మా రచయితలు

రచయిత పేరు:    వి శాంతి ప్రబోధ

కథలు

తనకోసం తాను 

ఉదయం ఆరుగంటలకే కాలింగ్ బెల్ మోగడంతో  ఏమిటీరోజు పనిమనిషి పద్మ అప్పుడే వచ్చేసిందే అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది మాధురి.  
ఎదురుగా  చెల్లి మాలతి.  
ఆమెకేసి కళ్లింతవిచేసుకుని విస్మయంగా చూసింది.  "ఏంటే ఉరుముల్లేని పిడుగులా  ఊడిపడ్డావ్.  రాత్రి మాట్లాడినప్పుడు కూడా వస్తున్నట్టు  చెప్పనేలేదు" చెల్లి చేతిలోని బ్యాగ్ చూసి ఆశ్చర్యంగా అడిగింది మాధురి. 
"ఏం.. నీ ఇంటికి రావడానికి కూడా ముందు చెప్పి పర్మిషన్ తీసుకుని రావాలా ..?" దబాయిస్తూ ఎదురు ప్రశ్న వేసి బాత్రూంలోకి దూరింది మాలతీ. 
 
మొహం కడుక్కొచ్చిందేమో ఆమె మొఖమంతా తడితడిగా ఉంది. ఆ తడి చీర చెంగుతో అద్దుకోవడం చూసి టవల్ అందించింది మాధురి. 
అక్కచేతిలోని టవల్ అందుకుని మొఖానికి అడ్డుకుంటూ  "అక్కా .. నాలో ఏమన్నా మార్పు కనిపిస్తోందా"  అకస్మాత్తుగా సూటిగా అక్క మొహంలోకి చూస్తూ అడిగింది.  

దబ్బ పండులా మిసమిసలాడుతూ ఉండే చెల్లి ఇలా వేలాడిన తోటకూరలా  అయిపోయిందేమిటి?  మనసులో అనుకుంటూ కిచెన్లోకి నడుస్తూన్న మాధురి ఆగిపోయి చెల్లినే  అయోమయంగా  చూస్తూ   "అదేం ప్రశ్నే ...."  అంది కానీ .. పాలిపోయినట్లున్న చెల్లెల్ని చూస్తే దిగులేసింది.  

"అమ్మా,  నీలో చాలా మార్పు వచ్చింది. నువ్వు  ఇదివరకటి మా అమ్మలాగా లేవు. 
నీలో కోపం, ఆవేశం, అసహనం  తొందరపాటు పెరిగిపోయాయి. నువ్వు చెప్పింది వినకపోతే వెంటనే వైల్డ్ గా  రియాక్ట్ అవుతున్నావ్  " ఒక్క క్షణం ఆగి,  అయోమయంగా చూస్తున్న అక్కనే చూస్తూ "ఈ మాట నాది కాదు. స్నేహాది. దాదాపు రోజూ ఈ మాట నాకు దానినోట వినిపిస్తోంది. అక్క చెప్తున్నది నిజమేనంటాడు సౌహార్ద్. నీ మరిదిదీ వాళ్ళ మాటే. కాకపొతే స్నేహ చెప్పినట్లుగా పదే పదే ఆ విషయం చెప్పరు.  అంతే తేడా" లోపల నిక్షిప్తమైన అగ్నిపై నవ్వు పూత పూస్తూ అన్నది మాలతి. 
 
చెల్లెలు నవ్వుతూనే చెప్పినా ఆ నవ్వులో జీవం ఉన్నట్టనిపించలేదు మాధురి  కళ్ళకి.  ప్రశాంతంగా ఉండేందుకు, దిగులు మేఘాల్ని తరిమేసేందుకు శతవిధాలా ప్రయత్నం చూస్తూ మాలతి.  

చెల్లెలి కుటుంబంలో ఏదో జరిగింది. ఆమె మనసును బాగా గాయం చేసేదేదో జరిగింది.  లోలోన అగ్నిగుండాలే బద్దలవుతున్నట్టుగా ఉంది.  పైకి కన్పించనీకుండా పెదవులపై నవ్వులు పులుముకుని మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. 
ఇద్దరమూ ఉండేది ఇదే సిటీ లో, చెరో మూల ఉత్తర దక్షిణాల్లా... ఎప్పుడూ ఇంత ప్రొద్దున రాలేదు.  వచ్చినా వాళ్ళాయనతోనే వస్తుంది. 
ఇప్పుడిలా బాగ్ తో వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్న మాధురి "నీకేమనిపిస్తోంది ?" చెల్లికేసి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుప్రశ్న వేసింది. 
 మొహంలో మారుతున్న భావాల్న, రంగుల్ని కన్పించనీకుండా నొక్కిపెట్టిన పెదాల్ని వదిలి "ఏమో...  నాకేమయింది .. మామూలుగానే ఉన్నాగా .. "అంటూ భుజం ఎగురవేసి అక్కకేసి చూసే ధైర్యం చేయలేక కిందకి చూస్తూ అన్నది.  
ఆ వెంటనే, "అయ్యో ఫోన్ ఎక్కడ పెట్టాను .. "అని వెతుక్కోవడం మొదలుపెట్టింది మాలతి. 
ఆమె ఫోన్ కి రింగ్ చేసింది మాధురి. 
"ఓ ఇక్కడే ఉంది" అంటూ ఫ్రిజ్ పై నుండి మొబైల్ చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నది మాలతి.  
ఉదయపు నీరెండ మీదపడుతుండగా "వాళ్ళు అన్ని సార్లు చెబుతున్నారంటే నిజంగానే ఏమన్నా తేడా వచ్చి ఉంటుంది . పెద్దవాళ్ళం అవుతున్నాం కదా .. మార్పులు సహజమే .. వచ్చాయేమో .." సాలోచనగా అన్నది మాధురి 
"లేదక్కా .. చూడు నేను మామూలుగానే ఉన్నాగా .. 
నువ్వేమన్నా చెప్పు.. నా కయితే వాళ్ళ మాటల్తో నన్ను పిచ్చి దాన్నిగా మారుస్తున్నారనిపించింది" గొంతులో జీర అడ్డుతగులుతుండగా  అసహనంగా లేచి నిల్చుని అటూఇటూ కదులుతూ అన్నది మాలతి 
చెల్లెలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి తట్టుతూ ఆమె చేతిని పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది మాధురి.  ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఒక్కసారిగా బావురుమంది మాలతి .  చెల్లెలు అట్లా ఏడుస్తుంటే మాధురికీ  దుఃఖం పొంగుకొచ్చింది. 
అందర్లోకి చిన్నది మాలతి. చాలా గారాబంగా పెరిగింది. పెళ్ళై అత్తింటికి చేరాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కష్టాలు పడింది. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. ఏనాడూ నోరు తెరిచి తన కష్టాన్ని, బాధని చెప్పుకోలేదు. ఇట్లా గుండెపగిలి ఏడవను లేదు.  ఇప్పుడేంటి అంతా సుఖంగా, సజావుగా సాగిపోతున్న వేళ.. కొద్దీ క్షణాల తర్వాత తనను తాను సముదాయించుకుని చెల్లెలి బాధకి, దుఃఖానికి మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడింది మాధురి. 
" ఛ .. ఛా .. ఏమిటే ..మరీ  చిన్న పిల్లల్లా .. ఆ పిచ్చిమాటలేంటి ? " చిరుకోపంతో కసురుతూనే చెల్లెలి తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది.  
అక్క  మొహంలోకి లిప్తపాటు అలా చూసి దీర్ఘశ్వాస వదిలి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు ఒత్తిగిలింది మాలతి. 

"మాలతీ ... నువ్వు ఏదో బాధలో ఉన్నవని నాకు అర్ధమవుతున్నది .  అదేంటో ఈ అక్కదగ్గర కూడా చెప్పుకోలేవా .. అక్క నీకంత పరాయిదై పోయిందా .. " నిష్ఠురమాడింది మాధురి. ఆ విధంగానైనా చెల్లిలోపల మరుగుతున్నదేదో బయటికి వస్తుందన్న ఆశతో . 
ఆ తర్వాత " అక్కాచెల్లెళ్ల బంధానికి అర్థమేముంది .. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడవ్వకపోతే.. 
అమ్మ ఉంటే అమ్మకి చెప్పుకునేదానివి కాదా .. అమ్మ తర్వాత ఆ బాధ్యత నాదే కదా .. " చెల్లెలి తల నిమురుతూ అనునయిస్తూ అన్నది మాధురి. 

ఆ తర్వాత నెమ్మదిగా "నాకెవరున్నారు .. నువ్వు తప్ప .. అందుకేగా .. అక్కడ ఉండలేక నీదగ్గరకొచ్చింది "  వెక్కుతూనే అన్నది మాలతి 
"నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే స్నేహ పని .  నువ్వు మాట్లాడింది ఇది తప్పు . అది తప్పు . 
ఇలా కాదు అలా మాట్లాడాలి. అలా ఉండాలి. ఇలా చెయ్యాలి అంటూ ఎప్పుడూ నాలో తప్పులు వెతకడం ...  నాకు క్లాసులు పీకడమే దాని పని అయిపొయింది. 
ఒకటి అని మరోటి  చెప్తున్నావ్ ..అంటుంది ఒకసారి . అడిగిన దానికి సూటిగా చేప్పకుండా  చుట్టూ తిప్పి ఏదేదో చెప్తున్నావ్  అంటూ విసుక్కుంటుంది మరోసారి.  
పిల్లలిద్దరూ నాతో  మాట్లాడేదే తక్కువ.  
ఎప్పుడయినా ఏదైనా మాట్లాడితే నా మాటల్లో ఎప్పుడూ తప్పులెన్నడమే, పూచిక పుల్లలాగా తీసిపడెయ్యడమే వాళ్ళ పనయిపోయింది .  సూటిగా జవాబులు చెప్పట్లేదు అంటుంది. 
నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. ఏమి తప్పులు తీస్తారోనని.  
వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఏదో తత్తరపాటు. పదాలు తొందరగా గుర్తురావు. ఒకటి అనబోయి ఒకటి అనేస్తున్నాను.  అది నాకూ తెలుస్తోంది. 
ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.  ఎక్కడలేని దిగులు వచ్చేస్తోంది. నిద్ర పట్టడం లేదు. ఒంటరితనం భరించలేకపోతున్నా. నిండా యాభైఏళ్లు లేవు. 
ఇప్పుడే నా పరిస్థితి ఇట్లా ఉంటే .. 
భవిష్యత్ ఇంకెంత భయంకరంగా మారుతుందో..  తలుచుకుంటే విపరీతమయిన ఆందోళన కలుగుతోంది. 
నిద్రలేక నీరసం .. చేసే పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా .. 
ఒక్కోసారి పిల్లల్ని ఏమనలేక నన్ను నేనే హింసించుకోవడం లేదా నా కోపమంతా పనిమనిషిమీద చూపడం జరుగుతోంది. 
అమ్మ కేమయింది ఉత్తగానే అరుస్తుంది. ఇట్లా అయితే ఈ ఇంట్లో పనిచేయడం నా వల్లకాదని అల్టిమేటం ఇచ్చింది పనిమనిషి. 
బయట ఎవరూ  ఇంతవరకూ నాతో పిల్లలు చెప్పినట్లు చెప్పలేదు.  
ఆ మాటే అంటే  బయటివాళ్లేందుకు చెప్తారు. నీ వాళ్ళం కాబట్టి, నీ మంచికోరేవాళ్ళం కాబట్టి మేం చెబుతాం అంటుంది స్నేహ.  
ఆలోచిస్తే అదీ నిజమే అనిపిస్తుంది " చేతికున్న ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ మాలతి అంతరంగాన్ని అక్కముందు  పరిచింది.  
"అంటే .. స్నేహ  అంటున్నట్లు నిజంగా నీవు కూడా ఫీలవుతున్నావా .. నీలో మార్పు వచ్చిందని"  చెల్లెలి కళ్ళలోకి గుచ్చ్చి గుచ్చి చూస్తూ అడిగింది మాధురి. 
"ఏమోనే .. అదే నాకేమీ అర్ధం కావడం లేదు" కొన్ని క్షణాలాగి  మళ్ళీ తానే 
"పరిస్థితులను బట్టి, మారుతున్న వయసును బట్టి  నా భావోద్వేగాల్లో తేడా వస్తే వచ్చి ఉండొచ్చునేమో .. .  
ప్రశాంతమైన జీవితం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు. ప్రతివారికీ ఏదో ఒక ఆందోళన, వత్తిడి ఉంటుంది కదా ..  
ఈ మధ్య నేను ఒంటరినైపోయినట్లుగా అన్పిస్తోంది. ఏం మాట్లాడినా పిల్లలది, వాళ్ళ నాన్నది ఒకే మాట. నన్ను వేరు చేసేస్తున్నారు . నేను పిలిస్తే ఒక్క అంగుళం కదలరు. పలకరు. అదే వాళ్ళ నాన్న పిలిస్తే ఏంటి నాన్నా..  అంటూ వెంటనే రెస్పాండ్ అవుతారు.   
నేనంటే గౌరవం లేదు . నాకూ , నేను చేసే పనికీ  విలువేలేదు.  
అటువంటి చోట నేనెందుకు ఉండాలి .. ఎన్నోరోజుల నుండి ఈ ప్రశ్న నన్ను వేధిస్తున్నది .. 

చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారు. ప్రతిదీ నాతో పంచుకునే వారు. అప్పుడు వాళ్ళకి అమ్మే లోకం.  ప్రపంచపు రంగులు తెలియని అమాయకత్వం. 
ఇప్పుడు వాళ్ళ ప్రపంచం పెద్దదైపోయింది. రంగు రంగుల లోకం ఇరవైనాలుగు గంటలూ ఇంట్లో ఉండే అమ్మకి ఏమి తెలుసూ .. ఏమీ తెలియదు. 
అందుకే  వాళ్ళప్రపంచంలో అమ్మ స్థానం ఏమూలనో ... రంగువెలిసిన బొమ్మలా ..   
వాళ్ళ నాన్నసంపాదనకోసం, స్నేహితుల కోసం బయటి ప్రపంచంలో నలుగురితో తిరిగొస్తారు.  ఆయనకు చాలా విషయాలు తెలుసు. లోక జ్ఞానం తెలుసు అనుకుంటారు. అన్నిటికంటే ముందు తమకోసం కావలసినన్ని డబ్బులు ఇస్తారుగా అందుకే అయన ఏమి చెప్పినా వాళ్ళకి వేదవాక్కు. 
వాళ్ళ దృష్టిలో నేనో కరివేపాకు.. ఇంకెందుకే .. నేనింకా ఆ ఇంట్లో ఉండడంలో అర్ధముందా .. చెప్పక్కా.. 
వాళ్ళ పద్దతి చూస్తే .. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది ...  " హృదయంలోని బాధ వడిపెడుతుండగా లేని నవ్వు పెదవుల చెదరనీకుండా అక్క కళ్ళలోకి చూస్తూ  అన్నది మాలతి  
"అలా ఎందుకనుకుంటావే .." అనునయంగా అన్నది మాధురి 
"ఏం ఎందుకనుకోకూడదు ..? 
అయినా ..  నీకేం తెల్సు .. వాళ్ళ ప్రవర్తన .. రోజూ నేనెంత వ్యధకు, రంపపుకోతకు గురవుతున్నానో .. వాళ్ళు చేసిన గాయాలు ఎలా సలుపుతుంటాయో..  ఎన్ని సార్లు నాలో నేను ఏడ్చుకుంటూ ఉన్నానో ..
ఇన్నాళ్ళు నన్ను నేను సమాధాన పరుచుకుంటూ వచ్చా.. గాయానికి పై పై పూత పూసుకుంటూ వచ్చా .. ఇక నా వల్లకాదు" గబగబా చెప్పింది. 

ఆ వెంటనే "నీకూ తెలుసుగా .. మా పెళ్లినాటికి సతీష్ కి సరైన ఉద్యోగమే లేదాయె. నా ఉద్యోగంతోనే కదా సంసారాన్ని నడుపుకొచ్చింది. ఆ తర్వాత తనకి మంచి ఉద్యోగమే వచ్చినా టూరింగ్ జాబ్. ఇంట్లో ఉండేది తక్కువ . అన్నీ నేనే చూసుకునేదాన్ని కదే ...చివరికి వాళ్ళ అమ్మానాన్నలు .. చెల్లెళ్ళ పురుళ్ళు  అన్నీ నేనే కదే చేసింది .. " చెల్లెలు తన ధోరణిలో చెప్పుకుపోతూన్నది.  

నిజమే, చాలా ఇబ్బందులు పడింది. గుట్టుగా సంసారాన్ని ఉన్నంతలో బాగానే లాక్కొచ్చింది.  కానీ ఏనాడూ ఇట్లా బయటపడలేదు.  అన్ని ఒత్తిళ్ళనీ తట్టుకుని నిలబడింది.  గడ్డుకాలం దాటిపోయింది. హాయిగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడేమిటో.. సమస్య 
మధ్యలో సతీష్ ఆరోగ్యం దెబ్బతిని ఉద్యోగాన్నిహెడ్ ఆఫీసుకు మార్చుకున్నాడు.  
పిల్లలూ కాలేజీలకు వచ్చారు. తాను డాక్టర్ కావాలని కలలు కని ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేకపోయిన సతీష్ కి తన కొడుకు డాక్టర్ కావాలని కోరిక. అందుకోసం చెల్లెలు ఎంతకష్టపడిందో  తనకు తెలియనిది కాదు అనుకుంది మాధురి. 

"  సౌహార్ద్ ని ట్యూషన్స్ కి ఎట్లా తిప్పానో ..  స్నేహని మ్యూజిక్ క్లాసులకూ, డాన్స్ క్లాసులకూ ఎలా తీసుకెళ్లానో .. వాళ్లకిష్టమైనవి చేయడం కోసం నేనెంత వదులుకున్నానో వాళ్లకేం తెల్సు  .. చెప్పినా ఇప్పుడు వాళ్ళకవేమీ  పట్టవు. అదొక విషయమే కాదు.  
పిల్లలకీ వాళ్ళ నాన్నకు నేనో వ్యక్తిని ఇంట్లో ఉన్నాననే ధ్యాసే ఉండదు ..
ఏదో సందర్భంలో మీ కోసం నేనన్నీ వదులుకున్నానంటే .. 
నిన్నెవరు చేయమన్నారు .. మేమేమన్నా నీ వెంటబడి తీసుకెళ్ళమన్నామా .. అన్నీ చేయమన్నామా.. ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటావు ..  అని కయ్ మంది స్నేహ. 

రోజంతా ఇంట్లో ఉన్న నాతో వాళ్ళ అవసరాలకు తప్ప మాటలుండవు . నన్నొక మనిషిలాగా చూడరు. 
వాళ్ళ నాన్నతో మాత్రం చాలా చాలా మాట్లాడతారు. జోకులేసుకుంటారు .. కలసి సినిమాలు చూస్తారు. వాటి గురించి చర్చించుకుంటారు .. 
నేను మధ్యలో వెళ్తే నాకేమీ తెలియదని .. నా మాటల్లో .. చేతల్లో తప్పులు వెతుకుతారు .. 
వేళకు తిండి తినరు. బయటి తిండి తినడమే గొప్ప అనుకుంటున్నారు.  నేను వాళ్ళకోసం వండిందంతా వృధా అవుతుంటే మనసు చివుక్కుమంటున్నది. 
రాత్రి పగలు లేకుండా బయట తిరుగుళ్ళు .. చెప్తూనే ఉంటాను. వింటేగా .. పాత చింతకాయ పచ్చడి అంటారు 
అసలే రోజులు బాగోలేవు . ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు .. ?
అలాంటప్పుడు సతీష్ వాళ్ళని కోప్పడొచ్చుగా .. 
ఊహూ .. అలా చేయడు .. ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు .. మరి నాకు మండదా .. చెప్పక్కా ..
మళ్ళీ తనే .. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ .. ఆ మాత్రం ఆడపిల్లకి నేర్పుకోలేవా.. అర్ధరాత్రి దాకా తిరిగొస్తుంటే చెప్పొద్దా ..  అంటాడు నీ మరిది . 
కానీ తాను చెప్పడు . తండ్రే కదా .. చెప్పొచ్చు కదా .. ఊహూ .. అది చెయ్యడు .. 
అది చెయ్యొద్దు .. ఇది చెయ్యొద్దు. అట్లా ఉండు, ఇట్లా ఉండు అని చెప్పి నేను చెడ్డదాన్నయిపోతున్నా .. 
నా మాటలు వాళ్ళ బుర్రకెక్కవు.  చాదస్తపు మాటలకింద తీసి అవతల పడేస్తారు. "
  
"అయితే .. " మాట పూర్తి కాకుండానే 
" వాళ్ళ పనులు చేసిపెట్టే రోబోని కాదుగా... విలువలేని చోట , గౌరవించని చోట ఉండడం ఎంత కష్టమో ..ఎంత ఉక్కపోతగా ఉంటుందో నీకేం తెల్సు .. ? ఆ  గాయపు రంగులేమిటో లోతు ఎంతో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. 
రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటున్నానక్కా .. 
అందుకే.. అక్కడి నుండి , వాళ్ళనుండి దూరంగా వచ్చేశాను . అప్పుడు వాళ్ళ కోసమే నా జీవితాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నాను . కానీ ఇప్పుడు, జీవితం దశదిశా లేకుండా సాగిపోతుండడాన్ని భరించలేక పోతున్నాను. 
విరిగిన రెక్కలను అతికించుకుని నన్ను నేను ఆవిష్కరించుకోవాలని, స్వేచ్చా విహంగంలా విహరించాలని తపన .. అందుకే నాకోసం నేనొచ్చేశా ..  "
"వచ్చేశావా ..?" అప్రయత్నంగా మాధురి నుండి 
" అవును, వచ్చేసా ..  చచ్చి పోదామన్న ఆలోచనను అక్కడే సమాధిచేసి నా జాడని నేను వెతుక్కునే ప్రయత్నంలో ఆ ఇంట్లోంచి వచ్చేశా..   
నేనిలా రావడం నీకు ఇష్టం లేదా .. కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా.. బరువయితే  చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదంటే ఏదో ఒక ఉద్యోగం దొరికే వరకూ ఇక్కడ నీతో ఉంటాను ".  నా కళ్ళలో నా జవాబు వెతుకుతున్నట్లుగా సూటిగా చూస్తూ ..  స్థిరంగా తన నిర్ణయాన్నినొక్కి చెప్పింది మాలతి. 
తన చేయి చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా నొక్కుతూ "మంచి పని చేసావ్ .. నీకు నేనున్నానన్న నమ్మకం ఉన్నందుకు సంతోషం .. దిగులు పడకు.  
అన్నీ సర్దుకుంటాయి . ముందు స్థిమితపడవే .. . అన్ని విషయాలూ నింపాదిగా మాట్లాడుకుందాం " అని బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసే మిషతో అక్కడ నుండి లేచింది మాధురి. 

ఆ కాసేపటికే స్నేహ ఫోన్ " అమ్మ..వచ్చిందా పెద్దమ్మా.." ఆ అడగడంలో ఎంతో కంగారు.. దుఃఖం పొంగుకొచ్చి మాట్లాడలేకపోయింది.  
కూతురి చేతిలో ఫోన్ తీసుకుని "వదినా .. మాలతి అక్కడికి .. " సతీష్ అడుగుతుండగా ..  

"వచ్చింది. తాను మానసికంగా చాలా డిస్ట్రబడ్, డిప్రెస్డ్ గా ఉంది".  నేను మళ్ళీ మాట్లాడతా ముక్తసరిగా చెప్పి కాల్ కట్ చేసింది మాధురి. 

చెల్లెలు స్థితికి కారణమైన ఆ కుటుంబ సభ్యులపైన చాలా కోపంగా ఉంది మాధురికి. 
తనకంటూ సెలవు దినం లేకుండా గడియారం ముల్లులా నిత్యం ఎవరికి ఏం కావాలో సమయానికి అమర్చిపెట్టడం తన బాధ్యతగా భావించే మాలతికి ఒక ప్రశంస ఇవ్వకగా ఆమె శ్రమకు విలువ ఇవ్వకపోగా  చిన్న చూపు చూడడం, చులకన చేయడం  .. చాలా కష్టంగా ఉంది మాధురికి. 
ఆలోచిస్తున్నదామె .. ఈ సమస్య మాలతిది ఒక్కదానిదేనా .. 
చాలా ఇళ్లలో గృహిణుల సమస్యే .. కాదు కాదు ఆడవాళ్ళ సమస్యే .. 
ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగబాధ్యతలతో సతమతమవుతూ నేనూ అనేకపాట్లు పడ్డదాన్నేగా...
చాలా మంది గృహిణులు నిరాశా నిస్పృహలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు ..  ఆందోళన కుంగుబాటు కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. 
తోడికోడలు వాళ్ళ  అక్క ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది. 
ఆవిడకిదేం పోయేకాలం అంటూ ముక్కున వేలేసుకున్నారు.  ఇట్లా చేసిందని అందరూ ఆశ్చర్యపోయారు.  ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవు.  ముత్యాల్లాంటి పిల్లలు.  చక్కని సంసారం. నిండుకుండని కాళ్లతో తన్నేసుకుంది అనుకున్నారంతా. బహుశా .. ఆమె కూడా జీవితం పట్ల నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా కుంగిపోయి  అలా చేసుకొన్నదేమో...  ! అనేక సందేహాలు .. 
చెల్లెలు ఏమి చేస్తున్నదోనని చూస్తూ ఫ్రిజ్ లో ఉన్న దోశ పిండి తీస్తున్నది మాధురి. 
చేతిలో రిమోట్ పట్టుకుని ఛానెల్స్ అటూ ఇటూ తిప్పుతున్నది. ఏ ఒక్క ఛానెల్ చూడడంలేదు.  ఆమె చూపులు గోడపై ఉన్న పెయింటింగ్ పై ఆగాయి. తదేకంగా చూస్తున్నాయి. 

అస్థిమితంగా ఉన్న మాలతిని ఆకట్టుకున్న పెయింటింగ్ కాలక్షేపం కోసం ఈ మధ్య మాధురి వేసిందే .. 
మాలతికి చిన్నప్పుడు చిత్రకళలో ప్రవేశం ఉంది . కాలేజీ రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నది.  ఆ తర్వాత ఉద్యోగం , పెళ్లి, సంసారజీవితంలో అన్నీ ఏ గంగలోకి కొట్టుకుపోయాయో ... 
భర్త , పిల్లలు ఆమె మొదటి ప్రాధాన్యతలో నిలవడంతో ఆమె వేసిన పెన్సిల్ ఆర్ట్, పెయింటింగ్, హ్యాండీ క్రాఫ్ట్స్ ఆసక్తులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.  కొంతకాలం చెల్లిని ఇక్కడే ఉంచుకుని జీవితం పట్ల నూతనోత్సాహం కలిగించాలి. 
సతీష్ వస్తే .. వచ్చి బతిమాలితే .. వెళ్తుందా .. ఏమో .. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె మాత్రమే .. ఆమె మనసు పొరల్లో ఏముందో .. 
నా దగ్గర ఉన్నంత సేపూ చెల్లిని గతం చేసిన గాయాల నుండి బయటపడే మార్గాలు ఆలోచించాలని మాలతి గురించే ఆలోచిస్తున్నది మాధురి. 

శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది. దానికి సపర్యలూ జరుగుతాయి. కానీ మనసుకు అయిన గాయం పైకి ఏమీ కనిపించదు. లో లోపలే విస్తరిస్తూ గాయాన్ని మరింత పెంచుతుంది.  అది మనం గమనించలేం. గమనించినా దానికి తగిన వైద్యం చేయించాలని అస్సలు ఆలోచించం ... 
శరీరంలో మిగతా భాగాలకు లాగే మనసుకు తగిలే దెబ్బల్ని చికిత్స అవసరం. 
నిజానికి,  ఈ సమయంలో కుటుంబ సభ్యులందరి సహకారం కావాలి.   వారి మధ్య ఉన్న అనుబంధం మరింత గట్టిబడాలి కానీ పలుచన కాకూడదు. 
 
మాలతి మనసుకి అయిన గాయం చిన్నా చితకా గాయం కాదు. ఈ ఒక్కరోజుది కాదు. లోలోపలే రక్తమోడిన గాయం ఇప్పుడు పక్వానికొచ్చింది. ఆ పుండు పగిలి  డిప్రెషన్ కు లోనయింది. దానికి తోడు మోనోపాజ్ సమస్యలు.  
మాలతి మామూలుగా అవ్వాలంటే అందరి సహకారం చాలా అవసరం. నచ్చచెప్పి ఇంటికి పంపడం కంటే కొంతకాలం ఇక్కడ ఉంచడమే ఉత్తమం. 
మధురికి ఒకప్పుడు తన కుటుంబం ఇచ్చిన సహకారంతో మోనోపాజ్ సమస్యలనుండి బయటపడిన వైనం గుర్తొచ్చింది.  భర్త కాలంచేసినా, పిల్లలు విదేశాల్లో ఉన్నా ఒంటరినన్న దిగులు, అభద్రతాభావం లేకుండా ఆనందంగా గడిపేస్తున్నది. 
మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్లలో హెచ్చు తగ్గులు మందులతో సవరించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల డిప్రెషన్ కు లోనైన మాలతిని మామూలు మనిషిని చేయడం కొంత సున్నితమైన వ్యవహారమే కానీ తగ్గని, పరిష్కారం కాని సమస్య ఏమీ కాదు. 
నిజానికి ఆ డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు మాలతి కూడా అన్వేషిస్తున్నదని స్పష్టమవుతున్నది. 

కుటుంబం కోసం తన సర్వశక్తులూ ధారపోసే తల్లులు, అదే తమ లోకం అనుకునే తల్లులు తమదనుకున్న లోకం తమకు దూరంగా జరిగిపోతుంటే బెంబేలు పడిపోతుంటారు.  అదే సమయంలో తమను చేతకానివాళ్లుగా తీసిపడేస్తుంటే కుంగిపోతుంటారు. లోపలికి ముడుచుకు పోతుంటారు.  
కానీ చెల్లెలు ఆ స్థితిని అధిగమించాలని ప్రయత్నించడం,  అందులో భాగంగానే ఇక్కడికి రావడం.. అంటే చెల్లెలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని సుస్పష్టం..  
క్షణం తీరిక లేదు . చిల్లి గవ్వ ఆదాయం లేక చిన్నచూపుకు లోనవుతున్నానని భావించే ఉద్యోగ అన్వేషణలో పడింది. తన ఆత్మగౌరవం తాను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నది. తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నది.  తన అస్థిత్వాన్ని తాను నిరూపించుకోవడానికి ఘర్షణ పడుతున్నది .  అందుకు ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే .. 
కొన్నాళ్ళు మాలతి ఆ ఇంట్లో లేకపోతే.. అప్పుడు తెలిసి వస్తుంది ఆమె ఏమిటో .. ఆమె విలువ ఏమిటో ..  
మబ్బుల మాటున దాగిన వెన్నెల్లాటి వారి ప్రేమను ఒకరికొకరు అర్ధం చేసుకోవడానికి, వ్యక్తం చేసుకోవడానికి కొంత సమయం, సంయమనం అవసరం.  కాలమే వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.     
ఈలోగా తన చెల్లి మానసిక పరిస్థితి, మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులు .. హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే ఇబ్బందులు, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యల గురించి వివరంగా సతీష్, స్నేహ, సౌహార్ద్ లకు తెలియజేయాలి.  
నిండైన ఆత్మవిశ్వాసంతో మాలతి తన కుటుంబంతో ఆనందంగా ఉండడంతో పాటు, ఓ వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో చేతనయినంత తోడ్పాటు అందించాలని ఆలోచనలతో దోశప్లేటు చెల్లెలుకి అందించింది మాధురి.  

సాహిత్య వ్యాసలు

దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ  రైతక్కల కృషి

పొయ్యివెలగని రోజుల్లో బుక్కెడు బువ్వ దొరకని కాలంలో కాళ్ల కింది మట్టినే బుక్కి మెలిపెడుతున్న పేగుల బాధ తీర్చిన ఆకలి పోరాటం వారిది. 
రాళ్లురప్పలతో నిండిన బీళ్లలో అడవిని సృష్టించిన గొప్పదనం వారిది. 
ప్రకృతితో మమేకమై, మరచిపోయిన పాత పంటలకి పునరుజ్జివనం ఇచ్చే వ్యవసాయం వారిది. 
కాసుల కోసం కాదు, కడుపు ఆకలి తీర్చుకోవడం కోసమే వారి ఆరాటం.    
సొమ్ముకోసం చేసే మాయాజాలం నుండి భూతల్లిని కాపాడుకోవడం, తమ చుట్టూ ఉన్న జీవావరణాన్ని సజీవంగా ఉంచుకోవడం కోసం ఎంత శ్రమైనా చేయడం వారి నైజం. 
వారు నమ్మిన దాన్ని నలుగురికి పంచడం వారికి అలవాటు. ఆయితే,  ప్రకృతికి, ప్రకృతి న్యాయానికి విరుద్ధంగా వెళ్ళరు. 
జీవితాల్ని నిలుపుకునే ఆహారపంటలు,  జీవావరణం కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యం.  
పనికిరాని భూముల్ని సాగులోకి తెచ్చి, రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ బతుకులో వెలుగులుపూలు పూయించడం వారి విజయం  
అట్లాగని టెక్నాలజీ వాడరని కాదు. అధునాతన టెక్నాలజీ అంది పుచ్చుకుంటూనే ప్రకృతితో మమేకమవ్వడం వారికే సొంతం.   
పాత కొత్త విధానాల మేలుకలయికతో ప్రపంచమంతా తమ గొంతు వినిపించడం ఆ భూమిపుత్రికలకే సాధ్యం. 
అవును, అది కల కాదు నిజం. 

అసాధ్యంగా కనిపించేదాన్ని సుసాధ్యం చేసిన వాళ్లెవరో కాదు, అతిసామాన్యంగా కనిపించే అసాధారణ మహిళలు.  
అందరూ అసుంట .. ఇసుంట అంటూ చెరబెట్టిన వాళ్ళతోనే భేష్ అనిపించుకున్న ధీరలు.    
అతిపేదరికంలోంచి నిలువెత్తు వృక్షాల్లా ఆకాశానికి ఎదిగిన దళిత రైతక్కలు.   
వీళ్ళకి చిన్నా చితకా అవార్డు కాదు అంతర్జాతీయ అవార్డు ప్రకటించారు . ఆ ప్రకటన చేసింది ఊరూ పేరూ లేని వాళ్ళు కాదు, ఐక్యరాజ్యసమితి. 
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతిగా భావించే నోబెల్ కు సమానంగా చూసే మహోన్నతమైన ఈక్వేటర్  పురస్కారాన్ని అందుకున్న పర్యావరణవేత్తలు ఆ మహిళలు. 

ఆ మహిళల గురించి మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపుకోవాలని వాళ్ళనిక్కడ పరిచయం చేస్తున్నాను. 

2019 కి గాను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డిడిఎస్ )కి ఈక్వేటర్  పురస్కారాన్ని ప్రకటించింది. రెండేళ్ళకొకసారి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ UNDP ఈక్వేటర్ పురస్కారం ప్రపంచ దేశాల్లోని సంస్థలను ఎంపికచేసి పురస్కారం అందిస్తుంది.  127 దేశాలనుండి వచ్చిన 847 దరఖాస్తులనుండి కేవలం 22 సంస్థలను ఈ పురస్కారానికి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది.  అందులో ఒకటి  డెక్కన్  డెవలప్మెంట్ సొసైటీ.   ఈ ఏడాది మనదేశంలో  దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఒక్కటే ఈ పురస్కారానికి ఎంపికైంది.  గతంలో తొమ్మిది సంస్థలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది.
 
స్థానిక వనరులతో ప్రకృతి సిద్దమైన పరిష్కారాలతో పర్యావరణాన్ని కాపాడుతూ, వారి ఆరోగ్యాన్నే కాక భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ అభివృద్ధి సాధించడంలో అసాధారణ ఉదాహరణగా నిలిచినందుకు చేసిన కృషికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళలకు ఈక్వేటర్ పురస్కారం అందజేస్తున్నామని జూన్ 5, 2019 న  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.  

'మేము డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సాధించిన ఘనకార్యాలు వ్యక్తిగతంగా అభినందించాలి . మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. మీ ప్రయాణ ఖర్చులు , వసతి ఏర్పాట్ల బాధ్యత ఈక్వెటర్ ఇనిషియేటివ్ తీసుకుంటుందని ' అని ఐరాస బాధ్యులు స్పష్టంగా చెప్పారు.  

ఈ  క్రమంలో న్యూయార్క్ నుండి ఇద్దరు సభ్యుల బృందం  డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కి వచ్చి 15 రోజులుండి  ఇక్కడి గ్రామాలలో చేస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అంతా వీడియో చిత్రీకరించుకొని వెళ్ళింది.  మూడున్నర దశాబ్దాలుగా  పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం వంటి వివిధ రంగాలలో ఈ మహిళలు చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు  వచ్చిందని సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు.  
 
మూడుతరాల ప్రతినిధులైన అనసూయమ్మ, మొగులమ్మ, మయూరి లతో కూడిన ముగ్గురు సభ్యులను  డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్లేందుకు ఎంపిక చేసింది.  అవార్డు అందుకోవడానికి వెళ్లడం కోసం కావలసిన  ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికీ వీసా తిరస్కరణకు గురవ్వడంతో కొంత నిరాశ చెందారు.  కానీ .. చివరికి సాధించారు.  వారితో పాటు డిడిఎస్ కో డైరెక్టర్ చెరుకూరి జయశ్రీ వెళ్లారు. 

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP ) వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి సెప్టెంబర్ 24 వ తేదీన న్యూయార్క్ లోని టౌన్ హాల్ లో జరిగే ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొని పదివేల డాలర్ల బహుమతిని (దాదాపు ఏడు లక్షలు ) స్వీకరించారు డిడిఎస్ రైతక్కలు.   
అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనడంతో పాటు  2019 ,సెప్టెంబర్ 19 నుండి 26 వరకూ న్యూయార్క్ లో జరగిన కమ్యూనిటీ వర్క్ షాప్స్ , చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నారు.    

చిక్కపల్లి అనసూయమ్మ (50)
మూడున్నర దశాబ్దాల పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం అడవుల పెంపకంలో ద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా, ముంచుకొస్తున్న ముప్పునుంచి బయటపడడం మొక్కలను నాటడం , చెట్లను పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ వేదికపై చెప్పిందామె .  తన తోటి మహిళలతో కలసి 1200 ఎకరాల పోరంబోకు భూముల్లో ఇరవై లక్షల చెట్లు నాటింది.   అడవిని పెంచింది.  ఇప్పుడు అది ఎంతో మంచి ఫలితాలను ఇస్తున్నదని ఆనందంగా తన అనుభవాలు ప్రపంచ వేదికపై పంచుకున్నది అనసూయమ్మ . 

తొమ్మిదేళ్లకే పెళ్లయింది. భర్త సరిగ్గా చూడకపోవడంతో 14 ఏళ్లకే పుట్టింటికి చేరింది.  కూలికి వెళ్ళేది. ఒకప్పుడు కడుపు నింపుకోవడం కోసం డిడిఎస్ సభ్యురాలిగా చేరింది.  మొక్కల పెంపకంపై తీసుకున్న శిక్షణ ఆమె జీవిత గతినే మార్చేసింది. కొండప్రాంతాల్లోను జహీరాబాద్ ప్రాంతంలో గుబ్బడి అంటారు. ఆ గుబ్బడిల్లో మొక్కలు పెంచింది కాబట్టి జనం ఆమెను గుబ్బాడి అనసూయమ్మ అంటారు.  ఇప్పుడామె నాటిన మొక్కలు వృక్షాలై మహా వృక్షాలై మనకగుపిస్తాయి.
 
"రేపు బయలుదేరతామనే వరకూ మేం పోతామో తెలియని పరిస్థితి . 18 వతేది మా ప్రయాణానికి ఏర్పాట్లయ్యాయి. 17 వ తేదీ మాకు వీసా మంజూరీ అయింది.  గంటలకొద్దీ ప్రయాణం చేసి అమెరికా చేరాం.  22 సంస్థల నుంచి వచ్చిన వారిని కలిశాం. అందరినీ పరిచయం చేసుకున్నాం .  
150 అంతస్థుల భవనంలో 46 అంతస్తులో మాకిచ్చిన బస. మూడునాలుగు కిలోమీటర్లు నడిచి మీటింగ్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ మా అనుభవాలు పంచుకున్నాం.  నాలుగు రోజులు మీటింగుల్లోనే ఉన్నాం . ఎప్పుడూ ఊహించని అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం కలిగింది " అని తన ప్రయాణం గురించి చెప్పింది అనసూయమ్మ. 

మొగులమ్మ (35)
అత్తాకోడళ్ల సంఘం ,భారతీయ చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు మిల్లెట్స్  సిస్టర్స్  నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషిస్తున్నది పొట్లపల్లి మొగులమ్మ.    కేంద్రప్రభుత్వం వారి నారిశక్తి పురస్కారం రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతులమీదుగా అందుకున్నది మొగులమ్మ.  భారతదేశ  చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్యలో 5000 మంది సభ్యులున్నారు.  ,సేంద్రియ వ్యవసాయం, భూసారాన్ని పెంచడం, చిరుధాన్యాల సాగు,  కలిపి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించింది.  సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలతోనే దేశ భవిష్యత్ ఉన్నదని అందరూ గుర్తించాలని కోరింది. 
మనదేశంలో అధికంగా వాడుతున్న పురుగుమందులు, రసాయన ఎరువుల వల్ల ఎదురవుతున్న అనర్ధాలు , మానవ మనుగడకు ముంచుకొస్తున్న ముప్పును వివరించింది.  
అంతర్జాతీయ ఆహార భద్రత కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం చిరుధాన్య హక్కులు మహిళలకే చెందుతాయని మేము గట్టిగా నమ్ముతున్నామని అంటున్నది మొగులమ్మ.  

అందరం ఐకత్యంతో ఉండి ఐకమత్యపు పంటలు మనం పండిస్తున్నం. అట్లనే అందరు పండించాలని కోరుకుంటున్నది మొగులమ్మ. 

మయూరి (18)
మూడవ తరం ప్రతినిధి.  మయూరి 18 ఏళ్ళ పస్తాపూర్ గ్రామస్తురాలు. మొదటిసంవత్సరం కమ్యూనికేషన్స్ డిగ్రీ  విద్యార్థిని. 
జీవవైవిధ్యంపై డాక్యూమెంటరీలు రూపొందిస్తుంది మయూరి.  ఆసియాలో బయోడైవర్సిటీ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్న పిన్న వయస్కురాలు మయూరి. 
ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు అందుకునే అసాధారణ అవకాశం నాకు వచ్చింది.  
అక్కడ కూడా జరిగిన సమావేశాలను వీడియో డాక్యుమెంట్ చేశాను. 

వాళ్ళ చేతిలో బంజరు నేలలు పంట భూములుగా మారిపోయాయి.  ఎందుకూ పనికిరాని రాతినేలలు, గులకరాతి భూములు చేలుగా , చెలకలుగా, చిట్టడువులుగా, అడవులుగా దర్శనమిస్తాయి.  వారి సంకల్ప బలం, శ్రమ శక్తి ఇచ్చిన ఫలాలు అవి.   

బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీళ్లకోసం తన్లాడిన బతుకులు, చేయి చాచి చుట్టూ చూసిన బతుకులు ఇప్పుడు చెయ్యి చాచవు.  చివరికి విత్తనాలు, ఎరువులు, కరెంట్, బోర్లు , మోటార్లు, నీళ్లు, మార్కెటింగ్  ఇలా వేటికీ బయటినుండి వచ్చే సహాయం కోసం ఎదురు చూడరు వీళ్ళు. ప్రభుత్వం నుండి ఏ పథకం వస్తుంది..  ఏమి సాయం వస్తుందని మోరలెత్తుకోని ఎదురుచూసే పరిస్థితే వీళ్లకు లేదు.  
తామెవ్వరి ఆధీనంలో ఉండమని తమ స్వాధీనంలోనే ఉంటామని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు ఈ రైతక్కలు .  తమకు కావలసిన ఆరోగ్యకరమైన తిండి, మందులు, ఎరువులు, పురుగుమందులు, మార్కెటింగ్ అంతా వారిచేతుల్లోనే ఉంది. 
అంతేనా .. తమ పనిని, తమ పంటలని, తమతిండిని, తమ ఆరోగ్యాన్ని, తమ ఆచార వ్యవహారాలని, భాషా సంస్కృతుల్ని  ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేస్తుంటారు వీళ్ళు.  అందు వాళ్ళు వాడుకునే సాధనాలు రెండు. ఒకటి రేడియో. రెండోది వీడియో. 
అక్షరం ముక్కరాకపోయినా అద్భుతంగా వీడియో డాక్యూమెంటరీలు చేస్తారు వీళ్ళు . డాక్యూమెంటరీ చేయడమొక్కటేనా .. ఆ డాక్యుమెంటరీ చేయడమెలాగో శిక్షణ ఇస్తారు. ఇక్కడి వాళ్ళకే కాదు బంగ్లాదేశ్ , పెరూ వంటి దేశాంతర వాసులకు కూడా శిక్షణ ఇచ్చి వచ్చారు.  
అమాయక గ్రామీణ మహిల్లా కనిపించే వీళ్ళని కదిలిస్తే వినిపించే విజ్ఞానం అనంతం.  కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పార్లమెంట్ హౌస్ లో కూడా తమగొంతు వినిపించే అవకాశం వారికి వచ్చింది. 
ఆ మహిళల్ని కదిపితే ఒక్కొక్కరూ వాళ్ళు తిరిగిన దేశాల లిస్టు ఇరవయ్యో .. పాతికో ఉంటాయి .  ఈ ముగ్గురే కాదు ఇలా చంద్రమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, చిన్ననర్సమ్మ, పూలమ్మ, జనరల్ నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, కమలమ్మ, మంజుల, నాగమ్మ, స్వరూపమ్మ  .. ఇలా ఎందరో ... 
వాళ్ళు చూసిన ప్రపంచం, అదిచ్చిన జ్ఞానం ముందు నేను మనం పుస్తకాల్లో చదువుకున్న జ్ఞానం చాలా చిన్నది .. 
మీరెప్పుడైనా జహీరాబాద్ వైపు వెళితే దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కి వెళ్లి అక్కడి రైతక్కల కృషిని చూడడం మరవకండి. 

ఈ సంచికలో...                     

Nov 2020