మా రచయితలు

రచయిత పేరు:    డా. వి. ఆర్‌. రాసాని

కథలు

దానం గొడ్లు

''నాయనా! ఆ దూడ కల్లా చూస్తానే వుండావు. యిద్దోరా జున్ను. అంత తిని స్కూలుకు యెల బారు''

                స్కూలు బ్యాగు తగిలించుకుని, మొగసాల అరుగు మింద కూసోని, అప్పుడే లేచి అటు ఇటు ఊగుతూ తప్పటడుగులేస్లూ నడుస్తున్న పసికోడెను చూస్తూ వున్న నాకు జున్నుగిన్నె అందించింది అమ్మ.

మా మట్టావు పొద్దన్నే తెల్లటి కోడెదూడను ఈనింది. ఎంతో ముద్దేస్తోందో బుజ్జిముండ.

                బెల్లం ముక్క లేసి కాచిన ముర్రుపాల జున్ను కమ్మగా వుంది. పసికోడెవైపు చూస్తూనే అమ్మిచ్చిన జున్ను తినేశాను. వీధిగుండా వీస్తున్న సన్నగాలి దూడ మట్టివాసనను మోసుకొస్తోంది. అప్పుడే గడ్డి మోపును మోసుకొచ్చిన మా యప్ప గొడ్ల పందిలి(రి) కింద పడేసి, చేతిలో కాసిన్ని గరిక పోచల్ని పట్టుకొచ్చి 'టిర్ర్‌..టిర్ర్‌..దా..దా...'' అంటూ అవునోటి కందిస్తూ ముదిగారం చేశాడు.

                అప్పటికే దూడ దేహానికంటి వున్న మట్టును ఆవు నాకేసిండడంతో ఆకలిగా తనబిడ్డనే చూస్తూ ఆవురావురుమన్నట్లు గరికపోచల్ని నముల్తూ నిలబడివుంది మట్టావు.

                అప్పటికే నేలపైన పడున్న మాయను ఒక కట్టెకు తగిలించుకొని తీసుకెళ్ళి, ఇంటివెనక చేని గెనింపైనున్న పుట్టలోకి జారవిడిచి వచ్చాడు అప్ప.

                స్కూలుకు బయలు దేరి వెళ్ళి క్లాసులోకూర్చున్నా మట్టావు, పసిదూడలపైనే ధ్యాసంతా...

                ''ఈ వేల్టికి దూడ చెంగుచెంగున ఎగరతావుంటూంది... కుర్ర్‌...కుర్ర్‌ మంటూ అరుస్తూ మట్టావు చుట్టూ తిరగతా వుంటుంది. మట్టావు 'అంబా' అంటూ దూడను ప్రేమగా పిలుస్తూ వుంటుంది. దూడకేం పేరు పెట్టాలి?''

                అయవార్లు చెప్పిన పాఠాలేవీ ఆ దినం తలకెక్కలేదు. బుర్రనిండా మట్టావు, పసికోడె....ఆలోచనలే.

                సాయంత్రం స్కూలునుంచీ తిరగొచ్చేటప్పటికి పసికోడె లేత తోకను పైకెత్తి మెల్లగా ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతోంది.

                బ్యాగు ఇంట్లోకి విసిరేసి వెళ్ళి, దూడ మెడను రెండు చేత్లుల్తో  పట్టుకొని 'ఆయ్‌! దా..దా..'' అంటూ ముఖంపైన ముద్దు పెట్టాను. పసికోడె మోర పైకెత్తి నాకళ్ళలోకి చూసింది. ఆ కళ్ళు నిర్మలంగా నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. మట్టావు మా యిద్దరినీ ప్రేమగా చూస్తూ.. మెల్లగా అంబా..అంబా అంటూ బిడ్డను పిలిచింది.

                దూడలేత శరీరాన్ని రెండు చేతుల్తో నిమిరి వదిలేస్తే, అది మెల్లగా, అందంగా నడుస్తూ వెళ్ళి అమ్మ రొమ్మును నోట్లోకి చేర్చుకుని పొదుగును గద్దిగుద్ది చప్పరించ సాగింది.

                దానికి కొంత  దూరంలో వున్న పచ్చి గడ్డి పిడికెడు తెచ్చి మట్టావు నోటికందిస్తే...అది తన్మయత్వంతో సగంకండ్లు మూసుకొని సుతారంగా గడ్డిని నమలసాగింది.

                దూడకు పాలిస్తున్న మట్టావును చూస్తూంటే గడపలో కూర్చోని  సంవత్సరం వయసున్న చెల్లికి పాలిస్తూ కనిపించిన చిన్నప్పటి అమ్మ గుర్తుకొచ్చింది.

                వెంటనే ఆవు ముఖాన్ని గుండెకు హత్తుకొని 'నా కొగ తెల్లటి తమ్మున్నిచ్చినావు మట్టావు' అని ముద్దు పెట్టుకున్నాను. మట్టావు తన దూడకు మాదిరే నాలుకతో నా చెంపను నాకింది.

                అందులో ఆత్మీయ స్పర్శ...అమ్మస్పర్శ...ఇక అప్పటి నుంచీ మట్టావే నాకు మరో తల్లి. చిన్నప్పుడు కన్న తల్లి నాకు పాలిచ్చింది. ఇప్పుడు ఈ గోవుతల్లి నాకే కాదు, నా కుటుంబానికంతటికీ పాలిస్తోంది.

                అమ్మ తెల్లవారే లేచిరోట్లో సజ్జలు పోసి, కుదురు పెట్టి, అన్ని నీళ్ళు చల్లి రోకటితో దంచడానికి పూనుకుంటే, చెల్లి డాక్షాలో పెరుగుపోసి, రోటికి కొంత దూరంలో నిలువుగా నాటివున్న కొయ్యకుండే దారాలు కల్వానికి తగిలించి చిల కడంలో మునిగిపోతే, మాయప్ప ఒక తట్టను తలకు తగిలించుకుని, చెక్కుకోని ఎత్తకొచ్చేవాడు.

                శెలవుల్లో ఆవుదూడను పట్టుకొని మా చేల గెనాలపైనా, బావులగడ్ల పైన పైటేళదాకా మేపుకొని, ఆపైన పెద్ద చెరువులోనీళ్ళు తాపుకోని యింటికి తోల కొచ్చేవాణ్ణి. ఆ సమయంలో పసికోడె నాతో బాగా ఆడుకునేది. దాని గంగడోలును అరచేత్తో నిమురుతుంటే మోర పైకెత్తి నిలబడి ఆనందించేది. ఆ సమయంలో మట్టావు చెవులు పైకిలేపి ముఖాన్ని అటుఇటు తిప్పి పటపట లాడించి మావైపు ప్రేమగా చూసేది.

                ''నాయనా! నా బిడ్డను నువ్వు ఇట్లే ప్రేమగా చూసుకో'' అని చూపులతోనే నాతో చెప్పుకునేది మట్టావు.

                వాటి శరీర భాష నాకు బాగా తెలుసు. అందువల్లా వాటి ప్రేమ నాకు బాగా అర్థమయ్యేది.

 

                దూడకు సంవత్సరం వయసొచ్చింది. నాకు టెన్త్ పరీక్షలొచ్చాయి. వాటిలో నేను పాసై చిత్తూరు కన్నన్‌ కాలేజీలో ఇంటర్‌లో చేరాను.

                పెరిగే మా వయసుతో బాటు కాలమూ మారుతూ వచ్చింది.

                వానలు కురవడం తగ్గిపోయాయి. బెట్టమీద బెట్ట... వరసగా కరువులే....వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని పోయింది. ప్రపంచానికి అన్నంపెట్టే రైతుకు కడుపునిండా కడి దొరకడమే కష్టమైపోయింది. తాగేనీళ్ళకే కష్టమై పోయింది. ఇలాంటి పరిస్థితిలో గొడ్లను సాకడం భారంగా మారిపోయి, రైతులు అయిన కాడికి ఆవుల్ని, ఎద్దుల్ని అమ్మేసుకోని, పనులు వెతుక్కుంటూ పరాయి ప్రదేశాలకు పోసాగారు. అందరి భూముల్లాగానే మా మూడెకరాల చేనూ బీడు బారిపోయింది.

                మాయమ్మా, అప్పా అతికష్టంమీద కూలిపనులు పట్టుకొని కడుపు నింపుతున్నారు. నేను చెల్లీ గోకుడు పారలు, తట్టలు ఎత్తుకొని మైళ్ళ దూరం నడిచిపోయి గరిక పోచల్ని వేర్లతో సహా తవ్వుకొచ్చి, ఆ గడ్డిని నేలపైన పోసి కట్టెతో కొట్టి, దుమ్ము వదిలించి ఆవుకూ దూడకు వేస్తూ వచ్చాము. అదీ కొంతకాలమే...పశువులకు గడ్డి పోచ దొరికేదే కానా కష్టమైపోయింది.

                నేను ఇంటర్‌ పాసయ్యాను.

                ''ఇంక మేము చదివించలేము నాయనా. ఏదయినా ఉద్యోగం చూసుకో'' అన్నాడు అప్ప.

                అయినా టీచర్‌ ట్రైనింగ్‌ ప్రవేశ పరీక్ష రాశాను. మంచిర్యాంకు వచ్చింది. వాకాడు టీచర్‌ ట్రైనింగ్‌ స్కూల్లో చేరిపోయినాను. అక్కడ పాఠాలు వినడం, లెసన్‌ ప్లాన్స్‌ తయారు చేయడం, రికార్డ్స్‌ రాయడంతోనే సరిపోయింది. ఎనిమిది నెలల తర్వాత లీవుల్లో ఇంటి కొచ్చాను.

                ఇంటి పరిస్థితి దయనీయంగా వుంది.

                చెల్లి స్కూలు మానేసి కూలికెళుతోంది. అమ్మ గొడ్లకాడనే వుండి పోయింది. నానా తంటాలు పడి వరిపొట్టు తెచ్చి కుడితి బానలో వేసి కలబెట్టి గొడ్లప్రాణాలు నిలబెడుతూ వస్తోంది. మట్టావు, పసికోడె బాగా బక్కచిక్కి పోయాయి. ప్రాణాలను కళ్ళలో పెట్టుకుని జీవిస్తున్నట్లు నన్ను చూడగానే మట్టావు కళ్ళు రెప్పలు రెపరెపలాడించింది. పసికోడే అంతే. నావైపు దీనంగా చూసినట్లనిపించింది.

 

                నేను వెళ్ళి వాటి ముఖాలను స్పృశించి  వీపుల్ని నిమిరాను. అవి ఏదో ఆశగా నా కళ్ళలోకి చూసినట్టునిపించింది. వాటి చూపును చూసి నా గుండెలో ఏదో కలుక్కుమనిపించింది. కొంచెం చెలించి పోయాను.

                ''ఇంక ఆరునెలలు అట్ల యేగితే, డిఎస్సీ వస్తూంది. బాగా ప్రిపేరై ఉద్యోగం సంపాదిస్తాను. ఆ లోపల ఏదో వొగ ప్రైవేటు స్కూల్లో నైనా పనిచేసి వీటికీ, ఇంట్లో వాళ్ళకీ కడుపు నింపతాను'' అనుకున్నాను.

                ఆ రోజు రాత్రి నూకల సంగటి, చెనిగ్గింజల ఊరిమిండిచేసి పెట్టింది అమ్మ.

                ''ఇంక గొడ్లను సాకలేము నాయనా. మీ యప్ప అమ్మేద్దాం అంటావుండాడు'' అంది అమ్మా.

                ''అవున్నాయనా! మాకే సంగటిలేం యింక వాటికడుపులేడ నిండతాయి'' అన్నాడు అప్ప.

                నా మననసు మరోమారు చివుక్కుమంది.

                ''వద్దునాయనా! కొనుక్కున్నోళ్ళు కటికోళ్ళకమ్మేస్తారు. వద్దు. ఆర్నెళ్ళలో ట్రైనింగ్‌ అయిపోతుంది. ఏదో వొగటి సంపాదిస్తాను. అంతవరకు ఓపిక పట్టండి'' అన్నాను.

                ''ఇంటిగొడ్లను అమ్ముకోవాలని నాకూలేదు నాయనా. కానీ దినదినానికి అవి బక్కవైపోయి బుడుగు పడిపోతావుంటే చూడలేకుండా వున్నాము నాయనా'' బాధగా అన్నాడు అప్ప.

                ''పోనీలే అప్పా!  అన్న సెస్తావుండాడుగదా. ఆర్నెళ్ళు అట్లాగదాము. అంతవరకు నా కూలి డబ్బుల్తోనైనా వరిగడ్డి కొని యేద్దాం'' చెప్పింది చెల్లి.

                ఆ మాటతో అమ్మా అప్పా మౌనంగా తలొంచుకున్నారు. అది ఆశ్వయుజమాసం. తిరుమలలో 'సాలకట్ల' బ్రహ్మోత్సవాలు  మొదలయ్యాయి. ఆ మాసంలోని మూడవ శనివారాన్ని మా పక్క తిరుమల శనివారం పేరుతో నొసటన నామాలేసుకుని పండగా చేసుకుంటారు. ఆ రోజు ఉదయాన తెల్లవారు జామునుంచీ పొద్దు పుట్టిన మూడు గంటల వరకు ప్రతి పల్లెలోను ఏ యింట్లో విన్నా 'గోయిందా! గోయింద' అంటూ ఒక్క పొద్దులు తీర్చుకుంటారు. అందుకే దీన్ని 'గోయిందుల పండుగ' అని కూడా పిలుస్తుంటారు. వెంకటేశ్వరుడు ఇలవేల్పుగా వున్న చాలమంది తేనెపల్లి పంచాయితీలో వుండే లక్ష్మీపురం పక్కనున్న కలిగిరి కొండకు వెళ్ళి, అక్కడ వెంకన్న స్వామికి తలిగెలుపెట్టుకోని, దేవుణ్ణి చూసి వస్తూంటారు. కొందరు రైతులు ప్రతి శనివారం నాడు గోవుల్ని దానం చేస్తూంటారు. తిరుమల శనివారం నాడైతే ఎక్కువమంది అక్కడి దేవుడికి గోవుల్ని దానంగా సమర్పించుకోని వస్తూంటారు. దేవుడి పేరుతో వదిలిన కోడెల్ని, కరువుకు మేపుకోలేని గొడ్లను దానం పేరుతో అక్కడ వదిలేసి వచ్చేస్తూంటారు.

                మాకు ఇలవేల్పు తిరుమల వెంకన్నే. ఆ కారణంగా తిరుమల శనివారం నాడు కలిగిరి కొండకు వెళ్ళి తలిగాలేసి, ఒక్క పొద్దు తీర్చుకోని దేవుణ్ణి దర్శించుకోని రావాలి. అందుకోసం అ ముందురోజు పూతల పట్టుకు పోయి పొంగలికి  కావాల్సిన బెల్లంమ్దుద, అరిటాకులు, కర్పూరం, టెంకాయ, ఆకూవక్కా అన్నీ తీసుకొచ్చి పెట్టాను.

                ఆ రోజు రాత్రే ఆడోళ్ళు ఇండ్ల ముందర పేడనీళ్ళతో 'కల్యాపు' చల్లి, ముగ్గులేసి పేడతో ఇండ్లు అలుక్కొని, గడపలకు ఎర్రమట్టిరంగు పూసి సిద్ధం చేసుకున్నారు.

                తెల్లారితే తిరుమల శనివారం!

                ఆ రోజు తెల్లవారే చాలామంది లేచి స్నానాలు చేసి నట్టింట్లో దీగూడు కింద నేలకు మూరెడెత్తులో దేవమూలకల్లా గోడకు తెల్ల తిరుమణి ఎర్రనామంతోగానీ, లేదా చిక్కుడాకు పసరు, ఎర్రనామంతో గానీ నామాలువేసి, దాని ముందర అరిటాకులు పరిచి పరమాన్నం, అత్తిరసాలు వంటివి యింకా కొన్ని చేసి తలిగెలేసుకుని, దీగూట్లో దీపాంతిని వెలిగించి 'గోయిందా' 'గోయింద' అంటూ ఒక్క పొద్దులు తీర్చుకోసాగారు.

                మరి కొందరు కావాల్సినవి గంపల్లో పెట్టుకొని కలిగిరి కొండకు యెలబారినారు. కలువగుంట రామ్మూర్తన్నోళ్ళు, ఎన్‌. భాస్కరెడ్డోళ్ళు ఇంటిల్ల పాది 'ఇల్దీర్థం' మాదిరి ఆ కొండకు బయలు దేరినారు. ఆ కొండకు మలుపులు మలుపులుగా కాలిబాటుంది. ఎక్కేది కొంచెం కష్టమే.

                తెల్లారే లేచి, తల స్నానాలు చేసి, ఉతకిన గుడ్డలు తొడుక్కోని తిరుమల కొండకు 'ఇల్దీర్థం' పోతున్నంత భక్తితో, నిష్టతో కావాల్సినవి అన్నీ పేర్చుకున్న గంపను మా చెల్లి నెత్తిన పెట్టి, పొద్దు పుట్టక ముందే కొండదారి పట్టాము.

                ఆ దారి పక్కన పెద్దపెద్ద బలస, మంగిరి, చండ్ర, చిగర, రెప్పాల, రేగు, రేల వంటి చిన్న చిన్న చెట్లు, అక్కడక్కడా పెద్దపెద్ద చీమరాల, కానగ, మద్ది, రాగి, మర్రి, బూరగ వృక్షాలు, మరికొన్ని తుంపర చెట్లు గుబురు గుబురుగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ఒక మోస్తరు అడవే...

                కొండపైన పోను పోను ఆ ప్రాంతమంతా అక్కడక్కడా పెద్దపెద్ద మామిడి చెట్లు, చింత చెట్లు రెండు మూడు మర్రి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. పొద్దు పుట్టేసరికి మేము ఆ ప్రాంతంలోని ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి చేరుకున్నాము. అక్కడికి వంద గజాల దూరంలోనే వెంకన్న గుడి కనిపిస్తోంది. అప్పటికే కొంత దూరంలో వున్న మామిడి చెట్టు కింద రామ్మూర్తన్నోళ్ళు, భాస్కరెడ్డోళ్ళు రాళ్ళ పొయ్యిల మీద పొంగళ్ళను ఉడికిస్తూన్నారు. రామ్మూర్తి, భాస్కరెడ్డి ఎస్వీ యూనివర్సిటీలో పీ.జీ. చేస్తున్నారు. మాయప్ప మూడు రాళ్ళను తెచ్చిపొయ్యి తయారు చేస్తే, మా చెల్లి గంప దించి, పక్కకు వెళ్ళి కొన్ని ఎండిన కంపల్ని ఏరుకొచ్చి, ఆ రాతిపొయ్యిలో దూర్చింది. మా యమ్మ పక్కనే వున్న కుళాయి కాడికి వెళ్ళి చిన్న డాక్సాలో నీళ్ళు పట్టుకొచ్చి బియ్యం కడిగి, మిగిలిన నీళ్ళ తో ఎసురు పెట్టింది. నేను రామ్మూర్తిన్న దగ్గరికెళ్ళి, వారిపొయ్యిలో నుంచీ ఒక మండే కొరివి తీసుకొచ్చి పొయ్యి ముట్టించాను.

                మా యప్ప, మేస్తూ మాకు దగ్గరగా వచ్చిన ఒక ఆవును ''టిర్ర్‌..టిర్ర్‌..దా...దా...'' అని గిరికేసి, దాన్ని మచ్చిక చేసుకుని, చెంబడు పాలు, పిండుకుని వచ్చి కాగుతున్న ఎసట్లో పోశాడు. అవి కాగి న తర్వాత మాయమ్మ కడిగిన బియ్యాన్ని ఎసట్లో పోసింది. అవి కలాపెలా ఉడికిన తర్వాత రెండు బెల్లం ముక్కల్ని వేసి బాగా కలబెట్టంది. అంతే కొంత సేపటికి బెల్లం పొంగలి తయారైపోయింది.

                రామూర్తన్నోళ్ళు, భాస్కరెడ్డోళ్ళు అప్పటికే తలిగెలు లేసుకుని గోయిందులు పెడుతూ ఒక్క పొద్దు అప్పటికి తూర్పున పొద్దు పుట్టి చాలాసేపయింది.

                మా యప్ప జానెడు పొడవుండే ఒక నల్లరాతిని తెచ్చినీళ్ళతో కడిగి, దాన్ని ఒక చోట నిలబెట్టి, నేలపైన చుట్టూ నీళ్ళతో కడిగి, దాన్ని ఒక చోట నిలబెట్టి, నేలపైన చుట్టూ నీళ్ళు చల్లి ఎడమ అరచేతిలో కొన్ని నీళ్ళుపోసి తెల్లతిరమణి రుద్ది, కుడి చేతి చూపుడు వేలితో ఆ రాతికి నామాలు పెట్టాడు. అదయిన తర్వాత పురచేతిలోనే కుంకుమంత పోసి, నీళ్ళ చుక్కలతో తడిచేసి తెల్ల తెరమణి నామాల మధ్యన ఎర్ర నామందిద్దాడు. ఆ తర్వాత బెత్తెడు పొడవుతో ఒక ఈనపుల్లను తీసుకొని మా అందర నొసటన నామాల దిద్ది, గంపలో వుండే అద్దం తీసుకుని ముఖం చూసుకొని తను నామాలేసుకున్నాడు. మా యమ్మ అయిదరిటాకులు తీసుకుని వాటిలో రెండు అవక చిప్పలు చొప్పున బెల్లం పొంగలి వేసి తలిగెలు సిద్దం చేసింది. మాయప్ప శిలముందర కర్పూరం వెలిగించి అందులో బొచ్చుతీసిన కొబ్బరికాయ అటుఇటు తిప్పి 'గోవిందా! గోవింద' అంటూ పక్కనున్న ఒక చిన్న రాయిమీద కొట్టాడు. కొబ్బరినీళ్ళను మాయమ్మ ఒక గలాసులో పట్టుకున్న తర్వాత రెండో దెబ్బకు రెండొప్పులు చేసి, జుట్టుపీచు పీకి చిప్పలు కింద పెట్టి 'ఏడు కొండల వాడా వెంకటరమణా! గోవిందా! గోవిందా' అంటూ చేతులు జోడించి మొక్కాడు మాయప్ప.

                మేమూ 'గోవిందా' గోవింద' అంటూ గోవిందులు పెట్టాము. అదయినపిదప గ్లాసులో పట్టిన టెంకాయనీళ్ళు మా దోసిళ్ళలో పోస్తే, మేము 'గోవిందలు' పెడుతూ నోట్లో పోసుకుని ఒక్క పొద్దు తీర్చుకున్నాము. ఆ తర్వాత ఒక తలిగె, మాకు సమిపంగా వచ్చిన పొంగలి తినేసి కూర్చున్నాము.

                అప్పుడు గుడి వాచ్‌ మెన్‌ రత్నం రాజు ఇక పెద్ద చెంబు చేతపట్టుకొని, వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ అక్కడి కొచ్చినాడు. అతనిదీ మావూరే. పదేళ్ళుగా అతను అక్కడున్న వెంకన్నగుడికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

 

                ''యేం మొగిలప్పన్నా! కొండకొచ్చి తలిగేసుకుంటున్నారా?'' పలుకరించాడు. ''అవునబ్బా! తిరుమల శనివారం నాడు ఇక్కడికి వచ్చి తలిగేసుకోని ఒక్క పొద్దు వదిలేది ఆచారం గదా! సరే, నువ్వేమి ఇట్లొచ్చానావు?'' అడిగినాడు మాయప్ప.

                ''దినొమ్ము యి సమయానికి ఇక్కడుండే దానం గొడ్ల దగ్గిర పాలు పిండకపోయి ధర్మకర్త ధర్మయ్యకు, పూజారికి యివ్వాలి, అందుకని ఇట్టొస్తినన్నా'' కుళాయికాడికి పోతూ చెప్పాడు రత్నంరాజు.

                ''సరే మొగం  కడుక్కోని రాబ్బా! నువ్వూ అంత బెల్లం పొంగలి తిని పోదువుగానీ...'' మాయమ్మ పిలిచింది.

                ''వస్తానక్కా!'' పందుంపుల్లను విసరి దూరంగావేసి, కుళాయితిప్పి, దోసిటితో నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిళించి ఉమ్మేస్తూ నోరూ, ముఖం, చేతులు, కాళ్ళుకడుక్కొని పైగుడ్డతో తేమ తుడుచుకుంటూ మేమున్న కాడికి వచ్చి' ఏమి శరవణా! నీ టీచర్‌ ట్రైనింగ్‌ అయిపోయిందా?'' అంటూ నన్ను పలకరించినాడు.

                ''ఇంకా ఆర్నెళ్ళుందన్నా?'' అన్నాను.

                మా చెల్లి గంపలో వుండే వొగ అరిటాకు మాయమ్మ కందిస్తే మాయమ్మ మిగిలిండే బెల్లం పొంగలిలో చిప్పకట్టేసి, కాసింతతీసి ఆకులో యేసి రత్నంరాజుకు అందించింది.

                కొంచెంనోట్లో వేసుకుని ''ఎంతబాగుండాదక్కా'' అంటూ నిమిషంలో తినేసి, కుళాయికాడికి పోయి చేతులుకడుక్కోని 'వస్తానక్కా! శరవణ్‌ వస్తానబ్బా, అమ్మణ్ణీవస్తా...'' అని మా దగ్గర శెలవు తీసుకుని పాలావుల్ని వెదుక్కుంటూ వెళ్ళిపోయాడు.

                మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి దేవున్ని దర్శించుకుని మిగిలిన పొంగలి డాక్సాతో బాటు చెంబు గింబూ అన్ని గంపలో పెట్టుకొని పల్లెకు యలబారినాము.

                దారిపక్కన గడ్డి మేస్తా చాలాపసరాలు కనిపించినాయి. ''వీటిని ఎవురు, ఎట్లా చూసుకుంటారప్పా?'' మా యప్ప నడిగినా చూసుకునేదేముండాది. అంతా అడివేగదా! ఈ దానం గొడ్లకు ఈ అడివే తల్లీ దండ్రీ, యజమాని, అంతా అడివేగదా. పొగులంతా మేస్తాయి. సందేళకంతా వచ్చి ఈ గుడి చుట్టూతావుండే మామిడి చెట్లకింద, మర్రి చెట్టు కింద పండుకుంటాయి. పూజకు కావాల్సిన పాలు, నెయ్యి, అన్నీ ఈ దానం ఆవుల్నించే...'' చెప్పినాడు మా యప్ప.

                ఇంటికి చేరుకోగానే మిగిలుండే పొంగలి పరమాన్నం మట్టావుకు, పసికోడెకు తినిపించింది మా యమ్మ, ఆ సాయంత్రం ఆవుపంచితం పట్టి ఇల్లంతా చల్లి ఆవుముఖానికి, ముందరి కాళ్ళకు పసుపు పూసి, కుంకుమ బొట్టుపెట్టి మెక్కుకుంది.

                మాట్టావును, పసికోడెను ముద్దాడి తిరిగి రెండ్రోజుల తర్వాత వాకాడు కొచ్చేసినాను.

                చూస్తూండంగానే ఆరుమాసాలు కాలగర్భంలో కలిసి పోయాయి. ఈ ఆరు మాసాల్లో చాలా మార్పు వచ్చింది. ముందే కరువు. మనుషులకు తిండేకాదు, తాగునీళ్ళు సేకరించడం కూడా కష్టమై పోయింది. చేసేదానికి పనుల్లేవు. రైతులు చాలా మంది పైగుడ్డను భుజానేసుకుని పనులు వెతుక్కుంటూ పరస్థలాలు వెళ్ళి పోయారు. మేపుకోలేక కొందరు గొడ్లను కసాయోళ్ళమ్మేసుకున్నారు. మా యప్ప కూలిపని వెతుక్కుంటూ బెంగుళూరెళ్ళి పోయినాడు. నా చదువు మధ్యలో బందయిపోతుందని ఇంటి విషయాలేవీ నాకు తెలియకుండా అమ్మా, చెల్లీ జాగ్రత్తపడినారు.

                నేను అతికష్టం మీద కోర్సు పూర్తి చేశాను. నేను పరీక్షలు రాస్తుండంగానే త్వరలో డి.ఎస్సీ ప్రకటన వస్తుందని తెలిసింది. పరీక్షలన్నీ పూర్తి చేసి, డి.ఎస్సీ ప్రిపరేషన్‌ కోసం తిరుపతిలో ఫ్రెండ్స్ తో బాటు ఒకరూము తీసుకొని వుండిపోయాను. నాకు టీచర్‌ ట్రైనింగ్‌లోను పరీక్షలోను మంచి మార్కులే వచ్చాయి. కొద్దిరోజులకు డి.ఎస్సీ కూడా వచ్చింది. అది కూడా నేను బాగారాశాను. ఇవన్నీ చూసుకుని ఇల్లు చేరుకునేటప్పటికి మరికొన్ని నెలలు గడిచి పోయాయి.

                ఇంటికొస్తే....ఇల్లంతా బిశాంబరంగా వుంది. పందిలికింద గొడ్లువున్న జాడకనిపించలేదు.

                ''అమ్మా! ఆవూ, కోడె కనిపించలేదే?'' అడిగాను. ''పది నాల్లప్పుడు మీయప్ప బెంగుళూరు నుంచీ వచ్చినాడు. ఇంటికర్చులకు కొంత దుడ్డు యిచ్చి పోయనాడు. పోతూపోతూ కడుపుకిన్ని గడ్డిపోసలు లేక ఎమకలు పైనేసుకోని గొడ్లు అగోరిస్తావుంటే వాటిగోస్ట సూడలేక, కటికోళ్ళకు అమ్మడం ఇష్టంలేక కలిగిరి కొండకు తోలకపోయి దేవుడికి దానం చేసి వచ్చినాడు'' అమ్మ చెప్పింది.

                ఆ మాటవినగానే ''అయ్యో, నా పసికోడె, మా మట్టావు తల్లి ఏమైనాయో గదా!'' అని నా మనసు కొటకరించింది.

                ''మనయింట్లో మనుషులు మాదిరి వున్న ఇంటి గొడ్లను ఎందుకు తోలేసినారమ్మా! నేనే ఏదో విధంగా సాకే వాన్ని కదా!'' నొప్పిగా అన్నాను.

                చెల్లీ, అమ్మా మౌనంగా తలొంచుకుని వుండి పోయినారు. ఇంట్లో నుంచీ వీధిలోకొచ్చినాను. అప్పుడే వీధిలో కనిపించిన రామ్మూర్తన్న ''ఏమి శరవణ్‌. ఎట్లావుండావు?'' అంటూ పలకరించాడు. ''బాగుండానన్న'' అని, మాయప్ప ఇంటిగొడ్లను దానం యిచ్చిన విషయం చెప్పి ''అన్నా! నాతోబాటు కలిగిరి కొండకు రాన్న... మా గొడ్లను తిరిగి తీసకొస్తాము. ప్లీజ్‌..అన్నా.'' అని వేడుకున్నాను. నా బాధ చూసి రామ్మూర్తన్న 'సరేపదా' అన్నాడు. ఇద్దరం అరగంటలో కొండెక్కి గుడికాడికి వెళ్ళాము. తేనెపల్లి ధర్మయ్య దేవస్థానం ధర్మకర్త, అతనుకూడా అక్కడే వున్నాడు...వాచ్‌మెన్‌ రత్నంరాజు గుడి బయట ఏదోపని చేసుకుంటన్నాడు. అప్పటికే పూజలు పూర్తయి నట్లుంది. పూజారి, ధర్మయ్య దేవళం ముందరుండే రాతి మంటపంలో కూర్చోని ఏదో మాట్లాడుకుంటున్నారు. నేరుగా వెళ్ళి మా విషయం అడిగినాము.

                ''అదేట్లా? ఒగతూరి బిచ్చగాడిజోలెలో దానంగా పోసిన ధాన్యాన్ని ఎవురయినా తిరిగి తీసుకుంటారా? యిదీ అంతే'' తెలివిగా అన్నాడు పూజారి.

                ''ఏదో లేసామీ.. ఇతనికి ఇంటి గొడ్లంటే ప్రాణం, వీళ్ళ నాయన తెలీయకుండా యిచ్చేసినాడు. తిరిగి అవి తీసకపోతానంటున్నాడు. యిచ్చేస్తే పోలేదా?'' రామ్మూర్థన్నాడు.

                ''ఈ కొండపై నుండే చెట్టూ చేమూ అన్నీ ఈ వెంకన్నవే. అదే మాదిరి యీడికి చేరిన గొడ్డూ గోదా స్వామివే. అవి తిరిగిచ్చేదానికి కుదరదు'' తెగేసి చెప్పేసినాడు ధర్మకర్త ధర్మయ్య.

                ఆ మాటలు వింటుంటే అతని పేరులో వున్న ధర్మం లేశమైనా ఆ ధర్మకర్తలో లేవనిపించింది. అతను ధర్మకర్తకాదు, అధర్మకర్త అనిపించింది.

                ఇంక చేసేదేమీ లేక తిరిగొస్తూ దారిపక్కన కనిపించే గొడ్లలో మాయింటి గొడ్లేమైనా వున్నాయేమొనని చూస్తూ వచ్చాను. ఎక్కడా వాటి జాడైనా కనిపించలేదు. కరువుకు కొండపైన గడ్డి ఎండిపోయి వుంది. ఎండిన గడ్డినే తింటూ అక్కడి గొడ్లు, ఆ గడ్డిలాగానే సరైన గడ్డిలేక ఎండిపోయి కనిపిస్తున్నాయి.

                ఉసూరుమంటూ యింటికొచ్చిన నాకు మనసు మనసులో లేదు. ''మాగొడ్లను మాకిచేదానికి వీళ్ళకేమి? దానంగావచ్చిన గొడ్లపైన ఈ పూజారికీ, ధర్మకర్తకు అధికారమేమిటి?'' పరిపరివిధాల ఆలోచిస్తూనే వుండిపోయాను.

                ఆ మరునాడు రత్నంరాజు ఊరి ముందర కనిపించినాడు. నా బాధను ఆయనకు చెప్పుకున్నాను. అతను అటు ఇటు చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకుని ''అబ్బా! నీ ఇంటి గొడ్ల గురించినీవు పూజారోళ్ళకు అడిగినవు నీకోగనిజం చెప్తా. యాడా అనకు '' రహస్యం చెబతున్నట్లుగా స్వరం తగ్గించి అన్నాడు.

                ''ఏందన్నా అది?'' ఆసక్తిగా అడిగాను.

                ''రైతులు ఎన్నో గొడ్లను దేవునికి దానం యిస్తారుకదా! అవన్నీ ఏమవుతున్నాయో తెలుసా?''

                ''నాకెట్లా తెలస్తాది?''

                ''ఆ పూజారీ, ధర్మయ్యలు నెలకో, రెండునెల్లకో వొగతూరి, బెంగుళూరు నుంచీ కసాయోళ్ళను పిలిపించి బేరం మాట్లాడుకొని దానం గొడ్లను వాళ్ళకు ధారపోస్తారు. జనాలకు అవి దానం గొడ్లు. వాళ్ళకు ధనం పశువులు.''

                ఆ మాటవినగానే నోరు వెళ్ళబెట్టక తప్పలేదు!

                అతను మరొక విషయంకూడా చెప్పాడు.

                ''రేపు బెంగుళూరు నుంచీ రెండు లారీలొస్తాయి. రేపు రాత్రికే దొరికిన గొడ్లను దొరికినట్లు పట్టుకొని లారీల కెక్కించి, పొద్దన్నేనే గొడ్లలారీలు కదల్తాయి. వాటిలో మీ గొడ్లు కూడా వుండొచ్చు. నేనొస్తానబ్బా. పనుండాది'' చెప్పాల్సింది చెప్పేసి అతను ఇంటివైపుకు నడిచాడు రత్నంరాజు.

                ఆ మాట విన్న తరువాత నా మనసు ఒక విధంగా ''ఏం చేయాలీ? దానం గొడ్లను కబేళాలకుమ్మేసి ధనం చేసుకుంటున్న ఈ అన్యాయాన్ని ఎలా ఆపాలి? ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి?'' తీవ్రంగా ఆలోచించాను.

                ఆలోచించనూ ఆలోచించనూ ఒక మార్గం తొచింది. వెంటనే రామ్మూర్తిని కలుసుకున్నాను. అసలు విషయం చెప్పి ''ఎట్లయినా పశువుల ప్రాణాలు కాపాడాలన్నా'' అన్నాడు.

                ''అవును ఇది వింటావుంటే నాకూ బాదేస్తావుంది. గతంలో కూడా వాళ్ళు గొడ్లను అమ్మేసుకుంటారని విన్నానుగానీ కబేళాల కమ్మేస్తారని అనుకోలేదు. ఉండు. నాకు రెండు టీ.వీ. ఛానల్స్‌ వాళ్ళు, రెండు పత్రికల వాళ్ళూ తెల్సు. వాళ్ళకు ఫోన్‌ చేస్తా...భయపడొద్దు. ఈ అన్నాయాన్ని ఎట్లయినా అడ్డుకుందాం'' భరోసాయిచ్చాడు రామ్మూర్తన్న.

                ఆ మరునాడు తెల్లారేసరికి మేముండే లక్ష్మీపురానికవతల కలిగిరి కొండ మొగదల రెండు లారీల నిండా దానం గొడ్లు ఎక్కించబడ్డాయి. వాటిలో మా మాట్టావు, పసికోడె వుండాయేమొనని చూశాను. చూడంగ చూడంగ రెండో లారీలో ఇరవైగొడ్లు పండ్లు పొట్లంలో వేసి ప్యాక్‌ చేసినట్లుగా సందులేకుండా బిక్కు బిక్కు మంటూ నిలబడి వున్నాయి. పశువులు.  లారీ టైర్లపైకెక్కి చూసినా...మధ్యలో మోరలు పైకెత్తుకోని నిలబడి వున్నాయి మట్టావు, పసికోడె బాగా చిక్కి పోయివున్నాయి.

                కిందకి దిగి రామ్మూర్తన్నకు ఫోన్‌ చేశా.

                ''ఏమన్నా! మీరింకా రాలేదు?''

                ''వచ్చేసినామబ్బా శరవణా! ఎనిక్కి చూడు'' అవతల్నుంచీ రామ్మూర్తన్న గొంతు.

                తిరిగి చూస్తే... ముందుండే లారీ కాడికి రెండు పెద్ద కెమరాలతో టీ.వీ. వోళ్ళు, పేపరోళ్ళు వచ్చేసుండారు.

                వెనకంటీ పూజారినీ తీసకొచ్చినారు.

                ''ఎవరెవరో ఇచ్చిన దానం గొడ్లను కబేళాలకమ్ముకోవడం అన్యాయం గదా'' అంటూ వోళ్ళు అడుగుతుంటే ''నాకేం తెలీదు. పూజాపునస్కారాలు చేసుకునే వాణ్ణి'' దీనంగా ముఖంపెట్టి అన్నాడు పూజారి. ''ఏం తెలీకనే దగ్గరుండే పశువుల్ని బండ్లకెక్కిస్తా వున్నావా?'' ఒక పేపరోడు అడిగినాడు.

                ''పశువుల్ని పూజించే బ్రహ్మడైవుండే, ఆ పశువుల్నే కటికోళ్ళకమ్ముకుంటా వుండావే సిగ్గులేదా?'' ఒక టీ.వీ. వాడు అతని ముఖానికి కెమరా తిప్పి అడిగినాడు.

                ''అదంతా నాకు తెలీదు...ధర్మకర్త ఈ గొడ్లను, ఆ బండ్లకెక్కించు అంటే...అట్ల చేస్తావుండా అంతే'' తడబడుతూ  బుకాయించాడు.

                లారీలో వున్న వాళ్ళంతా దిగి ''బేటా! ఫోటోలు తీయబాకండి'' అంటూ ప్రాథేయపడ్డారు.

                ''మిమ్మల్నెవురు రమ్మన్నారు?'' ఒక జర్నలిస్టు ప్రశ్న ''ధర్మకర్త ధర్మయ్య, ఈ పూజారే రమ్మన్నారు''. చెప్పాడొకతను.

                ''ఈ వ్యాపారం ఎన్నేళ్ళనుంచో జరగతావుంది?'' మరో కెమరామెన్‌ అడిగాడు.

                ''ఇక్కడ ఆవులు ఎక్కువైనప్పుడంతా మరమ్మంటారండి. రెండు నెలలకొక తూరి వస్తుంటామండీ...'' ఒకడి సమాధానం.

                ''ఎన్నేళ్ళనుంచీ...?''

                ''దాదాపు పదేళ్ళ నంచీ...'' మరొక గొడ్ల వ్యాపారి సమాధానం ''అంటే కొన్ని వేల గొడ్లను నరికేశారన్న మాట '' రామూర్తన్న మొరుసుకున్నాడు.

                ''ప్రజలు దేవుడికిచ్చిన దానం గొడ్లను, ఆ దేవుడి పేరుతోనే కబేళాలకమ్మీసుకుని లక్షలు సంపాదిస్తున్నారన్నమాట''

                జర్నలిస్టుల ప్రశ్నల మీద ప్రశ్నలు....

                ''మేము గొడ్ల వ్యాపారస్తులం...ఎక్కడ గొడ్లమ్ముతామంటారో అక్కడి కొస్తాం''

                అమ్మినోళ్ళనొదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేమిటి?''

                ''ఇంకెప్పుడూ ఈ పక్కకు రాము. దయమాడి టీ.వీ.ల్లో చూపకండి''

                ''పేపర్తలో ఆకచేటా!''

                తెలుగులోను, కన్నడంలోను ప్రాధేయపడ్డారు.

                లారీల్లో కెక్కించిన పశువుల్ని దించినారు. అన్నీ దాదాపు యాభై పశువులు. నేను మా మట్టావును, పసికోడెను తీసుకొని ఇంటికొచ్చేశాను. ఆ రోజు ఏ టీ. వీ. చూసిన ఆ మరునాడు ఏ పేపరు చదివినా ప్రధానంశాలుగా ఇవే వార్తలు, ఇవే విశేషాలు.

                భాస్కరెడ్డోళ్ళింటి నుంచీ ఒక నాలుగు, రామ్మూర్తన్ళోళ్ళ దగ్గరి నుంచీ వొగ అయిదు వరిగడ్డి కట్టలు తెచ్చుకొని పందిలి కింద వేసి, వాటిలోనుంచీ రెండు పిడికెళ్ళ వరిగడ్డి తీసి మా గొడ్ల ముందరేశాను.

                ''గోవును పూజించే కలిగిరి వెంకన్న గుడిలో గోవులు చేరే చోటే గోమేధం జరిగిపోతుంటే...ఇంక మానవత్వం ఎక్కడుంటుంది. ఈ రోజు నేను నా గొడ్లను, వాటితో పాటు కొన్నింటిని కాపాడగలిగాను. ఇలా ప్రతిసారీ ఎవరు కాపాడుతారు?'' అనుకుంటూ గొడ్లవైపే చూస్తూన్నాను.

                ''శరవణ్‌! పోస్ట్‌!'' వీధిలోనుంచీ పోస్ట్ మెన్‌ కేక.

 

                నేను ఇంటిముందరి కెళితే ఒక కవరిచ్చి వెళ్ళి పోయాడు పోస్ట్ మాన్‌ కవరు చించి లెటర్‌ చూడగానే ఆనందంతో కేక వేయాలనిపించింది.

                గొడ్డొచ్చిన వేళ, బిడ్డచ్చినవేళ అంటారు.

మాయప్ప చేత గుడికి అప్పజెప్పబడి దానం గొడ్లుగా ముద్రపడిన మా మట్టావు. పసికోడె తిరిగి ఇంటికి వచ్చిన సమయంలోనే శుభవార్త! నేను డి. ఎస్సీలో పాసయ్యాను. అవడమే కాదు. జిల్లా కంతా మొదటి స్థానం సంపాదించాను. త్వరలో ఉద్యోగంలో చేరడానికి అధికారపత్రం, గొడ్లవైపు ఆనందంగా చూశాను.

                ''త్వరలోనేను ఉద్యోగస్తున్ని కాబోతున్నాను. మీకింకేం భయంలేదు'' అనుకున్నాను.

                మా ఇంటిగొడ్లు ఇంకనుంచీ దానంగొడ్లు కాదు. నా ప్రాణం గొడ్లు.

ఇంటర్వ్యూలు

విభిన్నకోణాలలో సాహిత్యన్ని సృష్టించాలని ఉంది – డా. వి. ఆర్‍. రాసాని 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా. వి. ఆర్‍. రాసాని ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?

             నేను 1957లో చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల  మండలానికి చెందిన కురవపల్లిఅనే ఒక గ్రామంలో పుట్టాను. రాసాని యల్లమ్మ, రాసాని శిద్దయ్య నా తల్లి దండ్రులు.  నాకు ఇద్దరన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. నేను నాల్గవ సంతానం గొర్రెలు, మేకలు మేపడం కులవృత్తిగా కలిగిన వ్యవసాయ కుటుంబం మాది.

            నేను పులిచెర్ల మండలంలోని కమ్మపల్లెఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, పులిచెర్ల జడ్‍.పి. హైస్కూల్లో హైస్కూలు విద్యను పూర్తి చేశాను. పీలేరులో ఇంటర్‍ చదివాను. తిరుపతిలోని టి.టి.డి అధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మక కళాశాల ఎస్వీ ఆర్టస్ కళాశాలలో బి.ఏ పూర్తిచేసి ఎస్వీ యూనివర్సీటిలో ఎం.ఏ (తెలుగు) ఎం.ఫిల్‍. పిహెచ్‍.డి. పట్టాలు పొందాను.

            అ తర్వాత టి.టి.డి. కళాశాల అయిన ఎస్వీ జూనియర్‍ కళాశాలలో 1983నుంచీ తాత్కాలిక అధ్యాపకుడిగా చేరి అక్కడే పర్మనెంటు చేయబడి 2003 లో ఎస్వీ ఆర్టస్ కళాశాలకు ఉద్యోగోన్నతిని పొంది 2017లో రిటైరయ్యాను.

            ఇక వివాహ విషయానికి కొస్తే 1989లో హోమియోపతి డాక్టరైన డా।। కె.ఉమాదేవితో వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు యశ్వంత్‍ కుమార్‍, కాంచన్‍ క్రిష్ణ. యశ్వంత్‍ బిటెక్‍ తరువాత ఫ్రాన్స్లో ఎం.ఎస్‍ పూర్తి చేసి, ఎంబిఏను జపాన్‍లో పూర్తి చేసి ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాంచన్  డిగ్రీ చేసి ప్రస్తుతం మా దగ్గరే ఉన్నాడు. డాక్టరు ఉమాదేవి మంచి డాక్టరుగా, పత్రికా రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. వారు హోమియో వైద్యం, ఇంటింట హోమియో వైద్యం, స్త్రీల వ్యాధులు -హోమియో వైద్యం, ఇన్ఫెక్షన్స్, పిల్లల పెంపకం లాంటి ప్రసిద్ధ గ్రంథాలు రాసారు.  దాదాపు పది సంవత్సరాల నుంచీ వార్తా దినపత్రికలో ప్రతి సోమవారం వైద్య సంబంధ వ్యాసాల శీర్షికను నిర్వహిస్తోంది. అలాగే విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలోనూ కొన్ని సంవత్సరాల పాటు హెల్త్ శీర్షికను నడిపినారు.  ఈమె కవిత్వాలు కొన్ని, చిన్న పిల్లల కథలు కొన్ని ముద్రింపబడ్డాయి.

2.         మిమల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?

            నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసిన వ్యక్తులు లేరు గానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మాపల్లె ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యం గల ఊరు  మా ప్రాంతంలో వీధి నాటకాలు ప్రదర్శించడంలో అప్పటి కాలంలో పేరు మోసింది. ఇక పొలంపనుల్లో సజ్జగూళ్లు కోసేటప్పుడు, చెనక్కాయాలు విడిపించేటప్పుడూ, లేదా రాత్రివేళ తీరుబడిగా వుండేటప్పుడు ఎన్నో జానపద కథలు ముసలివాళ్లు, ఆడవాళ్లు చెప్పేవాళ్ళు. ఆడవాళ్లు జక్కికి గొబ్బిళ్లు తట్టేవారు. కుంటాట, కుండలు తీసే ఆట, ముక్కులు బిళ్లాట ఆడేవారు.   మగవాళ్లు కోలాటం, చెక్కభజన, పాండురంగ భజన, కులుకు భజనలాంటివి ప్రదర్శించేవారు. మగవాళ్లు బలిగూడు(కబడ్డీ), ఉప్పరబట్టెలు ఆడేవారు.  రోజూ ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు ఒక జానపద కథో, జానపద పాటో వినిపిస్తుండేది. కూర్చుంటే చాలు విప్పుడు కథలు, దాగుడు మూతలు ఏదో ఒకటి వుండేటివి. పైగా నేను బాగా చదువుతానని మా ఎగువ వీధిలో కొందరు ముసలాళ్లు ఏడెనిమిది మంది సందేళ అన్నంతిన్నాక మా యింటిముందర స్టూలువేసి, దానిపైన లాంతర్‍ పెట్టి రోజూ కొంచెం కొంచెం చొప్పున భట్టి విక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, భోజరాజు కథలు, సహస్ర శిరచ్చేద చింతామణి వంటి పుస్తకాలు చదివించుకుని వినేవారు. బహుశా ఈ నేపథ్యమే నేను రచయిత కావడానికి పునాది అనుకుంటాను.

            నేను చిన్నప్పుడు పద్యాలు రాసేవాన్ని.  వాటిని చదివి హైస్కూల్లో గొప్ప మార్క్సిస్టు రచయిత, అనువాదకుడు అయిన  ఏ.జి. యతిరాజులుగారు నన్ను కవితలు రాయమని ప్రోత్సహించారు.  పైగా శ్రీశ్రీ ప్రస్థానం ఇచ్చి ఇలా రాయమన్నాడు.   ఆయనే నేను కమ్యూనిస్టుగా మారడానికి కారణం.  ఆయన ఇటీవల చనిపోయేంత వరకూ నాతో సన్నిహిత సంబంధాలే కలిగి ఉన్నాడు.  కమ్యూనిజానికి చెందిన రచనలు, మార్క్సు, ఏంగిల్స రచనలు చదవడం ఆయన వల్లనే సాధ్యమైంది.  బహుశా ఆ కారణంగానే నేను 1975 నుంచి విరసంలో ఉన్నాను.  యాక్టివ్ గా కాదుగానీ వాళ్ళతోనే ఉండేవాన్ని.  ఆ తర్వాత 1977 లో నేను బి.ఏ. మొదటి సంవత్సరం చదివేటప్పుడు విరసం నుంచీ విడిపోయి జనసాహితీలో చేరాను.  దానికి పి.డి.ఎస్. యు. అనుబంధం.  ముప్పాళ్ళ రంగనాయకమ్మ,  నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, తిరుపతిలో భూమన్ ...లాంటి జనసాహితీ వాళ్ళతో బాగా పరిచయం.

            ఒకసారి భూమన్  గారి ఇంట్లో రంగనాయకమ్మతో వారం రోజులు సాహిత్య చర్చలు జరిగాయి.  అప్పుడే ఆమె ప్రజాశక్తి ఎడిటర్ గా ఉండిరి.  ఆ చర్చల్లో కె.యస్.వి.రమణ, కె.బి.తిలక్, ఏ.యన్. నాగేశ్వరరావు, రాఘవశర్మ లాంటి వారు చురుగ్గా పాల్గొన్నారు.  వారిలో నేనూ ఒకన్ని.  అప్పట్లో నేను రంగనాయకమ్మ గారితో చర్చించిన విషయాలు, వేసిన ప్రశ్నలు, ఆమె సమాధానాలు నాకింకా ఇప్పటీకీ గుర్తే.  తిరుపతిలో భూమన్  గారి ఆధ్వర్యంలో ఎ.యన్., నేను జనసాహితీలో యాక్టివ్ గా ఉండేవాళ్ళం.  ఆ తరువాత ఐదారేండ్లకు అరసంలో చేరి ఇప్పుడూ అందులోనే....

            ఈ సంస్థలు, యతిరాజులుగారు నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాలు.  ఆ తర్వాత తిరుపతి మావోగా పేరుగాంచిన త్రిపురనేని మధుసూదనరావు, భూమన్, హేతువాది డి.నాగసిద్దారెడ్డిలాంటి వారి ప్రభావమూ నా పైన కాస్తోకూస్తో ఉందనే భావిస్తున్నాను.

            ఆస్కార్ వైల్డ్, గోర్కి, తుర్గినేవ్. టాల్ స్టాయ్, మామ్, మపాసా లాంటి ఆంగ్ల రచయితల రచనలు, శరత్, ఠాగూర్, ప్రేమ్ చంద్ లాంటి ఇండియా రచయితలు, శ్రీశ్రీ, తిలక్, శివారెడ్డి, సౌభాగ్య కవితలు, గురజాడ, శ్రీపాద, కేశవరెడ్డి,మునిపల్లె రాజురావిశాస్త్రి, రారా, కారా, కేతు, కె.సభా లాంటి వారి రచనలు నన్ను ప్రభావితం చేసినట్లే లెక్క.

            నన్ను బాగా ప్రోత్సహించిన పత్రికలు ఆంధప్రభ, చతుర, విపుల, ఆంధ్రజ్యోతి సాహిత్య ప్రస్థానం పత్రికలు.

            ఆస్కార్  వైల్డ్  - ది పిక్చర్  ఆఫ్‍ డొరియన్  గ్రే,  చార్లెస్  డికెన్స్  - ఏ టేల్  ఆఫ్‍ టూ సిటీస్ ,   అలెక్స హెలీ – రూట్స్, టాల్ స్టాయ్  - అన్నాకెరినీనా.  గోర్కి – అమ్మ,  మిరియం ఆలీ – వితౌట్  మెర్సి,  నాన్ కంగ్ పో - ది రివర్  ఫ్లోస్  ఈస్ట్  వంటి నవలలు శూద్రకవి మఋచ్చకటికం, గురజాడ కన్యాశుల్కం వంటి నాటకాలు గోపిచంద్  అసమర్థుని జీవయాత్ర బుచిచ్చ బాబు చివనకు మిగిలేది చలం మైదానం, సూరి చెంగీజ్ ఖాన్ , స్వామి శప్తభూమి  వంటి నవలలు నాకిష్టం.

3.         మీరు నిర్వహించిన కాలమ్‍ రచనలు?

            నేను నాలుగు పత్రికల్లో శీర్షిక రచనలు చేశాను. ఆంధ్రభూమి దినపత్రికలో సంవత్సరం పాటు మావూరి కతలుమాండలిక రచనలు చేశాను. దీనికి మంచి పేరొచ్చింది. తిరుపతి నుంచి వెలువడిన కామధేనుదినపత్రికలో రాయలసీమ నటరత్నాలు కళాదీపికపక్ష పత్రికలో ఒక వాక్య కవితలు వ్యాఖ్యానంతో లో క్యూలుపేరుతోను కొన్ని సంవత్సరాలు నడిపాను. ఇందులోనే తెలుగు నాటక పద్యాలు శీర్షికను కూడా నడిపాను.

            వాకాటి పాండురంగరావు ఎడిటర్‍గా వున్నప్పుడు ఆంధప్రభ వార పత్రికలో ఇది తిరుపతి’  ఫోటోఫీచర్‍ నడిపాను. ఇది వారానికొకరు చొప్పున రాసిన శీర్షిక. ఒక వారం బాపు శ్రీరమణలు చెన్నపట్నం సమాచారం పేరుతో రాస్తే వీరాజీ ఒక వారం బెజవాడ కబుర్లురాస్తే మరొక వారం మిరియాల రామకృష్ణ విశాఖపట్నంవిశేషాలు రాసేవారు. వారి సరసన నేను ఇది తిరుపతినడపడం మరిచిపోలేని జ్ఞాపకం.

4.         మీ నిర్ధేశికత్వంలో పరిశోధనలు?

             నా నిర్ధేశకత్వంలో ఏడు ఎం.ఫిల్‍ పట్టాలు, రెండు పిహెచ్ .డి. పట్టాలు వచ్చాయి. శ్రీరమణ మిథునంకథలపైన కేశవరెడ్డి మునెమ్మనవల పైనా, వల్లూరి నాటికలపైన, అక్కినేని కుటుంబరావు పనివాడితనంకథలపైన మంచి ఎం.ఫిల్‍లు  వచ్చాయి.

            అలాగే శ్రీపతి కథలపైన యం నరసింహులుతెలుగులో గిరిజన సంచార తెగల కథలపైన వై.మోహన్‍ మంచి థీసిస్ లు సమర్పించారు. ఈ రెండిండటికి మంచి పేరొచ్చింది. ఇంకా ఇద్దరు చేస్తున్నారు.

5.         ఇప్పుడు రచయితల్లో బాగా నచ్చినవారు?

            సింగమనేని, కేతు, బండి నారాయణస్వామి, శాంతి నారాయణ, వెంకటకృష్ణ, కాశీభట్ల వేణుగోపాల్‍, చింతకింది శ్రీనివాస్‍, అట్టాడ అప్పలనాయుడు, శిరంశెట్టి కాంతారావు, ఖాదీర్‍, సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి అభ్యుదయ రచయితలందరూ ఇష్టమే.

6.         మీకు వచ్చిన అవార్డులు, రివార్డులు?

            నాకు మొదట 1996 విశాలాంధ్ర వారి ఉత్తమ రచయిత పురస్కారం చాసో చేతుల మీదుగా తీసుకోవడం, ఆ తర్వాత చీకటి రాజ్యం నవలకి కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, విమలా శాంతి పురస్కారం తీసుకున్నాను. ఆ తరువాత  రెండు సార్లు అధికారభాషా పురస్కారం, రెండుసార్లు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, రెండు సార్లు కందూకూరి నాటిక పురస్కారం, ఇంకా ప్రైవేట్‍ సంస్థల నుంచీ ఎస్‍.గంగాప్ప పురస్కారం, మండలి వెంకటకృష్ణరావు పురస్కారం, శీశ్రీ, గురజాడల పురస్కారాలు వంటివి చెప్పుకోదగ్గవి. బతుకాట పుస్తకాన్ని తెలుగువిశ్వవిద్యలయంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరధ్వాజ చేతుల మీదుగా జరిగిన అవిష్కరణ మరిచిపోలేనిది.  అట్లాగే బతుకాట నవలకు తానా పురస్కారం లభించింది.  ఇక్కడ తానా వారి గురించి ఒక మాట చెప్పాల్సి ఉంది.  సుమారు పాతికేళ్ళ నుంచి ఉత్తమ కథలతో కథా సిరీస్ తేవడం లక్షలలో నవలా పురస్కారాలు అందివ్వడం చాలా  అరుదయిన విషయం. వారు పురస్కారం ఇచ్చిన నా నవల డిగ్రీ కి పాఠ్యాంశంగా ఉండడం , స్వామి వ్రాసిన శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం లభించడం ఇటీవల  వారి మెప్పు పొందిన సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి  కొండ పొలం నవల సంచలనం కావడం జరిగింది.  ఈ విధంగా వారి సాహిత్య సేవ ప్రశంసనీయమైంది.

7.         మీరు చాలా సభలు, సమావేశాలు నిర్వహించారుకదా. వాటి గురించి?

            నేను చిన్న వయసునుంచీ కొన్ని సంస్థలు నడుపుతూ డిగ్రీ స్థాయిలో వున్నప్పుడే నాటక సమాజాన్ని నడిపాను. ఆ తర్వాత తిరుపతి కేంద్రంగా సాహిత్య కళాపీఠంనవకవితా  మండలుల స్థాపనల్లో  నేనూ ఒక్కణ్ణి. అలాగే ఉప్పల నరసింహం అధ్వర్యంలో సాగిన కథావేదికసంస్థకు రాయలసీమ విభాగానికి కార్యదర్శిగా వున్నాను. పోయిన శతాబ్ది చివరి దశకంలో యం సుభ్రమణ్యం యాదవ్, మాజీ యం ఎల్ ఎ  తలరి మనోహర్ నేను కలిసి తిరుపతిలో జానపద కళాసమితి స్తపించడం జరిగింది.  దీని ద్వారా అనేక సభలు సమావేశాలు జరిపాము.  ముఖ్యంగా ఒక విశావిద్యలయం జరుపాల్సిన జథేఎయ సదస్సు లాంటిది ఒక జానపద సాహిత్య సదస్సు జరిపాం . అందులో  బిరుదురాజు రామర్జు యస్ గంగప్ప జీ నాగయ్య సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు మేధావులెందరో పాల్గొని పాత్ర సంపర్పణలు చేయడం ఒక విశేషం.  ఆ తర్వాత మధురాంతకం రాజారాం చనిపోతే  విశాలాంధ్ర మేనేజర్‍ పి. రాజేశ్వర్‍రావు, భూమన్‍, సింగమనేనిలాంటి వారి ప్రోద్బలంతో మధురాంతకం రాజారాం సాహిత్యసంస్థను స్థాపించి దాని  ద్వారా కథాకోకిల పురస్కారాలను, కథకులకు, విమర్శకులకు ఇస్తూ  ప్రతి సంవత్సరం ఉత్తమ కథలతో కొనసాగిన కథావార్షికకు సహ సంపాదకుడిగా పది సంవత్సరాలు చాలా సేవ చేశాను. దీనిక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ఇందులోనూ కష్టమొకరిది పేరు మరొకరిదిగా అయిపోయి రాజకీయాలకు కుట్రలకు గురై ఆ సంస్థ మూలన పడింది. వీటి ద్వారా కొన్ని వందల సభలు, సమావేశాలు నిర్వహించి విసగైపోయి ఇప్పుడు అన్నింటికి దూరంగా వున్నాను.

8.         మీరు నిర్వహించిన సదస్సులు?

            నేను 2011లో మా కళాశాల ఎస్వీ ఆర్ట కళాశాల తెలుగు విభాగం ద్వారా యు.జి.సి. వారి ఆర్థిక సహాయంతో తెలుగుకథ - దళిత, బహుజన, మైనారిటి, గిరిజన జీవితాలు అన్న అంశంపైన మంచి సెమినార్‍ జరిపాను. ఈ సెమినార్‍లో రాచపాళెం చంద్రశేఖర్‍ రెడ్డి కీలకోపన్యాసం చేసారు. ఈ సెమినార్‍లో జయధీర్‍ తిరుమలరావు, స్వామి, వల్లూరు శివప్రసాద్‍ కొలకలూరి మధుజ్యోతి, టి భారతి, యం. విజయలక్ష్మి లాంటి గొప్పవాళ్లంతా పాల్గొన్నారు. ఆ వ్యాసాలతో పుస్తకాన్ని ముద్రిస్తే చాలా మంచి పేరొచ్చింది. కత్తిపద్మారావు, కా.రా. కేతు, విహారిలాంటి మేధావులంతా ప్రశంసించారు. కా.రా. గారు ఆ పుస్తకాన్ని, ముద్ర నవలను ఇరవై ఐదు కాపీలు చొప్పున డబ్బులిచ్చి మరీ కొని ఇంటికి వచ్చే అతిధులకు కాపీ బదులు వాటిని ఇచ్చినట్టుగా ఎన్‍. వేణుగోపాల్‍ కోసం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలా ఎందరో మేధావులను ఆకర్షించిన  పుస్తకాలివి..అలాగే అదే కళాశాలలో తెలుగు శాఖ తరపున 2016లో నా రచనలపై యు జి సి సెమినార్‍  జరిగింది. మేడిపల్లి రవికూమా ఈ సెమినార్ లో కీలకోపన్యాసం చేసారు. 

9.         మీ రచనల గురించి చెప్పండి?

            నా రచనల గురించి చెప్పాలంటే చాలా అవుతుంది అయినా అడిగారు కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను.

            కమ్యూనిస్టు మేధావులు చెప్పినట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా సమసమాజ నిర్మాణం వస్తుందో రాదో గానీ నేను ఆ అభ్యుదయ దృక్పథంతోనే రచనలు చేస్తున్నాను. పైగా నాకు తెలిసిన జీవితాలనే తీసుకుని రచనలు చేశాను. ఆ కారణంగా నా రచనల్లో నేను చిత్రించిన  చాలా పాత్రలు ఇంకా జీవించేవున్నాయి.

            నేను కథలు, నవలలు, నాటకాలు, విమర్శనా గ్రంథాలు వంటివి చాలా ముద్రించాను. వాటిలో ఎనిమిది కథాసంపుటాలు మెరవణి, పయనం, ముల్లుగర్ర, మావూరి కథలు, మృత్యుక్రీడ, విషప్పురుగు, మెరవణి మరికొన్ని కథలు, శ్రీకృష్ణదేవరాయకథలు, నవలలు తొమ్మిది. అవి చీకటిరాజ్యం, మట్టిబతుకులు, బతుకాట, ముద్ర, చీకటిముడులు, పరస, వలస, ఏడోగ్రహం, వంకరగీత.

            నాటకాలు నాలుగు. కాటమరాజు యుద్ధము, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత, అజ్ఞానం.

            నాటికలు ఆరు. స్వర్గానికి ఇంటర్వ్యూ, జలజూదం, నేలతీపి, దృష్టి, మనిషిపారిపోయాడు.

            మూలకథలతో కథారూపకాలు అన్న పేరుతో నాటిక నాటక పుస్తకం కూడా వేశాను.

            లోచూపు, వేడుకపాటలు, పనిపాటలు, అమరజీవి పొట్టిశ్రీరాములు, భారత వీరనారీమణులు, ప్రసిద్ధ తెలుగునాటక పద్యాలు, జానపదగేయాలలో పురాణాలు వంటివి విమర్శనా గ్రంథాలు. ఇవిగాక ఇంకా ఇరవై దాకా రేడియో నాటికలు, రెండు దూరదర్శన్‍ నాటికలు ప్రసారమైనాయి.

            నా రచనలపైన హైదరాబాదు, నాగార్జున, ఆంధ్ర, ద్రవిడ, మద్రాసు, ఉస్మానియా, ఎస్వీ, పద్మావతి వంటి విశ్వవిద్యాలయాల్లో దాదాపు 20 మంది దాకా పరిశోధనలుచేసి ఎంఫిల్‍., పి.హెచ్‍డి పట్టాలు పొందారు.

            నేను ఉద్యోగ విరమణ చేసినప్పుడు మిత్రులు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి డా।।పి.సి. వెంకటేశ్వర్లు నా సాహిత్యంపైన 56 వ్యాసాలతో రాసాని సాహిత్య సమాలోచనపేరుతో వేసిన పుస్తకం బాగా పేరు తెచ్చుకున్నది.

10.      ఇతర భాషల్లోకి పోయిన మీ రచనలు?

            నా మొదటి నవల చీకటిరాజ్యంను  ఇన్  ద రెజిమ్  ఆఫ్  డార్కనెస్  పేరుతో ఆచార్య తుమ్మపూడి భారతిగారు ఆంగ్లంలోకి అనువాదం చేస్తే ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రించారు.

            ముద్ర నవల మూడు భాషల్లో అనువాదమైంది. కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లోకి, ఆచార్య రాజన్న తగ్గి (కన్నడం)  డా।। ఆర్‍.బి. వాణిశ్రీ (హిందీ), డా।। ఎస్‍. హసీనాబేగం (ఉర్దూ) గారు అనువాదం చేశారు. అలాగే ఆంధప్రదేశ్‍లోని డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యంశంగా వున్న బతుకాటనవలను రాజన్న తగ్గి బణ్ణద బతుకుపేరుతో కన్నడంలోకి అనువాదం చేశారు. దీన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రంచి అనువాద శాఖలో పాఠ్యాంశంగా కూడా పెట్టారు.  అలాగే తగ్గి, కస్తూరి, కుం.వి లాంటి వారు నా కథలను కన్నడంలోకి అనువదించారు.

            తరిగొండ వెంగమాంబ నాటకం, వలస నవల కూడ కన్నడంలోకి తర్జమా చేయబడినాయి. తరిగొండ వెంగమాంబ నాటకాన్ని వై.సి.పి. వెంకట్రెడ్డి హిందీలోకి అనువాదం చేసి జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా పొందారు. అలాగే అమెరికా వాసియైన డి కృష్ణ మూర్తి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల శాఖ అధ్యక్షురాలైన ఆచార్య టి భారతీగారు కొన్ని కథలను ఆంగ్లంలోకి అనువదించారు.

11.      మీరు నటులు కూడా అని విన్నాము దాని గురించి కూడా?

            నేను చిన్నప్పటి నుంచీ నాటకాలు వేశాను. 1978నుంచీ వెంకటరమణా ఫైనార్టస్ అసోసియేషన్‍ అన్న నాటక సమాజాన్ని స్థాపించి దాదాపు 70 - 80 నాటకాలను ప్రదర్శించిన అనుభవం వుంది. ఎన్నో సార్లుఉత్తమ నాటకరచయితగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ ప్రతినాయకుడు, గుణ నటుడిగాహాస్యనటుడిగా బహుమతులందుకున్నాను. ఈ అనుభవంతోనే 2012లో అప్పటి సమైక్యాంధ్ర నిర్వహించిన సినిమా నందిఅవార్డ్సుకమిటీలోను న్యాయనిర్ణేతగా ఉన్నాను. అలాగే రెండు సార్లు నంది నాటక పోటీలకు, మూడుసార్లు టి.టి.డి. వారి గరుడ నాటక పోటీలకు, మరికొన్ని జాతీయ స్థాయి నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా కూడా వున్నాను.

            ‘స్వర్గానికి ఇంటర్వ్యూఅనే హాస్య, వ్యంగ్య నాటిక వందసార్లకుపైగా ప్రదర్శింపబడింది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నాటకాన్ని టి.టి.డి. ద్వారా సురభి కళాకారులు 100సార్లకు పైగానే ప్రదర్శించారు. ఆ తర్వాతనే ఆమె గురించి అందరికి తెలిసింది.

12.      మీ మొదటి రచన ఏది? ఏ సందర్భంలో నుండీ వచ్చింది?

            నేను నాలుగో క్లాసులోనో, ఐదో క్లాసులోనో  ఉన్నప్పుడునుకుంటా. మా వూరిలో మేజారి గోవిందయ్య అనే టైలర్‍ రాత్రివేళ మా వూరి విద్యార్ధులకు ఉచితంగా ట్యూషన్‍ చెప్పేవాడు. ఆయన ఒకసారి  8వ తరగతి విద్యార్ధులకు ఛందస్సు  చెబుతూ ఒక రోజు కందపద్యం గురించి, దాని లక్షణాల గురించి చెప్పి మీరు ప్రయత్నించి ఒకటి రాసి చూపించండి అన్నారు. నేను అంతవరకూ ఏకాగ్రతతో ఆ లక్షణాలు విన్నాను. పది నిమిషాల తర్వాత పలకలో ఒక పద్యం రాసి ఆయనకు చూపించాను. ఆ పద్యం ఇప్పటికి గుర్తుంది.

            శ్రీరామాయన్నంతనె

            ఓరామా నొసగితౌర మోక్ష పదంబుల్‍

            శ్రీరామా నిన్ను దలతు

            నోరామానన్ను బ్రోవు మోరఘరామా!

ఇది  నా తొలి రచన. ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లు హైస్కూలుకు వచ్చింతర్వాత హిందీ టీచర్‍ ఎ.జి. యతిరాజులు సారు ద్వారా కవితలు రాయడం, నవలలు రాయడం ప్రారంభించాను. 8వ తరగతిలో పాత తెలుగు సినిమా లాంటి నవల రాధా మాధవీయంఅనేది రాశాను. ఆ తర్వాత ఒక కుష్ఠిరోగి గురించి ఇది కథకాదుఅనే నవలని, అలాగే డిగ్రీ మొదటి సంవత్సరంలో మరో నవల రాశాను. అవి ప్రింటింగ్‍ చేసే స్థాయిలో లేవు. దాని తర్వాత ఎం.ఏ. మొదటి సంవత్సరంలో వున్నప్పుడునుకుంటాను విజయవాడ పున్నమ్మతోట వీధిలోని సాహితీకల్పనఅనే సంస్థ నిర్వహించిన కథల పోటీకి మధురక్షణం’  అనే కథరాసి పంపితే సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. అదే నా మొదటి అచ్ఛయిన కథ. ఆ తర్వాత నాటకాలు వేసుకుంటూ మరికొన్ని కుటుంబ సమస్యలతో కథలు రాయలేదు. ఆ తర్వాత 1988లో నేలరాలిన వసంతంకథతో తిరిగి కథా సాహిత్యంలోకి వచ్చాను. అ విధంగా ప్రారంభించి ఇప్పటి వరకు 150కి పైగా కథలు రాశాను.

13.      ముద్ర నవల నేపథ్యం ఏమిటి?

            చిత్తూరు జిలాల్లో ఆ మాటకొస్తే దక్షిణాదిలో చాలా రాష్ట్రాలలో అణగారిన కుటుంబాలలో కొన్ని మూఢాచారాలతో, మూఢ నమ్మకాలతో ఆడపిల్లల్ని బసివినిపేరుతో ముద్రేసి వదిలేస్తారు. అలాంటి స్త్రీలు వాడకంతా వదినలుగా మారి కొంగుపట్టుకున్న ప్రతివాడితో పడుకొని చివరన చాలా దినావస్థలో చనిపోతుంటారు. అలాంటి వారిని కోస్తాలో మాతంగిఅనీ, తెలంగాణలో జోగినిఅనీ, కర్ణటకలో జోగిత’ ‘దేవదాసీ’, ఒడిస్సాలోను దేవదాసి అని, తమిళంలో మరో పేరుతో పిలుస్తారు. మా పక్క వూరిలో మాదిగ కులంలో ఇలాంటి ఆచారం ఎక్కువగా వుంది. చిత్తూరు జిల్లాలో మరీ ఎక్కువ. అలాంటి వారిపైన రాయాలని రాశాను. ఇది చిత్తూరులో 1998 ప్రాంతంలో ముద్రితమై సంచలనం రేపింది. ఆ పుస్తకం చదివి తిరుపతిలో కోర్టు జడ్జి ఒకాయన జిల్లా అధికారులతో మహతిలో బసివినిలను పిలిపించి వేల మంది బసివినులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించి,తిరుపతిలోని రాజీవ్‍నగర్‍లో కొన్ని వందల ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ మాతమ్మలకాలనీ పేరుతో ఆ కాలనీ వుంది. ఈ నవల చాలా భాషల్లోకి అనువాదం కూడా అయింది. ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. కన్నడంలో అయితే ఆరునెలల్లోనే ద్వితీయ ముద్రణ కూడా అయింది.

14.     తిరుపతిలో సాహిత్య వాతావరణం ఎలా వుండేది? ఆ వాతావరణం మీలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి?

            ఒకప్పుడు చాలా బాగుండేది. పోయిన శతాబ్ధంలో సప్తదశకం ఉత్తరార్థంలో ఉద్యమాలు బాగుండేవి. ఎస్‍.ఫ్‍.ఐ., ఎ.ఐ.ఎస్‍.ఫ్‍,  ఆర్. ఎస్‍.యు. లాంటి అభ్యుదయ సంస్థలు ముందుండి ఉద్యమాలు నడిపేవి. అప్పటి ఉద్యమాలకు మూల చైతన్యంగా త్రిపురనేని మధుసుధనరావు గారు, భూమన్  గారు నిలిచేవారు. ఆ రోజుల్లో వీరిద్దరి ఉపాన్యాసాలు వినడానికి సినిమా యాక్టర్ని చూడడానికి జనాలు ఎలా ఎగబడుతారో అలా ఎగబడి వచ్చేవారు. కొన్ని తరాలను ఆ విధంగా వారు ప్రభావితం చేశారు. రాను, రాను ప్రత్యేక ఉద్యమాలు తగ్గిపోయాయి.  అయినా త్రిపురనేని చనిపోయేవరకూ మార్క్సిస్టు నిబద్దతతోనే వున్నారు. నా ‘‘చీకటి రాజ్యం’’ నవల ఒక గ్రామంలో రేగిన తెలంగాణ ఉద్యమం లాంటి తిరుగుబాటును చిత్రించిన నవల అనీ చాలా మీటింగులల్లో చెప్పే వారు. ఇప్పుడు ఆయన పోయినా ఇంకా ఇలాంటి చైతన్యాన్ని కొందరిలోనైనా కలిగించాలన్న తపన భూమన్  గారికి  ఉంది.

            ఇలాంటి సంస్థల్లో తిరగడం ద్వారాను, ఇలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొనడం వల్లనూ, నాలో శాశ్వతంగా అభ్యుదయ భావాలు స్థిరపడ్డాయి.

15.      మధురాంతకం రాజారాం ప్రభావం మీ మీద ఉందంటారు. అది ఎంత వరకు నిజం?

            రచనా పరంగా మధురాంతకం రాజారాం ప్రభావం నా పైన ఉందని నేను అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఏ ఇతర రచయితల ప్రభావానికీ నేను లోనయ్యానని భావించడం లేదు గానీ వారి రచనలు మాత్రం బాగా చదువుకున్నాను. అటాంటి వారు మరికొందరి ద్వారా నే నే దారిలో సాహిత్యపరంగా నడవాలన్నదీఎవరి పక్షాన నా రచనలు ఉండాలన్నదీ మాత్రం నేర్చుకున్నాను. నిజానికి నావి పదైదు, ఇరవై కథలు ప్రింటైన తర్వాతగానీ రాజారాం లేదా ఇతర రచయితలతో నాకు పరిచయం బహిరంగంగా కలుగలేదు. నాకు ఫీలింగ్‍ వుండేది నేను పల్లెనుంచీ వచ్చినోన్ని అనే భావన. పైగా ఫ్రీగా ప్రవర్తించలేని మనస్తత్వం, షై వుండేది. న్యూనతా భావం వుండేది. ఆ కారణంగా మొదట నాకు ఎవరితోనూ పరిచయాలు లేవు.

            రాజారాం ఆంధప్రభలో నా మెరవణి కథచదివి అప్పటి ఎడిటర్‍ వాకాటి పాండురంగారావు దగ్గర నా అడ్రస్‍ తీసుకొని మా తెలుగు డిపార్ట్మెంటుకు వెతుక్కుంటూ వచ్చారు. ఆ తర్వాత కాత్యాయనీ విద్మహే మేడం గారి తండ్రి రామకోటి శాస్త్రి గారు మా యింటికి నాకు కొత్తగా పెళ్ళయిన సంవత్సరం వచ్చి నీ కథలు బాగున్నాయి. మీ మామగారు నాకు చాలా సన్నిహితుడు. నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. అని చెప్పి ఆశీర్వదించి పోయారు. అలాగే కా.రా. మాష్టారూ, మునిపల్లి రాజుగారూ, అబ్బూరి ఛాయాదేవి, కేశవరెడ్డి, సింగమనేని, స్వామి, శాంతినారాయణ, విశాలాంధ్ర మేనేజర్  పి రాజేశ్వరరావు, చాసో, వల్లంపాటి వంటి వారు మా ఇంటికి వచ్చేవారు. కేతుమేష్టారు నాకు గురువు. మా మామగారి కొలీగ్‍ కావడంతో చాలా అభిమానంతో మా యింటికి వచ్చేవారు. ఆ విధంగానే ఇంకా చాలా మంది రావడంతోనూ, పరిచయాలు ఏర్పడడంతోనూ నాలోవున్న న్యూనతాభావమూ, షై తగ్గాయి.

            కాకపోతే రాజారాం గారి అబ్బాయి తిరుపతిలో వుండడంతో తిరుపతికి వచ్చినప్పుడల్లా మా యింటికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడే వారు. నేనంటే వారికి చాలా ప్రేమ ఏర్పడింది. నాతో ఎన్నో ఆంతరంగిక విషయాలు చెప్పుకునేవారు. అలా వారు నాకు సన్నిహితులే గాని వారి రచనల ప్రభావం నా పైన లేదు.

16.      రాయలసీమ సాహిత్య ప్రత్యేకత ఏమిటి?

            మొదటి నుంచీ రాయలసీమ కరువులతో ఒక వైపు కక్షలతో మరోవైపు అల్లాడుతూనే వుంది. దీన్ని గురించి పట్టించుకునే ప్రభుత్వాలేరాలేదు. రాయలసీమ నుంచీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులయినా దీన్ని గురించి పట్టించుకోక పోవడం దురదృష్టం, మొదటి నుంచీ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా రాజకీయ నాయకుల అధిపత్యం మూలంగా అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఉత్తరాంధప్రాంతాలు వివక్షకు గురవుతూనే వచ్చాయి. కారణం అవి సంపన్న జిల్లాలు. మిగిలినవి పేదప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఊడిగం చేసే ప్రభుత్వాలే ఎప్పుడూ వుంటాయి.  ఆ కారణంగా తెంలంగాణా వేరు పడింది. రాయలసీమ ఎప్పుడో ఒకప్పుడు వేరు పడుతుంది. ఆ తరువాత ఉత్తరాంధ్రలోనూ చలనం వస్తుంది - గ్యారంటీ.

            ఈ కారణాలవల్లనే ఈ ప్రాంతాలలో ఉనికి కోసం ఆరాటం కనిపించే సాహిత్యమే వచ్చింది. రాయలసీమలోనూ అంతే. ఈ ప్రాంతపు కథ అయినా, నవలయినా, కవిత్వమైనా ఇక్కడి జనాల బాధల్ని చిత్రీకరించి, రాయలసీమ ఉనికిని కాపాడుకోవాలన్న దృక్పథాన్నే వెలువరుస్తోంది.

17.      ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్యాన్ని మీరెలా చూస్తారు?

            ఇప్పుడు వస్తున్న సాహిత్యం తీవ్రత లేదా గాఢత తగ్గింది. కారణం రాసేవాళ్లకి తీరికలేదు. చదివే ఒపిక లేదు. కాబట్టి అధ్యయనం లోపించింది. అయినా స్వామి, శాంతికారాయణ, అట్టాడ అప్పలనాయుడు, సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి, శిరంశెట్టి కాంతారావు, మల్లిపురం జగదీష్‍ లాంటివారు మంచి సాహిత్యాన్ని పుట్టిస్తున్నారు. ఆ కారణంగా కొంచెం ఆశాజనకంగానే వుంది. అయితే వారుగాక ఇప్పుడు రాస్తున్న వారిలో మాత్రం సామాజిక నిబద్ధత కరవైందనిపిస్తోంది.

18.      ఇప్పటి సాహిత్య విమర్శను ఎలా చూడాలంటారు?

            విమర్శ అంటే మంచిని పొగడడమే కాదు. రచనలోని లోపాలను చూపించి విశ్లేషించగలిగితే దాని వల్ల ఆ రచయితకీ, ఇతర సాహితీకారులకు మేలుజరుగుతుంది. అలాంటి విమర్శ రా.రా, చే.రా, లాంటి వారితోనే పోయింది. ఇప్పుడు రాచపాళెంగారు సాగిస్తున్న సాహిత్యవిమర్శ మెచ్చుకోలుగా వుంది. మిగిలినవాళ్లు వాళ్ళ మిత్రుల సాహిత్యంపైన, లేదా తమ వర్గంలోని వ్యక్తుల సృజనపైన పొగుడుతూ విమర్శానాగ్రంథాలు రాస్తున్నారు. దురదృష్టవశాత్తు సృజనకారులు తక్కువైనా వర్గాలు ఎక్కువ చేసుకున్నారు. తమవర్గం కాని వారు ఎంత మంచి రచన చేసినా కనీసం దాన్ని చదవడంలేదు. అవార్డులు రివార్డుల విషయంలోనూ ఈ వర్గాలు బలమైపోతున్నాయి. అదొక దురదృష్టం. ఇప్పుడొస్తున్న పురస్కారాలన్నీ అలాంటివే మరి.

19.      సాహిత్యంద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనా?

            తప్పకుండా సాధ్యమే. మంచి సాహిత్యం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది అని నమ్మేవాళ్లల్లో నేనూ ఒకన్ని మంచి సాహిత్యం పఠితకు  హృదయ సంస్కారాన్ని, సమాజం పట్ల అవగాహనని ఏర్పరుస్తుంది. మంచి పౌరుడిగా, మానవత్వంవున్న మనిషిగా మనిషిని తీర్చిదిద్దేది సాహిత్యమే. చూడండి ఒక ప్రదేశానికి పోయి చెడిపోయినవాన్ని చూస్తాం. చెడు స్నేహాలు చేసి చెడిపోయిన వాన్ని చూస్తాం. సినిమాలు చూసి చెడిపోయిన వాన్ని చూస్తున్నాం కానీ పుస్తకం చదివి చెడిపోయిన వాన్ని ఒక్కడంటే ఒక్కన్ని కూడా చూడలేం. అలాంటిది సాహిత్యం. అయితే నేడు బుక్  కల్చర్‍పోయి లుక్  కల్చర్‍ వచ్చేసింది. ప్రపంచీకరణ భూతం మనుషుల్లోని మానవత్వాన్ని మింగేసింది. అలాగే  నేటి అంతర్జాలం పుణ్యమాని పూర్తిగా, అది తన  ఉనికినే  కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాట్సాప్‍లు, ముఖపుస్తకాలు, ట్విట్టర్లు అంతా గందరగోళం. మనషుల్లో సోమరి తనాన్ని, కళ్ళజబ్బుల్ని, మానసిక అనారోగ్యాన్ని ఇవి కలిగిస్తున్నాయి. మళ్ళీ వీళ్ళని పుస్తకం వైపు మళ్ళిస్తే గాని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఊహించడం కష్టమే.

20.      సాహిత్య జీవితం మీకు ఎలాంటి తృప్తినిచ్చింది?

            నేను నా మేధస్సు అనుమతించిన మేరకు మంచి సాహిత్యాన్ని అందించాననుకుంటున్నాను. కానీ సాహిత్య జీవితం కాస్తా మంచిగానే వున్నా నాకింకా సంతృప్తి కలుగలేదు. చాలా సమస్యలపైన, జీవితంపైనా విభిన్నకోణాలలో సాహిత్యన్ని సృష్టించాలని ఉంది. సమాజంలో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అంతరించే వరకు ఇంకా రాయాలనే ఉంది. అలా రాసనప్పుడే నాకు  సంతృప్తి.

            దురదృష్టం ఏమిటంటే నా సాహిత్య జీవితంలోను కొన్ని ఎదురుదెబ్బలు, అవమానాలు, వివక్షతలు కూడా ఎదుర్కొన్నాను.

21        మీ సాహిత్యసేవను ఎలా చూడాలంటారు?

            మంచిగా  చూస్తే చాలు.

22.       సాహిత్య విమర్శలో మీ రచనలు?

            నేను ముందే చెప్పాను. లోచూపు పుస్తకంలో మాత్రం లోతైన విమర్శనా వ్యాసాలు వున్నాయి. మిగితావి పరిశోధనలు మాత్రమే.

            అయితే తెలుగులో ఇప్పటికీ సరైన విమర్శ  రాలేదనే నా భావన. అలాంటి సరైన విమర్శ అనిపించుకోవాలనే ఆ విషయాలు రాశాను.

23.       తెలుగు నాటక చరిత్రలో మీ భాగస్వామ్యం? అవార్డుల ఎన్నికల్లో మీ పాత్ర?

            నాటక సాహిత్య చరిత్రలోనూ నాకూ ఒక పుట వుండే విధంగానే రాశాననిపిస్తోంది. తరిగొండ వెంగమాంబ నాటకం, కాటమరాజు యద్ధం , చెంచిత పద్యనాటకాలు చాలా సార్లు ప్రదర్శించి మెప్పును పొందాను. అలాగే నా రేడియో నాటకాలు ఎన్‍.ఆర్‍. నంది, పి.వి రమణ లాంటి వారి ప్రశంసల్ని అందుకున్నాయి.

            నేను రాసి ప్రదర్శించిన నరమేధంనాటకం గత శతాబ్ది చివరి దశకంలో సంచలనమైన నాటకంగా పేరుతెచ్చుకుంది. ఇటీవల రాసిన ప్రసిద్ద తెలుగు నాటకపద్యాలుఅన్న పరిశోధనాగ్రంధం  నాటకసాహిత్యంలో శాశ్వతంగా నిలబడిపోయేదే.

            ఇక అవార్డుల విషయానికొస్తే నేను దేనికి న్యాయనిర్ణీతగా వెళ్ళినా  లోపాలను, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా రాసిపెడతాను. ఆ కారణంగా నా న్యాయనిర్ణయం బాగానే వుంటుందని అంటారు. నా న్యాయనిర్ణయంలో పక్షపాతం, పైరవీ తత్వం ఏమీ వుండవు.... పెద్దపెద్దవాళ్ళే ఫోన్లు చేసి రికమెండషన్‍ చేస్తారు. వత్తిడి తెస్తారు. గానీ నేను ఏనాడు వత్తిళ్ళకు లొంగలేదు. నా సెలక్షన్‍ బాగానే వుంటుందన్న పేరు తెచ్చుకున్నాను. సాహిత్య పురస్కారాల విషయంలోను అంతే అది చాలు.

 

24.      మీరు వ్రాసిన పాఠ్యాంశాల గురించి చెప్పండి

1990 లో విష్ణుశ్రీ వ్రాసిన జాణ పదాలు అనే పుస్తకానికి నేనే ముందుమాట వ్రాసి తిరుపతిలో అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి వి సి గా ఉన్న సినారె చేత అవిష్కరింప చేశాను.  అందులో నా ముందు మాట చదివిన సినారె  నా చేత బి ఎ డిగ్రీ  రెండవ సంవత్సరినికి జానపద ప్రదర్శన కళలు అన్న పేపర్ కు విధి నాటకాలు అడే  పద్దతి, విధి నాటకాల నిర్మాణం – పాడే పద్దతి అనే రెండు పాఠ్యాంశాలు వ్రాయించారు.

బతుకాట నవల ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా డిగ్రీ మొదటి సంవత్సరినికి పాఠ్యాంశంగా  పెట్టారు.  అలాగే  కొన్ని అటానమస్ కళాశాలల్లో ముద్ర నవల పాఠ్యాంశంగా  ఉంది.  కృష్ణ  దేవరాయ విశ్వవిద్యాలయంలో  పి  జి విద్యార్ధులకు కొంత కాలం ‘చీకటి ముడులు’, ‘పరస’ నవలలు పాఠ్యాంశంగా  ఉండేవి .  ప్రస్తుతం రాయలసేమ విశ్వా విద్యాలయంలో  పి జి  విద్యార్థులుకూ ‘వలస’ నవల పాఠ్యాంశంగా  ఉంది .

25.       సాహితీవేత్తలకు, గోదావారి అంతర్జాల పత్రిక ద్వారా మాకేం చెప్పదలుచుకున్నారు?

            ఇప్పటి సాహితీకారులు ఒకరి చెబితే వినే స్థాయిలో వుంటారనుకోవడం అనుమానమే. రచయితలకి, కవులకు ఇగోలు ఎక్కువైపోయాయి. ఈ  ఇగోలు పోయేంతవరకు వాళ్లు చెబితే వింటారనుకోను. అయినా ఎక్కువ చదివి తక్కువ రాయడం పటిష్టంగా ప్రయోజనకరంగా రాయాలి. రాశికాదు వాసి వుండేటిగా  చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న కష్టాల గురించి రాయండి అని మాత్రం చెప్పగలను. వర్గాలకి దూరంగా వుండాలని కూడా చెప్పాలనిపిస్తోంది.

 

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు