మా రచయితలు

రచయిత పేరు:    గడ్డం మోహన రావు

కథలు

సందమామ

శంషాబాద్‌ దగ్గర కొత్తూర్ల భాగోతాలాడుతున్నరు చిందోళ్లు. శనివారంనాడు ఊరాట.. ఆదివారంనాడు జాంబపురాణం, ఎల్లమ్మేషం. పర్ద కట్టిర్రు.. మామిడి కొమ్మలు, తోరణాలు కట్టిర్రు.. అలికి ముగ్గులేషిర్రు.. సాందిరికింద పెద్ద పీటెలేషిర్రు.. రొండు దిక్కుల గ్యాసులైట్లు వెట్టిర్రు.

పోరగాళ్ళు ఒక్కటే లొల్లి వెట్టుకుంట తిరుగుతుండ్రు.. దొంగ పోలీసాట.. దొర్కవట్టుడు.. కుంటాట, పొద్దింజామ్ల గోనెసంచులు, తాటి సాపలు స్టేజి ముంగటికొచ్చినయి.. జాగలకోసం తిట్లు.. ఒట్లు.. దోస్త్‌ కటీఫ్‌లు.. దోస్తులు. నాలుగైదయిందో లేదో..

''చిందోళ్ళాడుతున్నరు.. దబ్బ దబ్బ పోవాలె.. బాసండ్లు తోమాలె.. ఇల్లాకిలినూకాలె.. కోళ్ళకప్పాలె.. కూలికివొయిన అమ్మలొచ్చెటకల్ల బువ్వండాలె.. చింతపండు తొక్కునూరాలె..'' ఆటలు బందువెట్టి ఇండ్ల దిక్కు నడ్సుకుంట మాటల్లవడ్డరు ఆడివిల్లలు.. మొగపోరలు చెంగోబిల్ల చేతులొక్కరాయంట ఆన్నే ఆడుతున్నరు. కొందరు సైకిల్‌ టైర్లు కొట్టుకుంట ఉరుకుతున్నరు. ఇంకొందరు.. తాటిమట్టల బండ్లను తోలుకుంట కార్లవొయినట్టు కుషీ అయితున్నరు. బుడ్డబుడ్డ పోరలు తీగలబండ్లు నడ్పిచ్చుకుంట మురుస్తున్నరు. కొత్తూరు పక్కపొంటి ఉన్న లంబడితండ దిక్కుకెళ్ళి కూరగాయల గంపలతోటి ఎడ్లబండ్లు బస్టాండు దిక్కవోతుంటె.. ఎడ్లబండ్లెన్క యాల్లాడువడుకుంట గంతులేస్తున్నరు..

ఒక్కొక్కరు.. ఒక్కొక్కరు.. ఏడయ్యెటల్లకల్ల సందులేకుంట జమయ్యిరు మంది.. దిబ్బతీర్థం.. జాతరలెక్కుంది.. ఆడొళ్ళంతా సాపలల్ల, గోనెసంచులల్ల కిందనే కూసున్నరు. వాళ్ళ ఒళ్ళల్ల చిన్న పిల్లలు..

''అమ్మా! నాకు పైసలియ్యే.. పిప్పరమెంట్లు కొనుకొచ్చుకుంట.. అమ్మా! నాకు పైసలియ్యే.. బిస్కెట్లు కొనుక్కొచ్చుకుంట..'' అంట ఒక్కటే సతాయిస్తుండొక పిలగాడు.. తల్లి ఏం మాట్లాడ్తలే.. ''అమ్మా..! అమ్మా..! నాకు పైసలియ్యే.. రాగం దీస్తుండు. అది ఏడుపులాంటి పాట. పాటలాంటి ఏడుపు.. చూసీ చూసీ విసిగిపోయి.. కోపమొచ్చి..

''అగరో.. ఏడికెళ్ళి కారుతుందారిపోరనికి గాగురం.. మీ అయ్య ట్టలు కట్టలుతెచ్చిచ్చె.. గల్లగురుగులన్ని నిండిపోయి.. బేంకులల్ల గూడ వడ్తలేవు పైసలు.. పైసల్లేవ్‌! గియ్‌సల్లేవ్‌..! నడువ్‌ అవుతలికి నడువ్‌..'' అన్నది కోపంతోటి శంకరమ్మ.. పిలగాడు సౌండు పెంచిండు.. ఏడుపాప్తలే..

''దమ్మమీదకేదికెళ్లెయ్యనుండె.. నీ పోరని పాసునదంతె.. షెయిని వట్టనిస్తలేడు.. ఊ.. ఏం గొనుకొచ్చుకుంటవో కొనుకొచ్చుకోపో..'' అని బొడ్లెదోపుకున్న చెక్కుడు సంచిని దీసింది.. ఒక అర్రల.. జర్దుంది.. లెంకులాడింది.. పైసల్లేవు.. ఇంకో అర్రల చెయ్యివెట్టి దేవులాడింది. సున్నం, కాసు, పోక చెక్కలు.. జర్దకట్టెలున్నయి.. నడుమ ఒక చారణాబిల్ల తళుక్కున మెరిసింది చుక్కలల్ల చంద్రుని లెక్క.. విసుగ్గా ఇచ్చింది కొడుకు రాముకు - ''ఇగవటురా..'' అని.

''సలికాలం మోపయినట్టుంది.. సల్లగొస్తుందిగాలి - పొద్దంత ఒక్కటే వొంగవడుడుతల్లీ!'' అన్నది ఇస్తారమ్మ.. సుగుణమ్మతోటి.. రాంబాయి కాళ్ళకు పట్టగొలుసులు.. వాటి మీద కాళ్ళ కడియాలు.. మణికట్టుకాడికెళ్ళి మోచేతులదాక గాజులు.. చేతివేళ్ళకు బంగారం వెండి  ఉంగరాలు.. చెవులకు కమ్మలు.. గెంటీలు.. ముక్కుకు రొండు దిక్కుల చెత్తిరసొంటి ముక్కుపుల్లలు.. మెడల బంగారు పుస్తెలతాడు.. గుండ్లపేరు.. రొండు పాలిండ్ల నడుమ గుండ్లపేరుకున్న బంగారు చింతగింజ.. దానికి ఎర్రని, పచ్చనిరాళ్ళు.. ఎరుపు, చామన ఛాయకలగలసిన ముద్దుగుమ్మకు ముద్దుగున్నయి.

ఇర్వైయైదేండ్ల కంటె చిన్నదే.. ఈమె మొగడు రుక్కయ్య జీవాలకాడికి వోతడు.. ఆయినకదేలోకం.. మూడు వొందలదాకున్నయి గొర్లు, మ్యాకలు.. పదిహేను ఆవులున్నయి. బుడ్లకొద్ది సల్ల పెరుగు..

''యాడికివొయిర్రత్తమ్మ.. పనికి'' ప్రశ్నించింది సుగుణమ్మ.. ఇస్తారమ్మను.

''ఏ.. గా.. కాపొల్లతానికి వొయినంరా.. గుత్తకు తీస్కున్నం.. గొర్రుగొట్టి రొండు రోజులయినట్టుంది.. ఇరువాలుగూడ సక్కగ గొట్టనట్టున్నరు.. నారు వీకల్నాయె.. నాటెయ్యాల్నాయె..''

''ఎంతకు దీస్కున్నరు.. గుత్తకు..''

''రొండు వొందలకు తీస్కున్నంగని.. కూల్లన్న పడ్తట్టులేవు.. ఇయ్యల్లటికి మూడు రోజులాయె..'' అసహనంగా అన్నది ఇస్తారమ్మ.

''చిందోళ్ళ ఏషాలింక గానట్టున్నయి.. బాలకిష్టి వేషాలొచ్చినయిగా..'' ఇస్తారమ్మ మనసును అల్కగజేసింది సుగుణమ్మ.

''ఏషాలేసుడు.. సన్నవనిరా.. రొండు మూడు గంటలయితది.. ఏషం గడ్తందుకు.. ఇగొస్తయేమొ ఒకటెన్కొకటి..'' చిందోళ్ల మేకప్‌ కష్టాన్ని కండ్లకు కట్టింది ఇస్తారమ్మ.

''మంత్రేషమచ్చిందిగా.. అటెన్కరంబేష మొస్తదేమొ ఇగ..'' అనుకుంట సుగుణమ్మ ఆటమీద వడ్డది. ముచ్చటబందువడ్డది.

సాందిరి కింద రంభ.. చిందుకు తగ్గట్టు మద్దెల మోగుతున్నది.. రాగానికి తగ్గట్టు హార్మోనియం రాగం దీస్తున్నది.. దరువుకు తగ్గట్టు తాళం చేతులల్ల ఎగురుతున్నది.. సాందిరికింద పెద్దపీటెల వెన్క నిలబడ్డ చిందుస్త్రీలు రంభకు జతకట్టి వంతపాడుతున్నరు. సాందిరికెదురుంగ అరుగుల మీద,  కచ్చీరుమీద పటేండ్లు కూసున్నరు. కొంతమంది.. అరుగుల మీద నడుమొంచిర్రు.. ముసలిముతక నెత్తిరుమాళ్ళు పరిచి కాళ్ళు సాపుకొని కూసొని సూస్తున్నరు.

''ఏమాటాడుతున్నరే'' ప్రశ్నించిండు చిత్తయ్య, పెద్దులును.

''రేణుక జమదగ్నటకానె..'' అన్నడు పెద్దులు. సుట్టనోట్లెకెళ్ళి తీసుకుంట.. పొగను బయిటికి వొదులుకుంట..

''సంజీవ, నర్సయ్య, రామయ్య, రాజయ్య, దశరథ.. అంతవేషకాళ్ళే.. మంచిగ కమ్ముతదే ఆట..'' అన్నడు చిత్తయ్య.

ఇంకో వేషం రాంగనే పర్దాకిందికేషిండ్రు.. పర్దావెన్కనుంచే.. పద్యాన్నందుకున్నడు వేషధారి.

''శారదాదేవి నిన్మదిని సన్నుతిజేతు మదీయ తల్పులన్‌

జేరి సుశబ్దముల్‌ బలుకజేయను నీకృపగాదె పండితుల్‌

కోరియుగాంచి మెచ్చునటు కోర్కెతో పద్దియమాల గూర్పుమో

వారిజనేత్రి బ్రహ్మసతి వందనమమ్మ మయూరవాహనీ''

అనుకుంట సరస్వతిని స్తుతించిండు. పద్యానికి.. రాగానికి తగ్గట్టు హార్మోనియం మోగింది. పర్దాకు అవతలిదిక్కు.. ప్రేక్షకుల దిక్కే నిలవడ్డ మంత్రేషకాడు అందర్నొక్కసారి చూషిండు.

''ఆహా.. ఈ సభాభవనం సకల ప్రజలతో.. ఎంతో వైభవంగానున్నది. మహారాజును పిలిచెదనుగాక'' అనంగనే.. పర్దావెన్కనుంచి.

''కార్తవీర్యుడన్‌ సత్కీర్తినొందినాడ ధాత్రిలొ విను

మార్త్యలోకమేలె చక్రవర్తి నటంచుబొగడ నా

కీర్తికాంత వైజయంతితో.. నర్తించెటివాడను విను

కరసహస్రుడన్‌ భీకరుడన్‌ రణరంగ బలుడను విను

మహీష్మపురమును పాలింతునే - సురపతి వైభవమునగల..'' అని పాడుకుంట.. నడుముకున్న కత్తినితీసి తిప్పుకుంట, ఆడుకుంట పర్దాముంగటికొచ్చిండు కార్తవీర్యుని వేషంలున్న పరంధాములు. ఎత్తుగతగ్గ మనిషి.. ఏం రాజసం.. అచ్చం.. మహారాజుల తీర్గనే కొడ్తుండు. చేతివేళ్ళకున్న ఉంగరాలు తళుక్కున మెరుస్తున్నయి. బంగారు కిరీటాన్ని తలదన్నే కిరీటం.. చెవులకు మకరకుందనాలు.. మెడల కంఠహారాలు.. ముత్యాలదండలు.. గిరుజులు, మెరుగుపట్టి, బొట్టుశేరు, భుజకీర్తులు, ఛాతిమీది పట్టీలు, నడుముకు పట్టి.. అన్ని కలిసి గ్యాసులైట్లకు దగదగ మెరుస్తున్నయి. నిజంగ మహారాజే దిగొచ్చినట్టుంది. దిమ్మరపోయి చూస్తున్నరు జనం.

''ఓరీ సేవకా! మహీష్మతి పురమున ప్రజలందరు మహానంద భరితులయ్యి ఉండిరే.. కార్తవీర్య మహాప్రభును భక్తితో దలచి ముదమున నున్నవారలేగదా..!?'' ప్రశ్నించిండు కార్తవీర్యుని వేషంలో ఉన్న పరంధాములు చిరుదరహాసంతో.. అటూ ఇటూ తిరుగుతూ.

''అయ్యా! నువ్వెవరివి.. యాడికెళ్ళొచ్చినవు.. వివరంగ చెప్పునాయినా..?'' ప్రశ్నించిండు మంత్రేషకాడు.

''నా నామధేయము కార్తవీర్యార్జునుండు.. మహీష్మతి పురానికి మహారాజును.. వెయ్యిభుజాలు గల్గినవాడను.. సురాముప్ఫైమూడు కోట్లమంది దేవతలకు రాజైన దేవేంద్రునికంటే మిన్నగానున్నవాన్ని'' అని గర్వంతో.. రాజసంతో ఓ నవ్వు నవ్విండు.. కార్తవీర్యార్జునుని సొమ్ముల మిరిమిట్లకు జిగేల్‌మన్నయి పర్దముంగట కూసొని అటే సూస్తున్న సుగుణమ్మ కండ్లు. కార్తవీర్యార్జునుని నవ్వులు సక్కగొచ్చి ఆమె గుండెల్ల గుచ్చుకున్నయి. కండ్లార్పకుంట అటే సూస్తున్నది.. గుండె కొట్టుకునుడు ఎక్కువైంది.. సలికాలమే అయినా ఆమెకు సల్లజెమ్టలు వట్టినయి. పెదవులదురుతున్నయి. మూలుగుతున్నది..

పొద్దుగల్ల ఐదున్నరకు మంగళారతితోటి ఆటయిపోయింది.. కట్నాలు మంచిగనెవడ్డయి. చిందోళ్లంత ఇండ్లల్లకువొయి వేషాలు కడుక్కున్నరు. చాయితాగుతందుకు ¬టలు దిక్కవొయిర్రు. కొందరు పొద్దటికల్లుకు ఈదుళ్ళకు, తాళ్ళల్లకు వొయిర్రు.. పదకొండుగంట్లప్పుడు ఇండ్లపొంటి తెచ్చిన బువ్వలు తిని కూర్పట్లొస్తె.. ఈతసాపలు, గోనె సంచులు తీస్కొని పొయి చింతచెట్ల కింద అడ్డమొరిగిర్రు.. మూడుగంట్లకు లేషి కొందరు ఫాంజి, పిట్టెలేసుకొని షికారుకు పోయిర్రు. పరంధాములు గాలంబరిగె తీసుకొని.. పోతపోత ఎర్రలు తొవ్వుకొని, బొమ్మమేడాకుల వెట్టుకొని, వాగు దిక్కు వొయిండు.. గాలానికి ఎర్రనుగుచ్చి 'తూ.. తూ' అని ఎర్రమీద ఉమ్మి నీళ్ళల్లకేషిండు.. సొప్పబెండు మునిగినట్టైతె గాలం బరిగెను తీసిండు.. చాపవల్లే.. గాలానికున్న ఎర్రను మొత్తం దిన్నయి చాపలు. సందమామ చాపలు ఎగురుతున్నయి.. దుంకుతున్నయి. ఎండకు వెండి మెరిసినట్టు మెరుస్తున్నయి.

''నీయమ్మ..! చాపలు.. ఉషారున్నయి'' అని మల్లా ఎర్రను గుచ్చి నీళ్ళల్లకేసి బరిగెను చేతులవట్టకుండు. జెర్రషేపు కాంగనే సొప్పబెండు నీళ్ళల్ల మునిగింది.. ఏదో గుంజుకపోతున్నట్టనిపిస్తే బరిగెను 'ఒక్కసారి' మీదికి లేపిండు.

''దీని తల్లి పడ్డదిరా.. సందమామ..!'' అని చూషెటల్లకల్ల చాపలేదు.. పరంధాములెన్క నిలబడి అద్దగంటసేపట్నుంచి ఆయిన్నే చూస్తున్న సుగుణమ్మ రయికెల వడ్డది.

''ఎటువాయెరా ఇది.. పడ్డట్టే వడి మాయమైంది.. పడక పడక ఒక్కటి వడ్తె ఇట్లయ్యింది'' అని లేషి ఎన్కకు తిరిగెటల్లకల్ల ఏముంది.. సుగుణమ్మ.  రయికెలవడ్డ సందమామచాపనామె అటిటనవరెకల్ల చెట్లల్లవడ్డది. సుగుణమ్మ చేతుల మూటుంది..

''పడ్డాయయ్య చాపలు..'' ప్రశ్నించింది సుగుణమ్మ.. పరంధాములును.

''ఏ.. ఏడనమ్మా! యేకాలమాయె నేనొచ్చి, పడ్తలేవ్‌.. ఒక్కటి వడ్డదిగని అదెటోవొయింది'' అన్నడు పరంధాములు.

''ఇగో నీ సందమామ'' అని ఆమె చేతులున్న చాపను సూపిచ్చింది. దాన్ని తీసుకోబోతున్న పరంధాములతో..

''మరి ఈ సందమామ'' ఉక్కిరిబిక్కిరైతున్న గొంతుకతోటి అడిగింది. ముఖమంత ఎర్రగైంది.

''ఏందమ్మా! ఏం మాట్లాడుతున్నవ్‌ నవ్వు?'' అర్థమై.. అర్థంగానట్టుడిగిండు పరంధాములు.

''నన్ను లగ్గంజేసుకో.. ఇగో ఈ మూట తీసుకో''

''ఏందది?''

''బంగారం.. యెండి.. పైసల్‌''

''నీ మొగనికి తెలిస్తె నిన్ను నరికి కాకులకు గద్దలకేస్తడు..''

''నిన్న రాత్రి ఆటల సూషిన..''

''మేం ఆటలాడుకొని బతికెటొళ్ళం.. చిందోళ్లం..''

''మేం........? అయితె''

''మాది అడ్కతినె జాతి.. మీరు ఎక్కువోళ్లు.. మేం తక్కువొళ్లం..''

''నాకు గదంత తెల్వది.. ఈ వూళ్ళె ఉండొద్దు.. ఏడికన్న పోదాం..''

''నాకు లగ్గమైంది.. ఇద్దరు పిల్లలు..''

''అయితెమాయె.. ఇద్దరముంటం.. అక్కుంటది.. నేనుంట..''

''కాగురంబట్టిన లెక్కలా..? నన్ను బత్కనిస్తరా..? ఈ వూరొళ్ళు''

''బొంబాయికి వోదాం''

''నీ కాళ్ళు మొక్త.. నీకు దండం బెడ్త.. నన్ను బత్కనియ్యి..''

''నువ్వు చేస్కొకపోతె ఈ బాయిలవడిసస్త..''

''సావు.. నువ్వు సస్తెనాకేంది.. బతికితె నాకేంది..''

''ఇదే మాటనా..?''

''ఆ.. ఇదే మాట..''

''పోతున్న''

''పో''

''దుంకుతున్న''

''దుంకు''

రొండు నిమిషాలేం మాట్లాడకుండ తెచ్చిన మూటను ఆన్నే ఇడ్షిపెట్టి ఏటి అవతలకుపోయింది. సందమామ చాపను ఆన్నే ఇడ్షిపెట్టి గాలం బరిగెతోటి ఊరుదిక్కువొయిండు పరంధాములు.

''ఇంటికాడ నాయినకు బాగలేదటనే నేను చూసొస్త'' అని పెండ్లాం పిల్లలతోటి ఇంటివడదాకవొయిండు..  రాత్రాడిన చిందు భాగోతంలోని కార్తవీర్యార్జునుడి సహస్త్ర బాహువులే కండ్లల్ల మెదుల్తున్నయి సుగుణమ్మకు.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు