కె వి ఆర్ వెళ్ళిపోయి 2020 జనవరి 15 నాటికి 22 ఏండ్లు ముగుస్తాయి. ఇంతకాలం గడిచినా ఆయన అందించిన సాహితీ సృజన ఎప్పుడూ మన మధ్యన జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. ఆయనకు ఒక బుక్ కీపర్‌గా వ్యవహరించటం నా జీవితానికి ఉన్న అర్హత. అరుణతార 1980లలో అనుకుంటాను. కె వి ఆర్, కొడవటిగంటి కుటుంబరావు తొలినాళ్ళ కథల సేకరణ కోసం ఒక ప్రకటన చేశారు. అది చదివాను. వాటిని వెతికే ప్రయత్నం మా వేటపాలెం లైబ్రరీ కెళ్ళాను. అవి అన్నీ కూడా 30 ల నాటి పాత పత్రికలు. ఆ పత్రికల్ని చూడ్డం, చదవటం కూడా అదే మొదలు నా జీవితానికి. మొత్తానికి కె వి ఆర్ కు కావాల్సిన కొ.కు. కథలు కొన్నింటిని అందిపుచ్చుకున్నాను. అయితేచ అవి అన్నీ ఎత్తి రాయాల్సిందే కానీ, అప్పట్లో మా ఊళ్ళో మరో మార్గం లేదు. జిరాక్స్‌లు మా దరిదాపులకు రాని రోజులవి. కొన్ని కథలు ఎత్తిరాసి ఆయన ఇచ్చిన కావలి అడ్రసుకు పోస్టు చేశాను. వారం రోజులు తిరక్కముందరే కె వి ఆర్ నుండి కార్డు వచ్చింది. నాకు కె వి ఆర్ కు అనుబంధం ఏర్పడటానికి ఇది మొట్ట మొదటి ఆడుగు. ఆయన్ని ఉత్తరాల్లో చూడటం, చదవటం తప్ప అప్పటికీ ప్రత్యక్షంగా చూసే అవకాశంగానీ, సందర్భంగానీ 1984 జనవరి దాకా రాలేదు.
గెడ్డమాకివలస మహాసభల్లో మా గురువుగారైన విరసం పతాక గీతం రచయిత రుద్రజ్వాల ద్వారా కె వి ఆర్ తో ప్రత్యక్ష పరిచయం కలిగింది. ఆ మహాసభల్లో అప్పటి కవుల్ని రచయితల్ని మేధావుల్ని కళాకారుల్ని చూడ్డం, కలవటం, మాట్లాడటం గొప్ప అనుభవం. నా సభ్యత్వం కూడా అప్పుడే తీసుకోవటం జరిగింది. ఆ మహాసభలలోనే కె వి రమణారెడ్డి పేరు ''కుల'' నామధేయం తొలగించుకుని కెవిఆర్గా మిగిలిపోయారు. అలా ఎందుకు చేస్తున్నారో కూడా బహిరంగ వేదిక మీద నుండే వివరించారు. అదో మరిచిపోలేని సందర్భం.
అఖిల భారత విప్లవ సాంస్క ృతిక సమితికి వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ, మద్రాసులో 1986 సంవత్సరంలోనే కులం - వర్గం అనే విస్త ృత సెమినార్ ఏర్పాటు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి కెవిఆర్ పేపర్ తయారుచేసి సమర్పించారు. ఆ సందర్భం మా ఇద్దరినీ మరింత ముడివేసింది. ఇక్కడి కులాన్ని గురించి అధ్యయనం చేసే పనిలో భాగంగా కుల పురాణాలు అప్పటికి దొరికినవన్ని ఆయన చదవటం జరిగింది. ఈ పనికి మా వేటపాలెం సారస్వత నికేతనం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించింది. కెవిఆర్కూ, మా లైబ్రరీకీ మధ్యన అవసరమైన బుక్స్ అందించే కీపర్‌గా నా వంతు పని చేయటం అప్పుడే మొదలైంది. నా పట్ల వాత్సల్యం లాంటిది కెవిఆర్ నుండి నాకు లభించటానికి ఈ సందర్భం గుర్తుంచుకదగినది నా జీవితానికి.
అలాగే నూరేళ్ళ కన్యాశుల్కం సందర్భంలో శ్రీ మొదలి నాగభూషణ శర్మ వేటపాలెం లైబ్రరీకి వచ్చారు. లైబ్రరీ వాళ్ళతో నా గురించి వాకబు చేసి పిలిపించుకున్నారు. ఆయన ఉన్నన్ని రోజులు ప్రపంచ నాటక రంగం గురించి, పని చేసుకుంంటూనే మా మధ్యన సంభాషణలు ఆ దిశగా గడిచాయి. కెవిఆర్ అందించిన ''మహోదయం'' గురించి నాగభూషణశర్మ గారు సోదాహరణంగా చెప్పుకుపోయేవారు. అది వినడం ఓ గొప్ప అనుభవం. ఆ మాటల సందర్భంలోనే ''వీవర్'' అనే ఆంగ్ల నాటకం గురించి, దాని విశిష్టతను గురించి మాట్లాడారు. ''వీవర్'' అనే నాటకం ఒకటి ప్రపంచ రంగస్థలం మీద చాలా కాలం క్రితమే వచ్చిందని, అది ''కన్యాశుల్కం'' కన్నా ఎన్నో రెట్లు గొప్పదని చెప్పడం కూడా జరిగింది. మీరూ ''వీవరే''నంటగా కెవిఆర్ అన్నారు. మీ వయసు అడుగలేదు. ఇంత చిన్నవాళ్ళు అనుకోలేదని ఆశ్చర్యాన్ని ప్రకటించారు శర్మగారు. ఇదంతా నూరేళ్ళ కన్యాశుల్కం కోసం పాత పత్రికల్ని తిరగేస్తూ, సేకరణ పని చేస్తూన, ఇక్కడ కూడా కెవిఆర్ పూలదండలో దారంలా వర్క్ పూర్తి అయినన్ని రోజులు మా వద్దనే ఉన్నారనిపించేది. ఈ గురజాడపై వచ్చిన రచనలను గమనిస్తున్నపుడు ఎన్నో విలువైన రచనలు ఇతరులవి కనిపించేవి. మనం ఒక దాన్ని అవసరంగా మొదలు అయితే, ఎవరెవరో కనిపిస్తుండేవారు. అలా కనిపించిన వాటిని వదిలి వేయక నోట్స్ పెట్టి ఆ వివరాలు రాయటం అలవాటైంది కూడా. అదిగో అలా దొరికనవే 61, 62 లోఓ కెవిఆర్ విశాలాంధ్ర డైలీలో తాను రెండు సంవత్సరాల పాటు నిర్వహించిన శీర్షిక ''అక్షర తూణీరం'' కంటపడింది. ఆ శీర్షిక మొత్తంగా వివరాలు సేకరించుకున్నాను. అవి మొత్తం 71 లేదా 72 వ్యాసాల సముదాయం. మొదటి నాగభూషణ శర్మతో గురజాడ పని ముగిశాక కెవిఆర్‌ను వెళ్ళి కలిశాను. చేసిన పని చెప్పటం. ఆ సందర్భంలో ఈ అక్షర తూణీరం గురించి కూడా చెప్పాను. వాటిని పుస్తక రూపం చేయటానికి అప్పుడు సుముఖంగా కనిపించలేదు. మళ్ళీ వాటిని గురించి కెవిఆర్ హెచ్చరించటం చెయ్యలేదు. ఆయన మరణానంతరం వాటిని ఒక సంకలనంగా విరసం ప్రచురించింది. అలా కెవిఆర్ ''అక్షర తూణీరం'' వెలుగు చూసింది.
అలాగే, మనం చేసేది చిన్నపనా పెద్దపనా అని వ్యత్యాసం చూసే తత్వం కెవిఆర్‌కు లేదు. అందుకు నా అనుభవాన్నే మీ ముందుంచుతాను. బాబ్రీ మసీదుపై కాషాయ మూకలు దాడి జరిపాక, వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎత్తిపడుతూ తెలుగు కవిత్వంలో అనేక మంది కవుల తమ ప్రతిస్పందనల్ని రాయటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వచ్చిన పది కవితల్ని ఒక దగ్గర చేర్చి ''ఒక నేపథ్యం-పది గొంతుకలు'' అనే సంకలనరూపం పేర తయారైన దానికి ముందుమాట అవసరమని అడిగాడు. ఆ పది కవితల్ని చూసి, చదివి ఏమంటారోనని సంకోచించిన నాకు ఒక చారిత్రక పత్రంగా నిలిచిపోయె ముందుమాటను రాసి సహకరించాడు. అలా ఎన్నో సందర్భాలు ఎందరో కవులు, రచయితలకు ఆయన రాసిపెట్టినవన్నీ అక్షర సైనికుని కవాతుగా గుర్తుండిపోతాయి. మరొకప్రక్క కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురైనపుడు సాహిత్యకారులు ఎలా పనిచేస్తుండాలో కూడా ఆయన ఆచరించిన జీవితం ఒక దారి చూపెడుతుంది.
విరసం అంటే తన కుటుంబం. అది చాలా పెద్దది. అన్ని తరగతుల వారు అందులో కుటుంబసభ్యులుగా ఉండేవారు. ఎవరికి ఎలాంటి కష్టం మీదపడినా కెవిఆర్ ముందుగా స్పందించేవారు. అందుకు ఎన్నో సందర్భాలు చెప్పుకోవచ్చు. ఆయన రాసుకున్న జైలుడైరి ''జైల్లో మూణ్ణాళ్ళ ముచ్చట''ను గుర్తు చేసుకోవచ్చు. కానీ, ఆయన రాయని మరెన్నో సందర్భాలు సాయం పొందినవాళ్ళు ఉన్నారు. కస్తూరమ్మ (రుద్రజ్వాల మొదటి భార్య) కు గుండె జబ్బు అని బయటపడినప్పటినుండి, పూర్తిస్థాయి వైద్యసాయం చేయిస్తూనే వచ్చాడు. ఒక సమావేశంలో వరవరరావు సార్ ''శ్యామల'' గారింట్లో వస్తువులు అద్దెకుంటున్న పిల్లలు ఎత్తుకునిపోయారని చెప్పాడు. చెరబండరాజు కుటుంబం ఎలా బతుకుతుందో తెలుసు కనుక, సమావేశం మధ్యలోనున్న భోజన విరామంలో కూతురు అల్లుడు ఇంటికి వెళ్ళివచ్చారు. వరవరరావు సార్‌కు ఆయిదువేల రూపాయలు అందించి శ్యామలకు చేర్చండి అన్నారు. 1984 శ్రీకాకుళం నుండి 1998 జనవరి సభల తిరిగి శ్రీకాకుళం దాకా నేనూ, నా ఇబ్బందుల్ని కెవిఆర్ తనవిగానే భావించేవారు. ఆయన పర్సనల్ లైబ్రరీ మొత్తాన్ని వేటపాలెం సారస్వత నికేతన్‌కు అందించారు. దీనిలో కూడా ఆయనకు సన్నిహితులలో నేనూ ఉన్నాననే భావం చాలా గర్వంగా ఉంటుంది!