మొగ్గుచూపి నవలామణులుగా ప్రఖ్యాతి పొందేరు.

అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం అనంతరం కవుల కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. అదేకాలంలో కవిత్వ రచన మొదలుపెట్టారు నాయని కృష్ణకుమారి. అంతవరకూ సామాజిక, కౌటుంబిక పరిస్థితులకు కట్టుపడిన కవయిత్రులలో వైవిధ్యమైన, స్పష్టమైన గొంతుకను ప్రదర్శించిన తొలి కవయిత్రిగా కృష్ణకుమారిని పేర్కొనవచ్చు.

1960-78 వరకూ రాసిన కవితలనుఅగ్నిపుత్రిగా సంపుటీకరించారు.

‘‘వర్తమానాన్ని తిట్టుకుంటూ

నిస్పృహలో మునిగి తేలే

నీరవ మూర్తి కాదు నా కవిత

ప్రతి నీటి కణంలో తోచే

ప్రభాకర ప్రతిఘటనంలా

నా కవిత్వమంతటా

నమ్మకం అక్షరమై మెరుస్తుందిఅని ఆత్మ విశ్వాసంతో తన కవిత్వం గురించి చాటిచెపుతారు కవయిత్రి.

పాఠకుడి మనసుకి కవితాసౌందర్యం అందాలంటే కవికి సంబంధించిన అనుభూతిపరమైన వివరణను అందుకునేందుకు దోహదపడే ఆర్ద్రతా, మనోభావాలు, కవిత్వంలో ప్రతిఫలించాలి.

నాయని కృష్ణకుమారి స్వభావరీత్యా సాధుస్వభావి. అందుకే కాలక్రమేణా వచ్చే సామాజిక మార్పుల్ని ఆహ్వానిస్తారు, దుఃఖిస్తారు. కానీ మార్పుకోసం విప్లవ భావాల్ని కోరుకోరు.

చాలా కవితల్లో దైవమో, కాదో, ఉన్నాడో, లేడో అనే డోలాయమాన స్థితిలో అంతస్చేతనలో రాసిన చాలా కవితలు కనిపిస్తాయి. కానీ మూఢభక్తిని ప్రోత్సహించరు. ఆమె తన ముందుమాటలో కూడాదేవుడి విషయంలో ఇదమిత్తమనే భావన నాకింకా ఏర్పడలేదంటారు. అందుకే ఆమె వెతుకులాట కొన్ని కవితల్లో వ్యక్తమౌతుంది. 

చాపకింద నీరులా ప్రవహించే కాలప్రవాహంలోని మార్పుల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలని అభిలషించే కవిత్వం వీరిది. అందుకే

‘‘కాలం చెంగుల్ని పట్టుకొని

అతివేగంగా నడుస్తూనే

అగమ్యోహాల చిక్కుముళ్ళని

అతినేర్పుగా విప్పుకుంటాను’’- అంటారు.

కవిత్వమంటే జీవితమనీ, అనుభవాల తామరతంపరలనీ కవయిత్రి విశ్వాసం. పాఠకుల మనసులకు అందని సర్కసు ఫీట్ల కవిత్వాన్ని రాసి మెప్పు పొందే కవుల ఆధిపత్యాన్ని నిరసిస్తారు. చెప్పదలచుకున్న విషయాన్ని డొంక తిరుగుడుగా కాక సూటిగా చెప్పటం వీరి కవిత్వ లక్షణం.

‘‘నా కవిత్వాన్ని రూపు కట్టించదలచుకున్న భావంగా నేను కూడా రూపాంతరం చెందుతాను. అంతేకానీ భావాలకు ఆశ్రయభూతాలైన శబ్దాల్లోకి పరకాయ ప్రవేశం చేయను. కవిత్వంలో కవి మనస్సే కాక అతని చిత్తవృత్తి, అహంకారమూ, ఆర్ద్రతా, కాఠిన్యమూ వంటి లక్షణాల స్థాయి తెలిసినప్పుడు ఆ కవి కవిత్వము అర్థమయ్యే పద్ధతిలో వేరుగా ఉంటుందిఅంటారు నాయని కృష్ణకుమారి.

దూరం కొలతఅనే కవితలో కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తనీయకు అని పాఠకుడికి బోధించేందుకు అన్నట్లు పలు ఉదాహరణలు ఇస్తారు.

‘‘నీకూ నీ కోరికకూ మధ్య

దూరం ఎంత ఎక్కువైతే

అంతగా పెరుగుతుంది

అంతరంగంలో రాగం...’’అని చెప్తూనే-

‘‘కావలసినదానికంటే ఎక్కువగా

కామిత ఫలాన్ని ఒడిగట్టచూడకు’’ అని సలహా యిస్తూ – 

కొసమెరుపుగా-

‘‘ఇది నీకే కాదు

నీ పిల్లలకు కూడా పనికొచ్చే నిజం’’ అని ముక్తాయింపుని ఇస్తూ పిల్లల పట్ల అమితమైన ఆశలు పెట్టుకోవద్దని, అవి నెరవేరకపోతే కుంగిపోవలసి వస్తుందనే అర్థాన్ని ధ్వనింపజేస్తారు.

రాళ్ళు-పిచ్చివాళ్ళుఅనే కవితలో నేటి సమాజాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ 

‘‘ఎక్కడ చూసినా ఈ రోజుల్లో

పిచ్చివాళ్ళ చేతుల్లో పిడుగుల్లాంటి రాళ్ళు’’ అంటారు.

దైవం గురించి చాలా కవితల్లో ఉన్నాడో లేదో అనే వెతుకులాటతో సంశయాత్మకంగా రాసారు కవయిత్రి. అందులో ఒకటిగాలి పిడికిలిలో

‘‘గాలి పిడికిళ్ళ వేలంవెర్రికి

కొంటె నవ్వులు రువ్వుతూ

గుండెగుడిలో దీపంలా నువ్వు’’ అంటూ ప్రతీ మనిషిలోనూ గుండెల్లోనూ వెలిగే దీపమే దైవమని తీర్మానిస్తారు.

కొన్ని కవితల్ని మాత్రాఛందస్సు పద్ధతిలో పంక్తి చివర ప్రాసని పెట్టి ఒక లయతో నడిపారు. అవి ఆనాటి కవులైన శ్రీశ్రీ వంటివాళ్ళు తొలినాళ్ళలో రాసిన విధానాన్ని తలపిస్తాయి.

‘‘బ్రతుకు పాట ప్రిదిలి

కదులు బాట నొగిలి

శృతి చలించి

మతి భ్రమించి’’ అంటూ లయను పొదువుకొని సాగుతాయి. భరతమాతని హిమావృత శైలపంక్తి కిరీటంతో, వింధ్యాచల వడ్డాణంతో, గంగాయమున కంఠహారాలతో అలంకరించి అప్సరసలా ఉన్న దేశం ఈనాడు మామూలు స్త్రీలా పిల్లల చేతికి ఒకముద్ద అందించలేని పేద అమ్మగా మార్చేస్తున్న అదృశ్యహస్తాల్నీ వాటిని పడగొట్టాలని తపన పడ్తూ, మాత ముఖంలో వెలుగు కోసం హారతి కర్పూరమై కరిగిపోవాలని ఆరాటంతో ఆరు పేజీల సుదీర్ఘ కవిత అర్థవంతంగా మంచి పదచిత్రాలతో అక్షరీకరించారు కవయిత్రి.

సముద్రం, అగ్ని, జ్వాలా, శిఖలను కవిత్వ పంక్తులలో పొదుగుకొంటూ కాలాన్ని తన నెచ్చెలిగా భావించి తనలో లయింపచేసుకొంటూ సర్వ విషయాలూ కాలనెచ్చెలికి అర్థమయ్యేలా ఆమె చేయి పట్టుకుని ముందుకు తన గమనాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటూ పోతుంది అనే విషయాన్ని అనేక కవితల్లో  ప్రస్తావిస్తారు.

మరొక మంచి కవితమట్టి మనిషి’. బాల్యం నుండి మనిషికి మట్టితోగల అనుబంధాన్నీ, అమ్మకీ మట్టికీ గల సాదృశ్యాల్నీ, అభేధాల్నీ వర్ణిస్తూ

‘‘తొలకరింపు తడుపుకు

చిలకరించిన మట్టివాసనల చిక్కదనంలో

అమ్మవాత్సల్యపు కమ్మదనాన్ని’’- చెబుతారు

‘‘నన్ను కన్నతల్లి ఆంతర్యంలో

నా నేలతల్లి ఆధిక్యాన్ని కొలిచే

నేనింకెవరిని మట్టిమనిషిని’’ అని సామాజిక జీవనంలోకి మమేకమౌతారు.

సాధారణ పదాలతోనే కవితల్ని అల్లే నేర్పు బహుశా జానపద సాహిత్య పరిశోధనలవల్ల అలవోకగా అలవడింది. అలా రాస్తూ రాస్తూనే ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా భారీ సమాసాల్ని కవితలో చొప్పించేస్తారు. అంతకుముందు చదివిన కావ్యప్రభావం వల్ల అలాంటి పదగుంఫనలోకి వెళ్ళిపోతారు. అటువంటి వాటిలో కొన్ని ఉదాహరణలు-

  1. శాద్వలాంచల వాః కణాలకు మల్లె
  2. దురంత భీషణ క్రుధోద్విగ్న ప్రకృతి
  3. తీరస్థ పృధు శిలాగ్ర స్పర్శనం
  4. దుష్టచ్ఛేద నోన్ముఖ నిస్త్రింశిక వంటి పంక్తులు వారి కవితల్లో దొర్లడం కనిపిస్తుంది. 

అయితే అటువంటివి బహు తక్కువే.

ఏడున్నర పేజీలఊడలమర్రికవిత కొమ్మల నీడన గూటిలోని పక్షుల గాథను కథాత్మకంగా వర్ణిస్తారు. అటువంటిదే నాలుగన్నర పేజీలచౌరస్తా’. మరొకటి ఏడు పేజీలఅన్నదమ్ములుకవిత సంభాషణాత్మకంగా నడుస్తుంది. పగలంతా గిల్లికజ్జాలుతో అమ్మని సతాయించిన అన్నదమ్ములు రాత్రి కావలించుకొని పడుకున్న అన్నదమ్ములు స్వప్న వియద్గంగలో సేదతీరుతున్న శ్వేతయుగళంతా వున్నారంటూ అందమైన పదచిత్రాలతో కథన కవితగా రాసారు కవయిత్రి.

మరొక మంచి కవితహుసేన్ సాగర్లో-

‘‘చక్కని హైదరాబాద్ చూపించమని

సముద్ర పాప గగ్గోలు’’ పెడితే

అలల పిడికిళ్ళతో నీటిని విసిరితే

తీరిన కడలిముక్కే

నగర శరీరాన్ని హత్తుకున్న

సొగసైన హుసేన్ సాగర్ పాప’’ అంటూ హుసేన్ సాగరాన్ని కడలిముక్కగా పోల్చిన తీరు చక్కటి పంక్తులుగా తీర్చారు. ఈ కవిత నిండా మబ్బుపిల్లలు తారట్లాడుతారు. నేలతల్లి తన ఒడిలో అమర్చుకున్న నిర్మలమైన అద్దం బిళ్ళగా హుసేన్ సాగరాన్ని పోల్చుతారు. అంతటి నిర్మల కాసారాన్ని ధ్వంసం చేస్తోన్న గుర్రపు డెక్కల మొక్కల్ని గురించీ వాపోతారు కవయిత్రి.

సాధారణంగా భావకవిత్వచ్ఛాయలున్న కవులు వెన్నెలతోను, పూలతోనో, మలయపవనంతోనో మమేకమౌతారు. విప్లవ కవులు సూర్యుని తోనో, జ్వాలలతోనో పోల్చుకుంటారు. కానీ కృష్ణకుమారి గారు మాత్రం-

మనిషికీ మనిషికీ మధ్య

కనీ కనపడని

ఎర్రడాలు మనసు మంటల్నీ

దయ్యంలా అసూయని పెంచే

మానవత్వం మసిచేసే మంటల్నీ

కన్నెర్రని మంటల్నీ ఆర్పే

బొగ్గుపులుసు గాలిని’’ అంటారు కవయిత్రి.

ఎప్పుడూ మనిషి అంతరంగ దర్శనం చేస్తూనే అతని బాహ్య జీవన విధానాన్ని సరిపోల్చుతూ కవిత్వీకరించడం ఈ కవయిత్రి సాహిత్యలక్షణం. అందుకే ఆమెచింతలూ, చికాకులూ, నిరాశలూ, దురాశలూ, కష్టాలూ, కన్నీళ్ళూ, సుఖాలూ, సంతోషాలూ, సంతృప్తీ, త్యాగరక్తీ వంటి సమస్త పార్శ్వాలూ రంగరించుకొని రూపెత్తిన సగటు మనిషే నా కవిత్వమంతటా విశ్వరూపావిష్కరణంగా ఉండాలనుకుంటాను’’ అంటారు.

నాయని కృష్ణకుమారి గారి తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేసే క్రమంలో వైద్యురాలిగా పరిచయమై హృదయానికి దగ్గరైన ఆత్మీయ మిత్రురాలైన డా. పి. శ్రీదేవి మరణవార్త (1962)విని ఆర్ర్దంగానే కాక ఆత్మీయ స్పర్శను నింపుకున్న స్మృతిగీతం ‘‘ఏం చెప్పను నేస్తం’’ కవిత-

‘‘నీవు మామధ్యను లేనందున / మాకు వెలితి!

నీ కలం కథలుగా మారనందున /తెలుగు కథలకే వెలితి!’’

అంటూ ఆద్యంతాలకి అందకుండా ఆవేశకావేశాలు పట్టని ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకోగల అంతర్గతంగా శక్తిశాలిని యైన డా. పి. శ్రీదేవికి ఆత్మీయంగాఏం చెప్పను నేస్తంకవితాసంపుటిని అంకితం ఇచ్చారు కృష్ణకుమారి.

ఈ సంపుటిలోని కవితలన్నింటా సమాజంలో పెచ్చరిల్లుతున్న హింసా, ఆర్థిక అసమానత, విద్యారాహిత్యం, కులమత ప్రాంత విద్వేషాలూ, ఇలా సమాజాన్ని కుదిపేసిన పలు సమస్యల్ని గుదిగుచ్చి రాసిన ఆరేడు పేజీల పెద్ద కవితలే ఉన్నాయి. అంతవరకూ ఉగాది సమ్మేళనాల్లో మామిడిపూతలూ, కోయిల పాటలూ, చెరుకు, మామిడుల రుచులూ వీటితో కోమల కవిత్వాన్ని వినిపించే కవి సందర్భాలలో కృష్ణకుమారి సామాజిక సమస్యలవైపు దృష్టి సారించి అరవయ్యో దశాబ్దంలోనే కవిత్వీకరించటంలో రచయిత్రి సామాజిక దృష్టి కోణం తెలుస్తోంది.

ఇంద్రధనస్సులోని రంగుల్లా విభిన్న అంతరాలు వున్న జనాల్ని ఈ ఉగాదైనా ఒక్కటిగా చేస్తుందా అనే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ జనంలో పొడచూపుతున్న అనేకానేక వైరుధ్యాల గురించీ, పెచ్చుపెరుగుతోన్న హింసాప్రవృత్తుల గురించీ, అంతకంతకూ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పేదల గురించీ, అక్షరాల్లో పొదుగుతూ వాపోతారు కవయిత్రి.

దేవుని అస్తిత్వాన్ని నిర్ధారణ చేసుకోలేని సంశయంలోమృత్తికాతృష్ణకవితలో మట్టికీ మనిషికీ గల అవినాభావ సంబంధాన్ని వివరించే క్రమంలో నగర రోడ్లు విశాలం చేయాలనుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే మతాలయాల గురించి నిరసిస్తారు.

‘‘సామాన్యుని బతుకుని బాగుచేయమని

అడ్డమైన దేవతల్నీ

అడుక్కుంటున్న తరుణంలో

కనురెప్పలమీది నీలితెరల్ని లాగి

వెలుగుసూదుల్ని గుచ్చుతుంది

ఉగాది ఒయ్యారి’’ అని మూఢభక్తిని నిలదీస్తారు.

1969లో వచ్చిన ఉద్యమ నేపథ్యం వలన కాబోలు తెలుగు భాష గురించిన కవితల్లో మాతృభాషాభిమానాన్ని వెల్లడించడమే కాక అందరం ఒక భాషామతల్లి బిడ్డలమేనని తెలుగు కవిత్వం సార్వజనీనత్వాన్ని అభిలషిస్తూ కొన్ని కవితలను రాసారు. 

మొదటి కవితాసంపుటి తన తండ్రి నాయని సుబ్బారావుకి అంకితమిచ్చిన కృష్ణకుమారి సుమారు పాతికేళ్ళ తర్వాత రాసినసౌభద్ర భద్రరూపంగా శోభనిచ్చే చిరునవ్వుతో ఆర్తులైన వారినందరినీ, ఆత్మీయంగా అభిమానించే తల్లి భద్ర రూపాన్ని తలచుకుంటూ తల్లికే అంకితమిచ్చారు.

ఇందులోని చాలా కవితల్లో తన బాల్యాన్ని తలపోస్తూ, ఆ సమయంలో ప్రేమగా హత్తుకునే తల్లిని గుర్తుచేసుకొన్నారు కవయిత్రి.

‘‘పెను ప్రపంచంలోకి నన్ను

నిర్దాక్షిణ్యంగా విసిరేసి

మూసుకుపోయిన నీ గర్భ ద్వారం’’అంటూ తన పుట్టుకని గుర్తు చేసుకుంటూ, చల్లటి స్పర్శలా చాచిన చేతుల మధ్య ఒదిగిపోయి ఆమె గుండెమీద గువ్వపిట్టైనప్పటి దృశ్యాల్నీ దూదుంపుల్లా, తొక్కుడు బిళ్ళాట నాటి ఉత్సాహాన్నీ అక్షరబద్ధం చేసారు. ఈ క్రమంలో ప్రకృతినంతటినీ తల్లీబిడ్డలుగా వర్ణించటం గమనార్హం. బద్దకంగా పడుకున్న కొండలు చెట్లచేతులు చాపాయంటారు. ఆకాశం భూమిపిల్లను సందిట పొదువుకుందంటారు. రెక్కలు మొలిపించుకున్న పులుగుకూన /శ్రమించి కట్టిన గూడును దాటి ఎగిరిపోయి రాబందుల పాలౌతుందేమోనని దిగులుపడతారు.

‘‘నేలతల్లి నిర్భర వక్షాన

తల్లిని కరచుకున్న పిల్ల పోలిక

పల్లవించిన అడవి!’’ని దర్శిస్తారు ఈ విధంగా అంతటా మాతృదర్శనాన్ని వీక్షిస్తున్న కృష్ణకుమారిగారు తన జీవన సంధ్యలో ముందుకు వేస్తున్న ప్రతీ అడుగూ మృత్యువు వైపుకు కాదంటారు. తనవెనక ఘనీభవించిన కాంతిసముద్రం వైపు, దాంట్లో వటపత్రశాయి లాంటి బాల్యంవైపూ, తన పుట్టుకకు కారణమైన గర్భద్వారంవైపు ప్రయాణించి తిరిగి తల్లి గర్భగూడులో గువ్వపిట్టలా ఒదిగిపోవాలని కలగంటారు కవయిత్రి.

తొలి సంపుటిలో దైనం గురించి డోలాయమానంగా ఉన్న కవయిత్రి  ఈ సంపుటి చివరి మూడు కవితల్లో  దైవాన్ని నిర్ధారించుకుంటారు.

తిరునామం కింద కళ్ళకలువల్నీ, విశ్వరూప చమత్కారానికీ, ఉక్కిరిబిక్కిరై, ఊపిరందని చేపపిల్లలా ఎగసిపడుతూ తలంచుతున్నానని అంటారు.

ప్రతి కవితనీ ఒక సామాజిక బాధ్యతతో, సమసమాజ భావనతో, మానవీయ దృక్పథంతో రాసారు కవయిత్రి. అనేకచోట్ల మట్టినీ, నేలనీ, దేశాన్నీ, మాతృభాషనీ, తల్లితో పోలుస్తూ మాతృభావనని అనేక కవితల్లో కవిత్వాన్ని అమ్మగా రూపుదిద్దారు నాయని కృష్ణకుమారి.

మూడు నాలుగు దశాబ్దాల పాటు అనేక సాహిత్య ప్రక్రియలతో పాటూ కవిత్వానికి నిర్భయాన్ని అద్ది ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులలో సైతం తనదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ విదుషీమణిగా కవిత్వ పతాకాన్ని ఆవిష్కరించిన కవయిత్రి నాయని కృష్ణకుమారి.

 

 

 

 

 

 

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు