గోత్రాల బతుకు
పొయి మింద అన్నం వుడకతాఉంది. అప్పుడే ఊర్లో ట్యాంక్ నీల్లు వస్తా ఉండాయి. ఆ నీళ్లు అరగంట వస్తాయి. బిరిన్యా పట్టుకోకపోతే మల్ల మరుసునాడు వరకు నీల్లకు అగసాట్లు పడాల్సిందే. పొయి కాడ చూసుకుంటా నీల్లు ఎత్తకపోయిపోసుకుంటా,ఇంగాఒగ పక్క కూర ఏమి చేయాలా అనే డైనమా లో ఉండగా...
'చీరలమ్మ చీరలో' అని మాకు మామూలుగా చీరలమ్మే ఆయప్ప అరుచుకుంటా వీధిలో మాఇంటి ముందర చీరల మూట దించి ఇప్పి ''రండక్కా,రండమ్మామంచి చీరలు వచ్చినాయి అత్తారింటికి దారేది చీరలు వొచ్చినాయి. ధర తక్కువ సూద్దురు రండి ''అని అరస్తా ఉండాడు.
నేను ఇంట్లోనుండే "వోన్నో పొయిమింద అన్నం ఉంది వొంచేసి వస్తా కాంచేడు ఉండు"అంటి . ఆయాలకే నలుగురైదు మందిఆడోళ్ళు ఆ యప్ప గుడ్ల మూట సుటకారం ముసురు కొన్నారు. నా మనసంతా ఆ గుడ్లాయన చుట్టే తిరగతా ఉంది. ఆడ చీరలు చూసే అమ్మ లక్కలమాటలు వినబడతా ఉండాయి ... ఇదో ఈ చీర బాగుంది, ఈ అంచు బాగుంది, ఆ పూసలు బాగుంటాయి, ఈ చీర గుడ్డ బాగా మెత్తగా ఉంది, న్నోవ్ ఈచీరఎంత, ఆచీరఎంత అని బేరమాడతా ఉండారు.ఆయాలకు నేను ఆదరా,బాదరాగా పనులన్నీ ముగించు కొని ఆ చీరల కాడికి పోతి. ఆ చీరలు అమ్మే ఆయన ఉండు కొని ఇవి ''అత్తారింటికి దారేది'' చీరలు.కొత్తగా వొచ్చినయ్ చూడమ్మా అనే!
అందరూ చీరలు కొంటా ఉంటే నేనుండు కోని "అన్నా నాకు చీరలొద్దు గానీ రైగ్గుడ్లు చూపించు అంటి.ఆయన్న రైగ్గుడ్ల కట్టనెత్తి నాముందర ఏసె .ఇదోమ్మా మేల్గుడ్డ .నీకు ఏరంగు కావలో అది ఎత్తుకో అనే.నాకు నల్ల రైగుడ్డ అంటే బలే బెమ .అచ్చం నల్ల రైకి తీసుకొని బేరమాడతా చేతిలో పట్టుకున్న. ఆయాలకు మాయత్తొచ్చి నా చేతిలో ఆ నలుపు గుడ్డ చూసి ఆగ్రుడయిపోయింది. మే మనది నల్లగుడ్డగోత్రం. వొల్లు మీద నల్లగుడ్డ తొడగద్దు అని నా చేతిలోని రైకి గుంజు కొని ఆడేసేసా .నేను అయితే గానిలే నాకు ఆ నల్లరైకే కావాలని ఆయమ్మ ఒక పక్క తిడతా ఉన్నట్లే నేను బేరమాడి నల్లరైకి తీసుకుంటి. మాయత్త ఉండుకొని కులము,గోత్రంలేని పనులు చేస్తావా అంటా వదరతా ఉన్నట్లే నేను నల్ల రైకి ఎత్తుకొని ఇంటికి వొచ్చేస్తి.మా అత్త దానికి నలుపు గోత్రమని చెప్తా ఉంటే ఇరుద్దంగా అట్లే నల్లగుడ్డ ఎత్తుకొని పాయ సూడు అని మా ఎదురింటి రంగత్తతో మేయిస్తా ఉంది.రంగత్త ఉండు కొని ఇప్పుడెవరమ్మా కులం, గోత్రం పట్టించుకునేది అందరూ ఏసుకుంటానే ఉండారు అనే.మా యత్త "ఎవురో పియ్యతింటారని మనము తిందామా,ఏలికి గోరేంటికి అడ్డం.పెద్దోళ్ళు అనేది కులము ఇడిసినా,గోత్రం ఇడకూడదని. అందుకే ఇప్పుడు 'అంటేది అంట్లా ముట్టేది ముట్లా' అని సాధిస్తా ఇంట్లోకి వచ్చి నామొగునికి ఎగేసె. ఒరే నీ పెండ్లాము నల్లగుడ్డ గోత్రం తొడగద్దు అంటే అట్లే తీసుకొని వచ్చింది. నా మాట అంటే లెక్క జనా లేదురా అనే. నామొగుడు ఉండు కొని నల్లగుడ్డ దొడగద్దు అంటే ఎందుకు తెచ్చినావు ఇచ్చేయిపో అనే.ఈల్ల ఇద్దరి రావిడి బాగయిపాయనే అని తిరిగి ఇచ్చేసిందంక వాళ్ళ కండ్లు సల్ల బల్ల .మా పుట్టింట్లో ఉన్నబుడు నల్లరంగు కలందే గుడ్డతొడిగేది లేదు.ఈల్ల ఇంటికొచ్చి ఆగుడ్లన్నీ పక్కన పారేసే పనాయ.మాయమ్మోళ్ళకి బూరగ్గట్టి గోత్రం. మేము ఆ బూరగకట్టి ఎప్పుడేగాని పోయిలో పెట్టే వాళ్ళం కాదు. అయినా ఈల్లకు గుడ్డ గోత్రం ఏందో అనుకొని ఉండిపోతి .
ఆ మర్సునాడు సీతాలు పెద్దమ్మ పొయ్యిలో కట్లు కావాలని పెద్దరెడ్డివాల్ల భూములు కల్ల పోయింది.వాళ్ల భూముల్లో కానగ చెట్లు ఎక్కువ.ఆ చెట్లలోఎండిన కానగ కట్లు మదగాలు,మదగాలుగా పడింటాయి. పెద్దరెడ్డోల్లకి కానగ్గట్టి గోత్రం అని,వాల్లు ఆకట్టెలు పొయ్యిలో పెట్టరని మా ఊర్లో అందరికీ తెలుసు.అందుకే మా ఊర్లో అందరూ వాళ్ల కానగ మాన్లోఎండి రాలిన కట్లు ధైర్యంగా ఎత్త కొచ్చుకుంటారు. ఆ ధైర్యంతోనే మా సీతాలు పెద్దమ్మ కూడా పోయి కానగ కట్లు అన్నీఏరి మోపు కట్టింది.కానీ పెదరెడ్డి నడుపు కొడుకు 'పీతిలోరూక పడితే నాలికతో అద్దుకోనే రకం'. పోయిపోయి ఈ యమ్మవాని కంటబడింది. వాడొచ్చిఎవర్నిఅడిగి ఏరినావు."సొగసుగానీ మీసాలు నాన్యానికి సరిపోయినట్లు "మా కట్లన్నీ మీఊరోల్లకే సరిపోతాఉండాయి అని అరిచే .ఆయమ్మ"మీకు కానగకట్లు గోత్రం కదా అందుకని ఏరుకుంటూ ఉండా"అనింది."మాకు గోత్రం అయితే ఈ కట్లు వేరేవాళ్ళకి బొదులు ఇచ్చి ఏరే కట్లు తెచ్చుకుంటాను అని ఆయమ్మ కట్టిన కట్టెలమోపు పెరొక్కొని పంపించినాడు.ఆ యమ్మ వుసూర్న వొట్టి చేతులతో ఇంటికి రాలేక వచ్చేదావలో జిల్లేడుకట్లు బాగా ఎండిపోయి ఉంటే ఆ కట్లనుమోపు కట్టుకొని ఇంటికొచ్చి వాల్ల ఇంటి ముందర వేసింది.వాల్ల అత్త దూరం నుండి ఆ మోపును చూసి అమ్మ నా కోడలు ఈ పొద్దు పెద్ద,పెద్ద కట్లు మోపు తెచ్చింది అని పొగడతా దగ్గరికి పోయి మోపు కళ్ళ తేరి పార చూసింది. అవన్నీ జిల్లేడు కట్లు.ఒసేయ్ తిక్కదాన జిల్లేడి కట్లు మనకు గోత్రం ఈ కట్లు మనం పొయిలో పెట్ట కూడదు అని ఆ మోపెత్తక పోయి పారేయమనింది.సీతాలు నాదగ్గరికి వచ్చి ఎవరే యమ్మ ఈ గోత్రాలు కనిపెట్టింది ఈ పొద్దు చేసిన కష్టమంతా శాదము అయిపోయా అని బాధపడే !
ఇంతలో మా మేనత్త లచ్చుమమ్మ ఆన్నేఉండే. సీతాలుబాద అంతా ఇని "కాదండే నాకు పెండ్లి కాక ముందు పరమట నుండి నన్నుఅడిగే దానికి ఒగ పెండ్లికొడకు వచ్చిండే. బాగుండేవాడు .ఇద్దరమూ మొగపడితిమి . మా పెద్దోళ్ళు మా ఇద్దరి మీద పేరు పలాలు చూపించను పొయినారు. ఆడ పేరుపలాలు చూసే ఆయప్ప ఇద్దరి గోత్రాలూ అడిగినంట.మాకు సున్నంగోత్రం, వాళ్లకూ సున్నమేనంట. ఇద్దరికీ సరిగోత్రం వచ్చిందే , సరి గోత్రం ఉన్నవాల్లకు పెల్లి చేయకూడదనే .ఆడ ఇరిగిపాయ లేదంటే ఈ చర నుండితప్పించుకునిందు అనే .
ఇంతలో మాచినవ్వ వచ్చే. ఆ యమ్మ ఏమన్నంటే మాయత్తింటి టోల్లకు గోత్రం తెలియకుండా ఉంటే అప్పుడు కుల పెద్దలు పోయి పిచ్చికుంటలాయప్పను పిలిపించినారంట . అయ్యప్ప దగ్గర ఉన్న రాగి తామర పైన అవి రాసి ఉంటారంట.అయ్యప్ప అప్పుడు నీకు ఫలానా గోత్రమని ఎత్తి ఇస్తాడు .అట్ల మాకు ఎలవకట్టి గోత్రంమని ఎత్తి ఇచ్చినాడు. లేదంటే మన కులసరిత్ర తెలిసిన డొక్కలోళ్లు,మాస్టీన్ వాళ్లు గోత్రం ఎత్తిస్తారు. మాకు ఉట్టి గోత్రం.అందుకే మేము మా ఇంట్లో ఉట్టి కట్టం.అయినా ఈ కాలం ఎవరు పట్టించుకుంటున్నారు "దేవరిల్లు ముట్టిగుడిసి ఏకమైనాయి " అనేసి నాకు పని ఉందని ఎల్లిపాయ . మేము ఎవరుదావన వాళ్ళం పోతిమి .
మల్ల వారానికి నోములు పండగ వచ్చే. నోములునోయను గుడికి పోతిని. గుల్లో వరుసగా కుసోని ఉండాము.పూజారి అందరి గోత్రాలు అడిగే.మనిషికి వొగ గోత్రం చెప్పినారు.శివశంకు గోత్రం, ర్యాలకట్టి గోత్రం, మంగకట్టి గోత్రం, ముట్టికట్టి గోత్రం, ఇరిక్కా యలుగోత్రం, ఎలవకట్టి గోత్రం, సండ్రమాను గోత్రం, మండలంగోత్రం, రోజునాటుగోత్రం, ఎన్నిలి గోత్రం, కొర్రసట్టి గోత్రం, గుమ్మడకాయి గోత్రం, బండమింద నీళ్లు గోత్రం, ఊసిల్లు గోత్రం, అంటా రకరకాలు చెప్పినారుబో !
అర్థాలు
మదగాలు=రెమ్మలు, రెమ్మలుగా
శాదము=వృధా
మొగపడితిమి=ఇష్టపడితిమి
మా ఊర్లో మంగళారం మంగళారం సంత జరుగుతుంది. వారమంతా కస్టం చేసి సంపాయించిన డబ్బులకి సంతకు పోయి సరుకులు తెచ్చుకుంటేనే కూర్లకు యసనముండదు. అయినా కాలం మారి డైలి మార్కెట్లు, రైతుబజార్లు,సూపర్ మార్కెట్లు ఎన్నొచ్చినా మాకుమటుకు సంత ఒగ తిరనాల్లాంటిది. మాచేతిలో దుడ్లున్ని కాడికి ఎక్కడో ఓ సోట మాసొమ్ముకు తగ్గ బేరం వుండనే వుంటుంది . బేరగాలు దగ్గర గోజాడి, గోజాడి మనం అడిగిన రేట్లకు వాల్లు సరుకు అమ్మితే ఆ ఆనందం, ఆ బింకం బలేవుంటుంది. ఇంగ మాఊర్లో వారంవారం కచ్చితంగ సంత చేసే వాల్ను సావుకార్లు అంటారు.
ఈ మంగళారం నేను ఇంటి సరుకులు సగలం తెద్దామని మూడునూర్లు దీసుకుని సంతకు పోతి. సరుకులన్నీ దీసుకోని ఆ సంచిని చేత్తోనే మోస్కోని బస్టాండికి వచ్చేసరికి చేతులు ఎర్రగా కమిలి పొయినాయి.భుజానగాని నెత్తినగాని పెట్టుకుంటే ఎంతబరువైన మోయచ్చు. కాలం మారె. నెత్తినగాని పెట్టుకుంటే యాడ మొరుటోల్లు అనుకుంటారేమోనన్నజంకు.సంచి నాకాళ్ళకు ఆనిచ్చుకొని నేను నిలబడితి. ఆడ నాకుబాగా జతగత్తె,మాఊరి ఆడబిడ్డ కమల కూడా బస్సుకోసం బస్టాండ్ లోవుంది. నేనుదాని పక్కకు చూసి నగతా అంచుకుపోయి కమలా బాగుండావా అంటి.అది మూతిముడ్సుకొని తలకాయి పక్కకు తిప్పుకుండే. మల్లా నేనే మాట్లాడిస్తి. అదివుండుకోని "మ్మేయ్ నేను నీతో మాట్లాన్ను,నాకొడుకు పెండ్లికి నీ ఇంటికొచ్చిసెబితే కూడా నువు రాలా.నేనంటే నీకు లెక్క జమలేదు. నీబిడ్ల పెన్నిండ్లకు కూడా నేనురాను" అని బాదపడే. నే నుండుకోని "మ్మేయ్ మాపరిస్థితి బాగలేదు. నేను డేటు అయింటి. ఆపొద్దుటికి నాకు రెండుదినాలు. నామొగుడు మడికాడ కోతులకి కావిలుండాడు. మడికాడ గెడిసేపు కూడ యామారేదానికిలేదు. నోటికొచ్చిన పంటపోతుంది అని దానికి నచ్చజెప్తి. ఆటికీ అది సరిగా మాట్లల్లా, ఆయాలకే దాని బస్సొచ్చే.అదిఎక్కిపాయ.నేనూ మాఊరుబస్సుకి ఇంటికి వొచ్చేస్తి.
ఇంటికి వస్తానే కమలన్నమాటలు నామొగినితో చెబితి. నామొగుడుండుకోని "ఈడ కోతులతో గెడి సేపుకూడా నిమ్మలం లేదే , పొద్దుపుట్టి పొద్దుగుంకి పొద్దుమసికిలు పడేవరకు కావిలుండల్ల.యామారి నామంటే పచ్చికాయి, పాలకాయి, చెట్లుతోసహా పెరికేస్తాయి.ఏమిచేసేది. అందరితోను నిస్టూరం కట్టుకోనే పనై పోయింది. ఈ కోతులతో ఒగపెండ్లికి పోలేము, ఒగసావుకిపోలేము, ఎవరికన్నా ఆప్తి అంటేపోలేము. గోతికాడనక్కేగతం కాస్కో నుండే పనైపోతాంది అనే"
అవును నామొగుడు చెప్పింది నిజం.ఇబుడు కోతులతో ఏగుతున్నాం . కోతుల గొడవ ఒకటేనా మాకు. పంట చేస్తే దానికి ఎన్ని ఆసించు కొని ఉంటాయో ! మా యట్ల చిన్న సేద్య గాళ్ళు అరకవ నీళ్లకు మడి నాటితే మల్లల్లో ఎలకలు. మాకు వాటితో రంపు చిన్నది కాదు. నీకే కాదు ఈ భూమిలో మాకూ అక్కుంది అని దౌరుజన్యంగా మేము మడి నాటతున్నబుడే మా కంటే ముందుగానే గెనాల్లో వాటి ఇండ్లు కట్టుకునే దానికోసం బొక్కలు లోడుకుంటా ఉంటాయి..గదులు గదులుగా లోడతాయి. మేము నాట్లు పెట్టే గుందికి అవి ఇండ్ల పని మొదలు పెడతాయి అవిటి కట్టడం లో యాడన్న డ్యామేజీ అయి బొక్కలు పడితే మా మల్లోని నీల్లన్నీఎలిపోతాయి. అబుడు చూసి ఆబొక్క తొక్కిపూడ్సల్ల. మడి ఎన్నులు ఇడిసేటబుడు వొరికర్ల మొదల్లు తీయగ ఉంటాయని వాటిని కొరకతాయి.
గింజలు అట్ల ముదరతానే ఆ వడ్ల గొలకల్ని నోటితో కొరికి ఎత్తకపోయి వాటి బొక్కల్లో పెట్టుకుంటాయి. పొదుపు అనేది ఎట్లా చేయాలా అనే విషయం ఎలకల దగ్గరే నేర్చుకోవల్ల .మల్ల సంవత్సరం వరకు తిండికి బయం లేకుండా వొడ్ల గొలకలు ఎత్తి పెట్టుకుంటాయి.బీదోల్ల పైకి షావుకార్లు దౌర్జన్యం చేసినట్లు మేము వాటి బొక్కలు కనుక్కొని దౌర్జన్యంగా తవ్వి పగలగొట్టి చూస్తే అవి ఎత్తి పెట్టిన దాన్యంగింజలు కనబడతాయి. ఆ బొక్కల్లో పాములు దూరి వాట్ని సంపితే తప్ప వాటి తిండికి ముప్పు రాదు. అవి ఎత్తి పెట్టిన తిండి గింజలు సంవత్సరం తర్వాత చూసినా సెడి ఉండవు అంత బాగుంటాయి. వొకబుడు ఇర్లోల్లు ఎలుకల్ను బట్టేవాళ్ళు .ఎలకల్ని పట్టే బుట్టల్లో గింజలేసి వాటిని మల్లో పెడతారు. ఆ గింజల కోసం ఎలకలొచ్చి ఆ బుట్టలో పడి ఇరుక్కు పోతాయి. ఒక ఎలక్కి ముప్పైరూపాయలు ఈయల్ల. అది ఒక పని.మల్ల ఊదర పెట్టేది.బొక్క లో పొగ పెడితే ఆ పొగకు ఊపిరాడక బయటకొచ్చేస్తాయి.అట్ల పట్టుకొని సంపేది. అట్లా పంటను మేము ఎలకల నుండి ఎంత కాపాడినా అవిటి వాటా అవి దోసుకుంటానే ఉంటాయి.
ఇవిటి గొడవ ఇట్లుంటే పందులువొగ పక్క. ఇవి సానా తెలివైనవి. పొగులు రావు.సరిగ్గా నడి జామకాడ వస్తాయి. ఇవి పంట లో పన్నాయంటే, పెద్దలంటారు చూడు పంది పొల్లినట్లుపొల్లాడి దొర్లతా ఉండావు అంటారే అట్లా చిత్త, చిత్తగా తొక్కేసి తినేసి పొల్లాడి ఎలి పోతాయి. అవి రాకుండా మడి సుట్టూ కమ్మి కట్టల్ల. గుడ్డ తిరుకులు సుట్టు కట్టల్ల. బెదుర్లు పెట్టల్ల.దానికోసం మనిషిబొమ్మ చేసి నిలబెట్టేది. ఇప్పుడు ఇంగా కాలం మారి పులి ఎట్లా ఉంటే అట్లా బొమ్మలు సిక్కతా ఉండాయి కదా ఆ పులి బొమ్మ తెచ్చి నిలబెట్టేది. దానికి పులి అరుపు గాండ్రించిన ట్లు అలారం పెట్టేది, డప్పులు కొట్టేది. ఇట్లా వాటిని బెదర కొడతాము .
ఇంగా గువ్వలు, పక్షులు అవి ఎంత సుకుమారంగా సున్నితంగా ఉంటాయో అవిటి పనితనం కూడా అట్లే ఉంటుంది, " ఒక కథ ఉంది వొక రాజుని శని దేవుడు ఎంటాడతా ఉంటాడు. అన్నీ పోగొట్టుకోని తిండి దొరక్క ఆకిలికి అలమటిస్తా ఉంటే ఒగ గువ్వల గుంపు వచ్చి కుసుందంట ముందర. వాటినన్న తిందామని వొంటి మింద ఉన్న ఒగేఒగ పంచి గుడ్డ ఇప్పి వాటిపైన ఏస్తే అవి ఓగే కట్టుగా ఆ పంచిగుడ్డతో సహా ఎగిరిపోతాయంట. బిత్తల తో నిలబడి ఆకులు కట్టుకునే స్తితివచ్చే ఆ రాజుకి. అట్లా పంట వొడుపుకువచ్చినబుడు యామారినామంటే యాబై , నూరుగువ్వలు గుంపులు గుంపులుగా వచ్చి పొట్టు కూడ రాల్సకుండా నోటితో సున్నితంగా బీముగింజలు తినేసి ఊదేస్తాయి. ఇవి పొద్దన సాయంత్రం వస్తాయి. ఎండ పొద్దు లో రావు. అవి వచ్చే టైముకు దేవునికి మెరివిని తిరిగినట్లు అన్నంతినే గిన్ని చిన్నకట్టి ఎత్తుకొని డాంగ డాంగ మంటూ కొట్టుకుంటూ వూడ్ వూడ్ మని అరసల్ల. ఎంత చేసినా వాటి వాటా వాటికి పోతుంది. వీటినన్నిటిని జయించి ముందుకు పోతే దేవుడు కూడా పగ పడతాడు. వాన పడక పంటలు ఎండిపోతాయి లేదంటే వానపడి మునిగి పోతాయి. ఇవన్నీ కనికిరించి పంట ఇల్లు చేరి మా సట్లో పడే వరకు మాకు పురిటి నొప్పులే.
సరే ఇవిటి గొడవంటే ముందు నుంచీ అలవాటయ్యింది .కానీ ఇప్పుడు కొత్తగా కోతుల బెడద వచ్చి పడింది.
మేము పది కుంటల్లో టమాటల పంట ఏసినాము. మాభూములు సుటకారం పెద్దపెద్ద మాండ్లు ఉండాయి. కోతులు మా మాండ్లుని వాటికి స్తావరాలు చేస్కునాయి. ఎంతదేశం తిరిగినా కూడ సాయంత్రానికి ఇండ్లకు ఒచ్చినట్లు మాండ్ల మిందకు ఒచ్చేస్తాయి. అది ఒగటి, రెండుకాదు, గుంపులుగుంపులు వొస్తాయి. ఒగొగ గుంపుకి యాభై కోతులుంటాయి. ఒగగుంపు పోతే ఇంగో గుంపు వస్తాయి. ఒగ గెడివి యామారినా మా పంటంతా పెరికి నేలమట్టం చేసేస్తాయి. అనే వుండ్ల "ఒగకోతి వనమంతా చెడిసనంటారే" అట్లా ఈ కోతుల రావిడి ఎక్కువై ఈటి గురించి మాఇంట్లో ఎన్నోదినాలు రంపు లాడుకున్నాము. నేను కోతుల కాడికి పోతే వాట్నినేను తోల్లేను. అవి నామిందకు ఎగరబారతాయి. నేను పోను బయిపడి . నామొగినికి యాస్ట అయినబుడు గాని, ఏదైనా పని పన్నబుడుగాని, ఇంట్లో పిల్లోల్లని లేక నన్నుగాని పొమ్మంటే మేము పోకపోతే ఆయనకి బలే కోపం వస్తుంది. మడికాడికి పోతే మాటాడే దిక్కులేకుండా ఊరికే కుసోవల్లంటే బేజారయేది. అందుకే మేము పోమనేది.మాకు జైలుసిచ్చి అయిపోయింది ఆడ . వాటిని తరమల్లని మేము చేయని పనిలేదు. టపాసులు కాల్సేది, డప్పులు కొట్టేది, అగ్గి పెట్టేది ఇట్ల ఏమిజేసినా అవికొమ్మలపైకి పొయ్యి అవి కుసున్న కొమ్మను ఊపతా ఆటినుండి మమ్మల్నే కండ్లతోను, పొండ్లుతోను బెదిరిస్తాయి. మేముతెగబడి కొట్టేదానికి దేవుడనే బయము.
మొన్న నామొగుడు కాంచేపు పనుందని పంటకాడ లేకుండా యామారినాడు. ఈసందులో కోతులు జొరబడి కాయల్నిపెరికి,అన్నీపీకి పీకి నేలపాలు చేస్నాయి. పెరికిన కాయని తినేస్తే పర్వా లేదు అట్లకాదు కాసింత కొరికేది అది పారేసి ఇంగొగకాయ కొరికేది. అది చూసి నామొగుడు కోపంపట్ట లేక కట్టి ఇసిరేసినాడు. ఒగకోతి తలకాయికి తగిలింది.మిగతావన్నీతప్పించుకున్నాయి. ఆ కోతి ఆన్నేపడిపోయింది. ఆ పడిపోయిన కోతిని చూసి నామొగినికి బాదేసింది. అదరాబదర పరిగెత్తి పోయి ఏట్లో నుండి బక్కిట్టుతో నీల్లు ముంచకచ్చి దానికి తాపినాడు. అయినా అది కదల్లేదు.దాని మెడంతా రక్తం కారతాఉంది. ఓరే ఇదేమొ చచ్చేట్టిగావుంది కోతిని చంపితే కోటిపాపాలు అంటారు. "ఇవిటి దిక్కుఆర్నాని! పంట తినేసి పోతే పోనీ ఈ కర్మయాల అనుకోని దిగులుపడిపోయినాడు.ఆ కోతికి దెబ్బతగిలే కుందికి మిగిలిన కోతులన్నీ మాండ్లెక్కేసి అరస్తా దానికల్లా చూసుకోనుండాయంట. అన్నీయాడ నామింద ఎగరబారతాయోనని ఇంటికొచ్చి జరిగింది మాకుచెప్పి అన్నం ఎత్తుకొని బొయ్యి ఆ కోతికి పెట్టినాడు. అది తినిండ్ల. ఆ యన్నాన్ని మిగిలిన కోతులు తిన్నాయి.సాయంత్రం మల్లా అన్నం ఎత్తకపోయి పెట్టినాడు. అబ్బుడు అదికొంచం అన్నం తిని తెపుర్లుకునింది. ఆ కోతి లేసి తిరుగులాడేంతవరకు మిగిలిలిన కోతులు ఒగ పొగులు రేయి మేత నీల్లు లేకుండా దాని సుటకారం కావిలున్నాయి.ఆమర్సునాడు అన్నీఊర్లోకి వొచ్చేసినాయి.
ఊర్లో మద్యానం మూడుగంట్లు అయ్యింటుంది. గెట్టిగ అరుపులు ఇనపడే . నేను ఈది లోకి పోయి నిలబడితి. ఊర్లోని ఆడోల్లంతా కట్లెత్తుకొని కోతుల్ని తరమతావుండారు. వీల్లజతకి మొగోల్లు కుక్కలు కూడా ! నేను వాల్లగుంపులో నిలడితి. మా వొదిన ఉండుకోని"మాఇంట్లో కోన్ని పొదగ బెట్టింటే ఆ పొదిగినకోడి మేతకుపోయింటే ఆ గుడ్లు ఎత్తకచ్చి తినేసె. ఇల్లంతా గుడ్లు పగలగొట్టేసినాయి. రేపోమాపో పిల్లలు ఇడగతయి ఆ గుడ్లు. ఆ పొలుసు వాసన పోవలంటే నేనుఎంతసేపు కడగల్లో. ఈటిని దేవుల్లంటారే దేవుల్లు అయితే గుడ్లు తింటాయా అనే"
ఇంగోయమ్మ "మాఇంట్లోకూర,అన్నం తినేసి సామాండ్లన్నీ పీకేసినాయి.నా మనవరాలు చిన్నబిడ్డ.ఇంట్లోవుంటే ఆ బిడ్డ మిందకు ఎగరబారింటే బయంతో జరం వొచ్చేసింది. మాతమ్ముడు తలుపుతెర్సుకోని పనుకోనుంటే సడిసప్పుడు లేకుండ ఇంట్లోకి పోయి సామాండ్లన్నీ పీకతా వుండాయంట. వాడులేసిఅరిస్తే అట్లే జొరబడి వానికాలు కర్సింది. వాడు మనూరి రెండుగంట్ల బస్సుకు గవర్నమెంట్ ఆసుపత్రికి బాయె " అనే.
ఇగ మాఆడబిడ్డ వాల్లది పూరిల్లు. పైకప్పడం పేరికేసి ఇంట్లోకి జొరబన్నాయి. ఇంట్లోవున్నఉప్పునుండి నూన్డ్లు, మసాలడబ్బాలు, సామాండ్లు మెత్తం నేలపాలు చేసేసినాయి. అదిఇంటి కొచ్చిచూసి బోరున ఏడిసింది. ఊరందరి ఇల్లలో జరిగిన దానికంటే మా ఆడబిడ్డలచ్చిమికి జరిగిందానికే అందరు బాద పడినారు. ఎందుకంటే దాని మొగినికి కాలు అవుటు. దాని రెక్కల కస్టంతోనే ముగ్గురు బిడ్డల్ని, సంసారాన్నినెట్టు కొస్తా వుంది. ఈ నస్టం పూడాలంటే దానికి రెన్నెల్లు పడుతుంది.
మా చిన్నబుడు ఊర్లోకి కోతులాడించేవాళ్లు వస్తావుండ్రి. ఆ కోతికి నిక్కర చొక్కాయి తొడిగి సోకుజేసి ఆ కోతిని బుజాన ఎక్కిచ్చుకొని చేతిలో పొడువాటి కట్టితో ఇంటింటికీ పొయ్యేది. అమ్మా సీతమ్మఅత్తింట్లోలు ఎట్లాంటోల్లుఅంటే అది అలిగేది.తలకాయికిందికి వాలేసేది. పుట్టినింటోలు అంటే అది నగేది సలాంకొట్టేది. పిల్లాగుంతలు ఆడేది.పిల్లోలమంతా ఆ కోతులోడు ఊరు దాటకున్నంత వరకు ఆయప్ప యనకాలే పోయేది. ఆ కోతి చేస్టలకు పగలబడి నగేది. కోతిని జూస్తే అంత అపురూపంగా ఉండేది.చూడక చూడక కోతిని చూసే వాళ్ళం.అట్లుండేది అబుడు. ఇబుడు సుమారు పదేండ్లయ్య, ఊర్లమింద కోతులనెత్తుకొని వచ్చి.
మాయమ్మ వాల్ల అన్న వుండ్యా. ఆ యప్పకు బిడ్లు లేరు. ఆలు మొగుడు ఇద్దరూ మన్సుల్ని నమ్మరు.వాల్ల బిడ్లేగతం మూడునాలుగు కుక్కలు,మేకలు యాబై, పిల్లులు ఐదారు ఉన్నాయి. అవి ఇల్లంతా తిరిగేది అరిసేది.చిన్నబిడ్లేగతం వాల్ల కాళ్ల సుటకారం తిరిగి కాళ్ల కు అడ్డం పడేవి. కొత్తోల్లు ఎవురన్నావాల్ల ఇంటికి పోతే వాట్నిచూసి చీకొట్టుకొనేది. వాల్లు తినేగిన్నెలోవాటికి అన్నం పెట్టేది. అదీ మించితే వాటికి తినిపిస్తా అదేచేత్తో వాళ్లుతినేది. నేను ఏంది మామా ఈ సంత అంటే "అయ్యోమ్మ అట్లనద్దు దేవుడు ఈ బూమ్మింద పుట్టిన జీవికల్లా దాని నోటి ముసర దానికి ఏసే ఉండాడు. వాటికి ముసర లేకుండ సేయగూడదు" అనేవాడు.
మా యన్నఉండుకోని ఈ కోతుల్ని చూస్తే బాదేస్తుంది. అవి మాత్రం ఏమి చేస్తయి. పొలింమింద యాడేగాని మేతలేదు. అడువులు పలసబారి పొయినాయి.వాన్లులేక,నీల్లు లేక, తిండి దొరక్క అవి ఊర్లమింద బడ్డాయి. పెద్దలు అనేవుండారు 'దేనినోటి కూడన్నాపెరికేస్తే అవి మననోటికూడు పెరికేస్తయి' అని అదియిదే అనే. నిజమే ఈ కోతుల దెబ్బకి భయపడి సానామంది సేద్యాలు చేయకుండా బూములు బీల్లు పెట్టుకోనుండారు.
అయినా మేము చేసిన తప్పేమి? మేము సెట్లు కొట్టలేదు, మేము ప్యాక్టరీలు కట్టలేదు, మేము రోడ్ల మీద పెద్ద పెద్ద పొగ బండ్లు నడప లేదు, మేము సెరువులు సదరం చేసి బిల్డింగులు లేపలేదు, దేశమంతా ఎడతెరపు లేకుండా కరెంటు తీగలు నాట లేదు. మేము చేసిందల్లా ఆ బూమిని దున్ని నాలుగు రకాల తిండి గింజలు పండించి నలగరి కడుపులు నింపడం ఒకటే.
మాకు దెల్సి మేము దేని నోటి ముసరా పెరక లేదు."నీ కులానికి నాసాడు అంటే తలా గెంటెడు అన్నట్లు" మనిషి చేసేపనులకి బూమి మీద పుట్టిన సాటిమనిసులతోపాటు నోరులేనిజీవాలు కూడా పలితం అనుబవించాల్సిందేనా ?
అర్థాలు
ముసర = నోటికాడికి పొయ్యేది ఏదైనా,నోటికి మెత్తుకునేది
మసికిలు = చీకటి
పొలుసు వాసన = నీసువాసన
బెదుర్లు = బెదిరింపు
గుడ్డ తిరుకులు = గుడ్డ పేలికలు
కాలుఅవుటు= కాలు అవిటి
బిడ్లేగతం = బిడ్ల మాదిరిగా
మెరివిని తిరిగినట్లు=ఉరేగింపులాగా చుట్టూ తిరిగేది
**************************************************
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు