మా రచయితలు

రచయిత పేరు:    అల్లం రాజయ్య

నవలలు

సైరన్ (నవల)

సైరన్‌  గురించి....

21.03.1977 అత్యయిక పరిస్థితి ఎత్తి వేసిన తరువాత తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతాంగ విప్లవోద్యమాలు ఆరంభమయ్యాయి. 1974లో ఏర్పడి పని చేస్తున్న రాడికల్‌ విద్యార్థి సంఘం, జననాట్యమండలి(1972) ప్రజలతో మమేకమయ్యాయి. అప్పటికీ తన అన్ని రకాల పోరాటాల అనుభవంతో - భారత కమ్యూనిస్టు పార్టీ సివోసి తన కార్యకలాపాలను తిరిగి సమీక్షించుకున్నది.  ఫ్యూడలిజాన్ని , భూస్వామ్య హింసావాద వర్గ శత్రు నిర్యూలన అనే ఏకైక కార్యక్రమంతో తుద ముట్టించలేమని అది విప్లవానికి బాట కాదని, గుణపాఠం తీసుకున్నది.  'విప్లవానికి బాట' రచించుకొని వ్యవసాయ విప్లవానికి పూనుకున్నది. 

చరిత్ర నిర్మాతలు కొంతమంది వీరులు కాదని- ప్రజలే చరిత్ర నిర్మాతలని, రైతాంగంతో పాటు కార్మికవర్గం కూడా విప్లవ చోదక శక్తులుగా గుర్తించి రైతాంగ, కార్మిక వర్గంలో పనిచేయనారంభించింది.  ఈ రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణిలో రాడికల్‌ విద్యార్థులు- కార్మికులను నూతన ప్రజాస్వామిక  విప్లవోద్యమానికి సిద్దం చేసే పనికి పూనుకున్నారు.  పేరుకు పెట్టుబడిదారి ఉత్పత్తి విధానమే అయినా - సింగరేణిలో అటు కార్మికులల్లోను - ఇటు యజమానుల ప్రతినిధులైన అధికారుల్లోనూ భూస్వామిక భావజాలం, ఆచరణ ఉండేది.  విచిత్రంగా చుట్టుపక్కల ఊళ్ళలోని దొరలే గూండాలను పోషిస్తూ కార్మిక ప్రాంతాలల్లో అన్ని రకాల చిల్లర దుకాణాలు, వైన్‌ షాపులు, వడ్డీ వ్యాపారం నుండి చిట్టీ, సినిమా వ్యాపారాల దాకా దోపిడి, దౌర్జన్యాలను సాగిస్తూ ఉండేవారు.  కార్మిక సంఘాల నాయకులుగా దొరలే అధికారం చెలాయించేవారు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లోని పేద దళితులే కాకుండా, వ్యవసాయం కుప్పకూలిన బహుజనులు, అగ్రకులాలు కార్మికులుగా సింగరేణిలో చేరారు.  సరిపడ ఇంటి వసతి లేక చిన్న చిన్న మురికి గుడిసెల్లో - ఏ మాత్రం సౌకర్యం లేకుండా - పందులతో, దోమలతో సహజీవనం చేసేవారు.  పై అధికారులు దొరలల్లాగా ఏ కార్మిక చట్టాలు పాటించకుండా అధికారం చెలాయించేవారు.  బయట బస్తీలు, మార్కెట్‌ మొత్తం దొరల వాళ్ల తాబేదార్ల గూండాలతో భయానక వాతావరణంలో నిండిపోయి భయంభయంగా బతికేవాళ్ళు.

దుర్భరమైన పని పరిస్థితులు - హీనమైన కనీస వసతులు, దోపిడి, దౌర్జన్యాల మధ్య కార్మికులు అసంఘటితంగా,  అభద్రతగా ఉండేవారు.

అట్లాంటి కార్మికుల్లోకి రాడికల్‌ విద్యార్థులు వెళ్లి పని చేయడం - సింగరేణి కార్మికులు తమ శక్తేమిటో తెలుసుకొని - కాలరీ ప్రాంతంలోని అన్ని రకాల కార్మిక వ్యతిరేక శక్తులతో పోరాడటం - తమకంటూ ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకునే  దిశగా ఎదగడం వరకే నేను రాయాలనకున్నాను. అనగా సింగరేణిలో దుర్భరమైన కార్మిక జీవితం ఒక్క కుదుపుతో కదలడం ఆరంభ

రైతాంగ పొరాటాల ఆరంభం - ఎదుగుదల గురించి  'కొలిమంటుకున్నది' నవల రాశాను.  నేను ఉద్యోగరీత్యా కార్మికులల్లో ఉండటం - విప్లవోద్యమాలను ఆరంభించి కొనసాగిస్తున్న నా తరం ఉద్యమ సహచరుల మధ్య జీవించడం, వారి అనుభవాలు తెలుస్తుండటం - రకరకాల పనులరీత్యా మొదటి దశలో సింగరేణి కార్మికుల అనేక మీటింగుల్లో - పనులల్లో కలిసి తిరగడం వలన కార్మిక జీవితం - పోరాటం నా లోపల ఒక రూపం తీసుకోసాగింది.  అట్లా 1978లో ఈ నవల మొదలు పెట్టాను.  రకరకాల పనుల ఒత్తిడి వలన కొంత రాసి వొదిలేశాను. 

ఆ తరువాత సింగరేణి కార్మికోద్యమాల గురించి పాటలు, కథలు ఆరంభమయ్యాయి.  సహచరులు, మిత్రులు వూరుగొండ యాదగిరి ( పి చంద్‌), తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారలు అప్పటికే సింగరేణి ఉద్యోగులు.  రాయడం ఆరంభించారు.  దాదాపుగా మేం ముగ్గురం కలిసి చర్చించుకొని సింగరేణికి సంబంధించిన చాలా పుస్తకాలు తెచ్చాం.  అమరుడు శేషగిరి, నల్లకలువలు, నల్ల వజ్రం, బొగ్గు పొరల్లో లాంటి పుస్తకాలు తెచ్చాం.  నాకన్నా ఎక్కువ ప్రత్యక్ష అనుభవం గల్గిన వారైన నా సహచరులు చాలా రాశారు. పని ఒత్తిడిలో - పోరాటాలు సంఘటితపడి ఉన్నతరూపంలోకి ఎదగడం వలన ఈ నవల వెనుకబడిపోయి పూర్తి చేసే అవకాశం రాలేదు. శేషగిరి నవల తరువాత - సింగరేణి మొదటి దశ ఉద్యమాలకు సంబంధించినది ఈ నవల సైరన్‌.  సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడి పని చేయడం - రెండవ దశకు సంబంధించిన నవలలు రాయవల్సినవి.  అవి రాయతగినవారు నా సహచరులు.  తప్పక రావాల్సియే ఉన్నవి.

కోల్‌బెల్టు పత్రిక - ఈ నవలను ' సింగరేణిలో సిరియాలుడు' పేర అతికొంత భాగం సీరియల్‌గా వేసింది.  పత్రిక ఆగిపోయింది. నేను ఎంచుకున్న పనుల్లో మిగిలిపోయిన పని పూర్తి చేయాలనుకున్నాను.

 

06 డిశంబర్‌- 2019                                                                            

అల్లం రాజయ్య

 

సైరన్ నవల ప్రారంభం.....

ఎర్ర బస్సు దుమ్ము రేపుకుంటచ్చి వేపచెట్టుకిందాగింది. బస్సుల నుంచి ఓ కుంటి ముసల్ది గుడ్డల ముల్లె బట్టుకొని ''నారాయణ - నారాయణ'' అనుకుంట దిగింది. ముసల్దానెనుక ఓ కర్రె పడుసోడు ''దిగుదిగవే ముసల్దానా!'' అనుకుంట దిగిండు...

పడుసోడు పిక్కుటం పైంటేసుకున్నడు. పిక్కుటం పైంటు నల్లది. పిర్రలమీద తెల్లబడ్డది. దాని మీద ఓ పూలంగి. పూలంగి మీదిగుండి తీసున్నది. లోపల ఆకుపచ్చబనీను మెడదాకున్నది... ఛాతీ విరుసుకుంట రోడ్డు మీద నిలుసున్నడు. నెత్తిమీది తాటికమ్మ టోపి తీసి పట్టుకున్నడు. మనిషి సగం కాలిన తునికి మొద్దు తీర్గ కాకి నలుపు... కుడిసేతికి గడియారం. కాళ్లకు చెప్పులు - కండ్లు తాగినోని తీర్గ ఎర్రగున్నయి...

ఏపచెట్టుకింద కూలిపోయిన మొండిగోడల్ల చెక్కబొమ్మలున్నయి. సెక్క బొమ్మల ముంగట కడుపీడ్సుకపోంగ పన్న కుక్క సెవులు రిక్కించి వచ్చినతన్ని సూసి గర్రుమని, మొరుగ సేతకాక కాళ్ల మీద తల బెట్టుకున్నది. ఆ మొండిగోడల పక్క సిన్న గుడిసే, గుడిసెల ఎర్రతేలు లాంటి మొటిమెల ముఖపు పడుసోడొకడు లుంగీ సెక్కి కట్టుకొని బండమీద కూకున్నడు. అతని ముంగట గాజు గ్లాసులున్నయి. గ్లాసుల పక్కన సారా క్యానున్నది - గుడిసె ముంగట తొర్రోడొకడు బబ్బెర గుడాల మీది ఈగలను విసురుతండు - గుడిసెల నలుగురైదుగురు కూర్చున్నారు. ఏపచెట్టు వెనుక బాగంల సిన్న గూన కప్పటిల్లు. అందట్ల పెండ్లాం మొగడు కొట్లాడుతండ్లు.

కర్రెవాడు అటిటు చూసి ఠీవిగా నడుస్తూ సారా గుడిసెకేసి వచ్చిండు...

''ఓరినీ లింగన్న అల్లునివా? శెంకరేగదూ నీపేరు'' కొమురయ్య మీసాలు తుడుసుకుంట సారా ఘాటుకు గొంతు మండంగన్నడు.

''ఔ నే మామ''  శంకరయ్య వరుస గలుపుతూ...

''మాలచ్చి మొగడు''  ఇంకో పెయికంగిలేనివాడు...

''దో సౌ...''  శంకరయ్య...

''జెర తామూలు - తామూలు... సౌ..సౌ ఏసుకో...'' అన్నాడు కొమురయ్య...

''మా బావది పెద్ద బుక్క...''  ఇందాకటి వాడు. ఎర్రటోడు సర్రున నల్లా తిప్పిండు... గ్లాసులో నురుగచ్చింది...నూరుగ్రాముల  సారా.

''దండె గొడుతన్నావుర పోడా...'' అన్నాడు శంకరయ్యగొంతులో పోసుకొని - గుటిక్కిన మింగి... ''ఇంకో సౌ... పైసలెన్నిరా?''

''రొండు రూపాలు...''

పిర్రమీది జేబుల నుంచి నల్ల పాకెటు తీసి పటపట లాడే రెండు రూపాయల నోటుతీసి గిరాటేసిండు...

''బావ కత జోరు మీదనే ఉన్నది... నాకో సౌ చెప్పు బావో...''  ఒకడు...

ఇంకో రూపాయితీసి పడేసిండు

''నేనేం పాపం జేసిన అల్లుడా! '' కొమురయ్య.

ఇంకో రెండురూపాలు తీసియిచ్చి శంకరయ్య బయటకొచ్చిండు. హోటల్ల కొచ్చి పొడుగు సిగరెట్టు తీసి ముట్టిచ్చిండు - అడుగేసి మళ్లేమనిపిచ్చిందో - ఇంకో దో సౌ దెమ్మని తన టోపిని విచిత్రంగా చూస్తున్న అంగిలేని పోరన్ని పంపిండు. ఆ దో సౌ తాగిండు - కొద్దిగా తూలుతున్నాడు... కండ్ల మీద మాపటెండ... ఏదో హిందీ పాట గొనగబోయిండు - రాలే.. టోపి నెత్తిమీద పెట్టుకున్నడు - మళ్ళా తీసి ఎనుకకు ఏలాడేసుకున్నడు - అది నడుత్తంటే సప్పుడుయితంది. తీసి సేతుల బట్టుకున్నడు... అట్లా నడుస్తూ వాగుల దిగిండు. వాగుల కొంత దూరం నడిచిండు... వాగొడ్డుకున్న మిరుపతోట్లనుంచి గమోగ్జిన్‌ వాసన గప్పున కొట్టింది...మోట బాయికాడెక్కన్నో పొట్టి కొమురయ్య కొండపొడుగురాగం తీసి ఏదో పాట పాడుతండు. వాగు ఆవలొడ్డుకు తొండం తెగిన కొట్టోదెలు మోట ఆగున్నది. మడుగుల బొమ్మేడి సెట్ల నీడకు సాపపిల్లలెగురుతన్నయి. నీల్ల సెలిమెల కాడికచ్చిండు - సాకలోల్లు ఆరిన బట్టలు కుప్ప జేసుకుంటండ్లు - మీసాలరాజం సెప్పులేసుకొని సారా దుకానంకెల్లి పోతూ ఎదురైండు...

''శంకరయ్య పటెలేనా? ఇప్పుడే రాకటా? పూజైపోయినట్టున్నది బాంచెన్‌...'' ముసిముసినవ్వుకుంటడిగిండు...  '' నీ యింట్ల పీన్గెల్ల బట్లన్ని గట్లనే ఉన్నయి... జెప్పన కాలబడు... పోరనికి కొయ్యగుచ్చి కాలొదుల కిచ్చింది దవఖాన్లకు దీస్కపోయి సూదేపిచ్చుక రమ్మంటే పైసలేడియే అన్నడు - గిప్పుడెమొ సారకురుకుతండు...'' భార్య ఆగమ్మ కోపంకొద్ది బట్ట జాడిచ్చింది...

ఆగమ్మ కోడలు సంటమ్మ రయికెలేకుంట నీళ్ల మడుగుల తానం జెత్తంది... శంకరయ్య అటుకేసి చూసి చూడనట్టు చూసిండు...

తొవ్వల బరిసిన బట్టలు ఎంతతొక్కద్దనుకున్నా తొక్కనే తొక్కిండు...

                ''ఏంది బాంచెన్‌ జెరంత సూసుకుంట నడువుండ్లి'' ఆగమ్మ

                ''సూసెటట్లున్నదా పనివరుస...'' మంచినీళ్లచెలిమె కాడ ముసలమ్మ  అన్నది...

                ఆడనిలుసున్న పడుసు పోరగండ్లు కిసకిసనవ్విండ్లు. పోసాని ముఖం మాడిపోయింది.

                బిందె తోముతన్న కోమట్లవరమ్మ ''పోసీ అల్లుడత్తండు - అల్లుడు అన్నది...

                ''అత్తేంభాగ్గెం...'' ఇందాకటి ముసులమ్మ...

                ''బిడ్డకు దిగేత్తలేడు - కాలేర్లపని - బిడ్డ కాలు కిందబెట్టకుంట కూకుంటలేదు. ఎయ్యిరూపాల జీతం...'' వరమ్మ. ''ఔ బాంచెన్‌... ఈనికే తవ్వెడ్ది సాలది - సీసగావాలె - మాంసంగావాలె - ఇత్తుకులేకుంట దింటడు - ఎనుకా ముంగటసూడకుంట '' ముసలవ్వ...

                '' ఔ గని దానికేమన్న'' వరమ్మ...

                ''ఏడ?...''

                ''బగుళ్ల సామి మందుబోత్తడట..గదా?''

                ''ఆనింట్ల పీనిగెళ్ల ఆనిపాటిదప్పింది...'' అన్నదిపోసాని...

                శంకరయ్య ఆడినుంచి తప్పుకోవాల్నని ముందటికి నడిచిండు... నీల్లచ్చినయ్‌ - పైంటు పైకి ఎత్తరాలేదు... సెప్పులు సేతుల బట్టుకొని ఆనీళ్లల్ల నుంచే నడిచిండు... ఒడ్డుకెక్కి నంక వాగుల తడిసిన లాగుకు దుమ్ము అంటింది...

                ఎనక సెలిమెకాడ ఆడోల్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ''లింగయ్య అల్లుడు శంకరయ్యచ్చిండన్న'' వార్త శంకరయ్య కన్నా ముందే ఊళ్లె తెలిసింది...

                శంకరయ్య అత్తగారింటికొచ్చేసరికి మామలింగయ్య బండికి జనుమేత్తండు. బామ్మర్ది మొండోడు కందెన గొట్టం బట్టుకొనున్నడు. కొండి జడల పిల్ల  బండి మిఠాయి లేవకుంట నొగలమీద కూసున్నది...

                ''బావచ్చిండు - బావచ్చిండు...'' పిల్ల బండిమీదినుంచి లేసింది - బండి నొగలు మీదికి లేసినయ్‌

                '' నీ బొందమురుగ కసేపుకూకోరాదే...'' అని అల్లున్ని చూసిండు లింగయ్య.

                ''గిదేనా రాకడ... లచ్చవ్వమంచిగున్నదా? '' అని అల్లున్నడిగి ''మొండీ బావకు గడంచ తెచ్చేయిపో'' అన్నాడు. మొండోడుకందెన గొట్టం బండి గుజ్జులకు తగిలేసి ఇంట్లనుంచి గడంచ తెచ్చేసిండు.

                పిల్ల శంకరయ్య చేతులల్ల ఊగులాడబడ్డది. ''రిబ్బెన్లు దెచ్చినవాబావా?'' అన్నదిపిల్ల...

                అప్పుడు యాదికొచ్చింది శంకరయ్యకు పిల్లలకేమన్న తేకపోతినే అనుకున్నాడు.

                ''ఈపారి తెత్త...మర్సిన''

                ''నువ్వెప్పుడుగంతే....'' పిల్ల గునిసింది.

                శంకరయ్యకు చివుక్కుమనిపించింది. గడంచలో కూర్చున్నాడు...లోపలినుండి పునుక్కుంట ముసల్ది లింగవ్వచ్చింది.

                ''బిడ్డా లచ్చవ్వ బాగున్నదా? మీ సడ్డకుడు కలుత్తడా? మల్లవ్వ బిడ్డ మంచిగున్నదా? '' అడిగింది...

                ''మొన్న జీతాలనాడు బజాట్ల కలిసిండ్లు మంచిగనే ఉన్నరు...నేను అధాతుగచ్చిన...''

                ''దేవుని గుళ్లె రాయివడ - లచ్చవ్వకు కడుపుబండక పాయె - దానితోటోల్లంత...'' ముసలమ్మ

                ఇంతలోకే పోసాని నీల్ల కడువెత్తుకొని వచ్చింది...ఆ తరువాత పోసాని  కాపు ఎంకటమ్మింటికి  అల్లుని కోసం బోయి తవ్వెడు బియ్యం చేబదులు తీసుకొని కొంగు సాటుకు బట్టుకచ్చింది. లింగయ్య కోమటి రాజీరింటికిపోయి బండెడు పెంటమ్మి నలుబై రూపాయలు తీసుకొని మాదిగిండ్లల్లకు బోయి పన్నెండు రూపాలు బెట్టి కోడి పుంజును తెచ్చిండు... అయిదురూపాలది కల్లు దెచ్చిండు...

                ఈ సంగతులేవి శంకరయ్యకు తెలియదు...

  2  

ఎన్నీల చింతమీదికెక్కింది... ఏసంగి పెరడికి నీళ్లు గట్టి అయ్య కొడుకులిద్దరు ఎడ్లు ముందునడువంగ ఇంటికేసి నడుస్తున్నారు...

                సాంబయ్యది సింతగింజ రంగు... దవడలు పీక్కుపోయినయి. దవడ పండ్లూసిపోయినయ్‌... అమ్మ చీకినట్టు ఎప్పుడు నోట్లె పొగాకుండాలె - అయినెపుట్టిన కాన్నుంచి అంగి మాటెరుగడు. నోట్ల్లె పొగాకున్న లేకున్న ఎప్పుడూ నములుతూనే ఉంటాడు...

                ''వారీ! శంకరిగాడు జాడపత్తలేకుంట బాయె'' అన్నడు దేకీసపార ఎడం భుజం మీది నుంచి కుడి భుజం మీదికి మార్సుకుంట...

                ''నాకేమెరుకనే - '' అన్నాడు కొడుకు మొగిలి. అతనికి ఒళ్ళంతా చీదర చీదరగున్నది. నెత్తిమీద ఎంటికలు పని తీరికలేక కత్తిరించక పెరిగినయ్‌... సెముటకంపు - మంచాలనుంచి లేత్తెనే పని - మల్ల పెరడికాడికి పండబోవాలె - పెండ్లాం రాయేశ్పరి గునుత్తంది - '' నేను ఊడ్సి సల్లనేనా'' అంటది. ఏనాత్రో గుట్టకింది నుంచి నడిసిరావాలె.

                అయ్య నిదుర లేత్తే తిట్లు...

                ''అదిగాదుర - అగ్గెన గాండ్ల అయిదునూర్లు  బోత్తిమి అతీలేదాయె గతీలేదాయె - కరువుల కక్కుడు పారుడైనట్టున్నదికద  '' ఈ మాట కొడుక్కుచెప్పిండు.

                ''నీ తల్లి జిరాయితు సేసుడు గట్టుకు కట్టెలు మోసినట్టుగున్నది. రైతును దేకినోడే లేడాయె - ఇత్తునం బెట్టిన కాన్నుంచి పీకులాటేనాయె - కడుపునిండ తిన్నదిలేదు - ంటినిండ పన్నది లేదు... కాకులగొట్టి గద్దలకేసిట్టున్నది పనివరుస... ఆనల కగ్గిదల్ల కొట్టేటప్పుడు కొట్టయాయె - అసలేట్ల బుసబుస నాలుగానలు గొడితె - నాటుకు సేతికర్సులే ఊసే - నోట్లె కచ్చినంక కుంటెండిపాయె - ఎకురం పొలం ఎండిపాయె. గీంత ఎకురం పెరడన్న సక్కగ జేసేకుందామంటే బాయిల నీళ్లెల్లి సావవాయె. కర్రకు బొక్కెడు    నీళ్లుబోసి పండుతే - మక్కలసీదె గాడ్ది కొడుకే లేక పాయె... అందట్ల కాని మీదెద్దు - ఇసపుపరుగు ముట్టిసచ్చె. ఉరిబెట్టుకునే కాలమచ్చింది... మా అయ్య పదెకురాలిత్తె నాకాలానికే సిప్ప సేతికచ్చేటట్టున్నది.. పుట్టి మునుగుతది గని ...'' ఇటా ్లగాసాంబయ్య వదురుతానే ఉన్నడు....

                ఈ మాటలు మొగిలయ్య వినివినీ ఉన్నయే - ఆ మాటలు ఇంకా ఎట్లా సాగుతాయో కూడా తెలుసు - ఆఖరుకు తనపెండ్లి చెల్లె పెండ్లస్తది గా మాటల్ల.

                ''దెహె, ఉండరాదే... ఊకనుకుంటె అత్తదా, సత్తదా?'' మొగిలి కసురుకున్నడు.

                సాంబయ్య మాట్లాడలేదు.

తండ్రి కొడుకులిద్దరు ఊరు సొచ్చిండ్లు... కోమటోల్ల పెరట్ల మల్లేశడు ఆర్సి కేక బెట్టిండు.. అంటే బువ్వకు పోతడన్నమాట - ఆరోల్ల కొట్టంల గొడ్లల్ల ఏదో గొడ్డు బొనుగూపుతోంది... ఆ రోల్ల పాటకులల్లో నుంచి తెల్లటి పడకలు గన్పిచ్చినయ్‌... ఆ మంచాలు చూసి మొగిలికి నిద్ర ముంచు కొచ్చింది... ఎన్నీల ఎలుగులో మంచమ్మీద కూకున్న వాణి ఎందుకో వక్కడ వక్కడ నవ్వుతంది. ''బతుకుంటే గట్లా ఉండాలె -'' ననుకున్నడు మొగిలి - చెప్పుల్లేని పాదానికి ముల్లు గుచ్చింది...

                ''అన్నన్న సత్తి... గొల్లలమ్డికొడుకులు మేకలకు తుమ్మమండ గొట్టినట్టున్నది...'' అనుకున్నాడు...

                ''పెద్దిగాని దగ్గెరికి బోయి సెప్పులు తెచ్చుకొమ్మంటె తెచ్చుకోవైతివి... సీకుడం ముల్లేనా?'' సాంబయ్య.

                ''అయ్యో సెప్పులా? ఇంకెన్ని పారీలు ముడిపియ్యాలె కొత్తయి కొనుమంటె ఎప్పుడు పీసుకమేనాయె''

                ''ఇగోరా నా తోలు గట్టిగున్నది - పెద్దిగాన్నిడిపిచ్చి సెప్పులు గుట్టుమను...'' అన్నాడు.

                కాలు ఎగేస్తూ ముంగటికి నడిచాడు. కోమటోని దొడ్డికాడి జంబిచెట్టు కింద ఏదో ఆకారం వీళ్లను చూసి నిలుచున్నది...

                ''తొవ్వల దప్ప ఏర్గవోను జాగ దొరకది గదా'' సాంబయ్య అటేటుబోయినంక అన్నడు...

                కోమట్ల కొట్టంముందు లాలయ్య కట్టె గదువ కింద బెట్టు కొని కాల్లమీద కూర్చున్నాడు. అతని ముందు దుమ్మలో పాలేరోల్లు కూర్చున్నారు. వడ్లాయినే ఊరపిచ్చుక పిటపిట లాడినట్టు... ''మారేనయ్యా ! నానుంచి గాదు... నలుగురున్నరు. ఏదో ఓటిసెయ్యిండ్లి...''అంటున్నాడు...

                ''నలుగురు పోరగండ్లు పుట్టినంక నాకునీకు బనావు గాదంటె ఏడ బోతది పెండ్లాం... గొంతికెలకచ్చెదనుక తాగ పైసలుంటయి - కూడేదని పెండ్లామంటె  రేషమత్తది... నలుగురికెర్కలేద అరమ్మ రంకులతనం'' దడిమీది నుంచి చేతులు చాపుతూ చెప్పుతోంది వడ్ల వరమ్మ...

                మూలమలుపు కాడి గుడిసెల మధునమ్మ ఎప్పుడో సచ్చిన సెట్టెత్తు కొడుకును తలుచుకొని తలుచుకొని ఏడుస్తోంది.

                ''బొడ్డి ఏడ్సేడ్సి సత్తది...దానిది కట్టప్పుటుకు...'' సాంబయ్య అనుకుంటనే ముందటికి నడిచిండు...

 

                చింతకింది గౌరయ్య సాదుకపు అల్లుడు రాయేశడు ''దీదీ'' అని కొట్లాడుతండ్లు... రాయేశడుతాగున్నడేమొ ఇంటిసుట్టు గడిగొయ్య పీక్కోని తిరుగుతండు.

                ''నాకెరికే ఆళ్లుతన్నుకుంటరని... పోశమ్మ సూపుతప్పింది - నేను మా అన్న కెప్పటి నుంచో సెప్పుతన్న ఇంటెనా...'' పిస్స బొందాలు ఆడికీడికి తిరుగుతండు.

                ''వారీ బొందిగ...'' తమ్మున్ని పిలిసిండు సాంబయ్య... బొంద్యాలు సాంబయ్య మాట పట్టించుకోనే లేదు...

                తండ్రి కొడుకు లిద్దరు ఇంకా ముందుకు నడిచే సరికి అంజనేయుని గద్దెమీద కిట్టయ్యగారు కూకుండి '' ఇయ్యేడు నక్కమీదొచ్చింది కాలం... శివశివ.. ఇంత ఘోరం నేనిన్నడూ చూడలేదు...'' అంటున్నాడు.

                ''అదిగాదు పంతులు మా అవ్వ చెప్పుతది... ఎనుకట కరువత్తె రేగడిమన్ను ముద్దలు పిసుక్క తిన్నరట...'' రామయ్య వెనకకు చేతులు కట్టుకొని తలపాగ అటుయిటూ ఊగంగ చెప్పిండు....

                ''ఏంరాసాంబడు... కనపడుటమే లేదు...'' అన్నాడు కిట్టయ్యగారు...

                ''ఏడిదుండి... సత్తా మంటె తీర్తలేదు...''

                ''రేపు సోమవారం - కాయిదం తిరుగబెట్టుకోకపోతివి'' అన్నాడు కిష్టయ్య...

                ''అట్లనే నుండ్లి...'' అనేసిండు సాంబయ్య...

                 మరికొంత దూరం నడిచేసరికి వెంకటనర్సు ఎదురొచ్చిండు...

                ''సాంబుమామ... కోపరేట్విలోన్‌ కిస్తుగట్టన్నట... సాగర్‌రావు దొర కలువుమన్నడు'' అన్నాడు...

                ''అట్లాగే లేరా?'' అన్నాడు సాంబయ్య...

                కుడిచేతుల దోవతి సింగు ఎగిరేసి ఎడం వేలుముక్కులో పెట్టుకొని ఎద్దును చూసిండు వెంకటనర్సు.

                ''మడి కట్టు మీది తెచ్చింది గిదేనాయె - ఎద్దుకగ్గిదల్గ సవ్వన గుంజింది... తూర్పెడ్లు మనకాడ ఆగయి. అవి కుష్కి దున్ని అడివిల బొంగు గడ్డి తిన్నయాయె...''

''అవురా! ఎనుకట మా అన్న తాడిసెర్లన ఎద్దును దెత్తె గట్లనే అయ్యింది. ఆడికి మా అన్న అననే అన్నడు - కానిసందాయె రెక్కిరిగినట్టాయె...''

                తండ్రి కొడుకులిద్దరు ముంగటికి నడిచారు...

                వాకిట్లోనే రాయేశ్వరి ఎదురైంది... ఎన్నీల ఎలుక్కు భార్యను చూసిండు మొగిలి. ఊతికిన కోక - తలకుబోసు కున్నదేమొ... మొగన్ని చూసి గిరుక్కున లోపటికి బోయింది...

                ఇంటి ముందు గడంచల శంకరయ్య కూకుండి పిలగాడు రమేశ్‌తోని బాతఖానీ కొడుతున్నాడు...

                ''నీకు నూరేండ్లాయిస్సురో?'' అన్నాడు సాంబయ్య...

                ''ఔ బాంచెన్‌ మొండిగాడు నూరేండ్లు బతుకుతడు గాదూ'' అన్నది నశం పీర్పుకుంటన్న ముసిల్ది...

                ''అయితేనేను మొండెగాన్నే అంటవ్‌ '' అన్నాడు శంకరయ్య.

                ''సాకల్దాన్నవ్వ'' అన్నది సాకలిగౌరు...

                ఆ మాటలో శంకరయ్య మాట వినపడనేలేదు...

                ''ఏందిరో తమ్మి ఎట్లెట్లనో అయినవ్‌ ఈకలు దీసిన తాంబుర్ర తీర...'' అన్నాడు శంకరయ్య.

                ''ఎప్పుడచ్చినవే?'' మొగిలి.

                ''పెండ్లామోమొ ఉనుక బంతి పువ్వుతీరుగైతంది మొగడేమొ ములక్కాయ తీర్గ అడ్లనే ఉంటండు'' ఇందాకటి ముసల్ది...

                ''దుడ్తు....'' పందిరిగుంజ సాటుకు ఒదిగినిలబడ్డ రాయేశ్వరి ముసల్దాన్ని మొగోళ్లకు విన్పించకుండాకసిరిండు.

                ''అగ్గిగావన్నా బిడ్డా!'' లోపటినుంచి భూదేవి తడు ముక్కుపోగు ఊగంగ బయటికొచ్చింది...

                సాంబయ్య ఎడ్ల కట్టేసి వాటి ముంగట ఇన్ని జాడు కర్రలేసి వచ్చి శంకరయ్య పక్కకు కూర్చున్నాడు... మొగిలి మరో పక్కకు కూర్చున్నాడు. భూదేవి తెచ్చిన నిప్పును అట్లాగే పెట్టి శంకరయ్య జేబులోనుంచి సిగరెట్టు డబ్బా తీసి సాంబయ్య కియ్యబోయాడు

                ''అద్దద్దు... మాకేంవాక గొడ్డటి పురాండం - రమేశ దిగుట్లె సుట్టుండాలె తేపో'' అన్నాడు.

శంకరయ్య సిగరెట్టు ముట్టిచ్చిండు. మొగిలి చిత్రంగా చూస్తున్నాడు.

                ఎన్నీల చింతల మీది నుంచి బయటికొచ్చింది. శంకరయ్య గొంతు కొద్దిగా తడబడుంతోంది.

                ''సిన్నాయిన బుధారంనాడు మొగిలికి ఇంటర్యూన్నది. బర్తీలున్నయి... ఇంటన్నవే? రెండువేల రూపాలు పట్టుకొని మొగిలిని తోలియ్యాలె - గందుకోసమే నాత్రి బజిలిజేసి ఉరికచ్చిన'' అన్నాడు.

                భర్తీ అనేటాల్లకు అందరి ముఖాలల్లో ఎన్నీలెలుగు - మల్లా రెండు వేలనేటాల్లకు సాంబయ్య మొఖం మాడిపోయింది.

                ''నెలకిందనే అయిదు నూర్లిత్తిమి గాదుర'' అన్నాడు నూతిలో నుంచి మాట్లాడినట్టు.

                ''అయిదునూర్ల - గయ్యేడికి సరిపోతయి. అసలు మూడువేలు నడుత్తంది - ఆడు నాకెరుకున్నోడయేపటికే రెండువేల అయిదు నూర్లకు ముక్కిరుసుకుంటనే  ఒప్పుకున్నడు. అదిగాక గియ్యంతెనే. తమ్ముడైతే పనిమీది కెక్కనీయ్‌ - నెలకు వెయ్యిరూపాలు - మీకట్టాలు కడతేరుతాయి'' శంకరయ్య.

                ''నిచ్ఛమేననుకో - కని ఈడ ఉరికచ్చిందిరా?''  సాంబయ్య.

                ''ఓ సిన్నాయిన ఎనక ముందాడకు - ఎనుకటిదినాలు గాదు... భూమిని నమ్ముకుంటె బతుకులేదు. ఇన్నావే - రైతును దెకెటోడెవ్వడులేడు... దున్నాలే.. దోకాలె ఇత్తునం బెట్టాలె. పసి గుడ్లోలె సాది సవరచ్చెన జెయ్యాలె - ఆఖరుకచ్చిందాంట్లనే బతుకాలె... ఇన్నావే...'' శంకరయ్య చెప్పుకపోతున్నాడు.

                సాంబయ్యకీ మాటలు మనుసుకు బట్టలేదు కాసేపు... లచ్ఛిమికి పిలగాన్ని సూడబోయిననప్పుడు - సర్పంచ్‌ ఎడ్ల కొట్టంల మాసిన గుడ్డపేగుగట్టుకొని, నల్లగ ఒంటినిండ దుమ్ము నిండి - ఎంటికలుపెంచి కడుపీడ్సుపకపోతూ కనిపించిన శంకరగాడనే పాలేరోనికి ఇప్పటి శంకరయ్యకు పోలికలు కడుతున్నాడు.

                భూదేవి వచ్చి కూర్చుండి - ''అయితే బిడ్డా మావోనికి నౌకరి దొరుకుతదంటవు... నీ బాంచెన్‌ బిడ్డా!  దేవుడు సాయకారమైనట్టు అయితన్నవ్‌... మావోనికి జెప్పన దొరికిందంటె ఎములాడ రాయన్నకు కోల్లాగెను కట్టేసి లింగం మీద రూపాయిబెడ్త...'' అని మొక్కింది...

                రాజేశ్వరికి యమ సంతోషంగా ఉన్నది...మొగనికి కొలువు దొరుకుతే ఈ సాకిరి తప్పుతది - తన పెద్దవ్వ బిడ్డ తీర రంగుసీరెలు కట్టచ్చు...అవేందో సినిమాలు చూడచ్చు - ఇంతకన్నా రాజేశ్వరి ఆలోచనలు ముందుకు సాగలేదు...

మొగిలయ్య కైతే గుర్రానెక్కినంత సంతోషంగా ఉన్నది. శంకరయ్య ఆమాట ఈ మాటామాట్లాడి, బుదారం పైసలు బట్టుకొని పస్టు బస్సుకు రమ్మని చెప్పిపోయిండు .

                మొగిలి ఆదరబాదరగా మొఖం కడుక్కొని జొన్న గడుకతిని పెరట్లకు పండబోయిండు... పుచ్చపువ్వు లాంటి వెన్నెల పైరగాలి బొయ్యిమంటూ...మంచెలో చాలా సేపుకూర్చుండి తలాతోక లేని ఆలోచనలు చేశాడు - రాళ్లగెర్రె మీద తీతువపిట్ట ''కిక్కిరీకీ ీకిక్కిరీకీ''అంటూ ఉలికులికి పడి గూసింది.

                మక్కపెరట్ల సప్పుడచ్చింది...''నీ తల్లి నక్కచ్చినట్టున్నదని మంచెదిగి సప్పుడచ్చిన దిక్కు నడిసిండు - ఏమిలేదు - దట్టమీద కూర్చున్నాడు - ఎక్కడా మనుషుల అలికిడిలేదు. తన మనుసులో పోటెత్తే ఆలోచనలు ఎవరికన్నా చెప్పుకుంటె బాగుండు.. రాజేశ్వరి కనిపించింది. గాలికి వెంట్రుకలెగురుతున్నాయి. మొగిలి అధాతుగా లేచి ఇంటితొవ్వబట్టిండు. చెప్పుల్లేని కాళ్లకు రాళ్లు రప్పలు తాకినా ధ్యాసేలేదు...

                ఇంటి ముందటికి వచ్చేసరికి సాంబయ్య అదే గడంచలో తలపట్టుకొని కూర్చున్నాడు... వంగిపోయిన వెన్నీల వెలుగు సాంబయ్య ముఖం మీద ప్రతిఫలిస్తోంది.. సాంబయ్య కండ్లల్లో నీళ్లు... అదెన్నేండ్ల దుక్కమో? తాతలు తండ్రుల కాన్నుంచి భూమిని నమ్ముకొని బతికిన కుటుంబం. చరిత్రలో నమ్ముకున్న భూమిని కాదని తన కొడుకు తరం బయటికి పోతోంది... మళ్ళా తనరెక్కలకట్టం తనకే...

                మొగిలికి తండ్రి దు:ఖం అర్థంకాలేదు...

                కొడుకును చూసి సాంబయ్య కండ్లు తుడుచుకున్నాడు.

                ''మొగిలి ఇగరారా... ఇట్లాకూకో -'' అన్నాడు...

                మొగిలి తండ్రి పక్క గడంచలో కూకున్నాడు.

                జీరబోయిన గొంతుతో...'' నాయినా ! మా నాయిన గుర్తున్నాడురా? ఎట్ల గురుతుంటడు. నేను ఆరేండ్లపోరనప్పుడు కాలం జేసిండు. అంతెత్తు మనిషి - అయినె ఎప్పుడు ఇల్లు మొఖం సూసెరుగడు. ఒక్క పూటన్నా సరింగ తినెరుగడు. పొద్దున పండ్ల పుల్లేత్తేె మాపటికే కడిగెటోడు.. అప్పుడు గీ మోటర్లు, రైల్లు లేకుండె - పేటకు వరంగల్‌కు బండిల సామానేసుకపోతే ఆరందినాలు బోయెటోళ్ల  - ఎంత కిరాయని అయిదురూపాలు... తను తిన్నడు తినలేదు - సావంగ మాకు భూమిచ్చి పోయిండు - మీ పెద నాయిన ఏది మా  అన్న మమ్ముల బొచ్చెకు గట్టుకొని సాదుకచ్చిండు. నన్ను బామని ఎంకటరాజయ్యకు పాలేరుంచుతనని అవ్వంటె - మా నాయిన్నుండంగ మమ్ముల పాలేరుంచలే దని సతి పోరాడిండు... ఓరి కొడుకా మన మక్క పెరడేసిన రేగడి పన్నెండెకరాలు ఉపాస ముప్పిడుండి కొన్నం...'' ఇట్లా చెప్పి చెప్పి  ''సరె ఇకబో...'' అని గడంచలో పన్నాడు...

                మొగిలికి సిగ్గనిపించింది.. తండ్రి పడుకున్నాడని నిర్దారణ అయ్యేదాక కూర్చున్నాడు. ఆ తరువాత తలుపు తట్టిండు - తలుపు తీసింది రాయేశ్వరే...

                సాంబయ్యకు నిదుర బట్టలేదు... ఈ ఆలోచనలన్నీ అన్నకు చెప్పాలనే ఉన్నది... కని మూడేండ్లనుంచి అన్నకు తనకు మాటలు లేవు. కొడారిల చొప్పకట్టలెత్తుక పోయిండ్లని అదినె తిట్టింది. ఆడోల్లు ధీంటె ధీ అన్నరు. అట్లా మాటలు బందయినాయి. ''ఎంత కొట్లాడిన ఆడు మా అన్న గాదా!'' అనుకున్నాడు. లేచి కూర్చున్నాడు. వాకిట్లోకొచ్చిండు. తన అన్న ఇంటి ముంగటి దాకా నడిచిండు... తలుపులు మూసున్నాయి... కాసేపు తటపటాయించి తలుపుల దగ్గరే కూర్చున్నాడు... ఆఖరుకు ధెర్యంచేసి తలుపు గొట్టిండు...

                ''ఎవలదీ? '' లోపలినుంచి మల్లయ్య.

                ''నేనే అన్నా'' సాంబయ్య

                ''నేనే అంటే?''

                ''సాంబయ్యను''

                మల్లయ్య తలుపు తీసిండు - ఎదురుగ తమ్ముడు ''గింత నాత్రి దనుక ఏంజేత్తన్నవ్‌రా? '' అనిలోపటికి నడిచిండు. అన్న వెనుకనే సాంబయ్య లోపటికొచ్చిండు.

                నిజానికి మల్లయ్య నిద్రపోలేదు. సదువుకునే సిన్నకొడుకు  నాగయ్య  రంధితోటి మనిషి సగమయ్యిండు. డిగ్రీ సదువు మధ్యలో ఒదిలి పెట్టి ఆరు నెల్లు జాడా పత్తాలేదు. కాలుకు బట్టకట్టుకుంట తిర్గిండు. ఆఖరుకు రామడుగు ఠానాల ఉన్నడని కబురు దెల్సింది. అడుక్కుంటపోతే - పోలీసోల్లు సూడనియ్యలేదు. ఆన్నుంచి - మరో దిక్కు. తొమ్మిదిమంది - వాళ్ల తండ్రులతోటి తను  ఠానాల సుట్టు తిర్గుతనే ఉన్నడు.

                ''ఏందిర సాంబయ్య?''

                ''ఏంలేదన్న - మా మొగిలిగానికి బాయిపని  దొరుకుతదట''

''మంచిదే గాదుర...''

                ''అదిగాదే లింగులు అల్లుడు శంకరి జెప్పిండు''

                ''ఎంతవరకు బెడ్తండ్లు?''

                ''అయిదునూర్లిచ్చిన - ఇంక రొండువేలు గావాలె అంటండు.''

                ''దొరుకుతే మంచిదేగని - ఆని ఖ్యాల్లి మంచిగ లేదు జేగర్త...''

                మాటలయి పోయినయ్‌... మల్లయ్య తలపట్టుక కూర్చున్నాడు...

                ''నాకు నాయిన్న కలల గన పడ్డడే...''

                ''ఏమన్నడురా?''

                ''భూమి నిడిసిపోతండ్లారా అన్నడు''

                ''కాలంరా... ఏ ఎండ కాగొడుగు బట్టాలెగదరా? ఒకప్పుడు మనూరు కలకల లాడేది... కనిఇయ్యల్ల ఊళ్లె దిర్గన్నంటే దప్పులుగొడ్తయి. ఎల్లిపోయి నూరు తీర్గయిపోయింది - మనూళ్లె నుంచి ఎంతమరది బోయిండ్లు. పడుసోల్లంత ఏడ కములం దొరుకుతె ఆడికిబోతండ్లు. అద్దంటవా? అద్దంటె కడుపు నిండే దారేది? ఊళ్లె ఉన్నోన్ని పీక్కతినేటందుకు ఊళ్లె పెద్దమనుషులున్నరు...  మనమేనత్త కొడుకులలిద్దరియే ఊరిడిసిపోయిన బతుకలై పోయినయ్‌. తొందురు గట్టు మల్లి ఎర్రలింగనికి జెట్టమ్మ తీర్గ దల్గింది. ఇంట్ల యింట్లనే మాయం - మన కండ్ల ముంగట ఆని కడుపు ఈడుండుగ ఎప్పుడన్న నిండిందా? సరె సరె... గయ్యన్నెందుకు గని... రూపాలేడ జూసినవ్‌...''

                ''బామనోనికి ఎద్దు బాపతియి ఎనిమిది నూర్లియ్యాలె - అడ్డీ ఎంతయ్యిందో? మల్ల ఆన్నే అడుగుత''

                ''అడు ఏదన్న  కుదువ పెట్టుకోందిత్తడా?''

                ''పెరడి రయిను బెడ్త...'' గొంతు వనికింది...

                మల్లయ్య గుండు దెబ్బతాకిన వానిలాగా కాసేపు మాట్లాడలేదు... చివరకు దీర్ఘంగా నిట్టూర్చ...

                ''భగవంతుడేం సంకల్పంలున్నడో... కానియ్యిరా....'' అన్నాడు...

నిజానికి సాంబయ్య అన్నతో ఇంకా మనుసువిప్పి చాలా మాట్లాడాలను కున్నాడు. మనుసులో మెదిలే సంగతులు బయటికి రాలే. '' సరెనే నేబోయత్త...'' అని లేచి బయటకొచ్చిండు...

                గడంచంలో వెల్లకిలా పండుకున్నాడు. కండ్లు మూతలు పడ్డాయి. కలలు - కలలో తండ్రి....

 

  3  

                అంబటేల్లయ్యింది... ఆడోల్లు వాక్కు మంచినీల్లకోసం పోతున్నారు... సఫాయి సాయిలు పొలికట్టందుకొని దమ్మురేగంగ వాడలు ఊడుత్తండు... అడ్లధాతికాడ రాజయ్య నాలెకు మొఖమేసుకొని మోట బొక్కెనకు పెండెలు బెడ్తండు... రాజయ్య అల్లుడు రాసోడి పెయికంగి లేకుండ దడికాడ పుల్ల లిరుత్తండు...

                మోట బొక్కెన కాడకూసున్న రాయలింగు ఓటుగాలు సాపి ''అడ్లపుటుకు బుట్టినవా? మాదిగి పుటుకురా? '' అని రాసోడిని తిట్టి - అటునుంచి సాంబయ్య రావడం చూసిండు.

                ''సాంబయ్య నీ కొడుక్కు బాయి పనచ్చిందట నిచ్ఛమేనా?'' అన్నడు.

                ''ఏది గుర్రం కడుపుల గుడ్డు'' అన్నాడు సాంబయ్య

                '' మారే... అయితది. ఏగిర్తపడ్తె అయితాది.'' అన్నాడు.

                ''నీకేందే... ముగ్గురు కొడుకులు జెమ్మకదరి అమాలి పనిజేసుకుంట కోరుట్లనున్నరు'' వడ్ల రాజయ్య..

                ''కొడుకులా ఆళ్ల జోలితియ్యకు'' రాయలింగు...

                ''ఆ సంపాయిత్తలేరా?''

                ''మా సంపాయిత్తండ్లు ఎంటికలు... ముగురు ఎడ్ల కెడ్లు కొడుకుల బెట్టుకొని నాతిప్పలైతే తప్పలేదు. ఒక్కన్ని సత్తన్న.. పెద్దలమ్డి కొడుకంటడు - భూమమ్ముకోని ఆనిదగ్గరికి బోవన్నట.. ఆనికేమెరుక భూమి సంగతి?''

                ''ఏం జేత్తరే ఈడుండంగ సేతకగ్గిదల్గ కడుపుకే సాలక పాయె - లచ్చిరాజం పాపం కోమట్ల సేతల సచ్చిండు.''సాంబయ్య...

''ఆడగంతేరా? నీ కొడుకు బోతండేమొ గనపడదా? ఉప్పుతోని టోకటొంబయి కొనుక్కోవాలె... నూటికి సెలుగమనకట్టం మనమీన్నే ఏత్తండ్లు - మొగోడు బుడితె అయ్యకాసర - ఆడిది బుడెతె తల్లి కాసర అన్నరు.. నీతల్లీ కొడుకులు బుట్టి భూమినమ్ము మంటండ్లు ఆన్నే సింగ సానమెసుకొని ఎంతకాలముంటరు?'' రాయలింగు.

 

                ''నా గొంత పనున్నది...'' సాంబయ్య అక్కడి నుంచి కదిలిండు..

                ''మనిషి అంగిపేండు'' రాయలింగం. బిచ్చెగాళ్ల లింగం బజాట్ల బర్రెను పండబెట్టి కొనుపులు ఎర్రగ గాల్చి  ఎడమ తొంటిమీద కాలుత్తండు - బర్రెనాలికెల్ల బెట్టి పీండ్రీలుతంది... కోమటాయినె సింగులు మీదికెత్తి పట్టుకొని బర్రె సుట్టు దిరుగతండు... తనను ఆన్నే ఉండు మంటరేమొనని తప్పిచ్చుకొని ముంగటికి నడిచిండు. మూడు పానాదుల కాడ పోరగండ్లు ఏదో ఆటాడుతండ్లు..

                మాదిగి పెద్దులు పాత పేగుల వడ్లోజొడ్లో మూట గట్టుకొని భుజం మీదేసుకొని పోతండు..

                ''సాంబయ్య పటేలా! మోట బొక్కన సెవ్వబేయిందని మొగిలయ్య పటేల్‌ గిప్పుడే అచ్చిపేండు. గీ ఇత్తులు ఇంట్ల బానపోసి మోట కాడికి పోత పటేలా? అవుగని పటేలా బాయి పని దొరికిందట నిచ్చమేనా?''

                ''నిచ్చమేగనీ జెర జెలిబో - ఇప్పటికే తూర్పు బాజు పెరడెండిపోయింది. సూడు... మా కోడలు పిల్ల ఎండకోర్సది - బాయిల నీల్లొడిసేదను మోట కొట్టుమను - మాపటించి నేనే పోత..''

                అనుకుంటనే ముంగటికి నడిచిండు... పలుకలు పట్టుకొని సీమిడిముక్కు పోరగండ్లు బల్లెకు పోతండ్లు. అందట్ల తనకొడుకు రమేశడున్నడు.

                ''నాయిన్న బలుపం లేదు - పదిపైసలియ్యే కొనుక్కుంట '' పిలగాడు తండ్రిని చూసి గునిసిండు.

                ''ముల్లె గట్టుకచ్చిన్నారా? పో - ఉద్దెర తీసుక పో - లాపోతే అవ్వను జొన్నలు బెట్టుమని కొనుక్కపో'' అన్నాడు.

                ''నాకుటయిమైతందిపో - సారుగొడుతడు''

                ''గంగలపడు...''

                సాంబయ్య కొడుకును తప్పించుకున్నాడు. కిట్టయ్య గారి ఇల్లచ్చింది. పెద్దరువాజ రేకు తలుపులు తెరిచున్నాయి. లోపట అరెకురం ఆకిట్ల - తూర్పు పక్క ముసలితులిసె చెట్టు - కిట్టయ్య పంతులు పెండ్లాం సుగుణమ్మ ఎంటెకలిరబోసుకొని తులిశమ్మ చెట్టు సుట్టు తిరుగుతంది... నెత్తిల ఎర్ర పువ్వొకటున్నది. మనిషి ఎర్రగ పొట్టిగా ఉంటుంది...

                ఆకిట్ల కచ్చినిలుసున్నడు... కిట్టయ్య బంకుళ్ల తట్టుకుర్చీలో కూర్చుండి బెల్లపురంగు కాయిదాలు ముంగటేసుకొని సదురుతండు...

                అరుక్కింద సుంకరి నర్సిమ్ములు బర్సెకట్టె బట్టుకొని నిలుసున్నడు.

                సాంబయ్య ముంగటికి నడిచిండు....

                ''దండాలు పంతులూ....'' సాంబయ్య...

                ''ఊ...దండం...దండం...'' అనుకుంటనే కాయిదాలు సదిరిండు.

                సుగుణమ్మ ఇంట్లకు బోయింది...

                ''దూరం దూరమే..రామి... మడి...మైలబడిపోతే మళ్లీ నీళ్లు బోసుకొని చావలేను'' లోపలినుంచి.

                ''ఏమే... వంటయ్యిందా? నేను కచ్చీరుకు బోవాలె'' పంతులు ఇంట్లకు కేకేసిండు...

                ''ఎక్కడా?... ఔతుంది...'' ఇంట్లనుంచి...      

                ''నర్సిమ్మ... నువ్వురుకు... పల్లెమీని ఎంబడోల్ల రాయడు. ఎవడు ఆ పొడుగుటోడు - వాన్ని కచ్చీరుకు రమ్మను... నువ్వు తినిరా... జెప్పన రావాలే..''

                నర్సిమ్ములు వెళ్లి పోయాడు...

                ''సాంబయ్య ఇయ్యల్ల తీరదు.. రేపు... రేపు వర్జం...లెక్కపక్క అయిరాదు..సరె... నీకాయిదమే కదా!..'' అన్నాడు మళ్లీ కాయిదాల్లో చూస్తూ...

                ''అదిగాదుండ్లి... మావోనికి బాయిపని...''

                ''మంచిదే... మంచిదే... నీకేందిరో నక్కను తొక్కినవ్‌...''

                ''రెండువేలు గావన్నట...''

                ''మంచిదే పెట్టక పోయినవా?''

''తమరికెరుకలేందేమున్నది...''

                ''సూర్యారావు దొర వారినడుగక పోయినవా? మావోడు సత్య నారాయణకు నిన్ననే మున్నూరు బంపిన మా పెద్దది లేదు కామేశ్వరి... దానికి ఇల్లు గొనుక్కుంట నంటే నెల కింద అయిదువేలిచ్చిన... సరే లాలయ్య నడగక పోయినవా? సర్పంచ్‌ వీరయ్య దగ్గర కొట్టటం అమ్మిన బాపతు పైసలుండే...''

                ''మానాయిన్న కాన్నుంచి తమరిదగ్గర్నే...'' సాంబయ్య గునిసిండు...

                ''లేవ్వురా? లేవంటే ఇనవ్‌...'' అన్నాడు ఖచ్చితంగా

                ''తమరు కాదంటెట్ల?''

                కిట్టయ్య పంతులు బీడిముట్టిచ్చి ''ఏమేయ్‌... సుగుణాబాయి ఇలారా! సాంబయ్యచ్చిండు.'' అనికేకేసిండు.

                ''వస్సున్నా వస్సునా! పని తెములనియ్యరు. వంటయ్యిందంటారు...మళ్లీ మర్సిపోసానోయేమొ? విస్సుకు ఉత్తరం రాసిండ్లా..'' మడిగుడ్డతోనే బయట కొచ్చింది...

                ''సాంబయ్య కొడుక్కు బొగ్గుబాయిల పనిదొరికిందట...''

                ''శుభం... సాంబడు. నీకోడలు కన్పిస్సలేదు... అప్పటికొచ్చి ఉప్పుడు బిండిబెడ్త తీసుక పొమ్మను... రాము బాసండ్లు తోమే...'' బయటికి ఇంట్లకు ఒకేమాట

                ''వాడంటడు...  రెండువేలు గావాలట''

                ''నాదగ్గెరెక్కడున్నయి? నీకళ్లు మంచియే... డబ్బుసూస్సే...''

                ''అదే మొన్న నీ బాపతు కోళ్లాగెలనమ్మి తిమిగదా?'' పాపం గీ మాలుతండు... ఏదన్న రాపిచ్చుకో...''

                ''మారే నయ్యా నాదగ్గరలేవు'' లోపలికి పోబోయింది...

                ''పెరడిరైను బెట్టురా?'' అన్నాడు...

                ''నాదగ్గర లేవంటే వినరు'' లోపలికి వెళ్లిపోయింది. ఆమె వెంటనే కిట్టయ్యలోపలికి వెళ్లి అర్దగంటకు తిరుగొచ్చి

                ''అయిదు రూపాల వడ్డి సొప్పున తీసుకోమంటంది...పెరడిరైను బెట్టుకుంటదట''

''నేనేమిదినాలె పంతులూ?''

                ''సావొచ్చిందే?''

                ''ఎంతుండ్లి ఏడాదిగడువు - ఏడాదికియ్యకపోతే అట్లనే కానియ్యిండ్లీ'' సాంబయ్య.

                ''సరె పెరడిరాసియ్యి - ఏడాదికియ్యక పోతే ఇచ్చేదనుక దున్నుకునుడు - ఏడాదికి వడ్డీ అసలు గలుపుడు.. రూపాలకు వడ్డిలేదు - పెరడికి మునాఫలేదు.. నేను జెప్పన్నే కచ్చీరుకు బోయత్త - బువ్వదినిరాపో...'' అన్నాడు

                సాంబయ్య నిట్టూరుస్తూ పోబోయాడు...

                ''ఔరా! మీ అన్న కొడుకు సంగతేమన్న తెల్సిందా? వాడు రంకుల పోరడు...సరెగని  లాలయ్యను తీసుకొచ్చుకో...'' అన్నాడు...

                సాంబయ్య బయట కొచ్చాడు... అప్పటికే బువ్వలుదినే యేల్లయ్యింది..

  4  

                అరుగుమీద స్తంభానుకానుకొని సాంబయ్య బెల్లం గొట్టిన రాయితీరుగా కూర్చున్నాడు.

                లాలయ్య కాయిదం రాసిండు... వినిపిచ్చిండు... అంతా విన్నడు...

                ''ఇగో సాంబయ్య కాయిదం నాకిచ్చిపో -  పైసలు దీస్కపో'' అన్నాడు కిట్టయ్య రెండుసార్లు లెక్కబెట్టి రెండువేలిచ్చిండు.

                బజాట్లకొచ్చి నిలుచున్నాడు... కుక్కలు కుయ్యికుయ్యి మంటున్నాయి. తొవ్వల ఎవరు మందలిచ్చినా సాంబయ్య పలుకనే లేదు... ఇల్లు చేరుకొని పంచెమీద కప్పుకొని మునగదీసుకొని పడుకున్నాడు..రాత్రయ్యింది.. అందరు తినిపోయిండ్లు...

                ''ఏంది మునిమాపు ముసుగు బెట్టుకొని పన్నవ్‌'' భూదేవి పంచె తొలిగించింది.

                సాంబయ్య కళ్లల్లోనీళ్లు... భూదేవి మనుసు కలికలైపోయింది...

                ''అదులుతారులే...లే..'' అన్నది భూదేవి...

                ''నీ కెరికలేదే?'' అన్నాడు సాంబయ్య...

''ఎదిగిన కొడుకు కాలేర్ల మీదికి బోతె సేతెట్లని గాదు నీ పీకులాట - మన కట్టం మనకుండనే ఉన్నది...''అన్నది.

                సాంబయ్య ఇంకా పొడిగించలేదు. ఏదో తిన్నాడనిపించి మళ్లీ పడుకున్నాడు - తన చిన్నతనం యవ్వనం పంటలు కరువులు, కాటకాలు, వర్షాలు అన్న ఒక్కక్కటే గుర్తొస్తున్నాయి... ఆ రాత్రంతా సాంబయ్య నిదుర పోనేలేదు...

   5  

 

                మొగిలి ఏదో కూని రాగం తీసుకుంట తొండం తాడిగ్గి మోట పోనిచ్చిండు - కందెనలేక గిరుక కిర్రుకిర్రు మని రాగం తీత్తంది. అంబటేల్లయిపోయింది. బాయిల నీళ్లొడిసిపోయినయ్‌ ''ఇగో మోటిడుత్తన్న - గ కాలువకేసి పార పెరట్లదాసి రా '' పెరట్లకు కేకేసిండు....

                రాజేశ్వరి సప్పుడు చెయ్యలేదు. మొగిలి మోటవిడిచి ఎడ్ల మూతులకు బుట్లు గట్టిండు... ఇంతలోకే రాయేశ్వరొచ్చి బొదట్ల నీళ్లల్ల కాల్లు చేతులు కడుక్కుంటున్నది. వెనుక నుంచి మొగిలి రాయేశ్వరిని పట్టుకున్నాడు.

                ''ఇడువ్‌...ఇడువ్‌... ఎవలన్న సూత్తే'' రాయేశ్వరి

                ''నేను మొగన్ని గాదా? నువ్వు పెండ్లానివిగాదా?''

                ''మోటుసరసం...'' దూరంగా జరిగింది...తను జరిగాడు...''సూడు...సూడు'' రాయేశ్వరి వెక్కిరింతగా నవ్వింది.

                మొగిలి బిత్తరపోయి చూసిండు...

                ''బాయిపనికి గిట్లనే పోతవా - సెవుల మీదికి సౌరం బెరిగింది - పెంటరదీయించుకో - జుట్టు సూడు - గది సూత్తే అడివిలనుంచి తప్పచ్చిండంటరు - జుట్టు కత్తెరేపిచ్చుకో...

                ''జుట్టా - మా అవ్వ సీపురుకట్టమర్రేత్తది ఎరికేనా?''

                ''అట్లనే ఉంచుకో - పోయేటప్పుడు సెప్పు నూనె బెట్టి నున్నగ దువ్వి కొసకు బంతిపువ్వు గడుత'' అన్నది ఇంకా నవ్వుతూనే...

''ఏయి ఏమనుకుంటన్నవో...'' రాయేశ్వరి మీది కురికుండు..

                రాయేశ్వరి అందకుండా గెట్టు మీది నుండి పరుగెత్తింది... మొగిలి వెంటపడ్డాడు...

                ''అగో అటు చూడు '' అన్నది...

                మొగిలి ఆగి చూసిండు ఎడ్లు పెరట్లో తడితొక్కుడు తొక్కుతున్నాయి.

                రాయేశ్వరి ఎగపోస్తూ కూలబడిపోయింది. మొగిలి ఎడ్లను కొట్టుకొచ్చాడు.

                ఇద్దరు ఇంటితొవ్వ బట్టారు.

                ''ఔగని నన్నెప్పుడు తీస్కపోతవ్‌...?''

                '' ఆలు లేదు సూలులేదు కొడుకు పేరు సోమలింగం '' అన్నాడు మొగిలి...

                రాయేశ్వరికి బుగ్గలు ఎరుపెక్కినయ్‌... తనకు నెలతప్పిన సంగతి మరిచేపోయింది...

                ''ఔ...'' అన్నది...

                ''ఏందే...?'' మొగిలి...

                ''ఏమి లేదేమిలేదు...'' రాయేశ్వరి మాటమార్చింది...

                ''ఇగో నన్ను జెప్పన తీసుకపో... నాకు నువ్వులేకుంటె ఎట్లనో ఉంటది...'' రాయేశ్వరి...

                ఇద్దరు నడుస్తున్నారు... మొగిలి కొంత దూరం నడిచి మళ్లీ ఆగి ''అయితె జుట్టు కత్తెరేపిచ్చుకోమంటవ్‌?''

                ''ఔమల్ల...''

                ''మా నాయిన బడికే పంపకపాయె. సదువుకుంటే గియ్యన్ని తెలిసేది. నువ్వు మూడో తరగతి చదివినవన్నరు''

                ''ఔ. సదివిన పిల్లకు మనతగ్గ పిలగాడు దొరకడని మాన్పిచ్చిండ్లు''

                నెత్తి గోక్కున్నడు... ఆదారంట మాదిగోళ్లు తంగెడు కట్టెత్తుకొని వచ్చారు...

                ''ఏమవ్వో రాయేశ్వరవ్వ... ఎప్పుడు నీల్లుపోసుకుంటవవ్వో.'' బాన పోసు అడిగింది...

                ''పోయే..'' అన్నది...

                '' అవ్వ ఇదేం సోద్దెమవ్వ... నువ్వసలు బిడ్ల గనవా?'' అన్నది పొట్టి బాను...

                వాళ్లు వెళ్లిపోయారు... మొగనికి చెప్పాలనుకున్నది...

                ఊరచ్చింది. ఇద్దరు ఏమెరు

                ఇల్లచ్చింది... ఇంటి ముంగట రమేశ్‌ పుస్తకాలు పట్టుకొని ఎదురయ్యిండు...

                ''నువ్వు అయ్య వైతన్నవ్‌'' అనేసింది తలవంచుకొని లోపలికి పోయింది రాయేశ్వరి...

                మొగలి నిలబడిపోయిండు. చప్పున అర్థం గాలేదు. అర్థమై ముసిముసి నవ్వుకుంట ఎడ్ల కట్టేసిండు...

                ''ఇగో అఅవ్వా నేను మంగలోనికాడికి పోతన్న సౌరం తీయించుకుంట నీళ్లు కాగబెట్టు '' అనికేకేసిండు...

                ''మంగళారంరా?'' అన్నది భూదేవి

                ''సోమారం సొతుకు, మంగళారం మటుకు... అన్నీ అంకలే నేనుబోతన్న...'' అని బజాట్లకొచ్చిండు మంగళాయన సర్పంచ్‌ వీరయ్యకు గడ్డం గీకిరాను బోయిండు. మొగిలి పోయిన గంటకొచ్చిండు.. మిగతా ముగ్గురికి చేసినంక మొగిలికి చేసిండు...

                మంగలాయనికి కటింగ్‌ చెయ్యరాదు.. పేండ్లుకొరికి నట్టు దాట్లు దాట్లు చేసిండు - కత్తిరిచ్చిన జుట్టు చూసి మొగిలికి బాధ కలిగింది...

                వాకిట్లకే భూదేవి ఎదురచ్చింది..

                ''అయ్యయ్యో తురుకోనివా? దూదేకులోనివా జుట్టేదిరా?'' నోరునొక్కుకున్నది...

                ''తియ్యి తియ్యే - జుట్టు బెట్టుకొని కాలేరు మీనికెట్ల బోవాలె?'' అన్నడు.

                ''అదెరా కాలేరుకు జుట్టేం అడ్డమురా?''

                ''నీకెరుక లేదు లేయే''

మొగన్ని చూసి రాయేశ్వరికి నవ్వాగింది కాదు.... అత్త కోప్పడుతుందని నవ్వాపుకున్నది...

  6  

                తెల్లారితె బుదవారం... మొగిలి పెరట్లకు పండబోనే లేదు... సాంబయ్యే పండబోయిండు. ఆ రాత్రంతా సాంబయ్య నిదుర పోనేలేదు... అర్థ రాత్రి దాటినంక ఇంటికచ్చి అందరిని ఆదర బాదరగ లేపిండు...

                ''ఏమే లే..లే. ఎసరుబెట్టు - ఆడ అవ్వోడ అయ్యోడ.. కాసిన్ని బియ్యం బెట్టు... తిని పోతడు బస్సచ్చే యాల్లయ్యింది - మొగిలి లేరా.... మొఖం కడుక్కో...'' లేపిండు. భూదేవి లేచి బయటకొచ్చి సుక్కలు చూసి'' ఇంకా తెల్లారే సుక్క పొడువనే లేదు బస్సుగిప్పుడే వత్తదా?'' అన్నది ఆవులిస్తూ...

                ''మొగిలీ.... చెప్పద్దే అనుకున్న..కని చెప్పకపోతే ఎల్లేటట్టులేదు. కాలేరంటే కండ్లు మెరిసే దినుసుంటయి. ఇగో నన్ను మతికి బెట్టుకో... మనం కాలేరును నమ్ముకునేటోల్లంగాదు - భూమిని నమ్ముకునేటోల్లం - అయిదారేండ్లు జెర పెయిల భయంబెట్టుకొని సెయ్యి. అప్పు సప్పులు దేరనంక ఇంకో ఎకరం పొలం తీసుకుందాం! ఇన్నవా? నీ కొలువు కోసం పెరడి రయిను బెట్టి రెండు వేలు అప్పు దెచ్చిన - గది మతికుంచుకో.. అందరి తీరు కొత్తలు సేతులకు రాంగనే సింగన మద్దీలాడకు''

                మొగలి కివన్ని తలకెక్కడమేలేదు.

                ''సరెసరెనయ్య పోరన్ని పోకముందే గిన్నికట్టడి జేత్తన్నవ్‌...'' భూదేవి...

                ''నేనేమంటన్ననే... సెప్పద్దా? ఆడో సిన్నపోరడు గాదు. ఆయింక మానాయిన సెప్పలేదనే సొడ్డెందుకు?'' రాయేశ్వరి ఆకిలూడిసింది. పొయ్యంటుబెట్టింది.

                 మొగిలి పండ్లు దొముకున్నాడు...

                ఈగడబిడకు రమేశ్‌ లేచిండు...

                ''అన్నా! అన్న నాకు మాంచి అంగిలాగు దేవాలె'' అన్నాడు సాంబయ్య దగ్గరకూకుంటు -

                ''మాతెత్తడులేరా? నువ్వెందుకులేసినవ్‌ - అల్లుకు బోతే పిల్లిని సంకల బెట్టుకపోయినట్టు తుమ్ముతవో దగ్గుతవో పండుకో'' తల్లి.

''నేనేం తుమ్మ.నువ్వే నశం బీర్సుకొని తుమ్ముతవు'' అన్నాడు పిలగాడు...

                తెల్లారే సుక్క బొడిసింది. మొగిలి పెండ్లిల్ల అత్తగారు బెట్టిన దోతికట్టుకున్నడు. కమీజేసుకున్నాడు. నెత్తికి నూనెరాసుకున్నాడు...

                సుక్క బొడువంగనే తండ్రి , తల్లి, తమ్ముడు వెంటరాగ ఇల్లు బయలెల్లిండు.

                ''పెదనాయినకు జెప్పిరాపోర'' అన్నాడు సాంబయ్య...

                ''అయినెందుకుమజ్జెన'' భూదేవిగునిసింది.

                ''నీకెరుకలేదే - మమ్ముల ఇంతప్పటి నుంచి సాది సవరచ్చెన జేసిండు'' సాంబయ్య

                ''మీరుమీరొక్కటె - మజ్జెన నేనేఏరుడ్డం'' భూదేవి

                ''పెదనాయినా ఓ పెదనాయినా'' పిలిసిండు మల్లయ్య. తలుపులు తీసిండు. అతనివెనుక అతని భార్య లింగమ్మ నిలుచున్నది...

                ''పెదనాయిన నేనుబోతన్ననే''  వంగి కాళ్లు మొక్కుతూ.

                ''పోయిరా కొడుక! క్షేమంగబొయి లాభంగ తిరిగిరా. మీకురెక్కలచ్చినయ్‌ - మమ్ములిడిసి పోతండ్లు మా కట్టం మాకే       ఉన్నది. జెర ఎవ్వల తెరువుకు బోకు'' అన్నాడు మల్లయ్య.

                ''పెద్దవ్వ నేను బోయత్తనే...''

                ''పొయిరా బిడ్డా''

                బజాట్లకొచ్చిండు. అప్పుడు యాదికొచ్చింది ఎంప్లాయ్‌మెంటు కార్డు - లోపటికిబొయి తెచ్చుకున్నడు.

                ''శంకరి ఇల్లు మతికున్నది గదా?''

                ''గుడికాడ దిగుతే ఎడంసెయ్యిబాజు మామతికున్నది...''

                ఊళ్లె నుంచి అటేటు బోంగనే బర్ల పాలుబిండుతన్న సాయమ్మ ఈతలికచ్చింది.

''అయ్యో బిడ్డా పోతన్నవా? మావోడు దుర్గయ్య సుత రకం బట్టుక పోయిండు. ఆరం దినాలాయె అతీగతీ తెలువలేదు. రెండు బర్రెకుక్కలమ్మిచ్చిన... జెరంత ఉత్తురం రాయిమను కొడుకా? సదివి సదివి బేకారై పోయిండు...'' అన్నది....

                                ''అరె రకం మంచిగ బెట్టుకున్నవ - నడికట్ల బెట్టుకో - బస్సుల్ల జేబులు కోసెటోల్లుంటరు.'' సాంబయ్యకు రకం యాదికొచ్చింది...

                ''రాయేశ్వరీ - నువ్వు జెర ఇంటికాడుండు పో ఈన్ని బస్సెక్కిచ్చత్తా'' అన్నది భూదేవి...

                రాయేశ్వరి విధిలేక ఎనకెనుకకు సూసుకుంట ఇంటికి బోయింది.

                మొగిలి వాళ్లు బస్సుస్టేజీ కొచ్చేసరికి ఆడ మాదిగోళ్ల పెద్దిరాజాలు, ఆని పెండ్లాం కూసుండి ఉన్నరు. బస్సు ఇంకా రాలేదు.

                కాసేపటికి లింగయ్యచ్చిండు...

                'మాలచ్చిమికి మల్లచ్చే సోమారమత్తనని చెప్పు'' అన్నాడు...

                కోళ్లు గూసినయ్‌. సాంబయ్య ఏం మాట్లాడకుండ వేపచెట్టుకింద కూర్చున్నాడు... బస్సచ్చేవేళయింది. తూరుపు రేకలు వారుతున్నాయి. అప్పటికే సుట్టుపక్కల ఊళ్లోల్లు మరికొంత మంది వచ్చి చేరిండ్లు...

                ఇంతలో రాయేశ్వరి ఎగపోసుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో చిన్న గుడ్డ మూటున్నది...

                ''అత్తా సర్వపిండి మర్సిపోయిండ్లు'' అన్నది.

                ''అయ్యో నామతిమండ...'' అన్నది... భూదేవి.

                ''అద్దులేవే...'' అన్నాడు మొగిలి.

                రాయేశ్వరి తీసుకొమ్మన్నట్టుగా చూసింది. విధిలేక తీసుకున్నాడు.

                ఇంతలోకే బస్సచ్చింది...

మొగిలి బస్కెక్కిండు.... బస్సుకదిలింది... సాంబయ్య బస్సుదగ్గర నిలుసున్నాడు. అతని కండ్లల్లో గుబగుబ నీళ్లూరినయ్‌. బస్సు కదిలింది. కిటికీ లోనుంచి మొగిలి వంగి చూసిండు - తల్లి కొంగుతో కళ్లు తుడుచుకుంటోంది. రాయేశ్వరి ఎగిరెగిరి చెయ్యూపుతోంది... తండ్రి అట్లాగే  నిలుచున్నాడు...

                మొగిలికి ఎక్కన్నో కలుక్కుమన్నది...

                                                                                           (తరువాయి భాగం వచ్చే సంచికలో)

సైరన్ (నవల)

గత సంచిక తరువాయి భాగం                                                    

             బస్సు అక్కడక్కడ ఆగుతూ - మందిని దించుతూ, ఎక్కించుకుంటూ సాగిపోతోంది. మొగిలి అత్తగారింటికి పోతున్న కొత్త కోడలులా బితుకు బితుకు మనుకుంటూ బసస్సులో కిటికీపక్క కూర్చున్నాడు. గుడిమెట్టుదూరమైపోతోంది... కంచెలు, చేండ్లు - వాగు అన్నీ దూరమై పోతున్నాయి. ఆనకాలం అదే గుడిమెట్టుకింద - టేకు  చెట్ల అడివిలో తుపతుప సినుకులు బడంగ తవిసి గడ్డలు తవ్వుక తినడం -  ఎంకట్రాజయ్య మాట్లె సేపలు పట్టడం - నెత్తిమీదికి  వంగిన మబ్బుకింద - జలజల తెల్లగ పారే నీళ్లల్ల మడి దున్నడం - సలి... వరి కుప్పలు - కుప్పల కాడి ముచ్చెట్లు -సలికాలపు నెగల్లు ఎండకాలం -బజార్గల్ల ఆటలు- అయ్యగారి మామిడితోట్ల మోరుగాళ్ల తెనుగు బాలయ్యను ముప్పు తిప్పలు బెట్టి మామిడి కాయలు దొంగతనం చెయ్యడం - ఎన్నెల రాత్రుళ్లు కోలాటాలు, నాగన్నతో కలిసి ఊర్లు తిర్గడాలు - కొడార్లు - కొడార్లలల్లో ముచ్చెట్లు - రాయేశ్వరి... గుండె గుబగుబలాడింది....

                అప్పటికే బస్సు పైవింక్‌ లైను దగ్గర ఆగింది... సైకిల్లమీద బొక్కటోపీలు బెట్టుకొని మసి బట్టలేసుకొని కార్మికులు బాయికేసి ఉరుకులు పరుగులు బెడ్తండ్లు - పట్నంతుమ్మ చెట్టుకింద తట్టలన్నీ పర్సి ఉన్నాయి - బొగ్గులా నల్లగా ఉన్న ఒకామె చాయ్‌ అందిస్తోంది - అక్కడ డ్యూటీ దిగినోల్లు నీర్సంగా మాట్లాడుకుంట చాయ్‌ తాగుతండ్లు. దూరంగా కనిపించే గొట్టాలల్లి నుంచి పొగ నీర్సంగా లేత్తోంది. బీరపువ్వురంగు లారీలు దబడదిబడ ఉరుకుతన్నయ్‌... బస్సుకదిలింది... మోరీ దగ్గర బర్ల మంద ఎదురచ్చింది. అటెటు బోతె లుంగీలు గట్టుకొని సానామంది తిరుగుతండ్లు - బస్సు హస్పటల్‌ దాటింది - ఎంతపెద్ద బంగుళలో అనుకున్నడు మొగిలి...

                ''ఓ పటేలా ఇంకేడదిగుతవ్‌ - రామ్‌మందరమచ్చింది'' అన్నాడు కండక్టరు...

                మొగిలి ఉలిక్కిపడి లేచిండి. బస్సుదిగబోయిండు. సర్వపిండి ముల్లె మరిచిపోయి మళ్లీవెనక్కి ఉరికి తెచ్చుకున్నాడు. డోరుపక్కనున్న కళ్లద్దాలవాడు కిసుక్కున నవ్విండు...

                బస్సు కింద దిగంగనే మొదట ఏమి కన్పియ్యలేదు. బొగ్గు పొగ మావురుగప్పినట్టు... ఒకల మొఖలొకలికి కన్పియ్యకుంట - కమురు కమురువాసన... సైకిల్లు వస్తూ పోతున్నాయి.. పట్నంతుమ్మ సెట్టు మోరీ కింద పందులు ఘర్‌గర్‌మంటున్నాయి... ఆపొగకు మొగిలి కండ్లు మండినయ్‌ - దగ్గచ్చింది.. కాసేపునిలబడి పట్నం తుమ్మచెట్లల్ల గుడిసెలను పోల్చుకున్నాడు.. ఎడంబాజు నడిచాడు..

                రోడ్డుకింద సెట్లకింద పోరగండ్లు ఏరుగబోతండ్లు. 'పోరగండ్ల కగ్గిదల్గ అటేటన్న బోలేదు' అనుకున్నాడు - గబ్బువాసన గప్పున కొట్టింది. ముక్కుమూసుకున్నాడు. అటేటు నడిచేసరికి భూమిలనుంచి పొడుచుకొచ్చిన నల్ల - నల్లసుట్టూ నీల్ల మడుగు. నీల్ల మడుగులనే కుండలు బిందెలు బెట్టుకొని ఆడోల్లు కొట్లాడుతండ్లు.

                ''నీ మొగడే పోతడుగని డ్యూటీకి మా మొగలు సాపుక పంటరా?'' ఓ కర్రెపడుసామె ముఖమంతా రెచ్చిపోంగ అంటున్నది...

                ''సాపుకపన్నది సాల్లేదా?'' అన్నది ఇంకోముసలమ్మ....

                ''లంజె నా సవితి... లాకలాంపంటం'' అన్నది ఇందాకటామె. బిందెలు తోసేస్తూ తను జబర్దస్తీగా బిందె నల్ల కింద బెట్టింది.

                ''దానికియ్యిండ్లి నీళ్ళు- దానిమొగడు బుడ్డలీడర్‌ సాబాయె'' అన్నారెవరో?

                ''ఎవలకు లీడరు?''

                ''ముప్పయారు జుట్లు గల్సుంటయిగని మూడు సికెల్‌ గల్సుండయట - జెరతాములుగ ఒక లెనుక ఒకలు పట్టుకుంటేందో?'' అనుకున్నాడు మొగిలి...

                ముందటికి నడిచాడు. ఇరుకువాడ.. గుడిసెల ముంగట చెత్తా చెదారం నిండున్నది. - నల్లనీల్లు రోడ్డుమీదనే పారుతున్నాయి. ఆడాడ బొందలు జేసి పందులు తొక్కుతున్నాయి...

                ఓ గుడిసెకు ముందు - చెక్కుకపోయిన కంకబద్ద లాంటి వాడొకడు డ్యూటీ బట్టలు ఇడువకుండానే గడంచలో కూర్చుండి కడుపుల పేగులు బయటకొచ్చేలాగా దగ్గుతున్నాడు - ఆ ముఖంలో నెత్తురు పేరుకొచ్చింది. కండ్లు పేలిపోయే విధంగా పొడుచుకొచ్చినయ్‌..

                ''అదెనయ్యా తాగుడింట్ల పీనిగెల్ల తాగద్దంటె ఇనవ్‌..దగ్గిదగ్గి మమ్ముల గంగల గలుపుతవ్‌గని'' ఇంకో జెరంత ఒత్తు పెయ్యామె గులుగుతోంది

                ''తాగకుంటెందో?'' అనుకున్నాడు మొగిలి.

                మరికొంత దూరం నడిచేసరికి శంకరయ్య ఇల్లచ్చింది. రెండు గుడిసెమధ్య మనిషి బోయేంత సందులనుంచి తొవ్వ... ఆ గుడిసెలెనుక శంకరయ్య గుడిసున్నది... మొగిలి పోయెటాల్లకు... గుడిసెముందు అంపుల కాడ లక్ష్మి కూకుండి బాసండ్లు తోముతోంది. ముఖమంతా  ఉబ్బున్నది... ముక్కుకింత మసున్నది...

                ''అన్నున్నడా! అదినే'' మొగిలి నిలబడి...

                ''ఓ నువ్వా మొగిలి...'' అన్నది ముఖం మీదికి సంతోషాన్ని తెచ్చుకుంటూ... ఇంటెనుక ఇనుపపొయ్యిల బొగ్గుమండుతంది.

                ''లక్ష్మి లేచి చేతులు కడుక్కొని కొంగుకు తుడుసుకున్నది.. కాళ్లకు నీల్లిద్దామని చూస్తే ఒక్క కుండలోనన్నా నీళ్లులేవు ఏది కరువే'' అని గొనుగుతూ...అడుగులు బొడుగులు జమచేస ియిచ్చింది. చేతులున్న మూటెక్కడ బెట్టాలో తెలువక దిక్కులు చూసిండు...

                ''ఏందది - నా కోసం తెచ్చినవా?'' అన్నది నవ్వుతూ లక్ష్మి. ఆ నవ్వు నవ్వులాగా లేదు...

                ''మాఅవ్వ గట్టింది. సర్వపిండి...'' అన్నాడు సిగ్గుపడుతూ...

                ఇటియ్యి అని చొరవగా గుంజుకున్నది...

                మొగిలి కాళ్లు కడుక్కున్నాడు - నవారు మంచం లోపలేసింది... అంగి గుడిసెలకు బొవాలె... గుడిసె ఎత్తు లేదు. లోపటికి నడిచిండు... కాసేపు ఏమి కన్పించలేదు. ఆ తరువాత మంచం కన్పిచ్చింది - కూర్చున్నాడు... ఇల్లంత బోసిగున్నది... ఒకపక్క పొగచూరిన పోటో ఒకటున్నది. అందట్ల లక్ష్మి, శంకరయ్య సగమే ఉన్నారు. నిట్టాడు దగ్గెర తడుక గట్టున్నది - తడుకకు మాసిన బట్టలున్నాయి...తాటికమ్మటోపి...లోపట బోళ్లుబొక్కలేవి ఎక్కువ లేవు...

                ''ఏందట్లా సూత్తన్నవ్‌...'' అన్నది లక్ష్మి

                ''అన్నలేడా?'' అన్నాడు...

                ''నాత్రి బజిలికి బోయిండు... అత్తడు...కూకో'' అన్నది...

                బొగ్గుపొయ్యి ఇంటి ముందటికి తెచ్చి చాయ్‌కు నీల్లు బెట్టింది...

                ''నేను బువ్వదినచ్చిన'' అన్నాడు మొగిలి...

                ''ఏమరిగిపోవులే...'' అన్నది లక్ష్మి...

                మొగిలికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజానికి లక్ష్మి తనకన్నా ఒక్కేడు చిన్న... మనిషి అట్టకట్టుండేది ఇప్పుడో ఎండిపోయింది...

                ''మా అవ్వ, తమ్ముడు గినమంచిగున్నరా?'' అడిగింది లక్ష్మి..

                ''ఆ మీ నాయిన మల్లచ్చే సోమారమత్తనన్నడు...'' అన్నాడు...

                లక్ష్మి పేగుల సర్వపిండి విప్పుకొని కొంచెం తిన్నది.

                ''అత్త సర్వపిండి బెడితే బాగుంటది  -  నేను తింటున్న'' అన్నది.

                మరికాసేపు వాగు గురించి, మనుషుల గురించి, పంటల గురించి, పేరుపేరున  అడిగింది. మొగిలి సిగ్గుపడుతూనే చెప్పుకొచ్చిండు...

                గాజుగ్లాసులో చాయ్‌ తెచ్చియిచ్చింది... ఊదుకుంట తాగిండు...

                ''సెల్లె నీళ్లు బోసుకున్నదా?'' అన్నది లక్ష్మి గడుప అవతల కూర్చుండి తను చాయ్‌ తాగుతూ...

                ''ఎహె...ఎహె....నాకేమెరుక'' అన్నాడు మొగిలి - ఆ సిగ్గులో నాలిక చురుక్కుమన్నది...

                లక్ష్మి, మొగిలి సిగ్గును చూసినవ్వింది...

                ''మీ అన్నచ్చే ఏల్లయ్యింది... తానానికి ఉడుకునీళ్ళు లేకుంటే సింగిబింగాడుతడు'' అనిలేచి నీల్ల బిందె బట్టుకొని నల్లకాడికి పోయింది...

                చాయ్‌తాగి మొగిలి బయటకొచ్చిండు...అంత మాలోకంలో ఉన్నట్టున్నది... నడికట్టుకు కట్టుకున్న డబ్బుతీసి జేబులో పెట్టుకున్నాడు...వాకిట్లో తిరుగుదామన్నా మూడడుగులే లేదు...

                టయిమెంతయ్యిందో? పొద్దు అంబటేల్లయ్యింది... అప్పుడు వచ్చిండు శంకరయ్య.

                శంకరయ్యను మొగిలి గుర్తుపట్టనేలేదు. పెద్దబొగ్గుపెళ్ల నడిసచ్చిట్టచ్చిండు. నెక్కరంతామసే - కాళ్లకు తక్కెడుతక్కెడు బూట్లు - నెత్తిటోపిసుత నల్లటిదే...

                ''ఎప్పుడచ్చినవ్‌ తమ్మీ?'' అన్నాడు శంకరయ్య.

                అప్పుడుగుర్తుబట్టిండు మొగిలి - ''పొద్దటి బస్సు కచ్చిన్నే'' అన్నాడు...

                ''ఏదీ లచ్చేది?'' అన్నాడు.. చిరాకుగా...

                ''నల్లకాడికి నీళ్లకు  బోయిందే''

                ''ముండ తెల్లారెదనుక బంటది... కలువ కొయ్య బెడితెనే మంచి గుండె..''బూట్లిడుసుకుంట...

                మొగిలికి ఏమనాలో తోచలేదు...

                ''మందికి మార్నగాలంబుట్ట ఒక్క బిందెడన్న పట్టుకోనిత్తలేరుగద'' అనుకుంటొచ్చింది లక్ష్మి...వాకిట్లో మొగన్ని చూసి నోరు మూసుకున్నది.

                ''నీల్లేసినావే'' దాదాపుగా అరిచినట్టుగా

                ''మా ఏసిన'' అన్నది లక్ష్మి....

                ''పట్టు...బయటికి బట్టు ఊళ్లెకు బోవాలె - మొగిలికి చాయిచ్చినవా? చాయ్‌ తాగినవా?'' అడిగిండు

                ''మా తాగిన్నే''

                శంకరయ్య స్నానం చేసి పైంటేసుకున్నాడు.. బుస్సర్టేసుకున్నాడు - తాటికమ్మ టోపీ పెట్టుకున్నాడు

                ''ఎరుకల బుట్ట తీర్గ ఏం మంచిగున్నది'' అనుకున్నాడు మొగిలి...

                ''పైసలు దెచ్చినవా? పోదాంరా? లీడరోనికి గలువాలె'' అని బయటికి దారి తీసిండు.

                ఇద్దరు కలిసి సందుగొందులు దాటిండ్లు - మూల మలుపు దగ్గర పాన్‌ టేల ఒకటున్నది... టేలాలో గుండ్రగ కుది మట్రం గా ఉన్న గడ్డపాయనొకడు కూర్చున్నాడు...

                ''క్యా బయి...'' అన్నాడు టేలాయన...

                టేలా ముందు నలుగురైదుగురు నిలుచున్నారు...ఒకడు ఏదో పైటింగ్‌ సినిమా గురించి చేతులు తిప్పుతూ చెప్పుతున్నాడు...

                ''నువ్వెన్ని చెప్పునాకు దర్మేంద్రంటే పడదు...'' అన్నాడు పొడుగు వెంట్రుకలవాడు.

                ''ఆడిగుల్ల్లోకు గట్లనే ఉంటది... ఇన్నవా? ధర్మేంద్ర పైటింగ్‌ నీకేమెరుక...'' అన్నాడు కుడిచేతికి ఉన్న కడాన్ని రాసుకుంట ఇంకోడు...

                ''నమస్తే శంకరన్నా'' అన్నాడు బక్కటోడు...

                ''నమస్తే.. పనికి బోతన్నవ'' అన్నాడు శంకరయ్య

                ''ఏడ - ట్రేనింగయిపోయి దగ్గెర దగ్గెర నాలుగునెల్లయిపోయినయ్‌...''

                ''ఇప్పుడేంజేత్తన్నవ్‌?''

                ''ఏమున్నది - ఏజెంటాఫీసు ముంగట పులిజూదమాడబోతండు.. హేమమాలిని బొమ్మలు సూసుకుంట తిరుగుతండు'' అన్నాడెవడో...

                ''యాకుబ్‌..దోపాన్‌ బనావో...'' అన్నాడు శంకరయ్య.

                ''పత్తి జర్ద అయిపోయింది.... మాక పొట్టేగాన్ని తోల్తే ఇంకారాలేదు... ఇంకోటి ఎట్ల సార్‌....'' పాన్‌షాప్‌వాలా... శంకరయ్య మొగిలి మొఖంలోకి చూసిండు...

                ''మీఠా...'' అన్నాడు...

                ''నయాచోకరా?'' అన్నాడు పాన్‌వాలా...

                ''మావోడే...'' అన్నాడు శంకరయ్య...

                ''అబ్బో శంకరన్నకు బాగనే పతారున్నదే'' అనుకున్నాడు మొగిలి.

                తనోటివేసుకొని మొగిలి కొకటిచ్చిండు - '' నాకద్దన్న నాకద్దనుకుంటనే -'' తీసుకున్నాడు మొగిలి - ఓ పొడుగుసిగరెట్టు ముట్టిచ్చిండు శంకరయ్య - గణేశ్‌ బీడికట్ట జేబులేసుకున్నాడు... ఇంకో సిగరెట్టు మొగిలికిచ్చిండు.

                ''నాకదన్న''

                బాయిపనికి మొదలిది... సిగిరెట్టు తాగనోనివి బాయిల పనేం జేత్తవ్‌... నేర్సుకో..'' జబర్దస్తీగా యిచ్చిండు...బుక్కనిండా ఉమ్మి ఊంచాలో వద్దో - సిగరెట్టు ముట్టిచ్చిండు -ఎట్లా తాగడం చూయించిండు శంకరయ్య. మొగిలికి మొదటిబుక్కలో దగ్గచ్చింది... కండ్లల్లకు నీల్లచ్చినయ్‌... పాన్‌ ఊంచిండు...

                ఇద్దరు రోడుమీద నడుస్తున్నారు. కొంత దూరం నడిచిన తరువాత ఏందో యాదికొచ్చినట్టు ఆగిపోయి మళ్లీ వెనక్కి నడిచాడు శంకరయ్య... రోడ్డుమీద నిలుసుండి బిక్కిరిబిక్కిరి చూసి జేబులోనుంచి పైసలు దీసి లెక్క బెట్టిండు...ఎనిమిదో తొమ్మిదో రూపాయలున్నాయి...'' తమ్మీ నీ దగ్గరేమన్నా ఉన్నాయా?... ఇంటికి బోయినంకిత్త...'' అన్నాడు శంకరయ్య...

                ''పదిరూపాలల్ల టికట్టుబోను  సిల్లర ఉన్నది...'' అని జేబులనుంచి తీసిచ్చిండు...

                ''ఇగో ఆరున్నరున్నది..'' అనుకుంట మార్కెటుకేసి నడిచిండు... మొగిలి వెంట బడ్డాడు. మార్కెట్ల వాడిపోయిన కూరగాయలు - గుడ్లు - ఈగలాలే చేపలు - ఓమూలకు గుంగురెంటికల కటికయిన దగ్గర మాంసం - జనం తొక్కిసలాడుతండ్లు. ఆడోల్లు ఏర్రగబుర్రగున్నోల్లు ఆ దుమ్ముల్నే దస్తిగుడ్డలు ముక్కుల కడ్డంపెట్టుకొని సింగులెత్తి పట్టుకొని బేరాలు చేస్తండ్లు - డ్యూటీల మీదచ్చిన కార్మికులు సేతుల్ల సైకిల్లు బట్టుకొని కొంటండ్లు

                ''బాలకిట్టు - జెరంత మంచిది సూసి కిలో మాంసమియ్యి...'' శంకరయ్య దుబ్బల మోకాళ్లమీద కూకుండి కుడిచేత అటిటు తిప్పుతూ...'' అగో గ బరిబద్ద బొక్కలేం జేసుకోను... కారం గంతెందుకు..నల్లి బొక్కతియ్యి... అరెజెరంత తామూలుగ జోకు...''

                ''బయికన్పిస్తలేవ్‌...అయిదుకిలోల పైసలు రావాలె...''కటికాయన.

                ''ఇత్తయిత్త - దెంకపోతనా? ఆరు తారీకురానియ్యి అన్నీ ఇచ్చేత్త...'' అన్నాడు.. పైసలు దీసి యిస్తూ ''ఎట్లనే '' మొగిలి...

                ''కిలోలసొప్పున - కిలోకు పదిరూపాలు'' .

                ''అబ్బో'' అన్నాడు మొగిలి.

                ''బాయిపనోడు తగినట్టు కూరాకు దినకుంటే సేదగ్గు లేసి సత్తడు''

                కూరబట్టుకొని ఇద్దరు మరల ఇంటికొచ్చారు. లక్ష్మి అప్పటికి స్నానం చేసింది.

                                                                8

 

                సైకిలు దీసుకొని బజాట్లకచ్చిండ్లు - మొగిలికి సైకిలు ఎనుకెక్క రాలేదు - ముందట కూసుండ బెట్టుకున్నాడు...శంకరయ్య మొగిలి యూనియన్‌ ఆఫీసుకు చేరుకొనే సరికి పదైపోయింది. అప్పటికే అక్కడ పదిపదిహేను మంది జమై ఉన్నారు..

                యూనియన్‌ ఆఫీసు ముంగట ఒక సిమెంటు గద్దె ఉన్నది. గద్దె నడిమధ్యన జెండా ఒకటి ఉన్నది. మీద ఎర్రరంగు నడుమ తెల్లరంగు కింద పచ్చరంగు - మద్దెన చక్రమున్నది...

                శంకరయ్య సైకిలు నీడకు బెట్టచ్చిండు - యూనియన్‌ ఆఫీసుకు ఎడంగా ఒక వేప చెట్టున్నది. వేపచెట్టు కింద నల్లగ వాడిపోయిన అరటి పండ్లు బెట్టుకొని ఒక ముసలమ్మ కూర్చున్నది.. చెట్టు కింద కొంత మందిమట్టిలో కూర్చున్నారు. వాళ్ల మధ్యలో చెక్కుకపోయిన మొఖపోడు కూర్చుండి ''నమ్మినాన బోత్తె పుచ్చిబుర్రలయినట్టున్నది ఎవారం ఈలంజకొడుకుల ముడ్డిమూడు సుట్లు దిరిగేటాల్లకే గూట నరాలు గుంజుకత్తన్నయ్‌ - ఇగత్తదంటరు - అగచ్చే నంటరు.. రెండు వేలు రూపాలు దీసుకున్నరు. బాయి దొరలు పిలిసిరి. ఎద్దును సూసినట్టు పిక్కలు సూసిరి దోతిడిపిచ్చి సూసిరి - కండ్లు సూసిరి - అన్నీ సూసి బరువు లేవట్టిచ్చిరి ఆ - డాక్టరోడు మల్లా సూసె - ఇరవైయొక్కదినాలు. దినానికి మూడురూపాలిచ్చి ట్రేనింగు చేపిచ్చిరి... ఇగో అచ్చెననిరి ఈడికి మూన్నెల్లు గడిసిపాయె - అచ్చిందిలేదు సచ్చింది లేదు -'' అంటున్నాడు...

                ''అయ్యో అత్తది... అదేమన్నలం....? నౌకరీ గిట్లేగిరపడ్తె అయితదా?'' రాగెంటికలవాడు...

                ''నువ్వింక ట్రేనింగ్‌ జెయ్యలేదా?''

                ''రేపు మాపత్త దంటడు...''

                ఇందాకటోడు సిత్రంగా నవ్విండు...'' పొగాకున్నదా?'' ఎవడో పొగాకు చిన్నముక్కిచ్చిండు....దవడకేసిండు...

                వాళ్లకు కొంచెందూరంలో నిలుచున్నతను.. దారిలకు నిక్కి - నిక్కి సూత్తండు...

                మొగిలి వాళ్లకు కొంచెం దూరంలో నిలుచున్నాడు.

                ''ఈడిప్పుడిప్పుడచ్చేటట్టులేదు... దా అట్ల బొయి చాయ తాగిత్తామురా?'' అని మొగిలిని తీసుకపోయాడు శంకరయ్య. ఇద్దరు చాయ  తాగచ్చేటల్లకు ఆఫీసుముంగట స్కూటరున్నది. ఆఫీసు తలుపు తెరిచున్నది - ఇద్దరు లోపటికి నడిచారు...

                ఆపీసులో టేబిల్‌ - టేబిల్‌ ముందు కుర్చీలో కర్రెగా తునికిమొద్దు తీరంగున్నోడు కూర్చున్నాడు.

                ''నమస్తేసార్‌'' అన్నాడు శంకరయ్య...

                ''దాదాశంకరయ్య..కూకో...'' అన్నాడు...

                టేబిల్‌ మీద కాయిదాలున్నాయి... లీడరు నున్నగా దువ్వుకున్నాడు. తెల్ల ఖద్దరు బట్టలు.  లీడరు నెత్తిమీద  అంగేలేని ముసిముసినవ్వుతండు. ఇంంకో పక్క పిక్కుటం లాగేసుకున్నోడు టోపిపెట్టుకున్కోడు. అయినెనుక ఈ ముసలాయన నడుత్తండ్లు.

                ''అయతె అయింది లాపోతె లేదని సెప్పరాదుండ్లయ్య ఊకె కొలువా కుమ్మరియ్య - నాకు బాయి పని బాకి లేదని మల్ల మావూరికే పోయి పాలేర్తనం జేసుకుంట...'' ఇందాకటి చెక్కుకపోయిన మొఖపోడు...

                ''అయితది...ఎట్లనయ్య? ఉరుకులాడ్తె అయితాది. దేనికైనా యాల్ల రావాలె - నీ ముంగట నేను ఏజెంటుకు చెప్పలేదా? నామాటటుంచు దొరగూడ చెప్పె..'' ముఖంమీద పట్టిన చెమట తుడుచుకుంటూ -'' ఉఫ్‌ ఎండలు గిప్పుడే గింత గనమున్నయి... వీరసామిగా ప్యానేయి.. ఎడందిక్కు తింపు..వారీమొండోడ...'' పిలిచిండు - మొండోడనే పిల్లవాడొచ్చిండు...

                ''చాయ్‌లు పట్టుకరా?'' అన్నాడు.

                మొండోడు బయటికి నడిచిండు...

                ''సరే రేపొద్దున మల్లగలువు నేను ఏజెంటాపీసుకత్త... దొరగూడత్తడు.. అడుగుదాం..'' అన్నాడు.వీరసామి సల్లబడిపోయిండు...

                ఇంతలోకే పోనచ్చింది... ''నేను రాఘవులును...ఇంతకు మునుపే వచ్చిన్నుండి..కె.కె 2 బాయినా? రొయ్యకాళ్లోడా? లేబరొచ్చిండ్లు.. మాట్లాడిపోత...అట్లెట్ల సార్‌... స్ట్రయికంటె పదిహేను రోజులు ముందు నోటీసియ్యాలె... సరె నేను బోత సార్‌...''ఫోన్‌ పెట్టేసి కెకె2 బాయిమీద వోర్‌మెన్‌ ఎవన్నో కొట్టిండట - సమ్మెలకు దిగిండ్లట - కానియ్యిండ్లి నేను అర్జంటుగ పోవాలె...'' అన్నాడు...

                శంకరయ్య మాట్లాడాలని నోరు తెరిచిండు...

                ''శంకరయ్య ! సరే... కొద్దిగ మీరంతా ఆఫీసు బయటుండి ఒక్కొక్కరు వస్తే  పనైతది....అందరిక్కన్నే కూకుంటె ఏది మనుసున బట్టది'' అన్నాడు రాఘవులు. అందరు బయటకు నడిచారు... ముగ్గురి తరువాత శంకరయ్య మొగిలి లోపటికి నడిచారు...

                ''ఇగో నీ పేరేంది?'' అన్నాడు మొగిలినుద్దేశించి.

                ''మొగిలి''

                ''మొగిలి  తీసెయ్యి నీ పేరు రాజయ్య తండ్రి పేరు అయిలయ్య''

                ''కాదుండ్లి...'' మొగిలి...

                ''శంకరయ్య ఎక్కన్నుంచి తెచ్చినవోయి..నీ పేరు మీద కాల్‌రావాలంటే...ఇంక పదేండు ్లగావాలె...''అప్పుడు మొగిలికి ఎంప్లాయ్‌మెంటు కార్డు గుర్తొచ్చింది. తీసివ్వబోయాడు.

                ''ఉంచుకో - ఇగో నేనిచ్చేకార్డు తీసుక పో - నీ పేరు రాజయ్యని చెప్పు...తండ్రి పేరు అయిలయ్య వింటన్నవా?...''

                మొగిలి కిదంతా అర్థంగాలేదు..శంకరయ్య డబ్బుతియ్యమన్నాడు. తీసి శంకరయ్యకిచ్చిండు. శంకరయ్య రాఘవులుకిచ్చిండు రాఘవులు నల్లటి కాష్‌ బ్యాగులో డబ్బు కుక్కుకున్నాడు. ఏందో కాయిదం మీద రాసుకుంటూ..'' ఇదంతా మాకనుకునేవు శంకరయ్యా నీ కెరుకలేందేమున్నది - కిందినుంచి మీదిదాక ముట్టజెప్పాలే - మజ్జెన గీ పీకులాట మీకెందుకనేరు...ఏవున్నది యూనియనొకటే డిసింది గదా! మంచికో సెడ్డకో గిందట్ల సొచ్చినం - నడిపిచ్చుకరావాలె... బాయిమీద ఏమంటండ్లు శంకరయ్య. రావాలె... అన్నట్లు మన యూనియన్‌కు మీలాంటోల్లుంటేనేగదా! లట్టుగాడుపొట్టుగాడత్తరు - అది తెత్తము ఇది తెత్తమంటరు... అగెనిస్టోలు ఎన్నంటేంది. మీద ఎవరున్నరన్నదే కావాలే...ఇందిరమ్మ ఉన్నంత సేపు కార్మికుల హక్కులు గావాలంటే మన యూనియనే ముందట బడంది కలువది...'' అన్నాడు...

 

                శంకరయ్య మొగిలి మళ్లీ నమస్తే చెప్పి బయటకొచ్చారు...

                బయటకొచ్చిన తరువాత ''ఈనెవ్వలే?'' అన్నాడు మొగిలి...

                ''కాంగిరేసులీడరు...''

                ''గీనే బాయిలపనిత్తడా?''

                ''బాయిదొరలిత్తరు.. ఆళ్లకీళ్లకు కన్సల్టు రేపు ఇంటర్యూ..బర్తీరేపే...ఇంటన్నవా?''

                ''అట్లయితే మనమే బోయి గ పైసలు ఆళ్లకిత్తె గాదా?''

                శంకరయ్య బిగ్గరగా నవ్విండు...

                ''మొగిలీ గీడంత సాటుమార్గర - లీడరోడు సుత ఒక్కక్కలను సాటుకు బిలిసే తీసుకున్నడు...బాయిదొర గట్లనే తీసుకుంటడు. - నువ్వు లంచమిత్తనన్నవంటె మెడలమీద కట్టేసి ఈవలికి దొబ్బిత్తడు...''

                ''ఎందుకని?''

                ''లంచం తప్పు''

                ''తప్పయితే ఎందుకు తీసుకోవాలె?''

                ''లంచం నేటుకు తీసుకుంటె తప్పు...ఆడు ఊకెనే ఎందుకిత్తడు నౌఖరీ...''

                మొగిలి మరింక లాభంలేదని నోరుమూసుకున్నాడు...

 

                                                                 9

 

                జనరల్‌ మేనేజర్‌ ఆఫీసు ముంగట నూరు మంది దాకా కూసుండో నిలబడో ఉన్నారు... ఇంకా పగలు కాందే ఎండ దంచేస్తోంది.. ఆఫీసు కవతల వేపచెట్ల రోడ్డు మీద దబడ దబడ లారీలు వస్తూ పోతున్నాయి...దూరం గుడిసెలు ఎండలో కాలిపోతున్నాయి. దూరంగా నేలంతా బొగ్గు దుమ్ముతో నిండిఉంది. ఆఫీసు ముంగట ఒకటి రాలచేట్టు రెండు కానుగు చెట్లున్నాయి. రాల చెట్టుకింద రెండు పులిజూదం ఆటలు మాంచి జోరుమీద నడుస్తున్నాయి... ఆ ఆటల సుట్టూ పదిపదిహేను మంది నిలుసుండో కూర్చుండో పులి మేకలను తినడం చూస్తున్నారు.. కానుగు చెట్టుకింద నలుగురైదుగురు దుబ్బలో అడ్డదిడ్డంగా పడుకున్నారు... లాగులేసుకున్నోల్లు పదిమంది కన్నా ఎక్కువుండరు. మిగతా వాళ్లంతా దోతులోల్లే. కాల్లకు చెప్పులు లేనోల్లు - ముడుతలు బడ్డముతక బట్టలోల్లే ఎక్కువ...

                తీరిగ్గా  పాన్‌లు నములుతూ ముచ్చెట్లు బెట్టుకుంట - నవ్వుకుంట కొందరు వీళ్లను చూసి చూడనట్టు చూస్తూ ఆఫీసులోనికి పోతున్నారు.. స్కూటర్ల మీద కొందరు, కార్లమీద కొందరు వస్తున్నారు.. కార్లవచ్చినోల్లకు లోపలనిలుచున్న గూర్ఖా సలాములు కొడుతున్నాడు.

                ఆ మందిలో మొగిలి, శంకరయ్య ఉన్నారు. మొగిలి ఆఫీసు సుట్టున్న పడారి గోడ చూసిండు. గేటునుంచి లోపట నవనవలాడ్తన్న పూలచెట్లను - గాలికి కదులుతున్న నీలగిరి చెట్లను - పచ్చగా ఉన్న గడ్డిని చూసిండు. లోపట పచ్చరంగు బంగుళాలను వచ్చిపోయే వాళ్లను చూస్తున్నాడు.

                రెండోకానుగు చెట్టుమొదట్ల తోపుడు బండిమీద పండ్లు బెట్టకొచ్చిండెవడో? పండ్లు కొనేటోడు లేనేలేడు.

                రాల చెట్టు మొదులు కొరిగి కూచున్న సుక్కబొట్టోడొకడు.. ఆవుళించి పెద్దగొంతుకతో..'' గిదేదన్న అయితే బాగుండు.'' అన్నాడు.

                అతని పక్క కూర్చుండి కునికి పాట్లు పడుతున్నోడు ''రోట్లే తలబెట్టి రోకటి పోటుకు బెదురుతెట్ల''అన్నాడు కండ్లు మూసుకొనే...

                ''మొన్న గీన్నే ఏమయ్యిందంటే - అడెవడో ఎర్రజెండ లీడరోడట - ఆడచ్చినంక - గీన్నీ నీతీరుగనే కూరుకుపట్లు  బడుతున్న సోరొకడు అధాటున లేసిండు. అమాంతం లీడరు గళ్ల బట్టిండు -   నీతల్లి నా పైసలు నాకు పారసి మాట్లాడు... నీతల్లి ఎకురం సేనమ్ముకోనచ్చిన. కొలువు లేదు గంగరాయి రాలేదు. మల్ల మావూరికి బోతనన్నడు''  ఒక నడీడాయన చెప్పవట్టిండు.

                లీడరోడు ఇడిపిచ్చుకున్నడు. ''ఎవనికిచ్చినవ్‌ పైసలు... రసీదున్నదా? ఈడ నీ అయ్యవ్వదాస బెట్టిండా నౌకరి?'' అని అడిగిండు. ఆఫీసులకు తప్పిచ్చుకోనుబోతే ఈడ కూసున్నోల్లు ఇడిపిచ్చిండ్లు...''గదే ఎవనయ్యవ్వదాసబెట్టిండో? మీదిమీదికురికిండు'' సోరోడు.

                ఓ నడీడోడు చెప్పుకొచ్చిండు సేతులు తిప్పుకుంట.

                ''మంచి పనైంది - లాపోతేంది?'' అన్నాడెవడో...

                ''అది నిచ్చమేగని పనిబాయెగదా?''

                ''ఎటయినపోయేదే - సచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని -  ఈడున్నోల్లందరికి కొలువు దొరుకుదా? - ఏ సగం మందికో పావు మందికో దొరకుద్ది. దొరికినోడు మురుసుకుంట బోతడు - దొకరనోని కడుపు మసులుతది - ఆగనోడు గట్లనే సేత్తడు...'' ఆఖరు మాట చెప్పి ఆటేటు నడిచిండు.ఎవలేం మాట్లాడలేదు...

                మొగిలికి ఈ మాటలు వినబుద్ది కావడం లేదు.

                శంకరయ్యకు రెండు దినాల నుంచి నిదురలేక తిక్కతిక్కగా - ఉన్నది....

                మొగిలి అందరి మొఖాలు చూసుకుంట కాసేపు చెట్ల కింద ఆడికీడికి దిరిగిండు - రాలచెట్టుకింద దుమ్ములో పన్నతని మొఖంలోకి చూసిండు.. అది తనకు తెలిసిన మొఖమే ఉన్నట్టున్నది.. దగ్గరి దాకాపోయి వంగిచూసిండు! శాయమ్మ మనుమడు దుర్గయ్య...తనకు తెలిసినోడు కనిపించినందుకు సంబురపడి లేపిండు... ఆట్లా పండుకున్న మనిషి నిదురపోవడంలేదు కండ్లు తెరిచి మొగిలిని కాసేపు అయోమయంగా చూసిండు.

                ''నేను దుర్గయ్యా! మొగిలిని -''అన్నాడు.

                దుర్గయ్య లేచి కూర్చున్నాడు - బుస్సర్టుకు అంటిన దుమ్ము దులుపుకున్నడు.. ఆకుచెప్పులేసుకున్నాడు.

                ''మా శాయవ్వగలిసిందా?''

                ''ఓ వచ్చేటప్పుడు నీగ్గలువుమని చెప్పింది - ఏమయ్యింది?'' అన్నాడు...

                ''ఏమయితది - మా బాపు ముంచిండు - బలార్షల మా అన్న తీర్గ సిన్నప్పుడే ఏదన్న పనిసూసుకుంటే ఒడిసిపొయ్యేది.. సదివిచ్చి బొగ్గు పనికి బెట్టద్దనుకున్నడు... నేను గాలపు సాపలమ్మి దొరల ఇండ్లల్ల బోల్లు కడిగి సదువుకున్న. సదివినోనివి ఏంపని జేత్తవంటారు.. సదివినోనికి సదివే పని ఇప్పియ్యరు - ఆఫీసుల చుట్టు పుచ్చిన కుక్కతీర్గ తిరిగి తిరిగి యాష్టచ్చింది''

                ''గమద్దెన మా మనుమనికి కొలువు దొరికిందనె గదా!''

                ''మా దొరికింది - కాయిదం కంపెనోడు ఉద్యోగమిచ్చిండు''

                ''దాని పేరేందో చెప్పింది మీ అమ్మ''

                ''మూడుపత్తాల కంపెనీ - బల్లర్షలున్నది. ఎవడో సేటు పత్తాలాడి గిదీన్ని ఓడిపోయిండట - పత్తాలల్ల వచ్చింది గన్క గదే పేరుబెట్టిండు.. అయితే  ఉజ్జోగం రాజోర అడువుల్ల. గోండోలల్ల - ఆర్నెల్లు జేసిన ఆళ్లతోని పొద్దందాక కంక బొంగు గొట్టిచ్చుకోని లారీలు నింపిచ్చుకొని - లారీలు నడిసేటందుకు రోడేపిచ్చుకొని బల్లార్షకు దేవాలి. ఆళ్లకిచ్చేది మొగోనికి రెండున్నర ఆడిదానికి రూపాయినర - నాతోటి సేరినోల్లు ఆయింత ఇయ్యకుంట బాగనే సంపాయించిండ్లు - నాకే  ఆళ్లను, ఆళ్ల ఆకటి సావుల్ని - గుడిసెల్ని సూత్తే కడుపుల దేవినట్టయ్యేది... మాతాత సచ్చి నప్పుడు మాసాయవ్వ మా నాయిన్నలను దంచబోయి ఇసుర బొయి సాదుకచ్చిందని మా నాయిన్న జెప్పంగిన్న ... ఆళ్ల మొఖాలల్ల మా శాయవ్వ గనిపిచ్చేది - సరే నా పనేదో నేను సేసుకోక కంపిని పెద్దొర బిలిసినప్పుడు పుసుక్కున అన్న - మొగకూలి మూడు రూపాలన్న బెంచండ్లి అని... అచ్చా సూద్దాం అన్నడాడు.. మరోరేన్నెల్లకు గొండోల్లకే మయ్యిందో లారీలల్ల వచ్చినోల్లను కూలీలు బెంచుమన్నరు... అప్పటికే పర్మినెంటయిన...నన్ను తీసేటందుకు ఎటూసాతగాలే... ఓనాడు జీతాలపైసలు పంచేదినం - నేనున్న గుడిసెమీద గుండగాళ్లతోలిచ్చి లూటీ చేపించ్చిండు - మీదికెల్లి తన్ని చ్చిండు - నౌఖరి ఊడింది''

                ''ఓర్నీయవ్వ...''అన్నాడు మొగిలి...

                ఇగమరింక సదువు తోని లాభంలేదని సదువు రానోని తీరుగ ఎంప్లామెంటు కార్డు తీసినా - బల్లార్షల గట్ల చెయ్యబుద్దిగాలే - ఆడమీది బాయిల్ల పనైపోయి, మాసిన్నాయిననే మాంజిరి బంపిండ్లు మల్ల నాకేడదొరుకుద్ది... గీడ మా అక్కున్నదనిచ్చిన...''

                ''అయిపోయిందా?''

                ''అన్నయిపోయినయ్‌.. ఇంటర్వూల బరువెత్తరాదని బనికి రావన్నడు...''

                ''సరే నాపైసలు నాకియ్యిమంటే - ఏడియి బాయిదొరకిచ్చిన మంటరు లీడరోడు...''

                ''మరేంచేత్తమనుకుంటన్నవ్‌?''

                దుర్గయ్యలేచి నిలుచున్నాడు.. అతనికండ్లు మండుతున్నాయి. గొంతు గుడగుడలాడింది - ''అదేతెలుత్తలేదు - మా శాయవ్వ బర్లను సుత అమ్మిచ్చిన - మరింక రెండే రెండు - ఒకటి రాఘవులుగాని బొండిగ బిసుకుడు - లేదా ఇట్లనే సీదాబోయిరైలు పట్టాల మీన తలబెట్టుడు...''

                ''ఛ...గయ్యేం మాటలు...''

                దుర్గయ్య నవ్విండు.. ఒకే ఒక నిముషం మొగిలి లేత కళ్లల్లోకి ఇంకా డక్కా మొక్కీలు తినని కళ్లల్లోకి చూసిండు... తలంచంకొని ఆకు చెప్పులు దుమ్మును వెనుక చల్లు తుండగా వేపచెట్లరోడ్డు కేసి నడిచాడు.

                మొగిలి ఆఎండలో నడిచిపోతున్న దర్గయ్యను చూస్తూ నిలుచున్నాడు...

                ''దొరచ్చిండు - దొర'' అన్నారెవరో.

                మందిలో కలకలం బయలు దేరింది - గోధుమ రంగు కార్ల ఎద్దు తలకాయంత తలకాయోడు కూసున్నడు - ఎనుకబాజు రాఘవులు కూసుండి కారుకిటికీల నుంచి తల ఈతల బెట్టి - చెయ్యూపుతండు - చెట్ల కిందోలల్లో కొందరు వంగివంగి దండాలు చెట్టిండ్లు - శంకరయ్య భీరిపోయి నిలుసున్న మొగిలి భుజంతట్టి క్రిష్ణారావు దొరే అచ్చిండు.  నీ రొట్టిరిగి నెయ్యిల బడ్డదనుకో? దొరమాట కెదురుండదు?'' అన్నాడు.

                ''గయినే బాయి దొరా?'' అన్నాడు మొగిలి...

                ''ఎట్ల చేత్తవోఏమో? జంగల్ల నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నవ్‌... గయినెగీడ దొర - మందమర్రిలుంటడు... గీ ఊళ్లే కల్లుదుకాండ్లన్ని ఆయినెయే - సినిమాటాకీసాయినేదే - బ్రాండి షాపు లాయినయే - ఎనకట గీ కంపిని బడ్డ భూమంత ఆళ్లదేనట - గిప్పుడుసుత సుట్టుపక్కల ఇరవైఅయిదుల్లల్ల జమీనున్నది...''

                ''అట్లనా?'' అన్నాడు...

                కారు ఆఫీసుముందాగింది. రాఘవులుదిగి కారుడోరు తెరిచిండు - క్రిష్ణారావు కార్లోనించి దిగిండు. అంతెత్తుమనిషి... ముద్దసెంపల్లు - ఎదుకండ్లు...గుంగురెంటికలు - దొరదొర తీరుగానే ఉన్నాడు... నిలబడి జేబులనుంచి బంగారంగు సిగేరెట్టు డబ్బాతీసి సిగరెట్టు ముట్టిచ్చుకున్నాడు... వాచ్‌మెన్‌ వంగగివంగి సలాములు చేస్తుండగా లోపలికి నడిచాడు.....

                జనరల్‌ మేనేజర్‌ పి. యస్‌. శాస్త్రి రూంలోకి అడుగు పెట్టాడు. రాఘవులు రూంబయటే ఆగిపోయి పర్సనల్‌ మేనేజర్‌  ఆఫీసుకేసి నడిచాడు..

                క్రిష్ణారావు ''కులాసేనా?'' అంటూ కనీకనిపించని నవ్వునవ్వి మెత్తటి ఫోంకుర్చీలో కూర్చున్నాడు. క్రిష్ణారావు కూర్చున్న తరువాత తనూ కూర్చుండి టేబుల్‌ మీది కాగితాలు సదిరి పెన్ను టేబుల్‌ మీద పడేసి...

                ''చాలా రోజులయ్యింది.. పేదవాన్ని అప్పుడప్పుడు కరుణించాలి...'' శాస్త్రి...

                ''పేదవారా ఎందులో?''

                ''పీకాట - తాగుట్లో...'' అన్నాడు శాస్త్రి నవ్వుతూ....

                ''కనిపించడం లేదు... ఊళ్లో లేవనుకున్న...''

                ''ఏది లీవుమీద పోవాలనే.మైసూర్లో మా పెద్దమ్మాయుంటది. ఊటికి పోదాం రా నాన్నా అంటుంది. సరే... అదొద్దు అనుకుంటే సిమ్లా అన్నాపోవాలి.. ఢిల్లీ వాళ్లు ఏదో మైన్సు మీటింగేస్తే యం.డి..తన మనిషిని పంపుకున్నడు...''

                ''మేనేజింగ్‌ డైరక్టర్‌కి నీకు మంచిగలేదా?''

                ''కాదు ఆయనోరకంలెండి... మీకు తెలియని దేమున్నది? పొలిటికల్‌ ఇన్‌ప్లూయెన్సు ఉంటుందిగదా? బొగ్గు బాయిల మనగ్రిప్పుల నుండి పోతన్న యనికదా? నేషనలైజుచేసింది...''

                ''ఏంచేసినా ఏలేవాళ్లు మీరేకదోయి శాస్త్రీ...''

                ''అన్నారు... నిష్ఠూరం బెట్టారన్నమాట - మీరులేకుండానా''

                ''ఉన్నా లేనట్టేలెక్కా...''

                ''మీ మాట అట్లాగే ఉంటుంది.'' అనుకుంటూనే బజ్జురునొక్కాడు...

                ప్యూన్‌ పరుగెత్తుకొచ్చాడు... చూడు - ''మోహన్‌ర్రావున్నాడా?... అర్జెంటుగ రమ్మను'' ప్యూన్‌పోబోయాడు.. ''రాములు కూల్‌డ్రింక్స్‌ పట్టుకరా?''

                కాసేపు ఇద్దరు మాట్లాడలేదు.. ఏర్‌కండీషనర్‌ ధ్వని. పైన పంఖా చాలాస్లోగా తిరిగుతోంది - నెత్తికి టోపీ బెట్టుకున్న కోల్‌ కార్మికుని బొమ్మ క్యాలెండరు గోడమీద.

                మోహన్‌ర్రావొచ్చాడు - ఎర్రగా ఉన్నాడు - వయసులో ఉన్నాడు. ఇద్దరిని చూసి వంగివంగి సలాములుచేసి నిలుచున్నాడు...

                ''కిశోర్‌ రూంలో ఇంటర్వూ అరేంజు చేయండి క్వీక్‌...'' శాస్త్రి

                ''ఓకే సార్‌...'' పోబోయాడు...

 

                ''మోహన్‌ర్రావు మాయూనియనోల్లకు చార్జ్‌సీట్లు బాగిస్తున్నవట...''

                ''సార్‌...'' అన్నాడు...

                ''నువ్వువెళ్లు....'' అన్నాడు శాస్త్రీ

                ''అంతా ఏదో పార్మాలిటీస్‌...అట్లా లేకుంటే కార్మికులకు మనమెందుకు? ఆఫీసు బీకేయ్యరు...ఇప్పటికే కంట్రోల్‌తప్పుతోంది... రైవల్‌ యూనియన్‌ గ్రూపులున్నాయి మరి... మీ వాళ్లకే కాదు - మేం అందరితోటి బాగుండకపోతే మీరు సమ్మె అంటరు. మాపైవాళ్లు ఇనెఫిసియెన్సి అంటారు...''

                ''ఏదో ఇంటర్వ్యూ...''

                ''అదేనండీ - బదిలీ పిల్లర్సు తీసుకోవాలి. చాలా ఖాళీలున్నాయంటారు మీరు - ఎంప్లాయిమెంటు వాళ్లు అదే అంటారు. మా పరిస్థితేమో ఉన్న లేబర్‌కే వర్కులేదు... కండీషనేం బావుండలేదు -ఇప్పటికే లాసుల నడుపుతున్నం. పొజీషనేం బావుండలేదు...''

                ''శాస్త్రీ నువ్వెప్పుడన్నా బాగున్నాయంటావా?''

                ''ఏదో ఉద్యోగపు అలవాటు...''

                ''అదిసరే... మావాళ్లో ముప్పయి మందున్నారు అంటాడు రాఘవులు...ఏదోమేంటైన్‌ చెయ్యాలె...కదా? యూనియన్‌ వ్యవహారాలు...''

                ''అసలు వెకెన్సీసే నలుబై ఉంటాయండీ - అందులో మీకు తెలియనిదేమున్నది? మిగతా ప్రెషర్స్‌ ఉంటాయి'' ఇంతలోనే కూల్‌డ్రింక్స్‌ వచ్చాయి. తాగిండ్లు...

                ''ఇంకో నలుబై పెంచు... డాక్టరు ఫిట్‌ల పోయే వాళ్లు పోతారు - నీరిస్కుపోతుంది కదా?''

                ''డాక్టరు ఇట్లాగే అనుకుంటే ''

                ''మీసబార్డినేటేకదా? అదిగాక ... ట్రేనింగ్‌ మళ్లీ తతంగమంతా ఉండనే ఉండే...''

 

                ''సరే ఇంకా చెప్పండి...మీమాటకాదన వశమా? ఒకటి అరా రిజెక్టయితే...సరే..చూశారా.. ఆఫీసులో ఏర్‌కండీషనర్‌  మార్పించా.  ఇంట్లోకి కూడా మార్వాలని. చిన్నమ్మాయికి సంబంధం కుదిరింది - వైజాగ్‌డాక్‌ యార్డులో ఇంజనీరు... కట్నం కొంచెం ఎక్కువే అనుకోండి..'' అన్నాడు.

                ''ఎంతుంటుంది?''

                ''లక్షనర...''

                ''అదే ఎక్కువా?''అన్నాడు రావు...

                ''ఏదో ఉద్యోగస్తులం కదండీ ''

                ''మీ పనే హాయి... సాయంత్రం రాఘవులును మీయింటికి పంపిస్త...''

                ''లిస్టు వస్తుందిగదా?''

                ''ప్యూనును పిలువండీ...''

                మళ్లీ బజర్‌ నొక్కాడు.. ప్యూనొచ్చిండు...

                ''రాములు రాఘవులును పిలూ''

                రాఘవులొచ్చాడు ''సార్‌కు లిస్టియ్యి'' అన్నాడు...

                ''అందరికి కాల్స్‌ వచ్చినయే కదా?''

                ''ఎంప్లాయిమెంటు వ్యవహారం రాఘవులుకే తెలుసు''

                ''అంతా వాళ్లే సార్‌...''

                రాఘవులు లిస్టు తీసియిచ్చాడు  క్యాష్‌ బ్యాగ్‌లో నుంచి. ''సాయంత్రం సారింటికి ఓ మారుపో.... సార్‌ కొంచెం పరెషాన్లున్నడు...'' అన్నాడు...

                ''అచ్చా మై చల్‌తూం - ఫిర్‌మిలేంగే... రండి మీరులేక ఆటరక్తి కట్టడంలేదు...''

 

                క్రిష్ణారావు, రాఘవులు లేచి బయటకొచ్చారు. కారెక్కారు. కారు వెళ్లిపోయింది - చిరునవ్వులు నవ్వుతూ రాఘవులు అందరికి చెయ్యూపిండు...

                అప్పుడే ఇంకో కారొచ్చింది - ఆకారులోనుంచి దిగింది బాస్కర్‌రావు, స్వామి దిగారు - బాస్కర్‌రావు బక్కగా లేడు - లావుగాలేడు - బట్టలుసాదా - స్వామి ఎర్రచొక్కావేసుకున్నాడు.

                వాళ్లిద్దరు శాస్త్రీ రూంలోకి అడుగుబెట్టారు మళ్లీ. అవే మాటలు.... కూల్‌డ్రింక్స్‌... మామూలే చెట్లకింద కూర్చున్నోల్లు కడుపుల్లో ఆకలి మండిపోతోంది. నెత్తిమీద సూర్యుడు మండుతున్నాడు వాచ్‌మన్‌వచ్చి ''ఇంటర్యూ'' సాయంత్రం మూడు గంటలకు అన్నాడు.

సైరన్ నవల 

మూడయ్యింది. అయినా ఎండతగ్గలేదు -  నేలంతా బగబగ మండుతూ పొగు కక్కుతోంది.. పల్లెలనుంచి వచ్చినవాళ్లు -  బస్సు కిరాయలు  కూడ లేనివాళ్లు అదే చెట్లకింద కునుకు తీశారు...కొందరు వాడిపోయిన ముఖాలుండొద్దని డబ్బున్నవాళ్లు అన్నమో టిపినో తినొచ్చారు.... ఏది లేనోళ్లు నల్ల  నీళ్లు తాగారు... గుండెల్ల  డుక్కుడుక్కు. ఇంతా చేస్తే తీసుకుంటారో లేదో

                మొత్తానికి అందరి మొఖాల  మీద పులిబోనుకు పోబోతున్న మేకపిల్ల  బెదురు, దిగులు  కనిపిస్తోంది...వాళ్లవెంట వచ్చిన వాళ్లు భరోసాయిస్తున్నారు. శంకరయ్య మొగిలికి పేరు, తండ్రి పేరు చెప్పాడు. ‘’భయపడద్దు -  ఆడిగిన దానికల్లా టకాటకి చెప్పు...మనం పైసలిచ్చినం గద ఏం ఫికరు బెట్టుకోకు’’ అన్నాడు ఆఖరుగా.

                ఇంకెవడో ‘‘నౌఖరి దొరుకుతే తిరుపతెంకన్నకు తల  నీలాలిత్తనని మొక్కుకో బస్‌ -  దేవుని మీద భారమేసి బేఫికరుగ పో’’ అన్నాడు.

                ఈ మాటల్లనే మొదటివాడు బయటకొచ్చాడు... వీరాధి వీరునిలాగా...

                మొగిలి అందరితోపాటు ఆఫీసువరండాలో కడుగుబెట్టాడు. శంకరయ్య ఆఫీసవతల  నిుచున్నాడు.  స్ప్రింగ్‌డోరు దగ్గర లైనుగ నిలుచున్నారు.

                మొగిలికి సల్ల చెముటలు  పెడుతున్నాయి. ఇటు నుంచిటే ఎవలకు కనిపియ్యకుంట ఊళ్లె బడేదాక ఉరుకుతే బావుండుననుకుంటున్నాడు.. అందరి మొఖాల్లోకి పులుకు పులుకున చూస్తున్నాడు...

                ఆరుగురి తరువాత మొగిలి వంతచ్చిది. గదిలో కడుగుబెట్టాడు. ఎదురుంగా సన్నగా ఎర్రగా ఉన్నోడొకడు కూర్చున్నాడు. అతని ఎడమ పక్క మీసాలు  నున్నగా కొరుక్కున నల్లటి సీమ కండ్ల వాడున్నాడు. కుడిపక్క తెల్లటి బట్టలోడున్నాడు...

                ‘‘నీ పేరేమిటి?’’ ఎర్రవాడు

                మొగిలి తత్తరపడి గుటికిల్లు  మింగిండు -  నెత్తి గోక్కున్నాడు -  పంఖాకేసి చూశాడు...

                ‘‘నీపేరు...’’నల్లవాడు

                ‘‘రా...రాజయ్య’’ అన్నాడు తడబడుతూ తొందర తొందరగా...

                ‘‘తండ్రి పేరు?’’

                ‘‘అయిలయ్య’’

                ‘‘అయిసీ - ఎర్ర వాడు పెన్నుతో పేపరు మీద ఏదో రాసిండు...

                ‘‘మీదేవూరు?’’

                మొగిలి చెప్పిండు.

                ‘‘ఎంతదాక సదువుకున్నావు?’’

                చదువుకోలేదని చెప్పిండు...

                నల్లవాడు ధోవతి పైకి ఎత్తుమన్నాడు -  పిక్కలు  చూశాడు...

                ‘‘పైన్‌... కర్‌సక్‌తా...’’అన్నాడు ఎద్దును చూస్తున్నట్టు నోరు తెరువుమన్నాడు. ఇంకేదో అన్నాడు -  దండలు  చూశారు -  చాతీ చూశారు... అక్కడే ఉన్న ఉసికెబత్త లేవట్టుమన్నారు. మొగిలి లేపి ఛాతీ దగ్గరిదాకా తెచ్చుకొని దించాడు.

                అటిటూ లాడీస్‌ పయ్యున్న ఇరుసెత్తుకొని బస్కీలు  తియ్యమన్నడు.  మొగిలి తీత్తనే ఉన్నడు.  చెమట కారిపోతుంది.  ఇగ జెరంతయితే పడుతడు అనే సమయానికి ‘‘ఇక నువ్వువెళ్లచ్చు’’ అన్నారు...

                మొగిలి బయటకొచ్చాడు. గుండెనిండా గాలి పీల్చుకున్నాడు -  నెత్తి మీది నుంచి పెద్దగుండేదో దించినట్టు ఫీలయ్యిండు...

                ‘‘అంత బాగ చెప్పినవా?’’ శంకరయ్య ఎదురొచ్చిండు.

                ‘‘బాగనే చెప్పిన...’’

                ‘‘మల్ల  రెండురోజులకు ఆఫీసుల  లిస్టేస్తరు డాక్టరు ఫిట్‌కు బోవాలె’’ వాచ్‌మన్‌ చెప్పిండు -  శంకరయ్య రెండు రూపాయ నోటుతీసి వాచ్‌మన్‌ చేతుబెట్టి  ‘‘ పనైతే పార్టీ ఇత్తం’’ అన్నాడు.

                ‘‘అబ్బో అయెదాకనే తరువాత మా మొఖమెవడు సూత్తడు?’’ వాచ్‌మన్‌...

                ‘‘పుత్తెగట్టుకున్నట్టేనాయె -  ఓసారి ముడివడితె ఎప్పుడు నీ కాడికి అచ్చుడే ఉంటది’’ శంకరయ్య...

                ఇద్దరు బయటకొచ్చి సైకిలు  మీదెక్కిండ్లు ` ‘‘శంకరన్నాకొలు వు దొరుకుత దంటవా?’’ మొగిలి అడిగిండు.

                ‘‘నువ్వయితే అన్ని చెప్పినవ్‌గదా? మా దొరుకుతది’’ అన్నాడు శంకరయ్య -  శంకరయ్య మనుసులో డాక్టరు ఫిట్‌ గురించి అనుమానం లేకపోలేదు...

 

                                                                                   11

 

                ఉదయం పదిగంటలయ్యింది.  బొగ్గుపొయ్యి పొగ తగ్గి వాతావరణం తేటగయ్యింది.

                మొగిలికి మూడుదినాల  నుండి పనిలేకుండా కూర్చోవాలంటే  బాగనిపించడంలేదు. తినడం... సూరుకింద మంచమేసుకొని పొద్దంగే దాక పండడం...

                ‘‘అట్ల బయిటికన్న పోయత్తేంది పిలడా?’’ లక్ష్మిఅంటూనే ఉన్నది...

                ‘‘వదినా నాకంత ఎటమటంగున్నది ` గీడ మనుసులు  కొత్తంగున్నరు. ఆ లాగు, అంగీలు  సూసెట్లాకే గీళ్లు మనోల్లు  గాదని పిత్తంది -  పల్లెలదిర్గినోన్ని’’

                లక్మినవ్వింది.  ‘‘అయ్యో గిదెంత సేపు ` మీ అన్న గిట్లెనే అనెటోడు ` దూదేకులోని తీర్గ ఏషాలని -  గిప్పుడు సూడరాదు -  సిన్నప్పుడు మనూల్లెకు పిర్ర మీన సినిగిన లాగేసుకొచ్చేటోడు టుపాకి రాముడు - గదేఏషం...? ఇన్నవా? నువ్వు గట్లనే అయితవు...’’

                ‘‘అదిగాదు వదినా ఎవన్ని మందలియ్య వశంగాదు -  ఎవడు సూసినా సొలుక్కుంటనే పోతండు...’’

                ‘‘మనూల్లె సుత కల్లచ్చిందట గదా?  నువ్వు తాగవా?  అన్ని అయ్యే అత్తయిలే... తాగుడేనా?  పెండ్లాన్ని గొట్టుడత్తది, తినుడత్తది. అప్పుల్లోల్లత్తరు... మా నాయిన అవ్వనుకుంటరు చ్చిమికేందని -  మరిదీ మోసెటోనికెరుక కావడి బరువు’’  లక్ష్మి గొంతు వనికింది. కండ్లల్లోకి నీళ్లొచ్చినయ్‌ -  సర్రున లేచి గుడిసెలకు బోయింది...

                మొగిలి ఆ మాటలోని బరువుకు తికమకపడ్డడు ` ‘‘అన్నీ ఉన్నాయి - అయిదో తనందప్ప- ఇంతకన్నా నీళ్ళులేనడివిల  బొండిగ గోసిందుత్తం... ఎక్కన్నో పల్లె సెరో సార్గం సేసుకొని బతికితేనే బాగుండు -  ఈడికచ్చినంక రెక్కకు పనిలేదు -  అడిగినోడసలేలేడు -  తిన్నవా అన్నోడు లేడు -  కాలునొచ్చిందా, ఏలునొచ్చిందా అన్నోడు లేడు...’’ లక్ష్మి గుడిసెలో సన్నగా వనికే గొంతుతో గొనుగుతోంది.

                మొగిలి వచ్చిన దగ్గరి నుంచి చూస్తూనే ఉన్నాడు. శంకరయ్య ఇంటికి రాగనే నోరు దగ్గర బడ్డోనితీర్గత్తడు -  మొఖం మారి పోతుంది.  మందలిత్తె కరువత్తడు. వచ్చిన్నాడు లెల్లాయిపదాలు  పాడుకుంట సొలుక్కుంటత్తడు. ఉట్టెగనే తిడుతడు -  బట్టన్నా విప్పకుండా మంచాల ఎల్లొక బడి సచ్చినోని తీర్గ పడి నిదుర బోతడు -  మళ్లీ పొద్దున్నే ఉరుకులు  పరుగులు ... ఇదంతా మొగిలికి అర్ధం కాలేదు. ‘‘నాకెందుకులే ఎవల  సంసారంల  ఏమున్నదో?’’ అనుకొని లేచి ఎటూ దోసక కూలిపోయిన దడి కట్టడానికి పూనుకున్నడు...

                కాసేపటికి లక్ష్మి బయట కొచ్చింది. ’’మనుసుల  బెట్టుకోకు మరిదీ -  అదంతే.  రేపు నీకు తెలిసొత్తది...’’ అయ్యయ్యో గ పనెందుకు బెట్టుకున్నవ్‌ -  పుల్లలన్ని పుచ్చిపోయినయి -  ఆ దడి గంతే -  కొత్తప్లు దేవాలె -  పొరక దొరుకదు -  కంపదెత్తే మనకే ముల్లు  గుచ్చుతాయి’’ అన్నది లక్ష్మి...

                ‘‘ఊకే కూకుంటే యాష్టత్తంది ’’ అన్నాడు మొగిలి లక్ష్మి ముఖం చూడడానికి ధైర్యంలేక తలవంచుకొనే.

                ఇంతలోనే సైకిల్‌ గంట చప్పుడొచ్చింది. లక్ష్మి గుడిసెలకు బోయింది...

                శంకరయ్య చెమటలు  కారంగ వచ్చిండు.

                ‘‘తమ్మీ నీ పేరెల్లింది -  నడువ్‌ -  తిన్నవా? దావాఖానకు బోవాలె...’’ అన్నాడు హడావిడిగా...

                మొగిలికి మతిపోయింది.. ఆదరబాదరగా మొఖం మీద నీల్లు  జల్లుకొని -  ’’ వదినా నేనుబోయత్త’’ అన్నాడు వాకిట్లో నుంచే.

                ‘‘మీ అన్నతింటడేమొ అడుగు’’ అన్నది...

                ‘‘నవుదిను -  నేను ఓటల్ల  దిన్న’’ అన్నాడు శంకరయ్య

                ‘‘నువ్వు తిన్నవా’’ అన్నాడు మొగిలిని.

                ‘‘సూసిసూసి తిన్న...’’

                ‘‘సరే నడువ్‌...’’

                ఇద్దరు సైకిలెక్కి హాస్పటల్‌ చేరుకునే సరికి పదకొండున్నర అయ్యింది. దవాఖానా అంటే అదేదో పెద్ద బంగళా అనుకున్నాడు మొగిలి. రెండు క్వార్టర్లు కలిపున్నయి. ముంగట ఏవేవో పచ్చటి చెట్లున్నయి. ఓ మూలకు కారు బెట్టుకోను చిన్న ఇల్లు  లాంటిదున్నద -` వీళ్లు పోయోట్లాకే హస్పిటంతా మందే ఉన్నారు. వరండా చాలక ఎండలో నిలుచున్నారు. ఆడోల్లు, పిల్లలు -  పిల్లలనెత్తుకున్న ఆడోల్లు, దెబ్బలు  తాకినోల్లు , దగ్గులోల్లు, దమ్ములోల్లు  వీళ్లంతా కాక కొత్తగా భర్తీ అయ్యేటోల్లు.  

                ‘‘ఇగో కాయిదందీసుకపో ’’ అని జేబులోనుంచి కాయిదం తీసిచ్చిండు శంకరయ్య.

                ‘‘నువేరావాలన్నడు. చెప్రాసిగానికి మస్కగొట్టి కాయిదం పట్టుకచ్చిన..’’ అన్నాడు.

                మొగిలి లైనుకు నిలుసున్నాడు...

                ‘‘ఏమాయెనమ్మ, సింగు సవరిచ్చుకునేట్లాకే నెత్తిమీదికి పొద్దచ్చేటట్టున్నది. జెరతొందర తొందరగానియ్యిండ్లి -  పనాడ బెట్టచ్చిన’’ గుమ్మటం లాంటి ఆడిమనిషి ఆడ డాక్టరుకు వినబడేటట్టు అంటున్నది. ఆమె వెనుక పైటజారకున్న మాటిమాటికి సదురుకుంటున్న ఓ పడుసుపిల్ల  నోటి దగ్గర దస్తీ బెట్టుకొని నవ్వింది.

                ‘‘సోగ్గా నవ్వేదేదో సీదానే నవ్వరాదు - ఇపసారిపిట్ట గోడకుగొట్ట - ’’ ఆమె వెనుకనున్న అమ్మోరు మచ్చల మొఖమామె.

                మొగోల్ల లైన్ల ఒకడు  ‘‘నీ బాంచెనుల్లా నన్ను కాసంతజెప్పన బోనియిండ్లి. కాలు  యాలలు బార్తంది ` దవాఖానవ్వను...ఏం మందేత్తరోగని -  మగ్గది -  ఏడికన్నాబోదామంటె ఇయ్య్లరేపు పదిరూపాలు  లేంది ఎవడు కండ్లగానడు’’

                ‘‘జీతమవ్వను..ఇచ్చినట్టే యిచ్చి తీసుకోనట్టే తీసుకునిరి -  బొగ్గుపెళ్లబడి పది రోజులాయె -  పదిరోజు నాగాలేనాయె - రోజు సేత్తేనే ఓదానికందుతే ఓదాని కందదు...’’

                ‘‘అన్నన్న’’ ఇంకెవడో కడుపుబట్టుకున్నాడు. లైను కదుదు. మొగిలి తల  పక్కకువంచి డాక్టరును చూడాలనుకున్నాడు. లోపట ఎక్కడున్నాడో కనిపించలేదు.

                ‘‘ఏమాయెర్రా లైను కదులది?’’ కాలునొప్పోడు. ముందట నిుచున్న పన్నునొప్పోడు ‘‘డాక్టరు చాయ్‌ తాగుతండు’’ అన్నాడు అందరికి వినిపించేలాగున...

                ‘‘ఓర్నియవ్వ గిప్పుడు ఛాయా? ఎట్లనోగట్ల పొద్దుబుచ్చుదామని సూత్తరు లమ్డికొడుకు, నీతల్లి గర్మి సీకట్ల సచ్చేది మనం -  పంఖ కింద కూసుండి సాయ్‌ దాగేదీళ్లు ’’ ఇంకెవడో.

                ఆడ్లో లైన్ల కదిలికొచ్చింది. లైనుముందట మెడ మీది దాకా ఎంటికలు  బెంచుకున్న కంపౌడరు గాడొచ్చి ఏదేదో సదిరిండు -  పైట పిల్ల  కండ్లు పులపొడిసింది -  లైనులైను’’అని అటులోపటికి వచ్చి ఆడోల్లను సదిరి నట్టే సదిరిండు -  పైటపిల్ల  వానెనకనే పోయింది. లైనట్లా ఉండంగనే పిల్ల  డాక్టరమ్మకు చూయించుకున్నది మల్ల  మందుల కాడ -  నర్సుతో ఏదేదో మాట్లాడిండు కాంపౌండరు. పిల్ల బయటకొచ్చింది.

                మందంతా చూస్తుండగానే పైటపిల్ల  రోడ్డుమీద అపసోపాలు  పడుతూ నిలుచున్నది... కాంపౌండరు తీగలు  సాగుతూ, ఎంటికలెగ దోసుకుంటూ ఏదో చెప్పుతున్నాడు...

                అంతలోకే డగ్‌డగ్‌మని సప్పుడు చేస్తూ సైకిల్‌మోటారొచ్చింది. ఎర్రగాబుర్రగా ఉన్నవాడు దిగిండు. వాని బొటన వ్రేలుకు కట్టు కట్టున్నది. అంతమంది మొగోల్లు  లైనులోఉండంగా వాడు సరాసరి లోపలికి బోయిండు -  వంగివంగి సలాము చేస్తూ కాంపౌండరు వాని వెనుకే వెళ్లిండు. డాక్టరు కళ్లజోడు తగిలించుకొని కూర్చీలోనుంచి లేచి నిబడి వచ్చిన వానికి ఎదురుకుర్చీలో కూర్చుండబెట్టి తను లేచొచ్చి అన్నీ తనిఖీ చేసిండు. ఆ తరువాత ఎర్రవాడు కాంపౌండరు గదిలోకి నడిచిండు -  కాంపౌండరుగాడు సుతారంగా కట్టువిప్పి మళ్లీ కట్టు కట్టిండు.

                డాక్టరు హడావిడిగా వచ్చి  ‘‘మిస్టర్‌, నీకు బుద్దుందా బాండేజి అట్లాగేనా చేసేది...అని స్వయంగా తను విప్పి....మళ్లీ కాంపౌండరు వేసిన మందే వేసి కాంపౌండరు కన్నా అధ్వాన్నంగా కట్టుగట్టిండు...ఎర్ర వాడు అందరు చూస్తుండగానే సైకిల్‌ మోటార్‌ డగ్‌డగ్‌ మనిపించుకుంటూ వెళ్లి పోయిండు.

                లైనులైను దగ్గర్నే ఉన్నది...

                లైనులో నిల్చున్న దొడ్డుటామె - గంపంత నోరుతెరిసి...‘‘ఈ దవాఖాన లంజెన్నా? లంజెకొడుకన్నా కాంది సూడరానామ్మో’’అన్నది...

                లైను కదిలింది

                మొగిలి డాక్టరు రూంలోకి అడుగు పెట్టేసరికి పన్నెండయిపోయింది...

                డాక్టరు మొఖంనిండా మొటిమలే ఉన్నాయి -  మళ్లీ పేరు, తండ్రి పేరు, ఊరు అడిగిండు -  రాసుకున్నాడు... ఏదో మిషన్‌ మీద నిల్సోమన్నాడు, మొఖమంతా కోపంగా బెట్టుకున్నాడు...

                దూరంగ గోడమీద బెట్టిన అక్షరాలను చూపిచ్చి ‘‘కనిపిస్తందా?’’ అన్నాడు.  కాంపౌండరుగాడు లోపలికి తీసుకపోయి దోవతి విడువు మన్నాడు-

                ‘‘ఎహె..ఎహె.’’ అన్నాడు మొగిలి ధోవితి పట్టుకుంటూ.

                ‘‘అరె! ఎద్దులాగున్నవ్‌...చూపియ్యాలె..విప్పు - విప్పుమంటుంటే’’ కాంపౌండరు కసురు కొని ధోతి విప్పిచూసిండు... తరువాత స్టూలు  మీద కూర్చుండ బెట్టిండు ` ఎడంకాలు  నూసిండు, కుడికాలు  చూసిండు.

                ‘‘వాటీస్‌దిస్‌...ఇదేమిటి?’’

                ‘‘బర్ర...’’

                ‘‘ఎట్లయ్యింది...?’’

                ‘‘తెల్లజొన్నకొయ్య కాలుగుచ్చింది.’’

                ముట్టి చూసిండు..ఒత్తి సూసిండు..ఏదో అన్నడు.. పొమ్మన్నడు.

                మొగిలి బయటకొచ్చిండు.. శంకరయ్య ‘‘ఏమడిగిండు ఏమడిగిండు?’’ అన్నాడు. మొగిలి అడిగిందంతా చెప్పిండు. శంకరయ్య ఊ అనలేదు ఆ అనలేదు...

                ‘‘గిదెప్పుడు దెలుత్తదే?’’

                ‘‘సోమారం బొర్డేత్తరాండాలె’’ అన్నాడు శంకరయ్య ఆలోచనగా...

                ‘‘అయినయా ఇంకేమన్నా ఉన్నయా?’’ అన్నాడు మొగిలి...

                ‘‘ఏడ ఇరువై ఒక్క దినాల  ట్రేనింగ్‌ -  రోజుకు మూడు రూపాలిత్తరు. అటెన్క స్పేర్ల బెడుతరు. ఆయింక’’

                 ‘‘నీతల్లి -  గిదంతా పీకులాటే ఉన్నది -  మా వూల్లే గిట్లగాదు -  పాలేరుంటవా అంటే ఉంటనంటే అయిపోయె’’

                శంకరయ్య మాట్లాడలేదు ...సైకిలు  నడిపిచ్చుకుంటూ ఇద్దరు నడుస్తున్నారు...రోడ్డు మీద ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చేట్లోల్లు  వస్తున్నారు పోయే వాళ్లు పోతున్నారు.

 

                                                                         12 

 

                ఆ రాత్రి మొగిలికి నిదుర బట్టలేదు... శంకరయ్య, లక్ష్మి గుడిసెలో పడుకున్నారు... చాలాసేపు ఊకినే కండ్లు తెరుచుకొని ఆకాశంలోకి చూస్తూ పడుకున్నాడు. ఆకాశంలో చుక్కలు  జిగేలుమంటున్నాయి. వెన్నెల  మీద మబ్బుతునక కప్పేసింది.. వాడకట్టుకు ఎక్కన్నో కుక్కలు  మొరుగుతున్నాయి... ఎవరో పక్కింట్ల దగ్గుతున్నారు. మూడిండ్ల ఆవల  కావచ్చు భార్య భర్తలు  కాబోలు  తగువులాడుతండ్లు - మొగగొంతు లొడలొడ వరుస క్రమంలేకుండా వదురుతున్నాడు... కాసేపటికి గిపగిప గుద్దిన చప్పుడు. ఆడామె తిడతూ ఏడుస్తోంది. చటుక్కున మంచంలోనుంచి లేచిండు - కొట్లాటకాడికి పోవానుకున్నాడు కాని ఎవరు పోతున్నట్లు లేదు -  ఎవరిగుడిసెల్లో వాళ్లె అదెదో మామూలు  సంగతన్నట్టు పట్టించుకోవడం లేదు. ఇదే మావూల్లెనైతే ఊరోల్లంత కుప్పయేటోల్లు -  కొట్లాట సముదాయించెటోల్లు - అనుకున్నాడు...

                మంచంలో కూర్చున్నాడు. లొల్లి మగ్గింది..కుక్క మొరుగుడు ఆగిపోయింది. ` గుడిసెలో నుంచి శంకరయ్య గుర్రు విన్పిస్తోంది...

                మొగిలి కళ్ల ముందు పల్లె మెదిలింది - అక్కడి మనుషులు  గొడ్డుగోదా పొలాలు  చేండ్లు చెలుకలు, అడివి, గట్టు అన్నీ మెదిలాయి...

                వర్షా కాలం  తుపతుప చినుకులు  పడుతూంటే -  నెత్తిమీది కంటా వంగి మబ్బు గుడగుడలాడుతూ ఉంటే - బండమీది నుండి, చేండ్ల మీది నుండి నీళ్లు జలజల  పారుతూ ఉంటే టేకుటాకు గొడుగు కుట్టుకొని నెత్తమీద బోర్లించుకొని.. టేకుటాకు గొడుగు కుట్టడంలో కొంగ పోశాలు  దిట్ట -  ఒక్క చినుకన్నా పడకుండా ...ఆరిద్ర పురుగులు – నేల  కనిపించకుండా లేచే దువ్వెన్లు, బసవన్నలు  పచ్చగడ్డి...

                చలికాలం  -  గొంగడి కోలాట మేసుకొని చేండ్లు చెలుకలు  దిర్గడం -  అడ్ల ధాతి కాడినెగడు -  నెగడి చుట్టూ కూకుండి విక్రమార్కుని కథలు -  వడ్లీరయ్య లొడలొడ గొంతు... ఎండకాలం  -  కొడార్లు -  వెన్నెట్లో చిరుతల  రామాయణం కోలాటం, పాటలు ... ‘‘శివశివ మూర్తివయ్య గననాధ శివుని కొమారినివి గణనాథ..’’, ‘‘బంతిపువ్వు దండు దెచ్చితి బామరో తలుపులు  దియ్యవే’’ -  చిన్నప్పుడు ఆడిన ఆటు ఢీమ్మ ఢీలి -  ‘‘పిల్లా కెంతెంతే ఢీమ్మఢీలి, పిలగానికెంతెంతే’’,  కోడి పుంజులాట -  గుయ్యోపుంజూ గుయ్యే కోక్కరోకో...కో...వాడు మొగిలి...’’

                రాజేశ్వరి యాదికొచ్చింది. ఏం చేస్తున్నదో? నిదుర బోయుంటది. నిదురలో తనకు నౌఖరి దొరికినట్టు కలలు కంటుంటది... పాపం .....మొగిలి మనసులో తియ్యతియ్యగా రాజేశ్వరి జ్ఞాపకాలు ...

                సాంబయ్య గుర్తొచ్చిండు  -  నాయిన రాత్రి నిదురబోయుండడు..గడంచలో కూర్చుండి తనకు నౌఖరి దొరికిందో లేదోనని ఆలోచిస్తూ ఉంటాడు...

                నౌఖరి దొరుకుద్ది -  ఈ గుడిసెల్లో తనోగుడిసెలో -  శంకరన్న తీర్గనే...సీకట్లనే ఉరికి – మల్ల  పొద్దుబొడిసినంక ఇంటికచ్చుడు -  కొట్లాటు తాగుడు ` ఛ ` తను తాగద్దు -  ఎవల జోలికి పోవద్దు మరింక ఎడ్లుండయి - పంటుండది ` పెరడుండది -  మడికట్టు దున్నుడుండది -  వానల్లో వనుకు బట్టుడుండది -  సలిలో మంట కాగుడుండది -  ఎండల్లో గుంటుక కొట్టుడుండది -  మరింక పల్లె.. పెట్టెం లింగయ్య, అనుముల  ఎంకటర్రాజం, సిందెంరాయమల్లు, అడ్డడు ` రొడ్డకొమురయ్య ఎవలుండరు.. పరాసికాలుండయి -  బండిమీది పదాలుండయి - చెమ్మదిగిదిండదు - కోలాటపు పాటలుండయి.

                మొగిలి మనుసులో ఎక్కడో సన్నగా దు:ఖంలాంటిది. అద్దు గీ నౌఖరి నాకద్దు -  గీ సోకుటీకుద్దు -  గీ గుడిసెద్దు గీ కొట్టాటద్దు... నాయిన్న ఊకుంటడా?  అప్పులూకుంటయా?  భూము బోతయి -  జాగుబోతయి – మాదుగుల  తీరుగ  ఉపాసముప్పిడుండాలె -  పిర్రగట్టయ్య తీర్గ ఒంటిమీదకి గుడ్డుండది...గుడిసె ముంగటి నుంచి ఎక్క్లిల్లు -  ఎవలో సన్నగా ఏడుస్తున్నారు -  మొగిలి తొంగి చూసిండు లక్ష్మి.. అరె వదినకేమయ్యింది.. మొగిలి మంచంలోనుంచి లేచి గుడిసె ముంగటి కొచ్చి నిలుచున్నాడు...లక్ష్మి చూసింది. ఉలిక్కి పడ్డది...

                ‘‘నువ్వింకా పండలేదా?’’ అన్నది లక్ష్మి

                ‘‘లేదదినా?...’’ అన్నాడు మొగిలి.

                లక్ష్మి లేచి నిలబడి `  ‘‘మొగిలి బాయిపనద్దు మనూరికి బో -  మొగిలి నువ్వీ రొంపిల దిగకు ’’ నెమ్మదిగా అనేసి లక్ష్మి గుడిసెలోకి వెళ్లిపోయింది.

                మొగిలి మళ్లీ మంచంలో కూర్చున్నాడు –లక్ష్మికి తక్కువయ్యిందేమిటో మొగిలి ఎంతా ఆలోచించినా అర్థం కాలేదు... తలాతోకలేని ఆలోచనలు  చేస్తూ మొగిలి నిదర రాక మంచంలో పొర్లుతూనే ఉన్నాడు..

 

                                                                                  13

               

                సినిమా టాకీసు ముందు స్కూటర్‌ నిలబెట్టి రాఘవులు  నిుచున్నాడు. చేతిలో క్యాష్‌బ్యాగ్‌...టాకీసుకు మొదటాటకు ఇంకా అర్థగంటే ఉన్నది -  బుక్కింగ్‌ కాడ జనం తొక్కీసలాడుతండ్లు - రాఘవులు  చేతులు  తిప్పుతూ చుట్టు నిలుచున్న వాళ్లతో - ‘‘మరందుచేత ఉద్యోగాలు  మన జేబుల్లున్నయా?  ఉంటె గింత తతంగమెందుకు? దేనికైన ముహూర్తంగావాలె మానవప్రయత్నం - మనం చేసేదిచేస్తాం...ఆఖరు మినట్‌దాకా మనం కొట్లాడుతాం - కొందరికి దొరుకుతుంది = ఒకరిద్దరికి ఆగిపోతుంది - అదిగాక సంగతేందో తోసుకుందాం...’’ స్కూటర్‌ స్టార్టుచేసి కదలబోయాడు.

                అప్పుడు వచ్చాడొకడు -  దుమ్ము కొట్టుకపోయున్నాడు. కాళ్లకు చెప్పులు  లేవు. చేతిలో సంచి ఒకటున్నది...

                ‘‘నీతల్లి గప్పుడు గీ మాటెందుకు చెప్పలేదు - చెట్టెక్కిచ్చి చేతులిడిపిచ్చినవ్‌ -  ఆర్న్లెయె తిరుగబట్టి ’’ అనుకుంటనే రాఘవులు  గల్లా పట్టుకున్నాడు...

                రాఘవులు  మిడిగుడ్లేసిండు... కాష్‌బ్యాగ్‌ కింద బడ్డది -  స్కూటరాగిపోయింది.

                ‘‘ఇడువ్‌బే...’’ రాఘవులు  పెనుగులాడిండు - అప్పుడు సినిమా దగ్గరి వాళ్లు - వచ్చిపోయే వాళ్లు మార్కెట్లోని వాళ్లు బ్రాండి షాపు వాళ్లు, బట్టషాపు వాళ్లు చుట్టూ మూగిండ్లు...

                ‘‘నా పైసలు  నాకియ్యి ’’ గల్లా పట్టుకున్నవాడు...

                 సినిమా టాకీసు దగ్గరి నుంచి వచ్చిన గుండా సారలి ఝాడిచ్చి గల్లా పట్టుకున్నవాని దవడ మీద     గుద్దిండు  -  దుమ్ములో పడిపోయిండు. గుద్దు వర్షం -  సంచీ కిందబడి పోయింది -  సంచిలోని కాయిదాలు  కింద బడిపోయినయ్‌ - చుట్టూ నిలుచున్నవాళ్లు చోద్యం చూస్తున్నారేగాని ఎవరు విడిపించలేదు -  ‘‘మార్‌ సాలెకు మార్‌’’ శంకరి గుండా వచ్చిచేరిండు.

                రాఘవులు  అంగి సరిచేసుకున్నాడు -  ‘‘వాన్నిడువుండ్లి’’ అన్నాడు స్కూటర్‌స్టార్టు చేసివెళ్లిపోతూ...

                సినిమా టాకీసు దగ్గర నుంచి ఎట్లా  వచ్చిన వాల్లు  అట్లాగే వెనుదిరిగి పోయారు..

                కిందబడ్డోని దవడ ఉబ్బింది. ముఖమంతా దుమ్ము కొట్టుక పోయింది -  రెండు దినానుంచి    తిండిలేనట్టున్నది `- లేవలేక లేచిండు -  లేచితూలి పడబోయిండు.  చుట్టూ నిల్చున్న వాళ్లల్లో - ‘‘వాళ్ల జోలికెందుకు బోయినవు బై - వాళ్లు గుండాగాళ్లు’’ ఒకడు.                      

‘‘ఏ వూరో?’’ ఇంకెవరో?

                ‘‘అయ్యలాలా సూసిండ్లు గదా! సూసుకుంటనే ఉన్నరు. నామీద ఇద్దరు బడి తన్నంగ సూసుకుంటనే ఉన్నరు...నేను మూడువేల  రూపాలు లంచం బెట్టిన. నౌఖరిప్పిత్తమని - తన్నిండ్లు - గిదీ రాజ్జం... ‘‘ ఏడుపు గొంతుతో అని... నోట్లో ఊరిన నెత్తురు ఉమ్మేసి బజారు వెంట నడువసాగిండు...

                ‘‘దొంగని తెలిసినప్పుడు ముందుగా డబ్బిచ్చుడు తప్పుగాదా?’’ ఓ దుకాణదారు...

                ‘‘దొంగని ముఖం మీద రాసున్నదా?’’ మరొకడు...

                శంకరయ్య పక్క నిలుసున్న మొగిలికి కడుపు దేవినట్టయ్యింది... ముఖం మాడిపోయింది ` ‘‘అన్నా...’’  ఏదో అడుగబోయిండు.

                శంకరయ్య మొగిలి రెక్కబట్టుకొని మందినుంచి బయట కీడ్సుకొచ్చిండు...

                ‘‘గిక్కడ గిది మామూలే - కడుపుగాలినోడు తన్నులు  దినడం మామూలే - గుండగాళ్లు...ఆనిపున్నెం మంచిది – నాలుగుదన్ని ఇడిసి పెట్టిండ్లు...’’

                ‘‘లాపోతే సంపుదురా?’’

                ‘‘సంపుటమో లెక్క గాదు - ఆడు అంబోతు తీర్గ తాగినంత పోపిచ్చి ఉత్తగనే పెంచుతలేడు’’

                మొగిలి మాట్లాడలేదు. ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు -  అదే వీధీలో జనం ఎప్పటిలాగే ఏమి జరుగనట్టే నడుస్తున్నారు -  జంటలు  జంటలుగా  దుమ్మురేగంగా, ఆ దుమ్ములోనే లేని నవ్వు తెచ్చుకుంటూ నడుస్తున్నారు - రోడ్డుకు రెండు పక్కలా దుమ్ములో శద్దర్లమ్మె  వాళ్లు, కప్పుసాసర్లమ్మె వాళ్లు, బనీన్లు జాంగాలమ్మే  వాళ్లు, సోడావాళ్లు, పాన్‌షాపులోల్లు  ఎప్పటిలాగే వచ్చి పోయేవాళ్లతో బేరాలు  చేస్తున్నారు...

                ఎవడో ఎర్రగా ఉన్న వాడు డ్యూటీ బట్ట మీదనే బొక్కటోపి మెడకేసుకొని పూట్‌గా తాగి సొలుగుతూ పాన్‌ ఉమ్మడం చేతగాక తన బట్ట మీదనే ఉమ్ముకుంటూ సిగిరెట్టు  తాక్కుంటూ...’’  దొంగలు  బంచత్‌ బాయి దొరలు  దొంగలు. లీడరోళ్ళు  దొంగలు – బంచత్, ఆళ్ల నమ్మే లేబరోల్లు  దొంగలు ...’’ అంటున్నాడు.

                వానికేసి చూసిన వాళ్లు చిరునవ్వు నవ్వుతూ వెళ్లిపోతున్నారు...

                సైక్లిల్లు, కార్లు, జీపులు, లారీలు  ఒకటే రొద...శంకరయ్య మొగిలి సి.యస్‌.పి రోడ్డు మీదినుంచి నడుస్తున్నారు...

                శంకరయ్య ఎవరికో నమస్తేలు  చెప్పుతున్నాడు. మరెవరో శంకరయ్యకు నమస్తేలు  కొడుతున్నారు. ఇద్దరు అట్లా నడుస్తూ యాప కాడికొచ్చిండ్లు. శంకరయ్య కాసేపు రోడ్డు మీద నిలుచుండి ఏమి దోచని వానిలాగా నెత్తి గోక్కున్నాడు - జేఋపునికి చూసుకున్నాడు...

                ‘‘గురూ! ఇంకా పోలేదా?’’ అన్నాడొక గడ్డంవాడు అని ‘‘సిక్‌లో ఉన్న నువ్వు పోతె నేనొస్త డ్యూటీకి రానా...’’ అన్నాడు.

                ‘‘నేను పోతలేను  సుట్టాలచ్చిండ్లు’’

                ‘‘సుట్టాలత్తెనే తడాఖా’’

                ‘‘సరెసరె నాకు జెరంత పనున్నది’’ అని అతన్ని తప్పించుకొని రోడ్డుదిగి గుడిసెల్లో నుంచి మళ్లీ యాప దగ్గరకి నడిచిండు.  కొంచెం లోపలున్న గుడిసె ముందు చాలా మంది జనం నిలుచున్నారు -  ఒకనిమాట  ఒకనికి వినపడకుండా వదురుతున్నారు.

                ‘‘మా బాయిమీన ఆడుఎవడాడు నర్సొక్కులోడు... కోతిమొఖపోడు - నిన్న ఏమన్నడంటే ` హాలర్‌ కాడి నల్లా కాడ నీళ్లు  దాగుతన్న -  ఆడచ్చిండు. ‘‘ఎవడుబే’’  అన్నడు. నేను నీళ్లు దాగి వాన్ని చూసిన. నీదేసిప్టు – నీళ్ళ  మడుగైంది ’’ అన్నాడు. ప్యూనుగాడచ్చి -  అనిదే బాయి అయినట్టు ‘‘నడువ్‌ నడువ్‌’’ అన్నడు. గొడ్లునో బర్రెనో అదిలిచ్చినట్టు.  ‘‘నీ తాత సొమ్మా,  నల్లా ఉంటే నీలు తాగిన’’ అన్ననేను. ఆడు నామీదికురికచ్చిండు - ఇద్దరం తన్నుకున్నం ఆడి తోటయి పోయిందా? ఎవడు కోతిమూతోడు ఆనవ్వను కుక్కల్‌దెం... నాకు తెల్లారి బిలిసి సార్జి సీటిచ్చిండు... గది బట్టుకొని రాఘవులిగాని దగ్గెరికిపోతే - వాడే మంటడు?  ‘‘ నల్లాకాడ నీల్లెందుకు దాగినవ్‌’’ - అని - నాకట్ల కోపమచ్చింది. ‘‘నల్లా కాడ నీల్లు  దాగకపోతే ఏర్గబోతరా’’ అన్నా? లీడరోడు బాయోడు ఒకటే మాటంటే ఎట్ల చెప్పు? -  గిదేమన్న నాయెమేనా?’’ పక్కనున్న వాన్ని నిలదీసి అడిగిండు.

                ‘‘కాదనుకో? కని నాయెం, అన్నాయెం చెప్పెటోడెవడు?’’అన్నాడు ఎదుటోడు...

                ‘‘నువ్వు గట్లనే అంటవా?’’

                శంకరయ్య మొగిలిని తీసుకొని లోపలికి నడిచిండు -  గుడిసె ముందు జాగాలో సాటు గట్టున్నది. లోపట చాలా మంది తీరిపారి కూసుండి ముంగట సీసాలు  బెట్టు కొని తాగుతండ్లు - సారావాసన గప్పు మంటోంది -  మాటలు - ఎడతెరిపి లేని మాటలు. ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర కూర్చుండి తాగుతున్నారు. వాళ్ల దగ్గర సీల్లేసిన చిన్న సీసాలు, గ్లాసులు, మిరుప కాయబజ్జీలు, గుడాలున్నాయి.

                గుడిసెలో ఒక పక్క నల్లగా తునికి మొద్దు తీరుగున్న వాడొకడు పైసలు  దీస్కొని సీసాలిస్తున్నాడు -  కొందరికి గ్లాసుల్లో పోస్తున్నాడు.

                ‘‘గిటెందుకు తీస్కచ్చినవే?’’ అన్నాడు మొగిలి..

                ‘‘ఎందుకంటవేంది?’’ శంకరయ్య ఓ సేర్‌ సీసా తెచ్చిండు. -  గుడాలు  తెచ్చిండు -  మిరుపకాయ బజ్జీలు  తెచ్చిండు.

                ఇద్దరు ఎదురెదురుగా దుమ్ములో కూర్చున్నారు -  దుమ్మంటే దుమ్ముగాదు -  అది బొగ్గుదుమ్ము. సీసాలోది వంచి శంకరయ్య ఎత్తి గొంతులో తనే మొదట పోసుకున్నాడు.

                మరోమారు గ్లాసులో పోసి మొగిలి కిచ్చిండు

                ‘‘అద్దద్దు నేను గుడాలు  దింటగని -  నాకద్దు’’

                ‘‘దుడ్తు ఎవడన్నింటే  ముడ్డితోని నవ్వుతరు’’

                ‘‘తెల్లగల్లు  దాగినగని గిది’’

                ‘‘తీసుకో సచ్చేంబోవు...’’

                మొగిలి బలిమిటికి గొంతులో పోసుకున్నాడు. గొంతంతా మంట - కండ్లల్లోనుంచి పొగెల్లి నట్లనిపిచ్చింది శంకరయ్య చెప్పుతున్నాడు.

                ‘‘మొగిలీ నేను మొదట్లచ్చినప్పుడు నీ తీర్గనే అనుకున్న -  తినద్దనుకున్న. తాగద్దనుకున్న. కని గిప్పుడు తినుడు తాగుడు తప్ప మరోలోకం లేదు -  ఆఖరుకు గిదన్న మిగులుద్ది -  సచ్చిన్నాడేం కొంటబోతం. సిన్నప్పుడు పల్లెల  ఆకటికి సచ్చినం. గిప్పుడు గీడ -  వారీ మొగిలి నావొంట్లె నెత్తురు కొలిసమ్ముకుంటన్న -  మల్ల  గపైసలు  బెట్టి తాగుతన్న’’ లొడలొడ ఏదేదో సెప్పుతున్నాడు.

                ‘‘అంతే అన్న -  కాకపోతేంది? ’’ అన్నా అన్నాడు పక్కవాడు...

                ‘‘నాకు పెయి దిరుగుతందన్నా’’ మొగిలి.

                నువ్వేం భయపడకు `- మన పెయ్యిదిరుగక పోతే భూమి తిరుగుతదా? మిరుపకాయ దిను’’ అన్నాడు శంకరయ్య.

                పైసలయిపోయినయ్‌ - ఇద్దరు లేచి బయటకొచ్చారు. అప్పటికి రాత్రయిపోయింది - బజాట్ల కరంటు బుగ్గ లెలుగుతున్నాయి. దుకాన్లు మూసున్నారు. శంకరయ్య తూలుతున్నాడు. మొగిలికైతే గిర్ర గిర్ర తిరుగుతోంది.

                ‘‘రారా...నా ఎంటరా?’’ మొగిలిని పట్టుకున్నాడు...

                ‘‘నాకు కక్కత్తందే...’’ అన్నాడు మొగిలి

                ‘‘అద్దద్దు కక్కకు - గీడ నీళ్లులేవు...’’ అన్నాడు.

                ఇద్దరు నడుస్తున్నారు... మొగిలి కాళ్లు మడతలు  బడుతున్నాయి. కరంటు బుగ్గల వెలుగు ముఖం మీద కొడుతోంది. రోడ్డంతా ఎగుడు దిగుడు.  శంకరయ్య దారెంట ఏదేదో చెప్పుతూ మొగిలిని తీసుకొని గుడిసె చేరుకున్నారు...

                లక్ష్మి ఇద్దరి వాలకం చూసింది...

                ‘‘నువ్వు సెడిపోయింది గాక మొగిలిని జెడగొడ్తన్నవ్‌.. నౌఖరిప్పిత్తనని తీస్కచ్చి గిదా?’’ అన్నది

                ‘‘లంజె...నడువ్‌ - నువ్వానాకు సెప్పేదానివి’’ అన్నాడు శంకరయ్య

                మంచంలో మొగిలిని కూర్చుండ బెట్టిండు.

                ‘‘లంజె కూడేదే’’ అన్నాడు..

                ‘‘బజాట్లకేనా? కాళ్లుసేతులు  కడిగేదున్నదా?’’

                ‘‘నాయిష్టం తే... మొగిలి లేరా’’ అన్నాడు – లక్ష్మి ఇద్దరికి భోజనం బెట్టింది -  మొగిలి తల  వేల్లాడేసిండు.. శంకరయ్య తీసుకొచ్చి అన్నం ముందు కూర్చుండ బెట్టిండు...

                మొగిలి బల్లున అన్నంలో కక్కుకున్నాడు -  శంకరయ్యకు సర్రున కోపమచ్చింది -  ‘‘లమిడి కొడుకా?’’  నెత్తిమీద గుద్దిండు...

                ‘‘లంజే..గిదేంకూరే..’’ అని పల్లెం విసిరికొట్టిండు...

                లక్ష్మి తల  వంచుకొనే మొగిలి ముఖం కడిగి బయట మంచం మీద పడుకో బెట్టింది -  శంకరయ్య బయటకొచ్చిండు..లక్ష్మి ఇంట్లో సాపు చేస్తోంది..

                ‘‘వారీ మొగిలిగా... నీకు బాయిపని రాలేదు’’ అన్నాడు అప్పుడు యాదికొచ్చి శంకరయ్య....

                మొగిలికి మాట వినపడనే లేదు...నిద్రలోకి జారుకున్నాడు.

                ‘‘వీనవ్వ -  పీకులాటే అచ్చేటట్టున్నది`’’ అనుకున్నాడు.

                లక్ష్మి ఆ మాటవిని బయట కొచ్చింది. ‘‘నీ సావు నిర్సావుగాను. మాదండి మొగోన్నని ఊళ్లెకు బోయి పెగ్గెలకు బోయి పుల్లబెట్టి దున్నుక బతికెటోన్ని నౌఖరంట తీసుకత్తవి. గిప్పుడు రాలేదంటివి -  ఆడ మన ఇజ్జత్‌ బోతది - నువ్వే పైసల్‌ తిన్నవంటరు...’’

                శంకరయ్య కామాట నిజమే ననిపిచ్చింది...

                ‘‘నీసావు నిర్సావుగాను -  గపైసలన్నా వాపస్‌ యిప్పియ్యి - ఆళ్ల మానాన ఆళ్లుబోతారు -  మల్లగిసొంటి నడుమంత్రపు ఏషాలెయ్యకు’’  అన్నది...

                ‘‘లంజెకాన నీకెందుకు బంచత్‌’’ అన్నాడు శంకరయ్య రేషంగా...

                లక్ష్మి మాట్లాడలేదు...

                మొగిలి నిదురలో కలవరిస్తున్నాడు...

 

                                                                                     14

 

                ఎప్పటిలాగే తెల్లారింది... శంకరయ్య ఎప్పటిలాగే ఆదరబాదర లేచిండు... అప్పటికే గుడిసెలన్నీ బొగ్గుపొగలో నిండిపోయాయి. అరుపులు, కేకలు, తిట్లు విన్పిస్తున్నాయి. మధ్యమధ్యలో పెద్ద రోడ్డు మీదెక్కడో దబడ దిబడ ఉరికే లారీ రొద...ఉరుకులు  పరుగులు  మీదనే ఇనుపలోటా బట్టుకున్నాడు.. నీల్లు  లేవు...

                ‘‘ఒసే లచ్చి లంజె నీల్లేయే నీళ్లు’’ గావుకేక పెట్టిండు.

                లక్ష్మి నీళ్ళ పంపు దగ్గరికి పోయింది. ఆ కేకకు మొగిలి లేచి కూర్చున్నాడు -  రాత్రి జరిగింది కొంత జ్ఞాపకానికొచ్చింది. శంకరయ్య ముఖంలోకి చూడలేక పోయాడు...

                ఇంతలోకే ముఖం మాడ్చుకొని ‘‘లంజెలు  ఒక్కలన్నా సందియ్యరుగదా?’’ తిట్టుకుంట లక్ష్మి వచ్చింది.

                ‘‘కాళ్లు బార జాపుకొని తెల్లారే దాక పండకపోతే గదా! పొద్దుగాల్లేత్తేగాదా?’’ శంకరయ్య.

                ‘‘సీకట్లనే లేసిన -  ఏవారాయె నల్ల  కాడ కూకుండి’’  లక్ష్మి బిందెలో నీళ్లు తెచ్చి సిమెంటుగోళంలో పోసింది.

                ‘‘డ్యూటీకి బోతడని చెప్పద్దా?’’

                ‘‘నీ మొగడొక్కడేనా సిపరాతిపిట్ట - అందరు డూటీకే కాలబడతరనిరి’’

                ‘‘మాటకు మాట బంచత్‌...’’ అనుకుంటనే నీళ్లు తీసుకొని పట్నం తుమ్మ చెట్లకేసి పరుగెత్తిండు -  మురికి  కాలువలు  గెంతుతూ చెట్లల్లోకి నడిచాడు - అప్పటికే చెట్లన్ని నిండిపోయాయి... వాళ్లందరిని తప్పిచ్చుకొని దూరం పోయేసరికి పందులు  గురుకూ గురుకుమని వెంటపడ్డాయి...

                శంకరయ్య మళ్లా గుడిసె కొచ్చేసరికి తొలి సైరన్‌ గాడిది గూసినట్టు కూసింది...

                ఉలిక్కి పడి మొఖం మీద నీళ్ళు  జల్లుకున్నాడు - ఆకుతూ ఆకుతూ అని ఊంచిండు - మొఖంమైపోయింది...

                ‘‘ఆ గబ్బు నోరు మంచిగ్గడుక్కుంటె గాదా?’’ అన్నది లక్ష్మి...

                ‘‘నీయవ్వ నాదా గబ్బునోరు తందునా?’’లక్ష్మి మీదికురికిండు...

                ‘‘ఇంటాడిదాన్ని గొట్టంది ఇది మీసం గాదని - తన్ను కొత్తా - తన్ను...’’అన్నది...

                ‘‘చాయ్‌..’’ అరిచిండు...

                శంకరయ్య డ్యూటీ బట్టలేసుకొని చాయ్‌తాగే సరికే ఏడుగంటల  సైరన్‌ కూసింది -  శంకరయ్య బొగ్గుపొయ్యి మీద నీళ్లు గుమ్మరిచ్చినట్టు చప్పగా చల్లారిపోయిండు.

                ‘‘నీతల్లి మస్టర్‌ బోయింది...’’  గొనుక్నున్నాడు...బట్టలు  విడిచాడు.అప్పుడు మొగిలి నౌఖరి సంగతి యాదొచ్చింది.. మొగిలి లోటా బట్టుకొని చెట్ల్లకు పోయిండు.

                మంచంలో వెల్లకిలా పన్నాడు. సూర్యుడు పైకెక్కి వచ్చాడు. ‘‘పీకులాట బెట్టుకుంటినే -  ఇజ్జత్‌ బోయే టట్టున్నది... ఇప్పుడే నౌఖరి దొరికినట్టు తీసుకత్తిని. రాఘవులు  గాడెంత పనిజేసిండు -  డాక్టరుగాడే పుల్ల  బెట్టిండు. వాని కిచ్చిండ్లో లేదో పైసలు  -  లంగలు  బంచత్‌... గిప్పుడెట్ల గిప్పుడు రాఘవులుగాన్ని తన్నేం ఫలం - వాడు సూత్తాం సూత్తామంటడు -  బాయి మీదికి బోయి లీవు కాలబెట్టి దొర దగ్గెరికి పోయడిగితే  - అదే మంచిది...’’

                ‘‘ఇగో లచ్చిమి -  మొగిలిని తయారుగుండు మను నేను బాయి మీదికి బొయి లీవు బెట్టత్త ’’ అని సైకిలు  దీసుకొని బయట కొచ్చాడు.

                ‘‘శంకరయ్య గుడిసెకు బాయికి మూడు మైళ్లు... లీవ్‌ క్లర్కుదగ్గర లీవు ఫాం అడుక్కున్నాడు. రాయిమంటే ‘‘మాకదేపని -  పో -  పో మ్యాన్‌వే క్లర్కు దగ్గరకి పొమ్మని ’’  కసురుకున్నాడు.

                మ్యాన్‌ వే ముంగట మంది జమై ఉన్నారు. తలో మాట -  తలో తిట్టు మందిలో రాఘవులు  నిలుసుండి ` చేతులూపుతూ ‘‘సోదరులారా! నామాట వినుండ్లి -  నల్లా దగ్గర నీళ్ళు  దాగడం తప్పుగాదు - కని నిజమే -  కాని ఆడ మడుగైందనుకో -  ఎవడన్న జారిపడితె ఎవనికి పీకులాట’’

                ‘‘జారిపడకుంట సిమెంటు గద్దె గట్టియ్యాలె’’

                ‘‘కట్టిత్తరు అదివేరే సంగతి...’’

                ‘‘మరైతే చార్జిసీటు వాపసు దీసుకొమ్మను’’ ఓ దవడలు  చెక్కుకపోయిన కార్మికుడు తెగేసి చెప్పిండు.

                ‘‘అదట్లా ఉంచుండ్లి -  ఆ మడుగు ఈ కార్మికుడే - మన ఓదెలు  చేస్తె అయ్యిందా అనేది దొరకెట్లా తొస్తది...’’

                ‘‘అదిగాదయ్య...’’

                ‘‘కార్మికులారా మీరట్లా మాట్లాడితే  ఎట్లా? అందరు మాట్లాడతమంటే మాట్లాడుండ్లి - మద్దెన మేమెందుకు? ` చార్జి సీటు వాపస్‌ తీసుకొమ్మని మనం కోరుదాం -  నేను పోయి మాట్లాడ్త -  మీరంతా బాయి లోపలికి దిగండి’’

                ‘‘ఏదో ఒకటి తేలేదాకా దిగేది లేదు..’’ అన్నాడు శంకరయ్య.

                తను ఎట్లాగు దిగేది లేదు కనుక - కొత్తసినిమా మీద మనుసు పీకిన వాడొకడు. ‘‘అంతే అంతే’’ అన్నాడు...

                బదిలీ ఫిల్లర్స్  అదే అన్నారు.

                హామర్‌ మన్స్‌, ఫిట్టర్స్‌ ` ‘‘దిగాలె’’నని అందామనుకొని మందికి భయపడి ఊకున్నారు...

                ‘‘ఇట్లా మధ్యన సమ్మె చేస్తే ఇల్లీగల్‌’’ అన్నాడు రాఘవులు.

                ‘‘అదేనోంట’’ అన్నాడో తొర్రోడు.

                ‘‘సమ్మె చేయాలంటే పదిహేను రోజు ముందు నోటీసిచ్చి చెయ్యాలె’’ రాఘవులు ...

                ‘‘బాగుంది ` మహా బాగుంది ` బాయిదొర పదిహేనొద్దులాగి చార్జి సీటిచ్చిండా? కడుపు ఇయ్యల్ల  నొత్తె పదిహేనొద్దులకు ఓమ బుక్కుమంటవ్‌లే. లేవయ్య! మాంచి లీడరువు’’ అన్నాడెవడో...

                ‘‘రూల్స్  అంతే...’’

                ‘‘నీ రూల్స్ గీల్స్  గుద్దల  బెట్టుకొమ్మను...మా రూల్స్ గిది...పో -  పొయ్యి అడుగుపో’’  టింబర్‌మన్‌ ముసలోడు అన్నాడు ..

                ‘‘అయితే ఉండండి...’’ అంటూ రాఘవులు  సూపరిడెంటు రూంలోకి పోయిండు -  ఏదేదో మాట్లాడిండు ...

                నవ్వు ముఖంతో మళ్లీ కార్మికుల  దగ్గరికొచ్చిండు ‘‘కార్మికులారా మనం గెలిచాము... పోరాడితే మనం మన హక్కులు  గెలుచుకోగలమని రుజువైంది. చార్జిసీటు వాపసు తీసుకోవడానికి బాయిదొర ఒప్పుకున్నాడు’’ అన్నాడు రాఘవులు.

                ‘‘పెనం గిటు బెట్టిండేంది. తింపేసినట్టున్నది కత’’ ఎవడో అన్నాడు...

                ‘‘గదే కదా అంపయితె మరదలు  మిట్టయితే వదినె...’’ 

                హాలరు తిరిగింది... పంఖాతిరిగింది -  మ్యానువే తలుపు దబెల్లు  దబెల్లున ఇగ్గుతో వేస్తూ ఒక్కొక్కలు  బొగ్గుబాయిలకు దిగిండ్లు...

                రాఘవులు  చెమట తుడుచుకున్నాడు... స్కూటరు దగ్గరికి నడువబోయాడు. అప్పుడు శంకరయ్య తగులుకున్నాడు..

                ‘‘జెరంత లీవు గావాలె’’ అన్నాడు...

                ‘‘అయితే నువ్వీడుండు. నేను శాంక్షన్‌ చేయించుకొస్తా’’ నని రాఘవులు  బోయి లీవు శాంక్షన్‌ చేయించాడు...

                ‘‘జెరంత ఆగుతరా?’’ అన్నాడు శంకరయ్య నాలె చూపు చూస్తూ...

                ‘‘మల్లేంముంచుకచ్చింది -  మంగలోన్ని సూసి దున్నపోతు కుంటినట్టు’’ రాఘవులు  అదో విధమైన నవ్వు నవ్వుతూ...

                ‘‘గదేనుండ్లి మావోనికి నౌఖరిరాలే...’’

                ‘‘ఓ మతికత్తలేదే -  ఆనాడు తీసుకచ్చినోడా!  ఇంకో పారి జూద్దాం...అట్ల రాంగనే ఇట్లయితదా?’’

                ‘‘రెండువేల  అయిదువందలు ’’

                ‘‘ఇచ్చిండ్లోయి, ఇయ్యలేదని ఎవలంటండ్లు.? నేనిచ్చేకాడ ఇవ్వనే ఇస్తి. ఏడ జరిగిందో మిస్టేకు... జరిగింది . ఈ భర్తి కాకుంటే ఇంకో భర్తి’’

                ‘‘నాయింటి మీద బడున్నడు’’

                ‘‘ఇంటికి బొమ్మను మల్ల  చాన్సచ్చినప్పుడు పిలుసు కొచ్చేవు’’

                ‘‘నేనాడ వస్తదని తీస్కచ్చిన...’’

                ‘‘ఓ సావొచ్చిందే... ఎట్లస్తదోయి ఎకాఎకిన...అది నౌఖరా మరోటా? చూస్తివిగదా? ఇంత జేస్తె మాకు మోఖ పడ్డప్పుడు గంజి ఈగ తీర్గతీసేస్తరు... వానికి అదే ఆ ముసలినాకొడుక్కు లక్ష సార్లు నేను సాయంజేసిన. వాడు మందిల ఎగిరెగిరి మాట్లాడిండు. -  సూస్తివిగదా! మీ వర్కర్ల నమ్మవశం గాదు - అందుతే జుట్టు లాపోతే కాళ్లు బట్టుకుంటరు... మల్లగలువు’’ మని స్కూటరు స్టార్టు చేసిండు. కొంత దూరం పోయి స్కూటరాపి పిలిచిండు -  శంకరయ్య దగ్గరికి పరుగెత్తిండు...

                ‘‘ఇగో మాపటించి దొరస్తున్నాడు... నువ్వుబొయ్యి అడుగు -  నాపేరు దియ్యకు -  మద్దెన నేనే తోలిచ్చినంటడు. లోడింగు పని అంతదనుక బెట్టుకొమ్మను...’’ రాఘవులు  స్కూటర్‌ వెళ్లిపోయింది...

                ‘‘నీయవ్వ లోడింగు పనికి గుడుక దొరనే అడుగన్నట’’ అనుకున్నాడు శంకరయ్య...

సైరన్ నవల నాల్గవ భాగం  

(గత సంచిక తరువాయి భాగం )

                                                                              15

                ‘‘ఇగో మొగిలి...నువ్వేం ఫికరు పడకు - దేంట్లనో దాంట్లె  ముందుగాల ఇరుకాలె ... ఇన్నవా? ఇంతట్లకాలం గడుత్తనే    ఉంటది. గిప్పుడు నువ్వింటికి బోయినవనుకో నువ్వాడ! నేనీడ! ఓపారి మతి కుండె. ఓపారి లేకపాయె - నాకండ్ల ముంగటుంటె - రాంగపోంగ రాఘవులు గానికి కండ్లబడి సెవుల జోరిగ తీర్గ తాపతాపకు మతికి జేత్తె - పీడ బోనియ్యని ఎప్పుడో పనిల పెడ్తడు..నేనైతే తిరుగంగ తిరుగంగ దొరికింది’’ అన్నాడు శంకరయ్య..

                మొగిలి ఏమనలేదు - ఇద్దరు బొగ్గుకుప్పల మధ్యనుంచి నడుస్తున్నారు. సి.యస్‍.పి.(కోల్‍ స్క్రీనింగ్‍ ప్లాంట్‍) దగ్గర గల్లర గల్లర సప్పుడైతంది - బొగ్గు కుప్పల్ల బొగ్గు పెళ్లలు కదులుతున్నట్టు బట్టలు, పెయ్యంతా బొగ్గు దుమ్ముబడిన వాళ్లు లారీలు లోడ్‍ చేస్తున్నారు...ఎవడో తెల్ల బట్టలోడు వాల్ల పక్కన సైకిలు బట్టుకొని నిలబడి ముక్కు కడ్డంగా దస్తీ బెట్టుకొని మాట్లాడ్తండు.

                ఇద్దరు బొగ్గుకుప్పలు దాటి రోడ్డెక్కారు... జనరల్‍ స్టోరచ్చింది. వాచ్‍మన్‍ వచ్చిపోయే లారీల తనఖీ చేస్తున్నాడు. రోడ్డు మీద నడుస్తుండగా...

                ‘‘ఓ మొగిలయ్య బావ గీడికచ్చినవేందే?’’ అన్నా డెవడో పక్కనుంచి.

                మొగిలి ఉలిక్కిపడి చూసిండు - బోడగుండు, ఎత్తు చెప్పులు - కర్రెగున్నవాడు. ఎర్ర దస్తీ ఒకటి మెడదగ్గర బెట్టుకొని దోవతి చింగులు అచ్చం పట్వారి పట్టుకున్నట్టు పట్టుకొని అడిగిండు.

                ‘‘అయ్యో నన్ను గురుతు బట్టలేదా? ఏల్పుల సమ్మన్ని. కుంటిమల్లవ్వ కొడుకును’’ అన్నాడు..

                మొగిలికి యాదొచ్చింది. చిన్నప్పుడు ఇద్దరు ఎడ్ల కాసేటోల్లు - వాడు కిట్టయ్య పంతులుకు పాలేరు...ఎప్పుడు కడుపీడుసక పోంగ ఏదో పదం - ఆయాది కొచ్చింది ‘‘వానికడుపుడికినాది - వాని కండ్లు మండినాయి. పాలేర్లు రాలేదని పండ్లు గొరికినాడు - అయ్యలేని పోరన్ని, దిక్కులేని పోరన్నిధీములేని పోరన్ని’’ అంటూ కైగట్టి పాడేటోడు...

                ‘‘ఏడున్నవురా?’’ మొగిలి...

                ‘‘మా బావ రప్పిచ్చిండు. కొలువు కోసం దిరుగుతన్న’’ అన్నాడు.

                ‘‘మా లింగు మామ బిడ్డ లచ్చిమి మొగడు’’ అని శంకరయ్యను చూపెట్టిండు.

                ‘‘లచ్చవ్వ మంచిగున్నదా? మీది బేగంపేట గాదుండ్లి’’ అన్నాడు సమ్మయ్య

                ‘‘ఔ..’’ నన్నట్టు తలూపిండు శంకరయ్య. ఇద్దరు మరికొంచెం నడిచేసరికి చిన్న బ్రిడ్జి వచ్చింది. బ్రిడ్జికిందా మురుగు    నీళ్లు పారుతన్నాయి... వాగుదాటిన తరువాత క్వార్టర్లు... ఎడంబాజు దొరలయి. కుడిబాజు రైటర్లయి, వోర్‍ మన్లయి...

                క్వార్టర్ల దాటి మార్కెట్లకొచ్చిండ్లు - మార్కెట్లో తట్టుబొంతలు కొయ్యల మీదేసుకొని కూరగాయలమ్మేటోళ్లు ముందు వాడిపోయిన కూరగాయలు బెట్టుకొని తాపతాపకు నీళ్లు జల్లుతున్నారు...కొనే వాళ్లు దుకానం నుంచి దుకానానికి తిరుగుతున్నారు...

                ‘‘అగో మీతమ్ముడు..’’ అన్నారెవరో.

                పేడి మూతి నూనె రాసిన ఎంటికలుగల ఎర్ర టాయన సంకల పిల్లనెత్తుకొని ‘‘ఒరే శంకరీ’’ అని పిలిచిండు.

                శంకరయ్య ఆగి పోయిండు...

                ‘‘అయ్యో! నువ్వెప్పుడచ్చినవు పిలడా? ఊళ్లంత మంచి గున్నరా? మా అవ్వ నాయిన్న - ఇటుతొంగన్న సూత్తలేరు?’’ భర్తకన్న ఎత్తున్నామె లక్ష్మి అక్క చెంద్రకళ అడిగింది...

                ‘‘మొన్ననే వచ్చిన’’ అన్నాడు మొగిలి.

                ‘‘మా యింటి దాకన్నా రాపోతివి...’’

                ‘‘నాకెర్కలేదు?’’

                ‘‘నువ్వన్న చెప్పద్దా...?’’ అన్నది మరిదికేసి చూసి...

                ‘‘ఏడది? తీరికబడలే - ఇయ్యల్ల అత్తామనే బయలెల్లినం’’అన్నాడు శంకరయ్య.

                ‘‘రాండ్లి....రాండ్లి...’’ అన్నదామె

                ‘‘ఇయ్యల్ల మామత్తనన్నడు’’అనేమాట నోట్లెనే అగిపోయింది - శంకరయ్య మందిల కలిసిపోయిండు -

                మొగిలి తత్తరపడి మందిని దాటుకుంటూ పోతూ ఓ ఎర్ర చీరామెకు గుద్దుకున్నడు. ఆమె గయ్యిన అంతెత్తులేచి ‘‘కండ్లు గన్పడ్తలేవ్‍ బాడ్‍కావ్‍’’ అన్నది. చుట్టు పక్కలోల్లు మొగిలిని వింత మృగంలాగ చూసిండ్లు.

                ‘‘లమ్డికొడుక్కు రెండేత్తె కండ్లు కన్పడ్తయి’’ అన్నాడెవడో...మొగిలి మొఖం నల్లబడి పోయింది....

                ఆ గడబిడలోనే శంకరయ్యచ్చి మొగిలి చెయ్యిబట్టుకొని గుంజుకపోయాడు...

                ఇద్దరు మార్కెటు దాటి మల్లీ రోడ్డెక్కారు...

                ‘‘ఇంకానయం -అది తన్నలేదు’’ అన్నాడు శంకరయ్య.

                ‘‘ఎందుకుతన్నుద్ది?’’

                ‘‘అంతే -గీడ గట్లడుగద్దు’’

                పెద్దపెద్ద దుకానాలొచ్చాయి - దుకాన్ల మధ్యలో ఓ పెద్ద బంగళా ఉన్నది- దాని చుట్టు ప్రహారి గోడున్నది. గేటు లోపల ఖాళీ స్థలంలో కుర్చీలు వేసున్నాయి. ఓ కుర్చీలో క్రిష్ణారావు దొర కూర్చుండి సిగరెట్టు తాక్కుంటూ ముక్కుల్లో నుంచి పొగ వదులుతూ ఏదో అంటున్నాడు- అతని ముందు అమ్మోరు మొఖపు నడీడు మనిషి నిలబడున్నాడు.. దూరంగా జాజితీగ పందిరికింద ఎర్రగ ఎత్తుకెత్తున్నామె నిలబడున్నది...

                ‘‘రాయమల్లూ - ఆలోచించాలే’’ - ఎనకాముందు ఆలోచించాలె - విన్నవా. మనుషులన్న దగ్గర వ్యవహారాలుంటాయి.. ఇచ్చుడు పుచ్చుకునుడు లేకుంటే ప్రపంచం నడువది. కాని నీతి ఉండాలె - వింటన్నవా? కొంతకాక పోతె కొంత యివ్యాలె...’’

                ‘‘యిస్తూనే ఉన్నదొర’’ రాయమల్లూ.

                ఆ పక్కనే నిలబడ్డ పొట్టి గడ్డపువాడు పిడికిలి బిగించి - కుడి చేతి కడెం ఊగుతుండగా ‘‘అరెబయి జూటా మత్‍ బోలనా... నేను నీ చుట్టు తిరిగి తిరిగి పరిషానయితి.... వడ్డీలేదు, అసలులేదంటే మాదీ దంద ఎట్ల నడువాలె?’’ సిక్కులాయినె.

                ‘‘నేను ఉత్తగనే అన్ననా? నాగళ్లబడితె అన్ననా? నెలా నెలా వడ్డి యివ్వనే పడ్తి. పోయిన నెలల తఖిలీబున్న దంటె వినకపోతివి. నువ్వే గుండాలతోని తన్నిస్తనంటవి.’’

                ‘‘తెరి మాకా బోసిడికె మెరీపైసే పారేసి మాట్లాడు’’

                ‘‘ఖామోస్‍...మధ్యలో నేనెందుకు...? చూడు రాయమల్లూ. కొట్లాటలు ఉండయనీకాదు - నువ్వు మొదటి నుంచి నా యూనియన్‍ మనిషివి - నా మనిషివి. ఎవడు కొట్టినా నాకు కష్టంగుంటది బై...పో...మళ్లీ నాదగ్గరకి కిస్సా రావద్దు... నువ్వేం చేసుకుంటవో నీయిష్టం.. సింగ్‍బై జెర ఆలోచించి వసూలు చేసుకో...’’ఇంకా మాట్లాడడానికేమి లేనట్టు - అగ్గిపెట్ట గీసాడు        క్రిష్ణారావు.

                రాయమల్లు అనే కార్మికుని ముఖం ముడుచుక పోయింది. తలెత్తి సింగ్‍ను, క్రిష్ణారావును చూసి బయటకు నడిచాడు...

                ‘‘వీనవ్వల గాడ్దులు దెం....లంగ లం... కొడుకులు. తోడు దొంగలు. దొరోని పైసలు వీడు వడ్డీకి తింపుతడు.  మళ్ల దొరోడు పంచాయితీ తెంపుతడు.  ఇప్పటికే నా యిల్లు ముంచిండ్లు...’’ అన్నాడు... కాళ్లునేలకేసి బాదుతూ వెళ్లి పోయాడు.

                శంకరయ్య మొగిలి లోపలికడుగు బెట్టారు...

                ‘‘ఎవర్రా మీరు ?...’’ క్రిష్ణారావు..

                ‘‘నేను కెకె -2 లోపని చేస్తున్నదొర - వీడు మా సిన్నాయిన కొడుకు... మొన్నటి భర్తిల రాఘవులు సారు బెట్టిత్తనన్నడు - కని కాలేదు దొరా’’

                ‘‘అయితేం జెయ్యమంటవ్‍?’’ అప్పటికే క్రిష్ణారావుకు కేసు అర్థమైంది.

                ‘‘రాఘవులు సారు నడిగినం దొరా! ఏదో తమరికి గలిసి లోడింగు పనిలనన్న బెడ్తె...’’

                ‘‘ఇగో అట్లబోయి - టాకీసుకాడ మా మొఖద్దమ్‍ నరేందర్‍ గాడుంటడు - నేను రమ్మన్నని చెప్పు’’ అన్నాడు...

                శంకరయ్య టాకీసు కాడికురికిండు.. మొగిలి అక్కడే నిలుచున్నాడు

                ‘‘ఏమోయి నీపేరేంది? ఏవూరు’’

                మొగిలి చెప్పిండు....

                క్రిష్ణారావు అచ్చం ఇంటర్వూలోల్లు చూసినట్లే పిక్కలు చూసిండు...

                ఇంతలోనే నరేందర్‍ అనే మొఖద్దమ్‍, శంకరయ్య వచ్చారు....

                ‘‘నరేందర్‍ వీడు ఫిల్లింగు పనిల కొస్తడట. రేపటి నుంచి తీసుకో - సి.యస్‍. పి దగ్గర ట్రక్కులోడింగ్‍ల బెట్టు... ఇక మీరు పోవచ్చు’’ అన్నాడు...

                శంకరయ్య దండం బెట్టిండు - మొగిలి తను దండం బెట్టిండు ఇద్దరు బయటకొచ్చారు...

                వాళ్లిద్దరు గుడిసె చేరుకునే సరికి పల్లెనుంచి లింగయ్య వచ్చున్నాడు...

                ‘‘ఏమిర మొగిలి పనైనట్టేనా? అడిగిండు.

                ‘‘అయినట్టేననుకో’’ అన్నాడు శంకరయ్య

                ‘‘ఆ అనుకో’’’ అన్నమాట తీరుచూసి లక్ష్మి మొగిలి కళ్లల్లోకి చూసింది...

                ‘‘ఇగో మీనాయిన తీరుపాటం జూసుకొని రమ్మన్నడు... ఏ సంగతి చెప్పుమన్నడు...?’’ లింగయ్య... వాళ్లట్లా మాట్లాడుతుండగానే మామకు సారాతేవడానికి సైకిలు తీసుకొని బయలు దేరిండు శంకరయ్య.

                ‘‘ఏందట్లా దీర్ఘంతీత్తడు ’’ అన్నది లక్ష్మి

                ‘‘ఈ భర్తీల దొరుకలే - మల్లచ్చే భర్తీరెన్నెల్లకున్న దంటండ్లు - అంతదనుక లోడింగు పనిల చెయ్యిమన్నడు దొర’’

                ‘‘ఓ గ పనినువ్వేం జేత్తవ్‍’’ అన్నమాట లక్ష్మి నాలిక చివరిదాకా వచ్చింది కాని అనలేదు...

                లింగయ్య ఊరు సంగతులు చెప్పుతుంటే మొగిలి ఎన్నడో ఆ ఊళ్లె నుంచి వెళ్లి వచ్చినంత ఉత్సాహంగా దిగులుగా మోకాళ్ల మీద కూర్చుండి వింటున్నాడు.

                మొగిలి ద్యాసల్లా ఆ ముచ్చెట్లల్లో ఎక్కడన్నా రాయేశ్వరి గురించి చెప్పగలడేమోనని - అడగుతే వదిన నవ్వగలదేమొనని.. లింగయ్య రాజేశ్వరి సంగతి ఎత్తనేలేదు...

 

                                                           16

 

                శంకరయ్య  సైకిలు మీద మొగిలిని తీసుకపోయి  మసుకు మసుకుండంగనే సి.యస్‍.పి. దగ్గర దించిండు. ఆడ  చాలా  లారీలాగున్నయి ఒకటెనుక ఒకటి.  మొగిలి అన్నిలారీలు ఒక్క దగ్గరచూసెరుగడు...

                ‘‘ఇగ్గో గ లారీల నేం జూత్తన్నవ్‍...?’’ శంకరయ్య.

                లారీలు తప్పించుకుంటూ బొగ్గు కుప్పల దగరికి నడిచారు. అప్పటికే అక్కడ రెండు వందల మంది దాకా జమై                     ఉన్నారు...పది పన్నెండు మంది గుంపు గుంపులుగా కూర్చుండోనిలబడో బీడీలు తాక్కుంటూ ముచ్చెట్లు బెట్టుకుంటున్నారు...

                ఆ మందిలో మొఖద్దమ్‍ నరేందర్‍ కోసం వెతికిండ్లు...

                ‘‘ఏవూరు తమ్మి కొత్తగచ్చినవా? బర్లగాసినవంటే మొగతనముండది’’ అన్నాడో తొర్రోడు.

                ‘‘పెండ్లయ్యిందా తమ్మి’’ అన్నాడింకొకడు...

                ‘‘మొఖద్దమ్‍ నరేందరింకారాలేదా? ’’ శంకరయ్య...

                ‘‘అయినా? ఆయినెకేంది మారాజు - లేవాలె - నాష్టజెయ్యాలె పవ్వ గొట్టాలె గప్పుడిటత్తడు...’’ అన్నాడు తొర్రోడు...

                ‘‘ఇగో ఈడుండు ఈల్లతోనేపని జేసుడు - నాకు డ్యూటికి యేల్లయితంది’’ అని సైకిలెక్కిండు శంకరయ్య.

                తెల్లవారింది. పొద్దు పొడిసి బారెడెక్కింది - ఎండపొడ బొగ్గుపొగలో చిక్కుబడిపోతంది...మొగిలికి తెలిసిన వాళ్లెరులేరు... చేతులు కట్టుకొని వనమిడిసినకోతిలాగా, తప్పిపోయిన పక్షిలాగా అందరిముఖాలల్లోకి చూశాడు...అందరి ముఖాలల్లో అలసత్వం పేరుక పోయున్నది. పెరిగిన గడ్డాలు - కండ్ల బూసులన్న సరిగా కడగని ముఖాలు, మసి బట్టలు - పెదువులు తెరుచుకొంటూ మూసుకుంటూ ఎవడో అకారణంగానే ఎన్నో సంత్సరాలనుంచినవ్వు మొఖం ఎరగని వానిలాగా నవ్వుతాడు.... ఎవడో తనచిన్నతనం పదహారేండ్ల పడుచుపిల్ల గురించి వర్ణించి చెప్పుతున్నాడు..మిగతా వాళ్లు లొట్టలు వేస్తూ వింటున్నారు...

                అంతలోకే ఖనేల్లు ఖనేల్లుమని దగ్గుతూ ఒక ముసలి వాడొచ్చాడు...ముఖమంతా జేవురించింది - వాని చేతిలో గిలేటు టిఫినున్నది. అందులో నుండి పప్పుకారిన చారికలున్నాయి.. వాడొచ్చి టిఫిన్‍ కిందబెట్టి బొగ్గుకుప్పమీద కంకెడు ఖల్లు ఊంచిండు.

                ‘‘దగ్గులోడా గటేటన్న ఊంచరాదుర’’  - అన్నాడెవాడో... ఆ మాట పట్టించుకోనేలేదు..

                ‘‘దీపాంతెల సమురైపోతంది...’’ అన్నాడు  దగ్గులోడు...

                మొగిలి దగ్గులవాని మొఖంలోకి చూశాడు - కండ్లు మండే నిప్పుల్లాగా...నిజానికి ముసులోడు కానే కాదనిపించింది. ఈ మనిషిని ఎక్కన్నో చూసినాననుకున్నాడు. ఎక్కడో గుర్తుకు రాలేదు...

                ఇంతలోకే ముచ్చెట్లాగి పోయినయ్‍...సైకిలుగంటలు వినిపించినయ్‍..అందరి కన్నా ఆఖరుగావచ్చాడు నరేందర్‍...

                మొఖద్దమ్‍ల చుట్టు లారీల వాళ్లు మూగిండ్లు...ఎవడో లెక్కేసి నూటా నాలుగు లారీలున్నయన్నాడు...

                కర్రెగా సుండకుసుండున్నోడు... మొదటి రెండు లారీలు తనయనిచెప్పి ‘‘పూసల మల్లిగాడేడి?’’ అన్నాడు - ఆకంఠంలో కరుకుదనం...

                ‘‘ఇగో ఈన్నె ఉన్న...ఇగో ముందుటి ఎనిమిది లారీలు మనయి - నింపుండ్లి..నేనుమల్లత్త’’ అన్నాడు

                ‘‘సరే యాకోబన్నా’’ అన్నాడు మల్లయ్య...

                ‘‘చంద్రమొగిలి గాడేడి?’’ అన్నాడు నరేందర్‍...చంద్రమొగిలి ముందుకు వచ్చిండు - అప్పటి దాకా ఎట్లా కలువాలా అని ఎనకా ముందు చేస్తున్న మొగిలి నరేందర్‍ ముంగటచ్చి నిలుసున్నాడు...

                ‘‘గీడెవ్వడో కొత్తోడున్నట్టున్నది’’ నరేందర్‍...

                ‘‘పనిగావాలె..’’ మొగిలి

                ‘‘గీడ పనిలేదు గినిలేదుపో - ఏ ్య ంగుల తక్కువలేరు... గీడగాదు - దారి దప్పచ్చినట్టున్నది పో పో’’ అన్నాడు యాకోబు...

                ‘‘నిన్న దొర మీకు చెప్పలేదా? ’’ అన్నాడు మొగిలి నరేందర్‍నుద్దేశించి.

                ‘‘ఓ నువ్వా డోకిలిగాని లెక్క నిలబడ్డవు పనిజేయచ్చినవా? సూసిపోనచ్చినవా? దండంబెట్టుడేలేదు - గిప్పుడేగంత పొగరు మీదున్నవేంరో?’’ అన్నాడు నరేందర్‍ -

                ‘‘మన గాంగుల మనుషులు బరుపూరనే ఉన్నరు కాదుండ్లి’’ చెంద్ర మొగిలి.

                ‘‘ఉంటేంది మీద మిండడు దోలిచ్చిండు...ఎరికయ్యిందా?’’ నరేందర్‍..

                ‘‘నిజమే కానుండ్లి ఉంటె ఇద్దరుండాలె గీడు ఎక్కువేగదా?’’

                ‘‘ఏడి? దగ్గులోడేడబోయిండు.. ఆడు దగ్గుడుకే గంట గావాలె - ఆడు పుసుక్కున సత్తె పీకులాట ఆన్నాగుమను’’ అన్నాడు నరేందర్‍...

                బొగ్గుకుప్పమీద ఇంకా దగ్గుతున్న దగ్గుల వాడికి ఎవరో ‘‘ఒరే కాసింగా, నిన్ను పనిల నుంచి తీసేసిండ్లు...’’ అన్నారు...

                అప్పుడు లేచిండు దగ్గులవాడు... ఈడిగీలబడి నరేందర్‍ ముంగటి కొచ్చిండు. ఒకే ఒక్క నిముషం నిశబ్దంగా నరేందర్‍ ముఖంలోకి చూసిండు - ఆ పక్కనే నిలుసున్న మొగిలి దిక్కు చూసి కాండ్రకిచ్చి ఊంచి...

                ‘‘నీ అవ్వ మిండడు సంపాయించిండా బాడ్‍కావ్‍ - నడువ్‍’’ అని మొగిలి దిక్కు పీలచేయెత్తి చూయించి నరేందర్‍ దిక్కుతిరిగి....

                ‘‘మొఖద్దమ్‍... నా బొచ్చె సీరి సూడు - నా కడుపు చింపి సూడు - ఆడ బొగ్గు, బూడిది పేరుకపోయినయి. నా నెత్తురు బూడిదై పోయింది. నా మాంసం బొగ్గయిపోయింది - నా బతుకు మసై పోయింది. ఒరే లంజ్జకొడుకుల్లారా నేను గీడికి ఇరువై యేండ్లకిందచ్చిన - ఓ మొఖద్దమ్‍ నువ్వు గుద్దకడుగక ముందు నీ నీడ బొగ్గుతట్ట మోసిన - నువ్వు నిన్న మొన్నచ్చినవ్‍.. ఆని కాళ్లీని కాళ్లుమొక్కి’’

                ‘‘అరె దగ్గులోడా నడువ్‍ ఈడినుంచి నడువ్‍’’ నరేందర్‍ మెడల మీద చెయ్యేసి దొబ్బిండు.

                దగ్గులవాడు కింద దుమ్ములోపడ్డాడు. వాని టిఫిన్‍ ఊడిపోయి మక్కజొన్న గడుగ పప్పు ఎర్రగా కింద బడ్డది. లారీలోల్లు చుట్టూ మూగిండ్లు...

                ‘‘నీయవ్వల కుక్కల్‍ దెం...తయి - ఒరే బద్మాషి లంజకొడకుల్లాలా - నా తనువుల నెత్తురు పీల్సేసిండ్రు. నేను మిమ్ముల గావుబడ్త’’ లేచి పిడికిల్ల నిండా బొగ్గుతీసి విసిరికొట్టాడు...

                ‘‘కయికురే కాసిం - జావ్‍ - గుండగాళ్లతో నేంది? - ఎందరు బోంగ చూల్లేదు’’ ఇంకో తురకవాడు టిఫిన్‍ మడిచిచేతికిస్తూ.

                ‘‘ఒరే లంజకొడుకుల్లాలా మీరు మనుషులుకాదు కుక్కలు -ఇరువై ఏండ్లు కలిసి పని సేస్తిమే - ఒక్కడు ఒక్కడన్న నా ఎనుక నిలబడరా?... దెబ్బల్ల, కట్టంల కలిసున్నగురుత్తంలేదు.. తుమ్‍సైతాన్‍లోగు బంచత్‍... సైతాన్‍కే బచ్చే నాతీర్గ మీరు గిట్లనే పోతరు బిడ్డా! యాద్‍రక్‍నా..’’ దగ్గులవాడు ఇంకా వదిరేవాడే కాని వానికి దగ్గుతెరొచ్చిది...

                ఎవరో ఇద్దరు దూరంగా తీసుకపోయార...

                మొగిలి నాభిలో అతకంతకు దూరమయ్యే కాసిం దగ్గు గడ్డపారేసి పెకలిస్తోంది... ఆ కండ్లు, ఆసెత్తఆమాటలు.

                ‘‘బతుకవ్వను గాడ్దులుదెం...’’ అన్నాడేవడో మందిలనుంచి..

                ‘‘ఎవడుబే - పుర్రెలగిన పురుగు మెసులుతాందిబే...మాకె...దవడ పండ్లూడాలె...’’అన్నాడు పొట్టిగా గుండ్రంగా ఉన్న మొఖద్దమ్‍...

                ‘‘మిమ్ముల గాదుండ్లి - బతుకునంటన్న...’’ అన్నాడెవడో.

                ‘‘అబ్బోబాంచెన్‍ ఈ ఇలాకాల తమరిని మాటని బతికేటోడున్నారు బాంచెన్‍..’’

                ‘‘అదిరా...హన్‍మాన్‍ బస్తీమే మేరా నామ్‍ లియేతో బచ్చీరోనా బందుకర్‍నా సమ్‍ఝే’’ అన్నాడు పొట్టివాడు....

                మొఖద్దమ్‍లు లారీడ్రైవర్లతోని మాట్లాడుతుండగానే ఎటుగ్యాంగటు పనిమీదికి పోయింది...

                చెంద్రమొగిలి గ్యాంగు మూడో బొగ్గుకుప్ప దగ్గర చేరింది..ధోవతుల వాళ్లు కాసెలు చెక్కిండ్లు - తువ్వాలున్నవాళ్లు, తుండుగుడ్డలు న్నవాళ్లు నెత్తులకు చుట్టుకున్నారు...

                ‘‘మోత్తవా? ఎత్తుతవా?’’ అన్నాడు చంద్రమొగిలి...

                ‘‘మోత్త’’నన్నాడు మొగిలి...

                ‘‘మరి సుట్టబట్ట తెచ్చుకోలే...ఆతువ్వాల పేగు సుట్టబట్ట చేసుకో - బొగ్గుకుప్పల వైర్లుంటయి ఏరుక తెచ్చుకొని కట్టుకో’’ అన్నాడు...

                ‘‘పోశవ్వతల్లి మైసవ్వతల్లి!’’ అనుకుంట బొగ్గు కుప్పను తాకి భుజానికి చేయి తాకిచ్చుకున్నారు...

                ‘‘పటుండ్లి...జెరంత కాలాడియ్యిండ్లి’’ చంద్రమొగిలి

                మొదటిలారచ్చి గద్దెదగ్గెర ఆగింది...

                సెమ్మాసులతోని తట్టలునింపిండ్లు - మొగిలి నెత్తి మీదికి తట్టెత్తిండ్లు - తట్ట బరువుకు మెడ జువజువలాడింది - కాళ్లు వనికినయ్‍...బొగ్గు పొడినెత్తి మీదినుంచి సన్నగా రాలుతోంది. లారీదగ్గర దాకా నడిచి గద్దెమెట్లు ఎక్కంగ పిక్కెలెక్కచ్చినయ్‍ - మొదటి తట్ట లారీలో పోసిండు... నిలబడ్డడు - ఇంకో తట్ట తెచ్చిన వాడు గద్దె దగ్గెర నిలుసుండి ‘‘ఏం జూత్తన్నవ్‍ - అయినట్టే నడువ్‍’’ తొందరజేసిండు -

                దబడదిబడ లారీలల్లో బొగ్గుపెళ్లలు బడుతున్నాయి. చెమ్మాసులు కసుకు కిసుకు మంటున్నాయి -పక్క గ్యాంగులో ఎవడో మూలుగుతుండు - లారీలో నుంచి రేడియోలో ఏదో తురకంపాట. అక్కడెక్కన్నో సిక్కుల డ్రైవర్‍ కొసమొదలులేని పాటెత్తుకున్నాడు.

                ఫిబ్రవరి నెలలోనేఎండెక్కుతోంది - ఆ ఏరియా అంత భగభగ మండుతోంది - బొగ్గు నెరుసులు, దుమ్ము ఒకల మొకం ఒకలకు కనిపించకుండా...మొగిలి  తలనుంచి కాళ్లదాకా చెమటలు కారి బొగ్గుపొడంటుకొని కారం రాసినట్టుగా మండుతోంది.. దు:ఖమొచ్చింది. అక్కడెక్కడనో తన తండ్రి సాంబయ్య దున్నుతున్నట్టుగా మనుషులంతా మసక మసకగా - తిన్నదరిగి పోయింది. మూడు లారీలు లోడు చేసే సరికి ప్దొంగి పోయింది.

                గ్యాంగోళ్లు లారీల నీడలకు చేరిపోయి తెచ్చుకున్న క్యారియర్లిప్పుకున్నారు - దగ్గర్లో ఒక్కనల్లా నన్నాలేదు.  ఒక్కడు మాట్లాడలేదు. నాలికెండిపోతంది - తిరిగి తిరిగి సి.యస్‍.పి లోపలికి బొయ్యి కడుపునిండా నీల్లు తాగిండు...మిషన్ల మోతకు చెవిగూబలు బద్దలౌతున్నాయి.

                మళ్లీ లారీ కాడికొచ్చాడు...

                లారీ వెళ్లి పోయింది. అన్నాలుదినే వాళ్లు ఎర్రటెండలో మిగిలిపోయారు.

                ‘‘నీతల్లి అన్నాలు దినేటందుకు ఒక్కరేకుల షెడ్డన్నాకట్టియ్యరు’’ అన్నాడెవడో.

                బుక్కనిండా అన్నం కుక్కుకున్నవాడు గుడ్లుతేలేసి టిఫిన్‍ బట్టుకొని సి.యస్‍.పి లోపలి కురికిండు.

                ‘‘షెడ్డుకచ్చిందా నీళ్ల నల్లాకు దిక్కులేదు...’’

                ‘‘వానావ్వల కుక్కల్‍దెం...- లారికి నూరు దెం....పోబట్టిరిగని - మరి నల్లేపియ్యండ్లని అడిగిండ్లా?’’ ఓ బక్క వాడు...

                ‘‘అగో! రాయలింగడు ఇటేసూత్తండు -కడుపుబ్బుతది- పవ్వకాశపడి మొఖద్దమ్‍ల సెవులేత్తడు - ఆడి నుంచి దొరదాక పోతది... దగ్గులోడు’’ గుసగుసగా పక్కవాడు..

                ‘‘లొట్టపీసు. తియ్యితియ్యవోయి - మాంటె పీకి పారేత్తరు గదా! ఈ పాటి దెబ్బలు ఎవడైనా కొడుతడు... కని మతికుంచుకో... బొండిగ పిసుకంది విడిచి పెడ్తనా?’’ ఇందాకటతను...

                రాయలింగు అనేవాడు గుడ్లు మిటకరిచ్చిండు.

                తనకు టిపిన్‍ లేక ఆ అన్నం వాసన, కూర వాసన భరించలేక లోడు కోసమొచ్చిన లారీ నీడకు బోయి కూర్చున్నాడు మొగిలి - లారీవెనుక డ్రైవర్లు పత్తాలాడుకుంటండ్లు - కాంటా క్లర్కు ఎండలో ఆడికీడికి తిరుగుతండు. ఎండలో అన్నాలు దినే వాళ్ల దగ్గర కుక్కలు కాళ్ల మీద కూర్చుండి నోర్లకేసి చేతుల కేసి చెవులు రిక్కించి చూస్తున్నాయి.

                లారీ నీడ కొరిగిండు మొగిలి...కండ్లు మూతలు పడ్డాయి...మీయవ్వల కుక్కల్‍దెం...’’ దగ్గులోడు తిడుతున్నాడు...ఎవరో పిలుస్తున్నారు - మొగిలి లేచికూర్చున్నాడు - ఎండతగ్గింది...

                ‘‘నీపేరేంది?...లేలే...పని షురువయ్యింది..రేపటి నుంచి టిఫిన్‍ దెచ్చుకో...ఇంటన్నవా?’’ చెంద్రమొగిలి.  మొగిలి లేవబోయాడు...ఒళ్లంతా నలుగురు తన్ని ముగ్గురీడ్సినట్టుగా....

                మళ్లీ పని మొదలయ్యింది - ఒక లారీ నింపేసరికి చీకటైపోయింది. కరంటు బుగ్గ లెలిగినయ్‍..

                నరేందర్‍ ముడితె మూసిపోయేతెల్లబట్ట లేసుకొని వచ్చిండు...వాసన నూనె బెట్టుకున్నడు..కండ్లు ఎర్రగా మండుతున్నాయి  - బుక్కనిండా ఎర్రగా అప్పుడే కోసిన గొర్రెను పీక్కతిన్నట్టు పాన్‍..

                ‘‘చెంద్రమొగిలి...ఇగరా’’ అని పిలిచిండు..చెంద్రమొగిలి అతనిచుట్టూ మిగతా ఏడుగురు నిలుచున్నారు. కొందరు బట్టలు జాడిచ్చుకుంటున్నారు...

                ‘‘ఇగో మొండోనికి మొన్న దెబ్బ తాకిందంటే ఇచ్చిన అయిదు రూపాలు బట్టుకొనిడెబ్బైయైదు ఇత్తన్న...’’ అని రూపాలు యిచ్చిండు...

                ‘‘జెర కట్టంలున్న సార్‍ వారం దినాలకు దీసుకోండ్లి’’ మొండయ్య.

                ‘‘నీ అయిదు రూపాలకు వారం రోజులా! జాన్తనయి...’’ సైకిలెక్కి వెళ్లిపోయిండు...

                డెబ్బై అయిదు ఎనిమిదిగురి మీద పంచిండ్లు - కాసేపు పిటపిట లెక్కలు - మనిషికి తొమ్మిది రూపాయలు రాగ మూడు రూపాయలు మిగిలినయి. మొండికి మూడు రూపాయలు ఇచ్చిండ్లు.

                తొమ్మిది రూపాయలు పట్టుకొని మొగిలికి సంతోషమో మరేమి కలిగిందో చెప్పలేం... ఈడ్సుకుంట బొగ్గు కుప్పలు దాటి రోడ్డు మీది కొచ్చిండు...

                మొగిలి కాలరీ బతుకు అట్లా మొదలయ్యింది... మొగిలి చెట్ల నీడల కింది నుండి - కరంటు బుగ్గల వెలుగుల తొక్కుకుంటూ..చీదర చీదరగా అలిసిపోయి నడుస్తున్నాడు.. ఆకాశంలో అప్పటికే చుక్కలు రగరగ లాడుతున్నాయి...

                ఆ నల్లని రోడ్ల మీద పాములా మెలికలు తిరిగిన రోడ్ల మీద నెత్తురు తాగేయ బడ్డవాళ్లు చాలా మంది అచ్చంగా మొగిలిలాగే నడుస్తున్నారు... కాకపోతే మొగిలికిది కొత్త - వాళ్లకదిపాత...

 

                                                             17

 

                తూరుపురేకలు బారుతున్నాయి. మొగిలి ఇంకా లేవనే లేదు.. నిన్నటి అలవాటు లేని పనికి ఒళ్లంతా బరువుగా నొప్పిగా ఉన్నదేమొ ఆదమరిచి నిదురబోతండు

                ‘‘ఓ మరిదీ లేలే యాల్లయితంది - పనికి బోవా?’’ లక్ష్మి లేపింది...

                మొగిలి దిగ్గున లేచి కూర్చున్నాడు...ఇంతలోనే ‘‘ఇగో పిల్లా’’అంటూ కొంపలంటుకపోయినట్టు గడ కర్రలాగా ఎత్తుగున్న పక్కింటామె వచ్చింది..

                ‘‘కాసిం ఉరిబెట్టు కున్నడట! సూద్దాంరా! అందరు బోతండ్లు’’ అన్నది ఆదర బాదరగా

                ‘‘అయ్యో! వాడకట్టు కంత పెద్దదిక్కు ఎట్లయ్యింది?’’ అన్నది లక్ష్మి ఖాళీ నీల్లకడవ అక్కడ పడేసి తను, వచ్చినామె వెంట నడిచింది...

                మొగిలికి నిద్ర వదిలిపోయింది.  తను లేచి ఆదర బాదరగా బయట కొచ్చిండు. అప్పటికే ఆ గుడిసెల సందుల నుంచీ మనుషులు ఆదర బాదరగా రోడ్డు కేసి నడుస్తున్నారు. మనుషులంతా పోయే దిక్కు  బడి మొగిలి నడిచిండు -  వాడ చివరన గుడిసె - గుండిసె ముందు జనం మూగిండ్లు - గుడిసెకు  గోడల వంతుకు పాత తట్టలు, సంచి బొంతలు కట్టున్నాయి - గుడిసె కప్పు చిరిగిపోయున్నది. కప్పుకు అట్టముక్కలున్నాయి. అట్టలు లేని దగ్గర కంకబొంగులు తేలున్నాయి. ఆ వాడకు అది ఆఖరి గుడిసె - ఆ గుడిసె దాటితే పట్నం తుమ్మచెట్లు. గుడిసె పక్క నుంచి బొలబొల మురికి నీల్ల కాలువ.. కాలువలో పందులు..

                ఎవరో పచ్చచీర ముక్కు పోగామె చేతులు తిప్పితూ - ‘‘ముంత బట్టుక పోదామని బయలెల్లిన - తెల్లారె సుక్క పొడవక ముందే లేసి దగ్గుకుంట గుడిసె ముంగట కూకుండే టోడు లేడేందనుకున్న - మల్లరాంగ ముసలోని కేమయ్యిందని గుడిసెలకు తొంగి సూసిన. ఇగ నాకు దప్పులు గొట్టినయ్‍’’

                ‘‘నిన్న పది గంటలకే గుడిసెకచ్చిండు -‘‘ఏందే కాసీమన్న ఒంట్లె బాగలేద! పనికి బోలేద!’’ అనిఅడిగిన. ఎన్నడైనా కడుపునిండ మాట్లాడెటోడు. ఆగకుంటనే బోయిండు.

                మొగిలి మందిల నుంచి గలుమ దగ్గరికి నడిచి గుడిసెలకు తొంగి చూసిండు - గుడిసెలో దరిద్రం తాండవిస్తోంది.  గుడిసె మధ్యలో కాసిం తాడుకు వేల్లాడుతండు...కనిగుడ్లు అసహ్యంగా పొడుచుకొచ్చినయ్‍ - నాలిక బయటికెల్లింది - పెదవులు నల్లబడ్డాయి - సిరిగినగుడ్డలు ...ముడ్డిబట్ట ఊసిపోయింది - గప్పున వాసన గొట్టింది - చతికిన పిర్రల మధ్య మలం...

                మొగిలి అంతకు ముందెన్నడు ఉరి బెట్టుకొని సచ్చినోల్లను చూల్లేదు - ఆ ఆకారం చూసి భయమయ్యింది -

                ‘‘అరె దించుండ్లిర్రా! దించుండ్లి’’ అన్నాడో కార్మికుడు.

                ‘‘మనం దించుతెట్ల? - పోలీసోల్లు రావద్దా?’’

                ‘‘ఎవడన్నా! పోలీసు టేషన్‍కురికిండ్లిరారో...ఉరుకుండ్లి’’ అన్నాడో ముసలివాడు -

                మొగిలి పోతాన్నాడు. ‘‘నీకేమెరిక’’ అన్నాడెవడో...

                ‘‘బవు కట్టపు పుటుకు - మనిషి జల్మమే గంత - నా ఎరికల నేను గీడికచ్చినపుడు గీడ గీ గుడిసొక్కటే ఉండే - నన్ను తీసుకచ్చి ఏంగాదని ఈడ గుడిసేపిచ్చిండు... ఏమయ్యిందో? ఏమో? ఈని పెండ్లాం మూడేండ్ల కొడుకును విడిచిపెట్టి ఎవనితోనో లేసి పోయింది... అప్పటినుంచి సూత్తన్నా గదే బతుకు ’’ ముసలోడు...

                ‘‘ఒక్క కొడుకు వలీగాడు అట్లతేలే...జేబులు కత్తిరిచ్చి బతుక వట్టె - ఈడు ఉపాస ముప్పుడుంటె ఆడు తొంగన్న సూడడు...’’

                ‘‘నిన్న ఈన్ని పనిల నుంచి తీసేసిండ్లట?’’ అన్నారెవరో.

                ‘‘అదెనో? గంతే బంచత్‍ నియ్యతి లేదు - అవసరమున్నంత సేపు నెత్తురు పీల్సుకుంటరు. బొక్కయి పోయినంక తన్ని తగిలేత్తరు...’’

                ‘‘ఈని జాగల ఇంకెవడో కొత్త పోరడచ్చిండట’’

                మొగిలికి నిన్నటి ఉదయం కాసిం మాట్లాడిన మాటలు యాదికొచ్చినయి. ఎవడన్నా గినే అందుకు కారకుడని చూపెడుతరేమొనని భయపడ్డడు.

                ‘‘కొత్త నెత్తురు గావాలెగదా?’’

                లక్ష్మి! కళ్లల్లో నీళ్లూరినయ్‍ - కొంగుతో కళ్లొత్తుకున్నది ముక్కుచీదింది...

                ఇంతలోకి పోలీసులొచ్చిండ్లు - అమీన్‍ గుడిసెలోకి తొంగి చూసి ‘‘లమ్డికొడుకు ఖరాబు చేసిండు’’ అన్నాడు ముక్కు మూసుకుంటూ .

                పోలీసులను దించుమన్నాడు. పోలీసులు లోపలికి పోనే లేదు... ఆఖరుకు మొగిలి మరిద్దరు కార్మికులు దించి కింద పండబెట్టిండ్లు - కట్టెలాగా బిగుసుక పోయున్నాడు.

                ఎక్కడిదో కుర్చీ తెప్పిచ్చుకొని ముండ్ల మీద కూర్చున్నట్టు కూర్చుండి పంచనామా రాసిండు-ఎవేవో అడిగిండు...

                ‘‘వీనిపేరు?’’

                ‘‘కాసిం’’

                ‘‘తండ్రిపేరు?’’

                ‘‘ఏ తల్లి గన్నదో, ఏ తండ్రి గన్నడో ఎవలకెరుక?’’

                ‘‘ఎవలన్న ఉన్నరా?’’

                ‘‘వలీ అని ఓ కొడుకున్నడు - జేబులు కత్తిరిత్తడు’’

                ‘‘ఓ! అసీ - వాడిప్పుడు సబ్‍జేల్లున్నడు’’

                ‘‘వీని కేమన్న రోగమున్నదా?’’

                ‘‘కడుపున్నది - ఆకలి రోగమే అన్నిటికన్నా పెద్దది’’

                ‘‘ఎక్కడ పన్జేస్తడు?’’

                ‘‘క్రిష్ణారావు దొర కింద లోడింగ్‍ పని జేసెటోడు - నిన్న పీకేసిండ్లట -’’

                ‘‘ఎన్నేండ్లబట్టి? ’’

                ‘‘ఎవలకెరుక...?’’

                ఇట్లాంటివే ఎన్నోఅడిగి రాసుకున్నాడు - అక్కడున్న నలుగురి సంతకాలు దీసుకున్నాడు...పోలీసులు వెళ్లిపోయిండ్లు ...

                ‘‘వాడకట్టుకు శపమున్నది - దానం జెయ్యాలె - గుడిసెల ఏన్నన్న ఏమన్న ఉన్నయో లేవో సూడుండ్రి’’ అన్నారు.  గుడిసెలో చూసిండ్లు - ఓ మూల రేకుడబ్బాల సోడన్ని మక్కలున్నాయి. - మరికొన్ని నూకలింకో డబ్బాలో - గిలేటు టిపిన్‍... మూడు రూపాల చిల్లర - సుట్ట ముక్కలు - చిరిగిన పాత గుడ్డలు - ఎప్పటిదో కొడుకు, భార్య, తను కలిసి దిగిన ఫోటో...

                ‘‘ఎట్లా...?’’ అన్నారు కొందరు.

                ‘‘చందాలు అసూలు సేద్దాం’’ అన్నారు...

                అప్పటికప్పుడు ఎవలకు దోసినంత ఆళ్లిచ్చిండ్లు.  ఇంతలోనే నూరుమంది దాకా లోడింగోలొచ్చిండ్లు... .వాళ్లో కొంత యిచ్చిండ్లు...

                పదిగంటల ప్రాంతంలో లారీల లాగిపోయినయని పదిమంది తప్ప గ్యాంగు కొకడుండి మిగతా వాళ్లు లోడింగ్‍ కాడికి పోయిండ్లు. వాళ్లతోపాటు మొగిలి నడిచిండు -

                మొగిలి మనుసు కోళ్లు తవ్విన పెంటయిపోయింది...

                శవంకండ్లు - ఖనెల్లు ఖనెల్లు దగ్గులు - ఉమ్మిన ఖల్లు - నాలికెవెల్ల బెట్టి - పిర్రల్ల మధ్య మలం..గబ్బువాసన బతుకుంతా వాసనే.... తట్ట మోస్తున్నాడు... చిత్రంగా అందరి ముఖలల్లోకి చూసిండు - ఆ చితికిన చెంపల్లో - బొగ్గు పొడి అంటుక పోయిన దవడలు - ఎర్రగా మండే ఆ కండ్లు - కాసిం కండ్లలాగే అచ్ఛంగా ...వీళ్లంతా గట్లనే ఉరి బెట్టుక సత్తరేమొ?

                రెండువేలనర లంచం బెట్టి కొలువు దొరుకుతదని - కొలువు బాయిల దొరుకుద్దని - రాత్రి పగలు మన్నుబుక్కి మన్నేర్గే బదులు ఏదో ఆడత పాడత సేత్త ననుకుంటే - గీడి కచ్చింది పనివరుస..తను రావడం. ఒకడు ఉరి బెట్టుకున్నడు. ఈడ పని చేసే వాళ్లంతా వచ్చినప్పుడు గట్లెనే ఎవడో ఒకడు ఉరి బెట్టుకున్నాడా? పెండ్లా మెందుకు లేసి పోయింది? కొడుకు దొంగెందుకయ్యిండు? ఇట్లాగా విచారాలు సాగినయ్‍... ఈ విచారాలు మిగతా వాళ్లకున్నయోమొనని పరిశీలనగా చూసిండు - ఆ సంగతే మరిచి పోయినట్టు అంతా అతి మామూలుగానే పని చేస్తున్నారు. - ఎత్తేవాళ్లు తిడుతూనే ఉన్నారు..మోసేవాళ్లు ఈడిగీల బడి మోస్తునే ఉన్నారు - లారీడ్రెవర్లు పత్తాలాడుకుంటనే ఉన్నారు....

                పొద్దునెత్తి మీది కొచ్చింది - పనాపిండ్లు - గిలేటు టిపిన్లు విప్పుకున్నారు... మల్ల మాటలు...

                నీళ్లకోసం సి.యస్‍.పిలోనికి నడిచాడు.. సి.యస్‍.పి - ఆగున్నది... లొల్లిలేదు... లోపల బెల్టుదగ్గర నలుగురు కూకుండి ముచ్చెట్లు బెట్టుకుంటున్నారు.. పేడిమూతోడొకడు  ఊరిచ్చి ఊరిచ్చి ఏదో చెప్పుతండు... మిగతా వాళ్లు ఆసక్తిగా వింటున్నారు. పేడిమూతి వాడు కీచుగొంతుకతో ‘‘నిన్న ఓ ఫవ్వగొట్టిన.. సీకటియ్యింది... రోడ్డు దిగిన... చెట్లల్ల పందులు గురుమంటన్నయి.... సడీ సప్పుడేంలేదు. సైకిలు పోతంది... నేనేమో రాందిపోంది పద మెత్తుకున్న... సైకిలు ఎత్తుగడ్డ తాకినట్టు టక్కునాగిపోయింది...’’ పేడిమూతివాడు టక్కున ఆపేసిండు...

                ‘‘ఏమయ్యింది సెప్పురాదుర?’’ అన్నాడు సస్పెన్సు భరించలేక వింటున్నోడు...

                ‘‘టక్కున సైకిలు దిగిన గీడెత్తుగడ్డలేడియని - అటొకలు ఇటొకలు ఉరుకుతండ్లు’’

                ‘‘ఓర్నితల్లి! పట్టుకోకపోయినావు?’’

                ‘‘నీకు ఓ సాన్సు’’

                ‘‘మారే గీడేం జేసుకుంటడు...?’’

                మొగిలికి రోతగా తోచింది... నీల్లుదాగిండు - లారీల దగ్గరికి పోయిన ఇలాంటివెవో ముచ్చెట్లుంటయి - కాసేపు ఏడనన్న ఒంటిగ కూకోవాలనుకున్నాడు...సి.యస్‍.పిలో కొద్దిగా లోపల చిన్నగది లాంటి దున్నది...దాని పక్క కూర్చున్నాడు...ఏదో పరపర సప్పుడత్తె తిరిగి చూసిండు - గదిలాంటి దానిలో సిమెంటు గోడకు గడ్డంపెరిగిన వాడొకడు పండ్లు గిలకరిచి బొగ్గుతో ఏదో గీస్తున్నాడు... బొమ్మయి పోయింది... ఒక మనిషి బోర్ల బొక్కలో, ఇంకొక మనిషి వానిమీద - ఛీఛీ అనుకున్నాడు మొగిలి...

                వాడు బొమ్మదించి - ‘‘వీడు కంపినోడు’’, ‘‘వీడు యూనియనోడు’’ అనిరాసి చేతులు దులుపు కొని సీరియస్‍గా వెళ్లి పోయిండు...

                మొగిలికి అక్కడ ఉండబుద్ది కాలేదు... మొగిలి ఆ మనిషి వెళ్లిన దిక్కు చూసిండు - ఆ మనిషి వెనుదిరిగి ‘‘వానవ్వల..వోర్‍ మెన్‍గాన్ని తిట్టిన్నని - నెలరోజులు సస్పెండు చేసిండ్లు - యూనియనోని సుట్టు తిరిగితే లీడరోడు గది నీతప్పే అన్నడు... అనడుమరి- కంపినోని దగ్గర అంగుమంటె అంగటోడాయె - ఆఖరుకు గీడ సి.యస్‍. పి. లేసిండ్లు. వానవ్వల కచ్చ...కచ్చ ఇంకా దెం...త. ఏమనుకున్నరో’’ అని పిడికిలి బిగించి అరచేతిలో రెండు సార్లు గట్టిగా గుద్దుకొని సి.యస్‍.పి బంకరు మీదికి నడిచిండు...

 

                ‘‘ఈడ ఎవడేం సక్కగలేడు’’ అనుకుంట బయటికి ఎండలోకి నడిచిండు..మొగిలి...

 

                                                             18

 

                వారం రోజులు గడిచిపోయినయ్‍ - ఐదు రూపాయలతో గిలేటు టిపిన్‍ కొన్నాడు - ఇంకో అయిదారు రూపాయిలు ఖర్చయిపోయినయి అన్నిపోను నలుబై  రూపాయలు మిగిలినయ్‍ ఎప్పటిలాగే ఆ దినము పనిమీదికి పోయాడు...

                కాని ఆ రోజు ఒక్కలారన్నా లేదు -ఎప్పుడు ఇంజన్‍ రొదతో డ్రైవర్ల కేకలతో అయిల్‍ మరకల క్లీనర్ల అరుపులతో సందడిగా ఉండే లారీ స్టాండు బోసిగా ఉన్నది - ఇదివరకు లారీలు నిలబడే స్థలంలో రెండు గాడిదలు నిలబడి ఒకటి నొకటి నాక్కుంటున్నాయి...

                లోడర్లంతా గుంపులు గుంపులుగా కూర్చుండి మాట్లాడుకుంటున్నారు - మొగిలి చెంద్రమొగిలి గ్యాంగు కూర్చున్న దగ్గరికి నడిచిండు...

                ‘‘శీనివాస్‍ టాకీస్‍ల ఏ మాట ఆడుతందోయి పిలడా?’’ అన్నాడొకడు.  మొగిలి తికమక పడ్డాడు...

                ‘‘మారే ఇంక గంత దాక రాలే -’’ అన్నాడు ఒకడు...

                టిపిన్‍ కింద బెట్టుకొని మొగిలి తనూ కూలబడ్డాడు..

                ‘‘ఇయ్యల్ల కూలి మునిగినట్టే లెక్క - లారీల కేం బుట్టిందో?’’ అన్నాడొకడు...

                కోటేసు సైకిలి మీద రివ్వున వచ్చిండు. కోటేశు టిప్‍టాఫ్‍ బట్టలేసుకున్నాడు.. వచ్చీరావడంతోటే ‘‘ఇయ్యల్ల లారీలోల్లు స్ట్రైకు చేత్తండ్లు - యాపలకాడ లారీలన్ని ఎక్కడి యక్కడ ఆగిపోయినయ్‍’’ గుక్క తిప్పుకోకుండా అన్నాడు.

                ‘‘స్ట్రైకెందుకర్రా...’’ చంద్రమొగిలి...

                ‘‘ఏదన్నుంటెనే స్ట్రైకుచేత్తరు - ఉత్తగెందుకు చేత్తరు..?’’ అన్నాడు అర్జయ్య ముడ్డికింది తువ్వాల తీసి దులుపుకొని లేచి నిలబడుతూ...

                ‘‘ఏదో ఉంటదని మా ఎరికే గని గదేందోనని?’’ ఇంకెవడో...

                ‘‘జీతాలు బెరుగన్నట - ’’ కోటేసు...

                ‘‘నీయక్క ఎప్పుడు సూసిన పత్తాలాడుకుంటుంటరు. లారీలల్ల మందిని తీసుక పోతరు. అట్ల పైసలచ్చే. గాళ్లే జీతాలు బెరుగన్నంటె ఎట్ల ?’’ చంద్రమొగిలి...

                ‘‘మందినెక్కిచ్చుకుంటె మాత్రం - డ్యూటీ మీదికి ఎక్కిండ్లంటె ఆరం దినాలు ఇల్లనేరా? పెండ్లా మనేరా? ఓటల్లదిని మోటబర్ల పండుడేనాయె - ఊరికింత దినుడు. బీడి, కాడి - అదిగాక పోలీసోల్లు మామూల్లు గుంజిరి...’’ అర్జయ్య.

                ‘‘ఆళ్లకు దినానికి ఆరు రూపాయలు బ్తరాదా?’’

                ‘‘అన్ని బొందలకే పోతయి...తిరుపతి కూడుకు బర్కతి లేదంట - వచ్చినట్టే వత్తయి - పోయేటియి బోతయి - మా సడ్డకుడు శంకర్‍లాల్‍ దగ్గర జేత్తడు - అని పెండ్లాం మీద గోరెడు బంగారంలేదు’’ అర్జయ్య..

                ‘‘ఆళ్ల సంగతి మనకెందుకు గని మనం ఉండుడా! పోవుడా! - మొఖద్దమ్‍లు జాడా పత్తాలేరు...’’యాకూబు...

                ‘‘స్ట్రైకు ఎప్పుడు బందయితదో ఎవలకెరుక లారీలు ఎప్పుడన్నా రావచ్చు’’ దావూద్‍ పిర్రలగోక్కుంటూ.

                ‘‘తియ్యి - ఆడినుంచి సెయ్యిదియ్యి లైసెన్సున్నదా?’’ ఎవడో అన్నాడు.

                 దావూదు గోకుడాపిండు - అందరు నవ్విండ్లు...

                మొఖద్దమ్‍లు రాలేదు. నెత్తిమీదికి పొద్దచ్చింది. లోడర్లు బొగ్గు కుప్పల చుట్టూ -సి.యస్‍.పి చుట్టు - రోడ్డు మీది హోటల్‍ చుట్టు తిరుగుతండ్లు... కొందరు ఏదైతే అదయితదిని వెళ్లి పోయారు...మొగిలి తను కూడా పోవాలను కున్నాడు. కాని కొత్త...

                కోటేసు మళ్లీ సైకిలెక్కి ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వరకు మళ్లో వార్త దెచ్చిండు - ‘‘కనీసం మూడు నాలుగు దినాల కన్నా ఎక్కువే ఉంటుందట - డ్రైవర్లు ఊరేగింపు తీసిండ్లు ’’ అని చెప్పుకొచ్చాడు.

                అప్పటికి యాభయి మందే మిగిలిండ్లు - పచ్చరి చెట్టు కింద కూర్చున్నారు. అప్పటికే కొందరు చెట్టునీడకు నిదురలు తీసిండ్లు - వాళ్లను లేపిండ్లు -

                అర్జయ్య నేలమీద దుబ్బల పుల్లతోని గీతలు బెడుతూ - ‘‘ఇగో మనసుట్టు పక్కల అంతా ఏదో విధంగా కలిసి కట్టుగుండి జీతాలు బెంచుకుంటండ్లు మనం సూత్తనే ఉన్నాం’’ అన్నాడు...

                ‘‘గిదేమన్న సాటు మాటు ఎవారమా?’’  దావూదు .

                ‘‘కాదు నిచ్ఛమే...మన సంగతి ఎప్పుడన్న ఇసారం జేసిండ్లా?’’ అన్నాడు.

                ‘‘సాలు సాలురొరే - ఇంకేదన్న మాట్లాడు. తన్నంగ తన్నంగ గీడికచ్చినం - గీడ సుత గీంత పని బోగొట్టే ఉపాయాలు చేయకు - మనల్నెవడు అలిమి బలిమి చెయ్యలేదు...’’యాకూబు...

                ‘‘ఏందన్న నీ భయం...?’’

                ‘‘నాభయంగాదు గీడ ఒక్కనికి బుట్టినోల్లులేరు...’’ అన్నాడు రాయలింగు కేసిచూస్తూ...

                ‘‘చూడన్నా గిది నావొక్కని గురించి గాదు చెప్పేది.. అందరి గురించే... అయినా నేను తప్పేం మాట్లాడిన.. గిట్ల భయపడుకుంట  ఎన్నిదినాలు బతుకుతం...? పుట్టిందో నాడు సచ్చేదోనాడు.. అసలు ఉన్నూరు నిడిసి పెట్ట గీడ అడుగు బెట్టిన్నాడే తాడు లేని బొంగురమై పోయింది. - ఉన్నది బోయింది ఉంచుకున్నది బోయింది. ఎవడు చెప్పినా ఎంటిక లేం బీక్కుంటడు’’ అన్నాడు అర్జయ్య...

                ‘‘సరే! సరే తెగవడ్డోనికి తెడ్డే లింగమంట - మేం బోతం’’ అన్నాడు చంద్రమొగిలి లేచినిలబడి కదులబోతూ...

                కాని అక్కడ కూర్చున్న వాళ్లెవరు కదల లేదు...

                ‘‘ఇగో ఇనుండ్లి... గీడ మనం ఎండల కర్రెపిట్టలోలె మాడి నీల్లు నిప్పులు దాక్కుంట భగభగ మండే బొగ్గు లారీకి ఎనిమిది మందిమి లోడుచేస్తే, లారీకి రెండు వందలు వసూలు జేసి అందట్ల నూరు రూపాలు దొర తీసుకొని తను, బాయిదొరలు      పంచుకుంటండ్లు.- మనకెంతిత్తండ్లు?- ఎనుభై రూపాలు - వింటండ్లా!  పొద్దు నోపారి మాపటీలోపారి వచ్చిపోయినందుకు మొఖద్దమ్‍లు ఇరువై తీసుకుంటడ్లు -ఎంతలేదన్న ఒక్కొక్క మొఖద్దమ్‍కు రోజుకు నూరుకన్నా ఎక్కువే - ఎంత పెద్ద గుండగాడయితె అన్ని రూపాలెక్కువ - దెం..తిని దేవల్ల భారతిచ్చి గొంతికలకచ్చె దనుక తాగి దొర కుక్కలైపోయి నీ నా అసొంటోల తన్నుతరు... ఈల్లన్నా మాపటీలో పొద్దున్నో ఈడికత్తండ్లు గని - దొరయితే మనం చేసే పని సూడకుంట కాలు మీన కాలేసుకొని దినానికి వేలు  తింటండు - మనం పంచుకుంటె రోజుకు మనిషికి పదిరావు.... అదె మనం జేసిన పనికి ఆళ్లు దినిపోవు డెందోంట?’’ అర్జయ్య లేచి  నిలుచున్నాడు.  అతని ముఖంలో ఎక్కడో నిప్పు రవులుకుంటోంది....

                చంద్రమొగిలి పోనేలేదు - దూరంగా నిలబడి ‘‘నిరుడు కొండడు గిట్లనే అన్నడు - నెలకింద మైసడు పొద్దునత్తె పనిలేదు పొమ్మన్నరు... గిదెట్ల అన్నరు? ‘బాగిచ్చేకాడ చెయ్యిపో’ - అన్నరు.. లొల్లిబెడితే మెడలు బట్టి నూకేసిండ్లు - తిడితె - సాయంత్రం సినిమూ టాకీసుకాడ పెండ్లం పిల్లలతోటుండంగనే నెత్తుర్లు కారంగ తన్నిండ్లు...’’ గొనుక్కున్నాడు...

                ‘‘అది నిచ్ఛమే గాడిదాక మా అందరి• •రికే  కాదుర రాయిలింగం’’ దావూదు కిసకిస నవ్వుతూ...

                ‘‘ఓరి బాడ్‍కావ్‍ నవ్వులుగాదు...’’యాకూబు...

                ‘‘మనం కలిసి  కట్టుగ నిలబడితె -’’ అర్జయ్య...

                ‘‘ఎట్ల నిలబడ్తం - మనకెవడన్న సాయకారముండాలె’’ గంగులు...

                ‘‘ఎవడుంటడుయూనియన్‍ బెట్టింది దొరేనాయె...ముడ్డిమీద తన్నెటోడు - పంచాతు జెప్పెటోడు ఒకడేనాయె...’’ దావూదు...

                ‘‘మనం మొదట నిలబడితె - ఎవలన్న సాయకార మత్తరు - అదిగాక కడుపు నొచ్చేదెవలకు నీకా? మందికా? కడుపునొచ్చినోడు ఓమ బుక్కాలే’’ అర్జయ్య...

                ‘‘ఆ గిదంత అచ్చేదా సచ్చేదా? ఉత్త పున్నానికి కోండ్రిగాడు దెబ్బలు దిన్నట్టు’’ - ఎవడో పెద్దగా అని ఆడినుంచి వెళ్లి పోయిండు...

                ఒక్కొక్కరే ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.  మొగిలి తను ఇంటి దారి బట్టిండు.. ‘‘అదినిచ్చమే - ముమ్మాటికి నిచ్చమే కని నాకెందుకీ పీకులాట - ఏదో మల్ల భర్తీదాక ఎల్లదీత్తె - గీపీడబోతది...దొరకు కంటయితె ఇంకేమన్న ఉన్నదా? నౌఖరి టుప్పా? ఇప్పిత్తడా? ఈల్ల మాటలు సూత్తె గయ్యన్ని సొచ్చెల్లినోల్ల తీర్గనే ఉన్నరు- నౌఖరి దొరకకుంటే?’’ మొగిలికి ఊపిరాడలేదు... ఆగిపోయాడు..                   అప్పుడే పట్నం తుమ్మ చెట్లకింద - గుడిసెల చూర్ల కింద తాగొచ్చి తన్నే మొగల్లను ఊహించుకొనే ఇల్లాల్ల మనుసుల్లోలాగా చీకటి గూడు కడుతోంది... తన చుట్టు పక్కలంతా రణగొణ ధ్వని - మంది తిరుగుతున్నారు - స్కూటర్లమీద తిరిగేవాళ్లు కబుర్లాడుతూ పోతున్నారు...

                                         (తరువాయి భాగం వచ్చే సంచికలో)

సైరన్ నవల  ఐదవ  భాగం

సైరన్ నవల  ఐదవ  భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం )

‘‘వద్దు..’’ అనుకొంటూ ముందుకు నడిచిండు.  మనుసులోని ఆలోచనలు పారదోలడానికి కాళ్లెగరేస్తూ హుశారుగా కులాసగా ఉన్నట్టూ నడుస్తూ కాసేపు ఖాళీ టిపిన్‍ గిన్నె వేళ్లతో టకటక కొడుతూ   ‘‘లాల్లలా...లాల్లలా’’ అని గొనుగుతూ నడుస్తున్నాడు.

                అదిగో మూల మలుపు - పాన్‍టేలా! పాన్‍టేలాలోని తురక పిలగాడు ఎరెర్రగా నవ్వుతూ పక్కనే నిలబడిన కుంటి కర్రెపిల్ల తోని పరాచికాలాడుతున్నాడు...

                మొగిలి అదిచూసి చూడనట్టు చూసి, పందులను తప్పించుకుంటూ - బురద గుంటల మీద గంతులేస్తూ సాయంత్రపు బొగ్గు పొయ్యిల పొగకు కండ్లు నులుముకుంటూ గుడిసె చేరుకున్నాడు...

                అప్పటికింకా శంకరయ్య రాలేదు...

                ‘‘అచ్చినవా? మరిదీ - ఇగో ఉత్తురమచ్చింది. ఇంటికాన్నుంచే కావచ్చు’’ అని ఓ పచ్చకవరు అందిచ్చింది

                మొగిలికి ఎక్కకల్లేని సంతోషమొచ్చింది - తండ్రి, తల్లి, తమ్ముడు అంతా కనిపించారు... వెనువంటనే అది తనకు చదువరానందుకు ఎక్కడలేని బాధ కలిగింది...

                ‘‘మోటు గాని కేమెరుక మొగిలి పువ్వాసనంట  సదువత్తదా?’’ లక్ష్మి చిన్నగా నవ్వి  ‘‘నేను గ ఎంబడోల్ల పిలగాన్ని తీసుకత్త - నువ్వయితె కాళ్లు చేతులు కడుక్కో’’ అని బయటికి పోయింది...

                ఎంబడోల్ల పిలగాన్ని వెంట బెట్టుకొని వచ్చేసరికి అట్లాగే నేలమీద ఉత్తరం బట్టుకొని మొగిలి కూర్చుండి ఉన్నాడు...

                పిలవాడు పీలగా ఉన్నాడు... కాలుకు  వెండి బేడున్నది. ఉత్తరం చింపిండు.. లక్ష్మి దరవాజ కానుకొని కూర్చున్నది...

                ‘‘సిరంజీవి కుమారుడు మొగిలిని మీ నాయిన దీవించి వ్రాయుటం ఏమనగా! మేమంతా ఇక్కడ కులాస గానే దేవుని దయతోని బాగున్నం - నీ మంచిసెడ్డలు లింగులు తెలియజేసినాడు...

                మంతెనకు బొయి నల్లగొండ సాత్తుర్లతోని నీ పేరుమీద పంచాంగం చూపెట్టుకచ్చిన - ఆరింట శని ఉన్నదని -పాల్గుణ మాసమెల్లే దాక చేసేపని కుదరదని చెప్పిండు.  భగవంతుని సంకల్పం లున్నట్టుగనే జరుగుతది, గని మన మనుకున్నట్టు జరుగుతదా? కొలువు దొరకలేదని నువ్వేం రంధి పెట్టుకోకు - మీ అవ్వ మరీమరీ చెప్పుతున్నది. మక్కపెరడి రేపోమాపో కోత బడుదామనుకుంటన్నం... మనపక్క పెద్దనాయిన పెరడిగోసిండ్లు . ముఖ్యంగా వ్రాయించేదేమనగా చి।।ల।।సౌ।।మైన రాయేశ్వరికి కడుపు పోయింది...’’

                మొగిలి సర్రున ఉత్తురం గుంజుకున్నాడు...

                పెదవులు వనికినాయి...చేతులు వనికినాయి...

                ‘‘అయ్యయ్యో ఎంత పనైపోయింది పిలడా!’’ లక్ష్మి....

                వనికే చేతులతో మళ్లీ ఉత్తరం పిల్లవానికిచ్చాడు..

                ‘‘పూసిన పూలన్ని కాయలుగావు - కాసిన కాయలన్ని పండ్లుగావు...కనుక నువ్వేం ఫికరు పడకు - మీ అత్తగారచ్చి తీసుకపోతనంటే కోడలు పోనంది...నవ్వు నీపని సెడకుంటా వీలు సూసుకొని ఒక్క పారి వచ్చిపోగలవు - మీ అవ్వ కండ్లల్లో కనపడుతున్నాడంటంది...ఉత్తరం చూసిన వెంటనే మళ్లీ ఉత్తరం రాయించగలవు....’’

                మీ నాయిన

                మందలసాంబయ్య

                పిల్లవాడు ఉత్తరమిచ్చి వెళ్లిపోయాడు. కాసేపు లక్ష్మి గాని మొగిలి గాని మాట్లాడలేదు...

                ‘‘అదినే - గిప్పుడు మనూరికి రైలుందా?’’

                ‘‘ఉంటదిగని - నువ్వు పనికెక్కి ఆరంగాలె ’’

                ‘‘ఇయ్యల్ల పని నడువలే - ఎప్పుడు నడుత్తదో? తెలువది ఎల్లుండత్త’’

                ‘‘ఔగని మీ అన్నకు చెప్పిపోవా?’’

                ‘‘నువ్వే సెప్పు...గీ ఉత్తురం సూపెట్టు ’’ అని లేవబోయాడు..

                ‘‘అయ్యో జెరంత తిని పోవా! కాల్లు చేతులన్నా కడుక్కోవా?’’

                ‘‘ఇంటికాడ తింట వదినా!’’

                మొగిలి గుడిసెలనుంచి పైకం తీసుకొని వీధిలో కొచ్చిండు...

                కరంటు బుగ్గ లెలిగినయ్‍...రైలుస్టేషన్ కు పోయిండు...

మల్ల రైలు దిగి బస్సు పట్టుకోవాలె...

 

                                                         19

 

                మొగిలి బస్సుదిగి ఊళ్లె కొచ్చేసరికి ఊరులుకు మగ్గిపోయింది. తల్లి తలుపు దీసింది...తండ్రి తమ్ముడు పెరడి కాడికి    పండబోయిండ్లు...

                మొగిలిని చూసి భూదేవి చేటంత మొఖం చేసుకొన అచ్చి ‘‘అచ్చినవా కొడుకా! పదిహేనొద్దులకే బొగ్గయిపోయినవు - పానం మంచిగ లేదా? కొడుకా!’’ అన్నది ఒళ్లంత పునికి...

                రాజేశ్వరి లేచి దీపం కైనీడకు నిలబడి మొగిలిని పరిశీలనగా చూసింది... ఆమె ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు...

                ‘‘అద్దుమ నాత్రచ్చినవ్‍ బిడ్డా! తిన్నావా?’’

                ‘‘లేదవ్వా!’’ మొగిలి.

                ‘‘పో. గిన్నన్ని బియ్యంబెట్టుపో..’’ భూదేవి అనేసి మంచంల పన్నది.

                రాజేశ్వరి గుబగుబలాడే కన్నీళ్లతో గిరుక్కున లోపలికి పోయింది. దీపం ముట్టిచ్చింది. పొయ్యి అంటేసింది. బియ్యం పొయ్యి      మీద పెట్టింది.  మొగిలి ఒకసారి తొంగి చూసిండు. పొయ్యిలో వెలుగుతున్న కట్టెల మంట వెలుగులలో రాజేశ్వరి వెలుగునీడల దోబూచులాటలో..

                ‘‘కాళ్ళు కడుక్కో బిడ్డా!’’ భూదేవి.

                బయట అంపులకాడికి పోయి కాళ్లుముఖం కడుక్కొన్నాడు.  రాజేశ్వరికి కొద్ది దూరంలో పీటేసుకొని కూర్చున్నాడు.

                ఎట్లా మాట్లాడాలనో తెలియక మొగిలి మూగమొద్దయ్యాడు.

                రాజేశ్వరి కంచుతలెల బువ్వకొడిగుడ్డు కూర తెచ్చింది.  మొగిలి తనో ముద్ద తిని - గారువంగ రాజేశ్వరికో ముద్దపెట్లిండు.

                ‘‘ఇంటెనుక మంచమేసత్త నువ్వు తిను’’ రాజేశ్వరి తుర్రుమన్నది.

                మొగిలి తినే సరికి ఇంటేనుక మంచమేసి బట్టలు పరిచింది రాజేశ్వరి.

                లేచిపోయి ఇంటెనుక మొగిలి మంచం మీద కూర్చున్నాడు... అతని కాళ్ల దగ్గర కూర్చుండి ఎక్కెక్కి పడి ఏడుస్తొంది...రాజేశ్వరి.

                ‘‘లే - పిస్సదానా ఏడుత్తరా?’’ అన్నాడు మొగిలి గొంతు పూడుక పోయింది. లేవట్టి గుండెల కదుముకున్నాడు...

                ‘‘నన్ను నీఎంట తీసుకపో నాకీడ పిస్సలేసినట్టుగున్నది - ఆనాడు కడుపంతా గుంజుకపోయింది...ఒకటేనొప్పి...’’

                ‘‘ఔగని మీవోల్లింటికి పోకపోయినవా?’’ ముఖమంతా ముద్దులాడుతూ...

                ‘‘నువ్వెప్పుడత్తవో ఎరుక లేదాయె...కొండకెదురు సూసినట్టు సూసిన’’

                రాజేశ్వరి దు:ఖం పోగొట్టడానికి తను పోయిన దగ్గరి నుండి జరిగిన సంగతులన్ని చెప్పుకొచ్చాడు... అట్లా ఇద్దరు ఆ రాత్రంతా మాట్లాడుకుంటూనే కూర్చున్నారు...తొలి కోడి కూసింది... మొగిలికి మరింక నిదురబట్టలేదు. లేచి పెరడికేసి నడిచాడు...

                ఆదినమంతా ఊళ్లోల్లంత నౌఖరి గురించి అడుగుతనే ఉన్నారు...మొగిలి ఈడువాళ్లు మొగిలి అదృష్టానికి ఈర్ష్య పడ్డారు...

 

                మొగిలికి అతిదగ్గరి మిత్రుడు పెట్టెం లింగయ్య వచ్చి కలిసిండు - అతని వెనుకనే పిల్లవాన్నెత్తుకొని అతని భార్య వచ్చింది...

                లింగయ్య వెనుకనే అతని తండ్రి మల్లయ్య పెద్దపెద్ద జంగలేస్తూ గాలికి ఎగిరే జుట్టు పోస తీడుకుంట ‘‘వీనవ్వను...ఒక్క కొడుకు నన్ను పోరన్ని ఏరుబడగొట్టిండు - పాలేరున్న కాడ మానం బోగొట్టి కాలేరు మీనికి బొతడట - ఏడి సాంబయ్యేడి? సెప్పుతోని గొట్టిత్త’’ అనుకుంట వాకిలంతా ఆడికీడికి దిరిగిండు...

                ‘‘చిన్న కొడుకును మాగండాన్నే కన్నవా?’’ అంది పెట్టెం లింగయ్య భార్య కొరకొర లాడుతూ....

                ‘‘అగో సూసినవా? నిన్న గాక మొన్నచ్చింది...ఎంత మాటనే...ఇంటన్నవే భూదేవి...’’ అన్నాడు మల్లయ్య...

                ‘‘పోరీ నీకేందే నువ్వు పోరాదు’’ అన్నది భూదేవి...

                ‘‘సావనియ్యడు - లేవనియ్యడు’’ అనుకుంట పిలగాన్ని ఎత్తుకొని లింగయ్య భార్య వెల్లిపోయింది.

                శాయమ్మొచ్చింది. ‘‘అవుపిలడా! మావోని అతిగతీ దెలువలే - నీగ్గిన కల్సిండా?’’అన్నది...

                ఏజెంటాఫీసు నుంచి ఎండలో వెళ్లిపోయిన దుర్గయ్య  మళ్లీ కన్పించనే లేదు. దుర్గయ్య అన్న మాట ‘‘రెండేతొవ్వలు ఆని బొండిగపిసుకుడో - రైలుపట్టాల కింద తలబెట్టుడో?’’ యాదికచ్చింది.

                ‘‘కలువలేదా?’’ శాయమ్మ

                ‘‘కల్సిండు... మంచిగనే ఉన్నడు...’’

                ‘‘కొలువు దొరికితే కొడుకెత్తు బంగారం (బెల్లం) సమ్మక్కకు పంచిపెడ్తనని మొక్కిన బిడ్డా!’’ శాయమ్మ తూరుపు దిక్కు మొక్కుకుంట వెళ్ళిపోయింది.

                పెట్టెం లింగయ్య ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయిండు -

                అన్నాలు దినేదగ్గర సాంబయ్య నల్లగొండ శాత్రుర్ల గురించి, శని గురించి భారతం చెప్పుకొచ్చిండు.. ఆ దినమంతా ఆడికీడికి దిర్గడంతోనే సరిపోయింది...

 

                                                              20

    

                తెల్లారి సీకటితోనే బియ్యం, పప్పు బట్టుకొని మొగిలి బస్సెక్కిండు...

                మొగిలి బస్సు దిగి, బియ్యం మూట మోసుకొని తెచ్చి గుడిసెల బారేసిండు...

                అప్పటికి శంకరయ్య డ్యూటీకి తయారయ్యిండు..

                ‘‘ఇంటికాడంత మంచేనా? మరదలుకు కడుపు బోయిందట గద...ఏం జేత్తం? - తాకినేలుకే పోట్రాయి తాగుద్ది...ఇగో ఎంకడచ్చిండు. పని చాలయ్యిందట - జెప్పనబో - ఆళ్లతోని మంచిగుండు...ఇగ రెన్నెల్లయితె అలీ సాబటు పీర్‍ సాబిటు ఎట్లనోగట్ల బాయిల సొర్ర బడితె మనలను కోనాయనెటోడుండడు’’ శంకరయ్య...

                ‘‘మాయింట్ల అంత మంచిగున్నరా?’’ లక్ష్మి.

                ‘‘బాగనే ఉన్నరదినె’’.

                ‘‘బియ్యమెందుకు తెచ్చినవ్‍? ’’ అనుకుంటనే సైకిలెక్కి శంకరయ్క వెళ్లిపోయాడు...

                మొగిలి ఆదర బాదరగా టిపిన్‍ పట్టుకొని పని దగ్గరి కొచ్చేసరికి సందు లేకుంట లారీలు నిండున్నయి - బొగ్గుకుప్పలు కూడా పెరుగున్నయి. సి.యస్‍.పి. పట్ట (బెల్టు) బందయ్యిందట. కంపినీ లారీలన్నీ బయటనే బొగ్గు పోత్తన్నయి - కంపినీ లారీలు బర్రు బర్రున ఇరాం లేకుంట తిరుగుతన్నాయి. లోడర్లంతా కూర్చున్నారు....మొగిలి తమ గ్యాంగు దగ్గరికి పోయి వెంకులు పక్క నిలుచున్నాడు - వెంకులుది తన ఈడే - మూడేండ్ల నుంచి గీన్నే పనిచేస్తున్నడట. ఎవల ముచ్చెట్లాల్లయే. కాని ఈ ముచ్చెట్లల్లో ఎక్కడో వేడి...

                అర్జయ్య సన్నని గొంతుతోటి ‘‘సూసిండ్లా! లారీలోల్లకు యాభయి రూపాలు జీతం పెరిగిందట.  అంటే ఇన్నూట యాభయినుంచి మున్నూరయినవి.   రోజు బత్తా అయిదు నుంచి ఏడు రూపాలు పెరిగిందట - అడుగందే అవ్వయిన బెట్టది - మనం ఎప్పటి నుంచో గిదేఏషం - లారీ లోడింగ్‍ నేను కొత్తలచ్చినపుడు యాబై యుండే అప్పుడు మనకు ముప్పయిచ్చేవాళ్లు - అది ఇన్నూరయ్యింది - అంటే మూడు రెట్లు  బెరిగింది - ఎనుభై రూపాలున్నప్పుడు  బెంచిండ్లు. తరువాత తెడ్డు చూపిండ్లు.’’

                ‘‘ఎట్లయితె అట్లయితది. ఇయ్యలడుగుదాం’’ అన్నారు కొందరు...

                మరికొందరు ఎటూసప్పుడు చెయ్యలేదు...

                ఇంకొందరు ‘‘అందరు ఎట్లంటే గట్ల - నలుగురితోని నారాయణ’’ అన్నారు...

                ఎవలడుగాలనే కాడ పెద్ద రబస జరిగింది...

                చివరకు అర్జయ్య తనే అడుగుతానన్నాడు..

                ‘‘ఆళ్లు ఒప్పుకోరు అప్పుడేం చేద్దాం?’’ అన్నాడు చెంద్రమొగిలి...

                ‘‘ఏం జేద్దాం ? మనం సమ్మె జేద్దాం - గిప్పుడైతేనే మంచి గుంటది. దాదాపు ఇన్నూరు లారీలుంటయి మనం నింపకపోతే అటు లారీలోల్లు లొల్లి చేస్తరు...’’ అర్జయ్య...

                వాళ్లట్లా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కొక్క మొఖద్దమ్‍ దిగిండు... రాకడ రాకడే చిర్రుబుర్రు లాడుకుంటచ్చిండ్లు...

                ‘‘ఏమాయ్యెరో? ఆవలగన్ని లారీలు నిలబడుంటే తీరిపారి ముచ్చెట్లు బెడుతండ్లు.. లేండ్లి లేండ్లి ’’ నరేందర్‍...

                ఎవలు మాట్లాడలేదు. అర్జయ్య వాళ్ల గ్యాంగు మొఖద్దమ్‍ కరీం... ‘‘మాక - లమ్డికొడుకులకు గమండి బెరిగింది బంచత్‍... ఏమిరా అర్జా! లీడరువైతన్నవట హమ్‍కు లీడరునయివోనా బై... అమ్‍కు మజ్దూర్‍హోనా’’ అన్నాడు..

                అర్జయ్య మాట్లాడలేదు...

                ‘‘ఇయ్యల్టీ నుంచి అర్జయ్యను పనిలకు తీసుకునేదిలేదు’’ అన్నాడు నరేందర్‍...అర్థంచేసుకొని...

                అయినా లోడర్లు మాట్లాడలేదు - కదలలేదు..లారీ డ్రైవర్లు క్లీనర్లు మొఖద్దమ్‍ల చుట్టు మూగిండ్లు..తలో మాట...

                ‘‘బెల్లం గొట్టిన రాయోలె ఉలుకరు పలురు సి.యస్‍.పి బ్రేక్‍డవున్లుండి - కోల్‍ యార్డంత నిండి పోతంది’’ ఇంకో మొఖద్దమ్‍: అరిచిండు...

                అప్పుడు అర్జయ్య లేచి నిలబడి...’’కోప్పడకుండ్లి మాకిచ్చేటియి సరిపోత లేవు’’ అన్నాడు...

                ‘‘ఏందిబే - నువ్వేనన్నమాట లీడరువు గింతదాకచ్చిందా ఎవ్వారం - నువ్వు అసలుకే లేవు... మీకు సరిపోకుంటే పోండ్లి బై - గా రేటుకు పనిచేసేటోల్లనే తెచ్చుకుంటం...’’నరేందర్‍...

                ‘‘నడువుండ్లిరా? మనతోనై పోయిందట - కొత్తోల్లను దెచ్చుకుంటరట - కడుపు లేనోల్లు ఎవలన్న దొరకుతే గట్లనే తెచ్చుకోండ్లి...’’ అర్జయ్య.

                ‘‘ఏకు దమ్మున...’’నరేందర్‍ మాట పూర్తికాక ముందే - సగం మంది లేచి నిలబడ్డారు - సగం మందిలో కొంతమంది లేవాలా వద్దా అని అలోచిస్తున్నారు...

                ‘‘బంచత్‍... సమ్మె చెస్తండ్లన్నమాట’’ కరీం గడ్డం గోక్కుంటూ.

                ‘‘అన్న మాటేంది ఉన్నమాటే’’ మందిలో నుండి ఎవడో - ఆ ఎవడ్నో చూడాలని నరేందర్‍ ప్రయత్నం చేశాడు. కాని అందరి ముఖాలు ఒక్కలాగే ఉన్నాయి...

                ‘‘బాగా ఆలోచించుకోండ్లి.... మీ పని బోతే అర్జడు పనిప్పియ్యడు - మీరు ఆకట సత్తె అర్జడు కూడు బెట్టియ్యడు... వింటండ్లా? ’’ నరేందర్‍...

                ‘‘పుట్టిన కాన్నుంచి తమరే సాదవడ్తిరి... ఉత్తపున్నానికిచ్చినట్టు మాట్లాడవడ్తిరి... మేం పనిచేస్తేనే గదా మీరైనా మేమైనా బతికేది. గీ రెక్కలేడమ్ముకున్నా గీంత మాత్రం దొరకకపోదు...’’ మళ్లీ మందిలోనుంచే...

                నరేందర్‍కు చెమటలు పట్టాయి...ముసలం పుట్టనే పుట్టింది - పన్నెండు మంది మొఖద్దమ్‍లుండి కూడా ఎవడో ఒకడు పుల్లబెడితే పనాగి పోయింది...

                ఆ ఎవన్నో మసి సెయ్యడం సుతారం గాదు... కాని ఎట్లా? ఇప్పుడైతే పని ఆగిపోతది... దొర దెం...లు.. అంతా ఉల్టా సీదా.. మొఖద్దమ్‍లు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

                కరీం జబర్దస్తీగా అర్జయ్య గల్ల బట్టిండు...

                ‘‘ఇడువ్‍... ఇడువ్‍....’’ తొక్కులాటలో లోడర్సుకు ఏం చేయాలో పాలుపోలేదు...

                ‘‘ఇడువ్‍ అర్జన్న గల్లా నిడువ్‍...’’ అన్నాడెవడో అందరు అదే అన్నారు... ఎవడో కలుగజేసుకున్నాడు... కరీంను బయటకి దొబ్బారు... ఇంకొంచెం ఆలిశ్యమైతే లేబరు కరీంను తొక్కేవాళ్లే.

                నరేందర్‍ పరిస్థితి చెయ్యిదాటిపోతున్నందుకు...గాబరాపడి... ‘‘ఆగండాగండి...’’ అని అరిచిండు

                ‘‘ఆగండి - సరే ఎట్లాగో సమస్య పుట్టింది మీరు మేము నౌఖరిగాళ్లమే - మనకు యజమానున్నడు...నేను ఫోనుల మాట్లాడివస్త. మీరంతా ఆగుండ్లి...’’ అన్నాడు...

                లోడర్సు సరేనన్నారు...

                నరేందర్‍ సైకిలెక్కి ట్రక్కులు చుట్టేసి రోడ్డు మీదికొచ్చి ఓ బ్రాండి షాపులో నుంచి క్రిష్ణారావుకు ఫోను చేసిండు...

                ‘‘నేను దొరా! నరేందర్‍ను... లోడర్సు సమ్మె చేస్తమంటున్నారు...’’

                ‘‘మీరంతా ఎందుకున్నరు? మొ... చీకుతండ్లా! ట్రక్కుకు ఇరువై రూపాలు దెం... వాడలు దిరుగుమనా మిమ్ముల బెట్టుకున్నది?...లం..కొడుకులారా. ఎవడేం మాట్లాడుతండో చూడొద్దా? చూడు - నరేందర్‍గ ఆ లమ్డికొడుకు లంతా బద్దిమాకోల్లు - సీసా కల్లు గప్పుచుప్పున గొట్టి గుర్రు కొట్టి పండేటోల్లు’’ అవతలినుంచి -

                నరేందర్‍కు చెమటలు పట్టాయి. చేతిలో ఫోను వనికింది... ముఖం మాడిపోయింది...  ‘‘దొరా! రెండు రోజుల నుండి పనిబందు గదా! ఈ విషయం మాదాక రాలేదు’’

                ‘‘రాస్కెల్‍...మొన్నటిరోజు అర్జడు చెట్టుకింద ఏం మాట్లాడిండో నాకు తెలిసింది... మీరేం చేస్తున్నట్లు ?- ఇలాంటి సమయంలో ఊరుమీద బడి అంబోతులోలె తిరుగకుండా పని మీదుండాలె... ఇంగ్లీషులో ఓ సామెతున్నది...ఎమ్టీ మైండ్‍ ఈజ్‍ డేవిల్స్ వర్కుషాపని. వాళ్లు పనిచేయకుండా కూర్చుంటే ఏదో ఆలోచిస్తరు. అది సరే! అర్జనికి ఎవరెవరితో సంబంధాలున్నాయో కనుక్కున్నారా? లేదు... అన్నీ నేనే చెప్పినంక మీరెందుకోయి...బాస్కర్రావు గాడు వాని ఆంధ్ర రాజకీయంతోటి పుల్లలు బెట్ట చూస్తండు - అంత దమ్మొచ్చిందంటే... వాని వెనుక ఏదో ఒకటుండాలె... చూడు...ఇప్పుడు గడబెడ కానియ్యకు. నేను హైద్రాబాదు పోయిన్నని చెప్పు...వారం రోజులు గడిచే దాకా నడిపించుండ్లి - ఆ తర్వాత సంగతి చూద్దాం ...’’

                ‘‘మా మాట నమ్మరు దొరా’’

                ‘‘సరేసరే! రాఘవులు గాన్ని తొలిస్త...నువ్వు పోయి వస్తున్నారని చెప్పు...’’

                ఫోన్‍ పెట్టేసి ఢీలాపడి సైకిలు దొబ్బుకుంటూ లోడర్ల దగ్గరికొచ్చాడు నరేందర్‍.

                ‘‘వస్తండ్లు -ఈలోగా పని గానియ్యిండి - మాట మాటేనాయె, పని పనేనాయె - ఇగో బై మద్దెన మమ్ముల అనకుండ్లి - వచ్చినంక అన్నిమాట్లాడుకోండ్లి - మీయిష్టం - వాళ్లిష్టం - మనదేందంటే కిరాయి వసూలు చెయ్యడం ఎవలకు పంచేదాల్లకు పంచడం’’ నరేందర్‍...

                ‘‘రానియ్యిండ్లి - దొర తోనే అన్ని మాట్లాడుతం’’ లోడర్సు...

                గంట గడిచిపోయింది. ఈలోగా లేబర్లలో ముసలివాళ్లు గునుపులను గుండెల్లోనే అదిమి పట్టుకున్నారు. అసలే రెండు రోజుల నుంచి పనిలేదు. ఇయ్యల్ల కూడాపోతే - ఎందుకొచ్చిన పీడ.  ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్టు. కడుపు గాలినోల్లం మనం - రెండు రోజులు పనిబోతె ఉపాసముండుడే -కని దొరకు పోతేంది, ఉంటేందిఇట్లాగా ఆలోచించి..ఒక ముసలివాడు మొఖద్దమ్‍లకు వినిపించకుండా అర్జయ్య పక్కకుచేరి... ‘‘ఒరే అర్జన్నా! ఆళ్లు మా రాజులు - వాళ్లకు రెండురోజులు పోతేలెక్క గాదు...మరి మనకో రెక్కాడితె డొక్కాడ్తది...’’ అన్నాడు...

                ‘‘అవునిచ్చమే - మనకుబోతే మనిషికి పది రూపాయలు బోతయి... మనం కడుపు నిండ దిని కండలు బెంచుతన్నమా? గ లేమిడిలనే గిది గూడా - కని దొరకు ఒక్కనాడు ఆదాయం ఎంత లేదన్న మూడు నాలుగు వేలుంటది - అది ఎక్కువానా? మన పది  రూపాయ లెక్కువనా?’’ అర్జయ్య అంతే మెల్లగా చెప్పాడు...

                ‘‘కరీంగాడు చూడు  ఎట్ల చూత్తండో?’’ అన్నాడొకడు...

                  ‘‘ఏందిబే?’’ అన్నాడు  కరీం మొఖద్దమ్‍.

                ‘‘మిమ్ములగాదు బాంచెన్‍...మా కనకయ్య నంటున్న’’ అన్నాడు....

                ‘‘పిత్త బలిసినవ్‍ బిడ్డా ! నీ బలుపు దేవుడు తియ్యకపోడు గాడెవడో గట్లనే ఎగిరిండట ’’అన్నాడెవడో...

                మొఖద్దమ్‍లు ఆ మాటలు తమను కాదన్నట్లు ఎటో చూస్తూ నిలుచున్నారు.

                గంట గడిచింది. ఇలాంటి మాటలు - అర్జయ్య మనుసులో మాత్రం ఎన్నో విచారాలు...ఇంతలో గోధుమరంగు కారొచ్చింది...

                ‘‘దొరచ్చిండు దొరచ్చిండు’’ లోడర్సంతా తొక్కీస లాడుతూ కారు చుట్టూ మూగారు...

                కారాగింది. కారులోనుంచి దొర దిగలేదు రాఘవులు దిగిండు...చాలా ప్రశాంతంగా నవ్విండు. అద్దాలు తీసి జేబులో పెట్టుకున్నాడు... దొరకు దండాలు బెట్టాలనుకున్న కార్మికులు ఆగలేక రాఘవులుకే పెట్టిండ్లు...

                ‘‘అరె దొరరాక గీసుప్ప నాతోడచచ్చిండేందిరో?’’

                ‘‘ఏమయ్యో మేం దొరగావాలన్నం...’’ అన్నా డొకడు గుంపులోనుండి...

                రాఘవులు అదే చెక్కు చెదరని నవ్వును జీడిగింజ ముఖం మీద పులుముకొని కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నిలుచున్నాడు...

                ‘‘కార్మిక సోదరులారా! దొర బొగ్గుబాయిల వాళ్ల సమస్యల గురించి మాట్లాడడానికి పట్నంబోయిండు...’’

                ‘‘అరే ఇగెట్లరా?’’

                ‘‘వినండి...అయితే దొరొచ్చేదాక మనకు పనులాగుతయా? ఆగయి...లారీలాగుతయా ఆగయి. రాజుబోతె రాజరికం పోతుందా? మీ సమస్య లేమిటో చెప్పండి ఈ సంగతి తెలిసిన వెంటనే నేను పట్నం ట్రంకాల్‍ చేసి దొరతో మాట్లాడిన... సంగతేందో నన్ను తెలుసుకొమ్మన్నాడు...’’ అన్నాడు...

                అర్జయ్య మందిలో నుంచే -  ‘‘సంగతే ముంటది సార్‍ కయికిలి గాళ్లకు... మాకు కూలి బెరుగన్నననే...పదేండ్ల కింద మేం తొలుత గీ పనిమొదలు బెట్టినప్పుడు లారీకి ఇరువై రూపలిచ్చేటోల్లు - అప్పుడు మనిషికి తక్కువల తక్కువ మూడు రూపాయలు ఎక్కువల ఎక్కువ  అయిదురూపాలు గిట్టేది - అది ముప్పయి చేసిండ్లు - నలుబై చేసిండ్లు - ఎనుబై చేసిండ్లు - కని ఆనాడు మూడు రూపాలల్ల గాసం గిన గొనుక్కోంగ ఆటాన మిగిలేది- ఇప్పుడు పదచ్చినా గాసానికే సరిపోతలేదు...’’ అర్జయ్య...

                ‘‘నిజమే నిజమే’’ అన్నాడు రాఘవులు...

                ‘‘తమరికెరుక లేనిదేమున్నది - మా కండ్ల ముంగట బొగ్గుబాయిలోల్లకు ఎన్నిపారీలు ఎంతెంత బెరిగినయ్‍. నిన్నగాక మొన్న లారీ డైవర్లకు యాభయి రూపాలు జీతం, బత్తల రూపాయి బెరిగే...’’

                ‘‘గది మేమే పెంచిపిచ్చినం..మా యూనియనే పోరాడి గెలుచుకున్నది...’’ రాఘవులు ఉత్సాహంగా చెప్పబోయాడు...

                ‘‘ఇగో పదేండ్ల కింద బీడి కట్ట ధర ఏకానుండె. ఇయ్యాల బీడికట్ట ధర ముప్పయి పైసలయ్యింది. ఏందన్న మాట బీడి కట్ట ధర నాలుగంతలయ్యింది - మరి మా జీతం రోజుకు పదన్న గిడ్తలేవు. అప్పుడు మూడురూపాలనుకున్న ఇప్పుడు పదిహేను గిట్టాలె’’ అన్నాడొకడు...

                ఇంకొకడు సబ్బు ధర జెప్పిండు - మరొకడు బియ్యం, పప్పు ధర చెప్పిండు...

                రాఘవులు అందరిని మాట్లాడనిచ్చి...

                ‘‘నిజమే కాదనను...కని దేనికైనా పద్దతుండాలె - విన్నరా? సమ్మె చేయదల్చుకుంటే ఖానూను ప్రకారంగా పదిహేను రోజుల ముందు నోటీసియ్యాలె’’

                ‘‘మాకేడ కానూండ్లు ఎరిక బాంచెన్‍...మాకు పర్మినెంటా? యూనియనా?’’

                ‘‘కనుక - మీరు పని మీది కెక్కుండ్లి - దొరచ్చిన తరువాత మీ తరపున అన్ని సంగతులు నేను దొరకు చెప్పుత...’’

                ‘‘మేము కూడా వత్తముండ్లి’’

                ‘‘సరే మీదాంట్ల ఓ ఇద్దరొచ్చేరు...కార్మికులారా ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. వింటండ్లా? మన దేశం నుండి ఇంగ్లీషోనంతటివాన్ని గాంధీ శాంతి యుతంగా వెల్లగొట్టగలిగాడు..ఎవరో వస్తారు..కామ్రేడ్సు అని మనదేశం మాట కాకుండా మాట్లాడుతరు - మనం పోరాడాలెనంటరు. మీరు వాళ్ల మాటలు నమ్మి పోరాటంలకు దిగిండ్లో? వాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఎనుకకు మర్రి ఉరుకుతారు. ఆఖరుకు మిగిలేదేమిటో? మీకు చెప్పాల్సిన పనిలేదు...’’

                ‘‘గియినే మన సంగతి మాట్లాడక ఎవల సంగతో చెప్పుతడేందిరా?’’ అన్నాడొకడు...

                ‘‘ఇగో గయ్యన్ని మాకేరుకలే - మా మొఖద్దమ్‍లు మమ్ముల కుక్కల సూసినట్టు సూత్తరు. ఊ అంటే  ఆ అంటే మీది కురికత్తరు. తంతండ్లు. గాళ్లకు గూడా జెరంత గదేందో శాంతి ముచ్చట చెప్పుండ్లి బాంచెన్‍’’ అన్నాడు ఒక పొట్టివాడు...

                అందరు నవ్విండ్లు...

                ‘‘ఏమయ్య తోటి కార్మికులతోని అట్లాగేనా వ్యవహరించుడు... సరే - ఇకముందు అట్లాంటియి జరుగుతే నాకు చెప్పుండ్లి’’

                ‘‘తమరేడ దొరుకుతరు బాంచెన్‍...?’’

                ‘‘నేను కార్మికుల్లోనే ఉంటగదా! అది సరే పని మొదలు బెట్టుండ్లి...’’ అన్నాడు రాఘవులు మొఖం మీద చెమట తుడుచుకుంటూ...

                అర్జయ్య ఏదో మాట్లాడబోయాడు. కాని లోడర్సు అప్పటికే సెమ్మాసులు, తట్టలు తీసుకొని పని మీదికి పోయారు...

                నిలబడిన అర్జయ్య కేసి అప్పుడు చూశాడు రాఘవులు... కత్తిరించిన మీసాలు...కనుబొమ్మలు ముడిచాడు...అతని మనసులో ఎక్కడో చిన్న ఘర్షణ... కారెక్కిండు... మొఖద్దమ్‍లు గ్యాంగుల చుట్టూ మిర్రి మిర్రి చూస్తూ కాసేపు తిరిగి ఎండకు అలిసిపోయి - సైకిల్లెక్కి వెళ్లిపోయారు...

                పని జోరుగా నడుస్తోంది. లారీలు నిండుతున్నాయి బొగ్గుకుప్పలు తరుగుతున్నాయి. అన్నాలకు దిగి నప్పుడు...

                ‘‘అర్రె అన్నాలుదినే టందుకు షెడ్డు గురించి మతికే లేకపాయె -’’ అన్నాడొకడు...

                ‘‘నల్ల కూడా...’’

                ‘‘అట్లా చూస్తే సానున్నయి. బూట్లుగావాలె - వారానికో సెలవు గావాలె - బట్టలు గావాలె- ప్రావిడెంటు ఫండు కట్టుగావాలె - జీతాలు ఏ రోజు కారోజుగాకుంట వారానికొక్క మారుగావాలె - పెళ్లలుబడి సితికిపోయిన మన కాళ్రెక్కలకు ముదరగట్టియ్యాలె - మనకు సుత కంపినీ దవకాండ్ల సూపిచ్చుకోనియ్యాలె - గ్లి సానున్నయి’’ అన్నాడు అర్జయ్య...

                ‘‘నీకు తెలివి బాగనే అచ్చిందిరో’’ అన్నాడో ముసలివాడు...

                ‘‘ఇది మన మొదటి అడుగు...’’ అన్నాడు వెంకులు...దాన్నెవడు వినిపించుకోలేదు...

                ‘‘ఇంతకూ మనం ఓడినట్టా? గెలిసినట్టా?’’

                మొగిలి ఎప్పటి నుంచో అనాలనుకున్న మాట గొంతులోనే ఉండిపోయింది...

                                                                          21

 

                ఆ గుడిసె ఎటూ నాలుగు గజాలు లేదు. కంకబొంగులతో వేసిన కప్పు ఎప్పుడో ఎగిరిపోయింది... అలాంటి గుడిసెలో నలుగురు మనుషులు కూర్చున్నారు... అప్పుడు సాయంత్రం నాలుగు కావస్తోంది. ఆ నలుగురిలో ఒకడు అర్జయ్య ఇంకొకడు వెంకులు... ఇంకోఇద్దరిలో ఒకడు చిన్నగడ్డం - బక్కమొఖం పెద్దపెద్ద కనిగుడ్లు - అతనిపేరు ఇబ్రహీం - రెండో అతనివి మొలితిప్పిన మీసాలు- కోలముఖం మనిషి బలంగా ఉన్నాడు...అతని పేరు కొమురయ్య.

                ఇబ్రహీం చాలా సేపటి నుండి మాట్లాడుతున్నాడు.. మధ్య మధ్యలో కొమురయ్య వివరించి చెప్పుతున్నాడు.. అర్జయ్య వాళ్ల మొఖాల కేసి చూడకుండా వింటున్నాడు... ఒక్క వెంకులు మాత్రమే ముగ్గురి మొఖాలు పరిశీలనగా చూస్తున్నాడు. వెంకులుకు ఆ మాటలు అర్థం కావడం లేదు...

                ‘‘చూడు కామ్రేడ్‍... ఒక పక్క గని కార్మికులు బ్రహాండమైన పోరాటాలు చేసి మొదటి వేజ్‍ బోర్డు సాధించుకున్నారు. బోనస్‍ సాధించుకున్నారు..మరో పక్క ఇదే ఏరియాలో బొగ్గు లోడింగు చేస్తూ  మీరు పశువుల్లాగా ఏ హక్కులులేకుండా తుమ్ముతే ఊడే ముక్కులాగా పని చేస్తున్నారు. మీరంతా ఒక్కటి కావాలి...అసలు మీరు ఇవ్వాల్ల సమ్మె నాపవలసిందిగాదు - దీన్నే డిలే పాలిటిక్సు అంటారు... అసలు చుట్టుపక్కల ఇరువై ఊళ్ళల్లో భూములు గలిగినవాడు భూస్వామి. పల్లెటూల్లో దొర కిరాతకమైన దొర. ఒక సంఘటన చెప్పుత వినండి... ఇది వారం రోజుల కింద జరిగింది - మొగుల్లపెల్లిలో ఈ దొరకు అరవ చాకిరి చేస్తున్న ఒక పాలేరు ఆ పని భారానికి కాగలేక అత్తగారింటికి పారిపోయిండు - మామ ఏదో కంపనీలో కంట్రాక్టరు లేబరుగా పనిచేస్తుంటే అక్కడే   ఉన్నాడు - ఈ లోగాఈ సంగతి వీడికి తెలిసింది - భార్య నెత్తిమీద కుండలు బోళ్లు పెట్టించి వాళ్ల స్వంత యింటిని ఖాళీ చేయించి - ఆ గుడిసెకు కంప దడి కట్టించి వెళ్లగొట్టాడు - అలాంటి దొర కొడుకు ఇక్కడి కొచ్చి లేబర్‍ నాయకుడి అవతారమెత్తి - లేబర్ల హక్కులకోసం పోరాటం చేస్తున్నట్టు ఫోజుపెడుతున్నాడు -చుట్టుపక్కల ఇరువై ఊళ్ల్లల్ల ఒకపక్క వందల పాలేర్లను - రైతులను దోపిడి చేసే ముకుంద రావు దొర - ఇంకో పక్క గీడ లేబరు మీద దోపిడి  జరుగుతుందని అయిన కొడుకు క్రిష్ణారావు చిలుక పలుకులు  పలుకుతున్నాడు - ఎందుకు? ఎప్పుడు కార్మికులు ఆలోచించరు. ఎందుకంటే  దొర కొడుకులే  ఇక్కడ సారా కంట్రాక్టు, బ్రాండిషాపులు, సినిమాటాకీసు, వడ్డీ వ్యాపారం -- ఇవేకాక బంగారు గుడ్లు పెట్టే లోడింగ్‍ కంట్రాక్టు ఉన్నాయి. ఇవ్వన్నిటికి అధికారం కావాలి -దానికి లేబర్‍ యూనియన్‍ - పై నుంచి చందాలు కావాలి. ఇది మనొక్క దేశంలోనే సాధ్యం...గుండా గ్యాంగును పెంచి పోషించి కార్మిక ప్రాంతాలలో గుండాగిరి చెలాయించుతండ్లు.’’

                ‘‘వాడు పొద్దున సింగ్‍ గానింట్ల కనిపించిండు’’ అన్నాడు కొమురయ్య

                ‘‘ఓర్నియవ్వ పట్నం బోయిండని - ఆ కర్రె మూతోడు చెప్పిండే ’’ వెంకులు...

                ‘‘గదే గమ్మత్తు...లెనిన్‍ ఏమన్నడో తెలిసిందా?’’.  లెనిన్‍ ఎవరో అక్కడున్నవారికి తెలియలేదు.  ఆయన భాస్కరరావు కన్న పెద్ద లీడరేమో అనుకున్నరు.

                ఈ మాటలు ఎంతకూ తెగేటట్లు లేదు...

                ‘‘మీరొక్కపారి లోడింగ్‍ కాడికొచ్చి మాట్లాడ్తె మంచిగుంటది. నాకేమో ఓటిదోస్తే ఓటి దొయ్యక పాయె! అది గాక            మావోళ్లు గూడ మా ఎనుక బలమున్నదని ముందు కత్తరు’’ అర్జయ్య...

                ‘‘కొమురయ్య రేపొద్దున నువ్వెళ్లు - నేను కెకెటూ మీదికి బోవాలె...సాధ్యమైనంత వరకు సామరస్యంగానే చూడండ్లి...

                ‘‘మల్ల గదేమాట - నేనాడికి బోతే ఆనిమొఖద్దమ్‍లు ఊకుంటరా?’’

                ‘‘నువ్వూ మన  వాళ్లను తీసుకపో... ఎందుకైనా మంచిది. మనం సమ్మె పద్దతిలోనే పోవాలె - ఏదన్న గడబిడ జరిగిందంటే వాడా రూలింగ్‍ పార్టీ - పోలీసులు కేసులు - ఓటిబోయి ఓటయితది...’’ ఇబ్రహీం...

                ‘‘మరి కానే అయితది...కాకుంటెట్లయితది...? కర్ర విరక్కుంట పాము సావకుంట వాని గుండాలు ఆడోల్ల నెత్తుకపోతే శాంతి అంటిరి. ఎట్ల పనైతది’’ కొమురయ్య

                ‘‘కామ్రేడు నువ్వు కమ్యూనిజాన్ని సరీగ అర్థం చేసుకోలేదు...కామ్రేడు లెనిన్‍ ఏం జెప్పిండు  ఒక్కడుగు వెనుకకు రెండుగులు   ముందుకు’’ ఇబ్రహీం...

                ‘‘పెద్దసారు గాలి సోకిందిగని’’ కొమురయ్య...

                ‘‘పార్టీ ఆదేశం మరి...కామ్రేడ్సు రేపు మేము తప్పకుండా వస్తాము...’’ ఇబ్రహీం లేచి నిలబడ్డాడు...

                మీటింగైపోయింది...వాళ్లతో పాటే వెంకులు వెళ్లి పోయాడు...

 

 

                                                           22

 

                అర్జయ్య మార్కెటు కేసి నడుస్తున్నాడు. అతని మనుసులో అనేక రకాల ఆలోచనలు...‘‘ఇంతకుముందు ఎంతో మంది గులిగిండ్లు - ఎదురుబడి అడిగిండ్లు.  ఎట్ల చేసేటోల్లను అట్లా చేసి మొత్తానికి అందరిని ఓడిచ్చిండ్లు - ఒకప్పుడు పిర్రల మీద సినిగిన కాకిరంగు  నెక్కరేసుకొని నరేదంర్‍ గిట్లనే లేబరుగ వచ్చిండు...వచ్చిన దగ్గరినుండి కూలి బెరుగాలని అనేటోడు... ఆఖరికి ముందటబడి అడిగిండు - ఎవడు సపోర్టు చెయ్యలే - పెరుగాలా వద్దా అనే మాట చెప్పకుండా కార్మికులు నిలుచున్నారు... తర్వాత మార్కెట్ల ఎక్కన్నో నరేందర్‍ను గుండగాళ్లు కొట్టిండ్లన్నరు. వారం రోజలకు ఏమయ్యిందేమో నరేందర్‍ మొఖద్దమ్‍  అవతారమెత్తిండు - ఇప్పుడు లోడర్లు అంతా కూలి పెరుగాలన్నరు -ఏమో విషప్పురుగులు - తన నేమన్నా చేస్తే తన పోరగండ్ల  గతేంగావాలె?’’  - అర్జయ్య కాల్లు వనికినయ్‍ - చెమట పట్టింది... ఎవరన్నా తనను వెంబడిస్తున్నారేమోనని చుట్టూ చూసిండు. ఎవరి పనుల మీద వాళ్లే వెళ్లి పోతున్నారు -

                దూరంగా బ్రాండిషాపు ముందు సారలిగాని గ్యాంగు ఒకల భుజాలమీద ఒకరు చేతులేసుకొని వచ్చేపోయే ఆడవాళ్లను చూస్తూ నవ్వుతున్నారు..వాళ్లు తనకేసి వస్తారని - ఇక్కడే తంతారని వనికి పోయిండు - కాని వాళ్లు అర్జయ్యను చూడనే లేదు...

                ‘‘గిట్ల బయపడితెట్ల - సచ్చిందోనాడు! పుట్టిందోనాడు. తనేం తప్పుచేసిండు - తనకు కూలిజాలదని అడగడు తప్పా! గుండాలకు తాగ పోపించకపోతే వాని పనులు చేసిపెడ్తరా? తనకు గుండాలకు పోలికెక్కడిది. తను మామూలు తిండి కోసం పని చేసే కాడ అడుగుతండు... అదీ వాని ఇంట్లసొమ్ము ఇయ్యిమంటలేడు - తను సంపాదించే దాట్ల వాటా పెంచుమంటండు? ఇది తనొక్కని సంగతిగాదు - పనిచేసే వాళ్లందరిది....

                ‘పోరాడాలె - సాధించుకోవాలె’ - కమినిష్టోల్లంటరు. మల్ల శాంతితోని పనులు జేసుకోవాలెనంటడు లీడరు - వాళ్లు వాళ్లొక్కటి గాదుగదా? అనవసరంగా లంపాటకంల ఇరుక్కుంటలేను గదా! ఏమో సాయంజేత్తమంటండ్లు! ఉత్తగెందుకు జేత్తరు? ఈడ గెలుస్తే ఇగో మేం కొట్లాడి సాధించినమంటరు? దొరకు ఈడపొక్క బొడుత్తే బాయిల మీద ఈల్ల యూనియన్‍లో ఎక్కువ మంది చేరుతారు. చందాలు వసూలు జేసుకుంటరు - పోనీ ఆని లాభమానిది - మా లాభం మాది - వాళ్లిద్దరికి బడది. గదాని మూలకంగా మాకింత లాభమైతే ఆయింక ఎవడే గంగల పోతేంది? కమినిట్టోల్లు మా ఎనుకుంటే దొరోనికి బాయిల కాడ దెబ్బత్తదని ఇసారంజేసి ఏమన్న పెంచక పోతడా? ఎట్లనో గట్ల సత్తవడుత ఈదుకత్తా మంటె ధరలు మండిపోవట్టే - ఏడికి సాల్త లేదాయె నీతల్లి - కాలేర్లమీద పచ్చిపియ్యి బంగారం - అందిన కాడికి ఎవడు గొరుక్కునేది ఆడు గొరుక్కుంటరు. అడిగే నాధుడు లేడు...నిన్నగాక మొన్న ఓటల్ల  సిప్పలు గడిగిన రామసాని గాడు బంగుళ గట్టె - బాయిల పనిసేసి నోడు - మీది పనిచేసినోడు - బిల్లింగ్‍ పనిచేసినోడు ఆఖరుకు మా లోడర్లు - అందరు లెక్కలు బెట్టుకుంటె అల్లి కల్లి సున్నకు సున్న - సేతుల పైసుండది - ఏదన్న గండమత్తె సిక్కులోనింటి కురికి నూటికి పది రూపాల వడ్డి సొప్పున అందరు అప్పు తెచ్చుకునిరి. వాడు దొరోని ఏజెంటేనాయె. - మల్ల ఎవన్నడిగిన బజాట్ల నిలబడి గింత దొపుకమా అని తిడుతరు.  - కిటుకేడనో సమఝ్‍కాదు - తిరుపతి కూడు బర్కతిలేదంట - గీడి సొమ్ము పాపపు సొమ్ము...’’

                ఇట్లా ఆలోచిస్తూ టక్కున ఆగిపోయి చుట్టూ చూసిండు... అప్పుడు కూరగాయల మార్కెట్లో మధ్యన నిలబడ్డాడు - ఓ దుకాణంలోకి  వెళ్లి టమాటలు అడిగిండు - కిలో రూపాయి...ఓర్నియవ్వ టమాటలకే అర్ధబెడితె మిగతా ఏం దినుడు?’’ అనుకుంట పక్క దుకాణం ఆడమనిషి దగ్గరికి నడిచిండు - ఆమె ఒకటో రెండో మంచి టమాటలు గలిపి మిగతా కుళ్లినవి గలిపి కుప్పలు బెట్టింది - కుప్పకు పావలా అన్నది...కుప్ప సూత్తే  కిలో అయేటట్టున్నది - పావలిచ్చి వాసన గొట్టే కుప్ప సంచిలెత్తుకున్నాడు. వాడిపోయిన వంకాయలో పావుకిలో పావులిచ్చి తీసుకున్నాడు...

                వెనుదిరిగి రెండుగులేశాడు...‘‘అర్జీ మార్కెటు కొస్తివా?’’ఎవరిదో ఎరుకున్న గొంతే - చుట్టూచూసిండు సైకిలు  పట్టుకొని నరేందర్‍ పరమ ప్రశాంతంగా నోటి నిండా పానేసుకొని -పొడుగు సిగరెట్టు తాగుతూ చిన్నగా నవ్వుతూ...

                ‘‘కలువనే కల్సిండు’’ అనుకొని ‘‘ఔ సారు’’ పోబోతూ అర్జయ్య...

                ‘‘నేను వస్తన్న పా... కూరగాయలు మందలియ్య వశంగాదు - ఈ మురిగినయ్‍... వాడినయి కొనేబదులు గుడ్లు దినుడే మంచిది...’’

                ‘‘మావోళ్లు ఇంటికాడెదురు సూత్తండ్లు - సుట్టాలచ్చిండ్లు’’ అర్జయ్య వేగిరపడుతూ....

                ‘‘అయ్యో గట్లేగిరపడ్తెట్ల - గీడ సుత మొఖద్దమ్‍గ సూత్తెట్ల ఇగో సిగరెట్టు తాగుతావా?’’

                ‘‘తమరిదేమొ సైకిలాయె - నాదేమొ కాళ్లాయె! పొత్తు కుదరది - సిగలెటు నాకు పడది - నాకు బీడున్నది...’’

                జేబులనుంచి గణేశ్‍ బీడి తీసి ముట్టిచ్చిండు...

                ‘‘ఆగరాదు - సూడోయి...’’వెంటనడుస్తూ.

                ఇద్దరు నడుస్నున్నారు...

                ‘‘సూడు అర్జన్నా! మనం గతికి లేకనే గీడికచ్చినం. వింటన్నవా? మనం పనేడ దొరుకక పుచ్చిన కుక్కతీర్గ దిర్గుతే దొరే ఆదుకున్నడా? కనుక నా అనుభవ మేందంటే ఈ లోకంల ఎవని ఏడుపు ఎవనికి బట్టది...

                మందేడుపులన్ని మనకే కావాలంటే మన పని గోవిందే.  నేను నీ తీర్గనే ఎగిరిన- ఎనుకకు పారజూసుకుంటే నా భార్యకు  రయికె గుడ ్డగతిలేదు - మనది మనం జూసుకున్నంక - ఆయింక మంది...’’ ఆగి అర్జయ్య ముఖంలోకి పరిశీలనగా చూసి...

                ‘‘ఏంది నరేందర్‍ గిట్లమాట్లాడ్తండని అనుకోవచ్చు మన దొర సంగతి నీకు తెలియంది కాదు - దగ్గెరికి దీసిండంటే ఆనన్నం కుక్కలు దినాలె - నా సంగతే చూడు - దేవుని దయవలన...’’

                ‘‘మానం అమ్ముకోవాల్నంటవు’’అర్జయ్య

                ‘‘నేనట్లా అన్ననా? మీ కమినిస్టులే చెప్పుతారు - శ్రమ, శ్రమ విలువ ఏందేందో? అని - శ్రమ విలువ అంటే ఏందో ఎరికేనా? నా రక్తం గింత నీకు కొలిసమ్ముతన్న నువ్వు గింత నాకియ్యిమని... అంటే తెలిసిందా? నువ్విప్పుడు కూరగాయలు గొన్నవే - గట్లనే మనల్ని మనం అమ్ముకోవడం - విన్నవా? కొనుడు అమ్ముడున్నంక - మార్కెట్ల ఏదున్నోడు అదమ్ముకుంటడు - ఏదిగావాల్సినోడు అది కొనుక్కుంటడు - వింటన్నవా? ఒకడు నెత్తురమ్ముకుంటె - ఇంకొడు మాటమ్ముకుంటడు ఇవి రెండు    లేనోళ్లు ఉన్నదమ్ముకుంటరు.. ఆడిది మానమమ్ముకుంటది. గిందట్ల రెండో వాని సంగతే లేదు తెల్సిందా?’’

                ‘‘ఇంతకూ నువ్వే మంటవు సారు నాకవతల పనున్నది...’’

                ‘‘గట్ల ఉరుకు లాడ్తె నీయిష్టం.. పట్నంల దొరకు పనైపోయి రెండు గంటల కొచ్చిండు - కరీంగానిది బద్దీమాకు. ఆడు లేబరు మీద పనికి రాడు -ఏదో పీకులాట తెస్తడు.  అదిగాక టాకీసుకాడ తాగి తడిసి లేబరోల్లు లొల్లి చేస్తండ్లు. ఆడికి వాన్ని మారుద్దాం...మీద్దాంట్లనే ఎవడన్నా ఉంటే చూడు. మొఖద్దమ్‍ చేద్దామన్నడు..ఈ పీకులాటేందుకు?’’

                ‘‘సాలు సాలయ్య... సారు! మాలోడర్లు పెండ్లామాలు దిడ్తరు...’’

                ‘‘ఊ అను నేను సూసుకుంట’’

                ‘‘ఇప్పుడు గాంకన్కన్నవుగని - నేను కట్టం జేసి బతికి నోన్ని మాటలు నేసిగాదు.. నీ తీరుగ నేను మాటలమ్ముకోను...’’

                ‘‘నీకు ముదిరింది కమినిష్టు పిచ్చి’’

                ‘‘సారు నాకు గయ్యన్ని దెలువయి - ఆళ్లేంపీకి పెట్టలే - మీరేం పీకి పెట్టలే....’’ అర్జయ్య రెండు చేతులెత్తి దండం బెట్టి చరాచరా నడిచాడు...

                ‘‘పులి పంజా దెబ్బ తాకుద్ది - నీయిష్టం...’’

                నరేందర్‍ పండ్లు గొరుకుతూ గొనగడం అర్జయ్యకు వినిపించింది.

                నరేందర్‍ ముఖం మాడిపోయింది.. కోపంగా సైకిలెక్కి సింగ్‍ ఇంటికి పోయాడు. అక్కడ చాలాసేపు క్రిష్ణారావుతో మాట్లాడిండు...చీకటైన తరువాత బ్రాండిషాపులోకి నడిచి పెగ్గుమీద పెగ్గు పోసిండు... కండ్లు మండుతన్నాయి. మాట తడబడుతోంది...అదే బ్రాండి షాపులో ఎప్పటి నుంచో తాగుతున్న సారలి గ్యాంగు వద్దకు వెళ్లాడు...

                థర్డు షిప్టుకు రమ్మంటూ బాయిలమీది సైరను కూసింది - ఒక్క సైరన్‍తో పాటు ఎనకాముందుగా  అన్ని బాయిల మీద  మరిన్ని సైరన్లు కూశాయి. వీధిలో కుక్కలు మోరలెత్తి సైరన్‍తో పాటు మొరిగినయ్‍..

                సారలిగ్యాంగు బయటికొచ్చింది... అప్పుడు పదకొండు గంటలు. రాత్రి - బ్రాండి షాపులో కూర్చున్నతను జోగుతూ తలుపులు మూశాడు...

                సారలిగ్యాంగు ఎనిమిది మంది తప్పడ తప్పడ అడుగులేస్తూ చెట్లనీడల కింద గుడిసెల కేసి నడస్తున్నారు...

 

                                                             23

 

                మిట్ట మధ్యాహ్నం మరింక లోడర్లు అన్నాలకు దిగే సమయంలో నల్లటి పిల్లవాడొకడు సైకిలు మీదొచ్చిండు...

                ‘‘అర్జన్న మీదాంట్లనే పనిజేస్తడా?’’ అని అడిగిండు..

                చంద్రమొగిలి ‘‘అదే ఏమయ్యింది...? ఇయ్యల్ల పనికి రాలే...’’

                పిల్లవాడు సైకిలు దిగి  ఎండకు ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని ‘‘అర్జన్న రైలు కింద బడ్డడు’’ అన్నాడు...

                ‘‘ఏందేంది...?’’ అన్నరు కార్మికులు...

                పిల్లవాడు తను చూసిన సంగతి చెప్పిండు...

                ఎక్కడి తట్టలక్కడే విడిచి, ఎక్కడి సెమ్మాసులక్కడే విడిచి లోడర్లు రైలుకట్టకేసి పరుగెత్తారు.. వాళ్లతోపాటు మొగిలి పరుగెత్తాడు...

                వాళ్లు అర్జయ్య చనిపోయిన దగ్గరికి చేరుకునే సరికి అక్కడ అప్పటికే చాలా మంది పోగై ఉన్నారు.. మొఖద్దమ్‍లు   ఉన్నారు... రాఘవులు ఏడుపు గొంతుతో ఏదో అంటండు.  కుదిమట్రంగా ఉన్న ఇన్సెపెక్టరు మరో నలుగురు పోలీసులు నాన్ని శవం దగ్గరికి రాకుండా కర్రలతో అటకాయిస్తున్నారు...

                అర్జయ్య భార్య చెదిరిన వెంట్రుకలతో పిచ్చిదానిలా మాలు లేకుండా ఏడుస్తోంది...

                ఇన్‍స్పెక్టరును రాఘవులు ఏదో అడిగిండు.

                ‘‘మనం శవాన్ని తీయడానికి వీల్లేదు...ఇది సివిల్‍కు సంబంధించిన కేసుగాదు -- రైల్వే పోలీసులది...’’

                ‘‘వాళ్లెప్పుడొస్తారు...?’’ రాఘవులు...

                ‘‘కాగజ్‍నగర్‍ నుంచి రావాలి- అంతదాకా ముట్టటానికి వీల్లేదు...’’

                మొగిలి జనాన్ని తోసుకొని ముందుకు పోయాడు.  రైటు పట్టాల పక్క రెండు కాల్లు తెగి - తల తెగి.. అర్జయ్య  భయంకరంగా చనిపోయాడు. అతని కళ్లు ఇంకా తెరిచే ఉన్నాయి...

                ‘‘రైలు కడ్డం బడితే ఒక్క నెత్తురు చుక్కన్న పట్టాల మీద లేదు’’ చంద్రమొగిలి గులిగినట్టుగా...

                నిజంగానే అక్కడ నెత్తురు మరకలు లేవు... కంకరమీద గినబడ్డదేమొనని చూద్దామంటే పోలీసులు రానియ్యటం లేదు...

                ‘‘ఏం కట్టమచ్చిందో?’’

                ‘‘పెండ్లాం గయ్యాలిదేమొ?’’

                ‘‘అప్పులైనయేమొ? మొన్న రామకిట్ట పురమట సోరోడే - తాగితాగి రెండు వేలప్పు జేసిండట - అండ్ల వెయ్యి సిక్కులోనికేనట - ఇంటి మీదికచ్చి పెండ్లమాలు దిట్టిపోయిండట. సారలిగాడు పెండ్లాన్ని ఇంటికొచ్చి ఖరాబు చేసిండట  - డబ్బెడు గ్యాసునూనె మీద గుమ్మరిచ్చుకొని అగి్గ బెట్టుకున్నడట - రామరామ ఆ సావు సూడవశంగాదు - మాడిమసి బొగ్గయి పోయిండు’’

                ‘‘ఏందో ఇయ్యల్లింట్ల రేపు మంట్లె?’’

                ‘‘సత్తరు.. దేనికో దానికి గిట్లనే సత్తరు..వానవ్వల కుక్కలుదెం - సావకుంటె సంపుతరు...’’ కాండ్రికిచ్చి ఉమ్మేసి ఒక ముసలివాడు దుమ్మును తన్నుతూ వెళ్లి పోయాడు...

                ఇట్లాగే ఎవరికి దోచిన మాటలాల్లు...

                రైల్వే జమెదారు అయిదు గంటలకొచ్చి రాత కోతలు సేసిండు...

                లోడర్లు అర్జయ్య శవంతోపాటు  పెద్ద ఊరేగింపు తీసిండ్లు.  ఊరేగింపు అంతకంతకు పెద్దదైంది.  వందలు వేలయ్యింది.  లోడర్లంతా కలిసి తలా కొంత వేసుకొని అర్జయ్యను దహనం చేశారు. చాలా మంది తాగిండ్లు.  మొగిలి తాగిండు. గప్పుడు చాలామంది ఏడ్చిండ్లు.  అంతూపొంతూ లేకుండ, పేరుపట్టకుండా తిట్టిండ్లు.  కమ్యూనిస్టు పార్టీ వాళ్లు పాటలు పాడిండ్లు.  నినాదాలిచ్చిండ్లు.  మొగిలి మెదడు పచ్చి పుండులాగున్నది. 

 

                                                              24

 

                రాత్రి ఎనిమిది గంటలకు యాపలకాడ  కమ్యునిస్టు పార్టీవాళ్లు సభబెట్టారు.. ఆ సభలో బాస్కర్రావు ...

                ‘‘కామ్రేడ్‍ అర్జయ్య ఈ దుష్టవ్యవస ్థకోరల్లో బలైపోయిన మరో కార్మికుడు...కామ్రేడ్‍ అర్జయ్యంటే బతుకలేక ఆత్మహత్య చేసుకున్న వాడుగానే లోకానికి తెలుసు...కాని కామ్రేడ్‍ అర్జయ్య తనతోటి కార్మికులను గిట్టుబాటు కూలికోసం సంఘటిత పరిచి రెండు రోజుల క్రిందనే - పెత్తందార్ల భూస్వాముల కబంధ హస్తాల కింద నలుగుతున్న బొగ్గు లోడింగ్‍ కార్మికులను సమ్మె చేయించాడు....కాంగ్రెసు నాయకులు కల్లబొల్లి  మాటలు చెప్పి’’

                 మధ్యలో గుంపులెక్కన్నో ‘‘కామ్రెడ్‍ అర్జయ్య’’ అని మొత్తుకున్నారు. భాస్కర్రావు తను ‘‘అమర్‍ హై’’ అన్నాడు.  మందిలో కొందరు ‘‘అమర్‍హై’’ అన్నారు. ఆ నినాదాలు ఆగగానే ఉపన్యాసం కొనసాగించాడు.

                ‘‘నాన్పుడు రాజుకీయాలతో ఆ సమ్మెను తాత్కాలికంగా ఆపారు.  కాని కామ్రేడ్సు! అమరుడు అర్జయ్య పోరాటాన్ని కొనసాగించి కూలిరేట్లు గిట్టేదాక విశ్రమించేది లేదని అందుకు మా తరుపున అనగా కమ్యూనిస్టు పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలందించగలమని మనవి చేస్తున్నాను. ప్రపంచ కార్మికులారా ఏకం కండని మన మార్క్సు మహాశయుడు ఎప్పుడో చెప్పాడు  పోరాడితే పోయేదేమి లేదు.  బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ ముగించాడు..

సైరన్ నవల  ఆరవ  భాగం 

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)

వెంకులుతో పాటు వచ్చిన మొగిలికి తమ వాళ్లెవరు అక్కడ కనిపించలేదు... బితుకు బితుకుగా మందిలో తిరిగారిద్దరు...

            ‘‘మనోలెవలు రాలేదేంది ఎంకన్న’’ అన్నాడు మొగిలి...

            వేదిక మీద మరో నాయకుడు అర్జయ్య కుటుంబానికి సానుభూతి ప్రకటించాడు..

            అంతా చీకటిచీకటిగా ఉన్నది.

            వెంకులు మొగిలి చెయ్యి బట్టుకొని బయటకు తీసుకొచ్చాడు...రోడ్డుమీద మైసయ్య అనే లోడరు హడావిడిగా సైకిలు మీద పోవడం చూసి ఆపిండ్లు...

            ‘‘అరె మీరంతా గీడున్నరా? మార్కెట్ల మీటింగు దొరచ్చిండట...’’ అన్నాడు మైసయ్య...

            మొగిలి వెంకులు మార్కెటుకేసి నడిచారు...

            మార్కెట్ల్లో అట్లాంటిదే సభ...

            భారీగా లైట్లు పెట్టారు.  ఎత్తుగా వేదిక కట్టారు.

            వేదిక మీద క్రిష్ణారావు చెంపకు చెయ్యానించుకొని తన తమ్ముడో బామ్మర్దో చచ్చినంత విషాదంగా కూర్చున్నాడు -మైకు ముందు రాఘవులు నిలబడి చేతులు తిప్పుతూ...

            ‘‘అర్జయ్య గురించి ఏమని చెప్పాలె...ఎప్పుడో పదేండ్ల కింద మాట - చిరిగిన మాసిన బట్టలతో అడివిలో  తప్పిపోయినెద్దులాగా నాదగ్గరి కొచ్చిండు.  అప్పటి నుంచి ఇప్పటి దాకాఏది నిన్న పోయేదాక, అర్జయ్య ఎవరితోని పోట్లాడినట్టుగాని నేనెరుగను...తన పనేందో తనేందో...అలాంటి అర్జయ్య మనల్ని విడిచి పెట్టిపోయినాడు..మానవునికి మరణం అతిసహజం...అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే - మట్టిసెత్త మనది...కుటుంబమన్న కాడ ఏవో తగాద లుంటాయి. అంత మాత్రాన రైలు కింద పడతమా? పానం దీసుకుంటమా? మీలాంటి నాలాంటి మొండి వాళ్లు నెగ్గుకు వస్తారు... మన దొర వారిని చూసిండ్లా! తన వర్కర్   పోయినందుకు ఎంత బాధపడి పోతున్నారో?’’ ఇట్లా మాట్లాడి మాట్లాడి - చెప్పిందే చెప్పి మరింక చెప్పడానికి ఏమిలేక మైకును వొదలలేక వొదిలాడు...

            క్రిష్ణారావు లేచి నిలడడ్డాడు..ఎక్కన్నుంచో చప్పట్లు, అందరు చప్పట్లు కొట్టారు...

            జీరబోయిన గొంతుతో ‘‘ కార్మికులారా! ఈ విశాద సమయంలో మాట్లాడడానికి నాదగ్గర మాటలు లేవు..నేను హైద్రాబాదులో ఉండగా ఈ వార్త తెలిసింది... నా కార్మికుడు పోయినందుకు నాకక్కడ ఒక్క నిముషం ఉండ బుద్దికాలేదు...ఎన్ని చెప్పినా! అర్జయ్య భార్యకు మాంగల్యాన్ని మళ్లీ యివ్వలేం... కాని నానుంచి అయ్యేది.. అర్జయ్య కుటుంబానికి వెయ్యిరూపాయలు విరాళం ప్రకటిస్తున్న... మీతో మీ అందరితో కష్టంలో సుఖంలో పనిచేశాడు కనుక మీరు ఏదన్న సహాయం చేయండి. మనందరం కలిసి అర్జయ్య కుటుంబాన్ని ఆదుకుందాం’’ అని ముగించి కూర్చున్నాడు...

            రాఘవులు లేచి...’’ కొందరు గిట్టని వాళ్లు దొర వారిని బదనాం చేయడానికి యూపలకాడ మీటింగు బెట్టినారని తెలిసింది... కార్మికుల పట్ల ఆయన ఔదార్యగుణాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లే అలాంటి తప్పుడు కూతలకు జవాబు చెప్పగలరని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు...’’ ఇదే ధోరణి...

            దుబ్బలో కూర్చుండి ఒళ్లంతా చెవులు చేసుకొని ఆశగా చూస్తున్న లోడింగ్‍ కార్మికుల కనుబొమ్మలు ముడుచుకున్నాయి...

            ‘‘సావగొట్టి సెవులు మూసిండ్లు వీనవ్వల...మన కూలి సంగతెవడు మాట్లాడడే..’’ అన్నాడు వెంకులు...

            ఎవడో ‘‘మాకు కూలిబెంచాలె’’ అని అరువబోయాడు...

            పక్కవాడు నోరుమూశాడు...‘‘అవు నాటకాడాటడంగ మద్దెలగాన్ని తేలుగుట్టినట్టు - గిక్కడద్దు’’ అన్నాడువాడు...

            కార్మికుల్లో గుసగుసలు, సనుగుడు...ఇంతలో ఎవడో బక్క పిలగాడు ఎర్ర కాయిదాలు పంచుతున్నాడు...సభలో కలకలం  మొగిలి కూడా వనికే చేతులతో ఆ కాయిదం తీసుకున్నాడు.. నిప్పులాగా కాయిదాన్ని పట్టుకొని చూశాడు.. చెంపలకు రాసుకున్నాడు.... పునికాడు ..జేబుల పెట్టుకున్నడు. కనిపిస్తున్నదేమొనని జేబుకేసి చూసుకున్నడు...

            మీటింగు చివరన నిలబడిన వాడెవడో చూపుడు వేలు చూయించి... ‘‘అర్జయ్యను చంపిచ్చింది నువ్వే. మళ్ల సాకునాలు మాట్లాడ్తన్నవా?’’ అన్నాడు...

            ‘‘ అర్జయ్య హత్యమీద విచారణ జరిపించాలె ’’ పిలగాడు మొత్తుకున్నాడు.

            మందిలో నుంచి కొంత మంది లేచొచ్చి అతని నోరు మూసి అవతలికి ఎత్తుక పోయారు...

            రాఘవులు మాట్లాడుతూనే ఉన్నాడు..నరేందర్‍ తదితర మొఖద్దమ్‍లు మందిలో చెదిరిపోయి కూర్చుండి అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూనే ఉన్నారు...కార్మికులందరిని గద్ద చూపులతో గమనిస్తున్నారు.

            మీటంగయి పోయింది... కార్మికులు చెదిరిపోయారు. రాత్రి పది గంటలు దాటింది - మొగిలి తనకు తెలిసిన ముఖంకోసం వెతుకుతూ రోడ్డుమీద నడుస్తున్నాడు. దుకాన్లు మూస్తున్నారు...

            మూలమీది టేల దగ్గరికొచ్చాడు - నల్లవాడు కూర్చున్నాడు. ఇతని కిద్దామా అనుకున్నాడు..‘‘నమ్మవశంగాదు’’ అనుకొని గుడిసెల్ల బడి నడిచాడు.. ఎంబడోల్ల ఇల్లచ్చింది.. వాకిట్లకు బోయి తొంగి చూశాడు.. ఎంబడోల్ల పిలగాడు ఏదో చదువుకుంటున్నాడు.. ఇంట్ల ఎవరున్నట్టులేదు..

            ‘‘ఏందే మొగిలన్న గింత నాత్రచ్చినవ్‍. మల్లా ఉత్తరమొచ్చిందా?’’ పిలగాడు...

            మొగిలి చప్పున కైనీడనుంచి పిలగాని దగ్గరికి నడిచి జేబులో నుంచి కరపత్రం తీసిచ్చిండు...

            ‘‘ఓ గిదా?’’ అన్నాడు పిల్లవాడు తనకు ముందే తెలుసునన్నట్టుగా...

            ‘‘ప్రియమైన కార్మికులారా!

            ఈ రోజు లారీ లోడింగ్‍ పనిచేసే అర్జయ్య అనే కార్మికుడు  రైలు పట్లాలదగ్గర చనిపోయిన సంగతి బస్తీ అంతా మసులుతోంది... అర్జయ్య పట్టాల దగ్గర చూసిన వారెవ్వరు ఇది ఆత్మహత్య అని నమ్మరు... ఎందుకంటే పట్టాల దగ్గర నెత్తురు చుక్కైనా లేదు.. అర్జయ్య ఒంట్లో నెత్తురు లేదా? అది ఎవరుతాగినట్టు? దొరా! దొర మొఖద్దమ్‍లా? కంపినా?

            అర్జయ్య  లోడింగ్‍ కార్మికులను గిట్టుబాటు కూలి యివ్వాలని సంఘటిత పరిచాడు.. ఒక ట్రక్కు నింపినందుకు ట్రక్కుకు రెండు  వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో  వాస్తవంగా ఆ రెండు వందల రూపాయలు  చెందాల్సిన లోడర్సుకు ఎనుభై రూపాయలు మాత్రమేయిచ్చి మిగతా దానిలో ఇరువై రూపాయలు మొఖద్దమ్‍లు తీసుకుంటున్నారు. దొర లారీకి వంద తీసుకుంటున్నాడు.   ఈ విధంగా రోజుకు సరాసరిగా నలుబై లారీలకన్నా ఎక్కువే లోడింగు చేస్తారు. ఎంతలేదన్న దొర ఆదాయం రోజుకు వేల రూపాయలు.  ఇందులో అందరు అధికారులకు వాటాలున్నాయి. ఈ ఆదాయం నికరంగా రావాలంటే అర్జయ్యలుండొద్దు....

            దొర పోలీసు అధికార్లకు డబ్బు పడేసి ఇది ఆత్మహత్యగా రిపోర్టు రాయించారు...

            కనుక ఈ హత్యమీద విచారణ జరిపించాలనీ, దోషులను శిక్షించాలనీ - అలా చేయని పక్షంలో ప్రజలే ప్రజాశత్రువులను శిక్షించగలరని ఇందు మూలకంగా హెచ్చరిస్తూన్నాం...’’

            మొగిలి ముఖంలో నెత్తురు చుక్క లేదు...మొదట కాళ్లల్లో వనుకు - ఆ తర్వాత ఒంట్లో ఎక్కడో సల్లగా జరజర పాకినట్టు...

            ‘‘ఎవలు తమ్మీగిది రాసింది...’’ అన్నాడు  వనికే కంఠంతో...

            ‘‘రాడికల్స్’’ అని చదివాడు ఎంబడోల్ల పిల్లవాడు...

            ‘‘గాల్లదేమన్న యూనియనా? ఏడుంటరు?’’ అన్నాడు మొగిలి...

            ‘‘నీకే తెలువాలె.. గిది నీకెవలిచ్చిండ్లు?’’అన్నాడు ఎంబడోల్ల పిలగాడు బయటకు చూస్తూ...

            మొగిలి బయటకొచ్చి నిలుచున్నాడు...

            ఆకాశం తేటగున్నది.. చుక్కలు బిక్కుబిక్కుమంటూ ఇంకా వందగజాలు నడిస్తే ఇల్లు... నడుస్తున్నాడు.. ఆ సందు.. దూరంగా చీకట్లో ఉరేసుకొని సచ్చిన కాసిం గుడిసె దయ్యంలాగా...

            తలవంచుకొని తను గుడిసెకేసి తిరిగాడు...

 

                                                                25

 

            మొగిలి ఖాళీ టిపిన్‍ ఊపుకుంటూ నడుస్తున్నాడు.. ఇయ్యల్ల లారీలన్ని నాలుగ్గంటలకే లోడింగయి పోయినయ్‍. ఒకటి అరా వస్తదేమొనని ఆరింటి దాకా చూసి మరింక రావని - వచ్చినా తెల్లారే లోడ్‍ చేద్దామని లోడర్లు ఆనాటికి పని చాలించారు...

            ‘‘ఓ మొగిలన్న నేను సుత అత్తనుండు’’ అన్నాడు వెనుకనే ఈడ్చుకుంట వచ్చే వెంకులు..

            రోడ్డు సందడిగా కలకలలాడుతోంది... రోడ్డు కిరు పక్కల కొత్త దుకాండ్లు వెలిసినయ్‍...నార సంచుల మీద కూర్చున్న బేరగాళ్లు వచ్చిపోయే కార్మికులను పిలుస్తూ... ‘‘ఓ అన్న ఇగరా!.. మాల్‍ చూసి పో.. అగ్గువ...’’ అరుస్తున్నారు..

            కొందరు డ్యూటీలు దిగిన కార్మికులు బొక్క టోపీలు నెత్తులమీద బోర్లించుకొని ముచ్చట్లు బెట్టుకుంటూ బలవంతపు నవ్వులు నవ్వుతూ నడుస్తున్నారు. మరికొందరు తెల్లటి ధోతులు  కట్టుకొని పిలగండ్ల నెత్తుకొని పెండ్లాల వెంట బెట్టుకొని బేరాలు చేస్తున్నారు...పాతబట్టల వాళ్లు, కొత్త బట్టలవాళ్లు, పండ్లవాళ్లు, సోడాలవాళ్లు, కండ్లద్దాల వాళ్లు, పౌడరు డబ్బీల వాళ్లు, పూసలవాళ్లు, కప్పుసాసర్లవాళ్లు, బనీన్లమ్మేవాళ్లు, ఇట్లా ఎటుచూసిన కండ్లు తిరిగేపోయేటట్టు రోడ్డంతా మెరిసిపోతోంది - జనం కాళ్ల దుమ్ము, బొగ్గు పొయ్యిల పొగ కలిసి అలలుగా లేస్తోంది...

            బేరగాళ్లు అరుపులు, జనం అంతుపొంతులేని మాటలు, స్కూటర్లు బరబర, ట్రక్కుల డబడిబ,సైకిలు గంటలు, సినిమా టాకీసు రికార్డులు - జనం మాటలు గోలీసోడా, కీసుకీసులు -  అన్నీ కలిసి గందర గోళంగా ఉన్నది.

            వెంకులొచ్చి ఓరగా చిత్రంగా వచ్చిపోయే జనాన్ని చూస్తూ నిలుచున్న మొగిలిని జబ్బపట్టి ‘‘దా పోదాం ఏం సూత్తన్నవ్‍ - ఇయ్యల్ల  బొగ్గు బాయిల దిగేటోల్ల జీతాలరోజు - గీ ఒక్కరోజె మనోల్లు నవ్వేది...ఇంటన్నవా? ఇయ్యల్ల సూస్కో, కల్లు సారా దుకానంబ్రాండిషాపులు బరుపూర్‍ - రేపొద్దున సూస్కుంటే పిల్లి బట్టిన కోళ్లయితరు’’ వెంకులు....

            ఇద్దరు నడుస్తున్నారు.. నడిరోడ్డు మీద ఒక తల నెరిసిన కార్మికడు బొక్కటోపి వెల్లకిలా పట్టుకొని అందులో నోట్లను కుడి చేత అదిమి పట్టుకొని ...‘‘ పోతన్నయి. లేసి పోతన్నయ్‍ - జెరంత పట్టుకోండ్లి’’ అనుకుంట ఏడుస్తున్నాడు...

            ‘‘గు...వలుగ తాగిండు లమ్డికొడుకు’’ ఎవడో జబర్దస్తీగా రూపాయి నోట్లు తెల్ల వెంట్రుకల వాని జేబుల కుక్కి...

            ‘‘డోకిలికే నడువ్‍..’’ అని గళ్ల బట్టి దొబ్బిండు...

            ‘‘నీకేందిర...నీయవ్వ’’ తెల్లవెంట్రుకల వాడు సొలుగుతూ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు...

            మొగిలి మందిలో నడుస్తున్నాడు. ఉల్లిపొర చీరల వాళ్లు కులాసగా నవ్వుతూ రాక్కుంటనే పోతున్నారు. గోసులు బెట్టుకున్న ముద్ద సికలవాళ్లు బెదురు బెదురుగా ఓరోరగా నడుస్తున్నారు... ఆడోల్లను తాకడానికి కొందరు జులాయి వాళ్లు  అంగీల మీదిగుండి తీసి, చాతి విరుచుకుంటూ మందిలో నడుస్తున్నారు...

            ‘‘పక్కకు జరుగు...’’ వెంకులు మొగిలిని బయటకు లాగాడు...

            మందంతా దూరం తొలిగిండ్లు...ఒకడు చింత నిప్పుల్లాంటి ఎర్ర కళ్లున్నవాడు - చెవుల మీదికంటా వెంట్రుకలు పెంచి మందిలో నుంచి కనబడ్డాడు...

            ‘‘సారలిగాని గ్యాంగు’’ అన్నాడు వెంకులు.

            సారలిగాడనే గుండా వెనుక ఇంకా అయిదారుగురున్నారు. వాళ్లు అప్పటికే తాగున్నారు.   వాళ్లల్లో కొందరు రోడ్డు పక్క దుకాన్ల వాళ్ల దగ్గరిపోయి ఏదో మాట్లాడుతున్నారు - వాళ్లు సలాంలు బెడుతూ నోట్లు తీసియిస్తున్నారు.

            ‘‘దొర గుండగాళ్లు మామూల్లసూల్లు జేసుకుంటండ్లు..’’వెంకులు...

            వెనుకకు వెనుకకు చూస్తూ ఇద్దరు ముందుకు నడిచారు...నాలుగడుగులు వేశారో లేదో- కెవ్వున కేక విన్పించింది... గాలి దుమారం లేచినట్టు - సాయంత్రం పూట చింతమీద జేరిన గొర్రెంకల మందలోనికి పోరడు రాయిసిరినట్టు గొర్రె మందమీద తోడేలు బడ్డట్టు - లొల్లి...తొక్కుకుంట - గెబ్బడ గెబ్బడ ఉరుకులు పరుగులు... అంతా మూడు నిమిషాలే...

            ఉరుకులాగినయ్‍..లొల్లాగింది...టర్నింగ్‍దగ్గర... జనం కుప్పకూడిండ్లు - మొగిలి వెంకులు వెనుదిరిగి మంది మూగిన దగ్గరికొచ్చేసరికి - నడిమందలో...ఒక తెల్లటి దోతివాడు...‘‘అయ్యలారా! నా పెండ్లాన్ని గుంజుక పోయిండ్లు... ఆ లం...కొడుకు లెత్తుక పోయిండ్లు...’’ అరుస్తూ ఏడుస్తూ పిచ్చిలేచిన వానిలాగా మట్టిగీరుతూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు..

            మందిలో చప్పుడు లేదు. సారలిగ్యాంగు లేదు. మందికి అటువేపు ఇటువేపు లారీలాగినయ్‍...హారన్లు మోగుతున్నాయి...

            అయిదు నిమిషాలకు అమీన్  సాబ్  జీబులో పోలీసులొచ్చిండ్లు...ఏడిచే వాన్ని వెంట బెట్టుకొని ‘‘మాకానికాలో యహాంసే’’ అని కర్రలతోని జనాన్ని చెదరగొట్టిండ్లు..

            జనం చెదిరిపోయిండ్లు...దుకాన్ల వాళ్లు ‘‘అచ్ఛామాల్‍ హరేక్‍మాల్‍...మాల్‍దేఖనా?’’ అరుపులు...సోడాసీసాల కీసుకీసు సప్పుడు.

            వెంకులు మొగిలి చెయ్యిపట్టి గుంజిండు....పక్కకు తీస్కపోయిండు.

            మౌనంగా కొంత దూరం నడిచిండ్లు...‘‘వాళ్ల కొరితి కెయ్యాలె’’ అన్నాడు మొగిలి హఠాత్తుగా - వెంకులు ఆగిండు - అప్పుడు కరంటు బుగ్గ వెలుగు కింద మొగిలి మొఖం చూసిండు... కండ్లల్లో నీళ్లు...

            జవాబు చెప్పకుండా మరికొంత దూరం నడిచిన తరువాత రోడ్డు దిగిండ్లు - ‘‘గిదిక్కడ మామూలే...మొగిలీ.. గీడ ఏడ్వదలుచుకుంటె పుట్టెడు దు:ఖం  ఇంటన్నవా? గీడ గ గుండగాళ్లది, దొరలది, లుచ్చెలది, లఫంగులది రాజ్జెం.. ఆడెవడో దిక్కు మల్లోడు ఇయ్యల్ల పెండ్లాన్ని పోగొట్టుకున్నడు ఈన్ని ఠానాల తెల్లందాకుంచుతారు... వాళ్లు ఆ అక్కను రాత్రంతా సెరిచి రేపొద్దున ఇడిసి పెడ్తరు... మానవంతురాలైతే రేపొద్దున ఏ రైలుకట్టకాన్నో ఆమె శవం దొరుకుతది...లాపోతే గంతే...’’

            ‘‘పోలీసోల్లు పట్టుకోరా?’’

            ‘‘మల్ల రేపొద్దున ఆళ్లు గట్లనే గళ్లలెక్కిచ్చి తిరుగుతరు...కొత్తోడు గిన అమీను గాడత్తె పట్టుకుంటె దొరపోను జేసి ఇడిపిత్తడు...’’

            ‘‘అయితే పోలీసోల్లు ఇడువకుంటే..?’’

            ‘‘మళ్ల పని గంతే... నూటికి శెలుగ  తాబదలా చేస్తరు. లేకుంటె ఆనింటి మీన గుండాగాళ్లు బడ్తరు.. ఎవనికైనా పెండ్లాం పిల్లలుంటరు గదా! మొండెగాని తోని పెట్టుకునేటోడు మొండెగాడె గావాలే... ఈడికచ్చే అమీను గాళ్లంతా దొరకు దెలిసినోల్లె అత్తరు...’’

            ‘‘మరి గిదీని కుదరు లేదా?’’

            ‘‘దేనికున్నదని...మనోని అర్జయ్య గతేమైందో ఎరికేగదా! ఇబ్రహీంగాడు ఎన్నిమాటలు చెప్పిండు...నేను అర్జయ్యతోని ఇబ్రహీంను కలిసిన.

            ఉస్కో అన్నడు. దంగల్ల దిగినంక వాడు సెంగో బిళ్ల...అర్జన్న దొరికిపేండు.’’

            మొగిలి మాట్లాడలేదు...

            ‘‘గిది ఎప్పటినుంచి జరుగుతందో నాకు తెలువది కని నేనచ్చిన కాన్నుంచి గిసొంటియి సూత్తనే ఉన్న - ఆరం కింద అనుమాన్‍ బస్తిల మొగడు నాత్రి బజిలికి బోయినంక ఇంటిమీద బడి నోట్లె గుడ్డలు గుక్కి చెరిచిండ్లు...గీ గుండాగాళ్లే. గంతేనా? కల్లు, సారా, బ్రాండి తాగేటోడు మొదటి సీసా వీళ్లకు తీసిపెట్టాలి. పొద్దందాక తాక్కుంట తిరుగుతరు ఊరిమీద పడి. ఈడ గుడిసెలోల్లకు పాయకాన్లు లేవు.  ఆడోల్లంత పదిమంది గూడి చెట్లల్లకు పోయేటోల్లు.  సారలిగాడు మొదట లారీ లోడింగుల చేసేటోడు. ముఖద్దమ్  అయ్యిండు.  దొంగతనాలు చేసేటోడు.  ఓపారి జైలుకు పోయచ్చిండు.  మల్లచ్చినంక ఆనసంటోళ్లను పదిమందిని కుప్పేసుకొని ఆడోళ్లను చిడాయించుడు బెట్టిండు.  ఆడోళ్లు ఊకుంటరా? చెట్లల్లేసి దవడలు సదిరిండ్లు.  వీని గ్యాంగును దొర మల్ల దగ్గరికి దీసిండు.  దొర గసోంటోడే గదా!  ఇంకా ఎక్కువయ్యిండ్లు... బస్తీల పొంట తిరుగుడు ఆడోళ్లను గుంజుడు...తన్నులు దినుడు...ఎమర్జెన్సో గంగరాయో - గప్పుడు ఎదురులేకుంటయ్యిండ్లు.  సక్కగున్న అక్క బస్తీ దొరకబట్టి ఇంటికే పోయి ఖరాబు చేసేటోల్లు.  గిప్పుడు బజార్లోనే చేత్తండ్లు.  బస్తీలన్ని వనుకుతున్నాయి’’.

            ‘‘వానవ్వల గొడ్డలందుకొని రొండుగ నరుకుతే...’’

            ‘‘గదిజేత్తె మంచిగనే ఉండుగని ఎవడు జెయ్యాలె...? నువ్వు జేత్తవా?’’

            మొగిలి నక్కిల్లు దగ్గర బడ్డయి....

            ‘‘నిరుడు శంకర్రెడ్డని అమీన్‍ సాబచ్చిండు - పదిహేనొద్దుల దాకా ఉచ్చ దీటై మండింది...రాములవారి గుడి కాడ గిట్లనే పిట్టరు భార్య నెత్తుకపోతే - సారలిగాని గ్యాంగును ఠానాలేసి కొట్టిండట - కేసు బెట్టిండట - బేల్‍ దెచ్చుకున్నరు -ఆనాటి నాత్రే శంకర్రెడ్డి ఇంటి మీద బడి అమీన్‍ సాబు ముంగట్నె పెండ్లాన్ని ఆగమాగం జేసిండ్లు - ఆఖరుకు బిల్‍ పత్త లేకుంట బోయిండు...’’

            గుడిసెల్లకు బోయే అడ్డ తోవొచ్చింది. వెంకులు వెళ్లిపోయాడు -మొగిలి గుడిసె చేరేసరికి - లక్ష్మి బిక్కుబిక్కు మంటూ కూర్చున్నది... మొగిలి ముఖం చూసి లక్ష్మి బిత్తర పోయింది....

            ‘‘ఏంది మరిదీ గట్లున్నవ్‍...’’

            వనికే గొంతుతో జరిగింది చెప్పిండు...

            ‘‘బాయిలింట్ల పీన్గెల్ల ఆడిది బజార్ల దిరుగ వశమా? మొగ పుటుక బుట్టిండ్లు - గొంతికెలకచ్చె దాక తాగుడు పెండ్లాల గొట్టుడుగని - ఆళ్ల నాము నరుక నడిబజాట్ల దొరికిచ్చుకొని ఏ గాడ్ది  కొడుకన్నా పలుగజీరిండా?’’

            ‘‘అన్నింక రాలేదా?’’

            ‘‘ఇయ్యల్ల అన్న సత్తడో! అత్తడో! ఎవలకెరుక? దుబ్బల పడిపోయిండో - జీతాలు గద - ఎన్నో బ్రాండి షాపుల            కూకుండి -  తనసొంటి తాగుబోతుల కుప్పేసుకొని తాగుతండు గావచ్చు మొగిలీ!  నువ్వు సూత్తలేవా? ఈ బతుకు బతికే బదులు ఏ కయికిలి జేసుకొని బతికినా మేలు...’’ లక్ష్మి ముక్కు చీదింది...

            మొగిలి తలపట్టుకొని మంచంలో కూర్చున్నాడు...

            ‘‘నువ్వుతిని పందువురా? నాకు ఎప్పటి బాగోతమేనాయె...’’అన్నది...

            ‘‘నా కాకలయితలేదు...’’ మొగిలి పండుకున్నాడు...

            ‘‘బజార్ల ఏమన్న తిన్నవాతానం జేసి పండుకోరాదు... పెయ్యంత బొగ్గుగుడుతలేదా?’’

            ఆ మాట మొగిలి వినిపించుకోనేలేదు... లంచం యిచ్చిన మూడు వేల రూపాయలు - పెరడి గిర్వి - ఆడపిల్ల కేక...మొగిలి కిదంతా ఏమిటో అర్ధంకాలేదు....

            ఇంటెనుకకు పోయి సల్లటి నీళ్లు మీద కుమ్మరించుకున్నాడు.  పెయ్యంత పేరుకపోయిన బొగ్గుదుమ్ము. లోపల ఇడవారుతోంది...

 

                                                               26

 

            మార్చి నెలలో ఎండలు మండుతున్నాయి.  మండే ఎండల్లో లోడర్సు బొగ్గు లారీలు నింపుతూనే ఉన్నారు... చిటపొట లాడే ఎండలోపొగలు కక్కే ఎండలోబొగ్గు నెరుసులు చెమటతో కలిసి ఒళ్లంతా కంపరంగా ఉండగా లోడర్సు గొనుగుతాండ్లు ... వచ్చే డబ్బు సరిపోక ఇంటిదగ్గరి అశాంతి పనిమీద చూపెడుతారు..వాళ్లల్లో వాళ్లే తిట్టుకుంటారు. కసురుకుంటారు... ఊరు పేరు లేకుండా ఎవన్నో తిడుతారు...అప్పుడప్పుడు మరింక భరించలేక అర్జయ్య లాంటివాడు బయట పడతాడు...కల్లు సీసాకో మరిదేనికో ఆశించే ఏజెంట్లు, లోడర్ల లోనే ఉంటారు ... వార్తలు పొక్కుతాయి..అర్జయ్యలను గుంబనంగా చంపుతారు. మళ్లీ మామూలే...

            అలా మరో ఇరువై రోజులు గడిచిపోయాయి...మరో నలుగురు కార్మికులు తొలిగించ బడ్డారు... నలుగురు కొత్తవాళ్లు వచ్చారు...

            మిట్ట మద్యాహ్నం- బొగ్గు కుప్పకెగబడి బొగ్గుల్లాంటి కార్మికులు పని చేస్తున్నారు...రాయలింగు బొగ్గెత్తుతున్నాడు...కుప్పకింద భాగమంతా అయిపోయింది...మీది భాగం ఉన్నది...చిరాకుగా, కోపంగా సెమ్మాసు బొగ్గు కుప్పకు కుచ్చిండు   రాయలింగం - గలగల కుప్ప కూలింది...కుప్ప శిఖరంమీద పెళ్లలు దొర్లుతూ వచ్చి రాయలింగు కాళ్ల మీద పడ్డాయి.. అందరికి పాత బూట్లున్నాయి...ఎట్లాగో అట్లాగ బాయి కార్మికుల దగ్గర కొనుక్కున్న బాపతువే - రాయలింగు బూట్ల జత చిరిగి కొత్త జత బూట్లు దొరుకక బరికాళ్లతోనచ్చాడు...

            ‘‘అన్నన్న సత్తి’’ కూలబడి పోయిండు...

            నేలంతా నెత్తురే.. వేళ్లు కత్తిరించినట్టుగా అయిపోయాయి...ఎక్కడిపనక్కడ విడిచి కార్మికులంతా రాయలింగు చుట్టు మూగిండ్లు...

            ‘‘ఆనవ్వల..రోజుకు వేలకు వేలు దెం...వట్టిరి గాని మనకు బూట్లనేరా?’’ పానునగంటి పోచం అరిచిండు.

            ‘‘నా కొడుక్కు మంచిపనైంది...సాడుగొట్టు లమ్డికొడుకు గాదు - సావు..మేము గీడ ఏదన్న అనుకోను భయం - కొంటబొయి  దొర సెవులేత్తివి...నీకే గొంతికెలదాకా పెడుతడుండు...’’ అన్నాడింకొకడు....

            ‘‘నూతిల బడ్డోనిమీద నూర్రాళ్లన్నట్టు గిప్పుడు గవేందిరా?’’ చెంద్రమొగిలి...

            బొగ్గులోనుంచి రాయలింగును బయటకు తీశారు.  రక్తం కారిపోతోంది... ‘‘అయ్యయ్యో నెత్తురు పోతంది. గేరత్తది.  ఏదన్న కటు్ట కట్టండెహె ’’ యాకూబ్‍...

            ఎవడో ‘‘బొగ్గు పొడి దంచి పోయాల’’న్నాడు. 

            ‘‘అద్దద్దు గూడుకడ్తది..  గింతంత అయిడన్న లేకపాయె’’ నారాయణ.

            మొగిలి సర్రున చుట్టబట్ట చీరి రాయలింగు కాలుకు కట్టు గట్టిండు.  గుడ్డంతా రక్తంతో తడిసిపోయింది...

            ‘‘సత్తనే.... నేను బతుకనే...’’ రాయలింగు మూలుగుతుండు...

            ‘‘ఏం జూత్తర్రా- ఓ యిద్దరు సైకిలు మీద దవాఖానకు దీసుకుపోండ్లి...’’ చంద్రమొగిలి.

            కార్మికులు ఒకల మొఖాలొకరు చూసుకున్నారు...  ఎవల గ్యాంగుల  నుంచి పోవాలెచంద్రమొగిలి గ్యాంగులనుంచి  మొగిలి పోతనన్నడు.  కాని మొగిలికి సైకిలు తొక్కరాదు. 

            ‘‘రాయలింగని గ్యాంగోల్లే పోవాల’’న్నరు.

            ఆఖరుకు నర్సయ్య అనేవాడు తను తీసుకుపోత నన్నాడు.  అప్పుడు డబ్బుల సమస్య వొచ్చింది.  అందరి జేబులు వెతికితే పదిహేను రూపాయలు జమైనాయి.. నర్సయ్య, మొగిలి కలిసి రాయలింగును కంపినీ దవాఖానకు తీసుకుపోయారు.

            రాయలింగును తీసుకు పోయినంక మళ్ళీ పని సాగేసరికి పొద్దంగింది.

            వెంకులు మనసులో అనేక విచారాలు....

            సాయంత్రమైంది... మొగిలి, నర్సయ్య రాయలింగుకు కట్టుకట్టించి ఇంటి దగ్గర విడిచి వచ్చారు.  పనైపోయింది.

            లోడర్లు ఇండ్ల ముఖం పట్టారు.  రోడ్డు కవతల నీలగిరి చెట్లు పెండెలు పెండులుగా అప్పుడే పెరుగుతున్నాయి.  వెంకులుకు మొగిలికి దోస్తాని ఏర్పడ్డది.

            ‘‘యాపలకాన్నుంచి పోదామా?’’ అన్నాడు మొగిలి.  చాలామంది అటుకేసి నడుస్తున్నారు.

            ‘‘మనం బొయ్యేం చేస్తం- తాగేటోళ్ళు బోతరు...  నిజంగా ఆళ్లే అదృష్టవంతులు.. సౌ, దోసౌ యేసుకున్నరంటే లెల్లె పాటలు పాడుకుంట కుక్కలు మలుసుక పన్నట్టు పంటరు.  మొగిలి నా మొఖంలకు సూడు- నాకేది తెలిసి సావదు.  కని తెల్లందాక నిదుర బట్టది. తన్నంగతన్నంగ  గీడచ్చి పడ్డ.  మా వూల్లె మా అవ్వ ఒక్కతే ఉంటది.  మా అయ్య సచ్చినపుడు రెండెకరాల సేనుండె.  గద్దలు తన్నుక పోయినయి.  పోనీ మా అవ్వను గీడికి తీసుకద్దామంటే - నేను గీ మట్టిలనే పోతానంటది.  ఇంటికేమన్న పంపుదమంటే గీడ గీ బాగోతం...’’ వెంకులు నడుస్తున్నాడు.

            మొగిలికి చాలా చెప్పాలని ఉన్నది.  కాని మాట పెకలది.

            దూరంగా కొండలు కనిపిస్తున్నయి మసక మసకగా. ఆ కొండల కింద ఏవేవో పల్లెటూళ్లు...ఎత్తు వంపులున్న కాలి బాట మీద  నడుస్తున్నారు..  కొంత దూరం నడిచి సట్టున ఆగిపోయిండు వెంకులు.

            ఎడమ బాజుల నలుగురైదుగురు మనషులు తిరుగుతున్నారు.  అది పోగూడని డీ ఫిల్లరింగ్  జరిగిన  జాగా.  సుట్టూ ముళ్ల తీగ దడి - ఆ పక్కనే గుదిగుచ్చినట్టు గుడిసెలు.  ఆ జాగా డీ ఫిల్లరింగ్‍ జరిగి లోపటికి కూలిపోయింది.

            ‘‘ఏంది గాడ మనుషులు తిరుగుతాండ్లు?’’ మొగిలి.

            ‘‘ఎవల్లో ఏదో ప్లాన్‍  చేత్తాండ్లు.  గుడిసెలు గిన ఏసు కుంటరేమో?’’

            ‘‘నీకు సంత గుడిసున్నదా?’’

            ‘‘నాకు సంతగడిసా? కిరాయికున్న.  మరి నీకో?’’

            ‘‘నేనా మా సుట్టాలింటి దగ్గరుంటన్న...’’

            ‘‘మనం సుత ఏసుకుంటే బాగానే ఉండుగని- గుడిసంటే మాటలా? బొంగులు గావాలె.  తడుకలు గావాలె.  ఎంత లేదన్న ఇన్నూరు రూపాలు గావాలె’’ మొగిలి.

            ‘‘ఇన్నూరే గదా?’’

            ‘‘ఆడ ప్రమాదమంటరు.  కంపినోడచ్చి పీకేత్తడు..’’

            ‘‘అదే ఎందుకు, మరి జాగెక్కడున్నదిగుడిసెలు సూడు ఓటి మీదోటి ఎట్లున్నయోఓ గుడిసెల పన్నోని మొస ఇంకోని కినచ్చేటట్టు...’’

            ‘‘నీ తల్లి ఏ గులడిసెల ఎవడు సచ్చేది దెల్వది.  కంపినోడు కంపిన్ల పని చేసేటోనికి ఇల్లియ్యడు.   పెద్ద నౌకరి దొరలకేమో బంగుళాలు.  పోనీ కిరాయికో ఎట్లనో సత్తా మంటే ఇండ్లు లెవ్వు.  అంత కంపిని జాగేనాయె.  ఇల్లెవని కున్నది...?’’

            ‘‘మల్ల గట్లయితే సందున్నకాడ కట్టు కోకుంట ఏం జేత్తరు?’’

            ఇద్దరు అట్లా మాట్లాడుకుంటూ గుడిసెల్లో చొచ్చారు.  ఓ గుడిసె బయట పాత తట్టలు గట్టిన చిన్న జాగాలో ఒకామె స్నానం చేస్తోంది.  సాటేమి లేదు.  గుడిసెలు మోకా లెత్తులేవు.  బూడిద కుప్పలు చెత్తా చెదారం రోడ్లనిండా.  ఆ చెత్తలోనే  ఆ మసిలోనే పిల్లలు ఆడుకుంటున్నారు. 

            రైల్వేలైను దగ్గర నుండి బొగ్గు దొంగతనం చేసుకొచ్చే పోరగాండ్లు వెనకకు చూసుకుంట గుడిసెల కేసి నడుస్తున్నారు. 

            గుడిసెల్లో ఒకటే సందడి... ఎక్కడో ఏడుపు.  ఎక్కడో తిట్లు.  ఎక్కడో తాగుబోతు బూతుపాట.  కండ్లు కన్పించకుండా పొగ.  కమురు వాసన .. గుడిసెల ఆవల గాడుపు దుమారం పుట్టినట్టున్నది. కేకలు... గుడిసెల మీద కప్పిన అట్టముక్కలు ఎగురుతున్నాయి.  బూడిద దుమ్ము కప్పేసింది.

            వెంకులు, మొగిలి కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు.  ఎటూతోచక హోటల్‍ గుడిసెలో చొచ్చి నిలుచున్నారు.

            గాడుపు దుమారం హెచ్చింది.  గుడిసెల్లో కేకలు హెచ్చాయి.

 

                                                           27

 

            పిండార బోసినట్లుగా వెన్నెల. సాయంత్రం రేగిన గాలి దుమారం ఆగిపోయి గాలి బిగుసుక పోయింది.  ఉక్కపోత .. మొగిలి గుడిసె బయట వెల్లకిలా పండుకున్నాడు .   అతనికి బాయిల పని యాదికొచ్చింది.  ‘‘దొరుకుద్దో దొరుకదో.  రోజు పొద్దున లేత్తేనే లోడింగు పనికి బోవుడైతంది.  లీడర్లకు మల్లొక్కపారి కలువకపోతి.  ఏదన్న కాకపాయె.  ఈల్ల ఇంటి మీన బడి తిన బడితి.  ఎన్ని దినాలుండాలెరాజేశ్వరి యాదికొచ్చింది.  పన్నది గావచ్చు. ఎప్పుడు నౌఖరి దొరుకాలే, ఎప్పుడు తీసుకురావలె. ఏందో గీడికచ్చి తట్టుబడిపోతి.  ఉన్నదో లేందో దున్నుక  బతుకుతే  అయిపోవు... రూపాలు దెచ్చి ఆనికిచ్చి  ఇరుకున బడితి.  ఏ మొఖం బెట్టుకొని ఊళ్లెకు బోవాలె...’’ ఇట్లా మొగిలి ఆలోచనలు సాగుతున్నాయి...

            ‘‘గాలి  కగ్గిదల్గ...గింతన్న లేదు.  ఉబ్బరిచ్చి సత్తన్న’’ లక్ష్మి నిలువెల్లా చెమటకు తడిసి కొంగుతో విసురుకుంటూ బయటికొచ్చింది.

            ‘‘పన్నవా పిలడా?’’

            ‘‘లేదు వదినా..’’ మొగిలి మంచంలో లేచి కూర్చుంటూ.

            ‘‘మా సెల్లె యాదికచ్చిందా?’’ అన్నది లక్ష్మి నవ్వుతూ...

            ఇంతలోనే బాయిల మీదెక్కడో సైరన్‍ కూసింది.

            ‘‘మీ అన్న అచ్చే యాల్లయింది’’ అన్నది లక్ష్మి..

            మొగిలి తలవంచుకొని మంచంల కూర్చున్నాడు.

            ‘‘మొదట్ల మీ అన్న గిట్లనే నిదురబట్టక తండ్లాడెటోడు.  ఏమంట తాగుడలవాటయ్యిందో సచ్చినట్టు పంటడు.’’ లక్ష్మి అని కొంగుతో గాలిసురుకుంటూ కడప క్రింద కూర్చున్నది..

            ‘‘ఏమో అదినా చిక్కుల బడినట్టున్నది.  బాయి పని దొరకక పాయె.  అప్పు తెచ్చి రకం లీడరోనికిత్తిమి..’’ మొగిలి.

            ‘‘మా దొరుకుతది గప్పుడు కండ్లగాన్తవా?’’

            ‘‘గట్ల పరాయిదాని తీర్గ మాట్లాడ్తవ వదినా? తల్లిదండ్రి తీరుగ ఆదుకుంటండ్లు’’.

            ‘‘పరాయి దాన్ని కాదా? అయినా కాకున్న గీడ ఎవల కెవలు లేరు మరిదీ! ఒక తల్లి కడుపున బుట్టిన మా అక్కే! మరి సెల్లె బతికిందా సచ్చిందా అని తొంగన్న సూడదు.  నాకేమొ కాళ్లు సేతులు గట్టేసి గుడిసెల పారేసి నట్టుగున్నది.  తెల్లారి  లేసుడు.  కాకులోలె, గద్దలోలె నీళ్ళకోసం కొట్లాట.  డ్యూటీకి బొయ్యేదాక ఉరుకులు పరుగులు.  పోయినంక గుడిసెల ముక్కుతూ మూల్గుతూ పడుండుడు.  ఏ నాత్రికో మీ అన్నత్తడు.  గప్పగప్ప వాసన.  పెయ్యంత గొగ్గరిత్తది.  పంటే కుక్క తీర్గ పండి లాపోతే మీదబడి గొట్టె.   నా పెయ్యంత కాయగాసింది మరిదీ....’’ లక్ష్మి కంఠం వనికింది.

 

            ఆ ముచ్చట తప్పించాలని మొగిలి చిన్ననాటి సంగతు లెత్తుకున్నాడు.  ‘‘ఆ దినాలే బాగుండె కాదదినామనం ఆడిందాట పాడింది పాట. గిప్పటి పోరగాండ్లకు పాపం తీరికే లేదు.  ముడ్డికి పేగులేనోడు సుత ఏదో పనిజేయవట్టె.  మనం ఎన్నాటలాడేది?’’

            ‘‘ ఔ మరిదీ, నువ్వు గింతుండేది.  సీమిడిని ఎగపీల్చుకుంట మా యింట్ల తిర్గెటోనివి.  రాయేశ్వరి ఎట్ల మెచ్చిందిబ్బా!’’ అన్నది లక్ష్మి నవ్వుతూ.

            అట్లా చాలా సంగతులు మాట్లాడుకున్నారు.  లక్ష్మి పడిపడి నవ్వుతోంది.  ఎన్నో సంవత్సరాల నుంచి నవ్వుమొఖం ఎరుగనిదానిలా... ఆమె పైట ఒళ్లోకి జారిపోయింది.  చెమట కోసం జాకెట్టు హుక్కు  ఊడ దీసుకుందేమో వెన్నెల వెలుగులో ఛాతీ కన్పిస్తోంది.  మొగిలి ఇదేమి కనిపించకుండా చేతులు తిప్పుతూ ఏదో చెప్పుతున్నాడు.  సరిగ్గా అలాంటి సమయంలో శంకరయ్య వచ్చిండు.  అలసటగా కోపంగా చిరాకుగా ఇద్దరిని చూసిండు.  అతని ముఖం మరింత నల్లగయ్యింది.

            లక్ష్మి కొంగు సరి చేసుకొని నీల్లకుండ బయటపెట్టింది.   ఒక్క మాటన్నా మాట్లాడకుండా శంకరయ్య స్నానం చేసిండు.

            దీపం పెద్దది చేసి భోజనం పెట్టింది.  శంకరయ్య ముభావంగానే సగం తిని సగం అన్నంలోనే చేయి కడుక్కున్నాడు.

            ‘‘అయ్యయ్యో అట్లా ఉంచుతే ఏమయితది?’’ లక్ష్మి.

            శంకరయ్య దీపం వెలుగులో లక్ష్మి ముఖం చూసిండు.  లక్ష్మి ముఖంలో ఏ భావం లేదు.  కాని చెమటకు నుదుటి కుంకుంబొట్టు చెదిరున్నది..

            మొగిలికి ఇంకా నిదుర పట్టలేదు.

            లక్ష్మి  తను కొంత తిన్నది.  దీపం తగ్గిచ్చింది. శంకరయ్య మంచం పక్క సంచి బొంత పరుచుకొని పండుకున్నది.  శంకరయ్య చాలాసేపు కండ్లు తెరుచుకొనే ఉండి ‘‘అదినె మరిదికి బగ్గనే కుదిరింది’’ అన్నాడు కసిగా.  లక్ష్మి దిగ్గున లేచి భర్త ముఖంలోకి చూసింది.  ఆ కండ్లు తనెన్నడు సూడని కండ్లు.

            ‘‘ఇట్లనన్నా బతుకనియ్యవా? ఊకే ఉరిబెట్టరాదు పీడాబోతది.. నేనే తీసుకొచ్చిన్నా? నువ్వా? ’’ అన్నది.

            మొగిలికి ఈ మాటలు వినబడ్డాయి.  సలి పిడుగు మీద బడ్డట్టు వనికి పోయాడు.

            తన గుండె కొట్టుకోవడం తనకే విన్పిస్తోంది.  బయటెక్కడో కుక్కలు మొరుగుతున్నాయి.

            కాసేసటికి లక్ష్మి వెక్కిల్లు విన్పించాయి.

            ‘‘మరింక ఈడ సింగసానమేసి ఉండరాదు.  నా జాగల నేను ఏదన్నా సూసుకోవాలె’’ అనుకొని కండ్లు మూసుకున్నాడు మొగిలి.

 

                                                             28

 

            తెల్లారింది. ఉక్కిరి బిక్కిరి చేసే బొగ్గు పొగలు మనిషికి మనిషి కన్పియ్యకుంట మావురు గప్పినట్టున్నాయి.  ఆ పొగలనే వసుకూ వసుకూమని దగ్గుతూ ఆ కార్మిక బస్తీ మొత్తం తిట్లతో, అరుపులతో గోలగోలగా ఉంది.  ఉరుకులు పరుగులు మీదున్నది.

            రాత్రెడు నిద్ర బట్టిందో ఈ దగ్గులు, దనుసుడు ముక్కులు మండే పొగలకు కూడా లేవకుండా మొగిలి నిదురపోతున్నాడు.  చెంపల మీద సొల్లు కారంగా అడ్డదిడ్డంగా నులక మంచంలో గుర్రు కొడుతున్నాడు.

            శంకరయ్య ఏమి జరుగనట్టే ‘‘మొగిలి లే లే...పొద్దెక్కింది.  ఇయ్యల్ల డూటీకి బోవా?’’ అని ఊపి లేపిండు. 

            మొగిలి ఉలిక్కిపడి లేచి పక్క దులిపి మడతపెట్టి మంచం ఎత్తి గుడిసె చూరుకింద పెట్టిండు.

            ఆ దారంట నీళ్ల బిందెత్తుకొని వగలు పడుతూ పోతున్న పడుసుపిల్ల మొగిలి కండ్లల్లోకి ‘‘సంగతేందన్నట్టు’’ చూసి ముసి ముసి నవ్వుకుంటపోయింది.

            ‘‘వామ్మో దీని తెలివి తెల్లారి పోను - ఆడోల్లు కాలాంతకులు - ఎన్ని కనుక్కుంటరో?’’ - ఆదరాబాదరగా చెట్లల్లకు పోయచ్చి, పలకర పుల్లతోని పండ్లు తోమేటాల్లకు - ఎన్నడు లేందీ శంకరయ్య చూరుకింద మంచంల తీరిపారి కూసుండి, చాయ తాగుతే ‘‘ ఏమే...లచ్చిమీ మొగిలికి చాయ్‍ తే...’’ అన్నాడు.

            ఇందాకటి పిల్ల ఖాళీ బిందెతోటి పంపుకాడికి పోతూ - ‘‘తొవ్వల కట్టె బెట్టి తొక్కుకుమని - ఇద్దరుపోతులకు పోతులు తొవ్వలుంటెట్ల?’’ అన్నది.

            ‘‘పక్కనుంచి పోరాదు మరదలా? నీకడ్డ మత్తన్నమా?’’

            ‘‘మా పోతతీయ్‍ - బావో ఏందికత! డూటీకి పోవ?’’

            ‘‘ లే - నీకు ఇడెంబెడ్తామని ’’ శంకరయ్య....

            ‘‘మా అక్క ఎడ్డిది గన్క సేసుకున్నది.  ముకం అద్దంల సూసుకున్నవా?’’

            ‘‘నేను సూత్తగదాఎటువంటి మొగన్ని సేసుకుంటవో?’’ లక్ష్మి చాయ్‍ తెచ్చి చూరుకింద మొగని ముఖం పరిశీలనగా చూసింది.  మూమూలుగానైతే - పొద్గాల దానినోట్లే నోరేందుకు బెట్టినవ్‍ - దానికి తిక్కరేగిందంటే నిన్ను నన్ను ఉతికి ఆరేత్తది - అనేది.  గుడిసెలోకి వెళ్లింది.

            మొగిలి నిలబడే చాయ్‍ తాగిండు.  ‘‘ దా - కూసో మొగిలి’’ శంకరయ్య కొంచెం జరిగి చోటిచ్చాడు.  మొగిలి ముండ్ల మీద కూసున్నట్టు మంచంల కూర్చున్నాడు.

            శంకరయ్యకు తనమీద తనకే రోతగా ఉంది.  తాగింది దిగిపోయి మొదడంతా కోళ్లు తవ్విన పెంటలాగున్నది.  తాగినప్పుడే హుషారు, ఈ ఉతారు పొద్దందాకా వెంటాడుతూ ఉంటుంది.  గలీజుగా ఉంటుంది.  మరింక జన్మల తాగద్దనుకుంటరు.  మళ్ల సాయంకాలానికి పుర్రెల తాగుడు పురుగు మెసులుతది.  ఈ గడబిడంతా దూరం గొట్టి శంకరయ్య...‘‘ పేరు పెద్దిరికం చెప్పుల మోతైపోయింది గదా! ఆనవ్వ రాఘవులుగాన్ని నమ్ముకుంటే గీడికచ్చింది -   ఇయ్యల్లబొయ్యి నౌఖరిత్తడా! తీపుకున్న  పైసలలు పారేత్తడా అడిగత్త - అత్తగారూల్లె నల్ల మొకమైపాయె - గ  పైసలు ఎర్రజెండ భాస్కర్‍రావుకు పారేసినా గీ పాటికి పనైపోవు’’ అన్నాడు.

            ‘‘నాకు మంచిగనిపిత్తలేదు - అంత దుమాల్ల మోల్లెగున్నది’’ మొగిలి.

            ‘‘గట్లనే ఉంటది.  నాకిప్పటికీ మాపటేల్లకు సిమ్మం సీకటి కమ్ముకచ్చినట్లని పిత్తది.  గింతమంది గీడుండంగ దిక్కులేనికాడ అడివిల తప్పిపోయినట్టుగుంటది’’

            ‘‘ మీ యింట్ల ఎంతకాలముండాన్నే?’’

            ‘‘మొగిలీ! మేం పరాయోల్లమా? నేనంటే పరాయోన్ని గావచ్చుకని - లక్ష్మి మీ మేన వదినేనాయె.  నాదేమున్నదికర్సంతా  నీది నువ్వే పెట్టుకొనవడ్తివి...  గీడ మనకు మనం దిక్కుగాకపోతే - కోనాయెనేటోడుండడు... మొగిలీ! మన్నుల  మట్టిబెడ్డోలే రాత్రి పగలు  పాలేరుతనం జేసే నన్ను సాంబు సిన్నాయినే నాకు పిల్లను మాట్లాడి పెండ్లి జేసిండు. గాయింత మరుత్తనా?’’ శంకరయ్య.

            ‘‘ఈ మాటలు నిజంగానే అంటున్నడా? మనసులో మరేమన్నా ఉన్నదా?’’ అని మొకం చూసిండు మొగిలి...

 

            ‘‘తాగినప్పుడు - నేనేమన్న అంటే మనుసుల బెట్టుకోకు. రోజు నరాలు తిమ్మిరెక్కుతయి. మొసెల్లది.  గీ బాయిల పనిల సంపాయించే  సొమ్ము  పాపపు సొమ్ము. దక్కది. ఆడిచ్చి నట్టే ఇచ్చి - మళ్లీ గుంజుకోను కండ్లు సెదిరిపోయేటియన్నీ బజాట్ల  బెట్టిండ్లు - బాయిపైసలు బర్కతుండయి.  నా అసొంటోనికి పిల్లికి మెలతాడు తీర్గ - బీసకపోల్లు నూటికొక్కడో ఇద్దరో  పండ్లూటలు బట్టుకొని తినక తాగక సిట్టీలేసి - అడ్డీల కిచ్చి సంపాయిత్తరు. ఆళ్లకు పైస మీద కాయిస్  -   వానవ్వల పైస  బవురూపులది - సంపాయించి నెత్తిన బెట్టుక పోతమా? నా సిన్నతనంల ఆకట సచ్చిన - గిప్పుడు గొడ్డు కట్టం - తింటన్న.. తాగుతన్న - సూద్దాం - పిల్లాజెల్లా ...’’

            మామూలుగానైతే - లక్ష్మి తను ఏదో మాటనేది.  కాని ఆమెకు చెప్పరాని దు:ఖమేదో లోలోపల సుళ్లు తిరుగుతోంది.  మొగవాళ్లు చేసేటీయన్నీ చేసి - మీదికెళ్లి రంకు అంటగట్టి - పెత్తనం జేత్తరు.  మొద్దుబారిపోవాలె - ఈ బస్తీలో ప్రతి మొగోడు తన  భార్యను లంజెఅని తిట్టనోడు లేనేలేడు.  బయట ఏం పనిచేసికాల వడ్తరో - నవ్వుతరో తుళ్లుతరో - కని ఇంటికత్తె మాత్రం పొగసూరే బొగ్గు పెళ్లల్లాగా మొటమొటలాడుతుంటరు.  రాత్రయితే పెండ్లాను గుడిసెల సుట్టు తింపుకుంట కొట్టని మొగోడే లేడు.  ఇదో మాలోకం - ఇదో నరకం....

            లక్ష్మి బిందె తీసుకొని నీళ్ల పంపు కాడికి బయలుదేరింది...

            శంకరయ్యకు రెండో బజిలి - మామూలుగానైతే తయారూ బజారు మీద పడేటోడు. తల దిమ్మెక్కినట్టుగా ఉంది - కాళ్లు బార చాపుకొని కళ్లు మూసుకొని నులక మంచంలో పడుకున్నడు.

            మొగిలి డ్యూటీ బట్టలేసుకొని అప్పటికే తయారుగుంచిన టిఫిన్  తీసుకొని బజాట్ల కచ్చిండు...

            ఇరుకు సందులు - అందులో పందులు - పొద్దటి పూట నీళ్లకోసం ఆడవాళ్ల హడావిడి, అరుపులు - ఇంకా బొగ్గుపొగలు కరిగిపోయి ఎండ బయలెల్లనే లేదు.

            కొంచెం దూరంలో బురద గుంటలో నల్లా దగ్గర గుంపుగా ఆడవాళ్లు దుమదుమలాడే ముఖాలతో ‘‘జరుగు జరుగే - గొడ్డుటావు తీర్గ మీదికత్తన్నవ్‍ ’’ అన్నారెవరో?

            ‘‘దానికేంది ఇద్దరు మొగలు.  ఒకడు ఇంట్లుంటె మరొకడు డూటీలుంటడు’’ నల్లగా పొట్టిగా ఉన్నావిడ...

            లక్ష్మి చేతిలోని బిందె జారిపడ్డది. లక్ష్మి  ఆ బిందెతో ఆమె తల పగులగొడుతుందేమో అనుకున్నాడు.

            మొగిలి ఎవరో తరుముతున్నట్లుగా - తొవ్వలో కంటా పోసిన బొగ్గుపొయ్యిల బూడిద కుప్పలు తన్నుకుంటు తిరిగి చూడకుండా నడుస్తున్నాడు.

            కడుపుల తిప్పుతుంది - ‘‘ఆడోల్లకు నాలిక మీదనే మాటలు ఎందుకో? - పల్లెలగంతే’’ అనుకున్నాడు.

            గుడిసెలు దాటిండు. పెద్ద బజార్లకచ్చే సరికి మొస తిరిగినట్టయ్యింది -  మొదట యాపల కాన్నుంచి పోవాలనుకున్నడు.  ఇంతట్లకే  నిన్న గుడిసె కోసం చూసిన  జాగ మతికచ్చింది. ‘‘చేతుల  నూరునూటయాబయి రూపాయలున్నయి. ఇంటికాన్నుంచి ఇంకోనూరు దెచ్చుకుంటే - సిన్నదో పెద్దదో  గుడిసేసుకుంటే - ఈ కిరికిరి తప్పుద్ది - తన మూలంగా - శంకరన్న, లక్ష్మి వదినెకు కైలాటకాలు’’ అనుకున్నాడు మనసులో...

            నిన్న చూసిన జాగాలో అడ్డదిడ్డంగా - కొయ్యలు తడుకలు గట్టి పన్నెండు గుడిసెలు లేవనే లేసినయ్‍ - గుడిసెలు వెయ్యనే వేసిండ్లు గద’’ - కొంచెం దూరం నడిచేసరికి గుడిసెల ముందు తెల్ల బట్టలోల్లు ఏదో కాకిరి బీకిరి వదురుతండ్లు - వాళ్ల పక్క కాకి  బట్టల కంపినీ వాచ్ మండ్లు సేతుల్ల కట్టెలు బట్టుకొని - గుడిసెల కాడ నిలుసున్నరు - వాళ్ల పక్కనే అయిదుగురు పోలీసోల్లు – అమీన్  సాబ్ నిలబడి ‘‘ఆట్  బూట్ ’’ అని గరంగరంల తిరుగుతండ్లు - వాళ్లకు కొంచెం దూరంల బుల్ డోజర్  డుగ్ డుగ్  మని సప్పుడు చేత్తంది – డ్రైవర్  స్టీరింగు మీద చెయ్యేసుకొని ఉన్నడు.

            గుడిసెల ముందు ఆడమగ కార్మికులు, వాళ్ల భార్యలు, చిన్న పిల్లలు లైనుగా నిటుసుండి చేతులారుస్తూ సాపెనార్దాలు పెడుతున్నారు - ఈ గడబిడకు బిత్తిరి మొఖాలేసుకొని పిల్లలు భీరిపోయి నిలుసున్నరు.

            కార్మికులల్ల నుంచి ఒకాయన పోలీసు అమీన్‍ ముంగటికచ్చి పర్రుమని అంగీ చింపుకొని - నేల మీద మట్టితీసి తూర్పుకేసి విసిరేసిండు.

            ‘‘మీకే దమ్ముంటే - గరీబోల్లం, పనోల్లం, మా దిక్కు నిలబడి కంపినోన్ని అడుగాలె - బొగ్గుబాయిల అడివిల తుప్పల్ల బెట్టిండ్లు - మనుషులకు తిండి తిప్పలుంటయి.  పెండ్లాం పిల్లలుంటరు.  ఇండ్లు గావాలే - ఆడు కట్టియ్యాలే - ఆ సోయి లేదు. - దిక్కులేక వశపడక మేం తిప్పలు పడి గుడిసెలేసుకుంటే  పీకే సుండాదివయ్యాఇగో నా బొచ్చె మీన్నుంచి తోలిచ్చి కూలగొట్లుండయ్యా’’

            ‘‘అరే దేడ్‍ దిమాక్‍ గిది గోపచ్చిన ఏరియా కూలతది డేంజర్‍ జాగా ’’ - కంపెనీ తెల్ల బట్టలోడు.

            ‘‘సిపరాతి పిట్ట మంచి జాగా సూపెట్టవయ్యా కంపెనీ కట్టిచ్చిన క్వాటర్లుండుడుగాదు’’ - ఆడామె అరిచింది.

 

            ‘‘సత్తెసత్తిమి - కంపెనోడు  జాగా సూపెట్టమను’’ ఇంకొకడు.

            ‘‘గదంత మాకు దెల్వది - ఏజెంటుతోటి మాట్లాడుకోండ్లి – పర్మిషన్  తీసుకోండ్లి - గుడిసెలు కాదు బంగ్లాలు కట్లుకోండ్లి’’ ఇందాకటోడు.

            ‘‘ఏజెంటుగాన్ని గీడికి రమ్మనుపో’’ - మరొకడు.

            కంపెనీ వాచ్ మన్  అతని మీదికురికి పట్టుకున్నాడు - కొడుతరేమోననుకున్న అక్కడి వాళ్లు ఒక్క పెట్టున కంపెనీ వాళ్ల మీద పడ్డారు.  తెల్లబట్టలోల్ల బట్టలు చిరిగినయ్.

            పోలీసులు  కర్రలతోని పెడేల్లుపెడేల్లున కొడుతాండ్లు.  కొట్టుకోల్లు మొత్తుకోల్లు - కొందరు ఉరుకుతున్నారు.  తిట్లు...

            బుల్ డోజర్  కదిలింది.  పోలీసు అమీన్  బుల్  డోజర్  మీదికెక్కి పిస్టల్  తీసి కాల్చిపారేస్తాననిఅరుస్తున్నాడు.

            మొగిలికి కాళ్లు వనికినయ్. అక్కడి నుండి ఉరికిండు... వెనక్కిక తిరిగి చూసిండు.  బుల్ డోజర్  గుడిసెలను తొక్కుతోంది.

            గుండె కొట్టుకుంటోంది – బుల్ డోజర్ తన వెనుక బడి తరుముతున్నట్టుగానే ఉన్నది.

సైరన్ నవల  ఆరవ  భాగం 

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)

వెంకులుతో పాటు వచ్చిన మొగిలికి తమ వాళ్లెవరు అక్కడ కనిపించలేదు... బితుకు బితుకుగా మందిలో తిరిగారిద్దరు...

            ‘‘మనోలెవలు రాలేదేంది ఎంకన్న’’ అన్నాడు మొగిలి...

            వేదిక మీద మరో నాయకుడు అర్జయ్య కుటుంబానికి సానుభూతి ప్రకటించాడు..

            అంతా చీకటిచీకటిగా ఉన్నది.

            వెంకులు మొగిలి చెయ్యి బట్టుకొని బయటకు తీసుకొచ్చాడు...రోడ్డుమీద మైసయ్య అనే లోడరు హడావిడిగా సైకిలు మీద పోవడం చూసి ఆపిండ్లు...

            ‘‘అరె మీరంతా గీడున్నరా? మార్కెట్ల మీటింగు దొరచ్చిండట...’’ అన్నాడు మైసయ్య...

            మొగిలి వెంకులు మార్కెటుకేసి నడిచారు...

            మార్కెట్ల్లో అట్లాంటిదే సభ...

            భారీగా లైట్లు పెట్టారు.  ఎత్తుగా వేదిక కట్టారు.

            వేదిక మీద క్రిష్ణారావు చెంపకు చెయ్యానించుకొని తన తమ్ముడో బామ్మర్దో చచ్చినంత విషాదంగా కూర్చున్నాడు -మైకు ముందు రాఘవులు నిలబడి చేతులు తిప్పుతూ...

            ‘‘అర్జయ్య గురించి ఏమని చెప్పాలె...ఎప్పుడో పదేండ్ల కింద మాట - చిరిగిన మాసిన బట్టలతో అడివిలో  తప్పిపోయినెద్దులాగా నాదగ్గరి కొచ్చిండు.  అప్పటి నుంచి ఇప్పటి దాకాఏది నిన్న పోయేదాక, అర్జయ్య ఎవరితోని పోట్లాడినట్టుగాని నేనెరుగను...తన పనేందో తనేందో...అలాంటి అర్జయ్య మనల్ని విడిచి పెట్టిపోయినాడు..మానవునికి మరణం అతిసహజం...అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే - మట్టిసెత్త మనది...కుటుంబమన్న కాడ ఏవో తగాద లుంటాయి. అంత మాత్రాన రైలు కింద పడతమా? పానం దీసుకుంటమా? మీలాంటి నాలాంటి మొండి వాళ్లు నెగ్గుకు వస్తారు... మన దొర వారిని చూసిండ్లా! తన వర్కర్   పోయినందుకు ఎంత బాధపడి పోతున్నారో?’’ ఇట్లా మాట్లాడి మాట్లాడి - చెప్పిందే చెప్పి మరింక చెప్పడానికి ఏమిలేక మైకును వొదలలేక వొదిలాడు...

            క్రిష్ణారావు లేచి నిలడడ్డాడు..ఎక్కన్నుంచో చప్పట్లు, అందరు చప్పట్లు కొట్టారు...

            జీరబోయిన గొంతుతో ‘‘ కార్మికులారా! ఈ విశాద సమయంలో మాట్లాడడానికి నాదగ్గర మాటలు లేవు..నేను హైద్రాబాదులో ఉండగా ఈ వార్త తెలిసింది... నా కార్మికుడు పోయినందుకు నాకక్కడ ఒక్క నిముషం ఉండ బుద్దికాలేదు...ఎన్ని చెప్పినా! అర్జయ్య భార్యకు మాంగల్యాన్ని మళ్లీ యివ్వలేం... కాని నానుంచి అయ్యేది.. అర్జయ్య కుటుంబానికి వెయ్యిరూపాయలు విరాళం ప్రకటిస్తున్న... మీతో మీ అందరితో కష్టంలో సుఖంలో పనిచేశాడు కనుక మీరు ఏదన్న సహాయం చేయండి. మనందరం కలిసి అర్జయ్య కుటుంబాన్ని ఆదుకుందాం’’ అని ముగించి కూర్చున్నాడు...

            రాఘవులు లేచి...’’ కొందరు గిట్టని వాళ్లు దొర వారిని బదనాం చేయడానికి యూపలకాడ మీటింగు బెట్టినారని తెలిసింది... కార్మికుల పట్ల ఆయన ఔదార్యగుణాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లే అలాంటి తప్పుడు కూతలకు జవాబు చెప్పగలరని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు...’’ ఇదే ధోరణి...

            దుబ్బలో కూర్చుండి ఒళ్లంతా చెవులు చేసుకొని ఆశగా చూస్తున్న లోడింగ్‍ కార్మికుల కనుబొమ్మలు ముడుచుకున్నాయి...

            ‘‘సావగొట్టి సెవులు మూసిండ్లు వీనవ్వల...మన కూలి సంగతెవడు మాట్లాడడే..’’ అన్నాడు వెంకులు...

            ఎవడో ‘‘మాకు కూలిబెంచాలె’’ అని అరువబోయాడు...

            పక్కవాడు నోరుమూశాడు...‘‘అవు నాటకాడాటడంగ మద్దెలగాన్ని తేలుగుట్టినట్టు - గిక్కడద్దు’’ అన్నాడువాడు...

            కార్మికుల్లో గుసగుసలు, సనుగుడు...ఇంతలో ఎవడో బక్క పిలగాడు ఎర్ర కాయిదాలు పంచుతున్నాడు...సభలో కలకలం  మొగిలి కూడా వనికే చేతులతో ఆ కాయిదం తీసుకున్నాడు.. నిప్పులాగా కాయిదాన్ని పట్టుకొని చూశాడు.. చెంపలకు రాసుకున్నాడు.... పునికాడు ..జేబుల పెట్టుకున్నడు. కనిపిస్తున్నదేమొనని జేబుకేసి చూసుకున్నడు...

            మీటింగు చివరన నిలబడిన వాడెవడో చూపుడు వేలు చూయించి... ‘‘అర్జయ్యను చంపిచ్చింది నువ్వే. మళ్ల సాకునాలు మాట్లాడ్తన్నవా?’’ అన్నాడు...

            ‘‘ అర్జయ్య హత్యమీద విచారణ జరిపించాలె ’’ పిలగాడు మొత్తుకున్నాడు.

            మందిలో నుంచి కొంత మంది లేచొచ్చి అతని నోరు మూసి అవతలికి ఎత్తుక పోయారు...

            రాఘవులు మాట్లాడుతూనే ఉన్నాడు..నరేందర్‍ తదితర మొఖద్దమ్‍లు మందిలో చెదిరిపోయి కూర్చుండి అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూనే ఉన్నారు...కార్మికులందరిని గద్ద చూపులతో గమనిస్తున్నారు.

            మీటంగయి పోయింది... కార్మికులు చెదిరిపోయారు. రాత్రి పది గంటలు దాటింది - మొగిలి తనకు తెలిసిన ముఖంకోసం వెతుకుతూ రోడ్డుమీద నడుస్తున్నాడు. దుకాన్లు మూస్తున్నారు...

            మూలమీది టేల దగ్గరికొచ్చాడు - నల్లవాడు కూర్చున్నాడు. ఇతని కిద్దామా అనుకున్నాడు..‘‘నమ్మవశంగాదు’’ అనుకొని గుడిసెల్ల బడి నడిచాడు.. ఎంబడోల్ల ఇల్లచ్చింది.. వాకిట్లకు బోయి తొంగి చూశాడు.. ఎంబడోల్ల పిలగాడు ఏదో చదువుకుంటున్నాడు.. ఇంట్ల ఎవరున్నట్టులేదు..

            ‘‘ఏందే మొగిలన్న గింత నాత్రచ్చినవ్‍. మల్లా ఉత్తరమొచ్చిందా?’’ పిలగాడు...

            మొగిలి చప్పున కైనీడనుంచి పిలగాని దగ్గరికి నడిచి జేబులో నుంచి కరపత్రం తీసిచ్చిండు...

            ‘‘ఓ గిదా?’’ అన్నాడు పిల్లవాడు తనకు ముందే తెలుసునన్నట్టుగా...

            ‘‘ప్రియమైన కార్మికులారా!

            ఈ రోజు లారీ లోడింగ్‍ పనిచేసే అర్జయ్య అనే కార్మికుడు  రైలు పట్లాలదగ్గర చనిపోయిన సంగతి బస్తీ అంతా మసులుతోంది... అర్జయ్య పట్టాల దగ్గర చూసిన వారెవ్వరు ఇది ఆత్మహత్య అని నమ్మరు... ఎందుకంటే పట్టాల దగ్గర నెత్తురు చుక్కైనా లేదు.. అర్జయ్య ఒంట్లో నెత్తురు లేదా? అది ఎవరుతాగినట్టు? దొరా! దొర మొఖద్దమ్‍లా? కంపినా?

            అర్జయ్య  లోడింగ్‍ కార్మికులను గిట్టుబాటు కూలి యివ్వాలని సంఘటిత పరిచాడు.. ఒక ట్రక్కు నింపినందుకు ట్రక్కుకు రెండు  వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో  వాస్తవంగా ఆ రెండు వందల రూపాయలు  చెందాల్సిన లోడర్సుకు ఎనుభై రూపాయలు మాత్రమేయిచ్చి మిగతా దానిలో ఇరువై రూపాయలు మొఖద్దమ్‍లు తీసుకుంటున్నారు. దొర లారీకి వంద తీసుకుంటున్నాడు.   ఈ విధంగా రోజుకు సరాసరిగా నలుబై లారీలకన్నా ఎక్కువే లోడింగు చేస్తారు. ఎంతలేదన్న దొర ఆదాయం రోజుకు వేల రూపాయలు.  ఇందులో అందరు అధికారులకు వాటాలున్నాయి. ఈ ఆదాయం నికరంగా రావాలంటే అర్జయ్యలుండొద్దు....

            దొర పోలీసు అధికార్లకు డబ్బు పడేసి ఇది ఆత్మహత్యగా రిపోర్టు రాయించారు...

            కనుక ఈ హత్యమీద విచారణ జరిపించాలనీ, దోషులను శిక్షించాలనీ - అలా చేయని పక్షంలో ప్రజలే ప్రజాశత్రువులను శిక్షించగలరని ఇందు మూలకంగా హెచ్చరిస్తూన్నాం...’’

            మొగిలి ముఖంలో నెత్తురు చుక్క లేదు...మొదట కాళ్లల్లో వనుకు - ఆ తర్వాత ఒంట్లో ఎక్కడో సల్లగా జరజర పాకినట్టు...

            ‘‘ఎవలు తమ్మీగిది రాసింది...’’ అన్నాడు  వనికే కంఠంతో...

            ‘‘రాడికల్స్’’ అని చదివాడు ఎంబడోల్ల పిల్లవాడు...

            ‘‘గాల్లదేమన్న యూనియనా? ఏడుంటరు?’’ అన్నాడు మొగిలి...

            ‘‘నీకే తెలువాలె.. గిది నీకెవలిచ్చిండ్లు?’’అన్నాడు ఎంబడోల్ల పిలగాడు బయటకు చూస్తూ...

            మొగిలి బయటకొచ్చి నిలుచున్నాడు...

            ఆకాశం తేటగున్నది.. చుక్కలు బిక్కుబిక్కుమంటూ ఇంకా వందగజాలు నడిస్తే ఇల్లు... నడుస్తున్నాడు.. ఆ సందు.. దూరంగా చీకట్లో ఉరేసుకొని సచ్చిన కాసిం గుడిసె దయ్యంలాగా...

            తలవంచుకొని తను గుడిసెకేసి తిరిగాడు...

 

                                                                25

 

            మొగిలి ఖాళీ టిపిన్‍ ఊపుకుంటూ నడుస్తున్నాడు.. ఇయ్యల్ల లారీలన్ని నాలుగ్గంటలకే లోడింగయి పోయినయ్‍. ఒకటి అరా వస్తదేమొనని ఆరింటి దాకా చూసి మరింక రావని - వచ్చినా తెల్లారే లోడ్‍ చేద్దామని లోడర్లు ఆనాటికి పని చాలించారు...

            ‘‘ఓ మొగిలన్న నేను సుత అత్తనుండు’’ అన్నాడు వెనుకనే ఈడ్చుకుంట వచ్చే వెంకులు..

            రోడ్డు సందడిగా కలకలలాడుతోంది... రోడ్డు కిరు పక్కల కొత్త దుకాండ్లు వెలిసినయ్‍...నార సంచుల మీద కూర్చున్న బేరగాళ్లు వచ్చిపోయే కార్మికులను పిలుస్తూ... ‘‘ఓ అన్న ఇగరా!.. మాల్‍ చూసి పో.. అగ్గువ...’’ అరుస్తున్నారు..

            కొందరు డ్యూటీలు దిగిన కార్మికులు బొక్క టోపీలు నెత్తులమీద బోర్లించుకొని ముచ్చట్లు బెట్టుకుంటూ బలవంతపు నవ్వులు నవ్వుతూ నడుస్తున్నారు. మరికొందరు తెల్లటి ధోతులు  కట్టుకొని పిలగండ్ల నెత్తుకొని పెండ్లాల వెంట బెట్టుకొని బేరాలు చేస్తున్నారు...పాతబట్టల వాళ్లు, కొత్త బట్టలవాళ్లు, పండ్లవాళ్లు, సోడాలవాళ్లు, కండ్లద్దాల వాళ్లు, పౌడరు డబ్బీల వాళ్లు, పూసలవాళ్లు, కప్పుసాసర్లవాళ్లు, బనీన్లమ్మేవాళ్లు, ఇట్లా ఎటుచూసిన కండ్లు తిరిగేపోయేటట్టు రోడ్డంతా మెరిసిపోతోంది - జనం కాళ్ల దుమ్ము, బొగ్గు పొయ్యిల పొగ కలిసి అలలుగా లేస్తోంది...

            బేరగాళ్లు అరుపులు, జనం అంతుపొంతులేని మాటలు, స్కూటర్లు బరబర, ట్రక్కుల డబడిబ,సైకిలు గంటలు, సినిమా టాకీసు రికార్డులు - జనం మాటలు గోలీసోడా, కీసుకీసులు -  అన్నీ కలిసి గందర గోళంగా ఉన్నది.

            వెంకులొచ్చి ఓరగా చిత్రంగా వచ్చిపోయే జనాన్ని చూస్తూ నిలుచున్న మొగిలిని జబ్బపట్టి ‘‘దా పోదాం ఏం సూత్తన్నవ్‍ - ఇయ్యల్ల  బొగ్గు బాయిల దిగేటోల్ల జీతాలరోజు - గీ ఒక్కరోజె మనోల్లు నవ్వేది...ఇంటన్నవా? ఇయ్యల్ల సూస్కో, కల్లు సారా దుకానంబ్రాండిషాపులు బరుపూర్‍ - రేపొద్దున సూస్కుంటే పిల్లి బట్టిన కోళ్లయితరు’’ వెంకులు....

            ఇద్దరు నడుస్తున్నారు.. నడిరోడ్డు మీద ఒక తల నెరిసిన కార్మికడు బొక్కటోపి వెల్లకిలా పట్టుకొని అందులో నోట్లను కుడి చేత అదిమి పట్టుకొని ...‘‘ పోతన్నయి. లేసి పోతన్నయ్‍ - జెరంత పట్టుకోండ్లి’’ అనుకుంట ఏడుస్తున్నాడు...

            ‘‘గు...వలుగ తాగిండు లమ్డికొడుకు’’ ఎవడో జబర్దస్తీగా రూపాయి నోట్లు తెల్ల వెంట్రుకల వాని జేబుల కుక్కి...

            ‘‘డోకిలికే నడువ్‍..’’ అని గళ్ల బట్టి దొబ్బిండు...

            ‘‘నీకేందిర...నీయవ్వ’’ తెల్లవెంట్రుకల వాడు సొలుగుతూ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు...

            మొగిలి మందిలో నడుస్తున్నాడు. ఉల్లిపొర చీరల వాళ్లు కులాసగా నవ్వుతూ రాక్కుంటనే పోతున్నారు. గోసులు బెట్టుకున్న ముద్ద సికలవాళ్లు బెదురు బెదురుగా ఓరోరగా నడుస్తున్నారు... ఆడోల్లను తాకడానికి కొందరు జులాయి వాళ్లు  అంగీల మీదిగుండి తీసి, చాతి విరుచుకుంటూ మందిలో నడుస్తున్నారు...

            ‘‘పక్కకు జరుగు...’’ వెంకులు మొగిలిని బయటకు లాగాడు...

            మందంతా దూరం తొలిగిండ్లు...ఒకడు చింత నిప్పుల్లాంటి ఎర్ర కళ్లున్నవాడు - చెవుల మీదికంటా వెంట్రుకలు పెంచి మందిలో నుంచి కనబడ్డాడు...

            ‘‘సారలిగాని గ్యాంగు’’ అన్నాడు వెంకులు.

            సారలిగాడనే గుండా వెనుక ఇంకా అయిదారుగురున్నారు. వాళ్లు అప్పటికే తాగున్నారు.   వాళ్లల్లో కొందరు రోడ్డు పక్క దుకాన్ల వాళ్ల దగ్గరిపోయి ఏదో మాట్లాడుతున్నారు - వాళ్లు సలాంలు బెడుతూ నోట్లు తీసియిస్తున్నారు.

            ‘‘దొర గుండగాళ్లు మామూల్లసూల్లు జేసుకుంటండ్లు..’’వెంకులు...

            వెనుకకు వెనుకకు చూస్తూ ఇద్దరు ముందుకు నడిచారు...నాలుగడుగులు వేశారో లేదో- కెవ్వున కేక విన్పించింది... గాలి దుమారం లేచినట్టు - సాయంత్రం పూట చింతమీద జేరిన గొర్రెంకల మందలోనికి పోరడు రాయిసిరినట్టు గొర్రె మందమీద తోడేలు బడ్డట్టు - లొల్లి...తొక్కుకుంట - గెబ్బడ గెబ్బడ ఉరుకులు పరుగులు... అంతా మూడు నిమిషాలే...

            ఉరుకులాగినయ్‍..లొల్లాగింది...టర్నింగ్‍దగ్గర... జనం కుప్పకూడిండ్లు - మొగిలి వెంకులు వెనుదిరిగి మంది మూగిన దగ్గరికొచ్చేసరికి - నడిమందలో...ఒక తెల్లటి దోతివాడు...‘‘అయ్యలారా! నా పెండ్లాన్ని గుంజుక పోయిండ్లు... ఆ లం...కొడుకు లెత్తుక పోయిండ్లు...’’ అరుస్తూ ఏడుస్తూ పిచ్చిలేచిన వానిలాగా మట్టిగీరుతూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు..

            మందిలో చప్పుడు లేదు. సారలిగ్యాంగు లేదు. మందికి అటువేపు ఇటువేపు లారీలాగినయ్‍...హారన్లు మోగుతున్నాయి...

            అయిదు నిమిషాలకు అమీన్  సాబ్  జీబులో పోలీసులొచ్చిండ్లు...ఏడిచే వాన్ని వెంట బెట్టుకొని ‘‘మాకానికాలో యహాంసే’’ అని కర్రలతోని జనాన్ని చెదరగొట్టిండ్లు..

            జనం చెదిరిపోయిండ్లు...దుకాన్ల వాళ్లు ‘‘అచ్ఛామాల్‍ హరేక్‍మాల్‍...మాల్‍దేఖనా?’’ అరుపులు...సోడాసీసాల కీసుకీసు సప్పుడు.

            వెంకులు మొగిలి చెయ్యిపట్టి గుంజిండు....పక్కకు తీస్కపోయిండు.

            మౌనంగా కొంత దూరం నడిచిండ్లు...‘‘వాళ్ల కొరితి కెయ్యాలె’’ అన్నాడు మొగిలి హఠాత్తుగా - వెంకులు ఆగిండు - అప్పుడు కరంటు బుగ్గ వెలుగు కింద మొగిలి మొఖం చూసిండు... కండ్లల్లో నీళ్లు...

            జవాబు చెప్పకుండా మరికొంత దూరం నడిచిన తరువాత రోడ్డు దిగిండ్లు - ‘‘గిదిక్కడ మామూలే...మొగిలీ.. గీడ ఏడ్వదలుచుకుంటె పుట్టెడు దు:ఖం  ఇంటన్నవా? గీడ గ గుండగాళ్లది, దొరలది, లుచ్చెలది, లఫంగులది రాజ్జెం.. ఆడెవడో దిక్కు మల్లోడు ఇయ్యల్ల పెండ్లాన్ని పోగొట్టుకున్నడు ఈన్ని ఠానాల తెల్లందాకుంచుతారు... వాళ్లు ఆ అక్కను రాత్రంతా సెరిచి రేపొద్దున ఇడిసి పెడ్తరు... మానవంతురాలైతే రేపొద్దున ఏ రైలుకట్టకాన్నో ఆమె శవం దొరుకుతది...లాపోతే గంతే...’’

            ‘‘పోలీసోల్లు పట్టుకోరా?’’

            ‘‘మల్ల రేపొద్దున ఆళ్లు గట్లనే గళ్లలెక్కిచ్చి తిరుగుతరు...కొత్తోడు గిన అమీను గాడత్తె పట్టుకుంటె దొరపోను జేసి ఇడిపిత్తడు...’’

            ‘‘అయితే పోలీసోల్లు ఇడువకుంటే..?’’

            ‘‘మళ్ల పని గంతే... నూటికి శెలుగ  తాబదలా చేస్తరు. లేకుంటె ఆనింటి మీన గుండాగాళ్లు బడ్తరు.. ఎవనికైనా పెండ్లాం పిల్లలుంటరు గదా! మొండెగాని తోని పెట్టుకునేటోడు మొండెగాడె గావాలే... ఈడికచ్చే అమీను గాళ్లంతా దొరకు దెలిసినోల్లె అత్తరు...’’

            ‘‘మరి గిదీని కుదరు లేదా?’’

            ‘‘దేనికున్నదని...మనోని అర్జయ్య గతేమైందో ఎరికేగదా! ఇబ్రహీంగాడు ఎన్నిమాటలు చెప్పిండు...నేను అర్జయ్యతోని ఇబ్రహీంను కలిసిన.

            ఉస్కో అన్నడు. దంగల్ల దిగినంక వాడు సెంగో బిళ్ల...అర్జన్న దొరికిపేండు.’’

            మొగిలి మాట్లాడలేదు...

            ‘‘గిది ఎప్పటినుంచి జరుగుతందో నాకు తెలువది కని నేనచ్చిన కాన్నుంచి గిసొంటియి సూత్తనే ఉన్న - ఆరం కింద అనుమాన్‍ బస్తిల మొగడు నాత్రి బజిలికి బోయినంక ఇంటిమీద బడి నోట్లె గుడ్డలు గుక్కి చెరిచిండ్లు...గీ గుండాగాళ్లే. గంతేనా? కల్లు, సారా, బ్రాండి తాగేటోడు మొదటి సీసా వీళ్లకు తీసిపెట్టాలి. పొద్దందాక తాక్కుంట తిరుగుతరు ఊరిమీద పడి. ఈడ గుడిసెలోల్లకు పాయకాన్లు లేవు.  ఆడోల్లంత పదిమంది గూడి చెట్లల్లకు పోయేటోల్లు.  సారలిగాడు మొదట లారీ లోడింగుల చేసేటోడు. ముఖద్దమ్  అయ్యిండు.  దొంగతనాలు చేసేటోడు.  ఓపారి జైలుకు పోయచ్చిండు.  మల్లచ్చినంక ఆనసంటోళ్లను పదిమందిని కుప్పేసుకొని ఆడోళ్లను చిడాయించుడు బెట్టిండు.  ఆడోళ్లు ఊకుంటరా? చెట్లల్లేసి దవడలు సదిరిండ్లు.  వీని గ్యాంగును దొర మల్ల దగ్గరికి దీసిండు.  దొర గసోంటోడే గదా!  ఇంకా ఎక్కువయ్యిండ్లు... బస్తీల పొంట తిరుగుడు ఆడోళ్లను గుంజుడు...తన్నులు దినుడు...ఎమర్జెన్సో గంగరాయో - గప్పుడు ఎదురులేకుంటయ్యిండ్లు.  సక్కగున్న అక్క బస్తీ దొరకబట్టి ఇంటికే పోయి ఖరాబు చేసేటోల్లు.  గిప్పుడు బజార్లోనే చేత్తండ్లు.  బస్తీలన్ని వనుకుతున్నాయి’’.

            ‘‘వానవ్వల గొడ్డలందుకొని రొండుగ నరుకుతే...’’

            ‘‘గదిజేత్తె మంచిగనే ఉండుగని ఎవడు జెయ్యాలె...? నువ్వు జేత్తవా?’’

            మొగిలి నక్కిల్లు దగ్గర బడ్డయి....

            ‘‘నిరుడు శంకర్రెడ్డని అమీన్‍ సాబచ్చిండు - పదిహేనొద్దుల దాకా ఉచ్చ దీటై మండింది...రాములవారి గుడి కాడ గిట్లనే పిట్టరు భార్య నెత్తుకపోతే - సారలిగాని గ్యాంగును ఠానాలేసి కొట్టిండట - కేసు బెట్టిండట - బేల్‍ దెచ్చుకున్నరు -ఆనాటి నాత్రే శంకర్రెడ్డి ఇంటి మీద బడి అమీన్‍ సాబు ముంగట్నె పెండ్లాన్ని ఆగమాగం జేసిండ్లు - ఆఖరుకు బిల్‍ పత్త లేకుంట బోయిండు...’’

            గుడిసెల్లకు బోయే అడ్డ తోవొచ్చింది. వెంకులు వెళ్లిపోయాడు -మొగిలి గుడిసె చేరేసరికి - లక్ష్మి బిక్కుబిక్కు మంటూ కూర్చున్నది... మొగిలి ముఖం చూసి లక్ష్మి బిత్తర పోయింది....

            ‘‘ఏంది మరిదీ గట్లున్నవ్‍...’’

            వనికే గొంతుతో జరిగింది చెప్పిండు...

            ‘‘బాయిలింట్ల పీన్గెల్ల ఆడిది బజార్ల దిరుగ వశమా? మొగ పుటుక బుట్టిండ్లు - గొంతికెలకచ్చె దాక తాగుడు పెండ్లాల గొట్టుడుగని - ఆళ్ల నాము నరుక నడిబజాట్ల దొరికిచ్చుకొని ఏ గాడ్ది  కొడుకన్నా పలుగజీరిండా?’’

            ‘‘అన్నింక రాలేదా?’’

            ‘‘ఇయ్యల్ల అన్న సత్తడో! అత్తడో! ఎవలకెరుక? దుబ్బల పడిపోయిండో - జీతాలు గద - ఎన్నో బ్రాండి షాపుల            కూకుండి -  తనసొంటి తాగుబోతుల కుప్పేసుకొని తాగుతండు గావచ్చు మొగిలీ!  నువ్వు సూత్తలేవా? ఈ బతుకు బతికే బదులు ఏ కయికిలి జేసుకొని బతికినా మేలు...’’ లక్ష్మి ముక్కు చీదింది...

            మొగిలి తలపట్టుకొని మంచంలో కూర్చున్నాడు...

            ‘‘నువ్వుతిని పందువురా? నాకు ఎప్పటి బాగోతమేనాయె...’’అన్నది...

            ‘‘నా కాకలయితలేదు...’’ మొగిలి పండుకున్నాడు...

            ‘‘బజార్ల ఏమన్న తిన్నవాతానం జేసి పండుకోరాదు... పెయ్యంత బొగ్గుగుడుతలేదా?’’

            ఆ మాట మొగిలి వినిపించుకోనేలేదు... లంచం యిచ్చిన మూడు వేల రూపాయలు - పెరడి గిర్వి - ఆడపిల్ల కేక...మొగిలి కిదంతా ఏమిటో అర్ధంకాలేదు....

            ఇంటెనుకకు పోయి సల్లటి నీళ్లు మీద కుమ్మరించుకున్నాడు.  పెయ్యంత పేరుకపోయిన బొగ్గుదుమ్ము. లోపల ఇడవారుతోంది...

 

                                                               26

 

            మార్చి నెలలో ఎండలు మండుతున్నాయి.  మండే ఎండల్లో లోడర్సు బొగ్గు లారీలు నింపుతూనే ఉన్నారు... చిటపొట లాడే ఎండలోపొగలు కక్కే ఎండలోబొగ్గు నెరుసులు చెమటతో కలిసి ఒళ్లంతా కంపరంగా ఉండగా లోడర్సు గొనుగుతాండ్లు ... వచ్చే డబ్బు సరిపోక ఇంటిదగ్గరి అశాంతి పనిమీద చూపెడుతారు..వాళ్లల్లో వాళ్లే తిట్టుకుంటారు. కసురుకుంటారు... ఊరు పేరు లేకుండా ఎవన్నో తిడుతారు...అప్పుడప్పుడు మరింక భరించలేక అర్జయ్య లాంటివాడు బయట పడతాడు...కల్లు సీసాకో మరిదేనికో ఆశించే ఏజెంట్లు, లోడర్ల లోనే ఉంటారు ... వార్తలు పొక్కుతాయి..అర్జయ్యలను గుంబనంగా చంపుతారు. మళ్లీ మామూలే...

            అలా మరో ఇరువై రోజులు గడిచిపోయాయి...మరో నలుగురు కార్మికులు తొలిగించ బడ్డారు... నలుగురు కొత్తవాళ్లు వచ్చారు...

            మిట్ట మద్యాహ్నం- బొగ్గు కుప్పకెగబడి బొగ్గుల్లాంటి కార్మికులు పని చేస్తున్నారు...రాయలింగు బొగ్గెత్తుతున్నాడు...కుప్పకింద భాగమంతా అయిపోయింది...మీది భాగం ఉన్నది...చిరాకుగా, కోపంగా సెమ్మాసు బొగ్గు కుప్పకు కుచ్చిండు   రాయలింగం - గలగల కుప్ప కూలింది...కుప్ప శిఖరంమీద పెళ్లలు దొర్లుతూ వచ్చి రాయలింగు కాళ్ల మీద పడ్డాయి.. అందరికి పాత బూట్లున్నాయి...ఎట్లాగో అట్లాగ బాయి కార్మికుల దగ్గర కొనుక్కున్న బాపతువే - రాయలింగు బూట్ల జత చిరిగి కొత్త జత బూట్లు దొరుకక బరికాళ్లతోనచ్చాడు...

            ‘‘అన్నన్న సత్తి’’ కూలబడి పోయిండు...

            నేలంతా నెత్తురే.. వేళ్లు కత్తిరించినట్టుగా అయిపోయాయి...ఎక్కడిపనక్కడ విడిచి కార్మికులంతా రాయలింగు చుట్టు మూగిండ్లు...

            ‘‘ఆనవ్వల..రోజుకు వేలకు వేలు దెం...వట్టిరి గాని మనకు బూట్లనేరా?’’ పానునగంటి పోచం అరిచిండు.

            ‘‘నా కొడుక్కు మంచిపనైంది...సాడుగొట్టు లమ్డికొడుకు గాదు - సావు..మేము గీడ ఏదన్న అనుకోను భయం - కొంటబొయి  దొర సెవులేత్తివి...నీకే గొంతికెలదాకా పెడుతడుండు...’’ అన్నాడింకొకడు....

            ‘‘నూతిల బడ్డోనిమీద నూర్రాళ్లన్నట్టు గిప్పుడు గవేందిరా?’’ చెంద్రమొగిలి...

            బొగ్గులోనుంచి రాయలింగును బయటకు తీశారు.  రక్తం కారిపోతోంది... ‘‘అయ్యయ్యో నెత్తురు పోతంది. గేరత్తది.  ఏదన్న కటు్ట కట్టండెహె ’’ యాకూబ్‍...

            ఎవడో ‘‘బొగ్గు పొడి దంచి పోయాల’’న్నాడు. 

            ‘‘అద్దద్దు గూడుకడ్తది..  గింతంత అయిడన్న లేకపాయె’’ నారాయణ.

            మొగిలి సర్రున చుట్టబట్ట చీరి రాయలింగు కాలుకు కట్టు గట్టిండు.  గుడ్డంతా రక్తంతో తడిసిపోయింది...

            ‘‘సత్తనే.... నేను బతుకనే...’’ రాయలింగు మూలుగుతుండు...

            ‘‘ఏం జూత్తర్రా- ఓ యిద్దరు సైకిలు మీద దవాఖానకు దీసుకుపోండ్లి...’’ చంద్రమొగిలి.

            కార్మికులు ఒకల మొఖాలొకరు చూసుకున్నారు...  ఎవల గ్యాంగుల  నుంచి పోవాలెచంద్రమొగిలి గ్యాంగులనుంచి  మొగిలి పోతనన్నడు.  కాని మొగిలికి సైకిలు తొక్కరాదు. 

            ‘‘రాయలింగని గ్యాంగోల్లే పోవాల’’న్నరు.

            ఆఖరుకు నర్సయ్య అనేవాడు తను తీసుకుపోత నన్నాడు.  అప్పుడు డబ్బుల సమస్య వొచ్చింది.  అందరి జేబులు వెతికితే పదిహేను రూపాయలు జమైనాయి.. నర్సయ్య, మొగిలి కలిసి రాయలింగును కంపినీ దవాఖానకు తీసుకుపోయారు.

            రాయలింగును తీసుకు పోయినంక మళ్ళీ పని సాగేసరికి పొద్దంగింది.

            వెంకులు మనసులో అనేక విచారాలు....

            సాయంత్రమైంది... మొగిలి, నర్సయ్య రాయలింగుకు కట్టుకట్టించి ఇంటి దగ్గర విడిచి వచ్చారు.  పనైపోయింది.

            లోడర్లు ఇండ్ల ముఖం పట్టారు.  రోడ్డు కవతల నీలగిరి చెట్లు పెండెలు పెండులుగా అప్పుడే పెరుగుతున్నాయి.  వెంకులుకు మొగిలికి దోస్తాని ఏర్పడ్డది.

            ‘‘యాపలకాన్నుంచి పోదామా?’’ అన్నాడు మొగిలి.  చాలామంది అటుకేసి నడుస్తున్నారు.

            ‘‘మనం బొయ్యేం చేస్తం- తాగేటోళ్ళు బోతరు...  నిజంగా ఆళ్లే అదృష్టవంతులు.. సౌ, దోసౌ యేసుకున్నరంటే లెల్లె పాటలు పాడుకుంట కుక్కలు మలుసుక పన్నట్టు పంటరు.  మొగిలి నా మొఖంలకు సూడు- నాకేది తెలిసి సావదు.  కని తెల్లందాక నిదుర బట్టది. తన్నంగతన్నంగ  గీడచ్చి పడ్డ.  మా వూల్లె మా అవ్వ ఒక్కతే ఉంటది.  మా అయ్య సచ్చినపుడు రెండెకరాల సేనుండె.  గద్దలు తన్నుక పోయినయి.  పోనీ మా అవ్వను గీడికి తీసుకద్దామంటే - నేను గీ మట్టిలనే పోతానంటది.  ఇంటికేమన్న పంపుదమంటే గీడ గీ బాగోతం...’’ వెంకులు నడుస్తున్నాడు.

            మొగిలికి చాలా చెప్పాలని ఉన్నది.  కాని మాట పెకలది.

            దూరంగా కొండలు కనిపిస్తున్నయి మసక మసకగా. ఆ కొండల కింద ఏవేవో పల్లెటూళ్లు...ఎత్తు వంపులున్న కాలి బాట మీద  నడుస్తున్నారు..  కొంత దూరం నడిచి సట్టున ఆగిపోయిండు వెంకులు.

            ఎడమ బాజుల నలుగురైదుగురు మనషులు తిరుగుతున్నారు.  అది పోగూడని డీ ఫిల్లరింగ్  జరిగిన  జాగా.  సుట్టూ ముళ్ల తీగ దడి - ఆ పక్కనే గుదిగుచ్చినట్టు గుడిసెలు.  ఆ జాగా డీ ఫిల్లరింగ్‍ జరిగి లోపటికి కూలిపోయింది.

            ‘‘ఏంది గాడ మనుషులు తిరుగుతాండ్లు?’’ మొగిలి.

            ‘‘ఎవల్లో ఏదో ప్లాన్‍  చేత్తాండ్లు.  గుడిసెలు గిన ఏసు కుంటరేమో?’’

            ‘‘నీకు సంత గుడిసున్నదా?’’

            ‘‘నాకు సంతగడిసా? కిరాయికున్న.  మరి నీకో?’’

            ‘‘నేనా మా సుట్టాలింటి దగ్గరుంటన్న...’’

            ‘‘మనం సుత ఏసుకుంటే బాగానే ఉండుగని- గుడిసంటే మాటలా? బొంగులు గావాలె.  తడుకలు గావాలె.  ఎంత లేదన్న ఇన్నూరు రూపాలు గావాలె’’ మొగిలి.

            ‘‘ఇన్నూరే గదా?’’

            ‘‘ఆడ ప్రమాదమంటరు.  కంపినోడచ్చి పీకేత్తడు..’’

            ‘‘అదే ఎందుకు, మరి జాగెక్కడున్నదిగుడిసెలు సూడు ఓటి మీదోటి ఎట్లున్నయోఓ గుడిసెల పన్నోని మొస ఇంకోని కినచ్చేటట్టు...’’

            ‘‘నీ తల్లి ఏ గులడిసెల ఎవడు సచ్చేది దెల్వది.  కంపినోడు కంపిన్ల పని చేసేటోనికి ఇల్లియ్యడు.   పెద్ద నౌకరి దొరలకేమో బంగుళాలు.  పోనీ కిరాయికో ఎట్లనో సత్తా మంటే ఇండ్లు లెవ్వు.  అంత కంపిని జాగేనాయె.  ఇల్లెవని కున్నది...?’’

            ‘‘మల్ల గట్లయితే సందున్నకాడ కట్టు కోకుంట ఏం జేత్తరు?’’

            ఇద్దరు అట్లా మాట్లాడుకుంటూ గుడిసెల్లో చొచ్చారు.  ఓ గుడిసె బయట పాత తట్టలు గట్టిన చిన్న జాగాలో ఒకామె స్నానం చేస్తోంది.  సాటేమి లేదు.  గుడిసెలు మోకా లెత్తులేవు.  బూడిద కుప్పలు చెత్తా చెదారం రోడ్లనిండా.  ఆ చెత్తలోనే  ఆ మసిలోనే పిల్లలు ఆడుకుంటున్నారు. 

            రైల్వేలైను దగ్గర నుండి బొగ్గు దొంగతనం చేసుకొచ్చే పోరగాండ్లు వెనకకు చూసుకుంట గుడిసెల కేసి నడుస్తున్నారు. 

            గుడిసెల్లో ఒకటే సందడి... ఎక్కడో ఏడుపు.  ఎక్కడో తిట్లు.  ఎక్కడో తాగుబోతు బూతుపాట.  కండ్లు కన్పించకుండా పొగ.  కమురు వాసన .. గుడిసెల ఆవల గాడుపు దుమారం పుట్టినట్టున్నది. కేకలు... గుడిసెల మీద కప్పిన అట్టముక్కలు ఎగురుతున్నాయి.  బూడిద దుమ్ము కప్పేసింది.

            వెంకులు, మొగిలి కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు.  ఎటూతోచక హోటల్‍ గుడిసెలో చొచ్చి నిలుచున్నారు.

            గాడుపు దుమారం హెచ్చింది.  గుడిసెల్లో కేకలు హెచ్చాయి.

 

                                                           27

 

            పిండార బోసినట్లుగా వెన్నెల. సాయంత్రం రేగిన గాలి దుమారం ఆగిపోయి గాలి బిగుసుక పోయింది.  ఉక్కపోత .. మొగిలి గుడిసె బయట వెల్లకిలా పండుకున్నాడు .   అతనికి బాయిల పని యాదికొచ్చింది.  ‘‘దొరుకుద్దో దొరుకదో.  రోజు పొద్దున లేత్తేనే లోడింగు పనికి బోవుడైతంది.  లీడర్లకు మల్లొక్కపారి కలువకపోతి.  ఏదన్న కాకపాయె.  ఈల్ల ఇంటి మీన బడి తిన బడితి.  ఎన్ని దినాలుండాలెరాజేశ్వరి యాదికొచ్చింది.  పన్నది గావచ్చు. ఎప్పుడు నౌఖరి దొరుకాలే, ఎప్పుడు తీసుకురావలె. ఏందో గీడికచ్చి తట్టుబడిపోతి.  ఉన్నదో లేందో దున్నుక  బతుకుతే  అయిపోవు... రూపాలు దెచ్చి ఆనికిచ్చి  ఇరుకున బడితి.  ఏ మొఖం బెట్టుకొని ఊళ్లెకు బోవాలె...’’ ఇట్లా మొగిలి ఆలోచనలు సాగుతున్నాయి...

            ‘‘గాలి  కగ్గిదల్గ...గింతన్న లేదు.  ఉబ్బరిచ్చి సత్తన్న’’ లక్ష్మి నిలువెల్లా చెమటకు తడిసి కొంగుతో విసురుకుంటూ బయటికొచ్చింది.

            ‘‘పన్నవా పిలడా?’’

            ‘‘లేదు వదినా..’’ మొగిలి మంచంలో లేచి కూర్చుంటూ.

            ‘‘మా సెల్లె యాదికచ్చిందా?’’ అన్నది లక్ష్మి నవ్వుతూ...

            ఇంతలోనే బాయిల మీదెక్కడో సైరన్‍ కూసింది.

            ‘‘మీ అన్న అచ్చే యాల్లయింది’’ అన్నది లక్ష్మి..

            మొగిలి తలవంచుకొని మంచంల కూర్చున్నాడు.

            ‘‘మొదట్ల మీ అన్న గిట్లనే నిదురబట్టక తండ్లాడెటోడు.  ఏమంట తాగుడలవాటయ్యిందో సచ్చినట్టు పంటడు.’’ లక్ష్మి అని కొంగుతో గాలిసురుకుంటూ కడప క్రింద కూర్చున్నది..

            ‘‘