మా రచయితలు

రచయిత పేరు:    శ్రీరామ్ పుప్పాల

సాహిత్య వ్యాసలు

ప్రజల విరసం

విరసం పరిచయమైన తరువాతే నా వ్యక్తిత్వం నాకు స్పృహలోకొచ్చిందేమోనని ఇప్పుడనిపిస్తోంది. సమాజమూ, చైతన్యమూ లాంటి పదాలకి అర్ధమూ అప్పుడే తెలిసింది.  నా ఆరవ తరగతిలోననుకుంటాను; విజయవాడ రైల్వే స్కూలు మేగజైన్ విజయ' కోసం చిన్న కవితోకటి రాశాను.గుంటూరు నుండి వచ్చే బాలానందం; వరంగల్లు NIT లోని ఆచార్య సి రామచంద్రయ్య గారి సంపాదకత్వంలో వచ్చే చెకుముకి పత్రిక కోసం కొన్ని ఆర్టికల్స్ రాయడం -- ఇలా మొదలయ్యింది నా రాత పని. తెలుగంటే గొప్ప ఇష్టముండేది. అందుకు చూడామణి, కోటేశ్వర శర్మ, నారాయణ మూర్తి, తాటి శ్రీకృష్ణ లాంటి గురువులే కారణమనిపిస్తుంది. ఇంటర్ కొచ్చేసరికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువవాణి లో కవితాకిరణాలు, భావచిత్రాలు నాకు తొలినాళ్ళలో తర్ఫీదునిచ్చిన కార్యక్రమాలు. 1997 లో విరసం సాహిత్య పాఠశాల నన్ను చాలా ప్రభావితం చేసిన సంఘటన. మొట్టమొదట విరసం గురించప్పుడే తెలిసింది. పదిహేడేళ్ళప్పుడనుకుంటాను ఆదివారం విశాలాంధ్ర లో స్వగతం’ 'షరా మామూలే' అని రెండు కవితలు ముత్యాల ప్రసాద్ గారు అచ్చువేశారు. కవిత్వమంటే ఏమిటో, ఇతర సాహిత్య రూపాలేమిటో అప్పుడే ఇతమిద్దంగా ఒక ఆకారం ఏర్పడ్డం వెనుక నాకే కాదు చాలా మంది కొత్త కుర్రాళ్ళకి విరసమిచ్చిన సాహిత్య జ్ఞానమే క్రియాత్మక కారణమనుకుంటాన్నేను. దృక్పధ రాహిత్యంతో అభ్యుదయ కవిత్వం వెనక్కి తప్పుకుంటున్నప్పుడు, దిగంబర కవిత్వం పెట్టిన కేకల్లోపడి అరవయ్యో దశకం చివరినాళ్ళు చెవులు చిల్లులు పడుతున్నప్పుడు -- సరిగ్గా 1970 లో విరసం కన్నుదెరవడం సాహిత్యానికి శుభపరిణామం. మరీముఖ్యంగా తెలుగు వచన కవిత్వానికి.

 

విరసం ఏర్పడక ముందుటి సాహిత్యమూ ఆ తర్వాతిదానికీ తేడా ఏమిటా అని ఆలోచిస్తే ముందుగా నాకు కొత్తపుంతలు తొక్కిన కవిత్వమే గుర్తొస్తుంది. అది విప్లవ బాట పట్టింది. విరసం పునాదుల్లో ఉన్న సామ్రాజ్యవాద దళారీ విముక్తి పోరాటం, ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యం, శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం ఇవన్నీ తెలుగు సాహిత్యంలోకి కొత్త బలాన్ని తీసుకొచ్చాయి. ప్రజలపక్షాన పనిచేస్తున్నామని బాకాలూదే రాజకీయ పార్టీల అనాచరణలోని మౌలిక సమస్యల్ని, ప్రభావవంతమైన మార్క్సీయ సిద్దాంత సరళిని ఉద్యమస్పూర్తితో అక్షరాల్లోకి విరసం ప్రవేశపెట్టింది. అంతకు ముందు సీవీ లాంటివాళ్ళు రాసిందున్నప్పటికీ విరసానంతర సాహిత్య పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. మార్క్స్ ఆలోచనా విధానాన్ని దేదీప్యమానంగా వెలిగించిన ఏంగిల్స్, మావో ప్రతిఫలనాల్ని విరసం ఎక్కువగా అర్ధం చేసుకునే వీలు తెచ్చింది. సామాజిక వర్గ చైతన్యాల స్పృహకి చాలా దోహదపడింది. సృజనకు మూలమవుతున్న విషయానికి చెట్టు వేళ్ళలాంటి అనేక ఆర్ధిక, రాజకీయ, తాత్విక లోతుల్ని అవగాహనలోకి తెచ్చింది. కవిత్వమైతే వస్తుగతమై ఉండాలా ? శిల్పాధార అనుభూతి ప్రధానంగా నా ? కధా నవలల్లో సామాజిక జీవన చిత్రణ - అందులోని వైరుధ్యాల్లోని అంతహ్సంఘర్షణల్ని -- మేధోవ్యాపారమైన విమర్శ కైతే సమూల దృక్పధ స్వభావ స్వరూపాల్ని విరసం సరికొత్తగా ముందుకు తెచ్చింది. ఝంఝు, లే, రక్తగానం, చనుబాల ధార, మంజీర మూడ్స్, విప్లవం వర్ధిల్లాలి లాంటి కవితా సంకలనాలు విప్లవావసరాన్ని ఎవర్ గ్రీన్ గా ఉంచాయి. అంటరాని వసంతం నవల, ఇప్పుడు వీస్తున్న గాలి నుంచి ఇప్పటి డిసెంబరు నెల అరుణతార ప్రత్యేక కధా సంచికల దాక; కొకు, టీఎమ్మెస్ విమర్శా గ్రంధాలదాక ఏది సమాజికావసరమో విప్లవ సాహిత్యం కాక మరింకేం చెప్పగలిగింది ? ఆ పని విరసం కాక నిష్పక్షపాతంగా మరింకే సంస్థ చేయగలిగింది? నిర్భయంగా, నిరపేక్షంగా సర్వకాల సర్వావస్థల్లోనూ విరసం చూపే ఆ విప్లవనిబద్దతే నాలాంటి ఏ సృజనకారుడి పరిణామక్రమంలోనైనా వెలుగు దీపాలు చూపించిందనుకుంటాను. అరుణతార పత్రిక సంగతి నేనికేం ప్రత్యేకంగా చెప్పలేను. విరసమూ అరుణతార ఒకటే.

 

విరసం లాంటి సంస్థ 50 సంవత్సరాలు మనగలగడం వెనుక గల పరిస్థితులు-కారణాలు కూడా ఆ సంస్థ చూపిన రాజకీయ సైద్దాంతిక దృక్పధ మార్గంలోంచే అర్ధం చేసుకోవాలి. సాహిత్యానికీ రాజకీయానికీ గల సున్నితమైన సంబంధాన్ని విరసం సాధికారంగా నిర్వచించింది. నిర్వహించింది కూడా. 1950 నుండీ మన దేశ స్వాతంత్ర్యంలోని మేడిపండు ప్రజాస్వామ్య అసలు రూపాన్నీ, సహజ వనరుల్ని దళారులపరం చేసే ప్రజా ప్రతినిధుల్నీ, పెట్టుబడిదారులకి దోచిపెట్టి మేలు చేసే ప్రభుత్వ విధానాల్ని, విరసం తప్పుబట్టింది. శ్రీకాకుళ, తెలంగాణ సాయుధ పోరాటాల్ని స్పూర్తిగా తీసుకుంది. పాణిగ్రాహి లాంటివారు సమాజానికి కావాలన్నది. శ్రీ శ్రీ మొదలు చెర, శివసాగర్, కొకు, కారా, రావిశాస్త్రి, కళ్యాణ రావు, వరవర్రావ్ ల దాకా ఎందరో ప్రజా సాహిత్య పోరాటయోధుల్ని విరసం అమ్ములపొదిలో బాణాల్లా ధరించింది. వీళ్ళందర్నే కాదు విరసం భావజాలాన్ని ఇష్టపడేవాళ్ళందరూ సాంస్కృతిక యుద్ధ సైనికులే. ఆయుధాన్ని ధరించే సంస్థ శరీరమైతే; ఆ శరీరమ్మీదనుంచే ఆయుధాన్ని ప్రయోగించగల క్రమశిక్షణ కలిగి ఉండటం కత్తి అంచుమీద నడచినట్టనుకోదగ్గ సందర్భాలు విరసం చరిత్ర నిండా ఎన్నో ఉన్నాయ్. దళిత, స్త్రీవాద, బహుజన పోరాట పరిణామాలకి విరసమే స్పూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు. వోల్గా, విమల,సౌదా, అరుణ, త్రిశ్రీ, కలేకూరి లాంటివాళ్ళ మూలాలన్నీ విరసానివి కాదా ? సభ్యత్వం లేనప్పటికీ జీ లక్ష్మీ నరసయ్య, పాపినేని శివ శంకర్ తదితరులవి విరసం విప్లవ భావజాలం కాదా ? సాంకేతికంగా చూడరంటే, ఈ ఉద్యమాలకి తన జండాని ఆ ఉద్యమ భుజాలమీద మోసిన సందర్భం విరసానికి ఉంది. ఈ అస్తిత్వ ఉద్యమాలు విరసానికి అంతర్గతమూ, సమాంతరమూ అనతగ్గవి. ఇన్నింటికి సిద్దపడింది కనుకనే విరసం అవసరం ప్రస్తుత తెలుగు సాహిత్య సామాజిక రంగంలో ఎంతో ఎక్కువ ఉన్నది.

 

అందుకే విరసాన్ని ప్రేమించడమంటే విప్లవ సాహిత్యం లో వచ్చిన పరిణామాలను ప్రేమించడమేనంటాను. అది గుడ్డిప్రేమ కారాదు, కాదు కూడాను. విప్లవం ఆధునిక సాహిత్యానికి భక్తి వాదాల్నుంచి, అతి-మిత, వ్యక్తి, అస్థిత్వ, రూప, ప్రతీక మొదలైన అనేకానేక వాదాల్నుంచి ఎలా కొత్తచూపునిచ్చిందన్నది ప్రధానంగా తెలుసుకోవాలి. సామాజిక జీవితం అందునా, ప్రజాజీవన వాస్తవ స్తితిగతులే పరిశోధక తలంగా సాహిత్య ప్రయోగ శీలంగానే విరసం ప్రవర్తించింది. కొత్త రచయితలను కవులను తయారుచేయడంలో విరసం అదే సదాశయ ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉంది. అదే క్రమంలో ఉద్యమ కేంద్రక మావోయిస్టు సాయుధ మార్గాన్ని, విరసం వెనకేసుకురావడాన్ని ఎవ్వరూ విమర్శించరు గానీ కొత్త తరం విప్లవ అవగాహనకు మాత్రం విరసం శాస్త్రీయ ఆదరువునివ్వాల్సిన అవసరమైతే చాలా కనిపిస్తోంది. అందుకు నేటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత ప్రభావంతంగా వినియోగించాలి. virasam.org ఉన్నప్పటికీ దాన్ని యువతరానికి మరింత చేరువ చేయాలంటే వాళ్ళకర్ధమయ్యే భాషలో విప్లవాన్ని మార్పుకెలా సంకేతం చేయాలో ప్రణాళిక రచించాలి. ఇప్పుడు ఆ పని కొత్తగా చేయాలా అన్న ప్రశ్న అక్కరలేదు. నేటి యుగం సోషలిస్టు పెట్టుబడిదారీతనాన్ని నరాలకెక్కిస్తున్న సందర్భ యుగం. ప్రపంచీకరణ్ణి ఎదుర్కొని ఎదుర్కొనీ దానికి దాసోహమయ్యామా ? శత్రువులమయ్యామా ? దాంతోనే సౌకర్యవంతంగా సహచరిస్తున్నామా ? దేన్నీ తేల్చుకోలేనంత అమాయక స్తితిలో లేకపోయినప్పటికీ సరళీకరణ విప్లవాన్నీ మాలిమి చేస్తున్న చారిత్రక రాజకీయ కాలాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో ఉన్నాం. విలువైన ప్రజా రచయతల్ని, కళాకారుల్ని అకారణంగా జైళ్ళపాల్జేసుకుంటున్న దుర్మార్గపు కాలంలో ఉన్నాం. ఈ కాలపు యువతరానికి ఆవేశం కన్నా ఆలోచనెంత పదునైన ఆయుధమో చాలా విస్పష్టంగా తెలుసు. దేశాల్ని ప్రభావితం చేసిన తాత్వికతల గురించి తెలుసు. అయితే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ కళాత్మక పరిధుల్లోంచి తమని తాము లిబరేట్ చేసుకోవాలో తెలీని కన్ఫ్యూషన్ నుండి యువతరానికి వెలుగు చూపే దీపస్థంభం విరసమే కావాలి. అది విరసమే చెయ్యగల పని. అందుకే 50 ఏళ్ల విరసం సందర్భాన్ని నేనిప్పటికీ చారిత్రక అవసరంగా స్వాగతించాలంటాను. 

 

నా దేశపు మధ్యతరగతిని (ఫ్యూడల్ యుగం నాటి బూర్జువా తరగతి కాదు) అతి నీచంగా తమ స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుంటున్న ఇన్నేళ్ళ స్వరాజ్యం, దీని మూల స్థంభాలనబడేవిప్పటికీ సార్వభౌమికత (Sovereign) ముసుగులో మనిషితో వ్యాపారానికి మాత్రమే విశాలమవుతూ సార్వజనీన మానవత్వానికి (Humanity) అంతకంతకూ సంకుచితమవుతున్న (Monopolized) అంతర్జాతీయ కుహానా వర్గ పరిజ్ఞానం పట్ల నిస్సహాయంగా చూస్తూ ఉండిపోనక్కర్లేదు. విరసం లాంటి సంస్థలతో కలసి పోరాడొచ్చు. ఆఖరుకి అవసరమనుకుంటే విరసంతో కూడా!  మనం దేనికీ వెనుకాడక్కర్లేదు. ఏ పోరాటానికైనా ప్రజలేగా జండాల్ని మోసేది.

 

(వ్యాసకర్త రాజమండ్రిలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారు. 2018 లో  “అద్వంద్వంకవితా సంపుటి తీసుకొచ్చారు. రస్తా ఆన్లైన్ మేగజైన్ లో మలిచూపు శీర్షికని, కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షికనీ రాస్తున్నారు. కవిత్వమూ విమర్శా ఇష్టమైన ప్రక్రియలు. త్వరలో వ్యాస సంకలనం తీసుకొచ్చేపనిలో ఉన్నారు. ఈయన ఉమ్మడిసెట్టి, పెన్న రచయతల సంఘం, రంగినేని యల్లమ్మ కవిత్వ పురస్కారాలు పొందారు)

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు