మా రచయితలు

రచయిత పేరు:    జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

కథలు

కూటీస్

     "ఈ సాఫ్టు వేరు ఎంత పాప్యులర్ అయిందో తెలుసా?"

     "ఓహో పాప్యులర్ ఫుట్ వేరెట్టాడా? మన భీంవరంలో పాప్యులరూ బాటాల కంటే అబద్ధంగాడి చెప్పులకే మంచి పేరుండేదిరా. ఈ కంపెనీ చెప్పులొచ్చి ఆడి నోట్లో మట్టి కొట్టాయి. ఫారిన్ మాల్ కొట్లొచ్చి కంపెనీల నోట్లో మట్టికొట్టాయి. ఉప్పుడా ఫారిన్ కంపెనీల నోట్లో ఫారిన్ మట్టే కొట్టే సొల్లు బుకింగులొచ్చాయి. ఏంటదీ, అమ్మేజానో కొనేజానో ఉంది చూడు. దాంట్లో కొడితే చాలు, ఎంత అమిరికా చెప్పులైనా సరే ఇలా బుకింగు సేత్తే అలా ఇంటికొచ్చి వాలిపోతన్నాయి. ఇదేం పోయేకాలమో ఏంటోగానీ దీనిగురించి బ్రమ్మంగారు కూడా రాయలేర్రా అబ్బాయ్. ఈ లంకంత ఇల్లూ ఈ కార్లూ, ఇంట్లోనే ఈత చెరువులూ, పైకీ కిందకీ లిఫ్టు. అది పనిచెయ్యకపోతే మెట్లూ ఇయ్యన్నీ చూసి ఇంత పెద్ద కోటీస్వరుడు ఏ మహారాజు ఉజ్జోగం ఎలగబెడతన్నాడో అని తెగ సంబర పడిపోయాను. చెప్పుల కంపెనీలో సేరి వచ్చిన సచ్చినోళ్ళందరికీ కాళ్ళు పడతన్నాడా, సిగ్గులేనెదవ. రానీ చెబుతాను"

     "తాతయ్యా నన్ను మాట్లాడనిస్తావా? అంతా నువ్వే మాట్లాడేస్తావా?"

     "మాట్లాడ్డానికిదేవన్నా మీటింగేంట్రా? నన్నేవైనా సెప్పనిస్తావా అంతా నువ్వే సెప్పేత్తావా అనడగాలి. చివరాకరకి తెలుగ్గూడా రాకుండా తయారయ్యావు యెద్దవ్వా"

     "తాతోయ్.., మీ భీంవారం మాటలు విండానికి బలే ఉంటాయి. ఇంతకీ యెద్దవ్వ అంటే ఏంటి? ఎద్దుకి అవ్వా"

     "ఎద్దుకి అవ్వేంట్రా యెదవన్నర యెదవా. యెదవా అంటే పనికిమాలినెదవ అనర్థం"

     "ఓ మా తాతయ్యలాంటోడన్నమాట"

     "అబ్బో యెటకారాలకేం తక్కువ లేదుగానీ మీ నాన్న పాపులర్ సాఫుట్ వేర్ నించీ ఎన్నింటికొత్తాడేంటి?"

     "అది పాపులర్ సాఫుట్ వేర్ కాదు.  పాపులర్ అయిన సాఫ్టు వేర్. దానిగురించి నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్లకాదు"

     "వురే నాకు పొట్టకోత్తే అచ్చరమ్ముక్కరాదు. అయినా నువ్వేదో ఫుట్ వేరనగానే అబద్ధంగాడినించీ మొదలెట్టి అందరి చెప్పుల కతా చెప్పుకొచ్చానా లేదా? ఇంతకీ నీకా చెప్పుల కతలేమైనా తెలుసా?"

     "ప్చ్. ఐ డోంట్ నో"

     "యెదవింగ్లీస్ మాట్లాడావంటే మూతి పగలగొట్టేత్తాను. ఐ డోంట్ నో అంటే నాకు తెల్దనుకుంటున్నావా?"

     "తాతయ్యా ఏకంగా అన్ని రకాల చెప్పుల కథలే తెలిసినోడివి. ఐడోంట్ నో అంటే ఏంటో తెలీదని ఎలా అనుకుంటాను?"

     "అద్దీ అలా రా దారికి. ఉప్పుడు చెప్పు ఆడి సాఫుట్ వేరు గురించి"

     "నువ్విందాకా చెప్పుల కథలో ఇలా నొక్కితే అలా చెప్పులింటికొచ్చేత్తాయన్నావు చూడు. ఆ చెప్పుల్లాగే టిఫిను, భోయినం, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్..,"

     "కొంపతీసి ఆ డ్రింక్స్ కూడానా ఏంటి?"

     "లేదులే తాతయ్యా, ఆ డ్రింక్సు అమ్మడానికి సెన్సున్నా లేకపోయినా లైసెన్సు మాత్రం ఉండాలి. అదంత సులభంగా రాదుగానీ, కూల్ డ్రింక్సుతో సరిపెట్టుకో. దీంట్లో కూడా ఇలా నొక్కితే సాలు టిపినీలు బోయినాలూ అలా ఇంటికొచ్చేస్తాయి"

     "ఏంటీ, ఇంటికే వచ్చేత్తాయా? సల్లారిపోవూ? అదీ మంచిదేలేరా మనవడా. ఎంతైనా చద్దన్నం చద్దన్నమే. దాని రుచీ, చలవా, బలం దేనికీ రాదు. అంటే ఆ ఫుట్ వేరెట్టి మీ నాన్న ఐద్రాబాదులో అందరికీ సద్దన్నం అలవాటు సేత్తన్నాడన్నమాట. మంచిదేగా?"

     "చద్దన్నాలు తినడానికి ఇదేమన్నా భీంవారంలో బల్సుమూడా? హైదరాబాదు. వేడివేడిగా ఉంటేగానీ ఏదీ తినరు. ఇలా ఆర్డరివ్వగానే అలా హోటలోళ్ళు ప్యాక్ చేసిచ్చేస్తారు. వాటిని ఇంత పెద్ద హాట్ పేకులో తెచ్చిపెడతారు. దాంతో వేడి తగ్గదు. ఇది పాత సాఫ్టువేరు కథ. ఇప్పుడు కొత్త యాప్ కథ"

     "ఏంటీ యాపాక్కతా?"

     "ఇప్పుడు మీ ఊళ్ళో చిన్నప్పుడు వేప్పుల్లల్తో పళ్ళుతోముకోవడం గురించీ, పళ్ళ పొడుల గురించీ పేస్టుల గురించీ కథలు చెప్పద్దు. నేనంటున్నది యాప్. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఎవరింట్లోంచీ కావాలంటే వాళ్ళింట్లోంచీ మనకి ఇష్టమైన ఫుడ్ ఐటం తెప్పించుకోవచ్చు"

     "అదికాదొరే..,"

     "మధ్యలో మాట్లాడకు. ఈ మధ్యన పెర్సనల్ హైజిన్ పట్ల అవేర్నెస్ బాగా పెరుగుతోంది. అంచేత సాదాసీదా హోటళ్ళనించీ తెప్పించుకు తినడానికి  ఎవరూ ఇష్టపడ్డంలేదు. పెద్దపెద్ద హోటళ్ళకి వెళ్ళడానికి డబ్బులు చాలవు.  అలాంటివాళ్ళందరికీ ఈజీగా హైజెనిక్ ఫుడ్ అందించడానికి ఓ కొత్త యాప్ కనిపెట్టాడు నాన్న. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మనవాళ్ళు బోల్డుమందుంటారు. వాళ్ళలో చాలామంది హౌస్ వైఫులుగా ఉంటూ ఇంట్లోనే ఖాళీగా కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళలో ఎంతోమంది వంట బాగా చేస్తారు. ఎంత బాగా చేసినా అందరూ అన్నీ రుచిగా వండలేరు. ఒకావిడ పులిహోర స్పెషలిస్టయితే ఒకావిడ వంకాయ కూర స్పెషలిస్ట్. ఇంకొకావిడ కోడి ఇగురు ఇంకొకావిడ బొమ్మిడాల పులుసు. ఇలా ఒక్కొక్కళ్ళూ ఒక్కో ఐటంలో స్పెషలిస్టులై ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఎవరి ఐటం వాళ్ళు వండుతారు.  మన బాయ్స్ వెళ్ళి ఆ ఐటమ్స్ కలెక్ట్ చేసుకొచ్చి మనకి వడ్డిస్తారు"

     "ఎంత ఆడోళ్ళైతే మాత్రం ఆళ్ళంత సుచీ సుభ్రంగా సేత్తారో లేదో ఎలా తెలుస్తుందిరా?"

     "గుడ్ క్వశ్చిన్. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నవాడికి దగ్గర్లో ఉన్న వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కుక్స్ అందర్నీ చూపిస్తుంది. వాళ్ళ ఇళ్ళలోని క్లీన్లీనెస్ వాళ్ళు తీసుకునే హైజెనిక్ ప్రికాషన్స్ గురించి  చెబుతుంది. కూరగాయలూ ఆకుకూరలూ, గుడ్లూ, మాంసం ఎట్సెట్రాలన్నీ ఎంత తాజాగా ఉన్నాయో చూపిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి?"

     "ఏదీ నాకోసారి చూపించు"

     "ఇదిగో, ఈవిడ పులిహోర ఆంటీ"

     "ఆ ఇల్లూ వాలకం సూత్తంటే బ్రాంబర్ల ఇల్లులా ఉంది. ఆ వండే ఆవిడకూడా మా పంతులమ్మగార్లాగే ఉన్నారు"

     "కరెక్ట్. వాళ్ళు బ్రాహ్మిణ్సేగానీ, ఇదిగో ఇది ఉప్మా పెసరట్టాంటీ ఇల్లు"

     "అబ్బో ఉప్మా పెసరట్టే. అంటే ఈవిడ ఇడ్లీ కారప్పొడి, అటుకులుప్మా కూడా తెగ బ్రమ్మాండంగా చేస్తుంది. ఎంతైనా కోవట్ల టిపినీలే టిపినీల్రా"

     "వండ్రఫుల్. తాతయ్య సామాన్యుడు కాడు. మా నాన్న నీ తెలివిని తెగ పొగుడుతూంటే ఎవళ్ళనాన్న వాళ్ళకి ముద్దులే  అనుకునేవాణ్ణి. పర్లేదు. నాలెడ్జ్ బానే ఉంది. ఇదిగో ఇదేమో రొయ్యల ఇగురు స్పెషలిస్ట్ ఇల్లు. చూడు ఇల్లెంత నీటుగా ఉందో. వాళ్ళ కిచెనైతే క్లీన్లీ నెస్ లో ఫస్ట్"

     "సూత్తంటే ఈరింట్లో పులస సద్దిపులుసు కూడా దొరుకుతుందనిపిస్తంది"

     "కరెక్ట్. ఎలా గెస్ చేశావ్?"

     "ఆరు రాజులింట్లో రానెమ్మగోర్లా ఉన్నారు. పులస సద్దిపులుసు, పూతసుట్టలూ, గోరుమిఠీలూ తింటే రాజుగోరింట్లోనే తినాలి"

     "యూ ఆర్ జీనియెస్ తాతయ్యా. ఇప్పుడు చెప్పు. ఇది ఎవరిల్లు?"

     "రేయ్, ఆ వంటిల్లింకోపారి సూపించరా. అదిగో ఆ పింగాణీ కల్వం, ఆ కోడి కాళ్ళూ ఆ వాసన బియ్యం ఆ వండే ఆవిడ సీర కట్టూ సూపు వాడీ చూశాక్కూడా ఆరు కమ్మోరని తెల్దేటి? ఆరింట్లో కోడి పలావుంటాది సూడూ, అబ్బబ్బబ్బ. దానికి రుచంతా నూరే మషాళాలోనే ఉంటందిరా బాబూ"

     "నువు నిజంగానే మొగాడివైతే ఇదెవరిల్లో కనిపెట్టాలి తాతయ్యా"

     "ఇదెవరిల్లబ్బా. మాయదారి కాలం కాపోతే అన్నిళ్ళల్లోనూ అవే సోపాలూ అవే ఫ్రిజ్జులూ అవే టీవీలు. ఎలా కనిపెట్టాలబ్బా? అదిగో, ఆ పక్కన బొగ్గులు. ఆటిమీద సీకుల కమ్మీలు. అయ్యన్నీ సూత్తంటే అది ఉప్పరోళ్ళ ఇల్లులా ఉంది. ఆ దండేసిన  పుటోవులో ఉన్నావిడ కొప్పు సూత్తే సాలు. ఆరి కతంతా సెప్పెయ్యచ్చు"

     "నువ్వు దీన్ని ఎంతమాత్రం కనిపెట్టలేవనుకున్నాను. కానీ కనిపెట్టేశావు. నీ టాలెంట్ అద్భుతం. ఇప్పుడు చెప్పు. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి?"

     "మందేవూరు?"

     "కోపల్లె"

     "పెద్దబడుండేదేవూరు? భీంవారం. ఆ బళ్ళో సదూకునే కోపెల్లోళ్ళందరికీ అన్నాలెట్టిందెవరు"

     "ప్చ్ తెలీదు"

     "ఆల్లమ్మలూ మామ్మలూ ఎట్టేవారు. అప్పట్లో ఎవరి కులం ఆరికుండేది. ఎవరి మతం ఆరింట్లో ఉండేది. ఒంట్లో కులం, ఇంట్లో మతం ఉండకూడదనే మంచి మనసుతో ఎట్టిందే పెద్ద బడి. ఆ పెద్ద బడిలో చదివేవాళ్ళెవరికీ కులం-మతం, అంటు-సొంటు ఉండేవి కాదు. ఆడోళ్ళు అన్నాలొండేవాళ్ళు. కారేజీల్లో ఎట్టేవాళ్ళు. అయన్నీ పెద్దబడికి అట్టికెళ్ళి ఎవరి కారేజీ ఆరికిచ్చేది ఎవరనుకుంటున్నావు? మనమే. మనకో పెద్ద తొక్కుడుబండుండేదిలే. ఆ బండిమీద ముందు వరసలో బ్రాంబర్లు-కోమట్ల కారేజీలు, ఆటెనక రాజులూ కమ్మోరూ కాపుల కారేజీలూ ఆ యెనకమాల అమాంబాపతు కారేజీలూ ఎట్టుకుని కోపెల్ల, పెదమిరం, చినమిరం, రాయలందాకా ఒక్కోఊర్లోనూ కేరేజీలన్నీ బండిలో ఎక్కించుకుంటూ వచ్చేవాణ్ణి. అప్పటికి మూడు వరసల కేరేజీలయ్యేవి. ఎన్ని వరసలున్నా సరే, బ్రాంబర్ల కేరేజీలకి మాత్రం వేరే ఎవరి కేరేజీలకీ తగల్నిచ్చేవాణ్ణి కాదు. ఈ నీసుగాళ్ళ వాసన ఆ నీటుగాళ్ళకి పట్టించడం పాపం. అందుకే నేను కూడా ముట్టుకునేవాణ్ణి కాదు. నేను పెద్దబడికాడికెళ్ళి బెల్లు కొట్టగానే పిల్లలంతా ఎవరి కేరేజీ వాళ్ళట్టుకుపోయేవాళ్ళు"

     "గ్రేట్. ఈ విధమైన డబ్బావాలా గ్రూప్ బొంబాయిలో చాలా ఫేమస్ తెలుసా?"

     "ఎర్రెదవా, ఎంత బొంబాయోడికైనా భీంవారం వత్తేగానీ బుర్రుపయోగించడం ఎలాగో తెల్దులేగానీ. ఆళ్ళకంటే ముందునించే మనకీ పద్దతుండేది. రాజుల కాలంలో కూడా పొలాలకెళ్ళడాలూ పనులకెళ్ళడాలూ బడికెళ్ళడాలూ ఉండేయి.  ఇయ్యన్నీ ఉన్నాయీ అంటే అన్నాలట్టికెళ్ళేవోళ్ళూ ఉండాల్సిందేగా? ఆ అన్నాలట్టికెళ్ళడమే మన వంశాచారం. తాతముత్తాతల్నించీ కూడట్టికెళ్ళి ఇచ్చేవాళ్ళం కాబట్టే మనింటికి "కూటోళ్ళు" అనే పేరొచ్చింది. మంగళ్ళొచ్చి సన్నాయి వాయిస్తేనే శుభం. చాకళ్ళొచ్చి ముట్టుకుంటేనే మడి. వాళ్ళలాగే మన కూటోళ్ళు కూడా మడే. అందుకే మనం ముట్టుకున్నా అంటయ్యేది కాదు. అలాగని బ్రాంబర్ల కారేజీల్లో పప్పలు బాగుంటాయి కదాని మనం ఆ కారేజీలకీ మరచెంబులకీ మూతలు తియ్యకూడదు. ఒకవేళ ఏదో జివచచ్చి రెండు దొంగపప్పలు తిన్నా.., తిన్నసంగతి ఎవళ్ళకీ చెప్పకూడదు. అయినా మీ నాన్న కాలానికే మడీ-దడీ, చాదస్తం-గీదస్తం పోయి శుచీ-శుబ్రాలు మాత్రమే మిగిలాయి. అందుకేగా నువ్విన్నిళ్ళు చూపించినా అన్నీ నీటుగా క్లీనుగా ఇందాకా ఏదో అన్నావు చూడు..,"

     "హైజిన్"

     "c హై జున్ను. ఆ హై జున్నుంటే ముర్రుపాలు తాగినంత బలం. అప్పట్లో కేరేజీల బండి తొక్కీ తొక్కీ మీ నాన్నని చదివించాను. ఆ కేరేజీలు పోయి మెస్సులొచ్చి కులం-కిలం, మతం-గితం లేకుండా అందర్నీ పక్కపక్కనే కూర్చోపెట్టి వడ్డించడం మొదలెట్టి మన కూటోళ్ళ తొక్కుడు బండిని అటకెక్కించాయి. ఆ అటకమీంచీ దింపినోళ్ళే బొంబాయి డబ్బావాలాలు. ఆళ్ళని చూసి ఈ సెల్లులోళ్ళు ఫోను హోటల్ బుకింగులెట్టారు. ఆళ్ళని మించి ఆలోచించి మీ నాన్న ఈ ఇంటివంటలెట్టాడు. చివరాకరకి ఏమైంది? గాంధీ తాత కాడినించీ మీ తాతదాకా వద్దు వద్దంటూ వదిలించుకున్న కులం తేడాలన్నీ ఉప్పుడు సెల్లుల్లోకి ఎక్కించారు. బ్రెమ్మంగారు ఊరికే చెప్పారా? బూమి గుండ్రంగానే ఉంటాది. వచ్చింది పోతాది. పోయిందే వస్తాదీ అని. ఈ యెదవలు పప్పులో వద్దన్నదాన్ని పులుసులో ఏత్తన్నారు. పులుసులో వద్దన్నదాన్ని చారులో పోత్తన్నారు. దేంట్లోనూ వద్దనుకున్నదాన్ని కుప్పతొట్టిలో ఎయ్యడం మానేసి ఇదిగో ఈ యేప తొట్టిల్లో ఏత్తన్నారు"

     "యూ ఆరె గ్రేట్ ఫిలాసఫర్ తాతయ్యా"

     "నా తొక్కుడు బండి ఎంత అటకెక్కితే మాత్రం మళ్ళీ మళ్ళీ లాసఫర్ లాసఫర్ అని గుర్తుచెయ్యక్కర్లెద్దుగానీ ముందు మన కూటి సంగతి చూడు"

     "నీతో మాట్లాడుతూనే మనకి బ్రాహ్మిణ్స్ భోయినం ఆర్డరిచ్చాన్లే. ఇంకో రెండు నిమిషాల్లో వస్తుందిగానీ ఆ యాప్ పేరేంటో తెలుసా? కూటీస్"

     "కూటీసా? అంటే ఏంట్రా?"

     "మనింటిపేరు"

     "వార్నీ అందరూ కూటీస్ లో ఆర్డరిచ్చాను. కూటీస్ లో ఆర్డరిచ్చానని చెప్పుకుంటూంటే అదేదో ఇంగ్లీషనుకున్నాను. మనింటిపేరేనా? "

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు