మా రచయితలు

రచయిత పేరు:    ఎన్‌.వి.యస్‌.నాగభూషణ్‌

కథలు

తీర్మానం నెగ్గింది

అది 1917వ సంవత్సరం...అక్టోబరు నెల...రష్యా దేశ రాజధానీ నగరం  పెట్రోగ్రాడ్‌...

వేలాది చిన్నా పెద్దా పరిశ్రమలకు నిలయం...లక్షలాది కార్మిక జనావళికి జీవనోపాధి కల్పించే కేంద్రం.  వందలాది పరిశ్రమాధిపతుల్ని కుబేరుల్ని చేసే స్థానం...అయితే కుబేరులంతా నగరంలో వుంటే,  కార్మిక జనావళికి మాత్రం ఆ నగరంలో నివసించే భాగ్యంలేదు.  నిజానికి ఆ కార్మిక ప్రజల పూర్వులే ఆ సుందర నగరాన్ని తమ రక్త మాంసాలూ, వాటితో పాటు వేలాదిమంది ప్రాణాలూ ధారపోసి నిర్మించారు. అయినప్పటికీ ఆ నగరంలో నివసించే యోగ్యత వారికి లేదు. వారంతా నగరానికి పక్కనున్న నెవానదికి ఆవల, మురికి వాడల్లో నివసించాల్సిందే.

శిథిలమైన పూరిళ్లలో, ఒంటినిట్రాడి గుడిసెల్లో లేదా ఒంటిరాతి చుట్టిళ్లల్లో, కొంత మంది అద్దెల కోసం నిర్మించిన మూడు నాలుగంతస్తులలోగల ఒంటి గదుల్లో, కిక్కిరిసిన గృహాల మధ్యనే పందులు వీరవిహారం చేసే మురికి నీటి గుంటల మధ్య, ఈగలూ, దోమలకు ఆలవాటైన కార్మిక పేటల్లో వీరంతా నివసించక తప్పదు.   మురికివాడల్లో  జీవనం,  మురికి వాడల్లో మరణం వీరి జన్మహక్కు. ఇదంతా కేవలం రష్యాకే పరిమితమైన విషయం కాదు,  ప్రపంచమంతటా,  ప్రతి దేశంలోనూ ఉన్న విషయమే.

సుమారు రెండు శతాబ్దాల కిందట వేలాది శ్రామిక ప్రజల శవాలపైన నిర్మితమైన సెయింట్‌ పీటర్స్‌ నగరాన్నే యుద్ధం మొదలయ్యాక పెట్రోగ్రాడ్‌ పేరుతో పిలుస్తున్నారు. నెవానది ఒడ్డున గల చిత్తడి నేలల్లో,  నిజానికి ఆ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో లేదు. కేవలం ఘనమైన ఉత్తరాది యుద్ధంలో గెలవడం ద్వారానే ఆ ప్రాంతాన్ని పీటర్‌ ది గ్రేట్‌, స్వీడన్‌ పాలనలోగల ఫిన్లాండ్  నుంచి స్వాధీనం చేసుకుని,  దూర ప్రాంతాలనుంచి గట్టి మట్టినీ,  రాళ్లనూ వేలాది ప్రజలతోటి బలవంతంగా మోయించి తెప్పించి, ఈ నగరాన్ని నిర్మించాడు. ఈ పనిలో వేలాది మంది శ్రామిక ప్రజలు చనిపోయినా లెక్కచెయ్యక,  పీటర్‌ ది గ్రేట్‌ ఆ చనిపోయిన వారి శవాలపైనే, వారి ఎముకలతోనే ఈ నగరాన్ని నిర్మించాడు. చివరికి ఇంత గొప్ప నగరాన్ని నిర్మించిన ఖ్యాతి పీటర్‌ చక్రవర్తికి దక్కగా, బలిదానాల పాలైన విస్మృత చరిత్ర ఆ శ్రమజీవులకు దక్కింది.

ఈ పెట్రోగ్రాడ్‌ నగరం దేశ పారిశ్రమిక కేంద్రం మాత్రమే గాక, గొప్ప గొప్ప విశాల సుందర హార్మ్యాలకు, వాస్తు శిల్పంతో మనోహరంగా కనిపించే ఉన్నత సౌధాలకూ ప్రసిద్ధి.  చక్కని విశాల పూలవనాలతో కూడిన మహాభవనాలకు నిలయం.  కల్లోల బాల్టిక్‌ సముద్రానికి ముఖద్వారంగా చెప్పదగిన ఈ నగరం ఫాషన్లకు ప్రతీతి కావడమే గాక,  దేశ సంస్కృతీ కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది.

ఈ నగరంలో నివసించే అర్హత కొంతమందికే ఉన్నది.  పద్నాలుగు అంతస్తులుగా విడగొట్టబడిన (పీటర్‌ ది గ్రేట్‌ చేత) సమాజంలో,  ఆఖరి అంతస్తులోని అత్యంత అధిక సంఖ్యగల జనం మినహాయించి,  పై పదమూడు అంతస్తుల ప్రజానీకానికి ఈ నగరంలో నివసించే యోగ్యత ఉంది.  ఇలాంటి యోగ్యత కలిగిన వారిలో ఉన్నత వంశీకులైన ప్రభు వంశాలవారూ,  అత్యంత విశాలమైన ఈ దేశంలోని మూలమూలపైనా అధికారం చెలాయించగలిగిన రాజాస్థానంలోని ప్రముఖులూ,  లంచాలు మేసి ప్రజానీకంపై జులుం చెలాయించే వివిధ హోదాల్లోని ఉద్యోగులూ,  కార్మిక జనం రక్తమాంసాలు పీలుస్తూ కోట్ల రూబుళ్ల సంపదలను పోగేసుకునే అధునిక పరిశ్రమాధిపతులూ,  పేద రైతాంగం చేత పరోక్షంగా బానిస చాకిరీ చేయించుకుంటూ, తెగబలిసిన భూకామందులూ, రాజాస్థానంలోని వారి దన్నుతో, దేశవిదేశాలతో చట్ట వ్యాపారాలు చేస్తూ వందలకోట్ల రూబుళ్ళు వెనకేసుకునే వణిక్  ప్రభువులూ ఈ నగరంలో నివసిస్తారు.

అయితే స్థితి ఏదైనా,  వారు భాగ్యవంతులైనా నిరుపేదలైనా సుందర పెట్రోగ్రాడ్‌ వాసులైనా, మురికివాడల కార్మిక జనావళి అయినా,  పెట్రోగ్రాడ్‌ ప్రాంతానికిగల భౌగోళిక స్థితి వల్ల, అంతా ఆ ప్రాంత ప్రకృతికి తలవంచక తప్పదు. ఆ నగరం బాల్టిక్‌ సముద్రపు ఫిన్లాండ్‌ అఖాతపు పరిసరాల్లో ఉండటం వల్ల,  ఆఖాతపు మంచుగాలుల, తుఫాన్ల తాకిడి అధికంగా ఉంటుంది.

అందునా అక్టోబరు నెల కావడంతో నగరం యావత్తూ చలిగాలుల తాకిడులతో వణికిపోతోంది. దీనికితోడు అనిశ్చితంగా,  ఒక క్రమం లేకుండా ఉండుండి ఒక్క సారిగా దబాటున పడే భీకర వర్షధారలు, మధ్య మధ్య ఆఖాతం నుండి వచ్చి అదాటుగా చరిచికొట్టే మంచుగాలులు, నగరం ఏదో నరకలోకంలో ఉన్న అనుభూతిని కలిగిస్తూంటుంది. ఒక్క అక్టోబరు నెలే అనుకోనేల, సెప్టెంబరు కూడా అంతే. ఫిన్లాండ్‌ ఆఖాతవు పరిధిలో ఉండుటవలన మంచుగాలుల దెబ్బకు మొహాలూ, పెదాలూ చిట్లి పోవడం ఖాయం.  మొహాలు ఎంత దాచుకున్నా, ఈ గాలులదెబ్బ తగలకపోవడం అంటూ ఉండదు. అసలు ఈ రెండు నెలలూ ఒక్క పెట్రోగ్రాడే అని కాదు. యావత్తు రష్యా పరిస్థితీ అంతే.  పెట్రోగ్రాడ్‌ అయితే మరీ.

ఇక వెలుతురు విషయమూ అంతే. పగలు తొమ్మిదీ, పదింటిగ్గానీ తెల్లారదు. మళ్ళీ మధ్యాహ్నం మూడింటికీ చీకట్లు కమ్ముకుంటాయి. అదువల్ల ఈ రెండునెల్లూ ఎప్పుడు గడిచిపోతాయా అని ప్రతి సంవత్సరమూ ఆ దేశ వాసులు, ముఖ్యంగా ఆ నగరవాసులు క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడుపుతారు ప్రతిసంత్సరమూ. ఈ కాలంలో నెవానదికి అటువైపుగా, నగరానికి దూరంగా విసిరేసినట్లుండే కార్మికపేటల స్థితి అయితే పరమదారుణంగా ఉంటుంది. రాజధానీ నగరమే ఈ కాలంలో రొచ్చుగుంటలా ఉంటుందంటే, ఇక ఈ కార్మిక పేటలస్థితి మురికి కూపాల్లా వుంటుందనాలి.

అలాంటి మురికి కూపంలో ఉన్న ఒక వీధి '’సెర్ద్ బోల్ స్కయా' వీధి. ఆ వీధి మలుపు తిరిగే దగ్గర ఒక నాలుగంతస్తుల ఇటుకలతో కట్టిన భవనం రంగులు వెలిసిపోయి, బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఆ రోజు 10వ తేదీ, సాయంకాలం 5 గంటల సమయం... కారుచీకట్లు కమ్ముకున్న సమయం... ఆ సమయంలో ఒక పొడుగాటి వ్యక్తి ఆ వీధిలోకి ప్రవేశించాడు. కొద్దిగా ముందుకు నడిచి, వీధిమలుపు దగ్గర కొద్దిసేపు ఆగాడు. అలా ఆగిన అతడు, అటూ ఇటూ పరిశీలనగా చూశాడు. వీధి దీపం ఎంతో దూరాన వుంది. ఆ సన్నటి వెలుగులో ఆ మలుపుకి ముందుగానీ, వెనకగానీ ఎవరైనా వస్తున్న జాడ కనబడుతుందేమోనని ఆగి పరిశీలనగా చూశాడు. ఎవరూ రావడంలేదు. అంతా నిశ్శబ్దంగాఉంది. దాంతో ఆ వ్యక్తి సంతృప్తితో కొద్ది దూరంలో గల రంగువెలిసిపోయిన ఆ భవనం వైపు గబగబా నడిచాడు. ఆ వేగంవల్ల బురదలో కాళ్లు జారిపడబోయాడు గానీ,  ఎలాగో నిలదొక్కుకున్నాడు. జాగ్రత్తాగా భవనాన్ని సమీపించాడు. అది తనకు పరిచయమైన భవనమే అన్నట్టుగా అతడా మసక వెలుతురులో మెట్లవైపు వెళ్లాడు. అటు

కటిక చీకటిగా వుంది. కన్నుపొడుచుకున్నా కానరాని గాఢాంధకారంలో కొద్దిసేపు ఆగి, చీకటికి అలవాటు పడ్డాడు. మెట్లను చేతితో తడముతూ ఎలాగో ఆనవాలు పట్టి,  కొద్ది మెట్లు ఎక్కాక,  గదుల తలుపుసందుల్నుంచీ వచ్చే సన్నటి వెలుగురేఖల ఆనవాళ్ల సాయంతో శబ్దం కాకుండా మెల్లగా ఎక్కుతూ నాలుగో అంతస్తు చేరుకున్నాడు.

నాలుగో అంతస్తులో విశాలంగా బారుగా ఉన్న నడవా ఉన్నది. ఆ నడవాకూడా చెక్కతో చేసిందే. అంచేత ఆ వ్యక్తి నడవాలోగల నాలుగు ద్వారాల్లో మొదటి మూడు ద్వారాలనూ, ఆ తలుపు సందుల్నుంచీ వస్తున్న దీపపుకాంతి రేఖల ఆధారంతో దాటుకుంటూ వెళ్లి నాలుగోద్వారం ముందు నిలబడ్డాడు.

కొద్ది సేపు నాలుగోద్వారం ముందు నిలబడి, అతడు గది లోంచి ఏమైనా చప్పుడు గానీ వస్తుందా అని నిరీక్షించాడు. అతడికి ఏ శబ్దమూ వినిపించలేదు. లోపల ఏం జరుగుతున్నదీ తెలుసునేందుకు తలుపు సందుల్లోంచి లోపలికి చూసేందుకు ప్రయత్నించాడు గానీ,  అతడి ప్రయత్నం వృధా అయింది. ఎందుకంటే, తలుపు సందులు లోపల దట్టమైన కంబళితో మూసేసి వున్నందున, ఏమీ చూడలేకపోయాడు. దాంతో అతడు తన ప్రయత్నాన్ని విరమించుకుని, తన చూపుడువేలు గోరుతో సన్నగా తలుపుపై మెల్లగా, ఒక పద్ధతిగా గీరాడు. ఆపై కొద్దిసేపు వున్నాడు. ఫలితం కనిపించలేదు. అతడు మళ్లీ అదేవిధంగా గీరాడు. మళ్లీ ఆగాడు. నిశ్శబ్దంగా నిలబడిపోయాడు.

రెండో సారి శబ్దం చేసిన తర్వాత, కొద్దిసేపు నిశ్శబ్దమే నడిచింది. ఆ తర్వాత తలుపు వద్ద ఏదో చప్పుడైంది. ఆ తర్వాత మళ్లీ నిశ్శబ్దం. దాంతో ఆ వ్యక్తి తలుపు మెల్లగా తోశాడు. అది కొద్దిగా తెరుచుకోగానే, సాంతం తలుపు తియ్యకుండా లోపలికి అడుగు పెట్టాడు. అతడు లోపలికి అడుగుపెట్టీ పెట్టడంతోటే, తలుపు దానంతటదే మూసుకుపోయింది.

పొడుగాటి వ్యక్తి లోపలికడుగుపెట్టి,  కొవ్వొత్తి వెలుగుతో నిండిన గదిలో ఎవరి కోసమో చూశాడు. అతడికి కావలసిన వ్యక్తి కనపడక, కంగారుపడ్డాడు.

''ఈయన ఏమైపోయాడు ?  మరి తలుపు తీసింది ఎవరు? లేక తలుపు మొదటే తీసివుందా? ఒక వేళ ఈయన నాకన్నాముందే బయటకు వెళ్లిపోయాడా? తను రాకుండా ఆయన బయటకు వెళ్లడే... మరేమైవుంటుందబ్బా....ఒక వేళ నాకన్నాముందే బయటకు వెళ్లి ఉంటే, తలుపుకు తాళంవేసి ఉండాలే...''  పరిపరి ఆలోచనలతో తలుపు వంక చూశాడు ఆ పొడుగాటి వ్యక్తి.

గుమ్మం పక్కన నిలబడి, తనను చూసి నవ్వుతున్న ఒక వ్యక్తి అక్కడ కనబడడంతో, ఆ పొడుగు వ్యక్తి ఆందోళన ఉపశమనం పొందింది. అమ్మయ్య అనుకుంటూ నిట్టూర్చాడు. ఆ వెంటనే వివేకం మేల్కొనడంతో, బారాటి నెరిసిన గడ్డం,  మత గురువు ఆకారంలో వున్న ఆ వ్యక్తికి పిడికిలి బిగించిన చెయ్యి పైకెత్తి అభివాదం చేశాడు పొడుగు వ్యక్తి.

మతగురువు కూడా చెయ్యి పైకెత్తి,  బిగించిన పిడికిలితో, తనకంటే వయసు చిన్నగా, ఇంకా యువకత్వం జాడలు వీడని ఆ పొడుగు వ్యక్తికి అభివాదం చేశాడు.

ఒక పక్క సమొవార్‌ పొయ్యిమీద నిప్పుకణికల మీద కాగుతోంది. అందులో టీ మరుగుతూ కమ్మని సువాసనలు వెదజల్లుతోంది. చైనా నుంచి దిగుమతైన ఆ టీ, రష్యన్‌లకు ప్రీతిపాత్రమై శతాబ్దాలవుతోంది. ఆ అతిశీతల వాతావరణంలో, ఆ టీ వారికి సంజీవనీ  అనడంలో అతిశయోక్తిలేదు.

చాలా దూరం నుంచి  నడిచివచ్చిన ఆ పొడుగు వ్యక్తి,  తన శ్రమ పోగొట్టుకునేందుకు అక్కడున్న చిన్న బల్లమీద కూలబడ్డాడు. అతని శ్రమకు కొంత ఉపశమనం కలిగిద్దామనుకున్న లావాటి ఆ ముసలి మతగురువు గుమ్మంవద్ద నుంచి పొయ్యి వద్దకు వెళ్లేందుకు కొన్ని అడుగులు వేశాడు.

మత గురువు ఉద్దేశాన్ని గ్రహించిన పొడుగు వ్యక్తి, గబగబాతనే పొయ్యివద్దకు వెళ్లి ఆ పెద్దాయన్ను నివారిస్తూ  తనే సమొవార్‌ని దింపి, పక్కనున్న  రెండు కప్పుల్ని అందుకుని వాటిలో టీ పోసి, ఒకటి ఆ మతగురువుకి ఇచ్చి, మరోటి తను అందుకున్నాడు.

ఇద్దరూ టీ తాగాక, రెండు నిమిషాలు విశ్రాంతిగా కూర్చున్నారు. ఇద్దరిమధ్యా ఏ సంభాషణా లేదు. మౌనంగా కూర్చున్నారు. వచ్చిన వ్యక్తి ఆ కొద్దిసేపట్లోనూ తన అలుపు తీర్చుకుని, ''ఇక వెళ్దామా?'' అని మతగురువును ప్రశ్నించాడు.

మతగురువు తలూపి, తనూ లేచినిలబడ్డాడు.

ఇక ఆలస్యం చెయ్యకుండా పొడుగువ్యక్తి తలుపుతీసుకుని బయటకెళ్లి, తిరిగి తలుపు దగ్గరకు వేసి, మెట్లవైపుగా నడిచాడు.

పొడుగువ్యక్తి మొట్లుదిగి, భవనం దాటి,  మూలమలుపుదాకా వెళ్లి ఉంటాడన్న అంచనాకు వచ్చాక పొట్టిగా, లావుగా ఉన్న ఆ మతగురువు గుమ్మం బయటకు నడిచి, తలుపుకు తాళం వేశాడు. ఆ పై మెల్లగా, చప్పుడుగాకుండా మెట్లుదిగి, బయటకు వచ్చి, అటూ ఇటూ చూశాడు. దూరంగా మలుపుకు అల్లంతదూరంలో పొడుగు వ్యక్తి నడుస్తూండడాన్ని గమనించాడు. ఎవరూ తనను గమినించడం లేదని నిర్ధారించుకుని తనూ ముందుకు నడవడం మొదలెట్టాడు.

దారంతా జారుడు జారుడుగా వుంది. బురద, మంచు సంగతి చెప్పనే అక్కరలేదు. రెండూ కలిసి కాళ్లకు ఇంతెత్తున పడుతోంది. బూట్లు పాదాల ఎత్తుకు పైగా బురదలోనే మునిగిపోయాయి. ఆ బురద చింది మీదపడకుండా వీలైనంతవరకూ జాగ్రత్తపడుతూ, వేగంగా నడవసాగాడు వృద్ధమతగురువు.

పైనుంచి వర్షం ఏకధాటిగా కాక, మధ్య మధ్య కొద్దిపాటి విరామమిస్తూ, కొద్దిసేపు విజృంభిస్తూ, అలలు అలలుగా పడసాగింది. పైపెచ్చు ఈదురుగాలి వణికిస్తోంది. గొడుగులు ఏమాత్రం పనిచెయ్యవు. తలను కప్పుకునేవిధంగా ఉండే కాలర్‌ ముసుగున్న ఓవర్‌కోట్లు ధరించాల్సిందే. అలా కాలర్‌ ముసుగేసుకుంటే, దారి సరిగా కనిపించదు. ముందు కనిపించినా పక్కవేపు ఎవరున్నదీ, ఏమున్నదీ తెలీదు.  అయినా అలాగే వెళ్లక తప్పదు. అలాంటి స్థితిలో అడుగులో అడుగేసుకుంటూ నడవాలి. కానీ అలా నడిస్తే ఎప్పటికి గమ్యం వచ్చేను?  కనుక వీలయినంత వడిగా, జారిపడకుండా నడవాలి.

 

చీమ్మచీకటి... గాఢాంధకారంలో కూడా వీధి దీపాల వెలుతురు తగినంతగా కనపడకుండా, పొదుపు చర్యల్లో భాగంగా దూరదూరంగా ఏర్పాటు చేశారు. మురికి వాడలు కాబట్టీ, అక్కడి జనం ఎంతగా మొత్తుకున్నా, పాలనాధికారులు పెడచెవి బెడతారు. అదే నగరంలో అయితే, ఎవరు ఫిర్యాదుచేసినా, క్షణాల్లో పరిష్కరిస్తారు...లేకుంటే వారి ఉద్యోగాలు ఖాళీ...

కనీసం ఇళ్లనుండి వచ్చేదీపపు కాంతుల వెలుగురేఖలైనా దారి చూసిస్తాయనుకుంటే ఆ ఆశ  అడియాసే అవుతుంది. ఎందుకంటే యుద్ధం ( మొదటి ప్రపంచ యుద్ధం 1914 - 18) కారణంగా, కిరసనాయిలు దొరకడంలేదు. కొవ్వొత్తుల ధర అందుబాటులో లేదు. అందువల్ల పేదల ఇళ్లల్లో అవసరమైన ఏ కొద్దిసేపో వెలిగించుకుని, ఆ తర్వాత ఆర్పేస్తున్నారు. ధనికుల ఇళ్లల్లోనే దీపాల ధగధగలు. అయితే మురికి వాడల్లో ధనవంతులెందుకు నివసిస్తారు?  వారు నగరంలోనే వుంటారు. కానీ మురికి వాడల్లో ఆ జనాలకు అవసరమైన సరుకులు అమ్మేందుకు దుకాణాలు నిర్వహించుకునే కింది స్థాయి వర్తకుల ఇళ్లల్లో మాత్రం కొవ్వొత్తులు వెలిగిస్తారు. అయితే ఆ దుకాణాలతో కలిసుండే ఇళ్లు ఆ మురికి వాడల్లో అక్కడొకటీ, ఇక్కడొకటీ మాత్రమే ఉంది. అందువల్ల వారుండే ఇళ్లల్లోంచి మాత్రమే దూరదూరంగా సన్నటి వెలుగు రేఖలు బయటకు వచ్చే ఆస్కారముంది. అయితే ఈదురుగాలులవల్ల ఇళ్ల తలుపులూ, కిటికీలూ బిడాయిస్తారు గనుక, ఆ వెలుగురేఖలూ అంతంత మాత్రమే, అయితే దుకాణాలు తెరిచి ఉంచుకోక తప్పదు కాబట్టీ, వాటి నుంచీ మాత్రం కొద్ది పాటి వెలుతురు రహదారి పైన పడుతోంది.

పొడుగు వ్యక్తీ, ముసలి మతగురువూ ఒకరికొకరు సంబంధం లేనట్లు అలా దూరదూరంగా నడుస్తూనే ఉన్నారు. పొడుగు వ్యక్తి గబగబా పెద్దపెద్ద అంగలు వేస్తూ ఏ దుకాణం దగ్గరో,  సందుమలుపులోనో ఆగుతున్నాడు. ముసలి మతగురువు వీలైనంత వేగంగా నడవడానికి ప్రయత్నించినా,  ముందు వెడుతున్న వ్యక్తి అంత వేగంగా వెళ్లలేక అనుసరిస్తున్నాడు. అతడు దగ్గరకు వచ్చినట్లు కనిపించాక, పొడుగు వ్యక్తి తిరిగి ముందుకు వెడుతున్నాడు.

వర్షం జోరు కొద్దిగా తగ్గింది గానీ, మంచు పడటం మొదలైంది. వీధుల్లో దుకాణాలు చాలా వరకు మూసేసి ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దుకాణాల ముందు జనం 'క్యూ' లైన్లలోనిలబడి బారులు తీరి ఉన్నారు. ఆ నిలబడ్డవారిలో  ఎక్కువ మంది స్త్రీలే ఉండటం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్త్రీలకే సహనం ఎక్కువని రుజువు చేయడానికా అన్నట్లు వారలా గంటల తరబడి నిరీక్షించడం దినచర్యగా మారింది. వయసు మీరడం చేత ఇళ్ల వద్దనున్న పురుషులు బయట పనులకెళ్లి అలిసి ఇళ్లకు చేరుకుంటే,  దుకాణాల వద్ద గొంగళ్లు కప్పుకుని స్త్రీలు తమ చంటి పిల్లల్నెత్తుకుని క్యూ లైన్లలో నిలబడి వుండటం వారి రోజు వారి దినచర్యలో భాగంగా మారిపోయి చాలా కాలమైంది.

మాసిన దుకాణాల ముందు క్యూ లైన్లేమిటా అని పాఠకులకు అనుమానం రావచ్చును.

యుద్ధం మొదలైనప్పటినుంచీ ఇలా క్యూలైన్లలో జనం దుకాణాల ముందు బారులు తీరి వేచి ఉండటం సాధారణ విషయమైపోయింది. పాలకూ, రొట్టెకూ, పంచదారకూ, పొగాకుకూ ప్రతివారూ వణికిపోతూ వర్షంలో, చలిలో గంటలకొద్దీ క్యూ లైన్లలో నిరీక్షిస్తూ నిలబడాల్సి వస్తోంది. ఎక్కడ చూసినా క్యూలే. వాటిలో ఎక్కువగా ఉండేది స్త్రీలే, వారిచేతుల్లో పసిబిడ్డలు...ఇలాంటి దృశ్యాలే ప్రతిచోటా.

రష్యా ఆహార కొరతతో అల్లాడిపోతోంది. యుద్ధం వారి జీవితాల్లో కనీ వినీ యెరుగని దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చింది. పల్లెల నుంచీ,  ఫ్యాక్టరీలనుంచీ ఒక వయసు వరకూ మగవారిని బలవంతంగా యుద్ధ రంగానికి తరలించారు. దాంతో పంటలు పండించే వారికి కొరత యేర్పండింది. ఇక ఫ్యాక్టరీలలోనూ అంతే. కార్మికుల్నీ యుద్ధానికి తరలించడంతో, నైపుణ్యంగల కార్మికులకు కొరత యేర్పడి,  ముడిపదార్థాలు సరఫర కాక,  ఉత్పత్తులు పడిపోయాయి. అయితే తయారైన ఆ కొద్ది పాటి ఉత్పత్తుల్నీ కొనే నాధుడులేడు.  ఎందుకంటే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి.

అంతటా నిరుద్యోగం, దీనికి తోడు బగ్గుమనే ధరలు, అయినా కొందామంటే, ఏ వస్తువులూ చాలినన్నిలేవు. బ్లాక్‌ మార్కెట్‌కూ, విదేశాలకూ తరలిపోతున్నాయి ఉన్న కొద్దిపాటికూడా.  చాలాకాలంగా బ్రెడ్డుకి రేషనింగ్‌ ప్రవేశపెట్టారు. అయినా సరిపడా లేదు. కొంతకాలం మనిషికి పౌనుచొప్పున కేటాయించారు. తర్వాత ఆ రేషను అరపౌనుకి తగ్గిపోయింది. అరపౌను కాస్తా మరికొద్ది కాలానికి పావుపౌనుకి పడిపోయింది. అది కూడా ముందొచ్చిన వారికే దొరుకుతోంది. దుకాణాలు తెరిచిన కొద్ది సేపట్లోనే సరుకు నిండుకుంటోంది. దాంతో జనం రాత్రిపూటే క్యూల్లోనిలబడి, దుకాణాలు తెరిచేదాకా నిరీక్షిస్తున్నారు.

ఇక పాల విషయానికి వస్తే, అవి నగరంలోని సగం మంది పిల్లలకే అందుతున్నాయి. హోటళ్లల్లో, ఇళ్లల్లో నెలల తరబడి పాలు కనబడటంలేదు. యుద్ధం పేరుతో మేలైన పదార్థాలన్నీ అదృశ్యమైపోతున్నాయి.  ప్రజల్లో కట్టలు తెంచుకుని ప్రవహించేలా అసంతృప్తి... ఓర్పుకి పేరొందిన రష్యన్లలో ఆ ఓర్పు నశించిపోతోంది...అది బద్దలవడానికి సిద్ధంగా      ఉంది...

ఎక్కడ చూసినా దొంగతనాలూ, దోపిడీలూ...

ఇదంతా నాణేనికి ఒక పక్క మాత్రమే....

 

మరోపక్క....

ధనికుల లోగిళ్లు అర్ధరాత్రిళ్లు దాకా దీపకాంతులతో ధగధగ లాడుతూ, విందులూ విలాసాలతో కులాసా కాలక్షేపాలలో మునిగి తేలుతున్నాయి. ప్రతిరోజూ నాటకశాలల్లో రాత్రిపూట నాటక ప్రదర్శనలు నిరాటంకంగా యధావిధిగా సాగిపోతూనే ఉన్నాయి. వారాంతపు సినిమా ప్రదర్శనలు ప్రేక్షకులతో నిండిన హాళ్లతో రూబుళ్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి.

కళలు, సాహిత్యం, తత్వశాస్త్రం - వీటికి సంబంధించిన ఉపన్యానాలు వినేందుకు మహిళా మేధావులు గుంపులు గుపులుగా సాయంకాలపు విందు  సమావేశాలకు హాజరవుతూనే ఉన్నారు. కవులు కూడా తక్కువ తినలేదు. వారు రంజుగా కవితల్ని రాస్తూ, సాయంకాలపు విందు  సమావేశాల్లో వినిపిస్తూ,  శ్రోతల చప్పట్లను ఆస్వాదిస్తూనే ఉన్నారు. కాని వీరిలో ఎవరు పొరపాటున కూడా ఫిబ్రవరి విప్లవం గురించిగానీ, జనాలు గుసగుసలాడుకునే రానున్న మరో విప్లవం గురించి గానీ పొరపాటున కూడా తమ కలాల్ని కదిలించడం లేదు. కనీసం 1825 డిసెంబ్రిష్టు సైనిక విప్లవం గురించి గానీ, నరోద్నిక్‌ విప్లవ వీరుల వీరకృత్యాల గురించిగానీ ఒక్క కవితను కూడా రాయడంలేదు. పుగచోవ్‌ తిరుగుబాటు గాథల్నైతే తలిచే సాహసానికి కూడా పూనుకోవడం లేదు.

యువ అధికారులైతే తమ కొత్త హోదాల్ని ప్రదర్నించుకుంటూ ఇస్త్రీ ముడతలు నలగని యూనిఫాంలను ధరించి, తళతళ పాలిష్‌తో నిగారించే బూట్లను చప్పుళ్లు చేసుకుంటూ తిరుగుతూ హోటళ్లలోకి చేరి పార్టీలమీద పార్టీలు జరుపుకుంటున్నారు. ఆ పార్టీలలో తమ అందమైన భార్యల్ని కూడా ప్రదర్శిస్తూ, వారి అందమంతా తమ హక్కు భుక్తమే సుమా అన్నట్టు ఠీవిని ఒలకబోస్తున్నారు.

ఇక అధికార వర్గానికి చెందిన మహిళలైతే ఒక్కొక్క ఇంట గుంపులుగా చేరి, టీలు అందించుకుంటున్నారు. వీరంతా చక్కగా అలంకరించుకుని, వెండి, బంగారు నగిషీలు చెక్కిన పంచదార బాక్సులు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారంతా అధికార పీఠం నుండి దింపివేయబడ్డ మాజీ జార్‌ అయిన నీకొలస్‌-2 తిరిగి అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. లేకుంటే జర్మన్లు వచ్చి, ఈ కార్మిక అలజడుల్ని అంతం చేస్తే మంచిదని వారు తమ ప్రార్థనల్లో విన్న విస్తున్నారు.

(1917ఫిబ్రవరిలో జార్‌ చక్రవర్తిని కూలదోసింది ప్రజానీకం, కార్మికవర్గం, పోలీసులు, సైన్యం కూడా, ప్రజాందోళనలు ఉవెత్తున ఎగిసి  పడినప్పుడు,  వీరందరినీ నడిపించిన నాయకులలో మెజారిటీగా ఉన్న మెన్షివిక్కులూ, సోషలిష్టు రివల్యూషనరీలూ తాము అధికారాన్ని నిర్వహించలేమోననే అధైర్యంతో, బూర్జువాలకూ భూస్వాములకూ అధికారాన్నిఅప్పగించారు. వీరిచేత అధికారం పొందినవారు నిస్సిగ్గుగా తమ స్వార్ధం కోసం అధికారాన్ని  దుర్వినియోగం చేస్తూ, మరో పక్కన సామ్రాజ్య వాదులకు  సాయం చేస్తూ, శాంతినందిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, యుద్ధాన్ని కొనసాగించారు. వారి వాగ్దానభంగాన్ని సహించక ప్రజలు తిరిగి ఆందోళన మార్గాన్ని  తొక్కుతుంటే ,  తిరిగి మెన్షివిక్కులూ,  సోషలిష్టు రివల్యూషనరీలూ  జనాలను మరికొంత  కాలం ఓపికపట్టమని బుజ్జగిస్తున్నారు. దీంతో కార్మిక వర్గంలోపనిచేసే మరొక రాజకీయపార్టీ అయిన బోల్షివిక్‌ పార్టీ, లెనిన్‌ నాయకత్వంలో సాయుధ విప్లవ వానికి సన్నద్ధమవుతోంది – రచయిత.)

పనివాళ్లు దొరకడం కష్టంగా మారింది. ఒకరోజు ఒక ధనికుని కూతుర్ని ఒక బస్‌ కండక్టరుగా పని చేస్తున్న యువతి ''కామ్రేడ్‌'' అని సంబోధించినందుకు, ఆ ధనిక యువతి కోపంతో మండిపడిన సంగతి ప్రసిద్ధ అమెరికన్‌ విలేఖరి జాన్‌ రీడ్‌ తన గ్రంథం ''ప్రంపంచాన్ని కుదిపేసిన ఆ పదిరోజులు'' అనే దాంట్లో ఉటంకించాడు. ఈ ఉదంతం అటు ఉద్యోగాలు చేసే శ్రామిక మహిళల, ఇటు ధనిక వర్గపు మహిళల మనస్తత్వాల వైరుధ్యాలను గమనించవచ్చు.

సేవకులు స్వతంత్రులవుతున్నారు. ఒకప్పుడు వారితో పశువులతో లాగా ప్రవర్తించేవారు. వారూ సాటి మనుషులేననీ, వారికీ మానాభిమానాలుంటాయనీ శ్రామికేతర జనం భావించేవారు కాదు. ఇప్పుడు గుర్రపు బగ్గీలు తోలేవారికి కూడా యూనియన్లు ఏర్పడ్డాయి. హోటళ్లలో సర్వర్లు, వెయిటర్లూ కూడా సంఘటితమై, మామూళ్లను నిరాకరించడమే గాక , ఆ విషయాన్ని బోర్డులపై కూడా రాసి తెలుపుతున్నారు.

యుద్ధరంగంలో పై అధికారులతో కింది స్థాయి సైనికులు ఆత్మగౌరవంకోసం ఘర్షణలు పడటానికి సైతం వెనుకాడటం లేదు. లోగడ అలా చేస్తే, అధికారులు వెనువెంటనే చెంపచెళ్లుమనిపించడమే గాక, తీవ్రమైన కార్పోరల్‌ పనిష్మెంట్లు ఇచ్చేవారు. ఆ పనిష్మెంట్లను వారు పాటించక పోయారో, కోర్టుమార్షలే గతయ్యేది. అంటే దానిర్థం షూట్‌ చేసి చంపటమన్నమాట!

నేడు రష్యాలో  విలక్షణమైన సంస్థలెన్నో బయలుదేరుతున్నాయి. దేశం అంతటా చదవడం నేర్చుకుంటున్నది. వందలాది పత్రికలు వెలిశాయి. ఒక్కో పత్రిక లక్షలకొలది ప్రతులను ముద్రిస్తున్నాయి. కింది స్థాయి వర్గాలు కూడా రాజకీయాలు మాట్లాతున్నాయి. సాహిత్యం, ముఖ్యంగా తొల్ స్తోయ్‌, తుర్గేనెవ్‌, లెర్మొంతొవ్‌, గోర్కీ, కుప్రీన్‌, చేహోవ్‌,  శ్చెద్రిన్‌ లాంటి సాహిత్య దిగ్గజాల ఉత్తమ సాహిత్యం ప్రజలు ఆసక్తిగా చదువుతున్నారు. రాజకీయ, తత్వశాస్త్ర,   సాహిత్య గ్రంథాలు ఆబగా చదివేస్తున్నారు. దేశమంతా సభలూ సమావేశాలు, చర్చలతో హోరెత్తి పోతోంది. పెట్రోగ్రాడ్‌లోనయితే ప్రతిరోజూ నాలుగయిదు పెద్దసభలు జనంతో పోటెత్తి పోతున్నాయి. ఎక్కడ చూసినా రంగుమాసిన ఎర్రజెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఈ మధ్య నుంచీ మరో విప్లవం గురించి, ఒక కొత్తతరహా దాన్ని గురించిన పుకార్లు, గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరు తెలిసిన వాళ్లు వీధుల్లో తారసపడినా, పక్కకెళ్లి జరగనున్న దాన్ని గురించి ఎదుటివారికి ఏమైనా వివరాలు తెలుసునేమోనని మహా ఆసక్తికరంగా ఆరాలు లాగుతున్నారు.

రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న దృశ్యాల్ని కనురెప్పలకిందుగా గమనిస్తూ వెడుతున్న ముసలి మతగురువు ''వాతావరణం బాగానే వుంది. జరగనున్న విప్లవానికి అనుకూలంగానే వుంది...'' అనుకున్నాడు మనసులో.  ''ఈ తార తమ్యాలు  నశించాలి.  ప్రకృతిపరంగా మనుషులంతా సమానమే. కానీ అంతస్తుల తారతమ్యాలు చెప్పరానన్ని బాధలకు కారణమవుతున్నాయి. ఈ తారతమ్యాలు నశించాలి. మనిషి మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉండకూడదు. జీవితంపై ప్రతిమనిషికీ భరోసా ఉండాలి! సమాజంలోని ప్రతిమనిషీ ఆనందంగా, ప్రశాంతంగా, ఆత్మగౌరవంతో జీవించే వాతావరణం ఉండాలి! ఎలాంటి దోపిడీనీ అనుమతించకూడదు..ఇదంతా..ఇదంతా రష్యా ప్రజలకు త్వరలోనే అందబాటులోకి వస్తుంది. తప్పక వచ్చితీరుతుంది!'' దృఢంగా పిడికిలి బిగిస్తూ గొణుక్కున్నాడతడు, తనకు మాత్రమే వినిపించేట్టు, అతి తక్కువ ధ్వనితో.

పొడుగాటి వ్యక్తీ, ముసలి మతగురువూ దూరదూరంగా,  ఐనా కనుచూపుమేర దాటిపోకుండా,  ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ, రెండు గంటలకుపైనే నడిచి సెర్ద్‌ బోల్‌స్కయా పేటదాటి, అత్యంత విశాలమైన పెద్దపెద్ద ఓడలు సైతం ప్రయాణించగల నెవానది వద్దకు వచ్చారు. ఎదురుగా బోల్షియోఖ్తిన్‌స్కీ బ్రిడ్జి...

అప్పుడే ఒక సరుకుల ఓడ ప్రయాణించింది.  దానికి ముందు వెనుక రక్షణ ఓడలు..యుద్ధం మూలంగా కల్లోల  బాల్టిక్‌ సముద్రంలో ఓడల ప్రయాణం అత్యంత ప్రమాదభరితంగా ఉంది. ఆ నౌకలు ప్రయాణించేందుకు వీలుగా వంతెనను పైకి మడిచారు, యంత్రాల సహాయంతో. అవి వెళ్లగానే మరల వంతెనను కిందికి దించారు మనుషులూ, బళ్లూ తిరిగేందుకు వీలుగా.  నగరానికి లక్షలాది జనం, పెద్దపెద్దఫ్యాక్టరీలూ ఉండే పారిశ్రామిక వాడలూ, కార్మికపేటల్ని కలుపుతూ, నది పొడవునా ఇలాంటి వంతెనలు మరికొన్ని ఉన్నాయి. ఆ వంతెనల్ని చూసే సరికి ముసలి మతగురువు భృకుటి ముడిపడింది.

కార్మిక పేటల్లో గల లక్షలాది జనం నగరంలోకి రావాలంటే, ఈ వంతెనలు తప్పనిసరిగా దాటి రావలసిందే. ఈ వంతెనలు పైకి మడిచేసి ఉంచి, కిందికి దించకుండా ఉంటే ఒక్కడుకూడా నగరంలోకి రాలేడు. అంచేత ఈ రాకపోకలకు, ఈ వంతెలనలు చాలా కీలకమన్నమాట....రాబోయే విప్లవానికి కూడా!

''వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి... వ్యూహాత్మకంగా ఇవి చాలా కీలకమైనవి... ఈ విషయం చాలా ముఖ్యం...'' అనుకున్నాడు  ముసలి మతగురువు.

వంతెనదాటి కొంచెం ముందుకెళ్లాక నెవానది ఒంపు తిరుగుతుంది. ఆ ఒంపులోనే వుంది ధగధగదీపాల కాంతిలో మెరిసిపోతూ చీకట్లో కనబడే ఒక మహావిశాల భవనసముదాయంగల స్మోల్నీకాన్వెంటు. దీన్నే స్మోల్నీ ఇన్‌స్టిట్యూట్‌ అంటారు. స్మోల్నీ ఇన్‌ స్టిట్యూట్‌ మధ్యలో ఒక ఐదు గోపురాల కాథడ్రల్‌, దాంతోపాటుగా ఎత్తైన గంట స్తంభం ఉంది. నాలుగు వైపులా ప్రహారీలాగా రెండంతస్తుల భవన సముదాయాలున్నాయి. ముందు వైపున ఒక మహా విశాలమైన భవనం, రెండంతస్తులది దాదాపు రెండువందల గజాల పొడువుగల భవనం ఉంది. చుట్టూఉన్న భవనాలు గోపురాలతో అలరారుతున్నాయి. మధ్యలో విశాలమైన మైదానం ఉంది. అన్ని భవనాలూ గొప్పవాస్తు శిల్పంలో  అలరారుతున్నాయి. కాథడ్రల్‌ అయితే దాని వాస్తునిర్మాణ ప్రతిభ అనన్య సామాన్యం. తెలుపు నీలం రంగులతో అత్యంత ఎత్తుగా రాజఠీవి ఒలకపోస్తూ వుంది. ఒక్కసారిగా ఆ ముసలి మతగురువు మదిలో ఆ సౌధ చరిత్ర మెదిలింది.

పీటర్‌ దిగ్రేట్‌ కుమార్తె,  తనూ జారినాగా పాలన సాగించిన ఎలిజబెత్‌, తన అంత్యాకాలంలో నన్  (క్రైస్తవా సన్యాసిని)గా వుండేందుకు నిశ్చయించి, ఈ భవన సముధాయాన్ని, అలాగే క్రైస్తవ సన్యాసులుండేందుకు ఒక 'నన్నరీ'నీ నిర్మింపజేసింది. భవనాలన్నీ అత్యంత విశాలమైన, శిల్పసముదాయంతో అలంకరించబడిన గదులతో ఉన్నాయి. ఎలిజబెత్‌ ప్రభ్ర్విణి (1709 - 1762) తన పాలనా కాలంలో ప్రభువంశీకుల బాలికలకోసం ఈ భవన సముదాయాన్ని                      ఉపయోగించింది. సామ్రాజ్యం మొత్తంలోనూ బాలికలకోసం ఒక పాఠశాలను ఏర్పరచడం చరిత్రలో అదే మొదటిసారి.

పీటర్‌ దిగ్రేట్‌ రెండో కుమార్తె ఎలిజిబెత్‌ తండ్రికి ఇష్టురాలైన కుమార్తె. ఎంతో అందగత్తే.  బహుభాషలు నేర్చిన ఈమెకు వివాహం కలిసిరాలేదు. వివాహనికి నిశ్చయించబడిన తర్వాత,  కొద్దికాలం ఎడంలోనే తండ్రి, తల్లీ, ఆ తర్వాత వరుడూ కూడా చనిపోవడంతో,  ఏ రాకుమారుడూ ఆమెను వివాహమాడేందుకు ముందుకు రాలేదు. దాంతో ఈమె కన్యగానే మిగిలిపోయి, ఆపై ఆమె అనధికారికంగా పురుష సంబంధాల్ని కొనసాగించాల్సి వచ్చింది. ఆమె ఈ విధంగా కొంత వేసటకు గురైనా, 20 సంవత్సరాల  పాటు రాజ్యాన్ని పాలించింది. తన అంత్యకాలంలో సన్యాసినిగా బతకాలని ఎలిజిబెత్‌ అనుకుని, ఈ కాన్వెంటుని నిర్మించెందుకు ఇటాలియన్‌ వాస్తు శిల్పికళలో నిపుణుడైనవాడూ, ఆస్థాన వాస్తుశిల్పీ అయిన 'బర్తొలోమియో రాస్త్రెల్లీ'ని నియమించింది.

'ఫ్రాన్సిస్కో  బర్తొలోమియో రాస్త్రెల్లీ జూనియర్‌ తండ్రితో పాటు బాలునిగా రష్యాకు వచ్చాడు. తండ్రి ప్రసిద్ద 'బరోకి ' శైలి ఇటాలియన్‌ వాస్తుశిల్పి. అతణ్ణి పీటర్‌ ది గ్రేట్‌ ఆహ్వానించి పలు మహాసౌధాలను నిర్మింపచేశాడు. తండ్రితో పాటు వచ్చిన 16 సంవత్సరాల జూనియర్‌ రాస్త్రెల్లీ మొదట, భవనాల అంతర్గత అలంకరణల నిర్మాణంలో పనిచేసి, అనతికాలంలోనే స్వయంగా వాస్తుశిల్పిగా మారి,  ఆ రంగంలో గొప్ప మేధావిగా ప్రసిద్ధికెక్కాడు. 'ఆన్నా' ప్రభ్వణి జారినీగా పాలించిన సమయంలో ఈ ప్రాన్సిస్కో బర్తొలోమియో రాస్త్రెల్లీ  చేత పలు నిర్మాణాలు గావించిందామె. ఆమె ఈ శిల్పి నైపుణ్యాన్ని ఎంతగానో అభిమానించింది. ఆ తర్వాత ఎలిజిబెత్‌ తన పాలనా కాలంలో ఇతణ్ణి ఆస్థానశిల్పిగా నియమించి పలునిర్మాణాలు చేయించింది. అందులో ఈ స్మోల్నీ కాన్వెంటు ఒకటి. కాన్వెంట్‌ నిర్మాణాన్ని రాస్త్రెల్లీ  1748లో ప్రారంభిచాడు.  మిగిలిన భవనల సముదాయం పూర్తైనా కాథడ్రల్‌ నిర్మాణం పూర్తి కాకుండానే 1761డిసెంబరులో ఎలిజబెత్‌ చనిపోయింది. తాను సన్యాసిని కావాలని నన్నరీని నిర్మింపజేసుకున్నా,  ఎలిజిబెత్‌ తన అంత్యకాలంలో తన నిర్ణయాన్ని మార్చుకుని సన్యాసిని కాలేదు.

ఎలిజబెత్‌ తర్వాత అధికారాన్ని చేపట్టిన కాథరిన్‌-2, రాస్త్రెల్లీని పనిని కొనసాగించనివ్వలేదు. ఆమెకు 'బరోకి ' శైలిగా పిలవబడే ఇటలియన్‌ ప్రాచీన నిర్మాణశైలి ఆమెకు నచ్చలేదు.  దాంతో కాథడ్రల్‌ అసంపూర్తిగానే మిగిలిపోవలసి వచ్చింది.  కాథరిన్‌-2, రాస్త్రెల్లీని పదవి నుంచి కూడా తప్పించి, అవమానించింది. దాంతో ఎంతో బాధతో రాస్త్రెల్లీ రష్యా నుంచి వెళ్లిపోయాడు.  అప్పటికి కాథడ్రల్‌ బయటి నిర్మాణం చాలా వరకు పూర్తయిందిగానీ, లోపలి అలంకరణలు మొదలేకాదు. కాథరిన్‌-2 తర్వాత నీకొలస్‌-2 పాలనాకాలంలోనే,  వాసిలీస్తాసొవ్‌ అధ్వర్యంలో 1835నాటికి గానీ ఆ నిర్మాణం పూర్తికాలేదు. ఏమైనా ఈ భవన సముదాయాన్ని ప్రభువంశాల ఆడపిల్లలకు ఉన్నత చదువులకోసం       ఉపయోగించసాగారు. అయితే 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత, స్మోల్నీనుంచి విద్యార్థినులనందరినీ పంపించి వేశారు.          ఆ వెంటనే ఈ సంస్థని పెట్రోగ్రాడ్‌ కార్మిక, సైనిక ప్రతినిధుల సోవియట్‌ ఆక్రమించుకుని, అందులో తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుకుంది. నగర సైనిక విప్లవ కమిటీ కూడా ఆ పనే చేసింది. ఆ సైనిక విప్లవకమిటీ కార్మికుల్నీ, రెడ్‌గార్డుల్నీ నిర్మాణంచేస్తూ, నగరంలోని అన్ని ఫాక్టరీలతోనూ, కర్మాగారాలతోనూ సంబంధం పెట్టుకుంది.

ఇవేకాదు, ఇంకా చాలా  సంస్థలు విశాలమైన ఈ భవనంలోని పెద్దపెద్దగదుల్ని ఆక్రమించుకుని, వాటిలో తమ కార్యాలయాల్ని నెలకొల్పుకున్నాయి. అలాంటి వాటిలో కొన్ని సోషలిష్టు సైనిక్‌ యూనియన్‌, అఖిల రష్యా ట్రేడ్‌ యూనియన్ల కమిటీ, ఫాక్టరీ షాప్‌ కమిటీ, సే - యీ - ఖా ( కార్మికుల సైనికుల అఖిల రష్యా కార్యనిర్వాహక వర్గం) వగైరాలు. ఇంకా వివిధ రాజకీయపార్టీల కేంద్ర కమిటీ ఆఫీసులూ, వాటి చర్చల గదులూ, సమావేశ మందిరాలూ ఉన్నాయి.

ఏమైనా స్మోల్నీ ఇన్‌స్టిట్యూట్‌ ముసలి మతగురువుకు పరిచయమైనదే. అయితే ఈ మధ్యకాలంలో అతడు ఫిన్లాండు వెళ్లి, కొన్నాళ్లుండి రావడం వల్ల జరిగిన చేర్పులూ, మార్పులూ పరిశీలిస్తూ ముందుడుగు వేశాడు. అత్యంత సువిశాలమై ఆ భవన సముదాయపు బయట గేట్ల వద్ద అటువేపూ ఇటువేపూ పెద్దపెద్ద నెగళ్లు మండుతున్నాయి. డజన్లకొద్దీ సైనికులూ, రెడ్‌గార్డులూ వాటివద్ద చలికాగుతున్నారు. గేట్ల వద్దేకాక, లోపలగల వివిధ గదుల ద్వారాల వద్దకూడా గట్టికాపలా వుంది. పెద్దపెద్ద గన్నులూ, రైఫిళ్లూ పట్టుకుని కాపాలదారులు వచ్చేవారిని పాసులు  చూపించమని అడుగుతున్నారు. వారు చూపించిన పాస్‌ల్ని కాపలాదారులు శల్యపరీక్షచేస్తూ వాటిలో కొన్నింటిని సరైనవి కావని తిరస్కరిస్తూ, వాటి సంగతి తేల్చమని పై అధికారును పిలుస్తున్నారు.

ఇక ప్రతి అంతస్తులోనూ భోజనాల గదులూ, టీలు అందించే స్థలాలవద్ద జనాలు కిక్కిరిసి ఉన్నారు. వందల కొద్దీ కార్మికులూ,  సైనికులూ నిద్రలు లేక, అలిసిపోయి, నేలపైనే పడి నిద్రపోతున్నారు. చర్చల గదుల్లో అయితే, ఎడతెరిపిలేకుండా చర్చలపై చర్చలు రేయింబవళ్లూ జరుగుతూనే ఉన్నాయి.

వంతెనదాటే దాకా ఎడంఎడంగా నడిచిన పొడుగాటి వ్యక్తీ,  ముసలి మతగురువు వంతెన దాటాక, భవనం సమీపంలోకి రాగానే,  తమ మధ్య దూరాన్ని తగ్గించుకుని,  పక్కపక్కనే నడవసాగారు. అప్పటి దాక వంగిన నడుంతో నడుస్తున్న వృద్ధ మతగురువు, ఇప్పుడు నిటారుగా ఉన్న నడుంతో నడవసాగాడు. గేటు సమీపంచగానే, అక్కడ కాపలా ఉన్న సైనికులు వారిని అడ్డగించగా, పొడుగాటి వ్యక్తి వారికి పాస్‌ చూపించాడు. దాన్ని చూసి, ఆ సైనికులు అడ్డుతొలిగి, వారిని లోపలికి వదిలారు.

గేటు దాటి వెళ్లిన ఆ ఇద్దరూ,  వేగంగా నడిచి,  రెండో అంతస్తులో ఉన్న పెట్రోగ్రాడ్‌ సోవియట్‌ కార్యాలయం     ఉన్న విశాలమైన పెద్దగదిని చేరుకున్నారు. మళ్లీ గది బయటగల కాపలాదారులు వారిని అడ్డగించారు. తిరిగి పొడుగు వ్యక్తి పాస్‌ చూపించేసరికి, ముసలి వ్యక్తిని లోపలికి వదిలారు. పొడుగు వ్యక్తి మాత్రం లోపలికి వెళ్లకుండా కాపలావారితో ఏదో మాట్లాడుతూ బయటే ఉండిపోయాడు. అక్కడితో తనపని అయిపోయినట్లుగా అతడు గది బయటనున్న పొడవాటి బల్లపై కాపలావారి పక్కన విశ్రాంతిగా కూర్చుని,  వచ్చేపోయేవారిని గమనించడంతో నిమగ్నుడయ్యాడు.

మతగురువు లోపలికి ప్రవేశించిన వాడు కాస్తా ఆగి, గడియారం వంక చూశాడు. అందులోని సమయాన్ని గదిలోని గుడ్డి దీపం వెలుగు మసకమసకగా చూపిచింది. ఆ సమయం చూసి ఆ వ్యక్తి గాబరాపడుతూ,  ఆలస్యమయి పోయిందనుకుని, హడావిడిగా ఆ గదంతా ఒక్కసారి కలియజూశాడు. ఆ గది విశాలంగా ఉన్నాగానీ,  అందులో ఎవరూలేరు. అంతా ఖాళీగా ఉంది. అయితే పరిశీలనగా చూస్తే  ఆ గుడ్డి వెలుగులో ఆయనకు ఎడమపక్క మూలగా ఒక తలుపు మూసి ఉండటం కనిపించింది. దాంతో ఆ మతగురువు తన నెరిసిన బారాటి గడ్డాన్ని సవరించుకుంటూ, మూసి ఉన్న తలుపును ఆవలి వైపుకు మెల్లగా తోశాడు.  వెంటనే తలుపు బయటకు తెరుచుకుంది.

మతగురువు తెరుచుకున్న తలుపుగుండా లోపలికి చూశాడు. ఆ గది కూడా చీకటి చీకటిగానే వుంది. గది మధ్యగల మేజాబల్లపై కొద్దిపాటి కాంతినిచ్చే కిరోసిన్‌ దీపం వుంది. నిదానంగా చూస్తే ఆ దీపంచుట్టూ, ఎవరో వ్యక్తి కోసం వారంతా నిరీక్షిస్తున్నట్లు, మాటిమాటికీ వారు ద్వారంవంక తలెత్తి చూస్తూండడాన్ని ముసలి మతగురువు గమనించాడు. ఆయన లోపలికి వెళ్లి వారిని పలకరించాడు.

లోపల సమావేశమై ఉన్న పెద్దమనుషులు,  ఒక మతగురువు అసందర్భంగా తమ సమావేశ స్థలం మధ్యకు రావడాన్ని గమనించి, మొదట ఆశాభంగం చెందారు. ఎందుకంటే తామంతా ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నారో  ఆ వ్యక్తికాక మరో వ్యక్తి, తమకు అవసరం లేని వ్యక్తి వచ్చాడు. అసలు ఈ మతగురువుకు ఇక్కడ పనేమిటి? అసలు ఇంతటి రక్షణున్న తమ మధ్యకు ఇతడెలా రాగలిగాడు?  కాపలా వాళ్లను ఎలా తప్పించుకు వచ్చాడు?  వారెవరూ తమ స్థానాల్లో లేరా?  అంతమంది తమతమ స్థానాల్లో లేకుండా పోయారంటే బయట ఏం జరిగివుంటుంది?  ఒక వేళ జరగరాని అనర్థం ఏదీ జరగలేదు కదా!  ఏవేవో ఊహించుకుని అంతా కంగారుపడసాగారు. తమ మనసులలోని ఆందోళనలను ఎవరూ వ్యక్తమైతే చెయ్యలేదు గానీ,  లోపల ఉన్న వారంతా వచ్చిన ఆ మతగురువును తమ ఆగర్భ శతృవన్నట్లు చూడసాగారు. వారి ఆదుర్ద ఎందుకో అర్థంకాని మతగురువు వారి వంక ప్రశ్నార్థకంగా చూస్తూ ''ఆలస్యం  అయ్యిందా కామ్రేడ్స్‌?'' అని ప్రశ్నించాడు ఎడంగా నిలబడే.

''ఎవరు మీరు?  ఇక్కడికెందుకు వచ్చారు?  కాపలా సైనికుల్ని దాటి అసలెలా రాగలిగారు? ఇక్కడ మీ మతగురువులకేం పని?  వెళ్లండి...వెళ్లండి...వెంటనే బయటకు వెళ్లిపోండి...''  కూర్చున్న వారిలో ఒకరు మతగురువును మందలిస్తూ లేచి నిలబడే సరికి, మిగిలిన వారు కూడా గొప్ప అనర్థం జరిగిపోతున్నట్లు భావిస్తూ, లేచి నిలబడ్డారు తాము కూడా.

వారెందుకు తనను చూసి అలా కంగారు పడుతున్నారో మొదట మతగురువుకు అర్థంగాక,  వారి వంక తెల్లబోయి చూశాడు.  కానీ మరుక్షణం వారి కంగారుకు కారణం గ్రహించి నవ్వుకున్నాడు లోపల లోపలే.  బయటకు నవ్వితే బాధపడతారని వచ్చే నవ్వుని ఆపుకున్నాడు. తర్వాత వారందర్నీ ఒక ఆట పట్టిద్దాం అనుకున్నాడు... ఎందుకంటే, గంభీర మైన విషయాలు చర్చించేముందు, కొంత వినోదం కూడా అవసరమే కదా  అనుకున్నాడు.

అయితే ఇంతలోనే తన ప్రయత్నానికి భంగకరంగా ముందుగదిలోంచి లోపలికి రాబోతున్న పొడుగు వ్యక్తిని చూసి, ముసలి మతగురువు  సైగ చేశాడు  కళ్లతోనే.  దాంతో ఆ పొడుగు వ్యక్తి లోపలికి రాకుండా,  ముందుగదిలోనే ఆగిపోయాడు.

''ఎందుకు కామ్రేడ్స్‌ అలా కంగారు పడుతారు...ఇక్కడేం జరిగేదీ నాబోటి మతగురువులు తెలుసుకోకూడదా?'' ప్రశ్నించాడు మతగురువు నర్మ గర్భంగా నవ్వుతూ.

 

కూర్చున్న వ్యక్తులకు ఆ మాటలు మరింత అనుమానాన్ని కలిగించాయి. ఇతడెవరో తప్పక గూఢచారి అయివుంటాడు అని వారు భావించారు. వారిలోంచి టక్కున ఝర్జీనౌస్కీ లేచి,  మతగురువును పట్టుకుని బలవంతాన బయటకు లాక్కెళ్లబోయాడు.   అతణ్ణి కాపలావాళ్లకు అప్పగించాలని ఝర్జీనౌస్కీ ఉద్దేశం. అయితే ఝర్జీనౌస్కీని మతగురువు నిరోధించలేదు.  తలుపుదాకా అతడితోటే వెళ్లిన మతగురువు, ''కామ్రేడ్‌ ఝర్జీనౌస్కీ, ఎందుకంత కోపం...కొంచెం నిదానించు'' అన్నాడు. అక్కడ ఆగి ''నా పేరు నీకెలా తెలుసు?'' తను పట్టుకున్న మతగురువు భుజాల్ని వదిలేసి, ఆయన ముఖంలోకి పరిశీలనగా చూశాడు ఝర్జీనౌస్కీ.  అయినా అతడికి ఏ ఆనమాలూ చిక్కలేడు.

''మా మతగురువులకు అందరి గురించీ తెలుస్తుంది కామ్రేడ్‌,  ఒక్క నీ గురించే ఏమిటి, ఇక్కడున్న అందరి గురించీ నాకు తెలుసు...చెప్పమంటావా ఒక్కొక్కరి గురించీ...?'' చిరువ్వు నవ్వాడు మతగురువు.

అయితే జరిగేదంతా ఒక కమనీయనాటకంగా చూస్తూ నోటికి చేతుల్ని అడ్డుపెట్టుకుని నవ్వుతున్న పొడుగు వ్యక్తిని చూసేసరికి ఝర్జీనౌస్కీకి తన పొరపాటు అర్థమైంది. అ పొడుగు వ్యక్తి ఒక ఫిన్నిష్‌ కామ్రేడ్‌.  అత్యంత విశ్వాసపాత్రుడే గాక , ఒక కొరియర్‌గా గతకొంత కాలంగా పార్టీలో పనిచేస్తూండటం పార్టీలో కొద్ది మందికే తెలుసు. అతడు కొరియర్‌గా పనిచేసేది  ఒకే ఒక వ్యక్తికి...

''పొరపాటైంది  కామ్రేడ్‌  వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌.  మిమ్మల్ని గుర్తుపట్టలేక పోయాను.  క్షమించాలి'' అంటూ ఝర్జీనౌస్కీ మతగురువు చేతులు పట్టుకున్నాడు.

సిగ్గుపడుతున్న ఝర్జీనౌస్కీని ముసలి మతగురువు వేషంలో ఉన్న లెనిన్‌ అనునయించాడు. ఆ పై అక్కడున్న అందరికీ పిడికిలెత్తి అభినందించాడు. మిగిలిన వాళ్లు కూడా మతగురువు వేషంలో ఉన్న లెనిన్‌ కు క్షమాపణలు చెప్పారు. వారంతా ఆ తర్వాత ఆయన వేషధారణ అమోఘంగా కుదిరిందని ఆయన్ను అభినందించారు. నిజానికి వారంతా ఎదురుచూస్తున్నది ఆయన కోసమే. తమ బోల్షివిక్‌ పార్టీకి చెందిన సీ.సీ (సెంట్రల్‌ కమిటీ) సమావేశానికి వారంతా అక్కడ  వివిధ ప్రాంతాలనుంచి వచ్చి హాజరయి ఉన్నారు.

''ఆ సమావేశానికి సుదూరంగా యు.జి. (అండర్‌గ్రౌండ్‌ రహస్యంగా ఉండటం) లో ఉన్న లెనిన్‌ స్వయంగా హజరు కావలసి ఉంది. ఆయన ఒక ముఖ్యమైన తీర్మానాన్ని పార్టీ భవిష్యత్తునూ, అంతేగాక, దేశ భవితవ్యాన్ని నిర్ణయించగల ఒక ముఖ్మమైన తీర్మానాన్ని ఆ రోజు ప్రతి పాదించవలసి ఉన్నది. అయితే ఆయన రాక ఆలస్యమయ్యేసరికి ఆయన ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకోలేదు కదా అని వారు అందోళన చెందుతున్నారు. మారు వేషంలో ఆయన తమ ముందు హాజరవుతాడని వారు ఊహించలేదు.  అంతే గాక, ఆయన వేషాన్ని వారు గుర్తు పట్టలేకపోయి సిగ్గుపడాల్సి వచ్చింది కూడా. వారికంత ఆందోళన దేని కంటే, ఆయన్ను పట్టుకోవడానికి పోలీసుయంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఆయన ఉనికి ప్రభుత్వ వర్గాలవారికి తీవ్రకలవరపాటుకి గురిచేస్తోంది. ఆయన్ను పట్టుకుంటే గనుక ఆయున ప్రాణాలు తియ్యక మానరు. ఆయన మీద వారికి అంతపగ. దేనికంటే, విప్లవనికి ఊపిరి ఆయనేనని విప్లవ శత్రువులందరికీ తెలుసు.

అప్పటికే అనుకున్న సయయం మించిపోయినందున, సమావేశం వెంటనే ప్రారంభమయింది. సమావేశానికి అధ్యక్షుడు లెనినే.  ఆయనే పార్టీ అధ్యక్షుడు గనుక ఏ సమావేశానికై ఆయనే అధ్యక్షత వహించాలి. అదే సమయంలో ఆయనే తీర్మాన ప్రతిపాదకుడయినందున, తీర్మానాన్ని కూడా ఆయనే ప్రతిపాదించాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టేముందు, ఆయన తన అధ్యక్షోపన్యాసంలో భాగంగా మెదట  జాతీయ, అంతర్జాతీయ రాజకీయపరిస్థితులు విప్లవ రాజకీయాలు కేంద్రంగా సమీక్షించడానికి పూనుకున్నాడు లెనిన్‌.

కార్నీలొవ్‌ తిరుగబాటు విఫలమయిం తర్వాత బోల్షివిక్కుల బలం పెరిగిపోతూండగా, ఇతరపార్టీల విచ్ఛిత్తి  వేగంగా జరుగుతోందని  లెనిన్‌ తన ప్రసంగంలో సోదాహరణగా పేర్కొన్నాడు. దేశంలో ప్రధాన విప్లవశక్తులైన కార్మికుల, సైనికుల విశ్వాసం నిలుపుకోలేకపోయిన సోషలిష్టు రివల్యూషనరీలూ, మెన్షివిక్కులూ సోవియట్లనుండి అధికారాన్ని కోల్పోంతుండగా,  ఆ స్థానాన్ని బోల్షివిక్కులు గెలుచుకుంటున్న సంగతిని ఆయన గుర్తుచేశాడు.

మరో వైపు కార్మిక వర్గ పోరాటాల సంగతి చూస్తే, సమ్మె పరంపరలో చిక్కుకున్న విషయాన్ని ఆయన సోదాహరణగా వివరించాడు. మొదట 7 లక్షల మంది రైల్వే కార్మికులు సమ్మెచేశారనీ, ఆ తర్వాత 3 లక్షల మంది జౌళి కార్మికులు సమ్మెచేశారనీ, అవి పరిష్కారమైన తర్వాత, వెంటనే లోహ కార్మికులూ, ఆ తర్వాత చర్మ కార్మికులూ, సమ్మెచేశారనీ, ఆయన గుర్తు చేశాడు. 1905నాటి మొదటి విప్లవంలోగానీ, 1917ఫిబ్రవరి నాటి ద్వితీయ విప్లవంలోగానీ, ఇంత ఉధృతంగా సమ్మెలు సాగలేదని ఆయన ఆ గణాంకాలన్నీ బేరీజు వేసి చెప్పి,  ప్రస్తుతం కొన్ని చోట్ల కార్మికులు యజమానుల్ని తరిమేసి, ఫ్యాక్టరీల అజమాయిషీని తమ చేతుల్లోకి తీసుకుంటున్న సంగతిని ఆయన ప్రస్తావించాడు.

రైతు పోరాట స్వభావం కూడా మారుతోందనీ, వారంతా సోషలిష్టు రివల్యూషనరీల ప్రభావంలో ఉన్నప్పటికీ,  ఆ పార్టీ భూస్వాముల ప్రయోజనాలకోసం పనిచేస్తోన్న సంగతి గ్రహించి, ఆ ప్రభావంనుంచి బయటకు వస్తోన్న విషయాన్ని ఆయన వారి దృష్టికి తెచ్చాడు. ఉదాహరణకు జనరల్‌ కొర్నీలోవ్‌కు భూస్వాముల ప్రాపు ఉన్న విషయం రైతాంగం గుర్తించిందనీ అతడు నడిపించిన తిరుగుబాటు గనుక సఫలం అయ్యుంటే, తమకు ఎప్పటికీ స్వేచ్ఛ గానీ, భూమిగానీ దక్కదని పేదరైతాంగం గుర్తించిందనీ, అందువల్లనే వారు తెగించారనీ ఆయన చెప్పాడు. అందుకు దృష్టాంతమే వారు భూస్వాముల్ని పారదోలుతూ, వారి భూముల్నీ, పశువుల్నీ, పని ముట్లనూ స్వాధీనం చేసుకుంటూ, వారి భవనాల్ని దగ్ధం చేస్తున్న సంఘటనాలు పలుచోట్ల జరుగుతున్న విషయాన్ని ఆయన సమావేశం దృష్టికి తెచ్చాడు.

ఇప్పటిదాక ఉద్యమ తీవ్రతలేని రష్యనేతర ప్రాంతాల్లోకూడా ఇప్పుడు ఉద్యమం  తీవ్రంగా సాగుతున్నట్లు, విప్లవ భయంతో వివిధ రష్యనేతర జాతులకు చెందిన బూర్జువాలు, రష్యన్‌ బూర్జువాలతో కలిసి కూటమి ఏర్పారచుకుంటారన్న భయంతో, ఆయాప్రాంతాల రష్యనేతర శ్రామిక ప్రజలు, రష్యన్‌ కార్మికోద్యమంతో ఐక్యసంఘటనగా ఏర్పడుతున్న విషయం కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

పై విధంగా లెనిన్‌ జాతీయ స్థాయిలో విప్లవోద్యమం తమ పలుకుబడి పెంచుకుంటున్న అంశాన్ని సవివరంగా చెప్పి, ఆపై అంతర్జాతీయ అనుకుల పరిస్థితిపై తన రిపోర్టు ఇచ్చాడు.

ప్రపంచయుద్ధపు ప్రస్తుత పోకడలు రష్యన్‌ విప్లవానికి ఆటంకపరిచే పరిస్థితిలో లేవని ఆయన ఆ విషయంపై ప్రస్తావనగా చెప్పాడు. అవి రష్యన్‌ విప్లవానికి ఎలా అనుకులంగా ఉన్నాయో వివరించడం మొదలు పెట్టాడు.

ప్రస్తుతం రష్యన్‌ - జర్మన్‌ యుద్ధరంగంలో, విప్లవం కారణంగా స్తబ్దత నెలకొన్నందున, జర్మనీ తన సైన్యంలో కొంత భాగాన్ని ఫ్రాన్స్‌,  బ్రిటన్‌ల మీదికి మళ్లించిన సంగతినీ, ఆ చర్యతో జర్మనీ పాక్షిక విజయం పొందిన సంగతిని లెనిన్‌ సమావేశం దృష్టికి తెచ్చాడు. మరో వైపు  అమెరికా 1917 వసంతంలో బ్రిటన్‌, ఫ్రాన్సుల పక్షాన యుద్ధంలోకి ప్రవేశించినందువల్ల, ఈ పక్షానికి గెలుపు ఆశ కలిగింది. అయితే ఇప్పట్లో యుద్ధం ముగిసే జాడ కనబడకపోవడం వల్ల యుద్ధంలో నిమగ్నమైన దేశాల్లోని జనాలకు ఓర్పు నశించి పోతోందనీ, ఆయాదేశాల సైనికుల్లో అసంతృప్తితో కుతకుతలాడిపోతున్నారనీ ఆయన చెప్పాడు. అంతేగాక వారంతా రష్యన్‌ విప్లవం గురించీ,  బోల్షివిక్కుల పోరాటం గురించీ, తమ తమ ప్రభుత్వాలు చెబుతున్న అబద్ధాలలోని వాస్తవాలు గ్రహిస్తున్నారనీ, దాంతో వారు రష్యన్‌ శ్రామికుల పోరాటాల పట్ల సానుభూతి వహిస్తున్నారనీ ఆయన చెప్పాడు. వారు మన ఆదర్శాలను అనుసరించడానికి సిద్ధంగా        ఉన్నప్పటికీ,  వారికి బోల్షివిక్‌ పార్టీ లాంటి ధైర్యమూ, అనుభవమూ గల పార్టీ లేనందున క్రియాశీలత కనబరచలేక పోతున్నారని  ఆయన అన్నాడు. అయినప్పటికీ, వారిలో ఓర్పు అడుగంటిపోతూందనీ, దానికి గుర్తే 1917 శరదృతువులో జర్మన్‌ నౌకాసైనికులు గావించిన తిరుగుబాటే అందుకు నిదర్శనమనీ ఆయన ఉదాహరణనిచ్చాడు. ఇతర దేశాల్లో కూడా విప్లవం పరిపక్వం అవుతోందనడానికి అదే రుజువన్నాడాయన.

 లెనిన్‌ తన సుదీర్ఘ సమీక్షనాపి, అందరి వంకా ఒకసారి పరికించాడు.

ఆయన ఉపన్యాసాల్లోని విశేషం ఏమంటే, వాటిలో ఎక్కడా పాండిత్య స్పర్శగానీ, అలంకార విన్యాసంగానీ      ఉండదు. సూటిగా, క్లుప్తంగా, హేతుబద్ధంగా ఉంటుంది. విపక్షం వారిక్కుడా, ఆయన చెప్పే విషయానల్ని వ్యతిరేకించే సందుండదు. ఇప్పటిదాకా ఆయన చెప్పిన విషయాలు అక్కడి వారికి కొత్తకాదు. ఎప్పటికప్పుడు ఆయన ఆయా విషయాలపై పార్టీ పత్రికల్లో రాస్తూనే ఉన్నాడు. గణాంకాలతో సహా ఆయన చెప్పేవిషయాలు  సూటిగా ఉంటాయి.  కేవలం తర్కం ద్వారా వాటిని ఎదుర్కోవడం కుదరదు. అందుచేత ఆయన మాట్లాడేప్పుడు మౌనంగా ఉండటమే విపక్షం వారికి సురక్షితం.     ఉన్న వాస్తవాల ద్వారా పార్టీ లక్ష్యం ఏమిటనేది ఆయన కొద్దిమాటల్లోనే చెప్పగల దిట్ట. కార్మిక వర్గ రాజకీయాల్లో కావలసింది ఇటువంటి ఉపన్యాసాలే. అంతేగానీ కర్ర విరగకుండా, పాము  చావకుండా గంటలకొద్దీ చెప్పే ఉపన్యాసకారులు ఫ్యాక్టరీ కార్మికుల దగ్గర పనికిరారు.

లెనిన్‌ సాయుధ పోరాటం ప్రారంభించాలని పట్టుపట్టడం కొత్తకాదు. పార్టీ ఆరవ కాంగ్రెస్‌ జరిగిందే ( 1917 జులై 26 నుంచి ఆగష్టు 3 దాకా) పార్టీని సాయుధ పోరాటానికి సంసిద్ధం చేసేందుకు! పార్టీని సాయధ పోరాటానికి సంసిద్ధం  చేయడానికి లెనిన్  ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్  సూత్రప్రాయంగా అంగీకరించడమైతే చేసిందిగానీ, అందుకుగాను వెంటనే తగిన సంసిద్ధతాచర్యలు తీసుకుని పోరాటంలోకి దిగడం సాధ్యంకాలేదు. అసలా కాంగ్రెస్‌కు లెనిన్‌ ప్రత్యక్షంగా హాజరుకావడం కూడా జరగలేదు. ఆయన అందులో పరోక్షంగానే పాల్గొన్నాడు. తనకు విశ్వాసపాత్రులైన అనుచరులద్వారా ఆయన ఆ కాంగ్రెస్‌ను తన ఆలోచనలనకనుగుణంగా నడిపించగల్గాడు. జారిజం ఆయన్ని ఎలాగైనా చంపాలని భయంకరంగా సాగిస్తున్న వేటనుండి తప్పించుకునేందుకు, పార్టీ ఆదేశం మేరకు అప్పుడాయన అజ్ఞాతవాసంలో ఉండాల్సివచ్చింది.

అయితే ఇప్పుడు, ఆ సాయుధ పోరాట తీర్మానాన్ని కార్యరూపం ధరింపజెయ్యాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే , ఈ మధ్యకాలంలో, పెట్రోగ్రాడ్‌కు కొంత దూరంలో, రష్యాలోనే సాగించిన అజ్ఞాత వాసాన్ని వేట ముదరగానే,  సీ.సీ ఆదేశాలమేరకు, ఫిన్లాండుకు తరలించినా కూడా, ఇప్పటికిప్పుడు, ఎంతప్రమాదం ఎదురైనా విప్లవ విజయం మఖ్యమైనందున, ఆ ఫిన్లాండు నుంచి సరాసరి తన మకాన్ని పెట్రోగ్రాడ్‌కి  మార్చాల్సివచ్చింది. ఎందుకంటే విప్లవం విజయం సాధించండం, తద్వారా శ్రామిక రాజ్యం ఏర్పడటం, కేవలం తనొక్కడి  కల మాత్రమే కాదు. వందల సంవత్సరాలనుంచి ప్రపంచ నలుమూలలా ఉన్న తత్త్వవేత్తలు కన్న కల....శ్రామిక రాజ్యం..సోషలిజం...తద్వారా సర్వమానవ సమానత్వం...సమస్త ప్రజలకూ సుఖసంతోషాలు...

లెనిన్‌ తన ఉపన్యాసాన్ని ఒక్కక్షణం ఆపినప్పుడు తన లక్ష్యం కళ్లముందు ఒక్కసారిగా మెరిసింది. అనంతరం ఆయన, అక్కడ సమావేశమైన అందరి వంకా పరిశీలనగా చూశాడు. నిశితమైన ఆయన చూపులు అక్కడి వారందరి గుండెల్లోకీ లోతుగా చొచ్చుకు వెళ్లాయి. అవి వారి గుండెల్లోనుంచి, వారి మనసుల్లోకి దూరి వాటినాయన ఆసాంతం చదివేసినట్లుగా వారంతా అనుభూతి చెందారు. వారు ఏం ఆలోచిస్తున్నదీ ఆయనకు తెలుసు.

సీ.సీ. సభ్యుల్లో ఒకరిద్దరు సందేహ జీవులున్నారు. నిజానికి వారిని అంతకంటే కూడా వేరుగా వక్రబుద్ధులంటే సబబుగా ఉంటుంది. పార్టీ అంతా ఒక దారిన నడుద్దామంటే, వీరు మరోదారిన నడుద్దామంటారు. వీరి బుద్ధి పాతాళంలోవుంటే, నడక ఆకాశంలో.  ఎప్పటికప్పుడు వీరు తమ వక్రబుద్ధితో పార్టీచేత మొట్టికాయలు తింటూనే వుంటారు. పార్టీ వెనక నడుస్తూనే వారి బుద్ధి కెలకెయ్యడంతో మరల వక్రమార్గం పడతారు.

ఇక మరికొందరున్నారు. వారు తెలివైనవారే, మేధావులే.  కానీ గుంటనక్కలాంటి వారి. వారి ఆలోచనలు సూటిగా ఉండవు. బుద్ధిగా వుంటున్నట్టు నటిస్తూనే తెలివిగా పార్టీని పక్కదారి పట్టించాలని చూస్తారు. వీరు నష్టపోయే దానికన్నా ఎక్కువగా, వీరు తమ పక్కనున్న వారిని ఎక్కువ నష్టపరుస్తుంటారు. పార్టీలో గ్రూపును తయారుచేస్తారు. ఆ గ్రూపు వీరు తానే అంటే, వారు తందానా అంటూంటారు. ఒక చిన్న గ్రూపును తనచుట్టు తిప్పుకునేవారికే ఇన్ని తెలివితేటలుంటే, ఇంత పెద్దపార్టీని, దాని పుట్టుక నుంచీ వికాసందాకా, విజయందాకా, విజయం నుంచి స్థిర పాలన దాకా నడిపేవారు. నడపాల్సినవారు ఇంకెన్ని తెలివి తేటలు కలిగి వుంటారు?  అయితే ఇంతటి మహాత్తర కార్యక్రమాన్ని నిర్వహించేప్పుడు ఇలాంటి వారందరినీ ఒక కంటకనిపెడుతూ, కలుపుకుపోయేందుకు ప్రయత్నించాలి తప్పదు.

లెనిన్‌ ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే తీర్మానం కూడా, పార్టీ సాయుధ పోరాటాన్ని మొదలెట్టాలనే అయితే ఈ పోరాటాన్ని ఎప్పుడోగాక, తక్షణం అందుకనుగుణమైన చర్యల్ని తీసుకుని రోజులవ్యవధిలోనే పోరాటం మొదలవ్వాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడైతేనే విజయం దక్కుతుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా, విజయం మాట అటుంచి విప్లవం నిలదొక్కుకోవడమే జరగదు. ఓటమి అనివార్యమవుతుంది. ఇదంతా ఎలాగో లెనిన్‌ వివరించి చెప్పాడు.

ప్రస్తుతం పెట్రోగ్రాడ్‌ సోవియట్‌ బోల్షివిక్కుల స్వాధీనం అయివుంది. ఇక అరవైవేలమంది సైనికులుండే పెట్రోగ్రాడ్‌ స్థానిక సైనిక శిభిరమైన పెట్రోగ్రాడ్‌ గారిసన్‌ మొత్తంగా విప్లవానుకులంగా మారిపోయింది. ఇది గమనించిన ప్రధానమంత్రి కేరెన్స్కీ, గారిసన్‌లోని  యావత్తు సైన్యాన్ని యుద్ధ రంగానికి తరలించి తనకనుకూలమైన సైనికుల్ని ఇక్కడికి తరలిద్దామనే ఎత్తుగడలో ఉన్నాడు. మరో ముఖ్యమైన విషయం  రాజధానీ నగరమైన పెట్రోగ్రాడ్‌ను జర్మన్ల పరంచేసి, రాజధానిని మాస్కోకు మార్చేకుట్రను కూడా చేస్తున్నాడు. ఈ రెండు కుట్రలూ అమలు జరిగితే, పార్టీ సాయుధ పోరాటానికి పూనుకొన్నప్పటికీ విజయం సాధించడం కష్టం.... దాదాపు అసాధ్యం, ఓటమితప్పదు. అందువల్ల పార్టీ సాయుధపోరాటాన్ని తక్షణం ప్రారంభించాలి. ఇదీ లెనిన్‌ చెప్పిన విషయ సారాంశం! అత్యంత విశ్వసనీయ సమాచారం ఇది అంటూ లెనిన్‌ తీర్మానం ప్రతిపాదించాడు!

ఆ వెంటనే చర్చ ప్రారంభమైంది. ఇది ముఖ్య సమావేశమయినందు వల్ల, సి.సి సభ్యులతోపాటు, మరికొందరు ముఖ్యలనూ ఆహ్వానించారు. ఈ ప్రత్యేక ఆహ్వానితులకు వేరే పని ఉంది. వారిని ఎడంగా కుర్చోబెట్టారు. వీరికి చర్చలో పాల్గోనే అవంకాశంగానీ, ఓటింగ్‌ హక్కుగానీ ఉండదు. చర్చకేవలం సి.సి.కి మాత్రమే పరిమితం.  సమావేశంలో మాట్లాడిన వారంతా తీర్మానాన్ని బలపరచగా, సందేహజీవులైన కామెనీవ్ , జినోవీవ్ లు మాత్రం వ్యతిరేకించారు. వారి కాళ్లు బోల్షివిక్‌ పార్టీలోనే ఉంటాయిగానీ, ఆలోచనలు రాజీవాదులైన మెన్షివిక్కుల్లో ఉంటాయి. ఈ ఇద్దరూ బూర్జువా పార్లమెంటు కోసం కలలుకంటున్నారు. ఆరో కాంగ్రెస్‌లో కూడా వీరు ఇదే వైఖరి ప్రదర్శించారు. వారి ఉద్దేశంలో రష్యన్‌ కార్మికవర్గం సోషలిష్టు విప్లవాన్ని కొనసాగించేంత బలంగా లేదు. అంచేత అధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకు తొందరపడకూడదన్నది వారి భావన. అయితే వీరికీ ఎవరూ మద్దతునివ్వలేదు.

ఇక కమిటీలో కొత్తగాచేరిన ట్రాట్స్కీ ఒక జిత్తులమారి మేధావి! సామ్రాజ్యవాద ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకించడంలో ఇతడు ఇదే విధమైన జిత్తులమారి మార్గాన్నే అనుసరించాడు. తనది మధ్యేమార్గమని అతడు ప్రకటించాడు. అంటే అతడు, యుద్ధాన్ని సమర్థించే జాతీయ దురహంకార వైఖరికీ, వ్యతిరేకించే బోల్షివిక్కుకూ మధ్యస్థంగా ఉంటానని ప్రకటించి,      ఆచరణలో అతడు దురహంకారుల్ని పరోక్షంగా బలపరిచాడు. ఇటీవలే అతడు, కేవలం పార్టీ 6వ కాంగ్రెస్‌లోనే కొద్దివారాలకిందటే బోల్షివిక్‌లకే అనుకూలంగా ప్రజామద్దతు పెరిగిపోతు ఊండడాన్ని గమనించి, ప్లేటు ఫిరాయించి, తానూ బోల్షివిక్‌ పంథాకే అనుకూలమని చెప్పి, తన ముఠాతో పార్టీలో చేరాడు. ఇప్పుడతడు తన సహజ స్వభావంతో, సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించకుండా, కుయుక్తితో, తీర్మానానికి ఒక సవరణను ప్రవేశపెట్టాడు. అదేమిటంటే, సోవియట్ల అఖిల రష్యా రెండో కాంగ్రెస్‌ జరగక ముందు తిరుగుబాటు ప్రారంభించరాదని!

అయితే చివరగా తీర్మానాన్ని వ్యతిరేకించే వారి వాదనల్ని తిరస్కరిస్తూ మాట్లాడే హక్కు తీర్మాన  ప్రతిపాదకుడికి ఒక్కడికే ఉంటుంది. అతడు మాట్లాడిన తర్వాతే ఓటింగ్‌ ఉంటుంది. లెనిన్‌ తన తీర్మానాన్ని వ్యతిరేకించిన వారి వాదాల్ని పరాస్తంచేసేందుకు లేచి నిలబడ్డాడు. ఒక్కసారి ఆయన కామెనీవ్ , జినోవీవ్ ల వంక తిరిగి చిరునవ్వునవ్వాడు. ఎంత తీవ్రంగా వాదించేప్పుడు కూడా ఆయన ఉద్రేకపడడు. అమిత ప్రశాంతంగా ఉంటాడు. ఇది చూసి ఆయన ప్రత్యర్థులు ఉడికిపోతారు!

లెనిన్‌ తిరుగుదాడి , మార్క్స్ చేసిన ఒక వాఖ్యతో మొదలైంది. పీడక వర్గానికి చెందిన ఏ నిర్దిష్ట ప్రతినిధులు తమకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించి, తమను అణచివెయ్యాల్సిందీ నిర్ణయించడం కోసం పీడితులు ప్రతి కొద్ది ఏళ్లకూ ఒక సారి అనుమతించబడతారని మార్క్స్‌ చెప్పాడనీ, అందువల్ల అలాంటి పార్లమెంటరీ రిపబ్లిక్‌ కోసం కొందరు భ్రమలు పెంచుకున్నందున,   మనకిప్పుడు కావలసింది సోషలిజమేనని లెనిన్‌ నొక్కిచెప్పాడు. సోషలిజం సాధించడానికి సాయుధ పోరాటమొక్కటే మార్గమని వక్కాణించాడు. కార్మికవర్గం ఇప్పుడున్నంత బలంగాఎప్పుడూ లేనందున, ఎందుకంటే వారికిప్పుడు సైనికుల, నావికుల, ఇతర శ్రామికుల, రైతాంగం యొక్క మద్దతు కూడా ఉంది. గనుక, కామెనీవ్ , జినోవీవ్ లు చెప్పిన అభ్యంతరం నిలవదని చెప్పాడాయన.

అలాగే ట్రాట్స్కీ సవరణను అంగీకరిస్తే, ఇక తిరుగుబాటుకి అవకాశమే ఉండదని ఆయన అన్నాడు. ఒక వేళ తిరుగుబాటు జరిగినా, అది విఫలంకాక తప్పదని ఆయన చెప్పాడు. ఎందువల్లనంటే సోవియట్ల అఖిల రష్యా కాంగ్రెస్‌ జరిగే సమయంలో తిరుగుబాటుకి ప్రయత్నిస్తే గనుక, ఆ విషయం ప్రభుత్వానికి ముందే తెలిసిపోయి, తగిన జాగ్రత్తలు తీసుకుంటుందనీ, అప్పుడు విప్లవం ఓటమికి గురికాక తప్పదనీ ఆయన చెప్పాడు. అంచేత తీర్మానాన్ని యుదాతధంగా ఆమోదించాలనీ, వెంటనే అందుకు అవసరమైన ఏర్పాట్లకు పూనుకోవాలనీ లెనిన్‌ చెబుతూ తీర్మాన  వ్యతిరేకుల వాదనల్ని సమర్థంగా తిప్పికొట్టాడు.

తీర్మానం  అత్యాధిక మెజారిటీతో ఆమోదించారు. కామెనీవ్ , జినోవీవ్ లు మాత్రమే వ్యతిరేక ఓటేశారు. వెంటనే తీర్మానానికి అనుగుణంగా పార్టీని సమాయత్తంచేసేందుకు కమిటీ పూనుకొంది. తిరుగుబాటుకి నాయకత్వం వహించేందుకు గాను, లెనిన్‌ నాయకత్వాన ఒక రాజకీయ బ్యూరోను ఎన్నుకొన్నారు. అనంతరం తిరుగుబాటుకి దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమాయత్తం చేసేందుకు సమర్థులైన ప్రతినిధుల్ని అప్పటికప్పుడు నియమించారు. అలా నియమించబడిన వారు వెంటనే తమ నియుక్త ప్రాంతాలకు వెళ్లి పోయారు. జాప్యం గాకుండా ఉండేందుకు, వారిని సమావేశానికి ముందే పిలవడం జరింగింది. ఆ వెంటనే పెట్రోగ్రాడ్‌ సోవియట్‌ యొక్క విప్లవసైనిక కమిటీని నియమించారు.  దీనికి అధ్యక్షునిగా సమర్థుడైన పెట్రోగ్రాడ్‌ సోవియట్‌ అధ్యక్షుడైన 'పొద్వోయ్‌స్కీ'ని నియమించారు. ఈ సంఘం తిరుగుబాటు కోసం బహిరంగంగా పని చేసే ప్రధాన కమిటీ అన్నమాట!

పై ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి తెల్లవారి ఉదయం ఆరుగంటలయిపోయింది. అంటే సమావేశం ఎక్కడా విరామం అన్నది లేకుండా వరుసగా పదిగంటలకు పైగా జరిగిందన్నమాట! సమావేశం సంతృప్తికరంగా అనుకున్నట్లుగా ముగిసేసరికి, లెనిన్‌ ఎంతైనా సంతోషించాడు. ఇక ఇంటికి వెళ్లాలి! వెంటనే ఆయన తన విగ్గు సర్దుకుని, అక్కడున్న వారందరి వద్ద సెలవు తీసుకుని, తన కొరియర్‌ అయిన యువకుడు లెనోరాహ్య కోసం చూశాడాయన. రాహ్య సిద్ధంగానే ఉన్నాడు. ఇద్దరూ వేగంగా స్మోల్నీని విడిచారు.

చీకటి దట్టంగా ఉంది. ఆ కటిక చీకట్లో నెవానదిపై నడుస్తున్న ఓడల రంగురంగుల బల్బులు కాపలా యుద్ధనౌకల సిగ్నళ్ల కాంతులు అప్పుడప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుపుల్ని వెదజల్లుతున్నాయి.

 

పొడుగు మనిషి ఎప్పట్లానే వేగంగా ముందుకు సాగిపోతున్నాడు. ముసలి మతగురువు వంగిన నడుంతో, పెద్దగడ్డంతో చుట్టుముట్టిన ఆలోచనలలో, నెమ్మదిగా వెనుక నడుస్తున్నాడు. తను కన్న కలలు నిజమయ్యే రోజు ఎంతో దూరంలేదు. సాయుధపోరాటం సకాలంలో మొదలైతే, అది దీర్ఘకాలం సాగదు. రష్యన్‌ విప్లవంగానీ, ప్రపంచ విప్లవంగానీ, ఒక కళగా రెండు మూడు రోజుల్లోనే విజయం సాధిస్తుంది. కనుక తన పితృదేశం ఇక నాలుగయిదు రోజుల్లోనే,  ప్రపంచం లోనే మొట్టమొదటి సోషలిష్టుదేశంగా అవతరించబోతోంది.

ఆయన అంచనాలు నెవానదిపైని వంతెన రావడంతోనే ఆటంకం కలిగింది. అయితే ఆయన కల నిజమయిందిగానీ, ఆ రోజు, ఆయన అనుకున్నట్లు నాలుగయిదు రోజల్లో రాలేదు. అందుకు మరి రెండు వారాల సమయం పట్టింది.!

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు