మా రచయితలు

రచయిత పేరు:    కె. నాగేశ్వరాచారి

సాహిత్య వ్యాసలు

మాండలిక భాషకు ఊపిరిపోసిన విరసం

ప్రపంచ వ్యాప్తంగా రైతాంగ కార్మిక ఉద్యమాలు ముందుకురావడంతో ఆయాదేశాల్లో మాండలిక భాషలకు ప్రాధాన్యత పెరిగింది. దీనికి ఉద్యమాలకుండే దృక్పథమే ప్రధానకారణం. ఈ దృక్పథమే విరసం కలిగి వుండడం వల్ల తెలుగు నాట మండలిక భాషకు ప్రాధాన్యత పెరిగిందనడం కంటే అవసరం పెరిగిందనడం సబబు.

డెభ్బైయవ దశకంలో సృజన, ఆధునిక సాహిత్యవేదిక అల్లం వాసన వేస్తుందని పాఠకులు చమత్కరించుకునే వారు. అల్లం సోదరులు పాట మాట కథానవలలు తెలంగాణా మండలికంలో నడిపించారు. రైతాంగ ఉద్యమాలకు డెభ్బైయవ దశకంలోనే పునాదులు పడినా రూపుదిద్దుకునింది మాత్రం ఎనబైయవ దశకంలోనే. ఈ ఉద్యమాలే మాండలిక భాషా అవసరాన్ని పెంచింది.

భాషా వైవిధ్య వ్యక్తీ కరణలు, వినియోగమే సామాజికచైతన్యాన్ని సజీవంగా వుంచుతాయి. ఆనాటి ఉద్యమాలకు ఆనాటి సామాజిక వైరుధ్యాల్ని పరిష్కరించే ఆలోచనలుంటాయి, ఎవరైతే ఆ వైరుధ్యాల్ని పరిష్కరించుకోవాలో వారికి ఆ ఆలోచనల్ని చేరవేయాలంటే వారు అర్థం చేసుకోగలగిన భాషా, స్థాయిలోనే సృజనాత్మక సాహిత్యం అందించాల్సివుంటుంది. ఈ సామాజిక అవసరాన్ని విరసం గుర్తించింది.  మాండలిక భాషా  రచనల్ని ముందుకు తీసుకుపోయింది.

విరసం మావో ఆలోచనా విధానం తన ప్రాపంచిక ధృక్పధంగా చెప్పి ఆచరిస్తూవుంది. మావో ప్రతిపాదించిన నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలంటే వ్యవసాయిక విప్లవం జరగాలి. దున్నేవానికే భూమి లభించాలి. చారుమజుందార్‌ గుర్తించినట్లు ఈ దేశం అర్థవలస అర్ధభూస్వామ్య వ్యవస్థగానే కొనసాగుతుందని భూస్వామ్యానికి అశేష రైతాంగానికి వున్నదే ప్రధాన వైరుధ్యమని రైతాంగ పోరాటం రాజ్యాధికారమే లక్ష్యంగా కొనసాగాలని, అందుకు సాంస్కృతిక సైన్యంగా విరసం కొనసాగాలనేది మావో ఆలోచనావిధానం సారాంశం.

అన్ని సాంస్కృతిక రూపాలను విప్లవీకరించి ప్రజలనుంచి ప్రజలవద్దకు చేరాలనే ఆచరణ ప్రధానంగా విరసం కొనసాగుతూవుంది. ఈ ఆచరణ ప్రతిఫలనమే ఉపా చట్టాన్ని నేడు రచయితలపై కళాకారులపై ప్రయోగించడం.

కేవలం ప్రజలవద్దకు వెళ్ళడమంటే వారి మాండలికాన్ని అనుసరించడం కాదు. కొలిమంటుకున్నది నవలలో పి.సి.నరసింహా రెడ్డి అన్నట్లే గ్రామీణ జీవితంలోని అన్ని మలుపులను, పాత్ర గత వ్యక్తీకరణలను, సన్నివేశాలను వారితో మమేకమైతే తప్ప ఆయా మాండలికాల వ్యక్తీకరణలు రచయిత పట్టుకోలేడు. మరోచోట కాత్యాయినీ విద్మహే గారు అన్నట్లుగా ఆ మాండలికంలో తప్ప మరింకేమాండలికంలోనూ వ్యక్తీకరించ వీలుకాలు ప్రత్యేక వ్యక్తీకరణలుంటాయి. ఆ పాత్రతప్ప మరింకే పాత్ర, మాండలికం వ్యక్తీకరించలేని భావాలుంటాయి. ఆ మధ్య మామగారు బాగున్నారా సినీమాలో ఒక స్త్రీ పాత్ర చిత్తూరు మాండలికంలో ఆమాయకంగా మాట్లాడుతుంది. ఒక సహజమైన వ్యక్తీకరణ అది.

ఆ నాటి తెలంగాణా సాయుధపోరాట కాలంలో వట్టికోట, దాశరధి వంటి రచయితలు తెలంగాణా మాండలికంలో కథానవలలో వెలువరించినా ఆనాటి ఉద్యమానికి వున్న పరిమితుల రీత్యా రచయితల సందేశం మధ్య తరగతి ప్రజలకు చేరినట్లుగా రైతాంగ శ్రామిక జనానికందలేదు. ఎనబైయవ దశకంలో ప్రారంభమైన ఉద్యమం రచయితల సందేశాన్ని, ఆకాంక్షను ప్రజలవద్దకు తీసుకుపోయింది.

విరసం రచయితలకు మావో ఏనాన్‌ ప్రసంగం గొప్పస్ఫూర్తినిచ్చింది. ఆ స్పూర్తే వారిని ప్రజలవద్దకు పంపింది. ప్రత్యామ్నాయ రాజకీయాచరణను నేర్పింది. రచన ప్రజలను సామాజికాచరణవైపు ఆలోచింపజేయడం కంటే కావలసిందేముంది. మాండలిక భాషా రచన  మావొ ఏనాన్‌ ప్రసంగంలోని అంశమే. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాచరణ వైపు ఆదరణ పెంచడానికి ఉపయోగపడేది మాండలిక రచన.

మాండలిక రచన పాఠకుని కంటే శ్రోతకు దగ్గరగా వుంటుంది. అల్లం రాజయ్య కొలిమంటుకున్నది నవలకు రాసిన చివరిమాటలో ఈ విషయాన్నే విశ్లేషించారు. ఉద్యమ సందేశం ప్రజల భాషలో వ్యక్తీకరించేదే మాండలికం. ఇవ్వాళ తెలుగునాట ప్రజలవైపు రచయిత నిలబడినాడని చెప్పుకోవడానికి పనికొచ్చేదిగా మాండలికంలో రచనలు వస్తున్నాయి. దీని వల్ల మాండలిక పదాలు రికార్డుకావచ్చునేమో కాని సందేశ శూన్యత వుంటే ఆ రచన అలంకార ప్రాయమే.

కారా మాష్టారు చాలా చోట్ల మాండలిక యాస,భాషవేశని చెప్పారు. ఇవాళ ఈ తేడాను గమనించకుండా రచనలు వస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని రచయితలు గమినించాల్సి వుంది.

శ్రీకాకుళ పోరాట కాలం నుంచి మాండలిక భాషారచనలు విరివిగా కొనసాగినాయి. భూషణం, అట్టాడ కారామాష్టారు, రాచకొండ విశ్వనాధశాస్త్రి వంటి తొలితరం రచయితలంతా పాత్ర గతమైన మాండలిక రచన చేసినవారే.

పాఠకుడుని/శ్రోతను దృష్టిలో వుంచుకుని, సామాజిక లక్ష్యాలను నిర్దేశించుకున్న రచయితలు తెలుగునాట గ్రాంధిక భాషను వదలుకుని, వ్యావహారిక భాషను వాడుక వ్యావహారికాన్ని వదులుకుని మాండలిక భాషలో రచనలు కొనసాగిస్తున్నారు. సంస్కరణను కోరుకున్న గురజాడ విజయనగరం మాండలికంలోనే ఒక సామాజిక  వర్గానికి సంబంధించిన భాషను కన్యాశుల్కం నాటకంలో వినియోగించారు. ఇంకా సంస్కృత భారతాన్ని తెలుగు భారతంగా మార్చడానికి జరిగిన ప్రయత్నం వెను జైన బౌద్దాలను నిలువరంచడానికేనన్న కట్టమంచిరామ లింగారెడ్డి మాటను మరువలేం. వ్యావహారిక భాషా ఉద్యమం వెనుక విజ్ఞాన, సాంఘిక శాస్త్రాలను ప్రజలందుబాటులోకి తేవాలనే కాంక్షవుంది. ఐతే దృక్పథం బలహీనంగా వుండడంవల్ల తెలంగాణ పోరాట కాలంలో మాండలిక రచన విరివిగా ముందుకూడా లేదు. నక్సల్‌బరీ ఉద్యమంతో ప్రజలకు ఉద్యమం చేరాలన్న రాజకీయ దృక్పథంలో వాహికగా మాండలిక రచనలు కొనసాగాయి.

డెభ్బైయవ దశకంలో, మాండలిక రచనలు ఇతర ప్రాంతీయులకు అర్థంకావు, కాబట్టి మాండలిక రచనల ప్రయోజనం పరిమితమేనన్న చర్చ సాహితీలోకంలో కొనసాగింది. ఈ చర్చను కొడవటి గంటి కుటుంబరావు ఒకే మాటతో ముగింపు పలికారు కొన్ని శతాబ్దాల కిందట పద్యకావ్యాల్ని నిఘంటువుల సాయంతోనూ, వ్యాఖ్యానాలు గల కావ్యాల్ని ఆనందపారవశ్యంతో చదువుతారు. పైగా ఆ భాష సజీవభాషకాదు. కావ్యభాష. కొన్ని వందల, పదుల కిలోమీటర్ల దూరంలో వుండే ప్రజలు మాట్లాడుకునే సజీవభాష అర్థం కాలేదంటే ఆ ప్రజలు ఇష్టం లేకపోవడమే కారణమని ఆ చర్చను పూర్వపక్షం చేశారు.

నిరక్షరాస్యత దారిద్య్రం వల్లనే అన్నమాటను ఫాలోఫ్రెయిరే బ్రెజిలియన్‌ విద్యాతాత్వికవేత్త - అంగీకరించలేదు, అణిచివేతనే నిరక్షరాస్యత అని ఆయన వివరిస్తారు. ఉతృత్తి సాధనాలను చేజిక్కించుకున్న వర్గానికి వనరులు సమకూర్చుకునే అవకాశం కలిగివుంటారు. ఇవాళ రెండు తెలుగురాష్ట్రాల్లో కోస్తాంధ్ర తెలుగు భాషనే కొనసాగుతూవుంది. సమాజంలో సినిమా, వార్తాపత్రికలు, టి.విలు ఆధిపత్య ప్రచారమాధ్యమాలు, వీటి ప్రభావానికి దూరముండే పౌరుడు దేశంలో కనిపించరు. ఇవన్నీ మానవశ్రమ నిర్మితాలే కాబట్టి అవి తిరిగి ఏనాటికైనా మానవుణ్ణే చేరుతాయి. ఈ ప్రచారమాధ్యమాలభాష స్థానిక మాండలికాలపై పెత్తనం సాగిస్తువుంది. గత ముప్పైఏళ్ళ కాలంనుంచి మాండలిక భాషలో కూడా మార్పులు వస్తున్నాయి. అంటే ఈ మాధ్యమాల ద్వారా సాంస్కృతిక ఆధిపత్యం మొదలయింది ఈ గొలుసు పొడవు ఎల్‌పిజి దాకా కొనసాగుతూవుంది.

గతంలో భద్రిరాజు కృష్ణమూర్తి, జి.ఎస్‌. రెడ్డి వంటి భాషా శాస్త్రవేత్తల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాండలిక భాషలపై పరిశోధనలు చేసి ప్రాంతీయ మాండలికాలుగా గుర్తించారు. జిల్లాలవారిగా మాండలిక  పదకోశాలను తయారు చేశారు. వర్గ, కుల, మాండలికాలను గుర్తించారు. ఈ పరిశోధన వల్ల సమాజం పీడిత సమాజంలోనే ఎన్ని వర్గాలున్నాయో తెలుస్తుంది. రచయిత పీడిత ప్రజల్ని గుర్తించినపుడే వారి మాండలికాన్ని కూడా గుర్తిస్తాడు. రచయిత ఉద్దేశించిన విప్లవోద్యమంపట్ల ఆదరణ పెరుగుతుంది. రచయిత పీడతవర్గాల ముసుగు తీసివేయడంలో తమ కష్టాలకు కారకులెవరో తెలిసిపోతుంది. ఉద్యమాల అవసరాన్ని ప్రజలకు గుర్తిస్తారు. క్రమంగా మావో ఆశించినట్టుగా ఆదరణ ఆచరణగా మారి ప్రమాణాలు పెంపొందుతాయి, ప్రజల్ని కార్యోన్ముఖులను చేసే సాహిత్యదృక్పథమటువంటిది. అలంకారిక రచనలు కనీసం సమస్యల్ని పాఠకునికి ఫిర్యాదు చేయవుసరికదా తప్పుడు సమాచారంతో పాఠకుణ్ణి తప్పుదారి పట్టిస్తాయి, మాండలిక భాషలో రచనలు చేసినా పోరాట దృక్పథంలేనందువల్ల, నూతన ఆర్థిక విధానాల ప్రభావం వల్ల ఉద్యమాంలో కోవర్టులున్నట్లే సాహిత్యరంగంలోనూ ఉద్యమాల ముసుగేసుకున్నవారు అన్ని భాషాల్లోను కనిపిస్తారు.

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు