మా రచయితలు

రచయిత పేరు:    డా. పొన్నంరెడ్డి కుమారి నీరజ

కథలు

నాన్నా . .  వెళ్తున్నా . . 

 " నాన్నా వెళ్తున్నా . . . . " ఒకరి చేతిలోనుండి మరో చేయి . . . . వేళ్ళు చిన్నగా జారిపోతున్నాయి. " చిట్టితల్లీ . . . . చిట్టితల్లీ . . . . ఆగమ్మా ". కలవరిస్తున్నాడు, అరుస్తున్నాడు శ్రీనివాస్ నిద్దర్లో.  “ఏమండీ . . . ఏమండీ . . . . ఏమైందండీ . . . " పద్మ అరుస్తోంది.

 
కొద్దిసేపు నిశ్శబ్దం . . . . .
  
మళ్ళీ అదే కలవరింత " చిట్టి తల్లి . . . . ఆగమ్మా . . . . వెళ్ళద్దు , నన్నొదిలి వెళ్ళద్దు " .

" ఎవరినీయనిలా కలవరిస్తున్నాడు " అర్ధంకాలేదు భార్యకు .

ఏమండీ . . . ఏమండీ . . . . . " వినిపించుకోలేదు . గట్టిగా " శీనూ . . . . . శ్రీనూ . . . " అరిచింది భయపడుతూ పద్మ. గట్టిగా తట్టింది. తనా అంత తొందరగా పైకి లేవలేదు. తొమ్మిదో నెల . .

పద్దూ . . . . పద్దూ . . . నా చిట్టితల్లి " గాబరాపడూతూ . . మగతగా అంటున్నాడు . పద్మకు భయంగా వుంది . " ఎంతో గంభీరంగా వుండే ఈయనేనా ఇలా ఏడుస్తున్నాడు " ?

" నాన్నా . . . . . నాన్నా . . . . " భార్య పొట్టలోంచి అరుస్తోంది  కూతురు  తనకు మాత్రమే వినబడేట్టు.

 

 "ఏం తల్లీ . .

" నాన్నా ఈ లోకంలోకి నాకు రావాలనిపించట్లేదు " ,

ఎందుకమ్మా "

ఎక్కడ నాన్నా మమ్మల్ని బతకనిస్తున్నారు. మర్మాంగం తప్ప మరేమీ మాలో చూడలేని మనుషులున్న మీ లోకంలోకి రాలేను . . . . రాను "  నిక్కచ్చిగా చెప్తోంది.

" ఏమైంది తల్లీ ?". ఎక్కడ వెళ్లిపోతుందో ననే భయం.  నా నోట మాట రానివ్వడం లేదు. తనే అంది " 90 ఏళ్ళ అవ్వను , మూడు సంవత్సరాల పాపను . చివరకు ఐదునెలల పసికందునూ అత్యాచారం చేశారంటే ఎంత నీచమైందో ఈ లోకం అర్ధం కాలేదా నాన్నా. ఈ లోకాన్ని చూస్తోంటే భయమేస్తోంది నాన్నా. కాదు అసహ్యం . . . . . అసహ్యమేస్తోంది. పొట్టలో వున్న మమ్మల్ని గుర్తించలేరు కాబట్టి బతికిపోతున్నాం నాన్నా, లేకుంటే మమ్మల్ని వదిలేవారు కాదేమో ఈ కామాంధులు ".
 అయ్యో నా చిట్టితల్లీ నీకేం భయం లేదని, నేను నిన్నెలాగైనా కాపాడుకుంటానని ఎలా చెప్పను.

 నాన్నా ఇది నా ఒక్కదాని సమస్యాకాదు. నాలాంటి చాలామంది పసిగుడ్ల సమస్య. ఎందుకు నాన్నా ఈ సమాజం ఇలా తయారైంది . ఎక్కడ నాన్నా లోపం. తల్లిదండ్రుల పెంపకంలోనా, చట్టాల్లోనా, న్యాయవ్యవస్థలోనా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా . . . . . ఎక్కడ నాన్నా . . . ఎక్కడ ? నాకు సమాధానం కావాలి ".  నా చిట్టి తల్లి ఏడుస్తోంది. నేను చూళ్ళేకపోతున్నా.  

" అమ్మా . . . . " అని పిలుస్తున్నాడే కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు .

" నాన్నా ఒకప్పుడీ సమాజం ఇలా లేదంట కదా. మరిప్పుడేమైంది. అన్నింటిలో సాధించిన అభివృద్ధికి ప్రతిఫలమిదా. స్త్రీని ఆదిశక్తిగా భావించేవారంట కదా. మరిప్పుడు ? ఆకాశంలో సగమంటూ భూమిపై ఈ ఘోరాలేంటి ? . ఉద్యోగాల్లో పడి తల్లిదండ్రులు పిల్లలకివ్వాల్సినవి, నేర్పాల్సినవి నేర్పలేకపోతున్నారా ? . టీవీలు, సెల్ ఫోన్లు, వీడియోగేములో రాక్షసుల్లా తయారౌతున్నారా ? మునుపటిలా నీతి నిజాయితీ కథలు చెప్పే అవ్వా తాతలు అనాథాశ్రమాల పాలయ్యారు కదా ! . . ఇంకెవరు నేర్పుతారీ అబ్బాయిలకు మంచీ చెడూ. దీనికితోడు టివి కార్యక్రమాలు , సినిమాలు అన్నీ . . అన్నీ . . చెడగొట్టడంలో భాగాలే. ఈ లోకంలో స్వార్ధం పెరిగిపోయింది నాన్నా, డబ్బుకోసం ఇష్టమొచ్చినట్లు తీసే సినిమాలు ఎంత ప్రభావం చూపుతాయో పసిమనసులపై ఎవరు గుర్తిస్తున్నారు ".

" అయ్యో నేనున్నానమ్మా నీకు " అని అరుస్తున్నాడు కానీ . . .

" ఐనా మా గోడెవరికి పడుతుందిలే నాన్నా . మాకేమైనా ఓటు హక్కుందా ? . సమాజంగూర్చి ఆలోచించే, పట్టించుకునే నాధుడెవ్వడున్నాడు నాన్నా . . . . "  ఈ సారి బిగ్గరగా ఏడుస్తోంది . నా చిట్టి తల్లి , అయ్యో ఏడ్చి ఏడ్చి ఏమౌతుందోనని భయంగా వుంది . తల్లీ . . . . . . నువ్వేడవకు . . . నా ఓదార్పును పట్టించుకునే స్థితిలో లేదు.

" అవును నాన్నా అబ్బాయి . . . . . వాడికేం . . . . . . . . అని వదిలేస్తున్నారు. వాడేం చేస్తున్నాడో ఎలా తయారౌతున్నాడో పట్టించుకుంటున్నారా. ఇంటర్నెట్లో దొరికే అశ్లీల దృశ్యాలు. మంచో చెడో తెలుసుకునే జ్ఞానం వాడికెక్కడ ? వాడిమీద నిఘా పెట్టే సమయం మీకెక్కడ  .

అమ్మా బయటకెళ్ళకు , వెధవలున్నారని భయపెట్టి భద్రపరుస్తున్నారు.

 సూటిగా గుండెలోతుల్లో గుచ్చుకుంటున్నాయి మాటలు . నేనేం మాట్లాడాలో అర్ధం కావట్లేదు . . .                       "నాన్నా ఆ భద్రమేదో అబ్బాయి విషయంలో చేస్తే . . . . . . చాలామంది అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి కదా నాన్నా . కొడుకు పుట్టాడని కాలరెగరేసుకుని తిరగడం , కూతురు పుట్టిందని చిన్నచూపు చూడటం కాదు, పద్ధతిగా బతకడమెలాగో నేర్పితే ఎంత బాగుంటుంది ".

అమ్మాయిల్ని చూస్తే అక్కో చెల్లో, అమ్మో గుర్తు రావాలని ఎంతమంది చెప్తున్నారు. నీతిమాటలూ, బుద్ధి మాటలూ ఎంత సేపూ అమ్మాయిలకేనా ? అబ్బాయిలవైపు చూడకు, తలదించుకునే వెళ్ళు, అలా చెయ్యి . . ఇలా చెయ్యి . . . , రేప్పొద్దున అత్తారింట్లో అలా ఉండాలి . . . . ఇలా ఉండాలి ఇవే మాటలు వినీ వినీ చెవులు చిల్లులు పడిపోయాయి " .

చట్టమైనా , న్యాయమైనా ఏంచేస్తున్నాయి నాన్నా . ఒక్కసారి . . . . ఒక్కసారి తప్పు చేసినవాడిని ఒకడినైనా కఠినంగా శిక్షిస్తే పొరపాట్లు మళ్ళీ జరుగుతాయా ? మంత్రి కొడుకనో, బంధువనో ఇలా . . . . . . వదిలేస్తూ . . . . ఇంకా ఎంతమందినిలా బలితీసుకుంటారు. ఎన్ని ప్రాణాలతో ఆటలాడుకుంటారు. ఉన్మాదుల్లా మారి ఎంతమందికి కడుపు కోతను మిగులుస్తారు . అమ్మాయిని కనడానికే భయపడే స్థితి వచ్చేసింది నాన్నా సమాజంలో . ఎక్కడ జోగుతోంది నాన్నా ప్రభుత్వం ".

ఇవన్నీ అర్ధమైన తర్వాత ఈ సమాజంలోకి రావాలనిపించట్లేదు నాన్నా . ఈ సమాజం మారుతుందని , మార్చే వారున్నారని నాకనిపించడం లేదు నాన్నా అందుకే వెళ్తున్నా . . . . . .

శ్రీనివాస్ అన్నీ వింటున్నాడు. అలోచిస్తున్నాడు. ఆపాలనుకుంటున్నాడు.

శ్రీనివాస్ ఐపిఎస్ ఆఫీసర్. ఈ ఉద్యోగంకోసం ఎంత కష్టపడ్డాడు. తనకంటే తన తల్లి ఎంత కష్టపడింది. అమ్మ సరస్వతి . పేరుకే సరస్వతి అక్షరం ముక్కరాదు. కానీ తన కొడుకును ఐపిఎస్ ఆఫీసర్ ని చేసింది .

శ్రీనివాస్ అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మ భర్తల దగ్గర పొందే అవమానాలు . . . . . . చీదరింపులు ప్రత్యక్షంగా చూశాడు. నాన్న తాగుడుకు బానిసై అమ్మను పెట్టే చిత్రహింసలు చూశాడు. తాగి తాగి హఠాత్తుగా నాన్న పోతే . . . . . . . . అమ్మే అన్నీ తానై పెంచింది.

" నాన్నున్నా ఐపిఎస్ ఆఫీసర్ ని అయ్యేవాన్ని కాదేమో " అనుకునేవాడు శ్రీనివాస్ చాలాసార్లు, ఎందుకంటే తాగు బోతులున్న ఇల్లు ప్రశాంతంగా ఎక్కడుంటుంది గనుక. ఇదంతా అమ్మ కష్టం.

శ్రీనివాస్ కు స్త్రీలంటే గౌరవం. ఐపిఎస్ ఆఫీసరైన తర్వాత పద్మను వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పద్మ అమ్మ కాబోతోంది. కాదు కాదు శ్రీనివాసే నాన్న కోబోతున్నాడు. అతనికి పాప కావాలని కోరిక, రోజూ పద్మను చూసి మురిసిపోతుంటాడు. తనకు చిట్టితల్లినిస్తుందని.

ఎప్పుడే మాత్రం సమయం దొరికినా, ప్రయాణంలో వున్నా పుట్టబోయే పాపగూర్చిన ఆలోచనలే. ఎలా ఆడించాలి గుర్రమెలా ఎక్కించుకోవాలి అని. క్యాంపుకెళ్లినప్పుడల్లా ఓ గుర్తు . . . . . . మంచి బొమ్మ తెచ్చి ఇంట్లో దాచుకుంటాడు. పద్మ పిచ్చి మీకు " అన్నా పర్లేదు. చిట్టి తల్లి రాకకోసం నిజంగా పిచ్చోడల్లే ఎదురుచూస్తున్నాడు. నిద్రలోనూ రోజూ కలవరింతలే. కానీ ఈ రోజు కలవరింతలు భయపడుతున్నాయి పద్మను. భయపడుతున్నాడు శీను.

చిన్నగా తాను లేసింది. నీళ్ళు చిలకరించి భర్తను లేపింది . పక్కన కూర్చుని "ఎందుకలా అరిచారు. అది కలవరింతా, అరుపా అర్ధం కాలేదండి. నాకు భయంగా ఉందండీ, ఏమైందండీ ".

" నా చిట్టితల్లి ఈ లోకంలోకి రాదంట పద్దూ. ఎంతలా బాధపడింది . ఏడ్చింది ".

" ఏంటండీ చిన్న పిల్లాడిలా . . . . . . . " ధైర్యంగా అంది. " ఇలా చూడండి " . తన పొట్టపైన భర్త చెయ్యి పెట్టించి , " మన పాప కదుల్తోందండి. తొందరలో మీరు ఆడుకోవచ్చండి . మిమ్మల్ని నాన్నా అంటుందండీ "  అని ఆశలు కల్పించసాగింది.
మెల్లి మెల్లిగా శ్రీనివాసును  ఈ లోకంలోకి తెప్పించింది.

" ఇప్పుడు చెప్పండి ఏమైంది " .

శ్రీనివాస్ కలతా వివరించాడు. పద్మకు ఆశ్చర్యమేసింది. " కలలు అలా గుర్తుండవు కదా " !

పద్దూ టైమెంత అన్నాడు " .

సెల్ ఫోనులో చూసి " నాలుగన్నరయిందండీ ".

పద్దూ తెల్లవారుజాము కలలు నిజమౌతాయంట కదా"!

" అయ్యో . . . మీ పిచ్చికానీ . . నేను సైన్సు చదివాను కాబట్టి చెప్తున్నా మన ఆలోచనలు, భయాలే కలలుగా వస్తుంటాయి ".

" నిజం పద్దూ . . . నా చిట్టితల్లి వెళ్ళిపోయింది ".

ఎంతో ధైర్యంగా వుండే వీరేనా ఇలా. పద్మ నమ్మలేక పోతోంది. " ఏమండీ తెల్లవారింది అలా బయటకెల్దాం పదండి " అని బయట లాన్ లోకి తీసుకొచ్చింది. కొద్ది సేపు ఇద్దరూ అలా పచార్లు చేశారు.

పనిమనిషి " టీ " అంది. గార్డెన్లోనే కూర్చొని టీ తాగారు.

శ్రీనివాస్ మనసు మనసులో లేదు . పద్మ ఎన్ని కబుర్లు చెప్తున్నా సగం చిట్టి తల్లి ఆలోచనలు . . . . సగం పద్మ మాటలూ . . . కొద్ది సేపటి తర్వాత టిఫన్ చేయించడానికి పద్మ లోపలికెళ్ళింది.

శ్రీనివాస్ ఒక నిర్ణయానికొచ్చిన వాడిలా గదిలో కెళ్ళాడు. సిష్టం ముందు కూర్చున్నాడు. ఏవో గబ గబా లెటర్లు టైపు చేసుకున్నాడు. పద్మ టిఫిన్ కు పిలిచినా విన్పించుకోలేదు.

పద్మ లోపలికొచ్చింది. భర్త హడావిడి చూసింది. టైపుచేసిన మ్యాటర్ అక్కడక్కడా చూస్తే అర్ధమైంది.

శ్రీనివాస్ వెంట వెంటనే ఎవరెవరికో మెయిల్స్ పెట్టాడు. ప్రింట్లు తీశాడు. పోస్ట్ చేశాడు. పద్మ చూస్తూ వుంది. గంటసేపట్లో పని పూర్తి చేశాడు.

" ఇక తిందాం పద్దూ టిఫన్ " అన్నాడు.

ఇద్దరూ టిఫన్ తిన్నారు . కొద్ది సేపటికి పద్మకు కడుపు నొప్పి, నడుం నొప్పి ప్రారంభమయ్యాయి . అర్ధమైంది వారికవి పురిటి నొప్పులని , వెంటనే ఆసుపత్రికి బయల్దేరారు.

శ్రీనివాస్ తల్లికి కబురు చేశాడు.

ఆమె ఆనందంగా, కంగారుగా బయలుదేరింది.

డాక్టర్లేమీ " ఇబ్బంది లేదన్నారు ".

కానీ శ్రీనివాస్ మనసు ప్రశాంతంగా లేదు. కలే . . . . . . . . కలలోని చిట్టి తల్లే . . . . . . . . వెళ్ళిపోతున్నా " నని తన చేతిని విడిపించుకున్న జ్ఞాపకమే.

గది బయట కళ్లు మూసుకుని . . . ప్రశాంతంగా " చిట్టి తల్లీ నీకేం కాదు రామ్మా ! ఐపిఎస్ ఆఫీసర్ గా ఏ కూతురి కీ ఏమీ కాకూడదనే సిఎం నుండి పిఎం వరకు అందరికీ మెయిల్స్ పెట్టాను, ఫైల్స్ పంపాను. ఎలాంటి చట్టాలు తేవాలో, న్యాయవ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలో, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటో అన్నీ వివరంగా తెలియజేశాను తల్లీ. అవన్నీ జరిగేంత వరకూ నేను నిద్రపోను తల్లీ. నువ్వు నాకు కావాలంతే",

తెలియకుండా కళ్ళవెంట నీళ్ళు కారి చెక్కిళ్ళ పైనుండి జారి గడ్డం కింద దూరి వెళ్లిపోతున్నాయి చొక్కా లోపలికి, గదిలోనుండి డాక్టర్ బయటొచ్చారు. " కంగ్రాట్స్ మిస్టర్. మీ పాప బాగుంది మీలాగే " అన్నాడు.

శ్రీనివాస్ ఆనందానికి అవధుల్లేవు. గట్టిగా అరవాలనిపిస్తోంది. కానీ " ఇది హాస్పెటల్ కదా . . . . . . . . అన్పించి ఆపుకున్నాడు .

సిస్టర్ లోపలికి పిలిచిందే తడవుగా పరుగులాంటి నడకతో వెళ్ళాడు .

పద్మ నవ్వుతోంది. ఆ నవ్వులో " ఏం కాలేదు చూడు " అన్న నమ్మకముంది .

పాప చెంత కెళ్ళాడు. కళ్ళనిండా ఆనందం. మనసునిండా ఆనందం.

పాప తననే చూస్తున్నట్లుంది . . . . కళ్ళతో మాట్లాడుతున్నట్లుంది.

" నాకేం భయంలేదు కద నాన్నా " అని అడుగుతున్నట్లుంది.

" నువ్వు నా ప్రాణం తల్లీ. ఇక ప్రతి కూతురూ ఆ అమ్మానాన్నలకు ప్రాణమయ్యేలా చేస్తాను. ఎక్కడ ఏ సంఘటనా జరక్కుండా చేస్తాను. ఎంత కష్టమైనా సరే " అని ఆ చిన్ని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మాట ఇస్తున్నట్లు.

ఇంతలో శ్రీనివాస్ అమ్మ వచ్చింది.

తన చిట్టితల్లి వచ్చిన ఆనందాన్ని గుండెలనిండా . . . . . . నింపుకుని , అమ్మను అక్కడ పెట్టి శ్రీనివాస్ తాను ఐపిఎస్ అయినందుకు దాన్ని సార్థకం చేసుకునేందుకు తన బిడ్డకిచ్చిన మాట నిలుపుకునే పనిలో పడ్డాడు.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు