మా రచయితలు

రచయిత పేరు:    అల్లం వీరయ్య

కథలు

ఒక్కపురి

      ఇల్లు ఇలువాటిడిసి మంథేనవోపారి, మాదేపూర్‌వోపారి తిరగవడితివి. ఎక్కడి పనులక్కడ్నే ఉండె. అటుసూత్తె పాలేరోల్లు గీసిన కాడికే తిరిగి రావట్టిరి. ఏమోనమ్మ ఈ అట్టదంబాల చేత సేత్తేంది ఊకుంటేంది'' బుచ్చక్క సణుగుడెక్కువైంది.

            ''చెత్‌ ఊర్కెనే తిర్గత్తన్నన. పనుంటెనే పోతన్న'' నర్సయ్య గట్టిగానే గద్దించిండు. ''నేను గదే అంటన్న. పనిపనని బయట తిరిగుతే, అటు మిరపసెట్లు దౌరకచ్చె అరికల్ల మట్లనే ఉండె. ఏసికి నారుదొయ్య దున్నియ్యకపోతివి'' బుచ్చక్క తగ్గలె. ''మల్లగదేమాట, ఒదానెనుక ఓటైతది ఏగిరానికి ఒక్కరోజుకే అయితయా!'' నర్సయ్య.

                రోజు బుచ్చక్క, నర్సయ్యల ముచ్చట్టిట్లనే ఉంటయ్‌. తోటోల్ల పనులు పూర్తైతన్నయని, పనులెనుకవడితె కూడ దీసుకునుడు కష్టమని ఇద్దరికి తెలుసు.

*   *  *  *  *

                నర్సయ్య ఆ ఊల్లె పెద్దరైతు. పైగా ఆ ఊల్లె చిన్న చితక పంచాయతీ తీర్పులు, భూములు కొనడం అమ్మడం వంటి వాటికి మాటసాయం చేత్తడు.

                ఏ చిన్న సమస్యనైనా యుక్తిగా పరిష్కరించే నేర్పున్నది. గత యాబైయేండ్లుగా  నర్సయ్య  లేకుండా ఏ పంచాయితీ తెగలే.  ఊపిరి  సలుపని పనులున్నా ఈ పనులకు తప్పక తినుండవలసిందే- పెద్దమనషన్నపుడు ఇగురానికో ఉప్పోసకో వచ్చినోళ్ళకు తోచిన సలహాలువ్వడం తప్పనిసరి. అయితే ఇరవై ఎకరాల భూమున్నప్పటికి రెక్కలు ముక్కలు చేసుకుంటంది బుచ్చక్క.

      బుచ్చక్కకు పనిదయ్యం పట్టిందని ఇరుగు పొరుగమ్మలక్కలనుకుంటారు. ముగ్గురు కొడుకులు సదువుల మీదున్నరు. లానాదేనా  ఇబ్బందుల్లో ముఖ్య పాత్ర బుచ్చక్కదే.

   ఇయ్యాల మిరపచెట్లల్ల దౌరగట్టుడని ముందే అనుకున్న పని. బుక్కెడంత తిని తయారగుడే అలిసం - ఏ అడ్డంకి లేకుంటే మిరప చేన్లుంటడు  నర్సయ్య...

       ''నర్సయ్య ఓ నర్సయ్య ఉన్నావా'' తోట రాయమల్లు రానే వచ్చిండు - ఆయనవెనుక ఎగపొసుకుంట భార్య గట్టమ్మ. ''ఏందే రాయమల్లు ఉన్ననే'' నర్సయ్య. బుచ్చక్క నర్సయ్యదిక్కు తీక్షణంగా చూస్తుంది. ఆమె చూపులకు కొంత కలవరపడ్డా కూడా  తప్పదుగదా.

      ''ఇగో నర్సయ్య ఇగ ఈ ఊల్లె మొగిళిగడన్న ఉండాలే నేనన్నుండాలె లేదంటే అందో నాదో శవమన్న లేవాలె'' రాయమల్లు అవతలోడింటండా లేడాన్నది సూడకుంట బుర్ర కాయల రాల్లేసి ఊసినట్టు లడలడ బాధ కక్కేసిండు.

                ''గట్లెందుకే గా పిలగాడు నీ కొడుకేనాయె. గంత గనం ఐరా లెందుకచ్చినయే'' నర్సయ్య ''ఆడు పోరోడాయె, నేను ముసలోన్నైతి''

                ''సూటిగ సెప్పే''

          ''ఏం చెప్పాల్నే, నిన్నట్నుంచి పచ్చి వలికి నట్టె అది (కోడలు) ఒక్కటే తిట్టుడు తిన్న బువ్వ పెయికి పట్టకుంట. కోడల్దాని మాటలు వట్టుకోని గీడు కోడిపుంజుతీర్గ నా మీదకురికి రావట్టె''

                ''అసలెందుకచ్చిందో ఐరం చెప్పవుగద. నాకియ్యాల ఊపరి సల్పని పని గాలిపొయింది'' నర్సయ్య

       ''ఇగో నర్సన్నా నిన్నట్నుంచి ముసల్ది పచ్చి మంచినీల్లు ముట్టలే. సాపిచ్చుడు, సాపిచ్చుడు, దానవ్వ గారింటి నుండి ముల్లెలు దెత్తె మే మిద్దెల్లినమట''

                ''ఛీ......'' అసలు ముచ్చట చెప్పడాయెనని నర్సయ్య బాధ.

                బుచ్చక్క కంచంల బువ్వ పెట్టుకొని ఓ దిక్కు తినుకుంటనే ఓ చెవ్విటేసింది. ''ఐతె గట్టవ్వ మొకం కడిగినావె బుక్కెడంత సల్లవడ్తువు'' గట్టక్క నడిగింది బుచ్చక్క..

                ''తిన చిన్ని - నిన్నట్నుంచి ముసలోడు గూడతిండ్లే'' గట్టక్క

                ''ఇద్దరు సెరింత సల్లవడుండ్లే గట్టవ్వ'' నర్సయ్య.

                నర్సయ్యకు కొద్దిగ ఎసులు బాటైంది ''పెట్టుక రాయె ఇద్దరికని'' పురమాయించి పాలేరు రాజయ్యకు దౌర పనిచెప్పి తనుకొంత సేపటికత్తనన్నడు.

                ముసలోల్లిద్దరు సల్లవడ్డరు. కొద్దిగ నిదానానికచ్చిండ్లు. పని వాయిదేసిండు గనక నర్సయ్య గూడా ముచ్చట వినడానికి  సిద్దమైండు.

                నర్సయ్య రాయమల్లుకు మామవరుస. మామకు డెబ్బైయుంటే అల్లునికి డెబ్బై పైమాటే. గ్రామలల్ల కులాలొక్కటి గాకున్నా, పాత కాలం వరసలు కలిపే పిలుసుకుంటరు.

                ''సిన్నాయినా మీరు మీరు సూడంగా కడుపు గట్టికొని ఒర్రె గడ్డకో నాల్గెకరాలు మీ చేను కిందో నాల్గెకరాలు దక్కిచ్చి. పుట్లకుంట కింద రెండెకరాల పొలం నువ్వే కొనిత్తివి. ఒక్క కొడుకని కాకిగ్గద్దకు దొరకుంట కడుపుల దాసుకొని సాదిన. పెంచిన. గియ్యాల పెండ్లాం బెల్లమయింది. అయ్యవ్వలక్కరకు రానోల్లయిండ్రు.'' గట్టవ్వ కడుపుల సొద ఎల్లవోత్తంది.

                ''గాడు సిన్నగున్నప్పుడే చాతిల గడ్డలైతే మీ కాళ్ళు మీ కాల్లు పట్టుకొని పట్నంల పెద్ద దావఖాన్ల గదే నింసో, గింసోల ఆ కాలం ఆపరేషన్‌ చేయించుకచ్చి బతికిచ్చుకున్న. గియ్యాల రెండ్రోజుల్నుంచి ఉపాసముంటే ఎట్లున్నవ్‌ కోతనకపాయె, ఎవ్వని బిడ్డలు'' కొంత నిర్వేదంగా, విచారంగా గట్టవ్వ...

                ''గట్టవ్వా కాలమే గట్లున్నది. అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదాట'' బుచ్చక్క తినుకుంటనే మాట కలిపింది.

                ''బుచ్చవ్వా ఏం లేదు మాతోని ఉండడట. ఎందుకంటే సెప్పడు'' గట్టవ్వ

                ''నీకొక్కడే గాదవ్వ గదేం మాట'' బుచ్చక్క

                ''మొన్న గీయాల్లకు సురువైంది. ముసలోన్ని దొబ్బుతె మూడు తిరుగుల్దిరిగి కూలవడ్డడు. కాలో సెయ్యో ఇరుగుతే నేనెక్కడికని  ఉరుకాలెనవ్వ. ఏ ఇంట లేన్సాలు నాయింట్లనే ఉన్నది'' గట్టవ్వ.

                ''అయ్యో గాపిలగాని కేమచ్చింది - మంచోడే, మరాల్ల సోడాల్లకు వొయ్యక పొయినవ్‌ గట్టవ్వ. ఆ మురిపెమేందో సూత్తరు'' మాట మారింది బుచ్చక్కది.

                ''ఎట్ల వొయ్యాల్నవ్వ. లోకులేమంటరు ఒక్క కొడుకును సైసుత లేదంటరు. కోడల్ను నెగులనిత్త లేదంటరు'' గట్టవ్వ.

                ముసలి పాణాలకు ఎటూ పాలుపోని స్థితి. ఇదంత కొడుకు మెతకతనమేనని, కోడలు ఎంత సెప్పుతంతని. రాయమల్లు కొంత నిమ్మలానికచ్చిండు. ఎట్లైనా పంచాయితి పెట్టాలే. దాన్ని వాన్ని ముక్కు భూమికి రాపియ్యాలన్న పట్టుదలతో నున్నడు రాయమల్లు.

                ''పోషాలు సెవులేసినవా'' నర్సయ్య.

                ''సూత్తలేడా ఇంటలేడా'' రాయమల్లు

                ''కాదుగని నువ్వోసారి సెప్పిసూడక పొయినవు'' నర్సయ్య.

                ''మాసెప్పిన. ఇంటోడేనాయె, పట్టుమంటే కప్పకు ఇడువు మంటే పాముకురా అన్నడు'' రాయమల్లు.

                ''సరె ఇయ్యాల రేపు నాకు మిరపసెట్లల్ల పనున్నది. ఎల్లుండి కూసుందాం. ఇంతల నేనుగూడ పోషాలు సెవులేత్త'' నర్సయ్య.

                దిగాలు మొఖాలతో ఇంటి దారి పట్టిండ్రు ఆ దంపతులు.

                నర్సయ్య బుచ్చవ్వ మిరపచెన్లకు వొయ్యిండ్రు.

                ''ఓ ర్రాయ, నీక్కొద్దిగ్గూడ బుద్ది గానెం లేవ్వురా! నేనేం జెప్పిన పడమటి బాజుకెల్లి దౌర సురువు జెయ్యిరా అన్ననా లేదా నువ్వు తూర్పుదిక్కు దింపవడితివి'' నర్సయ్య చిటపటలాడిండు.

                ''ఎట్నుంచైతేందే పెద్దనాయ్న కంచల్నే ఎడ్లుంటే అక్కడ్నే దౌర కట్టి తింపవడితివి'' రాయడు ''మోరుదోపు పీనుగు మోసినోన్ని మింగిందాట. ఉల్టాపల్ట సేత్తవు ఎదురు మాట్లాడ్తవు'' నర్సయ్య.

                ''ఏ పోనియ్యరాదు ఎట్నుంచైతేంది మించుక పోయ్యేదేమున్నదయ్యా'' బుచ్చక్క. మారు మాట్లాడలేదు నర్సయ్య,

                ''నాయన పంచాయితేమయిందే'' రాయడు.

                ''ఎవల్దిరా పంచాయితీ'' నర్సయ్య

                ''నేను రాంగ లేదా గాల్లదే''

                ''అయ్యవ్వ కొడుకులకేందిరా పంచాయితీ'' ఏం మాట్లాడాల్నో తెలవకనే అన్నడు నర్సయ్య.

                ''పెద్దవ్వ, ఇద్దరూ ఇద్దరేనవ్వ. గా తండ్రి కొడుకులు మా దండి ఉచ్చిలిగాల్లు, మొన్నేమయిందో ఎరికేనావ్వ'' రాయడు

                ''నా కెట్ల తెలుత్తది పోరడా'' బుచ్చక్క. ఎడ్లు సాల్లనడత్తన్నయి, కప్పిన మిరపచెట్ల మీది మట్టిని తీసి మిరప మొక్కల్ని లేవడ్తంది దౌరెండి బుచ్చక్క . రాజాలు మాటలకు ఊ కొట్టుకుంట నడుత్తాందామె. నర్సయ్య చేను నాలుగు మూలల సూసుటానికి పోయిండు ముక్కుల ఏలు వెట్టుకుంట - అది ఆయన అలవాటు. ఇగ రాయడు పిలగాడేమి గాడు ముప్పయేండ్లకుంటడు.  కాకుంటే తన పదో యేటనుంచే గీ నర్సయ్య సేతల్నే పాలేరు. మొదట గొడ్లకాపరి ప్రమోషన్‌ మీద ఎడ్ల కాపరి తర్వాత పెద్ద పాలేరుకింద చిన్నపాలేరు, ఇపుడు చీఫ్‌ ఇన్‌ లెక్క పెద్ద పాలేరుగా పదోన్నతి మీదున్నడు. కాకుంటే బాల్యం యావ్వనం ఈ కుటుంబంతోనే ముడివడి ఉన్నందున కులాన చిన్నోడైనా నమ్మిన బంటుగా, నర్సయ్య పటేల్‌ కొడుకుల్లో ఒకడిగానే ఉన్నడు. కాకుంటే ''నాయన, పెద్దనాయన, అవ్వ పెద్దవ్వని'' ఆ దంపతులను పిలుస్తడు.

                ''అవ్వ ఏం లేదు - మొన్న మన కిందిచేను జొన్న దుక్కికేసిండ్లు గా రాయమల్లు. పెద్దనాయన నడిజామే లేపె కంచల్ల ఎడ్లుమేపుమని - తెల్లారింది. మనెడ్లు బట్టి కంచలమేత్తన్నయ్‌ - నేను ఎడ్ల జాడకు పొయన - గీ మొగిలన్న దున్నిన దుక్కినంత ముల్లు కట్టెతోని తవ్వవట్టె. అంబటాల్లయ్యింది. ఈని తవ్వుడు పాడుగాను ఆపడయె ''ఏందే మొగలన్నన్న'' ఆఖరికి. చెప్పుడాపి, లేసి పడిపడి నవ్వుతండు రాజయ్య...

                ''ఏందిరా గంతగనం నవ్వవడితివి''

                ''లేదవ్వా''

                ''చెప్పరాదుర'' విసుక్కుంది బుచ్చవ్వ

                ''ఇగ అంతకు ముందు మాపటించి గా ముసులాయెన రాయమల్లన్న దున్నిండు. మొగిళి ఇంటి కాడుండె '' దున్నడైనంక కర్రు, ముల్లుగట్టె, దొత్తెలు చేన్లనే దాసిండాట. ఎవడన్నెత్తుకపోతడని జాగర్త పడ్డడు. ఇంటికాడ మొగిళికి ''గుడిమెట్టు సూటిగ దాసిన్ననీ చెప్పిండు'' గీ మొగిలి సేండ్లకచ్చి నాగలి దగ్గర నిలవడి గుడిమెట్టు దిక్కు సూసిండు. సక్కగనే కనపడ్డది. ఆడ తవ్విండు - లేవు. కొద్దిగ జరిగిండు గుడిమెట్టు సక్కగనే కనపడ్డది ఆక్కడలేవు. చేను నాల్గు మూలల తవ్వుడే తవ్వుడు. నేనేందే మొగిలన్నంటే ఆల్ల నాయన చెప్పిన ముచ్చటనాకు చెప్పిండు. గట్లగాదు మొగలన్న మా చేండ్లనిలవడ్డా గుడి మెట్టు సక్కగనే ఉంటది. మన ఊల్లె నుంచి చూసినా సక్కగనే కన్పిత్తదన్న - గప్పుడు తెలివికచ్చిండు. ముసలోని అవ్వనక్కను తిట్టుకుంట ఇంటకురికిండు - గంత తిక్క లోలవ్వ వీళ్ళు'' ముగించిండు రాజాలు. బుచ్చక్కకు నవ్వైతే రాలేదు గాని, గ్యానం లేని ఉత్త గొర్రె మంగురు గాల్లనుకున్నది. సీకటి పడ్తంది - గొడ్లు బర్లు ఊల్లెకచ్చే ఏల ఇట్ల చేరిండ్రు ఇద్దరు - బిరబిరా పొయిమీద నీల్లేసి తానం చేసి అంటపనిల వడ్డది బుచ్చక్క . ఆ తర్వాత తానం చేసి దోతికట్టుకుంటండు నర్సయ్య.

                ''తాతా ఓ తాత  ఉన్నవా'' మొగిళి '' ఆ..ఆ.. ఉన్నపిలగా, గియాల్నేమో గిటువడ్డది తొవ్వ'' నర్సయ్య

                ''నీ కెరుకలేందేమున్నది తాత సర్వం నీకెరకేనాయె''

                నర్సయ్య మొఖం మీద కొద్దిగ చిర్నవ్వు ''కడుపునొచ్చినప్పుడు నోమ బుక్కగుంటె తప్పుతదా తాత''

                ''తప్పది గద పిలగ''

                ''ముసలోల్లు పొద్దుగాల నీదగ్గరికంచ్చిండ్లాట గద. ఏం చెప్పిండ్లు తాత'' మొగిలి

                ''ఏదో చెప్పిండ్లుగాని పంచాతి పెట్టాల్నన్నరు రేపు శనారం నాకక్కర్కురాదు. ఎల్లుండి సూద్దామన్న'' నర్సయ్య

                కొద్ది సేపు ఎవలు మాట్లాడలే. తనో పీట మీద కూసుండి మొగిలికో పీట జరిపిండు నర్సయ్య.

                ''అసలు మీకెందుకత్తంది లోల్లి పిలగ''డిటో ప్రస్నే మొగిలికేసిండు నర్సయ్య.

                ''ఏం చెప్పాలె తాత అంక శెండాలం తిట్టవట్టిరి. తిన్నది పెయిన పట్టనిత్త లేరు. నాకు కుట్లేయించుకుత్తే బతికిన్నాట. లేకపోతె ఎన్నడో మన్నులగలసి పోదునాట. నీ దినాలురో, నీ ఆరాలురో, ఛ...ఒక తీరు సాపిచ్చుడు గాదాయె. మా వోల్లు రేషానికత్తె దాని అటేడుతరాలు ఇటేడుతరాలు తిట్టి పోసింది  మా అవ్వ. నేనేడ పోవాలె తాత నువ్వే చెప్పు'' మొగిలి.

                ''అయ్యో నువ్వో తీరగ చెప్పవడితివి, ఆల్లోతీరుగ చెప్పిండ్రు గాదు పిలగ'' బుచ్చక్క

                ''ఏం చెయ్యాల్నమ్మ ఛీ..గీ బతుకెందుకనిపిత్తంది. ఇంత ఇసం పుచ్చుకొని సావబుద్దైతంది..'' మొగిలి.

                ''ఛ..గవేం మాటలు పిలగ...నీకేం తక్కువ నీ సోడు నువ్వండుకుంటే రాజంతంగ బతుకుతవ్‌'' తీర్పు తనే చెప్పింది బుచ్చక్క ఈ సారి.. ''సరెగని పిలగ ఆల్లు ముసులోల్లు. ఆయిసుడిగినోల్లు గట్ల దొబ్బితె కాలో సెయ్యో ఇరిగితె ఎవలకు దు:ఖం మల్ల నీకేనాయే'' మెత్తగా అంటించింది.

 

                ''నా మీదికి గొడ్డలి తీసుకోని నరుకుతననత్తె నేనేం చెయ్యాల్నమ్మ - పడుసు మొగోనితీర్గ ఆడె ఉరుకులాడవట్టె'' మొగిలి.

                ''ఆరునూరైనా ఇగ నానుంచిగాదు. ఆల్లతోన్నేనుండ. నా సోడు నాకు వోత్తె ఉన్ననాడ్తింట. లేకుంట ఉపాసముంట''.

                తీర్పు గూడ చెప్పుకున్నడు మొగిలి ''లొల్లి పెద్దగనే అయినట్టున్నది. ఇంటింటికో తిరీగుంటది. ఊరూరికోపద్దతుంటది. మనిషి మనిషికో తీరు అలవాటు, ఆలోచనుంటది. పెద్దోల్లు తొందరపడితె నువ్వేగిరపడకు. జరిగిందెట్లా నలుగురు కూసున్నకాడ సెప్పుకుంటరు. ఏదో తీర్మానం జేత్తరు'' నర్సయ్య

                ''అడ్డల బుడ్డేసినట్టు మద్దెల మా చెల్లోతిలేదా! అదింక లొల్లి పెంచుతంది గని'' గునిగిండు. మూడో పాత్ర జాడచ్చెటాల్లకు నర్సయ్యకు వశంగాలె - ఇగ ఇసారం జేసుడు దండుగనుకున్నడు - ''ఏల్లుండి ఖాయం పిలగ.  నీ తరుపున ఎవర్నైన పిలుసుకో -ముసలోల్లకు కూడా శెప్పుత'' శిక్కుముడిప్పుడు బహుకట్టమనుకున్నడు నర్సయ్య.

                ఆ రాత్రట్ల గడిసింది. మిరపల కలుపున్నది. కైకిలోల్లకని నర్సయ్య ఇంటిటికి తిరిగి కైకిలి మనుసులను పిలత్తండు - ఇంతల పోషాలింటి ముందట పరుపు బండమీద సుట్ట కాల్సుకుంట మరో లోకంలున్నడు.

                మీదికి మొఖంబెట్టి అలౌకికానందం పొందుతండు. ''హు...నిర్రందిపురుసుడు. ఇల్లూరీటవెయిన కొల్లూరుకోట వొయిన భేఫికర్‌ మనిషి. మాపటించి తెల్లగల్లు దుత్త, మూడు పూటల మేతుంటే సాలు మగానుబావునికి'' లోలోపల సనుకున్నడు నర్సయ్య. పైకి మాత్రం ''ఏం షోషాలు బాగేనా'' పలకరించిండు.

                ''ఆ... ఆ ... బాగే... నర్సిమ్మనికెందుకో గిటువడ్డది తొవ్వ'' పోషాలు - ''మిరపల కలుపుండె మందికోసమచ్చిన'' తనే కదిలిత్తడేమో రాయమల్లు, మొగిలి ముచ్చటనుకున్నడు నర్సయ్య.  పోషాలుకు ఆ ఊ సే తెల్వదన్నుట్టున్నడు.

                ''నీకేమన్నెరుకైందా ముచ్చట''

                ''ఏ ముచ్చటా''

                ''గాదే నీ కొడుకు, మనుమంది''

                ''ఓ రాయమల్లు మొగిలి గాందా''...

                ''రేపు నల్గుర్ని కుప్నేత్తనన్నరు. నీదాక రాలేదా ముచ్చట'' నర్సయ్య.

                ''సరె సరె నాదాకచ్చింది గని కొద్దిగ ఆట్లకూసో - ఎప్పుడూ చెప్పుల్ల కాల్లు పెట్టుకోనత్తవు.

                ''లేదు పోశాలు పనున్నది'' నర్సయ్య.

                ''సరె పనుంటె ఉండనియ్యిగని జర గిట్ల గోడ మీదికెల్లి తొంగి సూడు అవతలికి'' పోషాలు.

                ''ఏం దాసినవక్కడ'' నర్సయ్య

                ''ఏందో దాసిన సూడరాదా'' పోషాలు

                నర్సయ్య గోడ దగ్గరికెల్లి కాలిబొటిమెనేల్ల మీద నిలవడి రాయమల్లింట్లకు తొంగి సూసిండు. గోడవతల బయిట పపంచమొకటున్నదనే సోయి లేకుండానే చాలా చాలా జరిగిపోతున్నయ్‌.

                రాయమల్లు ఎడ్ల శెలిసుట్ట కాల్లమద్య పెట్టుకొని సన్నగ ఒక్క తీరచ్చెటట్టు పురి ఇప్పుతండు. కొద్దిగా దూరంల ఎంటికల పురెక్కెతట్టు చిన్న కట్టె తిప్పుతండు మొగిలి. గట్టవ్వ కోడలు నెత్తి ముందేసుకొని పేండ్లుగుక్కుకుంట, ఎంటికలసిక్కులు దీత్తంది.

                ఆల్లద్దరి ముచ్చటొడ్త లేదు - పేండ్లుగూడ

                ''ఓ నాయిన - పురి సక్కగత్త లేదు నీయ్యవ్వన్‌'' మొగిలి

                ''అత్తినాంటె బొక్కలిరుగుతయ్‌ మోరుదోపులం . కొడుక...తేపకు అంక వెడ్త వేందిరా'' రాయమల్లు

                మాపటెండ - మాగికాలం కొంత వేడిని, కొంత చల్లగా, మొత్తానికి  చూడ ముచ్చటగా ఉన్నది.

                ముసి ముసి నవ్వుకుంట పోషాలు దిక్కు తిరిగిండు నర్సయ్య.

                (సుమారు అరువై ఏండ్లు మా ఊరి తగాదాలు, పంచాయితీల తీర్పులతో  తమకు తోచిన విధంగా ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా పరిష్కరించి ఊరికట్టు కాపాడే ప్రయత్నం చేసిన నర్సయ్య, పోషాలుల...స్మరణలో -రచయిత)

అలక 

“రాయ బువ్వ కూరండి పెట్టిన . . పగటించి తిని తలుపేసుకొని సక్కగుండు అటీటు వోకు"

"తింటనే నీయవ్వ ఇప్పటికి ఇరవయి ఒక్కటో సారి చెప్పినవ్ . . .”

"నీ మొఖానికి నా అవ్వ దాకా పోకు బహు సక్కటి పూసవనే మల్ల మల్ల చెప్పవటితి"

ఇంతల "ఏమాయే మీనక్క నీ కొడుకుతోనే ముచ్చటియ్యా లోడుత్తదా?  మేం పోతన్నమని గల గల మాట్లాడకుంట రానే అచ్చిండ్లు కైకిలోల్లు.

సదరు మీనక్క నాకు మేనత్త . . . రాజయ్యేమో నాకు బావ. నా కంటే చిన్నోడే కని “ఆసి" కి పెద్ద నాట “బావనే”  పిలువాల్నని మా నాయన అవ్వ పలు సందర్భాల చెప్పిండ్రు.  అట్లనే మా అత్త కూడా . .  మా అత్తను అసలు మంచిరాల దగ్గర "గర్మిండ్ల" కిచ్చిండ్లు . . మా మామేమో కట్టెకోత మిషన్లో  పని చేసేటోడు.  మంచిరాలకు మకాం మార్చిండ్లు.   కొన్నేండ్లు మంచిరాలనే ఉన్నరు.. ఇది ఇట్లుండంగా  మామకు పాణం బాగా లేక బోళ్లు బొక్కలు పట్టుకొని మా ఊరుకు వచ్చిన్లు.  ప్రాణం బాగ లేని మనిషాయే పని జెయ్యడాయె . . కూసుని తినే కుప్పలేమి లేవ్వాయే . . పెద్దన్న నడపన్నతోని కుల్లంకుల్ల తనున్న స్థితి చెప్పింది మీనక్క.

దగ్గర కొంత పైకమున్నదని నన్ను ఒడ్డున పడెయ్యమని. అన్నదమ్ములిద్దరికీ చెల్లంటే ప్రేమే . . వదినలే కొద్దిగ దగ్గరికి రానియ్యరు. . పైగా రోగం మనిషి వేరే వండుకొని తినుమని ఖరాఖండిగా చెప్పిండ్లు వదినెలు.  తెచ్చిన ఫైసలతోని నాలుగెకరాల భూమచ్చింది . . అప్పటి నుంచి యెవసాయం మొదలు పెట్టింది మీనక్క.  చిన్నప్పటి నుంచి తెలిసిన పని. పెద్ద ఇబ్బందులు లేకుంటా బతుకు గడత్తంది.  ఆ టైములనే ఇగో గీ రాజయ్య పుట్టిండు . . . ఆ తర్వాత మామ కాలం చేసుడు జరిగిపోయింది.  రాత్రింబగళ్లు మొగరాయిని తీరు పనిచేసింది మా ఆత్త.  గొల్లపల్లి దగ్గర ఇంకో రెండెకరాలు కొన్నది. యేపల కుంట దగ్గర నాలుగెకరాలు కొన్నది. సొంత  వసతి గల్ల  ఇల్లు  కట్టుకొన్నది.  మా బావకు రెండు సంవత్సరాల వయస్సు అప్పుడు.  పొల్లడు ఇంకా మెడలు నిలుపుత లేడు.  సక్కగ నడత్తలేడన్న బెంగ ఉండేనే ఉన్నది.  "కుంటి రాజయ్య" అనే పేరు ఖాయమై పోయింది  మా బావకు.  మంథెన చోటా మోటా డాక్టర్లు, ఆ తర్వాత కరీంనగరం. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు కూడా తేల్చిన సంగతేందంటే మా బావకు  "సూడో మస్కులర్ డిస్టఫీ " అనే వ్యాధి ఉన్నదని, అది మందులతో నయం  గాదని వైద్య బాషలో జనటిక్ కండరాల జబ్బు మా తాత భాపతి నరాల రోగమని.  బావ రాజయ్యకు నడక లేకపోవుడు కొద్దిగ వనుక్కుంట మాట్లాడుడొక్కటే లోపం.  మనిషి మంచి  ఆకారం, తెల్లటి తెలుపు రంగు, రింగుల జుట్టు, పైగా మాటకారి. "ఏం  రాజయ్య నీకెంత సక్కటి బాలున్నది. నా  వెంటికలేమో సూడు నెత్తి మీద అరిగడ్డి పోసలున్నట్టు” . . . మా పోరగాండ్లందరికీ అయినెంటికలంటే అసూయ.  

"ఇగో బామ్మర్టి నా ఎంటికలు నువ్వు తీసుకో . . నా కుంటి తనం కూడా తీసుకో " మా బావ మాటల్లో బాధ. మనసు కలుక్కు మనేది.

ఇంతకు ముచ్చెట సంబురాన దొంగ తిండి మరిచినట్టు" మా బావ ఇంటికాడ కావలికి ఖాయమై పోయింది కాబట్టి అది అసలే కొద్దిగ చలి మొదలైన రోజులు. కాబట్టి ఆకిట్ల గోడ నీడకు కొద్దిగ నీరెండల కూసున్నడు మా బావ.  ఊళ్లే చిన్న చిన్న పిల్లగాండ్లు బడికిపోతే, కొందరేమో ఎడ్లకు వొయిండ్రు.. కొందరు అయ్యవ్వలెంబడి పొలం కోతల కాడికి వొయిండ్రు. పిల్లల్ను పట్టుకొన్న ముసలోల్లు, మా బావే ఊల్లె మిగిలినోళ్లు. ఇంతల జబ్బకు సంచులు యేలాడేసుకొని ఇద్దరు మనుషులు ఆ ఊల్లెకు రానే వచ్చిండ్లు. వచ్చి మా ఇంటికి తాళమున్నది.  ఏం చెయ్యాల్నో సమజు కాలేదు. ఆల్లకి మాగికాలం అసలే రాత్రి తినలే. ఇక్కడింత తిని బట్టలుతుక్కొని కొద్ది సేపు పడుకోవచ్చన్నది వాళ్ల మెదట్లో  ఆలోచన.  కానీ తలంపు తల్లకిందైంది.

"ఏమోయి, వీళ్లు లేరా?”

"పొలం కోతలు కదా! పొలం కాడికి పోయిండ్లు” రాజయ్య.    

"రాయేశం స్వామి కూడా లేరా?

"ఆల్లు కూడా పొయ్యిండ్లు " . . .

“పొలం ఎక్కడుంటది . .? దూరమేనా . . ?

"ఆ దూరమే .... ఇంతకు మీరెవలు . . . ?

"మేం రాజేశం , స్వామిలకు చుట్టాలమే”.

"ఏ ఊరు  మీది . . ?

"మాది మంథని " . . .

”మంథిన్ల మాకు చుట్టాలు లేరే?”  

“ఇంతకూ నీ పేరేందోయ్" మాట మార్చిండు. నువ్వేమైతవ్ వాళ్లకు”

బావను. బావను అంటే . . మేనత్త కొడుకును.  

"ఓహో . . ! వాళ్లకు బావవైతే మాకు బావవే నన్న మాట . . "

కొద్దిగ సిగ్గుపడ్డడు మా బావ.  మా బావ పరిస్థితి వాళ్లకర్థంమైంది  . . చేసే దేమున్నది . . అక్కడే వాళ్లు కూచున్నరు . . . మొఖాలు పీక్కపోయినయ్ . . తీరా ఇక్కడికస్తే వాళ్లనుకున్నది తల కిందులైంది.  ఇంతకు ఏం పని" మా బావ..

పనేం లేదు కలిసిపోవుడే"

తిన్నరా?"

తిండ్లే”

మా బావ సందిగ్ధంల పడ్డడు . . తినుమంటే ఇద్దరున్నరు. మాపటికి కూడా అండింది బువ్వకూరున్నది. కానీ అవ్వత్తె ఇగురమీక లేకుంట తిడ్తది. ఊకుందామనుకుంటే సుట్టాలయిరి . . ఎట్లైతే అట్లాయని  “మీరు బువ్వ తింటరానోయ్"అన్నడు బావ.
కొద్దిగ తటపటాయించినా ఉంటే తింటమనే  అన్నరు . . .

అట్ల రెండు పూటలకండిన బువ్వ కూర ఇద్దరు ఇత్తు  మిగులకుంట తిన్నరు.  బావ మడెండింది. నువ్వు కూడ తినమనీ బావను వాళ్లే అడిగినా నేను గిప్పుడే తిన్ననన్నడు.  ఒక్కల మందం మిగిలినా అవ్వకు అబద్దం చెప్పచ్చు నేనే ఎక్కువ తిన్ననని. అట్ట మొదలయింది  మా బావకు సీను, రవిల  పరిచయం.  సీను, రవిలది మంథెన గాదు రవిది కూడా కాదు. ఇద్దరు బంధువులు కారు . . . రాయేశం, స్వామిలకు  కూడా కారు. మిత్రులు మాత్రమే. వాళ్ళేంది అన్నది ఇప్పుడవసరం లేదు. ఇంతల మాపటేలయ్యింది.  గొడ్లు, బర్లు ఊరుకు  చేరుకుంటున్నయ్.  కొద్దిగ సలికూడా మొదలైంది. మా అత్త పొలం కాన్నుంచి రావడం రావడమే జరిగిన ఘోరాన్ని గమనించింది.

"పోతెనే రాయా . . బువ్వేదిరా . . . ?” 

 “నేంతిన్న"

"కుండెడు బువ్వ అది మూడు పూటలకండింది. ఒక్క నివే తిన్నవారా . . . ? "  

"ఆం ఒక్కన్నే"  

"తలుపెయ్యకుంటే ఏ కుక్కన్న సొచ్చిందారా ఇంట్ల" ఇంకా నమ్మబుద్ధిగాలే.  

ఆమె తక్కిచ్చి తక్కిచ్చి అడిగితే  నిజం చెప్పిండు మా బావ.  ఉగ్రురాలైంది మా అత్త. నేను పొద్దందాక పనికి పోతే, మాపటించి ఇంత తిని పడుకుందామంటే నువ్వు ఇంటికాడుండి గిదా చేసేది.  నానా రబస చేసింది మా అత్త.  పొద్దందాక చేసి చేసి అలిసిపోయె గింత తిందామనుకుంటే మళ్ల వండుడు కాబట్టే . . పైగా పోరడు గూడ తిన్నట్లు లేదు. మిడుక్కుంటనే మళ్ల బువ్వకూరండింది మా అత్త.

 

 కానీ మా బావ అలిగిండు . . ససేమిరా తిననంటే తిననన్నడు . . కడుపు నిండిందన్నడు. అయిన అహం దెబ్బతిన్నదేమో మొఖమంత మాడ్చుకున్నడు . . ఏడ్వడానికి సరిపోని వయసు. అంటే పదిహేను  సంవత్సరాలు.  పోనియ్ ఏ పని చేయలేడాయే . . నిస్సహాయ స్థితి. ఇవన్నీ మనసులో కొంత బాధను , కోపాన్ని . . . అవమానాన్నీ . . అన్నీ కలిపి మా బావ మూడు పూటలైంది తినక.  అదే పట్టుమీద బావున్నడు.  నేను ఒక్కదాన్ని చెయ్యబడితి. మగదిక్కు లేదాయే . . రెక్కలు ముక్కలు సేసుకుంటె నడుత్తదాయే.. యేల్లకత్తే  గీడు గిసొంటి పనులు సేత్తండాయే . . తినకపోనియ్ . . . మంట మీదున్నది మా అత్త.  తినకపోనియ్. కడుపుల సురసురమంటె  గుర్రం ఆరిగడ్డి తింటదాట" ఉండనియ్యి ఎన్ని రోజులుంటడో తాత ఉపాసం . . మా అత్త అదే పట్టు మీదున్నది. కని లోపల కొద్దిగా విచారంగనే ఉన్నది. ఆయినా బైట పడదల్చుకోలేదు. ఈ పట్టింపుల ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుకు మా మేనత్త ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసింది.

మొదట మా బావకిష్టమైన కూరలు, గారెలు, పూరీలు, తెల్లకల్లు వీటి ద్వారా మా బావ ఉపవాస దీక్షను భగ్నం చేయాలన్న ఉపాయం జేసింది. ఎట్లా కోతలైనై. కల్లంపని ఇప్పుడే లేదు. కొద్దిగ తీరిక దొరికింది.  మక్కలు పెట్టేపనోటున్నది. మోట సవరియ్యాలే. అదింక వారం రోజులదాక కుదరదు. ఏగిరమేం లేదు. మా బావ దీక్ష భగ్నానికి అదను ఇదన్న నిర్ణయానికచ్చి అమల్లో పెట్టింది. ఇంట్లదే గవ్వల కోడి పుంజును పట్టి, పొలంకాడ కోసుకచ్చింది. గౌండ్ల శంకరన్నకు ఇరవై రూపాల తెల్లకల్లు చెప్పింది. కోమటింట్ల కిల గోదుము పిండి కొనుక్కచ్చి పూరీలు చేసింది. పొద్దుగాలనే పెసరు పప్పు  నానవోసి ముద్ద గారెలు చేసింది. మా బావ ఈ చర్యలన్నీఓ  కంట కనిపెడుతునే ఉన్నాడు. గంభీరం సడలనిత్తలేడు.   ఎక్కడో లక్కడ పనికెళ్ళిపోయేటేళ్లకు సకలం  పూర్తి చేసి కొద్దిగ ఖాలీ అయ్యింది. మా అత్త మెల్లగ మా బావను మందలిచ్చింది. " రాయా... కోడి పుంజు కోసి అండిన. ముద్ద గారెలు చేసిన. కల్లున్నది. పూరీలు, బువ్వున్నది... తింటావా..? ఊకుంటావా..? నేనైతే తింటున్నా...!”

“నీ యవ్వ నే తినపో ...”బింకంగా మా బావ లోపల  మనుసుల ఎతల ఎత్తిపోతలు. తన కిట్టమైన కూర, గారెలు,  పూరీలు.  మల్లోసారి కదిలిచ్చింది మా అత్త.

 "మరి నన్ను గా తీరుగ తిడితివి గద” రాజయ్య .

"నువ్వేమన్నా సొక్కం పూసవా . . ఉన్నది లేనిది చూసినవా...”అన్నది మా అత్త.

“కాదే...అల్లు నిజంగా ఆకలితో వచ్చిండ్లే. నాకు మంచిగనిపియ్యలే . . నువ్వైతే పెట్టకపోదువా. .” అన్నడు రాజయ్య అసలు నిజం బయట పడ్డది.

అవునని కాదని  మాట్లడలే మా అత్త.

ఆమె “ సరే అయిందేదో అయింది... తిందాం..రా! ఉపాసమున్నకాడికి సాలు” అన్నది మా అత్త.

“మరి నన్ను మల్ల తిట్టనని.... మాటియ్యి.....”

" సరేరా . . రాయా రా  . . తినేవురా తిట్టా రా  . . నువ్వు కుడ కొద్దిగా ఉన్నది లేనిది సూడాలె. రా..” అని బుదరకిచ్చింది మా అత్త. . .

“నా గురించి సూడు. ఒక్కదాన్ని మొగోని తీర రాత్రి పగలనక నీళ్లకు, నిప్పులకు, కోత, మోతలకు తిరుగుతలేనారా... మనకెవ్వలున్నరు జెప్పు... ఎనకముందసేలే   లేదు కాదురా..” అనుకుంట మా అత్త గొంతు పూడుకుపోయ్యింది.

మా బావ మనసు కరిగిపొయ్యింది. " అవ్వ, ఇగ నువ్వు జెప్పినట్టింటనే . . సదువకు". ఉపవాసం భగ్నమైందట్ల.

ఇది గడిచి నలబదేండ్లయ్యింది. కాలం ఎవల కోసం  ఆగలే. తెల్లారుతున్నదీ....  పొద్దుగూకుతున్నది....  మళ్లీ మళ్లీ  శ్రీను, రవి ఇట్ల మా ఇంటికి మధ్య మధ్య వస్తూనే ఉండిరి. మా బావకు వాళ్ళిష్ట మైనోళ్లే. సీను గొంతు సక్కంగుంటది. “పొదల పొదల గట్ల నడుమ పొడిసెనొక్క సందమాను” అయినే రాసి పాడిండు.  రవికి పాటలు రావు. కలుపుగోలు మనిషి. తిండిపోతు. ఆకలికి ఆగడు.  ఇంతకు ముందు చెప్పిన కథలు శ్రీను, రవిల పేర్లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డిలు. వాళ్ళెంచుకున్న మార్గంల మా ఊరికచ్చేటోళ్ళు. మా ఇంటికి కూడా ఎక్కువ వచ్చేటోళ్లు... అప్పుడిన్ని ఇబ్బందులు లేవు. ఎవరచ్చైనా  ఏ ఊళ్ళేనైనా మీటింగ్ పెట్టి పాటలు పాడేటోళ్లు.  ఆకుల కళ్ళాలు, నాట్ల కైకిళ్లు, పాలేర్ల జీతాల గురించి మీటింగుల్ల చెప్పేటోళ్లు. ఊళ్ళె కొద్దిగా పెద్ద రైతులకు   కంట్లె నలుసులోలె అనిపించినా పెద్దగా వాళ్ళను పట్టించుకోలేదు.  ఇప్పుడు మా బావ లేడు. వయసుతో పాటు ఎక్కువైన అతని వ్యాధితో చివరకు అతడు తన నలబయ్యో యేట శాశ్వతంగా మాకు దూరమైండు. అతని ప్రతి కదలికలో నేనున్నా.  ఎందుకంటే సుమారు  ఇరవై ఏండ్లు  తిరగని దావఖానా  లేదు.  మా అత్తనైతే  ఎక్కని గుడిమెట్లు లేవు.  మొక్కని దేవుడు లేదు.  అదనంగా దవాఖానా ఖర్చులు.  మా బావ పోయిన తరువాత ఓ ఆరేడేండ్లు తిథికి నన్ను తప్పక పిలిచేది.  కోడి, గారెలు, తెల్లగల్లు, పూరీలు  పెట్టేది.  ఇపుడు మా అత్త గూడ లేదు.  కొడుకుని తలుచుకొని, తలుచుకొని ఆమె ఏడవని  రోజు లేకుండె.   మా బావ చేత బుక్కెడు బువ్వ తిన్న వెంకటేశ్వర్లు, రమణారెడ్డిలు  మళ్ళీ కలువలేదు – ఎక్కడున్నారో!

ఈ సంఘటనలకు, కలయికకు సాక్షిని నేను.  అప్పుడప్పుడు నా మనసులో వీళ్ళు కడులుతుంటారు. కంటిలో నీటి  పొరగా  మొదలై  కన్నీటి చుక్కలై నా కను కోలకుల్లో  మిగిలి పోయారు.

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు